నా జీవిత యాత్ర-3/'స్వరాజ్య' పత్రిక: చరమాధ్యాయం

వికీసోర్స్ నుండి

13

'స్వరాజ్య' పత్రిక: చరమాధ్యాయం

'స్వరాజ్య' పత్రిక విషయంలో వచ్చిన చికాకులు ఋణదాతలతో చేసుకున్న ఒప్పందాలవల్ల, ప్రజలనుంచి నా కెప్పుడూ లభిస్తూ వచ్చిన సహకారాదులవల్ల చాలావరకు సద్దుకోగలిగాను. కాని మా సంస్థను చికాకుల పాలుచెయ్యాలన్న పట్టుదలతో ఒక పెద్ద మనిషి కొన్ని పనులు చేశాడు. ఆయన అవకాశం కోసం కాసుకు కూర్చున్నాడు. ఆయన 'స్వరాజ్య' పత్రిక ఆఫీసు ఇంటి యజమాని. పేరు కె. సూర్యనారాయణరావు.

ఏదో ఒక దుష్ట నక్షత్రాన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఇల్లు, నెలకు రూ 300 ల అద్దెమీద, మూడు సంవత్సరాలకు తీసుకున్నాను. ఆయన మా కంపెనీపై ఏదో కుట్ర చెయ్యాలన్న దురద్దేశంతో ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. బహుశ: ఆయనకు ఆరంభంనుంచీ అటువంటి ఉద్దేశం ఉండి ఉండదు. దర్మిలా, అనగా మొదటి మూడు సంవత్సరాల అగ్రిమెంటు కాలమూ ముగిసిన తరవాత ఆర్థికమైన మా ఇబ్బందులు ఆయన గ్రహించ గలిగిన కారణంగా ఎల్లాగయినా మా అచ్చాఫీసు కైంకర్యం చెయ్యాలన్న దుర్బుద్ధి ఆయనకు పుట్టి ఉంటుంది. ఎల్లాగయినా ఆయనకు రావలసిన అద్దె బాకీ క్రింద ఆ అచ్చాఫీసును స్వాహా చేయవచ్చునని ఆయన భావించి ఉంటాడు.

నేను 1932 లో అరెస్టయిన నాటికి ఏవో కొన్ని చిల్లర అప్పులూ, లినోటైపు కంపెనీకి ఇవ్వవలసిన బాకీలూ ఉండి పోయాయి. ఇంటి యజమానికి కూడా కొంత అద్దె బాకీ పడి ఉన్నాను. ఆయన కివ్వవలసిన బాకీతో సహా, ఇరవై వేల కంటె ఎక్కువగా ఉండి ఉండదు. మహా అయితే ఆ ఇరవై వేల అప్పూ ఒకటి రెండు లినోమిషన్ల ఖరీదుకంటె ఎక్కువ ఉండదు.

నాకు శిక్ష పడిన తరవాత, నా వ్యాపారమంతా చూస్తున్న కృపానిధి అన్న మా మేనేజరు ఏదో కొద్దిగ ఋణం కావలసి, ఆ ఇంటి యజమానిని కలుసుకున్నాడు. ఆ ఋణం పుట్టి నట్లయితే, కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు తీరతాయనీ, మళ్ళీ తిరిగి నేను వచ్చేవరకూ నిర్విఘ్నంగా పేపరు నడపవచ్చుననీ ఆయన తలచి ఉండవచ్చును.

సూ. నా. రావు తంత్రం

ఆ ఇంటి యజమానికి, తాను వాంఛించిన ప్రకారం, తనకు రావలసిన అద్దె బకాయి కింద ఆ అచ్చాఫీసంతా కైంకర్యం చేసేయాలన్న ఆశ ఎక్కువయి ఉంటుంది. అందుచేత, ఆయన తన సలహాదారులయిన పార్థసారథి, తిరువెంకటాచారిగార్ల సలహాకోసం వెళ్ళాడు. ఏదో ప్రకారంగా కొంత ధనాన్ని 'స్వరాజ్య' కంపెనీవారి కిచ్చి, మొత్తం తనకు రావలసి ఉంటుందనుకున్న డబ్బుకు హామీగా ఆ అచ్చాఫీసునంతటినీ వ్రాయించుకోవాలని ఆయనకు ఆశ పుట్టింది.

నా భార్య, ఆ 'స్వరాజ్య' కంపెనీకి ఆమె స్వంతం ఒక లక్షా పదమూడు వేల రూపాయలు అప్పు ఇచ్చి, ఆ కంపెనీ ఆస్తులపై ఫ్లోటింగ్ హక్కు పత్రం వ్రాయించుకుంది. ఇంటి యజమాని, తాను పొందిన సలహా ప్రకారం, ఆమెకున్న యావత్తు హక్కూ ఆయన పరంగా ఆమె వదులుకుంటే తప్ప ఒక్క కాణీకూడా అప్పు ఇవ్వనని స్పష్టంగా చెప్పేశాడు.

అప్పటికి నా భార్య హనుమాయమ్మ, ఇచ్చిన అప్పు వడ్డీతో సహా రెండులక్షల వరకూ పెరిగింది. ఆ ఇంటి యజమాని, తాను కోరిన ప్రకారం హనుమాయమ్మ ఆమెకున్న యావత్తు హక్కూ తనపరం గావించిన తరవాత 'స్వరాజ్య' కంపెనీవారు ఆ కంపెనీకున్న యావత్తు ఆస్తీ తన పేర తనఖా వ్రాయాలనికూడా షరతు పెట్టాడు.

కృపానిధి అప్పు కావాలని వ్రాసిన ఉత్తరానికి జవాబుగా సూర్యనారాయణరావు, ముందుగా హనుమాయమ్మగారి కున్న హక్కులన్నీ తన పేర ట్రాన్సఫర్ అయితే తప్ప, అప్పు ఇవ్వబడదని స్పష్టంచేశాడు. హనుమాయమ్మ పట్నంలోనే ఉంటూ ఉన్నా, స్వతస్సిద్దంగా ఏమీ చదువుకున్న ఇల్లాలు కాదు. ఆమె నేను ఏది చెపితే అది తు. చ. తప్పకుండా చేసే బాపతు మనిషి.

అందువల్ల కృపానిధీ, సూర్యనారాయణరావు కలిసి వెల్లూరు జెయిల్లో నన్ను కలుసుకోడానికి వచ్చారు. నా భార్యకున్న హక్కులన్నీ సూర్యనారాయణగారి పేర ట్రాన్స్‌ఫర్ కావడానికి కావలసిన సన్నాహమంతా ఆమె చేసేలాగున నాచేత ఉత్తరం వ్రాయించుకోవాలని నా వద్దకు వచ్చారు. వారు వెల్లూరు ఒక శనివారం నాటికి జేరుకున్నారు. ఆ రావడంకూడా సాధారణంగా జెయిలు రూల్స్ ప్రకారం ఇవ్వబడే ఇంటర్వూకాలం పూర్తి అయ్యాక వచ్చారు.

వా రిరువురూ మేజరు ఖాన్ ఇంటికి వెళ్ళి తాము ఆనాడు సకా లంలో రాలేకపోయామనీ, ఒక అతి ముఖ్యమయిన విషయం గురించి మాటలాడడానికి పట్నంనుంచి వచ్చామనీ, అందువల్ల ఆదివారం అయినా అ మర్నాడు ఒక్క అయిదు నిమిషాలపాటు సూర్యనారాయణరావు నాతో సంప్రతించడానికి సావకాశం ఇప్పించవలసిందనీ మేజర్ ఖాన్‌ను కోరారు.

ముందర అవకాశం ఇవ్వ నిరాకరించినా, తరవాత, అల్లాగే అయిదు నిమిషాలసేపు మాట్లాడవచ్చునని, సూర్యనారాయణరావుకు అనుమతి ఇచ్చాడు. వా రుభయులూ, వెల్లూరు వచ్చేముందర, తమకు నాతో సంప్రతించడానికి అనుమతి కావాలన్న దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. నేను ఆ వారంలో ఎవరినయినా కలుసుకుంటానని గాని, అందులో ఆదివారం ఉదయం ఆరుగంటలకే అది తటస్థపడుతుందని కాని ఊహించలేదు.

ఆ రోజు ఉదయం ఆరుగంటలకు మేజర్ ఖాన్ నా గదికి వచ్చి, నాతో చాలా అర్జంటు విషయాలమీద మాటలాడడానికి పట్నంనుంచి ఎవరో మిత్రులు వచ్చారనీ, వారితో నేను అయిదు నిమిషాలసేపు సంప్రతించడానికి తాను అనుమతి నిచ్చాననీ చెప్పి, నన్ను తన వెంట రమ్మాన్నాడు. నన్ను చూడడానికి వచ్చిన వారి పేరు మేజర్ ఖాన్ చెప్పలేక పోయాడు.

ఎవ్వరితో మాటలాడడానికి నాకు అనుమతి ఇవ్వబడిందో, వారి పేరయినా ఎరగనే అని, ఆ అనుమతిని నిరాకరించాలని అనుకున్నా సాధ్యం కాలేదు. నేను ఖాన్ గారి వెంట వెళ్ళాను. ఆ ఆసామీ లోపలకు తీసుకు రాబడ్డాడు. వచ్చింది ఇంటి యజమాని సూర్యనారాయణరావు గారు. ఆయన నాతో ఆ ఇనుప కటకటాల లోపల అయిదు నిమిషాల సేపు మాటలాడడానికి అనుమతింపబడి ఉన్నాడు.

ముందు ట్రాన్స్‌ఫర్ దస్తావేజు

మేజర్ ఖాన్ కొంచెం అవతలగా బయటనే నుంచుని, నిమిషాలు లెక్కపెడుతూ, నిమిషం అయిన వెంటనే గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఆయన ఆ కటకటాల ద్వారా మమ్మల్ని చూడగలడు. సూర్యనారాయణరావు, తాను నాకున్న అప్పుల తీర్మానంకోసం రు 300 లు కూడా పుట్టించలేకుండా ఉన్నాననీ, అయినా నా భార్య గనుక ఆమెకున్న హక్కులన్నీ తనకు విలియా వేస్తే, కంపెనీకున్న అప్పు యావత్తూ తనకు రావలసిన అద్దెతో సహా, తాను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ చెప్పాడు.

సూర్యనారాయణరావు చెప్పిందంతా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కృపానిధీ, ఖాసా సుబ్బారావుగారలు ఎక్కడ ఉన్నారని అడిగాను. వారు బయట ఉన్నారనీ, స్వయంగా మాటలాడి ఉన్న చిక్కులన్నీ నాతో చెప్పడానికి భయపడుతున్నారనీ చెప్పాడు. ఆయన తన లాయర్లు, నా భార్యకున్న హక్కులన్నీ తన పేర వ్రాసి ఇచ్చే పక్షంలో, సహాయం చెయ్యవచ్చు నన్నారని అన్నాడు.

ఆమె హక్కులన్నీ విలియా వెయ్య నవసరంలేదనీ, తనపేర సబ్ మార్ట్‌గేజ్‌గా తన హక్కులను ఇస్తే చాలునని నేను చెప్పాను. ఆయన తన ప్లీడర్లు తనకు ఇచ్చిన సలహా ప్రకారంగా గాక ఇంకే విధంగానూ సహాయం చేయజాలనని చెప్పేశారు. నేను నా వద్ద కలం కాగితం కూడా లేవనీ, సంగతులు పరిశీలించి నా భార్యపేర ఉత్తరం వ్రాస్తాననీ చెప్పాను. ఆయన తనవద్ద కాగితం వగైరా లున్నాయని చెపుతూ, ఒక జేబులోనుంచి కాగితం తీసి ఇచ్చాడు.

ఆయన చెప్పిన విషయంలో నాకు పూర్తిగా నమ్మకం కుదరక పోయినా, ఆయన చెప్పిన పరిస్థితులన్నీ విషమ పరిస్థితులుగానే ఉన్నాయనీ, తొందరగా వాటి విషయం తేల్చుకోక పోతే పరిస్థితులు చెయ్యిదాటి పోతాయేమోనని తలచి, నేను నా భార్యపేర ఉత్తరం వ్రాయడానికి అంగీకరించాను. తీర్చవలసిన బాకీల విషయం ఆలోచించి ఇరవై వేలకంటె బాకీ లుండవని చెప్పాను.

ఆమెకున్న హక్కులన్నీ తనపేర ఆమె నామకహా విలియా వేస్తే, దానిని ఒక బినామీ వ్యవహారంగానే భావిస్తూ, తాను ఆ కాగితం ఆధారంగా ఎట్టి చర్య తీసుకో దలచలేదనీ, తన పేర ఆమె వ్రాసే ట్రాన్సఫర్ దస్తావేజులో ఇంత సొమ్మని కూడా వ్రాయనవసరం లేదనే ఆయన అంటే, అల్లాకాదు - అంకె దానిలో వెయ్యాలని నే నన్నాను.

ఏది ఏమయినా, ఆమె హక్కులన్నీ సూర్యనారాయణరావుగారి పేర విలియా వేస్తే, తతిమ్మా వన్నీ తాము సరిచూసు కుంటామని ఆయన చెప్పడం చేతనూ, జరుగవలసిన కాండంతా అయిదు నిమిషాలలో జరగవలసి ఉన్న కారణంచేతనూ, ఆ కాగితంమీద, నాభార్యపేర, వారు కోరిన ప్రకారం ఎటువంటి ట్రాన్స్‌ఫర్ దస్తావేజయినా సరే ఇరవై వేలకు వ్రాసి ఇవ్వమని, ఒక ఉత్తరం గబగబా వ్రాసేశాను.

ప్రపంచకంలో ఎంతటి మూర్ఖుడయినా, ఇటువంటి తెలివి తక్కువ పని, అనాలోచితంగా, ఆ అయిదు నిమిషాలలోనూ చేసి ఉండడని నా తలంపు. ఏదయితేనేం - చేయకూడని పని చేశాను. చెయ్యి జారిపోయింది.

సూర్యనారాయణరావు నన్ను పూర్తిగా బోల్తా కొట్టించాడు. నా భార్యచేత ఆమెకున్న సర్వహక్కులూ తన పేర ట్రాన్సఫర్ వ్రాయించు కున్నాడు. ఇంత జేసినవాడు అప్పులయినా తీర్చాడా అంటే అదీ లేదు. పైగా, నా భార్య వ్రాసి ఇచ్చిన ట్రాన్సఫర్‌వల్ల తనకు రావలసిన అద్దె మాత్రమే తనకు లభిస్తుందనీ, అందువల్ల నా తాలూకు ఇతర బాకీలేవీ తాను తీర్చననీ స్పష్టంచేశాడు. కావా లంటే, 'స్వరాజ్య' కంపెనీ బాపతు చర, స్థిర ఆస్తులన్నీ - దానికోసం కొన్నస్థలం, ఉన్న బిల్డింగూ అన్నీ సాఫ్‌సీదాగా తనపేర పదివేల రూపాయలకు తనఖాపెడితే, నా తక్కిన బాకీలు తీరుస్తానన్నాడు.

తరవాత తనఖా దస్తావేజు

కృపానిధి మంచి చిక్కుల్లో పడ్డాడు. అతడే జెయిలులో నన్ను కలుసుకుని ఆ తనఖా దస్తావేజు ముసాయిదా నాచేత అంగీకరింప జెయ్యాలని నిర్ణయించ బడింది. ఆ మొదటి వ్యవహారంలో కృపానిధి చాలా తెలివి తక్కువగా వ్యవహరించి నన్ను ఒక శుంఠని జేశాడు. తాను బయట ఉండి సూర్యనారాయణ రావుని ఒక్కణ్ణే నాతో మాటలాడడానికి జెయిలులోకి పంపించిన కారణంగా, అటువంటి పరిస్థితి ఉత్పన్నమయింది. తానూ, సుబ్బారావూ వచ్చి అల్లా బయటే ఉండిపోక పోతే, అధమం తాను ఒక్కడయినా సూర్యనారాయణ రావుతోపాటు లోపలికివచ్చి, సంగతి సందర్భాలు క్షుణ్ణంగా చెప్పిఉంటే, ఈ చిక్కులలో మేము పడేవాళ్ళము కాము.

నాచేత ఆ రెండవ దస్తావేజు సరిగా ఉందని అనిపించు కోవడానికి తానువచ్చి నన్ను కలవవలసి వచ్చేసరికి కృపానిధి మానసికంగా చాలా బాధపడ్డాడు. కాని వెనకటికీ ఇప్పటికీ ఆతని పరిస్థితి అల్లాగే ఉండిపోయింది. అందుచేత, ఆ మొదటి ట్రాన్స్‌ఫర్ దస్తావేజు వ్రాయబడిన 15 రోజులు తిరక్కుండా, తప్పనిసరిగా నన్ను కలుసుకోక తప్పింది కాదు. ఈ ముసాయిదాలన్నీ ఆ ఇంటి యజమాని లాయర్లే తయారు చేశారు.

కృపానిధి నన్ను కలుసుకుని సూర్యనారాయణ రావు ఎల్లా మమ్మల్ని దగా చేసిందీ వివరించాడు, కంపెనీ తాలూకు ఇతర ఆస్తులన్నీ తనఖా పెడితేనే గాని ఒక్కకాణీ కూడా ఇవ్వనంటున్నాడని చెప్పాడు. నేను, అ ఆదివారంనాడు సూర్యనారాయణరావు ఒక్కడే లోపలికి వచ్చి నాతో మాట్లాడిన సందర్భంలో ఏం జరిగిందో, కృపానిధితో వివరంగా చెప్పాను. మనల్ని బాగా దగాచేశాడనీ, ఆనాడు సూర్యనారాయణరావుతో తానూ లోపలికి రాక పోవడాన్నే అతనికి అలాంటి అవకాశం కలిగిందనీ, అదే పెద్ద తప్పయిపోయిందనీ వివరించాను. నేను కృపానిధిని చివాట్లు పెట్టి, ఈ పరిస్థితులలో తనఖా దస్తావేజు వ్రాయడానికి సుతరామూ ఒప్పుకోనని చెప్పాను.

నా జీవితంలో ఎప్పుడూ ప్లీడరుగా, అడ్వకేటుగా, రాజకీయ వేత్తగా పనిచేసి - ఇటువంటి చికాకు పరిస్థితులలో నేను చిక్కుకోలేదు. ఆ సమయంలో నా సహజ వివేకం కూడా నన్ను విడిచిపెట్టి పారిపోయిందను కుంటాను. ఆఖరికి, తప్పనిసరిగాం కంపెనీకి మిగి లింది కాస్తాకూడా తనఖా పెట్టడానికి పరిస్థితులనుబట్టి ఒప్పుకోవలసి వచ్చింది.

నన్ను పూర్తిగా దగా చేయగలిగిన ఆ సూర్యనారాయణ రావు, ఈసారి నన్ను తిరిగి కలుసుకుని తనఖా దస్తావేజు ముసాయిదా అంగీకరింపజేయడానికి తంటాలు పడకుండా, తెలివిగా తప్పుకున్నాడు. అతడు లోపలికివచ్చి ఉంటే, ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజు విషయంలో నాకు చేసిన దగా గురించి అడిగి ఉందును. అతడు ఈ రెండు సందర్భాలలోనూ, జాగ్రత్తగా ప్లానువేసుకుని, మమ్మల్ని నిర్భంధించి, మా చేత ఆ రెండు దస్తావేజులూ వ్రాయించుకో గలిగాడు.

మొదటిది - నా భార్య హనుమాయమ్మకు 'స్వరాజ్య' కంపెనీపై రెండు లక్షల పై చిలుకు రొక్కానికి ఉన్న హక్కులన్నీ ఆయన పేర ట్రాన్స్‌ఫరుకు సంబంధించిందీ, రెండవది - మిగిలిన చర, స్థిర ఆస్తులన్నీ సీదాగా అతని పరం చేసేదీ. అంతేకాదు - నాచేతా, నా భార్యచేతా కూడా ఉత్తరాలు వ్రాయించుకున్నాడు. ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజువల్ల కాని, తీరని ఆర్థికమైన లోటుపాట్లు ఏవయిన ఉంటే వాటి విషయంలో మేము ఇరువురమూ స్వయంగా బాధ్యులమనీ ఆ ఉత్తరంలో వ్రాసి ఇచ్చాము.

ఈ విధంగా నేను వెల్లూరులో ఖైదీగా ఉంటూన్న ఆ రోజులలో సూర్యనారాయణ రావు తంత్రంలో పడిపోయి, బలవంతంగా ఆ దస్తావేజులు వ్రాసి ఇచ్చాను.

ఆపైని హైకోర్టు

స్వరాజ్య కంపెనీ తరువాత చరిత్ర సుదీర్ఘమై అనేక సంఘటనలతో కూడుకుని ఉంది. అలా దగాగా సంపాదించిన ఆ రెండు దస్తావేజులు ఆధారంగా ఆ సూర్యనారాయణ రావు, హైకోర్టుకి వెళ్ళి 'స్వరాజ్య' కంపెనీని ఎల్లాగయినా మూయించేసి, ఆ కంపెనీ తాలూకు యావదాస్తినీ - అనగా అచ్చాఫీసు, లినో మిషన్లు, బిల్డింగులు, ఖాళాజాగా వగైరా - తనకు బాకీగా ఉన్నామని చెప్పబడే అద్దెబకాయి కింద, ఆ కొద్దిపాటి రొక్కానికే, చేత బట్టాలని చూశాడు. నేను జాగ్రత్తగా, ఆ వ్యవహారం నడిపిస్తూ, నా ప్లీడర్లు నన్ను జారవిడిచిన సందర్భాలలో నేనే స్వయంగా వాదించుకుంటూ, కంపెనీ మూసివేయాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రతి పిటీషనూ నెగ్గుకుంటూ వచ్చాను.

మిస్టర్ జస్టిస్ జెంటిల్ (Mr. Justice Gentle) వద్ద ఆఖరు సారిగా దాఖలు చేయబడిన పిటీషన్ విచారణకు వచ్చినప్పుడు, ఆ ఇంటి యజమాని కివ్వవలసిన అద్దె బకాయి ఎంతో నిర్ణయించ వలసిందనీ, ఆ పద్దులన్నీ సరిచూసి నికరం బాకీలు తేల్చవలసిందనీ ఆ జడ్జీగారు ఆర్డరు జారీ చేశారు.

అప్పీలు కోర్టులోకి ఆ వ్యవహారం వచ్చిన సందర్భంలో, ఆ సూర్యనారాయణ రావు తనకు రావాలని చూపించిన అంకెలు తప్పని వాదించాను. అప్పటికి, పరిస్థితుల ప్రభావం వల్లనే మదరాసు ప్రభుత్వంలో రెవిన్యూమంత్రిగా ఉండటం తటస్థించింది. అందువల్ల నేను స్వయంగా జడ్జీల ఎదుట నిలబడి వాదించడానికి సావకాశం (మంత్రులు కోర్టులలో జడ్జీల ఎదుట లాయర్లుగా నిలిచి వాదించడం న్యాయ విరుద్ధమూ, మంత్రి హోదాకు భంగమూను) లేకుండాపోయింది.

ఆ అప్పీలు కోర్టులో జడ్జీలలో ఒకరయిన జస్టిస్ వరదాచారి గారికి కంపెనీ మూసి వేయడమే న్యాయమని తోచింది. నా అభ్యంతరం కేవలం జమాఖర్చులకు సంబంధించిందే అయిన కారణాన్ని ఇవ్వ తేలే మొత్తం చిన్నదయినా పెద్దదయినా, ఈ పరిస్థితులలో కంపెనీని మూసి వేయడమే న్యాయమని ఆయనకు తోచింది.

ఈ లావాదేవీలన్నీ సుదీర్ఘంగా నడిచాయి.[1] కంపెనీ మూసివేయ వలసిందేను అన్న ఆ జడ్జీగారి తీర్పు న్యాయమైంది, సవ్యమైంది కాదంటూ, హైకోర్టు ఒరిజనల్ సైడున ఒక దావా వేశాను. దగాచేసే ఉద్దేశంతో వ్రాయించుకున్న ఆ ట్రాన్స్‌ఫర్ దస్తావేజూ, తనఖా దస్తావేజూ చెల్లవనీ, నేను నా కుమారులూ అప్పటికి చనిపోయిన హనుమాయమ్మగారి సన్నిహితవారసులుగా ఆమె హక్కులను రక్షించవలసిన బాధ్యత మా పైన ఉన్నదనీ, కంపెనీ తాలూకు ఆస్తులన్నీ మాకు చెందాలనీ, ఎటొచ్చీ సూర్యనారాయణ రావుకు అద్దెబాపతుగా ముట్టవలసిన సొమ్ముకు మాత్రమే అతడు అర్హుడనీ మా దావాలో పేర్కొన్నాము.

ఈ దావాలో జస్టిస్ సోమయ్యగారు మా పక్షంగానే తీర్పు ఇచ్చారు.

కాని ఇది ఇల్లా నడుస్తూ ఉండగానే, కంపెనీ వైండింగ్ ఆర్డరును పురస్కరించుకుని కంపెనీ తాలూకు ఆస్తులన్నీ విక్రయించబడ్డాయి. వేరే దావా వేసిన కారణంగా, ఆ కంపెనీ తాలూకు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఇన్‌జక్షన్ ఇప్పించవలసిందని మేము కోరిన ఆర్డరు నిరాకరించబడింది. అందువల్ల ఆ ఆస్తులన్నీ అల్లా అల్లా అమ్మకం అయిపోయాయి. వేలూ, లక్షలూ ఖరీదుచేసే ఆస్తులు టూకీగా వందలూ, వేలూ మీద ఎగిరిపోయాయి. ఆ ఆస్తులేవీ తిరిగి స్వాధీనపరచుకునే అవకాశం లేకుండా పోయింది.

ఫలితం దక్కని విజయం

అందువల్ల మాకు కలిగిన జయం కేవలం కాగితంమీదనే అని అనుకోక తప్పదు. ఈ డిక్రీమీద సూర్యనారాయణ రావు అప్పీలు పడేశాడు. తుదకు ఆస్తుల అమ్మకంవల్ల కోర్టులో జమఅయిన రొక్కాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీపడ్డాం.

ఒక కోర్టులో దోషంలేదని నిరూపించబడ్డా, కోర్టువారు నా వాదన న్యాయమయిందేనని కేసు నా పక్షంగా తీర్పు ఇచ్చినా, అంతిమ విజయం నాదేఅయినా, ఆస్తులు స్వాధీనంఅయ్యే పరిస్థితి చేయిజారిపోవడాన్ని - మీరు రాజీపడితే బాగుంటుందేమోననే కోర్టువారి సలహాను పురస్కరించుకుని, రాజీకి ఒప్పుకున్నాను.

నిజానికి ఆ సంస్థను మూసివేయడానికి నాకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. పూర్తిగా నన్ను నమ్మి, నా యందుఉన్న అఖండిత విశ్వాసంతో, ఈ దేశీయులేగాక పైదేశాలవారు కూడా, ఏ విధమయిన అపేక్షలూ లేకుండా, విరివిగా ధనసహాయం చేసిఉన్న కారణంగా, ఆ కంపెనీ మూసివేయడమంటే నా కదోలా అనిపించింది. చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడనిపిస్తోంది. ఆనాడు 1924 లో, గాంధీగారి సలహా ప్రకారం, ఈ సంస్థను మూసి ఉంటే, మా ఆస్తులు చిన్నం ఎత్తయినా పోయి ఉండేవి కావు. మాకు ఈ చిక్కులూ, ఈ క్షోభా, ఏవీ ఉండేవికావు.

నా విషయంలో నాకే బెంగా లేదు. నేను పుట్టింది ఒక బీదల ఇంటిలో, పెరిగిందీ బీదవారి కొంపల లోనే. ప్లీడరుగానూ, బారిష్టరుగానూ మాత్రం లక్షలు సంపాదించాను. దీర్ఘ కాలంగా నడచిన, ఒక పెద్ద దేశంయొక్క స్వాతంత్ర్యంకోసం జరిగిన శాంతియుత సమరంలో ప్రజలు వద్ద నుంచి సంపాదించిన లక్షలు, ఆ ప్రజల స్వాతంత్ర్యంకోసం ఆనందంగా ఖర్చు పెట్ట గలిగాననే భావన నామట్టుకు నాకు ఆనంద దాయకంగానే ఉంది. నాతో, నా దృక్పథంతో ఆలోచించి చూడగల శక్తి నా భార్యకూ, పిల్లలకు లేకపోయినా, జీవితమన్నది కేవలం వ్యక్తిగతంగా ఒక్కొకరమే బ్రతకడానికి కాదనీ, ఇతరుల కోసంకూడా మనం బ్రతకవలసి ఉంటుందనీ గ్రహించడాన్ని చాలా ఘనమయిన త్యాగాలు చేయగలిగాం. ఏ విధమయిన అనిష్టతా చూపించకుండా, మనస్సులో నయినా సణుక్కోకుండా, ఆస్తిపై వారికున్న అన్ని హక్కులూ, నా భార్యా, పిల్లలూ ఆనందంగా వదులుకున్నారు.

నిజాని కివి మా కుటుంబానికి చాలా కష్టపు దినాలు. 'స్వరాజ్య' కంపెనీకి అప్పిచ్చినవారిలో ఒకే ఒక ఋణదాత, నేను జైలులో ఉన్న సందర్భంలో, మా కుటుంబానికి విపరీతమయిన నష్టాన్ని కలుగజేయగలిగాడు.

'స్వరాజ్య' కంపెనీని ఎల్లా అయితే రక్షించు కోలేకపోయానో, అదే ప్రకారంగా నా భార్య జీవితాన్నికూడా కాపాడుకోలేకపోయాను. 1932 జూలైలో నేను విడుద లయ్యాను. అదే సంవత్సరం నవంబరు మాసంలో ఆమె దివంగతురాలయింది. ఇవీ 1932 నాటి నా వెల్లూరు జెయిలు ముచ్చట్లు.

  1. వీటిని గురించి "స్వరాజ్య పత్రిక - కంపెనీ" అన్న ప్రకరణంలో వివరంగా వ్రాద్దా మనుకున్నారు.