Jump to content

నా జీవిత యాత్ర-4/ప్రకాశంగారి మంత్రివర్గ అవసానము

వికీసోర్స్ నుండి

14

ప్రకాశంగారి మంత్రివర్గ అవసానము

1947 మార్చి 25 న మధ్యాహ్నం 12-15 గంటలకు కోటలో ఉన్న శాసన సభలో మాట్లాడడానికి ప్రకాశంగారు తమ స్థలంలో నిల్చున్నారు. ఆ కోట 1630 లో పూనమల్లి వేంకటాద్రి చెన్నప్పనాయకుడు ఇచ్చిన భూమిమీద తూర్పు ఇండియావారు కట్టిన కోట. బ్రిటిషు ప్రభుత్వంవారి స్థాపనను, పెరుగుదలను చూసిన కోట. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించడాన్ని కూడా ఆ కోట చూసింది.

అంతకు పది సంవత్సరాల క్రితం ఆ కోటలో నుంచే ప్రకాశంగారు రెవిన్యూ మంత్రి పదవి వహించి, జమీందారీ తత్త్వాన్ని అణచి ప్రజారాజ్య తత్వానికి అంకురార్పణ చేశారు. ఆ కోటలో నుంచే 1946 లో ముఖ్యమంత్రిగా, మధ్యవర్తుల ప్రాబల్యాన్ని అణచి, స్వయంపోషక గ్రామ స్వరాజ్యానికి బీజాలు వేశారు. అయితే, ఆయన కూచున్న స్థలం అంతకు ముందు మామూలుగా కూచునే స్థలం కాదు. ఆ స్థలం ఆ నెల 22 నాడు మరొక నాయకుని వశమైంది. ఆ రోజు కూచున్న ప్రకాశంగారు దాని కెదురుగా ఉన్న బెంచీపైన కూచున్నారు. అది పదవిలేని శాసన సభ్యులు కూచునే స్థలము. ప్రకాశంగారికి అక్కడినుంచి మాట్లాడడానికి ఏమున్నది?

సభా నిబంధనల ననుసరించి, పదవికి రాజీనామా యిచ్చిన మంత్రులు తాము చెప్పుకొనదలచిన దేదైనా ఉంటే సభా ముఖంగా లోకానికి - తమ మనసులో ఉన్నదీ, పదవి విరమణకు సంబంధించిందీ చెప్పడానికి అవకాశం ఉన్నది. దానిపై చర్చ ఉండదు.

అప్పుడు, తన పదవీ విరమణ గూర్చి చెప్పదలచుకొన్నది ఏదో చెప్పడానికీ, ఆయన తనకు సహజమైన పద్ధతిని మెల్లిగా లేచే సరికి - శాసన సభా ప్రేక్షక భాగంనుంచి చప్పట్లు గట్టిగా బయలు దేరినవి. శాసన సభ్యులు తమ ముందున్న బల్లలపైని చేతులతో గట్టిగా తట్టడం మొదలు పెట్టారు. వారు చప్పట్లు కొట్టరాదని సంప్రదాయము. కాని, తమకు ఇష్టులయినవారు ఎవరైనా మాటాడితే, ఆ మాటలాడ వలసిన అవసరపు ప్రాముఖ్యమునుబట్టి, వారి ఉపన్యాస ప్రారంభమున స్వాగత పూర్వకంగా, సభ్యులు తమ ముందున్న వ్రాతబల్లపై అరచేతులతో కొట్టి చప్పుడు చేయడం అలవాటు. అయితే, ప్రేక్షకులు మాత్రం ఏ విధమయిన చప్పుడు చేయడానికీ వీలులేదు.

అందుచేతనే, ప్రేక్షకుల గాలరీలోనుంచి చప్పట్లు చప్పుడు వినిపించే సరికి స్పీకరు శివషణ్ముగం పిళ్ళైగారు; అధికారం ధ్వనించే కంఠంతో, "ప్రేక్షకుల గాలరీలోనుంచి చప్పుడు వినిపిస్తే, ఇక ప్రేక్షకుల నందర్నీ గాలరీనుంచి అవతలకు పంపించి వేస్తాను!" అన్నారు.

వెంటనే కొంత నిశ్శబ్దత ఏర్పడింది. ఆయన 'తిరిగి ఆ మాటే చెబుతున్నాను,' అని మరొకమాటు చెప్పిన మాటనే చెప్పగా పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడింది. ఆ సమయంలో నిశ్శబ్దత అవశ్యకం కదా!

అక్కడ ప్రధాని కూచునే స్థలంలో ప్రకాశంగారంత గాంభీర్యంకలిగి, ప్రజానురాగం పొందిన ప్రధాని ఇది వర కెన్నడూ కూచో లేదు. అటువంటి ప్రధానిని ప్రజా వ్యతిరేక శక్తులు పదవీచ్యుతుని చేయగా, ఆయన చెప్పదలచిన మాటలను, భవిష్యత్తును సముద్ధరించు కొనడానికి శ్రద్దగా వినవలసిన సత్సమయమది.

మంద్రమైన కంఠంతో, మాటకు మాటకు మధ్య కొంత విలంబనంతో, ప్రకాశంగారు మాట్లాడ నారంభించారు:

"అధ్యక్షా! ఈ నాయకత్వ మన్నది మాలో ఎవరో ఒకరు ప్రధాని కావడానికీ, మంత్రి మండలిని ఏర్పరచి పరిపాలన జరపడానికీ అధికారాన్నిస్తుంది. మన రాష్ట్రంలోనేగాక, ప్రపంచంలో అన్ని దేశాలలోను ఈ నాయకత్వానికి, పదవికి ఆశించడం కలదు.......

"ఈ రోజున నేను అసలు ఉపన్యాసమే చేయకుండా ఉంటే బాగుంటుం దనుకొన్నాను. కాని, శాసన సభలో కొన్ని విషయాలు తెలుసుకొనేందుకు కూతూహలత కన్పించింది. ఇంతేకాక, నేను ఏ పరిస్థితులలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానో, ఏ పరిస్థితులలో మా మంత్రి పదవులను వదలుకో వలసి వచ్చిందో కొంచెం చెబుదామని నాకూ కోరిక ఉదయించింది........

"నేను కొన్ని విషయాలు సభ్యులకు చెప్పినట్ల యితే సరిపోతుంది. రాజకీయ ఖైదీలుగా మేము కారాగృహంలో ఉన్న సమయంలోనే, అక్కడినుంచి విముక్తులయిన తరువాత, ఈ శాసన సభకు నాయకులు వారా వీరా అనే పోటీలు బయలు దేరాయి... ....

"ఒక్కమారు మేము తిరుచినాపల్లి కారాగృహంలో ఉండగా, మాలో ఒకరికి పై నుంచి ఎవరో వ్రాసిన ఉత్తరంలో - ఆంధ్ర దేశంలో నాయకత్వం మారవలెనన్న ప్రసక్తి ఉండెను.....

"జనరల్ ఎన్నికలయిన తర్వాత, నాయకత్వానికి పోటీ చేసే పేర్లు ఒక్కొక్కటే మెల్లి మెల్లిగా బయటపడ్డాయి. నాయకత్వ పదవికి ముగ్గురు పోటీ చేస్తున్నట్టు మూడు పేర్లు కూడా పత్రికలలో పడ్డాయి. ఆ మూడిటిలో ఒకటి నా పేరు కావడం తటస్థించింది. నా మటుకు నేను ఎప్పుడూ ఒక చిన్నవాణ్ణిగానే భావించుకుంటూ వచ్చాను. ఆ విధంగానే ప్రజాసేవ (దేశసేవ) చేయడానికి వచ్చాను. ప్రత్యేకంగా బలం కలిగించే ఉన్నతమైన అధిష్ఠానవర్గం ఎన్నడూ లేదు. ఎప్పుడూ ఎవరో కొందరు పెద్దలతో నాకు తగాదాలు వస్తూనే ఉండేవి. వాటిని ఏదోవిధంగా పరిష్కరించి, బ్రతకగలిగి జీవితయాత్ర నడుపుకొంటున్నాను. ఎవరికైనా అజేయుడైన ప్రతిపక్ష నాయకునికింద నన్ను నేను భావించుకోలేదు. కాని, సామాన్య ప్రజాకోటికి నా యందు అభిమాన విశ్వాసాలు కలవన్న ప్రతీతి ఒకటి ఉంది.

"ఈ రోజు మార్చి 25 వ తేది. ఇంకొక అయిదు రోజులకు 1947 మార్చి 30 వస్తుంది. అప్పటికి సరిగా ఒక సంవత్సరం క్రింద, అంటే 1946 మార్చి 30 న ఆంధ్రప్రాంతంనుంచి ఒక గౌరవ సభ్యుడు, చెన్నరాష్ట్రంలో గల రాజకీయ పరిస్థితులను గురించి అధిష్ఠానవర్గంలో ఉన్నతస్థానం వహించిన ఒకరితో చెప్పడానికి వెళ్లారు. వెళ్ళవలసిందని ఆయనను ఎవరూ పంపించ లేదు. స్వయం ప్రతినిధిగా వెళ్ళారు. అధిష్ఠానవర్గంవారితో - చెన్న రాష్ట్రం తిండి కరువుతో, బట్ట కరువులలో, గడ్డు స్థితిలో ఉన్నదనీ, సరి అయిన నాయకుణ్ణి ఎన్నుకొనకపోతే రాష్ట్రం ధ్వంసమయిపోతుందనీ వారు చెప్పారు. ఇంతేకాక, మరొక విషయం కూడా చెప్పారు. పోటీ పడుతున్న ముగ్గురు నాయకులలో నన్ను తప్పించి, తక్కిన ఇద్దరూ చేతులు కలుపుకొనేలాగున అధిష్ఠానవర్గంవారు చేయవలసిందిగా కూడా గట్టిగా చెప్పారు. మంత్రివర్గంలో నాకు ఎదురుగా ఇప్పుడు కూచున్న ఒకరు [1] వెంటనే, అక్కడినుంచి తాను తనపై వేసుకొన్న దౌత్యం సఫలమయిందని రాజాజీకి ఒక ఉత్తరం కూడా వ్రాశారు. ఆ ఉత్తరంలో గాంధీగారు తనతో హృదయపూర్వకంగా అన్ని సంగతులూ మాట్లాడారనీ, అయితే, తనకు మాత్రం ఏ స్థానమూ చూపించలేదనీ కూడా అందులో వ్రాశారు....

"తరువాత, నాయకుని ఎన్నికలో ప్రతి క్షణమూ అధిష్ఠానవర్గంవారు అతిగా జోక్యం కల్పించుకొంటూ వచ్చారు. అయినప్పటికీ, ఇప్పుడు ఎన్నికయిన రామస్వామిరెడ్డిగారిని ఆహ్వానించినట్టే అప్పట్లో నన్నూ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానించడం జరిగింది...

"మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి ముందు ఒక విషయం నా మనస్సును వేధించింది. ఏ రాష్ట్రంలోనూ లేని ఒక గట్టి ఇబ్బంది మనలను ఈ రాష్ట్రంలో బాధించింది. మనకు ఒక్కొక్కప్పుడు జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అందుచేత, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను.

"1942 లో, క్విట్ ఇండియా తీర్మానం ఆమోదింపబడడానికి పూర్వం మన రాష్ట్రంనుంచి నలుగు రైదుగురు పెద్ద మనుష్యులు, ఆ తీర్మానానికి తమ ప్రతికూలతను ప్రకటించి, నాయకునికి (గాంధీజీకి) ఒక హెచ్చరికవాక్యం వ్రాశారు.

"ఈ సాహసోద్యమం మీరు తల పెట్టకండి! ఇది చాలా కష్టాలను సృష్టిస్తుంది. మీరు ఈ పని చేయవద్దు అని....

"కానీ, ఆ నాయకులు ఈ ఉత్తరంలో వ్రాసినదాంతో ఏకీభవించక, అ పెద్ద మనుష్యులు తమ దగ్గిరికి వచ్చి తా మన్న మాటలను సమర్థించుకొనవలసిందని వ్రాశారు.

"అధ్యక్షా! ఆ క్షణంనుంచి, ఈ ప్రతికూలమైన ఉత్తరం వ్రాసినవారు - ఒక ప్రత్యేక ప్రతికూల దృష్టితో నడచుకొని వస్తున్నారు. కాంగ్రెసు సంస్థకు కారాగృహ ప్రాప్తి కలిగింది. కాని, ఈ పెద్దమనుష్యులు దానితో సంబంధం లేనివారుగా దూరంగా ఉండిపోయారు.

"కాంగ్రెసు నాయకులు (గాంధీ) కారాగృహ విముక్తు లయిన తర్వాత అధిష్ఠానవర్గం ఎదుట, 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా వీరు వ్రాసిన ఉత్తరం ప్రసక్తీ, వీరి ప్రసక్తీ వచ్చినవి. ఇటువంటి విషయం, మరే రాష్ట్రంలోను జరగలేదు. ఆ సందర్భంగా కొందరిపైన క్రమశిక్షణ చర్య తీసుకోబడింది. దీని మూలంగా రాష్ట్రంలో, ఒక భాషాప్రాంతంవారికీ, ఇంకొక భాషాప్రాంతంవారికీ మనస్పర్థలు పెరిగినవి. ఆ విధంగా మన రాష్ట్రంలో వారి వర్గం, వీరి వర్గం అంటూ ఏర్పడినవి.

"నేను నాయకుణ్ణిగా ఎన్నికైన తర్వాత, ఏయే వర్గాలు అప్పటికి ఉన్నవో, వాటిని పరిశీలించుకున్నాను. ప్రతి వర్గం నాయకుణ్ణీ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి నాకు సహాయం చేయవలసిందని కోరాను....

(ఒక గౌరవ సభ్యుని చూపుతూ - )

"ఆ గౌరవ సభ్యునితో నేను చాలాసేపు ఆ విషయం చర్చించాను. వారూ, వారి వర్గమూ మంత్రివర్గంలో భాగస్వాములు కావడానికి ఒక నిర్ణయానికి రాలేదనీ, అందుచేత వారి వర్గంవారు అప్పటికి మంత్రివర్గంలో చేరదలచుకోలేదనీ చెప్పినారు. ఇతర వర్గాల నాయకుల సలహా తీసుకొనే ముందు నేను వీరితో మాట్లాడి ఉన్నాను. తర్వాత రెండవ వర్గంవారితో మాట్లాడాను. నా కోరికపైన వారు ఇచ్చిన పేర్లలో ఒకటి తప్ప తక్కువవాటిని నేను అంగీకరించాను...

"ఆ రోజున నా బాధలు ఆరంభమయినాయి. ఆ పేరు అంగీకరించకపోవడానికి అప్పటికి నా కొక కారణముండేది. అయితే, అప్పుడున్న కారణం ఎప్పటికీ ఉంటుందని అనుకోకూడదు...

"నేను మంత్రివర్గంలో చేర్చుకున్న మంత్రులు నాతో ఏకీభవిస్తారని, నన్ను ఏ ముఖ్యవిషయంలోనూ దిగవిడవరనీ, ప్రజాహిత కార్యక్రమాలలో తప్పక నాతోనే ఉంటారనే గట్టి భావంతో నా మంత్రివర్గ కార్యకలాపాలను ప్రారంభించాను. నాకు కలిగిన ఈ అభిప్రాయానికి ఆశాభంగం కలగలేదు. ప్రారంభించిన పది నెలలదాకా ప్రతి నెలా మా కార్యక్రమాలు సవ్యంగానే నడిచాయి. పరిపాలనానీతిలో ఏ భేదాభిప్రాయాలూ ఉండేవి కావు. ఒక్క మరకదుళ్ళ తిరస్కార విషయంలో ఏకీభావానికి రాలేకపోయాము. [2]


"అధ్యక్షా! ఈ మిల్లుబట్టల పరిశ్రమ ఇటుపైని విస్తృత పరచకూడదనే నీతికి సంబంధించి ఒక మంత్రి మిత్రుడు, మొట్టమొదట నాతో ఏకీభవించలేనని, వేరే ఒక చీటీమీద వ్రాసి పంపించాడు. అయితే, ఆ మిత్రుడుకూడా పార్టీ సమావేశంలో ఈ సమస్య చివరి చర్చలో ప్రభుత్వ నీతికి (పాలసీకి) వ్యతిరేకంగా చెప్పలేదు...

"మద్యపాన నిషేద విషయమై కొంత గట్టి ప్రతికూలత మొదట్లో వచ్చింది. కొందరు మిత్రులు ఇరవై నాలుగు జిల్లాలలోనూ ఒకే పర్యాయం మద్యనిషేధ చట్టం అమలు పరచవలె ననే అతివాదంలోకి వచ్చారు.. [3]

"జమీందారీ బిల్లు చర్చకు వచ్చింది. సెలెక్టు కమిటీకి ఆ బిల్లు పరిశీలించడానికి పంపవలసిందనే షరతుమీద దానిని ప్రవేశపెట్టడానికి అంతా సమ్మతించారు. అసలు నా మీద మిత్రులు చేసే పెద్ద ఆరోపణ నేను ఏలాగున అయినా పదవిని అంటిపెట్టుకొని ఉందామన్న దురాశ కలవాడి నన్నది. ఇది దురదృష్టకరము. అయితే, నాకు కొంతకాలంగా అదృష్టము, దుర దృష్టమనే భేదభావాలు లేకుండా ఉన్నవి. జయాపజయాలు వ్యక్తిగతంగా నన్ను ఆందోళన పరచవు. ఈ రోజున ఆ స్థలం వారికిచ్చి ఈ స్థలానికి నేను రావడ మన్న దానిని సంతోషపూర్వకంగానే చేశాను.

[హియర్! హియర్! వినుడు! వినుడు! - సభలో ప్రశంసలు]

"నేను ఎవరి చేతులలోకి ఈ పరిపాలనా యంత్రాన్ని అప్పజెప్పానో - వారు, నా అనుభవములవంటి అనుభవాలు పొందకుండా పని సాగించుకోవలెనని నా కోరిక...

"ఈ విశ్వాసరాహిత్య మన్న భావ మెలా వచ్చింది? నాలో ఏవైనా తప్పులున్నా, లేకున్నా ఒకటిమాత్రం చెప్పగలను. పరిపాలనా విధానంలో ఏవిధమైన అసంతృప్తీ కలుగజేసి ఉన్నానని నేను అనుకోను. వ్యక్తిగతంగా, సభ్యులను ఆదరించడంలో ఏ లోటూ రానిచ్చానని అనుకోను. ఒకవేళ ఏదయినా లోటు ఉన్నా, అది అసంతృప్తిగా మారేంతగా ఉందని నేను అనుకోను.

"నేను ఒక బీద కుటుంబంలో జన్మించాను. నన్ను పెద్దచేసి, శిక్షణ నిచ్చిన ఆయనకూడా బీదవాడే. నాకు స్వతహాగా ఎక్కువ మాటాడే అలవాటు లేదు. అయినప్పటికి - నా విద్యార్థి దశలో కానీ, మునిసిపల్ జీవితంలో గానీ, తరువాత ప్రజారంగంలో కాలిడిన తర్వాతగాని, ఈ నా స్వభావంవల్ల ఏ మిత్రుడూ నా యెడల అనాదరణ భావం కలిగి ఉండలేదు."

ఈ విధంగా ఆయన రెండురోజులు ఉపన్యసించారు. పిదప క్రొత్త ప్రభుత్వం పక్షాన డాక్టర్ సుబ్బరాయన్‌గారు ఇలా అన్నారు:

"కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి మనసులో ఉన్నదల్లా చెన్నరాష్ట్ర శాసన సభ్యులు, తమ నాయకుని వీలైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న భావమే. ఆ విధంగా వారు చేయజాలనప్పుడు అధిష్ఠాన వర్గంవారు ఏమి చేస్తారు? చెన్నరాష్ట్రానికి సంబంధించినంతమటుకు కలుగజేసుకోమన్నారు. అనగా, కాంగ్రెసు సంస్థ అనే సాగరంలో చెన్నరాష్ట్ర ఒక ద్వీపం అయిపోయింది. అనగా, సంస్థతో సంబంధం తగ్గిపోయినదన్న మాట. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ఇందుకా మేము పనిచేస్తున్నది? స్వాతంత్ర్య యుద్ధం దాదాపు పూర్తి అయిపోయి, జయము ప్రాప్తించి, మేము ఎక్కిన ఓడ నౌకాశ్రయము చేరే సమయంలో ఒక ద్వీపంగా ఉండిపోవడానికి ఇంక మేము అంగీకరించలేము."

అయితే ఇటువంటి జవాబు చెబుతున్నప్పుడు - ప్రకాశంగారు కాంగ్రెసువాదు లందరిలోనూ ఉత్తమోత్తమ కాంగ్రెసు వాదులనీ, ఉత్తమోత్తమ త్యాగధనులనీ, ఆయన పదకొండు నెలలపాటు నడిపించిన పాలన ఒక్కటి మాత్రమే భారతదేశంలో గాంధీ తత్వానికి అనురూపంగా జరిగిన దన్న దానినీ సుబ్బరాయన్‌గారు, ఆయన ప్రక్కన కూచున్నవారూ గ్రహించలేకపోయారు.

1946 లో సంస్థాపితమై, ఎడతెగని చురుకుదనంతో దాదాపు పదకొండు నెలలు నడచిన ప్రకాశంగారి ప్రజాప్రభుత్వజ్యోతి అలా అవసానము పొందినది

ఆంధ్రప్రాంతంలో, ప్రజలకు - ప్రకాశంగారి ప్రభుత్వ పతన కారకులయిన ఆంధ్ర మంత్రులపైన అమితమైన ఆగ్రహం వచ్చి, అనుకోని పరిణామాలకు దారితీసింది. తెలుగుదేశంలో వారు అడుగుపెట్టిన ప్రతి చోటా వందలకొద్దిమంది ప్రజలు వీరిని చుట్టవేసి, అవాచ్యమైన భాషాప్రయోగాలతో అహింసాదూరమైన కార్యకలాపాలతో వారిని అవమానించారు. కళా వెంకటరావుగారు, బెజవాడ గోపాలరెడ్డిగారు, చంద్రమౌళిగారు ముఖ్యంగా ప్రజల ఆవేశానికి గురి అయ్యారు. నావంటివారి మాటకేమిగానీ, ప్రకాశంగారే ప్రజల కోపాన్ని రెండు మూడు నెలలు తగ్గించలేకపోయారు.

ఏమయినా, తమిళులు కోరిన కార్యం జరిగింది.

ఆంధ్రుల తమ భవిష్యత్తును తాముగానే కొంతకాలం వరకు భ్రష్టం చేసుకోవడం జరిగింది.

ప్రకాశం - సాంబమూర్తిగారల మధ్య విభేదము, ఫలితము

మన దురదృష్టం కొద్దీ, రాజాజీ పాకిస్తాన్ ఇచ్చివేయవలసిందని ఉపన్యసించిన ఒక సభకు బులుసు సాంబమూర్తిగారు అధ్యక్షత వహించారు, వెనక ఒకమారు. తర్వాతి ఆంధ్ర రాజకీయాలలో, వీరిద్దరు కలిసి చేసిన ప్రచారపు దుష్ఫలితాలను గూర్చి తర్వాత వ్రాస్తాను. ఇక్కడ ఒకటి మాత్రం వ్రాయాలి. పై సంఘటనతో ప్రకాశంగారికి సాంబమూర్తిగారికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. ప్రకాశంగారు తలచుకుని ఉన్నట్టయితే, స్థానికంగా ఉన్న ఉపనాయక వర్గం తనకు ఎదురు తిరిగి, తాను రాజాజీతోబాటు జరిపిన ప్రయాణ కార్యక్రమాన్ని అంత గట్టిగా నిరసించి ఉండరనీ, ప్రకాశంగారు రాజాజీపై ఉన్న కోపంతో పాత చరిత్రను గమనించకుండా తనకు కూడా ఇటువంటి దుస్థితి కలిగించారనీ - సాంబమూర్తిగారు తర్వాత ఎప్పుడూ అంటూండేవారు. ఈ విషయంలో ప్రకాశంగారి చర్య తార్కిక వాదానికి సరిగా ఉన్నప్పటికీ, అంతదాకా తమకు అండ దండలుగా ఉండి, ఎప్పుడూ బలపరుస్తూన్న సాంబమూర్తిగారు ఆ తర్వాత సహాయం చేసే పరిస్థితులు లేకుండా చేసినది. సాంబమూర్తిగారి సహాయమే ఉన్నట్లయితే, 1946, 47 లలో ప్రకాశంగారు అంత తొందరగా శత్రువుల చేత పడేవారు కారు.

  1. బి. గోపాలరెడ్డిగారు.
  2. గాంధీగారు ఈ మరకదుళ్ళ విషయంలో ప్రకాశంగారితో ఏకీభవించడమేగాకుండా, అవసరమైతే కేంద్రానికి పరిహారం చెల్లించి అయినా వాటిని తిరస్కరించాలని అభిప్రాయ పడ్డారు.
  3. ఎనిమిది జిల్లాలలో దానిని విస్తృత పరిచేసరికి ఈ ఆందోళన తగ్గింది.