నా జీవిత యాత్ర-4/ప్రకాశంగారి గుండెదిటవు
15
ప్రకాశంగారి గుండెదిటవు
లోగడ ప్రకాశంగారి మంత్రివర్గ పతనకారకులైన తెలుగు మంత్రులపైన ఆంధ్రదేశ ప్రజలకు చాలా ఆగ్రహం కలిగిందని వ్రాశాను.
ఇలా ఉండగా, 13-4-47 న, జలియన్‌వాలాబాగ్ దినమున [1] విజయవాడలో నేతాజీ సుభాస్ చంద్రబోసు కాంస్య విగ్రహాన్ని ప్రకాశంగారు ఆవిష్కరించారు. ప్రేక్షకులు చాలా మంది హాజరయ్యారు.
అంతక్రితం కాకినాడలో - ప్రకాశంగారి మంత్రివర్గ పతన కారకులలో ఒకరయిన పళ్ళంరాజు అనే ఆయనను బహిరంగ సభలో, అక్కడ చేరిన ప్రేక్షకులంతా అల్లరి చేశారు. ఆ వార్త విజయవాడలో 13 వ తేదీన తెలుసుకొన్న కొందరు, కాకినాడలో జరిగినదానికి ప్రతీకారంగా ప్రకాశంగారి ఉపన్యాస సమయంలో అల్లరి చేద్దామని యత్నించారట. ప్రకాశంగారి సభకు ఎవరూ వెళ్ళరాదని ఊళ్ళో ప్రచారం చేశారట.
సమావేశం ప్రారంభమయింది. వేదికమీద కదలకుండా కూచుని ప్రకాశంగారు ఇలా చెప్పారట:
"ఎవరికైతే ఎదురు పక్షంవారు వచ్చి కొడతారనే భయం ఉన్నదో వారు ఈ సభలోంచి వెళ్ళిపోవలసింది."
ఆ విధంగా ఆయన చెప్పినా, అక్కడ చేరిన డెబ్భై ఎనభై వేల మందిలో ఒక్కరూ కదలలేదట. అంతేకాకుండా, అల్లరి చేద్దా మని (కాంగ్రెసుచే నియమింపబడి) వచ్చినవారిని తీవ్రంగా కొట్టి సభ అవతలికి నెట్టేశారట.
ఆతర్వాత రెండుగంటలసేపు ప్రకాశంగారు యథేచ్చగా ఉపన్యసించారని, ఆయనకు సన్నిహితులైన ముదలి వెంకటేశ్వరరావుగారు నాతో ముచ్చటిస్తూ అన్నారు.
అటువంటి గుండె దిటవుకు ప్రకాశంగారు పెట్టినది పేరు
1945 లో మేము జైలునుంచి విడుదలయి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో పర్యటించడం జరిగింది. అప్పటికి కాంగ్రెసునుంచి విడిపోయి, కమ్యూనిస్టులైన కొందరు మిత్రులు ఒక బహిరంగ సభలో ప్రకాశంగారిని తూలనాడ నారంభించారు. అక్కడి ప్రజలు అలా తూలనాడిన మనిషిని అదమాయిస్తూ ఉంటే, ప్రకాశంగారు, "అత నెవరో చిన్న కుర్రవాడు. ఏమీ అనకండి!' అని సర్దుబాటు చేశారు.
కాని, మేము తర్వాతి గ్రామం వెళ్ళేసరికి కమ్యూనిస్టు మిత్రులు హెచ్చు బలంతో వచ్చి అల్లరి చేయబోయారు. అక్కడేమో - ప్రేక్షకులు వారిని బలవంతంగా బయటికి త్రోసేశారు. మేము ఆ తర్వాత గ్రామానికి వెళ్ళేసరికి రమారమి పదకొండు గంటలు కావచ్చింది. ఎవరో ఒకరింటి ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. వేయి మందికి సరిపోయే ఆ చోట దాదాపు నాలుగువేలమంది ఇరుక్కొని కూచున్నారు. మీటింగు ఆరంభమయేసరికి దాదాపు యాభైమంది కమ్యూనిస్టు మిత్రులు నినాదాలు చేస్తూ, బాణాకఱ్ఱలు త్రిప్పుతూ ఒక ప్రక్కనుంచి ప్రేక్షకుల మీదికి దుమికారు. ప్రజలు లేచిపోసాగారు. వారికీ వీరికీ జరిగిన సంకుల సమరం, ప్రకాశంగారూ నేనూ కూచున్న వేదికను సమీపించ నారంభించింది. సమావేశం ఏర్పాటుచేసిన పెద్దలు కొందరు ప్రకాశంగారి దగ్గరికి తొందరగా వచ్చి, "వారి బాణాకఱ్ఱలు, వీరి బాణాకఱ్ఱలు మీకు తగులుతాయి. మీరు లేచి గదిలో కూచోండి. మేము ఆ కమ్యూనిస్టులను తరిమివేసిన తర్వాత మీరు ఇవతలకు రావచ్చును," అన్నారు.
ప్రకాశంగారు - "దెబ్బలు ఎలా తగులుతాయో చూస్తానులే! ఇక్కడే కూచుంటాను," అన్నారు. ఆయన కదలకపోయేసరికి నాకూ ధైర్యంవచ్చి, నేనూ కదలలేదు.
ఆ యుద్ధమంతా మాకు రెండు బారల దూరంలోనే జరుగుతున్నది. కొంత సేపటికి కమ్యూనిస్టు పార్టీ మిత్రులు తమ బాణా కఱ్ఱలతో వెనకకు పోయారు. ఆ తరువాత అక్కడ రెండు గంటల సేపు సభ జరిగింది.
అటువంటి ప్రకాశంగారు బెజవాడలో కాంగ్రెసువారు చేసిన అల్లరికి ఎందుకు లొంగుతారు?
ఆ కాంగ్రెసువారే తరువాత అక్కడినుంచి పోయారు.
శాసన సభలో పాయింట్ ఆఫ్ ఆర్డరు
1947 ఆగస్టు 15 న అఖండ భారతదేశం ఖండమై స్వాతంత్ర్య ప్రాప్తి పొందింది. చెన్నరాష్ట్ర అసెంబ్లీ 16-9-1947 న స్వాతంత్ర్యానంతరం ప్రథమ సమావేశం జరుపుకొన్నది.
నాడు, ప్రకాశంగారు ఒక పాయింట్ ఆఫ్ ఆర్డరు (అనగా - ఒక పని శాసన సభ కార్య సూత్రాలకు వ్యతిరేకంగా జరిగినపుడు దానిని గూర్చి సభాద్యక్షునికి ఏ సభ్యుడైనా చేసే సూచన) లేవదీశారు.
ఆయన లేవదీసిన మొదటి పాయింటు ఇది: బ్రిటిషు హవుస్ ఆఫ్ కామన్స్‌లో పాసయిన, ఇండియన్ ఇండిపెండెన్స్ ఆక్టు (ఇండియా స్వాతంత్ర్య శాసనము)లో - ఇండియాలో అప్పటికి పనిచేయుచున్న కేంద్ర శాసన సభ ఏదో, అదే స్వాతంత్ర్యానంతరం శాసన సభగానూ, నూతన సంవిధాన నిర్మాణ సభగానూ ద్వివిధ శక్తులతో పనిచేయగలదని వ్రాసి ఉంది. అందులో రాష్ట్ర శాసన సభల ప్రసక్తి లేదు. అందుచేత, అవి రద్దు అయినట్టుగానే భావించాలి. కనుక, చెన్నరాష్ట్రంలో పాత శాసన సభ ఆ రోజున శాసన సభగా పనిచేసే వీలులేదు.
ఇక రెండవ విషయము:
ఒకవేళ పనిచేసినా, శాసన సభ్యులు, మంత్రులూ స్వతంత్ర భారత ప్రభుత్వానికి తమ విధేయతను చూపించే ప్రమాణం చేయనిదే శాసన సభలో వారు ఏ కార్యాలు చేసే వీలులేదు. ఇదివరలో వారు తీసుకొన్న ప్రమాణంలో - వారు, బ్రిటిష్ చక్రవర్తికి తమ విధేయతను చూపించగలమని ప్రమాణం చేశారు.అందుచేత, క్రొత్త ప్రమాణం అవసరము. ఇదే రెండవ పాయింటు.
ఢిల్లీలోని సంవిధాన సభ ఈ విషయమై ప్రత్యేకంగా శాసన దత్తత ఆదేశము (Adaptation order) పంపలేదన్న వాదం చెల్లలేదు. బ్రిటిషు గవర్నమెంటుకు సర్వ విధేయతలు చూపిస్తామన్న పాత ప్రమాణంతో, స్వతంత్ర భారతదేశ శాసన సభలో ఈ శాసన సభ్యులు ఎలాగు పనిచేయగలరు?
అసలు, అంతకు ఒక రోజు క్రితం ముగ్గురు శాసన సభ్యులు, క్రొత్తగా ప్రమాణం తీసుకోవలసి వచ్చినప్పుడు, భారతదేశ సంవిధానానికే తమ విధేయత ప్రకటిస్తూ ప్రమాణాలు చేశారు. అందుచేత శాసన సభలో అప్పుడు భారతదేశ సంవిధానికి విధేయత చూపించే వారు కొందరూ; మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన బ్రిటిష్‌వారి చక్రవర్తికే విధేయత చూపించి ప్రమాణం చేసినవారు మరి కొందరూ (చాలామంది) ఉన్నారు. ఇది కూడదని ప్రకాశంగారు లేవదీసిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను సభాధ్యక్షుడు త్రోసివేశాడు. ప్రకాశంగారి పాయింటు సరి అయినది కాదని అధ్యక్షుడు ఇచ్చిన రూలింగు సరి అయినది కాదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ పాయింటు లేవదీసినపుడు శాసన సభలో చర్చింపబడుతున్న విషయము - జమీందారీ రద్దు బిల్లు. ప్రకాశంగారు ఆ సందర్భంగా ఇలా అన్నారు:
"కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు ఈ జమీందారీ రద్దు బిల్లు చర్చించడానికి పూర్వం చెన్నరాష్ట్రపు మంత్రులు తమ దగ్గరికివచ్చి సలహా తీసుకోవలసిందని ఆదేశించారు. వారు చెప్పినట్టు ఈ ప్రభుత్వంవారు నడుచుకోవాలి.
"అధ్యక్షా! కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు మన ప్రభుత్వంలో ఇటువంటి అతి జోక్యం కల్పించుకోకూడదని నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో గట్టిగా ఎదిరించాను. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సంవిధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకని ఏర్పాటైన విషయాలలో, మన ప్రభుత్వానికి చెందినంతమటుకు, సంవిధానానికి వ్యతిరేకంకాని పద్ధతిలో, మనకు తోచిన నిర్ణయం మనమే చేసుకోవచ్చును. మన సంవిధానానికి విధేయత చూపుతూ ప్రమాణం చేయమనడానికిదే కారణము."
ప్రకాశంగారు ఈ మాటలు చెప్పిన తేదీ 3-12-47. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు నాలుగు నెల లయింది.
అయినప్పటికీ, బ్రిటిషు ప్రభుత్వం ఎడల విధేయత చూపుతూ ప్రమాణంచేసిన వారు, డిల్లి ప్రభుత్వానికి విధేయత చూపించాలని భావించారు కానీ, సంవిధానం విషయం వారి మనసుకు పట్టలేదు.
ఇతర విశేషములు: 1947
ప్రకాశంగారి మంత్రిమండలి పతానానంతరము, ఆయన నివసిస్తున్న ఇంటినుంచి ఉత్తర క్షణం ఖాళీ చేయించడానికి చిన్న ఉద్యోగులు, సిబ్బందీ పూనుకొన్నారు. జ్ఞాతి వైరమంటే అలా ఉంటుంది. ప్రకాశంగారు మరొక ఏర్పాటు చేస్తేగానీ అక్కడినుంచి కదిలేది లేదన్నారు. కార్యదర్శులు కొందరు, ఈ సమస్య నెలా పరిష్కరించేదని గాభరా పడ్డారు.
గవర్నమెంట్ హవుస్ ఎస్టేటులో ఒకటి, రెండు ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రులైనా, కాకున్నా - ముఖ్యులైన శాసన సభ్యులకు అవి వసతి గృహాల క్రింద ఇవ్వడం పరిపాటి.
రెండు, మూడు దినాలు సిద్ధాంత రాద్ధాంతాలు జరిగిన తర్వాత, ఒక యిల్లు కేటాయించగా, ప్రకాశంగారు పాత యింటిని వదిలి, అందులోకి వెళ్ళారు.
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటై, కర్నూలుకు కదిలేదాకా ఆయన ఆ యింట్లోనే నివసించారు.
నూతన ఆంధ్రరాష్ట్ర స్వరూపం ఆ యింట్లోనే నిర్ణయమైనది. మంత్రులపై ఛార్జీలు
ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలోనే - బెజవాడ గోపాలరెడ్డిగారు, వారి కుటుంబంలో మరొక అయిదారుగురు, వారికి కొంత దూరపు బంధువులయిన ఇద్దరు కలిసి ఒక ప్రైవేటు కంపెనీగా ఏర్పడి, స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ ఆక్టు క్రింద పది లక్షలు అప్పు ఇవ్వవలసిందని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీసుకు అర్జీ పెట్టుకొన్నారు. వారు చేయదలచుకొన్నది - వేరుశనగనూనె తీయడానికి ఒక మిల్లు స్థాపించడము.
ఆ మిల్లు పేరు సుదర్శన ఆయిల్ మిల్సు.
ఆ శాసనం క్రింద ఇటువంటి ఋణాలు ఇవ్వడానికి వీలులేదని వారు నిరాకరించారు. దానిపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిని ఋణము కోరగా వారూ నిరాకరించారు. ఆ తర్వాత ఆ ఋణం ఇవ్వవలసిందని వారు ప్రభుత్వానికే అర్జీ దాఖలు చేసుకొన్నారు. ఇంతలో, ప్రకాశంగారి మంత్రివర్గం పతనమయింది.
తర్వాత, గోపాలరెడ్డిగారు ఆర్థిక మంత్రి అయ్యారు. బళ్ళారి నుంచి వచ్చిన హెచ్. సీతారామరెడ్డి అనే శాసన సభ్యులు పారిశ్రామిక శాఖా మంత్రి అయ్యారు. వారు తమ యాజమాన్యం క్రింద నడిచే ఒక మిల్లుకు ఆరు లక్షలు కావాలని అర్జీ పెట్టుకోగా, ఆర్థిక మంత్రిగా గోపాలరెడ్డిగారు దానిని ఆమోదించి డబ్బు మంజూరు చేశారు.
పారిశ్రామిక శాఖా మంత్రి అయిన సీతారామరెడ్డిగారు అంతకు ముందు పదిలక్షల రూపాయలకోసం గోపాలరెడ్డిగారు పెట్టుకొన్న దరఖాస్తుపై డబ్బు మంజూరు చేయడం అర్హమేనని సిఫారసు చేశారు. ఆర్థిక మంత్రిగారు తమ దరఖాస్తుపై డబ్బు మంజూరు చేసుకొన్నారు.
ఆ సంవత్సరంలో స్టేట్ ఎయిడ్ టు ఇండస్ట్రీస్ ఆక్టు క్రింద ఋణాలు ఇవ్వడానికి కేటాయించిన సొమ్ము యాభైవేల రూపాయలు మాత్రమే. లక్షకు మించి క్రొత్తగా వ్యయం చేయవలసి ఉంటే, ఫైనాన్స్ కమిటీ అనే ఉప సంఘం ముందు, వాటికి సంబంధించిన దరఖాస్తులు విచారణకై వెళ్ళాలి. అయితే, శాంక్షన్ అయిన ఈ దర ఖాస్తులు అ కమిటీ ముందుకు వెళ్ళినట్టు లేదు. ఇది కాబినెట్‌కు అసలే తెలియదు.
ఇది అధికార దుర్వినియోగమని మంత్రులపై ప్రకాశంగారు చేసిన మొదటి ఛార్జీ. [2]
తెనాలికి చెందిన శాసన సభ్యులు ఆలపాటి వెంకటరామయ్య గారు [3] మోహన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థకోసం లక్ష రూపాయల ఋణం ఆడిగారు. ఆయన గోపాల రెడ్డిగారి వర్గానికి చెందినవాడు గనుక లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఆ మోహన్ ఇండస్ట్రీసుకి సైను బోర్డు తప్ప, వేరే పరిశ్రమ అప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు.
ఏ విధమైన హామీ (సెక్యూరిటీ) లేకుండా, తమ రాజకీయ మిత్రునికి లక్ష రూపాయలు ఇవ్వడం తప్పని ఎవరో శాసన సభ్యులు గట్టిగా అల్లరి చేసిన పిమ్మట, లక్ష రూపాయల విలువగల వేరే భూమి హామిగా ఇస్తున్నామని వారు పత్రం ఒకటి బలవంతాన వ్రాసి యిచ్చారు. ఆ అప్పు తీరలేదు. సెక్యూరిటీ ఇచ్చిన ఆస్తిపైన ఋణాన్ని రాబట్టుకొందామనుకొంటే, ఆ పత్రమే చెల్లదు. అనే మొదలైన వాదాలు లేవదీశారు.
అధికార దుర్వినియోగ నేరారోపణలో ఇది కూడా ఒకటి.
ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ధాన్యసేకరణ చురుకుగా జరగడానికని ఎరువులు చవకగా దొరకడం కోసమని బస్తాకు ఒకటి చొప్పున బోనస్ చీటీలు ఇచ్చేవారు. బోనస్ చీటికి ఇంత అని ఎరువులు గవర్నమెంట్ గొడౌనులలో కొనుక్కునేకుందుకు వీలు కల్గించారు. ఇటువంటి లాభం స్వయంగా ధాన్యం పండించి, ధాన్యం అప్పజెప్పే రైతులకే చెందవలెనని ఆదేశము. ఈ ఆదేశం ప్రకారం రైతులు బోనస్ చీట్లను సంపూర్ణంగా వినియోగించుకొనే సమయం రాకుండానే ప్రకాశంగారి మంత్రివర్గం పతన మయింది.
క్రొత్త మంత్రి వర్గంలోని వేముల కూర్మయ్యగారు, ప్రకాశంగారి మంత్రి వర్గంలోనూ ఉండిన వారే. పడత్రోసిన వారితో ఏకం కావడంవల్ల క్రొత్త మంత్రి వర్గంలో కూడా ఆయన మరల మంత్రి అయ్యారు.
విజయవాడలో, ఆయనకు సన్నిహితుడైన ఒక హోటలు ఖామందు ఉండేవాడు. ఆయన అమాయికులైన రైతులదగ్గర వందలకొద్ది టన్నుల ఎరువులు తేలిగిన బోనస్ చీటీలను సంపాదించాడు. అగ్రికల్చరల్ ఆఫీసరు దగ్గిరికి వెళ్ళి, ఈ బోనస్ చీటీలన్నీ చూపించే సరికి, ఆ ఆఫీసర్ ఆ చీటీలకు కావలసిన ఎరువు విజయవాడ గొడౌన్లలో లేదనీ, చాలా గొడౌన్లనుంచి సేకరించినా సరిపోదని అభిప్రాయ పడ్డాడు.
ఆఫీసర్ అనవసరంగా ఆలస్యం చేస్తున్నాడని, ఆ హోటలు ఖామందు కూర్మయ్యగారితో చెన్నపట్నానికి వచ్చి చెప్పారు. ఆయన వ్యవసాయ శాఖామంత్రి అయిన మాధవమేనోన్ గారిచేత - హోటలు ఖామందుకు ఆయన ఇచ్చే బోనస్ చీటీలనుబట్టి కావలసినంత ఎరువులు ఈయవలసిందనే ఆదేశం వ్రాయించి, ఒక కాపీ ఆయన చేతిలోనే పెట్టి పంపారు.
ఒక్కొక్క రైతుకు నిర్ణీతమైన బరువుగల ఎరువులకు మించి ఇవ్వరాదనే నిషేధం ఉండడంవల్ల, ఎంతమంది రైతుల పేర్లు కావలెనో అంతమంది పేర్లతో ఆయన అంతకు ముందే ఒక పట్టీ దాఖలు చేసి ఉన్నాడు. ఆ పట్టీ నిజమనదో, అబద్ధమైనదో చూసిన వాడెవడూ లేడు.
ఆ హోటలు ఖామందు తాను రైతు కాకపోయినా, వందలకొద్ది రైతుల కీయవలసిన ఎరువులను తాను బ్లాక్ మార్కెట్ చేసుకున్నట్టయితే, ఉత్త పుణ్యానికే అనేక వేల రూపాయల లాభం పొందగలడు.
అధికార దుర్వినియోగ దోషారోపణలలో ప్రకాశంగారు పేర్కొనవాటిలో ఇది ఒకటి.[4] ఈ విధంగా ఒక పది ఛార్జీలు కలిపి, మంత్రులు ఈ విధంగా అధికార దుర్వినియోగంచేస్తే, కాంగ్రెసు ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని కాంగ్రెసు అధ్యక్షులు రాజేంద్ర ప్రసాదుగారు చెన్నపట్నం వచ్చినప్పుడు విజ్ఞప్తి పత్రం ఆయన చేతికిచ్చాము.
అ సమయంలో ఆయన నాతో ఇలా అన్నారు: "నీవు సంతకంపెట్టి ఇచ్చినప్పుడు, ఇందులో నిజమున్నదో లేదో అన్న చర్చ నాకు అక్కరలేదు. నీవు వ్రాసింది నిజమని నేను నమ్ముతాను. కాని, ఏ డెనిమిదిమంది మంత్రులతో సంబంధించిన దీన్ని చర్చిస్తే ప్రభుత్వపు ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. అందుచేత దీన్ని చర్చించాలని గట్టిగా అడగవద్దు."
"మీరూ మేమూ కలిసి పెంచిన కాంగ్రెసు ప్రతిష్ఠ మాట ఏమిటి?" అని నేను ఎదురు ప్రశ్న వేశాను.
ఆయన నవ్వుకుంటూ ఆ కాగితాలు ప్రక్కను పెట్టేసుకున్నారు. కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు కలుగజేసుకోరని తెలిసిపోయింది.
అందుచేత ప్రకాశంగారే, ఈ విషయాలను శాసన సభలో చర్చించడానికై, శాసన సభ హక్కుల భంగమనే సూత్రం క్రింద ప్రివిలేజీ తీర్మాన మొకటి ప్రవేశపెట్టారు.
మంత్రులు అధికారం దుర్వినియోగం చేస్తే, దాన్ని, శాసన సభ హక్కులకు భంగం క్రింద చర్చించే అవకాశముందా, లేదా? అన్నది స్పీకరు పదిహేను రోజులపాటు ఆలోచించి, చివరకు దానికి హక్కుల భంగంతో సంబంధం లేదని త్రోసివేశాడు. అయితే, ఆ విధంగా త్రోసివేసినపుడు, ప్రత్యేకమైన తీర్మానం క్రింద నోటీసు ఇచ్చినట్టయితే ఆలోచిస్తానని ఒక వాక్యం అందులో వ్రాశాడు.
ప్రకాశంగారు ఆ సలహా తీసుకొని, ఆ దోషారోపణ పత్రంలోని విషయాలన్నీ శాసన సభవారు చర్చించి, దోషులయిన మంత్రుల మీద తగిన చర్య తీసుకొనేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందనే తీర్మానమును ప్రవేశ పెట్టారు. ప్రవేశ పెట్టేముందు, అనవసరమైన అభ్యంతరాలు ఆఫీసువారు లేవదీయకుండా, ఆ ముసాయిదా పత్రాన్ని సెక్రటరీగారికి చూపించి, ఆయన బాగున్నదన్న తర్వాతే కార్యనిబంధనల ప్రకారంగా నోటీసిచ్చాము.
ఈ నోటీసిచ్చామన్న సంగతి తెలిసిన వెంటనే మంత్రివర్గం యావత్తూ ఆ బరువు స్పీకరుపైని మోపడం మొదలుపెట్టారు.
యథాలాపంగా మాట్లాడినట్లు ఒకమారు, సలహా అడిగినట్లు మరొకమారు; రాజేంద్ర ప్రసాద్‌గారే ప్రభుత్వం ప్రతిష్ఠకు లోటు వస్తుందని చెప్పినప్పుడు, కాంగ్రెసు పార్టీలో సభ్యులయిన ప్రకాశంగారు ఇటువంటి తీర్మానం ప్రతిపాదించడం న్యాయంగా ఉందా అని ఇష్ఠాగోష్ఠిగా చెప్పినట్లు ఇంకొకమారు; ఇంతకూ ప్రకాశంగారికి సంఖ్యాబలం లేకపోవడంవల్ల ఏలాగూ వీగిపోయే తీర్మానం చర్చకు తెచ్చి, శాసన సభా సమయమంతా వ్యర్థపరచడం భావ్యమా అని వేరొక్కమారు - అనేక విధాలుగా స్పీకరుగారిని ఒక మంత్రి వదలితే ఇంకొక మంత్రి, వారి వర్గాలకు చెందిన శాసన సభ్యులూ వెళ్ళి ఆయనను నొక్కాడానికి చాలా యత్నించారు.
ఆయన కూడా కార్యదర్శితో చాలా చర్చించి, ఆ తీర్మానం త్రోసివేయడానికి ఏ విధంగానూ వీలులేక పోవడంవల్ల దానిని గ్రహిస్తూ, ఎట్లయినా తీర్మానం వీగిపోతుంది గదా - బాధ ఎందుకని మంత్రులకు నచ్చజెప్పి, ఆ తీర్మానాన్ని ఎజండాలోనికి తెచ్చేందుకు అనుమతించారు.
ప్రకాశంగారి ఉద్దేశం - తీర్మానం జయమవుతుందా, వీగి పోతుందా అన్నది కాదు. శాసన సభలో బాహాటంగా, ముఖాముఖి చర్చ జరిగితే, మంత్రులు చెప్పుకోగలిగినదంతా చెప్పుకున్న తర్వాత - మంత్రులుచేసిన పనులు, అధికార దుర్వినియోగం క్రింద తప్పకుండా వస్తాయని ప్రజలు గ్రహిస్తారనీ, అలా గ్రహించడంవల్ల రాబోయే ఎన్నికల్లో వారే అధికార దుర్వినియోగం చేసిన ఆ మంత్రులకు తగిన గుణపాఠం చెప్పుతారనీ ఆయన ఆలోచన. అది పొరపాటు కాలేదు.
శాసన సభలోనూ, తర్వాత బహిరంగంగానూ ఆ మంత్రులు మొదటి సంవత్సరంలోనే చేసిన అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గ్రహింపగలిగారు. 1952 జనరల్ ఎన్నికలలో ఆ దోషారోపణ పత్రానికి గురి అయిన మంత్రులలో ఒక్కరూ తిరిగి ఎన్నుకోబడలేదు.
మొదట్లో, ఈ విషయాలను ప్రకాశంగారు బాగా నొక్కినొక్కి ప్రతి బహిరంగ సభలోనూ చెప్పాలని అనుకొన్నాము. కాని, ఎన్నికల సమయం వచ్చేసరికి, మేము వెళ్ళిన చోటల్లా ఈ మంత్రులు, వారి, అధికార దుర్వినియోగం అన్న మాటలతోనే వాతావరణమంతా నిండిపోయింది. ఫలితం మీదచెప్పినవిధంగా ఆ మంత్రులందరి పరాజయంగా పరిణమించింది. ప్రకాశంగా రీ విషయంలో చేసిన ప్రచారం వారి దూరదృష్టికి నిదర్శనము.
వీటి చరిత్ర యింతటితో ఆగలేదు. శాసన సభలో జరిగిన చర్చలు, గలాభాలు అన్నీ చూసి, అధిష్ఠాన వర్గంవారు వీటి విషయమై చర్చిస్తాము లెమ్మన్నారు. మేము చేసిన ఆరోపణలు ఋజువు చేయడానికోసం, వాటికి సంబంధించిన కాగితాలు ప్రభుత్వంవారు మాకు చూపించవలసిందని కోరాము. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి రాజాగారు. ఆయన విషయం ఇదివరలో కొంత వ్రాసే వున్నాను. ఆయన, కాంగ్రెసు అధిష్ఠానవర్గంవారి ఆదేశాన్ననుసరించి, ఆ కాగితాలన్నీ మాకు చూపించారు. దానిపై ఆయన, ఇవేవో ఒకమారు అదిష్ఠాన వర్గంవారు కూడా పరిశీలించి తుదినిర్ణయం తీసుకొంటే, కాంగ్రెసుపార్టీ బలపడుతుందని వ్రాయడం తటస్థించింది. దానిమీద, అధిష్ఠాన వర్గంవారు వర్కింగ్‌కమిటీ సభ్యులైన శంకరరావు దేవుగారిని వీటిని పరిశీలించడానికి, నియమించి పంపించారు.
ఇంతటిలో, పట్టాభి సీతారామయ్యగారి వర్గంవారు - తాము కూడా ఏదో ఒక దోషారోపణ చేస్తే తమ వర్గంమీద చేసిన దోషారోపణల బలం తగ్గగలదని ఒక ఆరోపణ చేశారు.
వారు, 1945 లో ఆంధ్రదేశంలో తుఫాను చెలరేగినప్పుడు తుఫాను బాధితుల సహాయార్థం వసూలుచేసిన డబ్బులో మిగులు ధనం, పాస్‌బుక్కు తమ వర్గానికి చెందిన కోశాధ్యక్షుని చేతిలోనే ఉండడంవల్ల - అందులో ఒక పెద్దమొత్తం ఇరవై వేల రూపాయలు, ఒక ఆసామీ భవిష్యత్తులో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయితే తనకు ఏదో ఫారెస్టు కాంట్రాక్టులకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చిన లంచమని, ఆ మొత్తం ఆ వ్యక్తి ఏ బ్యాంకువారి ఏ నెంబరు చెక్కుమీద వ్రాసియిచ్చాడో వివరిస్తూ, తమ వర్గంమీది నేరారోపణలను పరిశీలించేటపుడు, ప్రకాశంగారు పుచ్చుకొన్న యీ లంచం విషయంకూడా చర్చించాలనే ప్రతి విజ్ఞప్తి ఆ శంకరరావుదేవుగారి చేతిలో పెట్టారు.
శంకరరావుదేవుగారు రాగానే, ప్రకాశంగారు తమపై నున్న ఆరోపణలన్నిటికీ 'కాపీలుకాక అసలు కాగితాలనే చూపించ' మన్నారు. ఆయన కాపీలు ఇచ్చినప్పుడు అసలుతో సంబంధమేమని అడిగారు.
"క్రిమినల్ కేసులో ముద్దాయికి అసలుకాగితం చూసే హక్కుంది. చూపించం"డని ప్రకాశంగారంటే, ఆయన, "కాపీలో ఉన్నదే అసలులో ఉంటుంది గదా! ఎందుకు అసలు కావాలని నొక్కి అడగడ"మని ప్రశ్నించారు.
అందుకు ప్రకాశంగారు ఇలా చెప్పారు:
"ఈ మంత్రులపై నేను ఆరోపణలు తెచ్చి, మూడేండ్లు కావచ్చింది. ఈ మూడేండ్లలో, ఇప్పుడు నాపై చేసిన ఈ ఆరోపణల ప్రసక్తి రాలేదు. ఇటువంటిది - నిజంగా వారు నా మీద చేయదలచి ఉంటే, 1946 లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి ఉండవలసింది.
"ఇవన్నీ రాజకీయాలు. అందుచేత, ఇంత ఆలస్యంగా వచ్చిన ఆరోపణ, అసలు ఎక్కడనుంచి పుట్టిందో తెలుసుకోవాలి. ఈ సంతకం పెట్టిన ఆసామీ కృష్ణాజిల్లావాడు. ఈ కాగితం కృష్ణాజిల్లాలో పుట్టలేదు. నాకు లంచమిచ్చాడని ఆరోపింపబడిన మనిషి చెన్నపట్నంవాడు. ఈ కాగితం చెన్నపట్నంలో పుట్టలేదు. ఇది ఢిల్లిలో పుట్టింది. అసలు కాగితం చూస్తే, అది ఎవరి ఇంటిలో పుట్టిందోకూడా చెప్పగలను. అందుకోసమే అడుగుతున్నాను." "ఏమయినా సరే, ఇవ్వ" నన్నారు శంకరరావుదేవుగారు.
అంటే, ఈ ఫిర్యాదు రాజకీయంగా వేసిన ఎదురెత్తేగాని, నిజం కాదన్నది ఆయనా గ్రహించే ఉంటాడు. అందుచేతనే - అసలు ఇవ్వ వలసిందని మా పట్టుదల; ఇవ్వనని ఆయన పట్టుదలాను.
అధిష్ఠాన వర్గంలో ప్రకాశంగారికి ప్రతికక్షిగా ఉన్న ఒక ఉన్నత స్థానీయుని యింట యీ అభూత కల్పన జరిగిందని మా అందరి మనసులలోనూ ఉండేది.
ఇక, ఇక్కడ చెన్నపట్నంలో తమకు లంచమిచ్చాడని చెప్పబడ్డ వ్యక్తిని పిలిపించి, ఆయన చెప్పే సాక్ష్యం తీసుకోవలసిందని ప్రకాశంగారు శంకరరావుదేవుగారిని బలవంతం చేశారు.
"ఎందుకు లేండి, అక్కరలేదు లేండి" అని ఆయన తప్పుకొన్నారు.
ఆ తర్వాత, శంకరరావుదేవుగారు - ముఖ్యమంత్రి కుమారస్వామిరాజాగారిచేత ఆరోపణపత్రంలో చెప్పిన బ్యాంకుకు ఉత్తరం వ్రాయించారు అ భ్యాంకువారు, ఆ పేర్కొన్న వ్యక్తికి తమ బ్యాంకులో అకౌంటు లేదనీ, అందులో చెప్పిన నంబరుగల చెక్కు పుస్తకం తమ బ్యాంకువారు జారీ చేయలేదనీ వ్రాశారు. ఇంక ప్రకాశంగారిపైన దోష మేముంది?
అయితే, కుమారస్వామిరాజాగారు గానీ, శంకరరావుదేవుగారు గానీ - బ్యాంకువారి ఉత్తరాన్ని వెంటనే బయటపెట్టలేదు.
కొంతకాలమైన తర్వాత మేము ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఈ తగువు తీర్చడానికి, కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు - వల్లభాయి పటేలు, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అజాద్‌గారలు గల ఒక ఉప సంఘాన్ని నియమించారు.
బ్యాంకువారి ఉత్తరం సంగతి మాకు తెలియనీకపోవడంవల్ల, ప్రకాశంగారు మొదటి ధోరణిలోనే, తమపై గల ఆరోపణ మొట్టమొదట విచారించి, తాము దోషియో, నిర్దోషియో తేల్చవలసిందని బలవంతపరిచారు. బ్యాంకు ఉత్తరం సంగతి తెలిసి ఉండికూడా, నెహ్రూగారు, "పరిశీలనకేముంది? పరిశీలనకేముంది? అని పదిసార్లు తప్పించి మాట్లాడారు.
చివరకు, ఆ ఆరోపణ సరియైనది కాదని ఒక ఉత్తరం మూలంగానైనా అధిష్ఠానవర్గంవా రెవరూ తెలియపరచలేదు.
చివరకు నివేదిక వ్రాసేటప్పుడు మాత్రం, ప్రకాశంగారిపై వ్రాసిన పిర్యాదులో పేర్కొన్న వ్యక్తికి, అందులో చెప్పిన బ్యాంకులో అకౌంటు లేదని వ్రాశారు.
ఈ ఉత్తరం ఎక్కడ, ఎలా పుట్టింది? ఇటువంటి ఘోరమైన అసత్యారోపణలు చేసినవారిపై ఏమి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి? - ఈ వ్యవహారాలు వారెవ్వరూ పట్టించుకోలేదు.
అటువంటి కాంగ్రెసువాదులూ, అటువంటి కాంగ్రెసు అధిష్ఠాన వర్గమూ ఉండడంచేతనే - సత్యాహింసాచక్రద్వయం పైని, మహాత్మా గాంధీగారు స్వాతంత్ర్య రథాన్ని నడిపించి సంపాదించిన స్వతంత్ర భారతదేశానికి, ఇప్పుడు మనమంతా చూస్తున్న కడగండ్లు కలగడంలో ఆశ్చర్యం లేదు.
- ↑ 1919 లో వ్యక్తి స్వాతంత్ర్యాన్ని అనేక విధాలుగా అణచివేయడానికని రౌలట్ బిల్సు అని రెండు బిల్లులను కేంద్ర సభలో ప్రభుత్వంవారు ప్రవేశపెట్టగా, దేశమంతటా ఆందోళన కలిగింది. ఆ బిల్లులు పాస్ చేస్తే, దేశంలో సాత్త్విక నిరోధం (Passive resistance) ప్రారంభిస్తామని గాంధీజీ ప్రకటించారు. దేశమంతటా ప్రచారం జరిగింది. అపుడు అమృతసరులో జలియన్ వాలాబాగ్ అనే బహిరంగ స్థలంలో ఒక సమావేశం ఏప్రిల్ 13 న జరిగింది. ఆ ఆవరణకు ఒకటే త్రోవ. ఇటువంటి సభలు జరగడం ప్రభుత్వానికి ఇష్టంలేదు. అందుచేత జనరల్ డయ్యర్ అనే ఆయన అక్కడికి మెషీన్‌గన్ తెచ్చి, ఎవరినీ బయటికి పోనీక అడ్డుపడి, 1500 మందిని దారుణంగా హత్యచేశాడు. 3, 4 వేల మంది గాయపడ్డారు. అప్పటినుంచి బ్రిటిషువారు జరిపిన ఆ అమానుష కృత్యానికి గుర్తుగా ఆ 13 వ తేదీన - జలియన్ వాలాబాగ్ దినం జరపడం, సభలు చేయడం మన దేశంలో ఆచారంగా ఉన్నది.
- ↑ గోపాలరెడ్డిగారు సుదర్సన మిల్లుకు శాంక్షన్ చేసిన ఋణం, ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళ రాష్ట్రం వసూలు చేసుకోవలసిన ఋణాలలో చేరింది. వారికి ఆ మిల్లునంతా అమ్మినా ఆరులక్షలుకన్నా ఎక్కువ రాలేదట.
- ↑ ఈ వెంకటరామయ్యగారు 1962 లో మంత్రి అయ్యారు. పాపం, హఠాత్తుగా మరణించారు. మంత్రిగా ఉన్న సమయంలో, తెనాలి పట్నానికి వీరు చాలా ఉపయోగాలు చేసుకోగలిగారు. అక్కడ ఆయనకు మంచిపేరే ఉండేది.
- ↑ ఆ హోటలు ఖామందు, కూర్మయ్యగారు ఇప్పించిన గవర్నమెంట్ ఆర్డరు కాపీ తీసుకువెళ్ళి, వెంటనే ఎరువు లిమ్మని విజయవాడ అగ్రికల్చరల్ ఆఫీసరు నెత్తిపైన కూచున్నాడు. ఆయనేమో - గవర్నమెంట్ ఆర్డరు కాపీ తనకు అంది, ప్రభుత్వనుంచి వచ్చే ఆదేశాలు మొదలైనవి నమోదుచేసే రిజిస్టర్లో ఎక్కించు కోకుండా ఎరువు లివ్వలేనన్నాడు. చెన్నపట్నంనుంచి ఆర్డరు అధికార మార్గంలో విజయవాడకు అందలేదు. ఇంతలో ఈ వ్యవహారం చెన్నపట్నంలో పొక్కగా, వ్యతిరేక వర్గంవారు ముఖ్యమంత్రి రామస్వామి రెడ్డిగారి దగ్గరకు వెళ్ళి ఒక విజ్ఞప్తిపత్రం దాఖలు చేసుకొన్నారు. రైతుకాని ఒక హోటలు కీపరుకు మంత్రి కూర్మయ్యగారితో సన్నిహితత్వ మున్నదన్న కారణంతో అలా చేయరాదనీ, వ్యవసాయశాఖ మంత్రి వందలకొద్ది రైతులకు సరిపడే ఎరువులు ఒక నల్లబజారు ఆసామీకి ఇవ్వడం ఆపవలసిందనీ వారు విజ్ఞప్తిలో పేర్కొన్నారు. వెంటనే ముఖ్యమంత్రిగారు, ఆ ఆసామీకి ఎరువులు ఇవ్వడం ఆపమని ఆఫీసరుకు 'స్టాప్ ఇష్యూ' అని తంతి యిచ్చారు. ఇవ్వమని పంపిన నకలు ఆదేశం అందిన మూడు రోజులకు గానీ ముఖ్యమంత్రిగారి నిషేధ ఉత్తరువు అందలేదు. కూర్మయ్యగారి మిత్రులు తల పెట్టిన అన్యాయం జరగలేదని ఉద్యోగి సంతోషించినా, ముఖ్యమంత్రిగారి ఉత్తరువు అందే మధ్య గవర్నమెంట్ ఉత్తరువు ధిక్కరించాడనే ఆరోపణతో కూర్మయ్య, మాధవ మేనోన్ గారలు అతనిని డిస్మిస్ చేశారు. గవర్నమెంట్ ఆర్డరు అందక ఇవ్వలేదన్న అతని మొర విన్నవారు లేరు. 1954 లో ప్రకాశంగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయి, అతని మెమోలు (అప్పీలు విజ్ఞప్తులు), చూచి, తిరిగీ ఉద్యోగంలోకి తీసుకున్నారు.