నా జీవిత యాత్ర-1/రాజకీయ జీవితం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

21

రాజకీయ జీవితం

నాకు అంతో యింతో వెలుగు యిచ్చింది రాజకీయ జీవితం. ఆ జీవితమే నేను ఆంధ్రదేశపు సద్భావం పొందడానికీ, ఈ చరిత్ర వ్రాయడానికీ కారణం అయింది. కనక ఈ విషయం కొంచెం విపులంగా వ్రాస్తాను. నేను ఆదిలో వృత్తి నిర్ణయం చేసుకునే కాలంలో నా దృష్టి ప్లీడరీమీదికి పోవడానికి కారణం వ్రాసే ఉన్నాను. అ కాలంలో ప్లీడర్లకి ఉండే ఆర్జన, హుందా తనమూ మాత్రమే కాకుండా ఆ వృత్తి స్వతంత్ర వృత్తి అనే నమ్మకంకూడా నన్ను అందులోకి ఈడ్చుకు వెళ్ళింది. హనుమంతరావు నాయుడుగారి శుశ్రూష, రాజమహేంద్రవరంలో వీరేశలింగంపంతులు సంస్కర ణోద్యమమూ, కొంతవరకు నాలో రాజకీయాభిలాషలు రేకెత్తించాయి. అప్పటికి 1857 వ సంవత్సరంనాటి స్వాతంత్ర్య యుద్ధపు కథలు యింకా ప్రచారంలోనే ఉన్నాయి. ఏమైనా, ఈనాటి మహదాశయాలు ఇదమిత్థ మని ఏర్పడకపోయినా, నాలో యితర లౌకికాభిలాషలతోపాటు దేశసేవ చెయ్యాలనే అభిలాషకూడా ఉండేది.

నేను రాజమహేంద్రవరంలో యఫ్. ఏ. క్లాసు చదువుకునే కాలానికి కాంగ్రెస్ అనే మాట కొంచెంగా వినబడేది. కాని, ఆ మాట వినిపించు కునేవాళ్ళ సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. నేను 1893 వ సంవత్సరంలో లా కాలేజీలో చదువుకునే రోజుల నాటికి కాంగ్రెస్ మరికొంత పేరు పాతుకుంది. అప్పుడే నేను మద్రాసులో బిల్లిగిరి అయ్యంగారి ఐస్‌హౌస్ భవనంలో శ్రీ వివేకానందస్వామిని దర్శించి ఆయనతో చాలాసేపు చర్చచేశాను. అప్పట్లో బిసెంటమ్మ వర్గంలోని ఓల్డు అనే ఆయన దివ్య దృష్టితో టెలిపతీవిషయాలు చెపుతూ ఉండేవాడు. ఆ విషయా లన్నిటి గురించీ వివేకానందస్వామిని అడిగి తెలుసుకున్నాను. మానవుడికి జ్ఞానం పరిపక్వం అయితే ఆలాంటివి అసాధ్య విషయాలు కావని ఆయన చెప్పారు. ఆయన ఉపన్యాసాలు నాకు కొంత ఉత్తేజం కలిగించాయి. రాజమహేంద్రవరంలో ప్రాక్టీసుచేసే కాలంలో - అంటే 1894 - 1900 సంవత్సరాల మధ్యలో - కాంగ్రెస్సునిగురించి, సంవత్సరానికోమారు ఉత్సాహంగా చెప్పుకోవడమే ఉండేది కాని, స్వాతంత్ర్య స్వరూపంగాని, దానికి అవసరమైన కార్యక్రమ స్వరూపం గాని అవగాహనే కాలేదు. సిపాయి విప్లవం పాలకులకీ, పాలితులకీ కూడా అనేకపాఠాలు నేర్పింది. పాలకులు కేవలం జబర్‌దస్తీ సాగదనీ, దేశంలో ద్విభాషులతోపాటు మచ్చుపిట్టల్ని మరిగించాలనీ కూడా తెలుసుకున్నారు. ప్రజలు 1857 నాటి విప్లవానంతరం కొంత నిరుత్సాహపడినా, సక్రమమైన ఆందోళన సాగుతూ ఉండాలనికూడా గ్రహించారు. దీని ఫలితమే కాంగ్రెసుసృష్టి అని నా అభిప్రాయము. కొంతమంది ఆంగ్లమిత్రులు, కేవలం ధర్మబుద్ధితో కాంగ్రెస్ స్థాపనకి ప్రోత్సహించిన మాట సత్యమే కాని, మొత్తంమీద ఆంగ్ల రాజనీతిజ్ఞులు ఈ సక్రమాందోళనాసంస్థని అప్పట్లో ప్రోత్సహించడంలో కొంత స్వార్థంకూడా లేకపోలేదని నా నమ్మకం.

అప్పటికే, - అంటే కాంగ్రెస్సు ప్రారంభించిన కాలానికే - ఇంగ్లీషువారు దేశంలో నాణాల చట్టం ప్రవేశపెట్టి కరెన్సీనోట్ల చలామణీ ప్రారంభించారు. అప్పుడు బొంబాయిలోనూ, కలకత్తాలోనూ, ఇంకా ముఖ్యమైన వర్తకస్థానాలలోనూ చాలా తీవ్రమైన అలజడి బయలుదేరింది. అది ఆ వర్తకుల డబ్బుతోనూ పలుకుబడితోనూ కలిసి, చివరికి చినికి చినికి గాలివాన అవుతుందేమో నని మనదేశంలో వున్న ఆంగ్లరాజనీతి కోవిదులు కొంచెం భయపడి, ఈ ఆందోళనను సక్రమమైన కట్టు కాలవల్లో ప్రవహింప చెయ్యడానికి, ఈ కాంగెసు సంస్థని పురిగొల్పారని నా అభిప్రాయము.

అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధంనాటినించీ ఇంగ్లీషువారికి జయ పరంపరలే కాని, అపజయం అనేది లేదు. పరభూములు స్వాధీనం చేసుకున్నాక, గట్టి పద్ధతులమీద తీర్చిన సంస్థల సహాయంతో తమ ప్రయోజనాలు సాధించుకోవడంలో ఇంగ్లీషువాళ్ళు ఆరితేరినవాళ్ళు. అందుచేతనే వాళ్లు మొట్టమొదట మన రాజ్యాంగ సంస్థలని నిర్మూలింప జేసి, తమ విద్యా పద్ధతీ, న్యాయ పద్ధతీ ప్రవేశింపచేశారు. క్రమంగా తమ భాష, నాగరకత, సంప్రదాయాలూ, సంస్థలూ, ఆర్థికపద్ధతులూ, గ్రామ పాలనా సంస్థలూ మొదలైనవి మనకి అంటగట్టి, పూర్తిగా తమకి వశ్యుల్ని చేసుకున్నారు. కాంగ్రెస్ స్థాపింపబడే రోజులకే ఆంగ్లేయుల ప్రయత్నాలు చాలావరకు ముగిశాయి.

పల్లెలలో అనాదిసిద్ధంగా ఉండే విద్యాపద్ధతులు అంతమై, ఎలిమెంటరీ, ఎయిడెడుస్కూళ్ళు, బయలుదేరాయి. క్రమంగా, ఆవిద్య అనేది లేని ఈ పుణ్యభూమిలో అక్షరాస్యులు అరుదై పోయిన కాలం వచ్చింది. పాశ్చాత్య విద్యావిధాన ప్రవేశమే మనజాతి కంఠానికి తగిలించిన మొదటి గుదిబండ. దానికి తమ పరిపాలన సాగించడానికి ఏర్పరచిన లాకోర్టులు రెండో గుదిబండ. వీటిలోనించే లెజిస్లేటివ్‌కౌన్సిళ్ళు అనే భాధ్యతలేని బూటకపు సంఘాలు బయలుదేరాయి. సహజంగా ఇంగ్లీషు వారి విద్యావిధానంలో నించి తయారైన లాయర్లూ, సివిల్ నౌఖరులూ ప్రజలకి నాయకులు అయ్యారు. అల్లాంటి నాయకుల యాజమాన్యంలో సృష్టించబడిన ఈ కాంగ్రెస్ మహాసంస్థ ఆ దాస్య చిహ్నాలన్నీ వదులుకుని నేటికి గాంధీజీ చలవవల్ల నిజమైన ఏకైక జాతీయ సంస్థగా పరిణమించడం మనకి శుభావహం. అ విషయమై ముందుముందు వ్రాస్తాను. ప్రస్తావన మధ్యలో ఆంగ్ల విద్యాపద్ధతి విమర్శకి వచ్చింది.

కనక బర్మాలో ఆంగ్లేయులు చేసిన పనికూడా వ్రాస్తాను. నేను 1929 లో బర్మా వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసింది. ఆంగ్లేయులు తీబారాజుని పదచ్యుతుణ్ణి చేసి, ఖైదులో వుంచేసరికి, బర్మాలో నూటికి 80 మందికి తక్కువ గాకుండా విద్యావంతులు వుండేవారట. ఆంగ్లేయులు బర్మాని పూర్తిగా వశపరుచుకున్న 50 ఏళ్ళ లోపుగా ఆంగ్ల పాఠశాలలు స్థాపించి, జాతీయవిద్యావిధానాన్ని నాశనం చేసి, దేశంలో విద్యాగంధం ఉన్నవారి సంఖ్య సగానికి పైగా తగ్గించగలిగారు. బర్మాలో విద్యావిధానం అంతా బౌద్దసన్యాసులచేతుల్లో వుండేది. వారు స్థాపించిన మఠాల్లో ప్రజలకందరికీ ధర్మార్థకామాలు సిద్ధింపజేసే మహత్తరమైన విద్య లభించేది. ఆ మఠాలు ఇంగ్లీషు పాఠాశాలలు వచ్చాక పశువులకొట్టాలుగా మారిపోయాయి. అవి నేటికీ అక్కడక్కడ పొలాల్లో నిలిచే వున్నాయి. మాండలేలో 150 అడుగుల బౌద్ద విగ్రహం ఉన్న కొండ బర్మా బౌద్ధుల ఆరాధనకోసం సంపాదించ గలిగిన ఉకాంతి అనే ఆయన ఈ విషాదగాథ అంతా నాకు చెప్పాడు. ఆంగ్లేయులు ప్రతిచోటా ఈ తంతే జరిపించారు. రౌండు టేబిల్ సంపాదకుడయిన కర్టిన్ చెప్పినట్లు, తమ పరిపాలన సాగించడానికి అవసరమైన గుమాస్తాలనీ, ద్విభాషుల్నీ, వకీళ్ళనీ, యింకా యితర నౌఖర్లనీ తయారుచెయ్యడమే ఆంగ్లేయుల విద్యావిధానంలో వున్న పరమోద్దేశం ఒకవిధంగా మన విద్యావంతుల్ని ఆంగ్ల మానస పుత్రుల్నిగా తయారుచెయ్యడమే వారి ఆదర్శము. అప్పట్లో మన ప్రజలకి నాయకులుగా చలామణీ అయిన ప్లీడర్లు అంతా ఇల్లాంటి ఆదర్శం వల్ల ఉద్భవించినవాళ్ళే. దేశంలో ప్రజానీకాన్ని నిర్వీర్యం చేసి, శాశ్వతమైన బానిసలుగా తయారుచేసి బ్రిటిష్ సంస్థలకి అన్నింటికీ ఆంగ్ల విద్యాధికులే నిర్వాహకులు అయ్యారు. క్రమంగా ఈ నిర్వాహకులకి కూడా వాటి ఆంతర్యం గోచరం అవడంచేత కొంచెం ఆత్మగౌరవం రేకెత్తింది.

కాని, ఇంగ్లీషు పాలకులు అతి గడసరులు. కాంగ్రెసులో చేరి ప్రజానీకంకోసం ఎవరైనా పూనుకుంటే, వారికి ఏదోరీతిగా ఆశలు చూపించి, ఉన్నతోద్యోగాలు యిచ్చి, సంతృప్తిపరిచేవారు. కాంగ్రెస్సు ఉత్పత్తీ, వృద్ధీ యిప్పటికి బాగా లోకవిదితాలు అయ్యాయి కనక, యిక్కడ నేను వివరించదలచుకోలేదు. నేను ఇంగ్లండు వెళ్ళడానికి ముందుమాత్రం కాంగ్రెసు రాజకీయాలు నన్ను ఎక్కువగా ఆకర్షించలేదు. ఒకసారి నేను బొంబాయిలో వర్తకం చేస్తూవున్న గొల్లపూడి నరసింహం అనే ఒక లక్షాధికారి కేసుమీద బొంబాయినగరం సందర్శించాను. అప్పట్లో తీవ్రవాదిగా ప్రసిద్ధిపొంది, ప్రభుత్వపు ఆగ్రహానికి కూడా గురి అయిన లోకమాన్య తిలక్‌ని పూనానగరంలో దర్శించాను.

అప్పుడు ఆయనతో అనేకవిషయాలు చర్చించాను. అప్పటికి ఆయన రాజకీయాల్లో తీవ్రవాది. కాని, సాంఘికవిషయాల్లో కొంచెం పూర్వాచార పరాయణుడు. అందుచేత వీరేశలింగంపంతులుగారి ప్రభకి లోనైన నాకు ఆయనతో విశేషంగా చర్చించవలసిన ఆవసరం కలిగింది. ఆయన నాకు హిందూమతం మూలసూత్రాలన్నీ చక్కగా వివరించి మన ఆచార వ్యవహారాల్లో వుండే ఆంతర్యాలన్నీ బోధించారు. కాని, నేను అప్పట్లో వాటిని అవగాహన చేసుకునే స్థితిలో లేను. ఇప్పటికి వాటి పరమార్థం గ్రహించాను.

అప్పుడే ఆయనకీ, గోఖలేకీ వివాదం జరుగుతూవుండేది. ఆయన తమకి యిద్దరికిన్నీ గల అభిప్రాయబేధాలు ఏమీ ఆగ్రహావేశాలు లేకుండా, గోఖలే అంటే అతిగౌరవంతో వ్యక్తపరిచారు. అప్పట్లో గోఖలే ఆయనమీద కక్ష సాధించడానికి చాలాకష్టపడినట్లుగానే అర్థం అయింది. ఆనాటినించీ నాకు గోఖలే అన్నా, ఆయన రాజకీయాలు అన్నా ఒకవిధమైన అనిష్టం బయలుదేరింది. తిలక్ మీద వచ్చిన ప్రోసిక్యూషన్లలోనూ, ఇతర కష్టాలలోనూ ఈ గోఖలే ప్రభృతులకికూడా కొంత బాధ్యతవుందని నేను అనుకున్నాను. కాంగ్రెసు రాజకీయాలు నన్ను అప్పట్లో ఆకర్షించక పోవడానికి ఇది ఒక కారణం. ఆనాటి కార్యక్రమంలోగాని, నాయకత్వం లోగాని నన్ను ఉత్తేజపరచినది ఏమీ లేదు. లాలా లజపతిరాయ్, తిలక్ వంటివాళ్ళకి ఆ పోకడలు వచ్చినా, వాళ్ళకి కాంగ్రెస్ సంస్థలో పలుకుబడి వుండేదికాదు.

నేను ఇంగ్లండులో బారిష్టరు చదువుకునే రోజులలో దాదా భాయి, శ్యాంజీకృష్ణవర్మ, వెడ్డర్ బర్న్, రమేశచంద్రదత్తు, డబ్లి యి. సి. బోనర్జీ వంటి ప్రముఖుల పరిచయభాగ్యం సంపాదించుకున్నాను. ఆ దేశంలో వుండే స్వాతంత్ర్య వాయువులకీ, మనదేశంలో వుండే నిర్బంధాలకీ గల తారతమ్యం కూడా కనుక్కున్నాను. స్వాతంత్ర్యం కోసం పెనగులాడిన ఇతర దేశాల చరిత్రలన్నీ జాగ్రత్తగా చదివాను. ఈ పై కారణాలవల్ల నా మనస్సు రాజకీయాలలో లగ్నమైన దని చెప్ప వలసి వుంది, కాని, అప్పట్లో ప్రజానాయకు లనేవారి ఆదర్శమే చాలా చిన్నది. స్వరాజ్యమూ, స్వాతంత్ర్యమూ ఆనే ఆశయాలే లేకుండా వుండేవి. అప్పట్లో లండనులో హిందూదేశాన్నిగురించి ప్రచారం చెయ్యడానికి లండన్ ఇండియన్ సొసైటీవారు ఆహ్వానించిన మితవాద ప్రముఖుడు, గోఖలేకూడా ముందు తను మాట్టాడదలచుకున్నవి వ్రాసి పంపవలసినస్థితిలో వుంటే యిక యితరుల సంగతి చెప్పాలా? ఈ మితవాదం అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించి, వాళ్ళ యాజమాన్యం కింద దయాధర్మ భిక్షంగా, కొంచెం కొంచెం రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించాలనే ఆశయం - అప్పటికి విద్యాధికుల మనస్సుల్లో బాగా జీర్ణించి వుంది. బ్రిటన్‌లోనూ, యితర దేశాల్లోనూ స్వాతంత్ర్యం అన్నా ప్రజాస్వామికం అన్నా అర్థమయినట్లు మన వాళ్ళకి అర్థం కాలేదు. ఏమంటే - స్వార్థపరులైన ఆంగ్ల రాజనీతిజ్ఞులు మనదేశంలో అనేక మతాలూ, కులాలు వున్నాయనీ, ఒక ప్రజాస్వామికంకింద వీళ్ళందరూ ఒక తాటిమీద నడవడం అసంభవమనీ వ్రాశారు. ఇవి వాళ్ల మనస్సులకి బాగా పట్టుకున్నాయి. లండనులో డబ్లియు. సి. బోనర్జీ - (ప్రథమ కాంగ్రెసు అధ్యక్షుడు) పోయినప్పుడు శ్మశానంలో రమేశచంద్రుదత్తువంటి విద్యావేత్తా, బుద్ధిశాలీ కూడా తీవ్రవాదుల చర్యల్ని విమర్శించాడంటే ఇంక వేరుగా చెప్పేది ఏమిఉంది?

కాంగ్రెసు నాయకత్వం స్వల్పసంస్కరణలకోసం అంటే నిర్భందోచిత ప్రారంభవిద్య, న్యాయశాఖా కార్యనిర్వాహకశాఖల విభజనం, దేశీయులకి ఉన్నతోద్యోగాలు యివ్వడం, శాసనసభల్లో సభ్యుల సంఖ్య పెంచడం, ఐ. పి. యస్. పరీక్షలు ఇండియాలో కూడా జరిపించడం మొదలైన విషయాలకోసం ఆందోళన జరిపిస్తూ వుండగా మహారాష్ట్రదేశంలో లోకమాన్యుడు, పంజాబ్‌లో లాలా లజపతిరాయ్, బంగాళాదేశంలో విప్లవ వీరులు స్వరాజ్యం అనే ఆదర్శాన్ని ధైర్యంతో ప్రతిపాదించి కష్టాలపాలు అయ్యారు. స్వాతంత్ర్య రథానికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు. దేశంలో వుండే కోర్టులు ఇంగ్లండులోని స్టార్‌ఛేంబర్సు మాదిరివే అవడంచేత ఈ దేశభక్తులు స్వరాజ్యం కోరడమే అపరాధంగా పరిగణింపబడి, వాళ్ళకి కారాగృహప్రాప్తి కలుగుతూ వుండేది. వాళ్ళ పేర్లు ఉచ్చరించడం, వాళ్ళ పటాలు ఇంట్లో పెట్టుకోవడం ఆఖరికి 'వందేమాతరం' అని మాతృదేవికి నమస్కారం చెయ్యడంకూడా అపరాధం అయిపోయిన రోజులు వచ్చాయి. 1905-6 సంవత్సరాల ప్రాంతంలో తిలక్‌పటంకోసం రాజమహేంద్రవరంలో ఎన్నో ఇళ్ళు సోదా చేశారు. రాజకీయాందోళన క్రమంగా చినికి చినికి గాలివాన అయి తమ సామ్రాజ్యపు పునాదులకికూడా హాని కలిగిస్తుంది అనే భయంతో ఆంగ్లపాలకులు దేశం అంతా - ముఖ్యంగా బెంగాల్లో - నిర్భంధ విధానం ప్రారంభించారు. ఇంత జరుగుతూ వున్నా నాయకత్వం వహించి వున్న మితవాదనాయకులు తగిన రీతిని అసమ్మతులు తెలపలేక పోవడంచేత ప్రభుత్వం మరింత ధైర్యంతో నిర్భంధవిధానం సాగించింది.

స్వరాజ్యం అనే పదమే అపరాధంగా పరిగణింపబడుతూ వున్న ఆ రోజుల్లో నేను లండనులో దాదాభాయి నౌరోజీ సన్నిధిలో ఉండడం తటస్థించింది. ఈ వార్తలు చూసినప్పుడు ఒకసారి తేజశ్శాలి అయి యోగీశ్వరుడులా వున్న ఆయన ముఖం ఎర్రగా కందిపోయింది. అప్పుడే ఆయన భారతదేశం వెళ్ళి స్వరాజ్యం అనే ఆదర్శం బహిరంగంగా వెల్లడించాలని నిశ్చయించు కున్నారు.

ఆ నాటి మితవాదులు తరవాత కాలానికి చెందినవాళ్ళ మోస్తరుగా కాక, తమ సిద్ధాంతాలు అంటే చాలా పట్టుదల గలిగి వుండే వాళ్ళని నా అభిప్రాయం. ప్రభుత్వం వాళ్ళ మొరలూ, ప్రార్థనలూ,ఆశ్రయింపులూ, అనునయాలూ ఎంతగా పెడచెవిని పెట్టినా, వాళ్ళు మాత్రం మారడం అనేది వుండేదికాదు. మితవాదులు, వైస్రాయి తమ మాట వినకపోతే పోనీ ఇంగ్లీషు దొరగారిమాట అయినా వినకపోతాడా అని వైస్రాయిగావున్న లార్డు కర్జన్‌కాలంలో సర్ హెన్రీ కాటన్‌ని కాంగ్రెసు ప్రెసిడెంటుగా చేసి, ఆయనదగ్గిరికి పంపించాలని సంకల్పించారు. పాపం! వైస్రాయి ఆఖరికి కాటన్‌ని చూడడానికి కూడా అంగీకరించలేదు.

బెంగాలు విభజన తరవాత వచ్చిన ఆందోళన దేశంలోని మితవాద తీవ్రవాదశక్తుల్ని పూర్తిగా రెండు చీలికలుగా విభజించింది. నేను ఆ కాలంలోనే లండన్‌నించి తిరిగివచ్చి మద్రాసులో ప్రాక్టీసు ప్రారం భించాను. క్రమంగా రాజకీయాల్లో జోక్యం కలిగించుకోవడం ప్రారంభించాను. అప్పట్లో మద్రాసులో రాజకీయంగా ప్రముఖులైన వారు, సర్ సి. యస్. శివస్వామి, వి. కృష్ణస్వామయ్యరు, న్యాపతి సుబ్బారావు పంతులు, జి. సుబ్రహ్మణ్య అయ్యరుగార్లూ, తదితరులూను.

నేను బారిష్టరుగా ప్రాక్టీసు ప్రారంభించిన కొద్దిరోజులకే బెంగాలు నాయకుడైన విపిన్‌చంద్ర పాల్ మద్రాసులో ఉపన్యాసాలు యివ్వడానికి వచ్చాడు. ఆయన అప్పటికే 'గొప్ప వక్త' అని పేరు పొందాడు. అప్పుడు మద్రాసులో భాష్యంఅయ్యంగారు అడ్వకేటు జనరల్. శంకరన్‌ నాయరుగారు గవర్నమెంటు ప్లీడరు. పాల్ మద్రాసు బీచిలో వరసగా ఉపన్యాసాలు యిచ్చాడు. మొదటి ఉపన్యాసం అయ్యాక ఆయన మీటింగుకి అధ్యక్షుడు ఎవ్వరూ దొరకలేదు. సభానిర్వాహకులు నన్ను అడిగితే నేను అంగీకరించాను. అప్పుడు పాల్ నిజంగా నిప్పులు కురిపించేటంత తీవ్రంగా ఉపన్యాసాలు యిచ్చాడు. ఆయన చెప్పిన దాంట్లో బే సబబు ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఆ ఉపన్యాసాలు గవర్నమెంటు అధికారులకి తెలుస్తూ వుండేవి. భాష్యం అయ్యంగారు సభలో కూర్చోడానికి ధైర్యం చాలక బీచి ఒడ్డున మామూలుగా షికారుగా నడుస్తూ వున్నట్టు మెల్లిగా పచారుచేస్తూ వింటూ వుండేవాడు. కాంగ్రెస్ అధ్యక్షుడై ప్రభుత్వ ప్రాపకం సంపాదించిన శంకరన్ నాయరుగారు పాల్‌తో, "మీరు ఉపన్యాసాలు మానివేసి, వెంటనే మద్రాసునించి వెళ్లకపోతే, మిమ్మల్ని అరెస్టు చేయవలసి వస్తుం" దని చల్లగా సలహా యిచ్చాడు. వృద్ధిలోకి రాదలచుకున్న బారిష్టరువి, నీకీ గొడవ ఎందుకని నాకుకూడా చాలామంది స్నేహితులు సలహా యిచ్చారు.

ఈ సందర్భంలో అడ్వకేటుజనరల్ భాష్యం అయ్యంగారిని గురించి ఒక విషయం చెప్పడం చాలా అవసరం. పాల్ ఉపన్యాసాల మీద భాష్యం అయ్యంగారి అభిప్రాయంకోసం గవర్నమెంటు అవి అన్నీ సేకరించి ఆయన దగ్గిరికి పంపించింది. దానిమీద ఆయన సాహసించి పాల్ చెప్పిన మాటలు ఉద్రేకపూరితంగానే వున్నాయి కాని, రాజద్రోహం లేదని వ్రాశాడు. జీవితంలో ఆయన రాజకీయాల్లో పాల్గొనకపోయినా ఈ విషయంలో మాత్రం అతిధైర్య చూపించాడు. రాజకీయాలల్లో కిందుమీదయిన సర్ శంకరన్‌ నాయరుగారు కూడా సమయానికి ఇల్లాంటి అభిప్రాయమే వెలిబుచ్చాడు. బహుశ: భాష్యం అయ్యంగారి అభిప్రాయం మీదనే మద్రాసుప్రభుత్వం పాల్ ఉపన్యాసాలకి ఆయనమీద చర్య ఏమీ తీసుకోలేదు అనుకుంటాను. కాని పాల్ మాత్రం కొంచెం జాగా ఎరిగి బైఠాయించే మనిషి. నేను యిల్లాంటి సాహసమైన పనిచెయ్యడానికి వచ్చినవాడు ధైర్యంగానే వుంటాడనీ, ఎందుకైనా సిద్ధంగానే వుంటాడనీ అనుకున్నాను. కాని నాకు చాలా ఆశాభంగం కలిగించి, కొన్ని ఉపన్యాసాలు అయ్యాక శంకరన్ నాయరుగారి సలహా అంగీకరించి మెల్లిగా మద్రాసుకి స్వస్తిచెప్పాడు. ఆయన మీటింగులకి అధ్యక్షత వహించవలసి వచ్చినప్పుడు ఏమి వచ్చినా సిద్ధపడడానికి సంకల్పించుకునే నేను అంగీకరించాను. దానివల్ల గడబిడ మాత్రం ఏమీ జరగలేదు.