నా జీవిత యాత్ర-4/శాసన సభా విశేషాలు

వికీసోర్స్ నుండి

4

శాసన సభా విశేషాలు

మంత్రివర్గం ఏర్పాటయిన తర్వాత మొదటి శాసన సభా కార్యక్రమపు ఉదంతాలు ఇక్కడ కొంచెం వ్రాస్తాను. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ననుసరించి శాసన సభ విస్తృతమైంది. ఫోర్టు సెంటు జార్జిలో అప్పటి వరకూ ఉన్న శాసన సభా భవనం విస్తృతమైన శాసన సభకు సరిపోదు గనుక, కొత్తగా పెద్ద భవనం ఒకటి కోటకు దక్షిణంగా ఉన్న ఐలెండుగ్రౌండు అనే పెద్ద మైదానంలో తూర్పు భాగాన నిర్మించడానికి అప్పుడు ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఆ భవనానికి ప్లానులు, డిజైనులు తయారుచేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఫీజుగా ఎవరో ఆర్కిటిక్టులకు ఇవ్వడం కూడా జరిగింది. కాని, కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత, ఐలెండ్ గ్రౌండును రాయి, సున్నం కట్టడాలతో నింపివేయడం ఇష్టం లేక, ఈ శాసన సభను తాత్కాలికంగా సెనేట్ హాలు అనే భవనంలో నడప డానికి ఏర్పాటు జరిగింది. ఫోర్టు సెంటుజార్జికి దక్షిణంగా కూవమ్ నది ఉంది. అప్పట్లో కూవం ఒడ్డున క్లైవ్ హవుస్ అనే భవనం ఉండేది. అది ఇప్పుడు మద్రాసు యూనివర్శిటీ లైబ్రరీగా పునర్నిర్మింప బడింది. దానికి దక్షిణంగా పెద్ద మైదానంలో (ఇప్పటి యూనివర్శిటీకి సంబంధించిన నిర్మాణాలు అప్పట్లో లేవు.) పెద్ద పెద్ద గుమ్మాలతో సెనేట్ హాలుంది. యూనివర్శిటీలో పాసయిన వారికి డిగ్రీలు ఇవ్వడానికి ఆ హాలు నిర్మింపబడి ఉండెను. ఆ హాలు మేడ పైభాగంలో శాసన సభ ఆఫీసులు, దాని భూగర్బ భాగంలో శాసన సభ గ్రంథాలయం పెట్టుకొనేందుకు కూడా అవకాశం ఉండేది. శాసన సభకు కావలసిన ఏర్పాటు చేశారు.

గవర్నరులు కేవలం కాన్ట్సిట్యూషనల్ గవర్నర్లుగానే ఉంటామని మాట ఇచ్చిన తరువాత కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పడినట్లు లోగడ వ్రాసియున్నాను.

శాసన సభ ప్రథమ సమావేశము

14 - 7 - 37 న సెనేటు హవుసులో శాసన సభా సమావేశం జరిగింది. ఆ మరునాడు శ్రీ బులుసు సాంబమూర్తిగారిని స్పీకరుగా ఎన్నుకొనడం జరిగింది. ఇదివరకు వ్రాసిన గవర్నమెంటు తీర్మానాలతో బాటు మరొక ముఖ్య విషయం చెప్పవలసి ఉంది. 31 - 8 - 37 న, అంటే ఉద్యోగ స్వీకరణ అయిన నెలా పదిహేను రోజులలో శాసన సభలో భారత దేశానికి స్వాతంత్ర్య ప్రాతిపదికపైన సంవిధానము (Constitution) తయారు చేయడానికి కాన్ట్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన సభ) ఏర్పాటు చేయవలసిందని బ్రిటిషు గవర్నమెంటును కోరడం ఆ తీర్మానపు సారాంశము. 1946 వరకు ఈ అసెంబ్లీ రాలేదు. అది వేరే విషయము.

వందేమాతరం ప్రార్థనతో సభారంభం

15 వ తేదీన స్పీకరుగా ఎన్నికయిన వెంటనే సాంబమూర్తిగారు సభ్యులకు తన కృతజ్ఞతను రెండే రెండు చిన్న వాక్యములలో చెప్పి, సభ్యులలో ఒకరైన శ్రీమతి లక్ష్మీశంకరయ్యర్‌గారిని "వందేమాతరం" పాడమని ఆదేశించారు. సభ్యులందరు లేచి నిల్చున్నారు. జస్టిస్‌పార్టీ వారు, ముస్లిం లీగ్‌వారు కూడా ఆ రోజున సందేహాభ్యంతర భావాలు చూపకుండా లేచి నిలుచున్నారు. అయితే, రానురాను కాంగ్రెస్‌వారు తమ జాతీయ గీతం క్రింద పాడుతూ ఉన్న గీతం పాడినప్పుడు తాము నిలిచినట్లయితే తమ పార్టీ గౌరవానికి లోటు కలుగుతుందనే భావం ఒకటి వారిలో వారే అంకురింపజేసికొని, దానిని కాంగ్రెసు విద్వేషం అనే విషంతో తడిపి, వ్యతిరేకత అనే ఒక చిన్న మొక్కను తమ హృదయాలలో పెంచుకొన్నారు. ఒక రోజు సభలో ధైర్యం తెచ్చుకొని ఈ ప్రార్థనకు అభ్యంతరం చెప్పారు. కాంగ్రెసుకు వ్యతిరేకమైన పత్రికల వారా ఉప్పు అందుకొని, వారికి తోచినట్టు వారు వ్రాయడం మొదలు పెట్టారు. చివరకు సాంబమూర్తిగారు శాసన సభ ఆరంభం కావడానికి ఐదు నిమిషాల ముందువచ్చి, "ఇష్ట మున్నవారు పాల్గొనవచ్చు; లేనివారు వద్దు," అనే ఒక ఏర్పాటు కూడా చేశారు. ఇది అక్కడితో ఆగిపోయిందని మేము అనుకొన్నాము. కొంచెం లొంగుబాటు కనిపిస్తే ఎదురు పక్షంవారు ఊరుకోరు గద! ఆ గీతం శాసన సభా మందిరంలోనే పాడకూడదని అభ్యంతర పెట్టారు. దానిపైన సాంబమూర్తిగారు సర్వమత సామరస్యంగా ఉండే ఒక ప్రార్థన తామే వ్రాసి, ఒక రోజున సభా ప్రారంభంలో చదివారు. అది ఇది:

"అనంతమై సర్వశక్తిమంతమైన ఓ దేవా! చెన్నరాష్ట్ర ప్రజాప్రతినిధులమైన మేము శాసన సభయందు సమావేశమై, నిండు మనములతో ప్రార్థించు చున్నాము. మా హృదయముల నుండి రాగద్వేషములు అంతరించు గాక! మా మనస్సులు సర్వ జనోపయోగకరమైన సిద్ధాంతములను చేయుటయందు నిమగ్నమై ఉండుగాక! తద్వ్యతిరిక్త భావములు మాకు రాకుండా ఉండుగాక! మేము నిర్మించు శాసనములు, మేము ఆమోదించు తీర్మానములు జ్ఞాన యుక్తములై, హేతు సమర్థములై యుండుగాక! సత్యమును, న్యాయమును వాటికి ఆధారములగు గాక! అని ప్రజల ఆరోగ్య సౌభాగ్యములను వృద్ధిపరచుగాక! మాతృదేశ సేవయందు మా బుద్ధి స్థిరమైయుండి, శాంతి, స్వాతంత్ర్య సంపాదనకు మా సర్వశక్తులు వినియోగమగు గాక! ఓం శాంతి: శాంతి శాంతి:."

సభ్యులంతా విధిగా నిల్చుచున్నారే కాని, ఎదురు పక్షంవారు అదికూడా కాంగ్రెస్‌ వారికి లొంగిపోయినట్లు అయిందని తిరిగి కొంత ఆవేశం తెచ్చుకొన్నారు. వారు తర్వాత ముఖ్యమంత్రిగారిని కలుసుకొని ఏమైనా, ఈ ప్రార్దనను శాసన సభలో ఆపివేయాలని ఆయనను ఎలాగో మెత్తబరిచారు. ఒక రోజున ఆయన ముందుగా సాంబమూర్తిగారి గదిలోకి పోయి, ఆయనకు నచ్చజెప్పి _ శాసన సభలో లేచి, ప్రార్థన చేయడ మన్నది సర్వమత సమ్మతమయిన దయినా, చారిత్రకమైన పరిస్థితులవల్ల ఆ విషయమై అపోహలు వచ్చినవి గనుక దానిని విరమింపజేయవలసినదని స్పీకరుగారిని తాము కోరినట్లు, ఆయన అంగీకరించినట్లు ఒక స్టేట్‌మెంటు చేశారు. ఆ స్టేట్‌మెంటు పైన కూడా ఏదో కొంత చర్చ చేద్దామని, ఒకప్పుడు కాంగ్రెసులో ఉండి, తర్వాత ముస్లిం లీగులో చేరిన అమీత్‌ఖాన్ లేచేసరికి స్పీకరుగారు, "ఈ విషయం ఇంతటితోసరి; మరి ఎవరికీ ఏమీ మాట్లాడడానికిలేదు" అని నిస్సందేహంగా చెప్పడంతో ఈ ప్రార్థన సమస్య తీరిపోయింది.

ఇంగ్లీషు పార్లమెంటులో మాత్రం కామన్సుసభ ఆరంభ సమయానికి ఆరు నిముషాలు ముందు అంతా చేరి ప్రార్థన జరిపిన తరువాతనే, మిగిలిన కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇది వారికి ఏడువందల ఏండ్లనుంచి ఏ అవాంతరం లేకుండా సాగుతూన్న సంప్రదాయము. మన దేశంలో స్వాతంత్ర్యం పొందే ముందు సాంబమూర్తిగారు ఒక్కరే ఈ సంప్రదాయం నెలకొల్ప డానికి యత్నించారు. అయితే, అది పైన చెప్పిన విధంగా ముగిసి పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈప్రసక్తి ఎప్పుడూ ఏ శాసన సభలో కాని, పార్లమెంటులో కానీ ఎవరూ తేలేదు. తెచ్చినా, సాగుతుందని నాకు తోచదు.

సాంబమూర్తిగారి కొత్త పద్ధతులు

జమీందారీ బిల్లు తరువాత చరిత్ర కొంచెం సూచిస్తాను. ఈ బిల్లు విషయమై దేశంలో ప్రబలిన వాతావరణం విషయమై లోగడ కొంత సూచించాను. బిల్లు చర్చకువచ్చే రోజున సెనేట్ హవుస్ ఆవరణమంతా ప్రజలతో కిటకిట లాడుతూంది. ఇంతేకాక, సభా కార్యక్రమం చూడడానికి పాసులు అడిగేవారి సంఖ్యకూడా చాలా హెచ్చు అయిపోయింది. ప్రేక్షకులు కూర్చునేందుకున్న స్థలం పరిమితమైంది. ఇదంతా చూచి, సాంబమూర్తిగారు కొన్ని లౌడ్‌స్పీకర్లు తెప్పించి ఆవరణలో ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటరీ కార్యక్రమానికి చాల వింత అయిన విధానము. ప్రేక్షకులు లోపలకు రావడానికిగాని పాసులు కావాలనే నిబంధన లున్నాయికాని, బయట ఉండి వినడానికిగాని, అలా వినేటందుకు ఏర్పాటు చేయడానికిగాని వ్యతిరేకమైన నిబంధన లేమీ కనిపించలేదు. ఇంతేకాక, సాంబమూర్తి గారు ప్రజల కీ మాత్రం సౌకర్యం కలుగజేస్తుండగా ఎవరైనా అడ్డువస్తే ప్రజలంతా ఊరుకుంటారా? ఇంతేకాక, అట్టే అవకాశాలు లేని రెవిన్యూ శాఖకు మంత్రియై ప్రకాశంగారు ఒక విప్లవాత్మకమైన నినాదంగల నివేదిక ప్రజల పరంగా శాసన సభకు అందజేసే సమయంలో వారు చెప్పే మాటలు వినడానికి కయినా వీలులేకుండా చేస్తే, ఇదేం శాసన సభ అని ప్రజలు వచ్చి మీద పడిపోతారేమో అన్నంతగా వాతావరణం ఉండడంవల్ల ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు తమ మనసుల్లోనే అణచుకుని, మాట్లాడక ఊరుకున్నారు.

ప్రకాశంగారు చర్చ ఆరంభించడానికి లేచి నిలబడేసరికి శాసన సభలో గట్టిగా, నిర్విరామంగా చప్పట్లు ఆరంభమయ్యాయి. స్పీకరు గారు చప్పట్లు కొట్టడం కూడదని చెప్పారు. దాంతో సభ నిశ్శబ్దమయింది. ప్రకాశంగారు మాట్లాడడం ఆరంభించినప్పు డెప్పుడూ చుంద్రమైన కంఠంతో మాటకు, మాటకు మధ్య కొంచెం ఎక్కువ విరామంతో మాట్లాడడం అలవాటు. అది ఉపన్యాస ప్రారంభదశ అన్నమాట. ఆయన రోజుకు వెయ్యి రూపాయల చొప్పున దినవారీ ఫీజు పుచ్చుకుని హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో కూడా ఆయన వాగ్వైఖరి అదే. రానురాను ఉపన్యాసం వేగం అందుకొనేది. ఆ రోజున ఆయన ఉపన్యాసం ఇలా ప్రారంభించారు:

"అధ్యక్షా! ఈ విధాన సభవారు నియమించిన ఉపసంఘం పక్షాన రెండు నెలల క్రిందట నేను ఆ సంఘం నివేదికను మీకు సమర్పించాను. ఈ కమిటీ చర్చించిన విషయం - భూస్వాములకూ, రైతులకూ మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలను గురించినది. మా నివేదికను ఈ సభవారికి కొంత ఆలస్యంగా అందజేసినందుకు నేను సంజాయిషీ చెప్పవలసిఉంది. ఈ నివేదిక తయారుకావడానికి దాదాపు 15 మాసములు పట్టింది. మేము ఈ రాజధానిలో ఉత్తరభాగంలో రెండు కేంద్రాల లోను, దక్షిణభాగంలో రెండు కేంద్రాలలోను, రాజధాని నగరమయిన చెన్న పట్నమందునూ, సాక్ష్యాలు సేకరించితిమి. సాక్ష్య మిచ్చుటకు వచ్చిన సాక్షులందరి సాక్ష్యములను వ్రాసు కొన్నాము. వారు దాఖలు చేసిన కాగితములను అందుకున్నాము. ఇది జరిగిన తర్వాత ఉపసంఘం సభ్యుల వీలునుబట్టి మా సమావేశాలు జరిపేందుకు కొంతకాలం పట్టింది. మేము ఒక్క రోజుకూడా వృథా చేయలేదు. ఇతర కార్యాలకు భంగం లేకుండా ఈ ఉపసంఘం పని శ్రద్ధగా నడిపినాము పరిశీలనా సమయంలో అనేక వ్యాఖ్యలు - ముఖ్యంగా మేము ఆలస్యం చేసితిమన్న వ్యాఖ్యలు కూడా - వచ్చినవన్న విషయం నాకు గుర్తున్నది. అయితే, అటువంటివాటిని పట్టించుకోక మేము మా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్నాము. అధ్యక్షా! మరొక విషయం చెప్పాలి. మా నివేదికను శాసనసభకు అందజేసేముందు, కొందరు తమకూ తమ హక్కులకూ భంగం వాటిల్లుననే భయంతో దీనిని రహస్యంగా ఉంచివలసినదంటూ, అలా ఉంచేటందుకు ప్రయత్నాలు చేసినారు. వారి ఆ యత్నాలు ఫలించలేదు. నిబంధనల ప్రకారం శాసన సభా కార్యదర్శిగారికి సూచించిన ఒక తేదీనాడు నివేదికను శాసనసభ కందజేస్తామని నోటీసులు ఇచ్చాము. ఆ ప్రకారంగానే వాటిని అందజేశాము"

అని మెల్లిగా ప్రారంభించి, మూడు రోజులబాటు నివేదికలోని అంశాలను సహేతుకంగా, ఉద్రేకంలేని మాటలతో, వినేవారికి ఉద్రేకం కల్గించేటట్లు మాట్లాడగా, సభలో శాసన సభ్యుల అందరి ముఖాలలో పోయే జమీందారీలకోసం మనకెందుకీబాధ అన్నభావం కల్గినట్లు నాకు కనిపించింది. కాగా, ఈ ఉపన్యాసపు ప్రభావం ముఖ్యమంత్రిగారిమీద ఎలా పడిందో మనం ముఖ్యంగా చూడాలి. శాసన సభా కార్యక్రమంవరకు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.

రెండురోజులు చర్చ జరిగిన తర్వాత ఎవరూ అనుకోకుండా ముఖ్యమంత్రి రాజాజీ లేచి, మాట్లాడనారంభించేసరికి యావన్మంది సభ్యులు ముగ్దులైపోయారు. అందరూ ప్రకాశంగారి అభిప్రాయానికి ఆయన ఎంతవ్యతిరేకంగా ఉంటాడని అనుకున్నారో, అంత సుముఖంగా మాట్లాడారు. ప్రకాశంగారు మితవాది అనీ, తానే విప్లవవాది అనీ నలుగురూ అనుకొనే విధంగా మాట్లాడి - భూమిపై హక్కు రైతుదేనని, సిస్తులు హెచ్చించడానికి జమీందార్లకు హక్కు లేదని మొదలుగాగల ప్రకాశం కమిటీ శిఫార్సులను, అందులో ఉన్న భాషకన్న పటుత్వమైన భాషతో మాట్లాడి బలపరిచారు. దీనివల్ల శాసన సభలో ఒక సామరస్య సూచకమైన వాతావరణం ఏర్పడింది. నివేదిక, నివేదికతోబాటు పొందుపరచిన బిల్లులు శాసన సభ ఆమోదించి, వాటి ప్రకారం శాసనం ప్రవేశపెట్టాలని తీర్మానం అంగీకరింపబడింది.