నా జీవిత యాత్ర-4/జమీందారీ ఎంక్వైరీ కమిటీ నివేదిక

వికీసోర్స్ నుండి

3

జమీందారీ ఎంక్వైరీ కమిటీ నివేదిక

ప్రప్రథమంగా, జమీందారీలకు సంబంధించిన తీర్మానాలు శాసన సభలో ప్రతిపాదించి నపుడు కొంతమంది సభ్యులు అడ్డుపెట్టిన మాట వాస్తవము. అయితే, అవి సంప్రదాయ రీత్యా పెట్టిన అభ్యంతరాలని భావించాము. కాని, రానురాను పరిశీలన సాక్ష్యసేకరణ జరుగుతున్న సమయంలో ప్రీవీకౌన్సిల్ తీర్పులు ఏ పరిస్థితులను స్థిరపరిచాయో ఆ పరిస్థితులకు భిన్నంగా కమిటీవారు సేకరిస్తున్న సాక్ష్యం ఉన్నదని, అలా చేయడం న్యాయవిరుద్ధమని మొదలుగాగల వాదాలు పత్రికల మూలంగా బయలుపడి ఒక నూతన, వైషమ్యాత్మకమైన వాతావరణాన్ని కలిగించాయి. ప్రీవీ కౌన్సిల్ తీర్పుకు వ్యతిరేకంగా మనం శాసనం చేయవచ్చునా - చేయరాదా అన్న ప్రశ్న, శాసన సభలకు గల హక్కు లేమిటన్న ఒక ఉప ప్రశ్న, దాని పైన శాసన సభ్యులకు గల విజ్ఞాన పరిమితులు మొదలుగాగల విషయాలన్నీ చదువుకొన్న పెద్దలు రచ్చబండపైకి తీసుకు రావడం తటస్థించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ముఖ్యమా? లేక ప్రజల హక్కు, అధికారం, సుఖ దు:ఖాలు అన్నవి - అనగా "ప్రజాస్వామ్యం" ముఖ్యమా? అన్న మౌలిక సమస్య పరిష్కారం చేయవలసిన సమయం వచ్చింది. దీనితో, ప్రకాశంగారికి ముఖ్యమంత్రిగారు విముఖులయ్యారనే కింవదంతి శాసన సభలోను, వార పత్రికలలోను, క్లబ్బులలోను ప్రబలింది. కమిటీ ఆరంభించిన నాలుగైదు నెలలకు ప్రకాశంగారు, ముఖ్యమంత్రిగారు పరస్పర సంభాషణలు మానుకున్నారనే మాటకూడా ఎక్కడబడితే అక్కడ చెప్పుకొంటూ వచ్చారు. మంత్రివర్గంలో కూడా మంత్రులు రెండు పక్షాలై ఈ మాట వచ్చినప్పుడెల్లా ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. కమిటీలో ఒక జమీందారు సభ్యుడుగా ఉండేవారు. ఆయనకు సహాయంగా ఒక శాసన సభ సభ్యుడు (ముస్లిం లీగు) ఉండేవారు. చర్చలు ఎంత రహస్యంగా ఉంచినా అవి ఇంతో అంతో బయటకు వచ్చేవి. అలా వచ్చే వాటిలో సగమే సత్యముండేది. ఈ అర్ధ సత్యం పూర్తి అసత్యంకన్న ప్రమాదకరమన్న విషయం రుజువైంది.

ఒకరోజు డ్రాప్ట్‌లో జమీందార్లందరు దేశ ద్రోహులు (Traitors) అని వ్రాశారు. దానిపైన నేను, 'అంతమందీ దేశ ద్రోహులు ఎలా అవుతారు? మనమే కోరి విజయనగరం రాజాను మెంబరుగా చేర్చుకున్నాం కదా' అని, ఆ వాక్యం సవరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ప్రక్కన పెన్సిలుతో వ్రాశాను. ప్రకాశంగారికి దాని వల్ల నా మీద చాలా ఆగ్రహం కలిగింది. అప్పట్నుంచి డ్రాప్ట్‌లు పూర్తి అయ్యేవరకు నాకు పంపించడం మానివేశారు. ఆ కోపం తగ్గాక, ఆ విషయం ఆయనా, నేనుకూడా పట్టించుకోలేదు.

ఈ లోపున కమిటీ కార్యదర్శిగా, 1786 దగ్గరనుంచి రెవిన్యూ శాఖ పెర్మనెంటు సెటిల్మెంటుకు సంబంధించిన పాత రికార్డులు, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ తీర్పులు, ప్రభుత్వపు ఆర్డర్లు, తీర్మానాలు, అంతకు పూర్వం జమీందారీకి సంబంధించిన శాసనాలు, పెర్మనెంటు సెటిల్మెంటుకు మూలమైన అన్ని కాగితాలు - సేకరిస్తూ ఉంటే ఆ చర్య అంతా ఒక ఆధునిక మహాభారతమై, చూసేవారికీ వినేవారికీ మహాశ్చర్యం కలిగించింది. ఈ సంఘానికి ప్రకాశంగారు అధ్యక్షులు కావడంచేత, తమకు లాభం తప్పక కలుగుతుందని, కరాచీకాంగ్రెసు తీర్మానం ప్రకారం మధ్యవర్తులైన జమీందారులు పోతారనీ, జమీందారీ విధానం అంతం కాగలదనీ రైతులు ఆశపడ్డారు. ప్రకాశంగారు ఒకప్పుడు జమీందారుల తరపున న్యాయవాదిగా ఉండడంచేత, న్యాయవాది గనుక ప్రీవీకౌన్సిలువంటి ఉన్నత న్యాయస్థానపు తీర్పులను గౌరవించే తీరుతారని, సంఘంలో జస్టిసు పార్టీకి చెందిన ఒక జమీందారు, వారికి బలంగా ముస్లింలీగువారు కూడా ఉండడంచేత పరిస్థితులు అంతగా విష మించవనీ; అలా కాకపోయినా ముఖ్యమంత్రిగారు ప్రకాశంగారికి విముఖులు గనుక ప్రకాశంగారిని అడ్డవలసిన విధంగా అడ్డగలరనీ - జమీందారులూ, వారి న్యాయవాదులూ, వారి మిత్రులూ, వారికి మిత్రులైన శాసన సభ సభ్యులూ చెప్పుకుంటూ ఉండేవారు. ఈ అభిప్రాయ భేద కల్లోలాలలో ప్రకాశంగారు మాత్రం తాను వ్రాయవలసింది వ్రాసుకొంటూ, మౌనదీక్ష వహించి, దూషణ భూషణలకు అతీతులై ఉండేవారు.

అయితే, జమీందారులంతా కలసి పెద్ద ప్రయత్నం చేయడానికి తలపెట్టి, తమలో తాము చందాలుకూడా వేసికొని, శ్రీ కె. ఎం. మున్షీ గారిని ఒక లక్షరూపాయల ఫీజుమీద తమ సలహాదారుగా నియమించి, వల్లభాయ్ పటేలుగారి దగ్గరకు తమ తరపున విజ్ఞప్తిచేయడానికి పంపించారు. శ్రీ మున్షీ కాంగ్రెసు నీతిప్రకారం జమీందారీ పద్ధతి రద్దు చేయడానికి వ్యతిరేకంగా వెళ్ళడం సమంజసం కాదని మేమంతా అభిప్రాయపడ్డాము. ఎందుచేతనంటే - ఆ రోజులలో ఆయన అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో సభ్యుడుగానూ కాంగ్రెసుకు సన్నిహితుడుగాను ఉండేవాడు.

ఈ లోపున రిపోర్టు పూర్తిచేయడం జరిగింది. కాని, మెంబర్లు అందరి సంతకాలు కావడానికి, ప్రకాశంగారు వ్రాసిన అభిప్రాయాలతో ఏకీభవించేటట్లు చేయడానికి రెండు మూడుమార్లు అంతా సమావేశం కావలసి వచ్చింది. ఇందులో ముఖ్యంగా అభ్యంతరకరం అనిపించిన విషయం - జమీందారీల రద్దుమాట అట్టేపెట్టి, ప్రప్రథమంలో 1802 లో, అనగా పెర్మనెంటు సెటిల్మెంటు జరిగిన నాటి సిస్తులకు సిస్తురేట్లు అన్నీ తగ్గించవలసినదని ఉత్తర పూర్వపక్షాలు విమర్శచేసిన ప్రకాశంగారి సిద్దాంతము. సిస్తులు హెచ్చు చేయవచ్చునా కూడదా అనే విషయం గురించి పెర్మనెంటు సెటిల్మెంటు అయిన తర్వాత రెండు మూడు పర్యాయాలు గవర్నమెంట్ బోర్డు ఆఫ్ రెవిన్యూవారు ఆలోచించారు. అయితే, కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడినవి. పేష్‌కష్ అనగా - జమీందారు ఏటేటా ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తం నిర్ణయించే సందర్భంలోను, రైతుల దగ్గిర సిస్తులు పెంచి వసూలు చేయవచ్చునా కూడదా అన్న విషయంలోనూ జమీందారులు మొదట్లో సవ్యమైన పద్దతిలో వెళ్ళినట్లు కనిపించదు. ధనాశ చూపించి పెద్ద ఉద్యోగులను గవర్నరుతో సహా - తమకు అట్టి హక్కులు సంక్రమించినవన్న వాదం బలపరచుకొనేలాగున వారు చేసికొన్నారు. రైతులలో ఆందోళన బయలుదేరింది. ఇది ఈస్టిండియా కంపెనీ డైరక్టర్లకు తెలిసి, ఈ విషయంగా రహస్యంగా పరిశీలించడానికి ఒక సంఘాన్ని వేయడం జరిగింది. ఆ పరిశీలన ఫలితంగా ఆనాటి చెన్నరాష్ట్ర గవర్నరును ఉద్యోగంనుంచి తప్పించడంకూడా జరిగింది.

ఇంతేకాక, మొదట్లోఉన్న రెగ్యులేషన్స్ (శాసనాల) ప్రకారం సిస్తులు హెచ్చించడానికి జమీందార్లకు హక్కులేదు అనే విధి ఉండెను. దీనికి సంధించిన కాగితాలను ప్రకాశంగారి ముందు సేకరించి పెట్టగా, ఆయన జమీందారీలను తక్షణం రద్దు చేయాలన్న ప్రతిపాదనపై ఉన్న దృష్టి మరల్చుకొని, అన్ని జమీందారీలతో ఉన్న సిస్తురేట్లు 1802 నాటి రేట్లకు దించివేయాలనే అభిప్రాయం గట్టిగా ఆయనకు కలిగినది. అయితే, 1858 - 1908 లలో చేసిన శాసనం ప్రకారంగా ఆనాటి రేట్లు స్థిరపరుపబడి, ఇరవై సంవత్సరాలకొకసారి దినుసులు ఖరీదులు జాస్తి అయినట్లయితే రూపాయకు రెండు అణాలు రెవిన్యూ కోర్టులో పిటీషనులువేసి హెచ్చు చేయించుకొనే హక్కు ఇవ్వబడింది. ఇలాంటి పరిస్థితులలో 1802 రేట్లు పునరుద్దరించడం ఎలాగన్న శంక మెంబర్లకు కమిటీ సభ్యులకు, వృత్తిచేస్తూన్న లాయర్లకు కలిగింది. 1908 శాసనాలు తప్పయినట్లయితే వాటిని ఎందుకు సవరించకూడదు? రైతులకు మేలు ఎందుకు చేయకూడదు? అని ప్రకాశంగారి వాదన.

ఎలాగైతే నేమి, కమిటీ సభ్యులలో కాంగ్రెసు వారందరు - ప్రకాశంగారు కాక, మిగతా అయిదుగురు, రిపోర్టును ఆమోదించి సంతకాలు పెట్టారు. జమీందారు మెంబరు, జస్టిస్‌పార్టీ మెంబరు, ముస్లిం లీగు మెంబరు ఇది కాదని వారి వ్యతిరేకతను ప్రత్యేకంగా వ్రాసుకొన్నారు. దీని తరువాత ఘట్టం ఇంకా విచిత్రంగా జరిగింది. కమిటీ మెంబర్ల సంతకాలయిన వెంటనే, రిపోర్టు పూర్తిగా అచ్చుకావడానికి టైము చూచుకొని ఏదో తేదీని నిర్ణయించి, ఆ తేదీన శాసన సభలో నివేదిక అంద జేయడానికి నోటీసులను ఇవ్వడం జరిగింది. ఎజెండాలో ఈ విషయంకూడా అచ్చయింది. ఆ ఉదయం స్పీకరు సాంబమూర్తిగారు నాకు టెలిపోనుచేసి, తమను అర్జంటుగా వచ్చి చూడమని చెప్పారు. నేను వెళ్ళగానే, తమకు, గవర్నరుకు జరిగిన సంభాషణ సారాంశం చెప్పారు. గవర్నరుగారు ఫోనుచేసి స్పీకరును ఒకమారు కలుసుకో వాలన్నారు. స్పీకరు నాటి సెషను కాగానే కలుసు కుంటాననగా గవర్నరు అంతకుముందే కలుసుకోవలె నన్నారట. విషయమేమని స్పీకరు అడగగా, గవర్నరుగారు కమిటీ రిపోర్టు శాసన సభకు ఆరోజుకు అందజేయకుండా ఆ విషయం వాయిదా వేయరాదా అన్నారట. కాన్స్టిట్యూషనల్ గవర్నరు అయిన ఎల్‌స్కిన్ ప్రభువు ఆ విధంగా స్పీకరును కోరడం అన్నది చాలా అసందర్భము. ఆ మాట అలా ఉంచండి. ఆయన ఎందుకలా కోరారు? గవర్నమెంటు వారు ముందుగా ఆలోచించ కుండా, ఒక నిర్ణయానికి రాకుండా సభకు నివేదికను అందజేయడం మంచిది కాదుకదా అన్నది గవర్నరు అభిప్రాయము. దానిమీద సాంబమూర్తి గారు మాట తప్పించి, గవర్నరు ముఖ్యమంత్రితో ఈ విషయం మాట్లాడారా అని ప్రశ్నించారట. గవర్నరు ఫోనులోనే నవ్వి, "అది మీరు ఎలా కనిపెట్టా"రని అడిగారట. దానిపైన సాంబమూర్తిగారు గవర్నరు కోరినట్లే ముఖ్యమంత్రికూడా కోరి, తనతో అవే మాటలను అన్నట్టు గవర్నరు చెప్పారట. దానిపై తెలివైన న్యాయవాదులైన సాంబమూర్తిగారు ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయకూడదా అని గవర్నరు అంటే, సాంబమూర్తిగారు - అది ఎంత మాత్రం వీలుపడదనీ, శాసన సభ నియమించిన సంఘం నివేదికను శాసన సభకే అందజేయాలి కాని, గవర్నమెంటు కిచ్చే వీలులేదనీ, ఎజెండా పత్రికలలో వచ్చిన తరువాత దావాయి వేస్తే కొంపలు అంటు కుంటాయనీ, అసలది ముఖ్యమంత్రికే మంచిది కాదన్నారుట. గవర్నరు సాంబమూర్తిగారు చెప్పినది బాగుందని అలాగే కానిమ్మన్నారుట.

సాంబమూర్తి గారు ఈ విషయా లన్నీ నాతో చెప్పి, "నేను ప్రకాశంగారి కింకా ఈ విషయాలు చెప్పలేదు. నీవు వెంటనే వెళ్ళి చెప్పిరా. నేను తర్వాత మాట్లాడుతాను" అని చెప్పారు. ముఖ్యమంత్రికి అంతకాలంగా ప్రకాశంగారితో మాటలు లేకపోయినా, ఆనాడు స్వయంగా ప్రకాశంగారి దగ్గరకు వెళ్ళి, నివేదికను ఆపుచేయ కూడదా అని అడిగినట్టూ, ఆయన దానిని సహజంగానే నిరాకరించినట్టూ నాకు తర్వాత తెలిసింది. వారు నిరాకరించిన తర్వాత స్పీకరును ఉపయోగించి నివేదికను ఆపడానికి యత్నించడం పార్లమెంటరీ విధానానికి అపకృతి. అంతకన్నా కూడా ప్రజాస్వామ్యానికి హెచ్చు అపకృతి - ఈ విషయంలో గవర్నరుగారిని కూడా రంగంలోకి దించటం

నేను ప్రకాశంగారి వద్దకు వెంటనే వెళ్ళి, సాంబమూర్తి గారు చెప్పినదంతా యథాతథంగా చెప్పగా, ఆయన "అవునులే! ఈ దేశంలో అన్ని వ్యవహారాలూ తలక్రిందులుగానే జరుగుతాయి!" అన్నారు.

ఆ రోజున నివేదిక ఇచ్చినపుడే రాబోయె జనవరి 20 వ తేదీన శాసన సభలో దానిని చర్చించే సమయమని నిర్ణయం జరిగింది. ఇలా ఉంటూండగా, కొద్ది రోజులలో ప్రశ్నోత్తర సమయంలో ఈ కమిటీ విషయం వచ్చింది. ప్రశ్నోత్తర సమయాలలో ప్రకాశంగారి తరపున నేనే - రెండు మూడు సమయాల్లో తప్ప, ఎప్పుడూ జవాబులు చెప్పడం జరిగేది. ఆ ప్రశ్న వచ్చినపుడు, నేను దానికి జవాబుగా, రిపోర్టు శాసన సభకు అందించడమైనదని, జనవరి 20 వ నాడు జరిగే చర్చపై శాసన సభవారు చేసే తీర్మానాన్ని బట్టి శాసనం ఎప్పుడు ఎలా చేసేది తెలుస్తుంది అనీ అన్నాను.

ముఖ్యమంత్రిగారు వెంటనే నా చేయి తట్టి, "అలా జవాబు చెప్పవద్దు. గవర్నమెంటు వారు నిర్ణయిస్తారని చెప్పు," అన్నారు.

ఇంతట్లో సప్లిమెంటరీగా అనుబంధ ప్రశ్న వచ్చింది. నేను తిరిగీ మొదట చెప్పిందే మరింత విపులంగా, గట్టిగా చెప్పాను. ముఖ్యమంత్రిగారికి కోపం, అసంతృప్తి కలిగినట్లు నాకు కన్పించింది.

తిరిగి ఆయన నాతో, ఈ మారు సప్లిమెంటరీ ప్రశ్నకు జవాబులో మాట మార్చి తాను చెప్పినట్లు చెప్పవలసిందన్నారు. దానిపై నేను "మీరు మామాలుగా చేసే పద్ధతిలో నిల్చొని, ఆ జవాబు మీకు ఉచితమని తోస్తే మార్చివేయండి," అన్నాను.

నేను నిలిచింది ప్రకాశంగారి తరపున గనుక, ముఖ్యమంత్రిగారు చొరవచేసి జవాబు మార్చరని నాకు లోపల ఒక విశ్వాసం ఉండే అలా చెప్పాను. ఆయన మరి మాట్లాడలేదు. అది అప్పటికి ఆగిపోలేదు. మరికొంత సేపయిన తర్వాత ముఖ్యమంత్రిగారు చటుక్కున నా వైపు తిరిగి, జవాబులు ప్రొసీడింగ్స్‌లో (అంటే - శాసన సభలో జరిగే ఉత్తర ప్రత్యుత్తర, సంభాషణ, ఉపన్యాసముల యథాతథమైన రిపోర్టు) సరిదిద్దవలసిందని చెప్పారు. నేను అలా కుదిరే వ్యవహారం కాదని నిష్కర్షంగా, మర్యాదగా, మెల్లగ ఆయనకు చెప్పేసరికి, ఆయన ఇంగ్లీషులో "యూ ఆర్ ఇన్‌కారిజిబుల్ (you are incorrigible) అన్నారు. ఈ విషయాలు నేను ప్రకాశంగారికి చెప్పలేదు. అప్పటికే ఇద్దరి మధ్య వైషమ్యాలు హెచ్చుగా ఉన్నపుడు అగ్గిమీద గుగ్గిలం వేసినట్టు, ఈ విషయం చెప్పడం ఎందుకని నేను ఊరుకొన్నాను.

శాసన సభలో చర్చ వచ్చేనాటికి నివేదిక అంతా సభ్యులు చదివి ఉండడంవల్ల, జన బాహుళ్యానికి కూడా నివేదిక యథాతథంగా తెలియడంవల్ల వాతావరణంలో ఒక బ్రహ్మాండమైన నవ్యత్వం ఆవిర్భవించింది. ప్రకాశంగారు కేవలం తాను పట్టిందే పట్టు అనే మనిషి అన్న అపప్రథకూడా తగ్గింది. పాత రికార్డులు, పెర్మనెంటు సెటిల్మెంటు నాటి గవర్నమెంటు వాగ్దానాలు, వివాదాలు పరిష్కారం చేసే సమయంలో లోగడ రెవిన్యూ మెంబర్లు ఇచ్చిన ఉపన్యాసభాగాలు అందరికీ తెలిసేసరికి, ఇదివరకు అభ్యంతరం పెడుతున్నవారి సానుభూతి చాలమటుకు ప్రకాశంగారియెడల దినదినాభివృద్ధిగా పెరిగింది. శాసన సభలో ఈ నివేదిక చర్చ జరిగే జనవరి 20 వ తేదీ ఒక పర్వదినంవలె కన్పిం చింది. అన్ని జిల్లాల్లోంచి జమీందారీ రైతులు గుంపులు గుంపులుగా చెన్నపట్నం చేరుకున్నారు. చర్చ ఆరంభించడానికి రెండుగంటల ముందే సభామందిరపు ఆవరణమంతా వారితో నిండిపోయింది.