నా జీవిత యాత్ర-3/దక్షిణాదిని ఉప్పు సత్యాగ్రహం
9
దక్షిణాదిని ఉప్పు సత్యాగ్రహం
నేను పట్నంచేరేసరికి మదరాసు పరిస్థితి చాలా నిర్జీవంగా కనబడింది. శవం వెళ్ళిన కొంపలా కళా విహీనంగా ఉంది అ మహాపట్నం. ఆ పరిస్థితిలో నాకు రెండే రెండు గొంతుకలు వినబడ్డాయి. ఒక గొంతుక గద్దె రంగయ్యనాయుడిది, రెండవది పి. ఎస్. భాష్యం చెట్టిది. వారు ఉభయులూ ఉప్పు సత్యాగ్రహాన్ని గురించి ప్రబోధం చేస్తున్నారు. ఆ ప్రబోధాలను గురించి చిన్న చిన్న రిపోర్టులు పేపర్లలో అక్కడక్కడ ఏ మారుమూలో కనబడేవి.
తంజావూరు జిల్లాలో వేదారణ్యం గ్రామనుంచి రాజగోపాలాచారిగారు ఉద్యమం నడపనున్నారని విన్నాను. మదరాసు వాతావరణాన్ని పరిశీలించిన ఆచారిగారికి అక్కడి పరిస్థితులు సత్యాగ్రహ సమరానికి అనుకూలంగా లేవని తోచినట్లుంది. అదే అభిప్రాయం ఆ పురవాసులలో చాలా మందికి ఉన్నట్లు గ్రహించాను. మదరాసు మేయరు సత్యాగ్రహంపట్ల వ్యతిరేకంగా ఉన్నాడు.
"హిందూ"పత్రిక అనుకూలంగా లేదు. నా సంపాదకత్వాన నడుస్తూన్న 'స్వరాజ్య' పత్రిక, కృపానిధీ, ఖాసా సుబ్బారావు మాత్రం ఎలాగయితేనేం కాంగ్రెసు తత్వం, కాంగ్రెసు కార్యక్రమ విధానాలపట్ల సహనం చూపగలిగారు. ఆ పట్నంలో ఉన్న ఆ కొద్దిపాటి కాంగ్రెసు నాయకుల పరిస్థితి అల్లా ఉన్నా, నాకు మాత్రం ప్రజా హృదయం కాంగ్రెసు వైపే మొగ్గి ఉందనీ, ఉద్యమానికి మంచి ప్రోత్సాహం లభించి అది విజయవంతం అవుతుందని గట్టి నమ్మకమే.
1921 లో స్థాపించబడింది లగాయితు నాచే నడపబడుతూన్న 'స్వరాజ్య' పత్రిక యీ పది సంవత్సరాలలోనూ నిరాటంకంగా, కాంగ్రెసుకు అనుకూలంగా, నిర్భీతితో ప్రచారం చేస్తూ, చిన్నలకీ - పెద్దలకీ, అజ్ఞానులకీ - విజ్ఞానులకీ కూడా కావలసిన ప్రబోధాన్ని సమకూరుస్తూనే ఉంది. మా పత్రికని అతివాద పత్రికగానే జమకట్టి త్రోసిపారేసేవారు. సైమన్ కమిషన్‌వారు పట్నానికి వచ్చిన ఆ రెండు సందర్భాలలోనూ (1928, 29) మద్రాసు పౌరులు యావన్మందీ ఒకే త్రాటిమీదా, ఒకే మాటమీదా ఉంటూ, కాంగ్రెసు ఆదేశాన్ని ఎల్లా పాటించారో అందరూ ఎరిగినదే.
మదరాసు ప్రజానీకాన్నీ, వారి హృదయాన్నీ నేను 1921 నుంచీ కేవలం ఒక రాజకీయ వేత్తగా మాత్రమే గ్రహించలేదు; 1907 నుంచీ ఒక ప్రఖ్యాత న్యాయవాదిగా కూడా వారి హృదయం నాకు సువిదితమే. అందువల్లనే నాకు మద్రాసు పౌరులయందు అఖండ విశ్వాసం ఉంది. దానికి తోడుగా, నాకు చాలా సన్నిహితులయిన మిత్రులతోనూ, హృదయాంతరాలలో కాంగ్రెసుపై అభిమానం గల ఇతర నాయకాగ్రగణ్యులతోనూ సంప్రతించి మరీ కార్యరంగంలో ప్రవేశించాను. ముందుగా వాలంటీర్ల మకాములకు, వారికి శిక్షణ ఇవ్వడానికీ వీలుగా ఉండే తావుకోసం అన్వేషణ ఆరంభించాము.
ఉదయవనం క్యాంపు
లోగడ పంజాబులో గురుకాబాగ్ క్యాంపును గురించీ, ఆనాటి నా అనుభవాలను గురించీ, అప్పుడు కలిగిన అభిప్రాయాలను గురించీ విశదంగా తెలియజేసే ఉన్నాను. ఆ అనుభవాలను పురస్కరించుకుని సమగ్రమయిన, పరిపూర్ణమయిన క్యాంపును నడపడానికి వలసిన ఒక సువిశాలమయిన బంగళా కోసం మద్రాసులోని పేటలన్నీ గాలించాం. ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్యకు స్థావరంగా జాగా యివ్వడానికి చాలామంది భయపడ్డారు.
మైలాపూరులో ఉన్న 'ఉదయవనం బిల్డింగ్స్' అనే ఒక విశాల భవనం ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకుని, అ భవనం యజమానిని కలుసుకోవడానికి స్వయంగా నేనే బయల్దేరాను. ఆయనకీ ఏవేవో భయాలు, సంకోచాలూ ఉన్నా, నెలకి రెండు వందలు అద్దె క్రింద యిస్తానని అనడాన్ని, కొంచెం మెత్తబడ్డాడు. వ్రాతమూలకమయిన అగ్రిమెంట్లయిన తర్వాత, అడ్వాన్సు ఇచ్చి, ఆ బిల్డింగును మా ఆధీనంలోనికి తీసుకున్నాం. అది బాగా విశాలమయిన భవంతి కాకపోయినా, దానికి మూడంతస్తు లున్నాయి. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ జాగా వాలంటీర్లకి ట్రెయినింగ్ ఇవ్వడానికి సుమారుగా సరిపోతుంది.
వాలంటీర్ల కోసం నేనొక విజ్ఞప్తి జేశాను. శ్రీమతి దుర్గాబాయి ఆధీనంలో ఆ సంస్థ నడప దలచాము. పట్నంలో పబ్లిక్ మీటింగ్ పెట్టే లోపల, జిల్లాలవారీగా జరుగుతూన్న ఏర్పాట్లను చూడడానికి బయల్దేరాను. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిజిల్లాలోనూ లీడర్లకూ, వర్కర్లకూ ఎప్పుడూ లోటులేదు. సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభించిన నాటినుంచీ ఆంధ్ర రాష్ట్రంలో నాయకులకి ఎప్పుడూ కొరత రాలేదు. అప్పటి కప్పుడే గడచిన, ఏడు సంవత్సరాలుగా మేమంతా నీళ్లల్లో కయినా, నిప్పులలో కయినా సరే, దూకడానికి సిద్దమయ్యే ఉన్నాం. కాంగ్రెసు కమిటీలుగాని, కాంగ్రెసు వర్కర్లుగాని సవ్యంగా పనిచేస్తున్నారా - లేదా అన్న విచారం నా కెప్పుడూ లేదు.
మన రాష్ట్రంలో ప్రజలు అవసరం వచ్చినప్పుడు ముందుకు వస్తారన్నది ఎప్పుడూ అబద్ధం కాలేదు. మనవాళ్లు ఆరితేరిన చిచ్చర పిడుగులే అయినా, శాంతి సమర విధానంపట్ల కాగి చల్లారిన పాలు. 1921 నాటి శాసన ధిక్కార సంరంభంలోనూ, 1922 లో గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమంలోనూ, సైమన్ కమిషన్ బహిష్కరణ విషయంలోనూ, శాసన ధిక్కార సంరంభాలలోనూ మనవాళ్ళు విజయాలు సాదించిన యోధులే.
కాల వ్యవధిలేని కారణంగా, జిల్లాలకు ఉరుకులమీద వెడుతూ, ప్రజలలోని ఉత్సాహాన్నీ, వారికి ఉన్న పట్టుదలనీ గ్రహించగలిగాను. నిమిషాలమీద అన్ని జిల్లాలవారూ, ఎల్లా ఎల్లా పదకాలమీద పదకాలు వేసుకుని, ఈ ఉప్పు సత్యాగ్రహానికి సన్నద్ధులవుతూ ఉన్నదీ గ్రహించాను.
ఆంధ్ర పత్రికా సంపాదకులూ యజమానులూ అయిన దేశోద్థారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు నేను ఢిల్లీనుంచి వచ్చే నాటికి పట్నంలో తాము ఏ విధంగా కార్యభారం వహించాలో, ఏం చెయ్యాలో కూడా అంతు చిక్కని పరిస్థితిలో ఉన్నారు. పట్నంలో అనువయిన వాతావరణం లేదనే ఆయనా తలచారు. ఆయన బందరుకో, గుంటూరుకో వెళ్ళి, డా॥పట్టాభి సీతారామయ్యగారితోటో, దేశభక్త కొండ వెంకటప్పయ్యగారితోటో కలిసి యేమయినా చేద్దాం అని అనుకున్నారు. ఆయన బందరూ, గుంటూరూ కూడా వెళ్ళి, ఈ సంరంభా నికి వారు ఏ విధానాలు అవలంబించ నున్నారో తెలుసుకున్నారు. నేను పట్నం చేరేసరికి వారు జిల్లాలలో పర్యటిస్తున్నారు.
నేను కృష్ణా, గుంటూరు జిల్లాలలో పర్యటించాను. బందరులో కృష్ణాజిల్లా అన్ని తాలూకాలనుంచి వచ్చి పాల్గొనే వాలంటీర్ల విడుదల కోసమూ, వారికి చేయవలసిన భోజనాది సదుపాయాల కోసమూ బ్రహ్మాండమయిన ఏర్పాట్లు జరిగాయి. మా విజయాన్ని గురించి నాకు నమ్మకం మరింత దృడమయింది.
బందరులో ఉప్పు పొట్లాల అమ్మకం
బందరులో ఉన్న పరిస్థితులు గమనిస్తూన్న సందర్భంలో అప్పుడే అక్కడ సత్యాగ్రహ సమరం ఆరంభం అయిందని గ్రహించాను. వాలంటీర్లు తయారుచేసిన చిన్న చిన్న ఉప్పుపొట్లాలు బహిరంగ సభలలో అమ్మడం జరిగింది. జరుగుతూన్న సమర విధానంలో పోలీసులు ఏమీ కలుగజేసుకోవడం లేదు. అక్కడ సముద్రతీరంలో కొన్ని పల్లపు ప్రాంతాలలో సముద్రపునీరు కెరటాలుగా వచ్చి ఎండ వేడిమికి ఎండి ఉప్పు బిళ్ళలు బిళ్ళలుగా అ నీటిపై అచ్చు కడుతోందని, అదే ప్రకారం ఎండ తాపానికి తయారయ్యే ఉప్పుగల్లులు ఏరడానికే గాంధీగారు 'దండీ'కి బయల్దేరారనీ గ్రహించాను.
పోలీసులు ఏవిధమయిన చర్య తీసుకోని కారణంగా నేను కొంతమంది మిత్రులతో కలిసి, కారులో ఆ ప్రాంతాలకు వెళ్ళి, అచ్చట స్వభావ సిద్ధంగా తయారవుతూన్న ఉప్పు గల్లులను పెద్ద ఎత్తున పోగుజేశాను. నేను నాలుగైదు వేలు జేసే నాయుడిగారి సొంతకారులో బయల్దేరాను. నాతో కొంతమంది వర్కర్లున్నారు. వారిలో బోంబే క్రానికల్ పత్రికలో పనిచేస్తూన్న కీ॥ శే॥ సుబ్బారావుకూడా ఉన్నాడు. అ భూములు ఊరికి నాలుగైదు మైళ్ల దూరంలో ఉన్నాయి. దారి పొడుగునా వాలంటీర్ల క్యాంప్‌లు ఉన్నాయి. కొంతమంది వాలంటీర్లు మా కారును వెంబడించారు. అక్కడ సుమారు వెయ్యిమంది వాలంటీర్లు ఈ ఉప్పుగల్లులను ఏరుతున్నారు. వీరందరితో కలసి అ ప్రాంతానికి వెళ్ళడ మన్నది ఒక అలజడిని లేవతీసింది. మేము అ నీటిలో దిగి సుమారు రెండు బస్తాల ఉప్పును సేకరించాము. ఆ రెండు బస్తాల ఉప్పూ కారులో వేసుకుని వెనక్కి బందరు వెళ్ళాము. పోలీసువారు అ కారునీ, ఆ రెండు బస్తాల ఉప్పునే గాక మాలో కొందరినయినా నిర్బంధిస్తారని తలచాను. కాని నా ప్రయాణమూ, ఉప్పును ప్రోగుజేసుకు రావడమూ అన్నవి ముందుగా అనుకోని పను లవడాన్ని వారికి ఆశ్చర్యం కలుగజేసినా, అవసర చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయింది.
గుంటూరులో ఉప్పు తయారీ
తిరిగి వచ్చి, తెచ్చిన ఉప్పు పెద్ద పెద్ద మొత్తాలుగానే ఊళ్లో పంచి పెట్టించి, నేను బెజవాడ మీదుగా గుంటూరు వెళ్ళడానికి రైలెక్కాను. నేను రైలులో ఉండగానే ఏ స్టేషన్‌లో నయినా అరెస్టు కావచ్చునని వారంతా భావించారు. అటువంటిదేమీ జరక్కుండానే నేను గుంటూరు వెళ్ళి, అక్కడ కాంగ్రెసు వర్కర్లు సముద్రపు నీరు మరగబెట్టి ఉప్పు చెయ్యడం గమనించాను. అప్పటికీ గుంటూరు పోలీసులుకూడా ఏవిధమయిన చర్యా తీసుకోలేదు. అక్కడి మిత్రులతో నేను బందరులో చేసిన చేతలను వివరించి చెప్పి, ఆ జిల్లాలవారు ఎల్లా పోరాటానికి ఉద్రిక్తులయి తయ్యారుగా ఉన్నారో వివరించాను. పోలీసులు ఈ వేళ యేమీ చేయకపోయినా, వారు అలా చూస్తూ కూర్చోడానికి తావు లేదనీ, ఈవేళగాకుంటె రేపయినా వారు అరెస్టు చెయ్యక తప్పదని వివరించాను.
దేవరాంపాడు గ్రామంలో సముద్రతీరాల ఉన్న స్వంతభూములలో ఉప్పు పండించమనీ, అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న కనపర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వపు ఉప్పు గిడ్డంగిపై దాడి సలపమనీ సలహా యిచ్చీ, దేవరాంపాడులో నా కున్న అ కాస్త భూమిని వాలంటీరు క్యాంపు నడుపుకోవడానికి ఇచ్చాను. మా ఉద్యమానికి బలం చేకూరిన కొద్దీ, ఆ గ్రామంలో నెలకొల్పబడిన ఉప్పు సెంటరు చాలా పెద్దదయింది. గుంటూరులోని మిత్రులతో సంభాషించిన తర్వాత నేను చెన్నపట్నం వెళ్ళిపోయాను.
మదరాసు పౌరుల ఉత్సాహం
చెన్నపట్నంలో జరిగిన మొట్టమొదటి సత్యాగ్రహ సభ కోటకు ఎదురుగా ఉన్న విశాల మైదానంలో జరిగింది. ఆ మీటింగు నాటికే ఉదయవనం క్యాంపు పూర్తిగా నిండిపోయింది. పట్నంనుంచీ, పరిసర ప్రాంతాలనుంచేగాక, ఆంధ్ర, తమిళ, మలయాళదేశాలనుంచి వచ్చిన వారందరితోటీ ఆ క్యాంపు నిండిపోయింది. వాలంటీర్లు వచ్చింది ఆ రాష్ట్రం నుంచా, ఈ రాష్ట్రనుంచా అన్న ప్రసక్తే మాకు కలుగలేదు. ఆ పట్నం రాష్ట్ర మొత్తానికి ముఖ్యపట్టణం అవడాన్ని, రాష్ట్రమందలి అన్ని ప్రాంతాలవారికి మార్గం చూపడమే మా పని అని మేము భావించాం. వాలంటీర్లను పది పదిహేను మందిగల బాచిలుగా విభాగించి, రోజూ ఒక బాచీవారు, ఆ పురవీధులగుండా తిరగవలసి ఉంటుందని నిర్ధారణ జేశాం. అందు మొదటి బాచ్ పదిహేనుమంది ఏ యే రస్తాలద్వారా ఊరేగాలో కూడా నిర్ణయించాము.
మొదటి బాచ్ యింకా రెండు రోజులలో బయల్దేరుతుందనగా, మొట్టమొదటి బహిరంగ సభ ఏర్పాటయింది. ఇంకా నేను కాంగ్రెసు వారి ఆశయమూ, వారు చేయదలచిన పని వివరంగా చెప్పకుండానే కె. భాష్యమూ, బషీర్ అహమ్మద్ అనే ఇరువురు అడ్వకేట్లు నా కంటె ముందుగా ప్రజాసమూహానికి తమ ఉపన్యాసం వినిపించాలని ఉన్నదని, ముందుగా వారిని మాటాడనియ్యవలసిందనీ కోరారు. వారు ఉభయులూ కూడా నన్ను బాగా ఎరిగినవారే. కాని నన్నూ, అక్కడ జేరిన ప్రజానీకాన్ని పట్నంలో కావలసిన వాతావరణం లేదని ఒప్పించాలని వారి ఉపన్యాసంలో వివరించారు. అంతేకాదు, అక్కడ మేము శాసన ధిక్కారం చేయబూనడమూ, ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించాలని తలచడమూ వృథా శ్రమ అనీ, అందువలన ఆ పట్నంలో అటువంటి ప్రయాత్నాలేవీ చేయవద్దనీ నన్ను కోరారు. వారి ఉపన్యాసం సాంతం అయ్యాక, ఉన్న పరిస్థితి యావత్తూ విశదపరస్తూ, కాంగ్రెసు పిలుపును ప్రజలు మన్నించి తీరాలని హెచ్చరించాను. ఆ యిరువురి మిత్రులతోనూ మద్రాసు నగరం సజీవంగానే ఉన్నదనీ, అచ్చటి ప్రజలు ఎటువంటి త్యాగానికయినా సరే సిద్ధపడి, భారతీయ స్వాతంత్ర్య సమరంలో వారి స్థానాన్ని చరిత్రాత్మకం చేసుకుంటారనీ మనవి చేశాను.
ఆ సభలో జనం కనబరచిన ఉత్సాహం అవధులు దాటింది. మదరాసు వాతావరణాన్ని గురించి మాటలాడిన ఆ ఇరువురి పెద్దలకూ కూడా 'మదరాసు' చాలా ఉత్సాహవంతంగానూ, సజీవంగానూ ఉన్నదనీ, పట్నం గనుక ఈ పోరాటంలో పాల్గొనక పోతే, భారతదేశ రాజకీయ చరిత్రాత్మక పటంనుంచి మదరాసువారే తమ గ్రామ నామాన్ని తుడిచి పారేసినవా రవుతారనీ తేలిపోయింది.
తరవాత నేను ఉదయవనం క్యాంపును గురించి వివరించి, మనం మన ఉద్యమాన్ని ప్రతిభావంతంగా నడపిస్తూ జయాన్ని సాధించే పర్యంతమూ ఆ క్యాంపును నడపవలసి ఉన్నదనీ, అది సవ్యంగా నడిచే భాధ్యత యావత్తూ ప్రజానీకంపైనే ఉన్నదనీ, దానికి కావలసింది కేవలం ధనం మాత్రమే కాదనీ, తినడానికి కావలసిన వస్తుసముదాయం కూడా ఎంతో అవసరమనీ చెప్పాను.
గురుకాబాగ్‌లో అకాలీ సత్యాగ్రహ సమరం నడచిన తీరూ దానికి కావలసిన వస్తుసముదాయం వాఠెల్లా సమకూర్చుకున్నదీ వారి వాలంటీరు దళాలలో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన స్త్రీలూ, పురుషులూ, వైద్యులూ, నర్సులూ మున్నగు వారంతా చేరి ఎటువంటి సేవలు చేసినదీ విశదపరచాను. తుదకు ప్రభుత్వంవారే దారిలోకి వచ్చి, అకాలీల హక్కుగా వారి ఆలయ ప్రవేశానికి ఎల్లా తప్పని సరిగా ఒప్పుకోవలసి వచ్చిందీకూడా వివరించాను.
అటువంటి సహకారం మద్రాసు పౌరులనుంచి ఉదయవనం క్యాంపుకు ఆశిస్తున్నాననీ చెప్పాను. నేను మాటాడిన తరవాత గద్దె రంగయ్య నాయుడూ, భాష్యం చెట్టి గార్లేగాక, శ్రీమతి దుర్గాబాయి కూడా ఆ సభలో ఉపన్యసించి ప్రజల సహకారాన్ని కోరారు.
ఈ ప్రథమ బహిరంగ సభలో చేసిన విన్నపాలే ప్రజల్ని ఊపివేసి, వారి హృదయాలలో సుస్థిరంగా నాటుకున్నాయి. ఉప్పుమీద పన్నువేసే ప్రభుత్వ విధానమూ, విరివిగా లభ్యమయ్యే సముద్రజలాల నుంచీ, దేశంలో పలుచోట్ల ఉన్న ఉప్పు గుంటలనుంచీ నిత్యావసర వస్తువయిన ఉప్పును సంపాదించాడానికి కూడా ఎటువంటి అభ్యంతరాలను ప్రభుత్వం కలుగజేస్తున్నదీ ప్రజలకి స్పష్టం చెయ్యడం జరిగింది. అందువల్లనే, ప్రజల హక్కుల రక్షణకే మహాత్మా గాంధీ ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని లేవదీశారనీ విశద పరుపబడింది.
మొదటి జట్టులో దేశోద్ధారకుడు
ప్రబోధ ఫలితాలు వెంటనే కనబడ్డాయి. కనబడ్డ ఫలితాలు పరిధులు దాటాయి. ఆ మరుసటి రోజునుంచీ భోజన పదార్థాలు విరివిగా ఉదయవనం క్యాంపుకి జేరనారంభించాయి. అలా వచ్చే సప్లయిలు రోజుల తోటీ, వారాలతోటీ ఆగలేదు; నెలల తరబడి అలా వస్తూనే ఉన్నాయి. మేమంతా జెయిళ్ళకు వెళ్ళినా ఆ సప్లయి వస్తూనే ఉన్నాయి! 1931 లో గాంధీ - ఇర్విన్ ఒడంబడికలు సంతకాలయిన దాకా ఆ సప్లయిలు ఆగలేదు. ఆ మీటింగు అయిన తరవాత, నా నాయకత్వం క్రింద సత్యాగ్రహంచేసే మొదటి జట్టులో ఎవరెవరు ఉంటారో వారిపేర్లు వివరంగా పత్రికల వారికి అందజేశాం. పట్నంలో ప్రబోధం , ప్రచారమే గాక, అప్పుడే సంరంభం కూడా ఆరంభం అవుతోందన్న సంగతి విన్న నాగేశ్వరరావు పంతులుగారు పట్నం జేరుకున్నారు. ఆయన తనపేరు కూడా మొదటి జట్టులో చేర్చవలసిందని కోరుతూ టెలిఫోన్ జేశారు. అ ప్రకారం వారిపేరు జేర్చాం. ఆయన వచ్చి మాతో కలిశారు.
సముద్రపు టొడ్డున ఉప్పు పంట
ప్రతి దినమూ అవలంభించ దలచిన కార్యక్రమం ముందుగానే పత్రికా ముఖానా, ఇతర విధాలా కూడా ప్రకటించే వారము. ఆనాటి సత్యాగ్రహంలో ఎవరెవరు పాల్గొంటున్నారో ముందుగా ప్రభుత్వం వారికీ తెలిపే వారం. ఊరేగింపుగా బయల్దేరి ముఖ్యమయిన వీథులగుండా సాగి వివిధ ప్రాంతాలనుంచి సముద్రపు టొడ్డుకు జేరి, ఆ సముద్రపు నీటితో ఉప్పు జేసేవారు. ఇది ఒక అద్వితీయమైన సంరంభం. ఇదియే ఏ విధంగా పరిణమిస్తుందో, ఏ అంతస్తులను అందుకుంటుందో ప్రభుత్వం వారికి అవగాహన కాని కారణంగా, పదిహేను దినాలపాటు ఏ విధమయిన ఉపద్రవమూ లేకుండా వాలంటీర్లు పురవీథుల గుండా ఊరేగడమూ వగైరా కార్యక్రమాలన్నీ యథాతథంగా అల్లా అల్లా సాగిపోయాయి.
ఈ పదిహేను రోజులపాటూ నేనూ, నాగేశ్వరరావుగారూ ప్రతి దినమూ ఆనాటి జట్టుతో ఊరేగుతూనే ఉన్నాము. క్రమ శిక్షణతో కూడిన కవాతు, డ్రిల్లు వగైరాలకు అలవాటుపడిన సిపాయిల జట్టువలెనే ఉండేది మా జట్టు నడిచే క్రమమూ అదీను. మా వాళ్ళూ మార్చింగ్ సాంగ్స్ పాడేవారు. ఆ పాటలలో ప్రభుత్వం వారిని సవాలు జేసేవారు. ఉప్పు చట్టాన్ని ఊడ బెరుక దలచాం కాబట్టి, మీరు చేయగలిగింది ఏమయినా ఉంటే చూసుకోండి అనే హెచ్చరికగా ఆ పాటలుండేవి.
ఉదయవనం క్యాంపులో జేరిన వాలంటీర్లలో ప్రజ్ఞావంతులయిన యువకులుండేవారు. వారు తమ కార్యక్రమం పరిసర ప్రాంతాలకీ, గ్రామగ్రామాలకీ కూడా విస్తరింపజేశారు. కొంతమంది సముద్ర జలాలను పల్లపు ప్రాంతాలకు మళ్ళించడానికి వీలుగా భూమిని దున్ని, కాలువ లేర్పాటుజేసి, నీళ్ళు మళ్ళించి, ఉప్పు మళ్ళు ఏర్పరచేవారు. మార్చిల వలనా, అనుదినం ఉండే బహిరంగ సభల వలనా ఈ ఉద్యమం ఆ 15 రోజులలోనూ శుక్లపక్ష చంద్రబింబంగా దినదినాభివృద్ధి జెందింది. పూర్ణత్వాన్ని పొంద గలిగింది. ఒక వారం పది రోజులయ్యే సరికి ప్రభుత్వం వారికి కాస్త వేడెక్కిందిగాని, ఈ ఉద్యమాన్ని అణచడానికి ఏం చెయ్యాలి, ఎక్కడ ఏ తీరున ఆరంభించాలి అన్న ఆలోచన తెగలేదు.
దుర్గాభాయి సన్నద్ధత
రెండవ బహిరంగ సభ కూడా ఆ కోట పరిసరాలలోనే, కోటకు ఎదుట ఉన్న బీచీలోనే ఏర్పరుపబడింది. దానిలోనూ నేనే మాట్లాడాను. తరవాత ట్రిప్లికేన్ బీచ్‌లోనూ, ఇతర ప్రాంతాలలోనూ కూడా సభలు జరగడమూ, వాటిలో ఇతర నాయకులూ, వర్కర్లూ కూడా మాటలాడడమూ, స్త్రీలు కూడా ప్రముఖ పాత్ర వహించడమూ జరిగింది.
మా తరవాత అరెస్టుకు సిద్ధంగావలసినదని దుర్గాబాయిని నేను కోరకపోయినా, ఆమె అందుకు సంసిద్ధమయి, మాతోపాటు అనుదినమూ ఊరేగింపులలో పాల్గొంటూ, మా తరవాత ఉద్యమాన్ని నడపడానికి కావలసిన సాధన సంపత్తి యావత్తూ ఆకళింపుజేసికో నారంభించింది.
రెండవ బహిరంగ సభకి సుమారు లక్షమంది జనం హాజరయ్యారు. మేము ఆ స్థలానికి జేరే లోపల పోలీసువారూ, మిలిటరీవారూ కూడా బహు సంఖ్యాకులుగా రోడ్డు పొడుగునా ఉండడమేగాక, కోట ప్రాంతంలో మాకు ఎదురు వరసలో వారు అసంఖ్యాకంగా కనబడ్డారు. గుర్రాలమీద సవారీ చేస్తూన్న రౌతులు (mounted sowars) కొంత మందున్నారు. వీరందరూ ప్రజా రక్షణకోసమే పిలిపించబడి ఉంటారనీ, ఏదయినా గలాటా వస్తే ప్రజా రక్షణచర్యలలో వారు పాల్గొంటారనీ తలచాను. మీటింగు మధ్యలో చెదరగొట్టే ఉద్దేశంతో వారక్కడ చేరారని మేము భావించలేదు.
మీటింగు మధ్యనుంచి రౌతుల స్వారీ
నేను ఉపన్యాసమిస్తున్నాను. ప్రజలు చెప్పినదంతా నిశ్శబ్దంగా జాగ్రత్తగా వింటున్నారు. హఠాత్తుగా ఆ గుర్రపు రౌతులు ఇసుకలోకి జోరుగా వచ్చి గుర్రాలను అదిలిస్తూ, ప్రజా సమూహం మధ్యనుంచి, ఆ చివరనుంచి ఇటు కోట గుమ్మంవరకూ జోరుగా స్వారీ చేసుకుంటూ రాజొచ్చారు. కొంతమంది జనం మీదుగా గుర్రాలు వెళ్ళినప్పుడు ప్రజలలో చెప్పరాని భీతి, దిగులూ పుట్టుకొచ్చాయి. ఒక శాంతియుతమయిన బహిరంగ సభను చెదరగొట్టడానికే అధికార్లు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని తాము గ్రహించే లోపలే ప్రజలు గుర్రాల త్రొక్కు ళ్ళాటకి గురియై భీతిల్లి పోవడమూ, చిందర వందరగా అన్ని దిక్కులకూ పారిపో ప్రయత్నించడమూ సహజమేకదా?
నా దృష్టి అ గుర్రపు రౌతుల చర్యలపైకి మరలించబడింది. ఆ గుర్రపు దాట్ల మధ్య ఇరుక్కుని దెబ్బలు తిన్న ఒక వ్యక్తిని ఉపన్యాస వేదిక వద్దకు మోసుకుని వచ్చారు. ఆ మనిషిని జనానికి చూపుతూ, "ఆగండి! పరుగులెత్తకండి. ఉన్న తావులలోనే కూర్చోండి. భీతిచెంది పరుగులు పెడితే, పారిపోయే గుంపులమీదకి మళ్ళించబడిన గుర్రాలవల్ల ఇంకా ఎక్కువగా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది సుమా!" అని హెచ్చరించాను. ప్రజలు నిశ్చలంగానూ, శాంతియుతంగానూ కూర్చుంటే, వారిమీదకి రావడానికి ఆ ఆశ్విక దళాల వారికి దమ్ము లుండవనీ చెప్పాను.
తరవాత ఆ 'సావర్సు'ను హెచ్చరిస్తూ, "నిజంగా మీకు అలజడి కల్గించి అల్లరి చెయ్యాలి, సభను చెదర గొట్టాలి అనే అభిప్రాయం ఉంటే, దూర దూరంగా అక్కడక్కడ చెదురు మదురుగా కూర్చున్న ప్రజల మీదికి గుర్రాలను పోనివ్వడం కంటె, నిశ్చింతగా కూర్చుని ఉన్న ఆ ప్రజానీకం మధ్యనుంచి తిన్నగా, గుర్రాలను అదలించుకుంటూ, మా అందరిపై నుంచీ పోనీయడం సబ"బని చెప్పాను.
కొన్ని నిమిషాలపాటు అలా అలజడి కలిగించి, జనంలో ఇద్దరు ముగ్గురికి దెబ్బలు తగిలిన తర్వాత, వాళ్లంతా ఇంకే విధమయిన అల్లరి లేవదీయకుండా రోడ్డుమీదకి వెళ్ళిపోయారు. ఆ తరవాత సభ సాంతం అయింది.
ఆ ఉపన్యాస వేదికమీద ఉన్న స్త్రీలు, కొంత భీతిపుట్టి, సభాస్థలిని విడిచి వెళ్ళిపోవాలని తలచారు. కాని కొద్ది నిమిషాలలోనే వారు తేరుకుని, వారి స్థానాలను వదలకుండా అంటిపెట్టుకునే ఉండిపోయారు.
ఆ సభకి హాజరయిన జనం పారిపోవడానికి ప్రయత్నించకుండా కూర్చుని ఉండడమే మన బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ ప్రభుత్వం వారికి ప్రదర్శించిందనీ, ఆనాటి వారి ధైర్యసాహసాలే అంతిమ విజయానికి దోహద మిస్తాయనీ ఉద్ఘాటించాను. సభలో నిలద్రొక్కుకుని నిలిచిన స్త్రీలను అభినందించాను. దెబ్బలతో నా వద్దకు తీసుకురాబడిన వ్యక్తి, గుర్రం ముందుగా తన చుట్టూ తిరిగి మీదనుంచి గెంతిన తీరంతా పూర్తిగా వర్ణించి, అదృష్టవశాత్తూ తనకు అట్టే దెబ్బలు తగులలేదని వివరించాడు ఆ సంఘటన ప్రభుత్వం వారి నిరంకుశ కిరాతచర్యలకు వాచవి అయింది.
అబద్ధ మయిన మరణవార్త
అ పదిహేను రోజులలోను అనుదినమూ ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. మూడవసారికూడా నేను ఆ కోట ఎదుట ఉన్న ఇసుక మైదానంలో సభ యేర్పాటుచేసి మాటాడాలని తలపెట్టాను. ఆ సభకి చాలామంది జనమే వచ్చారు. అదిన్నీ సరిగా వెనుకటి సభ జరిగిన తావులోనే జరుపబడింది. వాలంటీర్లూ మొదలైన వారు చాలామంది తాము చేస్తున్న కృషిని వివరిస్తూ, సముద్రం పొడుగునా అనేక ప్రాంతాలలో వారు ఏ విధంగా ఉప్పును తయారుచేస్తున్నది, ఆ సముద్రతీరంలో పది పదిహేనుమైళ్ళ ప్రాంతం అంతా వారు ఏ ప్రకారంగా ఆక్రమించినదీ, వారు క్రమేపీ ఆ పట్నానికి చుట్టుపట్ల ఉన్న సముద్రతీర ప్రాంతాలలోని కుగ్రామాలలోకూడా ఎలా ఉప్పు చట్టాన్ని ఎదిరిస్తూన్నదీ వివరంగా చెప్పారు.
ఈ మీటింగులో నేను నిలబడి ఉపన్యాసం ఆరంభంచేసే సమయంలో, మశూచితో బాధపడుతూన్న నా రెండవ కుమారుడు మరణించాడన్న వార్త ఎవరో మోసుకొచ్చారు. వాడే గనుక చనిపోయి ఉంటే ఈ సమరంలో మున్ముందుగా ప్రాణాలు గోల్పోయింది వాడే అవుతాడని అన్నాను. మామూలుగానే నేను సభను నడిపాను.
సభానంతరం ఇంటికి వెళ్ళేసరికి ఆ కుర్రవాడు చనిపోలేదని తెలిసింది. వాడు చాలా తీవ్రంగా బాధపడుతూ మృత్యువువాత పడనున్న సమయంలో నా తమ్ముడు డా॥జానకిరామయ్య వాన్ని రక్షించగలిగాడని విన్నాను. మా తమ్ముడు ఆంగ్లేయ వైద్యంలో అఖండ ఖ్యాతి గణించినా, దాని పట్ట కలిగిన విముఖతతో హోమియోపతీ వైద్యాన్ని చేపట్టి, దానిని క్షుణ్ణంగా చదివి, గడ్డుకేసు లెన్నో సాధించి చాలా మందికి ప్రాణదానం చేయగలిగాడన్న సంగతి లోగడ వివరించే ఉన్నాను.
పరిపాలకులు మాత్రం నన్నూ, నాగేశ్వరరావు పంతులుగారినీ అరెస్టు చేసిందాకా ఇతరుల జోలికి పోలేదు. నన్ను జైలులోకి నెట్టే వరకూ కాల్పులూ జరపలేదు.
క్రమంగా ఇళ్లల్లోనే ఉప్పు పంట
అల్లా అనుదినమూ సత్యాగ్రహులు ఎన్నో వీథులమ్మట ఊరేగుతూ ఉంటే, వింత చూడడానికి వచ్చిన వేలాది జనులతో వీథులన్నీ కిటకిటలాడిపోయేవి. ఆ ప్రకారం క్రొత్తదారులు పట్టిపోతూ అన్ని ముఖ్యమయిన పురవీథులనూ కాలినడకన గాలించేశాం. హిందూదేశం మొత్తం మీద మదరాసు సువిశాలమూ, సుదీర్ఘమూ అయిన పట్నం. ఆ పదిహేను రోజులలోనూ మేము చూడని వీథిగాని, త్రొక్కని సందుగాని లేదు. ఆ ప్రకారంగా సముద్రతీరాన్ని చేరుకుంటూ, పదిమైళ్ళ పొడుగున్న ఆ తీరపు అన్ని ప్రాంతాలలోనూ ఉప్పు తయారుచేశాం. వేలాది జనం తమ సొంత కుండలతోనూ, వంటచెరకుతోనూ వచ్చి, మాతోపాటు ఆ యా ప్రాంతాలలో ఉప్పును తయారుచేసేవారు.
ఎందరో మిల్లు పనివారు కూడా మాతోపాటు ఉప్పు తయారీలో పాల్గొన్నారు. ఒక రోజున చూళై మిల్లు ప్రాంతంలో, మేము ఉప్పు వండడానికి బయల్దేరిన తరుణంలో, మా వెనుకనే వేలాది మిల్లు పనివారు వారి వారి కుండలతో ఉప్పు తయారుచేయడానికి సిద్ధమయ్యారు. వారిని పారీస్ కార్నర్ ప్రాంతంలో, పోలీసువారు అటకాయించడమూ, కొంత చికాకు గలుగచేయడమూ సంభవించింది. ఆ రోజున కొంత హింసాకాండ జరుగుతుందేమోననీ, ఆ హింసాకాండ కారణంగా మా కార్యక్రమం దెబ్బతినవచ్చుననీ తలిచాం. కాని ఆ నాడు ఏమీ జరుగలేదు.
నా భార్యకూడా అప్పుడప్పుడు నాతోపాటు ఈ ఊరేగింపులలో పాల్గొనేది. పదిహేనురోజుల పాటు వరసగా సవాలుచేస్తూ తిరిగినా ఏమీ జరగని కారణంగా, నాగేశ్వరరావు పంతులుగారికీ, నాకూ మా మా ఇళ్ళల్లోనే ఉప్పు చేద్దాం అనే బుద్ది పుట్టింది. వందలాది జనానికి సంతర్పణ చెయ్యడానికి పనికివచ్చేటంత పెద్దవిగా ఉండే గుండిగల్నికొన్నాం. మా మా ఇళ్లల్లో ఉండే పాత్రలలో కల్లా పెద్ద వాటిని బయటకు తీశాం. మా ప్రయత్నాలన్నీ పెద్ద యాగానికో, యజ్ఞానికో అన్నంత జోరుగా ఉన్నాయి.
ఇది యిలా జరుగుతూ ఉండగా ఎస్. వెంకట్రామయ్యరు అనే ఒక న్యాయవాద మిత్రుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన మా గురువు గారయిన ఒక ప్రోపెసరుగారి కుమారుడు. నేను ఆ సమయంలో మా ఇంట్లో ఒక చాపపై ఒళ్ళు విరుచుకుంటూ పడుకుని ఉన్నాను. ఆయన వచ్చి, పోలీసువారు నన్ను త్వరలోనే అరెస్టు చేయనున్నారని తెలియజేశాడు.
నా అరెస్టు - తంగచ్చి సవాలు
ఇంతలోనే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, కొంతమంది పోలీసులతో, మా ఇంటికివచ్చి, మండుతూ ఉన్న ఆ మంటలను ఆర్పి ఆ పాత్రలను స్వాధీనం చేసుకుని నన్ను అరెస్టు చేశాడు.
ఆ సమయంలో అక్కడ తంగచ్చియమ్మ అనే ఒక ముసలి వాలంటీరు ఉంది. అక్కడ తయారయిన ఉప్పంతా పోసిన ఒక పెద్ద పళ్ళెం ఆమె చేతిలో వుంది. డిప్యూటీ కమిషనర్ ఆ పళ్లాన్ని తన కిమ్మని అడిగారు. ఆమె వెంటనే, "ఇది నీ సొమ్ముకాదు. సముద్రజలంతో కష్టపడి మేము దీనిని తయారు జేసుకున్నాం. ఆయనతోపాటు నన్నుకూడా ఎందుకు అరెస్టు చెయ్యవు?" అని అడిగింది. ఆమె చేతనుంచి ఆయన ఆ పళ్ళాన్ని బలవంతంగా లాక్కున్నాడు.
నాగేశ్వరరావు పంతులుగారిని కూడా వారి ఇంటివద్ద నిర్భంధంలోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ నన్ను ఆయన కారులోనే తీసుకుని వెళ్ళి, మేజస్ట్రేట్ గారి ముందు హాజరు పరచాడు. నాకు ఒక సంవత్సరం జెయిలు, నాలుగు వందల రూపాయలు జుల్మానా విధించ బడ్డాయి. శిక్ష విధించబడిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఖరీదు చేసే సరిక్రొత్త కారు జప్తుచేసి తీసుకుపోయారు. నన్ను మదరాసు పెనిటెంషరీలో కొంతకాలం ఉంచారు.
నాగేశ్వరరావుగారికీ నాకు వేసినట్లే శిక్ష వేశారు. ఆ తర్వాత ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన పలువుర్ని నిర్భధించి శిక్షించారు. జిల్లాలలో అరెస్టయి శిక్షపొందిన మిత్రులెందరినో వెల్లూరు జెయిలుకు తీసుకువెడుతూ, దారిలో పెనిటెంషరీకి తీసుకువచ్చేవారు.
లాఠీఛార్జీలు, కాల్పులూ మొదలు
నా అరెస్టు జరిగిన మర్నాడు ఒక బ్రహ్మాండమయిన సభ తిరువళిక్కేనీ సముద్రతీరాన స్వామీ వెంకటాచల చెట్టిగారి అధ్యక్షతను జరిగింది. నా అరెస్టుకు పూర్వం, నేను ఉద్యమం నడుపుతూన్న రోజులలో జరిగిన హింసాకాండ, ఆ గుర్రపు రౌతుల ద్వారా కోట ఎదుట ఇసుక మైదానంలో జరిగిన చిల్లర అల్లరే. అంతకుమించి, కాల్పులుగాని, లాఠీచార్జీలుగాని జరుగలేదు.
మొదటిసారిగా, స్వామీ వెంకటాచలంచెట్టిగారి ఆధ్వ్యరాన జరిగిన, ఆ మీటింగులో కాల్పులు జరిగాయి. ఆ జరగకూడదని ముందుగా నోటీసుగాని, మీటింగులనూ, ఊరేగింపులనూ నిషేధిస్తూ ఆర్డరుగాని లేకుండానే ఆ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు తిన్నగా, కొంతమంది పోలీసులతో ఆ సభలో జొరబడి, మీటింగును చెదరగొట్టి, వెంట వెంటనే లాఠీఛార్జీ, కాల్పులూ వగైరా జరిపించాడు.
ఆ కాల్పులు చాలా వివేక హీనంగానూ, ఇష్టంవచ్చినట్లు జరుపబడిన కారణంగా, ఒక గుండు వెళ్ళి, ఏ పాపమూ ఎరుగనటువంటి, ఈ సభతో ఎట్టి సంబంధమూ లేనటువంటి ఒక ప్లీడరుగారిని పొట్టబెట్టుకుంది.
దర్మిలా సత్యగ్రహుల నందరినీ అన్ని వైపులనుంచీ, అన్ని ప్రాంతాలనుంచీ పట్టుకుని శిక్షించే సందర్భంలో, ఒక కుగ్రామంలో ఉప్పు సత్యాగ్రహ విషయంగా, ఒక దేవాలయంలో జరుగుతూన్న చిన్న మీటింగులోకూడా కాల్పులు జరిపారు. ఈ చర్యలన్నీ ప్రజలలో భీతిని ఉప్పతిల్ల జేసి, ఉద్యమాన్ని అణగద్రొక్కాలనే ప్రయత్నంతోనే చేయబడ్డాయి.
అదే ప్రకారంగా చెన్నరాష్ట్రంలోని పలు జిల్లాలలోనూ, తాలూకాలలోనూ కాల్పులూ, లాఠీ చార్జీలు విరివిగా జరుపబడ్డాయి.
ఈ ఉప్పు సత్యాగ్రహ కారణంగా, చెన్నరాష్ట్రంలో మొత్తం పదహారుసార్లు కాల్పులు జరిగాయి. ఎన్నో జాగాలలో , అన్యాయంగా, ఏ పాపమూ ఎరుగని సాధారణ జనసమూహాలపై గూడా లాఠీఛార్జీలు జరిగాయి. అంతేగాదు, ఆ లాఠీచార్జీ చేసేవారు కూడా చాలాసార్లు తాము చేస్తున్న పనికి సిగ్గు చెందిన సందర్భాలూ ఉన్నాయి.
జెయిళ్ల పాలైన స్త్రీలు
ఇలా చాలా నెలలపాటే ఈ సత్యాగ్రహ సమరం సాగింది. చాలామంది సత్యాగ్రహుల్ని నేను ఉన్న జైలుకే పంపించారు. అల్లా అరెస్టయి, శిక్షించబడిన వారిలో ఎందరో అమానుషమయిన లాఠీఛార్జీలకు గురైనవా రున్నారు.
పురుషులనే కాదు, ఎంతోమంది స్త్రీలనుకూడా అమానుషంగా హింసించి జెయిళ్ల పాలు జేశారు.
ఎన్ని వందలమంది సత్యాగ్రహులను ఈ విధంగా అరెస్టు చేశారో వివరంగా చెప్పడం ఎవరితరమూ కాదు.
మదరాసు నగరవాసులు మాత్రం ఆ కష్టకాలంలో తట్టుకుని ఉద్యమాన్ని సాగిస్తూనే వచ్చారు. అంతేకాదు, ఉద్యమం సాంతం అయ్యేవరకూ ఆ ఉదయవనం క్యాంపునకు కావలసిన ధన దాన్యాలన్నీ సమృద్ధిగా సప్లయి చేశారు. అప్పట్లో వారిని అభినందించాను. ఇప్పుడు కూడా వారిని అభినందిస్తున్నాను. దేశానికి దాస్య విముక్తి కలిగించే ఈ ఉద్యమంలో పాల్గొని, దేశమంటే వారికి ఉన్న అభిమానం, గౌరవం, భక్తీ కనబరచిన వేలాది ప్రజల్ని అప్పుడూ, ఇప్పుడూ కొనియాడడం మన విథే గదా! ఖైదులో అనారోగ్యం
అరెస్టయి జెయిలుకి వెళ్ళేముందు ఆ పదిహేను రోజులలోనూ నేను రాత్రింబవళ్ళు కాలినడకని పట్నం మూలమూలలా తిరుగుతూ వచ్చాను. ఆ రోజులలో ఉన్న ఉత్సాహం కారణంగా ఏవిధమయిన నీరసమూ, శోషా ఎరగను. అప్పట్లో నాకు శరీరంలో తాపం అధికం అవుతూన్న అనుమానమే కనబడలేదు. నన్ను పెనిటెంషరీలో పెట్టిన కొద్ది రోజులలోనే తలమీదా, ఒంటిమీదా కురుపులూ, సెగ్గెడ్డలూ బయల్దేరాయి. అక్కడ ఉన్న ఒక ఆస్పత్రి గదిలోకి వైద్యంకోసం నన్ను మార్చారు.
అంతవరకూ, నిజంగా, నాకు ఏవిధమయిన వైద్యవిధానంతోటీ అంతగా అవసరం కలుగలేదు. ఎప్పుడయినా అవసరం అని తోస్తే లూయీ ఖూనే గారి తొట్టి వైద్యం అనుసరిస్తూ ఉండేవాణ్ణి. ఆ ప్రకారం అప్పటికి ఇరవై అయిదు సంవత్సరాలుగా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కాలక్షేపం జేశాను. ఖైదీగా నాకు తొట్టిగాని, కావలసిన నీళ్ళుగాని లభ్యం కాలేదు. అక్కడి ఆ పెనిటెంషరీలో నన్ను కొద్దికాలమే ఉంచుతారనికూడా తెలుపబడింది.
నిజానికి పెనిటెంషరీలో మమ్మల్ని కొద్ది వారాలపాటే ఉంచారు. ఈ రోజులలో పత్రికా ముఖంగా జరుగుతూన్న చరిత్ర నాకు తెలుస్తూనే ఉంది. కాల్పులను గురించీ, లాఠీఛార్జీలను గురించీ వివరంగా వార్తలు గ్రహిస్తూనే ఉన్నాను. ఉద్యమం సఫల మవుతోందని గ్రహించి చాలా గర్వం చెందాను. ప్రజలలోని ఉత్సాహమూ, కార్యదీక్ష, అఖండ దేశభక్తి ఉద్యమానికి బలం చేకూర్చాయి. స్త్రీలూ, పురుషులూ కూడా తమకు తాముగానే నాయకత్వాలు వహించి ఉద్యమానికి చేయగలిగిన సేవచేయడం ఆరంభించారు.
నన్ను పెనిటెంషరీనుంచి తిరుచిరాపల్లి జెయిలుకు మారుస్తున్నారన్న వార్త ఎల్లా పొక్కిందో తెలియదుగాని, ఆనాడుమాత్రం రైల్వేస్టేషన్ అంతా ప్రజాసమూహంతో నిండిపోయింది. ఆ ప్రజా కోలాహలంనుంచి నన్ను తప్పించి, తేలికగా రైలు ఎక్కించడానికిగాను, కారులో కోడంబాకం స్టేషనుకు తీసుకువెళ్లి అక్కడ ఒక మొదటి తరగతి పెట్టెలో ఎక్కించారు. డిప్యూటీ కమిషనర్ స్వయంగా నాతో ఆ గుంపులనుంచీ, గలటానుంచీ తప్పించడానికిగాను కోడంబాకం తీసుకువెడుతున్నానని చెప్పాడు.
సత్యాగ్రహిగా మారిన భాష్యం
చెన్నపట్నపు వాతావరణం ఉప్పు సత్యాగ్రహానికి సరిపడదని వారూ వీరూ అన్న దానితో సరిపోలిస్తే, పట్నంలో ఉద్యమానికి లభించిన చేయూత, దాని సఫలతా నా కెంతో గర్వకారణ మయాయి. దేశంలో ఉన్న అనేక పట్నాలలో చెన్నపట్నం రాజకీయంగా సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించుకుంది.
అన్నిటికంటె విచిత్రమేమిటంటే, ఆనాడు మొట్ట మొదటి సభలో చెన్నపట్నపు వాతావరణం ఉప్పు సత్యాగ్రహానికి పనికిరాదని బల్ల గుద్ది వాదించిన ఆ లాయరు మిత్రుడు కె. భాష్యంగారు స్వయంగా ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని, దెబ్బలుకూడా తిని, అరెస్టయి శిక్ష అనుభవిస్తూ మా వెల్లూరు జైలుకే వచ్చారు. ఆయన్ని జైలులో ఆహ్వానించగలగడం నాకు గర్వకారణమే అయింది.
చెన్నపట్నపు లాయర్లలో ఆయన ఒక ప్రముఖుడు. అటువంటి వాడు ఉద్యమ ప్రారంభంలో చేసిన తన తప్పును తాను గ్రహించి,ఎంతో ఘనంగా ఆసేతుశీతాచలం సాగుతూన్న ఆ అహింసాత్మక సమరం సంగతి బాగా తెలుసుకుని, అందులో స్వయంగా పాల్గొని, తాను చేయగలిగిన దేశసేవ చేశాడు.
వివిధ జెయిళ్ళలో నాకు గలిగిన అనుభవాలను తెలిపే ముందు ఈ ఉప్పు సత్యాగ్రహ సమరంలో చెన్నరాష్ట్రంలో జరిగిన సంఘటనలను గురించి టూకీగా చెప్పాలని ఉంది.
గాంధీగారు ఉప్పు సత్యాగ్రహ సంరంభానికి ప్రాతిపదికగా సబర్మతీ ఆశ్రమంనుంచి దండీవరకూ కాలినడకని యాత్ర సాగించి, తన ఉద్యమానికి బలం చేకూర్చుకున్న పద్ధతిని ఈ రాష్ట్రంలో పలు జిల్లాలలోని నాయకులు అనుసరించారు. దక్షిణాన రాజగోపాలాచారిగారూ, ఉత్తరాన పశ్చిమగోదావరిజిల్లాలో దండు నారయణరాజూ, గోవిందరాజులు మొదలైనవారు గాంధీగారి మార్గాన్నే అవలంబించారు.
ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహం
ఆంధ్రదేశానికి సంబంధించినంతవరకూ, తూర్పు - పశ్చిమగోదావరిజిల్లాలలోనూ, కృష్ణా - గుంటూరు - నెల్లూరు జిల్లాలలోనూ, విశాఖ, గంజాం జిల్లాలలోనూ అక్కడి నాయకులు, గాంధీగారి మారాన్ని అనుసరిస్తూ, ఉప్పు సత్యాగ్రహాన్ని ఎంతో చాకచక్యంగా నడిపించి, ఆయాప్రాంతాలను చరిత్ర ప్రసిద్ధం చేశారు. కేవలం కాలినడకను వెళ్ళడమే కాదు; ఎన్నో క్యాంపులు నడపి, వాలంటీర్లను తయారు చేయడానికి స్థావరాలు ఏర్పరిచారు.
దేవరాంపాడు శిబిర సమరం
గుంటూరు జిల్లాలో 'దేవరాంపాడు' గ్రామంలోనూ, విశాఖ జిల్లాలో వడలి గ్రామంలోనూ నడిపిన క్యాంపులను గురించి కాస్త వివరిస్తాను. దేవరాంపాడులో నాకున్న చిన్న బంగాళానీ, దానిని అంటిఉన్న పొలాన్నీ అక్కడి నాయకులు తీసుకుని, దానిని ఒక శాశ్వతమయిన శిబిరంగా మార్చి, అక్కడికి రెండుమైళ్ళ దూరంలో ఉన్న 'కనపర్తి' గ్రామంలో ఉన్న ఉప్పు కొఠార్లమీదికి దాడి ప్రారంభించారు.
దేవరాంపాడు గ్రామ శిబిరాన్ని ఆధారం చేసుకుని, 'గంగాకలం' అన్న చిన్న నదిని దాటి (నది ఒడ్డునే ఆ శిబిరం ఉంది) వాలంటీర్లు రంగంలోకి దిగేవారు. ఇది చాలా అనువయిన స్థానంగా ఉండేది. నది సముద్రంలో కలిసే సంగమప్రాంతం అక్కడికి మైలులోపుగానే ఉంది. వాలంటీర్లకు ఆ నది దక్షిణపు గట్టున ఉండడానికి వీలుగా ఉండడాన్ని వారు ఒక బ్రహ్మాండమయిన పథకం వేసుకున్నారు.
తరవాత కార్యరంగంలోకి దిగారు. జట్లు జట్లుగా ఉప్పుకొఠార్ల మీదికి దాడివెళ్లే వాలంటీర్లను పోలీసువారు అరెస్టుజేసి తీసుకుపోతూ, ఆ నదిని దాటి శిబిరాన్ని ఆక్రమించుకుని వాలంటీర్లకు తావులేకుండా చేశారు. నది ఆవలిగట్టునుంచి వాలంటీర్లు ఆకొఠార్లమీదికి దండెత్తారు. అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న గుడిసెను వారు శిబిరంగా మార్చుకున్నారు. పోలీసువారు తాము ఆక్రమించుకున్న శిబిరాన్ని వదలి, ఒక్క ఉదుటున ఈ వాలంటీర్ల నూతన శిబిరం మీదికి దండెత్తారు. ఈ అదునులో నదికి అవతలి గట్టునుంచి వచ్చే వాలంటీర్లు ఆ శిబిరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఉద్యమం అక్కడ జరుగుతూన్న రోజులలో అల్లా ఆ శిబిరం వాలంటీర్ల చేతులలోంచి పోలీసువారి చేతులలోకి, పోలీసువారి చేతులలోంచి కాంగ్రెసువారి చేతులలోకి చాలాసార్లే మారింది. నాయకులు ఆ జిల్లా ఇతర ప్రాంతాలలోని పనులకు ఆటంకం కాని రీతిని, ఈ క్యాంపుపైనే ఎక్కువ దృష్టి పెట్టి, అక్కడ జరుగుతూన్నా పోరుకి సలహాలూ, సహకారమూ అందించేవారు.
సాధారణంగా ఇటువంటి వింత సంఘటనలు చూడడానికి జనం గుంపులు గుంపులుగా వస్తారుగదా! వారు చాలా శాంతియుతంగానూ, క్రమశిక్షణతోనూ మెలిగారు. ఆ ప్రాంతంలో నివసించే పల్లెవాళ్ళకి కూడా ఉప్పు సత్యాగ్రహం ఆవశ్యకత, ప్రభుత్వంవారు ఉప్పులాంటి అత్యవసర వస్తువులపై కూడా పన్ను విధించి, ఎల్లా బీదవారి పొట్టమీద దెబ్బ కొడుతున్నారో అర్థం అయింది. నిజానికి ప్రజలే గుంపులు గుంపులుగా ఉద్యమంలో చేరి, దానిని మంచి ధీమాతో నడిపించి జయం సాధించారు.
కమలాదేవి చాక చక్యం
కాకినాడ కాపురస్థురాలు కీ॥ శే॥ వేదాంతం కమలాదేవి, వందలూ వేలూ జనం గుంపులు గుంపులుగా తనవెంటరా, ఉద్యమాన్ని మాంచి పకడ్‌బంద్‌గా నడిపించింది. ఆమె చాలా దైర్యసాహసాలు గల ఇల్లాలు. ఆరుగురు బిడ్డల తల్లి. ఆమె ఆంధ్రదేశంలో పలు తావులలో ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా నడపించింది. పురుషులు జంకి వెనక్కు తగ్గే పరిస్థితులలో కూడా ఆమె మంచి నేర్పుతో వ్యవహరించింది. ఆమె అకాల మరణం దేశానికి తీరని లోటే.
ప్రక్కని దాడి చెయ్యడానికి ఉప్పు కొఠారులున్నాయా లేదా అనికాదు ప్రశ్న. సమీపాన సముద్రం ఉందా లేదా అన్న ఒక్క విషయం మీదనే ఆధారపడి, ఆంధ్రదేశంలోని కోస్తా జిల్లాలవా రందరూ శక్తి వంచన లేకుండా ఈ సత్యాగ్రహ సమరంలో పాల్గొని కీర్తిని గడించారు.
1930 నాటి ఉప్పు సత్యాగ్రహ చరిత్ర యిది. ఆ చరిత్రలో మద్రాసు నగరంతో సహా ఆంధ్రరాష్ట్రం ఎల్లా ముందుకు ఉరికిందో సంగ్రహంగా మనవి చేశాను. సహకార నిరాకరణ మారంభమయింది లగాయితు, శాసన ధిక్కారం, ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణలాంటి అనేక జాతీయ ఉద్యమాలలో ఆంధ్రులు చరిత్రాత్మకమైన పాత్ర వహించారు. ఇది నిజంగా వారికి గర్వకారణమే. నిర్మాణ కార్యక్రమంలో కూడా వారి దెప్పుడూ పైచెయ్యే. 'ర్యాలి' లో పంచాయతీ ఏర్పరచి, వారు రాజ్య తంత్రాన్ని నడిపిన తీరు అద్వితీయం. అడిగిన తక్షణం, ఆడవారే స్వయంగా వారి చేతులతోనే, వారివారి ఆభరణాలన్నింటినీ ఒలిచి, గాంధీగారి ఒడిలో పోసి స్వాతంత్ర్యోద్యమాని కిచ్చిన చేయూత స్త్రీ లోకానికే గర్వకారణం.