నా జీవిత యాత్ర-4/ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణము (1953)

వికీసోర్స్ నుండి

18

ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణము (1953)

ప్రకాశంగారి కబురు అందుకొనివచ్చి, సంజీవరెడ్డిగారు ఆయనను చెన్నపట్నంలో కలుసుకొన్నారు. రెండు పర్యాయాలు కలిసి చర్చించిన ఫలితంగా, జవహర్‌లాల్ నెహ్రూగారితో ఈ విషయం చర్చించడానికి నిర్ణయించారు.

సంజీవరెడ్డిగారు ఇలా ప్రకాశంగారితో కలుసుకోవడం, ఆయన సీనియరులైన గోపాలరెడ్డి, వెంకటరావుగారలకు ఇష్టంలేదు. అలాగే ప్రకాశంగారు సంజీవరెడ్డిగారితో ముచ్చటించడం, ప్రకాశంగారి అనుయాయులకు చాలా మందికి ఇష్టంలేదు.

ఇష్టంలేకపోయినా - ప్రకాశంగారు, నేనూ వారందరినీ ఒప్పించ గలిగాము.

పార్టీసమావేశ మొకటి ఏర్పాటుచేసి, ప్రకాశంగారి చర్యను ఆమోదిస్తూ, ఆ చర్యలు శాంతంగా సాగించవలసిందని తీర్మానం వ్రాసుకొన్నాము.

దీంతో ఆంధ్రదేశంలో అందరినీ ఆవరించిన స్తంభనంపోయి, నిర్మాణాత్మకమైన ఒక సంచలనం కలిగింది. తమిళ జిల్లాలలోకూడా కలవరము, సంతోషమూ రెండూ కలిసి, రాజకీయవాదుల మనస్సులను భాధించసాగాయి. కొందరికి సంతృప్తి కలిగింది.

ఆ తర్వాత రంగస్థలం ఢిల్లీకి మారింది.

ఢిల్లీలో ప్రకాశం, నెహ్రూగారల కలయిక

జవహర్‌లాల్ నెహ్రూగారు నిర్ణయించిన తేదీకి ప్రకాశంగారు, నేనూ ఢిల్లీ వెళ్ళాము. అక్కడ కాన్ట్సిట్యూషన్ హౌసులో బస చేశాము. సంజీవరెడ్డిగారు అంతకు ఒకరోజు ముందుగానే వెళ్ళారు.

ఆ తర్వాత రోజున నెహ్రూగారిని సంజీవరెడ్డిగారు కలుసుకోడానికి వెళ్ళారు. నెహ్రూగారు రెడ్డిగారితో, "ఏమయ్యా సంజీవరెడ్డి! మీ ముసలివానితో వేగడం చాలా కష్టము. ఆయన ఈ రోజున వస్తాడని నా ఇతర కార్యక్రమాలన్నీ రెండు గంటలు వాయిదా వేసుకొన్నాను. ఆయన వచ్చాడు కాడు. చూశావా ఆయన వైఖరి?" అన్నారు.

అందుకు సంజీవరెడ్డిగారు, "అదేమిఅలాగు అంటారు? ఆయన మిమ్మల్ని పదకొండు గంటలకు కలుసుకోవడానికి, వచ్చి సిద్ధంగానే ఉన్నారు. ఆయన యిక్కడికి వస్తున్నట్టు మీ పేర తంతివార్తకూడా యిచ్చారు," అన్నారు.

నెహ్రూగారు "నాకు ఏ తంతివార్తా అందలేదు," అన్నారు. అందుకు "ఆ తంతివార్త యిచ్చినప్పుడు నేను వారి దగ్గర ఉన్నాను. అందకపోవడం ఏలాగు జరిగింది?" అని ప్రశ్నించారు రెడ్డిగారు.

నెహ్రూగారు తమ పెర్సనల్ అసిస్టెంటును వెంటనే పిలిచి, "ప్రకాశంగారి దగ్గరనుంచి తంతివార్త వచ్చిందా?" అని ప్రశ్నిస్తే, ఆయన "వచ్చింది," అన్నాడు.

"ఎప్పుడు?" అని నెహ్రూగారు మళ్ళీ అడిగారు. "మొన్న" అని ఆయన జవాబిచ్చాడు. అది విని, "సరే వెళ్లు," అన్నారు నెహ్రూగారు.

తనకు తంతివార్త ఎందుకు చూపించలేదని నెహ్రూగారు ఆయనను అడగనైనా అడగలేదు.

అవి, బహుశ: ఢిల్లీ నగర సచివాలయ మర్యాదలు కాబోలు!

సంజీవరెడ్డిగారు వెంటనే కాన్ట్సిట్యూషన్ హౌసుకు వచ్చి, అక్కడ జరిగిందంతా మాకు చెప్పారు.

ఏర్పాటు చేసిన ప్రకారం ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు, నెహ్రూగారు కలుసుకొన్నారు. ఒక గంటసేపు చర్చించిన ఫలితంగా విభజన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక ఉప సంఘాన్ని నియమించడానికి అంగీకరించారు. లెక్కలు వగైరాల విషయమై, పూర్వము విభజన సంఘము చేసిన ఏర్పాట్లు ఆధారంగా తీసుకొని కచేరీల విభజన, ఉద్యోగస్థుల పంపకము, క్రొత్త రాష్ట్రంలో చేసుకోవలసిన ఏర్పాట్లు మొదలైన విషయాలు ఈ సంఘానికి పనిగా అప్పజెప్పారు.

అయితే, అంతకుపూర్వం శాసన సభ్యులు నూతన ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధాని పట్నంగా ఏదో ఒక పట్నాన్ని నిర్ణయించుకోవాలి. ఇదికూడా పూర్వము విభజన సంఘం చేసిన సూచనలలో ఒకటే.

అపుడు, సవ్యంగా సరిఅయిన రాజధాని పట్నం ఏర్పాటు చేసుకొనే వరకు, చెన్నపట్నంలో తాత్కాలికంగా ఆంధ్ర ప్రభుత్వం నడపడానికి అవకాశం ఇవ్వవలసిందని, ఆ విభజన సంఘంలో ప్రకాశంగారు గట్టిగా పట్టుపట్టారు. తమిళ సభ్యులు దానికి అంగీకరించలేదు. మిగిలిన ఆంధ్ర సభ్యులు తమిళులతో ఏకీభవించారు. అప్పుడు విభజన ఆగిపోవడానికి ఇదికూడా ఒక పెద్ద కారణము. ఇది అయిన సంవత్సరం తర్వాతనే కదా శ్రీరాములుగారు ప్రాయోపవేశము చేసినది!

ఆయన ప్రాయోపవేశం జరిగిన తర్వాత, చెన్నపట్నం వదులు కోవడానికి ఒప్పుకొన్న తర్వాత 'శుభస్య శీఘ్ర' మని మా కనిపించింది. ఇప్పుడు శాసన సభ్యులు తాత్కాలిక రాజధాని పేరు సూచించగానే, ఈ విభజన సంఘం పని ఆరంభించగలదని నెహ్రూగారు, ప్రకాశంగారితో ఆ సమావేశంలో అన్నారు.

తాత్కాలిక రాజధానిని సూచించడానికి ఆంధ్రప్రాంతానికి చెందిన శాసన సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడానికి అధికారరీత్యా ఆదేశం పంపుతామని ఆయన చెప్పారు. మేము తిరిగి వచ్చేసరికి, ఆ ఆదేశం చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దాని ప్రకారం చెన్నరాష్ట్ర శాసన సభామందిరంలో శ్రీ ప్రకాశంగారి అధ్యక్షతన ఆంధ్ర శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పూర్వం ముందుగా ప్రకాశంగారు - కృషికార్‌లోక్ పార్టీ తరపున గౌతులచ్చన్న గారినీ, కమ్యూనిస్టు పార్టీ తరపున టి. నాగిరెడ్డిగారినీ ఆహ్వానించారు.

శాసన సభ్యులు నూతన రాజధానిని సూచించాలి అనే ప్రతిపాదన బయటపడిన నెలరోజుల దగ్గరినుంచి, అన్ని జిల్లాలలోను ఈ తాత్కాలిక రాజధాని 'మా పట్నంలో, ఉండాలంటే - మా పట్నంలో ఉండాలి' అన్న తీవ్రమైన వాగ్వివాదాలు బయలుదేరాయి.

సహజంగా ప్రకృతి సౌందర్యాన్నిబట్టి, ఉండే సౌకర్యాలనుబట్టి విశాఖపట్నం అనువైన స్థలమని విశాఖపట్నం శాసన సభ్యులమంతా అనుకొన్నాము.

గోదావరి జిల్లాల ప్రసక్తి, రాలేదు.

కృష్ణా, గుంటూరు జిల్లాలు కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య హెచ్చుగా ఉన్న జిల్లాలు గనుక, తాత్కాలిక రాజధాని ఆ ప్రాంతంలో ఉండాలనీ, అది విజయవాడ - గుంటూరుల మధ్య ఎక్కడో ఏర్పాటు కావాలనీ - కమ్యూనిస్టులు అతి తీవ్రమైన ప్రచారం లేవదీశారు.

సంజీవరెడ్డిగారు మాట్లాడడంలో అప్పుడు ఎంతో ఆత్మనిగ్రహం కనబరిచారు. అయితే, రాయలసీమ సభ్యులలో, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక రిద్దరు తప్ప మిగిలినవా రంతా - 1938 లో సర్కారు జిల్లాల వారికీ, రాయలసీమ జిల్లాల వారికి జరిగిన ఒడంబడిక ప్రకారం ఆంధ్రా యూనివర్శిటీ కోస్తా జిల్లాలలో ఏర్పాటయింది గనుక, తాత్కాలిక రాజధాని అయినా రాయలసీమలో ఏర్పాటు కావాలనీ, అలా కాకుంటే తాము చెన్నరాష్ట్రంలోనే ఉండిపోతామనీ దాదాపు అందరూ సంతకం పెట్టిన కాగితం జేబులో పెట్టుకుని, సమయం వస్తే సభలో చదవడానికి సిద్దమై కూచున్నారు.

లోగడ, వీరు విద్యా విషయంలో ఆంధ్రా యూనివర్శిటీ యాజమాన్యం ఒప్పుకోమని మద్రాసు యూనివర్శిటీ యాజమాన్యంలో ఉండిపోయిన విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. ప్రాంతీయాభిమానాలు చాలా బలీయము లైనవి కదా!

ఈ పరిస్థితులలో, రాజధానిని సూచించడానికి పై చెప్పిన అదికార సమావేశాన్ని ప్రకాశంగారు తమ యింటిదగ్గర ఏర్పాటు చేశారు.

అనేక పట్నాలనుంచి, ఆయా పట్నాలకు చెందిన మిత్రులు, తమ పట్నాలలో గల సౌకర్య సంపదల ఛాయా చిత్రాలను తెచ్చి, ఆ సమావేశ సభ్యులకు చూపించి, ప్రచారాలు చేసుకో నారంభించారు.

ఉదయం ప్రకాశంగారి యింటిలో జరిగిన సమావేశంలో దీర్ఘమైన చర్చ జరిగింది.

విశాఖపట్నం విషయమై నేను ఆ సభలో ఉండడము మిగిలిన జిల్లాల సభ్యుల నందరినీ ఏకంచేసి, "మీకు హార్బరు ఉంది. షిప్ యార్డు ఉంది. ఈ విషయంలో మీరు విశాఖపట్నం పేరు చెబితే మేము ఒప్పుకొనేది లేదు," అని వారు చెప్పడానికి కారణమైనది.

రాయలసీమకు, శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం తాత్కాలిక రాజధాని యివ్వవలసిందే. అది, తిరుపతిలో ఉన్నట్లయితే చిత్తూరు జిల్లా మనతో కలసి వస్తుందనీ, లేకుంటే కలిసిరాదని తిరుపతిలోగల భవనాల బొమ్మలు చూపుతూ మిత్రులు గౌతు లచ్చన్నగారు వాదించారు.

కడపలోగల భవనాల చిత్రాలు చూపుతూ, కె. కోటిరెడ్డిగారు చాలాసేపు చెప్పారు.

తాత్కాలిక రాజధాని యిచ్చినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు గనుక, దానిని గుంటూరు - బెజవాడ మధ్య ఉంచాలని కమ్యూనిస్టులు వాదించారు.

రాష్ట్రం ఏర్పాటులో ఒక విధమైన ప్రధానపాత్ర వహించడంవల్ల, సంజీవరెడ్డిగారు - అనంతపురం, రాయలసీమ ప్రాంతాలలో కొంచెం సమ శీతోష్ణ వాతావరణం గల స్థలమయినా, తాను ఆ విషయం ప్రచారం చేసుకోవడం భావ్యం కాదని ఊరుకున్నారు. దానికి తోడుగా, అనంతపురం విషయమై ప్రసక్తి వచ్చినపుడు, ప్రకాశంగారు "సంజీవరెడ్డి అనంతపురం విషయమై ప్రచారం చేసుకోడులేండి" అని, సంజీవరెడ్డిగారికి ఒకవేళ మాట్లాడుదామన్నా అవకాశం ఇవ్వలేదు.

ఆలాగుననే విశాఖపట్నం విషయమై, "విశాఖపట్నంకోసం వేరేప్రచార మెందుకయ్యా?" అని అట్టే చర్చ అక్కరలేకుండానే వదిలి పెట్టారు.

చివరికి ఒంటిగంట అయినా, ఏ నిర్ణయానికీ రాలేకపోయాము. ఇక నిర్ణయానికి రాలేము అన్న భావం ఒకటి మా అందరికీ కలిగింది. కాని, ఆ రోజు ఆ నిర్ణయం చేసుకోక తప్పదన్న అత్యంత అవసరమును కనిపెట్టి, ప్రకాశంగారిపైనే ఈ నిర్ణయభారం వదిలివేద్దామని ఎవరో మెల్లిగా అన్నారు. అందరు గట్టిగా ఆ అభిప్రాయంతో ఏఖీభవించారు.

"అయితే, మీ రంతా మూడు గంటలకు రండి. తిరిగి సమావేశమవుతాము. అందులో నా నిర్ణయం చెపుతాను," అన్నారు ప్రకాశంగారు.

మూడు గంటలకు తిరిగి ప్రకాశంగారి గదిలో కూచున్నాము. ప్రకాశంగారు, "లచ్చన్నగారూ! ఒక కాగితం, పెన్సిలూ పట్టుకోండి," అన్నారు. తర్వాత "నా నిర్ణయం చెప్తాను. ఆ పేరు కాగితంమీద వ్రాయండి," అన్నారు.

అక్కడ కూడిన ఏడెనిమిది మందిమీ ఒక కన్ను ప్రకాశం గారిమీదా, రెండవది లచ్చన్న గారి పెన్సిలుపైనా ఉంచి చూస్తున్నాము.

ప్రకాశంగారు, "వ్రాయండి! 'కర్నూల్‌' అని వ్రాయండి" అన్నారు.

అందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంలో మునగడం జరిగింది.

కాగితంమీద 'కర్నూల్‌' అని వ్రాయక తప్పదని, లచ్చన్నగారు వ్రాశారు.

నవ్యాంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని జన్మ, నామకరణం ఆ క్షణంలో జరిగింది.

అందరూ లేచి ఎవరి మానాన వారు వెళ్ళారు.

శాసన సభా కార్యదర్శికి - ఆంధ్ర శాసన సభ్యులు సమావేశంలో తాత్కాలిక రాజధానిగా కర్నూలును ప్రతిపాదిస్తున్న తీర్మానం, నోటీసు టైపు చేయించి పంపారు.

ఇది రాయలసీమలో ఏర్పాటయినది గనుక, సంజీవరెడ్డిగారు ప్రతిపాదిస్తున్నట్టు సంతకం వద్దనుకొన్నారు. ఇవి కోస్తా జిల్లాలవారి సంతకంతో ఉండడం భావ్యమని భావించారు.

"గౌతు లచ్చన్నగారు ఒక పార్టీ అధినేత గనుక, ఆయన ఈ నోటీసుమీద సంతకం పెడితే బాగుంటుంది," అన్నాను నేను. "నువ్వు ఉన్న పార్టీ అంతకన్నా పెద్దది కాబట్టి నువ్వే ఈ నోటీసుపై సంతకం పెట్టాలి," అని నాతో అన్నారు ప్రకాశంగారు.

శాసన సభ్య సమావేశంలో, నేను ప్రతిపాదించిన తీర్మానానికి ప్రత్యామ్నాయంగా, ప్రతిపక్షంవారు మరొక తీర్మానం పంపించారు. సభాప్రారంభంలో నా తీర్మానం మొదట ఎజండాలోకి తీసుకొన్నారు గనుక, వారి తీర్మానాన్ని నా దానికి ఎమెండ్‌మెంట్ (సవరణ)గా తీసుకోవాలని నా వాదన. రెండు తీర్మానాలూ సమానస్థాయిలో చర్చించవచ్చని వారి వాదని.

శాసన సభా కార్యనింబంధనలలో ఒకే కాలమందు ఒకే ప్రతిపాదన చర్చించవచ్చుగానీ, రెండు స్వతంత్ర ప్రతిపాదనలను చర్చించకూడదని ఉండడంచేత అది కూడదని నా వాదన.

మొత్తంమీద - కాంగ్రెసు పార్టీ, కృషికార్ లోక్‌పార్టీ, ప్రజా సోషలిస్టుపార్టీ, కొందరు స్వతంత్ర సభ్యులు ఒకవైపునఉండి మెజారిటీలో ఉండడంవల్ల, నా ప్రతిపాదన ప్రకారం కర్నూలా, లేక వారి సవరణ ప్రకారం విజయవాడ - గుంటూరుల మధ్యభాగమా అన్నది తేలవలసి ఉంది. అందులో ఒకటి ఆమోదిస్తే, రెండవది వీగిపోయిందనేమాట నిశ్చయమే గనుక, అంతగా దెబ్బలాడుకోవలసిన విషయం కాదు.

అయినా, చాలా తీవ్రమైన వివాదం సాగింది. అసలు ముందురోజు ప్రకాశంగారి నిర్ణయానికే రాజధాని పేరు వదులుతా మన్న వారు, ఆ రోజు ఆ నిర్ణయానికి బద్దులై ఉండవలసింది. కానీ, ఆ విధంగా బద్దులమయి ఉండవలెనని, శాసనరీత్యా నిర్బంధ మేమీ లేదుకదా?

ప్రశ్న తిరిగీ లేవదీయడంవల్ల అనవసరమైన వాదోపవాదములకు చోటివ్వడం జరిగింది. ప్రకాశంగారి నిర్ణయం ఏకగ్రీవంగా ఒప్పుకొనిఉంటే, అనవసరమైన తగవులతో వ్యయం చేసిన మేధాశక్తి ఎంతో నిర్మాణాత్మకమై ఉండేది. కానీ ఇటువంటి తగాదాలన్నీ చారిత్రాత్మకంగా అగత్యాలవలె తోస్తూ ఉన్నవి.

శాసన సభ్యుల చర్చ మూలంగా, దేశంలో ముఖ్యంగా బెజ వాడలో ప్రతిపక్షులకు గల స్థానబలము, అంగబలములకు తోడు, అక్కడి ప్రజల సహజ స్వనగరాభిమానము కూడా తోడై, రాజకీయమైన ఉష్ణతను అత్యుగ్రతకు తీసుకువెళ్లాయి.

రాత్రి అయ్యేసరికి, ప్రకాశంగారికి విజయవాడ అభిమానులవద్దనుంచి ట్రంక్‌కాల్స్, తంతి వార్తలు రాసాగాయి.

తీర్మానం మార్చకపోతే, ప్రకాశంగారి కంచు విగ్రహం ప్రజలు బద్దలు కొట్టేస్తారనే భయం కలుగుతున్నదని కూడా ఆ వార్తలలో చెప్పారు.

ప్రకాశంగారు, "ఆ కంచు విగ్రహం పెట్టవలసిందని నే నెవరి నైనా కోరానా? దాన్ని పెట్టిన ప్రజలకు, దాన్ని బద్దలు కొట్టుకొనే హక్కు తప్పకుండా ఉంటుంది కదా?" అన్నాడు.

ప్రకాశంగారి నిర్లిప్తత బెజవాడలో ప్రజల ఆవేశాన్ని పూర్తిగా తగ్గించివేసింది.

కర్నూలు పేరు ఆయన చెప్పడానికి కారణ మిది: "విశాలాంధ్ర రాష్త్రం త్వరలో ఏర్పడడానికి అవకాశముంది. భాషారాష్ట్రాల ఏర్పాటు విషయమై, నెహ్రూగారు ఒక ఉపసంఘం వేశారు. అందుచేత, త్వరలో - విశాలాంధ్రరాష్ట్రం రావడము తప్పదు. అప్పుడు హైదరాబాదు మన రాజధానికాక తప్పదు.

"కర్నూలు, హైదరాబాదుకు వెళ్ళే త్రోవలో ఉంది. మరొక కారణమూ ఉంది. ఒకటి రెండు సంవత్సరాలు తాత్కాలికంగా రాజధాని అక్కడ ఉండినట్లయితే, రాయలసీమ జిల్లా కేంద్రాలన్నిటిలోను చాలా వెనకబడ్డది కావడంచేత, రాజధాని ఉన్న రెండు, మూడు ఏండ్లయినా, అది అభివృద్ధి పొందడానికి వీలు కల్పించిన వాళ్ళ మవుతాము."

కర్నూలు తాత్కాలికంగా రాజధాని అనడంలో హైదరాబాదు మనకు వచ్చినా, రాకపోయినా, మన మన్ని పరిస్థితులను సావకాశంగా ఆలోచించి, శాశ్వతమైన రాజధానిని ఏర్పరచుకోవాలన్న భావం ఇమిడి ఉంది. ఇపుడు పాఠకుల దృష్టిలోకి ఇంకొక విషయం తేవాలి.

'రాబోయే ఆంధ్రరాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?' అనే ప్రశ్న పుట్టవలసిన అగత్యమే లేకపోయింది. అంతమందీ - ప్రకాశంగారే ముఖ్యమంత్రి కావాలనీ, అవుతారని అనుకున్నారు.

అయితే, కొందరు శాస్త్రీయవాదులు ప్రకాశంగారిలో కన్నా తమలోనే హెచ్చు కాంగ్రెసు తత్త్వమున్నదనే తీవ్రవాదులై, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్ప మరొకరు ముఖ్యమంత్రి కాకూడదన్న వాదం లేవదీశారు.

ఇతర రాష్ట్రాలలో కాంగ్రెసు బలం హెచ్చుగా ఉండడం చేతనూ, కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వమే నడుస్తూ ఉండడం చేతనూ, ఆంధ్ర శాసన సభ ఏర్పాటయినపుడు, ప్రకాశంగారి ప్రజా సోషలిస్టు పార్టీలో కన్నా, కాంగ్రెసులోని శాసన సభ్యుల సంఖ్య కొంచెము ఎక్కువగా ఉంటుంది గనుకనూ - ప్రకాశంగారు కాంగ్రెసులో కలిస్తే తప్ప ముఖ్యమంత్రి కాకూడదన్న హ్రస్వదృష్టిగల కాంగ్రెసు వాదులు అభ్యంతరం పెట్టడం మొదలు పెట్టారు. ఈ సమస్య అంతా ఢిల్లీకి వెళ్ళింది.

వార్తా పత్రికలలో "ప్రకాశంగారు కాంగ్రెసులో చేరుతారా?" అనే ప్రశ్నతో వార్తలు పడ నారంభించాయి. ప్రకాశంగారు మాత్రం, ఆ విషయమై ఏమీ వ్యాఖ్యానం చేయక మౌనం వహించారు. అయితే, ఆయన - తన అనుయాయులకు, తాను కాంగ్రెసులో చేరడం ఇష్టం లేదన్న సంగతి గ్రహించారు.

నెహ్రూగారు కూడా అట్టే విశాలదృష్టి చూపించలేదు. ప్రకాశంగారు - కాంగ్రెసులో చేరకపోయినా ప్రజాసోషలిస్టుపార్టీని వదిలి - ఏ పార్టీకి చెందని వ్యక్తిగా, తన వ్యక్తిగతమైన ఔన్నత్యంతో పార్టీలకు అతీతులుగా, సకలాంద్రులకు ఏకైక నాయకులుగా వ్యవహరించాలని ఆయన బుజ్జగించారు. ప్రకాశంగారు, మాతో ఎవరితోను చెప్పక నెహ్రూగారికి అలాగేనని మాట యిచ్చేశారు.

ఆ దెబ్బతో మా పార్టీ పలుకుబడి కొంత తగ్గిపోయింది. అయి నప్పటికీ ఆయనమీద వ్యక్తిగతంగా ఉన్న గౌరవంచేత, ఆంధ్రరాష్ట్ర మవతరిస్తున్నదన్న ఆత్మతృప్తిచేత పార్టీలో ఉన్నవారు అట్టే గలభా చేయలేదు.

కాంగ్రెసుకు ప్రత్నామ్నాయపక్షంగా ఉండి, ప్రజాస్వామ్యంపై నమ్మకంగల పెద్ద పార్టీ దీనితో క్షీణదశకు వచ్చింది. ఇంతేగాక, మరి కొంతకాలానికి ప్రజాపార్టీతో కలిసిన సోషలిస్టులు విడిపోయి కాంగ్రెసుతో కలసిపోవడంవల్ల మొదటి కె.ఎమ్. ప్రజాపార్టీ వారెవరో, వారు మాత్రం మిగిలారు. 1956 వరకు, వారికి మంత్రివర్గంలో ఒక స్థాన ముండేది. ఇపు డదికూడా లేక పార్టీ నామమాత్రావశిష్టమైంది.

అయినా, అందులో - సత్యాహింసలపైన పూర్తి నమ్మకం గలవారు, ప్రకాశంగారిలాగే దేశముకోసం త్యాగం చేసినవారు ఆయన వలెనే స్వయంపోషక గ్రామ స్వరాజ్య ప్రాతిపదికపై దేశ శాంతి, సామ్యస్థితి, మానవతాగౌరవములను సంస్థాపన చేయడంలో నమ్మకమున్నవారు ఉండడంవల్ల, గౌరవంగా, నిరాడంబరంగా రాజకీయ రంగంలో మిగిలి ఉంది.

ఇక ప్రస్తుత విషయము:

ఆంధ్రరాష్ట్రానికి కావలసిన ముఖ్యమంత్రిత్వము ప్రకాశంగారికి చేకూరగా, కాంగ్రెసు తరపున సంజీవరెడ్డిగారికి ఉప ముఖ్య మంత్రిత్వము డిల్లీలో తెరవెనుకనే ఏర్పాటయింది.

తరువాత, వేయవలసిన అడుగులు తొందరగానే పడ్డాయి. సంజీవరెడ్డిగారు, గౌతులచ్చన్నగారు, ప్రకాశంగారి వంతున నేను ఉన్న ఒక చిన్న ఉప సంఘాన్ని, పంజాబు గవర్నరుగా పనిచేసి విశ్రాంతి తీసుకొంటున్న సి.ఎమ్. త్రివేదిగారి అధ్యక్షత క్రింద నెహ్రూగారు నియమించారు.

మాకు కార్యదర్శులుగా పనిచేయడానికి, ఇద్దరు ఐ.సి.ఎస్. ఉద్యోగులను ఇవ్వవలసిందని చెన్నరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దానిపై ఓ. పుల్లారెడ్డి, వి.కె. రావు గారలనే ఐ.సి.ఎస్. ఉద్యోగులను మా ఉప సంఘానికి కార్యదర్శులుగా నియమించారు. క్రొత్త రాష్త్రానికి ఎంతమంది ఐ.పి.ఎస్., ఐ.ఏ.ఎస్. ఉద్యోగులు ఉండవలెనో సూచిస్తూ, వారి పేర్లతో సహా మా సలహా సంఘంతో ప్రమేయం లేకుండానే ఏర్పాట్లు చేశారు. ఇక మేము చేయవలసిన పని - మిగతా శాఖలలో సీనియారిటీని బట్టి ఉద్యోగులను అన్నిశాఖలకు ఎన్నుకోవడము; వారు ఒప్పుకోకపోయినా, లేక చెన్నరాష్ట్ర ప్రభుత్వంవారు వారిని విడుదల చేయము అన్నా మరి ఒకరిని ఎన్నుకోవడము.

ఈ యత్నంలో, సహజంగా తెలుగు ఉద్యోగస్థులు పెద్దా చిన్నా యావన్మంది కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు అయ్యారు.

క్రొత్త హైకోర్టు ఆంధ్రలో పెట్టడానికి నిర్ణయించలేదు గనుక, హైకోర్టు విభజన విషయమై మేమేమీ చేయవలసిన పని లేకపోయింది.

ఆంధ్రదేశానికి, మిగులు చెన్న రాష్ట్రానికి మధ్య విభజించిన గవర్నమెంటు పరిశ్రమలు, అప్పులు - ఆస్తుల పట్టీలు అన్నీ ఇదివరలోనే తయారయిపోయి ఉండడంవల్ల, ఆంధ్రరాష్ట్ర శాసనం ఆలస్యం కాకుండా ఢిల్లీ శాసన సభలో పాసయింది.

ఉద్యోగుల విభజనేగాక, రికార్డులన్నీ విభజించాలి. సచివాలయ గ్రంథాలయం విభజించాలి. ఉద్యోగులతో బాటు రావలసిన కుర్చీలు, బల్లలు వగైరాలు విభజించాలి. వీటికి తగిన సూత్రాలన్నీ మేము సలహా సంఘంలో వ్రాస్తూ ఉంటే, ప్రభుత్వం తదనుగుణంగా ఆర్డర్లు జారీ చేయాలని ఏర్పాటు.

సెప్టంబరు 1 న, మా ఉప సంఘం పని, ఫోర్టు సెంటుజార్జి సచివాలయంలో గవర్నరుకు ఏర్పాటుచేసిన గదిలో ప్రారంభించాము.

ఎవరో కొందరు తెలుగు ఉద్యోగులు మాత్రమే చెన్నరాష్ట్రం క్రిందే ఉండిపోతామని ఉండిపోయారు. ఐ.పి.ఎస్; ఐ.ఏ.ఎస్. ల జాబితాలో తెలుగువారు తక్కువమందే ఉండిరి. ఐ.పి.ఎస్., ఉద్యోగులు ముగ్గురే ఉన్నట్టు జ్ఞాపకము. ఇతర రాష్ట్రాలలో పెద్ద ఉద్యోగాలలో ఉన్న కొందరిని ఆంధ్రరాష్ట్రంలోకి తీసుకురావడానికి యత్నించాము. కానీ, ఆ ప్రభుత్వాలు అంగీకరించలేదు. ఈ సందర్భంలో ఒక ముచ్చట చెప్పాలి. బొంబాయిలో పి. డబ్ల్యూ. డి. నీటిపారుదల చీఫ్ ఇంజినీరు ఆంధ్రుడు. ఆలిండియా ఇంజనీరింగ్ శాఖకు చెందినవాడు. ఆయనను ఆంధ్రరాష్ట్రానికి ఇవ్వవలసినదని, బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయిగారిని మేము కోరాము. త్రివేదిగారు - మా సంఘానికి అధ్యక్షులు గనుక, కాబోయే గవర్నరు గనుక ఆ చీఫ్ ఇంజనీరును మాకు ఇవ్వవలసిందని కోరగా, వారు 'తెలుగు రాజ్యానికి తెలుగువాడే ఉండాలని ఎందుకు మీకు పట్టుదల?' అంటూ నిరాకరించారు.

డాక్టర్ కె. ఎల్. రావుగారు ఢిల్లీలో పెద్ద ఉద్యోగములో ఉన్నప్పటికీ, ఆలిండియా ఇంజనీరింగ్ శాఖకు చెందినవాడు కాడు గనుక, తెలుగు రాష్ట్రానికి చీఫ్ ఇంజనీరుగా తీసుకొనేందుకు వీలు లేదన్నారు.

చివరికి చెన్నపట్నంలో చీఫ్ ఇంజనీరుగా పదవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకొంటున్న ఎల్. వెంకటకృష్ణయ్యగారిని చీఫ్ ఇంజనీరుగా కాంట్రాక్టుపైన తీసుకోవలసి వచ్చింది.

మనకు అనేక శాఖలకు అధిపతులుగా (హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్) ఉండడానికి అర్హతకలిగినవారు లేకపోవడం జరిగింది.

ఇక్కడి ఉద్యోగాల విషయమై ఈ పనులు చేస్తూ, కర్నూలులో అక్టోబరు 1 నాటికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఉద్యోగులను నియమించడం జరిగింది.

కర్నూలులో వసతులు కల్పించడానికి, అవసరమైనచోట్ల రోడ్లు వేయించడానికి, వెడల్పు చేయించడానికి, ఎలక్ట్రిక్ సప్లయి చేయించడానికి, మంచినీటి సరఫరా చేయించడానికి, సచివాలయం పెట్టడానికి అనువుగా కర్నూలు కలెక్టరు ఆఫీసు భవనంలో తగిన మార్పులు చేర్పులు చేయడానికీ, పెద్ద ఉద్యోగులకు వసతి గృహాలు, సచివాలయంలో పనిచేసే అన్ని తరగతులవారికి భవనాలు, అవి కుదరనిచోట డేరాలు నిర్మించడానికి నలభై లక్షల రూపాయలు మంజూరు చేశారు. పై చెప్పిన ఏర్పాట్లను చురుకుగాను, సవ్యంగాను జరిపించే బాధ్యత మా సంఘంపైనే పడింది.

ప్రభుత్వంవారు ఆర్డర్లు పాస్ చేయడం తప్ప, ఎక్కువ ప్రమేయం కల్పించుకోలేదు.

ఇలాఉండగా, పోర్టు సెంటుజార్జిలో బల్లల విషయమై, రికార్డుల విషయమై, పుస్తకాల విషయమై, గుమస్తాలకు గుమస్తాలకూ మధ్య చాలా తగాదాలు వస్తున్నాయనీ, మంచిబల్లలు వారుంచుకొని, విరిగిన బల్లలు, కుర్చీలు ఆంధ్రరాష్ట్రాని కిస్తున్నారనీ, పుస్తకాలు రెండేసి కాపీలు ఉన్న ఒక కాపీ అయినా అందనీయకుండా ఉన్నారనీ అరగంట కొకసారి మా ఉప సంఘానికి ఫిర్యాదులు వస్తూండేవి.

జ్ఞాతులు ఆస్తులు పంచుకొనేటప్పుడు, పై చేయిగలవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా తెలుగు ఉద్యోగులయెడల తమిళ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని వచ్చి మాకు చెపుతూండేవారు.

ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగంలో ఉన్న పుల్లారెడ్డిగారు, క్రొత్త రాష్ట్రంలోకి వెళ్ళిపోతున్నారనే వార్త ఎప్పుడైతే రూఢి అయిందో, అప్పటినుంచి తమిళ ఉద్యోగులు ఆయన మాటకూడా అట్టే పాటించేవారు కారు.

కేవలం తెలుగు జిల్లాలకు సంబంధించిన రికార్డులేవైనా ఉంటే వాటి అసలు కాపీలే తెలుగు రాష్ట్రానికి ఇచ్చి వేయవలసిందనీ, తెలుగు తమిళ రాష్ట్రాలు రెంటికీ సంబంధించిన కాగితాలుంటే అసలు వారు ఉంచుకొని, వాటికి నకళ్లు వ్రాసి మన కివ్వాలనీ సూత్రీకరించాము.

ఆ విధంగా పని జరగడం ప్రారంభమయినా, ఇప్పుడు ప్రకాశంగారి జీవితచరిత్ర వ్రాసే సందర్భంలో, అనేక రికార్డులు కావాలని మన ప్రభుత్వాన్ని అడిగితే, వారు వెతికించగా, అవి చెన్నపట్నం నుంచి నేటివరకు రాలేదని తేలింది. అందుచేతనే, నేను వ్రాసిన విషయాలకు సంబంధించిన గవర్నమెంటు ఆదేశాల సంఖ్యలుగాని, తేదీలు గాని యివ్వకుండా వాటిలోని విషయాలు మాత్రం సూచింపగలుగుతున్నాను. రికార్డులన్నీ భవిష్యత్తులో సమగ్రంగా పరిశీలించగలిగే అవకాశము ఎవరికైనా కలిగితే, ప్రకాశంగారి జీవితచరిత్ర, దానితో అవినాభావ సంబంధంకల ఆంధ్రదేశచరిత్ర ఇంతకన్నా సమగ్రంగా వ్రాయడానికి వీలవుతుంది. ఆ విధంగా వ్రాయవలెకూడా.

అక్టోబరు 1 నాటికి ఒక దినం ముందుగానే, శాసన సభ్యులు, ప్రకాశంగారు, గవర్నరుగారు, ఆహ్వానితులైన అనేకమంది పెద్దలు కర్నూలు వెళ్ళారు. ఒక లక్షమందికిపైగా ప్రజలు గుమిగూడారు.

మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా ఏవో భేదాభిప్రాయం వచ్చి రంగాగారు హాజరు కామన్నారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు భవనం ఒకదాన్ని గవర్నర్ బంగళా క్రింద మార్చడం జరిగింది. నెహ్రూగారు, రాధాకృష్ణన్‌గారు బస చేయడానికి తాత్కాలికంగా రెండు వసతి గృహాలు కట్టి, ఆధునికమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కలగజేశారు. పట్నానికి కొంచెం దూరంలో నెహ్రూగారు, రాధాకృష్ణగారు వచ్చే విమానం దిగడానికి కూడా ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సమయంలో ఆంధ్రదేశమంతా ఉప్పొంగింది.

అంతకు ఒకవారం ముందునుంచి, అక్టోబరు 1 న గాక, ఒకరోజు ముందుకాని, ఒకరోజు తర్వాతగాని యీ అవతరణోత్సవం జరుపవలసిందని జ్యోతిష్కులూ, జ్యోతిషం తెలిసిన పెద్దలూ ప్రకాశంగారికి ఉత్తరాలపైన ఉత్తరాలు వ్రాయడం మొదలు పెట్టారు.

లెక్కల సౌకర్యంకోసం ఒకటవ తేదీ నిర్ణయింపబడిందనీ, అది మార్చితే లెక్కల ఇబ్బందులు వస్తాయనీ ఉద్యోగుల ఆక్షేపణ రెండో ప్రక్కనుంచి వచ్చింది.

ప్రకాశంగారేమో, "జ్యోతిష్కులు చెప్పిన అభ్యంతరాల ననుసరించి, రాజ్యాలు నడిపించే కాలము కా"దన్నారు.

అసలు జ్యోతిష్కులు చెప్పినదానిలో తనకు వ్యక్తిగతంగా నష్టం వస్తుందని ఉన్నదేగానీ, ఆంధ్రదేశ జాతకానికి నష్టం వస్తుందని లేనందున, తనకు వచ్చే నష్టం ఒక లెక్కలోది కాదన్నారాయన.

"ఎంత శుభ సమయాన, జ్యోతిష్కులు చెప్పినట్టు మంత్రి అయినా, కలకాల మెవడూ మంత్రిగా ఉట్టి కట్టుకు ఊగబో"డన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీకి తాను అడ్డు రానన్నారు.

ఆంధ్రరాష్ట్ర శుభారంభము

జవహర్‌లాల్ నెహ్రూగారు దాదాపు ఇరవై అడుగుల ఎత్తు వేదికపైనుంచి, రాజ్యావతరణ దీపం వెలిగించి, సహజ గాంభీర్య వచన రచనలతో ఉపన్యాసము సాగించారు. రాధాకృష్ణగారు ఆశీర్వదించారు. వారి ఉపన్యాసంలో ఏ విధమైన లోటూ లేదు. కాని, అతిజాగ్రత్తగా 'అమర జీవి పొట్టి శ్రీరాములు' అనే అక్షర క్రమం తమ మాటలలోకి రాకుండా మాట్లాడగలిగారు.

తొలి ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకరణ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకాశంగారు, శ్రీయుతులు డి. సంజీవయ్య, కోటిరెడ్డి, గవర్నర్ త్రివేది, తెన్నేటి విశ్వనాథం, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. (Courtesyː P. I. B.)

రాష్ట్రమేమో క్రొత్తది, రాష్ట్ర విభజనలో అప్పుల పంపకమే అయింది. ధనరూపకమైన ఆస్తి నిల్వ లేవీ లేవు. అయినా, రాజ లాంచనాలతో, ఆ సమయానికి తగినట్టుగా, ఆ స్థలానికి వీలైనట్టుగా ఉపరాష్ట్రపతిగారికి, భారత ప్రధానిగారికి - గవర్నరుగారు, ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు అతిథి మర్యాదలు నడిపించారు.

ప్రకాశంగారు, ఆ తెల్లవారుజామున నా కొక ఉత్తరం వ్రాసి పంపించారు.

"నేను ఏర్పాటు చేయబోయే మంత్రి మండలిలో నిన్నొక మంత్రిగా తీసుకుంటున్నాను. అనుమతి పంపించవలసింది," అని ఉన్నది అందులో.

మాటల్లో ఈ విషయం అంతకు ముందు అనుకోకపోయినా, ఉప సంఘంలో నన్ను సభ్యునిగా వేసినపుడే ఇటువంటి ఏర్పాటు కాగలదని మే మనుకొన్న విషయమే. గౌతు లచ్చన్నగారు ఒప్పుకోక పోవడంవల్ల ఆ రోజున మంత్రిమండలిలో ఆయన పేరు గవర్నరు గారికి, ప్రకాశంగారు ఇవ్వలేకపోయారు.

నెహ్రూగారికి, ప్రకాశంగారు తమ పేరు, సంజీవరెడ్డిగారి పేరు, నాపేరు చూపి, త్వరలో మరొక నలుగురు మంత్రులను వేసుకొంటామని చెప్పారు.

ప్రకాశంగారు నా పేరు ఇచ్చినప్పుడు, నెహ్రూగారు "విశ్వనాథాన్ని కాంగ్రెసులో చేరమని మీరు అడగ కూడదా?" అన్నారట. అందుకు ప్రకాశంగారు "నేను అతనిని చేరమని అడగను. అతను చేరనూ చేరడు. ఈ విషయము మనము అలాగే ఉంచేయవలసిందే," అన్నారట. ఈ విషయము నాకు రాధాకృష్ణగారు చెప్పారు.

శాసన సభలో మాకున్న మెజారిటీ మొదట్లో బాగా ఉందనుకున్నా - మాలో ఉన్న కొందరు, తమలో ఉన్న ఒకరికి మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణం మనసులో ఉంచుకొని, ఆదర్శ భేదాలు నెపంగా చెప్పి, ప్రతిపక్షంలో కలిసిన తర్వాత, ప్రభుత్వానికి సంఖ్యాబలం తగ్గింది.

రాష్ట్రావతరణ దినాన నే నున్న పార్టీలో 27 మంది సభ్యులుండేవారు. ఆ సాయంకాలం అందులో 25 గురు మా యింటి దగ్గర సమావేశమై, నేను మంత్రి పదవి స్వీకరించడం అత్యవసరమనీ, మంచిపని చేశాననీ అభినందిస్తూ, ఒక తీర్మానంకూడా వ్రాసి ఆమోదించారు.

అయితే, ఇందులో కొందరు ఒక నెల రోజులు గడిసేసరికి, ఆ రోజున సభకు రాని మిత్రుని అభిప్రాయానుసారం నానుంచి విడిపోయారు.

అందుచేత, ప్రభుత్వ పక్షాన మాకు పదికన్నా హెచ్చు సంఖ్యాబల ముండేదికాదు.

శాసన సభా కార్యక్రమంలో సంఖ్యాబలం, నైతిక బలంకన్నా హెచ్చయినది. అందుచేతనే, పరిపాలనా విధానంలో నైతిక బలం ఫలించడం కోసమని చెప్పి, ముఖ్యమంత్రులు, ప్రధానులు సంఖ్యాబలం కోసం పలు పాట్లు పడుతూ ఉంటారు. కొందరు సంఖ్యాబలమే ప్రధానంగా చూచుకొని నైతిక బలానీ ధారపోస్తారు. పదవీ సౌభాగ్య మనుభవిస్తారు.

మరికొందరు (ఇట్టి వారు కొందరే ఉంటారు!) నైతిక బలానికే ప్రాధాన్యమిచ్చి, సంఖ్యాబలం కోసం యత్నించక పతన మవుతారు.

ఇందులో మొదటి తెగవారు రాజకీయ ప్రమాణాలు దిగజారడానికి అవకాశా లిస్తారు.

రెండవ తెగవారు నైతిక ప్రమాణాన్ని, ఔన్నత్యాన్ని దిగజార నివ్వరు. వీరు ఒక్కొక్కప్పుడు పదవీచ్యుతు లౌతారు కూడా. పదవి పోయినా, ప్రజల హృదయాలలో ప్రేమాను బంధితులై ఉంటారు.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఈ రెండవ తెగకు చెందినవారు.

అట్టివారే జీవితచరిత్ర కధనానికి అర్హులు.