నిర్వచనోత్తరరామాయణము
నవమాశ్వాసము
|
వాణీకీర్తిప్రత
తీవేష్టితమూర్తి వసుమతీదైవతమో
దావహుఁడు కల్పకస్ప
ర్థావిజితుఁడు మనుమసిద్ధిధరణీశుఁ డొగిన్.
| 1
|
క. |
జననాథుఁ డుడుగరలు భూ, తనయమనం బలరఁ గట్టి తగ నొప్పించెన్
మునివరులపత్నులకు ని, మ్మని మణిమయభూషణాంబరాదులు ప్రీతిన్.
| 2
|
తే. |
ఇవ్విధంబునఁ దనతలం పించుకంత, యైన జానకి యెఱుఁగనియట్లు గాఁగ
బాలతోడ విషం బిడుపగిది ననిచి, పుచ్చి రాఘవుఁ డుల్లంబు నొచ్చి మరలె.
| 3
|
లక్ష్మణుఁడు గంగాతీరవనములను సీతను దోడ్కొని పోవుట
చ. |
లలితగతిన్ సతోయకమలస్ఫుటమార్గమునన్ శరీరర
క్షలు వినయంబుతో నడపి గౌరవ మొప్పఁగ భక్తిపెంపుమై
నలయక పంపు సేయుచు మహాశ్రమభూములు వీడుపట్టుగా
లలనఁ దగన్ సుమంత్రుఁడును లక్ష్మణుఁడుం గొని పోయి రిమ్ములన్.
| 4
|
క. |
చని చని జనకతనూభవ, తనతనువున దుర్నిమిత్తతతి గలయఁగఁ దోఁ
చిన ని ట్లనియె సుమిత్రా, తనయునితో నెమ్మనంబు దలఁకుచు నుండన్.
| 5
|
ఉ. |
తప్పక మున్ను గన్గొనువిధంబ యమంగళసూచకంబు లే
నిప్పుడు నాశరీరమున నెన్నియొ కాంచితి నంతరంగముం
ద్రిప్పికొనం దొడంగెఁ బతిదిక్కున బంధులవెంట భృత్యులం
దొప్పమి యేమి వాటిలుటకో వెఱ పయ్యెడు నాకు లక్ష్మణా.
| 6
|
క. |
అనవుడు నమ్మాటలు గీ, టునఁ బుచ్చుచు నతఁడు లలితడోలాయతవీ
చినిచయసుభగాకృతి యగు, ననిమిషనదిఁ చేర నరిగె నత్యంతధృతిన్.
| 7
|
ఉ. |
అయ్యెడ రేవుబోయలఁ బ్రియంబు మెయిం బిలిపించి దేవికిం
జయ్యన నోడ పెట్టు మని శాంతతఁ బిల్చి సుమంత్రుఁ జూచి నీ
వియ్యెఁడ నున్సు తే రనుచు నింతిని డించినఁ బోతపాత్ర పై
కొయ్యన పోవఁ దాను కని యుత్తరణక్రియ నిర్వహించినన్.
| 8
|
ఉ. |
సంతస మందుచున్న రఘుసత్తముదేవికి లోకవాదవృ
త్తాంతము నన్న దన్ బిలిచి యన్నతెఱంగును దత్తపోవనో
ప్రాంతము గావునం దెలియఁబల్కఁ దలంచుచు నల్లఁ జేరి య
త్యంతవిషాది యై రఘువరానుజుఁ డాత్మ చలించుచుండఁగన్.
| 9
|
శా. |
నా కింక మరణంబ కార్య మిటు లన్యాయప్రవృత్తాత్ముఁ డై
కాకుత్స్థాన్వయదీపకుండు నను లోకత్యాజ్యుఁ గావించె నం
చాకాంతాతిలకంబుపాదముల పర్యంతంబుగాఁ బుణ్యగ
ణ్యాకారుం డిలఁ జాఁగి మ్రొక్కిన మనం బాకంపముం బొందఁగాన్.
| 10
|
ఉ. |
కారణ మేమి నన్ను దశకంఠకులాంతకుఁ డెగ్గు వల్కెనో
నేరమి గల్గెనో యకట నిక్కము నా కెఱిఁగింపు మిట్టిదు
ర్వారమనోవ్యథం బొరయువాఁడవు గావు వివేకవిశ్రుతా
చారుఁడ వైననీ వని విశాలవిలోచన గారవించినన్.
| 11
|
ఉ. |
ఇత్తెఱఁ గాచరించుటకు నే నిది యేటికి నియ్యకొంటి నీ
యుత్తమురాలి నోఁ బలుక నోపఁగ వచ్చునె యంచు వెండియుం
జిత్తము గూడఁ దెచ్చుకొని చెప్పక పో దని నిర్ణయించి డ
గ్గుత్తిక వెట్టి లక్ష్మణుఁడు కోమలిఁ జూచుచు నశ్రు లొల్కఁగాన్.
| 12
|
రాముఁడు లోకాపవాదభీతుఁ డై విడనాడినవృత్తాంతము సీతకు లక్ష్మణుఁ డెఱిఁగించుట
శా. |
ఏ నిం కేమని చెప్పుదు రఘుకులాధీశున్ జగం బెల్ల నీ
కై నింది౦పఁగఁ జాల నొచ్చి యది మిథ్యావాద మైనన్ సమా
ధానం బేర్పడఁ జేయ కున్న నిజవృత్తం బెంతయున్ దూషితం
బై నీచత్వము రాక తక్కదని యూహాపోహసంవేది యై.
| 13
|
క. |
పురజనుల భూజనంబుల, పరివారం బొండుభంగి బాయమి జీవ
స్మరణం బగుచున్న భవ, ద్విరహంబున కియ్యకొనియె విభుఁ డధికధృతిన్.
| 14
|
ఉ. |
ఏకత ముండినన్ బిలిచి యేర్పడ నింతయుఁ జెప్పి తేరిపై
వే కొనిపోయి నీవు పృథివీసుత కోరినయట్ల కాఁగ వా
ల్మీకులయాశ్రమంబున సమీపమునన్ మనకృత్యనిశ్చయం
బాకమలాక్ష్మికిం దెలుపు మన్న నృపాలకునాజ్ఞ సేసితిన్.
| 15
|
క. |
ఆశ్రమ మల్లదె మునిచర, ణాశ్రయవు నిరస్తశోక వై యుండు జగ
ద్విశ్రుతి యగు నీపతియును, నాశ్రమవిరహితుఁడ యింక నని పల్కుటయున్.
| 16
|
సీత తన్ను భర్త విడనాడినందులకై చింతించి లక్ష్మణునితో వయనిష్ఠురంబు లాడుట
క. |
తాలిమి కొలఁదులఁ బోవని, వాలాయపుదిగులు గుండె వ్రయ్యఁ గదిరినం
గీ లెడపినజంత్రముక్రియ, నేలపయిం బడియె మేదినీతనయ వెసన్.
| 17
|
క. |
పడి మూర్ఛిల్లి మగుడ నొక, వడికిం దెలివొంది బాష్పవారి గనుఁగవం
గడలుకొనుచుండ వాతెఱఁ, దడుపుచు వెలవెల్ల నగుచుఁ దల్లడపడుచున్.
| 18
|
క. |
పలు కుడిగి పెద్దప్రొ ద్దా, కులదృష్టి మఱందిఁ జూచుఁ గొండొకనవ్వుం
దలయూఁచు ముక్కుపైనం, గుళమిడు వెఱఁగందు వగలకుం గొలువిచ్చున్.
| 19
|
ఆ. |
సందియంబు పడ విచారంబునకుఁ జొర, మాఱు పలుక నొండుమాడ్కి సేయ
వెరవు గాక పిడుగువేసినయ ట్లైన, మాట కియ్యకొనుచు బోటి పలుకు.
| 20
|
క. |
అగుఁ గాక యట్లు చేసెద, జగతీపతిపనుపు సేసి చను నీవును నీ
తెగువ రఘుపతికి నీకుం, దగ వఁట యే ననెడి దేమి తమ్ముఁడ చెపుమా.
| 21
|
సీ. |
అఖిలధర్మస్థితి నపచారి యందునే యావనంబునఁ దప మాచరించెఁ
గరుణాసముద్రుఁడుఁ గాఁడందునే యట్టి యపరాధిఁ గృతకవాయసముఁ గాచె
నాశ్రితరక్షమై నర్థి లేఁ డందునే పగతుతమ్ముని రాజ్యపదవి నిల్పెఁ
బాటించి నన్ను సంభావింపఁ డందునే నాకుఁ గా నెన్ని యత్నములొ చేసెఁ
|
|
తే. |
బతి జనించినకోలెను బరహితైక, లోలమతి యొడల్ సిదిమినఁ బాలు వచ్చు
నాతఁ డిది కార్య మని నిశ్చయంబుచేత, నాయభాగ్యంబ యొండొకవేయు నేల.
| 22
|
క. |
ఇడుమలు గుడువఁగ బుట్టిన, యెడ లిది యిటు లోపుఁ గాక యొడ్డులు నాచేఁ
బడిరి తొలుభవమునం ది, ప్పుడు తత్ఫల మందకున్నఁ బోవునె నాకున్.
| 23
|
ఉ. |
ఉల్లము పొక్కు నెవ్వగల కోటఱి యే మరణంబు గోరినం
జెల్లదె జాహ్నవీసలిలసేచన మూర్ధ్వగతిప్రదంబు సం
ఫుల్లయశోభిరామ మగు భూపతివంశము నిల్చునంతలో
నొల్ల దురంతదుఃఖముల కోర్చుట మేలు దలంచి చూడఁగన్.
| 24
|
చ. |
అతులితపుణ్యమూర్తు లగునత్తల కెల్లను నేను భక్తి మ్రొ
క్కితి నెఱిఁగింపు సూర్యకులకేతువు నా విలసిల్లురాముసం
తతి భరియించి యున్న యది దానికి శోభన మందఁ గచ్ఛప
స్థితి నయినం దలంపు దయసేయుఁడు మీ కని యప్పగింపుమీ.
| 25
|
క. |
జనపతికి నింక నే నే, మని చెప్పిన నేమి యగును నది గడచన నై
నను నూసువోక వెండియు, ననియెద నొకమాట రఘువరానుజ నీతోన్.
| 26
|
చ. |
తనమది నొక్కయుమలిక దక్కిన మంచిది దానిఁ బాపఁగా
నని తలపోసి చేయుపని కక్కట యేనును లోను గానె నా
కు నెఱుఁగఁ జెప్పి పొ మ్మనుటకు దగనే మొగమాట లేక మ
న్ననయెడ నైన రాజుల మనంబులు ద్రిప్పఁగ బల్మి గల్గునే.
| 27
|
క. |
కానిమ్ము నాకుఁ జెప్పినఁ, గానియ కా దధిపుపనుపు గడతేర్పఁగ నేఁ
బూనినపని యిది నీవును, బూని యొనర్చు టది యెల్లఁ బొచ్చెమె చెపుమా.
| 28
|
తే. |
పతియ చుట్టంబుఁ బక్కంబుఁ బతియ చెలియుఁ
బతియ తల్లియుఁ దండ్రియుఁ బతియ గురుఁడు
పతియ దైవంబుఁ గావున నతనిపం పొ
నర్చుటయ కాదె ధర్మంబు నాతి కరయ.
| 29
|
ఉ. |
మేనికి నంతవంతఁ బడ మిక్కిలి కాఱియఁ బెట్టి నొంపఁగాఁ
బూనితి నోర్వ కున్న నది వోవునె యట్లు జగంబువారలున్
మానము లేక యీ తులువమాటలు నాదెస నాడ దుస్సహం
బైనది దీని మానుపునుపాయము చొప్పడ దేమి నేయుదున్.
| 30
|
మ. |
అనుచుండ మఱుమాట వల్కక సముద్యద్భాష్పుఁ డై లక్ష్మణుం
డినవంశాగ్రణిదేవిపాదయుగళం బీక్షించి ధాత్రీతలం
బును ఫాలంబునఁ బొంద మ్రొక్కి వినయంబుం దీవ్రశోకంబు నె
మ్మనముం జుట్టుకొనం బ్రదక్షిణముగా మందప్రచారంబునన్.
| 31
|
క. |
పడి నంటఁ దాఁకు బలితపు, టడలున రూపఱినమనమునం దోరిమి పాఁ
తెడలి వెసఁ బురికిఁ బోఁ దెగు, వడరిన వావిడిచి దిక్కు లద్రువ నఱచుచున్.
| 32
|
లక్ష్మణుఁడు సీతను గంగ దాఁటించి పురమునకు మరలుట
చ. |
అరిగి మరుత్తరంగిణియుపాంతము డాయుచు రోదనంబుతో
బెరయఁ గిరాతు దీనమతిఁ బిల్చి తదాహితయానపాత్ర మా
తురగతి నెక్కి యద్దరికి ధూతకళంకుఁడు వోయె మేదినిం
బొరలుచు నోడది క్కరయు భూతనయం బలుమాఱుఁ జూచుచున్.
| 33
|
క. |
చని యరద మెక్కి యల్ల, ల్లన పోవుచు నిలిచి నిలిచి లక్ష్మణుఁ డయ్యం
గనఁ బొరిఁ బొరి మరలి కనుం, గొనుచుండఁగఁ గోమలియును గొందలపడుచున్.
| 34
|
సీ. |
ము న్నాతెఱంగుననున్నట్టియే నిప్పు డిమ్మెయి వనమున కెట్లు వోదు
నిది యేమి యొంటిమై నేతెంచి తనిన నెప్పాట నే మఱుమాట పలుక నేర్తు
నెవ్వరితోడ నే నేమని యీ దురవస్థ మాటికిఁ జెప్పి వనరుదానఁ
బతి యిల్లు వాపిన కతము న న్నడిగిన నేను ద ప్పేదిగా నేర్పరింతు
|
|
ఆ. |
మునిసతీజనంబు ముందటఁ గొంకక, యెవ్విధమున మెలఁగి యిచట నిలిచి
కాల మెట్టిభంగిఁ గడపుడు నే నని, యడలి యేడ్చుచున్న యవసరమున.
| 35
|
వాల్మీకి సీతవృత్తాంతము మునిపుత్రులవలన విని వచ్చి తనయాశ్రమమునకుఁ దోడ్కొనిపోవుట
క. |
మునిపుత్రకు లేటికిఁ జని, చని యయ్యెలుఁగునకుఁ జేరి చంద్రాస్యఁ గనుం
గోని యటఁ బోవక యరిగిరి, మనములఁ గృప గదుర నాశ్రమమునకు మరలన్.
| 36
|
ఆ. |
సరభసముగ నేగి సంయమిచరణారవిందములకు నధికవినయ మెసఁగ
మ్రొక్కి మోడ్పుఁ గేలు ముందట నిగిడించి, యిష్ట మెఱుఁగ నతని కిట్టు లనిరి.
| 37
|
మ. |
ఒకనారీతిలకంబు గాననములో నుద్దామశోకార్త యై
వికలాలోకన మశ్రుధారలును బృథ్వీరేణులిప్తాంగముం
బ్రకటాక్రందనమున్ వికీర్ణకబరీభారంబు వక్త్రబ్జశో
షకనిశ్వాసగమోష్మముం గలయవస్థం బొందఁగా నయ్యెడన్.
| 38
|
తే. |
అరిగి యరిగి కనుంగొని యటఁ జనంగఁ, గాళ్లు లాడక మీ కెఱుఁగంగఁ జెప్పఁ
బాఱుతెంచితి మే మహాభాగుసతియొ, నిరుపమోదాత్తమూర్తి యన్నీరజాక్షి.
| 39
|
చ. |
అనవుడు నమ్మునిప్రవరుఁ డారఘువంశవరేణ్యుదేవిఁ గాఁ
దనమహనీయబుద్ధిఁ గని ధర్మవిధిన్ మహితార్ఘ్యపాత్ర చే
కొని రభసంబునం జనియె ఘోరదశాపరిపాకతప్రతచే
తన యగుచున్ మహిం బొరలు తామరసానన యున్నచోటికిన్.
| 40
|
మ. |
చని సంతర్పణవాక్యపూర్వముగ నాశ్వాసంబు గావించినన్
వనితారత్నము భక్తి నమ్మునిపదద్వంద్వంబునం దశ్రులం
గొని పాద్యం బొనరించె నాతఁడు మనక్షోభంబు సంధిల్ల ని
ట్లనియెన్ గద్గదికానిరుద్ధవచనుం డై యాసరోజాక్షికిన్.
| 41
|
క. |
జనకుఁడు తండ్రియు దశరథ, జననాథుఁడు మామ యఁట విశాలయశశ్శ్రీ
ధనుఁ డగురాముఁడు పతి యఁట, వనితలతో నిన్ను నెన్నవచ్చునె సాధ్వీ.
| 42
|
క. |
నీవచ్చినతెఱఁ గెడఁదను, భావించి యెఱింగి నీదుపావనచరితం
బీవెడమాటల నాఱడి, పోవుట కత్యంతచింతఁ బొందితి నబలా.
| 43
|
తే. |
లోకముల నెద్ది యేనియు నాకు నెఱుఁగ, రానియట్టిది లేదు నిర్మలత నొప్పు
నీదుచరితంబు తెల్లంబు గాదె రాము, నేరమియ చూవె యింతయు నిక్క మరియ.
| 44
|
చ. |
ఇదె మనయాశ్రమం బిచట నీవు వసింపు తపస్వినుల్ ప్రియం
బొదవఁగ నీకు నెల్లపనియుం బరమాదరవృత్తి నాచరిం
చెద రిదె నీగృహంబునకుఁ జేరితి గావున నీదుగర్భ మ
భ్యుదయముఁ బొందు దుర్యశము వోవుఁ బదంపడి నమ్ము మెమ్మెయిన్.
| 45
|
క. |
కైకొను మర్చన మనవుడు, నాకోమలి దెలిసి యర్ఘ్య మందుకొనియె సు
శ్లోకుఁ డగునమ్మునీశ్వరు, సాకతమున శోకవహ్ని శాంతతఁ బొందన్.
| 46
|
తే. |
ఇత్తెఱంగున నూరార్చి యింతిఁ దఱిమి, యల్లనల్లన తోకొని యాశ్రమమున
కరుగుదేరంగ నమ్మునీశ్వరున కర్థి, నెదురువోయి తపస్విను లెరఁగుటయును.
| 47
|
చ. |
జనకునికూఁతు రార్యగుణశాలిని రామునిదేవి సీత యా
తనికొఱగామి నియ్యెడకుఁ దాపసవృత్తిఁ జరింప వచ్చె ని
వ్వనితకు నెల్లకృత్యము దివానిశముం బరికించి బాంధవం
బు నెఱయఁ జేయుఁడీ యని తపోధనసత్తముఁ డప్పగించినన్.
| 48
|
ఆ. |
ఆతపస్వినులు ప్రియంబున జానకిఁ, బొదివి యాత్మవాసభూమి కర్థి
తోడ గారవించి తోకొని పోయిరి, మునియు నిజనివాసమునకుఁ జనియె.
| 49
|
క. |
మునినాథుఁ డింతిఁ దోకొని, తనయాశ్రమమునకు నేఁగు తడ వంతయుఁ దా
నును నిలిచి యాసుమిత్రా, తనయుఁడు గనుఁగొనియె నశ్రుధారలు గవియన్.
| 50
|
పట్టణమునకుఁ బోవుచు సుమంత్రుఁడు లక్ష్మణునకు దుఃఖోపశమంబుగాఁ దొల్లిటికథ యెఱింగించుట
ఆ. |
ఇవ్విధమున రాఘవేశ్వరుదేవి న, య్యడవిఁ ద్రోచి మరలి యరిగి యరిగి
యడలు గదిరి యిట్టు లనియె సుమంత్రుతో, నతఁడు మొగము దీన మగుచునుండ.
| 51
|
క. |
మనయింటిచేటు సూచితె, మనుకులసత్తముఁడు తొఱఁగె మైథిలిని భూ
జనవాదంబు మహాత్ముతుల, యనఘచరిత్రమునకంటె నధికం బగుటన్.
| 52
|
సీ. |
అభిషేకదినమున నడవికిఁ దపమున కరుగుము నీ వన్న నట్ల చనియె
నందును నతిశాంతుఁ డై యుండఁగాఁ దనకోమలి నఱిముఱిఁ గోలుపోయె
నమ్ముద్ధ మగుడఁ దే నని చన్నచోట ననేకవిధం బగు నిడుమఁ బడియెఁ
దెచ్చియుఁ బ్రీతిలో నొచ్చి యొడంబడి మనపుణ్య మేది యిమ్మాడ్కిఁ జేసె
|
|
తే. |
నకట పుట్టిన కోలెను నంతకంత, కగ్గలించినదుఃఖంబు ననుభవించు
చున్నవాఁ డన్న యే మని యుగ్గడింతు, నీమనోగ్లాని తెగుదల యెద్ది చెపుమ.
| 53
|
చ. |
అనిన సుమంత్రుఁ డి ట్లనియె నాతనిపుట్టిననాఁడ వచ్చి త
జ్జనకునితోడ భూమిసురసత్తము లెల్ల ననేకదుఃఖభా
జన మగు నల్పసౌఖ్యుఁ డగు శౌర్యము ధైర్యము దానశక్తియున్
వినయముఁ గల్గువాఁ డగును నింద్యుఁడు వీఁ డన వింటి నేర్పడన్.
| 54
|
ఆ. |
పితృవియోగజనితపీడయు ననుజవి, యోగజనితపీడయును సతీవి
యోగజనితపీడయును బొందు వీని న, నంగ వింటి నేను నరవరేణ్య.
| 55
|
క. |
కావున విధికృత్యము లగు, నీవృత్తాంతములు కింత యేటికి వగవం
జావును జేటును మనుజుల, కావిర్భావంబుతోన యైనవి గావే.
| 56
|
క. |
మఱియు నొకమాట యెవ్వరు, నెఱుఁగనియది దశరథునకు నేకాంతమునం
దఱమఱ లేక దృఢంబుగ, నెఱుకపడం జెప్ప వింటి నే నొకరుండన్.
| 57
|
క. |
అది రాముఁడు భరతుండును, మొదలుగ నెవ్వరును వినరు మున్నైనను నీ
హృదయంబుకలఁక యుడుపఁగ, మదిఁ గోరుటఁ జెప్ప వలసె మనువంశనిధీ.
| 58
|
సీ. |
సర్వజ్ఞుఁ డనఁదగు దుర్వాసుఁ డనుమునీశ్వరుఁడు వసిష్ఠునాశ్రమమునందు
సాంవత్సరిక మైనసత్రంబు నడపంగ ధర్మప్రియుం డగుదశరథుండు
వేడుక జన్నంబుఁ జూడఁ బోయి మునిప్రవరు లిద్దఱకు నభివందనంబు
సేసి రహస్యగోష్ఠీవినోదంబునఁ దత్పరు లగువారుఁ దాను నచట
|
|
తే. |
నున్నయెడ భూవరుఁడు దనకన్నప్రజల, యాయురైశ్వర్యములుఁ దదనంతరంబ
వారిసంతతితెఱఁగు దుర్వాసు నడుగ, నమ్మహీపతితోడ ని ట్లనియె నతఁడు.
| 59
|
క. |
నీకొడుకు అధికబలభ, ద్రాకృతులఁ బ్రవృద్ధిఁ బొంది యాయుశ్శ్రీ ల
స్తోకంబులు గాఁ బుణ్య, శ్లోకత నేలుదురు మధ్యలోకం బెల్లన్.
| 60
|
ఆ. |
వెలయఁ బదునొకండువేలవత్సరములు, రాజ్యమహిమఁ బొంది శ్రీరామభద్రుఁ
డనుపమానకీర్తి యార్జించి పదపడి, బ్రహ్మలోకసుఖము బడయువాడు.
| 61
|
తే. |
అన్న రాజ్యంబు సేయంగ ననుజు లెల్ల, పనులు నడపుచు నీతియు బాహుబలము
మెఱయ వర్తిల్లి యతఁ డేగుతఱియ తమకు, నవసరంబుగ సద్గతి కరుగువారు.
| 62
|
క. |
చతురమతి రామునకు భూ, సుతయం దుదయంబు నొంది సుతు లిరువుకు వి
శ్రుతు లగుదు రందుఁ బూర్వజుఁ, డతులితసామ్రాజ్యమునకు నభిషిక్తుఁ డగున్.
| 63
|
క. |
భరతాదు లయినమువ్వురు, నిరువుర నిరువురఁ ద్రిలోకరహితపూజ్యులఁ ద
త్పరులం బడయుదు రయ్యా, ర్గురు నొక్కొకభూమిపతు లగుదు రుజ్జ్వలు లై.
| 64
|
క. |
అనియెం గావున రాముఁడు, జనకతనూజయు నసౌఖ్యచరితులు మనకున్
వనటకు నించుక యేనియుఁ, బని గా దనవుడును హృదయపద్మం బలరన్.
| 65
|
క. |
అలఘురఘువంశమునకుం, దల మాటించుకయు లేమి తథ్యముగా నీ
వలన సమస్తంబును నేఁ, దెలిసితి నామనము కలఁక దీఱె మహాత్మా.
| 66
|
క. |
అని సౌమిత్రి సుమంత్రుని, ఘనపరిరంభణము సేసి గౌరవమున నా
తనితో సంభాషించుచుఁ, జన నొకపుణ్యాశ్రమంబు చక్కటి యైనన్.
| 67
|
ఆ. |
అచటి కరిగి మునికృతాధికపూజనం, బులఁ బథిశ్రమంబు వుచ్చి నాఁటి
రాత్రి యచటఁ గడపి రామానుజుఁడు జన, శ్లాఘ్యమూర్తి యగుచుఁ జనియెఁ బురికి.
| 68
|
లక్ష్మణుఁడు పట్టణమునకుఁ బోయి యన్నతో సీత నడవిని విడిచి వచ్చితి నని చెప్పుట
చ. |
నగరి సమీప మైన నరనాథునిసన్నిధి కోహటించి నె
మ్మొగము వివర్ణతం బొరయ మోసల నల్లన తేరు డిగ్గి నె
వ్వగ దలకొన్న వ్రేఁ గడరి వ్రాలుగతిం దలవాంచి యేగె సౌ
మ్యగుణవిభాసి లక్ష్మణకుమారకుఁ డానృపుఁ డున్నచోటికిన్.
| 69
|
మ. |
చని దీనాననుఁ డైనయజ్జనపతిం జక్కంగఁ దాఁ జూడ నో
పనివాఁ డయ్యును ధైర్య మూఁది విగళద్బాష్పాంబు లంతంత లో
నన యింకించుచుఁ దొట్రుపాటు చరణన్యాసంబులం జేర నీ
నినడం జేరి వినమ్రుఁ డయ్యెఁ బతికన్నీ రాఁకకున్ మీఱఁగాన్.
| 70
|
క. |
నేత్రములు దుడిచికొంచు సుమిత్రాసుతుఁ బెఱకరమున మెల్లన యెత్తెన్
ధాత్రీవిభుఁడు నిషాదా, మాత్రహృదయుఁ డయ్యుఁ దా సమాహితుఁ డగుచున్.
| 71
|
చ. |
అతఁ డుపవిష్టుఁడై రఘుకులాగ్రణి కి ట్లను దేవ దేవి నన్
చితిని భవన్నిరూపితవిశిష్టతపోవనభూమికిం దగ
న్పతి మునియాజ్ఞ నాశ్రమమునన్ వసియించె జరత్తపస్వినీ
యుతనవపర్ణశాల నఖిలోపనతార్ఘ్యసగౌరవంబుగన్.
| 72
|
క. |
అని తననిర్వర్తించిన, పని విజ్ఞాపనము సేసి పతితో నతఁ డి
ట్లను మఱియుఁ దన్మనోవే, దన మాన్పుతలంపునను హితము సత్యము గాన్.
| 73
|
లక్ష్మణుఁడు రామునకు దుఃఖోపశమంబు సేయుట
ఉ. |
ఇట్టివి దైవచేష్టితము లెవ్వరికిం గడవంగ రాదు మీ
యట్టిమహాత్ము లుమ్మలిక లందినచో ధృతి గట్టి చేసి లో
గిట్టక యుండ గీడ్పఱిచి గెల్వక తక్కిన నిర్వహించు పెం
పెట్టొకొ బుద్ధిమంతులకు నెక్కుడుభంగిఁ దలంచి చూడఁగన్.
| 74
|
క. |
పెరుఁగుట స్రగ్గగఁ జవులం, బొరయుట యవశంబు గాఁగఁ బుట్టుట చావన్
బెరయుట పాయఁ బదార్థో, త్కరముల నైజ మిది యెట్లు దప్పింప నగున్.
| 75
|
ఉ. |
కావున దారపుత్త్రసఖికామదముం బితృమాతృసోదరా
శావలనంబు గాఢముగ సల్పుదురే మిము బోఁటు లైనసం
భావితు లట్లు గాక నిరపాయము లై కడచన్నవానికిం
బోవునె పెద్దవారితలఁపుల్ మును వేడుక యెంత కల్గినన్.
| 76
|
మ. |
జనవాదంబునకుఁ బ్రియం దొఱఁగ నుత్సాహంబు సేయంగ వ
చ్చునె యి ట్లేవ్వరి కివ్విధంబు దలఁపం జోద్యంబు గాదే క్రమం
బున నిష్కల్మషవృత్తముల్ దెలియ నోపున్ లోక మెబ్భంగి నీ
మనువంశంబు భవద్గుణంబుల జగన్మాన్యత్వముం బొందెడున్.
| 77
|
శా. |
తాపంబుం బెడఁబాపి దుర్దమవిషాదంబుం దిగం ద్రావి ని
ర్వ్యాపారత్వముఁ బోవఁ ద్రోచి వగ లుద్వాపించి వెల్వెల్లఁబా
టేపొంతన్ మెలఁగంగ నీక మదికం దెల్లం దెగం బుచ్చఁగా
నీపెం పార్యజనంబు మెచ్చు ధృతి కున్మేషంబు గావింపవే.
| 78
|
క. |
అనవుడుఁ దమ్మునిమాటలు, విని సంభావించి యీవివేకవచనముల్
సను నీకు నిట్లు సెప్పఁగ, నని విభుఁ డుల్లంబు కలఁక యంతయుఁ దీఱన్.
| 79
|
రాముఁడు దుఃఖము నడఁచుకొని ప్రజలం బాలించుట
క. |
నీ పంచినట్ల చేసెద, భూపతులకు ననవధానమునఁ బుట్టు ననే
కాపదలు వినుము తొంటిమ, హాపురుషుల నని వినీతుఁ డగునాతనితోన్.
| 80
|
క. |
నృగుఁ డనఁగ నిమి యనం జను, జగతీపతు లనవధానజాడ్యంబున నిం
దగతిం బొందినతెఱఁ గా, సగరకులోద్వహుఁడు సెప్పెఁ జతురత మెఱయన్.
| 81
|
తే. |
ఇట్లు సల్లాప మొనరించి యెల్లపనులు, ననుదినంబును దలఁపింపు మఖిలజనులు
సంతసం బందునట్లుగాఁ జక్కఁ బెట్ట, నని నియోగించి యతనిఁ బోఁనిచి విభుఁడు.
| 82
|
ఉ. |
అచ్చటు వాసి యల్లఁ జని యాహ్నికవర్తన మాచరించి రా
లచ్చి వికాస మందఁగ నలంకృతుఁ డై మునిమాపు దర్శనం
బిచ్చిన మంత్రిభృత్యసుకవీశ్వరు లాదిగ నెల్లవారలున్
వచ్చి మహీశుఁ గొల్చి రనివారణఁ జిత్తము లంకురింపఁగన్.
| 83
|
ఆ. |
విభుఁడు నిఖిలజనులవిన్నపంబులు విను, వివిధసైన్యములకు సవరణముల
ననువు సేయు నభిమతార్థంబు లర్థుల, కిచ్చు వేఁట లాడు నిచ్చవెలయు.
| 84
|
క. |
ఇవ్విధమున నిత్యంబును, నవ్వసుధాధిపుఁడు ప్రజల కనురాగలతల్
నివ్వటిలఁ జేయుఁ దనమది, నొ వ్వెఱుఁగక యుండ బహువినోదపరుండై.
| 85
|
రాముఁ డేకాంతంబున సీతం దలంచి చింతిల్లుట
క. |
మనమునఁ బాయని ధరణీ, తనయవలని వగల నేకతంబ పొగిలి య
మ్మనువంశదీపకుం డి, ట్లను ధైర్యము పల్లటిల్లి యలుగులపడుచున్.
| 86
|
సీ. |
నీకకా యకట పినాకిబాణాసనం బద్భుతంబుగ సభ నట్లు సేసి
జనకానుమతిఁ దపంబునకు నక్కట నీవు ననుగమనంబు సేయంగ నరిగి
పాసియు మగుడ నిన్ బడయుదు ననునాస నక్కట ప్రాణంబు చిక్కఁ బట్టి
యక్కడ సేతుబంధాద్యుపాయములు నానందనం బయిన నీపొందు గాంచి
|
|
తే. |
యిం పొసంగు నీయర్మిలియెల్ల వమ్ము, గాఁగఁ దుది పోయి ని న్నిట్లు గానపాలు
నేసేసి యాఱడిఁ బుచ్చితిఁ జెప్పఁ జిట్ట, లయ్యె నామను వే మన నంబుజాక్షి.
| 87
|
ఉ. |
అచ్చట లోకమంతయును నక్కటికంబున నుమ్మలింప నీ
చిచ్చు చొరంగఁ బోక మది చిక్కఁదనంబున నియ్యకొన్న నా
కిచ్చటఁ దెచ్చి నిన్ విడుచు టెంతటి పెద్దజఘన్యవృత్తి కే
నచ్చట రచ్చ కెక్కుటకు నాఱడిపోకకు నోర్తు మైథిలీ.
| 88
|
ఆ. |
అని దురంతశోకమునఁ బొంది సెజ్జపై, మేను వైచి కన్నుగోనలందు
నివుడు నశ్రువారి చెవులకొలంకుల, నిండ నిట్టు లను విభుండు మఱియు.
| 89
|
ఉ. |
వీట దురాత్ము లైనయవివేకులు గొంద ఱనింద్య మైనయ
జ్జోటిచరిత్ర మంగనల చొప్పుగ సంశయ మంది యాడు పె
న్మాటల కేల యీదురభిమానము పూనితి వాని నేల నే
గీటునఁ బుచ్చ నైతిఁ బరికింపక చేసితి నింతిఁ బాసితిన్.
| 90
|
ఉ. |
లోకమువారిమెచ్చునకు లోలవిలోచనఁ బాఱవైచితిం
బో కొఱగామి యంతటన పోయెనె దీనికి నింకఁ గొంద ఱో
హో కృప మాలి చేసె నిది యొప్పదు పొ మ్మని దుర్వినీతి గాఁ
గైకొని రేని వారిమది కందున కెయ్యది గందు దైవమా.
| 91
|
క. |
అని వందుచు నంగనదెస, వనటకు సామ్రాజ్యవివిధవర్తనమునకుం
దనచిత్తము పొక్కఁగ న, మ్మనుజేంద్రుఁ డుద త్తవృత్తి మహి యేలునెడన్.
| 92
|
రాముఁడు మునులమొఱ విని శత్రుఘ్నుని లవణుం జంపఁ బంపుట
మ. |
వివిధాన్యాయపరాయణుండు రిపుదోర్వీర్యానివార్యుండు
హవసంక్రీడనలోలబుద్ధియు మహాహంకారుఁడుం గావునన్
లవణుం డడ్డము లేక దానవకులశ్లాఘ్యస్థితిన్ మేదినీ
దివిజవ్రాతము నెల్ల నాతురతఁ బొందించున్ సమిద్ధాత్ముఁ డై.
| 93
|
ఉ. |
దానికి రోసి సంయమికదంబక మారఘువంశసత్తముం
గానఁగ వచ్చి సంతతమఖప్రతిఘాతముఁ బ్రాణిహింసయున్
లో నగుచున్న వాని యతిలోకదురాచరణంబు లన్నియున్
దీనత దోఁపఁ జెప్పిన మదిం గృప కోపముతోఁ బెనంగఁగన్.
| 94
|
ఉ. |
తమ్ములదిక్కు గన్గొనుచు దైత్యులపీచ మడంగ దయ్యెడుం
గ్రమ్మఱఁ దోఁచె వీఁ డొకఁడు గాసిగ విప్రుల నేఁప కుండ శీ
ఘ్రమ్ముగ నేగి యద్దనుజుఁ గాలునిప్రోలికి నంపి రాకకుం
గ్రమ్మన నొక్కఁ డియ్యకొనఁగా వలయున్ మనలోన నావుడున్.
| 95
|
క. |
భరతుండు లక్ష్మణుండును, బరవసమునఁ బలుకుచుండఁ బతి కట్టె దురం
గరములు మోడ్చి వినయసుం, దరుఁ డగుశత్రుఘ్నుఁ డత్యుదాత్తవచనుఁ డై.
| 96
|
క. |
వీరల కెదురఁగఁ జాలెడి, వా రచ్చో నెవ్వ రాలవణు మాత్రకు దు
ర్వారభవదాజ్ఞ నేఁ జని, వైరం బనుపేరు మాన్చి వచ్చెద ననుడున్.
| 97
|
క. |
అగుఁ గాక యితఁడు వోవుట, తగు నని పెఱవారి నుడిపి ధరణీవిభుఁ డొ
ప్పుగ లవణువీడు మధురకుఁ, దగఁ బట్టము గట్టెఁ బిన్నతమ్మునిఁ బ్రీతిన్.
| 98
|
ఉ. |
మంత్రసమేత మై భువనమాన్యత నొప్పునమోఘబాణ మా
మంత్రితుఁ జేసి యాతనికి మన్నన రెట్టిగ నిచ్చి వేడ్కమై
మంత్రుల భృత్యులన్ బుధసమాజము వైశ్యుల వారిజాక్షులం
దంత్రము రాజ్యచిహ్నముల ద్రవ్యసమూహము నిచ్చెఁ బెంపుతోన్.
| 99
|
శత్రుఘ్నుఁడు లవణుపై నెత్తిపోవుట
ఆ. |
ఇట్టు లొసఁగి మునుల నెల్లను జూపి వీ, రెట్లు చెప్పి రట్ల యెల్లపనులుఁ
జేసి విజయలక్ష్మిఁ జేకొని రమ్మని, యధిపుఁ డనిచి పుచ్చ నతఁడు వోయి.
| 100
|
క. |
సురనదితీరంబునఁ గడుఁ, బర పగుతనదండు విడియఁ బనుచుచు భరతా
వరజుఁడు వాల్మీకిమునీ, శ్వరునాశ్రమమునకు నరిగి సద్భక్తిమెయిన్.
| 101
|
ఉ. |
అమ్మునిపాదపద్మముల కానతుఁ డై యతఁ డిచ్చుపావనా
ర్ఘ్యమ్ము వినీతవృత్తిఁ దగఁ గైకొని మూలఫలాదివన్యభ
|
|
|
క్ష్యమ్ములఁ దుష్టి పొంది సరసప్రియభాషలఁ బ్రొద్దు పుచ్చి యం
దిమ్ముల నాఁటిరే నిలిచి యిచ్చ నిజాగ్రజులం దలంచుచున్.
| 103
|
క. |
ఆరాత్రియు రఘుకులని, స్తారకు లగుసుతులఁ దరుణతరణిప్రతిమా
కారులఁ గాంచె ధరాసుత, వారిజలోచనులఁ గవలవారలఁ బ్రీతిన్.
| 104
|
క. |
మునిజనపత్నులు శీఘ్ర, మ్మున నపుడే యరిగి యత్తపోనిధి కెఱిఁగిం
చిన నతఁడు సత్వరుం డయి, చని బాలురఁ జూచి పరమసంతోషమునన్.
| 105
|
క. |
విశదపరిమార్జనమునకుఁ, గుశయును లవనంబు నిచ్చి కులపతి ప్రీతిం
గుశలవు లనునామము లస, దృశముగ నిడి వారలను బ్రదీప్తులఁ జేసెన్.
| 106
|
ఆ. |
అట్టియవసరమున నమ్మునిపల్లెలోఁ, బరఁగు నుత్సవంబు పలుకు లెల్ల
మనము పల్లవింప వినుచు శత్రుఘ్నుఁ డం, గములఁ బులకసమితి కరము దాల్చె.
| 107
|
ఆశ్వాసాంతము
మ. |
రమణీయాంగుఁ డభంగుఁ డుజ్జ్వలకృపారాధ్యుం డసాధ్యుండు దు
ర్దమసంరంభుఁ డదంభుఁ డార్యవినుతౌదార్యుం డవార్యుండు ధ
ర్మమయస్వాంతుఁడు దాంతుఁ డూర్జితరమామాన్యుం డదైన్యుండు హృ
ద్యమితాలాపుఁ డపాపుఁ డంచితకృపాయత్తుం డుదాత్తుం డిలన్.
| 108
|
క. |
ఉభయబలవీరుఁ డభిమత, విభవసురప్రభుఁడు దర్పవిశ్రుతరిపుభూ
పభయంకరసౌమ్యాకృతి, శుభచరితుండు సుభగతాభిశోభితుఁ డెలమిన్.
| 109
|
మాలిని. |
అనఘుఁ డమితసత్త్వుం డన్యభూభృత్కృతాంతుం
డనుపమధృతిసారుం డర్కతేజుం డజేయుం
డనితరసమపుణ్యుం డర్థిమిత్రుం డమేయుం
డనుకృతఫణిహారుం డన్వయోదారుఁ డుర్విన్.
| 110
|
గద్యము. |
ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బైనయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు నవమాశ్వాసము.
|
|