నా జీవిత యాత్ర-1/నాటకరంగ ప్రవేశం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3

నాటకరంగ ప్రవేశం

ఈ కాలంలోనే నా జీవితాని కంతకీ మార్పు తెచ్చిన నాటకాల ప్రకరణం ప్రారంభం అయింది. నాకు లోవర్ ఫోర్తు చదువు పూర్తి అయ్యేసరికి పూనా కంపెనీ ఒంగోలు వచ్చింది. వాళ్ళు హిందీలో నాటకాలు ప్రదర్శించేవారు. అప్పుడు వాళ్ళు ప్రమీలా స్వయంవరం, పీష్వా నారాయణరావు వధ, ఉషా పరిణయం, కీచక వధ మొదలైన నాటకాలు ఆడారు. మేమంతా నాటకాలు చూచాము. మాకు అప్పట్లో అల్లాంటి నాటకాలు ఆడాలనే సంకల్పం కలిగింది. మా సంకల్పానికి తోడు ఆ ఊళ్ళో నాటకాలంటే చెవి కోసుకునే ఉండదల్లీ సాహేబు అనే ఆయన ఉండేవాడు. నాకు పితృసమానులు, నా జీవితాభివృధ్ధి కంతకీ మూలకందమూ అయిన ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు కూడా అక్కడ మిషన్ స్కూల్లో ఉపాధ్యాయు లుగా ఉండి నాటకాలంటే అభిమానంగా ఉండేవారు. ముందు ఆయన్ని గురించి విపులంగా వ్రాస్తాను.

అల్లాంటి స్థితిగతుల్లో నేను నాటకాలు పాత్రధారణ ప్రారంభించి, ఆడవేషాల్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. పీష్వా నారాయణరావు వధలో నారాయణరావు పాత్రలో నారాయణరావు పాత్ర నేనే ధరించేవాణ్ణి. అందులో మనకీర్తి బాగా వ్యాపించింది. అందువల్లనే ఊళ్ళో ఉన్న ఉండదల్లీ సాహేబు, హనుమంతరావుగార్లకి అభిమానపాత్రుణ్ణి అయ్యాను. ఆ నాటకాల యావ కొంతవరకు నన్ను ఇతరమైన చిలిపి పనులనుండి కాపాడింది. ఉండదల్లీ సాహేబు మేనల్లుడు ఒకడు మాతో వేషాలు వేసేవాడు. ఎప్పుడూ నాకు తురకల సహవాసం ఉంటూనే ఉండేది. ఆ ఉండదల్లీ సాహేబు ఉర్దూలో పండితుడు. ఆయన ఉర్దూలోనే నాటకాలు వ్రాసేవాడు. మేము తెలుగు లిపిలో ఆ ఉర్దూ వ్రాసుకుని నాటకాలు కంఠస్థంగా వల్లించేవాళ్ళము. ఈ స్థితిలోనే ఒకవైపున నాటకాలూ, రెండోవైపున చదువూ సాగిస్తూ, నేను మిడిల్ స్కూలు పరీక్షకి తయారు కావలసివచ్చింది.

నేను ఈ నాటకాల్లో తిరుగుతూ వుంటే మా అమ్మగారు, అమ్మమ్మగారు కూడా చాలా బాధపడుతూ వుండేవారు. కాని, నేనెప్పుడూ వారి అదుపు ఆజ్ఞల్లో లేకుండా వుండడంవల్ల నన్నేమీ చెయ్యలేకపొయ్యేవారు. కన్న ప్రేమ వల్ల నేను చేసే ఆకృత్యాలన్నీ కాసుకుంటూ వచ్చేవారు. బయట ఎంత అల్లరి చేసినా స్కూల్లో చదువు విషయంలో ఏ లోపమూ లేకపోవడంవల్ల కొంత తృప్తిపడుతూ వుండేవారు. నేను ఆ మిడిల్ స్కూలు పరీక్షకి వెళ్ళడం ఒక బ్రహ్మాండమైన పని అయింది. హోటలు పెట్టుకున్నా మా దారిద్ర్యం తీరలేదు. అందువల్ల వచ్చే ఆదాయం కుటుంబ పోషణకీ, నా చదువుకీ సరిపోయేది కాదు. అందుచేత మా అమ్మగారు నన్ను సంపన్న గృహస్థుల ఇళ్ళల్లో వారాలకి అప్పజెప్పింది. బ్రతికి చెడిపోయిన సంసారం అనే మర్యాద వల్ల ఊళ్ళో వాళ్ళు మా అమ్మగారిని సామాన్యంగా వంటపూటి వాళ్ళని చూసేటట్లు చులకనగా చూసేవాళ్ళు కారు. ఆ కాలంలో ఒంగోలు ప్లీడర్లు అంతా తెలుగు ప్లీడర్లే. అందులో నాగరాజు సూర్యనారాయణరావు అనే ఒక తెలుగు ప్లీడరు ఉండేవాడు. ఎప్పుడైనా నాకు ఏ పుస్తకాలకైనా డబ్బు తక్కువైతే మా అమ్మగారు నన్ను ఆయన దగ్గరకు పంపించేది. మా కుటుంబం పూర్వపు ప్రతిష్ఠ మన్నించి ఆయన నేను ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా నాలుగు అణాలు ఇచ్చేవాడు. ఇప్పటికీ ఆయన నా కళ్ళలో మసులుతూనే వున్నాడు. ఇల్లాంటి నిక్కచ్చిలో మిడిల్ స్కూలుకి 3 రూపాయలు దరఖాస్తు కట్టవలసి వచ్చింది. నేను ఒంగోలుకి 35 మైళ్ళ దూరంలో వున్న మా బావగారి యింటికి నడిచి వెళ్ళాను.

తీరా నడిచి వెళ్ళాక మా బావగారు సాయం చెయ్యలేకపొయ్యారు. కాని నడక అనేది మనకి కొత్త కాక పోవడంవల్ల అట్టే ఆశాభంగం కలగలేదు. నాకు ఒంగోలుకి 10 మైళ్ళలో ఉన్న మా చిన్నక్కగారి ఊరు కొత్తపట్నానికి, మా మేనమామల ఊరు వినోదరాయడిపాలానికి, ఇంకా ఆ దగ్గిర గ్రామాలకీ... నడిచివెళ్ళడం అనే అలవాటు వుంటూనే వుండేది. ఆ నాటి నడక సత్తువే యిప్పటికీ నన్ను బలిష్టంగా వుంచిందని నా నమ్మకము. మా బావగారి దగ్గిర ఆశాభంగం అయ్యాక -- పాపం! మా అమ్మగారే తను కట్టుగునే పట్టుబట్ట తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆ గండంతో నా మిడిల్ స్కూలు పరీక్ష పూర్తి అయింది.

మిడిల్ స్కూలు పరీక్షకి వెళ్ళడానికి ముందే నా మనస్సులో రెండు అభిప్రాయాలు వుండేవి. ఒంగోలులో మా ఇల్లు మునసబు కోర్టుకి యెదురుగా వుందని ఇదివరకే వ్రాశాను. ఆ కోర్టులో ప్లీడర్లు లాంగు కోట్లు వేసుకుని తిరుగుతూ, డబ్బు సంపాదిస్తూ వుంటే నాకు కూడా ప్లీడరీ చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఆ లాంగు కోటు మీద ప్రేమ చాలావరకు వెళ్ళింది. మిడిల్ స్కూల్లో చదువుతూ వుండగానే ఒక లాంగుకోటు కుట్టించాను.