నా జీవిత యాత్ర-1/బిసెంటమ్మ హోంరూలు ఉద్యమం
23
బిసెంటమ్మ హోంరూలు ఉద్యమం
1909 వ సంవత్సరంలో బ్రిటిష్‌వా రిచ్చిన మింటో - మార్లే సంస్కరణాలు 1919 లో తిరిగి సంస్కరింపబడవలసి ఉన్నాయి. అంతేకాక, దేశంలో విప్లవ సంస్థలు, విప్లవ భావాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అందుచేత భారత సమస్య పరిష్కరించడానికి బ్రిటిష్ మంత్రులు హిందూదేశానికి రావా లని ఉద్దేశించారు. ఈ కాలంలో దేశంలో స్వాతంత్ర్య భావాలు ప్రసరింప జేసిన కీర్తి ముఖ్యంగా బిసెంటమ్మకీ, లోకమాన్యుడికీ దక్కింది.
లోకమాన్యుడు 1914 సంవత్సర ప్రాంతంలోనే మాండలే జైలులో ఆరు సంవత్సరాల శిక్ష అనుభవించి తిరిగి పూనా చేరుకున్నాడు. పశ్చిమ భారత దేశంలో ఆయన, దక్షిణ దేశంలో బిసెంటమ్మ ఏకమై హోంరూలు (స్వపరిపాలన) అనే ఉద్యమం లేవదీశారు. బిసెంటమ్మ వెనకాల దేశంలో అంతటా దివ్యజ్ఞాన సంఘాలు ఉండేవి. అ సంఘాల్లో ఉండే వారందరూ సమర్ధులు. ఆందోళన శాస్త్రీయ పద్ధతులమీద నడిపించడంలో అందెవేసిన చేతులు. లోకమాన్యుడికి మహారాష్ట్ర దేశంలోనూ, మధ్య రాష్ట్రాలలోనూ బ్రహ్మాండమైన పలుకుబడి ఉండేది. ముందుముందు బిసెంటమ్మ మనరాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిన సేవని గురించి వివరిస్తాను.
దేశంలో రాబోయే సంస్కరణాలలో స్వపరిపాలన సిద్ధాంతం పూర్తిగా ప్రవేశ పెట్టడానికి ఆందోళన జరుగుతూ ఉండగా, ఈ జాతీయ ప్రవాహానికి అనేకమైన అనకట్టలు బయలుదేరాయి. అందులో ఒకటి హిందూ మహమ్మదీయ సమస్య. రెండవది మద్రాసు రాజధానిలోని బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్య. పేర్లని బట్టే వాటివాటి ఆదర్శాలు తెలుస్తున్నాయి గదా!