Jump to content

నిర్వచనోత్తరరామాయణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

సప్తమాశ్వాసము




రంజకత్వచతురా
చారుఁడు వర్ణాశ్రమప్రచారుఁడు విద్యా
ధౌరేయుఁ డార్యవినుత
ప్రారంభుఁడు మనుమమానవాధీశుఁ డొగిన్.

1

బ్రహ్మ యింద్రజిత్తు కోరినవర మిచ్చి యింద్రుని విడిపించుకొని వచ్చుట

క.

అక్కడఁ గమలాసనుఁ డా, రక్కసుఁ డమరేంద్రుమీఁద రాకయు సమరం
బెక్కుడుగఁ జేసియును హరి, యుక్కఱి పట్టువడిపోకయుం దెలియంగన్.

2


చ.

విని మునిబృందముల్ గొలువ వేగమ లంకకు నేగుదెంచి య
ద్దనుజవిభుండు సేయు నుచితప్రతిపత్తిఁ బ్రియంబు నొంది యా
తనిదృఢశౌర్యముం దనయుదైర్యమునుం గొనియాడి వెండి యా
యనిమిషనాథు గెల్చిన జయాతివిశేషము సూపి చెప్పుచున్.

3


ఆ.

భువనములకు నెల్లఁ బ్రోదిగ శతమఖుఁ, దాను నిలుపుటయు నతండు లేమి
సకలభూతములకు సంకటం బగుటయు, నెఱుఁగఁ జెప్పి వారియిచ్చ యెఱిఁగి.

4


చ.

ముదమున నింద్రుబంధనమోక్షము సేయుఁ డభీష్టవస్తు వి
చ్చెద మదికోర్కి యేర్పడఁగఁ జెప్పుఁడు నా కనుచున్ సముల్లస
ద్వదనచతుష్టయుం డయిన వారిజసంభవుఁ జూచి వాంఛిత
ప్రదుఁ డగు టాత్మలో నెఱిఁగి రావణసూనుఁడు ప్రీతి నిట్లనున్.

5


క.

కమలాసన విను నావి, క్రమమున వెల పెట్టెదేనిఁ గారుణ్యము సే
యుము నాకు శాశ్వతం బగు, నమరత్వం బనిన నతని కజుఁ డి ట్లనియెన్.

6


క.

ఆశ్వాసంబుగ బలికిన, విశ్వాసము సేసి మున్ను వేడితి కలదే
శాశ్వత మగునమరత్వం, బీశ్వరుఁ డొకరునిక తక్క నితరుల కెందున్.

7


క.

అనుడు నొకతెఱఁగు సెప్పెద వినుఁ డని రావణసుతుండు వినయవిశేషా
వనతశరీరుఁ డగుచు ని, ట్లనియెం గరకమలముకుళనాదరపరుఁ డై.

8


ఉ.

ఆల మొనర్పగా వలయునప్పుడు వహ్ని నుపాస్తి చేసి యా
వేలిమి నొక్కతేరు ప్రభవించిన గ్రక్కున దాని నెక్కి దో

ర్లీల వెలుంగ నేగిన నరిప్రకరంబులచేత నెమ్మెయిం
గాలవశంబు నొందక యఖండితవిక్రమశాలి నయ్యెదన్.

9


ఉ.

హోమసమాప్తి నుత్థితరుథోత్తమ మొక్కటి దక్క నొంట సం
గ్రామము సేయఁబో నది యకాలముగా దుది కియ్యకొంటి నా
కీమెయి మేర పెట్టి వర మిమ్ము పరాక్రమలీల మెచ్చి నీ
వేమియు నీక పోక తగ వేనియుఁ బొ మ్మమరేంద్రు నిచ్చితిన్.

10


తే.

అనుడు దరహాసచంద్రిక తనదువదన, కమలవనమున కభినవకాంతి యొసఁగఁ
జిత్రచారిత్రుఁ డగుదితిపుత్రపుత్రు, నర్థిఁ గనుఁగొని యవ్వర మతని కిచ్చె.

11


చ.

అడిగినయట్ల యిచ్చిన దశాననసూనుఁడు ప్రీతి మేన నె
ల్లెడ వెలిఁ బేర్చె నాఁ బులక లెంతయు వింతగ మ్రొక్కి పెంపు సొం
పడరఁ గులం బెలర్ప జనకానుమతంబున నాబలారికిన్
విడుగడ సేసె నప్పు డరవిందభవుండు ప్రమోద మందఁగాన్.

12


ఆ.

అంబుజాసనుఁడు దశాననుఁ జూచి నీ, నందనునకుఁ ద్రిభువనముల నెగడ
నింద్రజిత్సమాఖ్య యిచ్చితి సుముఖులై, యుండుఁ డనియె దనుజు లుల్లసిల్ల.

13


చ.

అసురుల నిమ్మెయిం బ్రముదితాత్ములఁ జేసి పయోజసూతి సం
తసమున నాకలోకపతిఁ దోకొని పోవునెడం దదీయవ
క్త్రసరసిజంబు లజ్జ యనురాత్రి గడం జెడి యున్కికిం గృపా
రసపరుఁ డై హితార్హమధుకరస్ఫుటసత్యమృదూక్తి ని ట్లనున్.

14


చ.

తమతమదుష్కృతంబు సుకృతంబును నాపదయున్ శుభంబు లై
తముఁ దఱి యైనఁ బొందు నది దప్పునె సాధ్వి నహల్యఁ గోరి గౌ
తమునికిఁ దప్పి తీ వకట తత్ఫల మీయశుభంబు దోషసం
గమనినివృత్తికై యొకమఖం బొనరింపుము విష్ణుతుష్టిగన్.

15


క.

అని చెప్పి పోవుటయు న, య్యనిమిషవల్లభుడు విష్ణుయాగం బొనరిం
చి నిఖలదురితరహితుఁ డై, చనియెన్ దివంబునకు విశాలవిభూతిన్.

16


మ.

అనినం జిత్తము చోద్య మంద రఘువంశాధీశ్వరుం డిట్టు లా
తనికిన్ బీరము సెల్లెఁ గాని యెచటం దద్విక్రమక్రీడ మా
న్ప నొకం డైనను జాలఁడే యనుడు భూపాలాగ్రణిం జూచి య
మ్ముని మందస్మితసుందరుం డయి మనోమోదంబుతో ని ట్లనున్.

17

రావణుఁడు కార్తవీర్యునితోఁ బోరాడి చెఱఁబడుట

ఉ.

నిర్జితశత్రుఁడున్ భువననింద్యచరిత్రుఁడు నైన రావణుం
దూర్జితవిక్రమస్ఫురణ నుర్విఁ జరించుచు మించి యేచి శౌ
ర్యార్జనలోలబాహుమహిమాస్పదుఁ డై చనునాసహస్రభా
హార్జును పెంపుసొంపు హృదయంబున సైఁపక వచ్చె నాజికిన్.

18

తే.

అరుగుదెంచి మాహిష్మతీపురము సుట్టి, వేగ పోరికి నర్జును వెడలు మనుఁడు
రావణుఁడు వచ్చె నలఁతులఁ బోవఁడనుచు, గోపురాంగణస్థితజనక్షోభ మెసఁగ.

19


క.

పన్ని బహిరంగణంబున, నున్న నసంభ్రాంతిగతి సముచితమ్ముగ నా
సన్ను లయి మంత్రు లి ట్లని, రన్నరపతిపెంపునన్ భయం బెద లేమిన్.

20


చ.

అధిపతి వీట లేనిసమయంబున సంగరకాంక్షతోడ ని
ట్లధికబలంబులం గొని వృథాతిశయంబుగ నేగుదెంచి యి
వ్విధమునఁ బన్ని నీ వనృతవిక్రమముం బ్రకటించుకంటె నం
బుధినడు మైన నీపురికిఁ బోయి యొదుంగుము చాల మే లగున్.

21


చ.

అనుబలుమాట లియ్యకొని యద్దనుజేశ్వరుఁ డాతఁ డున్న వాఁ
డని యని సేయు వేడుక రయంబున వచ్చితి నెందుఁ బోయె మీ
జనపతిలావు నాదుభుజశక్తియు నించుక తూఁచి చూడ కేఁ
జన నెఱిఁగించి యియ్యెడకుఁ జయ్యనఁ దోకొని రండు నావుడున్.

22


ఆ.

అతనిపెంపుఁగలిమి కయ్యమాత్యులు దమ, నెమ్మనమ్ముల మెచ్చి నృపతివృత్త
మున్నరూపు సెప్పి యిన్నరభోజను, నిచట నునుత మనుచు నిట్టు లనిరి.

23


క.

వారువము నెక్కి వనితలు, గారవమునఁ గొలువఁ గంతుకైవడి వెడలం
జేరక యంతంతను బరి, వారము నిలువఁ బడ వర్షవరపరివృతుఁ డై.

24


క.

సరసకవివిటవిదూషక, పరిహాసకగాయకాదిపరిజనములు వే
సరుటపయి మేలు దొలఁకెడు, తురగము నెడఁ దూఱఁ గాంతి దొలఁకాడంగన్.

25


ఉ.

చూడ్కికిఁ బండు వై ముదము సొంపునఁ జూపఱు సొక్కుచుండ ని
మ్మాడ్కి నరేశ్వరుం డరిగె మాపటికిం జనుదెంచు నాతనిం
దోడ్కొని తేరఁ బూను టది దుర్వినయం బగు మాకు రాజులన్
వేడ్క మెయిం జరింపఁ జని వీటికి ర మ్మని పిల్వవచ్చునే.

26


క.

నటదలికులశుకపికసం, కటలీలోద్యానములను గమనీయసర
స్తటినీతటాకముల ను, త్కటకౌతుకవృత్తి నాడుఁ దరుణులుఁ దానున్.

27


క.

ఎయ్యెడ నిలుచుట యెఱుఁగమ, యియ్యెడ నేఁ డీవు విడియు మెల్లి యతనితో
నియ్యకొని యెల్లభంగులఁ, గయ్యము సేయంగఁ దలఁపు గలిగినయేనిన్.

28


ఆ.

వేగపడకు మనుజవిభుచేతిబలుపును, జూతు గాక యనిన శూర రేఖ
నగుచు మంత్రివరులమొగములు గనుఁగొని, యిట్టు లనియె దానవేశ్వరుండు.

29


ఉ.

ఏపున నేను వచ్చుటయు నిచ్చట నిల్చుట కోహటించుటన్
మీపతి యెక్క డేనిఁ జన మిన్నక మాటలు పేర్చినన్ రణా
టోపము మాన నేర్తునె కుటుంబసమేతము డాఁగె నాతనిం
జూపరు మీరు నింకఁ దలసూపఁ డతండును బోయి వచ్చెదన్.

30

క.

మెలఁగుదెస మెలఁగి క్రమ్మఱు, తల నొకమరి యేమఱించి దాడిమెయిన్ దో
ర్బలము మెఱసి పై పడి నా, చలము నెఱపి పోదు మీకుఁ జాటితిఁ జుండీ.

31


క.

అని దుర్మదాంధకార, మ్మునఁ గానక బిట్టు పలికి పోయెను గలని
స్వనకోకిలకర్బురకా, ననరేఖావంధ్యవింధ్యనగమున విడియన్.

32


మ.

చని దైత్యేంద్రుఁడు తత్ప్రదేశమునఁ జంచత్కాంచనాంభోజధూ
ళినితాంతప్రవిలిప్తహంసకులకేళీజాతసంధ్యాభివం
దనలోలప్రతిజాలమౌగ్ధ్యమున మోదస్థాన మై లోకపా
వనతం బేర్చిననర్మదం గని మృదుస్వచ్ఛందలీలారతిన్.

33


తే.

నెమ్మి మజ్జన మొనరించి తమ్మివిరులు, సాలఁ గోయించి హృద్యవిశాల మైన
పులినతలమున శివలింగపూజ సేయఁ, దొడఁగె నట నర్జునుండును బడఁతిపిండు.

34


క.

వనశైలీకౌతూహల, మునఁ దగిలినయట్టివారు ముదితహృదయు లై
వనిఁ బరిచితస్థలములకుఁ, జని హృద్యవిహారతంత్రచాతుర్యమునన్.

35


మ.

లలితక్రీడమెయిన్ సముత్కటమదోల్లాసంబునం బెక్కుభం
గులఁ జేతోరమచూతపోతలతికాగుల్మప్రదేశంబులం
గలయం గ్రుమ్మరి సొడ్మునుం జెమట నంగంబుల్ నవాంకూరసం
కలనాశోభితవల్లరీనిభము లై క్రాలంగ రాగిల్లుచున్.

36


క.

ముదమున జలకేళికి నర్మదకుం జనుదెంచి లలితమకరవిహారా
స్పదతత్ప్రవాహమున నిం, పొదవఁగ నాడునెడ నధిపుఁ డుల్లాసమునన్.

37


తే.

బాహువులు సాఁచి పడమర పాఱుచున్న, యాతరంగిణిఁ బోకుండ నాఁగుటయును
నెదురుదొట్టి దశాననుఁ డీశుఁబూజ, సేయునెడ ముంచికొనియె నచ్చెరువు గాఁగ.

38


క.

రావణుఁడు సంభ్రమంబున, దేవార్చనకొఱఁతతో నది వెడలి కలయన్
భావించి యెదురు క్రమ్మెడు, నావెల్లువఁ జూచి విస్మయం బెదఁ గదురన్.

39


క.

తూర్పుదెస వచ్చు నీనది, దర్పంబున నెదురురాఁ గతం బేమియె మీ
రేర్పడ నెఱింగి రం డని, శూర్పణఖాభ్రాతచరులఁ జూడఁగ నంపెన్.

40


ఆ.

వార లరిగి విభుఁడు వామలోచనలును, జలవిహార మర్థి సలుపు చునికి
చూచి వచ్చి యానిశాచరవల్లభు, నెదుర నిలిచి మ్రొక్కి యిట్టు లనిరి.

41


క.

దేవా దేవర పంపిన, నీవెల్లువతెఱఁ గెఱింగి యేతెంచితి మె
చ్చో వినఁగఁ జూడఁ బడయమ, యావిధ మద్భుతరసావహంబై యుండెన్.

42


ఉ.

భూరిబలాభిరాముఁడు విభూషణభూషితమూర్తి కామినీ
స్మేరముఖేందుబింబముల చెన్నున నుజ్జ్వలచంద్రలోకకే
లీరతి నున్నచందమున లీలమెయిన్ సలిలావగాహన
స్ఫారకుతూహలుం డయి విశంకత నొక్కఁడు కేలి సల్పెడున్.

43

క.

ఆతతబహుబాహుం డగు, నాతఁడు సేతులఁ బ్రవాహ మాఁగిన మరలం
దోతెంచె నావుడును విని, వీతభయుఁడు కార్తవీర్యవిభుఁ డని యెఱిఁగెన్.

44


చ.

ఎఱిఁగి కరంబు వొంగి కడునేకత మి ట్లగపడ్డచో నతం
డెఱుఁగక యుండ ముట్టికొని యే పడఁగించెద నంచు మంత్రులం
దఱకు నెఱుంగఁ జెప్పికొని దానవుఁ డున్మదుఁ డై చనంగ న
త్తఱి నరుణాభ్ర మస్థిమయధారలతో దివిఁ దోఁచె ముందటన్.

45


ఉ.

దానికి శంక సేయక యుదగ్రరణోత్సుకుఁ డైనయట్టియా
దానవవల్లభుండు బలదర్పసముద్భటసంకులంబుగా
సేనలు ముందటం దఱుమ శీఘ్రత మేదిని సంచలింపఁ గాం
తానిచయంబుఁ గంచుకివితానము బెగ్గిల బిట్టు ముట్టినన్.

46


మ.

వనితాబృందములోన నున్నపతి తీవ్రక్రోధుఁ డై గంగ గా
హనకేలిం బిడియేనుఁగుల్ వొదువ మోదాయత్త మై యుండి గ్ర
క్కున నన్యద్విపదానగంధమునకుం గోపించునైరావతం
బును బోలెన్ మడు వల్గ వెల్వడి రణప్రోత్సాహయోగ్యస్థితిన్.

47


క.

కట్టాయిత మై యువిదల, నిట్టుండుఁడు వెఱవ కిచట నిదె వచ్చెద నన్
ముట్టినదానవులను బలి, వెట్టెద నర్మదకు ననుచు భీకరవృత్తిన్.

48


చ.

అతఁడు వినూత్నరత్నరుచిరాంగద మై వివిధాయుధప్రభా
న్విత మగు బాహుసంఘమ యనీకముగాఁ బటువిక్రమక్రమో
ద్ధతి దితిసూనుసేనల మదం బఱి నల్గడఁ దూలఁ దోలె ఘో
రతిమిరపుంజభంజనకరప్రకరుం డగుభాను కైవడిన్.

49


క.

తెరలినబలములఁ గని యు, ద్ధురవృత్తిఁ బ్రృహస్తుఁ డతనితోఁ దలపడియెం
గరి కేసరి హరిణము పులి, నురగము గరుడిఁ దలపడ్డయొ ప్పమరంగన్.

50


క.

తాఁకి ముసలమున వ్రేసిన, వీఁక నొడిసిపట్టి యతఁడు వెసఁ దిగిచిన నా
రోఁకలి తనచే వచ్చిన, నాఁక గొనక దాన నసుర నడిచెం గడఁకన్.

51


ఉ.

ఆటున మూర్ఛవోయినఁ బ్రహస్తుఁ గనుంగొని యింకఁ దాఁకినం
గీ టడఁగించు నర్జునుఁడు గేవలుఁడే యని భీతచిత్తు లై
మేటిమగల్ సలం బెడలి మేమెయి మార్కొన లేక పాఱినం
గాటుకకొండవోలె దశకంఠుఁ డెదిర్చె మహీమహేంద్రునిన్.

52


ఉ.

వీరగుణాభిరాము లగువింశతిబాహుసహస్రబాహు లా
తారకకార్తికేయులవిధంబున నాబలనిర్జరేశ్వరా
కారత నమ్మురాచ్యుతులకైవడిఁ బెద్దయుఁ బ్రొద్దు మేమెయిం
బోరిరి చూచుఖేచరులు భూరిబలంబుఁ జలంబు మెచ్చఁగన్.

53

క.

లావఱి వివిధాయుధముల, భూవిభుఁడుం దాను నట్లు పోరి యలసి వీ
రావేశ మడర జయకాం, క్షావివశుఁ డై రావణుండు గడుఁ దమకమునన్.

54


మ.

మది శంకింపక ముట్టి విక్రమరసోన్మాదంబునన్ భూవిభున్
గద వ్రేయంగ నతండు పైపడి భుజాగర్వంబునం బట్టె నా
రదుఁ డార్వం బరికాఁడు నిర్భయతఁ జేరం జూచినం బట్టును
న్మదశుండాలములీల దిక్కలితనామశ్రావణున్ రావణున్.

55


క.

పట్టి యిరువదికరంబులు, గట్టిగ వీఁపుపయి మోపుగాఁ బెట్టి తగన్
బెట్టు మెడ పట్టుకొని తుది, ముట్టినమగఁటిమి నభంబు ముట్టఁగ నార్చెన్.

56


ఆ.

నృపవరేణ్యుఁ డిట్లు రిపుఁ బట్టు వఱిచి కం, చుకిగణంబు నల్లఁ జూచి యొకనిఁ
బిలిచి యోరి వీనిఁ బెడకేలితోన తె, మ్మని సముద్ధతముగ నప్పగించి.

57


క.

తరుణీజనము వినోదపుఁ, బరివారము మున్ను నడవఁ బనిచి పిఱుం దై
పురమున కరుగ నిజప్రభు, పరిభవముం జూచి దైత్యభటకోటి వడిన్.

58


క.

నిలునిలు విడువిడు మంచును, బలువిడిఁ గూడుకొని పిఱుఁదఁ బఱతెంచిన న
మ్ముల నోడు సేసి యందఱ, నిలిపి విజయలక్ష్మిసొంపు నెలకొన నెలమిన్.

59


క.

తనకొలఁది యెఱుంగక యీ, దనుజుఁడు వనితావినోదతత్పరు నన్నుం
జెనసె నని యుగ్గడించుచు, ననిమిషరిపుమీఁదఁ బొరిఁ గటాక్షం బెలయన్.

60


తే.

ఎదురువచ్చినమంత్రుల కెగ్గు లెన్ని, చూపి చెప్పుచు నివ్విధి కోపమునకు
నుపశమం బెట్లు సేయుదునొక్కొ యనుచుఁ, బురికిఁ జని మందిరాంగణభూమి నిలిచి.

61


క.

పొంపిరివోయెడుతనయను, కంపాతిశయమునఁ బంక్తికంధరు నెట్లుం
జంపంజాలక రోషము, పెంపునఁ గారాగృహమునఁ బెట్టఁగఁ బనిచెన్.

62


క.

మనుజపతి యివ్విధంబునఁ, దనచెఱయింటికిని మ్రుచ్చుఁ దప్పున నొప్పిం
చినయట్టుల మదిని సరకు, గొనక మఱచి యున్నయెడను గొనిదినములకున్.

63

పులస్త్యుఁడు కార్తవీర్యుని వేడుకొని రావణునిచెఱ విడిపించుట

మ.

దనుజేంద్రుండు సహస్రబాహువిభుచేతం బడ్డపా టంతయున్
విని మాహిష్మతికిం బులస్త్యుఁడు గడున్ వేగంబ యేతెంచి య
జ్జనపాలుం గనినన్ యథోచితముగా సత్కారముల్ సేసి వ
చ్చిన కార్యం బెఱిఁగింపుఁ డన్న నతఁ డౌచిత్యంబు మై నిట్లనున్.

64


చ.

అలవి యెఱుంగ' నేరక దశాస్యుఁడు లోకముతోడివానిఁ గాఁ
దలఁచి జితాఖిలాఢ్యుఁడఁ గదా యని నచ్చి కడంగి వచ్చి సం
కలియకుఁ జొచ్చె వానిఁ బలుకం బని లే దటు లుండె నింతలం
తలుపను లెల్ల నీకు భుజదర్పముగాఁ గొన నేర్పు సాలునే.

65


క.

ఆక్రమసంచిత మగుభూ, చక్రం బుదయాప్తశైలసహితంబుగ ని
ర్వక్రపరిపాలనస్థితిఁ, జక్రము చెల్లించు పూజ్యసామ్రాజ్యమునన్.

66

క.

తుదిముట్టి యున్ననీ కొకఁ, డెదురే యది గాక పగఱ యే పడఁగినఁ ద
ప్పు దలంప నిదియ కడు నొ, ప్పిద మగు నినుబోఁటినృపులపెంపున కరయన్.

67


చ.

నలినజుఁ డైన బ్రహ్మకును నాలవవాఁడు దశాననుండు ని
ర్మలగుణలోల వీఁడు మనుమం డని చెప్పఁగ నాకు సి గ్గగుం
బలుకులు వేయు నేటికిఁ గృపాపరతాస్తుతి దక్క వీని మం
దల విడు నాకుఁగా నృపతిధర్మవిచక్షణ పుణ్యవీక్షణా.

68


చ.

అనవుడు నట్ల చేయుదు మహాత్మ భవద్విపులాంతరంగమో
దన మగుదానిఁ జేయఁ గని ధన్యుఁడ నైతి దశాస్యు వేగ తో
డ్కొని చనుఁ డన్న నానృపతికుంజరు మంజుమృదూక్తిఁ జిత్తరం
జన మగుడున్ మొగం బలర సంయమి దీవన లిచ్చి మెచ్చుచున్.

69


తే.

దనుజవల్లభు విడిపించుకొని పులస్త్యుఁ, డరుగ లజ్జావనతుఁ డగునతఁడు నతని
ననుపఁబోయిన సానునయంబు గాఁగ, బుద్ధిఁ దగఁ జెప్పి లంకకుఁ బుచ్చి చనియె.

70

రావణుఁడు వాలిచే భంగపడి యతనితో మైత్రి చేయుట

ఉ.

రావణుఁ డివ్విధంబునఁ బరాజయ మందియు లంకలోనికిం
బోవుడు నంతయున్ మఱచి భూవలయంబునఁ దొంటియట్ల నా
నావిధదుశ్చరిత్రము లొనర్చుచుఁ గ్రుమ్మరి యొక్కనాఁడు వి
ద్రావితశత్రుభూరుహచరప్రభు వాలి నెదుర్చువేడుకన్.

71


శా.

కిష్కింధానగరంబుపై నరిగి సుగ్రీవాదు లెల్లన్ రణా
విష్కారోద్యమతీవ్రు లైనఁ గని తకద్విక్రాంతి మానంగ మ
స్తిష్కంబున్ రుధిరంబు మాంసమును ధాత్రిం గూల్ప నుంకించియున్
దుష్కర్మం బగు వాలిలేమి నని చేతోవృత్తి నూహించుచున్.

72


క.

పడుచుంబైదలు పన్నినఁ, గడపి చనక చిఱుతతోడి కయ్యమునకు నేఁ
గడఁగుట తగ దని యాయని, విడిచి దశాననుఁడు వారు విన ని ట్లనియెన్.

73


క.

మీలోనఁ గూడుకొని రాఁ, డాలం బాలంబు సేసి యది యెట్లొకొ తాఁ
జాల నని చెప్పుఁ గా క, వ్వాలికి డాఁగినను బోవవచ్చునె నాచేన్.

74


చ.

అనవుడు సూర్యసూనుఁడు దశశాననుఁ గల్గొని నీవు నన్ను మె
చ్చనికత మేమిటం గొలఁది సాలనె వాలిని గూర్చి వచ్చితే
యనికిఁ గడంగినన్ బిరుదు లైనమగల్ గని వీరు గారు నా
కనియు నెఱుంగ కిట్లు భయ మందితి నీవెడమాట లేటికిన్.

75


శా.

నా కి ట్లెంతయు నీడఁ బోయితి జగన్మాన్యుండు నా నొప్పునా
నాకేశప్రియనందనుం జెనసి మానప్రాణముల్ గావఁగా
నీకుం దీరునె యిప్డు దక్షిణపుమున్నీటం గృతస్నానుఁ డై
యేకాంతంబున నుండుఁ బొ మ్మనినఁ బోయెం బుష్పకారూఢుఁ డై.

76

మ.

దనుజేంద్రుండు మరుద్గతిం జని సముద్రస్నాసంజాతశు
ద్ధి నితాంతామలచిత్తనిశ్చలసమాధివ్యంజితానందమీ
లనసంభావితలోచనుం గపికులశ్లాఘాత్ము నవ్వాసవిం
గను తన్మూర్తినివృత్తవిక్రమకళాకౌతూహలస్ఫూర్తియై.

77

వాలి రావణునిఁ జంకలో నిఱికించుకొని నాలుగుసముద్రములను ముంచుట

క.

ఎదురెదురను ముదలింపఁగ, మదిఁ గొంకి పిఱిందివలన మందగతిం జే
రెద నేమఱి యున్నెడఁ బ, ట్టెద ననుపగఁ బుష్పకంబు డిగి వచ్చుతఱిన్.

78


క.

రావణునుద్యోగమునకు, దైవము ప్రతికూల మైనఁ దత్త్వనిదిధ్యా
సావేశవిరామం బై, యావనచరవిభుఁడు గన్ను లరవిరియంగన్.

79


క.

కడకంటిచూడ్కి దశముఖుఁ, బొడగని సంభ్రమములేమిఁ బొంచి నతనిఁ దాఁ
బెడమఱి చూచుట యుడిగి మ, గుడ నేత్రము లల్ల మూసుకొని చిత్తమునన్.

80


క.

వంచన నను నియ్యెడ ని, ర్జించుతలంపునను నసుర సేరెడు నే భం
జించెదఁ బాపాత్ముల నొ, ప్పించుట ధర్మంబ యనుచుఁ బిఱుఁ దారయుచున్.

81


క.

ఉన్నయెడన్ మునివ్రేళులఁ, దిన్ననినడ నసురపతి పదిలుఁ డై చేరం
గొన్నియడుగు లరిగి యడరి, యన్నగచరనాథుపై రయంబునఁ బడియెన్.

82


క.

వెనుకకు మొనసి కరంబునఁ, బెనఁచి తిగిచి నిఖిలలోకభీకరుఁ డగున
ద్దనుజేంద్రు ననాయాసం, బునఁ జంకిట నిఱికి యింద్రపుత్రుఁ డచలుఁ డై.

83


చ.

ఎఱుఁగనియట్ల యున్న నసురేశ్వరుఁ డప్పుడు గాలుఁజేయు లా
వఱి రభసంబునం గుదుప నక్కడ నిక్కడ నూడఁ జూచి మై
గిఱుపఁగ నవ్వి శక్తి యెఱిఁగించుట నెమ్మదిఁ గోరి వానిమై
సుఱసుఱ స్రుక్క నొక్కె బలసూదనసూనుఁడు ప్రక్కదాపునన్.

84


చ.

చదియఁగ నొత్తి యెత్తికొని శాతనఖంబులఁ గ్రూరదంష్ట్రలన్
వదనములన్ శరీరమును వారక వ్రచ్చుచు మేనిగాలిఁ దో
యదములు దూలఁ బశ్చిమదిగంబుధికిం జనియెన్ రయంబునం
జదల భుజంగమగ్రహణచారుసువర్ణవిలాసభాసి యై.

85


చ.

చని దనుజేశ్వరుండు వనచంకన యుండఁగఁ దజ్జలంబులన్
మునిఁగి శమంబుమై నియమముల్ దగఁ దీర్చి క్రమంబుతో నుద
గ్వననిధిఁ బ్రాక్పయోధిఁ గపివల్లభుఁ డట్టుల చేసి యశ్రమం
బున నిజపట్టణోపవనభూమికిఁ దెచ్చి సుఖోపవిష్టుఁ డై.

86

వాలిచే భంగపడి రావణుఁ డతనితో మైత్రి చేయుట

శా.

కోపం బాఱినఁ జంక వాపి ధరణిం గూర్చుండఁగాఁ బెట్టి ని
ష్పాపోల్లాసకటాక్ష మల్ల నొలయం బ్రౌఢస్మితజ్యోత్స్న ల

జ్ఞాపూరావృతతన్ముఖాబ్జములపై సాంద్రంబుగాఁ జూపి ని
ర్వ్యాపారామరసుందరీప్రకరగర్భస్రావణున్ రావణున్.

87


క.

కనుఁగొని యచ్చట నప్పుడు, కనినట్టులు సంభ్రమించి గారవమున న
వ్వనచరవీరశిఖామణి, దనుజపతికి నిట్టు లనియెఁ దదభిముఖుం డై.

88


క.

ఎందుండి రాక యిక్కడి, కెందులకుం బోక యిచట నేకార్యము సే
యం దలఁచి నిలిచి తప్పని, విందము నీ వింటికడకు విచ్చేయు తగన్.

89


క.

అనవుడు వెలవెలఁ బాఱువ, దనములు వెడ వాంచి యెత్తి దశముఖుఁడు గపీం
ద్రునిమోము దీనదృష్టిం, గనుఁగొని గద్గదిక నెలుఁగు గడలుకొనంగన్.

90


మ.

తగు నీ కే మని పల్కినన్ విసు భుజాదర్పంబునన్ మాఱు లే
క గిరీశున్ గిరితోన యెత్తి సురలోకస్వామి జంభారి గా
సిగ బంధించి జగత్త్రయంబును బనుల్ సేయన్ విజృంభించి గ
ర్వగరిష్ఠుం డగునన్ను నిద్దెసకుఁ దేరం జాలుటన్ వాసవీ.

91


చ.

అనవుడుఁ గౌఁగిలించి దనుజాధిపతిం దగ గారవించి తో
కొని పురి కేగి తత్తదనుకూలచరిత్రములన్ సఖిత్వరీ
తి నడపి తాను దమ్ముఁడు నతిప్రియభాషలచేఁ బ్రసన్నుఁ జే
సిన నతఁ డాకపీంద్రవరుచెల్మికిఁ బల్లవితాంతరంగుఁ డై.

92


ఆ.

వివిధకేలిఁ దగిలి వేడుకఁ గతిపయ, దినములందు నిలిచి దివ్య మగుటఁ
దోన వచ్చియున్న మానితనిజవిమా, నమునఁ బ్రీతిఁ దనపురమున కరిగె.

93


క.

లీల నటు లసురవల్లభుఁ, గేలీపాత్రంబుఁ జేసి క్రీడించినయ
వ్వాలి భవదస్త్రమున కర, సాలియుఁ జాలమి నుతింపఁ జాలదె యెందున్.

94


క.

అని మునిపతి యివ్విధమున, దనుజపతిం జెప్ప రామధరణీపతి తి
న్ననినవ్వు మెఱయ నాతని, వినితిమి యిఁక నొకటి వినఁగ వేడుక యనుచున్.

95


క.

ఏమియొకో న న్నడిగెడు, నీమానవనాథుఁ డంచు నెద నూహింపం
గా మునిజనవల్లభుతో, రామనృపతి కౌతుకస్ఫురణ ని ట్లనియెన్.

96

హనుమంతునిజననాదివృత్తాంతము

క.

కొంత యెఱుంగుదుఁ బవనజు, వింత దివిజరాజతనయు విక్రమము హనూ
మంతునకు వాలికిం గల, యంతర మేకొలఁదియొకొ చరాచరవేదీ.

97


ఆ.

అనిన నాంజనేయునతులబలము విన, వేడ్క సేసె నితఁడు విస్తరించి
కలతెఱంగు సెప్పవలయు నా కని ముని, యిట్టు లనియెఁ బ్రీతి యెసక మెసఁగ.

98


శా.

వాలిం గీలియు వాయుపుత్త్రుసరియే వాఁ డాత్మశక్తిజ్ఞుఁ డై
యీలోకంబులు గెల్తు నే ననిన మా ఱెందుం గలండే మహీ
పాలాగ్రేసర వానివర్తనముఁ జెప్పం జిట్ట లావిక్రమ
శ్రీలోలున్ భవదీయసన్నిధిఁ బ్రశంశసింపం దగుం జెప్పెదన్.

99

చ.

సురగిరిసానుదేశమున సుస్థిరసంపద నుల్లసిల్లు కే
సరి యనువానిభార్య గుణశాలిని యంజన నాఁగ నొప్పుసుం
దరి యనిలప్రసాదమున ధర్మవిధి మహనీయమూర్తివి
స్ఫురితుఁ గుమారుఁ గాంచెఁ బరిపూర్ణతపోమహిమాభిరామ యై.

100


ఉ.

ఆతనిరక్షణంబున నరహర్నిశముం దగ సానధాన యై
యేతరుపండు లొప్పు నవి యేఱి వనంబునఁ దెచ్చి యిచ్చుచుం
బ్రీతిఁ జరించుచున్నెడఁ గపిప్రవరార్భకుఁ డొక్కనాఁడు ప్ర
ద్యోతనబింబముం బొడుచుచుండఁగఁ జూచి సముత్సుకాత్ముఁ డై.

101


చ.

ఫల మనుబుద్ధిఁ బుచ్చికొనఁ బాఱె నభంబున వాయుదేవుఁడున్
సలిలకణార్ద్రతం గిరణజాలమువేఁడిమి దాఁకకుండ నే
వలనను దాన యై పొదివి వచ్చెఁ దనూభవు నాఁడె పర్వ మై
జలరుహమిత్రుఁ బట్ట రభసంబున రాహును జేరె నత్తఱిన్.

102


క.

ఆసైంహికేయుఁ డర్క, గ్రాసాదరవృత్తి వచ్చు కపిఁ గనుఁగొని సం
త్రాసభరితమానసుఁ డై, వాసవుకడ కేగి ఖిన్నవదనుం డగుచున్.

103


క.

రవిశశిబింబగ్రహణోత్సవ మెల్లను నాకు ము న్నొసఁగి యెప్పుడుఁ జె
ల్ల విడిచి యుండుదు నేఁ డొకఁ, డవార్యవిక్రముఁడు వచ్చె నర్కునిఁ బట్టన్.

104


మహా.

అనినం గోపించి యింద్రుం డఖిలభువనమర్యాద లయ్యైవిధం ద
ప్పనిభంగిం జొప్పుతో నేర్పడ నడవఁగ నాపంపు గానీక యెవ్వం
డినబింబగ్రాహి యై యయ్యెడకు ముదముమై నేగుదెంచెం దదంగం
బనఘా మద్వజ్రధారాహతిఁ బొడిపొడి సేయంగ నే వత్తు నంచున్.

105


మ.

అనికిం బూని కరీంద్రు నెక్కి చను జంభారాతికిన్ ముందటం
జని తద్బాహుపరాక్రమంబున మహోత్సాహంబుతో సింహికా
తనయుం డాకపిబాలుపై నడరి యుద్యద్విక్రముం డైనయా
తనియాటోపము నోర్వఁజాలక విభీతస్వాంతుఁ డై పాఱినన్.

106


తే.

ఎగచికొనిపోయి కపి దివిజేంద్రుదంతి, వెనుక సొర నంటఁ దఱిమిన మనములోన
మెచ్చియును దన చేసినమేర తప్పు, నని తలంచుచు మృదురోషుఁ డై యతండు.

107


క.

భాసుర మగువజ్రంబున, వేసిన హనుదేశ మర్ధవిదళిత మైనం
గేసరితనూభవుఁడు మూ, ర్భాసంగతుఁ డై ధరిత్రిఁ జాఁగం బడియెన్.

108


క.

తనవచ్చినపని దీఱిన, ననిమిషపతి నాకమునకు నరిగెఁ దనయునిం
గనుఁగొని వేదనఁ బొంది ప, వనుఁ డప్పుడ యుడిపెఁ దనదువర్తన మెందున్.

109


ఆ.

జగములందు వాయుసంచార ముడిగిన, సకలజీవలోకసంకటంబు
పుట్టుటయు విరించి పురుహూతవరుణాది, సురులు బలసి కొలువ నరుగుదెంచి.

110

క.

మాత్సర్యము ప్రాణంబు చి, కిత్సిత మగునొక్కొ వీనికిన్ వ్రణ మనుచున్
వాత్సల్యంబునఁ బుత్త్రకు, నుత్సంగమునందుఁ దాల్చియున్నసమీరున్.

111


క.

కనుఁగొని కరుణాపూరిత, మనస్కుఁడై యక్కటకటక మారుతుఁడు సుతా
ననసక్తలోచనుం డై, మన వచ్చుటఁ గానఁ డనుచు మక్కువతోడన్.

112


శా.

చేరంబోవుటయున్ సమీరుఁడు సురజ్యేష్ఠున్ నిరీక్షించి దు
ర్వారాంతపరితాప మేది తనయున్ వక్షోగతుంగా సమా
చారప్రౌఢత నెత్తికొం చెదురుగా సద్భక్తిమై నేగి లో
కారాధ్యం బగుతత్పదాంబుజయుగం బర్చించె నానమ్రతన్.

113


క.

వనజాసనుండు ఫాలం, బునఁ గేలిరవొంద నెత్తి పొదివి భుజము నా
తనిమస్తకంబు వక్షం, బునఁ జేర్చి కృపాతిరేకమున గాఢముగన్.

114


క.

పశ్చిమదిశచందంబున, నిశ్చేష్ఠుం డయిన బాలునిం జూచుడు వాఁ
డాశ్చర్యంబుగ నపుడ పు, నశ్చైతన్యాగమంబునం దెప్పఱిలెన్.

115


క.

దర్శనమాత్రన శోకవి, మర్శక్షమచిత్తుఁ డయ్యె మారుతి బాహా
స్పర్శమునఁ బ్రబలదురితని, కర్శుఁడు వ్రణనిర్వికారుఁ గా నొనరించెన్.

116


చ.

తనయుఁడు సేద దేఱిన ముదంబునఁ గౌఁగిటఁ జేర్చి యంబుజా
సనునకు మ్రొక్కఁ బంచి వికసద్వదనుం డయి వాయుదేవుఁ డెం
దు నిఖలదేవకోటి పరితోషవిధాయక మైనయాత్మవ
ర్తన మొనరంగఁ జేసె నమరప్రభుచిత్తము పల్లవింపఁగన్.

117


చ.

కమలభవుండు దేవతలఁ గన్గొని మారుతిఁ జూపి దేవకా
ర్యమునకుఁ గా జనించె నితఁ డద్భుతవిక్రమశాలి రామనా
మమున వెలింగి లాఘవసమాజవిభూషణ మైనకేలిజ
న్మమున దశాస్యుదుర్మదము మార్చునెడం బని సేయు శార్ఙ్గికిన్.

118


క.

కావున మీరిందఱు సం, భావించి వరంబు లొసఁగి పవనునకుఁ బ్రమో
దావేశము లోకహితముఁ, గా వీనిఁ గృతార్థుఁ జేయఁగాఁ దగు ననినన్.

119


ఆ.

వాసవుండు తనదు వక్షస్స్థలంబునఁ, గ్రాలు సురభికుసుమమాల యర్థిఁ
గపికుమారుచారుకంఠభాగంబున, నాదరార్ద్రహృదయుఁ డగుచుఁ బెట్టి.

120


క.

హనువున మత్కులిశము దాఁ, కినచో టెఱుకవడి వీనికిం దొడ వగుచి
ట్టునికికిఁ దగ హనుమంతుం, డనుపే రిచ్చితిఁ బ్రసిద్ధమై పెం పొనరన్.

121


క.

కులిశము మొద లగునాయుధ, ముల నేమిట వీనియంగములు నిర్దళితం
బులు గాకయుండ నొసఁగితి, నలఘువరం బనియె దృక్సహస్రం బలరన్.

122


సీ.

వారి నెయ్యెడల నీవానరోత్తమున కాపద పుట్ట నీనని యుదధిపతియు
నగ్ని నెన్నఁడును నీయగచరాగ్రణిఃఁ గీడొందంగ నీనని హుతవహుండు

భూతగణంబులచేత నీహరిసత్తమునకు నెగ్గొనరనీ నని శివుండుఁ
గాలదండమున నీకపిముఖ్యునకుఁ జింత వంత రానీ నని యంతకుండు


తే.

వరము లిచ్చిరి తక్కటిసురలు నిజమహానుభావానురూపంబు లైనపదవు
లొసఁగి రిమ్మాడ్కి మారుతి నసదృశప్రభావుఁ గావించి పద్మసంభవుఁడు ప్రీతి.

123


చ.

అనిలుని వీడు కొల్పి దివిజావళితోడ వియత్పథంబునం
జనియె నతండుఁ బుత్త్రుఁ గొని సంతస మందుచు నేగుదెంచి యం
జనకుఁ దదీయబాహుబలశౌర్యములున్ వరలాభముం గ్రమం
బున నెఱిఁగించి పోయెఁ గపిపుంగవుఁడున్ శిశుకేలిలోలుఁ డై.

124


క.

మునిజనులయాశ్రమములకుఁ జని చని యాగోపకరణచయ మెల్లను దు
ర్వినయమున గాసి చేయుచు, నునికి కలిగి వా రమందహుంకారములన్.

125


క.

తనశక్తియు వరలాభం, బున వచ్చినపెంపు నుల్లమునఁ దలఁపక యి
వ్వనచరుఁడు నిజబలం బెఱుఁ, గనిగజజాతియునుబోలెఁ గావుత మనినన్.

126


తే.

బుద్ధిమంతుఁడు గావున వృద్ధతాప, సోక్తులకు స్రుక్కి దౌర్జన్య ముడిగి మెలఁగె
నితఁడు తనలా వెఱుంగనికతన మఱియు, వీరు లనఁ గొంద ఱిమ్మహి వినఁగఁబడిరి.

127


క.

ఇనునరదముముందట వెను, వెనుకకు వెసఁ జనుచు శబ్దవిద్యాధ్యయనం
బొనరించె నాతఁ డొజ్జగ, హనుమంతుం బోల నలవి యగునె యొరులకున్.

128


తే.

జనకుఁ డగుఋక్షరజసుండు సచ్చుటయును, వాలిఁ బట్టంబుగట్టిన వానితమ్ముఁ
డైనసుగ్రీవుఁ డత్తఱి యౌవరాజ్య, భరముఁ దగఁ దాల్చియుండి యిప్పవనతనయు.

124


క.

చెలిఁ జేసి కొని ముదంబునఁ, గలసి మెలఁగుచుండి పిదపఁ గౌశికసుతుతోఁ
గలుషించి ఋశ్యమూక, స్థలి కాతఁడు వోవఁ దోన చనియె నితండున్.

130


క.

తనలా వెఱుఁగనికతమున, నినసుతునకు వశ్యుఁ డయ్యు నేడ్తెఱ సంక్రం
ధననందనుభుజబలమ, ర్దనమునకుఁ గడంగఁ డయ్యె రఘువంశనిధీ.

131


చ.

అనవుడు సమ్మదంబు దొలకాడఁగ నిక్కము నట్ల కాక య
వ్వననిధి దాఁటి లంకయును వానివనంబును గాసి చేసి నం
దనుఁ దెగఁ జూచి వచ్చినవిధం బది యల్పులచేతఁ దీరునే
జనకజఁ గాంతుమే యసమసాహసుఁ డీతఁడు లేక తక్కినన్.

132


క.

అని లజ్జావనతుం డగు, హనుమంతుఁ గటాక్షవీక్షణాదరముదితా
త్మునిఁ జేసి దాశరథి య, మ్మునిజనముం జూచి కేలు మొగుచుచు భక్తిన్.

133

అగస్త్యాదిఋషులు రాముని వీడ్కొని చనుట

క.

మసలితిరి విచిత్రకథా, రసవృత్తిం దడ వెఱుంగ రాక యనుష్ఠా
ససమయ మయ్యె నభోమ, ధ్యసమీపంబునకుఁ దరణియరదము వచ్చెన్.

134


మ.

విజయం చేయుఁడు నావుడున్ మునులు పృథ్వీనాథ యూహింప వి
శ్వజనీనుం డగునిన్నుఁ జూపు సదనుష్ఠానంబు గాదే భవ

ద్విజయశ్రీ దమకోర్కిగా సుకృతముల్ వేభంగులం జేయునీ
ద్విజకోటిం బరికించికొమ్మని కృతార్థీభూతచేతస్కు లై.

135


క.

క్రందుకొనఁగ నొక్కుమ్మడి, నందఱు దశవదనదమను నాశీర్వాదా
నందితుఁ జేసి యమందా, నందముఁ బొందుచుఁ దపోవనములకుఁ జనినన్.

136


క.

తగ నెల్లవారిఁ బొమ్మని, జగతీపతి యచటు వాసి సమయసముచితం
బుగ నయ్యైయెడలకుఁ జని, పగలిటివర్తనము ప్రాజ్యపదవిన్ సలిపెన్.

137


తే.

రాత్రి యగుటయుఁ గార్యతూర్యత్రయాది, వివిధగోష్ఠీవినోదముల్ వేడ్క నడపి
యతిమనోహరవాసగేహమున కేగి, నిరతిశయమోదమున సుఖనిద్రఁ జేసి.

138


చ.

రవియుదయంబుకంటె మును రాజశిఖామణి మేలు కాంచె దా
నవకులమర్దనాంక సునినాదము లైనసురంగగీతముల్
వివిధగతిప్రవర్తన నవీనము లై సొగయింప మాగధ
ప్రవరులు పాడుమంజుమృదుభంగికి వీనులు దొల్త మేల్కనన్.

139


ఆ.

అపుడు సముచితంబు లగుకరణీయంబు, లాచరించి రఘుకులాధినాథుఁ
డభిమతప్రసాధనాభిరామాకృతి, యై మహావిభూతి నతిశయిల్లి.

140


చ.

కొలువున కేగుదెంచి నృపకోటియు మంత్రికదంబకంబు దై
త్యులుఁ గపులుం గవీంద్రులు నియోగులు వందిజనంబు లిష్టభృ
త్యులు మొదలైనవారలు నిజోచితభంగి సుఖోపవిష్టు లై
బలసి ముదంబునం గొలువఁ బ్రస్తవనీయసముజ్జ్వలస్థితిన్.

141


తే.

చామరగ్రాహిణీకరచారుకటక, రశ్మిరాజినీరాజనరంజితుండు
భరతలక్ష్మణశత్రుఘ్నపరివృతుండు, నగుచు సామ్రాజ్యలక్ష్మిసొం పగ్గలింప.

142


సీ.

పౌరజానపదాభిశభాషణంబులు దగ నయ్యైతెఱంగుల నాదరించు
నుత్తమహయదంతిసత్తమరథరత్నములు సూచి సవరణ లలవరించు
యోధవీరప్రకారోక్తినిరూఢన ముద్దతి కెడఁదలో నుల్లసిల్లు
నిఖిలవిద్యాగమనిపుణవిద్వజ్జనసంభావనంబుల సంతసిల్లు


ఆ.

ననుదినంబు నిట్టు లభిమతబహువిధ, సముచితప్రవర్తనము లొనర్చు
చతివిభూతినుండి కతిపయదినములు, నోవుటయును రామభూవిభుండు.

143

పట్టాభిషేకమునకు వచ్చినజనకరాజు మొదలగువారిని రాముఁడు వీడుకొలుపుట

మ.

జనకాదిక్షితిపాలలోకములకున్
సంభావనాపూర్వకా
ర్చన లర్థిం దగ నిచ్చి వీడ్కొలిపి మార్గక్షేమసంవాహనం
బొనరింపం దనతమ్ములం బనిచినం బ్రోద్దామసేనాసహ
స్రనమద్భూమిభరస్ఫుటానమితశేషస్కంధు లై పోయినన్.

144


క.

వనచరనిశాచరులమ, న్నన నిచ్చలుఁ క్రొత్త గాఁగ నరపతి వారిం
గొనియాడుచుండఁ గతిపయ, దినములకుం దమ్ము లరుగుదెంచిరి మగుడన్.

145

ఉ.

అచ్చట రాజు లిచ్చినయనర్ఘమణిప్రకరం బుపాయనం
బిచ్చిన వేఱువేఱ ధరణీశుఁడు వారల నాదరించి మీ
తెచ్చినవస్తుకోటి గణుతింపఁ గృతార్థతఁ బొందె డెంద మే
నిచ్చెద వీరి కంచు నసురేంద్రహరీంద్రులఁ జూచి వేడుకన్.

146


ఆ.

పురుషరత్నములన పొందుట యుచిత మీ, రత్నములకు నని ధరావిభుండు .
వారి కప్పు డొసఁగె గారవ మేర్పడ, జాత్యరుచిరరత్నజాలకంబు.

147


క.

వనచరులకు నసురులకుం, గనకాంబరభూషణములు గణనకు మిగులం
దనుఁ జేరఁ బిలిచి యిచ్చుచు, జననాథుఁడు వేఱువేఱ సంభావించెన్.

148


ఆ.

ఇవ్విధమున వారి కెల్ల సంప్రీతి యొ, నర్చి రామధరణినాథుఁ డర్క
తనయుతోడి నిట్టు లనియెఁ బ్రసాదవి, కాసలలితవదనకమలుఁ డగుచు.

149


క.

నీపురి కేగుము హరిసే, నాపరిపాలనము సేయు నయదక్షుఁడ వై
నాపిలిచినయప్పుడ సే, వాపరతంత్రత వహింపవలయుం జుమ్మీ.

150


క.

అంగదుఁ బాటింపుము త, క్కుంగలయీసుభటకోటిఁ గొనియాడుము వీ
రిం గైకొంటిమిగాదె య, భంగుల యెప్పాట నరిది పనులకు నైనన్.

151


మ.

అని సుగ్రీవునిఁ బ్రీతి వీడ్కొలిపి దైత్యాధీశ్వరుం జూచి యి
ట్లను లంకాపురి కేగు ధర్మమహితన్యాయంబు లోకంబు కీ
ర్తన సేయన్ భవదీయరాజ్యము చిరస్థాయిత్వముం బొందఁగా
మను నీబంధుల నీగి తేజమున సమ్మానింపు మెక్కాలమున్.

152


క.

అని కారుణ్యజ్యోత్స్నా, జనకం బగుతనదువదనశశిమండల మా
తని నెమ్మనము సమ్మద, వనధిం బొంగింప నసురవరు వీడ్కొలిపెన్.

153


క.

హనుమంతుఁ జూచి మత్కీ, ర్తనములు భువనముల నెంతదాక నడచు నీ
వును నంతకాలమును ని, త్తనువు విడువకుండు మనుచు దయ చిగురొత్తన్.

154


క.

హిమధరణీధరతటసం, గమచారుమరున్నదీప్రకారసుభగతం
గమనీయంబుగఁ దద్వ, క్షమునం దొకహార మిడి యసదృశప్రీతిన్.

155


ఆ.

తిగిచి కౌఁగిలించి యగచరసత్తము, సద్గుణములఁ దగిలి సంస్తుతించి
రఘువరేణ్యుఁ డాదరం బెలరారంగ, వికచవదనుఁ డగుచు వీడుకొలిపి.

156


క.

తనుఁ బాయఁజాల కందఱు, వెనుఁబడుట యెఱింగి ధరణిరవిభుఁ డొండొరునె
మ్మనము మఱుఁగుచుండఁగ ని, వ్వనటకుఁ బని యేమి యనిన వా రతిభక్తిన్.

157


క.

ధరఁ జాఁగి మ్రొక్కి తమతమ, పురములకుం జనిరి రామభూపాలుండున్
భరతాద్యనుజసమేతము, పరిపాలన చేసి రాజ్యభారంబుఁ దగన్.

158

ఆశ్వాసాంతము

చ.

శరదభిరామచంద్రరుచిజాలసఖత్వసముల్లసత్పయ
శ్శరనిధిగర్వచర్వణవిశారదమేదురకీర్తిపూరభా

సురలహరీకదంబపరిచుంబితపూర్వమహీభృదస్తభూ
ధరమలయాభిధానగిరిదైవతపర్వతమేఖలుం డిలన్.

159


క.

ఫలితామరతరుశాఖా, తులితభుజుం డఖిలదిగ్వధూమస్తసము
జ్జ్వలదీధితిశాసనమణి, కులదీపక రాయగండగోపాలుఁ డిలన్.

160


మాలిని.

చిరవితరణలీలాశీలుఁ డుత్సాహవిద్యా
పరిణతదృఢసంగాభంగుఁ డక్షీణపుణ్యో
త్కరపరిచయశిల్పాకల్పుఁ డాభోగశుంభ
ద్ధరణివలయరక్షాదక్షుఁ డబ్జాక్షుఁ డుర్విన్.

161


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు సప్తమాశ్వాసము.

————