నా జీవిత యాత్ర-1/సూరత్ కాంగ్రెస్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

22

సూరత్ కాంగ్రెస్

తరవాత కొద్దిరోజులకి సూరత్ కాంగ్రెసు అయింది. కాంగ్రెస్ చరిత్రలో సూరత్ సమావేశం చాలా చరిత్రాత్మకం అయింది. అప్పట్లో 'మితవాదులు', 'అతివాదులు' అని రాజకీయవేత్తల్లో ఏర్పడ్డ చీలికలు సూరత్‌లో తీవ్రమయిన సంఘర్షణకి వచ్చి నిర్దిష్టంగా వేరయి పోయాయి. అప్పటికి దేశంలోని 'అతివాదులకి' లాలా లజపతిరాయి, తిలక్, పాల్ ప్రభృతులు నాయకులు. మితవాదులకి సర్ ఫిరోజిషా మెహతా, గోఖలే, సురేంద్రనాధ బెనర్జీ ప్రభృతులు నాయకులు. మన సుబ్బారావు పంతులుగారు తత్వంలో మితవాది అయినా కాస్త మధ్యస్థులు. ఆ కాలంలో కాంగ్రెస్‌కి ఫిరోజిషా మెహతా నియంత వంటివాడే. కాంగ్రెస్ సంఘాలు అనిగాని, ప్రతినిధుల్ని ఎన్నుకోవడంగాని ప్రతినిధులు ప్రెసిడెంటుని ఎన్నుకోవడంగాని ఏమీలేవు. మెహతా ఎవరిమీద కటాక్షవీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రెసు అధ్యక్షులు. తీవ్రవాదులైన తిలక్, లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురి అయినవాళ్ళలో ముఖ్యులు. వాళ్ళకి దేశంలో ఎంత పలుకుబడి వున్నా, ఎంత గౌరవంవున్నా కాంగ్రెసు అధ్యక్షులు కావడానికిగాని, తమ వాదన నెగ్గించుకోడానికిగాని ఎల్లాంటి అవకాశమూ వుండేదికాదు.

మితవాదులు 1907 వ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్‌కి కలకత్తాలో ప్రసిద్దన్యాయవాది అయిన రనవిహారిఘోషుని అధ్యక్షుణ్ణి చేశారు. ఈ ఎన్నిక ప్రతిఘటించాలని బాలగంగాధరతిలక్ ముందే నిశ్చయించు కున్నాడు. అ కాంగ్రెసుకి నాగపట్నంనించీ, మహారాష్ట్రంనించీ వచ్చిన ప్రతినిధులు సమస్తసన్నాహాలతోటి దిగారు. మద్రాసు నించి వి. కృష్ణస్వామయ్యరుగారు, జి. ఎ. నటేశనుగారు, యస్. దొరస్వామయ్యరు గారు, వి. చక్రయ్యచెట్టిగారు, సుబ్బారావు పంతులుగారు, యింకా కొందరమూ ఈ కాంగ్రెస్సుకి హాజరు అయ్యాము. అందులో కృష్ణస్వామయ్యరుగారు, సుబ్బారావు పంతులు, నటేశన్ ప్రభృతులు మితవాద పక్షీయులు. దొరస్వామయ్యరుగారు అప్పట్లో యస్. శ్రీనివాసయ్యంగారి దగ్గిర లా ఎప్రెంటిస్‌గా వుంటూవుండేవారు. ఆయనా, చక్రయ్యచెట్టిగారూ అతివాదులు. అతివాదుల ఆదర్శాలు అంటేనే నాకు యిష్టం.

సమావేశ ప్రారంభంలో మితవాదులు రాస్‌విహారీఘోష్‌ని అధ్యక్షుణ్ణిగా సూచించారు. వెంటనే లోకమాన్యుడు వేదికమీదినించి లేచి లాలా లజపతిరాయ్ పేరు సూచించాడు. అప్పటికి 22 సంవత్సరాలనించీ మానవమాత్రుడు ఎవ్వడూ అల్లాంటి సాహసం చేసి వుండలేదు. కాంగ్రెస్ నియంత అయిన మెహతా అభిప్రాయానికి వ్యతిరేకంగా అధ్యక్షుడి విషయంలో మరి ఒక సూచన రావడమే అలజడి కలిగించింది!

నేనూ, వి. కృష్ణస్వామయ్యరుగారూ వేదికకి ముందుగా కూర్చుని వున్నాము. అ పక్కనే తిలక్ ముఖ్య స్నేహితుల్లో ఒకడైన కపర్ది నిలబడ్డాడు. ఆయన పెద్ద తలపాగా నేటికీ నా కళ్ళకి కట్టినట్లే ఉంది. కపర్ది తరవాత స్టేటు కౌన్సిల్ మెంబర్‌కూడా అయ్యాడు. తిలక్ ఉపపాదనకి ఎవ్వరో అడ్డుచెప్పేసరికి సభలో పెద్ద అల్లకల్లోలం ప్రారంభం అయింది. నేనైతే చూడలేదుగాని కపర్దీయే తన కాలిజోడు విసిరాడనీ, అది సంకేతంగా గ్రహించి నాగపుర ప్రతినిధులు గలాటా ప్రారంభించారనీ చెప్పుగున్నారు. నాగపురంనించి వచ్చిన ప్రతినిధులు లాఠీకర్రలు పుచ్చుకుని 'తిలక్ మహారాజుకీ జై!' అనుకుంటూ వేదిక మీదికి వురికారు. తరువాత గలాటా పెరిగి, ఉభయపక్షాల వాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేతబట్టి విజృంభించారు! అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది. అల్లరి ప్రారంభం అయిన ఒక్క క్షణంలో, పక్కనే కూర్చుని వున్న కృష్ణస్వామయ్యరుగారు లేచి పారిపోయారు. నటేశనుగారు, "కృష్ణస్వామయ్యరు ఏమయ్యా?" డని కంగారు పడుతూ నా దగ్గిరికి వచ్చాడు. మనకి యీలాంటి అల్లరులు కొత్తగాదు! కనక నేను అక్కడే నిలబడ్డాను. వేదికమీద వుండే నాయకులంతా ఒక్కొక్కరే దొడ్డిదారిని నిష్క్రమించారు. చివరికి ఆ కల్లోలం బాగా పెరిగి ఎవళ్ళమట్టుకి వాళ్ళు ఖాళీచేసి వెళ్ళి పోయారు.

తరవాత ఒకళ్ళమీద ఒకళ్ళు నిందారోపణులు చేసుకున్నారు. వాస్తవానికి ఉభయులు కొంత అల్లరికి సిద్ధపడే వచ్చారని నా అభిప్రాయము. గడబిడ జరిగేముందు తిలక్ పక్షీయుడు ఒకడు మాకు దగ్గిరగా వున్న ఒక ఆహ్వాన సంఘోద్యోగిని పిలిచి అతనికి ఒక రౌడీని చూపించి ఈ కాంగ్రెస్‌లో ఈ రౌడీకి ఎల్లాగ ప్రవేశం కలిగిందో చెప్పమన్నాడు. ఆహ్వాన సంఘంలో వున్న ఆ పెద్దమనిషి సరియైన సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు. అందుచేతనే ఉభయులూ కూడా దీనికి సంసిద్ధులై వచ్చారని నే ననుకున్నాను.

పిరౌజిషా మెహతా రాజకీయంలో మితవాదే కాని గొప్ప దేశ భక్తుడు. ఇంగ్లీషువాళ్ళు అంటే ఆయనకి చాలా ఆగ్రహం. ఆయన వాళ్ళని చూస్తేనే కటకట పడేవాడు. ఈ అల్లరి అయిన కొంత సేపటికి ఆయన హాలు ఎదుట ఖాళీస్థలంలో కూర్చుని కొంచెం విచార గ్రస్తుడై మిత్రులతో భవిష్యత్తునిగురించి ఆలోచిస్తూ ఉండగా, శ్వేత ముఖుడైన ఒక పోలీసు ఉద్యోగి సిబ్బందితో తయారై, ఆయన దగ్గిరికి వచ్చి "ఇక్కడ ఏదో అల్లరి అయిందిట! దాన్ని గురించి ఏమైనా రిపోర్టు ఇస్తారా?" అని అడిగాడు. మెహతా ఆయనకేసి చురచుర చూసి, "ముందు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారో చెప్పు! ఇది అంతా గృహ కల్లోలమే! ఇక్కడ నీ ప్రసక్తి ఏమీ లేదు," అని చెప్పాడు. దాంతో ఆఫీసరు మెల్లి మెల్లిగా తగ్గి అక్కడినించి నిష్క్రమించాడు.

ఈ సందర్భంలో మన మద్రాసు నాయకుల సంగతి కొంచెం వ్రాస్తాను. సూరత్ సమావేశంలో అల్లరి జరగడానికి పూర్వం మన దొరస్వామయ్యరు గారూ, చక్రయ్యచెట్టిగారూ గోఖలేమీద ప్రశ్న పరంపరలు కురిపించి కొంత కలవరపరిచారు. అందుచేత వి. కృష్ణస్వామయ్యరు ప్రభృతులకి కష్టం కలిగింది. అందుచేతనే కృష్ణస్వామయ్యరుగారు యస్. శ్రీనివాసయ్యంగారి దగ్గిర అప్రెంటిస్‌గా ఉంటున్న దొరస్వామయ్యరుగారికి సర్టిఫికేటు యివ్వకుండా చేస్తానని బెదిరించడం జరిగింది. ఆ పని జరగలేదు కాని నాయకుల మనోవైఖరి ఎల్లా ఉండేదో చెప్పడానికి మాత్రమే ఈ సంగతి వ్రాస్తున్నాను. దొరస్వామయ్యరుగారు మంచి ధైర్యశాలి. తను నమ్మిన సిద్ధాంతాలు అంటే మంచి పట్టుదల ఉన్నవాడు. గొప్ప ప్రతిభాశాలి. ఆయన ఈ బెదిరింపులు లక్ష్య పెట్టలేదు. కాని ఆ కాలంలో మితవాదులు వాక్స్వాతంత్ర్యం అల్లాగే ఉండేది. రాజకీయకారణాలవల్ల జైలుకి వెళ్ళ వలసివస్తే సర్వెంట్సు ఆఫ్ ఇండియా సొసైటీలో సభ్యుడుగా ఉండడానికి కూడా వీలు లేదంటే, ఇక చెప్పేది ఏమిటి?

సూరత్తులో కాంగ్రెస్ రెండు చీలికలు అయింది. కాంగ్రెసుని చేతుల్లో పెట్టుకున్న మితవాదులు కొన్ని నియమాలు నిర్మించి, అతివాదుల బలం పెరగకుండా కట్టుదిట్టాలు చేశారు. మరుసటి సంవత్సరం కాంగ్రెసు మద్రాసులో జరిగింది. మళ్ళీ రస్‌విహారీఘోషే అధ్యక్షుడు. అది కేవలం మితవాద మహాసభ. వారు ప్రభుత్వంమాట అల్లా ఉండనిచ్చి, జాతీయవాదులపైన తమ తీవ్ర వాగ్ధాటి అంతా వినియోగించారు. 1908 వ సంవత్సరం మొదలు మరి ఏడు, ఎనిమిది సంవత్సరాలు - అంటే లక్నో కాంగ్రెస్‌వరకూ - కాంగ్రెస్సు కేవలం మితవాదులకి రంగస్థలమై ప్రభుత్వాన్ని యాథాలాపంగా విమర్శిస్తూ తీర్మానాలు పాసుచెయ్యడమే కాని, కోట్లకొలదిగా ఉన్న జనసామాన్యాన్ని రాజకీయంగాను, ఆర్ధికంగాను అభివృద్ధిలోకి తీసుకుని రావడానికి ఎటువంటి కార్యక్రమమూ ఇవ్వలేకపోయింది. ఇంక స్వరాజ్యకాంక్షమాట వేరే చెప్పవలసింది ఏమిఉంది? మితవాదుల దృష్టి ఎంత సేపూ ఉన్నతోద్యోగాలు, మింటో - మార్లీ సంస్కరణాల వల్ల శాసనసభ్యుల సంఖ్య కొద్దిగా వృద్ధిపొందడము, కొన్ని ప్రభుత్వ కార్యనిర్వాహక సభ్యత్వాలు దేశీయుల అందుబాటులో ఉండడము మొదలయిన సంస్కరణాలమీదే ప్రసరించింది. అందుచేత కాంగ్రెస్ ఆదర్శం వృద్ధి పొందలేదు. హిందువులైన కాంగ్రెస్ నాయకులు ఈ సంస్థద్వారా ఉద్యోగాలు సంపాదించడం చూచేసరికి ముసల్మానులకి కూడా సహజంగా వాటి విషయమై అభిలాష బయలుదేరడమూ తద్వారా హిందూ మహమ్మదీయ సమస్యకి పునాదులు పడడమూ జరిగాయి. లక్నో కాంగ్రెస్‌నాటికి మహమ్మదీయుల అంతరంగికాందోళన ఫలించి లక్నో ఒడంబడిక ప్రాప్తించింది. ఆ ఒడంబడికే నేటికి మనకి అన్ని విధాలా అనర్థదాయకం గానూ, జాతీయాభివృద్ధికి నిరోధకంగానూ, అభేద్యంగానూ ఉన్న హిందూ ముసల్మాను సమస్యకి మూలం అని నా అభిప్రాయము. అందుచేత, అప్పటినించీ కాంగ్రెస్‌కి ఎప్పుడైనా కులాసాగా వెడుతూ ఉండేవాణ్ణి. అంతకంటె ఎక్కువగా కాంగ్రెస్ ఎప్పుడూ నన్ను ఆకర్షించలేకపోయింది. ఆ తరవాత సర్ విలియం వెడ్డర్‌బర్ను అధ్యక్షత కింద అలహాబాదులో జరిగిన కాంగ్రెస్‌కి హాజరు అయ్యాను. మద్రాసులో జరుగుతూ వచ్చిన కాంగ్రెస్సులకి హాజరైన విషయ వ్రాయనే అక్కరలేదు.