Jump to content

నా జీవిత యాత్ర-1/బారిష్టరు వృత్తి

వికీసోర్స్ నుండి

16

బారిష్టరు వృత్తి

నేను మద్రాసులో బారిష్టరు వృత్తి ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రాక్టీసు బాగా అందుకుంది. 10 సంవత్సరాలు కింద కోర్టుల్లో ప్రాక్టీసు చేసి ఉండడంవల్లనూ, దేశంలో చాలామంది పరిచితులూ, అభిమానులూ ఉండడంచేతనూ ప్రాక్టీసు దినదినాభివృద్ధి పొందింది. 1907 వ సంవత్సరంలో నేను మద్రాసులో ప్రవేశించి 14 సంవత్సరాలూ - అంటే 1921 వ సంవత్సరంలో ప్రాక్టీసు మానివేసేవరకూ - ఏకటాకీగా ప్రాక్టీసు చేశాను. ప్రపంచక దృష్టితో చూస్తే నా జీవితంలో ఈ 14 సంవత్సరాలూ అన్నివిధాలా భోగభాగ్యాలతో కూడిన కాలము. ఈ కాలంలో సంగతులు వ్రాయడానికి దీన్ని రెండు భాగాలుగా విభజిస్తాను. మొదటి 7 సంవత్సరాలలోనూ కొత్తచోట ప్రవేశించడమూ, పదిమంది స్నేహితులూ వద్దు అన్నా, మద్రాసులో హేమా హేమీల మధ్య చేరి పడిపోకుండా క్రమంగా నిర్జించుకు రావడమూ తలచుకుంటే, నాకు బ్రహ్మాండమైన విషయాల్లాగ కనబడతాయి. తరవాత 7 సంవత్సరాల్లోనూ నాకే ఆశ్చర్యం కలిగేటట్లు డబ్బు సంపాదించడమూ, లౌకికంగా పేరు ప్రఖ్యాతులు పొందడమూ జరిగింది. ముందు మొదటి 7 సంవత్సరాలిని గురించి వ్రాస్తాను.

నేను మద్రాసు చేరి ప్రాక్టీసు ప్రారంభించేసరికి ఇంగ్లండు ప్రయాణం బాపతు 8 వేలూ, పుస్తకాలు వగైరాలు కొన్నబాపతు పన్నెండువేలూ కలిసి మొత్తం ఇరవై వేల అప్పు ఉంది. నేను ఆ అప్పుతో ప్రాక్టీసు ప్రారంభించాను. కాని, దైవికంగా కొద్దిరోజులకే ఆ అప్పు తీర్చి వెయ్యగలిగాను. నేటి యువకులకి జీవితంలో ఉత్సాహం కలిగించడం కోసం, ఆ సంపాదనకి కావలసిన పేరు సంపాదించుకోవడం కోసం నేను పడ్డశ్రమని గురించి కొంచెం వ్రాస్తాను.

నేను ప్రవేశించేటప్పటికే భారతీయులలో మాధవన్‌నాయర్ - (తరవాత జస్టిస్) - డాక్టర్ స్వామినాధన్, కె. పి. యన్. మీనన్‌గార్లు (క్రౌన్ ప్రోసిక్యూటరు) ప్రాక్టీసులో వుండేవారు. పి. సి. లోబో - (రిటైర్డు జిల్లాజడ్జీ) - సర్ జాన్ వాలస్ అడ్వకేట్ జనరలుగా ఉండేటప్పుడు ఆయన దగ్గిర అప్రెంటిస్‌గా ఉండేవాడు. ఆయన మధురకి పబ్లిక్ ప్రోసిక్యూటరుగా వెళ్ళిపోయాడు. బారిష్టర్లకి అప్పట్లో ఎక్కువ ప్రతిష్ఠలేని సంగతీ, వాలస్ నాకు ఇచ్చిన సలహా సంగతీ ఇదివరకే వ్రాశాను గదా! అల్లాంటి స్థితిగతులలో ప్రాక్టీసు ప్రారంభించి నిగ్రహించుకుంటూ వచ్చాను.

నేను మద్రాసు వచ్చిన సంవత్సరంలోనే కాకినాడలో వకీలుగా ఉండిన పేరి నారాయణమూర్తిగారు మద్రాసు చేరారు. ఆయన మంచి ప్రతిభాశాలి. ఆయన చేరిన కొద్దికాలానికే మేము తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఫైలు ముప్పాతిక మూడుపాళ్ళవరకూ ఆకర్షించగలిగాము. కాతాలిస్టు తీసుకుంటే తెలుగువాళ్ళలో మా పేర్లు తరుచుగా కనిపిస్తూఉండేవి. నేను బారిష్టరుగా వచ్చిన కొద్దిరోజులకే ఒక సివిల్ అప్పీలులో లాకాలేజిలో ప్రొపెసరుగా ఉండిన టి. వి. శేషగిరి అయ్యరుగారితో కలిసి పనిచేయ వలసి వచ్చింది. ఆయన వయస్సులోనూ, ప్రాక్టీసులోనూ నాకు సీనియరు. అయినా బారిష్టర్ని అవడంవల్ల నాకు సీనియారిటీ వచ్చింది. ఆలాంటి స్థితిలో ఆయన నాతో పనిచేయడానికి ఇష్టంలేక కేసులోనించి తప్పుకున్నారు. నేనే కేసు ఆర్గ్యుమెంటు చెప్పి మొట్టమొదటగా బారిష్టర్లమీద ఉంటూండే దురభిప్రాయం పోగొట్టగలిగాను.

ఆ తరవాత నాకు చిరకాలమిత్రు లయిన ఆర్. కుప్పుస్వామయ్యరుగారికి ఒక కేసులో నాతో పనిచేయవలసిన అవసరం కలిగింది. ఆయన సర్ వేపా రామేశం గారిలాగే బి. యల్. లో ఫస్టు క్లాసులో, ఫస్టుగా పాసయ్యారు. పాపం ఆయన శేషగిరి అయ్యరుగారిలాగ తప్పుకోలేదు. తప్పుకోమని శేషగిరి అయ్యరుగారు ఇచ్చిన సలహా కూడా గణించలేదు.

ప్రాక్టీసుకి వచ్చిన ప్రారంభంలో ఇంకొకసారి సర్ సుబ్రహ్మణ్యయ్యరుగారి కోర్టులో ఆర్గ్యుమెంటు చెపుతూ ఉన్నాను. ఆ సమయంలో ఆయన కోర్టులో కూర్చుని ఉన్న ఆర్. వెంకట్రామశాస్త్రిగారిని పిలిచి దానికి సంబంధించిన కేసు ఏదో ఉండాలి తియ్యమన్నారు. వకీలు పనిచేసే వాళ్ళకి అది అంత గౌరవకరం అయిన విషయం కాదు. దాని మీద నేను వెంటనే లేచి, "అయ్యా! నేను, నా మిత్రులూ ఇందుకు సంబంధించిన కేసులన్నీ వెతికాము. ఎక్కడా ఈ తీర్పుకి వ్యతిరేకంగా కనిపించ లేదు," అని గట్టిగా చెప్పాను. దాంతో ఆయన శాంతించారు. మొత్తంమీద మొదట్లో మద్రాసు బారు నా కంతగా స్వాగతం ఇవ్వలేదు; సరిగదా, నాకు కాలూనడానికే కొంత కష్టం కలిగించిందని చెప్పాలి. పెద్దల్లో భాష్యం అయ్యంగారు, కృష్ణస్వామయ్యరు, సుందరయ్యరు ప్రభృతులూ, పిన్నల్లో అప్పటికే మంచి చురుకుగా వస్తూన్న శ్రీనివాసయ్యంగారు, అల్లాడి, యన్. వరదాచారి, టి. ఆర్. వెంకట్రామశాస్త్రి, వి. వి. శ్రీనివాసయ్యంగార్లూ మంచి గడ్డుగా ఉండేవారు. కాని, మొదటినించీ నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే సహాయం అయింది.

ఏ వృత్తిలోనైనా ఆత్మవిశ్వాసం అవసరం. అందులో లాయరు వృత్తికి అది మరీ అవసరం. జడ్జీలని ఆశ్రయించి, వారి దయవల్ల వృద్ధిలోకి రావడం అనేది ఎక్కడోగాని ఉండదు. అక్కడక్కడ ఉన్నా అది సిద్ధాంతం కాదు. ఆత్మవిశ్వాసమూ, దానికితోడు పరిశ్రమా ఉండాలి. నేను కేసులు వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా చదివేవాణ్ణి, దాంతోబాటు లా కూడా క్షుణ్ణంగా చదివేవాణ్ణి. లండన్‌లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దపెద్ద బారిష్టర్లు, జడ్జీలు రాత్రి ఒకటి, రెండు గంటలదాకా చదువుతూ కృషి చెయ్యడం చూశాను. అల్లాగే నేనుకూడా చాలా కృషి చేసేవాణ్ణి. ఆత్మ విశ్వాసమూ, నిర్బయత్వమూ, పరిశ్రమా విడవకుండా ఈ మూడింటి సమన్వయం వల్లా నేను మద్రాసుబారులో నా స్థానాన్ని ఆక్రమించుకో గలిగానని చెప్పాలి. ఇంతే కాకుండా నా క్లయింట్లకి నే నంటే పరిపూర్ణ మైన విశ్వాసం కూడా ఉండేది. వాళ్ళకేసులు నా దగ్గిర ఉంటే, వాటితో ఐక్యం అయి పట్టుదలతో పనిచేస్తా ననే ప్రఖ్యాతికూడా గడించుకున్నాను. ఆ విశ్వాసమే నాకు ఆ వృత్తిలో జయం చేకూర్చింది. ఈ సందర్బంలో జడ్జీలతో ప్రవర్తించేటప్పుడు లాయర్లకి ఉండే ధైర్యం కూడా గొప్పగా సహాయం చేస్తుంది. జడ్జీలని ఎదురుకునే సాహసం చూపించే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. దానివల్ల అల్లాంటి సందర్భంలో అవసర మైన వాళ్ళు తమ కేసులు పట్టుకుని వెతుక్కుంటూ వస్తారు. రాజమహేంద్రవరంలో మునసబు రంగమన్నారుతో వ్యవహరించి నప్పుడు కూడా నా అనుభవం ఇదే. నాకు జడ్జీలతో వచ్చిన పట్టింపుల్ని గురించి ముందు వేరుగా వ్రాస్తాను.

మొత్తంమీద నేను కొద్దికాలంలోనే మద్రాసు హైకోర్టులో అప్పెలెటుసైడునా, సివిల్‌లోనూ, క్రిమినల్‌లోనూ మంచి ప్రాక్టీసు గడించేసరికి నన్ను ఏ జిల్లాలకి అయినా వెళ్ళి ప్రాక్టీసు పెట్టమని సలహా ఇచ్చిన సర్ జాన్ వాలెస్సూ, చీప్ జస్టిస్ అర్నాల్డు వైటూ మొదలైన వారు కొంచెం ఆశ్చర్యపడ్డారు. మద్రాసులో కొంతకాలం ప్రాక్టీసుచేసి పిమ్మట హైకోర్టు జడ్జీ అయిన నేపియర్ ఒకసారి నాతో, "హిందూ లాని గురించి పుస్తకం వ్రాసిన జాన్ డి. మెయిన్ తరవాత మద్రాసు బారిష్టరులలో ఇంత సివిల్ ప్రాక్టీసు సంపాదించిన వాళ్ళు ఎవ్వళ్ళూ లేరు!" అన్నాడు. మొత్తానికి విశేషం శ్రమలేకుండానే నాకు పుష్కలంగా కేసులు లభించేవి. నేను ఎప్పుడూ కేసులకోసం బాధపడలేదు.

అప్పుడే నాకు రాజమహేంద్రవరంలో స్నేహితుడైన కోకా వెంకటేశ్వరరావుగారు, తన అల్లుడైన పి. వెంకటరమణారావుగారిని - (ఇప్పుడు జస్టిస్) - నాతో పనిచెయ్యడానికి అప్పగించారు. అప్పటికి వెంకటరమణారావుగారు బి. యల్. పాసయినారు. ఆయన మంచి చురుకైన బుద్ధిశాలి. ఆయనకి ఉన్న జ్ఞాపక శక్తి చాలాగొప్పది. కేసుల్లో చాలా గట్టివాడు. సివిల్ కేసుల్లో లా పాయింట్లు తీసి, వాటిని క్షుణ్ణంగా జడ్జీ ఎదటపెట్టి, కేసులు గెలవడానికి నాకు ఆయనవల్ల లభించిన సాహాయ్యం చాలా గొప్పది.

క్రిమినలు సైడున నేను మొట్ట మొదట పనిచేసిన పెద్దకేసు ఆష్ హత్యకేసు. అది రాజకీయమైన కేసు. 1907-8 సంవత్సరాల్లో తిరునల్వేలిలో కలెక్టరుగా ఉండిన ఆష్‌ని ఎవరో రైలుస్టేషనులో రివాల్వరుతోకాల్చి చంపివేశారు. అప్పటికి బిపినచంద్రపాలు మన రాష్ట్రానికి రావడమూ, ఆయన ఉపన్యాసాలు దేశంలో గాఢమైన దేశాభిమానాన్ని రగులుకొల్పడమూ జరిగాయి. అవి వందేమాతరం రోజులు. వంగ విభజనవల్ల భారత జాతీయత రగుల్కొల్పబడింది. ఇది ఆ గందరగోళంలో వచ్చిపడిన కేసు! ఆ కేసులో మొదటి ముద్దాయి తరపున బారిష్టరు దేవదాసు, రెండవ ముద్దాయి శంకరకృష్ణన్ తరపున నేనూ వకాల్తా పుచ్చుగున్నాము. అసలు తిరునల్వేలిలో జరిగిన ఈ హత్య విచారణ సహజంగా తిరునల్వేలిలోనే జరగవలసి ఉంది. కాని రాజకీయ కారణాల చేత, ఆ కేసు మద్రాసు హైకోర్టువారే - అందులోనూ పుల్ బెంచివారు - విచారించారు. అల్లాంటప్పుడు ఆ కేసు నడిపించడం ఎంత కష్టమో వేరే చెప్పనక్కరలేదు. పుల్ బెంచికి అధ్యక్షుడు చీఫ్ జస్టిస్ సర్ ఆర్నాల్డు వైటు. ఆ విచారణలో నేను జడ్జీలని చాలా శ్రమ పెట్టాను! అడుగడుక్కీ డిఫెన్సు తరపున హక్కులు స్థాపించుకుంటూ, వాళ్ళప్రాణాలు విసిగించే వాణ్ణి. పోలీసులు F.I.R. లో ఆ దొరని కొట్టినవాడికి క్రాపింగు ఉందని వ్రాసి తరవాత సవరించుకున్నారు. నా క్లయింటుకి పెద్ద జుట్టు ఉండేది. ఆ పాయింటు పట్టుకుని సాగదీసే సరికి చాలా లాభించింది! పర్యవసానంలో నా క్లయింటుకి రెండు సంవత్సరాల శిక్ష వేశారనుకుంటాను. ఆ కేసు నడిపించడంలో నాకు కొంత ప్రఖ్యాతి వచ్చింది. అదే క్రిమినల్ ప్రాక్టీసులో మొదటి కేసు.

నేను మొత్తం ప్రాక్టీసు చేసిన 14 సంవత్సరాల్లోనూ మొదటి 7 సంవత్సరాల్లో ప్రాక్టీసు బాగా నిలదొక్కుకున్నాను. కాని, అప్పుడు నెలకి రెండుమూడువేల దాకా సంపాదన ఉన్నా, ఖర్చుకూడా అల్లాగే ఉండేది. ఏమయినా బారిష్టరుచదువుకీ, దాని ఉపాంగాలైన లైబ్రరీ వగైరాలకీ అయిన ఋణం తీర్చివేశాను. నా మిత్రుడు లక్ష్మణదాసు ఇంగ్లండు ప్రయాణంకోసం ఇచ్చిన డబ్బు వెంటనే తీర్చివెయ్యవలసిన అవసరం వచ్చింది. అందుచేత, నేను ప్లీడరుగా ఉన్నప్పుడు చాటపర్రులో కొన్న భూమి అమ్మి ఋణం అంతా తీర్చివేశాను. లైబ్రరీకోసం కంచుమర్తి రామచంద్రరావు గారి దగ్గిర చేసి ఋణం అంతా ప్రాక్టీసులో సంపాదన వల్ల తీర్చివేశాను. ఈ కాలంలో కుటుంబం పరిస్థితిని గురించి ముందు ముందు వ్రాస్తాను. మొదటి 7 సంవత్సరాలూ ఇల్లా గడిచిన తరవాత, మిగిలిన 7 సంవత్సరాల్లోనూ పుష్కలంగా సంపాదించి తోటలు, దొడ్లు, బంగాళాలు కొన్నాను.