నా కలం - నా గళం/నా ముందుమాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నా ముందు మాట

"నన్ను ఆత్మ కథ రాయాలని పదే పదే పెద్దలు - డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గర నుంచి నా సన్మాన సభలలో పాల్గొన్న ప్రముఖు లెందరో ఎప్పటి కప్పుడు నాపై ఒత్తిడి తెస్తూనేవున్నారు. అయితే, 'ఆత్మ కథ రాయడానికి అంత కథ నావద్ద లేదే!' అని ఆ పెద్దలతో వినమ్రతతో చెబుతూ వచ్చాను!

కాని, ఇటీవల జర్నలిస్టు మిత్రులనేకమంది, కొందరు రాజకీయ ప్రముఖులు "ఎందరో రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులతో మీరు కలిసిమెలిసి తిరిగారు. ప్రధానులు, ముఖ్యమంత్రులందరితో మీకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సందర్భంగా మీకు ఎన్నో అనుభవాలు, ఆసక్తికర సంఘటనలు ఎదురై వుంటాయి. మీకు మాత్రమే తెలిసి, ఇతరులకు తెలియని ఎన్నో వింతలు, విశేషాల భాండాగారం మీ వద్ద వున్నది. అవి ఎవ్వరికీ తెలియకూడదనా మీ వుద్దేశం? అవి మీకు మాత్రమే పరిమితం కావాలనా మీ అభిప్రాయం? మీ "తదనంతరం" వాటిని ఎవరు చెప్పగలరు?" అంటూ వచ్చారు.

కాగా, ఇటీవలనే నేను ఒక పెద్దల సమావేశంలో "ఆంధ్రపత్రిక" మాజీ సంపాదకులు, 90 సంవత్సరాల పాత్రికేయ భీష్మాచార్యులు శ్రీ మద్దాలి సత్యనారాయణ శర్మ గారిని, ఇంకా దాదాపు అదే వయస్సులో వున్న పాత్రికేయ ప్రముఖులను, మేధావులను కలిశాను. అక్కడ పిచ్చాపాటి మాట్లాడే సమయంలో వారికి జ్ఞాపకంలేని, రాని కొన్ని విషయాలను నేను అందించేసరికి శ్రీ శర్మ గారు "అలాంటి, అందరూ మరచిపోయిన సమాచారాన్ని, విశేషాలను మీరే చెప్పగలరు. మీరు ఆత్మకథ రాస్తే, మా అందరికీ ఎంతో ఉపయోగకరం కాగలదు" అనే సరికి నేను " నా కథ ఏ పాటిదని ఆత్మ కథ రాయమంటారు?" అని మళ్లీ పాత ప్రశ్ననే వేశాను! "మీరు ఎంతో చరిత్ర సృష్టించారు! మీ చరిత్ర కాకపోయినా, మీరు సృష్టించిన చరిత్రనే "చరిత్రకారుని చరిత్ర" అన్న పేరుతో రాయండి". అని శర్మ గారు సమాధానమిచ్చారు! ఆ సమావేశ ఫలితమే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రశ్నల రూపంలోనే మిగిలిపోయిన నా స్వీయ గాథ ఈ గ్రంథంరూపం ధరించింది.

అయితే, ఇది కేవలం నా "ఆత్మ కథ" కాదు. అలా అని ఇందులో నా స్వవిషయాలు బొత్తిగా లేకపోతే బాగుండదని, నా వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవాలని కోరే ఆత్మీయులు కొందరైనా వుంటారని, అక్కడక్కడ నా స్వ విశేషాలు కూడా దీనిలో చొప్పించం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించిన నా పాత్రికేయ, ఉపన్యాసక జీవితంలో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలు, ఘట్టాలను మాత్రమే పేర్కొంటున్నాను.

ఈ 65 సంవత్సరాలుగా నా జర్నలిస్టు జీవితంలో అలాంటి ఆసక్తికర సంఘటనలు వందలాదిగా వుండవచ్చు. వాటినన్నింటిని క్రమ పద్ధతిలో, వరుసగా రాయడం కూడా సాధ్యం కాదు. వెనుక జరిగినవి ముందు, ముందు జరిగినవి వెనుక - వరుసక్రమంతో సంబంధం లేకుండా ఆ సంఘటనలు దర్శనమిస్తాయి. నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ సంఘటనలను గ్రంథస్థం చేస్తున్నాను. కొన్ని చోట్ల అనివార్యంగా పునరుక్తులు కూడా వుండవచ్చు. ఈ గ్రంథస్థమైన సంఘటనలు నాకు తెలిసినవీ, జ్ఞాపకమున్న వీ కొన్ని మాత్రమే. వీటికి రెట్టింపు నాలో మిగిలిపోయి వుండవచ్చు. అందుచేత, ఇది ముగింపు కాదు; ఇది అంతులేని కథం! దీని ముగింపు నాతోనే!

ఎంతో కాలంగా ఈ కథంకు గ్రంథరూపం ఇవ్వాలని అనుకుంటు న్నప్పటికీ, నా జర్నలిస్టు జీవిత వజ్రోత్సవం సందర్భంగా నా జ్ఞాపకాలకు, అనుభవాలకు అక్షర రూపమివ్వగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాను. ఈ కథ భారత స్వాతంత్య్రానికి పూర్వం - 20వ శతాబ్ది ఆరంభంలో ప్రారంభమై, 21వ శతాబ్దిలో కూడా "నడుస్తున్న కథ" కావడం విశేషం. అది భగవత్కృప. అందువల్ల, ఈ ఆరున్నర దశాబ్దాల చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి, అవి కొందరికైనా ఆసక్తి కలిగించవచ్చు. వాటి నుంచి నావలెనే కొందరైనా గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మానవ మనస్తత్వాలను గురించి తెలుసుకోవచ్చు.

ఈ "ఆత్మకథనం" వెలుగు చూడ్డనికి నన్ను ప్రోద్బలించిన అగ్రిగోల్డ్‌ అధినేత శ్రీ వి.ఆర్‌. రావు అవ్వాస్‌ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.

నా "ఆత్మకథ" రాయవలసిందిగా చాలాకాలంగా పదే పదే నన్ను ఒత్తిడి చేస్తున్న యువమిత్రుడు శ్రీ గారపాటి అశోక్‌ కుమార్‌కు నా శుభాశీస్సులు.

ఇక చదవండి!