నిర్వచనోత్తరరామాయణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

పంచమాశ్వాసము



రమణచరణశరదం
భోరుహభృంగపతిచేఁ ద్రిభువనప్రథితా
చారునిచేఁ గనకాచల
ధీరునిచే మనుమవసుమతీవల్లభుచేన్.

1


క.

శంభునిచే నివ్విధమున, సంభావితుఁ డై తదీయశైలము డిగి సం
రంభమున రావణుఁడు దాఁ, గుంభిని నలుఁగడలఁ గలయఁ గ్రుమ్మరుచుండెన్.

2


క.

ఒక్కొకమరి సేనలతో, నొక్కొకమరి వీరపరిజనోపేతుం డై
యొక్కొకమరి దనయంతన, యెక్కడనేనిని జరించు నిచ్ఛాగతులన్.

3

వేదవతి రావణునిచే నవమానిత యై యగ్నిప్రవేశము చేయుట

మ.

హిమవంతంబున కేగి యొక్కయెడ నందేకాంత మొక్కర్తు చీ
రముఁ గృష్ణాజినముం గమండలువు నై రాగంబు వర్జించి సం
యమముం గైకొనిఁ యున్నఁ జేరఁ జని హృద్యాకారమున్ యౌవనో
ద్యమముం గాంతియుఁ జూచి రావణుఁడు గామాయత్తుఁ డై యి ట్లనున్.

4


క.

ఎవ్వనితనయవు నీపతి, యెవ్వఁడు పే రేమి నీకు నీరూపంబున్
జవ్వనముఁ బాయ నీతప, మెవ్విధిఁ బాటిల్లె నకట యింతయుఁ జెపుమా.

5


క.

అనుపలుకులు వినియుం దా, విననియదియపోలె నుచితవిధి నాతిథ్యం
బొనరించినయక్కన్యక, ననిమిషరిపుఁ డట్ల మఱియు నడిగిన నదియున్.

6


సీ.

అనఘ కుశధ్వజుఁ డనుమునీశ్వరుఁడు వేదాభ్యాస మనిశంబు నాచరించి
యాసుకృతంబునఁ జేసి నన్ గని వేదవతి యనుపే రిడి వంశమహిమ
వెలయంగ నిక్కన్య విష్ణున కిచ్చెద నని చాల బ్రీతి సేయంగ నెల్ల
వారును మాయయ్యకోరిక యెఱుఁగక యర్థింప నర్థింప నతఁడు ద్రోచి


తే.

పుచ్చ నసురేంద్రుఁ డైనజంభుండు నడిగి, తనకు నీకున్న నలిగి మాతండ్రి జంపెఁ
దల్లి సొదఁ జొచ్చె సత్యవ్రతంబు నడపు, జనకుపూనికి నేఁ దీర్తు నని తలంచి.

7


క.

అది మొదలు గాఁగ విష్ణుని, మది నిల్పి యతండ నాకు మగఁ డగు నని యి
ట్లు దపంబు సేయుచుండుదు, నిది నాతెఱఁ గనిన దానవేశ్వరుఁ డనియెన్.

8

ఉ.

కాంతి దొలంగ మే నిటులు గాఱియఁ బెట్టుచు జవ్వనంబుచె
న్నింతయు రిత్తవో సుఖము లెల్లను డిగ్గఁగఁ ద్రావి నెమ్మదిం
జింత దళంబుగా నడరఁ జేడ్పడి యొంటి చరించుచున్ జర
త్కాంతయుఁబోలె నియ్యిడుమఁ గైకొనఁ బాడియె చారులోచనా.

9


మ.

లలనా విష్ణుఁ డనంగ నెవ్వఁ డతఁ డేలా శుద్ధవంశంబు ని
ర్మలసంపూర్ణతపోమహత్త్వము వరఃప్రాప్తానుభావంబు దో
ర్బలసంపత్తియు నాకుఁ బోలెఁ ద్రిజగత్ప్రఖ్యాతిపాత్రంబు లే
కలదే లంక పరాక్రమం బఖిలలోకశ్లాఘ్యమే వానికిన్.

10


ఆ.

అనినఁ జెవులు మూసికొని యిట్టులను లోక, వంద్యు వేదవేద్యు వరదుఁ బరము
ననుపమాను నచలు నవ్యయు హరిఁ జెడ, నాడఁ గూడ దని మృగాక్షి మఱియు.

11


చ.

తపముల కెల్లఁ దాన ఫలదాత కులంబున కాదికర్త యై
యపరిమితప్రభావుఁ డగునాచతురాస్యుఁడు నాభిఁ బుట్టె వి
శ్వపతి యహీనబాహుబలసారఘను ల్మధుకైటభాదిదై
త్యపతుల నెల్లఁ ద్రుళ్లడఁచె నారయ విష్ణుఁ డమాననీయుఁడే.

12


క.

అనిన నసుర యమ్మాటలు, విన నొల్లక కదియ వచ్చి వెండియు సతి కి
ట్లనియె మరునంపపెల్లునఁ, దనువు నిలువ దింకఁ గోర్కి దఱిమెడుఁ బేర్మిన్.

13


చ.

ఎఱుఁగవు గాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
త్తఱి నుడివోవకుండ నుచితంబుగ జక్కవదోయివోని క్రి
క్కిఱిసినచిన్నిచన్నుగవ యిం పెసలారఁగ నాదువక్ష మన్
వఱలుసరోవరంబున నవారణఁ గేలి యొనర్సు కోమలీ.

14


ఆ.

అనుచుఁ దగిలి చూచు నద్దానవేశ్వరు, నలిగి చూచి నిన్ను నధముఁ డగుట
మును తపఃప్రభావమున నెఱింగియుఁ దగ, నాపులస్త్యుమనుమఁ డని తలంచి.

15


క.

అతిథిసపర్యయు సమయోచిత మగుసంభాషణంబు సేసితిఁ బోపో
మతి లేదు నీకుఁ జొప్పడు, నతివలలో నన్నుఁ దలఁప నగునె దురాత్మా.

16


చ.

అని కలుషించి వేదవతి యచ్చటు వాసి చనం దలంచినం
గని దశకంధరుం డడరి గ్రక్కున వేనలి పట్టికొన్న నం
గన యొకవ్రేల వ్రేయ నది కత్తివిధంబునఁ దాఁకి కత్తిరిం
చినక్రియఁ ద్రెంచె వెండ్రుకలు చేతఁ దెమల్చినయంత కివ్వలన్.

17


తే.

వెండ్రుకలు చేతవచ్చుడు వెఱఁగుపడుచుఁ, దపము పేర్మికి నలికి యుద్దనుజవిభుఁడు
నిలిచె రోషమహానలజ్వలనమూర్తి, యగుచుఁ బిఱిఁదికి బాసి యి ట్లనియె సతియు.

18


ఉ.

బన్నము లిట్లు నీవు పఱుపం బడి మేను దొఱంగు చుండి యే
నిన్ను శపించినట్లయిన నిర్మలనిత్యమహాతపఃప్రభా

వోన్నతి చేటు గాదె పునరుద్భవ మయ్యెద నీకు మృత్యు వై
సన్నుతపుణ్యజాత యనఁ జాలి యయోనిజమూర్తిఁ దాల్చెదన్.

19


క.

ఈపరిభవంబుఁ బడియుం, దీపే ప్రాణంబు లనుచు దిగ్గన ననలం
బాపాదించి దశానను, నే పడఁగన్ విష్ణు నాత్మ నిడి సొదఁ జొచ్చెన్.

20


ఆ.

కృతయుగమున వేదవతి యనఁగాఁ జన్న, నాతి త్రేత నిపుడు సీత యనఁగ
జనకుయజ్ఞ వేది జన్మించి నీసతి, యయ్యె నీవు విష్ణుఁ డగుటఁ జేసి.

21


చ.

అని ముని సెప్ప విస్మయము నార్తియుఁ గోపముఁ బ్రీతియుం బెనం
గోనఁ దప మిట్టిదిం గలదె కోమలి దొల్లియు నన్నె కోరెనే
దనుజుఁడు నాఁడు నియ్యనుచితం బొనరించెన్ తత్ఫలంబు మె
ల్లన యిటు వొందెనే యని తలంచుచు రాముఁడు గౌతుకంబునన్.

22


క.

ఇవ్విధమున సొదఁ జొచ్చిన, యవ్వనితం జూచి పిదప నసురాధీశుం
డెవ్వలని కరిగె నెవ్వరి, కెవ్విధిఁ గావించె ననిన నిట్లనె మునియున్.

23

రావణుఁడు దిగ్విజయము చేయుట

శా.

వీరుం డెవ్వఁడు నెందు లేఁ డనుచు నుర్విం ద్రిమ్మరున్ దర్పదు
ర్వారస్ఫారపరాక్రమక్రమకళావైదగ్ధ్యవిస్తార మే
పారంగా ధరణీశులన్ వెదకి వీరావేశి యై దుర్దమ
ప్రారంభం బొనరించుచున్ సమరసంరంభంబు శోభిల్లఁగాన్.

24


సీ.

ఒక్కచోఁ దా మరుత్తోర్వీసుజన్నంబునకుఁ జని యతని రణంబు సేయ
నడిగినఁ గ్రతుకాలమని సేయఁ దగవు గాదనుచు శాంతత నున్న యానృపాలు
నోడితి వని యార్చి యుడుగక యజ్ఞోపకరణంబు లన్నియు గాసి చేసి
ప్రాగ్వంశ మంతయు వ్రచ్చి వేదిక గ్రొచ్చి ఋత్విగ్గణంబులసత్వ మడఁచి


తే.

యజ్ఞభాగంబులకు వచ్చి హరికృతాంత, వరుణధనదులు బర్హియు వాయసంబు
హంసమును గృకలాసంబు నై భయమున, నడఁగియుండిన నెఱుఁగక యసుర వోయె.

25


ఉ.

అంతకవిక్రమున్ సురథు నార్యుఁ బురూరవు బాహుశాలి దు
ష్యంతు నజేయు గాధినృపసత్తమునిం గని కూడ ముట్టి మీ
రింతకు మున్ను న న్నెఱుఁగ రెన్నఁడుఁ గావునఁ గయ్య మిండు మీ
కెంతబలంబు గూడు నదియెల్లను గూర్పుఁడు దర్ప మేర్పడన్.

26


ఉ.

చాలక తక్కినన్ వినుఁడు శౌర్యము లజ్జయు నుజ్జగించి మీ
రోలిన నిల్చి నాయెదుర నోడితి మే మనుఁ డన్న మేదినీ
పాలురు పోరిలో మనకుఁ బంక్తిముఖుం జెనయంగ వచ్చునే
మే లిది యంచు నోటమిక మేకొని యట్టులు చేసి రుక్కఱన్.

27


మ.

దనుజుం డీపురి కేగుదెంచి మహిమోద్దామప్రతాపాగ్నిసం
జనితాశావలయప్రకాశబహుశస్త్రప్రౌఢిసంరూఢిచే

ననరణ్యక్షితిపాలు ముట్టిన నతం డత్యుద్భటాకారుఁ డై
యని కేగెం బృథివీపరాగపటలం బాకాశముం గప్పఁగన్.

28


ఉ.

సైన్యయుగంబునం బెనఁగి సంగరరంగమునందు మ్రగ్గ
జన్యవరుండు రావణుఁడు సమ్ముఖ మై మహి సంచలింప న
న్యోన్యవధాభిలాషమున నార్చి వడిం దలపడ్డఁ జూడ సా
మాన్యము లయ్యె నప్పు డొకమాత్ర జయాపజయప్రకారముల్.

29


చ.

వికటము లైనహస్తములు వ్రేయుచు నోలిన తాఁకి యున్న మ
స్తకములు నుగ్గు సేయుచు నిశాతకృపాణకళావిదగ్ధుఁ డై
యొకవడిఁ బోరి డస్సి బలియుం డగుదానవుచేత నొచ్చి నే
ల కొరగునప్డు భూపతి చలంబున నాతనితోడ నిట్లనున్.

30


మ.

అని నీ కోపక పడ్డ నేమి యిఁక దైత్యాధీశ యే ధర్మవ
ర్తిని యేనిన్ శుచి నేని నాకులమునన్ దివ్యావతారుం డొకం
డనపాయుం డుదయంబు సేసి భువనం బానందముం బొంద నెం
దు నవధ్యం బగునీశిరోదశకముం దున్మాడువాఁ డుద్ధతిన్.

31


ఆ.

అనిన నసుర నగుచు నగు నగు నీయందుఁ బొంకు గలుగు నెట్లు పోలుఁ బోలుఁ
బిదపఁ జూచికొంద మిది నీవు గొ మ్మని, పరిఘ నతనిశిరము పగుల వ్రేసె.

32


క.

ఆర్చి విజయోత్సవమునం, బేర్చినచలమున వరంబు పెంపున సొంపుం
దీర్చి దిగులు రాజులయెదఁ, గూర్చి విడిసె మగుడ దైత్యకోటి మదింపన్.

33


క.

ఇమ్మెయి నచట నచట య, జ్ఞములుఁ దపములును ధర్మచర్యలు బహువి
ఘ్నములఁ బెట్టుచుఁ గలయం, గ్రుమ్మరి నరవరుల నొక్కకోటికిఁ దెచ్చెన్.

34


మ.

ఒకనాఁ డొక్కెడఁ బోయి పోయి దివి నత్యుచ్చైఃపయోదంబు నె
క్కి కడుం జె న్నగువీణ చే నమర నక్షీణప్రభావుండు సం
ఖ్యకళాసంజనకుండు నారదుఁడు రాఁగాఁ జూచి యాసన్నపు
ష్పకుఁ డై భక్తిఁ గృతప్రణాముఁ డగుచున్ సల్లాపసౌఖ్యంబునన్.

35


ఆ.

అసురవరుఁడు గుశల మడిగిన నుచితసం, భాషణంబు సేసి బంధుభావ
మాదరమున నెఱపి యమ్ముని మానవ, హితముఁ గోరి యతని కిట్టు లనియె.

36

నారదచోదితుఁ డై రావణుఁడు యమునిమీఁదికిఁ జనుట

మ.

ధరణీచక్రమునందు నీవు సమరోత్సాహంబున రాజులం
బొరిపుచ్చం గనుఁగొంచు వించు మది నేప్రొద్దున్ ముదం బందుదున్
హరియుద్ధంబును శూలిసంగరము దేవాధీశుసంగ్రామముం
గర మర్థి న్మును సూతు నాకు నవి వేడ్కం జేయ వి ట్లెమ్మెయిన్.

37


క.

ఏ నీకు నొకటి సెప్పెద, దానవకులముఖ్య దేవతలకు నవధ్యుం
డైననినుఁబోటివాఁ డీ, మానవుల జయింప విక్రమంబును గలదే.

38

క.

కలయం ద్రిమ్మరి మేదినిఁ, గలవీరుల నోర్చి జయము గైకొంటి మను
ష్యులు నీ కెదురే యింకం, గలదే కొద వడ్డచో టఖండితశౌర్యా.

39


తే.

క్షుత్పిపాసలు జరయును ఘోరరుజలు, నడర నార్తులై యుండుదు రదియుఁ గాక
మర్త్యు లిటమున్న వీరు లమర్త్యు లైరి, పీనుఁగుల ముట్టి యొడిచిన బిరుదు గలదె.

40


క.

కావున నిమ్మనుజావళి, నీ వడుచుట మెచ్చు గా దనిన నప్పలుకుల్
దేవారి వోలు నని సం, భావించి మరుత్తపస్విపతి కి ట్లనియెన్.

41

నారదవచనప్రబోధితుం డై రావణుఁడు యమునిపై దాడి వెడలుట

ఉ.

ఏను రసాతలంబునకు నేగెద నాగకులంబు నోర్చి య
ద్దానవులన్ జయించి బలదర్పము లేర్పడ దేవకోటిదు
ర్మాన మడంప వాసవపురంబునకుం జనువాఁడ సన్మునీం
ద్రా నినుఁ గంటి నా కభిమతంబులు సేకుఱు నింక నెమ్మెయిన్.

42


తే.

అనిన విని నీకుఁ బాతాళయానమునకుఁ, దెరువుగా దిది సమవర్తిపురము సరణి
యందుఁ జను మతనిమదంబు నడపవలయు, ననిన నమ్ముని కనియె నద్దనుజవిభుఁడు.

43


ఉ.

మున్ను ప్రతిజ్ఞ సేసితి సముద్ధతవృత్తి దిగీశకోటికిన్
బన్నముఁ దేరఁ గావున శుభంబులు శీఘ్రమ చేత నీతి గ
ర్వోన్నతిఁ గ్రాలునాజముని ను క్కడఁగించి క్రమంబుతోడఁ ద
క్కున్నదిశల్ జయించెద సముజ్జ్వలదుస్సహవిక్రమంబునన్.

44


క.

పని వినియెద నని మ్రొక్కుచు, దనుజేంద్రుఁడు సనిన వేల్పుతపసియు నీతం
డనుమానింపక జముపైఁ, జనియెడు నియ్యిరువురకును సమరం బైనన్.

45


క.

వీఁడును వరసిద్ధబలుఁడు, వాఁడును జగ మెఱుఁగ దుర్నివారుఁ డలుక మై
నేఁ డిరువురుఁ దలపడుదురు, వేఁడిమొగంబులన చూతు వేడుకతోడన్.

46

నారదుఁడు రావణునిరాక యముని కెఱింగించుట

మ.

అని యొక్కించుక నిల్చి యొండుగడ గా నత్యంతశీఘ్రంబునం
జని వైవస్వతుఁ గాంచి తా నధికపూజాసత్కృతుండై కృతం
తున కారావణురాక సెప్పి యనిలో దోశ్శక్తిఁ జూపఁగఁ బూ
ని నిజం బై యిట వచ్చె నేనిఁ జెడఁడే నీచేత నం చున్నెడన్.

47


క.

అచ టెల్లఁ బుష్పకంబున, రుచి గప్పఁగ రావణాసురుఁడు దైతేయ
ప్రచయకలకలనిరంతర, నిచితనభోభాగుఁ డై యనికి నేతెంచెన్.

48


క.

చనుదెంచి పురసమీపం, బునఁ దమతమపుణ్యపాపములు గనుఁగొనఁ ద
మ్మనివారణఁ బొందఁగ ను, న్న నిఖిలజంతువులఁ జూచి నయవిరహితుఁ డై.

49


ఉ.

కొందఱు సౌఖ్యముం బొరయఁ గొందఱు దుఃఖముఁ బొంద నేల మీ
రందఱు నొక్కచంద మగుఁ డంచు విపద్దశఁ బొందువారి మే

లొంద నొనర్చె దైత్యపతి యున్మదుఁ డై పితృరాజుకింకరుల్
గ్రందుకొనంగ నే పడర గాసిగఁ జేసెఁ దదాజ్ఞ నెంతయున్.

50

యమరావణసేనలు పోరాడుట

ఉ.

రక్షకు లెల్ల నొక్కటఁ దిరంబుగ మోహర మేర్చి యార్చి సం
ధుక్షితకోపు లై యతులదోర్బలదుస్సహలీలఁ దాఁకినన్
రాక్షసులుం బరాక్రమధురంధరతం దగ మాఱుకొన్న వీ
రక్షయకారి ఘోరసమరంబు ప్రకీర్తిత మయ్యె నయ్యెడన్.

51


ఉ.

సేనలతోడ నద్దనుజసింహుఁడు సంగరకాంక్ష వచ్చినం
బూనికిఁ దీర్చి కింకరులు పోరుటకు న్మది నుల్లసిల్లి పె
ల్లైనబలంబులం దగుసహాయముగా సమవర్తి పుచ్చినన్
దానవసంగముల్ దలరఁ దాఁకె విశృంఖలదోర్విలాసతన్.

52


చ.

జమునిబలంబు పేర్చి నిజసైన్యము నుక్కడఁగించినన్ భుజా
సముదయసంభృతాస్త్రబహుశస్త్రమహోగ్రతఁ జూపెఁ దాఁకి వి
క్రమరసికాంతరంగుఁ డగురావణుఁ డుజ్జ్వలరోషపావకో
ద్యమవినిహన్యమానరిపుదర్పమహానిబిడాంధకారుఁ డై.

53


క.

పంపునకు వోడఁ దగ దని, త్రుంపఁ గడఁగి కాలకింకరులు భీకరు లై
నొంపఁగఁ జంపఁగఁ దఱిమి ని, లింపరిపుం బొదివి రెదఁ జలింపక కడిమిన్.

54


ఉ.

ఆశుగచక్రతోమరగళదాసికుఠారముఖంబులన్ మహో
గ్రాశయు లై నిజాంగముల నన్నిటి నొక్కట నొంప నల్గి కీ
నాశునివారి నెల్లను వినాశము నొందఁగఁజేయ వారిపైఁ
బాశుపతంబు పట్టి తెగ వాపె నిశాటవిభుం డుదగ్రతన్.

55


మ.

తలఁగెం దోయధిసప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడె సం
చలతం బొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడెఁ గొం
దల మందెం ద్రిదశేంద్రుపట్టణము పాతాళంబు ఘూర్ణిల్లె
కుల మయ్యెన్ గ్రహతారకాకులము సంక్షోభించె నవ్వేధయున్.

56


చ.

అపరిమితప్రతాపుఁ డగు నాదశకంధరుచేత ముక్త మై
త్రిపురము లేర్చుభూతపతి తీవ్రశరంబునుబోలె మండి మిం
టిపయిఁ గలంగఁ బేర్చి నిగిడించి యుగాంతమహాగ్నిరీతిఁ బా
శుపత మరాతిసైన్యముల సూరెల ముట్టి దహించె వ్రేల్మిడిన్.

57


చ.

జయమునఁ బొంగి పెల్లుగ నిశాచరవల్లభుఁ డార్వ సేనలుం
శ్రియమున నొక్కపెట్ట నలి రేఁగి నభంబు సెలంగ నార్చినన్
భయమున దండు గుండుగిలఁ బాఱుడు నాసమవర్తి యెంతయున్
రయమున నుద్భటారుణతురంగసమూహరథాధిరూఢుఁ డై.

58

యమరావణులద్వంద్వయుద్ధము

ఉ.

ముందట మృత్యు వుద్భ్రమితముద్గరహస్తతఁ గ్రాల నుజ్జ్వల
స్యందనపార్శ్వభాగమున నర్చిత మై ఘనకాలదండ మొ
ప్పం దనకోప మాననముపైఁ బెనుమంటయుఁ బోలె నాకృతిం
బొంది వెలుంగ నయ్యసురపుంగవుమోహర మున్నచోటికిన్.

59


చ.

చని తనమ్రోల వచ్చు మహిషంబుగళంబున ఘంటనిక్వణం
బును ఘనమౌర్వినాదమును, భూరితరాసురసైన్యతూర్యని
స్వనవిభవంబు మ్రేఁగికొన శాతశరాంబుధినీట ముంచె న
ద్దనుజబలంబు నప్రతిహతప్రదరుం డగుచున్ సముద్ధతిన్.

60


మ.

జమునాటోపము దుస్సహం బగుడు నుత్సాహంబు వాటింప లే
క మదం బేది బలంబు పెల్లగిలినం గ్రవ్యాదనాథుండు దు
ర్దమబాహాబలుఁ డై యెదిర్చె దశకోదండీసముజ్జృంభితో
ద్యమనిర్యాతనిశాతసాయకపటువ్యాపారఘోరంబుగాన్.

61


ఉ.

ఈసున నంతకుండు నసురేశ్వరుఁడున్ వివిధాస్త్రశస్త్రవి
న్యాసము లేర్పడం జన జయాపజయంబులఁ బొందుచున్ రణం
బాసురవృత్తిఁ జేసిన లయావసరం బగుచున్న నాసరో
జాసనుఁ దొట్టి వారితెఱఁ గారయ వచ్చి రమర్త్యు లందఱున్.

62


శా.

దేవవ్రాతము వచ్చినన్ భుజబలోత్సేకంబుఁ జూడన్ దశ
గ్రీవుం డుగ్రము లైనసాయకములం గీనాశు నొప్పించినం
జానం జేయుదు దైత్యునం చతఁడు భాస్వత్కాలదండంబు బా
హావిన్యస్తము సేయుచున్ భ్రుకుటిబంధాభీలసందీప్తుఁ డై.

63


క.

మృత్యుపురస్సరముగ లో, కాత్యయసమయంబొ నాఁగ నంతకుఁ డధికా
ద్ధత్యమునఁ గడఁగి డగ్గఱి, దైత్యుం బొడిసేయఁ గాలదండము పూనెన్.

64

బ్రహ్మ యమరావణులయుద్ధమును మాన్చుట

ఉ.

అత్తఱి గ్రక్కునన్ సరసిజాసనుఁ డడ్డము సొచ్చి నిల్చి కే
లెత్తి మహాత్మ యిట్టు లుచితేతరవృత్తము నీకు నీడె ను
ద్దత్తవరానుభావమున దానవనాథుఁ డవధ్యుఁ డేన నీ
యుత్తమకాలదండముప్రయోగ మమోఘము గా నొనర్చితిన్.

65


క.

కావున దీన నసురపతి, చావును బ్రదుకుటయు నాయసత్యము నిజముం
గావుము లోకము లన్నియుఁ, గావు సుమీ నాకు బొంకు గల్గినయేనిన్.

66


క.

తగ దుడుగు మనినఁ బితృపతి, నగి జగముల కెల్లఁ బ్రభువు నలినాసన నీ
వగుట భవదాజ్ఞ కెమ్మెయి, మిగులుదునే సమరమునకు మేకొని యైనన్.

67

క.

నక్తంచరు సమయించుట, యుక్తము గాదేని నిచట నునికి దగదు నే
శక్తుఁడ నై యుండియు భవ, దుక్తికిఁ గాఁ దొలఁగవలసె నోపనిభంగిన్.

68


ఆ.

అని రథంబు సూతుడును మృత్యుముఖపరి, జనముఁ దాను గూడి జముఁ డదృశ్యుఁ
డైన వేధయును నిజావాసమున కేగె, నారదుండు నరిగె నాకమునకు.

69


క.

కలయఁ గనుంగొని యెవ్వరు, మెలఁగమి సమరాంగణంబు మిన్నక యున్నన్
గెలిచినవాఁ డై దానవ, కులపతి సనె సుతలమునకుఁ గ్రొ వ్వెసలారన్.

70


ఉ.

ఆలములోన మైమయిఁ గృతాంతుని నోర్చితి నింక న న్నొరుం
డేల యెదుర్చు నంచు మద మెక్కి నిశాచరవల్లభుండు పా
తాళజయార్థ మేగి మహితంబుగ భోగవతీపురంబు గ
ర్వాలసలీల ముట్టె భుజగాధిపుఁడుం గనియెన్ వినీతుఁ డై.

71

రావణుఁడు నివాతకవచకాలకేయులతో యుద్ధము సేయుట

క.

గణనాతీతవినూతన, మణినికరము గప్ప మిచ్చి మన్ననఁ గని యా
ఫణిపతి సంతస మందెను, మణిమతి యనుపురికి నరిగె మనుజాశనుఁడున్.

72


సీ.

అందుఁ బూర్వంబున నంబుజాససుచేత వరములు గనిననివాతకవచు
లనియెడుదైత్యుల నానిశాచరపతి పోరికిఁ బిలిచిన వారు వొంగి
కయ్యంబు పెద్దయుఁ గాలంబునకుఁ గంటి మనుచు ననేకసైన్యములతోడ
వెడలిన నిరువాఁగు వివిధాస్త్రశస్త్రప్రహారఘోరంబుగా నసమసమర


తే.

మేఁడుకాలంబు సేసిన నెఱిఁగి యపుడు, వచ్చి వారలవరములవలను సెప్పి
తెలిపి సఖ్యంబు సేసినఁ గలసి యచట, జెలిమి మై నుండె దశముఖుఁ డెలమి మిగుల.

73


క.

అతులితనవభోగంబులఁ, గతిపయదినములు నివాతకవచులచేఁ దో
షితుఁ డగుచు నిలిచి శౌర్యో, న్నతి వెలయఁగ నరిగెఁ బద్మనగరంబునకున్.

74


మ.

చని వే ముట్టినఁ గాలకేయు లమితోత్సాహంబునన్ భూమికం
పనసైన్యోద్ధతులై కడంగి నగరప్రాకారబాహ్యాంగణం
బున వీఁకం దలపడ్డ రావణుబలంబుల్ వీఁగినన్ రేఁగి య
ద్దనుజాధీశ్వరుఁ డస్త్రశస్త్రనిహతిం దత్సైన్యముం గూల్చినన్.

75


ఉ.

చూచి మహోగ్రకోపమున శూర్పణఖాపతి వీఁగుసేనఁ జే
వీచి విశృంఖలప్రబలవిక్రమదుస్సహుఁ డై దవానలం
బేచిన కాననం బడరి యేర్చువిధంబున నన్యసైన్యముం
జూచియుఁ జూడకే బలము సొంపున రూపడఁగించి పేర్చినన్.

76

రావణుఁడు తనమఱఁది యైన విద్యుజ్జిహ్వునిఁ జంపుట

చ.

వడిగొని కాలకేయభటవర్గము ద్రోచినఁ దాను సేనలుం
గడఁగి నిశాచరేశ్వరుఁడు గ్రందుగఁ దాఁకి రణంబుసందడిం

దొడిఁబడ వ్రేసెఁ దీవ్రతరదోరసినిం దను నీడఁ బోక జో
ఱడమున బిట్టు గిట్టినమఱంది నెఱుంగక దుర్మదాంధుఁ డై.

77


శా.

విద్యుజ్జిహ్వుని వ్రేల్మిడిం దునిమి దోర్వీర్యం బవార్యంబుగా
నుద్యద్విక్రమవైరివీరసుభటవ్యూహంబు నెల్లన్ ధను
ర్విద్యాకౌశల ముల్లసిల్ల సమరోర్విం గూల్చె నిర్ఘోషసాం
ద్రద్యావాపృథివీదిశావలయగర్జస్ఫూర్జితాకారుఁ డై.

78


క.

రణవిజయము గైకొని ప, ట్టణ ముద్భటసుభటసంకటంబుగ భాస్వ
న్మణిగణధనములు మొదలుగఁ, దృణము తుదిగఁ జూఱగొనియె దివిజారి వెసన్.

79

రావణుఁడు వరుణపట్టణముపై దాడి వెడలుట

ఆ.

ఇట్లు భుజగదానవేంద్రుల నిర్జించి, యసుర మసరుకవిసి యంతఁ బోక
కంధివిభునిపురము కందువ యారసి, యుద్దవిడిని బురము నొద్ద కేగి.

80


మ.

వరుణుం డెక్కడ నున్నవాఁ డతనిగర్వగ్రంథి మాన్పంగ నే
ర్పరి నై వచ్చితి శస్త్రఘట్టనమునన్ రక్తంబు వోఁ జేసి నా
ఖరతేజంబునఁ గ్రాఁచి పొం గడంచి చుల్కం జేసి నానాధనా
హరణం బే నొనరింతుఁ జెప్పుఁడు మదీయప్రౌఢి యం చుద్ధతిన్.

81


క.

పురబహిరంగణమున మో, హరములు దీర్చికొని యున్నయసురేశ్వరుపై
నురవడిమైఁ దోతెంచిరి, వరుణతనూభవులు రథికవర్గముతోడన్.

82


క.

సేనలు సేనలఁ దలపడ, దానవుపుష్పకము గగనతలమునఁ గని యు
త్తానలసితరుథు లై యం, భోనిధిపతితనయు లతనిఁ బొదివిరి కడఁకన్.

83


క.

చీకాకు పఱిచి బలుగదఁ, జేకొని యతఁ డేయ వ్రేయఁ జేరువఁ జేరం
గైకొనక తఱిమి యీడం, బోక పెనఁగి రంబుధీశపుత్రులు గడిమిన్.

84


ఉ.

అంత మహోదరాదు లగునంబరచారవిదగ్ధు లైనదే
వాంతకవీరు లొక్కమొగి నారథిసంఘముతోడఁ దాఁకి దు
ర్దాంతభుజాబలంబు ప్రథితంబుగఁ గేతనముల్ హయంబులున్
దంతిసమూహముల్ దునుక తండము లై ధర డొల్ల నేసినన్.

85


ఆ.

విరథు లైనయబ్ధివిభుతనూభవులపై, నడరి రౌద్రమున సురారి కేలు
దోయిపదిటఁ బదియు వేయి శస్త్రాస్త్రవి, తతిని బొదివి జర్జరితులఁ జేసె.

86


చ.

వెఱచఱవన్ దశాననుఁడు వీరభటావళియుం గడంగి డ
గ్గఱి జలధీశనందనులు గ్రందుకొనన్ రథహీను లైనయ
త్తఱి నుఱుమాడఁ జొచ్చినఁ బదాతులఁ గూడి కడంగి పెల్లుగం
బఱచిరి పట్టణంబుదెసఁ బౌరజనంబులు బెగ్గలింపఁగన్.

87


మ.

వెఱ ని ట్లంబుధినాథనందనులు దోర్వీర్యంబు సాలించి యం
దఱుఁ బాఱంగ నిశాచరేంద్రుఁడు జయోత్సాహంబునన్ వెన్నడిం

దఱుమంగా బ్రజం జేయి వీచుచు సముద్యద్వేగుఁ డై తోలి తొ
ప్పఱఁ బెట్టెన్ శరజాలముం బిఱుఁదఁ గుప్పంగూర నాఁటించుచున్.

88


ఆ.

వరుణుబలముఁ దనయవర్గంబుఁ గోట సొ, రంగఁ బాఱ నెగచి రావణుండు
జలదనిస్వనంబుచందంబు నెలుఁ గెత్తి, యెల్లదిశలు సెలఁగ నిట్టు లనియె.

89


క.

పడుచులచేతను నీక్రియఁ, బొడిపించిన దశముఖుండు వో నిచ్చునె తాఁ
గుడిచెం గట్టెం గలనికి, నడచుం గా కింక నొదిఁగినం దను నగరే.

90


క.

అనుపలుకులకుఁ బ్రభాసుం, డనువరుణామాత్యుఁ డచట నందఱుఁ జన గ్ర
క్కున మరలి యితని నుడిగిం, చినఁ కార్యం బగున యట్లు చేసెద ననుచున్.

91


చ.

వరుణుఁడు పద్మగర్భుఁ గొలువం జనియెం బెఱవారు వచ్చి సం
గరమున నీకు నోడిరి జగద్విదితంబు భవద్భుజాబల
స్ఫురణము గావునన్ దివిజసూదన నీ కెదు రెవ్వ రిందులో
నరయఁగ నిందె కా దెచటనైన నొకండును గల్గనేర్చునే.

92


క.

అనిన విని పొంగి తనుఁ బే, ర్కొని బొబ్బిడి రావణాసురుఁడు ప్రజ మరలుం
డని చేయి వీచె జృంభిత, దనుజసమూహప్రశంసితగుణుం డగుచున్.

93


ఉ.

రాజితసౌధపంక్తిరుచిరద్యుతిజాలము పర్వి నిత్యవి
భ్రాజితచంద్రికావిభవభంగిన యొప్పెడునప్పురంబుఁ గే
లీజితవైరి రావణుఁడు లీలమెయిం జని కీర్తికాంతిసం
యోజితరేఖ గ్రొత్త యగుచుండఁగఁ జేసి మదం బెలర్పఁగన్.

94


క.

మరల విడిసి గెలుపునఁ బొం, పిరివోవుచు లంకఁ దలఁచి పెను పొనరఁ జమూ
వరులఁ బిలిపించి పోదము, పురమున కని చెప్పె దనుజఃపుంగవుఁ డెలమిన్.

95


చ.

పయనము చాటఁ బంచి సులభంబుగఁ బూరియు నీరు వంటక
ట్టియలును గల్లుచోట్లను గడిందిమగల్ దగునుక్కళంబుగా
భయ మనుపేరు లేక నిరపాయముగా విడియించుచున్ మనః
ప్రియ మగుభంగి సేన నడపించె విశృంఖలవైభవంబునన్.

96


చ.

బలములతోడ మేదిని నభంబున చేరువ నంతకంటె న
గ్గలముగ నొక్కి సైనికులకన్నుల కందనిచోట డాపలన్
వలపల దవ్వుగాఁ దొలఁగి వావిరి నెచ్చట నేని వచ్చుఁ దా
నలసినయట్టు లల్పపరివారయుతంబుగఁ బుష్పకంబునన్.

97

రావణుఁడు లోకములోని స్త్రీలనెల్లఁ జెఱలుపట్టుట

ఉ.

ఆసమయంబున న్మగనియాండ్రురు కన్యలు నాక చొచ్చి ధా
త్రీసురరాజవైశ్యులను దేఁకువ నేయక యెల్లజాతులుం
గాసిగ నొక్కపెట్టుగఁ బ్రకాశరహస్యవిభేదహీనుఁ డై
యాసురవైరి పట్టెఁ జెఱ లడ్డము లేక మృగాయతాక్షులన్.

98

క.

మునిసిద్ధయక్షకిన్నర, దనుజోరగకన్యకావితానము నెల్లం
గొనివచ్చి వచ్చి పుష్పక, మునఁ బెట్టుచు వచ్చెఁ బంక్తిముఖుఁ డనయుండై.

99


సీ.

తట్టికి వచ్చి యిట్టట్టు వో నేరని లేళ్లవిధంబున లీల యెడలి
వలఁ జిక్కి యెక్కడ మెలఁగంగ నేరని చిలుకలచాడ్పునఁ జెన్ను దఱిఁగి
మావునఁ జొరఁబడి యావలఁ జన లేని మీలచందంబునఁ జాలఁ గుంది
యురులలోఁ బడి యెందు నరుగంగఁజాలని నెమిళులతెఱఁగునఁ గొమరు దక్కి


తే.

కలయఁజూచుచుఁ బలుకంగ వెలుఁగు రాక, నలఁగుమేనులతో నెఱిఁదలలు వీడి
వెగడుపడి వెల్లనై కడు విన్నఁబోయి, పుష్పకంబున నున్న యప్పొలఁతు లెల్ల.

100


క.

కొలఁదికి మీఱిన నెవ్వగ, నలఁదురి నానావిధంబు లైనతమతలం
పులగతి నోర్తోర్తునకుం, దెలియ విలాపములు సేయుతెఱఁ గె ట్లనినన్.

101


క.

చంపు నొకో యక్కట కారింపఁ దలంచు నొకొ లఘుచరిత్రంబులకుం
బంపఁ గడంగు నొకో శం, కింపం డీకఱకుటసుర గీ డొనరింపన్.

102

రావణునిచెఱం బడిన స్త్రీలు విలపించుట

మ.

మగఁడా నీవు జగంబుచొప్పు మిగులన్ మానంబు వాటింతు వా
లిగ నెగ్గం బగుమాట వాటిలెనె తల్లీ నీకు లోకంబుపా
టిగ ని ట్లొందెనె నిందతోడివగ తండ్రీ యెందుఁ గీర్తింపఁగాఁ
దగునీసంతతి కీడునం దొడరెనే దైవంబుచెయ్దిం గటా.

103


తే.

 చమురు నెత్తురు నవుబంధుసమితిగరము, ప్రీతి నఱకాళులకు నఱచేతు లొగ్గ
సునికి యెక్కడ నీక్రూరదనుజుబారి, కగ్గ మై వచ్చు టెక్కడ నకట విధియ.

104


ఉ.

ఇమ్ములఁ దోడ నాడుచెలు లే మనుచుండుదు రొక్కొ యిప్డు నా
తమ్మునిముద్దుమాటలు గొదల్పడఁ బల్కెడుచిల్కబోద ని
త్యమ్మును బొత్తునం గుడుచు నర్మిలి చేడ్పడు మవ్వ మెక్కి యొ
క్కుమ్మడి నంకురించులత లొప్పు దొఱంగవె నీరు గానమిన్.

105


ఉ.

చిత్తము గుందుచుండఁ జెఱసేయుటకంటె విశుద్ధ మైననా
వృత్తము గోలువుచ్చుటకు వేగ తలంపక నన్ను లగ్గుగాఁ
గత్తులఁ గోసి దానవులు గండలు దిం డ్రని కట్టిఁ డైనవీఁ
డిత్తఱి నెట్టు లైన సమయింపఁ డొకో దొసఁ గెల్ల మానఁగన్.

106


క.

అని పెక్కుతెఱంగుల న, వ్వనితలు దురపిల్లి యిట్లు వనరుచుఁ జదలం
జని చని నలుదిక్కులుఁ గనుఁ, గొని పల్కిరి తల్లడంబు గూరిన మఱియున్.

107


ఆ.

ఇంక నేటిలోక మీదుష్టదైత్యుని, కిట్ల చెల్లె నేని యెల్లి నేఁటి
లోనఁ బాడు గాదె యానలినాసను, రాజసంబు నిష్ప్రయోజనముగ.

108

చెఱఁ బడ్డయింతులు రావణుని శపించుట

క.

తగు విక్రమంబు సేయుట, యగునే పరసతుల నిట్టు లదయతమై నె
వ్వగలఁ బొగిలింప నతనికి, మగఁటిమి గా నేర్చునే యమంగళచేష్టల్.

109


చ.

పరమపతివ్రతావిభవభాసురలీల వెలుంగుమమ్ము ని
ష్కరుణత నిమ్మెయిం బఱిచెఁ గావున నీదనుజాధముండు స
త్పురుషపరిగ్రహం బయినపుణ్యసతిం గలుషింపఁ జేసి త
ద్వరునిపరాక్రమంబున నవశ్యము మృత్యువుఁ బొందుఁ గావుతన్.

110


క.

అనవుడు దశాస్యుఁ డాశా, పనిహతిఁ బ్రభ సెడియు బాహుబలమదమునఁ గై
కొనక నలి నపహసించుచు, ననుమానము లేక యెలమి నరుగుచునుండెన్.

111


సీ.

ఉడుగక కాల్చుచు నుండెడుశోకంబ యతితీవ్రహవ్యవాహనుఁడు గాఁగ
నిట్టూర్పుగాడ్పులు నిగిడించుటయ విలసిల్లఁ బ్రజ్జ్వలితంబుసేఁత గాఁగఁ
బాయక యొనరించు బహువిలాపంబుల రాజితమంత్రాక్షరములు గాఁగఁ
గన్నీరు బోరనఁ గ్రమ్మించుటల పొరిఁ బొరి నాజ్యధారలపోత గాఁగఁ


తే.

గొలఁది కగ్గల మై యెదఁ గలుగువగల, యెనరుసమిధలు గా నిట్టు లువిదపిండు
రావణాభిచారంబుగ భావమందు, నుగ్రముగ వేల్చుతెఱఁగున నుండెఁ జూడ.

112

రావణుఁడు దిగ్విజయము చేసి వచ్చి లంకం బ్రవేశించుట

క.

ఇత్తెఱఁగున దశకంధరుఁ, డత్తరుణులఁ గొంచు లంక కరిగెం బౌరుల్
చిత్తము లలరం గానిక, లుత్తమవస్తువులు దెచ్చి యొప్పింపంగన్.

113


చ.

ప్రియ మెదఁ బల్లవింపఁగ విభీషణుఁ డాప్తులుఁ దాను నెంతయున్
రయమున భూషితద్విపతురంగముఁ డై యెదురేగి యన్నపా
దయుగము డాయ భక్తిమెయి దండనమస్కృతి సేసినన్ హరా
ద్రి యెగయ నెత్తి కీర్తిఁ బ్రచురించినబాహుల నెత్తెఁ దమ్మునిన్.

114


ఉ.

ఎత్తియుఁ గౌఁగిలించి దనుజేంద్రుఁడు లోచనపద్మషండముం
జిత్తసరోరుహంబు విలసిల్లఁ గనుంగొని కుంభకర్ణుఁ డిం
దిత్తఱి మేలుకానఁడె యహీనపరాక్రమశాలిఁ దామసా
యత్తునిఁ జేసె మాలవిధియం చొకయించుక చిన్నవోవుచున్.

115


క.

ఇభతురగస్యందనగతి, రభసంబునఁ బృథివి యద్రువ రక్షోవంశ
ప్రభువు నగరంబు సొచ్చెను, విభవోజ్జ్వలుఁ డగుచు వినయవినుతులు సెలఁగన్.

116


ఆ.

ఒక్కచందురుండ యుదయింపఁ బొంగెడు
నంబురాశి యిది పురార్ణవంబు
దనుజపతీముఖేందుదశకసన్నిధి నుబ్బ
కున్నె యనఁగ వీట సులివు మిగిలె.

117

శూర్పణఖ తనమగనిఁ జంపె నని దుఃఖించి రావణుని దూఱనాడుట

క.

అయ్యవసరమునఁ దనపతి, కయ్యంబునఁ బంక్తివదను ఖడ్గనిహతి రెం
డయ్యె నని శూర్పణఖ విని, పయ్యెదకొం గెడల బుడమిఁ బడి మూర్ఛిల్లెన్.

118


చ.

సభయము లైనడెందముల సంభ్రమ ముమ్మలికంబుఁ గప్ప సం
క్షుభితసఖీజనం బొలయఁ గొండొకసేపునఁ దేఱి తీవ్రశో
కభరితచిత్త యై మొగము గప్పెడుబాష్పజలంబు లంబుజ
ప్రభ సెడ ముంచు పెన్వఱదభంగిగ నెవ్వరి నేనిఁ జూచుచున్.

119


ఆ.

అరుగుదెంచి యన్నయడుగులకడ నార్త
నాద మడరఁ ద్రెళ్లి నాథుఁ బనవి
యేడ్చుచున్న నల్ల నెత్తి యమ్ముద్దియఁ
దడవి కన్నునీరు దుడిచి యతఁడు.

120


క.

సముచిత మగు తెఱఁగున శో, కము వాపుట కనునయింపఁ గడఁగి తదాలా
పములకుఁ జొచ్చుటయును గో, పమునను రక్కసియుఁ గరము ప్రల్లదురాలై.

121


ఉ.

అక్కటికంబు మాలి చెలియల్ వగఁ బొందదె నాకు దీన దూ
ఱెక్కు జగంబునం దనక యింతయుఁ గొంకక పాపకృత్తికిన్
స్రుక్కక వైర మెత్తి కడుఁగ్రూరుఁడ వై యిటుసేఁత చూడఁగా
దిక్కులు గెల్వఁ గాదు నను ద్రెక్కొనఁబోయితి గాని యిమ్మెయిన్.

122


క.

అగ్గలిక మెఱసి కడఁగుచు, మొగ్గరములు గడచి పోయి మును మును మఱదిన్
మ్రొగ్గతిలఁ జేసి దీనికి, సిగ్గుపడనినిన్ను నేమి నెప్పుదుఁ జెపుమా.

123

రావణుఁడు శూర్పణఖ నూరడించి దండకారణ్యమునకుఁ బంపుట

చ.

అనవుడుఁ గ్రందుఁగయ్యమున నప్పటికిన్ మనవారు లాఁతివా
రని మది నేర్పరింప వస మమ్మ దురుక్తము లేల యింక నా
తని మగిడింప వచ్చునె వృథాపరితాపము దక్కు నీదునె
మ్మనమున కెట్టు లట్టుల సమస్తధనంబులు వేడ్క నిచ్చెదన్.

124


క.

అని యొకభంగిం దననే, ర్చినయట్టులు సెప్పి తీర్చి చెలియలి నూరా
ర్చినవాఁ డై యవ్వనితకు, మనుజాశనుఁ డిట్టు లనియె మఱియుం బ్రీతిన్.

125


సీ.

దండకారణ్యంబు, దద్దయు హృద్యంబు శుక్రశాపమున నచ్చోటు దైత్య
వాస మయ్యెడుఁ గాన నీసమయంబున నెలవు గైకొని ఖరు నిల్పువాఁడ
నతఁడు పిన్నమకొడుకయ్యును మనము దా మనుభేద మెఱుఁగనియట్టివాఁడు
నీదెస మిగులంగ నెమ్మి వాటించు నయ్యెడ నీవు వసియింపు మిపుడ పోయి


ఆ.

యిష్ట మగుపదార్థ మెయ్యది యేనియు, ననుదినంబు వేడ్క నడిగి తెచ్చి
యనుసరించి నడపు మని నియమించెద, నేను గలుగ నీకు నేమి కొఱఁత.

126

చ.

అని యిటు లూఱడించి ఖరు నప్పుడ పిల్వఁగఁ బంచి యాదరం
బునఁ దగు రాజచిహ్నములు భూరిబలంబును నిచ్చి మంత్రు లై
చనుఁ డని దూషణుం ద్రిశిరు సత్కృతిపూర్వము గాఁగఁ బుచ్చి యం
దునిచె నతండు శూర్పణఖయుం బ్రియ మందిరి రాజ్యసంపదన్.

127

రావణుఁడు కుంభిల యనువనమున యజ్ఞము సేయుచున్న యింద్రజిత్తు జూడఁబోవుట

క.

చె న్నొందఁగఁ దనయింటికిఁ, గన్నా కయి మెఱసియుండు గాదిలితనయున్
జన్నములు సేయ నడవిన, యున్నాఁ డని విని దశాస్యుఁ డుద్యోగమునన్.

128


క.

అరదమున నేగె సముచిత, పరివారముతోడఁ జెఱల పడఁతులు డెందం
బురియఁగఁ బుష్పకమున ని, ర్భరవేదన నుండ నసురపతి నిష్ఠురుఁ డై.

129


తే.

తెరువు సూపుచుఁ జటులకేసరిని నెక్కి, కెలన వచ్చు విభీషణుపలుకు లర్థి
నాదరించుచు నతనిచే నచటివింత, లెల్ల నెడనెడ నెఱుఁగుచు నింపు మిగుల.

130


క.

కుంభిళ యనునుగ్రాటవి, శాంభవ మగునొక్కపూజ్యసత్రముఁ దగఁ బ్రా
రంభించి శివునిచేతను, సంభావితుఁ డైనతనయుసదనము సేరెన్.

131


చ.

చనుటయు నాతఁ డుల్లమున సంతస మాననకాంతి వింత సే
య నెదురు వచ్చి తండ్రి చరణాబ్దయుగంబు శిఖాభిరామ మై
ననిజశిరంబు గూడఁగఁ బ్రణామము సేసిన నెత్తి యర్మిలిం
దనపదిదోయిచేతుల నతం డిఱికౌఁగిటఁ జేర్చె నందనున్.

132


క.

ఆదరమున మహితచతు, ర్వేదమహాఖ్యాతమంత్రవిధులను శుక్రుం
డాదైత్యపతికి నాశీ, ర్వాదం బొనరించె విప్రవరసహితుం డై.

133


చ.

నగుచు దశాననుండు భృగునందనుతో నిది యేమి యీతనిం
బొగఁ బడఁ బంచి యివ్విపినభూమి నిరోధము సేసి దీన మీ
రు గనినలాభ మేమి యమరుల్ దగుభోజ్యము లెల్ల మ్రింగి మో
పుగొనుచు మిమ్ము నాలిగొని పోయిరి వేయును నేల నావుడున్.

134


ఆ.

అట్టు లనకు మన్న యసదృశవ్రతుఁ డగు, నీదువరసుతుండు నిరుపమాన
మహిమ వెలయ మున్ను బహువిధయజ్ఞంబు, లాచరించి పిదప నభవు గుఱిచి.

135


క.

మాహేశ్వర మగుయాగము, దోహలమునఁ జేయఁ గ్రతువుతుది నాశివుఁ డ
ర్ధాహితనారీక మ్మగు, దేహం బుద్దామవృషగతిం జెలు వొందన్.

136


మ.

దయ నిచ్చోటికి వచ్చి కామగతి హృద్యస్యందనంబుం దమో
మయమాయాచరితంబు శాత్రవబలోన్మాథక్రియాదక్షదు
ర్జయశాపంబును దివ్యబాణనిచయస్ఫారానుభావంబు న
క్షయతూణీరయుగంబు నిచ్చెఁ బటుదోర్గర్వం బఖర్వంబుగాన్.

137


తే.

నీవు సనుదెంచి తను మహనీయమహిమఁ, బురికిఁ దోకొని యరుగంగఁ బోవు వేడ్క
నెదురుసూచుచు నున్నంత నేగుదెంచి, తనిన భార్గవుపలుకులు విని సురారి.

138

రావణుఁ డింద్రజిత్తుఁ గుంభిళనుండి లంకకుఁ దోడ్కొని వచ్చుట

క.

అగుఁ గాక యింకఁ జేయున, ది గలదె పోనిమ్ము సురలుఁ దేఁకువ సెడఁగం
దగమికిఁ జెప్పితి మనకుం, బగ యింద్రుండ కాఁడె యెల్లభంగులఁ దలఁపన్.

139


చ.

అని గురుఁ బ్రీతి వీడ్కొని మహాబలముల్ దనపజ్జ వచ్చినం
గని కరులం దురంగములఁ గాలుబలంబుల నేర్చి యొక్కయొ
డ్డనముగఁ దీర్చి సుందరపటధ్వజదండము లెత్తఁ బంచి తూ
ర్యనినదపూరితక్షితినభోంతరుఁ డై దనుజేంద్రుఁ డున్నతిన్.

140


క.

మును రమ్యపదార్థంబులు, గొని వీథు లలంకరించుకొని జనులు గనుం
గొనియెడు వేడుక గుబురులు, గొని యున్నపురంబుఁ జొచ్చెఁ గొడుకుం దానున్.

141

ఆశ్వాసాంతము

చ.

పరిజనపద్మమిత్రునకుఁ బాఠకమిత్రున కన్యసైన్యవి
స్ఫురణలతాలవిత్రునకు సుందరగాత్రున కిందిరామనో
హరసుభగాతపత్రునకు నంబుజనేత్రునకుం బ్రమోదని
ర్భరధరణీకళత్రునకు రాజితగోత్రున కిజ్జగంబునన్.

142


క.

లావణ్యవిసరనవబా, లావృతచతురాంగనానయశచివరునకున్
సేవాగతబహువిధవసు, ధావల్లభసంకటీకృతద్వారునకున్.

143


మాలిని.

శతమఖగురులజ్జాసంపదాపాదనోద్య
న్మతికి నమితశత్రుక్ష్మాపసేనాతమోగో
పతికి నిహతశేషప్రత్యయైకార్థకార్య
స్తుతికి విజయమానద్రోహిబాహాసి కుర్విన్.

144


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందుఁ బంచమాశ్వాసము.

————