నా జీవిత యాత్ర-1/మాటపట్టింపులు

వికీసోర్స్ నుండి

17

మాటపట్టింపులు

ఈ సందర్భంలోనే నేను ప్రాక్టీసుకి వచ్చినప్పుడు బారు సంగతుల్ని గురించీ, జడ్జీల కయ్యాళీలనిగురించీ, నాకూ వాళ్ళకీ వచ్చిన పట్టింపుల్నిగురించీ కొంచెం వ్రాస్తాను. చాలామంది జడ్జీలతో నాకు మాట పట్టింపు రావడమూ, నా మీద మాట ఉంచుకోకుండా వెంటనే వాళ్ళకి మాట అప్పజెప్పి, నా ఆత్మగౌరవమూ, స్వాతంత్ర్యమూ కాపాడుకోవడమూ జరిగాయి.

నేను మొదట్లో ప్రవేశించినప్పుడు - అంటే 1907 వ సంవత్సరంలో - మద్రాసు బారులో ఒక ఆచారం ఉండేది. ఒక పెద్ద ప్లీడరు హైకోర్టు జడ్జీ అవడంతోనే అతని జూనియర్‌గా ఉంటూ ఉండిన లాయరు బారుకి నాయకుడై పలుకుబడి సంపాదిస్తూ ఉండేవాడు. అ ఆచారం కూడా నాకు మొదట్లో ఒక అడ్డే. నాకు అల్లాంటి ప్రాపకం లేదు. మొదటినించీ నాకు ఉన్న ధైర్యంతోనే అప్పటి హేమా హేమీలకి ఎదురుగా నిలబడేవాణ్ణి. అందులోనూ జడ్జీలుగా ఉండిన హేమా హేమీలు కేసులలో ముందే ఒక అభిప్రాయానికి వచ్చి లాయరుకి అడ్డు తగులుతూ శ్రమ కలగచేస్తూ ఉండేవారు. దాంతో లాయర్లకీ, జడ్జీలకీ కొంచెం తగాదాలు వస్తూ ఉండేవి. అందులోనూ, ఒక్కొక్కజడ్జీకి ఒక్కొక తిక్క ఉండేది. అందుచేత కాస్త స్వాతంత్ర్యం చూపించే లాయరుకి జడ్జీతో తగాదా తప్పేదికాదు. నేను వచ్చేసరికి జడ్జీలలో స్వతంత్రంగా ఉండే వాళ్ళలో నార్టు బాగా ప్రసిద్ధికి ఎక్కాడు.

నేను ప్రాక్టీసు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సర్ శంకరన్ నాయరు జడ్జీగా ఉండగా ఒక లిమిటేషన్ కేసు అప్పీలులో ఆర్గ్యుమెంటు చెపుతూఉన్నాను. ఆయన నేను చెప్పేది వినకుండానే ఇల్లాంటి కేసుల్లో ఇదివరకే చాలాపర్యాయాలు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి నాకు అడ్డుతగిలాడు. వెంటనే నేను అందుకుని, "ఇల్లాంటి కేసు ఎప్పుడూ ఈ హైకోర్టులో తీర్పుకాలేదు. సరిగదా, మీరు అసలే తీర్పు చెప్పలేదు. మీరు అనుకునే కేసుకీ దీనికీ అసలు సంబంధమే లేదు," అని చెప్పాను. అంతటితో ఆయన చల్లబడ్డాడు.

ఇంకొక సారి వాలస్‌తో వచ్చింది తగాదా. ఆయన లాపాయింటు గ్రహించడంలో సునిశితబుద్ధికలవాడే కాని, యథార్థం (Fact) గ్రహించడంలో నిదానం ఉండేది కాదు. ఎంత బుద్ధిశాలి అయినా యథార్థం గ్రహిస్తేనే కాని న్యాయం జరగదు. లా యథార్థాన్ని అనుసరించే ఉంటుంది. కనక అది గ్రహించి న్యాయం చెప్పాలి. పైగా, ఈ వాలస్ నిద్రపోయేవాడు. ఒకసారి ఆయన బెంచీమీద నిద్రపోయాడు. నేను కాగితాలు కిందపడవేసి కూర్చున్నాను. కొంచెం సేపటికి ఆయన మేలుకుని "Mr. Prakasamǃ Where are We?" అన్నాడు. నేను, "My lordǃ I don't know where we areǃ" అన్నాను. దానికి ఆయన చాలాబాధపడ్డాడు. అక్కణ్ణించి నేను హాజరయిన కేసుల్లో మాత్రం ఎప్పుడూ నిద్రపోలేదు. ఆయనే ఒకసారి, అంతకుముందు అడ్వకేటు జనరల్‌గా ఉండిన ఒక భారతీయ ప్రముఖుడు ఆర్గ్యుమెంటు చెబుతూ ఉంటే తల వేలవేసి నిద్రపోయాడు. ఆయన కునుకుతున్నా ఈయన ఆర్గ్యుమెంటు మానలేదు. ఒకనిద్ర తీసి లేచి, "ఏమండీ! మీరు ఏవిషయం ఆర్గ్యూచేస్తున్నారు?" అన్నాడు. ఈయన "అయ్యా! నేను కమర్షియల్ లా విషయం ఆర్గ్యూ చేస్తున్నాను," అన్నాడు. అపైన ఆయన "ఆ అసందర్బంగా మాట్లాడతారేమిటి? కమర్షియల్ లా మీకేం తెలుసును?" అన్నాడు. అంటే ఆయ నేమీ మాట్లాడలేదు. ఆ ముక్కలు విన్న వి. కృష్ణస్వామయ్యరుగారు పెదవిచప్పరించి, "అవును! ఇది మనకి ఇల్లాగ అవవలసిందే!" అన్నాడు. అంటే బారులో ఐకమత్యం లేదనీ, ఉంటే జడ్జీలు అల్లా ప్రవర్తించలేరనీ ఆయన అభిప్రాయము.

మరి, ఒక సందర్భంలో సర్ అబ్దుల్ రహీముగారితో నాకు మాటపట్టింపు వచ్చింది. ఆయన కోర్టు శుద్ధ బహదూరీ పద్ధతిగా ఉండేది. మొదటి రోజుల్లో ఆయన చాలా నిదానంగా వింటూ, న్యాయం సరిగ్గా పాలించేవాడు. కొన్ని స్వతంత్రమైన పోకడలు కూడా కనపర్చాడు కాని, రానురాను లాయర్ల మీద బెంచీమీదనించే చికాకుపడేవాడు. పైగా అప్పటికి వి. కృష్ణస్వామి అయ్యరుగారు హైకోర్టుజడ్జీపని విడిచిపెట్టి ఎక్జిక్యూటివ్‌కౌన్సిలర్ అయ్యారు. ఆయనకికూడా తన రాష్ట్రమైన బెంగాలుకి ఎక్జిక్యూటివ్‌కౌన్సిలరు కావాలని ఆశ ఉండేది. ఆయన ఎంత సేపూ అదే దృష్టిలో ఉండేవాడు. ఒకసారి నేను ఒక సివిల్ అప్పీలు ఆయన దగ్గిర వాదిస్తున్నాను. నేను రిపోర్టు పాయింటు వివరించకుండానే, "ఆ ఇందులో ఏముంది?" అన్నాడు. నాకు ప్రాణం విసిగి, "అయ్యా ఈ కేసులో నేను నా పార్టీల దగ్గిరనించి చాలా డబ్బు తీసుకున్నాను వాళ్ళకేసు అంతా శ్రద్ధగా చదివి తమకు నివేదించదలచుకున్నాను. అల్లాంటప్పుడు నేను చెప్పకుండానే మీరు 'ఇందులో ఏముందని' అంటే ఇంక నేను చెప్పేదేమిటి? ఇది న్యాయమూర్తులకి న్యాయమైన పనికాదు," అన్నాను. అంతటితో ఆయన తట్టుకుని నిదానపడ్డాడు. తరవాత నాకూ, ఆయనకీ ఎప్పుడూ తగాదా రాలేదు. నేపియర్ అనే ఇంకొక బారిష్టరు జడ్జీగా ఉండేవాడు. ఆయనైతే చురుకైనవాడే కాని శాంతం తక్కువ. ఒక కేసులో ఆయన నన్ను 4 గంటలకి పిలిచారు. అది ఒక క్రిమినలు కేసు. నేపియరుగారు ఆ కేసు అంతా పదినిమిషాలలో ముగించాలన్నారు. నేను అది అల్లాగ ముగించడం సాధ్యం కాదనీ, ఆయన ఇచ్చిన టైములో కేసులోని ముఖ్యవిషయం చెప్పడానికైనా వీలుండదనీ చెప్పాను. ఆయనకి ఆగ్రహంవచ్చి, "చాలు! సోది కట్టిపెట్టండి!" అన్నాడు. వెంటనే నేను కాగితాలకట్ట బల్ల మీద కొట్టి, ఆయన అన్నమాట ఉపసంహరించుకుంటే కాని ఈ కోర్టులో ఆర్గ్యుమెంటు చెప్పడానికి నిరాకరిస్తున్నా నన్నాను. ఆయన ముఖం ఎర్రనై అక్కడనించి లేచిపోయాడు. అప్పటికి బారిష్టర్ల అసోసియేషన్ అని ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో ఆస్‌బర్ను, గ్రాంటు, నార్టన్, స్వామినాథన్ ప్రభృతులు నాకంటె సీనియర్లు ఎందరో ఉన్నా నన్ను అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. ఆ సంఘం నేపియర్ అగౌరవ చర్యని గురించి తీవ్రమైన అసమ్మతి తెలుపుతూ ఒక తీర్మానం పాసుచేసి పంపించింది. చివరికి ఆయన క్షమాపణ చెప్పాక కేసు నడిచింది.

వి. కృష్ణస్వామయ్యరుగారు జడ్జీగా ఉండినప్పుడు ఒకసారి నాకూ, ఆయనకీ కొంచెం పట్టింపు వచ్చింది. ఆయనా, జస్టిస్ వాలస్సూ బెంచిమీద ఉండగా నే నొక Batch దావాలో వాదించవలసివచ్చింది. మొదటనే కృష్ణస్వామయ్యరుగారు నా కేసు తోసివేశారు. అన్ని కేసుల్లోనూ దావా కారణం ఒకటైనా నేను ఎప్పటి కప్పుడే ఒక్కొక్క పాయింటుగా వాదిస్తూ వచ్చాను. కృష్ణస్వామయ్యరుగారు, "ఏమి ఇల్లా వాదిస్తున్నా?" రని అడిగారు. నేను, "తాము నేను, చెప్పే విషయం సరిగ్గా అవగాహన చేసుకోకముందే ఒక తీర్పుకి వచ్చారు. అవకాశం ఉంది కనక ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నా మాటలకి విలవ ఇస్తారేమో అనే ఆశకొద్దీ తంటాలు పడుతున్నాను," అన్నాను. ఆయన, "అది ప్రకాశంగారి పట్టుదలకి నిదర్శనం," అన్నారు. కేసు నాకు వ్యతిరేకంగా అయింది. కాని, మరి పది, పదిహేను రోజులకి వి. కృష్ణస్వామయ్యరుగారు తమంతట తమరే ఈ కేసు పిలిపించారు. పిలిపించి, తాము ఇదివరలో పొరపాటు అభిప్రాయానికి వచ్చామనీ, అందుకోసం తిరిగి వినవలెననీ, అదిసవరించుకుంటున్నామనీ చెప్పి, నా కేసు అంతా విని నా కనుకూలమైన తీర్పు చెప్పారు. అది హైకోర్టు జడ్జీలలో సామాన్యం అయిన విషయం కాదు. పొరబాటు పడడం మానవ మాత్రులకి సహజమేకాని, అది పొరబాటని తెలిసిన తరవాత ఈరీతిగా సవరించుకోవడం అనేది అసాధారణ విషయం. అప్పుడే నేను లాటైమ్సులో ఆయన ఘనత ప్రశంసిస్తూ వ్రాశాను. కృష్ణస్వామయ్యరుగారు కోర్టులో దడదడ లాడించినా మనసులో కక్షవహించే తరహా మనిషికాదు. తరవాత, ఆయన ఎక్జిక్యూటివ్ కౌన్సిలర్ అయినప్పుడు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళాను. ఆయన నన్నెంతో ఆదరించి, " Prakasamǃ Good friends do not carry any prejudices in their minds" అన్నాడు.

ఒకప్పుడు సర్ కె. శ్రీనివాసయ్యంగారు బెంచీమీద ఉండగా నా కొక పేచీ వచ్చింది. ఆయన గొప్ప మేధావి. సునిశితమైన బుద్ధి విశేషం కలవాడు. దానికితోడు కేసు తానే స్వయంగా అవగాహన చేసుకునివచ్చి ఒక అభిప్రాయంతో కూర్చునేవాడు. అల్లాంటప్పుడే సామాన్య లాయర్ల పని చాలా ఇరుకుని పడిపోతుంది. అయినా, కూట్సు ట్రాటరూ ఇద్దరూ ఉండగా నే నొక కేసు ఆర్గ్యుమెంటు చెబుతున్నాను. ఆయన మధ్య మధ్యని నాకు అడ్డుతగిలి అప్పుడే జడ్జిమెంటుకి వచ్చేసినట్లు సూచించాడు. అప్పుడు నేను, "అయ్యా ఈ కేసులో నేను మీ కోసం ఆర్గ్యుమెంటు చెప్పడంలేదు. మీరు అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చినట్లు తోస్తుంది. నేను ఇది అంతా రెండో జడ్జీగారికోసం చెబుతున్నాను," అన్నాను. దాంతో ఆయన మరి మాట్లాడలేదు.

పి. ఆర్. సుందరయ్యరుగారు జడ్జీగా ఉండేటప్పుడు ఆయనతో కూడా నాకు తగాదా వచ్చింది. సుందరయ్యరుగారు చాలా వివేకవంతుడు. చురుకైనవాడే కాని, తాను విచారించబోయే కేసు స్వయంగా చదువుకుని, ఒక అభిప్రాయానికి వచ్చి, మాటిమాటికి అడ్డుతగుల్తూ ఉండేవాడు. లాయరు తన ఎదట పెట్టిన విషయాలన్నీ తన బుద్ధి విశేషంచేత వంకరటింకరగా తిప్పుతూ ఉండేవాడు. ఒక కేసులో నా కిల్లాంటి తగాదా వచ్చింది. అప్పుడు నేను లాటైమ్సుకి సంపాదకుడుగా ఉండేవాణ్ణి. అప్పుడు అ పత్రికలో, "This Judge is full of intellectual dishonesty," అని వ్రాశాను. దాని మీద జడ్జీలలో పెద్ద కలవరంపుట్టి, వీలైతే నా మీద జడ్జీల యెడల అగౌరవం చూపినందుకు కంటెంప్టుకేసు పెట్టాలని కూడా ఆలోచించారు. కాని, సందర్భాలను బట్టి Fair comment limit దాటక పోవడంవల్ల అది అంతటితో విరమించు కున్నారు. ఆలా టైమ్సుని గురించి ముందు ప్రత్యేకంగా వ్రాస్తాను.

ఇంతవరకూ నేను బారిష్టర్ల విషయమూ, జడ్జీల సంగతి వ్రాశాను. ఇక సివిలియన్ జడ్జీల సంగతి వ్రాస్తాను. ఈ జడ్జీలలో రెండు తరహాలవాళ్ళుండేవారు. ఈ జడ్జీలకి సమర్థత సామాన్యంగా ఉండేది. ఇందులో కొందరు జడ్జీలుగా కొంత అనుభవం సంపాదించి నిదానంగా ఉండేవారు. కొందరు, కాస్త చిరాకు తనం కలిగి, చెప్పినది సరిగా వినకుండా కిందకోర్టు తీర్పు ఖాయపరచే ధోరణిలో ఉండేవాళ్ళు, బెన్సన్ వగైరాలు ఈ తరహాకి చెందినవాళ్ళు. ఇందులోనూ కొందరు బెంచీ మీదనే చిరచిరలాడేవారు. కొందరు కేసవుతూంటే మాట్లాడకుండా కూర్చుని చివరికి కింది కోర్టులతో ఏకీభవిస్తూ ఉండేవారు.

మన్రో అని ఒక సివిల్‌జడ్జీ ఉండేవాడు. నేనొక కేసు ఆర్గ్యుమెంటు చెబుతూంటే, ఆయన తలవంచుకుని జడ్జిమెంటు వ్రాసేస్తున్నాడు. నేను, "ఆర్గ్యుమెంటు చెప్పకుండానే మీరు తీర్పు వ్రాసేస్తున్నారు! నేను ఎంత గొంతు చించుకుంటే మాత్రం లాభ మేమిటి?" అన్నాను. ఆయన, "నేను తీర్పు వ్రాస్తున్నానని మీ కెల్లా తెలిసింది?" అన్నాడు. "మీరు వేసిన ప్రశ్నలు, మీరు కూచునే వాలకం, మీ వ్రాత ధోరణీ చూసి, అల్లాగ అనుకున్నాను,: అన్నాను. నిజానికి ఆయన వ్రాసేది జడ్జిమెంటే!

బోడాం అనే జడ్జీ ఒకాయన ఉండేవాడు. ఆయన ఒరిజనల్‌సైడు బెంచీమీద ఉండేవాడు. విశేషమైన ప్రతిభ కలవాడు. ఆడవాళ్ళు - అందులోనూ కాస్త చక్కగా సింగారించుకున్నవాళ్ళు - బోనులోకి వస్తే ఆయన మనస్సు నిలకడగా ఉండేదికాదని ప్రతీతి. ఆకాలంలో కొందరు వకీళ్ళు ఆయనకోర్టులో కేసులు గెలవడానికి ఈ సూక్ష్మాన్నే కనిపెట్టారు. అందుచేత టంకసాలవీథిలో ఉన్న భోగంవాళ్ళు చాలామంది ఈ కోర్టులో సాక్షులైనారు! సి. పి. రామస్వామయ్యరుగారు ఆకాలంలో చురుకుగా ముందుకి వస్తూన్న వకీలు. ఆయనకి ఒరిజనల్‌ సైడులో పని బాగా ఉండేది. బోడాంకి ఆయన అంటే చాలా ఇష్టం. అనాటి సి.పి రామస్వామయ్యరు గారు తరవాత ఆ బోడాంకి ఒక శిలావిగ్రహం కూడా చేయించారు. నేటికి కూడా బోడాం అల్లాంటి గౌరవానికి ఎంత మాత్రం అర్హుడు కాడని నా విశ్వాసం. ఆరోజుల్లో అంతా కూడా అల్లాగే అనుకునేవాళ్ళు.

ఈరీతిగా పద్నాలుగుసంవత్సరాలు జడ్జీలతో కిందామీదా పడుతూ నా ఆత్మ గౌరవానికీ, వృత్తిస్వాతంత్ర్యానికీ భంగం రాకుండా బారిష్టరీ నడిపించాను. నేను పని ప్రారంభించిన కొద్దికాలానికి, ప్రముఖులైన లాయర్లతో ఆలోచించి, జడ్జీలని సరియైన పద్ధతిలో ఉంచడానికి పత్రిక ఒకటి అవసరమని తలచి, కె. రామచంద్రన్ దగ్గిర లాటైమ్సు అనే లాజర్నలు ఒకటి కొన్నాను. దానికి నేను ప్రధానసంపాదకుణ్ణి. బారిష్టరు దేవదాసు, మాధవన్నాయరు మొదలయినవాళ్ళు సహాయ సంపాదకులు. ఆ పత్రికలో జడ్జీలనిగురించి నిర్భయంగా వ్రాస్తూ ఉండేవాళ్ళము.

పి. ఆర్. సుందరయ్యరుగారిని గురించి వ్రాసినసందర్భంలో నామీద కంటెప్టు ప్రొసీడింగ్సువిషయం ఆలోచించినప్పుడు, మాధవన్నాయరుగారు చాలా గడబిడ పడ్డారు. ఆయన తన మామగారైన సర్ శంకరన్నాయరుగారి పలుకుబడితో గవర్నమెంటు ప్లీడరై, హైకోర్టుజడ్జీ కావా లనే ఆశలో ఉండేవారు. కనక అసలే భయపడి మిక్కిలి ఆదుర్దాతో స్వార్థానికి అడ్డురాకుండా తమపేరు సంపాదకవర్గంలోనించి తప్పించమన్నారు. వి.ఆర్. కృష్ణస్వామయ్యరుగారు హైకోర్టుజడ్జీ పనిలోనించి ఎక్జిక్యూటివ్‌కౌన్సిల రయినప్పుడు కూడా పత్రికలలో చాలా తీవ్రంగా విమర్శించాను. న్యాయమూర్తులు కార్యనిర్వాహకవర్గంలోకి ప్రమోషన్ అయ్యే సిద్ధాంతం పరిపాలనకి లాయకు అయిన సంగతి కాదని నావాదన. సర్ అబ్దుల్ రహీముగారినిగురించి వ్రాసినప్పుడు కూడా నా వాదన అదే! ఆ వ్యాసం వ్రాశాక సర్ అబ్దుల్‌గారు తమ ఇంటికి నన్ను భోజనానికి పిలిచి, తమకి ఉన్న ఆదుర్దా అంతా నాతో చెప్పారు. నడచినన్నాళ్లు లాటైమ్సు మద్రాసులో జడ్జీలకి, ప్లీడర్లకీ కొరడాలాగ ఉండేది.

నా ప్రాక్టీసు హైకోర్టులోనే కాకుండా మన రాజధాని అంతా వ్యాపించి ఉండేది. విశాఖపట్టణం మొదలు తిరుచునాపల్లివరకూ అన్ని జిల్లాకోర్టుల్లోనూ హాజరు అయ్యాను. ఒకసారి తిరుచునాపల్లిలో ఒక సివిల్‌కేసులో మూడుమాసా లున్నాను. వేలకొద్దీ ఫీజు పుచ్చుకున్నాను. నేను డబ్బు సంపాదించిన రోజుల్లో ఫీజు చాలా హెచ్చుగానే పుచ్చుకునే వాణ్ణి. పాపం! పార్టీలు చాలామంది చాలా డబ్బు నా పేరుమీదుగా పోగొట్టుకున్నారు! చాలామంది పూర్తిగా నష్టపడి ఉంటారని కూడా అనుకుంటాను. కొన్ని కేసుల్లో రోజుకి అయిదువందలు, వెయ్యీ కూడా పుచ్చుకున్నాను. తిరుచునాపల్లిలో సంపాదించిన డబ్బుతోటి ఊటీలో కొన్న బంగాళాకి 'గోదావరి' అని పేరు పెట్టాను.

1919 లో రాజమహేంద్రవరంలో సత్యవోలు గున్నేశ్వర్రావు ప్రభృతులపైన వచ్చిన ఫోర్జరీ కర్రెన్సీనోట్ల కేసులో మొదటినించీ - అంటే కమిటల్ కోర్టు దగ్గరనించీ - నేనే ఉండి నడిపించాను. ఆ కేసులో నాకు సాంబమూర్తిగారు సహకారిగా పనిచేశారు. నిడదవోలు పార్టిషన్ కేసు, కృష్ణాజిల్లా జమీందారీకేసులు మొదలయిన డబ్బు పుష్కలంగా లభ్యంఅయ్యే కేసులు అన్నీ వచ్చాయి. పానగల్లురాజాగారు చిత్తూరు కోర్టులో కాళహస్తి జమీందారుగారిమీద తెచ్చిన సివిల్ లిటిగేషన్‌లో నేను చాలాకాలం పనిచేశాను. అందులో నాకు పి. వి. రమణారావుగారు సహకారిగా పనిచేశారు. ఇల్లాగ మంచి ప్రాక్టీసు బాగా రావడంవల్లనే పదిసంవత్సరాల్లో రెండుమూడులక్షల రూపాయలూ, మద్రాసులో ఒక ఇల్లూ, ఊటీలో ఒక బంగళా, ఒంగోలులోనూ, రాజమహేంద్రవరంలోనూ ఒక్కొక్క ఇల్లూ, ఇంకా రెండులక్షల రూపాయల విలవగల స్థిరాస్తీ కూడా సంపాదించగలిగాను. నాకు విశ్రాంతి తీసుకున్న తరవాత మూడేసి మాసాలు ఒక్కొక్కచోట ఉండాలని ఒక ఆశ ఉండేది.

ఈ కాలంలోనే రెండు కేసులలో ప్రీవీకౌన్సిలు ఎదట వాదించడానికి రెండుసార్లు ఇంగ్లండు వెళ్ళి, అక్కడ ఒక్కొక్క సారి మూడుమాసాలకి తక్కువకాకుండా ఉన్నాను. యుద్దానికి పూర్వం వెస్టుమినిష్టరు పాలెస్ హోటలులో ఉండగా దక్షిణాఫ్రికా పోరాటం సాగిస్తూ ఉన్న బారిష్టరు మోహన్‌దాస్ కరంచందు గాంధీగారిని మొదట చూశాను. లండన్ ఇండియన్ సొసైటీ తరపున వెడ్డర్‌బర్న్ ప్రభృతులు ఈయన్ని ఆహ్వానించి, ఆ భవనంలోనే కింది అంతస్తులో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. చిరకాలంనించి ఆ సొసైటీతో నాకు సంబంధం ఉండడంచేత దానికి నేనూ హాజరు అయ్యాను. అపుడు గాంధీగారు పూర్తిగా పాశ్చాత్య దుస్తులు ధరించారు.