నా జీవిత యాత్ర-1/తండ్రిగారి మరణం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2

తండ్రిగారి మరణం

1884 వ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. మా నాయన గారికి అప్పుడప్పుడు శూలనెప్పి వస్సూఉండేది. ఆయన ఆ శూలనెప్పితోనే 1884 సంవత్సరంలో మల్లాంలో స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా జీవించి ఉండగానే నాకు నాయుడుపేటకి కబురు వచ్చింది. కాని, నేను ఊరు చేరుకునే సరికి ఆయన ప్రాణం పోయింది. అప్పటికి మా తమ్ముడు జానకిరామయ్య 3వ మాసం గర్భంలో ఉన్నాడు. శ్రీరాములుకి 8 సంవత్సరాలు. అప్పటికి మా చెల్లెలు అన్నపూర్ణ వయసు సుమారు 4 సంవత్సరాలు. అప్పటికి అప్పగా ర్లిద్దరూ కాపరాలకి వెళ్ళారు. ఈ స్థితిలో కుటుంబభారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకి ఉన్న సాధనాలు కూడా కొరతపడిపోయాయి. పిత్ర్యం ఖర్చయిపోయింది. తండ్రిగారి స్వార్జితంలో నిలవ అనేది శూన్యం. ఈ స్థితిలో మాకు కలిగిన విపత్తునుగురించి తెలియపరచగా మా మేనమామగారు కొంతకాలానికి వచ్చి, మమ్మల్ని ఆదరించి, ఆ ఊరినించి కనపర్తి తీసుకువెళ్ళారు. ఆ తరవాత మేము కనపర్తి శివారు వినోదరాయడుపాలెం గ్రామంలో కొంతకాలం ఉన్నాము.

మా తమ్ముడు జానకిరామయ్య అక్కడే జన్మించాడు. అతను జన్మించిన కొద్దిరోజులకి మా అమ్మగారికి మా కుటుంబం భవిష్యత్తు విషయమై ఆత్రత హెచ్చయింది. మా మేనమామల కుటుంబం కూడా సామాన్యమైన మధ్య తరహా కుటుంబమే. మా అమ్మగారికి వారిపైన ఆధారపడి ఈ సంసారం అంతా అక్కడ ఉంచడం ఎంతో అభిమానంగా ఉండేది. ఆ కాలంలో కుటుంబ నిర్వహణం అంటే చాలా దుస్తరమైన పని. ఉన్న భూమిలోనే సంవత్సరాని కంతకీ కుటుంబానికి కావలసిన ధాన్యాదులూ, దూడలికి కావలిసిన మేతా పండించుకోవలసి వచ్చేది. మా మేనమామల ఊళ్ళోవాళ్ళ స్థితిగతులు నాకు ఇప్పటికీ స్మరణకి వస్తున్నాయి. నేను కూడా తరచు పొలం వెళ్ళి మంచె మీద కాపలా కాస్తూ ఉండేవాణ్ణి. వాళ్ళీ పొలంలోనే నాలుగు మూలలా నాలుగు రకాల తినుబండారపు ధాన్యాదులు -- అంటే జొన్న, పెసర, కంది, మినుము, పరిగె, పత్తి మొదలైనవి -- పండించేవాళ్ళు. అల్లాగ మనుష్యుల కాయకష్టంమీద జీవించవలసిన రోజుల్లో ఒక సంసారంమీద ఇంకొక సంసారం పడడం అంటే మాటలా?

అప్పటికే ఇంగ్లీషు చదువుల ప్రాభవం ప్రారంభమైంది. కాస్త ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరడం, ఇంగ్లీషు పరీక్షలు ఇంటి పేళ్ళవడం ప్రారంభించాయి. అంటే బి.ఏ నారాయణస్వామి, యఫ్.ఏ శేషగిరి అయ్యారు అన్వర్థ నామాలు ఏర్పడ్డాయి. అందుచేతనే మా నాయనగారు మొదటినుంచీ మమ్మల్ని ఎల్లాగైనా ఇంగ్లీషు చదువు చదివించాలనే శ్రమపడుతూ ఉండేవారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అనే పెద్ద సమస్య తేలిపోయింది కనక, మమ్మల్ని ఇంగ్లీషు చదువుల్లో ప్రవీణుల్ని చెయ్యాలని ఆయన కోరిక. మా అమ్మగారు ఆయన కోరిక ఎల్లాగైనా సఫలం చెయ్యాలని సంకల్పించుకుంది. మా నాయనగారు పోయినప్పుడే మా అమ్మగారు "పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవలసి వస్తుందేమో!" అని అంటూఉండేది. అప్పుడు ఆ మాట నా కంతగా అర్థం కాలేదుచ కానీ, ఇంగ్లీషు చదువులు ఉన్న ఒంగోలులో హోటలు పెట్టి, అందువల్ల వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయం చేసినప్పుడే ఆమె మాటల అర్థం నాకు బోధపడింది. ఆ రోజుల్లో హోటలు వ్యాపారం అంటే ఈ రోజుల్లోలాగ గౌరవకరమైన వ్యాపారంగా పరిగణింపబడేది కాదు. ఇప్పుడు హోటలు యజమానులకి సంఘంలో కొంత గౌరవాదరాలు కలుగుతున్నాయి. ఆ రోజుల్లో హోటలు పెట్టుకున్న వాళ్ళంటే సంఘంలో ఎంతో చులకనగా చూసేవారు. అందరూ "పూటకూళ్ళ వాళ్ళు, పూటకూళ్ళ వాళ్ళు" అని చులకనగా మాట్లాడేవారు. కానీ, ఒకరి కుటుంబంమీద ఆధారపడి, వారికి బాధ కలిగించడం కన్న స్వోదరపోషణార్థం, నలుగురికింత అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించింది. ఎల్లాగైనా నాలుగు కాలాలపాటు శ్రమ పడి, తలకాచుకుని, ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. అదే మాతృప్రేమలో ఉండే అమృతం.

బంధువులు కొందరు నిరుత్సాహపరిచినా, మా అమ్మగారు ఆ నాడు సాహసం చేసి, సహాయానికి మా అమ్మమ్మగారిని వెంటబెట్టుకుని మా జానకిరామయ్య పుట్టిన 5,6 మాసాలకే ఒంగోలు చేరుకుంది. ఒంగోలులో అప్పటికే మునసబు కోర్టు ఉండింది. ఆ కోర్టుకి ఎదురుగా నెలకొక రూపాయో, అర్ధో అద్దె ఇచ్చి ఒక ఇంట్లో హోటలు ప్రారంభించింది. అప్పటికప్పుడే మా మేనమామ నన్ను ఒంగోలు తీసుకు వచ్చి గవర్నమెంటు నార్మల్ స్కూలులో లోవర్ ఫోర్తులో ప్రవేశపెట్టాడు. ఆ నాడు ట్రాన్సుఫర్ సర్టిఫికేట్లు మొదలైనవి ఏమీలేవు. ఒంగోలులో స్కూలు అధికారులు నన్ను పరీక్ష చేసి లోవర్ ఫోర్తుకి నేను అర్హుణ్ణని నిర్ణయించారు.

1884 సంవత్సరంలో ఈరీతిగా చదువుకోసం ఒంగోలు చేరుకున్నాము. ఆప్పటికి నా వయస్సు 12 సంవత్సరాలు. అప్పటికి గవర్నమెంటు మిడిల్ స్కూల్లో అప్పర్ ఫోర్తు దాకా చదివాను. అక్కడనించే మిడిల్ స్కూలు పరీక్షకి హాజరై మొదటి తరగతిలో ఉత్తీర్ణుణ్ణయ్యాను.

అప్పటి హెడ్మాస్టరు సుందరశివయ్య అనే ఆయన, కొంచెం చదివితే పనికొచ్చే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా చదువు చెప్పేవాడు. అల్లాంటి వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. అక్కడ కూడా ప్రవర్తన విషయంలో మనకి మామూలు యోగ్యతా పత్రికే సంప్రాప్తమైంది! పోకిరీ పిల్లల సహవాసం, జబర్ దస్తీ, మాష్టర్లని ధిక్కరించడం మొదలైన గుణాలు మన్ని వదలనే లేదు. బొంగరాలు, గోలీలు, మొదలైన ఆటల్లో మనది అందివేసిన చెయ్యి. సామాన్యంగా చెడుగుడు ఆటకి పెండేసి బద్దని నేనే! క్రికెట్టు ఆటలో రెండు జట్లుండేవి. ఒక జట్టులో నా పేరు ప్రధానంగా ఉండేది. ఇంతకీ ఈ ఆటలకి డబ్బు కావాలి గదా! ఆ డబ్బు మన దగ్గిర లేదు. అందుచేత అల్లాంటి వాళ్ళం అంతా కలిసి, చిన్న ముఠాగా చేరి, బజారులో వస్తువులమ్మే వాళ్ళ కళ్ళలో కారం కొట్టి డబ్బు సంపాదించే వాళ్ళము. నిరంతరం ఈ డబ్బు కోసం తడుముకోవడమే ఒక ఆలోచనగా ఉండేది.

ఒక రోజున మా ముఠా అంతా చేరి, "ఈ డబ్బు సంపాదించడం ఎల్లాగా?" అనే ఆలోచనలో పడ్డాము. మా ముఠాలో అద్దేపల్లి అప్పడు అనే అతను మంచి గట్టివాడు. ముఠా కంతటికీ ఏకైక నాయకుడు! మేమంతా కలిసి అతని నాయకత్వం కింద డబ్బు సంపాదించడానికి ఒక పన్నాగం పన్నాము. ఒంగోలికి చేరి వున్న రంగారాయుడు చెరువు కింది పొలంలో వరిగె పండి కోతకి సిద్ధంగా ఉంది. మేము రాత్రి రాత్రి ఆ పంట కోసి, అమ్మి, డబ్బు సంపాదించడానికి నిశ్చయించి, రాత్రి 12 గంటలకి కోత ముగించి, కట్టలు కట్టి నెత్తిన పెట్టుకున్నాము. ఇంతలో ఆ కాపలా వాడికి మెళకువ రావడమూ, వాడు కేకలు పెట్టగా నలుగురూ లేచి మమ్మల్ని పట్టుకోవడమూ జరిగాయి.

అప్పట్లో మా జట్టు నలుగురు. ఆ నలుగురిలో నేనే చిన్నవాణ్ణి. మాలో మస్తాన్ అని ఒక సాహేబుల కుర్రవాడు ఉన్నాడు. మేము కొంతసేపు ధైర్యసాహసాలతో ప్రతిఘటించాము. కాని, చివరికి దొరికి పోయాము. వాళ్ళు మమ్మల్ని పట్టుకుని పోలీసులికి అప్పజెప్పే లోపల మా పెద్దవాళ్ళు నలుగురూ వచ్చి వాళ్ళ పంట వాళ్ళ కిప్పించారు. ఇంతకీ చేను కోతకి సిద్ధంగా ఉంది కదా! ఆ రయితుకి ఖర్చు లేకుండా కోత అయిందని పెద్దమనుష్యులంతా తగాదా తీర్చారు. ఆ దొంగతనం వల్ల కలిగిన న్యూనత మూలంగా మేము ఎవళ్ళం కూడా రెండు రోజుల దాకా ఇళ్ళకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో ముఠాకి 'ఊట్' కంపెనీ అనే పేరు వచ్చింది. నాకు అప్పటికే నవులూరి రమణయ్య అనే ఒక పోకిరీ సహవాసం లభ్యమైంది. వాడి పెత్తండ్రి పురుషోత్తం అనే అతను బాగా వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడు. అతని తమ్ముడి కొడుకే ఈ రమణయ్య. ఇతను తన జబరదస్తీ వల్ల 'కింగ్ ఆఫ్ ఒంగోలు' అనే బిరుదు సంపాదించాడు. వాడు కూడా ఆ పొలం దోపిడీలో ఉన్నాడు.