నా జీవిత యాత్ర-1/రాజకీయాలతో పరిచయం

వికీసోర్స్ నుండి

10

రాజకీయాలతో పరిచయం

ఆయనే అప్పుడు లండన్‌లో ఉంటూ ఉండిన 'లండన్ ఇండియన్ సొసైటీ'లో నన్ను మెంబరుగా చేర్చారు. రాజకీయమే ప్రధానమైన నా జీవితంలో రాజకీయ స్వాతంత్ర్యం విషయమై ఆకాంక్ష అప్పుడే ఉదయించిన రోజులనవి. ఇంగ్లీషువారు ఈ పవిత్ర భూమిని అక్రమంగా ఆక్రమించుకొన్నారనీ, మళ్ళీ మన జన్మభూమి స్వాతంత్ర్యంకోసం వంగ రాష్ట్రంలోని విప్లవకారులు సాహసచర్యలు చేస్తున్నారని నాకు తెలుసును. వాళ్ళ కథలన్నీ నా మనస్సులో ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో లోకమాన్య బాలగంగాధరతిలక్ మహాశయుడి స్వాతంత్ర్య సంపాదనా కృషి, రాంచ్‌హత్య, తిలక్ మహారాజుమీద కేసు, మొదలయిన విషయాలు నా మనస్సులో బాగా నాటుకుని ఉన్నాయి. తిలక్, గోఖలేల అభిప్రాయభేదాలు, వాళ్ళకీ, ఫిరోజిషా మెహతా ప్రభృతుల మధ్య వుండే పోటాపోటీలు కూడా నేను తెలుసుకున్నాను. పంజాబ్‌లో లాలాలజపతిరాయ్ కృషి, ఆయన అనుభవించే కష్టాలు నన్నాకర్షించాయి. కాంగ్రెసు పుట్టి అప్పటికి 17, 18 సంవత్సరాలు అయింది. దేశాభ్యుదయంకోసం ఆ సంస్థపడుతూ ఉన్న శ్రమ నే నెరుగుదును. అయితే బెంగాలులో విప్లవకారులు, పశ్చిమదేశంలో తిలక్ మహాశయుడూ, ఉత్తరదేశంలో లజపతిరాయీ, నన్ను బాగా ఆకరించారు. కాని, "ఇప్పటిలాగ ఈ దేశం ఒకసంస్థ యాజమాన్యం కిందకి వచ్చి ఒక నాయకుడి కింద ఇంతటి ఏకీభావంతో ఉండడం నా జీవితంలో చూడగలుగుతానా!" అనే సంశయం మాత్రం నన్ను బాధిస్తూ ఉండేది. ఇల్లాంటి అభిప్రాయాలు మొలకెత్తి ఆ విషయమైన ఆలోచనలో వుండే సమయంలో ఇంగ్లండులో లండన్ ఇండియన్ అసోసియేషన్ చేరడం తటస్థించింది. అప్పటికి ఆ సభలోని ప్రముఖులలో దాదాభాయి నొరోజీ ముఖ్యుడు. ఆయన అప్పటికే ఇండియన్ పోవర్టీ (Indian poverty) అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథం అంతా, సమగ్రంగా చదివేసరికే నాకు దేశంలోని దరిద్ర నారాయణుల స్వరూపం గోచరించింది.

దాదాభాయి నొరోజీ కాంగ్రెసు స్థాపకులలో ఒకడై దేశాన్ని ఏకటాకీగా నడిపించడానికి కృషిచేసి, ఇంగ్లండులో కూడా పనిచేసి, ఇంగ్లీషు ప్రజలకి దాని నిజస్థితి తెలియ జెయ్యడానికి ఆదేశం చేరాడు. అక్కడ ఎంతో కష్టపడి పలుకుబడి సంపాదించి పార్లమెంటు మెంబరు కూడా కాగలిగాడు. బెంగాలులో సివిలియన్‌గా వుండి, పించన్ పుచ్చుకుని, కాంగ్రెసు స్థాపకుల్లో ఒకడైన సర్ హెన్రీ కాటనూ, బొంబాయి సివిలియన్ అయి, కాంగ్రెసు స్థాపకులలో ఒకడయిన సర్ విలియమ్ పెడర్‌బర్‌న్నూకూడా ఈ సంఘానికి ప్రధానులు. బెంగాలులో ఐ. పి. ఎస్. వుద్యోగంచేసి రిటైర్ అయి అనేక గ్రంథాలు వ్రాసిన రమేశచంద్రదత్తు, కాంగ్రెసు ప్రథమాధ్యక్షుడైన డబ్ల్యు. సి. బోనర్జీ కూడా ఆ సంఘంలోనే ఉండేవారు. అప్పుడే నేను దత్తు వ్రాసిన 'ఇకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' అనే పుస్తకం చదివాను.

దాంతో నాకు ఆంగ్ల పరిపాలన యెడల విముఖత్వమూ, భారత స్వాతంత్ర్య సంపాదన యెడల ఆకాంక్షా హెచ్చు కావడంలో ఆశ్చర్యం ఏమీలేదు. ఈ లండన్ ఇండియన్ అసోసియేషన్‌లో చక్కని లైబ్రరీ ఉండేది. ఇందులో ప్రాన్సు, ఇంగ్లండు, అమెరికా మొదలైన వివిధ దేశాల్లో ప్రజాస్వామికం కోసమూ, ప్రజల స్వాతంత్ర్యం కోసమూ జరిగిన పోరాటాల గాథల్ని గురించిన గ్రంథా లెన్నో వున్నాయి. ఆ గ్రంథాలు చదవడానికి నాకు గొప్ప అవకాశం లభించింది. ఈ సంఘ ప్రధానోద్దేశం కూడా అదే. విద్యాభిలాషులై ఆదేశం వచ్చిన భారతీయులకి తమ దేశం వచ్చిన పిమ్మట దేశసేవలో నిమగ్నులు కావడానికి తగిన విద్యావినేకాల్ని కలిగించడమే ఆ సంఘాదర్శం. అంతే కాకుండా హిందూదేశపు ఐశ్వర్వంమీద జీవయాత్రచేస్తూ ఆ దేశం ఎక్కడ వుందో, ఎంత దేశమో తెలియకుండా కాలక్షేపంచేసే ఆంగ్ల ప్రజలకి కాస్త వివేకం కలిగించడం మరి ఒక ఆదర్శం.

ఆ సంఘం తరపున తరచు సభలు జరుపుతూ ఉండేవాళ్ళు. నేను ఆ సంఘంలో చేరిన కాలానికి అప్పుడే మనదేశంలో అతివాద మితవాద విభేదాలు పెచ్చు పెరుగుతున్నాయి. నే నక్కడ ఉండగానే డబ్ల్యు. సి. బోనర్జీగారు మరణించారు. ఆయన అంత్యక్రియల సందర్భంలో రమేశచంద్రదత్తు ఉపన్యాసం చేస్తూ మన దేశంలో అతివాదం పెరిగిపోతూ ఉందనీ, వంగదేశంలో అరాజకం హెచ్చిపోతూ ఉందనీ విచారిస్తూ మాట్లాడారు. అసలు విషయం మాట అటుంచి ఆ సందర్భంలో ఆ విషయాలు మాట్లాడినందుకు అస్మదాదులకి కొందరికి కష్టం తోచి కొంచెం కటకట పడ్డాము.

నేను లండన్‌లో ఉండగానే దాదాభాయి నొరోజీ పార్లమెంటు ఎన్నిక కూడా వచ్చింది. ఆయన తరపున మేమంతా ప్రచారకులుగా పనిచేశాము. ఆ ఎన్నిక విధానం అంతా ఆంగ్లేయులే ఏర్పాటు చేసినా, అందులో భారతీయులం అందరమూ కూడా పాల్గొన్నాము. అప్పుడు నే నొక ఏజంటుగా పనిచేశాను. ప్రతి పక్షియులు, కొన్ని చోట్ల నొరోజీ నల్లవాడనీ, తెల్లవాళ్ళు తెల్లవాళ్ళకే వోట్లు ఇవ్వాలనీ ప్రచారంచేశారు.

అప్పుడు మాకు ఏమీ తోచక మా నాయకుడైన ఇంగ్లీషు ఆయన్ని సలహా అడిగాము. ఆయన, "ఇంత మాత్రానికే నా దగ్గిరికి రావాలా? దాదాభాయి నల్లవాడైతే ఆయనమీద పోటీ చేసేవాడు తెల్లదనంలో రంగు తగ్గిన జ్యూ. అందుచేత సమర్థతనిబట్టి వోటు ఇవ్వండి!" అని చెప్పమన్నాడు. పైగా, దాదాభాయి రంగులో తెల్లవాళ్ళకన్న తెల్లగా వుంటాడని చెప్పమన్నాడు. దాదాభాయి మంచి తేజశ్శాలి, యోగీ శ్వరుడులా వుండే ఆయన ముఖవర్చస్సు ఈ నాటికి కూడా నా కన్నులకి కట్టినట్లుంది.

ఆ రోజులలో లండన్ ఇండియన్ సొసైటీ తరపున 'ఇండియా' అనే వారపత్రిక కూడా ప్రచురించబడుతూ ఉండేది. మేము ప్రముఖులైన భారతీయుల్ని రప్పించి, వారిచేత ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తూ వుండేవాళ్ళము. ఒకసారి, "సురేంద్ర నాథ బెనర్జీని పిలవాలా! గోఖలేని పిలవాలా?" అనే మీ మాంస వచ్చింది. బెంగాల్ సివిలియన్ అయిన కాటన్‌కి సురేంద్రనాథ బెనర్జీ అంటే అభిమానం. బొంబాయి సివిలియన్ అయిన వెడ్డర్‌బర్న్‌కి గోఖలే అంటే ఇష్టం. చాలా దీర్ఘమయిన చర్చ అయిన తరవాత గోఖలేని ఆహ్వానించారు. అయితే గోఖలేని ముందు తను చెప్పబోయే ఉపన్యాసం వ్రాసి పంపమన్నారు. ఆయన అల్లాగే తన ఉపన్యాసం వ్రాసి పంపించాడు. అంతలో ఉండేది ఆ సంఘం స్వేచ్చ.

అ సమయంలో మా సంఘం తరపున లాలా లజపతిరాయ్‌గారు కూడా వచ్చారు. ఆయన్ని నేను శ్యాంజీ కృష్ణవర్మ ఇంట్లో కలుసుకున్నాను. మొట్ట మొదటి సందర్శనంతోనే నాకు ఆయన దేశభక్తి తీవ్రతా, ఆవేశమూ ప్రస్ఫుటం అయ్యాయి. ఆయన, "ఎన్నాళ్ళు మన దేశం ఇల్లాగ ఈ దాస్య బంధంలో పడి ఉండాలి?" అని ఎంతో ఆత్రంగా నిట్టూర్పు విడిచేవాడు. ఆయన మహారాష్ట్ర దేశీయుడు. సంపూర్ణ స్వాతంత్ర్య విప్లవవాది. బ్రిటిష్ పాలన అంటే పరమ ద్వేషి. హిందూ దేశంలో సాయుధ విప్లవం తీసుకురావాలనే విశ్వాసం కలవాడు. చాలా ధనవంతుడు. 'ఇండియన్ సోషియాలజిష్టు' అనే పత్రిక మంచి తీవ్రంగా నడుపుతూ ఉండేవాడు. హెర్బర్టు స్పెన్సరు అంటే ఆయనకి అభిమానం. స్పెన్సరు పేరిట లండన్‌లో భారతీయ విద్యార్థులికి విద్యార్థి వేతనాలు ఇచ్చేవాడు.

ఆయన దగ్గిర స్కాలర్‌షిప్ పుచ్చుకున్నవాడు ఆయన రాజకీయాల్లో పనిచెయ్యాలని బాండు వ్రాసి యివ్వాలి. నాకు కూడా ఆయన స్కాలర్‌షిప్ ఇస్తానన్నాడు. నేను నా మిత్రుడు ఒకడు వ్రాసినబాండు చూసి అందులో నవ నాడులూ బంధించే షరతులు నా కిష్టం లేక, అది నాకు అక్కరలేదని చెప్పాను. కృష్ణవర్మ దేశభక్తి అపారము. తరవాత ఇండియా స్కాలర్‌షిప్ అనే పేరుతో సావర్కారు, వి. పి. యన్. అయ్యరు, మదన్‌లాల్ ఢింగ్రా ప్రభృతులకి ఆశ్రయమిచ్చినదీయనే. ఆయన ఇంగ్లండులో ఉండడానికి వీలు లేకపోవడంవల్ల ఫ్రాంసులో వుంటూ ఇటీవలనే చనిపోయాడు.