నా జీవిత యాత్ర-4/క్రొత్త పార్టీ స్థాపన

వికీసోర్స్ నుండి

17

క్రొత్త పార్టీ స్థాపన

అప్పట్లో, చిరస్మరణీయులైన కాళేశ్వరరావుగారు[1] ప్రకాశంగారి పక్షంలో ఉండేవారు. మే మందరమూ (అంటే, ప్రకాశంగారు, రంగాగారి వర్గీయులమంతా) కలిసి వారి యింట్లో సమావేశమయ్యాము. చివరి క్షణంలో, మాలో నలుగురు అకారణంగా మంత్రి వర్గం వారిలోకి మలినప్రవేశం చేయడంవల్ల కలిగిన ఓటమికి ఎవరూ నిరుత్సాహ పడకూడదనీ, మంత్రులుచేసే అధికార దుర్వినియోగం, దొంగ కాంగ్రెస్ మెంబరుల జాబితా నిర్మాణం ప్రజలకు బోధపరిచినట్లయితే వారందరూ ఎన్నికలలో తిరిగి ఓడిపోగలరనీ అందరికీ దృడవిశ్వాసం కలిగింది.

ప్రతి జిల్లాలోనూ ప్రకాశం, రంగా వర్గాల అనుయాయులు చేయవలసిన కార్యక్రమంకూడా కొంతవరకు వ్రాయడం జరిగింది. నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను.

ఆ రాత్రి - బాగా రాత్రివేళ - మా వర్గాలకు చెందినవారు కార్యక్రమం వివరాలు ఆలోచించుకోడానికి కూర్చుంటూండగా, ఒక క్రొత్త సమస్య బయలుదేరిందట.

" 'కాంగ్రెసు మంత్రులు ఓడిపోతారు,' అని మన మంటున్నాము. వా రిప్పుడేమో అధికారంలో ఉన్నా, ఎన్నికలలో నిలబడతారు కదా! ఎవరిమీద మనం దోషారోపణ చేస్తున్నామో వారు ఎన్నికలలో నిలబడినప్పుడు, కాంగ్రెసు సభ్యులుగా ఉంటూ, వారిని ఓడించవలసిందని ప్రజలకు ఏ విధంగా చెప్పగల" మన్న ప్రశ్న ప్రకాశంగారినీ, రంగాగారినీ, కాళేశ్వరరావుగారినీ వేధించింది.

"మంత్రివర్గానికి వ్యతిరేకంగా దొంగతనంగా ప్రచారం చేయడం కాంగ్రెసు తత్వానికి వ్యతిరేకం ..... పెద్దమనిషి తరహాకు ప్రతి కూలం...."

"అయితే, మనం మౌనంగా ఉండవలసిందేనా?" "అలా ఊరుకున్నట్టయితే, అధికారదుర్వినియోగం చేసినవారికి 'ప్రజలపై దండెత్తి దోచుకు తినండి,' అని చెప్పినట్టవుతుంది గదా!"

ఇటువంటి ప్రతిబంధకాలు పరిశీలించగా, కాంగ్రెసునుంచి విడిపోవడం మంచిదనే ఒక భావం బయటపడింది.

ఆంధ్రదేశంలో కాంగ్రెసును పెంచిన దెవరు?

ఆ పెంచిన ప్రకాశం, కాళేశ్వరరావు, రంగాగారలు మొదలయిన త్యాగశీలురు యావన్మందీ వారు నిర్మించిన ఇల్లు విడిచి పోవలసిందేనా? పోకుంటేగానీ పరిష్కారమార్గం లేదా?

కాని, వేరే పరిష్కారమార్గం కనిపించలేదు. అధిష్ఠాన వర్గానికి పట్టాభిగారు, రాజాజీల మూలంగా ప్రకాశంగారి వర్గం ప్రతికూలమయింది. అది నిస్సందేహము.

చివరికి, కాంగ్రెసుకు రాజీనామా యిచ్చివేయడమే ప్రజా రాజ్య సంరక్షణకు తరుణోపాయమనే నిశ్చయానికి వారంతా వచ్చేశారు.

అలా వచ్చినవెంటనే తెలుగుజిల్లాలలో ప్రకాశం, రంగాగారల వర్గాలవారందరూ కాంగ్రెసునుంచి విడిపోయారు. [2] తెలుగు జిల్లాల రాజకీయ స్వభావం ఆ క్షణంలో మారిపోయింది.

ప్రకాశంగారు, రంగాగారు వెంటనే 'ఆంధ్ర ప్రజాపార్టీ'ని క్రొత్తగా స్థాపించారు. ఈ పార్టీ తరపున ప్రతి జిల్లాలోను, ప్రతి ముఖ్యకేంద్రంలోను తక్షణ కార్యక్రమోపక్రమణానికై చురుకుగా ఎడ్‌హాక్ (తాత్కాలిక) సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు, కొందరు ఉప నాయకులు హ్రస్వదృష్టితో ప్రకాశం, రంగాల వర్గాలు అనే అనవసరమైన, దేశ నష్టకరమైన విభేదాలు కల్పించారు. విభేద బీజాలు నాటగానే వేరుతన్నే శక్తిగలవై ఉంటాయి. అదే జరిగింది. తర్వాతి అధ్యాయంలో ఈ పరిణామాన్ని గురించి వ్రాస్తాను.

కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ

1947 లో పార్టీ సభ్యులలోనే కొందరు ప్రతికూలురు, క్రమబద్ధంగా ఉండాలనే నిర్భంధం లేకుండా, గాంధీ తత్వానికి కార్యరూపం ఇవ్వడానికి ప్రారంభించిన ప్రకాశంగారిని పదవీచ్యుతిని చేసే పన్నుగడల సమయంలో - న్యాయ అన్యాయ సూక్ష్మతను గ్రహించలేని కాంగ్రెసు అధినేత కృపలానీగారికికూడా, 1951 నాటికి కాంగ్రెసు నుంచి వెలుపలికి పంపబడే అవకాశాలు వచ్చాయి.

1917 లో గాంధీగారు నూతన అహింసామార్గ ప్రతిష్ఠాపకులై, సాత్త్విక నిరోధ ప్రక్రియను బ్రిటిష్ నీలిమందు తోటల పెద్దలపై ప్రయోగించే సమయంలో - సింధు ప్రాంతంలో తాను ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసులో వహిస్తున్న ఉన్నతోద్యోగాన్ని వదలి, గాంధీగారి సహచరుడై పనిచేసిన పెద్దమనిషి కృపలానీగారు. ఆయన పన్నెండు ఏండ్లు కాంగ్రెస్ ముఖ్య కార్యదర్శిగా ఉండి, తరువాత కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖుడు.

అటువంటి ఆయన స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేండ్లకు కాంగ్రెసునుంచి విరమించుకోవలసి వచ్చింది. అలాగుననే, 1946 జనరల్ ఎన్నికల తరువాత బెంగాలుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ పి.సి. ఘోష్‌కూడా కాంగ్రెసుకు రాజీనామా చేయవలసి వచ్చింది. లండనులో డాక్టర్ ఆఫ్ సైన్సు బిరుదు పొంది, కలకత్తా యూనివర్శిటిలో ప్రొఫెసరుగా ఉండి గాంధీగారి పిలుపు అందుకొని దేశంకోసం సర్వమూ త్యాగంచేసిన మహావ్యక్తి ఆయన.

1951 జూనులో, కృపలానీగారు - తనతోబాటూ, తనవలెనే కాంగ్రెసునుంచి విడిపోయిన వారినందరినీ పాట్నాలో సమావేశపరిచారు. వారందరూ కలిసి ఒక పార్టీగా రూపొందాలని నిర్ణయమైంది. నాటి ఉదయం అక్కడ పార్టీపేరు నిశ్చయమైంది. సభలో ఎవరి సలహాపైననో 'ప్రజాపార్టీ' అనే మాటకు ముందుగా 'మజుదూర్‌' అనే మాట కలిపారు. రంగాగారి సలహాపైన దానికి ముందు 'కిసాన్‌' అన్న మాటకూడా కలిపారు. 'ప్రజాపార్టీ' అన్నది అందరి సభ్యుల ఆమోదాన్ని పొందడంచేత ఆ పార్టీకి - "కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ" అనే నామకరణం జరిగింది.

ఆ మధ్యాహ్నం మహాసభకు నాలుగైదువేలమంది హాజరయ్యారు. కృపాలానీగారు కాంగ్రెసు సంస్థలో జరుగుతున్న పక్షపాతము, బంధుప్రీతి, అధికార దుర్వినియోగము మొదలైన పరిస్థితులు వర్ణించి, ఆ దుర్గుణాలు లేని రాజకీయ సంస్థ ఒకటి ప్రారంభించడం ప్రజలకు శ్రేయస్కరమని భావించి - తాను, ప్రకాశంగారు, పి.సి.ఘోషుగారు మొదలైనవారు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పి, పార్టీకి ఆ ఉదయం పెట్టిన పేరు వగయిరా విషయాలు వివరించి, పార్టీ ఇతర వివరాలు, ప్రోగ్రాము వ్రాయడానికి నలుగురితో కూడిన ఒక ఉపసంఘం ఏర్పడేటట్టు చెప్పారు. అందులో తాను, ప్రకాశంగారు, కిద్వాయిగారు, [3] డాక్టర్ పి.సి. ఘోషుగారు సభ్యులనీ ఆయనే చెప్పారు. సాదిక్ అలీ అనే యువకుణ్ణి (ప్రస్తుతం పాత కాంగ్రెసు సంస్థలో ముఖ్యుడు) కార్యదర్శిగా నియమించారు.

కృపలానీగారు ఉప సంఘ సభ్యుల పేర్లు చెపుతున్నప్పుడు, వెనకనుంచి ఒక మిత్రుడు లేచి, అందులో రంగాగారి పేరు ఉండాలని కేక వేశాడు.

"ఇది చిన్న ఉప సంఘము. దక్షిణ ప్రాంతీయులకు ప్రాతినిధ్యానికి ప్రకాశంగారి పేరు ఉండనే ఉంది గనుక, రంగాగారి పేరు పార్టీ కార్యనిర్వాహకవర్గం ఏర్పాటు చేస్తున్నపుడు వేసుకొంటా"మని కృపలానీగారు చెప్పారు.

కార్యదర్శిగా సాదిక్ అలీ పేరు చెప్పినప్పుడు, తిరిగీ అదేమిత్రుడు, 'రంగాగారిని కార్యదర్శిగా అయినా వేయండి' అని కేకలు వేశాడు.

అందుకు కృపలానీగారు, "నేను చేస్తున్న పని నాకు తెలుసు. నాకు కార్యదర్శి అంటే నేను చెప్పేమాటలు, ఉత్తరాలు వ్రాసుకొంటూ నావెంట తిరిగే మనిషి. రంగా పెద్దవారు. ఆయనకు ఇవ్వవలసిన స్థానము ఎలాగూ ఇస్తాము. మీరు అనవసరంగా ఇక్కడ గలభా చేయకండి," అన్నారు.

ఆ విషయం అంతటితో ఆగిపోయింది.

మిగిలిన కార్యక్రమం సాఫీగా జరుగుతున్నది. కాని, రంగాగారు చడీచప్పుడు లేకుండా ఆ హాలులోంచి ఏదో పనిమీద అవతలకు వెళుతున్నట్టుగా వెళ్ళారు. అక్కడ ఒక పత్రికా విలేఖరిని ఆవరణలోకి పిలిచి, అక్కడ ఏర్పాటయే పార్టీ ఏమీ పనిచేసే పార్టీ కాదన్న భావం వెలిబుచ్చి, దాంతో తన సంబంధాన్ని అప్పుడే వదలుకొంటున్నట్టు చెప్పి, కలకత్తా వెళ్ళిపోయారు.

అక్కడ - క్రొత్తపార్టీతో సంబంధం వదులుకోవడమే గాక, ఆంధ్రజిల్లాలలో ప్రకాశంగారితో కలిసి తాను ఏర్పరచిన 'ఆంధ్ర ప్రజాపార్టీ' నుంచి గూడా విడిపోతున్నట్టు పేర్కొని, "కృషికార్ లోక్‌పార్టీ" అనే క్రొత్త పార్టీని తాను స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.

ఎన్నికలలో అద్భుత విజయము

ప్రకాశంగారు తిరిగివచ్చి చెన్నరాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగారు. 1952 ఎన్నికలకు అభ్యర్థులుగా తెలుగు జిల్లాల్లోను, చెన్నపట్నంలోను మాత్రం లోక్‌సభకు, రాష్ట్ర శాసన సభకు 117 గురు అభ్యర్థులను నిలబెట్టారు. ఇదిగాక, దక్షిణ జిల్లాలనుంచిగూడా అనేకులను నిలబెట్టారు. ఇందులో సర్కారు జిల్లాలనుంచి అనేకులు గెలిచారు. ప్రకాశంగారు చేసిన ప్రచారంవల్ల లాభం పొంది, 'కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ' గెలవని చోట్ల కమ్యూనిస్టులుగానీ, స్వతంత్ర సభ్యులుగానీ గెలిచారు. కాంగ్రెసు పేరున గెలిచినవారు ఏమాత్రమైనా ఒక్క రాయలసీమలోనే గెలిచారు.

అప్పటివరకు, ఆంధ్రులు ఏకచ్చత్రాదిపత్యం వహిస్తున్న కాంగ్రెసు పార్టీకి చెన్నరాష్ట్ర శాసన సభలో మెజారిటీ పూర్తిగా పోయింది. కాని వారికి కృషికార్ లోక్ పార్టీ, ముస్లిమ్‌లీగు సహాయంగా ఉండేవి. మూడు పార్టీలు కలిసినా వారి బలం 150 దాటక పోయింది. ప్రతిపక్షంలో 164 సభ్యులు ఉండేవారు. ప్రకాశంగారు ఆ ఎన్నికలల్లో మద్రాసునుండి పోటీచేసి ఓడిపోయారని ఇదివరకే వ్రాశాను. కాని, తమ వ్యక్తిత్వాన్నిబట్టి ఆయన ఆ 164 సభ్యులను ఏకంవేసి యునైటెడ్ ఫ్రంటు అనే సమాఖ్య క్రింద శాసన సభా కార్యక్రమంకోసం ఏర్పాటు చేయగలిగారు. ఆ సమాఖ్య కార్యక్రమం ప్రారంభించినపుడు నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉండడానికి అందరూ అంగీకరించారు. ఆ సమాఖ్యలో కమ్యూనిస్టులు, కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ, మద్రాస్ టాయిలర్స్ పార్టీ, ఇంకా ఏవో వేరే పార్టీలు, స్వతంత్రులు ఏకమయ్యారు.

చెన్నరాష్ట్రానికి అంతవరకు గవర్నరుగా ఉన్న భావనగర్ రాజా గారి కాలపరిమితి ముగియగా, కేంద్ర ప్రభుత్వంవారు 'శ్రీప్రకాశ' అనే ఆయనను నియమించారు. ఈ శ్రీప్రకాశగారు చాలా మేధావి. నెహ్రూగారికి ఆప్తులు. పెద్ద పెద్ద యూనివర్శిటీ డిగ్రీలు పొందినవారు. 1946 లో నెహ్రూగారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయన మంత్రిగా ఉండేవారు. అయితే, ఆయన కొంత స్వతంత్రంగా ఆలోచించుకొనే లక్షణం గలవారు గనుక, నెహ్రూగారు ఆయనను గవర్నరుగా పంపివేశారు. అంతకు ముందు కరాచీలో హైకమిషనర్‌గా ఉండి, ఆయన చెన్నరాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు. ప్రకాశంగారంటే గురుభావం కలవా రాయన.

కాంగ్రెసువారికి మెజారిటీ లేదని ఇదివరలోనే వ్రాశాను. పైగా ఆ గెలిచిన వారిలో, రాష్ట్రంలో గౌరవ ప్రతిష్ఠలున్న పెద్ద నాయకు లెవరూ లేరు.

1946 లో రాజాజీని చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే యత్నంలో గాంధీగారు ప్రకాశంగారి చేతులలో ఓటమి పొందిన దిదివరకే వ్రాశాను. రాజాజీ ఆశాభంగ నైరాశ్యలోకంలో ఉండడం గాంధీగారికి అసంతృప్తికరంగా ఉండడంచేత, రాజాజీకి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చిక్కనప్పుడు కాంగ్రెసు అధ్యక్షులే నేరుగా పావలా చందా పుచ్చుకొని ఆయనను సభ్యుణ్ణిగా చేర్చుకొనేటట్టు చేసినది యిదివరలో వ్రాశాను.

రాజాజీలో ఏదో ఇంద్రుని అంశ ఉంది. అందుచేతే, తాను పాకిస్తాన్ వాదియైనా, గాంధీగారి ఆశీస్సులతో నెహ్రూగారి మంత్రివర్గంలో దేశ పరిపాలనలో భాగస్వామి అయ్యారు. స్వాతంత్ర్య ఘోషణ జరిగిన నాటికి ఇంత మేథావి లేరని నెహ్రూగారి మనసును వశం చేసుకొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన పిదప బెంగాల్ గవర్నరుగా వెళ్లారు. అక్కడినుంచి, మౌంట్ బాటను ప్రభువు గవర్నర్ జనరలు పదవినుంచి విరమించగానే భారతదేశానికి తాను గవర్నర్ జనరలు అయ్యారు. 1950 జనవరి 26 న భారతదేశ నూతన సంవిధానం అమలులోకి వచ్చేదాకా ఆ పదవిలో ఉండి, తర్వాత చెన్నపట్నంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు.

ఆయన కేంద్ర మంత్రిగా, ఢిల్లీలో, తన వర్గాన్ని ఓడించి ముఖ్యమంత్రి అయిన ప్రకాశంగారిమీద ఒక విధమైన అధికారంగల పదవిలోకి వెళ్ళారు. ఒకసారి చెన్నరాష్ట్రంలో ఉన్న అడవి కలప కేంద్ర ప్రభుత్వంవారు కొనవలసిన అగత్యం వచ్చింది. ప్రకాశం ప్రభుత్వంవారు ఏదో ఒక ధర అడిగారు. కేంద్రశాఖవారు అంత ధర ఇవ్వమని వాదించారు. ఇది శాఖల స్థాయిలో జరిగిన వ్యవహారము. అపుడు రాజాజి ప్రకాశంగారికి అర్దాధికార పూర్వకమైన (Demi - official) ఉత్తరం వ్రాశారు. అందులో ఇలా ఉన్నది.

"ప్రకాశంగారూ! ప్రతిదినమూ మీ ప్రభుత్వం మా ప్రభుత్వం దగ్గర ఏవేవో గ్రాంటులు కావాలని చేయి జాచుతూ వస్తూంది కదా! అలా చేయి జాచే ప్రభుత్వానికి బేరంచేసే తాహతు ఉన్నదా?"

రాష్ట్రంలో కాంగ్రెసు రాజకీయాలలో నాయకత్వ శూన్యమైన అవస్థ వచ్చిందని పైన వ్రాసే ఉన్నాను. ఆ సమయంలో ఎవరి ఊహో, ఎవరి తంత్రమో, చెన్నపట్నంలో పుట్టిందో, ఢిల్లీలో పుట్టిందో ఇప్పటి దాకా సరిగ్గా తెలియదు కాని, మహేంద్ర పదవి అనుభవించి వచ్చి విశ్రాంతి తీసుకొంటున్న రాజాజీని ఈ చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకువస్తేతప్ప, కాంగ్రెసు సంస్థ రాష్ట్రంలో నామ మాత్రావశిష్టమై నశిస్తుందనీ ఊహారచన జరిగింది. ఆ ఊహారచన తమదే అన్నట్టుగా శ్రీప్రకాశగారు తమ జీవిత చరిత్రలో వ్రాసుకొన్నారు.

సంవిధానం ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిలు (శాసన మండలి)లో కొందరు సభ్యులను నియమించే హక్కు గవర్నరుకు ఉంది. దాన్ని పురస్కరించుకొని గవర్నరు రాజాజీని శాసన మండలి సభ్యులుగా నియమించారు.

తరువాత వెనువెంటనే, డిల్లీనుంచి కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు, శాసన సభ కాంగ్రెసుపార్టీ వారికి - కాంగ్రెసు శాసన సభ్యులను సమావేశపరిచి, రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసిందని ఆదేశించారు. వారు అలాగే సమావేశమై రాజాజీని తమ పార్టీనాయకునిగా ఎన్నుకొన్నారు. గవర్నర్ జనరలుగా పనిచేసిన రాజాజీ చిన్న పదవి అనుకోకుండా, సంతోషంగా ఆ పదవి స్వీకరించారు.

ఇదిచూసి, ప్రకాశంగారు - యునైటెడ్ ఫ్రంటుకు చెందిన 164 సభ్యుల సంతకాలతో ఒక విజ్ఞప్తి గవర్నరుగారికి పంపించారు.

రెండు ఇతర పార్టీలతో కలిసినప్పటికీ కాంగ్రెసు మైనారిటీలో గనుక ఆపార్టీ నాయకుని ముఖ్యమంత్రి పదవికి ఆహ్వనించక, యునైటెడ్ ఫ్రంటు నాయకునికే అటువంటి ఆహ్వానం పంపించవలసిందని ఆ విజ్ఞప్తిలో సూచింపబడింది.

శ్రీప్రకాశగారు పెద్దమనిషే అయినా, ఆ విజ్ఞప్తిలోగల విషయాన్ని మాట్లాడడానికైనా ప్రకాశంగారిని ఆహ్వానించలేదు. రెండు, మూడు రోజులు ఆ విజ్ఞప్తి ఆయన తన దగ్గిరే అట్టిపెట్టుకొని, అంతట్లో రాష్ట్రకన్యను వివాహ మాడడానికి సిద్ధపడ్డ రాజాజీని ఆహ్వానించారు.

పత్రికా విలేఖరులు, "ఇది సంవిధానానికీ, సంప్రదాయానికీ విరుద్ధం కాదా?" అని అడిగితే, "ప్రకాశంగారి పార్టీ కలగాపులగం పార్టీ గనుక పిలవ లే" దన్నారు.

"అయితే, రాజాజీ పార్టీకూడా కృషికార్ లోక్, ముస్లింలీగు పార్టీల సహాయంతోనే కదా ఉన్నది?" అని వారు వేసిన ప్రతిప్రశ్నకు, ఆయన - "శాసన సభలో ఉన్న పార్టీ లన్నింటిలోనూ రాజాజీ పార్టీ సంఖ్యా దృష్ట్యా పెద్ద" దని ప్రత్యుత్తర మిచ్చారు.

"మైనారిటీ పార్టీకి రాజ్యం అప్పగించకూడదు. అలా చేసినట్టయితే ప్రభుత్వంవారు తమతో అంతకు ముందుదాకా కలియని సభ్యులకు ప్రలోభాలు చూపించి, తమలో కలుపుకోడానికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దీన్నే పాశ్చాత్య దేశాల రాజకీయాల్లో అశ్వ విక్రయ (హార్స్ ట్రేడింగ్) విధాన మంటారు. అది జరగడం మంచిది కాదుగదా!" అని విమర్శకులు చెప్పగా -

"ఇక్కడ అటువంటిది జరగదు" అన్నారు శ్రీప్రకాశగారు.

మంత్రివర్గం ఏర్పడి, మొదటి శాసన సభా సమావేశం కాకుండానే, యునైటెడ్ ఫ్రంటులో నలుగురి సభ్యులతో భాగంగా ఉన్న ఒక చిన్న పార్టీ రాజాజీ పక్షం వైపు వెళ్ళడమూ, ఆ నలుగురికీ నాయకుడైన మాణిక్యవేలు నాయకరుగారిని రాజాజీ ఒక మంత్రిగా తీసుకోవడమూ జరిగాయి.

శ్రీప్రకాశగారు జరగదన్న అశ్వ విక్రయం చెన్నరాష్ట్ర రాజకీయ విపణిలో ఆదిలోనే ఆరంభమయింది.

గవర్నరు ప్రసంగానికి ప్రకాశంగారి అధిక్షేపణ

శ్రీప్రకాశగారు - సంవిధానపు 176 వ అనుచ్ఛేదము (ఆర్టికల్) క్రింద ఉభయ శాసన సభలకు తమ సంబోధ (అడ్రెస్)నోపన్యాసము చేయడానికి నిలుచున్నారు. వెంటనే, ప్రకాశంగారు ప్రతిపక్ష నాయక స్థానంలో నిలబడి, గవర్నరును సంబోధిస్తూ -

"గవర్నరుగారూ! ఒక వ్యవస్థా విషయము (పాయింట్ ఆఫ్ ఆర్డర్) చెప్పడానికి నిలుచున్నాను."

అనేసరికి, గవర్నరు శ్రీప్రకాశగారు తటాలున తమ కుర్చీలో కూచున్నారు.

ఈ విధంగా, గవర్నరు (రాజ్యపాలుడు) ఉభయ శాసన సభా సభ్యులను సంబోదించే సమయంలో, పాయింట్ ఆఫ్ ఆర్డరు లేవదీయడమన్నది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు.

గవర్నరుకు చెరొక ప్రక్క కూచున్న శాసన సభ స్పీకరూ, శాసన మండలి అధ్యక్షుడు అది విని దిగ్భ్రాంతులయ్యారు.

ఆ దిగువ శాసన సభ కార్యదర్శి దేశంలో శాసన సభా కార్య విధాన నిపుణుడని పేరు పొందినవాడు. ఆయన, 'మే'దొరగారు వ్రాసిన 'పార్లమెంటరీ విధాన' మనే గ్రంథంలో పుటలు అటు ఇటు త్రిప్పి, తొందరగా పరిశీలించసాగాడు. అందులో ఇటువంటి విషయం ఉండదన్న విషయం వారు మరచిపోయారు.

ప్రకాశంగారు తన వ్యవస్థా విషయం వివరిస్తూ ఇలా చెప్పారు:

"మీరు సంవిధాన ప్రకారంగా నడిచే 'రాజ్యపాల్‌' అనగా, ప్రభుత్వం సలహాపైన నడుచుకొనే గవర్న రన్నమాట. అలా సలహా యివ్వడానికి ఒక ప్రభుత్వముండాలి. అది సంవిధాన క్రమబద్దమై ఏర్పడిన ప్రభుత్వమై ఉండాలి. మన సంవిధానపు నిజతత్వ ప్రకారం శాసన సభలో మెజారిటీ (బహుమతము) ఉన్న నాయకుని క్రింద ఏర్పాటయిన ప్రభుత్వమని దాని అర్థము. మీ కున్న లెక్కల ప్రకారమూ, నేను మీకు లోగడ మా యునైటెడ్ ఫ్రంటు పార్టీ తరపున మా 164 సభ్యుల సంతకాలతో అందజేసిన విజ్ఞప్తినల్లా, మీరు తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా కూచోబెట్టిన రాజగోపాలాచారి గారికి బహుమతము లే దన్నమాట నిస్సందేహము. "అటువంటప్పుడు, మీరు కూచోబెట్టినంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి కానేరడు. ఆయన ఏర్పాటుచేసిన మంత్రివర్గం సంవిధాన బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కానేరదు. ఆయన కేవలం అక్రమ ఆక్రమణదారుడు. ఆయన సలహాపై మీరు పిలిచిన ఈ శాసన సభా సమావేశం క్రమ బద్దం కాదు. క్రమ బద్ధంగా మా యునైటెడ్ ఫ్రంటు నాయకుని ఆహ్వానించి, ప్రభుత్వం ఏర్పాటు చేయించేంతవరకు ప్రజాప్రతినిధులమైన మేము ఈ అక్రమ సంబోదనా కార్యక్రమంలో మెజారిటీలో ఉండి పాల్గొన జాలము. అందుచేత, మా ప్రతికూలతను తెలియజేయడానికి మేమంతా ఈ సభలోనుంచి బయటకు వెళ్ళిపోతున్నాము."

ఇలా చెప్పి ఆయన బయటకు నడవ నారంభించేసరికి, తక్కిన యునైటెడ్ ఫ్రంటు సభ్యులందరూ ఆయన వెంట శాంతంగా బయటికి వచ్చేశారు.

అలా సగంపైగా స్థలాలన్నీ ఖాళీ అయేసరికి, ఆదిలోనే 'నాగవల్లి మరునాడున్న పెళ్ళి ఇల్లు' మోస్తరుగా సభ వెలవెల బోయింది.

ప్రకాశంగారు మాట్లాడుతున్నప్పుడు గవర్నరుగారు నిశ్చేష్టులై వినడం తప్ప మరేమీ చేయలేకపోయారు.

మేమంతా లేచి వచ్చేసిన తర్వాత, ఆయన తన ఉపన్యాసంలో నాలుగు ముక్కలు చదివేసి, సభ ముగించుకొని వెళ్ళిపోయారట.

అమరజీవి పొట్టి శ్రీరాములు

1913 లో బాపట్లోలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. 1917 లో ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా రాష్ట్ర కాంగ్రెసు సంఘం ఏర్పాటయింది. 1939 లో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ - దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కాంగ్రెసు పనికై ఏర్పడిన రాష్ట్రాలను భాషా రాష్ట్రాలుగా సంవిధానంలో ఏర్పాటు చేయడానికి తీర్మానించింది.

1948 లో వ్రాసిన సంవిధానం మొదటి ముసాయిదాలో ఆంధ్ర రాష్ట్రం చేర్చబడింది. రెండవ ముసాయిదాలో అది తీసివేయబడింది తెలుగు భూమిపైన, తెలుగు నాయకుడు కౌలుకు ఇచ్చిన పట్టాను బట్టి కట్టిన పోర్టు సెంటు జార్జి, దానికి ఉత్తరంగా ఉన్న పట్నం తెలుగు ప్రాంతంలో చేరునా, చేరదా అనే సందిగ్ధ స్థితి ఏర్పడింది.

ఈ ఆలస్యము, ఈ సందిగ్ధావస్థా గాంధీగారి ఆశ్రమంలో శిక్షణ పొందిన పొట్టి శ్రీరాములుగారి కేమి నచ్చలేదు. ఆయనసహాయ నిరాకరణోద్యమంలో (నాన్ కో - ఆపరేషన్) ప్రారంభ దశలోనే పాల్గొన్నవారు. పట్టుదలకు ఆయన పెట్టినది పేరు.

చెన్నపట్నంతో కలిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయకపోతే, నిరాహార దీక్ష తీసుకొంటానని - ఆయన చెన్నరాష్ట్ర ప్రభుత్వానికీ, జవహర్‌లాల్ నెహ్రూగారికి హెచ్చరికలు (నోటీసులు) అందజేశారు. కాని, వారు శ్రీరాములుగారినిగానీ, ఆయన చెప్పిన విషయాన్నిగానీ తమ దృష్టికి తెచ్చుకోలేదు.

శ్రీరాములుగారు మాత్రం, తాము సూచించినట్టు ఫోర్టు సెంటు జార్జి గుమ్మంవద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. బులుసు సాంబమూర్తిగారు, ప్రకాశంగారు నిరాహార దీక్షకు కోటగుమ్మం తగినస్థలం కాదని, మైలాపూరులో సాంబమూర్తిగారు నివసిస్తున్న వసతి గృహానికి ఆయనను తీసుకు వెళ్ళారు. ఇది అక్టోబరు నెల మూడవ వారంలో ఆరంభ మయింది.

మొదటి రోజులలో పట్నంలోని ప్రజలు దీన్ని అంతగా పట్టించుకోలేదు. శాసన సభలో ఎవరో ఈ ప్రసక్తి తెచ్చినపుడు, ముఖ్యమంత్రి రాజాజీ చులకనగా మాట్లాడారు. కాని, రానురాను - పట్నంలోను, శాసన సభ్యుల మనసులలోను, తెలుగు జిల్లా లన్నిటిలోను, శ్రీరాములుగా రే మవుతా'రన్న ఆందోళన ఉదయించింది.

ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణగారు ప్రమేయం కలిగించుకోవాలని చెన్నపట్నంనుంచి శాసన సభ్యులు, పెద్దలు ఆయనకు తంతివార్తలు ఇవ్వడం ఆరంభమయింది. కాని, ఆయనకు నెహ్రూగారి మనసును త్రిప్పే శక్తి ఉన్నట్టుకనిపించలేదు. మాకు జవాబుగా అనునయ వాక్యాలు మాత్రం టెలిఫోనులో చెపుతూ ఉండేవారు. శ్రీరాములుగారి నిర్దుష్టమయిన ఉపవాస దీక్ష రోజురోజుకూ, ఆంధ్రుల హృదయాలలో ఆందోళన కలిగించ సాగింది. ప్రజల భావాలలో ఒక వేడిని పుట్టించింది. ప్రకృతి అనుకోనటువంటి ఉష్ణతను ధరించింది. కార్మికులలోను, విద్యార్థులలోను - ఆంధ్రరాష్ట్రవిషయమై గాక, శ్రీరాములుగారి ప్రాణవిషయమై చాలా మనస్తాపం కలిగింది.

ముఖ్యమంత్రిగారు మాత్రం, శాసన సభలో ఈ ప్రసక్తివస్తే చులకనగాను, తేలికగాను మాట్లాడేవారు. ఉపవాసం ఆరంభమయిన యాభై రోజులకు, పట్నంలో గల వాతావరణాన్ని తపింప జేసింది. ఋషులు తీవ్రమైన తపస్సు చేస్తే, భూమి గజగజలాడుతుందని పురాణాలలో చదువుకోవడమే గాని, అంతకుముందు మాలో ఎవరికీ అనుభవం లేదు. కాని, అప్పుడు 50 వ రోజు దాటి 51 వ రోజు, 51 వ రోజు దాటి 52 వ రోజు - ఈ విధంగా ఉపవాస దీక్ష జరిగేసరికి చెన్ననగర రాజవీథులన్నీ గజగజలాడుతున్నట్టు అనిపించేది.

నెహ్రూగారు ఏమీ మాట్లాడలేదు. ఆందోళనా ఫలితంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని సచివాలయపు ఐ.సి.ఎస్. ఉద్యోగులు కరడుగట్టిన మనసులతో చెప్పిన సలహా వాక్యాలు, ఆయనకు వేద వాక్యాలయ్యాయి.

దినములు, క్షణములు, గడచిన కొద్దీ సామాన్య ప్రజానీకం సాంబమూర్తిగారి యిల్లున్న వీథిలో నిండిపోయేవారు. ఆయన యిల్లు చాలా చిన్నది.

యాభై ఆరవ దినము సగము రాత్రివేళ సమస్య పరిష్కారమవుతుందని, అందుచేత శ్రీరాములుగారు ఉపవాస దీక్ష విరమించవలసిందని రాధాకృష్ణగారు ట్రంకాల్‌ద్వారా చెప్పినట్టు, శ్రీరాములు గారికి ఎవరో మెల్లిగా చెప్పారు.

ఆయన చిన్న కంఠంతో

"ఈ వార్త జవహరులాలుగారు అన్నరా? లేక రాధాకృష్ణగారు తమంతట తామే ఈ ఆశను వెలిబుచ్చారా?" అనే అర్థంతో అడిగారు.

అది రాధాకృష్ణగారు తమ మాటగానే చెప్పినట్టు, టెలిఫోను వార్త తెచ్చిన ఆయన చెప్పాడు. అందుకు శ్రీరాములుగారు "ఉపవాస దీక్ష విరమించవలసిన అవసరం కనపడదు," అని చాలా మెల్లిగా చెప్పారు.

ఆ మాటలో ఆయన దృఢనిశ్చయం వెల్లడి అయ్యేట్టు ఆయన చేతులతోను, కళ్ళతోను సూచించారు.

ఈ విధంగా ఉపవాస దీక్ష సాగించి, 58 వ రోజు రాత్రి, 59 వ రోజు వచ్చేముందు ఆ మహాత్యాగి అసువులు బాశారు.

ఒక్కమారుగా ఆంధ్రదేశం పెనుబొబ్బ పెట్టింది. సాయంకాలంవరకు ఆయన భౌతిక దేహాన్ని, ప్రజలు చూడడానికి వీలుగా సాంబమూర్తిగారి యింటి బయట ఎత్తయిన వేదిక ఏర్పరచి ఉంచారు.

మైలాపూరునుంచి రెండెడ్ల బండిపైని అ భౌతిక దేహాన్ని ఉంచి, మౌంటురోడ్డునుంచి జార్జిటవును వీథులగుండా, వెనుక లక్షల కొద్ది ప్రజలు నడుస్తుండగా, ఏడెనిమిది గంటల వేళకు దహన భూమికి తీసుకు వెళ్ళారు. ఆ రెండెడ్ల బండి నొగపై ప్రకాశంగారు, సాంబమూర్తిగారు చివరివరకు కూచున్నారు.

ఆధునిక కాలంలో, ఇచ్ఛా మరణం పొందిన మహర్షి వలె, పొట్టి శ్రీరాములుగారు - ఐదు, ఐదున్నర అడుగుల పొడవుగల అల్పమైన భౌతిక దేహాన్ని వదిలి, సర్వ భారత దేశవ్యాప్తమైన అమరజీవిగా వర్దిల్లారు. నేడు భారతదేశంలో ఏర్పాటయిన భాషా రాష్ట్రాలు, నిజముగా ఆనాడు ఆయన చేసిన మహాత్యాగ ఫలితాలే.

ఆయన అమరులైన అ సమయంలో - అనేక శాసన సభ్యులు, ప్రభుత్వం వైఖరికి నిరసనగా, తమ సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చారు. శ్రీరాములుగారు డిసెంబరు 16 న అస్తమించారు. ఆ తర్వాత, తొమ్మిదిన్నర నెలల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉదయించింది. అ తరువాత మూడేండ్లు ముప్పై దినాలకు విశాలాంధ్రగా విస్తరిల్లింది.

ప్రజా సోషలిస్టు పార్టీ

1952 లో ఎన్నికలయిన తర్వాత అప్పటికి నాల్గు సంవత్సరాల ముందు కాంగ్రెసులోంచి విడిపోయిన ఆచార్య నరేంద్రదేవ్, జయ ప్రకాశ్ నారాయణ్‌గారల యాజమాన్యాన నడిచే 'సోషలిస్ట్ పార్టీ' - కృపలానీ, ప్రకాశంగారల నాయకత్వాన నడిచే 'కిసాన్ మజుదూర్‌ పార్టీ' లో విలీనం కావడానికి బొంబాయిలో సంయుక్త సహాసభ ఒకటి ఏర్పరచి, అక్కడ తీర్మానించినట్టు రెండు పార్టీలను కలిపి "ప్రజా సోషలిస్టు పార్టీ" అదే క్రొత్తపార్టీని రూపొందించారు.

ఈ మార్పు ఆంధ్రప్రాంతానికి సంబంధించినంత మటుకు అనర్థదాయకంగా పరిణమించింది. చివరికి, ఈ సోషలిస్టులలో వేళ్ళ మీద లెక్క పెట్టదగినంతమంది తప్ప, తక్కిన వారందరు కాంగ్రెసులో చేరిపోయారు. పై రాష్ట్రాలలో కూడా వీరిలో చాలామంది ప్రత్యేకంగా సోషలిస్టు పార్టీగా విడిపోయారు. ఆ విడిపోయినవారూ ఇప్పుడు మళ్ళీ రెండు భాగా లవుతున్నారు.

అది అలా ఉంచి, 1952 లో ఆంధ్రలో జరిగిన విషయము చూద్దాము. ప్రకాశంగారు, వారి అనుయాయులమైన మేము - ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచినపుడు, బళ్ళారిజిల్లాలో హెచ్చు భాగాన్ని, మైసూరు ప్రాంతాలలోని తెలుగు భాగాలను, చెన్నపట్నం అంతా, లేకపోతే ఉత్తరభాగం ఆంధ్రరాష్ట్రంలో కలిపిఉంచాలని అప్పటికి ముఫ్పైసంవత్సరాలనుంచి అనుకుంటూ ఉండేవాళ్ళము. అయితే, ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరిగే సమయంలో మాతో విలీనమైన సోషలిస్టులు - బళ్ళారి, చెన్నపట్నం ఆంధ్రలో చేరకపోతేనేమి అని వాదించి, పత్రికలలో కూడా వ్రాసేవారు. అందుచేత, పార్టీలో వారికి మాకు కొంత భేదదృష్టి ప్రతీకార్యములోను కనిపించేది.

వారి యీ అభిప్రాయానికి కారణమేమని వారినే అడగగా, వారు - తాము సోషలిస్టుపార్టీగా ఉండేరోజులలో బళ్ళారి అంతా కన్నడిగులకు చెందినదని, చెన్నపట్నంమంతా తమిళులకు చెందినదని తీర్మానం వ్రాసుకొని ఒప్పుకొన్నాము అని బయటపెట్టారు.

ఇంతేకాక, కాంగ్రెసు పార్టీ వారు (ఇది 1952 నాటి విషయమని పాఠకులు జ్ఞాపకముంచుకోవలెను.) ప్రజాభ్యుదయకరమైన త్రోవపట్టారు గనుక, కాంగ్రెసులో కలిసిపోవడమో, లేక వారితో చేయి కల పడమో చేసుకోవాలని వారు వాదించి, పార్టీ ప్రతి సమావేశంలోను ఏదో ఒక తగాదా లేవదీస్తూండేవారు. ఆ తగాదా లేవదీసిన నాయకుడే ఆ తర్వాత కాంగ్రెసుతో కలిసి, మంత్రికావడం ఒకేక్షణంలో జరిగిందని యిదివరలో సూచించాను. అందుచేత ఆంధ్రరాష్ట్ర సమస్యపై పార్టీలో ప్రకాశంగారి అభిప్రాయాలే బహుమతస్వీకారమై ఆంధ్ర హృదయాన్ని ప్రతిబింబిస్తున్నా, పార్టీనుంచి ఏక కంఠమైన మాట రాకపోవడంవల్ల దాని ప్రతిష్ఠ తగ్గడమేగాక, చివరికి అది రెండు ముక్కలుగా చీలిపోవడంకూడా జరిగింది.

అ రోజులలో గోపాలరెడ్డి, కళా వెంకటరావుగారల వర్గం - ప్రకాశంగారు, ఆంధ్రప్రజలు పెట్టుకొన్న ప్రత్యేక ఆంధ్రరాష్త్రస్థాపన లక్ష్యాన్ని అంతగా ఆమోదించే స్థితిలో లేరు. 1952 ఎన్నికలలో వారు ఓటమి చెందినా, అంతకుముందు మంత్రులుగా ఉన్నపుడు - రాష్ట్రవిభజన కమిటీలో, చెన్నపట్నం తమిళరాష్ట్రానికి చెందుతుందన్న సూత్రానికి, వారు స్వహస్తాలతో ఆమోదముద్ర వేశారు.

మా పార్టీలో కలిసిఉన్న సోషలిస్టుల వైఖరి పైన సూచించాను. ఈ విషయంలో, యునైటెడ్ ఫ్రంటులో భాగస్వాములుగా మాతో కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టుల వైఖరికూడా, సోషలిస్టుల వైఖరి ఉన్నట్టే ఉండేది.

ప్రజాసామాన్యం మనసులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారి ప్రాయోపవేశానంతరము, ఏదో ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రమంటూ ఒకటి ప్రత్యేకంగా దేశపటంలో తన రూపం కనిపించేటట్టు ఏర్పడాలనే ఆందోళనా భావం ఉండేది. ప్రకాశంగారు ఇదంతా కనిపెట్టి, నీలం సంజీవరెడ్డి, గోపాలరెడ్డి, కళా వెంకటరావుగారల వర్గంవారే అయినప్పటికీ, తమ అభిప్రాయాలతో కొంచెం అనుకూలంగా కనిపించేటట్టు ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు పత్రికలో చూసి, ఆయన తమతో ఒకసారి వచ్చి మాట్లాడవలసిందని కబురుపెట్టారు.

ఇది - ఆ సంవత్సరం ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై పెట్టిన మొదటి అడుగు.

  1. కాళేశ్వరరావుగారు విజయవాడలో, సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉండి, గాంధీగారి ఉద్యమ ఆరంభంలోనే, సత్యాగ్రహ సమరంలోకి దుమికిన అగ్రనాయక శ్రేణికి చెందినవారు. బెజవాడ పట్నానికి మునిసిపల్ ఛేర్మన్ గా ఉండేవారు, మహా మేధావి, త్యాగశీలులు. ఉద్యమ సందర్భంగా అనేక పర్యాయాలు కారాగార శిక్షలు అనుభవించినవారు. చివరి రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో స్పీకరుగా ఉండేవారు. సంఘ సంస్కర్త, చరిత్రకారులు.
  2. విశాఖపట్నంలో ఉన్న నాకు ప్రకాశంగారు, రంగాగారు కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా యిచ్చారని తెలిసి, వెంటనే నేనుకూడా రాజీనామా చేశాను. అప్పుడు నేను కాంగ్రెసు టికెట్టుమీద శాసన సభ్యునిగా ఉన్నాను. అలాగునే మునిసిపల్ ఛేర్మన్ గాను ఉన్నాను. ఆ ఉత్తరక్షణంలో నేను ఆ రెండు పదవులకూకూడా రాజీనామా చేసేశాను.
  3. ఈయన నెహ్రూ కుటుంబానికి ఆప్తుడు. నెహ్రూ కాబినెట్ లోని తన మంత్రి పదవికి రాజీనామా యిచ్చి, క్రొత్త పార్టీలో చేరేటట్టు కృపలానీగారికి మాట యిచ్చినా, ఆ క్షణంలో మంత్రిపదవి రాజీనామా చేయలేదు. ఆ తర్వాతనూ చేయలేదు.