నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం

వికీసోర్స్ నుండి


పల్లవి:
నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం, నా
సామికిదే శుభమంగళం - ముద్దు సామికిదే జయమంగళం ॥నా మనో॥

అనుపల్లవి:
ప్రేమతో నా కౌగిట జిక్కి కులుకు - పిసాళి గుబ్బల పోటుల నలసి
పిరివిరిగా ననగి పెనగి మేను - మరపించుచు నేర్పున ॥నా మనో॥

చరణ:
క్రొవ్విన కోవెలలే మావిచిగురు - కొరికిన క్రియ నా వాతెరనొక్కి
నవ్వు మొగంబు నలంకరింపగా - నన విల్తుని బారికి మదిసొక్కి
దవ్వు దవ్వులనె యురికి - మెలమెల్ల దరికి దరికి, డగ్గరి
చివ్వున నను బట్టిన మై ఝల్లని
చిటుకున వీడిన నీవితో నిక్కిన - చిన్ని చన్నుగవ ఠీవితో
మొవ్వపుటరగను మూతతో - మోహపు చెమటల పూతతో
పువ్వుల పాన్పున పొందుగ ననువిడి - పొరిపొరి కాముని పోరున తీరున ॥నా మనో॥

పదరిమదపు టేనుగు తనకరమున - బంగరు టనటుల బట్టిన లీల
వదలక నా పెందొడల వలిప పా - వడ పై కెత్తి సరిగ తనకేల
పొదవి పట్టి కులికి, పొక్కిలి - వెదకి వెదకి కులికి, వెలికి
కదలి సిగ్గుచే కనుమూసుక
బెదరింపున నొక యోరగ నొత్తిల - పదపడి కోరికలూరగా
మదనుడు ములుకుల నూరగా - మదిని వలపు మితిమీరగా
కుదురుగ నా యొడి కుచ్చెల పైనిడి - చెదరక బట్టిన చేతికి మ్రొక్కుచు ॥నా మనో॥

మరిమరి సరసపు మాటలనను బ్రతి - మాలి యెట్టకేలకు జయమంది
తరచుగ రతి కూజితముల చేతన - తమ్మరసము పయ్యెదపై జింది
ద్విరదేంద్రపాలుడు తోట్ల వల్లురి - పురవాసుడు వేణుగోపాలుడు
కరుణను దాసు శ్రీరాముని బ్రోచిన
ఘనుడు కళలు మైదేరగా, నన్ను - గలసి మెలసి తమిదీరగా, నఖ
విరచిత రేఖలు మీరగా, సుఖ - వీచులు పై పై బారగా
సురసుర సొక్కుచు సోలుచు లేచిన - తరి బయ్యర నిలువురమును నిలువగ ॥నా మనో॥