నా మనోధనము జూరగొన్న
మంగళహారతులు
నా మనోధనము జూరగొన్
సురటి రాగం - ఆది
పల్లవి:
నా మనోధనము జూరగొన్న విన్నాణపు దొంగకు మంగళం
నా సామికిదే శుభమంగళం ముద్దు సామికిదే జయ మంగళం. ॥ నా మనో ॥
అనుపల్లవి:
ప్రేమతో నా కౌగిట జిక్కి కులుకు పిసాళి గుబ్బల పోటుల నలసి
పిరివిరిగా ననగి పెనగి మేను మరపించుచు మురిపించుచు నేర్పున ॥ నా మనో ॥
చరణం 1:
క్రొవ్విన కోవెలలే మావి చిగురుకొరికిన క్రియ నా వాతెరనొక్కి
నవ్వు మొగంబు నలంకరింపగానన విల్తుని బారికి మది సొక్కి
దవ్వు దవ్వులనె యురికి, మెల మెల్లనె దరికి దరికి దరికి డగ్గరి
చివ్వున నను బట్టిన మై ఝల్లని
చిటుకున వీడిన నీవితో నిక్కిన చిన్ని చన్నుగవ ఠీవితో
మొవ్వపుటరగను మూతతో మోహపు చెమటలు పూతతో
పువ్వుల పాన్పున పొందుగ ననువిడి పొరిఫొరికాముని పోరున తీరున ॥ నా మనో ॥
చరణం 2:
పదరి మదపు టేనుగు తనకరమున బంగర పుటనటుల బట్టిన లీల
వదలక నా పెందొడలవలిప పావడపైకొత్తి సరిగ తనకేల
పొదవిపట్టి కులికి, పొక్కిలి వెదిక వెదకి చిలికి వెలికి కదలి సిగ్గుచే కనుమూసుక
బెదరించిన నొక యోరగ నొత్తిలి పదపడి కోరిక లూరగా
మదనుడు ములుకుల నూరగా మదిని వలపు మితిమీరగా
కుదురుగ నా యొడి కుచ్చెలపైనిడి చెదరక బట్టిన చేతికి మ్రొక్కుచు. ॥ నా మనో ॥
చరణం 3:
మరిమరి సరసపు మాటలనను బ్రతిమాలి యెట్టకేలకు జయమంది
తరచుగ రతి కూజితములచేతన తమ్మరసము పయ్యెద పైజింది.
ద్విరదేంద్ర పాలుడు తోట్ల వల్లూరివురవాసుడు వేణుగోపాలుడు
కరుణను దాసు శ్రీ రాముని బ్రోచిన
ఘనుడు కళలుమై దేరగా నను కలసి మెలసి తమిదీరగా,
నఖవిరచిత రేఖలు మీరగా, సుఖ వీచులు పైపై బారగా
సురసుర సొక్కుచు సోలుచు లేచిన తరి బయ్యెర మిరువురమును నిలువగ ॥ నా మనో ॥