Jump to content

నా జీవిత యాత్ర-1/అతివాద సంచలనం

వికీసోర్స్ నుండి

24

అతివాద సంచలనం

కాంగ్రెస్ మితవాదుల నాయకత్వానికి స్వాధీనం అయినప్పటినించీ అది చాలా సాధారణమైన లాంఛన వ్యవహారం అయిపోయింది. మరుసటి సంవత్సరం, - అంటే 1908 వ సంవత్సరంలో - మద్రాసులో సమావేశమైన కాంగ్రెసు కేవలమూ జాతీయవాదం మీదనే దాడి ప్రారంభించింది. ఆ సంవత్సరమే లోకమాన్యుడివంటి మహనీయుణ్ణి రాజద్రోహి నేరానికి కారాగారంలో నిర్భంధించారు. పంజాబులోనూ, వంగదేశంలోనూ కూడా నిర్భంధ చర్యలు జోరుగా సాగాయి. ఆనాటి అమృత బజార్ పత్రిక ప్రభుత్వాగ్రహానికి గురిఅయినా ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉండేది. ఏమైనా మద్రాసులో మాత్రం మితవాదానికే ఎక్కువ ప్రాబల్యమూ, పలుకుబడీ ఉండడంచేత నేను అంతగా రాజకీయాల్లో పాల్గొనలేదు. దేశంలో 1914 వరకూ కూడా మళ్ళీ జాతీయవాదుల బలం కనబడలేదు.

1915 లో భారత స్వాతంత్ర్య సమరంలో మళ్ళీ నూతన జాతీయ వికాసం కలిగిందని చెప్పాలి. యూరోపులో యుద్ధం అంటుకుంది. దేశాన్ని రాజభక్తి పరాయణత్వంతో ముంచి తేల్చిన మితవాద నాయకత్వం అంటే అందరికీ విసుగు పుట్టింది. ప్రభుత్వం నిరంకుశత్వమూ, అందులోనూ యుద్ధం రావడంతోటే సైనికులకోసము, ధనంకోసమూ అది అవలంభించిన పద్ధతులూ చూస్తే, దేశీయుల్లో బాగా సంక్షోభం కలిగింది. ఇది ఇల్లా ఉండగా ఆరు సంవత్సరాలపాటు కారాగారం అనుభవించిన లోకమాన్యుడు మళ్ళీ దేదీప్యమానమైన ప్రభతో రాజకీయ రంగంలో ప్రవేశించాడు. 1908 వ సంవత్సరంలో ఆయన్ని శిక్షించినవాడు జడ్జీ ఒక అప్రస్తుత ప్రసంగం చేశాడు. దానికి జవాబుగా ఆయన, "నా స్వాతంత్ర్యం కంటె నా నిర్భంధమే మా దేశానికి ఎక్కువగా శ్రేయస్కరం కాగల,"దని అన్నాడు. ఆయన అన్న మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. దేశం ప్రేమించిన మహాత్యాగికి విధించన ఆరు సంవత్సరాల శిక్ష, ఎవరి హృదయాన్ని ఆందోళన పరచదు! ఇలాంటి స్థితిగతుల్లో అంతకు ముందు సాంఘిక మత విషయాల్లో మాత్రమే పనిచేస్తూ, దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలై ఉన్న బిసెంటమ్మకూడా రాజకీయ రంగంలోకి ఉరికింది. అంతవరకూ ఆమె మత సంబంధమైన గొడవల్లోనే మునిగి ఉండేది. ఆమెకు సహజంగా ఉండిన వాగ్ధోరణీ, నిర్మాణపు నైపుణ్యమూ, రాళ్ళని సహితం చలింపజేసి ఉత్తేజం కలగచేసే శక్తీ రాజకీయ రంగంలో ప్రవేశించాయి. దాంతో మద్రాసులోనే కాకుండా దేశమంతటా కొంత సంచలనం ప్రారంభం అయింది. ఆమె 'న్యూ ఇండియా' అనే పేరుతో దైనిక, వారపత్రికలు నడిపిస్తూ వాటిల్లో చాలా ఉత్తేజకరా లయిన వ్యాసాలు వ్రాసేది.

లోకమాన్యుడు జైలునుంచి తిరిగి రాగానే భవిష్యత్కార్య క్రమాన్ని గురించి యోచించి దేశంలో తీవ్రమైన రాజకీయాందోళనం సాగించడానికి ఒక రాజకీయ సంస్థ నిర్మించాడు. అదే హోంరూలు లీగు. తరవాత కొంతకాలానికి మద్రాసులో బిసెంటమ్మ గోఖలే హాలులో ఒక సమావేశం ఏర్పాటుచేసి, అక్కడ అఖిల భారత హోంరూలు లీగు స్థాపించింది. బిసెంటమ్మకి శక్తి సామర్థ్యాలతోపాటు అధికారం చలాయించే అలవాటు కూడా ఎక్కువ. అందుచేత ఆమె ఒక పట్టున ఇతర నాయకుల వెనక ఉండిగాని, కలిసిగాని పని చెయ్యలేక పోయేది. ఏమైనా, ఈ అఖిల భారత హోంరూలు లీగు స్థాపనవల్ల రాజకీయంగా ఒక గొప్ప చైతన్యం కలిగింది. హైకోర్టు జడ్జీపని చేసి పింఛన్ పుచ్చుకున్న సర్ సుబ్రహ్మణ్యయ్యరు ప్రభృతులు ఈ సంస్థలో చేరారు. దేశంలో ఉన్న దివ్యజ్ఞాన సమాజాలు అన్నీ రాజకీయాల్లో ప్రవేశించాయి. దాంతో తీవ్రమైన జాతీయవాదం విజృంభించింది. ఇంక మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మహాశయుడు అ సంవత్స రంలోనే స్వర్గస్థుడు అయ్యాడు. క్రమంగా మితవాదుల పలుకుబడి జీర్ణించింది.

బిసెంటమ్మ ఆందోళన నన్ను బాగా ఆకర్షించింది. నేను అరందేలు, వాడియాల మోస్తరుగా ఆమె ఆంతరంగికుల్లోగాని, సి. పి. రామస్వామి అయ్యరుగారివంటి అభిమానుల వర్గంలో కాని ఎప్పుడూ చేరలేదు. అసలు అల్లాగ చేరడానికి సంకల్పించుకునే మనస్తత్వమే లేదు. అంతకు పూర్వం మితవాదుల కాంగ్రెస్ నడిచే రోజుల్లో హిందూ పత్రిక సంపాదకులుగా ఉండి అనేక కష్టనిష్ఠురాలకి లోనైన డి. సుబ్రహ్మణ్యయ్యరుగారితో నే నప్పుడప్పుడు ఇష్టాగోష్టి జరుపుతూ ఉండేవాణ్ణి. ఆయనకి ఆఖరు రోజులలో ఆరోగ్యం పాడయింది. కాని, నిష్కళంకమైన జాతీయవాది అవడంచేత ఎప్పుడూ ఆ ఆలోచనలోనే ఉండేవాడు. ఆయనే తరుచు నాతో నాయకుల ఆదర్శాలూ, చిత్తవృత్తులూ ఒక విధంగానూ, ప్రజల అవసరాలూ, ఆశయాలూ మరి ఒక విధంగానూ నడుస్తూ ఉన్నాయి అని అంటూ వచ్చేవాడు. బిసెంటమ్మ ప్రవేశంతో నాయకుల చిత్తవృత్తి కొంచెం ప్రజల వైపుకి మారిందని చెప్పాలి.

బొంబాయి రాష్ట్రంలో లోకమాన్యుడి ఆందోళనా, మద్రాసులో బిసెంటమ్మ కలిగించిన సంచలనమూ, యుద్ద తీవ్రతా, ఆ సందర్భంలో బ్రిటిష్ పాలకులు చూపిన నిరంకుశత్వమూ కలిసి జాతీయోద్వేగానికి కారణా లయ్యాయి. మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మరణంతో వాళ్ల పలుకుబడి కూడా క్షీణించింది. ఇంతే కాకుండా, రాజకీయ సంస్కరణలు కొన్ని వస్తాయనీ, అందునిమిత్తమై మాంటేగ్ ఈదేశం వస్తాడనీ బాగా వార్తలు వ్యాపించి ఉండడంచేత కూడా రాజకీయ వాతావరణంలో వేడి తీవ్రం అయింది.

లోకమాన్యుడు కారాగారంనించి రావడంతోనే దేశంలోని ప్రముఖులు కొందరు కాంగ్రెసు అతివాద, మితవాద కక్షలుగా చీలడం దేశానికి క్షేమం కాదని రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. కాని, సాగలేదు. చివరికి గోఖలే అనంతరం ఈ ప్రయత్నం కొంతవరకు సాగి లోకమాన్యతిలక్ ప్రభృతులు కాంగ్రెస్‌లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. 1919 వ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ పునస్సమ్మేళనం జరిగింది. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక మహాఘట్టం. నేను మహమ్మదీయుల ఆందోళనను గురించి ఇది వరకే వ్రాశాను. మహమ్మదీయులు ఆనాటి కాంగ్రెస్ రాజకీయాలద్వారా ప్రభుత్వ ప్రాపకం పొందుతూ వచ్చిన హిందువులకి పోటీగా ప్రత్యేక ఎన్నికస్థానాలూ, ప్రత్యేకోద్యోగాలూ కావాలనీ ఆందోళన ప్రారంభించారు. 1919 లో ముస్లింలీగుకీ, కాంగ్రెస్సుకీ ఒక రాజీ జరిగింది. లోకమాన్యుడు మహమ్మదీయులకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అన్నాడు. తాత్కాలికంగా హిందూ ముసల్మానులకి ఈరాజీ జరిగినప్పటికీ దూరదృష్టితో చూస్తే యీ రాజీయే మన రాజకీయమైన అనైకమత్యానికీ, పతనానికి మూలకారణం అయిందని నా అభిప్రాయము. మనల్ని నేటివరకూ హింస పెడుతూన్న ప్రత్యేక నియోజకవర్గాల సిద్ధాంతాన్ని ఆనాడు కాంగ్రెస్ అంగీకరించడంవల్లనే ఆ సిద్ధాంతం తాడుబారింది.

అప్పటి కప్పుడే భారత ప్రభుత్వం దేశంలోని రాజకీయాందోళకుల పోకడలు గమనించి, కొన్ని సంస్కరణలు ఇవ్వడంకోసం ఒక ప్రణాళిక తయారుచేసింది. కాంగ్రెస్సూ, లీగూ ఏకం అయి దానికి బదులుగా ఒక సంస్కరణ ప్రణాలిక తయారుచేసి పంపించారు. రాజకీయాల్లో అదే కాంగ్రెస్ లీగు ప్రణాళికగా ప్రసిద్ధిపొందింది. నేడు ఆ ప్రణాళిక చదివితే యీ నాటి స్వాతంత్ర్యాశయాలకి అది ఎంతగా కొరవడి ఉందో వేరుగా చెప్పక్కరలేదు. కాని, అక్కడికే ఆ సంస్కరణలు చాలా తీవ్రమైనవీ, అసంభమైనవీ అని చెప్పి తోసివేశారు.

జాతీయవాదుల పలుకుబడి హెచ్చడడంతో దేశంలో కలిగిన సంచలనం నన్ను ఆకర్షించింది. నేనుకూడా బిసెంటమ్మ హోంరూలు లీగులో చేరాను. ఆరోజుల్లో గోఖలేహాలులో జరిగే సభలకి హాజరౌ పాల్గొంటూ ఉండేవాణ్ణి.

1917 వ సంవత్సరంలో రాజకీయాందోళన మరింత తీవ్రం అయింది. ముఖ్యంగా బిసెంటు న్యూ ఇండియా పత్రిక ద్వారా మద్రాసురాష్ట్రంలో ఆందోళన మరింత తీవ్రరూపం ధరించింది. యీ ఆందోళన పర్యవసానంగా దేశంలో అంతటా నిర్భంధ విధానం తాండవించింది. చివరికి, బిసెంటమ్మ ముఖ్యశిష్యులైన అరండేలు, వాడియా గార్లని 1917 జూన్ 15 తేదీని ఉదకమండలంలోనూ, కోయంబత్తూరులోనూ నిర్భందించారు. రాజకీయాందోళనకి ఎప్పుడూ నిర్భంధ విధానమే గొప్ప సహాయకారి, మహత్తరమైన దోహదం! అదుచేత ఈ నిర్భంధాలు మరింత ఆందోళనకీ, సంచలనాలకీ కారణం అయ్యాయి. మళ్ళీ రాజకీయరంగంలో కొత్త కొత్త తారలు కనిపించాయి. నా మిత్రుడు పి. పి. రామస్వామయ్యరు ఆ వర్గంలోవాడు. బిసెంటమ్మ రాకతో ఆయనకూడా కాంగ్రెస్‌లో ప్రముఖస్థానం ఆక్రమించాడు.

ఆమె ఆందోళనసందర్భంలోనే సాత్విక నిరోధం అనే సాధనంతో ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదుర్కొనాలి అనే భావం ప్రచారం అయింది. మద్రాసు రాష్ట్ర కాంగ్రెసు సంఘంవారు సాత్వికనిరోధ కార్యక్రమం ఆమోదించి ఒక ప్రమాణంమీద దస్కత్తులు చేయించారు. ఆ ప్రమాణాలమీద దస్కత్తులు చేసినవాళ్ళలో సర్ యస్. సుబ్రహ్మణ్యయ్యరుగారు, పి. పి. రామ స్వామయ్యరు గారు, కస్తూరి రంగయ్యగారు మొదలైన ప్రముఖులు చాలామంది ఉన్నారు. కాని, నాకు మాత్రం ఎందుచేతనో ఆ కార్యక్రమం జరుగుతుందనే నమ్మకం కలగలేదు. ఆ ప్రమాణపత్రంమీద నేను దస్కతు చెయ్యలేదు. తరవాత 1916 లో గాంధీజీ సత్యాగ్రహ ప్రమాణాలు చేయించి నప్పుడు దస్కతుపెట్టాను. నాకు బిసెంటు ఆధ్వర్యంకింద జరిగిన వ్యవహారంలో పని జరిగే ధోరణి కనిపించలేదు. మొత్తంమీద దేశంలో ప్రస్ఫుటంగా పెరుగుతూ ఉన్న తీవ్రరాజకీయాందోళన ప్రభుత్వానికి కొంత కంగారు పుట్టించింది. లండన్ ఢిల్లీల మధ్య బోలెడు గ్రంథం నడిచింది. ఇండియామంత్రి మాంటేగ్ ఆగష్టు 20 తేదీని ప్రఖ్యాతమైన తన ప్రకటన వెల్లడించాడు. అందులో బ్రిటిషువారు ఇండియాకి క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వం ఇవ్వడానికే సంకల్పించారనీ, పార్లమెంటు ఎదట పెట్టబోయే సూచనలు చర్చించడానికి ప్రజలకి అవకాశం ఇస్తారనీ ప్రకటించాడు. అన్నింటికన్నా ముఖ్యం అయినది అతను ఈ దేశానికి వచ్చి ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుంటానని కావించిన ప్రకటన. ఈ ప్రకటనతోపాటు సెప్టెంబరు 16 వ తేదీని బిసెంటు ప్రభృతుల్నికూడా విడుదలచేశారు.

మాంటేగ్ రాక రాజకీయ సంస్థల్లో ఎక్కడాలేని సంచలనమూ కలిగించింది. కాంగ్రెస్ తాత్కాలికంగా సంకల్పించిన సాత్విక నిరోధ సంకల్పం ఉప సంహరించుకుంది. నిర్భంధంనించి వచ్చిన బిసెంటమ్మే దాని ప్రసక్తి విడిచిపెట్టింది. దేశంలోని ఇతర రాజకీయసంస్థలు రాజ్యాంగ ప్రణాళికలు తయారుచెయ్యడంలో మునిగిపోయాయి. అది వరకులేని అనేక కొత్త సంఘాలు కూడా బయలుదేరాయి. ఈ కొత్త సంఘాలలో మనరాష్ట్రానికి ముఖ్యమైనది బ్రాహ్మణేతర మహాసభ.

బ్రాహ్మణేతర పక్షానికి ప్రధాననాయకుడు డాక్టరు టి. యం. నాయరు. ఆయన చాలా సరసుడు. ట్రిప్లికేసుడివిజనుకి కార్పొరేషను సభ్యుడు. ఆయన ప్రజల ఆరోగ్యవిషయాల్లో ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉండేవాడు. తిరువళిక్కేణి డివిజన్‌లోని చెరువుల్లో బట్టలు ఉతికి అనారోగ్యం కలిగించడంచేత ఆయన పై పనులు నిషేధిస్తూ ఉత్తరువులు జారీ చేశాడు. దాంతో ట్రిప్లికేనులోని అయ్యర్లు, అయ్యంగార్లు ఆయనమీద కక్షకట్టి మరుసటి కార్పొరేషన్ ఎన్నికలలో ఆయన్ని ఓడించారు.

ఆ తరవాతే, ఆయన బ్రాహ్మణేతరపక్షానికి నాయకుడు అయ్యాడు. ఇతర బ్రాహ్మణేతర నాయకుల్లో చాలామంది కాంగ్రెస్ అభిమానులే. అంతకుపూర్వం కాంగ్రెస్సు నాయకుల రాజకీయ జీవితానికి ఒక మెట్టుగా ఉండేది. ఇల్లా మెట్లెక్కినవారిలో ఎక్కువమంది అయ్యర్లు, అయ్యంగార్లే. అందుచేత ఈ బ్రాహ్మణేతరోద్యమం ప్రారంభం అయింది. దానికి బ్రాహ్మణులైన కొందరు రాజనీతిజ్ఞుల సంకుచితదృష్టికూడా సహాయపడింది. మాటవరసకి వ్రాస్తున్నాను. బ్రాహ్మణేతర నాయకులు ప్రత్యేక నియోజక వర్గాలు కోరారు. నూటికి 97 గురు ఉన్న బ్రాహ్మణేతరులు ప్రత్యేక నియోజకవర్గాలు కోరుకోవడమే ఒక అవ్యక్తపు పని! దాన్ని ప్రతిఘటించిన రామచంద్రరావు పంతులు, కస్తూరి రంగయ్యగార్లు ఆ పక్షపు అవశ్యకత సమర్ధించిన వాళ్ళు అయ్యారు.