నిర్వచనోత్తరరామాయణము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షా ద్రామాయణాత్మనా.

శ్రియఃపతియు నఖిలచరాచరంబులం బుట్టింపఁ బెంప గిట్టింపఁ గారణం బగు సర్వేశ్వరుండు నిఖలలోకరక్షణార్థంబు రవికులాభరణం బగుదశరథునకుం బుత్రరత్నంబై రామరూపంబున నవతరించి సాధుబృందంబులం గాచె.

అట్టిపురుషోత్తమునిదివ్యచారిత్రంబు యథావస్థితంబుగ నాదికవి వాల్మీకిమహర్షి సకలవేదాంతరహస్యార్ధప్రతిపాదకంబును, నైహికాముష్మికసుఖప్రదంబును నపర వేదం బనాఁ బరఁగు సప్తకాండపరిమితం బైనశ్రీరామాయణం బనుమహేతిహసం బొనర్చి లోకంబునకు మహోపకారంబు సేసె.

అందుఁ దొలుతటియాఱుకాండములలో శ్రీరామునిపట్టాభిషేకంబుదాఁక జరిగినకథయు, సప్తమకాండమునం బట్టాభిషేకంబునకుం దరువాతిరామనిర్యాణపర్యంత మగుకథయు వర్ణింపఁబడి యున్నది. సప్తమకాండమునకే యుత్తరకాండ మనియుం బేరు. దీనికథావైభవముంబట్టి మనభరతఖండంబునంద కాక జర్మని మున్నగుద్వీపాంతరంబుల నుండుకవీంద్రు లనేకులు నానాభాషలలో నాటకములుగను, బ్రబంధములుగను వెండియుఁ బెక్కుతెఱంగులఁ దత్తదభిరుచి కనుగుణంబుగా వ్రాసికొని యున్నారు.

ఈ చరిత్రవోలె లోకవిదితం బగుచరిత్రంబు కొంతదనుక భారతం బొండుదక్క వేఱొం డెద్దియఁఁ గానరాదు, పాతివ్రత్యము, శాంతి, దయ, సౌశీల్యము, మున్నగుసుగుణంబులచే విలసిల్లి సకలపతివ్రతాజనకాలంకారం బై యొప్పులోకమాత సీతం బోలుసతీరత్నంబును, పౌరుషము, పితృభక్తి, జనానురాగము, క్షాంతి, కారుణ్యము మున్నగులోకోత్తరంబు లగుకల్యాణగుణంబుల కాకరం బైనశ్రీరాముం బోలుపురుషోత్తముండును మఱియొక్కం డెచ్చట నేని లేఁ డనుట సర్వజనవిదితము.

ఇట్టిమహాపురుషచరిత్రం బనర్లళకవితావిభాసితు లగుభాస్కరతిక్కనాదులకుఁ దెలుంగుబాసఁ బ్రబంధంబుగా రచియించుభాగ్యంబు లభించుట యాంధ్రభాషాభిమాను లగునస్మదాదులపుణ్యంబ కాని వేఱు గాదు. ఈచరిత్రంబును మొట్టమొదట మంత్రిభాస్కరుం డనుమహాకవి యాంధ్రీకరించె. ఇదియ భాస్కర రామాయణ మనుపేర నెల్లెడల మిగులం బ్రఖ్యాతి వహించి యున్నది. ఈభాస్కరుఁడు తిక్కనామాత్యునకుం దాత యని నిర్వచనోత్తరరామాయణమునం బ్రథమాశ్వాసములోని —

గీ.

సారకవితాభిరాము గుంటూరువిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
యైన మన్ననమెయి లోక మాదరించు, వేఱ నాకృతిగుణములు వేయు నేల.

అనుపద్యమునం దనకావ్యము స్వగుణంబునఁ గాకున్నను దనతాత యగు భాస్కరుని దివ్యకవితాప్రాగల్భ్యంబున నైనను లోకాదరణంబు నొందు నని చెప్పికొని యుండుటం దెల్లం బగుచున్నది. మంత్రిభాస్కరుఁడు పూర్వరామాయణము రచింప దానిం బూర్తి సేయం గడంగి కాబోలు తిక్కన యుత్తరకాండమును నిర్వచనముగ నాంధ్రీకరించె. దీనినే యిప్పటికి నూటయిరువది యేండ్లకు మునుపు కంకంటి పాపరాజు తద్దయు విస్తరించి రామనిర్యాణపర్యంతము గొప్పప్రబంధముగ విరచించెను. తిక్కనమాత్రము దన కావ్యము విషాదాంతముగ నుండఁ గూడ దని కాఁబోలు శ్రీరామనిర్యాణమును వచింపఁ డయ్యె. భారతమునఁ గృష్ణనిర్యాణముఁ జెప్పి యున్నను నప్పటికిఁ దనయభిప్రాయము మాఱియుండ వచ్చు నని యూహింపవచ్చును. ఇఁకఁ దిక్కనచరిత్ర యించుక వర్ణింప వలసియున్నది.

తిక్కన

నియోగిబ్రాహ్మణుఁడు, గౌతమగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, గొమ్మమాంబకు మంత్రిభాస్కరునకుఁ బౌత్త్రుఁడు, కొమ్మనకు నన్నమకుఁ బుత్త్రుఁడు, మహేశ్వరభక్తుఁడు, కేతన, మల్లన, సిద్ధన అనువార లీతని పెదతండ్రులు, ఈవిషయము విరాటపర్వములోని.—

సీ.

మజ్జనకుండు సన్మాన్య గౌతమగోర్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబాపతి యనఘులు గేతన, మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ, మ్మనదండనాథుఁడు మధురకీర్తి
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప, విత్రశీలుఁడు సాంగవేదవేది


తే.

యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల, నస్మదీయప్రణామంబు లాదరించి
తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి, యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు.”

అను పద్యమువలనను, నిర్వచనోత్తర రామాయణములోని—

మ.

అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలుధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్.

అనుపద్యమువలనను దెలియుచున్నది.

ఇంక నీకవి జీవించియుండుకాలముం గుఱించి పలువురు పలుతెఱంగులం దలాతలి వాదంబు సేయు చున్నను నిరర్థకాంశవిచారము పిష్టపేషణమ కా దలంచి హేతువాదంబునం దిగక సంగ్రహముగఁ దెలుపు చున్నాఁడ.

నిర్వచనోత్తరరామాయణమునకుం గృతిపతి యగుమనుమసిద్ధినృపాలుఁడు శాలివాహనశకము 1179-1182 (క్రీస్తుశ. 1258-1261) సంవత్సరములలో భూదానముఁ జేసినట్లు కృష్ణామండలములోని శిలాశాసనములవలనం దెలియుచున్నందునను, ఈమనుమరాజు రాజ్యముఁ గోలుపోఁగా [1254 సంవత్సరములో అక్కన బయ్యన యనుచోళులం జయించినట్లు కృష్ణామండలములో ఇనిమళ్ల గ్రామములోని శాసనము మున్నగు పెక్కుశాసనములచే క్రీ॥ 1200-1258 సంవత్సరముల నడుమ రాజ్యము చేయుచున్నట్లు తెలియుచున్న] గణపతిదేవుఁడు తిక్కనసోమయాజిప్రార్థనమువలన దండయాత్ర వెడలి వెలనాటిరాజులం జయించి నెల్లూరి కేగి మనుమసిద్ధిరాజుకు మరల రాజ్యంబు నొసంగినట్లు సోమదేవరాజీయమునం జెప్పంబడియున్నందునను, వారికి సమకాలికుఁ డగుతిక్కనసోమయాజియు శాలివాహనశకము 1127–1171 (క్రీ. 1200-1259) సంవత్సరములనడుమఁ దప్పక సశరీరుఁ డై యుండెననుట నిర్వివాదాంశము.

ఈ తిక్కనతాత యగుమంత్రిభాస్కరుంగుఱించి పెక్కుకవులు స్తుతిపద్యంబులం జెప్పి యునికి నేతద్వంశజులు రాజకార్యనిర్వాహదూర్వహు లనియ కాక యితనివంశము పండితవంశ మనియుం గూడ తేటపడుచున్నది. ఈకవికిఁ బూర్వులు మహారాజాస్థానములం గొప్పయుద్యోగము లొనర్చి జగద్విఖ్యాతిఁ గన్న మహాభాగులు. వీరినివాసస్థలము కృష్ణామండలములోని వెలటూ రనుగ్రామము. ఉద్యోగధర్మమున మంత్రిభాస్కరునికాలములో గుంటూరున నుండుటం జేసి గుంటూరువా రని పేరు వచ్చినదే కాని వీరియింటిపేరు కొట్టరువువారు. ఈవిషయమును గూర్చి అభినవదండి కేతన దశకుమారచరితలో—

గీ.

మనుమసిద్ధిమహేశసమస్తరాజ్య, భారగౌరేయుఁ డభిరూపభావభవుఁడు
కొట్టరువుకొమ్మనామాత్య కూర్మిసుతుఁడు, దీనజనతానిధానంబు తిక్కశౌరి.

అని వచించియున్నాఁడు. తిక్కనతండ్రి కొమ్మనామాత్యుఁడు గుంటూరికి దండనాథుఁడుగా నుండెను. ఈ కొమ్మనామాత్యుఁడు నెల్లూరిలో ధర్మపత్నిం గైకొని బంధుత్వమున నెల్లూరికి రాకపోకలు జరుగుచుండ మనుమసిద్ధినృపాలపరిచితి గలిగె ననియు, దానం జేసి మనుమరా జీకవికుటుంబము నాదరించి నెల్లూరికిం బిలిచికొని వచ్చి పూర్వము హరిహరనాథాలయ ముండిన యిప్పటిరంగనాథదేవాలయముదగ్గఱ నిల్లు గట్టించి తిక్కన నందుఁ గాపురం బుంపఁగా నారాజాస్థానంబున నమాత్యుండును, విద్వత్కవీంద్రుండును నై దిగంతవిశ్రాంతకీర్తిం గైసేసి వైదికకర్మానుష్ఠానతత్పరుం డగుటమిఁ బినాకినీతీరంబున జన్నంబు సేసి తిక్కనసోమయాజి నాఁ బరఁగి హరిహరనాథున కంకితంబుగా విరాటపర్వంబుఁ దొడంగి మహాభారతంబు నాంధ్రీకరించె ననియుఁ దరువాత మనుమసిద్ధిమరణముతో నాతనివంశ మంతరింపఁ దిక్కనసోమయాజికుమారుఁ డగుకొమ్మన నెల్లూరికి రెండుకోసులదూరమున నున్న పాటూరికరణీకమును సంపాదించికొని యచ్చట నివసించె ననియు, నాకారణమున నీకవివంశమువారికిఁ బాటూరువా రనుపేరు వచ్చిన దనియు, నేతద్వంశ్యులు చెప్పుచున్నారు. ఈపాటూరువారు పాటూరిలోఁ గొందఱు నిందుకూరిపేటలోఁ గొందఱు నున్నారు.

తిక్కనామాత్యుడు నిర్వచనోత్తరరామాయణమును, పంచమవేదమనాఁ బరఁగుభారతంబును (విరాటపర్వము మొదలు 15 పర్వములు) రచియించెను. మఱియు నీతఁ డవసానకాలమున ముద్దులమూటఁ గట్టు గృష్ణశతకమును రచియించెనఁట. నన్నయభట్టు భారతము నారణ్యపర్వముదనుక నాంధ్రీకరించి మృతిబొందఁగా నారణ్యపర్వముం దెలింగించుట నాతనికి మతిభ్రమణము గలిగి కీర్తిశేషుఁ డయ్యె నని తలంచి దానికి శంకించి యరణ్యపర్వశేషముం బూర్తిసేయఁ దొరకొనక తక్కుoగల పదియేనుపర్వముల రచించెనని చెప్పుదురు.

తిక్కన నిర్వచనోత్తరరామాయణ మొనర్చుతఱికి యజ్ఞము సేసి యుండలేదని యాశ్వాసాంతగద్యమువలనం దెలియుచున్నది.

ఈగ్రంథములు నెల్లూరి కధిపతి యగుమనుమసిద్ధిరాజున కంకిత మొనర్చెను. మనుమరాజు తిక్కనపై మిక్కుటంపుమక్కువచే మామవరుసం బిలుచుచున్న ట్లీకావ్యము ప్రథమాశ్వాసములోని—

క.

ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుఁడ వగు దనినను, భూనాయకుపల్కు చిత్తమున కిం పగుడున్.

అనుపద్యమువలనం దెలియు చున్నది.

ఇంక నీతనిభాషాంతరీకరణముంగుఱించి యించుక విచారింపవలసియున్నది. పూర్వకాలమున నాంధ్రకవులు, పురాణములు నితిహాసములం దెలిఁగించుతఱిఁ గథాసందర్భము మాత్రము మాఱకుండునట్లు కొంతదనుక బాటించుచు వచ్చిర కాని మూలములో నుండు ప్రతిపదమునకు సరి యైన తెలుఁగుపలుకుల నిఱికింపవలయు ననియు, మూలములో లేనివర్ణనలను గల్పనలను జేయరా దనియు, మూలములో నున్నవిషయముల నన్నింటిని వరుసగానే చెప్పవలయు ననియు సంకల్పించినవారు కారు. దీనికిఁ గారణము తమకావ్యములు స్వతంత్రములుగా నుండవలయు ననియుఁ గవితాధార దడవుకొనినట్లుండక యవిచ్ఛిన్నముగా నుండవలయు ననియుఁ దలంచుటయ. లోకములో ఒక భాషశైలి మఱియొకభాషశైలికిఁ గొన్నియెడలం బోలియునికియుఁ బెక్కుతెఱంగులం బోలకయునికియుం గలదు. గీర్వాణంబునం గర్మణిప్రయోగ మింపు నింపును. ఆంధ్రంబున నది యంతగా రుచింపదు. మఱియు దేవభాష వంశస్థము, ఉపేంద్రవజ్ర, ఇంద్రవజ్ర, ఆర్య మున్నగు వృత్తములు రచన కనుకూలములుగను విన సొంపుగ నుండును. తెలుఁగున సీసము, గీతము, చంపకమాల, మత్తేభము లోనగువృత్తములు సొగసుగ నుండుఁ గాని వసంతతిలకాదు లంతరమణీయములుగ నుండవు. కొన్నిజాతీయము లాంధ్రంబునం గొన్ని గీర్వాణంబునను సహృదయహృదయానందంబు నొందించు. ఇ ట్లొక్కొకచంద మొక్కొకభాష కందంబుఁ బొందించుటం జేసి యాయాభాష కనుగుణం బగుశైలిం గబ్బంబు రచించుటయ కమనీయంబు. మహాకవు లగునన్నయ, భాస్కరుఁడు, తిక్కన, శ్రీనాథుఁడు లోనగు వా రీఘంటాపథమునకు వెలి గాకయే కావ్యనిర్మాణమునకుం గడంగిరి. అట్లుగాక మూలమునకు నన్నివిషయంబుల సరిగ భాషాంతరీకరణము సేయునిర్బంధమునకు లోగిన నట్టిభాషోచితశైలి యలవడుట దుస్సాధము. కాఁబట్టియే తిక్కనామాత్యుఁడు నిర్వచనోత్తరకాండకథ నూఁతగాఁ గైకొని వర్ణనాదులఁ దనయిచ్చవచ్చినట్లు స్వతంత్రముగ రచియించె. అయినం గొన్ని యుచితస్థలములు మూలము ననుసరించియు నాంధ్రీకరించి యున్నాఁడు.

ఉత్తరకాండలోని—

సువర్ణపృష్ఠే స బభౌ శ్యామః పీతాంబరో హరిః,
కాంచనస్య గిరే శ్శృంగే సకటి త్తోయదో యథా.

అనుశ్లోకమును—

క.

గరుడునిపై శార్ఙ్గధను, ర్ధరుఁ డగువిష్ణుండు మేరుతటిఁ బొల్చుకటి
త్పరివృతజలదముఁ బోలుట, విరియ దనుజరాజహంసవితతి యితనికిన్.

అనియు, నిట్లే కొన్నికొన్నియెడలం గొంచె మించుమించుగఁ దెలిఁగించి యున్నాడు. కథాభాగములో సంస్కృతంబున బహుళంబుగ నున్నయెడం బ్రధానకథాంశమును మాత్రము వివరించుచు మిగుల సంక్షేపించి శ్రీరామనిర్యాణమును వదలి 10 యాశ్వాసములప్రబంధమును వ్రాసెను. సంక్షిప్తభాగంబుల సూక్ష్మదృష్టిచే గ్రంథంబునం జూచుకొనునది.

ఇక్కవిసార్వభౌమునిసరసకవితానిర్మాణకౌశల మిట్టి దని వక్కాణింప నేరితరము. ప్రబంధపరమేశ్వరుం డనాఁ గవిపుంగవులనడుమ వన్నె కెక్కినయెఱ్ఱాప్రెగ్గడ తనహరివంశములో నీతని—

తనకావించినసృష్టి తక్కొరులచేతం గాదు నా నేముఖం
బునఁ దా బల్కినపల్కు లాగమము లై పొల్పొందు నావాణిన
త్తను నీతం డొకరుండు నాఁ జనుమహత్వ్యాప్తిం గవిబ్రహ్మ నా
వినుతింతుం గవితిక్కయజ్వ నిఖిలోర్వీదేవతాభ్యర్చితున్.

అని కవిబ్రహ్మ కాఁ గొండాడియున్నాఁడు.—

నిరవధికకోమలపదమధురసరససరస్వతీవిలాసవైభవంబునను వేదమార్గప్రవర్తకత్వంబున నీతని నపరకృష్ణద్వైపాయనుం డనియే చెప్ప నొప్పును. మహాభారతంబున నాశ్వాసాంతపద్యంబులం జూడ నితం డద్వైతమతావలంబి యనియుఁ బూర్వోత్తరమీమాంసాశాస్త్రములయందును, వ్యాకరణమునందు నసమానపాండిత్యము గలవాఁడనియు గోచరింపకమానదు. ఇతఁడు కాళిదాసాదులువోలె సకలశాస్త్రమర్యాదల సమగ్రముగ నెఱింగిన పండితకవీంద్రుఁడు. ఇయ్యది భారతంబున నాయాఘట్టంబుల భాషాంతరీకరించుతఱి నెఱుంగనగు. ఈతనికి గీర్వాణాంధ్రంబుల నెక్కుడు వైశారద్యంబుకలిమి నుభయకవిమిత్రుం డనుబిరుదము గలిగె. సోమయాజి యగుటఁ బరమాస్తికాగ్రేసరుం డనియుఁ, గర్మాచరణదీక్షాదక్షుం డనియుఁ దెలియుచున్నది. ఇక్కవినాథురచన లాంధ్రభాషాభిమానుల కాగమములు. ఈరసికు సరసంపుఁబలుకు లాంధ్రభాషాయోషాభూషణములు. ఈతనికృతు లాంధ్రకవిపుంగవులకుఁ గవితామార్గప్రదర్శకములు. ఆంధ్రభాషాతత్వము నెఱింగినకోవిదులలో నీతం డపరశబ్దశాసనుఁడు. ఇక్కవీంద్రునకు గీర్వాణభాషావైశారద్య మెక్కుడయ్యును గవనంబునం దెలుఁగుపలుకులే తఱచుగాఁ గాన్పించును. కవనంబున జల్లిపదంబుల నిఱికింపక కాదాచిత్కముగ ననతిదీర్ఘసమాసములం బొందుపఱచుచుఁ జిన్నచిన్నపదములం గూర్చి యతిప్రాసములకుఁ దడవుకొనక సరళముగా హృదయరంజకముగాఁ గవన మల్లుటయ యీకవికి నైజము. సంస్కృతంబున బాణభట్టప్రథమకృతి యగుహర్షచరిత్రమునంబోలెఁ దిక్కన బాల్యకృతి యగునుత్తరరామాయణంబున నవిచ్ఛిన్నకవితాధారకుఁ గొన్నియెడల సంకోచంబు గలిగినను, కాదంబరింబోలె భారతంబున నారితేరి సర్వాలంకారశోభిత యై నవరసోపేత యై సరసగుణసమేత యై ప్రౌఢకవితాయువతి దద్దయు సహృదయహృదయాంబుజంబుల నలరించుచున్నది. సమయౌచితింబట్టి యేరసంబు వర్ణించుతఱి నెట్టిపదములం గూర్చిన రసము గృహీతాకృతివోలె సహృదయహృదయదర్పణంబులఁ బ్రతిబింబించునో, యట్టిమధురపదంబులం బొందించువిషయము నిక్క విచంద్రుఁ డెఱింగిన ట్లొరు లెఱుంగరు. సర్వతో ముఖపాండిత్యవిభూతి గలవాఁ డగుటమి బహుళార్థంబు గలభావంబు సంగ్రహించి యొకటిరెండుపద్యంబులలో నిముడ్చుటకును, నల్పాభిప్రాయంబునకుం జిన్నెలు వన్నెలు గల్పించి విపులంబుగా రమణీయంబుగా వ్రాయుటకును నేర్చినవలంతి. వేయేల? ఎఱ్ఱాప్రెగడ, శ్రీనాథుఁడు మున్నగుమహాకవులకే యీతనికవనమున నెఱుంగఁ దగినయంశము లనేకము లున్నవనఁ దక్కుంగలకవులఁ జెప్ప నేల? ఈతనికవిత్వంబున సందర్భోచితరీతిఁ బ్రయుక్తంబు లై చక్కనిలోకోక్తులు శ్రోతలం బఠితల నానందార్ణవతలనిమగ్నాంతరంగులం జేయుచున్నవి. ఉదాహరణములు — 'చెవులు పట్టి యాడించు' పు. 37 ప. 22, 'ఒడల్ సిదిమినఁ బాలు వచ్చు' పు 102 ప 22. 'నేతికుండపై యెలుక' పు. 107. ప. 22 ఇట్లు గనుంగొనఁ దగినది.

ఈకవి తనకవిత్వంబున పాదపూరణంబుగ వ్యర్థపదములం బ్రయోగింపక (నిర్వచనోత్తరరామాయణము 1 వ పుటలోఁ) దాఁజేసినప్రతిజ్ఞనుఁ జెల్లించుకొనెను. ఈతనికవనంబున శబ్దచిత్రంబులు నర్థాలంకారములు విరళంబులు. కాలిదాసాదులకుఁబోలె నీకవికి నుత్ప్రేక్షోల్లేఖాదులకంటె నుపమారూపకస్వభావోక్తులు గడుఁబ్రియములు.

ఉదాహరణము.—

ఉ.

చారుబలాకమాలికల చాడ్పున దంతము లొప్ప గర్జిత
స్ఫారరవంబులట్లుగ నభంగురతం బటుబృంహితంబు లా
సారముమాడ్కి దానజలసంతతి గ్రమ్మఁగఁ గాలమేఘమా
లారుచిరంబు లై మద చలద్ద్విపసంఘము లొప్పు నప్పురిన్.

1 ఆ. 53 ప.


సీ.

అనవద్యవేదవిద్యాలతావితతికి, నాలవాలములు జిహ్వాంచలములు......

1 ఆ. 57 ప.


సీ.

పడఁతుల నెఱివీగుఁ బాలిండ్లు వెడదోఁప, లీలఁ బయ్యెదలు దూలించుటకును..

1 ఆ. 59 ప.

శబ్దాలంకారంబులలో నీకవికిఁ బ్రియమైనది రెండురెండు గాని, మూఁడుమూఁడు గాని, పద్యములో నన్నియుఁ గాని సమాసములయం దంత్యాక్షరవ్యావృత్తినియమము. ఉదా:—

మ.

అతులౌదార్యుఁ డహీనశౌర్యుఁడు సముద్యద్ధైర్యుఁ డత్యంతవి
శ్రుతచారిత్రుఁడు సూరిమిత్రుఁడు జనస్తోతవ్యగోత్రుండు సం
భృతసత్కీర్తి పవిత్రమూర్తి యసుహృద్బృందార్తినిర్వర్తి పూ
జితధీమంతుఁడు పుణ్యవంతుఁడు జయశ్రీకాంతుఁ డిమ్మేదినిన్.


చ.

నిరుపమమూర్తి వైరిరథినీసమవర్తి వివేకవైభవ
స్ఫురితవిచారుఁ డుజ్జ్వలయశోమణివహారుఁడు ధర్మసంగ్రహా
దరపరతంత్రుఁ డార్యజనతామతమంత్రుఁడు వంశవారిజా
కరనవసూర్యుఁ డస్ఖలితగౌరవవర్తనధుర్యుఁ డిమ్మహిన్.

3 అ. 119 ప.

మ.

కమలాధారుఁడు భీతిదూరుఁ డసమాకారుండు గంభీరుఁ డ
బ్జముఖీమారుఁ డపారసారుఁడు కళాస్ఫారుండు వీరుండు దు
ర్ధమదోస్సారుఁ డధర్మభీరుఁడు మహోదారుండు దుర్వారుఁ డ
త్యమలాచారుఁడు నిర్వికారుఁడు యశోహారుండు ధీరుం డిలన్.

1 ఆ. 86 ప.

ఇట్టివి సూక్ష్మదృష్టిఁ గనుఁగొనినచో నీతనికృతులం బెక్కులు గన్పట్టును. అయినను గథాసందర్భమున దీనిని పరమార్ధ మని తలంచి రసభావాదులం దిగనాడి, క్లీష్టార్థకల్పనైకశరణంబు లగుచిత్రబంధయమకాదులకొఱకుఁ గష్టపడక యాశ్వాసాంతమున మాత్రమీ వ్యావృత్తినియమమును గైకొనినాఁడు. ఇట్టిలక్షణములు విశేషముగ నాంధ్రపంచమవేదంబునఁ జూపట్టును.

ఈ కావ్య మీతని ప్రథమకవిత యగుటం జేసి దీనియందు భారతమందలి కవితాప్రౌఢిమ యంతగాఁ గానరాకున్నను మొత్తముమీఁద భారతశైలిం బోలియే యున్నది. కాఁబట్టియే యిందలి పద్యంబులయందుఁ దిక్కన కత్యంతగౌరవ ముండి యుండెను. దీనికిఁ దనభారతంబున నిందలి కొన్నిపద్యంబులఁ గొంతవఱకు మార్చియు మార్పకయుఁ బొందుపఱిచి యుండుటయే ప్రమాణము.

విస్తరభీతిచే వాని నిట నుదాహరింపక విరమించితి. ఇక్కవీంద్రుఁడు నన్నయభట్టసంప్రదాయానుసారముగఁ గావ్యాదిని సంస్కృతశ్లోకరూపంబుగనే మంగళాచరణం బొనర్చెను. షష్ఠ్యంతములు మానెను. దీని బట్టి యేతద్వైకల్పికత్వంబు గవి కిష్ట మని తోఁచుచున్నది. ఈ కవివల్లభుంగుఱించి వ్రాయఁదగునంశము లనేకము లున్నను, విస్తరభయంబునను ముఖ్యముగా నవి భారతమునకు సంబంధించిన వగుటను విరమించుచు స్థాలీపులాకన్యాయంబుగ రెండుపద్యముల నిట నుదాహరించుచున్నాఁడ.

మ.

కుచముల్ వాఱెడినీటిమీఁదివిలసత్కోకంబులం గ్రేణి సే
యుచు నుండన్ మెడ యెత్తి పాదయుగళం బూఁదంగ బాహాలతల్
పచరింపం గరమూలకాంతి నిగుడ భావంబు రంజిల్లఁ బా
డుచుఁ గ్రీడించిరి పువ్వుఁబోఁడులు లతాడోలాకళాప్రౌఢులన్.

8 ఆ. 37 ప


శా.

ఏమేమీ రఘురామతమ్ముఁడవె మీ రేపారి పైనెత్తి మా
మామం బంక్తిముఖున్ వధించినను మీమౌర్ఖ్యంబు సైరించి యే
నేమిం జేయక యున్నఁ గ్రొవ్వి యిట నీ వేతెంచితే మేలు మే
లీమై తోడన పోదు గాక యని దైత్యేశుండు దర్పంబునన్.

10 ఆ. 17 ప.

ఇట్లు సరసగుణమణిగణభూషణభూషితకవితావనితామణి మధురశృంగారవిలసితంబుల రసికవరేణ్యు లనురక్తి ననుభవించి యానందాంబునిధిరంగతరంగంబుల డోలాకర్మ నాచరింతురు గావుత మని ప్రార్థించుచున్నాఁడ.

ఉత్పల వేంకటనరసింహాచార్యులు