నా జీవిత యాత్ర-1/బారిష్టరు చదువు పూర్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

11

బారిష్టరు చదువు పూర్తి

ఈ రీతిగా భారత స్వాతంత్ర్యం కోసం పాటుబడే మనుష్యులతోటీ, సంస్థలతోటీ నాకు సాహచర్యం కుదిరింది. కాని, ఈ పనులేవీ నా బారిష్టరు చదువుకి ప్రతిబంధకం అవదు. రోమన్ లా, కాన్‌స్టిట్యూషన్ లా, లా హిష్టరీ వగైరా విషయాల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతూ ఉండేవి. నేను వాటి అన్నింటిలోనూ బాగానే ఉత్తీర్ణుణ్ణి అవుతూ వచ్చాను. అ కాలంలోనే సర్ శంకరన్ నాయరుగారు బారిష్టరు చదువుకోసం వచ్చి, మా గ్రే ఇన్‌లోనే చేరారు.

శంకరన్ నాయరుగారు అప్పటికప్పుడే రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెసు అధ్యక్షులు అయ్యారు. అక్కడనించి మద్రాసు గవర్నమెంటు ప్లీడరు, పబ్లిక్ ప్రోసిక్యూటరు కూడా అయ్యారు. కాని, హైకోర్టు జడ్జీ కావాలని ఆయన ఆశ. కేవలం వకీలుగా ఉంటే మైలాపూరు మేధావులతో పోటీవల్ల ఆ పదవి రాదని ఆయన భయం. హైకోర్టులో విధిగా కొంతమంది బారిష్టరు జడ్జీలు వుండాలి కనక, అల్లాగయినా హైకోర్టు జడ్జీ కావాలనే ఉద్దేశంతో వేసవి సెలవలలో వచ్చి డిన్నర్లకి హాజరు అవుతూ వుండేవారు. చివరికి, ఆయన బారిష్టరు కోర్సు పూర్తి కాకుండానే జడ్జీ అయ్యారు. ఒకసారి ఆయనా, నేనూ లండనులో భోజనం చేస్తూండగా ఆయన షాంపేన్ ఆర్డరిచ్చాడు. నేను కేవలం కాయగూరలు తినడం, సారా తాగకపోవడం చూసి, ఆశ్చర్యపోయి, "ఇల్లాగైతే డిన్నర్ల దగ్గర మీరు పనికిరా రన్నమాటే!" అన్నారు. నా యీ కాయగూరల తిండి చాలామందికి ఆశ్చర్యంగా ఉండేది. ఇంగ్లీషు సహపాఠులు కొందరు నన్ను గడ్డితిని బ్రతికేవాడని హేళన చేస్తూఉండేవారు. అప్పటి కింకా ఈ విటమిన్ సిద్ధాంతం అమలులోకి రాలేదు. నేను విందుల్లో ఇంగ్లీషువాళ్ళ పంక్తికి బొత్తిగా పనికిరాకుండా ఉన్నానని, అన్నిటికన్నా తక్కువ ప్రమాదకరమైన సిగరెట్టు అలవాటు చేసుకున్న్నాను. దీనికి కూడా ఒక గాథ జరిగింది.

బారు విందులు జరిగినప్పుడు అందరిలోనూ చిన్నవాడైన విద్యార్థి భోజనానంతరం ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి, పొగ తాగడానికి మాష్టరు అనుజ్ఞ పొందాలి. ఇది అనుశ్రుతంగా వచ్చే ఒకతంతు. అంతవరకూ దాన్ని ఎవ్వరూ ధిక్కరించలేదు. నేనుమొదట్లో అక్కడికి వెళ్ళిన రోజుల్లో నా వంతు వచ్చింది. మా ఇన్‌కి అధ్యక్షుడు - మాష్టరు సర్ ఆర్థర్ కాలిన్సు. ఈయన మద్రాసు హైకోర్టు మొదటి ఛీఫ్ జడ్జిగా ఉండి చాలా స్వాతంత్ర్యం చూపించిన ప్రముఖుడు. ఆయన మద్రాసు హైకోర్టు నూతన భవనాలు తెరుస్తూ చాలాగంభీరంగా ఉపన్యసించి, "మతాలు, కులాలూ, ధనికులూ, పేదలూ అనే తారతమ్యం లేకుండా నేనూ, నా సోదర న్యాయాధిపతులూ న్యాయం చేస్తాము," అని చెప్పిన ధీరుడు. ఆయన ఈ ఇన్‌కి మాష్టరుగా ఉండడం చేతనే చాలామంది మద్రాసీయులు ఈ ఇన్‌లో చేరుతూ ఉండేవారు. నావంతు వచ్చేసరికి నేను నిలబడి, "సిగరెట్టు తాగి ఇల్లాంటి ఉపన్యాసం ఇవ్వను," అని చెప్పాను.

విందులో పాల్గొన్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. "ఇన్నాళ్ళ నించీ వున్న ఆచారం ధిక్కరించడమా?" అని హాహాకారాలు బయలుదేరాయి. నా బల్ల దగ్గిర ఉన్నవాళ్ళు కొందరు నన్ను తిట్టారు. కాని, నేను చలించలేదు. మాష్టరు దగ్గిరికి నా మీద రిపోర్టు వెళ్ళింది. ఆయన నన్ను తన బల్లదగ్గిరికి పిలిచారు. ఆ బల్లమీద ఇంకా ఎందరో మాజీ జడ్జీలు మొదలయినవారు ఉన్నారు. నేను "నా కీ ఆచారం ఇష్టంలేదు. ఇష్టం కానిపని చెయ్యకుండా ఉండడానికి నాకు స్వాతంత్ర్యం లేదా?" అని అడిగాను. ఆయన ఒక్క క్షణం నా ముఖంకేసి నవ్వుతూ చూసి "సరే! నీ బల్లదగ్గిరికి వెళ్ళ" మన్నాడు. ఈ రీతిగా నేను ఇంగ్లీషు ఇన్‌లోని పొగతాగే ఆచారం ధిక్కరించాను. అయితే, అ తరవాత నేనుకూడా సిగరెట్టు అలవాటు చేసుకున్నాను.

నేను మొదటిసారి అక్కడ ఉన్న ఎనిమిది మాసాలలోనూ ఇంగ్లండులోని ముఖ్య పట్టణా లన్నీ చూశాను. అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా చూశాను. బారిష్టరు పట్టాతోబాటు ఆర్టుడిగ్రీ కూడా పొందాలని నా సంకల్పం. అందుకుకూడా చదువు ప్రారంభించాను. కాని ఇన్ని చదువులవల్ల అసలు గ్రంథానికి అభ్యంతరం కలుగుతుందని విరమించాను. షేక్సుఫియరు మహాకవి ఇల్లు, ఆయన భార్య నివాసము మొదలైన చారిత్రక స్థలాలు ఎన్నో దర్శించాను. వాళ్ళ దేశంలోని ప్రసిద్ధ రచయితలకి వాళ్ళు చూపే ఆదరణమూ, గౌరవమూ చాలా ప్రశంసనీయాలు. ప్రభుత్వమే వాళ్ళు ఉండే ఇళ్ళు వగైరాలు కొని, వాటిని, జాతీయ ప్రతిష్ఠాపనలుగా రక్షించి ఉంచుతారు.

మనదేశంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో భారతం వ్రాసిన నన్నయాదులకీ, భాగవతం వ్రాసిన పోతన్నకీ వాళ్ళ గ్రంథాలు తప్ప వారి సంతతి వారికి ఉత్సాహం కలిగించి గర్వం కలిగించే చిహ్నా లేమీ లేనేలేవుకదా! అప్పుడే ఎప్పటికైనా రాజమహేంద్రవరంలో తిక్కనకీ, నన్నయకీ, ఎఱ్ఱన్నకీ ఒక స్మారకచిహ్నం కట్టాలని నాకు సంకల్పం కలిగింది. కాని, తరవాత జీవితపు ఆందోళనలో నే నా పని చెయ్యలేక పోయాను.

నేను లండన్‌లో ఉన్న మొదటి మూడు నెలలూ కూడా రాజమహేంద్రవరం మునిసిపల్ ఛైర్మన్‌గానే ఉన్నాను. కాని, అ తరవాత నా ఛైర్మన్ పదవికి లండన్‌నించే రాజీనామా ఇస్తూ మద్రాసు గవర్న మెంటు మెంబరు ఫోర్బ్సుకి "రాజమహేంద్రవరం మునిసిపల్ సొమ్ము జాగ్రత్తగా నీకు అప్పచెబుతున్నాను సుమా!" అని ఉత్తరం వ్రాశాను. ఆయన దానిలో ఉన్న ఎత్తిపొడుపు గ్రహించి, నన్ను అభినందిస్తూ తిరిగి ఉత్తరం వ్రాశాడు. తన సోదరి ఒక ఆమె ఎడింబరోలో లాండ్ లేడీ - అంటే హోటలు యజమానురాలుగా - ఉన్నదనీ, ఆమెను కలుసుకోమనీ నాకు వ్రాసి, ఆ విషయంలో ఆమెకి కూడా ఒక ఉత్తరం వ్రాశాడు. నన్ను ఛైర్మన్ పదవినించి లాగివేయదలుచుకున్న ఫోర్బ్సుకీ నాకూ ఉన్న సంబంధం అల్లాగ పరిణమించింది.

మొదటి టెరము ఎనిమిది మాసాలూ ముగించుకుని, జూన్ 30 వ తేదీని బయలుదేరి, జూలై 15 వ తేదీని బొంబాయిమీదుగా రాజమహేంద్రవరం చేరాను. నేను తిరిగి రాజమహేంద్రవరం చేరేటప్పటికి నా మిత్రులకీ, శత్రువులకీ కూడా ఒకటే ఆశ్చర్యం. ఇంట్లో వాళ్ళ సంగతీ, బంధువుల సంగతీ వేరే చెప్పనే అక్కరలేదు. కాశీకి వెడితేనే కాటికి వెళ్ళినట్లు లెక్క చూసుకునే రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి రావడం అంటే అందరికీ ఆశ్చర్యంగా వుండేది. నా మిత్రులూ, శత్రువులూ చాలామంది నేను లండన్‌లో పాడై పోతాననీ, మళ్ళీ రావడం సంశయమనీ అనుమానిస్తూ ఉండేవారు. ఒక్క రామచంద్రరావు మాత్రం నేను సంపూర్ణంగా పని నెరవేర్చుకుని వస్తాననే ధైర్యంతో ఉండేవాడు. ముఖ్యంగా ఈ దేశంలో లండన్‌లో స్త్రీల స్వేచ్చని గురించీ, తాగుబోతుతనాన్ని గురించీ వ్యాపించిఉన్న కల్లిబొల్లి కథల వల్లనూ, నా చిన్ననాటి చర్యలవల్లనూ, ఇక్కడ ఆ విషయాల్లో నాకు కొంత బలహీనత ఉండిన కారణంవల్లనూ అందరూ నేను పూర్తిగా పాడై పోతా నని అనుకున్నారు. కాని, నిజానికి ఆదేశం జీవితమే నన్ను మానసికంగా కొంత ఆ బలహీనతనించి తప్పించి, మంచిమార్గానికి మళ్ళించింది. పై కారణం చేతనే నేను తిరిగి వచ్చా ననేసరికి రాజమహేంద్రవరం అంతా ఒక వింతగా పరిగణించారు.