నారాయణరావు (నవల)/ప్రథమ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రథమ భాగము

౧ ( 1 )

“నీకు పెండ్లి అయినదా?”

“ఏదియో పడిపోయినట్లు అలపెరుంగని మహావేగమున ఈ లోక మంతయు ఎచటి కిట్లు పరువెత్తిపోవుచున్నది! కనులు మూసికొన్న చో వెనుక కేగుచున్నట్లు తోచు నీ లోకము, నిజముగా ముందుకే పోవుచున్నదా? ఈ ధూమశకట మతిరయమున బరువిడుచుండ, ఆ వృక్షములు, పొదలు వెనుక కేగుట యేమి! ఆ తారకలతోడి, మబ్బులతోడి మహాగగనము కదలకుండుటయేమి! ఇది యంతయు భ్రమయనుకొని నవ్వుదమా, నిజమనుకొని అచ్చెరువందుదమా!”

“అనేక కోటి యోజనముల దవ్వున దీపకళికలవలె మినుకుమినుకుమను నా నక్షత్రములు, ఈ గ్రహగోళములు, ఈ మట్టిముద్దపై ప్రాకులాడు మనుజ కీటకములకొఱకే దివ్వటీలు పట్టుచున్నవా! కోటి సూర్యోజ్జ్వలములగు తారకలు, వాని నాశ్రయించిన గ్రహములు నివియెల్ల ఎవరి నిట్లు వెదకికొనుచు పోవుచున్నవి? ఛందస్సులను దర్శించిన మన మహర్షులు ఈ పరమార్థమును ఎంత చక్కగా గానము చేసిరి!

“ఈ తారకలుకూడ సంగీతము పాడునట. అవి ఏ మహాభావమును గానము చేయుచున్నవో! బెథోవిన్, త్యాగరాజు మొదలైన గాయకులు ఆ మహాభావము నేనా తను గాంధర్వమున ప్రతిఫలింపజేయుచున్నది?”

వ్యక్తావ్యక్తమగు తన యాలోచనముల నుండి మరలి నారాయణరావు రైలు కిటికీ నుండి తల వెనుకకు దీసి, ఆ యింటరుతరగతిలో మైమరచి నిద్రించుచున్న స్నేహితుల పారజూచినాడు. మెయిలు అమిత వేగముతో కృష్ణానది వంతెన దాటి బెజవాడ స్టేషను సమీపించినది.

‘ఒరే సుషుప్తి కుమాళ్లు! లెండి! బెజవాడ వచ్చాము. ఒకటే నిద్దరా! లెండర్రా!’ అని నారాయణరావు తన స్నేహితుల నిద్దురలేపినాడు. కన్నులు నులుముకొని, చిరునవ్వునవ్వుచు పరమేశ్వరమూర్తి లేచి, ఇటు నటు పరికించి, ఆవులింత లడచుకొనుచు, ఒడలు విరిచికొనుచు ‘ఓహో డాక్టరుగారు! లేవరోయి! నిద్ర పారిపోయేందుకు కాఫీఅరఖు, ఇడ్లీమాత్ర సేవిద్దువు గాని’ అని రాజారావును ఒక చరపు చరచినాడు.

రాజారావు లేచి, కోపము నభినయించుచు, ‘ఓయి బక్కవాడా నీవటోయి!’ అని పరమేశ్వరుని ప్రక్కమీద పడవైచి యదిమిపట్టినాడు.

‘ఓరి పాపిష్టిగ్రహం! బక్కాళ్లమీదా నీ బాహుబలం!’ అని ప్రక్క మీద దొర్లుచున్న రాజేశ్వరుడు లేచి, రాజారావును గబగబ రైలు తలుపు వైపుకు గెంటుకొనిపోయినాడు. ‘నారాయణా! అలారం లాగరా! హత్య, హత్య! పోలీసు పోలీసు’ అంటూ లక్ష్మీపతి గొలుసును లాగబోయినట్లు నటించినాడు.

‘మీరంతా ద్వంద్వయుద్ధాలలో వీరధర్మం నిర్వర్తించండి, నేను ముఖప్రక్షాళనాది ప్రాతఃకాలోచితకృత్యంబుల నిర్వర్తించెదను గాక!’ అని నవ్వుచు నారాయణరావు బిఱ్ఱబిగిసికొని గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న మరియొక మిత్రుని ‘అరే మహమ్మదు ఇబిన్ ఆలం సుల్తాన్ అబ్దుల్ రజాక్ పాదుషాహా సాహెబు వారూ! లెండి. మీకీ వైతాళికులు లేరు! రాజ్యం గీజ్యం బూది అయితున్నాయి జహాఁపనాహ!’ అని లేపినాడు.

ఆలం నిద్దుర లేచి ‘ఏమి తొందర రా!’ అనుచు మొగము కడుగుకొనుటకు సిద్ధమయ్యెను. నారాయణరావు తన పనులు నిర్వర్తించుకొని ఉపహారములు కొనిరా వెడలిపోయి నాడు.

ఆ యువకమండలి అంతయు పక్కలు చుట్టుకొని, సామాను సద్దుకొను లోపల నారాయణ వచ్చి ‘ఏమర్రో ఇడ్లీ, ఉపమా, కాఫీ, పూరీ, ఉర్లకళంగ్ ప్రత్యక్షమౌతున్నాయి. సేవించటానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారా?’ అని హెచ్చరించి, అవి తెచ్చిన కూలీకడనుండి అందిపుచ్చుకొని, ఆయా సరకులను బల్లలపై నమరింప ప్రారంభించినాడు.

లక్ష్మీ: నాకు ‘చా’ తెచ్చావురా?

రాజా: లేదు రా; ‘చీ’ తెచ్చాడు.

ఆలం: తురకవాణ్ణి నాకే ‘చా’ అక్కర్లేదు, యీడికి ఎందుకోయ్ ‘చా’? తుమ్ చీనావాడా ఏమిరా భాయ్?

పక్క బండివారు మెయిలిక్కడ అరగంటవరకు ఆగుననియు, గవర్నరు గారి స్పెషలు చెన్నపట్టణము వెళ్లుచున్నదనియు చెప్పికొనుట విని, ‘ఓరి నాయనా! చెట్లు మొలవాలి రా, బాబూ!’ అనుకొనుచు మన మిత్రులందరు ఉపాహారముల నారగించి కాఫీ తాగినారు. ‘త్రీకాజిల్సూ సిగరెట్లడబ్బాలు తీసి, సిగరెట్లు వెలిగించి ధూమపానలోలు లైనారు.

నారాయణ రావు ‘పుస్తకాలు ఏవన్నా పట్టుకువస్తానురా? అని హిగిన్ బాదమ్ పుస్తక విక్రయశాలకడకు విసవిస నడచిపోయినాడు. గవర్నరు గారి ప్రయాణసందర్భమున గావలియున్న పోలీసు వారు ఆయుధోపేతులై అన్ని వైపుల పహరా ఇచ్చుచున్నారు. ఫలహారపుశాలకడ వారిబండి ఆగును. కాన అచ్చట నేరును రాకుండ బందోబస్తు చేసినారు. గవర్నరు గారికి స్వాగత మిచ్చుటకు కృష్ణా కలెక్టరుగారు, పురప్రముఖులు, ఉద్యోగస్థులు మొదలగువారు పూలదండలతో, సన్మానపత్రములతో నిరీక్షించుచున్నారు.

నారాయణరా వీదృశ్యమంతయు జూచుచు పుస్తకశాలకడ నాలోచనా నిమగ్నుడై నిలుచుండిపోయినాడు. నారాయణరా వాజానుబాహుడు, అయిదడుగుల పదనొకండంగుళముల పొడవువాడు. బలసంపదకు నెలవైనవాడు. ఉజ్జ్వల శ్యామలుడు, చిన్నవై, తీక్ష్ణమైన లోచనములు. తీరై, సమమై కొంచెము పొడుగైన ముక్కు దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనుస్సువలె తిరిగిపోయిన పై పెదవికి నాతిదూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీజాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదై యున్నది. ఆ లోపమును ఉత్తమనాయక లక్షణమగు నామ్రచిబుకము దృఢరేఖాచకితమై ధీరత్వము పుంజీభవింప జేయుచు తీర్చివేసినది.

నారాయణరావు కుడి చేతి చూపుడు వ్రేలితో నడుగు పెదవిని నొక్కుకొనుచు, బొమలు ముడిచి, విశాలఫాలము, వీచికల నిండిన పాలసముద్రమట్లయి పోవ, పరధ్యానములో మునిగిపోయినాడు.

ఉన్నట్లుండి తన్ను ఎవరో తీక్ష్ణదృష్టుల చూచుచున్నట్లు కాగా, ఆలోచనలు మరల్చుకొని ఎదుట నిలుచుండి తన్ను వింత చూపులతో గమనించు నొక పెద్దమనుష్యుని పరికించినాడు. నారాయణరావు తనలో నవ్వుకొనుచు ప్రక్కనున్న పుస్తకముల గమనించుచుండ, ఆ నూతనవ్యక్తి ‘ఆగండి’ అని చేయి యెత్తినాడు. బంగారపు పొన్ను కర్ర విలాసముగ నాడించుకొనుచు ఆ మూర్తి నారాయణరావుకడకు వచ్చెను.

‘మీ పే రేమిటండి?’

‘నారాయణరావు.’

‘ఇంటి పేరు?’

‘తటవర్తి వారు.’

‘మీ గోత్రం?’

‘కౌండిన్యస.’

‘మీకు వివాహమైందాండి?’

‘...........’

ఈ సంభాషణమంతయు ఇంగ్లీషులోనే జరిగినది.

‘అయ్యా! నారాయణరావుగారూ! నా కీ అనవసరమైన చోద్యం ఎందుకని మీ రనుకుంటున్నా రేమో! మిమ్మల్ని చూడగానే మీకు వివాహం కాలేదని నా అంతరాత్మ చెప్పింది. అందుచేత ఈ వెర్రి ప్రశ్నలు వేసినాను. వీరెవరా అని మీరు అనుకోవచ్చు. గవర్నరుగారి రాకకు వేచిఉన్న బృందంలో నేనొకణ్ణి. నన్ను తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు అంటారు. నేను మిమ్మల్ని అడిగిన ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వవలెనని నా మనవి. నా ఊహ సరియైనదా కాదా అని తెలిసికొన కుతూహలపడుతున్నాను.’

‘నాకు వివాహం కాలేదండి’ అని చిరునవ్వుతో నారాయణరావు జవాబు చెప్పినాడు. ఈయనయేనా విశ్వలాపురం జమీందారుగారు, రాజధాని శాసనసభలో మెంబరు, అనుకున్నాడు నారాయణ రావు.

‘గవర్నరుగారి బండి ఇంకా పదిహేను నిముషములవరకూ రాదులెండి. ఇప్పుడెక్కడినుండి వస్తున్నారు?’ అని జమిందారుగారు ప్రశ్నించారు.

‘చెన్నపట్టణాన్నుంచి స్నేహితులూ నేనూ కలిసివస్తున్నాం. సెలవిప్పిస్తారా?’ అని నమస్కరించి, మర్యాదలువెలుగు చూపులు మరలించి పుస్తకశాల చేరినాడు.

స్నేహితులందరును ప్లాటు ఫారంపై తిరుగుచున్నారు. గవర్నరుగారిని చూచుటకు రాజమహేంద్రవరంలో వీలు ఏలలేకపోయినదో వీరికి? ఈయన శాసనసభలో స్వరాజ్యపార్టీలో జేరి, నిపుణతతో ప్రభుత్వతంత్రమును చిందర వందరచేయుచు తనకు తోచినవిధమున దేశసేవ జేయుచున్నాడు. నిజమే కాని ఎవరయినను శాసనసభలకు వెళ్ళి చేయదగిన దేమున్నది? ఈ రాజనీతి నిపుణుడు అంత అప్రౌఢముగా తన్ను ప్రశ్నించినాడేమి? అని అనుకొనుచు నారాయణరా వేవో కొన్ని నవలలు, తదితర గ్రంథములు కొని తన పెట్టె జేరినాడు.

మిత్రు లెవ్వరును పెట్టెలో లేరు. నారాయణునకు మనస్సు పుస్తకముల మీద లగ్నము కాదు. జమీందారుడు, ఆశాకాంతులు వెలుగు ఆతని కన్నులు, దీనమైన అతని ఆఖరిప్రశ్న తలంపుకు వచ్చినవి. ఆయనకడ ఎంత రాజఠీవి యున్నది! స్వార్థపరులై అపహాస్యపు జీవితముల జీవించు అనేకులవలె గాక, ఈయన స్వరాజ్య సముపార్జన మహాయజ్ఞమునందు తానును ఒక ఇంధనమును అప్పుడప్పుడు వేయుచునే యున్నాడు.

‘ఏడీ నారాయడు! ఓరి ఇడుగోరా!’ అని గబగబ స్నేహితులందరు వచ్చి పెట్టె నెక్కినారు.

౨ ( 2 )

రైలు కూడా తథాస్తన్నది?


‘ఒరే నారాయడూ! ఏమైపోయినావురా నువ్వు? గవర్నరుగారి నాహ్వానించి సమ్మానపత్రాలు సమర్పించి సాగనంపివచ్చాము మేమంతా. నువ్వు జాతీయవాదివి. అవును. గవర్నరుగారికి దర్శనమివ్వవు. ఆ మాట మరచి పోయినాం’ అంటూ రాజేశ్వరరావు నారాయణుని చేతిలోని గ్రంథము అందిపుచ్చుకొని పేర్లు చూచుచు ‘అన్నట్లు మా జమీందారుగారు గవర్నర్ని ఇంటర్వ్యూ చేశారిక్కడ. ఆయనకు కనిపించావటగా నీవు!’ అని ప్రశ్నించెను.

అంతలో పరమేశ్వరు డందుకొని ‘అవును, ఆయన ఏమిటో నీ భోగట్టా తెగ విచారిస్తున్నాడు!?’

నారాయణరావు చిరునవ్వుతో ‘మరి నేనేమి సామాన్యుడ ననుకున్నావుటరా! నేను కూడా ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చాను’ అనెను.

రాజా: నువ్వు పెటగోనియనువురా బాబూ! సామాన్యుడ వెందుకవుతావు?

రాజే: నీ గోత్రం కూడా అడిగాడు రా! ఎందుకో?

నారా: పెటగోనియనులకు గోత్రము ఉండదనుకున్నాడేమో?

రాజే: లక్ష్మీపతి చెప్పాడు, మీది కౌండిన్యసగోత్రమని.

ఆలం: కాదురా భాయి. ఆయన నీకీ నిఖ్కా సేస్తాడు రా.

నారా: నీ మొఖం, ఆయన సాయిబు గాదురా, మొగాడికి నిఖ్కా చేయడమా!

రాజే: అవునురోయి! ఆయనకో కూతురుందిరా. ఆ పిల్ల కింకా పెళ్ళి కాలేదు. నిజమే.

పర: ఇక నేమి! నారాయుడి రొట్టె నేతిలో పడింది.

రాజా: నారాయుడి రొట్టెకాదు, నాదీని. నేనింక హిజ్ హైనెస్ విశ్వలాపురం జమీందారుగారికి స్టేటు డాక్టర్నవుతాను.

రాజే: ఒరే బాబూ! నారాయుడు! నన్ను కూడా కాస్త కని పెట్టి ఉండాలిరా. మామగారికి సిఫార్సుచేసి నన్నుకూడా స్టేటు ఇంజనీరుగా పారేయించు.

నారా: ఏడిశారులే వెధవల్లారా! మీలో ఒకడూ ఇంకా పరీక్షకైనా కూర్చోలేదు. అప్పుడే ఉద్యోగాలు! మామగారి యెస్టేటులో మిమల్నెవళ్లనీ అడుగైనా పెట్టనివ్వను, ఒక్క పరమేశ్వరుణ్ణిమట్టుకు ఆస్థానకవిని చేస్తాను.

రాజే: సెబాస్! చూస్తావేమిరా ఇంకా, పరమేశ్వరుడూ! ఏదీ రాజ జామాతమీద ఒక కీర్తన పాడరా!

పరమేశ్వరమూర్తి లేచినిలిచి ఆశీర్వచనముద్ర పట్టి గొంతు సవరించు కొంటూవుండగా, రాజేశ్వరరావు ‘ఆగరా పరమాయి! మరచిపోయాను. బంగారపు బొమ్మ, పచ్చకర్పూరపు బరిణలాంటి పెళ్ళికూతుర్ని విడిచిపెట్టి, యీ మొరటు నారాయుడిమీద పాటపాడటానికి వల్లగాదు. చేయరా, ముందు వధుకీర్తనం చేయి’ అన్నాడు.

‘అచ్చా! సభవారి అనుజ్ఞా?’ అని అడిగి పరమేశ్వరమూర్తి,

‘యెంకివంటి పిల్ల లేదోయి, లేదోయి!
యెంకి నావం కింక రాదోయి, రాదోయి!’

అని పాడునప్పటికి రాజారావు, ‘చాల్లేవోయ్, నీ అశుభప్పాటలు’ అని వారించినాడు. పరమేశ్వరుడు తెల్లబోయి,

‘నీతోటె ఉంటాను నాయుడు బావా!
నీమాటె యింటాను నాయుడు బావా!’

అని అందుకున్నాడు.

‘బాగుందిరా. ‘మంగళాంతాని కావ్యాని’ అన్నారు. తథాస్తు అనండోయి సభవారు’ అన్నాడు రాజారావు.

సభవారితోపాటు రైలుబండికూడ ‘తథాస్తు’ అన్నట్లుగా కూత కూసినది. గార్డుకూడ ఈల వేసి జెండాతోడి చేయెత్తి దీవించినాడు. సమయానికి ఊడిపడినట్లుగా జమీందారుగూడా పరుగుపరుగున వచ్చి బండిలో నెక్కినాడు.

కేకిసలు కొట్టుచున్న మన మిత్రులందఱు నదరుపాటుగ గనులప్పగించి చూచుచుండ, రాజేశ్వరరావు లేచి నిలిచి ‘దయ చేయండి, దయ చేయండి’ అంటూ చోటు చేసినాడు. జమీందారు గారు కూరుచుండి ‘నాబోటి వృద్ధులు చెదలుపట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీవంటి పడుచు వాళ్ళతో సావాసం చెయ్యాలి. మిమ్మందఱిని చూస్తే నాకు తిరిగి యౌవనం వచ్చినట్లుగా ఉంది. మీరంతా ఒక్కసారిగా బయల్దేరారు, అందరూ ఒక కాలేజీలోనే చదువుతున్నారు కాబోలు. రాజేశ్వరరావుగారు మా ఊరివాడు కావడంచేత నే నెఱుగుదును. తక్కిన అందరూకూడా రాజమండ్రికేనా? ఇంకా పైకి పోయేవారా?’ అన్నారు.

రాజే: లేదండీ, అందరూ తలో ఊరి వాళ్ళూ, తలో కాలేజీ వాళ్ళూను. ఇదిగో, మా నారాయుడు ఎఫ్. ఎల్. పరీక్షకు వెళ్ళాడు. ఆలంసాహెబు కూడా ఎఫ్. ఎల్. కే వెళ్ళాడు. ఆతడు రాజారావని, వేమూరివారు. వారిది కాకినాడ. ఆతను ఎమ్. బి., బి. ఎస్. నాల్గోయేటి పరీక్షకు హాజరైనాడు. అడుగో అతడు పరమేశ్వరమూర్తి, వాడ్రేవువారి చిన్నవాడు. ఆయన గ్రాడ్యుయేటు. కవి, చిత్రకారుడు, గాయకుడూను. ఇందాక మీకు కనిపించిన లక్ష్మీపతిది నిడమర్రు. ఇంటిపేరు నిడమర్తి వారే. ఆయన మా నారాయుడి బావగారు. ప్రైవేటుగా ఎఫ్. ఎ. పరీక్షకు హాజరైనారు. ఒక్క లక్ష్మీపతి తప్ప తక్కిన అందరమూ ఒక్కసారే రాజమండ్రిలో ఇంటరు చదివాము.

లక్ష్మీ: రాజేశ్వరరావునాయుడు గారు మీకు తెలిసిన వారే కదండి. బి. ఇ. పరీక్షకు హాజరైనాడు. చాల సంపన్న గృహస్థుడూ, సరసుడూనూ.

జమీం: సరి సరి. ఆయన్ని నేను ఇంత నాటినుంచీ యెఱుగుదును. కాలేజీలు మూసి చాలారోజు లైనట్లుంది, ఇంత ఆలస్యంగా బయలుదేరినారేమి?

ఆలం: రాజారావు పరీక్షలు మొన్ననే ఆఖరైనాయండి. అందుకోసం మేమంతా మరి నాల్గుదినాలు నిలిచి ఏవో సినిమాలతో కాలక్షేపంచేసి బయల్దేరాము.

జమీం: తక్కిన పరీక్షల్లో ఎట్లాఉన్నా, మనవాళ్ళు లా కాలేజీలో చాలా మేటిలనిపించుకొంటున్నారు..

రాజే: మా నారాయణ రావు ‘లా’ ఆత్మవికాసానికి పరమశత్రువంటాడు.

జమీం: ఏమండీ నారాయణరావు గారూ! అయితే మీరు గాంధీ మతస్థులా? నారాయణరావు సంభాషణప్రియుడయ్యు మితభాషి. తన హృదయానికి పులకరాలు కలిగించు చర్చ వచ్చినచో, పట్టుదలతో యుక్తులతో గంభీరమైన విద్యాప్రౌఢితో కవిత్వమువలె, గీతమువలె ఉపన్యసింపగలడు. సంభాషణలో నెదుటి వానిని చెరిగివేయగలడు. అప్పు డాతని సహజవినయసంపద మాయమగుట కూడ నొకచో సంభవించును. కొరడాకొసలవలె చురుక్కుమనిపించును. అపహాస్యరసము నంజుడు చూపును. ఎన్ని విషయములైనను అలంకారములతో, ఉదాహరణలతో, భావనాపథములకు నెత్తి వేయుచు మాట్లాడగలడు. కాని తనకు గౌరవాస్పదులగు పెద్దలన్న యెట్టి వాదములకు బోడు.

లక్ష్మీ: మా బావగారి తరఫున నన్ను కొంచెం వాదించనీయండి. అతని అభిప్రాయాల్నే నేను మనవి చేస్తాను. అత ననేది ... ఇప్పుడు దేశంలో విజృంభించియున్న ‘లా’ ధర్మదూరమంటాడు. సత్యానికి చాలా దూరమంటాడు. అసత్యం కలపందే నిజం కూడా నెగ్గదంటాడు. సాధారణంగా నిజం అసలు నెగ్గదంటాడు. ఇప్పుడుండే సాక్ష్య చట్టము, వ్యావహారిక చట్టాలూ చాలా దోషభూయిష్టాలనీ, అసలు ఆ తప్పు ప్రస్తుత కాలంలో ‘లా’ యొక్క తత్వం లోనే ఉందనీ, అలా ఉన్నంత కాలం ‘లా’ సత్యానికి వేలకొలది మైళ్ళ దూరంలో ఉంటుందనీ వాదిస్తాడు.

జమీందారుగారు తన హృదయము గ్రహించి నారాయణరావు సిగ్గుపడుచున్నాడని భావించుకొని, ఆతని మాట్లాడించక, ఇతరులతో ననేక విషయములు సంభాషించినారు.

మెయిలు వాయువేగముతో ఏలూరు వచ్చినది. జమీందారుగారు దిగి పోవుచు అందరితో తాను సెలవుతీసుకొనుచున్నాననియు, ఆనాటి స్నేహము మరల మరల తన కా యువకమండలి ప్రసాదించవలెననియు గోరినాడు.

‘నేను మిమ్మల్ని ప్రార్థించేది మీరంతా ఈరోజున మా ఊరిలో మా యింటికడ నా ఆతిథ్యం స్వీకరించాలని.’

ఆలం: అయ్యా, నేను సంతోషముతో వచ్చేదే. మాది ఏలూరు. నేను వస్తున్నానని మా తమ్ముళ్ళు, చిన్న చెల్లెలు స్టేషనుకు వచ్చారదుగో. మా అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి.

జమీం: మిమ్మల్నెవర్నీ నేను బలవంతపెట్టను. ఎవరికి వీలుంటే వారు వస్తే చాలా సంతోషిస్తాను. నాకు ఏ సంగతీ గోదావరిస్టేషనులో చెప్పాలని కోరిక.

అని జమీందారుగారు లేచి, వారందఱు తనకొనర్చిన నమస్కారములకు ప్రతినమస్కారము లిడి, వెడలిపోవుచు, ‘లక్ష్మీపతి గారూ, ఒకసారి నాతో వస్తారా, ఒక చిన్న పని ఉంది’ అని పిలిచినారు.

లక్ష్మీపతి ‘చిత్త’ మని ఆయనవెంట వెళ్ళినాడు. దారిలో కనబడిన గార్డును చూచి జమీందారుగారు ‘గార్డ్! వీరు నాతో మొదటితరగతిలో వస్తారు. కూడా వచ్చే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినరుతో టికెట్టు విషయం చూడండి. నమస్కారము’ అని లక్ష్మీపతి చేయిపట్టుకొని తన పెట్టెలోనికి గొనిపోయినాడు.


౩ ( 3 )

జమీందారుడు

విశ్వలాపురం జమీందారుగారైన లక్ష్మీసుందరప్రసాదరావుగారిది పేరెన్నికగన్న ఆఱువేల నియోగి కుటుంబము. హైదరాబాదు నవాబుగారి పరిపాలనలోనికి వచ్చిన రాజమండ్రి సర్కారు దగ్గర వెండి తలందాను, బంగారు పొన్నుకఱ్ఱ, ఇరువదియైదూళ్ళకు వీరమిరాసీలు, నాలుగు సంప్రతులకు బదస్తూలు, దివాణం పొందుతూ, ‘నిశ్శంక మహాశంక సింహమాన సకలవిద్వజ్జన ప్రముఖ సంస్థిత’ అని బిరుదుపొంది తల్లాప్రగడ నన్నయనాయని పౌత్రులు గౌరవం పొందినారు. ఆ వీరమిరాసీలు క్రమక్రమంగా చిన్న జమీగా పరిణమించినవి.

వారు నవాబులకు పన్ను కట్టుచుండిరి. వారి రాజకార్యనిపుణతకును వేగుదనమునకును, జమీ దక్షతతో పరిపాలించి యైశ్వర్యవంతముగ జేయుచున్నందుకును నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను, రవ్వల ఒరగల నిశితకరవాలము, శ్వేతచ్ఛత్రము, బంగారు పల్లకీ, బిరుదునిశానీ లిచ్చి శతాశ్విక దళమునకు దళవాయిగా నొనరించిరి.

విశ్వలాపురం జమీ మొగలితుర్రు పరిపాలన క్రిందికి వచ్చినపిమ్మట నన్నయమంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలితుర్రు వారికడ అమాత్యుడై రాజ్యము సర్వవిధముల విజృంభింపజేసెను. కలిదిండి మహాప్రభువు జగపతిరాయని స్వామి కార్యనిర్వహణదక్షతకు, స్వామిభక్తికి మిగుల సంతసించి, ‘మహామంత్రి, రాజవంశోద్దీపక’ అను బిరుదులు, రెండు గ్రామములతో దయ చేయించినారు.

అట్టి యుత్తమవంశమున జన్మించిన శ్రీ రాజా లక్ష్మీసుందరప్రసాదరావు, స్వకుల దీపకుడయి, సదాచార సంపన్నుడై నూతన విజ్ఞాన ప్రకాశమున తన హృదయమును గాంతిమంతము చేసికొని, పాశ్చాత్య విద్యయందును గడతేరినాడు. సంస్కృతమున బి. ఎ. పరీక్షయం దుత్తీర్ణుడయి ప్రసిద్ధ పండితుల పాదములకడ సంస్కృత భాషామృతము సేవించి, అమరభావ పులకితుడైనాడు. తాను జమీందారుడయ్యు రైతుల కష్టములు పటాపంచలయి, వారు బాగుపడిననే గాని భావిభారత భాగ్యోదయము కాదని నిశ్చయించి, పూర్వపు శాసనసభలకు నూత్న శాసనసభలకునుగూడ అధిక సంఖ్యాకులగు ప్రజలచే ప్రతినిధిగ వరింపబడి ప్రభుత్వమునకు ప్రక్కలోని బల్లెమయి మెలగినాడు.

రాజనీతిశాస్త్రమున నాతడు న్యాపతి సుబ్బారావుపంతులుగారి ప్రియశిష్యుడు, మోచర్ల రామచంద్రరాయని ప్రియ స్నేహితుడు అయ్యు గాంధిగారి అసహాయోద్యమముచే దేశము విప్లవమున బడిపోవునని ఆయన నమ్మడు. కావున శాసనసభలో స్వార్థపరులగు ప్రజాద్రోహులకు తన స్థానమయినను చిక్కకుండ చేయగలుగుటయే తాను చేయగల దేశ సేవయని నమ్మిన సత్పురుషు డాతడు.

లక్ష్మీసుందరప్రసాదరావుగారికి గంజాంజిల్లాలో నారికేళవలస జమీందారగు క్రొవ్విడి వీరబసవ రాజవరదేశ్వరలింగము గారు తమ ప్రథమ పుత్రిక వరదాకామేశ్వరీదేవి నిచ్చి వివాహము చేసినారు. వారి గర్భమును నిరువురు పుత్రికలు, నొక పుత్రుడు పవిత్ర మొనర్చినారు. ప్రథమ పుత్రిక శకుంతలా దేవిని నెల్లూరుజిల్లాలో నొక చిన్న జమీకి ప్రభువైన భావనారాయణరావు గారి ప్రథమ పుత్రుడు విశ్వేశ్వరరావుగారి కిచ్చి వివాహము చేసినారు.

కుమారరాజా విశ్వేశ్వరరావు చాల గర్వి. ఇంగ్లండు దేశమునకు బోయి ఆక్సుఫర్డులో ఎం. ఎ. పట్టమునంది, హిందూదేశమునకు వచ్చి, యుద్యోగుల నాశ్రయించి డిప్యూటీ తహసీల్దారు పదవి ప్రథమముననే సముపార్జించి, ప్రాపకముచే డిప్యూటీకలెక్టరుపీఠ మచిరకాలముననే యధివసించినాడు. తాను జమీందారు ననుమాట మరచిపోయి పై యుద్యోగులకడ వినయముగా సంచరించువాడు. బ్రిటిషు ప్రభుత్వము ఇండియాను వీడినచో నొక్క పురుగైన బ్రతుకదనియు, అత్యంత ఫలవంతము, నతి సుందరమునగు భారత భూమండల మెల్ల ఆసేతుహిమాచలము సహారా యెడారి అయిపోవుననియు నాతనికి భయము.

విశ్వేశ్వరరావు మామగారితో హిందూదేశాన నాగరికతయే లే దను చుండును. పాశ్చాత్యులు భారతభూమి మెట్టక పూర్వ మిచటివారెల్ల ఆఫ్రికా వాసులగు నీగ్రోలవలె ఒకరినొకరు చంపికొని తినుచుండిరనియు దన యభిప్రాయము వెలిపుచ్చుచుండును.

కోర్టులో నగ్నివర్షము కురిపించి యభ్యర్థులను న్యాయవాదులనుగూడ దూదివలె నేకి విడుచును. న్యాయ నిపుణములగు వాదముల నాత డర్థము చేసికొనలేక యుక్కిరిబిక్కిరియై తన తీర్పునందు వానిని జారవిడిచి తప్పుదారి బడి పై న్యాయాధికారిచే సన్న సన్నని చీవాట్లు తినుచుండును. అతని తాబేదార్లు అరచేత ప్రాణము లుంచుకొని మసలుచుందురు.

ఇంటిలో భార్యాభర్తలకు చుక్కెదురు. సంతతము ఎట్టి చిన్నవిషయమునకైన ఇరువురకు మాటపట్టింఫులు వచ్చి ఒకరితో నొకరు మాటలాడుట మానివేసికొందురు. జమీందారుల బిడ్డలమను నభిమాన మిరువురి మనఃపథముల నెల్లప్పడు జాగరితమైయుండి సుడిగాడ్పులు రేపెట్టుచుండును.

వారి బిడ్డలు తల్లిదండ్రుల సర్వవిధముల ననుకరించుచు వారిలో వారు, సేవకులతో, తల్లిదండ్రులతో, తోడిపిల్లలతో కలహమాడుచుందురు.

కలహదేవతకు వారిది పుట్టిల్లు. అపశ్రుతిమేళవింపుతో, బహు రాగముల కలయికతో నాదేవి వారింట విచిత్రనృత్యము సలుపుచుండును.

లక్ష్మీసుందరప్రసాదరావు గారి ప్రథమపుత్రికాజామాత లిట్లు తిక్తఫలములైపోయి ఆయన హృదయమును తీరని కోరికలచే బాధాపూర్ణము చేసిరి.

శకుంతలాదేవికి సంగీత సాహిత్యములు నేర్పించినాడు. రాణ్మహేంద్ర పురవాసియగు నొక యమెరికను మిషనరీ భార్యకడ నామె కాంగ్లభాష గరపించినాడు. ఈ విద్య లామెకు గర్వము వృద్ధిచేసినవి. కళాభిజ్ఞతలేని జామాత కవి చీదరజనింపజేయు పిచ్చిపోకడలైనను, జిల్లా జడ్జీల భార్యలకడ, కలెక్టర్ల సతులకడ పాడుమని భార్యను ప్రోత్సహించుచుండెడివాడు. ఆమె విరసముగా తా నవియెల్ల మరచిపోయినానని భర్తతో నప్పడము విరిచెడిది.

రెండవకూతురు శారద చిన్నతనమునుండియు శాంతవర్తన. మూగదేవుని వలె మాటలాడక విశాలనయనములతో, చిత్తరువువలె నన్నియు పరికించునది. ఆమె ఒక్కసారి దేనిని విన్నను మఱి మఱవదు. ఆమె మాటలలో సున్నితమై, తేటయై, మధురమగు చక్కని తెలివి తేటనీటియూటవలె ప్రవహించును. వీణె తీగలు, కోయిల గొంతులు కొండకోనలోని వేణునికుంజముల పాటలుగూడ పేలవము చేయగలిగినది ఆమె కంఠము. గానమూర్తియగు శ్రీరామయ్యగారి పాదములకడ నామె సంగీతము నేర్చికొన్నది. శ్రీరామయ్యగారు గాత్రములో, ఫిడేలు వాద్యములో దక్షిణాపథమున పేరెన్నికగన్న కళాస్వరూపులు. జంత్ర వాద్యములో నాయనను మించువారు ఆనాడు లేరు. తన కమాను కదల్పు లోని విశ్వగీతాస్వనము నాయన శారద కమానులోనికి ప్రవహింపజేసినాడు. శ్రీ త్యాగరాజమూర్తి కన్నులరమూసి శ్రీ సీతారాముని ప్రత్యక్షము జేసికొనిన దివ్యగానములో జనించిన తారకలగు కృతులు, ఆ సంప్రదాయముతోనే శ్రీరామయ్యగారు శారదకు ధారవోసినారు, శారద వీణయు బాగుగా నేర్చికొనుచున్నది, వీణాదక్షుడగు వేరొక యుత్తమ వైణికునికడ.

శారదకు తండ్రియన్న ప్రేముడి యెక్కువ. ఆమె చిన్నతమ్మునొక్క క్షణమైన వదలియుండదు. అచ్చముగా తన తల్లిపోలికయైన శారదను చూచిన జమీందారుగారికి గాఢానురాగము పెనవైచికొనిపోవునది. తన ఆశయముల కీమెయే తగిన కుమారితయని యాయన గర్వపడును. ‘చదువులలో చిత్రమెల్ల జదివిన బాలా!’ అని ఆనందబాష్పములతో తనయను గాఢాలింగనమొనర్చి యొకనాడు జమీందారుగారు తన స్నేహితులకడ, అప్పటికి బదునొకండేండ్లు ప్రాయముగల శారదచే సంగీతసాహిత్యసభ చేయించినాడు. వృద్ధుడు, శాంతమూర్తి, తేజస్వియగు భాస్కరమూర్తి శాస్తుర్లు బి. ఎ., ఎల్. టి. గా రామెకు నాలుగుభాషలు, ఛప్పన్న విద్యలు నేర్పినారు.

నేడు శారద పదునాల్గుసంవత్సరముల యెలనాగ. అందాలప్రోవు. సుగుణాలనిధి. చదువుల కన్నతల్లి. ఆమెకు తపఃఫలమై జీవితకల్పమగు భర్తను గొనితేవలయు.

సంఘసంస్కరణాభిలాషి యగు జమీందారుగారు శారదకు ఉన్నత విద్యలు చెప్పించవలెనని యెంత కుతూహలపడినను ఆయనహృదయము మాత్రము పూర్వసంప్రదాయ ఘంటాపథము దాటలేకపోయినది. వయసు మీరిపోకుండ శారదకు వరుని తేవలయు. ఇదివరకు జమీందారీ కుటుంబములతో వియ్యమందినాడు. ఆ సరదా తీరినది. తల బొప్పెలు కట్టినది. ఈనా అనుంగుకూతురిని ‘జమీందారు రాతుచేతనిడనమ్మ త్రిశుద్ధిగ నమ్ము శారదా!’ అని హృదయమున శపథము చేసికొన్నాడు.

భార్యయైన వరదకామేశ్వరీదేవి తన అన్న గారికొమరుడగు శ్రీ క్రొవ్విడి బసవరాజేశ్వర జగన్మోహనరావునకు శారద నిచ్చి యుద్వాహ మొనరింప పట్టుపట్టినది. అన్న గారగు విశ్వేశ్వర ఆనంద సువర్ణేశ్వరలింగం గారు విజయనగర వేశ్యవాటి సముద్రజనిత మాయాప్సరోమణీ నీచశృంగార సమారాధనలో ప్రాణముగూడ ధారపోసి, ఆస్తి అప్పులపాలుచేసి పోయినాడు, ‘కోర్ట్ ఆఫ్ వార్డ్సు’ వారు వ్యవహరించి అప్పులు నిశ్శేషముగా దేర్చివేసి, రెండు లక్షల రూపాయల నిలువతో నిరువది రెండేండ్ల వయసున జగన్మోహరావుకు జమీ అప్పగించినారు. ఈ చిన్న జమీందారుని గూర్చి రహస్యములు కథలై దేశ మంతట ప్రాకుచున్నవి.

లక్ష్మీసుందరప్రసాదరావుగా రా సంబంధముమాట భార్య కదిపినప్పుడు జుగుప్సపడినాడు. “అమ్మాయిని నరకకూపంలోకి వేరే తోయనక్కరలేదు! మన హృదయాలు పాషాణాలు చేసుకోవాలి మీ మేనల్లుడి కివ్వాలంటే” అన్నారు.

శీఘ్రముగా వివాహముచేయ సంకల్పించి వరునికై ఆంధ్రదేశము వలలు వేసి వెదకించినారు. అభిజాత్యముగలవాడు, అన్నవస్త్రములకు లోపములేని వాడు, మంచి తెలివైనవాడు, రూపవంతుడు, గుణవంతుడు, చదువుకొన్నవాడు గావలె నల్లుడు. సుప్రసిద్ధ నియోగికుటుంబము లన్నియు వెదకించినారు. వాడ్రేవువారు, మంచిరాజువారు, మారెళ్లవారు, చెన్నాప్రగడవారు__ వేయేల గోత్రములు ఋషులు కలియని ఇంటిపేర్లవారి జాబితా గవర్నమెంటువారి ‘నీలపుకాగితము’ వంటిది తయారైనది.

తారాచువ్వవలె పైకెగయు బాలురకు ధనముండదు. ధనమున్న వారు విద్యాగర్భదరిద్రతలో మునిగియున్నారు. రెండునుగల బాలకులకు రూప సంపద ఎరువుతీసికొని రావలయును. కొంచెముకొంచెముగా నీ మూడును ఏకీభవించిన నరులు విషకుంభసమానులు. జమీందారుగారికి విసుగు జనించి శారదకు తగిన భర్త దొరకునా యనిపించినది. తన భావవీధిలో నడయాడు జామాత కేమాత్రము తీసిపోయినను అట్టివానికి చూచిచూచి తన ముద్దులపట్టి నొసగుట కాయనకు మనసొప్పినదికాదు.

౪ ( 4 )

నారాయణుడు

బెజవాడ ప్లాటుఫారములో నారాయణరావును జూచునప్పటికి, జమీందారు గారికి హృదయ మొక్కసారి యేలోకో ద్రవించిపోయినది. అస్పష్టముగ నొక్క వాక్కు ఇతడే శారదకు వరుడు అని తన హృదయాంతరాళము నుండి నిశ్శబ్దగీతాన ప్రతిధ్వనించినది. నారాయణరావుకు వివాహము కాలేదని ఏల తట్టినదో జమీందారుగా రీనాటికిని చెప్పలేడు.

వ్యవహారములకై వచ్చినవారితోడను, తోటివారితో మాత్రమే సంభాషించు జమీందారుగారు నారాయణరావుకడకేగి ‘మీకు వివాహ మైనదా?’ యని ప్రశ్నించినారు. పిమ్మట మొగమెరుకగల రాజేశ్వరరావువలన నారాయణుని గూర్చిన వివరములడిగి తెలిసికొన్నారు. ఆయనకంటికి పుస్తకాల దుకాణము కడ దూరముగా నున్నప్పుడే నారాయణరాయని యాజానుబాహువిగ్రహము, పురుషత్వము మూర్తీభవించిన తేజముతో కనుపించినది.

అవయవస్ఫుటత్వము కమ్మెచ్చున దీసినట్లున్నను, అతని కనుబొమలలో, పై పెదవి మెలుపులో, రేఖలు తిరిగిన నిడివిచెవులలో, సమమైన నాసికలో, వనితాలాలిత్యము వెన్నెలవలె ప్రవహించుచుండును. గాఢముష్టిఘాతమున స్తంభమునైన విరుగగొట్టగల యాతని చేతులు దీర్ఘాంగుళులతో, మెత్తని తలములతో నందమైయున్నవి. ఎత్తయి విశాలమైన యాతని ఫాలము, నల్లని దట్టమైన జుట్టు పొదువుకొన, కారుమబ్బు లాక్రమించిన వెన్నెలతులుకవలె విరిసి పోయినది.

నారాయణరాయని యౌవనసుదృఢ దీర్ఘ దేహకాంతి ప్రవాహములో జమీందారుగారు చిరపిపాసువగు హృదయమును తనివోవ నోలలార్చినారు. తమకు సమీపమందుననే యిన్నినాళ్లు దాగియున్న యీ పురుషరత్నమును తన భాగ్యదేవత నేటికి సాక్షాత్కరింపజేసినదని మురిసిపోయినారు.

లక్ష్మీపతి నారాయణరావునకు మూడవ బావమరదియు, మేనత్త కొడుకును. తలిదండ్రుల కొక్కడే సంతానమగుట సోదర సోదరీ ప్రేమ యెరుగక, తన హృదయమంతయు నత్తవారి కుటుంబమునకు ధారపోసినాడు. చిన్న బావ యగు నారాయణరావును తమ్మునివలె ప్రేమించినాడు. ఆతని భావనాపథముల నారాయణరావు అమర్త్యబాలకుడు.

ఏలూరినుండి తాడేపల్లిగూడెం స్టేషనువరకు లక్ష్మీపతి శ్రవణపేయముగా నారాయణుని గుణగణవర్ణన చేయుచుండ, స్పెన్సరుచుట్ట కాల్చుచు మెత్తని మొదటితరగతి దిండుపై పరచిన బూరుగదూది దిండ్లపై నొరగి, జమీందారు గారు హృదయమార వినుచున్నారు. ‘నారాయణ మనస్సు చాలా మెత్తనండి. ఒకళ్ళ బాధ చూళ్ళేడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏడిస్తే వాడికళ్ళ గౌతమి తిరిగేది. తన అందమైన వస్తువుల్ని వాళ్లకిచ్చి ఊరడించడానికి ప్రయత్నించేవాడు. ఎంతమందో నౌకర్లున్నా చెల్లెళ్ళనీ, అన్న గారి బిడ్డల్ని తనే ఎత్తుకుంటాడు. ఆ పిల్లలు తల్లిదండ్రులకన్న నారాయణంటే చెంగున గంతువేసేవారు. చంటిబిడ్డ తలిదగ్గరకు వెళ్ళడమల్లా పాలకోసమేగాని వాడి ప్రక్కలోనే నిద్ర. మా వాడి గొంతుకలో తేనెల తీయదనం, ఉరుముల గాంభీర్యం పెనచుకొన్నాయి. పాటలుపాడ్తే నాకు కళ్ళనీరు తిరిగేది. సంగీతం నేర్చుకోరా అంటే నేనంత పవిత్రుణ్ణి కానురా అనేవాడు.

‘బళ్ళలో చదివేటప్పుడు తోటివాళ్ళొక్కళ్ళూ బాధపడకూడదు కదాండి. పుస్తకాలు బొమ్మలు తినుబండారాలు అందరికీ అస్తమానం పంచుతూ ఉండేవాడు!’ తాడేపల్లిగూడెమునుండి నిడదవోలువరకు నారాయణరావు చదువు సంగతి లక్ష్మీపతి జమిందారుగారికి పదముపాడినాడు.

‘ఎప్పుడూ ఏ పరీక్షా తప్పలేదు. ప్రతి తరగతిలోనూ మొదటివాడే. ఇంటరు మూడు సబ్‌జెక్ట్సులో మొదటిమార్కులు, బంగారు పతకాలు సంపాదించాడు. ఇంతలో మహాత్మగాంధీగారి సహాయనిరాకరణం వచ్చింది. రాజమండ్రి కాలేజీ వదలివేసి దేశంకోసం పనిచేశాడు. ఖైదుకు వెళ్ళాడు. ఆరు నెలలు నిర్భయంగా కృష్ణ జన్మస్థానంలో గడిపాడు. వచ్చాడు. స్వరాజ్యపార్టీ అంటే ఇష్టం లేదు. బి. ఎస్ సి. ఆనర్సు చదివాడు. రెండవ వాడుగా నెగ్గాడు. ఎఫ్. ఎల్. లో మొదటిస్థానము తప్పదుకదాండి.’

నిడదవోలు దాటేసరికి లక్ష్మీపతి తన బావగారి ఆస్తి వేదపారాయణము చేసినాడు. ‘ఇద్దరన్నదమ్ములు. మూడువందల ఇరవై యకరముల మాగాణి ఉంది. తోటలు ముప్పయి యకరములపైన ఉండవచ్చు. వడ్డీ వ్యాపారంలో లక్షా అరవై వేలవరకు తిరుగుతున్నట్లు జ్ఞాపకం. బ్యాంకులో షేర్లతోపాటు రెండు లక్షల రూపాయలవరకు ఉన్నవి. ఎంత లేదన్నా ఇరవైవేలదాకా నికరాదాయం ఉంటుంది. మా మామ గారు సుబ్బారాయుడు గారు మంచి గుణవంతులు. మా అత్తగారు జానకమ్మగారు పార్వతీదేవి. నలుగురు కొమార్తెలకు వివాహాలయినాయి. మంచి సంబంధాలు చేశారు.’

జమీం: సర్వవిధాలా వరప్రసాదిగా ఉన్నాడు మీ బావమరది. నా సంకల్పానికి దైవమనుకూలిస్తే, మా అమ్మాయి నేనూ కూడా ధన్యులమవుతాము.

లక్ష్మీ: అదేమిటండీ! తమరు గొప్పవారు. తమరు తలచుకొంటే జమీందార్ల సంబంధాలే కుదురుతాయి.

జమీం: సరి, జమీందార్ల మాటకేమి గాని మన నియోగులలో సరియైన ఒక్క సంబంధం చెప్పండి. మీరు చిన్నవారు. చదువుకుంటున్నారు. మీ యెఱుకను మంచి సంబంధం చెప్పండి. 

లక్ష్మీ : (చిరునవ్వుతో) చిత్తం! నాకుమాత్ర మేమి తెలుసునండి!

జమీం: అవునుగదా! నా మనస్సు చివికిపోయేటంత వరకు గాలించి వొదిలేను. ఇంత దగ్గిరలో మహారాజులు ముచ్చటపడిపోయే సంబంధం ఉందని తెలియక పోయింది. కాని భగవంతుని కృపవల్ల ఇప్పటికైనా తెలిసింది. లేక పోతే నా జన్మల్లా దుఃఖపడి ఉందును.

లక్ష్మీ: మనస్సులు కలిస్తే అంతా అల్లాకనబడుతుంది. నాకూ, మావాడు మీ అల్లుడు కావడం ఎంతో సంతోషం. కాని మా కుటుంబాలు పల్లెటూరి కుటుంబాలు!

జమీందారు గా రాలోచనాపథములలో నెగయుచు అర్ధనిమీలిత నేత్రులయి కూరుచుండిరి. రైలు కొవ్వూరిలో ఆగి, గోదావరి వంతెన దాటుచున్నది.

సుందరీమణియై, నారాయణరావు పోలికలు గలిగి, ఒక చిన్న బాలునకు తల్లియైన ప్రోయాలొకర్తు కొత్తపేటలో నాపె పుట్టినింట తనకై ఎదురు చూచు చున్నట్లు తోచి, లక్ష్మీపతి, చిరునగవు మెరుములీన, గోదావరి జలముల పార జూచుచుండెను. ఆమె ప్రేమమూర్తి. భర్తకు సదుపాయము లమర్చుచు నామె వేయికనులు, వేయిచేతులతో పరిచర్య చేయును. ఈ నిర్మల గౌతమీనీలజల ములకు నామె హృదయమునకు ఎంత చుట్టరికమున్నది! తమ సర్వస్వము భర్తలకే ధారపోయు హిందూవనితామణులు భర్తలకు పూజింపదగిన వారు. లక్ష్మీపతిరా వా గౌతమీ నిర్మలగంభీరతలో తన ముద్దుబిడ్డ మోమింతలో చూచినాడు. ఆతని మోమున, సంధ్యాకాశమున అరుణరాగమువలె, చిరున వ్వలంక రించినది.

బండి గోదావరి దాటి స్టేషనుకడకు వచ్చి ఆగినది. జమీందారుగారును, లక్ష్మీపతియు బండి దిగినారు. లక్ష్మీపతి ‘అయ్యా, సెలవు పుచ్చుకుంటాను. నమస్కారమండి’ అని తన స్నేహితులున్న పెట్టెకడకు పోయినాడు. ఆలం ఏలూరిలో నే దిగినాడు. కూలీలు మూడునిముషములలో సామానులు సర్దినారు. రాజేశ్వరరావు, నారాయణ రావు, లక్ష్మీపతి గారలు పరమేశ్వరమూర్తి, రాజారావుల బుజాలమీద తట్టిరి. ప్రీతిపూర్వకముగా కరస్పర్శ గావించి, వారు సెలవు గైకొని టిక్కెట్లు పుచ్చుకొను ద్వారముకడకు వచ్చినారు. ఇంతలో జమీందారు గారును వేరొక పెద్దమనిషియు, నలుగురయిదుగురు జవానులు ముగ్గురు జమీందారీయుద్యోగు లీయువకులకడకు వచ్చినారు.

జమీం: ఈయన నాకు చిన్నతనాన్నుంచి స్నేహితుడు. వేపా శ్రీనివాసరావు గారు, ఈ ఊళ్లో పెద్ద వకీలు.

శ్రీని: చాలా సంతోషంగా ఉందండి మీవంటి పడుచువాళ్లను కలుసు కోవడం. మరేమంటే మీరు భావి ఆంధ్రదేశానికి కీర్తితెచ్చే మణులని మా జమీందారుగారు చాలా చెప్పారు, యీ రెండు నిమిషాల్లోనే.

జమీం: వీరు లక్ష్మీపతిగారు. వారు ఈయన బావమరది నారాయణ రావుగారు.

లక్ష్మీ: (జమీందారు గారు పేర్లకై తడుముకొనుట చూచి) ఆతడు రాజేశ్వరరావు నాయుడు.

శ్రీని: చాలా సంతోషంగా ఉందండి. ఈరోజున మీరంతా మా యింటికి అతిథులుగా దయచేయాలి. తప్పదు లక్ష్మీపతి గారూ! మీరు మాట తీసేశారంటే నాకు మనస్సు నొప్పికలిగించారని నష్టానికి దావా తెస్తాను.

లక్ష్మీ: (నిముషములో గ్రహించి) రాజేశ్వరుడిమాట నేను చెప్పలేను గానీ, మేమిద్దరం వస్తాము.

రాజే: నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తాను.

శ్రీని: ఇంటికి వెళ్ళి భోజనానికి రావాలి. లేకపోతే దావా తప్పదు.

రాజే: మీకు మూడు పైసలు డిక్రీ యిస్తాను. ఇప్పుడే చెల్లించమంటే చెల్లిస్తాను.

శ్రీని: రాజేశ్వరరావు గారూ! మీ నాన్న గారు నాకు పూర్వం నుంచి పరిచితులు. నా సరదా తీర్చండి.

రాజే: పదిగంటలకు కలుసుకుంటాను. సెలవు.

అందరును స్టేషనుబయటకు వెళ్ళినారు. సామానులు జమీందారుగారీ గుర్రపు బగ్గీలలో సర్దించి, శ్రీనివాసరావు గారు తన మోటారులో అతిథు లిరువురిని తన ఇంటికి గొనిపోయిరి.

జమీందారుగారు సొంతమోటారు మీద తమ భవనమునకు వేంచేసినారు.

౫ ( 5 )

శారద

గౌతమీజల చుంబిత ప్రత్యూష వాయు బాలకులు ఒయారముగా దేలి యాడుచువచ్చి, ఆ వన పుష్ప చేలాంచలములలో దోబూచులాడుచుండిరి. వసంత గాఢ సౌరభములు పొగవోలె సుడులుకట్టి యెల్లెడల వ్యాపించుచున్నవి. బోగైన్ విల్లాలయు, గులాబులయు, వివిధ కుంకుమవర్ణములు, మల్లీమాలతుల స్వచ్ఛ హృదయార్ద్ర శ్వేతవర్ణములు, చంపక కనకాంబరముల సువర్ణరాగములు, నీలాంబర నిర్మలనీలములు కలసి మెలసి చిత్రరూపమై సొబగుమించిన జమీందారుగారి యుపవనములో, శారద ముగ్ధవనలక్ష్మివలె పూలు కోయుచున్నది. శారదకు పూలన్న ప్రాణము (ఏ బాలకు గాదు?). పూల చరిత్రలన్నియు నామె వల్లించినది. పూల మనసులు, పూల బాసలు నామె యెరుగును. ఏ ఋతువుల నే పూ లవతరించునో, ఏ ప్రదేశముల నే కుసుమములు కలకల లాడిపోవునో హాసప్రఫుల్ల వదనయై శారద చెప్పచుండును.

శారదాకుమారి సౌందర్యమూర్తి. ఆమె నయనములు విస్ఫారితములై, యర్ధనిమీలితములై, దీర్ఘ నీలవర్త్మాంచలములై, విచిత్ర జీవిత నాటకము నాలోకించుచు, నాశ్చర్యహాసముల వెదజల్లుచుండును. నల్లని పాపలు రెప్పలమాటున సగము దాగికొని యామినీ నీలాకాశగంభీరములై తోచును. మేలిమిబంగారు రంగులో తామరయెరుపు కలిపిన శరీరచ్ఛాయ. నవయౌవనపు తొలి వెలుగు లామె ఫాలముపై, నాసికాగ్రముపై, బుగ్గలపై, పెదవుల యంచులపై, చిబుకముపై, కంటి పైరెప్పలపై, చెవుల తమ్మెలపై నర్తించుచుండును. స్వప్నసీమలగు కనుబొమలు సన్ననై చంద్రవంక వంపులు తిరిగి చెక్కుల మాయమైనవి. బంగారు గన్నేరు మొగ్గవంటి ముక్కు, విలువంపగు సరుణోత్తరోష్టముపై పైడిమేడ గట్టినది. మధ్య సుడినొక్కుతో కాశీరత్న పుష్పముల జంటబోలి యామె యధరము స్పష్ట రేఖాంకితమై తేనియలు చెమరించుచున్నది. లేత దానిమ్మపూ వామె చిబుకము. పదునాలుగేండ్ల యెలప్రాయపు మిసిమిరేకలు కర్ణములనుండి యంగుళీయాంచలముల కెత్తిపోతలైనవి. బాహు మూలములనుండి పాదతలములకు సొంపు లెగబోయు ఏటి కెరటాలవంపులు మిలమిల లాడిపోవు కమ్మని చందనవర్ణపు పట్టుపరికిణీమడమలతో మెలివడి పోయినవి, నానాట నానందకిసలయములై మొలకెత్తు ముగ్ధభావములు గులాబి రైక మబ్బుల, నీలిపయ్యెద జిలుగువెలుగుల తొంగి చూడసాగినవి.

ప్రక్క పాపట తీసికొని, ఒత్తై పొడవైన కచభారమును పిరుందులవరకు వ్రేలాడు వాలుజడగా గీలించి, కాళ్ళకు జరీబుటాపూవుల మొఖమల్ లూఢియానా చెప్పులు తొడిగికొని, చెవుల లోలకులలో, కుడిముక్కు పుటమున బేసరిలో, మెడను హారములలో రవ్వలు, నీలాలు, కెంపులు తళుకులీనగా, నెమ్మదిగా పూవుల నరసికొనుచు, నొయ్యారముగా నడుగులిడుచు, తోటలో శారదాదేవి విహారము చేయుచుండగా, “నాన్నగారు వచ్చినా” రని కబురు వచ్చినది.

శారదాదేవి జమీందారు గారి తనయ నన్నమాట మఱవదు. ఆంధ్ర దేశమున తన సుగుణములచే, దాతృత్వదీక్షచే వంశధార నుండి పెన్న వరకు వేనోళ్ళ వినుతింపబడు శారదాంబా జమీందారిణి గారి మనుమరాలగుటచే నామె పోలిక లన్నియు పుణికిపుచ్చుకొన్నది.

‘తల్లీ శారదాంబా! ఈ దీపం నువ్వు పెట్టినదమ్మా! ఈ బిడ్డలు నీ వారమ్మా! ఈ వంశము నువ్వు నిలిపినదమ్మా’ అని యీ నాటికిని జమీందారు గారి తల్లి నెన్నియో వేలమంది జనులు తలచుకొని మొక్కుచుందురు. జమీందారు గారి తండ్రి జీవించియున్నప్పుడును, ఆయన కీర్తిశేషులైన వెనుకను, జమీందారుగారి చిన్నతనములోను, జమీందారు గారు పెద్దలై రాజ్యభారము వహించిన వెనుకను, శారదాంబాజమీందారిణిగారు బ్రతికినన్నాళ్ళు అహోరాత్రములు అన్ని వర్ణముల వారికి అన్న ప్రదానము గావించినారు. మాలమాదిగలకు వంటలు చేయించి పెట్టించినారు. ఎందరికో పెండ్లి పేరంటములు చేయించినారు. సంగీత సాహిత్య శాస్త్ర, వేదాది విద్యా పారంగతులకు వార్షికము లొసగి, సంభావించినారు. హైదరాబాదు సంస్థానములో వర్తకము చేసి, కోటికి పడగ నెత్తిన గంగరాజు సుజనరంజనరావుగారి కామె ఏక పుత్రిక. సుగుణసంపదయు ధనసంపదయు నామెలో గంగాయమునలవలె సంగమించినవి.

తండ్రిగారు వచ్చిరని తెలియుటతోడనే, శారదమోమున సంతోషము విఱియబార, తలలో తుఱుముకొనుటకు గోసికొన్న పూవులను సజ్జలో నిడికొని, విసవిస నడచి భవనములోనికి బోయినది. మేడమీద తనగదిలో నద్దముల యెదుట నిలుచుండి పూవుల నమరించుకొని, యా బాలిక నాయనగా రెక్కడ నున్నారో వెంకాయమ్మ నడిగి తెలిసికొని యచ్చటికి బోయినది.

జమీందారు గారు తాను చదువుకొను గదిలో సోఫాపై కూర్చుండి యున్నారు. శారద తల్లిగారు వరదకామేశ్వరీదేవియు నచ్చటనే దిండ్లకుర్చీలో కూర్చుండి భర్తతో మాట్లాడుచున్నది. జమీందారుగారి యక్క సుందరవర్ధనమ్మయు నచట నిలుచుండి ‘ఎందుకోయి, పిలిపించినావు?’ అని యడిగినది.

సుందరవర్ధనమ్మగారు విగతభర్తృక. హైకోర్టు న్యాయాధిపతిచేసి, లక్షలు సముపార్జించి, న్యాయధర్మములో ప్రఖ్యాతి వహించిన విశ్వనాథంగా రామెభర్త. వేదాంతజ్ఞానోపార్జనాసక్తి యామెకు మిక్కుటము. సంతతము ఆమె పట్టుబట్టలతోనే యుండును. ఆమె కుమారుడు తండ్రిబోలి చెన్నపట్టణములో న్యాయవాదవృత్తిలో పేరును, ధనమును వెనుక వేసికొనుచు దివ్యముగ కాలక్షేపము చేయుచున్నాడు. పుత్రునింట తన యాచారాదికములు సాగమి, ధర్మకర్మపరతంత్రుడగు నామెతమ్మునిఇంటనే యుండి, యాజమాన్యము వహించి, కాలక్షేప మొనర్చుచున్నది.

జమీం: చిన్నమ్మాయికి ఈరోజున పెళ్ళికొడుకు వస్తున్నాడు.

వర్ధనమ్మ, వరదకామేశ్వరి: ఎక్కడనుంచి, ఎవరు?

జమీం: కొత్తసంబంధం.

వర్ధనమ్మ: మన దేశమేనా? మన దేశములో ఇదివరకు మనం చూసి నచ్చవనుకున్న సంబంధాలేగా అన్నీ!

వరద: జమీందారీకుటుంబమేనా ?

జమీం: (నవ్వుచు) నన్ను చెప్పనివ్వండి మఱి. మన దేశమే. జమీందారీ కుటుంబంకాదు గాని పరువైన నియోగులు. చాలా సిరి సంపదా కల వాళ్లు. (భార్యవంక చూచుచూ) జమీందారులకు కూడా అప్పిచ్చేటంత నిల్వవుంది.

వర్ధనమ్మ: పల్లెటూళ్ళలో మెరపకాయ కాల్చుకొని తింటూ డబ్బు నిల్వవేసుకొన్న కోమట్లలాంటి మనవాళ్ళు కొందరున్నారు. అలాంటి వాళ్ళు కాదుకదా?

వరదకామే: బాగా అన్నారు వదినా!

జమీం: మనకన్నా మర్యాదకలవాళ్ళు. జమీందారులకు బుద్ధులు నేర్పగల పరువు ప్రతిష్టలు కలవాళ్ళు.

వర్ధనమ్మ: పెళ్ళికొడుకు ఎల్లాఉంటాడు?

వరద కామే: ముంజేతి కంకణానికి అద్దమెందుకు వదినా! పెళ్ళివారు వస్తున్నారుగా! పల్లెటూరి ఆంబోతు కేమీ తీసిపోడు లెండి.

వర్ధనమ్మ: ఆ! మరచిపోయాను, పెళ్ళికొడుకు ఏం చదివాడు?

జమీం: పెళ్ళికొడుకుది నవమన్మధాకారం. వంట్లో రక్తము లేక పాలిపోయి, అదో మంచి మేలిమిబంగారు రంగని చెప్పుకుంటూ నాల్గడుగులు నడవలేని మన జమీందారి దద్దమ్మ కాడు. అందానికి అర్జునుడు, బలానికి భీముడూ. ఈ సంబంధము కుదిరితే మన శారద ఆదృష్టవంతురాలు.

వరద: కాకిముక్కుకు దొండపండు. ఇంతకూ మీకు మా వాడు నచ్చ లేదు. వాడి కేమి లోటో, ఎందుకు నచ్చ లేదో నాతో చెప్పారు కాదు. ఖర్చు కొంచెము ఎక్కువ చేస్తే దుర్వ్యయమ౦టారు. ఓర్వలేనివాళ్ళు కల్పించినవన్నీ నమ్ముతారు. శారద కూడా ఎదుగుతూంది. దాని అభిప్రాయముకూడా అడగడం మంచిది. మీరు నవ నాగరికులు గాదూ! వీరేశలింగంపంతులుగారితో స్నేహము చేసిన వాళ్ళేగా! ఆడపిల్లకు ఏసంబంధం యిష్టమో అది చేయడమే మంచిది కాదూ?

వర్ధ: ఆ! మరదలు గారు స్వయంవరాలు చేయించమంటారు. శారదను పిలిపించండి.

ఇంతలో మెరపుతీగవలె శారద యచ్చటికి వచ్చినది. తండ్రి గారు చేతులు చాచుటతోడనే యా బాలిక పూలబంతివలె ఆయన కౌగిలింతలోనికి వచ్చి వ్రాలెను. కుమార్తెశిరము మూర్కొని తనప్రక్క సోఫాపై కూర్చుండబెట్టుకొని, జమీ౦దారు గారు ‘శారదా, ఎక్కడికి వెళ్ళినావమ్మా’ యని ప్రశ్నించిరి.

శా: తోటలో పువ్వులు కోసుకుందామనీ, నీళ్ళు సరీగ్గా తోడాడో లేదో చూద్దామనీ వెళ్ళాను. నాకోసం మీరు చెన్నపట్నం వ్రాసినపుస్తకం వచ్చిందండి బాబయ్యగారూ. నిన్ననే షేక్స్పియరు మొదలు పెట్టింది మా దొరసానమ్మ గారు. ‘వెనీసు వర్తకుడు’ అనే నాటకం. మనం తెప్పించుకున్న పుస్తకంలో నాటకాలన్నీ ఉన్నాయి. బొమ్మలు కూడా చాలాబాగా ఉన్నాయండి. కాని ‘వెరిటీ ఎడిషన్’ కావాలట. అది తెప్పించి పెట్టరూ బాబయ్యగారూ? జమీం: నీ యీడున షేక్సుపియరు పేరే తెలియదమ్మా మాకు. నీకు మంచి గురువు గారు దొరికింది. నాదగ్గర ‘ఆర్డెను ఎడిష’ నుంది. అది వెరిటీ కన్న చాలా మంచిది.

తండ్రి కొమార్తెల కిరువురకు సంభాషణ ఇంగ్లీషులోనే జరిగినది. తండ్రి శారద వైపు చిరునవ్వుతో చూచి ఇంగ్లీషులో నిట్లు పలికెను.

‘శారదా! జగన్మోహనరావు సంగతి నీకు చాలా వివరించి చెప్పాను. నీకు సర్వవిధములా తగిన వరుణ్ణి ఈ రోజున రప్పిస్తున్నాను. చదువులో మొదటివారిలో మొదటివాడు. రూపసంపదే కాదు, మంచి బలమైనవాడూ, అందమైనవాడూ. ధనంలో మనకెంత ఆస్తి ఉన్నదో అతనికి అందులో సగం ఉన్నది. అతను ఎఫ్. ఎల్. పరీక్షకు వెళ్లినాడు. మొదటివాడుగా నెగ్గుతాడు. పరీక్షలోను, ఆటలలోను నెగ్గిన మెడల్సు కప్పులు కాకివారి షాపంతషాపు పెట్టించవచ్చు నన్నారు.’

శారద సిగ్గుపడి చిగునగవుతో మాట్లాడక తలత్రిప్పి యూరకున్నది.

వర్ధనమ్మ గారు తమ్మునితో ‘నీతో చెప్పుటకు సిగ్గుపడుతుందేమోనోయీ’ అని యన్నది.

‘వారంతా సాయంత్రమునకు అమ్మాయిని చూడడానికి వస్తారు’ అని జమీందారు గారు స్నానమునకు లేచినారు.


౬ ( 6 )

కొత్తపేట


సుబ్బారాయుడు గారు మంచి సరసుడు, మాటకారి. తేనేలూరు నట్లేవ్యవహారమునైనను, తేట తెల్లముగ వివరింపగలరు. వ్యవహారదక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే యాయన మాటలు చెవులార వినుచుందురు. అప్పులిచ్చు షాహుకార్ల కందఱకు తప్పనివగు ధనసంబంధ వ్యాజ్యములలోదప్ప నితరముల యెడ నాయనకు సంపర్కమేదియు లేకపోయినను, చక్కని బుద్ధిసూక్ష్మత, పరిశీలనాదక్షత కలవాడగుటచే నేసంబంధమైనను, న్యాయసూత్రాలపట్ల విచిత్రాలోచన చేయగలడు. సలహా చెప్పగలడు. చదువుకొని పట్టాను బొందినచో భాష్యం అయ్యంగారు కాదగిన తెలివి యాయనకు గలదు. హిందూ న్యాయశాస్త్రములో నిదివరకు లేని కొన్ని సూక్మముల వివరించి యాయన యొసంగిన సలహాలవలన, ఒక దత్తతాభియోగము నెగ్గినదనియు, నా వ్యవహారపు దీర్పే దత్తతాన్యాయమును చాలావరకు మార్చినదనియు కోనసీమలోని పండిత పామరు లందరికిని దెలియును.

పచ్చని దబ్బపండుచాయ మానిసి, పొడగరి. ఆజానుబాహుడు. తెల్లగా నచ్చటచ్చట నెరసినతల, గడ్డము, మీసము లాయనకు వింతశోభ నిచ్చును. పొలముదిమ్మవంటి వక్షముతో, వట్రువలు తిరిగి కండలూరిన బాహుసంపదతో, కోలనై, బింక మొలుకు మోముతో, విశాలమై లోతైన కాటుక కన్నులతో, విరివియై విశాలమైన ఫాలముతో, తెల్లని యజ్ఞోపవీతముతో నాయన ద్రోణుని దలపించుచుండును.

సుబ్బారాయుడు గారి కెన్ని కథలు వచ్చునో లెక్క లేదు. ఆయన చెప్పు కథలు పెద్దలుగూడ తనివోవ వినుచుందురు. కొంచె మెచ్చుతగ్గుగా ననేక భాషలలోని గ్రంథములన్నియు నాయన పఠించినారు. కథలు సందర్భానుసారముగా నాయన కల్పించవలసి వచ్చిన కల్పించును. ఒక సారి కల్పించిన కథను మరల నెప్పటికిని మఱచిపోడు.

ఆ నాటి సాయంత్ర మేడుగంటలకు, దన నాల్గవ కొమరిత ఊకొట్టు చుండగా కాశీమజిలీలలోని అదృష్ట దీపుని కథ యాయన చెప్పుచుండెను. పెద్దకొమరుడు, నాతని సంతానమగు నిద్దఱు కొమాళ్ళును కొమార్తెయు, సుబ్బారాయుడు గారి భార్య జానకమ్మ గారు, కొందరు రైతులు, ఇరుగు పొరుగు బ్రాహ్మణులు, చుట్టములు, కాళ్లు పట్టుచున్న మంగలి, విసనకఱ్ఱ వీచుచున్న చాకలి యా కథ వినుచుండిరి. ఇంతలో గొన్ని బండ్లు వారి యింటిముం దాగిన చప్పుడైనది.

నారాయణరావు లోనికి వచ్చినాడు. ‘అన్నయ్య వచ్చాడు. అమ్మా! చిన్నన్నయ్యేవ్!’ అంటూ సూర్యకాంతం లేచి పరుగున అన్న గారిదగ్గరకు జేరినది. నారాయణరా వామెను సునాయాసముగ బైకెత్తి తనహృదయమున నదిమికొని ముద్దిడి క్రిందికి దింపినాడు. ‘చిన్న నాన్న గారు! తిన్న నాన్న గాలు! తిన్న నాన్న గాలు!’ అనుచు నారాయణరా వన్న కుమార్తెయు, నిరువురు కొమరులును, లేగదూడలవలె పినతండ్రికడకు పరుగు వారిరి. ముగ్గురి నొక సారిగా నెత్తి వేసికొని యొకరిని భుజముమీద, నిరువురిని జేతులలో నిముడించుకొని, చెల్లెలు తన్ను చేయి చుట్టి నడువ, ముందరి మండువాలోకి బోయినాడు. బండి వాడును, చాకలి, మంగళ్లు, సామానంతయు లోనికి జేర వేసిరి. నారాయణ రా వందులో నొక పెద్ద పెట్టె పై మండువాలో దింపించి, తాళము తీసి, యందులో నుండి బొమ్మ సామానులు, జపాను మర పనులు, చిత్రవిచిత్రములైనవి పుదుచ్చేరీపనులు, విక్టోరియా చిత్రవస్తుశాలలో కొన్న రాగి, వెండి, దంతపు, గంధపు శిల్పపుంబనులు, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్టణపు టద్దకపుదెరలు, ఖద్దరు, పట్టు, నూలు చొక్కాలు, పరికిణీలు, పొందూరు చీరలు, పయ్యద కండువాలు తీసి తన చుట్టు మూగిన తల్లికి, వదిన గారికి, పిల్లలకు, అన్న గారికి, పెదతల్లికి జూపించినాడు.

‘నా గుల్లంబండి బాగా వెలుతోంది’ అన్నాడు అన్న గారి చిన్న పిల్లవాడు.

‘చిన్నాన్న గారూ! నా మోటారు బాగా లేదుటండీ, తమ్ముడు బండి కంటే!’ యని పెద్దవాడు. ‘ఒరే తమ్ముడూ! నాకు తెచ్చిన యీ వెండి బొమ్మ సామానంత మంచివి కావురా మీవి?’ అన్నది యన్న కొమరిత.

మంచిరంగులు వేసి బొంబాయిలో జరీ పువ్వుల పని చేసిన పొందూరు కండువాలు చూచుకొనుచు, గంధపుబొమ్మలు మొదలైనవి గమనించుకొనుచు, సూర్యకాంతము ముసిముసి నవ్వులతో మురిసిపోయినది.

‘నారాయుడు మూడువందల రూపాయలకు తక్కువ ఖర్చు చేసి ఉండడు వీటికోసం. డబ్బంటే మంచినీళ్ళు తాగుతాడు’ అనుచు నన్నయగు శ్రీరామమూర్తి విస్తుపోవుచు జూచినాడు.

శ్రీరామమూర్తి కి తమ్ముడన్న నెంత ప్రేమయున్నదో, నారాయణరావుతక్క దక్కినలోక మెఱుగదు. తలిదండ్రులు, శ్రీరామమూర్తి భార్య వరలక్ష్మమ్మయు గొంచెముగా నెఱుంగుదురేమో. శ్రీరామమూర్తి, సుబ్బారాయుడు గారికి, జానకమ్మ గారికి ప్రథమ సంతానము. ముప్పదియేండ్ల యీడు వాడై, బి. ఏ., ప్లీడరుషిప్పు పరీక్షలలో గృతార్థుడై, యమలాపురములో వృత్తి జేయుచు, ధనము బాగుగా సముపార్జించుచు, బేరుగాంచిన న్యాయవాది యతడు. వ్యవహారముల నారి తేరిన బంటు. కోర్టు, ఇల్లు, తనయూరు, తన యాలుబిడ్డలు, తలిదండ్రులు, తమ్ముడు, చెల్లెళ్ళు, ఆలివంక బందుగులు, దగ్గర బందుగులు_అదియే యతని ప్రపంచము. సాంఘిక రాజ్యాంగ వ్యవహారములతో నాతనికి నిమిత్తము లేదు. మేనమామ పోలికతో గొంచెము స్థూల మనిపించు చామనచాయ రూపము. అయిదడుగుల ఏడంగుళముల పొడవయ్యు దమ్మునికన్న , దండ్రికన్న నాతడు చాల పొట్టి.

‘అన్నయ్యా! నీకోసం యీ మంచిగంధపు ఉత్తరాలపెట్టె పట్టుకు వచ్చాను. బాగుందా? దీని పనితనం చూడు. మూతమీద గోవర్ధనోద్ధరణం, లోపల కైలాసపర్వతం రావణుడు ఎత్తడం చెక్కి ఉన్నది. కింద రాముడు లేడికై పరుగెత్తడం, పక్కల్ని అశోకవనంలో సీత, బృందావనంలో గోపి కృష్ణులను చేశాడు. దీని ఖరీదు డెబ్భై అయిదు రూపాయలు.’

‘ఇంత చిన్న దానికే అంత ఖరీ దేమిటి రా!’

‘శిల్పపుపని విలువ అది’ అన్నది వదిన గారు.

‘ఏమమ్మోయి వదినా! నీకు తెచ్చిన పొందూరుచీర యిదిగో.’

‘ఎందుకురా పొందూరు కొనడం? మామూలు ఖద్దరులోనే సన్నరకం ఏ డెనిమిది పెడ్తే వస్తాయిగదుట్రా’ అన్నా డన్నగారు.

‘అదిగా దన్నయ్యా! బండఖద్దరుచీరలు కట్టుకుంటూంది. అసలే కొంచెం బొద్దుమనిషి. అందులో సాదాఖద్దరు చీరలు కట్టుకుంటుంటే రెండు రెట్లయింది వదిన అని, మూడు పాటినూలువి, ఒక పట్టుశాలీ నూలుది నాల్గూ కొనుక్కు చక్కావచ్చాను. అమ్మకి నాల్గు పట్టుకువచ్చాను. నీకు జరీకండువాలు రెండు. ఒకటి పొందూరుది, ఒకటి సేలంది. నాన్న గారికి బందరు పురిటి గడ్డవి, నాల్గు ఎఱ్ఱఅద్దకం పంచెలు పట్టుకువచ్చాను. ఇంకా ఉన్నాయి. అక్కయ్యలకీ, కన్న తల్లికీ, అమ్మడికీ, పిల్లలకీ, నీకూ నాకూను. కన్న తల్లి ఏదఱ్ఱా?’ ‘మందపల్లి మామయ్య గారింటికి వెళ్ళింది. వస్తూఉంటుంది’ అన్నాడు శ్రీరామమూర్తి. హృదయము వికసించి, యాతని మోము వెన్నెల వెలుగయినది. తమ్ముని గుణగణములు రోజుకు మూడు నాల్గుసారులు తక్కువ కాకుండ నితరులకడ నాతడు వర్ణన చేయుచుండును.

‘మా తమ్ముడున్నాడే వాడి దేహం, ఎంత వజ్రమో, హృదయం అంత నవనీతం సుమండీ! మా నాన్నగారి తెలివి తేటలు దశమి వెన్నెలైతే, మా వాడి జ్ఞానం పున్నమ వెన్నెలండీ! మనకు స్వరాజ్యమంటూ వస్తే మా వాడు ముఖ్యమంత్రి అవవలసిందే. నౌరోజీ, దాసు, నెహ్రూ, రాధాకృష్ణ, పట్టాభి, హాల్డేను మొదలైన వాళ్ళతో సమమైన బుఱ్ఱండీ’ అని యనుచుండును.

తాను లోభియయ్యు, దమ్ము డిట్లు ధనము వెచ్చించుటన్న నాతనికి బరమప్రీతి. అతని హృదయాంతరాళమున నణగిమణగియున్న యుత్కృష్ట గుణములన్నియు దమ్ముడగు నారాయణ రావుకడ జాగృతములై ప్రత్యక్షమైనవి.

ఈ సంగతియంతయు సూక్ష్మగ్రాహియగు నారాయణరావున కవగతమే!

‘పరమలోభి, గట్టిమనస్సువాడూ ఐన అన్న గారంటే అంత గౌరవం, అంత ప్రేమా ఏమిటా నారాయుడికి’ అని యాతని స్నేహితు లెన్ని సారులు గుసగుసలు వోయినారో!

‘ఏమిరా చిన్న బాబూ! నాన్న గారు పంపించిన అయిదువందలూ ఖర్చు చేసేశావా’ అన్నది తల్లి.

‘ఆఁ! ఇంకో నూటయాభై రూపాయల సరకు వీ. పీ. గా వస్తుంది, అమ్మా!’

‘కొడుకుసోద్యాలు చూసి సంతోషించడమేనా, మాకు నాల్గు మెతుకు లేవన్నా పారేయించేదున్నదా!’ అని యప్పుడే లోనికి లక్ష్మీపతితో వచ్చిన సుబ్బారాయుడు గారు భార్యను నవ్వుచు బ్రశ్నించినారు.

వేళాకోళములు చేయుటలో సుబ్బారాయుడు గారద్వితీయులు. అందులో భార్య నెప్పుడు బరిహాసములతో ముంచివేయుచుండును.

మా అక్కయ్య వంట చేసికొని కూచుంది. ఎనిమిదైనా మీరు లేవక పోతే! రోజూ ఎంత మొత్తుకొన్నా తొమ్మిదింటికైనా భోజనానికి లేచి రాని మీకు ఈ వాళ పట్న వాసాన్నుంచి అబ్బాయి, అల్లుడూ వచ్చారని, ఇంత తొందరగా జఠరాగ్ని కదిలింది!’

గుమ్మం దగ్గర నిలుచుండి నారాయణరావు కొని తెచ్చిన వింతలన్నియు గమనించు చుండిన జానకమ్మ గారి యక్క , లక్ష్మీనరసమ్మ గారు ‘మరది గారికి కొత్తటే అమ్మాయీ! ఉన్నదోటీ అనేదొహటీ’ అని పలికినది. ‘అప్పచెల్లెళ్లిద్దరూ వీరసతు లౌతున్నారు. ఆడవాళ్లు తలుచుకుంటే మొగాళ్లు మూలగదుల్లో దాగాలిసిందే’ అని సుబ్బారాయుడు గారు నవ్వుకొన్నారు.


౭ ( 7 )

పరమేశ్వరమూర్తి


పరమేశ్వరమూర్తి రాజారావును సామర్లకోట స్టేషనులో కాకినాడ బండి నెక్కించి, తానుబోయి మరల మెయిలులో గూర్చుండి నాడు. పరమేశ్వరమూర్తి పలుచని శరీరము, సొగసైన కన్నులు, పసిమిపచ్చరంగున గలియుటకు యత్నించు చామనచాయ, చీలిక గడ్డము, సమఫాలము, సన్నని పెదవులు, లెక్క పెట్టుటకు వీలున్న నల్లని మీసములుగల వాడు. చిన్న చెవులు, సన్నని పొడుగాటి కంఠము, విస్ఫారితము గాని భుజస్కంధము, గుండ్రని నున్నని కరములు, చిన్న చేతులుగల అతని కోమలశరీరమున నాడుదన ముట్టిపడుచుండును. ఈతలో ప్రథమ బహుమానమంది పోటుమానిసి యనిపించుకొను టొక్కటియే యాతని స్త్రీత్వమునకు దీరనికొఱత తెచ్చి పెట్టినది.

సహజ పంచమస్వనమున గంఠము తేనెలూర సంగీతము పాడుకొనును. నిత్య నవీనములై ఆర్ద్రము లైన ప్రకృతి విలాసము లాతని ధ్యానముద్రలో వికసించి మురిపించును.

ప్రకృతి యాతని యాలోచనాశక్తిని ప్రోవిసేయు పెంపుడుతల్లి. ప్రకృతిలో నే మార్పును జూచినను ఆతని హృదయము చలించిపోవును. సృష్టిలో ప్రతిపదార్ధమును పరమేశ్వరమూర్తికి మేరుపర్వత సమానమై గోచరించును. దృశ్యమానములగు ప్రకృతివికారము లెల్ల, కాలనాటికారంగములుగా బ్రత్యక్షమై, యాతనిని వివిధ వికారములకు లోనుజేయును.

పరమేశ్వరమూర్తికి ప్రాపంచిక మైన వ్యవహార పథము లపరిచితములు. ఆతని నావరించియున్న సహజపాండిత్యమే యాతనికి బరీక్షలలో జయము గొని తెచ్చి యాతనికే యాశ్చర్యము గొల్పుచుండును.

ప్రాణస్నేహితుడగు నారాయణరావువలె పరమేశ్వరమూర్తి గూడ సౌందర్యోపాసకుడు. అపశ్రుతియన్న యాతని హృదయము తటతట కొట్టుకొని విహ్వలించును. ఒక నా డాతడు స్నేహితుని ఇంటికి బోయి, చక్కగా నలంకరించియున్న యాతని గదిని చూచెను. తెల్లనిగోడల పైన నచ్చటచ్చట ప్రఖ్యాత భారతీయ చిత్ర కారుల ప్రసిద్ధ చిత్రాల ప్రతులు అలంకరింపబడియున్నవి. ద్వారములకు గవాక్షములకు ఖద్దరుపై మనోహరవర్ణములు చిత్రించిన మచిలీపట్టణపు, పంజాబు దేశపు కలంకారీ అద్దకపు దెరలు వ్రేలాడదీసియున్నవి. శోభాయమానమగు నా మందిరములో నొక యెడ దగిలించియుంచిన క్యాలెండరు బొమ్మను గాంచి, పరమేశ్వరుడు వణకిపోయినాడు. అతని కంటిలో రాక్షసి బొగ్గునలక పడినట్లయినది. పంటి క్రింద నిసుక రేణువులు నమలినట్లయినది.

పరమేశ్వరమూర్తికి జిన్నతనములో వివాహమైనది. అతడెంత రసగ్రహణపారీణుడో యాతని భార్య యంత నిష్కళాహృదయ. ఆమెకు సౌందర్యమన్న నేమో తెలియదు. అలంకరించుకొనుట యంతకుమున్నే యెరుగదు. ఆమె యచ్చపుగృహిణి. గృహకృత్యము లవలీలగ నెరవేర్చును. ఉదయమున లేచినది మొదలు రాత్రి భర్తను జేరువరకు నామె యొక క్షణమైన తీరుబడి లేక మధుపమువలె బని చేయుచుండును. వంటయిల్లలికి ముగ్గులు పెట్టును. కూరలు తరగును, బియ్యము కడిగియిచ్చును. రాత్రి తానే మడికట్టుకొనును. ఆడబిడ్డ లెవరైనా వచ్చినచో వారి పిల్లలకు నన్నియు నమర్చును.

రూప రేఖావిలాసముల కామె నోచుకొనకున్నను, ఆమెలో నొక వింత యందము తొలుకాడుచుండును. ఆమె కన్ను లద్భుతములు. నిష్కపటమై శాంతిపూర్ణమగు నామెహృదయ మాకన్నులలో ప్రతిఫలించును. అవి వెడదలై నల్లనై, దీర్ఘపక్ష్మముల వితానముక్రింద బ్రేమమున నడయాడుచుండును.

ఆమె పతిప్రాణయయ్యు హావభావవిలాసములచే భర్తహృదయమును రంజింపజేయుటకై యత్నింపదు. పరమేశ్వరమూర్తి యామెను ప్రక్క పాపట తీసి కీలుజడ యల్లుకొనుమని కోరును. లేనిచో మధ్యపాపటతీసి బొంబాయిముడి ముడుచుకొమ్మని కోరును. మోమున కంగరాగము లలదుకొమ్మనును. తెల్ల చీరలు ధరింపుమనును. ‘వంగపండుచాయ వస్త్రములు రాత్రి వేళ దేహమును విచిత్రముగ శోభింపజేయును’ అని భార్యతో వాదించును.

ఆ మాటలకు రుక్మిణి చిరునవ్వు నవ్వుకొనును. అంతమాత్రమే! అతని కోర్కెల పరిపాలించుట నాటక స్త్రీలకు జెల్లును గాని సంసారులకు గాదని యామె యూహ.

పరమేశ్వరమూర్తి పిఠాపురము జేరి యింటి కేగునప్పటికి రుక్మిణి మోము ప్రఫుల్లమయినది. ఆమె నయనముల దివ్యకాంతులు ప్రసరించినవి.

తనతోగూడ గదిలోనికి వచ్చిన భార్యను కౌగిలించుకొని ముద్దిడుకొన్నాడు. అచ్చట నెవ్వరు లేకపోయినను రుక్మిణి సిగ్గుపడి ‘అబ్బా, మీ కెప్పడూ ఈలాంటి పను లేనండి’ యన్నది.

‘నా ప్రేమ నాపలేక అల్లాచేశాను. నేను రాసిన యెనిమిది ఉత్తరాలకూ నువ్వు రెండుత్తరాలు జవాబు రాస్తావు. నీది కటిక హృదయం రుక్మిణీ! మూడు నెల్లు విరహ వేదన పడ్డానే! నీ బొమ్మే నాకు దిక్కా! ఎన్నాళ్లు నీకు ప్రణయ విలాసాన్ని నేర్పినా పూర్వకాలపు పునిస్త్రీవే కదా నువ్వు!’

‘నే నేం చేయనండి! అత్తగారికి తెలుస్తుందేమోనన్న భయం. ఆ రెండుత్తరాలేనా పనిదాని చేత రహస్యంగా కవర్లు తెప్పించి రాశాను.’

‘పైగా ఆ రాతేమిటి! ఎవరికి రాసిందో తెలీదు. ఏవో రెండుముక్కలు గిలికితే ఉత్తరం అవుతుందా!’ ఆమె తెల్లబోయి భర్తవంక జూచినది.

‘పోనీలే. ఇదేమిటి? ఈ గది ఇలా ఉంచావు? గదిని అలంకరించడం జన్మ నలంకరించుకోవడమే అని చెప్పలేదూ నేను! మరి ఈ సామాను కొట్టేమిటి?’

‘మీరు దూరానఉంటే నా కెందుండీ! ఎల్లాగండీ గది అలంకరించుకొని కూచునేది?’

‘పోనీలే’ యని పరమేశ్వరుడు రుక్మిణిని మరల తన హృదయమునకు హత్తుకొని ‘ఒక ముద్ది’ మ్మనియెను. ఆమె లజ్జారుణవదనయై యిటు నటు చూచి నాథుని పెదవుల తన పెదవుల నొక్కి, ‘వస్తా’ నని యింటిలోనికి మాయమైనది.

పరమేశ్వరమూర్తి శ్రుత్యపశ్రుతులు వెలుగు నీడలవంటివని యెఱుగును. ఎంత విచిత్రమగు శ్రుతి నీ వాపాదించుకొనగలవో యంత యపశ్రుతి వెన్నంటి గోచరించుచునే యుండును. రూపెత్తిన తన యాశయమై, పులకరాలు గలుగ జేయు బాలిక భార్యయైనదని సంతసింతమన్న నామె తన్ను ప్రేమింపకయైన పోవును, లేదా కర్కశహృదయయైన నగును. పరిపూర్ణత యెక్కడి దీ సృష్టిలో!

తల్లిదండ్రులతో ముచ్చటలాడి, పుట్టింటికి బిడ్డలతో వచ్చియున్న చెల్లెలితో మృదూక్తులాడి బిడ్డల నాడించి, పట్టణము నుంచి కొని తెచ్చిన బహుమతు లెవరివి వారికిచ్చి, భోజనమాచరించి, నిదురబోయి లేచి, పరమేశ్వరుడు గది నలంకరించుకొన మొదలిడినాడు.

వచ్చిన నాటి రెండవరోజున పరమేశ్వరునకు నారాయణకడనుండి కమ్మ వచ్చినది.

‘ఓరి పరమం! నా హృదయానికి ఎంతో దగ్గిర ఉన్న కవిరాజూ! విను, ఆ బాలిక సౌందర్యం అసలు శారదకు లేదు. నన్నూ, నా హృదయాన్నీ, నా ఆత్మనీ తనలో పెనవేసుకుంది. తనలో ఐక్యం చేసుకుంది. మా చిత్రకార మండలిలో ఆమె బొమ్మ చిత్రించడానికి ఒక్కరికైనా కుంచె నడవదోయి. ఆమె శరీర సౌష్ఠవము విడివడబోయే మల్లెమొగ్గల పోగేరా! ఆమె కళ్ళల్లో కథలు నర్తించాయి. జమిందారుగారితోకూడా వచ్చాడే, ఆయన-శ్రీనివాసరావు గారు ఆ ఊళ్ళోకల్లా మంచి ప్లీడరు. ఆయన ఇంటిదగ్గర నుంచి వెళ్ళాం జమీందారు గారి ఇంటికి. ఆయన ‘పిల్ల నచ్చిందా’ అని అడిగాడు. నచ్చిందని చెప్పటానికి నేను తగుదునురా పరమం! ఆ బంగారుపోత విగ్రహానికి, ఆ పువ్వుల ప్రోవుకు, ఆ దివ్య బాలికామణికి నేను తగుదునా పల్లెటూరి బండమనిషిని! నువ్వు రైలులోనే జమిందారు గారి ఉద్దేశం గ్రహించావుకదా! మన వాళ్లందరూ అదే గ్రహించారు. నాకూ నిముషంలో అవగాహన అయింది. అప్పటినుండీ నాకు ఒకటే సిగ్గు. వారి అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి చేయకుండా ఉంచింది నా యీ కర్కశ పురుషత్వానికి బలియివ్వడాని కేమో! ‘తప్పక సంబంధం నిశ్చయం అవుతుంది. నువ్వు వివాహానికి నీ భార్యతో రావాలి. అమ్మ గారినీ నాన్న గారినీ అన్న దమ్ములను బావ గారిని చెల్లెలిని నువ్వు నాకోసం బలవంత పెట్టి తీనుకు రాగలిగితే నీకు నేనేమివ్వగలను రా ? తలుపు దగ్గర పాట నిన్ను పాడనిస్తా.

‘సర్వకాలాలా ఆ బాలిక నాకు ప్రత్యక్షమవుతోంది. నన్ను ఒక విచిత్రానందం అలుముకుపోయినట్లుగా ఉన్నదోయీ!

‘ఇల్లా ఉండగా ఒక భయము నన్ను ఆవేశించింది. మా వ్యాపారములు చాలా బాగానే ఉన్నాయి. మేమూ కొంచెం భాగ్యవంతులమనే చెప్పాలి కదా! అయినప్పటికీ బాలిక జమిందారీ కుటుంబంలో జన్మించింది. రాజ భోగములో పెరిగింది. రాచఠీవి ఆమెలో పుంజీభవించి ఉంటుంది. ఉంటే యీ సామాన్య సంసారంతో ఆమె కలయిక మా జీవితాలకి విషాదాంతం అవుతుందేమో!

‘అంటే ఈ వివాహంవల్ల నాకూ నా కుటుంబానికి ఎడబాట్లయ్యే విధి వ్రాత తటస్థిస్తే నాకు జన్మాంతం తీరని వ్యధే కదా! పోనీ మా అన్నయ్యకిమల్లే నేనున్నూ ఉద్యోగంరీత్యా పర దేశంలో ఉంటానుగనుక పరవా లేదు అనుకుందాం (అల్లా అని అనుకోవడం నాకు చాలా కష్టంగా తోచినది). అయినా ఆ బాలిక నన్ను ప్రేమించక రాచపట్టిననే గర్వంలో మునిగి ఉండేందుకు ఎక్కువ సావకాశాలుంటవనుకో! అప్పుడు నా బ్రతుకు శూన్యమవుతుంది. ఆలోచన చేయలేకుండా ఉన్నానురా పరమం.

‘ఈ పిచ్చి ఉత్తరాన్ని చూసి నన్ను పిచ్చివాణ్ణి అనుకున్నా సరే! ఈ సందర్భంలో నువ్వు దగ్గర లేకపోవడం, నాలోని చైతన్యం మాయమైనట్టుగా ఉంది. నువ్వూ ఇప్పుడే కొత్తగా చేరుకొన్నావు నీ సంసారాన్ని . ఇంతలోనే మళ్ళీ వానప్రస్థాశ్రమం స్వీకరించరా అని ఎట్లా అన్ను? జాగ్రత్తగా ఆలోచించి జవాబురాయి. డాకుదొరకి కాకినాడ రాశాను. మా యిద్దరే నా కేడుగడలు.

‘ప్రేమనేది నిజమేననిన్నీ, అది పుస్తకాల్లో మాత్రం ఉండే వట్టి బూటకమనేవారి వాదన అనుభవరహితమనిన్నీ మనం ఇదివరకే అనుకున్నాం. అట్లాంటి ప్రేమ నన్నిప్పు డావరించుకుందోయి. ఆ బాలిక నా హృదయాన్ని కాలుడు సత్యవంతుని జీవాన్ని బొమ్మలో లాగుతున్నట్లు లాగివేసిందిరా! అది నిజమైన ప్రేమకావచ్చును; లేక వట్టి వాంఛేనా కావచ్చును. కాని ఆ బాలికను నేను కరగ్రహణం చేయనినాడు నాజన్మ ఎడారి అని భావించుకుంటున్నా, ఏమో! ఆమెను చూడ్డానికి వెళ్లనిమునుపు పిల్ల తెల్లగా పాలిపోయి ప్రాణం లేకుండ క్షయరోగం పట్టి పీడించేవ్యక్తి లాగు, ఈదురో అంటూ ఉంటుందనిన్నీ, ఏదో కాస్త సంగీతం, కాస్తన్నర ఇంగ్లీషు, అరకాస్త తెలుగు, పరకకాస్త సంస్కృతం బలవంతంగా నేర్చిన చిలకల్లే ఉంటుందనిన్నీ, కన్ను, ముక్కు, గడ్డం విభేదం లేకుండా ఉండే మూర్తి అయివుంటుందనిన్నీ, మా బావా, నేనూ అనుకున్నాం. కాని, ఆమె మానవ బాలిక కాదురా, మన్మథ సృష్టిరా! సరస్వతి సపత్నిరా!

‘ఏమి సంగీతం, ఏమి మాధుర్యం! ఆమె మూర్తి దాల్చిన కళాధిదేవతంటే నమ్ము. మేము అక్కడ కరిగిపోయాము. లోకోత్తరుడగు శ్రీరామయ్య గారి ఆంతరంగిక శిష్యురాలనని ఫిడేలు వాయిద్యంలో చాటుకుందిరా.

‘మా బావ, భాషలు తదితర పాండిత్యం సానపైపెట్టి ఒరచిచూచాడు.

‘ఆ బాలిక హృదయం చూరగొనాలి అని తన్మయుణ్ణయి, మతి చలించిన నాకు తీవ్రావేశం కలిగింది. ఆ బాలిక ఫిడేలు అందుకున్నాను. చెన్నపట్నంలో నేను నేర్చినవిద్య, వెంకటస్వామి నాయని మాధుర్యంతో, దక్షిణా పథాలు తిరిగి గమనించి హృదయస్థం గావించుకొన్న గోవిందస్వామిపిళ్ళే, చౌడయ్యల చమత్కృతులతో గుప్పేశాను సంగీతం వెన్నెల. ఆ రోజున ఎందుకైనా మంచిదని మహ అద్భుతంగా వేషం వేశాను. ఎలాంటి వస్త్రము అలంకరించానో నువ్వు ఊహించి ఉత్తరంలో రాయి.

‘మరి ఆ బాల నన్ను విస్తుబోయి చూసిందని నా అభిప్రాయం. మా బావ అభిప్రాయం అదే!

‘జవాబుకు ఎదురు చూస్తూ నువ్వు దగ్గర లేవని పరితపించే నీ నారాయుడు.’


౮ ( 8 )

‘ఔనా, కాదా?’


ఇంతలో లక్ష్మీపతి భార్య రమణమ్మ పిల్లవాని నెత్తుకొని బండి దిగినది. అన్నయ్య వచ్చాడూ! ఎంత సేపయింది అన్నయ్యా నువ్వు బండిదిగి? మందపల్లిలో వెంకట్రాయుడు మామయ్య గారి యింట్లో మాట్లాడుతూఉంటే పొద్దు పోయింది. ఇంతలో బాబు ఏడ్చాడు. నాలుగు వేడి మెతుకులు పెట్టి బయల్దేరాను. అత్తయ్య ఒకటే బలవంతం.’

‘బావా, నేనూ వస్తున్నామని అత్తయ్యతో చెప్పడానికి సిగ్గుపడ్డావేమిటి? ఇందాకటినుంచి ఇంకా రాలేదని బావ ఒకటే చూడ్డం గుమ్మం వైపు!’

‘నారాయణ గారూ, అల్లా చూసేరోజులు వచ్చాయి. నేను చూసే వాణ్ణో కాదో నీ హృదయానికి తెలవదురా వెఱ్ఱివాడా!’

‘ఇలా యివ్వవే బాచిగాణ్ణి! రాడేం? కొత్తవచ్చింది! ఏడుపు మొగం పెట్టాడు. మీ నాన్న వచ్చాడురా. సూరీడూ! బాచిగాడికి తెచ్చిన గిలకలు, బొమ్మలు ఇల్లా తేవే. ఇవిగోరా! ఆరీ నీ! లంచం యిస్తే వచ్చాడు. బావా వీడు ఓవర్ సీయర్ పని చేసేటట్టున్నాడోయి, అసాధ్యుడు. ఆ బూరా ఇయ్యి, నీ దగ్గరకు వస్తాడు. ఆ! వెళ్ళాడూ! వీడు తప్పకుండా, లంచగొండే! అచ్ఛా.’ బాచిగాడు ఆటలో కెవ్వుమని కేరింతలాడినాడు. తండ్రి చేతుల్లో ఎగురుట ప్రారంభించినాడు. లక్ష్మీపతి తొనలు తిరిగి పండువలె నున్న తన కుమారుని ముద్దిడుకొని సూర్యకాంతం చేతి కిచ్చినాడు.

‘బాచిగాణ్ణి నా కియ్యవూ సూరీడత్తయ్యా!’ అని శ్రీరామమూర్తి తనయ, జానకి, బాలకు నెత్తుకున్నది.

చాకలివాడును, పనికత్తెయు వేడినీళ్లు తోడగా సుబ్బారాయుడు గారు, లక్ష్మీపతి, శ్రీరామమూర్తి, నారాయణరావు స్నానములకు బోయినారు. సూర్యకాంతం అన్న గార్లకు, బావ గారికి సబ్బుబిళ్ల లందించినది. మంగలివా డొడళ్లు తోమినాడు. రమణమ్మ తెల్లని తువాలుమడత లందీయ, దుడుచుకొని, యామె యందిచ్చిన పట్టు తాపి తాను ధరించి మువ్వురు వంటవసారా నంటియున్న పడమటింటిలో యథాస్థానముల నధివసించిరి. సుబ్బారాయుడు గారు కోడ లందిచ్చిన యంగ వస్త్రము చే దడియార్చికొని, పీట పైనుంచిన మడిపంచెల జతలో నొక దాని గట్టి, సంధ్యావందనము ప్రారంభించినారు.

జపము కొంత యగుటయు, వడ్డన ప్రారంభించవచ్చునని తన మామూలు పద్ధతిని విస్తరివైపు చేయిచూపి తలయూపి నారు. జానకమ్మ గారి యక్క గారు వడ్డన ప్రారంభించి పూర్తి చేయునప్పటికి, ‘చతుస్సాగరపర్యంతం’ అని ప్రారంభించి గోత్ర ప్రవరులు పఠించి, సంధ్యావందనము ముగించిరి. అందరు నొక్క సారిగా నాపోశనములు గ్రహించినారు. భోజనములు కొంత వరకైనవి. పచ్చడి కలుపుకొనుచు సుబ్బారాయుడు గారు తమ యల్లుని దిక్కు మొగమై ‘మీరు ఆలస్యంగా వచ్చారు. బస్సు చెడిపోయిందా యేమిటి, దారిలో!’ అని సంభాషణ ప్రారంభించెను.

మామ గారన్న లక్ష్మీపతికి మిక్కిలి గౌరవము, భయము, భక్తి . అల్లుడన పరమ ప్రేమ మామగారికి.

‘కాదండి, విశ్వలాపురం జమిందారు గారు తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాద రావు గారు రాజమండ్రిలో ఉన్నారు...’

‘అవును, ఆయన చాలా మంచివాడు. శాసనసభలో ఎప్పుడూ రైతుల తరఫున మాట్లాడుతూ ఉంటాడు. గాంధి గారి శకం రాక మునుపు, పేరు ప్రతిష్టలతో పూజింపబడే ఆంధ్ర నాయకులలో ఆయన ఒకరు. ఆయన్ని బాగా ఎరుగుదును. జమీందారైనా నియోగులలో చాలా గౌరవంగా జీవిస్తున్న నాయకుడు.’

‘ఆయనకు వివాహం కావలసిన బాలిక ఒకర్తె ఉన్నది.’

‘ఊఁ!’

జానకమ్మ గారు దొడ్డిలో చల్ల గాలికి కూర్చుండియున్నది; యీ మాట విని లోనికి జూచినది.

‘మా చిన్న బావకు తమ కుమార్తెనిద్దామని వారికి సంకల్పం కలిగింది. వారూ మేమూ బెజవాడ ప్లాటుఫారంలో తారసిల్లాము. ఆయన నారాయణ బావసంగతి ఎల్లా గ్రహించాడో మమ్మల్ని బలవంతం పెట్టి రాజమండ్రిలో ఆపుజేశారు.’

‘వాళ్ళింట్లోనే!’ అని జానకమ్మ గారు అల్లుణ్ణి పృచ్ఛ జేసినారు.

‘అబ్బా! అప్పుడే జమిందారుల పేరు చెప్పేటప్పటికి ఒక్క గంతేసింది. బంగారపు తాళ్ళెట్టి యీడ్పించుకోవాలి. బంగారపు చీపురుకట్టతో కొట్టించుకోవాలి.’

‘ఊరుకుందురూ! మీ రెప్పుడూ వేళాకోళం చేస్తూనే ఉంటారు.’

‘ఇది వేళాకోళం అంటుందేమిటి? గాదిరాజువారి సంబంధం వచ్చినప్పడు కట్నాల సంగతి మనం కాదు కాబోలు, నిష్కర్షగా చెప్పి వాళ్ళను ‘వచ్చిందే దారి’ అని అనిపించింది.’

‘అవును. మొదట నగలమాట వారు నిష్కర్షగా అడిగితే నేను లాంఛనాల మాటడిగాను. మీరు బెల్లంకొట్టినట్లు మాట్లాడక ఊరుకుంటే, ఇంత నిష్కర్షగా అడిగే వాళ్ళ సంబంధం ఇష్టం లేక ఆయెత్తు యెత్తాను. అది తప్పుటే అక్కయ్యా?’

‘తప్పనా ఏమి? జమిందారుకు వియ్యపరాల నౌతాననే సంతోషం చేత, కతికితే అతకదని విచారంలో మునిగి ఉన్నావనుకున్నాను’ అని సుబ్బారాయుడు గారు నవ్వగా జానకమ్మ గారు, శ్రీరామమూర్తి, లక్ష్మీనరసమ్మ గారు నవ్వుకున్నారు.

శ్రీరామమూర్తి: ఇంతకూ ఎక్కడోయి మకాం, రాజమండ్రిలో?

లక్ష్మీపతి: శ్రీనివాసరావు గారింట్లో.

శ్రీరా: ప్లీడరు శ్రీనివాసరావు గారేనా? జమీందారుగారూ, ఆయనా జీవికాజీవులే.

సుబ్బారాయుడుగారు: అమ్మయ్యా!

జానకమ్మగారు: మళ్ళీ మొదలెట్టారూ?

సుబ్బా: తర్వాత ఏం జరిగింది?

జన: మీ కిప్పు డాదుర్దా వచ్చిందేమి?

శ్రీరా: ఉండవే అమ్మా! లక్ష్మీపతిని చెప్పనియ్యి.

లక్ష్మీ: నారాయణా, నేనూ వెళ్ళి పిల్లనుచూశాం. అమ్మాయి చాలా అందంగా ఉంది. మంచి తెలివైన పిల్ల. బాగా చదువు చెప్పిస్తున్నారు. సంగీతంలో నిధి.

జన: చిన్న బాబు ఈమధ్య మరీ బాగా నేర్చుకొన్నాడన్నారూ!

లక్ష్మీ: అతనూ ఫిడేలు వాయించాడు.

లక్ష్మీపతి బావమరదివంక జూచినాడు. ఇంతవరకూ హృదయములో నానందరాగములు వినుచున్న నారాయణ రావు, చిరు బొమముడిలో బావగారివంక జవాబు పరపినాడు.

లక్ష్మీ: వారంతా మంచిరోజు చూచి మామ గారితో మాట్లాడ్డానికి వస్తారనుకుంటాను. జమిందారు గారు బావంటే వెఱ్ఱిపడిపోతున్నారు.

జమిందారు గారి యాడంగులు తెరవెనుక నుండి నారాయణ రావును చూచిరనియు, దాను బాలిక నింగ్లీషుభాషలో, తెలుగులో, నితర విషయములలో బరీక్ష జేసితిననియు, లక్ష్మీపతి చెప్పగా నందఱు వినిరి. ఎవరి యాలోచనలు వారి నలముకొన్నవి.

సావిట్లో సుబ్బారాయుడు గారు పెద్ద కుమారునితో సంబంధము విషయమై రాత్రి రెండుజాములవరకు ముచ్చటించి, తమ కా సంబంధము కాకుండుటయే మంచిదని నిశ్చయించినారు. లక్ష్మీపతి దక్షిణపుగదులలో తనగది జేరినాడు. నారాయణ రావు తల్లికడ జేరి జమిందారు గారినిగుఱించి ముచ్చటించి, తండ్రిగారితోపాటు తనకై యారుబయట వేసిన మంచము పై పవ్వళించి నిదుర పోయినాడు.

నాల్గురోజులయిన వెనుక పరమేశ్వరమూర్తి వ్రాసిన లేఖయు, కాకినాడ నుండి రాజారావు వ్రాసిన లేఖయు వచ్చినవి.

‘నేను కవిత్వం వ్రాయలేను. అయినా కవిత్వం అంటే నాకు పరమ ప్రీతియన్న సంగతి తెలుసునుగదా. నువ్వు వ్రాసిన ఉత్తరం నాకు గల్గించిన సంతోషం, నేను పద్యాలు వ్రాసేవాణ్ణే అయితే నూరు పద్యాల్లో గుప్పి వేసే వాణ్ణి. లెక్కలవాణ్ణి కాబట్టి రెండుముక్కల్లో నా అభిప్రాయం తెలుపుతాను.

‘ఒకటి — జమిందారు గారి కుటుంబానికీ మీ కుటుంబానికీ పొత్తు కలవదని మనం ఊహించడం న్యాయం.

‘రెండు—జమిందారీ కుటుంబంలో నిష్కళంక మైనట్టిన్నీ, నిర్మల మైనట్టిన్నీ, ప్రేమపూరితమైన హృదయాలు ఉండడం అరుదు.

‘మూడు— పెళ్ళికుమార్తెకు కూడా నువ్వంటే ప్రేమకుదరడం కొంచెం కష్టం.

‘నాల్గు.అంత గొప్ప కుటుంబాలలో, నాగరికతలో మునిగి వున్న వాళ్ళలో ఆరోగ్యము చాల హీనముగా ఉంటుంది. నీకున్న బల సంపదకి బలహీనురాలై జన్మపొడుగునా ఏవో రోగాలతో మూల్గే బాలిక భార్య కావడం ప్రశస్తం కాదు.

‘అయినా ఈ యాపత్తులకు పూర్వపక్షాలు ఉన్నాయి. అవికూడా చాలా ముఖ్య మైనవే.

‘ఒకటి_జమీందారు గారు నీవిషయమై విపరీతమైన ప్రేమతో ఉన్నారు. తక్కినవాళ్ళెట్లా ఉన్నా, ఆయన ఒక్కడుచాలు రెండు కుటుంబాలూ సరీగ్గా ఉండడానికి. మీ కుటుంబము ఎప్పుడూ తప్పుచెయ్యదు. ‘రెండు–నువ్వు చక్కని వ్యక్తిత్వము కలవాడివి. అందమైన వాడివి. జ్ఞానము కలిగిన మహారాజు కుమార్తెనైనా వలలో వేసికొనే వ్యక్తిత్వము ఉందని నా అభిప్రాయం.

‘మూడు–నీఉత్తరాన్ని బట్టి చూస్తే, బాలిక చాలా ఆరోగ్యవంతురాలని స్పష్టముగా ఉంది. జమిందారు గారు ఆరోగ్యవంతులు.

‘కాబట్టి నాకు జమిందారు గారి సంబంధములో ఏమి లోటు కనబడదు. నేను ఉత్తరములో ముఖ్యమైన మూడు విషయాలకన్న, అలంకారములతో అసలే రాయలేను. నా మాటలు కటువుగా ఉంటాయేమో! నేను రెండు రోజులలో బయలుదేరి వస్తాను. ఈలోగా జమిందారు గారి కుటుంబము విషయమై దరియాప్తు చేసి వస్తాను.’

ఇట్లు, నీ ప్రియమైన

రాజారావు


‘ఒకనాడు ఐరోపీయ ప్రపంచాన్ని తన పాదాక్రాంతము నొనర్చిన మహోత్కృష్టుడైన ‘క్రిక్టాన్’ ఉన్నాడు. నేడు నారాయణు డున్నాడు.

‘నీకు పాదములకడ తన సర్వస్వముతో తన్ను ధారపోసుకొనుటకు ఏ బాలయున్నూ తగదని నా మనవి.

‘నిన్నుద్వాహమై ఆ బాలిక తన బ్రతుకు సువాసనాలహరిలో లీన మొనర్చుకోవాలి.

‘చిన్నతనాన్నుంచి నేను కలల్లో తేలియాడేవాణ్ణి. సౌందర్యోపాసనామయమైన నా బ్రతుకు అందానికే దూరమైంది. నా పురుషత్వ సంపద, ఉత్కృష్ట సౌందర్య స్వరూపమైన యోషారత్నము పదముమ్రోల సమర్పింప తలచుకొన్న నా తపస్సు నిర్జలభూమిలో నూయి త్రవ్వినట్లయినది. సర్వకళా స్వరూపమైనటువంటి నా హృదయం చివికిపోయింది.

‘కుంచెకొసల్ విచిత్రలత గూర్చి మనోహరవర్ణభంగి మూర్తించి, పరీమళావృత శరీరరుచుల్ పొదివించి కంఠమున్| పంచమరాగ గీతికల పల్కితి, తేనెలు వాకలూర, మాధ్వ్యంచిత దివ్యసుందర సుధామయ భావములల్లు వెట్టుచున్.’

‘ఆ భావం భావమాత్రమే అయింది. అల్లాంటి సందర్భములో నీఅదృష్టం గమనించుకో. నీహృదయాశయమైన బాలికామణికై ఎదురు చూడవచ్చును. నువ్వే ధైర్యంగల మగవాడివైతే మహాత్మా గాంధి గారు ఉపదేశ మిచ్చి నట్లు విధవా వివాహం చేసికొని ఉందువు. విగత భర్తృక లైన బాలలు విద్యా సంపన్నులు, సుందరీమణులు పెక్కుమంది ఉన్నారు. నీకు ధైర్యము లేదు. సరేనయ్యా! ఎల్లావచ్చిందో సంబంధరూపంగా వరంలా ఒక బాలిక, విద్యా స్వరూప, కళాకోవిద, అద్భుత సౌందర్యమూర్తి! నువ్వు అదృష్టవంతుడవు. ‘ఆలోచించక సంబంధం ఒప్పించు. నేనే దగ్గర ఉంటే! చాలా బాగుండేది.

‘షెల్లీ ఏ కోర్కెకై సంఘ బహిష్కారం పొందాడో, కీట్సు ఏ అందరాని ఫలముకై ఆశించి ఆశించి లోకాంతరాలు చేరాడో, డాంటీ ఏ ఉత్కృష్ట భావంతో ఆనందమయమైన కవిత్వం సృష్టించాడో, రొజెటీ ఏ దివ్యపథములో వసించి భగ్నమెన ఆ బ్రతుకులో తన గీతికాగుళుచ్ఛము బలి యిచ్చినాడో, ఆ మహా ప్రణయము నీకు వరమైతే హామ్లెటు లా ‘అవునా కాదా?’ అన్న సంశయంలో పడబోకు.

‘సరే. నేను రెక్కలుకట్టుకుని మా రాణీ గారితో వస్తున్నా. ఒదలి ఉండడం కష్టం గనుక బాబయ్యగారి అనుమతిమీద వచ్చి, పెళ్ళితంతులన్నీ నడిపిస్తాం. సూరీడు, కన్నతల్లి పిల్ల కాయలు నువ్వు వచ్చావని మురిసి మురిసి విరిసిపోతారు.

నేను నీయొక్కే! పరం'


రాయబారం


కలెక్టరుగారు తహసీల్దారు గారు, రాజమహేంద్రనగరము లోని పెద్ద వకీళ్లు, చెన్న పట్టణము నుండి జమీందారు గారి మేనల్లుడు ఆనందరావు గారు, పదిమందిన్నీ కిటకిటలాడుచు నవుకర్లతో, చాకర్లతో, ఒక్కసారిగా సుబ్బారాయుడు గారి ఇంటికి వచ్చినారు. సుబ్బారాయుడు గారు, చుట్టములకని వేరే కట్టియుంచిన మేడహాలులో పడక కుర్చీలమీద, పేముకుర్చీలమీద, దిండ్లకుర్చీలమీద నందఱు నధివసించినారు. కొత్తపేట డిప్యూటీ తహసీల్ దారుగారప్పుడు ‘సుబ్బారాయుడు గారూ! కలెక్టరు గారు, తహసీల్దారు గారు వీరందరూ తమతో ముఖ్యమైన పని ఉండి వచ్చారు. తమ రది కాదనక నిర్వర్తించడం మా కందరికీ చాల సంతోషప్రదమైన సంగతండి.’

సుబ్బా: చిత్తం. తమరు సెలవిస్తే నేను కాదనేవాణ్ణి ఎప్పుడూ కాదండి.

డి. కలె: తొందరపడి మాట యీయకండి. మాటయిస్తే మేము వదలం.

సుబ్బా: చిత్తం.

తహ: సెలవియ్యండి ఆనందరావు గారూ! వారు జమిందారు గారి మేనల్లుడు గారు. చెన్నపట్నంలో పెద్ద న్యాయవాదులు.

సుబ్బా: చిత్తం, నే నెరుగుదునండి.

ఆనం: శ్రీరామమూర్తి గారు మాకు పూర్వ స్నేహితులు. మా కెప్పుడు అప్పీళ్లు పంపిస్తూనే ఉంటారు. వారు పట్నంవస్తే నన్ను చూడకుండా వెళ్లరు. శ్రీరా: ఆనందరావు గారూ నేను ‘లా’ కాలేజీలో ఒక్కసారే చదువుకున్నాం. ఇన్నాళ్ళకు వారు మా యింటికి విచ్చేసి, మా ఆతిథ్యం అంగీకరించే భాగ్యం మాకు కలిగింది.

డి. త.: అల్లా అనకండి. ముందర మా ఇంటిలోకి ఏర్పాటులన్నీ అయినాయి. వారు మీ యింటికి రావడానికి చాలా అభ్యంతరాలున్నాయండో శ్రీరామమూర్తి గారూ!

ఇంతలో ఊరిలోని పెద్దలు నలుగురు నాహూతులయివచ్చి, యథోచితాసనముల నధివసించిరి.

ఆనం: మా మామయ్య గారు, వారి ద్వితీయ పుత్రిక ను తమ ద్వితీయ పుత్రున కిచ్చి వివాహం చేయ సంకల్పించుకుని మమ్ముల నందరిని తమ్ము ప్రార్థించుటకై పంపినారు. తమరు ఆమోదించవలెనని మేమంతా కోరుతున్నాము. వారి కోర్కెను పాలించవలసిందని మనవి.

సుబ్బా: చిత్తం. ఎంతమాట! వారు జమిందారులు. మేము సామాన్య గృహస్థులం. ఆగర్భ శ్రీమంతుల పిల్లను నా కుఱ్ఱవానికి ఇస్తామని మీరయితే అనుగ్రహించినా నేను చూస్తూ చూస్తూ ఎలా సాహసించను!

ఆన: తమరలా సెలవీయకండి. భాగ్యభోగ్యాల కేమి? వారికున్నది వారికుంది. మీకున్నది మీకుంది.

డి. త.: పేరొక్కటి లోపం గాని మీరుమాత్రం తక్కువవారా? మీ ఐశ్వర్యం ఏ జమిందారీకి తీసిపోతుంది?

సుబ్బా: తమ రదొకటి పెట్టకండి. మా ఐశ్వర్య మెంత? మే మెంత? ఏదో అన్న వస్త్రాదులకు లోపం లేకుండా గుట్టుగా కాలక్షేపం చేయడంతప్ప నే నంతటి వాణ్ణికాను. అందులో జమిందారీ సంబంధాలకు తూగే తాహత్తు ఎంతటి సంసారికయినా ఉండదు. అందుకనే పెద్దలు ‘సమయో రేవశోభతే’ అన్నారు.

డి. కలె: మీరు సమానులు కారంటే మేమంతా తెలివిమాలిన వాళ్ళమవుతామే కాని ఇతర మేమి లేదు. ఈ వినయసంపద మిమ్మల్ని సమానులనే కాదు, అధికులను చేస్తూ ఉంది. ఆమాటంటే మళ్ళా మీ మొదటి ఆక్షేపణే సిద్ధిస్తుంది కాబోలు! భేరీ జోకొట్టడమే గాని మేము మాకు మాటలు చెప్పలేము. వారు జమిందారులనే సందేహం మీకు సుతరామూ అక్కర లేదు. వారి యోగ్యతా, ప్రజారాధనతత్పరతా మీరైనా ఎఱగంది కాదు. అనవలసి అంటారేకాని, జమిందారు గారు ఏలాగైనా మీవంటి సంపన్న గృహస్థులతో వియ్యమందాలని కుతూహలపడుతున్నారు. మేమంతా అందుకు ప్రేరకులం, అనుమోదకులం. మీరు మా మాట తీసివేయరని ఆశపడివచ్చాం .

అంతలో నా యూరి కరణము వెంకటరాజుగా రందుకొని, ‘సుబ్బారాయుడు బావగారు! మీరు సందేహించకండి. మీ ఉభయులకు సర్వ విధాలా తగిఉంటుంది సంబంధం. బంధుకోటి కందరికీ వాంఛనీయమైనది కూడాను. జమిందారుగారనగా రత్నాకరుడివంటి వారు. ఆ శ్రీమహాలక్ష్మీ మీ అబ్బాయిని వెదకికొంటూ వస్తే కాలొడ్డి అతిలౌక్యం చేయకండి బావగారు. కలెక్టరు గారు, తాసిల్దారుగారుకూడా యింతగా చెబుతూంటే మిరు వెనకాడ కండి’ అన్నారు. సుబ్బారాయుడుగారి కీ యనురోధ పరంపరలో ఏమి చేయడానికి తోచక, ‘నేను వారిమాట తీసి వేయాలని కాదు. అల్పుడనని జంకుతున్నాను’ అనుచు పుత్రునివంక నొక చూపు సారించిరి.

ఇంతలో మరల తహసీల్దారు గారు దొరక బుచ్చుకొని ‘మీరు అల్పులో, అధికులో ఆ విషయం మాకు వదలి పెట్టండి. విశ్వలాపురం జమిందారు గారు పేరుకే గాని ఆచార వ్యవహారాల్లో జమిందారులు కారు. కాబట్టి వారితో యెత్తు లెత్తలేమనే సంశయం మీ కక్కఱ లేదు. అయినా మీరు పుచ్చుకొనే వారే గాని, యిచ్చే వారు కానప్పుడు మీ కా భయ మక్కర లేదు’ అన్నారు.

సుబ్బా: చిత్తం, పుచ్చుకోడానికికూడా అర్హత ఉండాలి. వారు యేనుగులను, గుఱ్ఱాల్ని , దాసదాసీజనాన్ని యిస్తే వాటిని భరించడానికి కూడా శక్తి ఉండదు మావంటి వాళ్లకు.

వెంక: ఈ పేదరుపుల కేమిగానండి, బావగారు తల యెగర వేయండి. నేను అక్కగారికి చెప్పివస్తాను. రావోయి, అల్లుడూ!

అంటూ శ్రీరామమూర్తితో ఆయన జానకమ్మ గారికడ కేగెను. ఇచట సుబ్బారాయుడుగా రేమియు పాలుపోవక, ‘తమవంటివారందరూ యీ స్వల్ప కార్యంమీద నాయింటికి దయ చేయడం, నేను తమ ఆజ్ఞకు అంజాయించడం నా కెంతో కష్టంగా వుంది. జమిందారు గారు మా కుఱ్ఱవానికి తమ అమ్మాయి నిస్తామనడం ఒక యెత్తూ, దిగ్దంతులవంటి తమందఱూ, ఆనాడు సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వెళ్లినట్టుగా రాయబారం రావడం ఒక యెత్తున్నూ. ఇంతకూ, విధిసృజన వాళ్లిద్దరికీ రాసిపెట్టి ఉండడంవల్లనే మీవంటివారు పూనుకోవడం కలిగింది’ అంటూ ఉపచారవాక్యాలు చెప్పుచుండగా వెంకట్రాజు గారు తిరిగి వచ్చి, వియ్యపురాలితో బెండ్లికొడుకుతోగూడ మాటలాడి వచ్చితి ననియు, వారందఱకు నంగీకార మేననియు చెప్పి ‘ఏమంటున్నారు, మా బావ గారు? ఇక నెలాగూ యిది తప్పేది గాదండోయి, మెడలు విఱిచి అంటగట్టడమేగాని’ అనుచు మేలమాడిరి.

సుబ్బా: తథాస్తు. కానివ్వండి. ఉభయత్రా పెద్దలు, మీ అందఱి మాటకు నేనుమాత్రం ఎదురు చెప్పుతానా!

అన్నంతలో అందఱును ‘శుభం, శుభం’ అనుచు మందహాసము లొనర్చిరి. వెంటనే సీతారామాంజనేయ సోమయాజిగారొక యాశీర్వచన పనస నారంభింప, సభలో నున్న తక్కిన బ్రాహ్మణోత్తము లందుకొనిరి.

పిమ్మట వెంకట్రాజుగారు, డిప్యూటీకలెక్టరుగారితో, ‘చిత్తం, యిక నేమున్నది తరవాయి? మంచిరోజుచూచి మనవాళ్లు రాజమండ్రికి ముహూర్త నిశ్చయంకొరకు వెళ్లిరమ్మని సెలవాండి’ అనియెను.

శ్రీనివాసరావుగా రంతట ‘మరేమిటంటే, మళ్లా యెప్పుడో చూడడ మెందుకు? ఉండవలసిన సిద్ధాంతు లందరు ఇక్కడనే ఉన్నారుగా విచారించండి ‘శుభస్య శీఘ్ర’ మ్మన్నారు. మొన్న నారాయణరావు గారు రాజమండ్రి వచ్చినప్పుడు, నేను పుట్టిన తారీఖు అడిగితే, పెట్టెలోంచి, మరేమిటంటే, జాతక చక్రం తీసియిచ్చారు. జాతకం చాలా బాగుందన్నాడు మా సిద్ధాంతి గారు. అమ్మాయి జాతకానికి కూడా చాలా బాగా సరిపోయిందన్నాడు. రెండు జాతకాల్ని బట్టి ముహూర్తం రహితం చేయించడం ఉత్తమం. ఏమండీ సిద్ధాంతి గారూ!

సిద్ధాంతి: చిత్తం! అది తమతో మనవి చేయకుండా నేను చూశానండి. రేపు వైశాఖమాసంలోనే ఉంది, సర్వోత్కృష్ట మైన ముహూర్తం. సప్తమ శుద్ధి, గురుశుక్రబలం బాగుంది. కుజుడు ఏవిధంగానున్నూ దోషకారిగా లేడు; అన్ని బలాలు బాగున్నాయండి! చాలా జయప్రదంగా వివాహం జరుగుతుంది. దాంపత్యం దివ్యంగా ఉంటుంది.

ఆనంద: తమది పెద్దపూర్ణయ్య గారి మతమా, చిన్న పూర్ణయ్యగారి మతమా అండి?

సిద్ధాంతి: అయ్యా ! నేనుమాత్రం చిన్న పూర్ణయ్య గారిని పూర్తిగా అనుసరిస్తాను. ఏమంటారా, శాస్త్రంలో ఏమన్నా దృక్సిద్ధం లేక పోతే నిజమైన ఉపయోగం లేదండి.

మృత్యుంజయ రావను నొక రాజమహేంద్రవరపు న్యాయవాది: అయ్యా దృక్సిద్ధం అనేది పాశ్చాత్యులు దూరదర్శినీయంత్రాలు చూసి వ్రాసిన వ్రాతల్ని బట్టేకదా! ఇప్పటి కింకా ‘హైపీరియా’ నని ‘ప్లూటో’ అనీ కొత్త కొత్త గ్రహాల్ని కని పెట్టుతున్నామంటారు. కొన్ని కొన్ని మార్పులకు శాస్త్రీయమైన జవాబు కన్పించదాయెను. మనవాళ్లు, అంటే మహాఋషులు అతీంద్రియ దృష్టితో చూచి ఏర్పరచిన లెక్కలన్నీ మార్చి, ఇప్పుడు దృక్సిద్ధాంతం కావాలి అంటారు. చివరికి ఈ దృక్సిద్ధాంతం నిలవకుండా ఎగిరిపోయేరోజు వచ్చిందాకా ఈ సిద్ధాంతాన్ని విడవరు కాబోలు.

తహసీల్: అదికాదండి. నేనూ కాస్త ఈమధ్య జ్యోతిషం నేర్చుకోవడం ప్రారంభించాను. మనవాళ్లు ఏర్పరచిన లెక్కలున్నాయి చూశారూ, దృక్సిద్దాంతం రూపకంగా సరిచూడమనే సెలవిచ్చారు. అల్లా చేయకుండా ఆచారం అనీ సంప్రదాయం. ఆ మాటలకు నిజమైన అర్థం గ్రహించకుండా ఒకటే పంథా, మరీ గుడ్డెద్దు చేనిలో బడ్డట్టు.

మృత్యుం: చిత్తం. తమరు సెలవిచ్చినది నిజమే మరి. కాలాన్ని బట్టి మనం ఆకాశపటంలో ఏమి గమనించాలో, భూమిమీద వాటినిబట్టి ఏమి మార్పులు వస్తున్నాయో అన్నీ చూసుకుంటూ ఉండనక్కర లేకుండా, గానుక యెద్దులాగ తిరగాలి అని సిద్ధాంత శాస్త్రాలు ఘోషించవండి. పాశ్చాత్య సిద్ధాంతాలు రోజుకోమాటు మారుతూ ఉంటాయి ఎందుచేత? అసలు సిద్ధాంత జనానికి ప్రాతిపదికమైన నిజం గోచరంచేసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణమనే మాయావాదానికి దాసులై నిజాన్ని రోజుకోసారి, నిమిషానికోసారి మార్చుకోవడం వున్నదే, అది తప్పని నా మనవి. మన వాళ్లు ఆ అసలు నిజమైన తత్వం పారలౌకికదృష్టి చేత తెలిసికొని, మార్గములు మనకు ఏర్పరిచారు. వాటిలో మనకు కావలసినవి తీసికొని తక్కిన వానిని తీసి వేస్తే ఎట్లాగండీ?

శ్రీని: మీరంతా సిద్ధాంతులు. మేము కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు గ్రహాలకి కారకత్వాలు కొన్ని యిచ్చారు. రాసులకు వేరు వేరు భావాలు నిరూపించారు. అల్లా యివ్వడానికి తగిన ఆధారం ఏమిటి? శుక్రుడు స్త్రీ గ్రహం అని అంటారు. పురాణాల్లో శుక్రుడు పురుషుడుకదా. చంద్రుడు అంతే. మరేమిటంటే, ఇది అంతా నాకో విచిత్రం క్రింద ఉంటుందండి.

డిప్యూటీకలెక్టరు: అయ్యా శ్రీనివాసరావు గారూ! వచ్చిన పని పూర్తి చేసి మీ సిద్ధాంత చర్చలు ప్రారంభిస్తే బాగుంటుందేమో?

ఆనం: అదే నా మనవి.

సుబ్బా: మా సిద్ధాంతి గారికి కబురు పంపాను.

శ్రీరా: భోజనానికి ఇంటికి వస్తారట. గోపాలపురం వెళ్లారట.

సుబ్బా: సరి, ఇక నేమి తమందరూ ఈ పూట నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయాలి. ఎన్నడూ రానివారు యీ నిమిత్తాన దయ చేశారు.

డి. త.: నే నందఱికి ప్రయత్నం చేయించాను. క్షమించండి’ అనుటయు సుబ్బారాయుడు గారికడ వారందఱు సెలవుతీసికొని డిప్యూటీతహసీలు దారుగారింటికి వెడలిపోయినారు.

౧౦/10

దేశాంతర్గతుడు

రామచంద్రరావు కాకినాడ నుండి రంగూను వెళ్ళినాడని తెలిసి, సుబ్బారాయుడి గారి ఇంట్లో అందరు కంగారుపడిరి. సూర్యకాంతమ్మయు, జానకమ్మ గారును కళ్లనీరు నింపుకొనుచు వాపోవజొచ్చిరి. సుబ్బారాయుడు గారు లోనికి వెళ్లి నాలుగుచీవాట్లు పెట్టిరి. ఆ రోజుననే బయలుదేరి లక్ష్మీపతియు, నారాయణరావును కాకినాడ వెళ్లినారు.

కాకినాడలో రామచంద్రరావు సంగతి యంతయు దేట తెల్లమయ్యెను. రామచంద్రరావు సూర్యకాంతము భర్త. ఇంటరు పరీక్షలో గృతార్ధుడు కాలేకపోయినట్లు వార్తాపత్రికలలో బ్రచురింపబడుటతో, రామచంద్రునకు మతిపోయినది. రామచంద్రుడు భౌతిక శాస్త్రాదులలో నుద్దండుడు. అతనికి నింగ్లీషు భాష మాత్రము కొంచెము దూరపుజుట్టమైనది. పదార్ధవిజ్ఞాన, రసాయన, వృక్ష శాస్త్రములలో గ్రమముగా దొంబది, యెనుబదియాఱు, నెనుబది యొక్క గుణము లాతడు సంపాదించెను. ఇంగ్లీషులో నూటికి ముప్పది మాత్రమే వచ్చినవట. తెలు గంతయ న్యాయము గా లేదు. నలుబదియైదు గుణములు వచ్చినవి. కాబట్టి తప్పిపోయినను, మొదటితరగతి గుణములు వచ్చినవి. ఒక భాగముననే కృతార్థుడైనాడు.

నారాయణరావు కొత్తపేటలో వినినప్పుడే శాస్త్రపాఠములలో మొదటి గుణములు సముపార్జించి ఇంగ్లీషుభాషలో దప్పిపోవునని యనుమానించి లక్ష్మీపతి కది వెల్లడించినాడు. తుదకట్లే అయినది.

రామచంద్రరావు తండ్రికొక యుత్తరము వ్రాసిపెట్టి యోడ నెక్కినాడు.

‘శ్రీ బాబయ్యగారి పాదాలకు వందనాలు. మన దేశంలో నిజమైన విద్యాదీక్షకు తావు లేదు. మన దేశంలో చదువు అంతా గుమాస్తాలను తయారుచేసే చదువు. దానికి తగిన విషయ ప్రణాళికే ఏర్పరచారు పరీక్షలకు. ఇంగ్లీషులో మార్కులు వచ్చితీరాలి అని నిబంధన ఉండడం యొక్క ఉద్దేశం అది. నేను ఇంగ్లీషుపరీక్షలో నెగ్గవలసివస్తే శాస్త్రజ్ఞానానికి నీళ్ళు వదలుకోవాలి. ఈ మీ తనయుని పరిశ్రమకు పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఖ్యాతి మీ రెరిగే ఉన్నారు. మీకు నన్ను పాశ్చాత్య దేశం పంపడానికి ఇష్టము లేదాయెను. కనుక మీ పెట్టె మారుతాళంతోతీసి, అందులో ఉన్న అయిదు వందల రూపాయలనోట్లు తీసికొని ఓడ నెక్కాను. ఈ దొంగతనానికి క్షమించండి. నేను ఎల్లాగో అల్లాగు అమెరికా చేరుకుంటాను. అమెరికా హార్వర్డులో చదువుతాను. అక్కడకు తాము ధనము పంపిస్తే అదృష్టవంతుణ్ణి. లేకపోతే అక్కడ కాయకష్టపడి ఎల్లాగో సంపాదించుకొని చదువు పూర్తి చేసుకుంటా. ఈ జరిగిన విషయం అంతా నేను జాగ్రత్తగా ఆలోచించి చేసినదే. శ్రీ అమ్మ గారి పాదాలకు ఆమెనిద్రపోతుండగా నిన్న రాత్రే నమస్కరించాను. మీ యిరువురి ఆశీర్వచనం నాకుంటే లోకాలుజయించగల్ను .

నమస్కారం

విధేయుడు మీ కుమారుడు,

రామచంద్రం

ఈ యుత్తరం చదువుకొనునప్పుడు మరల కనులలో నీరుతిరిగినది భీమరాజు గారికి. తల్లి మూల బండుకొని యతికరుణముగా నేడ్చుచునే యున్నది.

అప్పుడు నారాయణరావు, లక్ష్మీపతి, భీమరాజు గారు లోనికిబోయి యామె నోదార్పబూనిరి. నారా: అత్తయ్య గారూ! ఏమిటి మీరల్లా అధైర్యపడతారు! పట్నవాసంలో ఉన్నారు. ప్రపంచం సంగతి చూస్తున్నారు. సరోజినీదేవి గారివంటి ఉత్తమ స్త్రీల ఉపన్యాసాలకు వెళ్ళి వింటున్నారు. ఆంధ్రమహిళాసంఘంలో మీరు పేరుపొందిన సభ్యురాలుగా ఉన్నారు. ఎంతమంది మనదేశములో యీనాడు పాశ్చాత్య దేశాలకిపోయి అత్యుత్తమ విద్యల నేర్చుకోవడం లేదు! మీరు వీరమాతలు. మీ అంతట మీరే ‘నాయనా పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసివుంటే వెళ్ళిరా’ అనవలసింది.

లక్ష్మీ: పిన్ని గారూ! అక్కడకు వెళ్ళి లోక ప్రఖ్యాతి సముపార్జించటానికి నోచుకొన్నాడు, మా తమ్ముడు!

భీమ: (భార్య దుఃఖంవల్ల ఎక్కడ లేని ధైర్యముగలిగి) సరే, మీటింగు ముందరి మాటలూ ధైర్యమూ, కష్టం కలిగినప్పుడే అక్కఱకు రావాలి. ఎందుకు ఏడ్పు? ధైర్యంతో వెళ్ళాడు. శౌర్యంతో వస్తాడు.

రామచంద్రరావు తల్లి దుర్గమాంబ గారు లేచి ‘నాయనా నారాయణ రావు, బాబూ లక్ష్మీపతీ! ఏం చెయ్యను. ఒక్కడే కొడుకు, ఒక్కటే కాన్పు. ఆడదాన్ని కబుర్లకయినా అక్కరకు రాను. నా శక్తి స్వభావం అంతే! ఏం చెయ్యను? నాతో రెండు నెల్లనుంచి వాదిస్తున్నాడు. నేనన్నాను, చదువు కోసము పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా! గాంధీగారు ‘పాశ్చాత్యవిద్య ఆత్మ వికాసాన్ని చంపుతుంది. రామమోహనరాయివంటి వాడు పాశ్చాత్యవిద్య లేక పోతే ఇంకను వేయి రెట్లు మహాఋషి అవును’ అని చెప్పలేదా? అని నేను వాదించాను. వాడు ‘నువ్వు చెప్పిందంతా నిజం, అమ్మా! కాని మనం శాస్త్ర పరిశోధనలలో నూతన విషయం కనిపెట్టితే, ఇంగ్లీషువిద్యలో పెద్దపట్టా పొందితే గాని, ఆ సంగతి లోకం ఒప్పుకోదు. కాబట్టి నేను జర్మనీకి లేక అమెరికాకో వెడతాను’ అంటూ వుండేవాడు.

భీమ: ముందు కర్తవ్యం ఆలోచించకుండా ఇలా అన్నాను, అలా అన్నాను అని కూర్చుంటే ఏమి లాభం?

అందఱు కలిసి వారి మేడయింటిలో మధ్యహాలులో కూర్చుండినారు.

బుద్ధవరపు భీమరాజు గారు పూర్వకాలమునుండియు కాకినాడలో వర్తకము చేసి ధనికులైన పెద్ద కుటుంబముల వారిలో నొక కుటుంబమునకు పెద్ద. ఆయన వర్తకమునకు, లౌకికమునకు వీలయిన చదువుమాత్రమే చదువుకొన్నారు. కానీ కుబేరునకు వన్నెదిద్దు వ్యాపారపు సరళి, సులువులు, చాకచక్యము, వ్యాపార యుద్ధనీతి సంపూర్ణముగా నెగిన బ్రాహ్మణ శ్రేష్ఠి. పట్టణములోని వారెల్ల వారి కుటుంబమును బ్రాహ్మణ శ్రేష్ఠు లనే పిలుచుచుందురు.

ఆయనకు లేక లేక రామచంద్రరావు విపరీత మేధాసంపదతో జన్మించినాడు. అతనికి వర్తకమన వైముఖ్యము. దానికి తగినట్లు భీమరాజు గారికి వ్యాపారములో నష్టము తర్వాత నష్టము వచ్చి, మూడులక్షలన్నర రూపాయలు మట్టిపాలయినవి. అప్పటి నుండియు, మంచి గడుసరియైన భీమరాజుగారు వర్తకం, ఎగుమతి దిగుమతులు మానివేసి, చేతికందినంతమట్టుకు ధనము సేకరించుకొని ఇంపీరియల్ బ్యాంకులో రెండులక్షల యిరువది వేలు నిలువ చేసి, ఆ వల్ల వచ్చిన ధనముతో సుఖముగా గాలక్షేపము చేయుచున్నారు. ఆయనకు భూములన్న నమ్మకము లేదు. స్వసౌఖ్యము కొఱకు, కంపెనీ దొరలకు ‘సప్లయి’ కొఱకు, మామిడి మున్నగు ఫలవృక్షములు గల తోట నొకటి పిఠాపురం దగ్గర సంపాదించినారు.

అట్టి భీమరాజు గారి యేక పుత్రునకు నాల్గువేలరూపాయల కట్నము, రెండువేల రూపాయల లాంఛనములతో నారాయణరావు నాల్గవ చెల్లెలి నిచ్చి వివాహ మొనర్చినారు. సుబ్బారాయుడుగారన్న భీమరాజు గారికి గౌరవము, భీమరాజు గారన్న సుబ్బారాయుడు గారికి గౌరవము.

నారాయణ రావు, లక్ష్మీపతి, భీమరాజుగార లాలోచించి రంగూనులో భీమరాజు గారి స్నేహితున కొకనికి తంతివార్త నిచ్చిరి.

తన కుమారుడు పాశ్చాత్య దేశములకు వెళ్ళి ప్రఖ్యాతిగడించుట భీమరాజు గారికి సంతోషమే, కాని తనకు కావలసినంత యున్నది. వట్టి పేరు ప్రతిష్ఠలవలన కలుగు లాభమేమి? ఒకడే కుమారుడు, కాని దేశాల నుండుట, అక్కడ బాలుని కనిపెట్టి చూచు దిక్కెవ్వరు లేకపోవుట, కొంచెము జబ్బు చేసిన తలిదండ్రు లరచేత ప్రాణములుంచుకొను వారే. ఆ దూరదేశములు కుఱ్ఱవానికి పడునా? ఎట్టి చదువో? వాడు ఎన్ని ఇబ్బందులుపడునో? చలిఎక్కువ. తిండి వేఱు. అన్నిటికన్న పాశ్చాత్యదేశ వనితలు పాల్పడని వైపరీత్య మేది కలదు? భీమరాజుగా రీ భయములు తన బావమరదుల జెవిలో కంఠాన గద్గదిక తో నేకరువు పెట్టినారు.

నారాయణరావునకు గుండె గుభిల్లుమన్నది. పాశ్చాత్య దేశముల కేగిన యువకు లెందరో తెల్లని మేనులకు వలచి, దిగ్భ్రమనొంది, హృదయములు ఆ శ్వేతకాంతల పాదములకడ ధారవోసికొనినారు. అట్టి వారికి ఇంటికడ భార్య బానిసవలె రాక్షసివలె కన్పించును. ఎంతమంది భారతీయులు దీపము కడ శలభములవలె నరించి పోయినారుకాదు? రామచంద్రుడు చిన్న వాడు, డబ్బుకలవాడు. సంస్కారహీనలు, పురుషుల వలపింప నేర్చిన మాయలాడులు నగు తుచ్ఛవనితలు వేలకు వేలు పాశ్చాత్య దేశమున గలరని యాతని నమ్మకము. వారి వలలలో భారతీయ యువకులెందరో చిక్కినారు. భగవంతు డెట్టి విపరీతముల నొనరింపనున్నాడో యని లక్ష్మీపతి చెవిలో నూదినాడు.

ఆ రాత్రియంతయు బావమరదు లిరువురు గాఢాలోచనలో నిదుర నెఱుగరు.

లక్ష్మీ: నీకు చాలా భయమురా బావా! మానవప్రకృతి యెల్లప్పుడు కుటిలముగా సంచరిస్తుందనా నీ భావము? నారా: కాదోయి! స్థానబలము మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. స్థానబలిమివంటిదే స్థానవైపరీత్యమున్నూ.

లక్ష్మీ: సరి, నువ్వు ఒక్కడవు మదరాసులో ఉంటున్నావు కదా, మదరాసులో కుఱ్ఱవాళ్ళు పాడవ్వాలంటే ఎన్ని మార్గాలు లేవు? మన వారెవ్వరూ అక్కడ లేరు. అయినా ఎందుకు నువ్వు తగలబడి పోలేదురా మఱి?

నారా: నీ వాదన నాకు అర్ధమైందోయి. ఒకటిచూడు. భరత దేశంలో ప్రతి వ్యాపారంలో ముఖ్యజీవితాదర్శమైన సత్యమును సాధ్యమైనంత వరకు మరచిపోకుండా గమనించేటట్టుగా మన్ని మన పూర్వ నాగరికత తయారు చేసింది. ఆ నాగరికతయే ఈ నాటికిన్ని ఏదో రకంగా ఏదో రూపంగా సర్వత్రా వ్యాపించి ఉంది. అట్టి సంప్రదాయబలమే మన్ని ఇక్కడ కాపాడుతోంది.

లక్ష్మీ: సరే అదీ ఒప్పకుంటాను. అయితే, నువ్వు పాశ్చాత్య దేశం వెళ్లే వాళ్ళసంగతి జాగ్రత్తగా ఆలోచించు. వాళ్ళలో మూడురకాల మనుష్యులు. డబ్బుండి, పాశ్చాత్య నాగరికత అనుభవిద్దామని, చదువుపనిమీదో ఆరోగ్యం వంక మీదో లేకపోతే స్వతంత్ర ప్రభువులైన మహారాజులలాగ సరదాగానో వెళ్ళేవాళ్ళు మొదటిరకం.

నారా: అవును బావా ! అటువంటి వాళ్ళు వెళ్ళి చేసేపని ఏముంది? మన దేశంలో ధనం తీసుకుని వెళ్ళి అక్కడ తగల బెట్టడమే! మన దేశం బీద దేశం, పాశ్చాత్య దేశాలు భాగ్యవంతములైనవి. అందులో ఇంగ్లండు, ఫ్రాన్సు, అమెరికాలు మఱీని. వారికి విషయ సౌఖ్యమే ఆదర్శం. అందుకోసం ఎన్ని చిత్రాలో సృజించుకొన్నారు. వాట్లకోసం పది ఖర్చు చేసేచోట వేయి ఖర్చు. కాని పాశ్చాత్యులు మన దేశం వస్తే మన దేశంలో అన్నీ వెఱ్ఱి చవుక. వారికి మన దేశంలో ఖర్చు పంటికింద పోక చెక్క.

లక్ష్మీ: ఇంక రెండోరకం. ఉద్యోగం కోరి వీలయిన చదువు కొఱకు వెళ్ళే వాళ్ళు. ఇంగ్లాండులో చదువులన్నీ అట్లాంటివే. మూడోరకం వాళ్ళు పూర్ణమైన జ్ఞాన సముపార్జనమాత్రం కారణంగా పెట్టుకొని వెళ్తారు.

నారా: అలాంటి వాళ్ళు ఆ వ్యామోహంలోపడి పాడయిపోయి జ్ఞానసముపార్జనోద్దేశం మఱిచిపోవ రటోయి మఱి? ఆ హాని ఎదురుగా అమ్మ వారిలా నోరు తెరచుకొని లేదూ?

లక్ష్మీ: అల్లా పాడయ్యే వాడికి నిజమయిన విద్యావ్యసనం లేదన్నమాట!

నారా: నువ్వు చెప్పిన కారణాలు గ్రహించక అనటము కాదు. నిజమే! శాస్త్ర జ్ఞానం పూర్ణముగా సంగ్రహించుటే వ్రతంగా పెట్టుకొని వెళ్ళినవాడు ఉత్కృష్టజీవే! మన రామచంద్రుడు ఆ విధమైన తన్మయతలోనే ప్రయాణం సాగించాడు. పాశ్చాత్య దేశాలు వెళ్ళవలసివస్తే చిన్నతనంలో వెళ్ళడమే మంచిదని ఎరుగుదును. కామశక్తి మాంచి యౌవనంలోనే మనుష్యజీవితాన్ని కదల్చి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కామపరమైన మాయలకు మనుష్యుడు నిముషంలో లోబడిపోతాడు. చిన్నతనంలో కుర్రవాడు వాని దీక్షలోనే ఐక్యమై యుంటాడు. కాబట్టి వాడికి వాడి విద్యతప్ప వేరాలోచన కించిత్తైనా పుట్టనిమాట నిశ్చయం. పైగా పరిపక్వమగుటకు సిద్ధమవుతూన్న అతని హృదయానికి అపరిచితమైన విషయాలన్నీ భయంకల్పించే నీడలు. వాటిని నిరోధించటానికి అతడు చేసే ప్రయత్నం కృత్రిమము లేని సత్యహృదయంతో చేసేదే. అందుకనే చిన్న తనమే చాలా ఉత్తమం. కాని ఎంత చెప్పినా చెల్లాయి బాధపడుతుందని భయం నన్ను కదల్చివేస్తూంది బావా!

లక్ష్మి: ఓయి వెఱ్ఱి వాడా! యీ భయాలు నీబోటి ఉత్కృష్ట మానవునికి తగవురా!


౧౧ ( 11 )

చిన్నవాడు


ఆ రాత్రియంతయు నారాయణరావునకు నిద్రపట్ట లేదు. సూర్యారావు పేటలో భీమరాజు గారి మేడమీద ఆరు బైట వేసిన మంచముమీద వెల్లకిల బరుండి నారాయణరావు అశ్వినీ దేవతలు, బ్రహ్మహృదయము, అనూరాధ, తుల, వృశ్చికము, ధృవుడు మొదలగు తారామండలమునంతయు జొచ్చి చూచు చూపులతో గమనించుచుండెను. నక్షత్రవిరాజితమగు నయ్యాకాశకాండపటములో దన చిన్ననాటి కోర్కెలన్నియు నాతనికి మూర్తములై గోచరించినవి. చిరుత కోర్కెలతో దేశాలు గ్రుమ్మర దానును గోరువాడు. పాశ్చాత్యదేశము లాతని మనోలోచనాలకు దన చుట్టముల గ్రామములరీతి దోచెడివి. సీమ దేశములో రాణి గారు, రాజు గారుందురనియు, నచట నన్నియు బంగారపు మేడలనియు నాత డూహించుకొను వాడు. రాజమహేంద్రవరమునకు దూరమై గోచరించు పాపికొండల వెనుక సీమదేశమని వాదించువాడు తోటి బాలురతో. వీధులలో డబ్బులు, బేడకాసులు, పావలాలు, రూపాయలు చిమ్మియుండునని భావించెడివాడు.

సీమ దేశములోని భాగములే జర్మనీ, ఫ్రాంసు, ఇటలీ మొదలగు దేశములని యెంచెడివాడు. ఆ చిన్న నాటి యూహాప్రపంచమంతయు దాను విన్న కథలలో నల్లిబిల్లిగా నల్లుకొనిపోయి యుండునది. రాములవారి పుష్పక విమానముమీద తానధివసించి ఏకాలమును దేశాటనము చేయుటయే కోరువాడు. ఆనాటి కలలలో రాజకుమారిక రాక్షసులు, రాజులు, రాజ్యాలు కనబడ్డవి. తాను రెక్కలున్న గుఱ్ఱముపై స్వారి చేయుచునో, ‘జయ పరమేశ్వరా’ యని తాదలంచుకొన్న చోటికి వాయువేగ మనోవేగములతోను దన్ను గొనిపోవు మంత్రపు బాంకోళ్లపై నెగిరిపోవుచునో తన తండ్రి గారి కథలలో రాజకుమారునివలె గత్తి పుచ్చుకొని రాక్షసుల నుక్కడగించుచునో యుండువాడు. రాజకుమారికలను వివాహమాడు వాడు. ఎనిమిది సంవత్సరముల ప్రాయమునాడు, నారాయణరావు కలలో ‘దేశము’ ‘స్వరాజ్యము’ వినబడ్డది. తెల్లవారు మన దేశములోని ధనము కొల్లగొనుచున్నారను భావములు చొచ్చిరా నారంభించినవి. బెంగాలులోని యువకులు చేయుచున్న వానికంటె భయంకరమైన బాంబులు తయారుచేసి భరత ఖండము తప్ప, మిగిలిన దేశములను భస్మీపటల మొనరింపవలెనన్న తీవ్రేచ్ఛలతో నాతని హృదయ మావేశపూరితమైపోయినది. ఒకనాడాతడు ముఖముమీద ‘వందేమాతరం’ అని వ్రాసికొని, తోడి బాలురకుకూడ వ్రాసి, పాఠశాలకు వెళ్ళినాడట ! ఆనాడాతని తరగతి ఉపాధ్యాయుడు, వీరినందరిని బల్లమీద నిలుచుండ బెట్టి యా వ్రాత కడిగివేసికొన యాజ్ఞాపించెను. నారాయణరావు తన్నురిదీయవలెనేగాని మొగముమీద వ్రాత జెరపనన్నాడు. నారాయణుని తెలివి తేటలు, వినయ విధేయతలు, రూపసంపదయు నుపాధ్యాయులంద యనురాగమును జూరగొన్నను, ఆ నాడు నారాయణరావిచ్చు జవాబులచే నుపాధ్యాయులకు వెఱ్ఱియెత్తిపోయినది ‘మొదట నోరుముయ్యి! తర్వాత మొఖంమీద రాత చెరిపెయ్యి, లేకపోతే నీ వీపు చితకకొడతా!’ అన్నాడు ఉపాధ్యాయుడు.

‘మీరున్నూ తెల్లవాళ్ళ స్నేహితులే! మాకు స్వరాజ్యం కావాలి, అందుకని నేను చెరపను. వీళ్లెవ్వరూ చెరపరు’ అని జేవురించిన మొగముతో బాలకుడగు నారాయణరావు సింహదమనునివలె గర్జించినాడు.

ఆ ఉపాధ్యాయుడు తెల్లబోయినాడు. పేము బెత్తముదీసి రెండు దెబ్బలు వీపుమీద చురుక్కున జఱచినాడు. నారాయణరావు చెంగున బల్లపై నుండి యురుకుటయు, నుపాధ్యాయుని చేత నుండి బెత్తము లాగుకొని, ముక్కలు ముక్కలుగా విరిచి పారవేయుటయు, గనుమూసి తెరచునంతలో జరిగినది. బాలకులందరిలో పొడగరియై, చక్కని దేహ సౌష్టవముగల నారాయణరావు మోమున నపుడు వెలుగు నపూర్వ తేజము గాంచి ఉపాధ్యాయుల వారు భయకంపిత హృదయులై, మోము వెల్లనైపోవ, మ్రాన్పడిపోయినారు. బాలకులు భయాశ్చర్యములతో, ఏమి జరుగునోయని తేరిపార జూచుచుండిరి..

నారాయణరావు ‘రండఱ్ఱా! వందేమాతరం’ అని కేక వేసి వీధిలోనికి దారితీయ, బాలకు లాతని వెనుక ‘వందేమాతర’ మని కేకలు వేయుచు వీధిని బడిరి.

ఆరాత్రి, సుబ్బారాయుడు గారు పుత్రుని బిలిచి యంతయు దెలిసికొని కోపగించిరి. ఉపాధ్యాయుడు నారాయణరావును సమీపించి ‘నాయనా నేను పిల్లలుగల వాణ్ణి. నీకిట్టిపనులు సేయుట కెవరు బోధించారో నాకు తెలియదు. నా ఉద్యోగ మూడబీకి వేస్తారు. తిండికి గుడ్డకు దూరమై ముష్టి చెంబు చేతికి వస్తుం’దని నీళ్ళు తిరుగు కళ్ళు తుడుచుకొనుచు వక్కాణించినాడు. నారాయణరావుకును గనుల నీరుతిరిగినది. అప్పటినుంచి పాఠశాలలో నాత డెప్పుడట్టిపనులొనరింప లేదు. నారాయణరావు మొదటి ఫారము చదువుచుండగా నైరోపీయ మహాసంగ్రామము ప్రచండోష్ణవాయువువలె విశ్వమెల్ల వీవదొడంగెను. నారాయణరావు లేత హృదయమున నాంగ్లేయుల పైనపుడు జాలిపొడమినది. ‘ఈనాడు వారికి రాజ్యవినాశము సంభవించి విపత్తు వచ్చినది. పాపము తెల్లవారి బాలకులెందరో తండ్రులులేని బాలకులైపోదురు. కాన, వారికి మనమంతా సహాయం చేయాలి’ అని వాదించాడు తోడిబాలురతో. సరేయన్నారు వారు. చందాలు వసూలు చేసి, తాను తల్లిగారినడిగి పదిరూపాయలు చందావేసి, మొత్తము పదునేను రూకలు పెద్దకలెక్టరుగారు కొత్తపేట మకాము వేసినప్పుడు నిర్భయముగా వారిని దర్శించి ‘యుద్ధమునకు మా బాలకుల చందా’ యని సమర్పించినాడు. ఆ యాంగ్లోద్యోగి ఆశ్చర్యపూరితహృదయుడై ఈ నూలుపోగు వేయి మడుంగులు శక్తి గల త్రాడగుననియు, ప్రభుత్వము వారి తరఫున నా చిన్నబాలకునకు ననేక నమస్కారము లర్పించుచున్నాననియు, నాంగ్ల సామ్రాజ్యమున కానాడు సంభవించిన యాపత్తునకు భారతదేశము చూపు రాజభక్తి, యనన్యసామాన్య మనియు, నట్టిభక్తికి నీ బాలకుడే నిదర్శనమనియు నిండుసభలో నుపన్యసించుచు, తనకడనున్న లాంబ్ కవి శేఖరుని ‘ఎలియా’ వ్యాసముల గ్రంథము నారాయణరావునకు బహూకరించెను.

నారాయణరా వీయాలోచనలు తన్నలమికొన, హాయిగా నిదురగూర్కు లక్ష్మీపతిని గమనించి, యేల యిట్లీతనికి సుఖనిద్ర పట్టెనని యాశ్చర్యము జెందినాడు. ఒకరికి గష్టమగు విషయ మింకొకరిని రవంతైన చలింపజేయదు. ఒక్కరిని సంతోషసముద్రమున నోలలాడించువిషయమే వేరొకరిని దుఃఖజలధిని ముంచును. ఏ సందర్భములోనైన హృదయ మావంతయు జెదరనీయని తాను, రామచంద్రరాయని ప్రయాణముచే నిట్లు కలత జెందుచుండ, లక్ష్మీపతి, తన మరదలిభర్త యిట్లు దేశములు తెగించిపోవుట కించుకైన జలింపక, గాటముగా నిదురించుచుండుట గాంచి, సృష్టిలో నొక్కొక్కరి ప్రకృతి యొక్కొక రీతి నుండునుకదా యని నారాయణరా వనుకొనెను. లక్ష్మీపతిని లేపుదామాయని యాతనికి గోర్కె జనించినది. కాని వెంటనే మరల్చుకొని నాడు. వివిధములగు రంగులతో, విచిత్రములగు కలయికలతో మేళవింపై నిగూఢార్థపూరితమగు మానవజీవిత మంతయు జక్కని చిత్రలేఖనమేయని యాత డనుకొన్నాడు.

కావుననే, ప్రకృతిని ప్రాతిపదికగా, నాధారభూతముగ నొనర్చుకొని కళాసృష్టి చేయవలసివచ్చినది. ప్రకృతి ననుసరించుటయు నొక కళాసాంప్రదాయమగుట సంభవించినదని, యాత డూహించుకొన్నాడు. సర్వదా మన కనులయెదుట నుండి, మనకు జిరపరిచితములగు వస్తువులే ఛాయాచిత్రమగుట తోడనే ఆనందము సమకూర్చుచున్న వని యాతడనుకొనెను.

ప్రక్కయంతయు జల్లబడిపోయి హాయిగ జల్లగాలి వీచుచున్నను, నారాయణరావు తనకు నిదుర పట్టుట లేదని వితర్కించుకొని నాడు. నిదురబోవునపుడు మనఃప్రవృత్తులడగిపోవునా? ఆతురతవలననో, యే గాఢాలోచనా తీవ్రత వలననో మెదడు పనిచేయుటచే నిదురబట్టదు కాబోలు! తన బావమరది ఖండాంతరములకుపోయి యశస్సు గడించివచ్చును. ఇందు విషాదకారణ మేమున్నది? సూర్యకాంతమన్న దనకు నెక్కుడు ప్రేమ. ఆ బాలకు గష్టము కలుగు నేకార్యమైన దనకు విషాదము కలిగించును. కావుననే నేడు తానట్లు గజిబిజిపడిపోవుటకు గారణమైనది.

అహో! యీ నిర్మలాకాశమున మిరుమిట్లుగొలుపు నీ వేలకొలది తారలు నిశ్శబ్దగీతికలు పాడుకొనుచున్నవి. ఈ నిశ్చలత ధ్వనిపూరితమయ్యు నిశ్చలత యెట్లయ్యెను? ఈ నిశ్శబరాగాన, నీ కీచురాళ్ళు నిద్రలోని ఉచ్ఛ్వాస నిశ్వాస స్వనములు, దొడ్డిలోని యావుల కదలికలు, నక్షత్రమండలమునుండి రాలిపడు నుల్కలు, దారినిబోవు బడిగంట, యుదయించు చంద్రకిరణము, నెటనుండియో వినవచ్చు బాలకుని యేడ్పు– నీవియన్నియు, నెట్లు సమన్వయింప బడినవో! ఒక్క రాగములోని స్వరకల్పనమైనవి.

నారాయణరావు హృదయమున నీయఖండసృష్టిపై ప్రేమ పొంగిపొరలి పోయినది. ఆతడు భూమ్యాకాశముల నిండినట్లయినది. నీలగగనము, నిశ్చల తారకలు నాతనిలో లీనమైపోయినవి. తనకు బ్రాణవల్లభగా నిశ్చయింపబడిన శారదాదేవీస్వరూపమై ప్రకృతి తన్ను కౌగిలించుకొన్నది.

శారదాదేవి నిరుపమాన సౌందర్యవతి. తానెంత పుణ్య మొనర్చెనో యా బాలికను భార్యగా బడయుటకు, ఆమెతో దా నోలలాడనున్న స్వర్గ సౌఖ్యము లాతనికి గోచరించినవి.

తన్ను జిరునవ్వుతో, దారానయనములతో, చంద్రకాంతి పుష్పముల బోలు బుగ్గల సుడులతో జేరవచ్చు శారదలో లక్ష్మీపతిని, సూర్యకాంతమును, రామచంద్రుని విడివిడిగా జూచినాడు. వారలలో దనతల్లి గోచరించినది. అందఱు నొక్క సంశ్లేషంబున చంద్రబింబమై గగనవీధిపథముల నెటకో తేలియాడుచు బోవుచున్నారు. తా నేరి యంకముపైననో శిరము వాల్చి, శీతలమై, హంసతూలికాసమమై, మెత్తనగు నా తొడలో కరగిపోయినాడు. ఆ తొడయే చంద్రబింబమైనది.

రెండుగంటలు లోనిహాలులోని గడియారము ‘టంగు, టంగు’ మని పాడినది. నారాయణరావు నిదురలో మైమఱచినాడు.


౧౨

వివాహము

రాజమహేంద్రవరములో సమస్తవైభవములతో శ్రీ శారదా నారాయణరావుల వివాహమహోత్సవము జరిగినది.

అప్పురిలో జమిందారుగారి మందిరములన్నియు గన్నుల వైకుంఠముగ నలంకరించినారు. రోడ్లు, తోటలు పందిళ్లు వేయించినారు. జమిందారుగారి మేడలకు నాతిదూరాన రెండు మహాభవనములు మగపెండ్లి వారికి విడిది లేర్పరచిరి. విడిదికడనుండి జమిందారు గారి మందిరములవరకు నొక పందిరి. విడిదిల కడను, జమీందారు గారి మేడలకడను, చాందినీలు, గులోబులు, అగరునూనెల గాజుదీపాలబుడ్లు, తీగెల పండ్ల గెలలు, మెరుపుల పాదరసపుబుడ్లు, బుట్టలు, పూలతోరణములు, కొబ్బరికాయల గెలలతో పందిళ్ళలంకరించినారు.

జమిందారు గారి విశాలభవనములో విశాల సభాస్థలమున వివాహ వేదిక నమర్చినారు. చిత్రాలంకార శోభితమై యా వేదిక దివ్యమై వెలుగొందు చున్నది. వివాహసభామందిర మంతయు జుట్టములచే, సభ్యులచే గ్రిక్కిరిసి పోయినది. న్యాయవాదులు, జిల్లాకలెక్టరు, జమిందారులు, జిల్లా జడ్డి, పోలీసు సూపరింటెండెంటు, ఇంక ననేకులు ఉద్యోగులు, పురప్రముఖులు సభ నలంకరించినారు. ఆంధ్రాది దేశములనుండి పేరెన్నికగన్న వారెల్లరు ఆనాడు సభాభవనమున గ్రిక్కిరిసినారు. అందఱకు బఱపులు, దిండ్లు నమర్చినారు. పెండ్లి వారందఱు నొకయెడ నధివసించినారు.

పొన్నుస్వామి సన్నాయి మేళము వచ్చినది. మంగళ వాయిద్యములు భోరుమనినవి. ‘అయంముహూర్త స్సు ముహూర్తోస్తు’ అనుచు బురోహితులు మంత్రములు చదివిరి.

సభామధ్యమున నయిదువేల తులముల వెండిగంధపుగిన్నెయు, బంగారు పన్నీరుబుడ్డియు, బంగరు అత్తరువులదానును నొక దంతపుబీఠికపై నమర్పబడెను. సభలో నచ్చటచ్చట బీఠములపై సువాసన ధూపముల నెగజిమ్ము బరిణ లమర్చినారు.

పండితోత్తములు సముద్ర గంభీర స్వనముల వేదఘోష సలుపుచున్నారు.

ఆడువారికి వివాహవేది కు సమీపమున తెరలమధ్య నొక స్థల మమరించినారు.

సర్వాలంకార శోభితయై, పాలసముద్రమున జన్మించిన లక్ష్మీబాలవలె నున్న పెండ్లికొమరిత, శారదను గంపలో గొనివచ్చినప్పుడు, పట్టు పీతాంబరముల ధరించి, వెడదయురమున హారములు శోభింప నారాయణరావు నాందీ శ్రాద్ధమునకు లోనికి బోవునప్పుడు, జమిందారుగారు భార్యాసమేతులై సాలంకృత కన్యాదానము చేసి ధన్యులగునప్పుడు, నూతన వస్త్రాలంకార శోభితులై వధూవరు లొండొరుల ప్రక్క నధివసించినప్పుడు, మంగళ వాద్యములు బోరన విప్రాశీర్వాదములు దిశలునిండ నారాయణరావు శారదకు మంగళసూత్రధారణ కావించునప్పుడు, వధూవరులు తలబ్రాలు పోసికొనునప్పుడు జానకమ్మగారును దక్కుంగల చుట్టము లెల్లరు నపరిమిత సంతోషమున నోలలాడిరి.

వివాహ సమయమున జమిందారుగారు భూరిసంభావన లిచ్చినారు. రాజమహేంద్రవరములోని వితంతూద్వాహ మండలివారికి వేయిన్నూటపదాఱు లిచ్చిరి. జమిందారు గారి బంధువులు స్నేహితులు వధువునకు విలువగల బహుమతులు గొనివచ్చినారు. కొందఱు వెండి చెంబులు, కొందఱు కాఫీగిన్నెల దొంతరలు, గంధపుబుడ్లు, వెండి సబ్బు పెట్టెలు, బంగారు నగలు మొదలగు రకరకముల పారితోషికము లొసంగిరి.

పెండ్లికొమరిత చుట్టములందరు నవనాగరికులు. ఆంధ్రదేశములోని సంపన్న గృహస్థులు, ఎల్లప్పుడు పట్టుచొక్కాలు ధరింతురు. జుట్టు నున్నగా దువ్వుకొందురు. కంటి యద్దములజోళ్ళు వారికి సార్వకాలిక భూషణములే. ఆడువారికే కంటియద్దము లున్నవట. వారెప్పుడు నూరేగింపులకు రారు. సభల నలంకరింపరు. వారందరకు సేవకులు, సేవకురాండ్రు పెక్కు రుందురు. తమ బిడ్డలకు పాలిచ్చుకొను ముత్తయిదువులు వారిలోలేరు. కొందఱు బాలికలు కాళ్ళకు జరీ పువ్వుల మొఖమల్ జోళ్ళు సంతతము తొడిగికొని యుండుటచే పాదములకు బారాణిపూయుటకు వీలులేకపోయినదట.

మగవారు మగపెండ్లివారితో బంక్తిభోజనమునకు రాలేదు. అచటి గాయకుల గానసభలు వారి హృదయము లాకర్షింప లేదు. స్వంత బ్రాహ్మణులు దారిచూప వారికి వేరుగా నేర్పరచియున్న భోజనశాల కరిగి భోజనము చేయుట, వార్తాపత్రికలు, ‘నావెలు’ గ్రంథములు చదువుకొనుట, సిగరెట్లు కాల్చుకొనుట వారి దినచర్యయైయుండెను.

మగపెళ్ళివారు పల్లెటూరి వారు. ఆచారాదికములు వారికి మెండు. ఊరేగింపునకు వారుసిద్ధము. వెలగల బనారసు చీరలు ధరించుట, దేహమెల్ల బంగారు నగలు ధరించుట, పాదముల బసుపుపారాణులు పూయించుకొనుట, పేరంటములకు దండ తండములుగా వచ్చుట, పెండ్లిపాటలు పాడించుట, పాడుకొనుట మున్నగు బెండ్లితంతులెల్ల మగపెండ్లి వారి యాడంగులే గుత్తకు గైకొనిరి. వియ్యపురాలికి, నాడుబిడ్డలకు నయిదురోజులు మొగములు కడిగించుట మొదలగు తంతులన్నియు క్రమముగా జరుగవలెను గాన, ఇష్టము లేకపోయినను వరదకామేశ్వరీదేవి ప్రతివేడుకకు రావలసివచ్చినది.

మగపెళ్ళివారిలో మగవారు అన్ని సభలకు హాజరు. వారి సంగీత ప్రీతియు, దలలాడించుటయు, జేతులతో తాళము వేయుటయు వింతగా జెప్పుకొనిరి.

జమీందారిఫాయాలో జేరిన ఆడపెండ్లివారికి మగ పెండ్లివారి ఆడువారు కాళ్లకు నగలతో పసుపు బారాణులతో ముత్తయిదువులవలె కనిపించిరట. గజ్జలగుఱ్ఱములవలె దోచినారట!

‘ఇంత పల్లెటూరివాళ్లని మనం అనుకున్నామటమ్మా. వట్టి మోటు అడవి మనుష్యులవలె ఉన్నారు. ఈ సంబంధం ఎక్కడ తెచ్చారండీ అత్తయ్య గారూ!’ అని వరదకామేశ్వరీ దేవితో నొక దగ్గరిచుట్టము, సరోజని, యనినది. ‘అమ్మా, శారదను తీసుకు వెళ్ళి పల్లెటూళ్ళ పేడదొడ్లలో పడవేశారేమమ్మా?’ అని శకుంతలాదేవి చిన్నవోయిన మోముతో ననినది.

‘వదినా! మీ అమ్మాయికి మా అబ్బాయికన్న చాలగొప్ప సంబంధం తెచ్చారనుకొన్నాము. చూడ ముచ్చట వేస్తోంది. మా వైపు పనిచేసేవాళ్లు ఇంతకన్న చాలా నాజూకుగా ఉండిపోతారే’ అని జగన్మోహనరావు జమిందారుగారి తల్లి శివకామసుందరీదేవిగా రనిరి.

‘అవునండీ పిన్నీ, వాళ్ళ బట్టలు వాళ్లే ఉదుక్కుంటారట. పిడకలు చేసుకుంటారట. నీళ్లు తెచ్చుకుంటారట. పొలాలు వెళ్ళి గడ్డీగిడ్డీ కోసుకు మోపులుకట్టి తెచ్చుకుంటారట’ అని జమిందారు గారి వేలువిడిచిన మేన కోడలు లలితకుమారిదేవి యనినది.

‘ఆ నగలేమిటి? ఆ బొట్లేమిటి? ఆ చీరలేమిటి? గాడిదలకు దిగబోసి నట్లే! కోరి కోరి వేదికి వెదికి తెచ్చారే!’ అని మఱియొక శ్రీమతి ముక్కుపై వేలు వైచుకొనినది.

అందఱు వెడవెడ నవ్వులు విరగబడి నవ్వుకొని నారు. వియ్యపురాలు జానకమ్మ గారు గూడ వారి హేళనకు గురియైనది.

‘ఆవిడేనా వియ్యపురాలు! కూడా వచ్చిన పేరంటాలనుకున్నాను!’ అని హైకోర్టు న్యాయవాది ఆనందరావుగారి భార్య ప్రమీలా దేవి యనినది.

‘ఇంతకూ మా శారద అదృష్టం యిలా అయింది’ అని వరదకామేశ్వరీదేవి కన్నుల నీరునింపుకొంది.

ఆ ప్రక్కనే సోఫాపై నధివసించి యీ సంభాషణ లాలకించు శారద హృదయము పరిపరివిధముల బోయినది.

ఆమె తోటిబాలిక యోకర్తామెకడనే వసించి యున్నది. ఆ బాలిక కేలనో నారాయణరావు చక్కనివాడని తోచినది. ఆ బాలకు మొన్న మొన్ననే వివాహమైనది. ఆమెవరుడుగూడ శ్రీమంతుడు. విద్యావంతుడే! అయినను తేజస్సుతో నిండిన నారాయణరావు మొగము, అతని రూపసంపద ఆ బాలికకు జూడముచ్చటయైనది. ఆ బాలిక శారద పినతండ్రి కుమారితె. ఆమె పేరు నిరుపమా దేవి. ఆ బాలిక జనకుడు చెన్నపట్టణములో న్యాయవాదిగా నున్నాడు. శారదకు, నా బాలికకు మిక్కిలి స్నేహము. ‘శారద! నీ భర్త ఇంగ్లీషు భాషలో చాల గొప్పవాడే!’

‘ఎల్లా తెలిసిందే నీకు?’ క్రొత్తక్రొత్త ప్రపంచములో గన్నులువిప్పు నీ బాలికకు సిగ్గులుండరాదని వారి మతము. సిగ్గుపడువారిని గాంచి పల్లెటూరి వారని వారిలో వారే నవ్వుకొందురు.

సంబంధము తండ్రి తెచ్చినాడు. బాబయ్య గారు తెచ్చిన సంబంధము నందు లోపము లుండగూడదు. పెళ్ళి వారందరూ పల్లెటూరివారే. పల్లెటూరివా రగుటయే లోపమైనచో బాబయ్యగారి కది గొప్ప సంబంధమని యెట్లుతోచినది? బాబయ్య గారికి తనపై చాల ప్రేమ. ఎందు కిట్టి సంబంధము తెచ్చినారు? లోన సిగ్గుపడుచు... పెండ్లి ... చాల అందంగా ఉండెననియా అనుకొనినది. అంతలో ఆమె త్రపాహృదయయై ఆ యాలోచన మానికొన్నది. ఆమె మోము చిరునవ్వున ప్రఫుల్లమైనది.

‘ఏమిటే శారదా! చిరునవ్వు నవ్వుతున్నావు’ అని నిరుపమాదేవి యన్న ది.

‘ఏమి లేదే?’

‘వూరక నే నవ్వుకుంటారటే!’

‘ఏదో ఆలోచన తట్టి నవ్వు వచ్చింది.’

‘ఏమిటా ఆలోచన! మీ ఆయనమీదేనా?’

‘నువ్వు నన్ను వేళాకోళం చేస్తావేమిటే? వరసా తెలవదు వావీ తెలవదు!’

‘నువ్వు వరస కాకపోవచ్చును. కాని బావగారు కాదా ఏమిటి?’

నిరుపమకు బావగారా! నిరుపమ తనకన్న కొంచెము పెద్దదిగా! నిరుపమ యా యాలోచన గ్రహించి ‘బావగారని ఎందుకన్నా నంటావు? మనం ఇద్దరం కొంచె మెచ్చుతగ్గు ఒకేయీడు. అందుకని బావగారన్నా తప్పులేదే!’

నిరుపమ నారాయణరావును సంతతము మేలమాడునది. నిరుపమ ఆడు పిల్లల పాఠశాలలో నయిదవ ఫారము చదువుకొనుచున్నది. నారాయణరావా బాల హృదయము చూరగొనినాడోయన నిమేషమేని నాతని వదలక ఇంగ్లీషులో సమస్త విషయముల గుఱించి మాట్లాడునది.

శారద యిది యంతయు జూచి యించుక యక్కజమందినది. నిరుపమ శారదను జూచి—

‘మీ ఆయన చాలా తెలివైనవాడే. ఏ సంగతైనా నేనడిగేటప్పటికి, అతివిపులంగా తెలిసేటట్లుగా మంచి కథలా చెప్తాడే. ఎన్ని సంగతులు! ఎంత బాగా తెలుసును! మా మాష్టరుగారు పుస్తకము చదువుకొనివచ్చి మా కందరకూ చెప్పితే నిద్రవస్తుంది. నాకు ఇంటిదగ్గర చెప్పే మా మాష్టరు గారు చెప్పిన దానివల్లను పాఠం అర్థంకాకపోవడమూ ఉన్నది. కాని మీ ఆయన అద్భుతంగా పాఠం చెప్పగలడు. ఆయనదగ్గిర పాఠాలన్నీ చెప్పించుకుంటూంటే చాలా బాగా ఉండును’ అని పంచమస్వనంతో పలికింది.

‘చెన్న పట్నంలోనే ఉంటావు! అక్కడ అన్నీ చెప్పించుకోవచ్చును.’

‘అదిగో అప్పుడే ఉడుకుపోతుతనం! ఎక్కడ వీలవుతుంది? మా నాన్న గారితో చెప్తాను. మీ ఆయనకు చాలా బాగా సంగీతం వచ్చునట. పెండ్లి కూతురు చూపులకు వచ్చినప్పుడు ఫిడేలుమీద ఆద్బుతంగా వాయిస్తూ పాడినారట కాదూ! అమ్మ దొంగా! చెప్పావుకాదు. బొమ్మలు వేయడంకూడా బాగా వచ్చునట!’

‘ఏమో నాకేమి తెలుసునే నిరుపం! నువ్వు అవ్వికూడా నేర్చుకోవచ్చునులే!’

ఆ దినమెల్ల శారద తాను వినిన మాటలు, నిరుపమా దేవి పొగడ్తమాటలు దలచుకొనుచు నేయున్నది. ఆయన పల్లెటూరి అనాగరికులలో నొక వ్యక్తియా కాదా యని యామె తర్కించుకొనినది. ఆతని యుత్కృష్ట వ్యక్తిత్వమును ఆమెకు గోచరించినది. అంతకన్న నా బాల యాలోచింపలేదు. ఆలోచించుట కామె హృదయమునకు బరిపక్వస్థితి రాలేదు. నిరుపమ నగరవాసిని. అట్టి బాల కన్ని సంగతులు తెలియును. తనవా రెల్ల నట్టులనిరేమి? నిరుపమ యీరీతి బల్కినదేమి? ఆ రోజున ఆయన వాయించిన ఫిడేలు వాద్యము ఎంత అద్భుతమైనది!

పెండ్లి రెండవరోజు మధ్యాహ్నము జగన్మోహనరావు జమిందారు పెండ్లికుమారిత శారదకడకు వచ్చి, ప్రక్కనే సోఫాపై అధివసించినాడు. శారద ఎంత యందకత్తె! సినిమానటియగు సులోచనవలె యున్నది. శారదకీ యంద మెక్కడనుండి వచ్చినది? ఆమె తన కౌగిలిలో లతవలె నిమిడి పోవును. తన కిచ్చెదరనుకొన్న యీ బాలిక నే డింకొకని భార్య యైనదా? ఎవడీ నారాయణరావు ? ఈ సంబంధ మెట్లు తీసికొనివచ్చినారు? పందికిని బాలలక్ష్మికిని పాణిగ్రహణమట!

‘శారదా! ఏమిటా గర్వము? మాట్లాడుట మాని వేసినావు? మంచి పోతరించిన గిత్తలావున్న మొగుణ్ణి తెచ్చుకున్నానని గర్వమా ఏమిటి? ఎక్కడ నుంచి తెచ్చారు నీ కీ మొగుణ్ణి? కాకిముక్కుకి దొండపండు కట్టినట్లు నిన్ను తీసుకెళ్ళి వట్టి బండాడికి కట్టిపెట్టారు. మామగారికి ఎల్లా నచ్చిందీ సంబంధం? అత్తకు నచ్చలేదుటగా? ఈ నీ బంగారు విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ రాక్షసుడి వొళ్ళో పారవేసినారేమిటి?’

శారద యాతని పలుకులకు ప్రతిమాట చెప్పినది కాదు. ఆమె గుండె మాత్రము దడదడ కొట్టుకొనినది.

‘మాట్లాడవేం? ఆ! నీ మొగంచూస్తే నీకు వీడంటే అసహ్యమనే తోస్తుంది. కాదు మరీ! కాస్తడబ్బు కాస్త చదువు వుంటే పెద్ద కుటుంబం వాడవుతాడా? నాజూకు వాడవుతాడా? ఈ పందిని చూసుకొని నువ్వు కులక బోతావాయేం! అట్లా ఒక్క నాటికి నీ మనస్సు పోతుందా!’

శారద కొక్కసారి కన్నుల నీరుతిరిగినది. అచ్చటనుండి లేచి, విసవిస నడిచి, మేడమీదికి పోయినది.

౧౩

ముచ్చట్లు

వివాహము మంగళాంతమైనది. ఆ నాలుగురోజులు సుబ్బారాయుడు గారు సేలం సుందరి, వెంకటస్వామి నాయుడు, టైగరు వరదాచారి, చౌడప్ప, బలరామయ్య, హరినాగభూషణం మొదలగు గొప్ప గాంధర్వ గాయకుల రప్పించినారు. ఆడుపెండ్లి వారు సంజీవరావు పిల్లనగ్రోవిపాట, సంగమేశ్వర శాస్త్రి వీణపాట పెట్టించినారు. ప్రసిద్ధి కెక్కిన భాగవతులచే రాత్రులందు విడిదికడ హరికథలు చెప్పించిరి.

సదస్యమున కాంధ్ర దేశములో పెన్న నుండి తెలివాహా నదివరకుగల ఘనపాఠులు, కావ్యవ్యాకరణ తీర్థులు, ధర్మశాస్త్ర కోవిదులు, తార్కికులు, మహాపండితు లెందఱో విచ్చేసినారు. కవులు గాయకులు విద్వత్ బృందములు క్రిక్కిరిసిపోయినారు. సుబ్బారాయుడుగారు కాసుతో మొదలిడి నూటపదహార్ల వఱకు సంభావన లిచ్చినారు. జమిందారు గారుకూడ భూరిసంభావన లిచ్చినారు. ఆ వివాహవృత్తాంతము లాంధ్రదేశ మంతట గథలుగా జెప్పికొనిరి.

రెండువందల యేబదిమంది బ్రాహ్మణులు వంటలకు, నీరు తెచ్చుటకు, వడ్డనలకు నేర్పాటు చేయబడిరి. వంట సుబ్బయ్య గారి నలభీమపాకము జగత్ప్రసిద్ధము. ఆయన స్వయముగా మహానసాధిపత్యము వహించిరి. సమస్త పాకములలో షడ్రుచులలో నాయనిది అందెవేసిన చేయి. ఆయన వంకాయ కూర వండి పోక పొత్తిలో తొమ్మిదిరోజులు నిలువయుంచి, పదవరోజున దీసినచో నప్పటికప్పుడు వండిన కూరవలె బొగ లెగయుచు రుచికరమై, చెక్కు చెదరక యుండునట. అన్నమునకు, గూరలకు చారు పులుసులకు వేఱు వేఱుశాలలు. పిండివంటల పందిరి వేఱు. పిండివంటలకు పాలఘాటు బ్రాహ్మణుల జట్టు వచ్చినది.

స్త్రీలకు, బురుషులకు వేర్వేరు భోజనశాలలు, వడ్డనకై వేరు వేరు జట్టు లుండెను. సంబారములు జతనచేయుట కిరువదిమంది జమాజెట్టీ లేర్పరుపబడి నారు. ఇదికాక ఘనబంధువులకు వేరు వేరు వంటలు విడిగా బచనము చేయబడును.

పెరుగు బానలు నిలువ చేయుటకు గొన్ని గదులు. కూరగాయలకు గొన్ని గదులు, ప్రసిద్ధులు పదునైదుగురు తమలపాకు బీడాలు కట్టుచుండిరి.

ఐదురోజులు రెండుపూటల మూడు నాల్గు పిండివంటలు, వేపుడుగూరలు, కలగల్పులు, పప్పులు, పచ్చళ్ళు, దప్పళములు– చేసిన రకములు చేయకుండ సమారాధనలు దివ్యముగ జరిగినవి.

పెండ్లికి వచ్చిన చుట్టములకు, స్నేహితులకు, బండితులకు, నాశ్రితులకు సమస్త జనులకు నెచ్చట నేమియు కొఱత రాకుండ జమీందారుగారు వేయి కనులతో గనిపెట్టియుండిరి.

నాల్గవనాటి రాత్రి పట్టణమంతయు నూరేగింపుటుత్సవము మహావైభవముగ జరిగినది.

జమీందారుగారి ఊరేగింపు టేనుగుపై బంగారపుటంబారీ నమర్చి వధూవరుల నం దాసీనులజేసి యూరేగించినారు. అలంకృతములగు నాలుగు మదగజములు, ఒంటెలు, ఒయ్యారపునడకల తురగములు నాలుగు రణడోలు మేళములు, మైసూరుబ్యాండు, నౌబత్తు మేళములు, మోటారుకార్లు, చిత్ర విచిత్రములగు వేషములు, ఓడలు, బండ్లు మొదలగు వాహనములు, నయిదు వందల గ్యాసుదీపాలు, కొబ్బరికురిడీ దివ్విటీలు రెండువందలు, పూలచెట్లు, కాగితపుబుడ్ల దీపాల వరుసలతో, అఖండ వైభవముతో గనులపండువుగ నూరేగింపుటుత్సవము నడచినది. ఊరంతయు నూరేగింపులో నున్నది. మగపెండ్లి వారందరు మోటారుబండ్లమీద నూరేగిరి. ఆడపెండ్లివా రెవ్వరును రాలేదు.

వివాహమునకు నారాయణరావు స్నేహితులందఱు నరుదెంచిరి. చాల మందికి రాకపోకలకు ఖర్చులు నారాయణరావు పంపినాడు. ఆ యువకమండలి యంతయు పేకాటలతో, సిగరెట్ల కాల్పులతో, వివిధ వాదములతో, నవ్య కవిత్వపు సభలతో, బెండ్లి యైదుదినములు వినోదించిరి. జమీందారుగారు వారి విషయమై యపరిమిత శ్రద్ధవహించి, వారి కెప్పు డేమి కావలయునో అరయుచుండుటలో, సిగరెట్లడబ్బా అందుబాటు చేయుటలో నేమరకయుండెను. నారాయణరావు తనమిత్రుల యవసరములకని పరమేశ్వరమూర్తి చేతిలోనిడిన నూరురూకలతో బనిలేకపోయినది. రాజారావు, పరమేశ్వరుడు, ఆలం, ఇంకను చాలామంది ఆంతరంగిక మిత్రులు కుటుంబములతో వచ్చిరి. స్నేహమండలికి వలయు సౌకర్యము లొనగూర్చుపని లక్ష్మీపతి వహించవలసి వచ్చినది. లక్ష్మీపతి యతిశ్రద్ధాళువై స్నేహబృందముచే లోటేమియు లేదనిపించినాడు.

ప్రాణస్నేహితులు, కొంచెము దూరపుమిత్రులు, మరీ దూరపుహితులు, లోనగువారికి నారాయణరాయ లక్ష్మీపతులు దలలోని నాలుకవలె మెలంగిరి.

ఒక స్నేహితుడు: పెండ్లికూతురు అప్సరసవలె వుందిరా!

ఇంకొకడు: చాలా తెలివైన అమ్మాయటరా! ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు క్షుణ్ణంగా వచ్చునట. ఫిడేలు, వీణపాటల్లో అపరశారదాదేవే అన్నారు.

రాజా: అది గాదోయి, నారాయణరావు అదృష్టవంతుడని అనవచ్చు నన్నమాట.

పర: చాలా అదృష్టవంతుడని ఈ సభలో ఉపపాదన చేస్తున్నాను, సభవారు ఆమోదిస్తే ప్రకటనార్థము పత్రికలకు పంపుతాను. లక్ష్మీ: జమిందారుగారి శ్రద్ధ చాలా విపరీతంగా వుందోయి.

ఆలం: అరే లక్ష్మీపతీ! మనకి రైల్లోకనబడ్డప్పుడు ఇంత మంచివాడు అనుకోలేదు.

రాజే: ఒరేయి నారాయణా! జమిందారు గారు నిన్ను పూర్తిగా ప్రేమించడం ప్రారంభించారు. ఆయనకళ్ళు నిన్ను తనివితీరా క్రోలుతున్నట్లు నీమీదే వుంటాయి.

ఓ స్నేహితుడు: అసలు ప్రథమదృష్టి ప్రేమవ్యాపారంలా కనబడుతూ వున్నదిరా !

వేరొక మిత్రుడు: జమిందారు శాసనసభలో ఎప్పుడూ స్వరాజ్య పార్టీ తరఫున పని చేస్తాడు. కాని ఆయనకు అసహాయోద్యమం ఇష్టం లేదంటారు.

లక్ష్మీ: ఇష్టం లేకేమి ఆయన జైలుకు వెళ్ళకపోయినా, 1922 సంవత్సరంలో అందరూ జైలుకు వెళ్ళినపుడు శాసనసభలో అస్తమానం గవర్నమెంటును ఖైదీల విషయం ప్రశ్నలు వేస్తూనే వుండేవారు. ఒరే రాజేశ్వరుడు! మీ జస్టిసుపార్టీ పక్కలో బల్లెమై పానగల్లును డేకించేసేవాడు.

నారా: బావా! పానగల్లును డేకించగల మగవాడు ఇంతవరకూ పుట్టలేదు. ఇక పుట్టబోడు. అతనికి అతనే సాటి. ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయంలో ఆంధ్ర రాజధాని విషయంలో అతనికి ఉన్న పట్టుదల, దీక్ష ఇంకోడికి లేదు. ఆంధ్రాభిమానం ఇంతా, అంతా అని కాదు. పైగా తనకు పార్టీ మాటేలేదు. పైకి ఏమన్నా, క్రియలో అందరియందూ బ్రాహ్మణుడయ్యేది, బ్రాహ్మణేతరుడయ్యేది సమానప్రేమ ఆయనకు.

రాజే: నారాయణ రావుకూ జై! మా పార్టీ మర్యాదంతా కాపాడావురా.

నారా: అవునురా, స్వరాజ్య పార్టీ వాళ్లు శాసనసభలకు వెళ్ళి చేసినపని యేమిటి రా?

పర: ఒరే అల్లాంటే నేను ఒప్పుకోను. గవర్నమెంటు వారి మానస పుత్రుల మనుకొని, దేశద్రోహులై దేశం కోసం మనవాళ్ళు ఖైదులకు వెళ్ళి పడరాని పాట్లు పడుతోంటే చీమైనా కుట్టకుండా, లొల్లాయికబుర్లు చెప్పుతూ, ఉద్యోగాల కోసం ఏడ్చి నిద్రపోతూ, కాంగ్రెసును చండాలపు తిట్లు తిట్టిన మహానుభావులు కాదూ ఈ జస్టిసుపార్టీ సమరథులు?

నారా: నువ్వు చెప్పింది నిజం కాదనను. కాని, ఆ దృష్టి స్వరాజ్య పార్టీ వైపు మరల్చరా. తాము శాసనసభల్లోకి వెళ్ళి వెలగబెట్టేది ఏమి లేదని తెలుసును. వట్టి ప్రశ్నలు అడగడం తప్ప వీరు చేసిన మహత్కార్యం లేదు. వీరు సలిపిన గడబిడ అంతా వృధాయని తెలుసును. కాంగ్రెసులో వుండి ఖైదుకు వెళ్లలేరు, కష్టపడలేరు. శాసనసభలలో సభ్యులమని విఱ్ఱవీగడంతప్ప ఏమున్నది? సరియైనమార్గం చెప్పి దీక్షతో నడచుకోండర్రా అన్న ఆ మహాత్ముణ్ణి మూలకు తోశారు. ఆయన యేర్పరచిన బాటను నడిచే శక్తి లేక ఆక్షేపిస్తారూ? శాసన సభల్లో యుద్ధాలు చేసి, శాసనసభలు ముక్కలు చేస్తారా? దేశంలో పోనీ, అసంతుష్టయినా కలుగ జేశారా? ఒక్కగాటిని నడవవలసిన దేశం భిన్న భిన్నమై ఎవరికి వారే యమునాతీరే అయిందీ! ఏమిటోయి స్వరాజ్యపార్టీ వారు చేసిన అద్భుతకృత్యాలు?

పర: ఒరేయి! నీకు అసలు నిరాకరణ వాదం అంటే ప్రాణంగదా, పోనీ, మీబోటిగా ళ్ళేమి చేశారు? ఖైదుకు వెళ్ళివచ్చి ఏ మొహం పెట్టుకొని మళ్ళా కళాశాలల్లో చేరారు?

నారా: నేను చేసినపని సరియైందని వాదించానటరా? ఆరు నూరైనా, నూరు ఆరైనా, ఒకటే మార్గాన్ని నమ్ముకువుండలేక పోయిన హృదయదౌర్బల్యానికి తలవంచుకుంటున్నాను. అంతే.

పర: కాని తీవ్రవాదనంటే నీ కెంత ఇష్టమైనా స్వరాజ్య పార్టీ వారు చేసిన కార్యాలు కొంచెమయినా గమనించకపోతే ధర్మదూరం కాదురా!

నారా: వాళ్ళు అసలు చేయలేదని అన్ను. బార్డోలీ తీర్మానం తప్పనీ, గాంధీ గారికి మెదడు లేదనిన్నీ, రీడింగు ప్రభువు రాజీకి వచ్చినప్పుడు ‘ఫత్వా ఖైదీలు’ అంటూ తాము బట్టిన కుందేటికి మూడేకాళ్ళని కూచున్నాడనిన్నీ మనమహానుభావులు చేసిన హేళణ – ఏ కొద్దో కాంగ్రెసు దేశానికి అర్పించిన పనిని మంటగల్పడమే కాకుండా, దేశానికి విషమైందని నా వాదన.

ఈ సంభాషణ స్నేహితులందఱు వినుచున్నారు. కొందరు విసుగుతో దూరముగాబోయి పేకాట మొదలుపెట్టిరి. కొందరు తామును సంభాషణలో బాల్గొనిరి.

స్నేహితులందఱకు ఆ అయిదురోజులు త్రుటిలో వెళ్ళిపోయినవి. పరమేశ్వరమూర్తి గృహప్రవేశమునకై కొత్త పేట వెళ్ళినాడు. తక్కుంగల మిత్రులు, రాజమహేంద్రవరమునుండియే పనివినినారు.

జానకమ్మ గారు కోడలిని జూచి మురిసిపోయినది. ఆమె పెద్దవియ్యపురా లామెను జూచి ‘ఏవమ్మా వదినా! సుఖపడాలని పెద్దకోడల్ని తెచ్చుకున్నావే, ఈవాళే పెద్దమనిషి అయ్యేలాగుంది’ అని నది.

‘ఇదివరకు కోడలు వచ్చి సుఖపెట్టింది, ఇప్పుడు ఈవిడ వచ్చి సుఖ పెట్తుంది! వాళ్ళ భార్యాభర్తలు కులాసాగా ఉంటే అదే పది వేలు’ అనినది జానకమ్మ గారు.

ఒక ఆవిడ: మీ కోడలు చాలా నాజూకుమంతురాలు. జమీందారు గారి అమ్మాయి పనేమి చేస్తుంది? మీకు కోడళ్ళు పని చెయ్యాలిటమ్మా అక్కా!

ఇంకోవనిత: ఏమమ్మా అత్తా! పెళ్ళి వారు అతి నాజూకు వారు. ఒక్కరూ వచ్చి కూచోరు. పలకరించరు. ఇంత గర్వాలేమిటమ్మా? మన వాళ్ళని చూచి ఒకటే మూతులు ముడుచుకోవడము. జానకమ్మ: అందుకోసమే ఈ సంబంధము మా వారికి ఇష్టము లేకపోయింది. మెడలువంచి వొప్పించినారు.

వెంకాయమ్మ (నారాయణరావు అక్కగారు, శ్రీరామమూర్తి చెల్లెలు): అమ్మా, అదేమిటే అల్లాంటావు! నిక్షేపంవంటి సంబంధము. తమ్ముడికి మరదలంటే చాలా ఆపేక్ష. కోరుకొని చేసుకొన్న పెళ్ళికూతురాయెను.

సత్యవతి: (నారాయణ రావు రెండవ అక్కగారు) అక్కయ్యా! భార్యాభర్తలకు మనస్సు కుదిరిన సంబంధము చేసుకోవాలి. లేకపోతే వాళ్ళిద్దరి బ్రతుకూ యమలోకము.

వెంకాయమ్మ: నా తల్లీ, నీ ఖర్మం అల్లా కాలిపోయింది కాని, అన్ని సంబంధాలు భార్యాభర్తల ఇష్టంమీదే చేస్తున్నారటే?

జానకమ్మ: మగవాడు గౌరవముచేయని ఆడదాని బ్రతుకు అధమాధమం. డబ్బక్కర లేదు, పిల్లలక్కర్లేదు! మొగుడు ఆడదికూడా ఒక ప్రాణి అని తలపే లేక కుక్కకన్నా కనాకష్టంగా చూస్తే దానిబతుకు పేడలో దొర్లే పురుగుకైనా వద్దు.

సత్యవతి భర్త పరమకోపి; వట్టి అనుమానపుమనసువాడు. తన నీడను చూచి తాను భ్రమిసే పిచ్చిమనిషి. ఏదో వంక మీద భార్యను చావకొట్టును. బావగారితో మాట్లాడినావనును. మరిదివంక జూచినావనును. ఒక రోజంతయు తిండి పెట్టవద్దని తన తల్లికి నాజ్ఞ యిడి, గదిలో బెట్టి తాళము వేసినాడు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలకుడు, ఒక బాలిక చిన్నతనములో నే జబ్బులుచేసి పోయినారు. పెద్దపిల్ల పదేళ్ళది. సత్యవతి స్ఫురద్రూపి, తీర్చిన కనుముక్కు సొబగుగల బంగారుశలాక వంటిది. వెన్నెలకిరణము, అందకత్తె యయిన భార్యను జూచినప్పుడు వీరభద్రరావు, వీరభద్రుడై నిష్కారణముగ జావగొట్టును. సుబ్బారాయుడుగారికి జానకమ్మ గారికి సత్యవతి చరిత్ర సంతతము మహావిషాదము కలుగ జేయుచుండును. వారి జీవితయానములో సత్యవతీ చరిత్రయే నీటిక్రింద నణగియున్న భయంకరమగు శిలయైనది. పుత్రిక కొరకై జానకమ్మగా రెన్ని గంగాయమునా ప్రవాహములు కన్నుల బ్రవహింపజేసినదో!

సూర్యకాంతము: (నారాయణ రావు రెండవ చెల్లెలు) అక్కయ్యోయి! నేనూ చిట్టక్కయ్యా చిన్న వదినదగ్గర ఉన్నాము నిన్నల్లాను. మొట్టమొదట ఏమి మాట్లాడింది కాదే! మేమే తెగ పలకరించాము. అప్పుడు మాట్లాడిందే. తన చదువుసంగతులు, సంగీతం సంగతి, వాళ్ళచుట్టాల సంగతి అన్నీ చెప్పింది. మా యిద్దరికీ స్నేహం కలిసిపోయింది.

రమణమ్మ: (నారాయణ రావు పెద్ద చెల్లెలు) ఒసేవు అక్కయ్యా, నాతో రెండు మాటలేవో చెప్పింది. అంతే. సూరీడుతో ఒకటే కబుర్లు. వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహం కలిసిపోయింది. వెంకాయమ్మ: ఏమి కబుర్లు చెప్పిందేమిటే సూరీడూ!

ఇంతలో జానకమ్మ గారి రెండవ వియ్యపురాలు, వెంకాయమ్మ అత్తగారు, వచ్చి ‘ఏమండీ వదినా, ఈ రోజున యింకా పెళ్లికూతుర్ని తల దువ్వటానికి తీసుకు రాలేదు. ఊరిలో వార్నందర్నీ , బంతులాడించటమునకు పిలిచాము. మేమంతా ముస్తాబయ్యాము. మీరూ, మీ అమ్మాయిలు సోది పెట్టుకు కూచున్నారు అన్నది.

జాన: మా పెద్దమ్మాయి, సూరీడూ వెళ్లి పెళ్ళికూతుర్ని తీసుకువస్తారు. సత్యవతీ మాణిక్యం మీరంతానున్ను పెళ్ళి వార్నందర్నీ పేరంటానికి పిలవండి. సావిత్రీబాయి సంగీతపు కచ్చేరట! ఆడవాళ్ళకి ప్రత్యేకం. ఇది పెళ్ళికొడుకు గారి అరణ్యమెంటు. లెండఱ్ఱా, ఎవరిపనులు వారు చెయ్యండి మూడయ్యింది అప్పుడే.

ఆ నాల్గవ నాటి సాయంత్రం ఊరిలో ఆడవారికిమాత్రము అచ్చుకార్డులు పంపినారు. ఈ పద్ధతి అంతయూ నారాయణరావు పరమేశ్వరమూర్తి లక్ష్మీపతులు చేసిన ఆలోచన. దగ్గరచుట్టాలను, పెద్దలఇండ్లలో నాడంగులను మూడు మోటారుకార్లమీద జానకమ్మగారు, శ్రీరామమూర్తి భార్య, సూర్యకాంతము, మాణిక్యాంబ, శ్రీరామమూర్తిఅత్త గారు, వెంకాయమ్మ అత్తగారు వెళ్ళి పిలిచివచ్చినారు.

విడిదిలో మధ్యహా లతి సౌందర్యముగ పెళ్ళికొడుకు, బరమేశ్వరుడు నలంకరింపించినారు. వచ్చిన స్త్రీమండలి వీలుగా కూర్చుండుటకు విచిత్రముగా నాసనము లమర్పించినారు. విసనకఱ్ఱలతో విసరుటకు పనికత్తెల నేర్పాటు చేయించినారు.

వేరేగదులలో వచ్చిన వారందఱకు నుపాహారములు, కాఫీ, పండ్లు నిచ్చిరి. తాంబూలములు, కర్పూరపు దండలు, చక్కని పూవులద్దిన ఖద్దరు రవికలు, వెండికుంకుమబరిణెలు, పూవులగుత్తులు బొట్టుపెట్టి స్త్రీమండలికి నర్పించినారు. జడ్జీ భార్య, ఆంగ్ల సబుకలెక్టరుభార్య, మొదలగు గొప్పవారందరును వచ్చిరి. ఈ పద్ధతి నవీనముగా నుండుటచే, ఆడపెండ్లివారి వనితామణులందరు విచ్చేసిరి. వచ్చిన బాలబాలికలందరకు చక్కని వెండి బొమ్మ లర్పింపబడినవి. సెంటుబుడ్లు అందరకు నిచ్చినారు. జేబురుమాళ్ళిచ్చినారు. సావిత్రి ఆరోజున తన గానవిద్యాప్రౌఢిమ నానంద ప్రవాహముల బరపినది. ఆమెకంఠము వీణతీగయినది. ఆ మధుర దివ్యగాంధర్వములో వధూవరు లిర్వురు లీనమైపోయినారు. సంగీత కళాపాసకులగు నీ నూత్న దంపతుల యానందములో దివ్యత్వము జూరగొన్నది సావిత్రి.

౧౪ (14)

ఇతర దినాలు

ఈ వివాహపుతంతునం దేమి విచిత్రమున్నదో కాని, యా మూడుముళ్లు పడునప్పటికి సముద్రపుటుప్పు నడవి యుసిరిక వంటి రెండుజీవితాలు మిళితమైపోవును. ఏ కొండలలో పుట్టినవో ఏ లోయలలో ప్రవహించి వచ్చినవో, ఏ మెట్ట లెక్కినవో, ఏ పల్లముల నింపినవో, రెండు జీవిత ప్రవాహాలు చేరి యొక దారి నరుదెంచి, యీ పుణ్య వివాహవేదికకడ సంగమించి ప్రయాగ తీర్థమై పరిణమించునుకదా యనుకొని నారాయణరావు అక్కజపడెను.

తన్ను పెండ్లికొమరుని చేసినప్పుడు తాను స్నాతకపు బీటలపై తలిదండ్రులతో గూర్చుండినయప్పుడు మంగళ స్నానము లాచరించి, పట్టుపీతాంబరముల ధరించి, వివాహ వేదికపై పెండ్లిపీటపై నధివసించినప్పుడు, మంగళసూత్రద్వయము శారదకంఠమున మూడుముళ్లు వైచినప్పుడు వర్ణింపరాని భావవేగములో దేలిపోయినాడు. మంగళసూత్రధారణ మైనపిమ్మట ఎదురుగా గూర్చుండినంతనే శారద యనిన నంతప్రేమ తన్నేల యావరించినది? తాను మాతృమూర్తియు, శారద చిన్న బిడ్డయువలె నాతనికి గోచరించినది. శారదయు తాను వేలకొలది జన్మముల స్నేహితులై, గాఢానురాగమున గలసి సంచరించినట్లు తోచినది. శారదాదేవి మహారాజ్ఞియై రాజ్యమేలుచున్నట్లు తాను సేవకుడై యామెకు బరిచర్య చేయుచున్నట్టులు భావము జనించినది. శారదయు దాను నక్కచెల్లెండ్రయి యుగాల వెనుక నొక్క మేఘశకలములో నుండి విడివడిన కవలపిల్లలై యాడుకున్న ట్లూహావేశము కలిగినది. తాను పురుషుడట, శారద ప్రకృతియట; తాను పురుషోత్తముడట, శారద మహాసృష్టియట.

ఆతని కన్నులు చెమర్చినవి. తనివిదీర నా బాలికను జూడవలె ననుకొని నాడు కాని, యక్కడ ఈ వింతజూడ జేరిన యీప్రజాలోక మేమనుకొనునో యని సిగ్గుపడిపోయినాడు. ఆతని హృదయము ద్రవించిపోయినది. అతని బ్రతుకును బుష్పసౌరభము లావరించుకొనినవి. ఆ బాలికను దనకడకు జేర్చుకొని తన హృదయమున హత్తుకొనుకోర్కె పొలిమేరలు దాటినది.

‘ఒరే పరం! ఆ భావాల కంతులేకపోయినదిరా! నాకేనా, లేక ప్రతి పెండ్లికొడుక్కూ అటువంటి యావేశము కలుగునా? ఆ పిల్లకూ నాకూ మానవుడు విడబర్చజాలని బంధము ఏర్పడ్డట్టేనా? ఆ మంత్రములలో నెట్టి మాహాత్మ్యమున్నదోరా! కొంచెం కొంచెం అర్థమయ్యాయి. ఆ మంత్రోచ్చారణ విడివడి ఉన్నట్టి రెండుజీవితాలను ఏకం చేస్తున్నట్లు తోచింది. ఆ బ్రాహ్మణులు ఋషులైనట్టు, జటావల్కలాజినధారులైనట్లు నాకు కనిపించినదిరా, మా జీవితాలు రెంటికి అంటుగట్టి ఏకవృక్షం చేస్తున్న తోటమాలి లనిపించిందిరా.’ ‘ఔనురా! ప్రేమోదయమైన తర్వాత వివాహం చేసుకోగానే యూరపియను దాంపత్యంకంటె, మన దాంపత్యాలే ప్రేమసౌఖ్యాల కెక్కువ నిలయంగా వుంటవి. ఎవరిమాటో ఎందుకు? వివాహం నాటికి నేను వయసువచ్చిన వాణ్ణే అయినా వివాహాత్పూర్వం నేను నా భార్యను చూచుకోలేదు. అదివరకెంతోమంది బాలికలను నాకు యిస్తామని వచ్చినారు. సరే అని నేను చూచుకోడానికి వెళ్ళేవాణ్ణి. చూడగా చూడగా ఒక అమ్మాయి నాకు నచ్చింది. ఆపిల్ల చక్కని చుక్క. ఆ రూపసంపద అలౌకికమనుకో. అందం సంగతలా వుండగా ఆ పిల్ల సంగీతం పాడింది. ఓరీ! రాలు కరిగిపోయి నాకు కన్నులనీరు తిరిగిందంటేనమ్ము. ఈ అమ్మాయి నా భార్యఐతే నాజన్మం సార్థకం అవుతుందనుకొన్నా. తీరా వారు కట్నం తక్కువ ఇస్తామన్నారు. మా తండ్రి గారు ఎక్కువ ఇమ్మన్నారు. దానితో అది చెడిపోయింది. నేను మా అమ్మ చేత, మా నాన్నగారి స్నేహితుల చేత మా నాన్నగారికి చెప్పించినా లాభం లేకపోయింది, నా గుండె ముక్కలయింది. నేను నిర్మించుకొన్న ఆనందధామం కుప్పగూలిపోయింది. తర్వాత వచ్చిన సంబంధాలలో ఇంకో పిల్లకూడా ఆ అమ్మాయి అంత అందం కాదుగాని మొత్తంమీద చక్కదనం, సంగీతం అదీ వున్న పిల్లే. వాళ్లు గొప్ప సంబంధంకోసం వల పన్నుకొని, ఆ చేప వలలో పడితే మాసంబంధం వదలివేద్దామనీ, లేకపోతే, రెండోరకం క్రింద మాబేరానికి వద్దామనీ అనుకున్నారు. ఆ పిల్ల నా గుండెలో రాగాలు పాడింది. నా నేత్రాలు నిమీలితాలయ్యాయి. కాని వారి కా సంబంధందొరికింది. నా కా బాలిక దూరమయింది. ఆ దెబ్బతో నేనింక ఏ పెళ్ళికూతుర్నీ చూడనని ఒట్టు పెట్టుకున్నా. చివరకు చూడకుండానే సంబంధము నిశ్చయ మయింది. మంగళసూత్రం కట్టేటప్పుడు పిల్ల అంత బాగుండలేదని గ్రహించి చిన్నబుచ్చుకున్నాను. ఆనాటి యిద్దరు బాలికలూ అప్పుడు జ్ఞాపకం వచ్చారు. నిట్టూర్పు వదిలా. కాని ఒరే నువ్వు చెప్పినట్లు మంగళసూత్రధారణంలో ఏమిమహిమ వుందో, అది మొదలు నాభార్య అంటే పరమప్రేమ జనించింది రా!’

పరమేశ్వరుడు చెమరించే కన్నులతో నారాయణుని కనుగొని అతనివీపు నిమిరినాడు, నారాయణుడు విషయం మార్చుటకు నుద్దేశించి ‘మన పెళ్ళిళ్ళకు, మహమ్మదీయుల వివాహాలకు చాలా తేడావుంది రా!’ అని నాడు.

‘మహమ్మదీయుల వివాహాలు మత సంబంధం ఏమీ లేని కంట్రాక్టులు కావడం చేతనేమో, వాటిని రద్దు చేసుకోడం సులభంగా భావిస్తారు మహమ్మదీయ సోదరులు.’

‘అవును. మహమ్మదీయ వివాహం సంపూర్ణంగా కంట్రాక్టు. క్రిస్టియను చర్చి పెళ్ళి సగము మత సంబంధం. మన సంఘంలో మాత్రం వివాహం పూర్తిగా ధర్మసాధనమైన కర్మ. స్త్రీ, పురుష సంబంధం ఇంత పవిత్రం కావడానికి యెన్ని యుగాలు పట్టిందో! మానవుడు వట్టిజంతువులా, ఆ అతిపురాతన కాలంలో జీవితం ప్రారంభించి అడవుల్లో సంచరించే రోజుల్నుంచీ మానవ జీవితం ఎంత విచిత్రంగా మారిపోయింది యీ పవిత్ర వివాహసంస్థవల్ల!’

‘నిజం. భర్త ఏరకంవాడయితే భార్య కూడా ఆరకంలో కలిసిపోతుంది గదా. వకీలు భార్య అయిందనుకో ‘లా’ మాటలు వింటూ వుంటుంది. క్లయింటు రావటం, భర్త కేసుల్లో వాదించడం, గెలవడం, ఓడటం అనే భావాలలో ఐక్యం అవుతుంది. అదే డాక్టరు భార్య అయితే, రోగులు, రోగాలు, మందులు, ఇంజెక్షన్లు రాత్రీ పగలూ పని ఉండడం అనే ప్రపంచానికి రాణీ అవుతుంది. అలాగే ఉద్యోగస్తుని భార్య అయితే ఆవిడకు ఉద్యోగ ఫాయాలన్నీ అలవాటవుతాయి. అవును గాని, నాకు మొదటి నుంచీ ఒక్క ప్రశ్నకు సరిఅయిన జవాబు దొరకడం లేదురా! ఏమిటంటే, మగ వాడి జీవితంవల్ల ఆడదాని జీవితం ఎక్కువ మార్పు చెందుతుందా, లేక ఆడదాని జీవితంవల్ల మగవాడి జీవితమా?’

‘అది మంచి ప్రశ్నే! నా అభిప్రాయం ఏమిటంటే, ఆడదాని జీవితం దర్హంమీద స్వచ్ఛమైంది. మగవాడి జీవితపు రంగు తనమీద పడగానే, దానితో ఆమె నిండిపోతుంది. గృహనిర్వహణానికి సంబంధించిన సంసారవిషయాల్లో మాత్రం ఆడదాని వ్యక్తిత్వమే అధికంగా గోచరిస్తుంది. కాబట్టే ఇల్లుచూచి ఇల్లాలిని చూడమన్నారు. మగవాడు మృదుస్వభావం కలవాడైతే ఒక్కొక్కప్పుడు ఆడదాని స్వభావం పైచేయికావడం, వాడి జీవితంలో ఆ ఛాయలు విశేషించి కనిపించడం కూడా తటస్థిస్తుంది.

సుబ్బారాయుడు గారు తన రెండవ కుమారుని వివాహమును గూర్చిఎన్నియో విచిత్రాలోచనలలో తేలిపోయినాడు. ఆయన నలుగురు కొమార్తెలకు, పెద్ద కొమరునకు, మంచి గౌరవముగల కుటుంబములుగా జూచి వారితో వియ్యమంది నాడు. సంబంధములన్నియు ధన ధాన్య సంపదలతో దులగూగుచున్నవే. చుట్టములలో ననేక వివాహములకు దాను బెద్దరికముదాల్చి చక్కగా జరిపించినాడు. అవియన్నియు నొక యెత్తు. నేడు నారాయణ వివాహమొక యెత్తు. ధనమా చాల వ్యయమైనది. వ్యయమయినదని కాదు. అంతకు మూడు రెట్లయినను ఆయన లెక్క చేయడు. ఆవల వియ్యంకునకు గూడ వివాహవ్యయమొక లకారము దాటి యుండును. ఆయన జమిందారు గావున ఆయనకు లెక్క లేదు. జమీందారు గదాయని తన యెడల ప్రపత్తులలో నేమైన లోటు చేసినారా? ఒక పెద్ద మహారాజును గౌరవించినట్లు గౌరవించినారు. ఇంతకు దన వియ్యంకుడు నిషధ యోగ్యుడు. కాని వియ్యపురాలు సరియైన మర్యాదతో సంచరించలేదని ఆడువాండ్రు ఒకటే గోల. అది ఆమె స్వభావము కాబోలు. క్రొత్తలో నించుకంత పొరపున్నను, గాలక్రమమున వియ్యపురాం డ్రిద్దరకు నెయ్యము కుదురవచ్చును.

ఆగర్భ శ్రీమంతురాలై పెరిగిన కోడలు, తనయింటికి వచ్చి కష్టపడునేమో? కుఱ్ఱవాడు ఎక్కడో ఉద్యోగమో, న్యాయవాదిపనియో చేసికొనును. వాడు సంపాదించుకొనకున్నను భగవంతుని కృపచేత వానికి అన్న వస్త్రములకు లోటు లేదు. దాసదాసీజనమును బెట్టి చేయించుకొను శక్తియున్నది. నారాయణ దుర్వ్యయములకు లోనుగాకున్న జాలును. ఎట్టికొఱతయు నుండదు. బుద్ధికి బృహస్పతియయిన తన కుమారుడు, కుటుంబమునకు విఖ్యాతి తెచ్చుచున్న తన నారాయణుడు సంపాదింపలేని అప్రయోజకుడగునాయేమి? ఈ రోజులలో బ్రాహ్మణులకు ఉద్యోగములు దొరకనిమాట నిజమే. సంపాదన కుద్యోగమే కావలయు నాయేమి? చెన్నపట్టణములో న్యాయవాదియైన లక్ష లార్జింపవచ్చును. కుమారునకు మొదటినుండియు ‘లా’ యన్న యసహ్య మనుట నిజమే. తన ప్రోద్బలమువలననే కుమారుడు ఎంత ఇష్టము లేకున్నను న్యాయకళాశాలలో ఏది ఎట్లయినను ఆ విషయముల దాను తర్కింప బనిలేదు. గాంధీతత్వపూర్ణుడైన నారాయణుడు, ఏదియు వలదని యన్నను సరియే. ఆలోచింపవలసినది కోడలివిషయమే.

ఆ బాలిక ఎట్టిది యగునో? సర్వసాధారణముగ నీ జమిందారీ కుటుంబములలో గర్వమెక్కుడు. జమిందారుల యింటి యాడుబిడ్డ తనవంటి సంసారి యింట నతుకుట కష్టమే. నీటి నుండి తీసిన చేపవలె తనయింట బాధపడునేమో? కాని బుద్ధి తెలిసినపిల్ల గావున ఆమె అభిప్రాయము తెలిసికొనక వియ్యంకుడు తన కుమారుని అల్లుని గా నిశ్చయించియుండడు. కోడలికి నారాయణపై ఆపేక్ష కుదిరియుండును. అందును నారాయణు డెట్టివారి హృదయము నైనను చూరగొనగల గుణసంపత్తిగల వాడు. బాలికలు వీనిని భర్తగా బడయుట తమ జన్మములకు సార్థకతయని సంతసించునంతటి రూపవంతుడు. ఇంతకు ఈ రాజ సంబంధము మంచికి వచ్చినదో, చెడ్డకు వచ్చినదో? అంతయు దైవాధీనము. ఎవరి ప్రారబ్ధ మెట్లున్నదో? ఆ పరమేశ్వరుని విలాసము లెవరికి దెలియును! నేటివఱకు దానుపట్టిన దెల్ల బంగారమగుటయే గాని ఒక్క కార్యముగూడ గలసిరాకపోవుట యన్నది లేదు. ఏనాటి కే విచిత్రములు జరుగనున్నవో!

సుబ్బారాయుడు గారు గంభీరహృదయుడు. ధైర్యస్థైర్యము లాయన సొమ్ములే. చిన్ననాటనే తండ్రిపోయినను మనస్సు చెదరనీక నడిసంద్రమున నల్లాడు సంసారనౌకను చుక్కాని చేబూని చెక్కు చెదరకుండ గట్టున జేర్చినాడు. ఇతరుల డెందములు నొవ్వకుండ న్యాయమార్గమున తన పితృస్వమును వేయిరెట్లు వృద్ధి చేసి పిల్లజమీందారు డనిపించుకొనినాడు. ‘గోదావరికి అద్దరిని ఇద్దరిని సుబ్బారాయిడు గారి మాటయు భీష్ముని మాటయు నొకటే’ యని పించుకొనినాడు. నేల మాళిగలో నసంఖ్యమై మూలుగుచున్న నగదులో నిరువదియైదు వేల రూప్యములు కొమరుని పెండ్లికి వెచ్చించినాడు. తనయంతవాడైన పెద్దకొమరుని మనస్సేమనుకొనునో యని సందేహించనైన లేదు.

శ్రీరాముమూర్తికి వెచ్చపెట్టుటన్న దలనొప్పియే కాని, అవసరము వచ్చినప్పుడు మాత్రము వెనుదీయడు. తన నల్గురు చెల్లెళ్ళ వివాహములకు మువ్వురు చెల్లెళ్ళ పునస్సంధానమహోత్సవములకు, బండుగలకు పబ్బములకు సుబ్బా రాయుడు గారు లెక్క తెలియనిఖర్చు చేయుచున్నను శ్రీరామమూర్తి అడ్డుపెట్ట లేదు సరికదా, తండ్రి మరచిపోయినచో దానే జ్ఞప్తి చేసి ఖర్చు పెట్టించెడివాడు.

సుబ్బారాయుడు గారు తాను వరశుల్కము గ్రహింపనని తొలుతనే స్పష్ట మొనర్చుటచే, జమిందా రల్లునికి నలువది యకరముల ఈనాముభూమి, తన జమిందారీలోనిదిగాక, తన కున్న రైతువారీ భూములలోని సుక్షేత్రము, తణుకు తాలూకాలో తన గ్రామమునకు దగ్గర నున్న గ్రామములోనిది అరణ మొసంగి నాడు. తన కుమార్తెకు నిరువది యకరముల భూమి వ్రాసియిచ్చినాడు. మఱియు నిచ్చిన వస్తువాహనములకు లెక్కయే లేదు. ఆమె పేరున బ్యాంకిలో ఏబదివేలు రొక్కము నుంచినాడు.

సుబ్బారాయుడుగారుగూడ పెద్దకోడలి కిచ్చినట్లు పదివేలరూప్యములు చిన్నకోడలి కాభరణముల నిమిత్త మిచ్చినారు.


౧౫ ( 15 )

గృహప్రవేశము


గృహప్రవేశమునకు బెండ్లికొమార్తెతో శకుంతలాదేవియు, జమిందారు గారి వేలువిడిచిన మేనకోడలు లలితయూ, వరదకామేశ్వరీ దేవి పుట్టినింటి చుట్టము సరోజినియు, జమీందారు గారి కుమారుడు కేశవచంద్రుడును వెళ్లినారు. సుబ్బారాయుడు గారు తన చుట్టములందరిని పదునాఱు రోజుల పండుగ వఱకు నుండుడని కోరినారు. సుబ్బారాయుడు గారు బంధుసముద్రుడు. మర్యాదలు సలుపుటలో జనకమహారాజు. ఆయన బందుగులు, జానకమ్మ గారి బందుగులు, బిడ్డల చుట్టములు గలపి మూడువందలమంది వివాహమునకై చేరినారు. వారిలో బెక్కురు రాజమహేంద్రవరము నుండియే వెళ్ళిపోయినారు. కొన్ని కుటుంబముల వారు కొత్తపేట వెళ్ళినారు. కొత్తపేటలో ఎనమండుగురు తెలుగు వంటబ్రాహ్మణులను ఇరువురు దాక్షిణాత్య బ్రాహ్మణుల నియమించి సుబ్బారాయుడు గారు వధూవరుల గృహప్రవేశ మహోత్సవము పెండ్లివలె జరిపినారు. ఒక నాడు కోనసీమలోని పెద్దలందఱు విందుకు ఆహ్వానింపబడిరి. వధువుతో నరుదెంచిన బంధువులకు రాజభోగము లర్పింపబడినవి.

వివాహమున నన్నియు ఖద్దరు వస్త్రములే యుపయోగించినారు మగ పెండ్లివారు. తప్పని సరియైనప్పుడు స్వదేశీవస్త్రములు, పట్టువస్త్రములు నిచ్చినారు. ఆడపెండ్లి వారు పెండ్లికుమారునికి, ఇతర మగవారికి ఖద్దరు వస్త్రముల నిచ్చినారు. ఆడువారికి వారికి దోచినట్లు పట్టుచీరలు, రవికలు, విదేశీ చీరలు మొదలగునవి యొసంగినారు.

శారద కత్త వారి యిల్లు విచిత్రముగానే యున్నది. తన తండ్రి గారి మేడలో నున్న సోఫాలు, మరదిండ్లకుర్చీలు లేవు. ఒకటి రెండు తివాసీలు చిన్నవి యచ్చట నున్నవేమో! తన మేడలో అన్నియు తివాసీలే. గోడల కెన్నో చిత్రములైన బొమ్మలు అచ్చట తగిలించి యున్నవి. చిత్రవిచిత్రముగా నగిషీలు చెక్కిన బల్లలు, మేజాలు, కుర్చీలు, బీరువాలు, అలమారులు, పనితనముగల వెండి, ఇత్తడి, రాగి బొమ్మలు చీనా దేశపువి, ఆగ్రా, అజిమీరు, లక్నో ప్రాంతములవి, బర్మా కఱ్ఱ చెక్కడపు బొమ్మలు, లక్కబరిణలు, రవివర్మ బొమ్మలు, పాశ్చాత్య తైలవర్ణ చిత్రములు తమ పెద్ద మేడనిండ నున్నవి. తన తండ్రిగారిది, తాతగారిది, తల్లిది, బామ్మగారిది ఇంకను బూర్వికుల బొమ్మలు దమ గదులనిండ నలంకరింపబడియున్నది. ఇచ్చటనో తన భర్తగది యొకటి మాత్రము చాల అందముగా నున్నది. ఇల్లంతయు సూర్యకాంతము చూపించినది. భోషాణములట! తంజావూరి బొమ్మలట! మామూలు కుర్చీలు, పేము పడక కర్చీలు, ఆ కుర్చీల పై మామూలు పరుపుదిండ్లు. తమ మేడయంతట తండ్రి గారు స్వంతముగా విద్యుచ్ఛక్తి దీపములు, వీవనలు పెట్టించినారు. అత్తవారింట లష్టరు దీపాలట, పెట్రోమాక్సు దీపాలట! చీచీ! ఇది ఏమిటమ్మా!

శకుంతలా దేవి చెల్లెలిని జూచి ‘ఒసే శారదా! మా అత్తవారి మేడలో మన మేడలోనున్నన్ని వింతలు విచిత్రాలు లేకపోయినా అదీ జమిందారీకోట లాగే ఉంటుందే. కాని ఇల్లాంటి పల్లెటూరు కొంపలో పడ్డావేమిటే? వంద మంచాలూ, పరుపులూ ఉంటేమాత్రం జమిందారీ దర్జా వస్తుందటే? వచ్చి వచ్చి ఒక పల్లెటూరి వెంకయ్య గారి ఇంట్లో పడ్డావేమిటే? ఎంతో డబ్బుందట. చాలాభూమి ఉందట. ఏమి భాగ్యం? దర్జా పుట్టుకతో రావాలి గాని, తెచ్చిపెట్టుకుందామంటే వస్తుందటే?

‘వీళ్ళ కట్లు, బొట్లు, మాటలు అన్నీ చాదస్తంగా ఉన్నాయి, అక్కయ్యా.’

‘మీ పెద్దాడుబిడ్డ ఒకటే వడవడ వాగుతూవుంటుం దేమిటే! నన్నూ, లలితనూ, సరోజినినీ కూచోబెట్టి వేదాంతం బోధించడం మొదలుపెట్టింది. రెండో ఆవిడ మనకుటుంబం సంగతులు అన్నీ అడగడం మొదలుపెట్టింది. అస్తమానం ఈ చెవినుంచి ఆ చెవికి నవ్వుతోనేవుంది ఆవిడ.

లలిత: వాళ్లు చిన్నబుచ్చుకునేటట్లుగా మనం గబుక్కునలేచేవచ్చాంగా!

సరోజిని: ఏమే శకుంతలా! నీకు వేళాకోళాలు వెక్కిరింతలూను. వాళ్ళూ మనమల్లేనే గౌరవం సాంప్రదాయం కలిగిన కుటుంబాలు. అందరికీ జమిందారీలు ఉంటాయా యేమిటే? దేశమంతా గాలించినా గుడిగుడి గుంచంలా ఒక పది జమిందారీకుటుంబాలు న్నాయి. మీ నాన్నగారికి పదిమంది కూతుళ్లు పుట్టితే అందరికీ జమిందారీ సంబంధాలు ఎక్కడ తీసుకువస్తారే?

శకుంతల: నువ్వెప్పుడూ అందర్నీ హాస్యం చేస్తూనేవుంటావు. జమిందారీలు వుండకపోవచ్చును గాని ఎక్కడో పల్లెటూళ్ళపద్ధతిలావుంది అనరుటే.

ఇంతలో సూర్యకాంతం అక్కడకు వచ్చుటచే వారి సంభాషణ ఆగిపోయినది. సూర్యకాంతం చిన్నన్న గారిని వెర్రిప్రేమతో ప్రేమించినది. తల్లి దండ్రులు, అక్కలు, పెద్దయన్నయు నెందరున్నను నారాయణ క్షణము కన్పించకున్న సూర్యకాంతము బెంగపెట్టుకొనును. చిన్ననాటినుండియు సూర్యకాంతమును నారాయణరావే పెంచినాడన్న నిసుమంతయు నసత్యము లేదు. ఆమె కించుకంత దెబ్బతగిలిన ‘చిన్నన్నయ్యా’ అని యేడ్చునది. అన్నగారిదగ్గరనే పండుకొనును. అన్నగారితోనే భోజనము చేయును. ఆమెకు రామస్మరణ ‘చిన్నన్నయ్య! చిన్నన్నయ్య!’ చిన్నన్నగారు చదువులకై అమలాపురం, రాజమహేంద్రవరము, చెన్నపట్టణము వెళ్ళినప్పుడు, జైలుకు పోయినప్పుడు సర్వదా గ్రుడ్లనీరు బెట్టుకొనునది. రాజమహేంద్రవరము జైలునకన్న గారిని చూచుటకు వెళ్ళినప్పుడు నారాయణరావు జైలరు ననుమతి నడిగి చెల్లెలిని దగ్గరకు దీసికొని చెవిలో దేశభక్తినిగూర్చియు, ధైర్యమును గూర్చియు చిన్న యుపన్యాసము నిచ్చినాడు. ఆమె విచారించినచో శ్రీ మహాత్మాగాంధీ గారి హృదయము బాధ నొందుననియు, దన ముద్దు చెల్లెలు బెంగ పెట్టుకొని యింటిదగ్గర కండ్ల నీరు నింపుచున్నదని తెలిసినచో దన మనస్సు వికలమైపోయి జైలు భరించుట కడు దుర్భరమగుననియు, దన ముద్దు చెల్లెలు తనను దేశద్రోహి వలె జైలువదలి రమ్మని కోరునంతటి దేశభక్తి లేనిది కాదనియు జెప్పి, యూరడించినాడు. అప్పుడు సూర్యకాంతము కళ్ళనీళ్ళతో చిరునవ్వు నవ్వింది. ఆమె వదనము వాన కురిసి వెలిసి మబ్బులుమాయమైన పూర్ణిమాకాశమువలె సౌందర్యశోభితమైనది.

అట్టి ప్రేమపూర్ణమగు నామె హృదయము తన చిన్నన్న గారి పెండ్లి కొమరితను జూచినప్పుడెల్ల బరవశత్వములో నుప్పొంగిపోవును. తన చిన్న వదిన గారెంత యందగత్తె! ఏమి యా సొగసు! అంత సంగీత పాటకురాలెక్కడైనా యున్నదా? చిన్నవదినను కౌగలించుకో బుద్ధిపుట్టిన దా బాలకు. పెండ్లి అయిదురోజులు వీలయిన వేళలలో నొక్క నిమేషమైన కొత్తవదిన గారిని విడిచి యామె యుండలేదు. ఆమెకు దాను తలదువ్వును. ఆమె తలలో పూవులు ముడుచును. ఆమె నగలు సర్దును. ఆమె యొడిలో దనతల నుంచును. ఆమె దగ్గరగా గూర్చుండును. ‘వదినా! నువ్వు చాలా అందకత్తె’ వనును. శారద కిదియంతయు వెఱ్ఱిగా గనుపించినది. సూర్యకాంతమును వెఱ్ఱిపిల్ల యని యనుకొన్నది. కాని సూర్యకాంతము ప్రేమప్రవాహవేగమున శారద యుపేక్షా భావము చెదరగొట్టబడి కరిగిపోయినది. భర్తృ బంధుకోటిలో సూర్యకాంత మొక్కరితయే యామె హృదయములో బ్రవేశించినది.

సూర్యకాంతము వదిన గారికడ కరుదెంచి ‘చిన్నవదినా! మా గుమ్మడిపండావును జూపిస్తానన్నానుకదూ? నువ్వు దాని అందం చూస్తే వదలలేవు సుమా. రా! అప్పుడే పొలాల నుంచి మా ఆవులు, గేదెలు, బండి యెద్దులు వచ్చాయి. తక్కిన పశువులన్నింటినీ మా తోటలో పశువులశాలల్లోనే కట్టేసారు. వస్తావా?’ అని యడిగినది.  ఆ సాయంత్రము చల్లని గాలులు వీచుచు మల్లెమొగ్గల సౌరభ మెల్ల యెడల జల్లుచుండెను. నిన్ననే సూర్యకాంతం వదిన గారికి దమ యింటి వెనుక తోట జూపించినది. మల్లెజాతులు, సన్న జాజులు, గులాబుల కుటుంబములు, సంపంగెలు, జాజులు, మందారముల రకములు, ఏవేవో కొత్తరకముల పూవులు దొడ్డియంతయు నావరించి బారులుతీర్చి గీతములు పాడుకొనుచున్నవి. నారాయణ రావుకు దోటపనియన్న బ్రాణము. తాను సెలవలకు వచ్చినప్పుడు కొత్తకొత్త రకముల పూలచెట్లు నాటుచుండును. అంట్లు కట్టుట చిగురుల నంటుకట్టుట, కొమ్మలు కత్తిరించి వానికి జీవముపోయుట, మొక్కలలో క్రొత్త జాతులను సృజించుట మున్నగు పను లాత డవలీలగ జేయగలడు. అతనికి స్నేహితులు తోటమాలి యనికూడ బేరుపెట్టినారు.

అతడు మొక్కలతో మాట్లాడుకొనును. అతని హస్తస్పర్శకు, జల్లని మాటలకు జెట్లు సంతోషమున బొంగిపోవును. ‘బోసు చెప్పినదానిలో ఇంతైనా అతిశయోక్తి లేదురా’ అని స్నేహితులతో ననువాడు నారాయణరావు. గ్రాండిఫ్లోరా పూలచెట్లొక వరుసయును, చామంతి జాతు లొక బారును లెజిస్త్రోమియాలు వివిధవర్ణముల పూలతో నొకవంక ను గలకలలాడిపోవుచున్నవి. ఇంకను నేవేవో రకముల పూలట! భరత ఖండములో నెక్కడ పెరుగునదియైన నారాయణరావు దాని నెంత ఖరీదునకైన తెప్పించి తోటలో పెంచుచుండును.

సింహాచలము సంపెంగలు_పచ్చ, తెలుపు జాతులవి కలవు. కనంగ సంపెంగ, కర్పూర సంపెంగ, సకలగుణ సంపెంగ, తీగ సంపెంగ యాతని ముద్దుబిడ్డలు. ఎడ్వర్డు, కార్లైన్ డిఆర్డెను, ధవళమగు నమెరికా సుందరి, పాలెనీరాను మొదలగు నెనుబది రకముల గులాబుల ప్రాణప్రదముగా బెంచినాడు. బొడ్డుమల్లె, జంటమల్లె, పొదమల్లె, పందిరిమల్లె, చిరుమల్లె, కాకినాడమల్లెలు నక్షత్రము వలె విరిసి యాతని కన్నుల నార్ద్రములు సేయును. చెన్నపట్టణపు బొడ్డు చేమంతి, తెల్లచేమంతి చిన్నది, సాదారకము బొత్తాము చేమంతి, నీలపు చేమంతి, ఎఱ్ఱ చేమంతి, అరచేతి పెద్ద జాతి చేమంతులు నాతని జీవితమున దీపులూరజేయును. కదంబము కలదు, పన్నీరు వృక్షము లున్నవి, దేవపారిజాతము లున్నవి, పూవుదానిమ్మ లున్నవి.

సూర్యకాంతము చిన్నన్న గారి యుత్సాహములో తానును మునిగిపోవును. అన్నగారు చదువునకు పోయినప్పుడు తోటమాలితనము తన్నావరించినట్లు భావించుకొనును. తోటమాలులచే నీరు బోయించును. ఇవక పట్టనీయక కాపాడునట్లు చేయును. ఉద్యానవన బాలికయై యన్న గారి యాజ్ఞ పాలింపు చుంటినని గర్వమునొందును. ఆమె వనదేవతయే యయిపోవును.

శారద యా వనము చూచి ఆశ్చర్యమందెను. కొంచె మసూయ ఆమె లేత హృదయము నలమినది. ఆనాడు బాలికలిద్దరు వనసంచార మొనర్చునప్పడు నారాయణరావు చూచినాడు. ఆతని బ్రతు కప్పుడు సువాసనాలహరీస్నాతయైన ట్లయినది. ఆ యిరువురు బాలికలను దన యిరుసేతుల నెత్తి ముద్దాడ నువ్విళులూరినాడు. ప్రపంచమంతయు నాతనికి ప్రేమస్నాతమయినట్లు తోచినది.

చల్లని యడుగులతో వారిరువుర నాతడు డాసి ‘సూరీడూ! ఈతోటంతా చూపిస్తున్నావుటే’ అని పలకరించినాడు. పలుకరించి, తన చొరవకు దానే యక్కజంపడినాడు.

కులుకుమిటారియగు తన శారదతో మాటలాడవలెనని పెండ్లి రెండవనాడే యాతనికి గోర్కె వొడమినది. కాని సిగ్గుపెంపున మాటలాడింపలేడయ్యెను. ఎట్టి సభలోనైన పులకలు పుట్టించు గంభీర స్వరమున నుపన్యాసము లిచ్చు నారాయణరావా ముహూర్తమున త్రపావశుడైనాడు. మఱునాడుదయమున మోటారులో భార్యాసమేతుడై యూరేగునప్పుడు ‘నీకు కాలేజీలో చేరి చదవాలని ఉన్నదా’ యని యెట్లో ప్రశ్నించినాడు.

శారద యాశ్చర్యపూరితయైనది. ఆమెకు నాగరిక మర్యాదలన్న నెంతయు నిష్టమే. తానంతకుమున్ను చూడబోయిన వివాహములందు నూతన వధూవరులు మాటలాడుకొనుట చూచినది. సంతోషము నొందినది. అటులనే తానును మాటలాడగలనని తలంచి లజ్జాకవోష్ణమై మోము కెంపెక్క జిరునవ్వు పెదవులు దాటకుండ నప్పలించుకొన్నది. నేడు భర్త తన్నట్లు మాట్లాడించునని యామె కలనైన తలపోయలేదు. తొలినాడు తన్ను జూడ వచ్చిన నారాయణ రావును నిర్భయముగ జూచినది. అపుడపుడే పరిమళమలముకొను హృదయమున నారాయణరావును మెచ్చుకొన్నది. అతని రూపసంపద శారద మనస్సును గలకలలాడించినది. నారాయణరావు ఫిడేలుపై మధురముగా గానము చేసినప్పు డాశ్చర్యము, నానందము నామె నలముకొనియెను.

సంబంధము నిశ్చయమైనదని తెలిసినప్పటి నుండియు దల్లియగు వరదకామేశ్వరీ దేవి శారద చెవికడ నిల్లుగట్టుకొని విచారించినది. పల్లెటూరి సంబంధము ఘటించిన భగవంతుని తీవ్రముగా దూలనాడినది. తనకును శారదకును గ్రహచారమున్నట్లున్నదని కంటనీరు పెట్టుకొనినది. చుట్టములలో స్త్రీలు ఒకరిరువురు తప్ప మిగిలిన వారట్టి సంబంధము నిశ్చయమైనందుల కక్కజమందుచు వరదకామేశ్వరీ దేవితోపాటు విచారించినారు. ఆ సంబంధమును నిందించినారు.

శారద లేత హృదయమున నామాటలెల గాటముగ నాటికొని ప్రత్యక్షమైన స్వామియెడ నిరసన భావమును, వైముఖ్యమును మొలకెత్తించినవి. అట్టి మనస్థితిలో నున్న శారదను నారాయణరావు పలుకరించినప్పుడామె యించుక యులికిపడినదనిన వింత యేమి! ఆమె భర్తకు బదులుపలుకక మోమువంచికొన్నది. నారాయణరావు చిన్నబుచ్చుకొనియు, బాలిక సిగ్గుపడియుండబోలు నని సమాధానపడినాడు.

‘’శారదా! నీ కింగ్లీషు బాగా వచ్చునట కాదూ? ఇంగ్లీషు చదువుకొన్న బాలికలు సిగ్గుపడరటగా! నువ్వీయేడు స్కూలు ఫైనలు పరీక్షకు వెళ్ళుతావను కొన్నారే. అట్లాంటప్పుడు నాతో మాట్లాడడాని కీ సంకోచం ఏమిటి?’ నారాయణరా వింగ్లీషులోనే యామె నడిగినాడు.

శారద మారుపలుక లేదు. ఆమె నలముకొన్న ఆశ్చర్యపుదెర ఇంకను అలమినట్లే యున్నది. ఆమె మౌనముద్ర వహించియే యుండెను.

‘ఈ యేడు గవర్నమెంటు పరీక్షలో మొదటి తరగతి మార్కులు వస్తాయని మీ దొరసాని గారన్నది. నువ్వు చదువుకోని బాలికవలె సిగ్గుపడవని ఆమె చెప్పిందే? సిగ్గెందుకు నీకు? ఆమెమాటే నిజం అయితే, ఏదీ మాట్లాడు చూద్దాం.’ (ఇంకను ఇంగ్లీషు భాషలో నే...)

శారదకు బౌరుషము వచ్చినది. మద్రాసు యూనివర్సిటీ వారి మెట్రిక్యులేషను పరీక్షకు దరఖాస్తు పెట్తున్నాను. స్కూలు ఫైనలు పరీక్షకు పాఠశాలలో జేరాలికదా!’ అనిన దింగ్లీషులోనే.

‘అదీ! అల్లాగు జవాబు చెప్పాలి. ఫిడేలంటే యిష్టమా, లేక వీణంటేనా?’

‘రెండూనూ.’

‘ఆ రెండింటిలోను ఏది మంచిది?’

‘దేని కదే!’

‘అల్లాంటే ఎల్లాగుమరి? వీణమీది తానం ఫిడేలుమీద రాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధ్వని ఫిడేలులో లేదు. ఫిడేలు...’

‘అందుకనే దేని అందం దానిది. దాని అందం దీనికి, దీని అందం దానికి రాదు.’

‘నీవు సంగమయ్య గారి కచేరీ చూశావా?’

‘మా మేడకివచ్చి ప్రతియేడూ పదిహేనురోజులు మకాం చేస్తూవుంటారు. ఆయన అద్భుత వాద్యము నాకు వినిపించి నావీణపాటకు మెరుగులుదిద్దేవారు.’

‘ఏమిటీ! సంగమయ్య గారికే శిష్యురాలివా! ఎంత అదృష్టవంతురాలివి!’

ఇంతలో నూరేగింపు విడిదికడకు వచ్చుటచే నా నూతనవధూవరుల సంభాషణ యాగిపోయినది. నారాయణరా వట్టులనే మూడు నాలుగు సారులు భార్యతో మాటాడి ఆనందధామములో విహరించినాడు.

ఈనాడు తోటలో, భర్త సూర్యకాంతము నట్లు బలుకరించినప్పుడు, శారద కించుక రోత పుట్టినది. కనురెప్పమూత కాలములో జనించి మాయమయిన యా భావమును గ్రహించిన నారాయణరావు మనస్సు చివుక్కుమన్నది. సోదర  ప్రాణయగు సూర్యకాంతము నును లేతయెదకు వారిరువురి భావములు స్పష్టమై తోచినవి. అన్నా వదినెల మనోమాలిన్యము తుడిచివేయుటకో యన నా బాల ‘గుమ్మడిపం డావును చూతము రం’డని తన చిన్నారిచేతులు సాచి వారిరువురి హస్తములు గ్రహించి బిరబిర గొనిపోయినది.

౧౬

గృహమేధి

సుబ్బారాయుడు గారింటి వెనుక పెరటిలో నొక తూర్పువెలమల కుటుంబము, రెండు బీదకాపుల కుటుంబములు, అయిదు తూర్పుగొల్లల కుటుంబములు కాపురమున్నవి. వారందరు సుబ్బారాయుడుగారి పాలేరులే. కాపులలో కుంకట్ల సోమయ్య యనునతడు పెద్దపాలేరు. సుబ్బారాయుడు గారు పాలేండ్ర కాపురమునకై శుభ్రమగు నిండ్లు కట్టించి యిచ్చిరి. సోమయ్య యిల్లు తక్కిన వానికన్న బెద్దది. సోమయ్య బహుకుటుంబీకుడు. వృద్ధుడయ్యు జబ్బసత్తువయు చక్కని కంటిచూపును గల్గి వ్యవసాయము చేయించుటలో పేరుగన్న కాపు. సోమయ్య తండ్రి నాటనుండియు సుబ్బారాయుడు గారి తండ్రికడ వారు పాలేరులుగా బ్రవేశించినారు. సంసారము బొత్తుగా జితికిపోయి, కడు పేదరికమున సోమయ్యతండ్రి వీరయ్య సుబ్బారాయుడుగారి తండ్రి శ్రీరామమూర్తి గారి నాశ్రయించి పాలేరుగా జేరి, తన తెలివి తేటలచే, విశ్వాసముచే గ్రమముగా బెద్దపాలేరైనాడు. అప్పటికే సిగ యెగగట్ట నేర్చిన సోమయ్య, తండ్రికి కుడి భుజమై ఆతనికి దగిన కుమారు డనిపించుకొనుచు శ్రీరామమూర్తి గారికడ జీతము గొనుచుండెను.

ప్రథమమున సంవత్సరమునకు బదునెనిమిది బస్తాల ధాన్యమునకు బ్రవేశించిన వీరయ్య పోనుపోను ఇరువదియైదు బస్తాలు, నేబది రూపాయల రొక్కముగూడ జీతముగా బుచ్చుకొని, తొంబదియేళ్ళ వృద్ధుడై చనిపోయినాడు. సోమయ్య నేడు పెద్దపాలేరు. సుబ్బారాయుడుగా రాతనికి పాలేరని పేరు మార్చివేసి గుమాస్తాయని పేరుపెట్టి నెలకు బదునేను రూప్యముల జీతము, బస్తాగింజలు చొప్పన నిచ్చుచుండెను.

తక్కిన పాలేళ్ళందరకు కూడ మంచిజీతములే యిచ్చుచు, సుబ్బారాయుడు గారు వాండ్రకు శౌచాదిక ము నలవరచిరి. దొడ్డిలో నున్నవారు గాక మాలలు, గౌడులు నలుగు రితరపాలేళ్ళుండిరి. ఇంటిలో అంట్లుతోముటకు, నీరు తోడుటకు, బిడకలు చేయుటకు దొడ్డిలో గాపురమున్న కుటుంబములలోని స్త్రీలనే నియమించిరి. వారికిని సంబళము నేర్పరచిరి. సోమన్న కోడలు ఇంటిలో నాడు వారికి వలయుపనులన్నియు చేయుట, బియ్యము బాగు చేయుట, పిండిని విసరుట, బట్టలు సర్దుట, ఎక్కడివస్తువు లక్కడ నుండునట్లు చూచుట మొదలగు పనులను జేయుచుండును. గొల్లవారిలో నచ్చమ్మ నమ్మకమగు బంటు. దాని తల్లిదండ్రులు సుబ్బారాయుడి గారి యింటనే యుండువారు. అచ్చమ్మ తండ్రి గతించినాడు. తల్లి వృద్ధురాలై యింటిపనులను జేయుచుండును. అచ్చమ్మ వివాహము చేసికొని భర్త నిల్లరికము తెచ్చుకున్నది. అచ్చమ్మ యిద్దరు చెల్లెండ్రు నటులనే భర్తల నిల్లరికము తెచ్చుకొని సుబ్బారాయుడు గారింటనే కాపురముండి నారు.

వారి భర్తలు సుబ్బారాయుడు గారి పాలేళ్ళు. వారి పిల్లలు గొడ్ల కాపరులు, వారు పనికత్తెలు.

సుబ్బారాయుడి గారి దొడ్డిలో గాపురమున్న రెండవ కాపుకుటుంబము సోమన్న యల్లునిది. సోమన్నకు ముగ్గురు కొమరితలు నలుగురు కుమారులు. సోమన్న కొమరితలు కుమారులుగూడ నాల్గవతరగతివరకు జదువుకొన్నవారే. సోమన్న తన పెద్దయల్లుని సుబ్బారాయుడు గారి దగ్గర పాలేరుగా ప్రవేశపెట్టి తన యింటి ప్రక్కయింటిలో గాపురముంచినాడు. తక్కిన యిరువురు కొమరితలను దొడ్డిపట్లలో నొకరికి, గోపాలపురములో నొకరికినిచ్చి పెండ్లి చేసినాడు. వారందరు కడుపులు ఫలించి సుఖముగా కాపురములు చేయుచున్నారు. సోమన్న కు ముగ్గురు కొమార్తెలు వరుసగా బుట్టుటచే, నిక కొడుకు పుట్టడని నిరాశ చెంది, బీదకుటుంబపు బాలునికి పెద్ద కూతురునిచ్చి యిల్లరికము తెచ్చుకున్నాడు. ఇప్పుడు సోమన్న పెద్ద కుమారుడు సత్తెయ్య ఇరువదిరెండేండ్ల వాడు. చిన్నతనమున నారాయణరావుతో నాడుకొన్నాడు. నారాయణరావు రాజకుమారుడు, సత్తెయ్య బంట్రోతు. నారాయణ రావు కలెక్టరు, సత్తెయ్య డఫేదారు.

సుబ్బారాయుడి గారి దొడ్డిలో కాపురమున్న వెలమలు పదియేండ్ల క్రితము సుబ్బారాయుడు గారి పనిలో చేరి వొళ్ళువంచి పని చేయుచుండుట చేతను, వారు కడియములో మంచి పేరుగన్న పూదోటలో పని చేసియుండుట చేతను, సుబ్బారాయుడు గారు వారిని పూలతోటపనికి నియోగించిరి. ఆలమండ గ్రామంలో మామిడితోటలో బని చేసిన కుటుంబమును కొత్తపేట కనతిదూరమున నున్న తన ముప్పది యకరములతోటలో గాపురముంచినారు.

సుబ్బారాయుడి గారిదొడ్డిలో కాపురమున్న అయిదు గొల్ల కుటుంబములలో ఒక గొల్ల దూడల బెంచుటలో బేరుగన్న వాడు. ఆతని చేయి తగిలిన పశువుల దరికి రోగములు సేరవు. ఈతలుడిగిన పశువులు, అఱ్ఱుగడిగిన యెద్దులు వారి దొడ్డిలో పింఛనుద్యోగులవలె, వార్థకమున సుఖించుచుండును.

సుబ్బారాయుడి గారికి బశువులన్న బరమ ప్రాణము. మానవులకన్న వాని నెక్కుడు ప్రేమతో జూడవలెనని యాయన మతము. దొడ్డిలోని దూడల నన్నిటిని బేరులు పెట్టి ముద్దుగా బిలుచుచు గోముగా బెంచుచుందురు. ఏ దూడకైన నించుక కాలు నొచ్చినచో నాయన ప్రాణము విలవిల లాడిపోవును.

సుబ్బారాయుడు గారికి ఎనిమిదికాండ్ల స్వంత వ్యవసాయమున్నది. అయిదు ఒంగోలు జతలు, రెండు మైసూరుజతలు, సింధీజత యొకటియు, కేవలము సవారి బండ్ల కుపయోగించునవి కలవు. రెండుజతల బొబ్బిలిపోతులు, మూడు జతల బండిపోతులు, సంతతము వారికడ నుండవలెను. దొడ్డిలో గాపురమున్న వాని పిల్లలే పసుల కాపరులు.

మనుష్యులు పస్తుండినను, దూడలకు మేత తప్పగూడదని సుబ్బారాయుడు గారి మతము. వట్టిగడ్డి, జనుము దంటు, జొన్న చొప్ప, చిట్టు, తవుడు, ఉలవలు, సమస్తము సుబ్బారాయుడు గారి యింటిలో బుష్కలముగా నుండవలెను. పచ్చగడ్డి మేతకై పదియెకరములభూమిలో బిల్లిపెసర పెంచెదరు. బీటి నేలకూడ బుష్కలముగా నుండుటచే వారికి బశుగ్రాసలోపమెన్నడు నుండెడిది కాదు.

సుబ్బారాయుడు గారికి బాడిపశువులు విస్తారమున్నవి. ఒంగోలు ఆవులు ఎనిమిది, దేశవాళీ ఆవులు పన్నెండు గలవు. అయిదు పెద్ద గేదెలున్నవి. కొన్ని పాడిపశువులు, కొన్ని చూడివి, కొన్ని వట్టిపోయినవి. వారింట సర్వకాలముల పాడి పుష్కలముగా నుండవలెను. పాడిదూడలు గాక, వారింట గుమ్మడిపండావులని యొక జాతి కలదు. సుబ్బారాయుడు గారి తాతగా రాజాతి నేక్కడనుండి సముపార్జించిరో? ఆవు రెండడుగులన్నరయెత్తు, చిన్న తల, లేడికళ్ళు, పాల సముద్రమువంటి తెల్లని యొడలు, రేపు శేరు మాపు శేరు పాలిచ్చు కుండ పొదుగుతో గామధేనువువలె ముచ్చటగా నుండును. ఆ గుమ్మడిపండావు దూడ కడుచిన్నదియై బొమ్మదూడవలె ముద్దులు మూటగట్టుచుండును.

వనలక్ష్ములవలె నున్న శారదా, సూర్యకాంతములతో నేగు నారాయణ రావు త్రోవలోని మొక్కలను వర్ణించి చెప్పుచు, బాడి పశువుల పాకయున్న దొడ్డిలోని కేగెను. ఆ పెద్దపాకలో నొక ప్రక్క గుమ్మడిపండావులు రెండున్నవి. ఒకటి పాలిచ్చుచున్నది; రెండవది వట్టిపోయినది. తన్ను చూడగానే చెంగు చెంగున గంతులిడుచు చేరవచ్చిన దూడను నారాయణరావు ముద్దులాడ దొడగెను. పనుల త్రొక్కిడిచే రొచ్చు గానున్న యాదొడ్డిని గాంచి ఏవగించు కొనుచున్న శారదకు, భర్త దూడనెత్తి ముద్దులాడుట మీదు మిక్కిలియై —‘వదినా యింటిలోకి వెళ్ళిపోదాం రావమ్మా’ యని వెనుకకు తిరిగి, మగని యెడ్డెతనమును గూర్చిన తలపులతో నింటిదెసకు నడువసాగెను. శారదాచిత్తవృత్తి యెరుంగని సూర్యకాంతము ఆమె వెనుకనే పరువిడి, యామెకడ్డముగ నిలువబడి ‘ఏవమ్మా వదినా, ఏమిటి! గుమ్మడిపండు దూడనుజూడకుండగనే వెళ్ళిపోతున్నా వేమిటి? రా!’ అని పిలిచినది. ‘చూస్తూ నేవున్నా గదా’ యన్నది శారద.

అంతకుమున్నే వికలమనస్కుడైయున్న నారాయణరావు శారద వింతవర్తనమున కింకను నొచ్చుకొనుచు, ఆమెను వెనుకకు గొని తెచ్చుటకు నిర్బంధించు చెల్లెలితో ‘సూర్యం! నువ్వు ఇల్లారా! ఇది కబురులు చెపుతోంది చూశావా! దీనికి ‘వరబాల’ అని నాన్న గారు పేరు పెట్టారా?’ అనినాడు. సూర్యకాంతము తలవంచికొనియున్న వదిన దెస కొకపరియు, లేని వికాసము దెచ్చుకొను అన్నదెస కొకపరియు జూడ్కి ప్రసరించి నిట్టూర్పువదలి యన్న గారి దగ్గరకు వెడలిపోయెను. శారద యేమనుకొన్నదో యక్కడనే యాగి, ‘వదినా ఆ చిట్టిదూడ నిట్లాతీసుకు రావమ్మా’ యన్న ది. ఆ మాటకు సూరీడు మొగమింతయై దంతపుబొమ్మవలెనున్న యా పెయ్యదూడను సునాయాసముగ నెత్తికొని వదినగారికడకు గొనిపోయినది. నారాయణరావు నిట్టూర్చుచు నక్కడనుండి నెమ్మదిగా వెడలిపోయినాడు.

ఆసాయంత్రమే సుబ్బారాయుడు గారితోట జూచుటకు నాడు పెండ్లివారందరును మోటారుమీద బయలుదేరినారు. సూర్యకాంతము, సత్యవతి, పరమేశ్వరమూర్తి భార్య రుక్మిణియు వారితో వెళ్ళినారు.

తోటలో మామిడి జాతులు, బత్తాయిలు, పనసలు, పోకలు, కొబ్బరులు, జామలు, దబ్బలు, నారింజ, ఉసిరి, సపోటాలు, జంబుమలాకా, గులాబి జామ, పంపరపనాసలు, నిమ్మలు మొదలయిన వివిధ ఫలవృక్షజాతు లున్నవి. తోటలో రెండుమూడు కుటుంబముల వారు కాపురమున్నారు. తోట కన్నుల పండువై సువాసనలతో నిండియున్నది. చెట్టున బండిన కాశీజామపళ్ళు, నారాయణరావు బెంగుళూరునుండి తెప్పించిన గింజ లేని జామపళ్లు, పిండిగింజ జామపళ్ళు, సపోటాపళ్ళు, తోటమాలులు కోసి వారికెల్ల నర్పించినారు. దీపాలవేళకు మోటారింటికి దిరిగివచ్చినది.

నారాయణరావున కేదియో వ్యక్తము గానిభయ మొండు హృదయమున బ్రవేశించినది. శారదవర్తనమునం దేదియో విశేషభావ ముండునని యాతడనుకొనెను. ఛీ! తప్పు. అది భారతీయ నారీమణులకు సహజమగులజ్జ యని మనస్సును సమాధాన పరచుకొనెను.

నారా: పరం! మన స్త్రీ లెంత పాశ్చాత్యవిద్యావంతులైనా, వారికి పాశ్చాత్య నాగరికతా వాసన లెంత యలముకొన్నా, భారతీయ సంప్రదాయ వాసన వారిజీవితాన్ని వదలి పెట్టదురా!

పరం: ఏం, ఆ ఆలోచన కల్గింది? ఎవరైనా కనపడ్డారా ఏమిటిరా పెద్దచదువు చదివి భారతీయ సంప్రదాయాలున్న వాళ్ళు, ఇవాళ?

నారా: ఒక ఆలోచన్లోంచి ఇంకోటితట్టిన వరుసలో ఆఖరుఆలోచనఇది.

పరం: ఆ గొలుసుకు మొదటిలంకె ఎక్కడ మొదలెట్టిందేమిటి?

నారా: అదేముంటుంది లే, ఏదో చిన్న ఆలోచన!

పరం: అయినా, మనస్తత్వ పరిశోధనకోసం అడుగుతున్నాను.

నారా: నేను చెప్పింది తప్పా?

ఇంతలో లక్ష్మీపతి అక్కడకు వచ్చినాడు.

లక్ష్మీ: ఏమిట్రా వాదించుకుంటున్నారు?

పరం: చూడరా, వీడు ఒక పెద్ద సిద్ధాంతం చేశాడు. నువ్వు వప్పుకుంటావా, వప్పుకోవా? అంటాడు. సరేరా, నీ సిద్ధాంతానికి ఉపపత్తులైన మొదటి ఆలోచన లేమిటిరా అంటే, వీడు ఇవీ అవీ చెప్పి తప్పించుకుంటాడు. లక్ష్మీ: అసలు వీడి సిద్ధాంతం చెప్పవోయి.

పరం: ఈరోజుల్లో పాశ్చాత్యవిద్య చదువుకున్న ఆడవాళ్ళ అంతరాంతరాల్లో భారతీయ సంప్రదాయ వాసన ఉండనే ఉంటుందట.

లక్ష్మీ: అదా! అదెప్పుడూ మావాడి వాదనలో ఒహటి.

పరం: ఒరే! నువ్వు గాంధిగారి భావాలన్నీ అద్భుతం, నిజం అంటావు. ఆయన ఏవన్నారూ, ‘పాశ్చాత్యవిద్య లేకపోతే రామమోహనరాయ లింకా చాల గొప్పవాడయి ఉండును’ అని. దానిమీదేగా మోడరన్ రివ్యూ మొదలైన వాటికి కోపాలొచ్చాయి. అల్లాఅంటే అర్థం ఏమిటిరా లక్ష్మీపతీ? పాశ్చాత్య విద్యవల్ల నిజమైన భారతీయ నాగరికత నశించిపోతుందనేనా?

లక్ష్మీ: అవును. నిజమే!

నారా: ‘పాశ్చాత్యవిద్య వచ్చినా’, అని నేను అననే అన్నాను. అంటే మన వనితాలోకం విషయంలో గాంధిమహాత్ముని సిద్ధాంతం పూర్తిగా అన్వయించుననే నా అభిప్రాయం. అంతే గాని అది తప్పుఅని కాదుగదా. అంటే మన దేశంలో కాస్త తెలిసో తెలియకో సంప్రదాయం బ్రతికించి వున్నది ఆడవాళ్ళే అని.

పరం: ఏమిటి బ్రతికించిఉన్నది? పక్కపాపిళ్ళు, సిసిమా ముస్తాబులు, విడాకులరంధీ_వీటినేనా?

నారా: అన్నీ ఒప్పుకున్నా. కాని యీ పై పై మోజులతో పాశ్చాత్య తత్వం పూర్తి అయిందంటావా?

పరం: ఇంత వరకూ వచ్చిన తరువాత పూర్తికాక మానుతుందా? వాళ్ళ చదువు పూర్తిగా ఎక్కినకొద్దీ తక్కిన ముచ్చట్లు కూడా తీరవూ? తొందర పడతావేం?

నారా: కావచ్చును. కాని నేను ప్రస్తుత స్థితిని గురించే చెప్పుతున్నా.

లక్ష్మీ: సరే ఇద్దరి వాదనా ఒక్కటే. ఇక పదండి.

౧౭

మనుగుడుపులు

జమీందారు గారు వ్రాసిన యుత్తరమువల్లను, తీసికొని వెళ్ళుటకు వచ్చిన జమీందారు గారి చుట్టము గంగరాజు రంగారావు దేశముఖు గారి పట్టువల్లను, నారాయణరావుతో మనుగుడుపులకు నాతని యప్పచెల్లెండ్రు నలువురు, వదిన గారు, సూర్యకాంతము అత్తగారును తరలి వెళ్ళినారు.

సుబ్బారాయుడుగారు వధువువెంట వచ్చిన ఆడపెళ్ళివారి కందఱుకు, రంగారావు దేశముఖు గారికి వెలపొడుగు వస్త్రములు వెండిపళ్ళెములు ఫలములు మొదలగు బహుమతు లర్పించి పంపిరి. వారి నౌకరులకుగూడ దలకు మొలకు గట్ట నిచ్చిరి.

అల్లుని చూడగానే జమిందారుగారి వదనము ప్రఫుల్లమయ్యెను. మధ్యహాలులో శ్రీనివాసరావు గారు, మృత్యుంజయరావుగారు, సీతారామాంజనేయ సోమయాజులుగారు, ఆనందరావుగారు, భాస్కరమూర్తి శాస్త్రిగారు, బసవ రాజరాజేశ్వర శ్రీ జగన్మోహనరావు జమిందారుగారు, రంగారావు దేశముఖు గారు, నారాయణరావు, జమిందారుగారు, నారాయణరావు రెండవ బావ మఱది వీరభద్రరావు మొదలగు వారందఱు సోఫాలపై నధివసించి కొంతతడవు ఇష్టాగోష్ఠి సల్పిరి. నారాయణరావు మాటలాడక యన్నియు వినుచుండెను. శ్రీనివాసరావుగారు తన వైపు తిరిగి తన్ను ప్రత్యేక మప్పుడప్పుడు ప్రశ్నించుచుండుటచే నారాయణరావు గంభీరములు, నాలోచనాపూరితములునగు సమాధానములు చెప్పుచుండెను. నారాయణరావు స్నేహితుడగు రాజేశ్వరరావు నాయుడుగూడ నప్పడేవచ్చి యందఱకు నమస్కృతు లొనరించి యచ్చట గూర్చుండెను.

రైళ్ళవిషయమై సంభాషణ నడచుచుండెను.

శ్రీనివాసరావుగారు నారాయణరావును జూచి,

శ్రీని: ఏవండీ నారాయణరావు గారూ, చూశారూ! మరేమంటే మన దేశంలో రైళ్ళు కంపెనీల క్రింద వుండడం లాభమా, ప్రభుత్వం క్రిందఉండడం లాభమా?

నారా: ప్రభుత్వం క్రింద ఉండడమే లాభం.

శ్రీని: ప్రయివేటు కంపెనీలకు వుండే లాభాపేక్ష ప్రభుత్వానికి ఉండదనా మీ యభిప్రాయం?

నారా: ఆశ ఉండక పోవడమే కాదు. గవర్నమెంటు సాలీనా వచ్చే నికరాదాయం వృద్ధి చేసుకొని తద్వారా ప్రజలకు ఇతర సదుపాయాలు చేయవచ్చు.

మృత్యు: అయితే రైల్వేలుకూడ గవర్నమెంటు డిపార్టుమెంటై, ఎఱ్ఱటేపు పద్ధతి అమలులోకి వస్తే లాభాలనేవి వుంటాయా అని.

జమీ: ఆబుకారీ డిపార్టుమెంటు లాభసాటిగా లేదుటండీ?

శ్రీని: రైల్వేలు ప్రభుత్వం చేతిలోవుంటే చూశారూ, పెద్ద ఉద్యోగాలన్నీ ఇంగ్లీషువాళ్లకే కట్టబెట్టి వాళ్లందరికీ జీతాలు విపరీతంగా యిస్తారు. మరేమంటే ఆ సొమ్ము ఐ. సి. ఎస్. వాళ్ల జీతాలలాగ అంతా ఇంగ్లండే చేరుతుంది.

రాజే: కంపెనీ అయితేమాత్రం ఇప్పుడూ ఆ పనే జరుగుతోంది కాదా అండీ. నారా: వారి ఉద్దేశం ఏమిటంటే, బ్రిటిషు ప్రభుత్వం చేతిలో రైల్వేలు ఉండడం లాభమా లేక హిందూదేశపు ప్రయివేటు కంపెనీ చేతిలో ఉండడం లాభమా అని.

శ్రీని: అవును.

నారా: బ్రిటిషు ప్రభుత్వం హిందూదేశంలో వున్నన్నాళ్లు రైల్వేలు హిందూ దేశంలో కంపెనీలకు యివ్వరు. ప్రస్తుతం హిందూ దేశంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి రైల్వేలు కొనే కంపెనీలు తయారుగా లేవు. ఇంక రైల్వేలు వెనుకటి షరతుల ప్రకారం ప్రభుత్వం చేతిలోకి ఎప్పటికైనా వస్తాయి. కొన్ని వచ్చాయి అప్పుడే.

జమీం: రైళ్ల విషయం లెక్కలన్నీ నాదగ్గర వున్నాయి. ఇంతవరకు హిందూదేశంలో వేసిన రైళ్ల వలన ప్రయివేటు ఇంగ్లీషు కంపెనీలకు, హామీ రూపంగానున్న ప్రభుత్వం వేసిన రైల్వేలకు, వడ్డీనష్టం వగైరాలమీదనున్ను గవర్నమెంటుకు చాలానష్టం వచ్చింది. (నారాయణరావు వైపుకు తిరిగి) ఆనక ఒకసారి నా స్వంతగదిలోకివస్తే ఆ లెక్కలన్నీ చూడవచ్చును.

నారా: అలాగేనండి. నాకూ ఈమధ్య ఆ లెక్కలన్నీ కావలసే వచ్చాయి.

జమీ: ఆక్సువర్తు కమిషను సంగతి ఎరుగుదువు కాదూ?

నారా: అవును ఆ రిపోర్టులు చూడాలి.

మృత్యు: ఏమిటండీ ఆ కమిషను?

జమీం: రైల్వేలు గవర్నమెంటు చేతిలో వుంటే ఎక్కువ లాభమా, కంపెనీల చేతుల్లో ఉంటే ఎక్కువ లాభమా అన్న ఈ ప్రశ్నే.

నారా: ఇతర దేశాలు ప్రస్తుతం భాగ్యవంతమైన దేశాలు. మన దేశం చాలా బీదది. పైగా పాశ్చాత్య దేశాల్లోనే ఇప్పుడు రైల్వేలు గవర్నమెంటుకు ఇచ్చి ప్రజాధీనం చెయ్యాలని రభస చేస్తున్నారు.

శ్రీని: గవర్నమెంటు స్వాధీనం అయితే లాభాల సంగతి వేరే చెప్పాలా!

నారా: చిత్తం, వస్తున్నాను. ముందు రైల్వేలు లాభదాయకాలైనవి అనే సంగతి మనం ఒప్పుకుంటే.

శ్రీని: ఒప్పుకున్నాను ప్రస్తుతం.

నారా: అయితే, దేశంలో ఏకొద్దిమందికో కంపెనీరూపంగా వచ్చే లాభం గవర్నమెంటుకు వస్తే ఆ రాబడి విలువ ఇతర పన్నులలో తగ్గించవచ్చు కదా? మఱి ప్రస్తుత ప్రభుత్వం అలా తగ్గిస్తుందాంటే, ఇది కేవలం లాభసాటి గవర్నమెంటు గనుక, యిప్పుడు ప్రజలకి ఉపయోగం లేదు. అయితే రేపు ప్రజాప్రభుత్వం, అనగా కెనడా మొదలయిన దేశాలలో ఉన్నటువంటి డొమినియను ప్రభుత్వం, వచ్చినా లేక సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినా ఆ లాభం అంతా ప్రజలకే గాదండీ? శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లు కోట్లకొద్ది డబ్బు పెట్టి మన దేశంలో రైళ్ళు వేస్తే మన ప్రజలు లాభంపొందాలీ! ఇది సబబేనా?

నారా: వాళ్లు పెట్టిన పెట్టుబడి తీరగా ఏటేటా బోలెడు లాభాలను వాళ్ళెలాగూ గుంజుకుపోతున్నారు. ఇంక మనం కోరేదానిలో అన్యాయం ఏం ఉంది?

జమీం: గవర్నమెంటు, కంపెనీదగ్గిర నుంచి రైల్వేలను పుచ్చుకోవాలంటే ఉన్న యావత్తు సరకులకు రోడ్లకు పట్టాలకు ఖరీదు ఇవ్వనక్కరలేదా? ఆ డబ్బు ఇప్పుడు మనదగ్గర లేదే! ఆ డబ్బు మళ్ళీ ఇంగ్లాండే పెట్టుబడి పెట్టాలే.

నారా: డెబ్బదిఅయిదు సాలుసరి వాయిదాలమీద తీర్చడానికి ఏర్పాటు చేసికొని కదాండి?

జమీం: అవును. తిరిగి పుచ్చుకున్న తేదీకిముందు మూడుసంవత్సరాలు వచ్చిన లాభం కంపెనీ వాటాలకు పంచి, సగటుధరనుబట్టి అనగా నూరు కాసుల షేరుకు ఏ నూటయిరవయ్యనో అంచనా వేసి నూటికి నాలుగున్నర వడ్డీతో డెబ్బదిఅయిదు వాయిదాలలో తీర్చడానికే ఒప్పందం చేసుకున్నారని జ్ఞాపకం.

శ్రీజగ: ఈ రైళ్లు మనవాళ్ళు సరిగా నడపగలరండీ? మనవాళ్లే నడపడం వచ్చిందంటే రోజుకు రెండుసార్లు బోల్తాలో ఢీకొట్టటమో జరగదా!

భాస్క: అదేవిటండీ రాజాగారూ! అట్లా సెలవిస్తారు? ఎంతమంది గొప్ప ఇంజినీయర్లు, గార్డులు, డ్రైవర్లు మన వాళ్లు లేరు? స్టేషను మాస్టర్లంతా మనవాళ్లే. పోనీ ఇంగ్లీషువాళ్ళు పై ఉద్యోగాలు చేస్తున్నారా?

శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లకు ఏమాత్రం తీసిపోని యూరేషియన్లు.

భాస్క: వాళ్ళుమాత్రం మన వాళ్ళు కాదండీ? మన చేతికిందికి వస్తే మాత్రం వాళ్ల, ఉద్యోగాలు తీసి వెయ్యాలని ఉందాండి?

సీతా: అయ్యో! ఈ తెలుపూ నలుపూ గాని దొరలున్నారు బాబూ, అసాధ్యులు. అసలుదొరలు నయమండీ! వీళ్ల ముందర ఆగలేం.

ఆనంద: మీరు చెప్పింది నిజమే కాని ఇప్పుడు చాలా నయమండీ శాస్త్రులు గారూ. వాళ్ళూ తాము హిందూ దేశస్థులమనీ మునిగినా తేలినా మనతోపాటేననీ గ్రహించారు.

సీతా: వాళ్లని తెల్లదొరలు రానిస్తారాండీ బాబూ?

మృత్యుం: తెల్ల దొరలు వీళ్ళు కంత్రీలు, మా కక్కర లేదు, మాకేం సంబంధం లేదంటారు. మనవాళ్లు కాదంటారు.

నారా: అలాఅనకండి. భారతీయులు ఎప్పుడూ వాళ్లని తమలో ఐక్యం చేసుకోడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళే మేం తెల్లవాళ్లమని. వాళ్లదేశం హోము అంటే ఇంగ్లండని అంటూవచ్చారు. గాంధీజీ ఎప్పడూ వాళ్లని సంపూర్ణ ఐక్యభావంతో మనలో జేరమనే కోరినారు.

సీతా: వాళ్లు గబ్బిలాలన్న మాట!

శ్రీజగ: అదేమిటండీ తెలివితక్కువమాటంటారు? తెలియక పోతే ఊరుకోవాలి. గబ్బిలాలూ! యూరేషియను స్త్రీలకి ఉండే అందం ఒక్క ఇంగ్లీషు అమ్మాయికి ఉందీ! మీ ఛాందసపు బ్రాహ్మణ ముత్తైదువులకు ఉందా పోనీ?

నారా: అందచందాల విషయం ప్రస్తుతం కాదు; పోనీండి.

శ్రీని: అదేమిటండీ రాజా గారూ, కోపంవచ్చిందీ! చూశారూ, సోమయాజులు గారు వట్టి అమాయక బ్రాహ్మణుడు. మరేమంటే చూశారూ మీరు ఆ సంగతులూ, ప్రపంచం ఎరిగున్న వారు గనుక తెలుస్తుంది. చూశారూ!

జమీం: ఏదో ఛలోక్తికన్నారు. అంతే!

సీతా: చిత్తం చిత్తం. అంతేనండి మహాప్రభూ, క్షంతవ్యుణ్ణి.

ఇంతలో ఫలహారములకని కబురువచ్చినది. జమీందారు గారు శాస్త్రి గారిని సోమయాజులు గారినీ లోనికంపి తామంద రచ్చట నే యుపాహారముల గైకొందుమని వాక్రుచ్చినారు. తక్కిన వారందరికడ బంట్రోతులు పాలరాలు పరచిన బల్లల నుంచినారు. వంట బ్రాహ్మణులు నేతిలో వేయించిన జీడిపప్పు, ఆవు పెరుగులో వైచిన ఆవడలు, మైసూరుపాకము, గపుచిప్పుమిఠాయి, జిలేబి యుండలు, పనసతొనలు, చక్రకేళి అరటిపండ్లు, అనాసముక్కలు వెండి పళ్లెములతో అందరికడ నుంచినారు. స్పెన్సర్ కంపెనీ వెండిగళాసులలో మంచువైచిన మంచినీళ్లుంచినారు. చేతులు కడుగుకొనుటకు తళతళలాడు కంచుతట్టలు ఎవరికి వారికి వేరుగా నొకరు తెచ్చియుంచగా వంటబ్రాహ్మణులు నీళ్ళు పోయుటయు, చేతులు కడుగుకొనిరి. అపురూపమైన చీనా దేశపు గిన్నెల సెట్టులలో తేనీరు, కాఫీ, ఏది కావలసిన వారి కది యిచ్చినారు.

నారాయణరావు రాజేశ్వరరావును దీసికొని మేడమీద తనగదికి వెళ్ళెను. అచట స్నేహితులిరువురు తనివితీరునట్లు సాయంత్రమువరకు మాట్లాడుచునే యుండిరి.

పల్లెటూరి మోటుమానిసి యనుకొన్న నారాయణరావు తెలివితేటలలో, మాట నేర్పులో నతిశయించుటగాంచి శ్రీ జగన్మోహనరావు జమిందారుగారికి తల కంటగింపు కలిగినది. జమిందారుల యింట బుట్టిన తనవంటి వానికున్నచో శోభించునే గాని, ఈ పల్లెటూరి బడుగు తెలివి కెవరు సంతసింతురు? ఒకరి సంతసముతో తన కేమిపని? శారద మాత్రము సంతసింపదనుట ముమ్మాటికి నిశ్చయం. ఆంగ్లో ఇండియను వనితలను దాను వెనుక వైచికొని మాటలాడిన మాట లా ప్రక్కగదులలో నెచటనైన శారదయుండి వినలేదుకదా! 

౧౮

వీణ

ఆ సాయంత్రము విహారము సలిపివచ్చి నారాయణరా వత్తవారి మేడ చేరునప్పటికి దివ్యనాదపూరితమగు విమలగాంధర్వమున దిశల నింపుచున్న దొక బాలిక. రాజేశ్వరుడా పాట విని ‘ఎవరురా, అంత అద్భుతంగా పాడుతున్నారు’ అని అడిగినాడు.

‘ఆ! శ్రీరామయ్యగా రీమధ్య ఊళ్ళో లేరు. నేడే వచ్చారు. వారు ఫిడేలుతో పక్క వాయిద్యం వాయిస్తూ శిష్యురాలిని ఎంత విచిత్రంగా పాడిస్తారనుకొన్నావు!’

‘మీ ఆవిడే నేమిట్రా!’

‘ఆమాత్రం కనిపెట్టలేవురా! ఉండు. శ్యామ ఆలాపన జేస్తున్నారు. విను, విను. మాట్లాడకు.’

‘నాకు సంగీతమం టే తలనొప్పి.’

‘అప్పుడే నీవు ‘ఆస్పిరిను’ అంశకు వచ్చావుట్రా?’ గదిముందరి వరండాలో దీపాలు ఆర్పివేసి రాజేశ్వరరావును, తానును పడక కుర్చీలపై కూర్చుండి నారు.

తారకాకాంతులే ‘శాంతమూ లేక సౌఖ్యమూ లేదు’ అని పాడుచున్నట్లయినది. చీకటిలో గనబడని పూవుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించిపోయినది. గులాబిపూల పాలగొంతుక నుండి వెడలు నా పవిత్రస్వనముతో బోల్చుటకు నారాయణరావు కీ ప్రకృతిలో నేదియు తలపునకు రాలేదు. వేణువనస్వనములా, సెలయేటి గానములా, తుమ్మెద ఝంకారములా ఇవి యేవియు దగవని యాతడు తలయూచినాడు. కోకిల గొంతులు కావచ్చు ననిపించినది.

నారాయణరావు హృదయము ఆనందపూరితమై ప్రేమపూర్ణమైనది.

‘నను పాలింపా, నడచివచ్చితీవో !’

చిట్టి శ్రీరాముడు, నీల మేఘశ్యాముడై తొనలు తిరిగిన చిఱుచేతులతో చిన్న బంగారువిల్లు పట్టుకొని, నవ్వులు వెదజల్లుచు, నడచివచ్చిన ట్లాతనికి గోచరించినది. అతని కన్నుల నీరుతిరిగినది. ఆ గొంతులో చిన్ని శ్రీరాముడే కలడు. శ్రీరామయ్య గారి కంఠములో దుష్టరాక్షస సంహారుడగు రఘువీరుడే కోదండపాణియై అనుజ సౌమిత్రులతో సాక్షాత్కరించుచున్నాడు. ప్రశాంతమగు నా సంధ్యారాగములో మిళితమగు శ్రీరామయ్యగారి కమాను కదుపులోక శారదాదేవి గళమునుండి తొలుతాడు కలికి చెలువంపు తీయ సవ్వడులు గలసి, లత్తుకతీర్చిన చిన్నారి పాదాలపై పరికిణి యంచులు చిందులాడ, కనక కింకిణీనూపుర ఘల్ఘలారవముతో శీతనగ స్వచ్ఛహిమశకలముపై నృత్యమొనర్చు సుమాబాల విశ్వమోహనమగు కంఠ కుహూకారములు విరియించిన ట్లయినది నారాయణరావునకు.

‘ఎటులా బ్రోతువో తెలియా

ఏకాంత రామయ్యా...!’

ఆర్తరక్షకుడగు నా శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కని ప్రభువు! ప్రోచిన నాతడే ప్రోవవలయు. శ్రీరామ నీలమేఘము భక్తమనః కేదారముల బూర్ణసస్యముల బండించుగదా ! పరాప్రకృతియగు సీతమ్మ తల్లియు, పరమాత్మయగు శ్రీరామచంద్రుడును నవ్యయులు, సత్యచేతన ప్రదాతలు ‘ప్రోచినను కబళించినను నీదే భారము ప్రభూ! రామరామా! యని రంజిల్ల నావంతు, నియతిమై రక్షింప నీది వంతు’ అని కనులు మోడ్చినాడు నారాయణరావు.

రాజేశ్వరుడు చెలికానివంక తిరిగి ‘ఏమి నారాయుడూ! నే నిన్నాళ్ళూ పెళ్ళిచేసుకోనని మానివేశాను. ఏదో సంబంధము మా నాయన తీసుకువస్తే ఆ పిల్లకూ, నాకూ ప్రేమ కుదురుతుందని నమ్మకం లేదు. మా నాయనతో ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నా. మా నాయన పోయినతర్వాత నేటికి మా అమ్మ వెఱ్ఱిబలవంతం పెట్టింది. గొంతుక్కు వెలక్కాయ పడినట్లయి తర్వాత చెప్తానులే అని పారిపోయివచ్చాను’ అని పడకకుర్చీలో జేరగిలబడి కనులుమూసుకొని నారాయణరావు నడిగెను.

రాజేశ్వర రావుది పచ్చని దబ్బపండుచాయ. తెలగబిడ్డయైన నతని నందఱు బ్రాహ్మణుడే యని తలంతురు. అతడు శాకాహారి. స్వచ్ఛమగు పలుకు, మధ్యమోన్నతమై కండ పుష్టి కలిగిన శరీరము, వంకర తిరిగిన ముక్కు, సమమైన నుదురు, కామపురుషార్థపరతాస్ఫోరకములగు దీర్ఘ చక్రవాకలోచనములు. ఫ్రెంచి పద్ధతిని సగము మిగుల్చుకొన్న నల్లని మీసములు. చుట్టును జవ్వ లేని సులోచనములు ధరించి, ముంగురులు నున్నగ వెనుకకు దువ్వుకొనును. ప్రసిద్ధ సినిమా నటకు డగు రుడోల్ఫు వాలంటీనో పద్ధతి నాతడు పొడువుగా బెంచుకొను మొగచెంపలును, తీర్చినట్లున్న నల్లని కనుబొమలు నాతని మోమునకు గాంభీర్యమును పుణికియిచ్చును. ఆతడు ధరించునవి చిక్కని మీగడ తరక వంటి ఫ్రెంచిపట్టు చొక్కాలు, తెల్లటి లాగులను తొడుగును. కాళ్ళకి ఖరీదుగల లూథియానా జరీచడావు లుండును.

నారాయణరా వాతని నఖశిఖపర్యంతము జూచి చిరునవ్వునవ్వి, తన ముదుక ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, ఖద్దరు సేలం కండువాలను జూచుకొని నవ్వుచునే పెదవి విరుచుకొని ‘ఒరే రాజీ! నువ్వేపుడైనా అలంకారముతో లేని సమయం ఉందిరా?’ అని ప్రశ్నించెను.

‘ఇంటిదగ్గిర లబ్బీలుంగీ కట్తానురా!’ ‘అది పట్టుదేనా?’

‘ఆ.’

‘నిద్దట్లో నీ జుట్టు చెరుగుతుందిరా!’

‘పాపము శమించు గాక!’

‘ఏదీ చెయ్యి? పారాహుషార్!’

‘నామీద ఒక వ్యాసం రాయరా! ఒక కథ అల్లరా!’

‘నీ వొక్కడిమీదనేనా, ఆ పరకీయను కూడా కలపనా?’

‘సెబాష్! కలిపితే యిక మజా అడిగావూ!’

‘మఱి దశావస్థల్లో ప్రస్తుతావస్థయేదో చెప్ప?’

‘మీ కవిత్వాల్లో విరహావస్థ లన్నింటిమాటా నాకు తెలియదుగాని ‘ప్రళయం’ మట్టుకు తప్పేటట్లు లేదు.’

‘ఎవరికి? నాయికకా, నాయకునకా? ఆ పూర్ క్రీచరుకా? మీ మోహప్రవాహాన్ని ఆ భర్త అరికట్టడనీ, పైపెచ్చు సంతోషంతో ఓలలాడతాడనీ చెప్పావుగా! నీ వానాడు చెప్పినమాటలు తలచుకుంటే నా కిప్పటికి ఒళ్ళు జలదరిస్తున్నది. ఎంత అమానుషపు టూహ చేశావురా!’

‘ఒరేయి! ఈ విషయములో మనం యిద్దరం ఏకాభిప్రాయులం కామనిన్నీ, ఆ భావాలు మనం చర్చించుకోవడం మానివేద్దామనిన్నీ అనుకున్నాంగా?’

‘అవును. అందుకనే ఆయనమాట తలపెట్టవద్దన్నాను. కాని ఇప్పుడు నీ పెళ్ళిమాట ఎత్తావు కాబట్టి ఇప్పటికైనా ఈ హేయశృంగార ప్రబంధానికి స్వస్తి చెప్పి, పెళ్ళిమాట ఆలోచించడం ఉత్తమం.’

‘నారాయుడూ! నువ్వు చెప్పే ముసలమ్మల సిద్ధాంతాలు నాకు గిట్టవు. ఎప్పుడో ఇక్ష్వాకులనాడు పుట్టిన వివాహాచారాన్ని యీ ఇరవయ్యో శతాబ్దంలో కూడా పట్టుకు వేళ్ళాడమంటావునువ్వు. వివాహాలు లేని కాలం కూడా ఒకటి ఉండేదన్న మాట మరచిపోకు. ఏదో ప్రయోజనం కొరకు మధ్యలో కల్పించిన యీ ఆచారంతో ప్రయోజనం లేదనుకుని యిప్పుడు దాన్ని విడిచిపెట్టే వాళ్ళకు ఆక్షేపణ ఏముంది? స్త్రీ, పురుషుల ప్రేమసంబంధానికి ఇంత తంతెందుకు?

‘పెళ్ళిలేని కాలం ఒకటి ఉండేది అన్నావు. ఆ కాలం పాశ్చాత్యశాస్త్రజ్ఞుల వాదన ప్రకారం, మానవులు జంతువులలా సంచరించే రోజులు. కనక ఇప్పటి జంతువుల సంగతి విచారిస్తే ఆనాటివారి స్థితి మనకు గోచరిస్తుంది.’

‘అది సరే. నా వాదానికే వస్తున్నాను.’

‘తొందరపడకు. ఆ కాలంలో మానవజాతి అంతా ఇష్టంవచ్చిన మగవాడూ, ఇష్టమువచ్చిన ఆడదీ వాంఛ తీర్చుకోవడం, తర్వాత వాళ్ళకీ వీళ్ళకీ సంబంధం లేకుండా ఉండడం అనికదా నీ వాదన? నువ్వు అనుకునే జంతుత్వం జంతువులలో లేదు. మానవ సంబంధంలేని జంతువులలో ముఖ్యంగా లేదు. భగవంతునివల్లనో, లేక ప్రకృతివల్లనో వచ్చిన ‘ఇన్‌స్టిన్‌క్ట్’ (జంతుజ్ఞానం) వల్ల జంతువులు బ్రతకడం జాతి వృద్ధిపొందడం అనేవి మాత్రమే అవి ఎరుగును. ఆ జంతుజ్ఞానంవల్ల ఇష్టమువచ్చిన తిండితినవు. ఇష్టమువచ్చినట్లు కామం తీర్చుకోవు. దేహం కాపాడుకోడానికి తిండి, జాతి వృద్ధిపొందడానికి కామం అని ఆ జంతుజ్ఞానమే వాటికి చెప్పింది. ఇష్టమువచ్చినట్లు తిండితిన్నా, కామం తీర్చుకున్నా జాతి నశిస్తుందని ఆ జంతుజ్ఞానమే చెప్పింది. అందుకనే సాధారణపు కోతులలో ఒక మగకోతి కొన్ని ఆడకోతులు ఉంటవి. లేక ఉరాంగు ఉటాంగు మొద లైనవైతే, గొరిల్లా లాంటివి అయితే, ఒక మగది ఆడది నీతిగా ఉంటవి. అలాగే సింహం, పులి, తోడేలు, ఎలుగు. అదీ కాకుండా జంతువులకు ఋతుకాలం అంటూ ఒకటి ఉన్నది. ఆ కాలంలోనే కామక్రియా నిర్వహణం జరుగుతుంది. ఇదే జంతువులలో పెళ్ళివంటిది.’

‘అయితే మన ఆవుల సంగతి, కుక్కల సంగతి ఏమిటి? ఆంబోతుకు ఈ ఆవు ఆ ఆవు అని లేదు. ఎప్పుడు ఏ ఆవు ఎదపోయి సిద్ధంగావుంటే, ఆ ఆవుతో పొర్లడానికి ఆంబోతు సిద్ధం. ఆ ఆవుకైనా ఏ ఆంబోతైనా సరే. కుక్కలలో ఒక్కొక్క ఋతుకాలంలోనే ఆడకుక్క రెండు మూడు మగ కుక్కలతో సంబంధానికి సిద్ధం. చూలు నిలవగానే మానుకుంటుంది. తన పిల్ల అయిన మగకుక్క అయినా సరే! గాడిదెలు అంతే, పందులు అంతే. ఇప్పు డే మంటావు?’

‘నువ్వు ‘మన’ అనడంలో నే జవాబంతా వచ్చింది. అయినా విపులం చేస్తాను. మనుష్యుని జీవితాల్తో కలిసిపోయినవి ఆల జాతులు, కుక్క, గాడిద, పంది, పిల్లి జాతులు. అందువల్ల చాలాభాగo వాటికి జంతుజ్ఞానము నశించి పోయింది. మనుష్యునికున్న మనస్సున్నూ లేదు. అయినా అవికూడా ఋతుకాలాన్ని మాత్రం అనుసరిస్తాయా, అనుసరించవా?’

‘సరేరా! పెళ్ళి అనే సంస్థ సంగతి కానీ.’

జంతు జీవితంలోంచి నెమ్మదిగా మనుష్యుడు తన మనోబలంవల్ల పైకి రాసాగాడు. మనస్సంబంధమైన జ్ఞానము వృద్ధిఅయినకొద్దీ జంతుజ్ఞానము నశించినది. భోజన నిద్రామైధునములు మాత్రమేకాక అనేక వాంఛలు, వాటిని సంపాదించుకోడం పెట్టుకున్నాడు. కళలన్నాడు, లలితకళ లన్నాడు, కృషి వాణిజ్యాలు, యుద్ధాలు రాజ్యాంగాలు పరసాధన యిటువంటి వ్యాపారా లనేకం కల్పించుకున్నాడు. ఆయా వ్యాపారాలలో నిరంతరసాధన చేస్తూ, అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నాడు. ఆహారనిద్రా మైధునాలు తప్ప వేఱే పని లేనివాళ్లు అప్పటికీ యిప్పటికీ నువ్వనుకోగానే పశుతుల్యులుగానే వుంటారు. తన మానవత్వం సార్థకపరుచుకోడానికి ధర్మార్థాలు సాధింపదలచుకొన్న వాళ్లు పశుప్రవృత్తయిన కామానికి ఒక హద్దు ఏర్పరచుకొన్నారు. నిరంతర కామసేవ కోసం, ఉదరపూజకోసం ఆలోచిస్తూకూర్చోడానికి వాళ్లకు వీలుపడదు. నిద్రహారాలు కూడా మాని, దీక్షతో పనిచేసే మానవుడికి కామవిషయం కలలోకి గూడ రాదుగదా! అయితే ప్రజోత్పత్తిమూలకమైన కామం కూడా పురుషార్ధమే కనక, దాన్ని బొత్తిగా వదలి పెట్టనక్కరలేని సామాన్యగృహస్థులంతా, ఒక స్త్రీతోనే కామనిర్వహణం చేస్తూ, యితరపనులు చేసుకోడానికి మనశ్శాంతీ, తీరికా సంపాదించుకుంటారు. అంతే కాని స్త్రీ, పురుషులు స్వేచ్ఛాచారపరులయి నిరంతరం సంఘసుస్థితికి భంగంకల్గించే కొట్లాటలు తెచ్చి పెట్టుకోగోరరు’

‘ఒక స్త్రీతో వుండాలని నేను వొప్పుకుంటాగాని వివాహ కర్మకాండంతా ఎందుకు?’

‘ఆ మాటన్నావు, బాగుంది. జాతి క్షేమానికి, సంఘ సుస్థితికీ ఒక పురుషుడూ ఒక స్త్రీయే కూడివుండడం అవసరమని ఒప్పుకుంటే నాకు చాలు. వివాహకర్మ మానుకొన్నా నాకు సమ్మతమే.

‘మఱి ఎందుకు చేస్తున్నారందరూ యీ కర్మను?’

‘అది వేఱే సంగతి. వివాహం అర్థకామాలకే కాకండా, ధర్మమోక్షాలకు గూడా సాధనమని నమ్మేవారు ఆ పని చేస్తారు. వాళ్ల జోలి నీకెందుకు? తానుతప్ప యితరం లేదంటూ, ఆత్మాభిమానంతో మ్రగ్గేవాడికి గృహస్థాశ్రమం ఆత్మసాధన. తన చుట్టూ తాను కట్టుకొన్న గిరిని ఆలుబిడ్డలద్వారా విస్తరింప జేసుకొని, క్రమంగా విశ్వంతో ఐక్యభావం సాధించుకొంటాడు. గృహ్య సూత్రోక్తమైన కర్మలు సర్వభూత దయాళుత్వం మొదలైన ఉన్నత భావాలకు మెట్లవంటివి. ఇది అంతా మతానికీ, దేవుడికీ సంబంధించిన విషయం. నువ్విదంతా వేదాంతమంటావు. కాబట్టి ఆ సంగతి మనకు వద్దు.’

‘వివాహకర్మ అక్కరలేదంటే మనకిక తగాదా లేదు.’

‘లేకేమి? మీ స్వేచ్ఛాచారులు ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే నిబంధన ఒప్పుకోరుగా? మోజు తీరిపోగానే యెవరిదారి వారు చూచుకోవలసిందనేగా మీ మతం?’

‘అవును గాని, స్త్రీకిగూడ స్వతంత్రం అనేది వుంటే మేము చెప్పేస్థితి వస్తుందా, రాదా?’

‘ఆ స్థితికి కారణం స్త్రీ, స్వాతంత్య్రం అవునో కాదోగాని, ఆ స్థితి మాత్రం అధోగతికి కారణమవుతుంది. జడ్జి లిండ్ సే అమెరికా స్థితి వ్రాశాడు. చూడలేదూ? విడాకులు పుచ్చుకోడానికి స్త్రీ కీ పురుషుడికీ సమానస్వాతంత్య్రం వున్న సోవియట్ రష్యాలో, అమెరికాకంటే తక్కువ విడాకుల సంఖ్య. విన్నావో, లేదో? కాబట్టి స్త్రీ, స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నీతి నియమాలనేవి వుంటే ధర్మరతి అనేది వుంటే నువ్వనుకొనేస్థితి యెన్నడూ సంభవించదు. ఆహారనిద్రామైధునాలకొఱకే మనం బ్రతుకుతున్నామనుకొంటే మాత్రం ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అప్పుడు మన కీ రాజ్యాలూ అక్కర లేదు. కళలూ అక్కర లేదు.’

‘ఒరే నారాయుడూ! నీ కీ ప్లీడరీ ఎందుకుగాని, సనాతనమత ప్రచార పీఠం ఒకటి పెట్టరా!’ అనుచు రాజేశ్వరరావు నారాయణుని వీపుతట్టి వెడలి పోయెను.

౧౯

ప్రేమస్వాతంత్య్రము

రాజేశ్వరరావు చిన్నతనమునుండియు తిరుపతిరావు గారి శిష్యకోటిలోని వాడు. తిరుపతిరావుగా రే విషయమును గూర్చి సంఘముతో దాము పోరాడుచున్నారో, స్త్రీ, పురుషు లేవిధమున సంచరించవలెనని వాదించుచున్నారో అట్లే తాము సంచరించి అకల్మష హృదయులనియు, దృఢవ్రతులనియు, ధీరచరిత్రులనియు బేరుపొందినారు. వారి యభిప్రాయములతో నేకీభవింపనివారు గూడ వారి త్రికరణశుద్ధిని మెచ్చుకొనువారే. ఆ తిరుపతిరాయునికి రాజేశ్వరుడు నమ్మిన శిష్యుడు.

తల్లిదండ్రులు వివాహము చేసికొమ్మని యెంత పోరినను, ఆతడు యెన్నో సాకులు చెప్పుచు తప్పుకొనుచుండెడి వాడు. తిరుపతిరావు గారు ఎవ్వరితోడ నబద్ధము లాడవలదనియు, ఉత్కృష్టధర్మమగు స్వతంత్ర మసత్యముచే గలుషిత మగుననియు రాజేశ్వరున కనేక విధముల బోధించినాడు.

రాజేశ్వరుడు రాజమహేంద్రవరము చదువుటకు వచ్చినపుడు నారాయణునితో ప్రాణస్నేహ మేర్పడినది. నారాయణరావు రాజేశ్వరున కెన్ని సారులో తిరుపతిరావు గారి శుశ్రూష వలదని బోధించినాడు. పరమేశ్వరరావుమాత్రము తిరుపతిరావు గారి విధానము స్త్రీ, పురుష సంబంధపు జిక్కు చక్కగా విడదీయ రాజపథము కావచ్చుననియు, కొందరి జీవితము లా విధానమునకు సమర్పితములు గావలెననియు రాజేశ్వరు డట్లేల చేయరాదనియు నారాయణరావుతో వాదించువాడు. ఆది ఆత్మహననమార్గమని మనకు తెలిసివచ్చినప్పుడు, ఆ జ్ఞానమును రెండుచేతుల ద్రోసివైచి, కళ్ళకు గంతలు కట్టుకొని, మహావిషోరగ భయంకర జీవములు గడపి, విష వాయుపూర్ణమును, నగాథము నగు నరక కూపాన నేలబడవలయునని నారాయణరావు వాదించువాడు.

తిరుపతిరావుగారి స్నేహము చేయుచుండినచో రాజేశ్వరుని మోము చూడనని నారాయణుడు అదలించినను ‘నీకు ఉడుకుబోతుతన మెందుకు? నువ్వు కూడా మాజట్టు చేరు. నువ్వూ ఘోటక బ్రహ్మచారివేగా’ అని రాజేశ్వరుడు వికటముగా జవాబిచ్చెను . తిరుపతిరావు గారిచుట్టును పాశ్చాత్యవిద్యా దక్షులగు (విద్యాదగ్ధులా?) పెక్కండ్రు చేరినారు. ఒకరి భార్యల నొకరు పొందవచ్చును. స్త్రీ, స్వాతంత్య్ర సంపాదనము, శిక్షాస్మృతిలో పరభార్యా సంభోగమునకు, గర్భవిచ్ఛిత్తికి నేర్పడిన శిక్షలు తొలగించుట, విడాకుల చట్టము, అన్నదమ్ములతోపాటు స్త్రీలకు బితృస్వమున భాగమొసగు చట్టము నిర్మింప జేయుట మొదలగునవి వారికి ముఖ్యాశయములు.

పరస్త్రీ సంగమము దోషమని తలంచుట యజ్ఞానవిలసితమని వారి యభిప్రాయము.

ఆ బృందముతో తిరుగు రాజేశ్వరుడు పవిత్రుడు గాడని యెవరు చెప్పగలరు? ఆత డందగాండ్రలో లెక్కగావున ఆ సమాజములోని బాలికల కతనిపై మరలు జనించుట వింతకాదు.

కాని యా సంఘములోగూడ పెక్కు వత్సరముల నుండి పరస్పరము ప్రేమించుకొనిన స్త్రీ పురుష యుగ్మము లెన్నియో కలవు. ఆ సంఘములో పూర్వసంప్రదాయానుసరణి వివాహమైనవారిలో తిరుపతిరాయడు గారొకరు. ఆయన భార్య విద్వాంసురాలు, పతిప్రాణ. భర్తగారి యాశయములు, బోధలు, చర్యలు తన కేమియు నచ్చకపోయినను సత్యవర్తనమే పరమధర్మమని తలచి, పతియానతి కెదురు చెప్పక, స్వేచ్ఛాచార సంఘములో గాఢ దీక్షాపరురాలివలె చరించుచు, ఆయన కామసంబంధము చేసికొమ్మనిన వారితో నిష్టము లేకున్నను అటులనే చేయుచుండెను.

తిరుపతిరావు గారికి వనితామానాపహరణమే పరమవ్రతము. ‘స్త్రీ‘, భోగముకొరకే జనించినదని యాతని వాదము. నతివిచిత్రమైన ప్రాణియట వనిత. ఆమె కన్నులలో నీలిమబ్బులు తేలియాడునట. ఆమె పెదవులలో తేనెవాక లున్నవట. ఆమె వక్షములో ప్రేమ యతి గంభీరమై యాకాశమువలె నగమ్యసుందరమై యుండునట. ఆమె దేహము కౌగిలింతల గోరునట. ఆమె చెక్కిళ్ళు నీరసనిదాఘతప్తున కుపశమనోషధీ కుసుమములట. ఆమె మెడ, బాహువులు, కటిప్రదేశ మూరువులు, జంఘులు, పాదములు చుంబనసౌభాగ్యమునకై పరితపించు పరమకళాప్రదేశములట.

రాజేశ్వరుని కా బృందములో నొక స్నేహితుని భార్య సౌందర్యము అయస్కాంతమైనది. ఆమె రాజమహేంద్రవరములో నొకవకీలు భార్య. సుబ్బయ్యశాస్త్రి గారు నలుబదియేండ్లయీడువాడు. ఆయనకు ముప్పది రెండవ యేట రెండవ వివాహమైనది. వివాహమైన రెండు నెలలకు భార్య కాపురమునకు వచ్చినది. ఇప్పుడామె కిరువది రెండవయేడు. ఆమె పేరు వివాహము కాక పూర్వము పుల్లమ్మయైనను, సుబ్బయ్య శాస్త్రి, గారు పుష్పశీలయని నామకరణము జేసినారు. ఆ సుగాత్రి పుట్టిల్లు రాజమహేంద్రవరమే. ఆ విద్యావతి వీరేశలింగము పాఠశాలలో అయిదవ ఫారము చదువుచుండగా వివాహమైనది. అప్పటివర కామెతలిదండ్రు లామె కింకను ఈడు రాలేదనియే చెప్పుచుండిరి. వివాహమైనపిమ్మట బుష్పవతి యైనదని యుత్సవము జేసినారు. తక్కిన వేడుక లన్నియు జరిగి భర్తయింటి కా శోభనాంగి రెండు నెలలలో వెలుగువలె, సువాసనాలహరివలె ప్రత్యక్షమైనది.

పుష్పశీల పుష్పమే. ఆమెయందము నాగుబాము, చిరుతపులి, వజ్రముల యందమువంటిది. శిరోజములుంగరములై, దీర్ఘములై, నీలముకన్న నీలములై కటిభాగమున పచారుసేయును. వెడదలై, సోగలై పెద్దకనీనికలతో గాఢభావములొలుకు నాపె కన్నులు సమ్మోహనమంత్రములే. ఆమె సమనాసికాగ్ర మించుక పైకి తిరిగినట్లుండి వలపుదలపులు పట్టియిచ్చు చుండును. పూర్ణోష్టసుందరమగు నామెముఖ మించుక వెడదయై కాముకులకు నోరూరజేయుచుండును.

వనితాలోలుడగు సుబ్బయ్యశాస్త్రికి తిరుపతిరాయని స్వేచ్ఛాచారి సంఘమున బద్దుగైకొనుట తప్పనిసరియైనది. ఆ వనితా పుష్పవనములో బంభరుడు కాగోరినాడు. ఆత డందగాడు గాకపోయినను న్యాయస్థానమున పేర్వడిన యాతని వాదనాపటిమ కొందఱు యువతులమనసుల నాకర్షించినది.

స్వేచ్ఛాచారు లపుడప్డు సుబ్బయ్యశాస్త్రియింట నాతిధేయులగుట కలదు. కాని సుబ్బయ్యశాస్త్రి భార్యనుమాత్ర మా మూకకంట నెన్నడు బడనిచ్చినాడుకాడు. కావున నా సంఘ సభ్యురాండ్రగు వనితామణులు సుబ్బయ్య శాస్త్రిని ‘మీ పుష్పశీలకు గాలి వెలుతురు పడవు కాబోలు’ నని యెత్తిపొడిచెడివారు.

రాజేశ్వరుని మాటలును, మంచితనమును, మృదుస్వభావమును ఆతనిని సుబ్బయ్యశాస్త్రికి ప్రాణస్నేహితు నొనర్చెను. ఇంటిలో నించుక చనవు దొరకుటచే ఒకటి రెండుసారులు సుబ్బయ్య శాస్త్రి భార్య రాజేశ్వరరావుకంట బడినది. ‘పుర్దనాషీన్’ అగు పుష్పశీల ఏముహూర్త ఘటనాచమత్కృతినో యాతని కన్నులబడినది. పుల్లమ్మ గారు అద్భుత సౌందర్యవతియన్న ప్రతీతి మున్నాతడు విన్నాడు. కాని నేడు కన్నులలో తళుక్కుమని మాయమైన యా త్రిజగన్మోహినీమధురమూర్తియే ఆ పుల్లమ్మయని నమ్మజాలడయ్యెను. పుల్లమ్మ శరశ్చంద్రచంద్రికా ఖండము. తక్కు సుందరులెల్ల మిణుగురులు అతనిగుండె బ్యాండుస్వరము వాయించినది. తన భాగ్యదేవతాసాక్షాత్కార వృత్తాంతము నాతడు సుబ్బయ్య శాస్త్రి కెరుక పడనీక హృదయమున నిక్షేపించుకొన్నాడు.

సుబ్బయ్యశాస్త్రి గారియింట్లో వంటలక్క ముసలియామె. ఆయనతల్లి వేయికండ్లతో గోడలి ఘోషాను కాపాడుచుండును. ఆడవాళ్లుమాత్ర మామెను జూచుటకు బోవచ్చును. సుబ్బయ్యశాస్త్రి భార్యను బేరంటములకు పంపునపుడు గూడ ఘోషాను రక్షింపగల ‘సెడాను’ జాతి కారులో నంపును. మోటారు తోలువాడొక పెద్దకాలపు వీరాస్వామి. వీరాస్వామికి దన మోటారుబండి తప్ప నితరమేమియు గనపడదు. పుష్పశీల ప్రపంచము చూడవలెనను గాఢవాంఛగలది. తనయందము, తన నగలు, తన చదువు నితరులముందు, ముఖ్యముగా బురుషులముందు, మెఱపించుట కామె ముచ్చటపడుచుండును. కాబట్టి యత్తగారు గృహకృత్యము లొనరించుకొను నప్పుడు, మధ్యాహ్న భోజనానంతరము కునుకుదీయునప్పుడు, మేడమీదనుండి సమస్తాభరణభూషితురాలై యాకాశమునుండి తొంగిచూచు తిలోత్తమవలె ఇన్నీసుపేట వీధిలోనికి జూచుచు, ఆ దారి నేను పడుచువాండ్రకు ఎదురువచ్చు బండ్లరాకయు కాలము పోకయు దెలియనిచ్చెడిదికాదు.

ఎంతకాలమునుండియో ముదుకమేనితో బ్రాణములకు లకెవైచికొనియున్న సుబ్బయ్యశాస్త్రి తల్లి పుష్పశీల పుణ్యము పండియో, ఆపె ఘోష కొట్టియో యుండియుండి యొక్కనాడు ‘కృష్ణ కృష్ణా!’ యనుచు, నెవరికి దెలియకుండ, నే ముదుకలోకమునకో యెగిరిపోయినది. సుబ్బయ్యశాస్త్రి తన కుడిభుజము కూలిపోయినట్లు తన భార్యకు సాయముండువా రెవ్వరూ లేకుండిరని వాపోయెను. గూటిలో చిలుక కొదమవలెనున్న పుష్పశీల కొక్కసారి రెక్కలు విప్పుకొన్నట్లయినది. సుబ్బయ్యశాస్త్రికి గడియవైచిన తన యింటి తలుపులన్నియు విప్పుకొన్నట్లయినది. గంపంత యింటిని జూచుకొని, వయసులో నొంటరిగా నున్న తన భార్యను జూచుకొని, తన కోర్టుపని దలచుకొని సుబ్బయ్య శాస్త్రి, నిలువునా నీరైపోయినాడు.

పుష్పశీలకు భర్తపై గాఢనురక్తి లేకున్నను అసహ్యముమాత్రము లేదు. భర్తతో నీ యేడేండ్ల కాపురము లోకముతో పాటుగానే వెళ్లబుచ్చినది. నేడామెకు నెత్తిమీద బరువు దింపినట్లయినది. హృదయమునుండి కత్తిమొన పెరికివేసినట్లయినది. కళ్ల గంతలు విప్పినట్లయినది.

సుబ్బయ్య శాస్త్రికి భార్యయన్న వెఱ్ఱిమమకారము. ఇతర స్త్రీలపై నుబలాటము. ఇతర వనితల కెప్పుడు నాతడు మాటయిచ్చి తప్పినది లేదు. పుష్పశీల మాట కడుగుదాటినదియు లేదు. భార్య యాతనికి తుష్టి గూర్చు షడ్రసోపేత భోజనము. పరకాంత లాతనిచపలజిహ్వకు ఫలహారములు.

పుష్పశీల గర్భమింతవరకు ఫలించలేదు. ఆమె బ్రతుకున నిండియున్న కామపరిమళము పూర్ణముగా నింక నెవ్వరిని జుట్టుకొనలేదు. ఆమెతో యౌవన మాధుర్యము నరమూతకనులతో గ్రోలి చరితార్థ మొనరించు మధువ్రతుని కొఱకామె తపియించుచున్నది. తన మంజులాంగ సౌకుమార్యసరసతావిలాసముల నెమ్మేన పెనవేసుకొని మునుకలిడి, తెప్పదేల్చు పురుషవర్యు డామెకు బ్రత్యక్షము కాలేదు.

చెన్నపట్టణమునుండి వచ్చినప్పటినుండియు రాజేశ్వరునకు బుష్పశీలను జూడవలెనను వాంఛ వేయిమడుంగులైనది. అది యాతనికి దపస్సయినది. సుబ్బయ్యశాస్త్రి యింటి కాతడెన్ని సారులు వెళ్ళెనో! కాని యాతనికంటి కామె తళుక్కుమన లేదు. పుష్పశీలకు గావలియుండు బ్రహ్మరాక్షసి యిప్పుడు సుబ్బయ్య శాస్త్రి వేలువిడిచిన మేనత్త. ఒకనాడు సుబ్బయ్య శాస్త్రి మేనత్తకు జ్వరము వచ్చినది. ఆ యాదివారము నాటి సాయంసమయమున రాజేశ్వరుడు మిత్రునింటికి టీ వేళ కరుదెంచి తేనీరు గ్రోలుచుండ సుబ్బయ్య శాస్త్రి మేనత్తజ్వరముచే దనకు బెంగగా నున్నదని చెప్పినాడు. రాజేశ్వరు డదివిని తనదగ్గర నద్భుతమగు జ్వరనారాయణాస్త్రమువంటి పాశ్చాత్యౌషధ మొండు కలదనియు, నది రెండుమూడు మోతాదులతో గుదుర్చుననియు జెప్పి, తానెక్కి వచ్చిన సైకిలుమీద నతివేగమున నింటికరిగి యా మందు పట్టుకొనివచ్చి యిచ్చెను.

సుబ్బయ్య శాస్త్రి, చీకటిపడువరకు రాజేశ్వరు నచ్చటనే యుంచి మాట్లాడుచుండగ, లోననుండి పనిచేయుమనిషి వేగముగావచ్చి చెల్లమ్మ గారికి చెమటలు జడివానలా పోస్తున్నాయండి’ యని చెప్పెను.

స్నేహితు లిరువురు గుభాలున లేచి లోనికి బోయినారు. వారిరువు రచ్చటకు బోవునప్పటికి పుష్పశీలమ్మ యొక తెల్లని వస్త్రముచే నా రోగి ముఖము తుడుచుచుండెను. ఆమె తలయెత్తి రాజేశ్వరరావును జూచెను. రాజేశ్వరు డామెను జూచెను. చెల్లమ్మ గారికి జ్వరమును తగ్గెను.

అది మొదలుకొని పుష్పశీలాదేవి తప్ప ప్రపంచమున నేవస్తువు గోచరించుట లేదు. మనమున నింకొక భావము ప్రసరించుట లేదు. ఆతని జీవితసూత్ర మా బాలికారూపసంపదను బెనవేసుకొని పోయినది. భోజనము రుచించుట లేదు. నిద్రపట్టుట లేదు. గ్రంథములపై మనసుపోదు. టెన్నిసు మొదలగు నాటలాడ నిచ్ఛలేదు. స్నేహితుల సమావేశములు వెగటైపోయినవి.

రాజేశ్వరుని జూచినప్పటినుండియు, పిపాసార్థితునకు జల్లని మంచినీళ్లు కనులబడినట్లయినది పుష్పశీలకు. ఠీవియైన నడకతో, ఫ్రెంచిమీసముతో, పురుషత్వము వెలిగిపోవు రూపసంపదతో, రాజేశ్వరు డామెకు జయంతునివలె బొడగట్టినాడు. దూరదూరాననే నాగరికతాసముజ్వలులగు యువకులజూచి సంతసించు నాయోషారత్నమునకు రాజేశ్వరుడు అతిలోక సుందరుడై, ముంగిటి పెన్నిధానమై తోచెను.

ప్రోడయగు పుష్పశీల నాటినుండి రాజేశ్వరు డనేక మిషలతో దన యింటికి వచ్చినప్పుడు భర్తకు దెలియ రాకుండ దర్శన మొసగుచుండును. నర్మగర్భములగు చూపులతోడనే వారిరువురు నించుకించుక హృదయతాపోపశమన మొనర్చుకొనుచుండిరి.

భర్త కోర్టులో నొక గట్టి వ్యాజ్యములో మునిగియున్న రోజున రాజేశ్వరుని కేరీతినో చీటివచ్చినది. ముసలమ్మకు జ్వరము మరల వచ్చునట్లున్న దనియు దామిదివరకు ఇప్పించినమందు పట్టుకొని రావలసినది అనియు నా చీటి చెప్పినది. రాజేశ్వరుడు రెక్కలు గట్టుకొని యచ్చట వాలినాడు. కాని యతని తోడనే వచ్చినట్లు సుబ్బయ్యశాస్త్రియు నూడిపడినాడు. రాజేశ్వరుడు హృదయములో శాస్త్రిని నూరుహత్య లొనరించినాడు.

౨౦

వేదాంతి

రాజారావు త్వరలోనే చెన్నపట్టణము వెళ్లి కాలేజిలో జేరదలచినాడు. విక్టోరియా హాస్టలులో నుండుట కతని కాయేడు వీలులేదు. విశ్వవిద్యాలయము వారు నెలకొల్పిన వసతిగృహములో నాతడు విధిగా జేరవలసిన చ్చెను. ఆ యేటితో నాతని చదువుగూడ బూర్తియగును.

రాజారావు వైదిక సాంప్రదాయము సంపూర్ణముగ నెఱపు వెలనాటి బ్రాహ్మణుడు. చిన్నతనములో నాతనితండ్రి వసుదేవశాస్త్రి గారు సంధ్యావందనము, పురుషసూక్తము, శ్రీసూక్తము, నమకము, చమకము నాతనికి నేర్పినాడు. వేదములో కొన్ని సూక్తములు పఠింపించినాడు. కాని రాజారావున కా చదువు నచ్చమి దండ్రిగారితో జెప్పకయే మోడేకుఱ్ఱునుండి పారిపోయి కాకినాడ జేరుకొని, కొందరు సంపన్న గృహస్థులయింట వారములు కుదుర్చుకొని, దయాహృదయుడు, విజ్ఞానసముద్రుడు, భగవద్భక్తుడు, బ్రాహ్మమతాలంకారుడు, కళాశాలాధ్యక్షుడునగు శ్రీ వెంకటరత్నంనాయుడు గారి దయకు బాత్రుడై విద్యార్థి వేతనమును సముపార్జించుకొన్నాడు.

తనయు డెచ్చటికి బోయినదియు దెలియక యాతని తల్లిదండ్రులు బెంగగొనిపోయిరి. అతని తల్లి పేరమ్మగారికి మతిబోయి మూర్ఛజనించినది. పిమ్మట నెలదినములకు మూడవ ఫారములో తాను జేరినాననియు, బాగుగా జదువుకొనుచున్నాననియు, రాజారావు ఉత్తరము వ్రాసెను. దానితో తల్లిదండ్రు లిరువురు కాకినాడపోయి కుమారునిజూచి, కనుల నీరునింపుకొని, కుర్రవానిని వదిలి యుండలేక తాము సకుటుంబముగా వచ్చి కాకినాడలోనే వసింప నిశ్చయించుకొనిరి.

రాజారావంత అద్భుతమైన తెలివితేటలుగలవాడు కాడు. ఎట్టులో కష్టించి పరీక్షలలో గృతార్థుడగుటకు వలయు తెలివితేట లాతనికడ నున్నవి. కాబట్టి ఏపరీక్షయు దప్పకుండ నెగ్గుచుండెను. తుద కింటరుపరీక్షలో రెండవ తరగతిలో గృతార్థుడై మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము సముపార్జించెను. కాకినాడలో నాతని తండ్రి తన తెలివి తేటలచే కుటుంబవ్యయమునకు సరిపడ సంపాదించుకొనుచు, భూమివలన వచ్చు రాబడిని నిలువ వేసుకొనుచు, చిన్న చిన్న పద్దులమీద వడ్డీవ్యాపారము సలుపుకొనుచు కాలము బుచ్చినాడు. నేడు తన కొమరునకు మదరాసు వైద్యకళాశాలలో బ్రవేశము దొరకుట యాయనకు జాల సంతోషముగా నుండెను. రాజారావు స్కూలు ఫైనలు పరీక్ష చదువుచుండినప్పుడే మంచిసంబంధ మొకటి వచ్చినది. పెండ్లి వైభవముగ జరిగినది. రాజారా వింటరుపరీక్షకు బోవుటకు ముందే యాతనికి బునస్సంధానము జరిగినది. వైద్యవిద్యార్థియైన ప్రథమ సంవత్సరములో నే యుభయవంశపావనియగు కూతురు పెన్నిధివలె జనించెను.

రాజారావునకు నారాయణరావునకు చెన్నపట్టణములో స్నేహ మేర్పడినది. చిన్నతనములో రాజన్నశాస్త్రియగు నేటి రాజారావు సహజపాత్ర శీలుడు. పదిమందితో స్నేహము చేయలేడు. క్రొత్తవారితో మాటలాడలేడు. చిన్నతనమున కాకినాడలో పెద్దలతో నెట్లు మాట్లాడెనో యెట్లు వేతనము సంపాదించుకొనెనో, పెద్దవాడైన రాజారావునకు గ్రాహ్యము కాలేదు. నారాయణరావు సహజధీర స్వభావుడు గాన సభాకంప మెఱుగడు. రాజారావు పిరికివాడు. సభలో నోరెత్తలేడు.

అట్టి రాజారావును, నారాయణరావు కోమలవిలాస కాఫీహోటలులో జూచినప్పుడు పలుకరించెను. ఆనాటి నుండి స్నేహసముద్రుడైన నారాయణరావు రాజారావుగదికి వెళ్లుట ప్రారంభించియు, సినిమాలకు దీసికొని వెళ్ళియు, కాఫీహోటలులో దన స్నేహితులకు విందులిచ్చినప్పుడు రాజారావును గూడ లాగుకొని యేగియు, నాతని హృదయమును జూరగొని యించుకించుక బెదరుదీర్చినాడు.

రాజారావునకు దెలుగుకవితయందలి నేటి క్రొత్త పోకడలు రుచింపవు. స్వయ మాత డెద్దియు రచింపనేరడు గాని పురాణములు చదువుకొనుట యన బరమప్రీతి. వేదాంతగ్రంథములన్న ప్రాణమే. వివేకానంద, రామతీర్థులు, అరవిందఘోషు, జ్ఞానానంద ప్రేమానంద రాధాకృష్ణులు మొదలగు తత్వజ్ఞులు వ్రాసిన గ్రంథము లన్నియు బూర్తిగ జదివినాడు. చైతన్యుడు, రామకృష్ణ పరమహంస, హరనాథబాబా, రాధాస్వామి సత్సంగ గురువు మొదలగు వారి చరిత్రములు, బోధలు చదివినాడు.

నారాయణరావుగూడ వేదాంతవిచారమున నత్యంత ప్రీతి గలవాడు. అతడు మన పురాణేతిహాసములే గాక, వేదములు, బ్రహ్మసూత్రములు, గీత సాధు నిశ్చలదాస యోగీంద్రుని విచారసాగరము, వృత్తి ప్రభాకరముగూడ పఠించినాడు. యోగవాసిష్ఠము, జ్ఞానవాసిష్ఠము, సీతారామాంజనేయ సంవాదము, అధ్యాత్మ రామాయణము, ఉపనిషత్తులు, శంకర భాష్యము, పంచదశి మున్నగు తత్వవిచారగ్రంథముల సారమెఱింగిన వాడు. మధ్వరామానుజమతముల పరిచయము సంపాదించినాడు. బుద్ధపీఠకములు, జాతక కథలు, ధర్మపథము పరికించినాడు. జెండవిష్ణా, ఖురాను, బైబిలు, జైన సాంప్రదాయములు నవగతము చేసికొన్నాడు. కారలుమార్క్సు, నీషీ, షోపన్ హోరు, బెర్కిలీ, ఎమరుసన్ , బేకను, హాల్డేను, ఎడ్వర్డు కార్పెంటరు, టాల్ స్టాయి, రోలండు, బెర్నార్డు షా, ఎయిన్ స్టీన్, ఎడింగ్టన్, ఫ్లాటో, అరిస్టాటిల్ మొదలగు పాశ్చాత్యవేత్తల భావములు హృదయస్థము చేసికొనెను.

నారాయణరావు రాజారావుతో నెల్లప్పుడు వేదాంత విషయముల జర్చ చేయుచు నానందమునొందును. రాజారావు తన జన్మమున నా నిమేషములే శుభ ముహూర్తములని తలచి నారాయణుని రాక కెదురుచూచుచుండును.

‘మన ఆర్షవిజ్ఞానంముందు డార్విన్ సిద్ధాంతాలు బాలశిక్ష వంటివోయి! ఆతని పరిణామవాదం కేవలం భౌతికం. వినికీ, చూపుకూడా లేని కీటకాలుండేవట ఆదిలో. పిమ్మట దృష్టి శ్రవణాది జ్ఞానంగల సరీసృపాలు ఏర్పడినవట. ఆపైన పాలిచ్చే జంతువులేర్పడి, క్రమంగా కొంచెం మెదడు సంపాదించుకొని కోతులై, చివరకు మనుష్యులుగా పరిణమించినవట. జంతుకోటిలో యీ మెట్లన్నీ కనబడుతూనే వున్నాయట. ఈమాత్రం కనిపెట్టినందుకు డార్విన్ వాళ్ళకొక ఋషి అయిపోయినాడు’ అని రాజారావు.

‘నిజమే. కాని, అనంతంగా కనబడే యీ సృష్టిలో ఒక క్రమవిధానాన్నీ, వికాసాన్నీ, పరిణామధర్మాన్నీ దర్శించి చెప్పగలగడం కూడా సామాన్య విషయం కాదు. పురాణాల్లో చెప్పబడ్డ సర్గ విధానాన్ని విచారణ చేసి, అంతరార్ధం గ్రహించకుండా గుడ్డిగా ఆ ముసలమ్మ కథలనే నమ్మడంకన్న, ఆ కథల్నీ కార్యకారణ సమన్వయాలతో ప్రమాణీకరించడం మంచిదంటావా, అనవా? అతీంద్రియజ్ఞానంగల మన ఋషులు చెప్పిన గంభీర సత్యాలకు, వాళ్లు పరిశోధనాపూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణాలతో వ్యాఖ్యానం చేస్తున్నారు’ అని నారాయణ రావు.

రాజా: కావచ్చును. కాని కేవల ప్రత్యక్ష ప్రమాణం ఎంత వరకు ఉపయోగిస్తుందంటావు?

నారా: అలాకాదు. వాళ్ళు కూడా ప్రత్యక్షం నుంచి అనుమానాన్నీ సాధిస్తున్నారు గాని ప్రత్యక్షంతో ఆగిపోవడం లేదుగదా.

రాజా: నిజమే. ప్రకృతివిషయం ఇంద్రియ గ్రాహ్యం, బుద్ధిగ్రాహ్యమూ గనక, ఆ రహస్యం సాధిస్తారనుకో. బుద్ధి కూడా మొదటి మెట్టులోనే వుంటుంది గాని పైకి దాటిపోలేదు. బుద్ధికిగూడా గ్రాహ్యంకాని ఆత్మానుభవైక వేద్యమైన పరతత్వం మాట ఏమంటావు?

నారా: ప్రత్యక్షనుమానాలని కూడా గ్రహించని అంధవిశ్వాసం, శుష్క తర్కమూకంటె వాళ్ళబుద్ధివ్యవసాయం ఉత్తమమంటాను. వాళ్లు నిరంతర పరిశోధనవల్ల ఆటం అనే మూలపదార్థాన్ని పట్టుకొన్నారు. ఇంకా లోతుకుపోయి ఆటంకూడా ఎలెక్ట్రాన్ల సంఘాతమని గ్రహించారు. అయితే నువ్వనేది, ఈ యెలక్ట్రాన్లు కూడా అనిత్యపదార్థాలే కాని నిత్యాలు కావుగదా. ఈ అనిత్యాలను పట్టుకొని ఎన్నాళ్ళు ప్రాకులాడినా నిత్యమైన సత్యపదార్థాన్ని చేరలేదంటావు. సరే; బుద్ధిమార్గాన పోగలిగినంతదూరం పోయినతర్వాత అక్కడ దారిదొరక్కపోతే ఇదికాదురా అని వాళ్ళూ మనదారికే వస్తారు. పరమాత్మసాధనలో వాళ్లు ప్రతిదినమూ అనుభవసిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఇది బుద్ధిగ్రాహ్యం కాదురా అని తెలుసుకొని, దూరదూరాన అఖండజ్యోతిని దర్శిస్తున్నారు. అప్పుడే ఎయిన్‌స్టీన్, ఎడింగ్టను వంటి సాధకులు బయలుదేరారు. పూర్వం మనవాళ్లెప్పుడో ఆ నిత్యపదార్థాన్ని యోగసాధనల చేత చేరారు. ఇప్పుడా మార్గాలన్నీ చీకటితోనిండి దుర్భేద్యాలుగా వున్నాయి. పాశ్చాత్య సాధకులు తిరిగి విజ్ఞానదీపం వెలిగించి ఆదారి కోసం వెదుకుతున్నారు. వాళ్లు సంపాదించిన విజ్ఞానమార్గంలో దానికి రాచబాట వేస్తున్నారు. అంతేకాని మావాళ్ళకు ఇవన్నీ పూర్వమే తెలుసునంటూ మనం చంకలు కొట్టుకుంటూ కూచుంటే మనం యిక్కడేవుంటాం. వాళ్లు పురుషకారపరులు, మనం పండితమ్మన్యత్వం చేత తమస్సులో పడివున్నాము.’

ఇట్టి చర్చలు తరచు జరుగుచు, రాజారావు నారాయణరావుల మైత్రికి దోహదము సల్పుచుండెడివి.

రాజారావు ప్రపంచములో దిరుగనేర్చినవాడుకాడు. మిత్రులతో గలసి మెలసి తిరుగక వేఱుగా నుండును. సహాధ్యాయినులగు యువతులను మోమెత్తి చూడడు. జుట్టు కట్టు మున్నగు వేష భాషలలో నాతడు శుద్ధ శ్రోత్రియుడు. వేషధారులగు తోడి నాగరిక విద్యార్థు లాతని గాంచి పల్లెటూరి సరుకనియు, ఛాందసుడనియు లోలోన నవ్వుకొనుచున్నను, సహాధ్యాయినులాతని వింతమృగమువలె జూచుచున్నను, రాజారా వా పెదవి విరుపులను, అవహేళనములను సరకుగొనక సంచరించెడివాడు.

అతనితో గాఢపరిచయమున్న కతిపయమిత్రులుమాత్ర మాతని సరళహృదయము, వినయశీలము, మధుర స్వభావము, గార్యదీక్షయు నెఱింగి యాతని నెంతయు ప్రీతిమై మన్నించుచుందురు.


౨౧ ( 21 )

నౌకావిహారము

నారాయణరా వత్తవారింట మనుగుడుపులు గుడుచు మూడవరోజున నాతని యుత్తరముల ప్రకారము రాజారావు, పరమేశ్వరమూర్తి, లక్ష్మీపతి వచ్చినారు. జమీందారుగారు, నాడు తాను రైలులో చూచిన మిత్రులందరినీ యల్లునితోబాటు మనుగుడుపులన్నినాళ్లు తనయింట విందులకు రండని ఆదరపూర్వకముగ నాహ్వానించెను. ఆ విధమున నల్లునిచేగూడ వారికి వ్రాయించెను.

ఆ రోజంతయు రాజేశ్వరరావుగూడ వారితోగడిపెను. చిత్రలేఖనవిద్య పూర్తిగావించి నిరుద్యోగియై కాలముగడపు పరమేశ్వరమూర్తి తనకు గురువగు అవనీంద్రుడు పంపిన యుత్తరము స్నేహితులకు జూపించెను. ‘పొట్టకై ఎవరికో మమ్ముకొని కళారాధన మొనర్పనెంచిన వారికి కళాసరస్వతి సాక్షాత్కరింపదు. కళాధిదేవతనే నమ్ముకొన్నచో పొట్టగడవకపోదు. నీ కష్టమంతయు కళకే ధారబోసిననాడే నీవు కళాప్రతిష్టలతో పేరుగాంతువు. ఉద్యోగము లేకపోయెనని చింతింపకుము. నీవు అదృష్టవంతుడవు. కావుననే యీ విధముగా నీకు గళారాధనకు గావలసినంత సావకాశము లభించినది. కళాస్రష్టవగుట కిదియే సమయము. కళారాధకుడవై లోకారాధ్యత గడించుకొనుము.

‘నీకు సహాయ మొనరించుపట్ల నే నేమాత్రము శక్తివంచన చేయనని యెఱుగుదువు, ఒక్కసారి దేశసంచారము చేసి ప్రకృతిలోని బాహ్యాభ్యంతర సౌందర్యముల దిలకించిరమ్ము. ప్రకృతికంటె మంచి గురువు నీకెచ్చటను లభింపదు. విశ్వస్రష్ట కళానైపుణితో మానవ కళావిలాసము పోల్చి చూచుకొనుము. అంతియే కాని విషాదయోగము పాల్పడకుము. ధీరుడవుకమ్ము. నీవు నా దగ్గర దిగవిడిచి వెళ్ళిన చిత్రములు రెంటిని నా స్నేహితులు చూచి సంతోషించి, కొనిపోయినారు. వారు సొమ్మిచ్చిన వెంటనే నీకు పంపుదును.’

ఈ యుత్తరము నారాయణరావుచూచి యాలోచనా నిమగ్నుడయ్యెను. ఆంధ్రదేశమునం దే లలితకళయు వృద్ధియగు నుపపత్తులు కానరావు. ఏనాడు చక్రవర్తులు, మహారాజులు కాలగతులై మాయమైరో యానాటితో నాంధ్రదేశ సౌభాగ్యము మన్నయినది యని యాతడనుకొనెను.

రాజే: ఒరే పరం! ఏదో స్నేహితుడవు. వేస్తున్నావు. నువ్వు చెప్పిన ముక్కల్లా సరేనని ఊరుకున్నాము. నా కెపుడు తిన్నగా అర్థం అవలేదు. ఏమిట్రా మీ బొమ్మలవిషయం? ఆ వంకరటింకర మనుష్యులేమిటి, ఆ విపరీతపు రంగులేమిటి? ఏమిటీ బెంగాలు సాంప్రదాయం?

పరం: అయితే చిత్రలేఖన ఎల్లా ఉండాలంటావు?

రాజే: ప్రకృతి ననుసరించి ఉండనక్కరలేదట్రా?

నారా: అంటే నీ ఉద్దేశం ఏదో విపులంగా చెప్పరా?

రాజే: రవివర్మ బొమ్మలు తీసుకో, వాటిల్లో మనుష్యులు మన మనుష్యుల్లా ఉన్నారు.

లక్ష్మీపతి: కళ సృష్టే కాని అనుకరణంకాదు, అని కాదూ మీ యిద్దరూ అనేది నారాయణా?

నారా: అవును బావా. రవివర్మ మహావిష్ణువుకు శివుడికి నాలుగు చేతులు వున్నట్లు చిత్రించాడుగదా, అల్లా ప్రకృతిలో ఉన్నాయా? లేవు. మఱి ఎందుకు వేశాడు? పోనీ పాశ్చాత్య చిత్రలేఖకుణ్ణి తీసుకో. రాఫెలు రెక్కలతో ఎగిరివచ్చే దేవమూర్తుల్ని చిత్రించాడు. మనుష్యులకు ఎక్కడైనా రెక్కలుంటాయా? పరం: రవివర్మ వేసిన కృష్ణుడు, చెట్లు, రాళ్ళు, యమునానదీ నిజంగా సృష్టికి అనుకరణాలు కావు.

రాజే: ఆయన ఊహ చేశాడు.

లక్ష్మీ: ఓరి వెర్రివాడా! అదేరా సృష్టి!

రాజే: మఱికొందరు చిత్రకారులు దృశ్యచిత్రాలంటూ, ఏ పాపికొండలో, గోదావరో, కృష్ణానదో చూచి అదేరకంగా వేస్తారుగదా అని సృష్టా, అనుకరణమా?

పరం: అవి ఏవీ కావు రా.

నారా: ఎందుకంటే, ఒకడు గోదావరి మధ్యకు వెళ్ళి చూస్తే ఎటు చూచినా నీరే కనబడుతుంది. అందుకని ఆ నీరే పటంనిండా చిత్రిస్తాడు. అది గోదావరవుతుందా? అలాగే ఒక పర్వత పాదాన ఎదురుగా నిలుచుండి తన కళ్లయెదుటనున్న ఆ రాతిగోడనే చిత్రిస్తే పర్వతమవుతుందా? కాదు. కాబట్టి దృశ్యచిత్రాల్లో కూడా దేశ కాల పాత్రల్ని వర్ణించాలి.

రాజే: సరే. బొమ్మ వేయాలంటే ఏం జేస్తాడురా చిత్ర కారుడు?

నారా: ఏ చిత్రంలోనైనా ప్రధానంగా భావపూర్ణత ఉండాలి.

పరం: ఆ భావం రమణీయంగా ఉండాలి.

లక్ష్మీ: అందుకనేగా ‘సౌందర్య మే ఆనందము’ అని గానం చేశాడు కీట్సు?

రాజారావు: లక్ష్మీపతీ! ఉండు. వాళ్ళిద్దరూ ఏదో చెప్తున్నారు, ఒక మోస్తరుగా ఇంతవరకూ వాళ్ల వాదన శాస్త్రపద్ధతిగానే ఉంది.

రాజే: నీకు ఎన్ని చెప్పినా, మన బ్రతుకు వేళాకోళం కాదోయి బాబూ అంటే, ఏమి తెలియ దేమిటి నాయనా!

లక్ష్మీ: నేను వేళాకోళంగా బతుకుని చూస్తున్నానురా రాజేశ్వరుడా! చాలా తీక్ష్ణంగానూ తీవ్రంగానున్నూ చూస్తున్నాను. కాని ఆ బ్రతుకెక్కడా నాకు కనపడదు.

రాజే: నువ్వుకూడా మా సంఘంలో చేరరా మరి.

నారా: మీ సంఘం, ఒక బౌద్ధ సంఘారామంవంటిదిరా మరి. భిక్కులు, భిక్కిణీలు, జీవితం ఆనందం బాగుందోయి.

రాజే : అసలు నేనడిగిన విషయానికి మీరిద్దరూ జవాబియ్యలేదేవిటిరా?

పరం: కళ మనుష్యసృష్టి అనేగా ఇంగ్లీషులో అర్థం?

నారా: అవును. ఇంతలో జమిందారుగా రా ప్రదేశమునకు వచ్చి నారు. ఆయన స్నేహితులందరిని తన చిన్న లాంచిలో గౌతమీ విహారమునకు దీసికొని వెళ్లినారు. ఆంధ్రులకు బ్రత్యేకరాష్ట్ర మావశ్యకమా కాదా యను చర్చ వచ్చినది. రాజేశ్వరరావు, లక్ష్మీపతియు నాంధ్రదేశమునకు బ్రత్యేకరాష్ట్ర మావశ్యకమని వాక్రుచ్చి నారు. రాజారావామోదించినాడు.

నారా: దేశమునకంతా స్వరాజ్యం తెచ్చే ప్రయత్నాలుమాని, ఆంధ్రరాష్ట్రంమాత్రం తెచ్చే ప్రయత్నం నేను ఆమోదించను. ఎందుకంటారా, యావద్దేశ బంధమోక్షానికి పొటుపడవలసిన ఉత్కృష్టవ్యక్తులకు ఆంధ్రసమస్య సైంధవుడులాగ అడ్డు అవుతుంది. దేశపరిపాలన చేతికివచ్చినతరువాత మీ చిత్తము వచ్చినట్లు భాషనుబట్టో మరొక దాన్ని బట్టో రాష్ట్రవిభజన చేయడం సులభం. అనవసరపు ఖర్చులతో నెత్తి బరువెక్కిన యీ రోజులలో రాష్ట్ర విభజన చేస్తే ఖర్చుకు డబ్బుండక భాగింపబడ్డ రాష్ట్రాలన్నీ దివాళా రాష్ట్రాలయితే ఏమిలాభం?

జమిందారు గారు: స్వరాజ్యము అంటే నీ ఉద్దేశం సంపూర్ణ స్వాతంత్య్రమనేనా?

నారా: ఏదైనా సరేనండి. సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినాసరే, లేదా, ఆస్ట్రేలియా కెనడాలవలె డొమినియను ప్రభుత్వం వచ్చినాసరే. ఏదివచ్చినా ఆదాయవ్యయాలు సంపూర్ణంగా మన చేతుల్లోకివస్తే రాష్ట్ర జనలు మనకు సులువుగా అవుతవని ఉద్దేశం.

జమీ: కాని ఈ లోపుగా మనవాళ్లకి జరిగే అపరిమితమైన నష్టం సంగతి ఆలోచించు. అరవవాళ్ళవే గొప్ప ఉద్యోగాలన్నీ. అరవ దేశంకోసం డబ్బు ఖర్చయినంత తెలుగు దేశ లాభానికి ఖర్చగుట లేదు.

నారా: కాని రామారాయణం గారు మొదలగు తెలుగువారే మంత్రిత్వాలు నడుపుతున్నారు. నెమ్మది నెమ్మదిగా పెద్ద ఉద్యోగాలలోకూడా మన వాళ్ళు చేరుతున్నారు. ఒక పదిసంవత్సరాల పాటు మనం తొందరపడ కుండా స్వతంత్ర సంపాదన దీక్ష వహిస్తే, స్వతంత్రంతో అన్ని చిక్కులు మంచువిడిపోయినట్లు విడిపోతాయని నా ఉద్దేశం అండి.

జమీం: నే ననేది మన దేశానికి ప్రస్తుతం సంపూర్ణ స్వాతంత్య్రము రాదని; వచ్చినా మనకు చాలా నష్టం. సంపూర్ణ స్వాతంత్య్రము రాకుండా డొమినియను ప్రభుత్వం వచ్చేటట్లయితే మనం రాష్ట్ర విభజనకోసంచేసే ప్రయత్నాలన్నీ డొమినియను ప్రభుత్వం వచ్చేందుకు ప్రయత్నాలవుతవి. పైగా కాంగ్రెసు తరఫున గాంధీగారి ననుసరించి పని చేసేవాళ్లు ఏ కారణం వల్లను ఇతర వెఱ్ఱులలో పడరు. వాళ్లమార్గం రాజమార్గమే. ఇక నాబోటి వాళ్లా, మాకు గోఖ్లేగారి మార్గమే. మీ పద్ధతులు మాకు నచ్చవు. నచ్చక ఇక ఏమి చేయము? ఈ పనులు మేము చేస్తాము. నారా: చిత్తం.

లక్ష్మీ: మావాడు మనకు ఆంధ్రరాష్ట్రం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర హైకోర్టు అన్నీ కావాలనే రకమేనండి. ఆంధ్రప్రతిభ, ఆంధ్ర పౌరుషము, ఆంధ్రవిజ్ఞానము తలుచుకు తలుచుకు పరవశుడౌతాడు. నేడు ఆంధ్రదేశ దురదృష్టం వల్ల ఆంధ్రులెవ్వరూ ఏ విషయంలోనూ ఆంధ్రదేశంలో ఉన్నంత కాలం పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడంలేదని విచారిస్తాడు.

పరం: ఆ! ఆంధ్రదేశానికి కుజుడో శనో రాజ్యం చేస్తూ ఉన్నాడు, లేకపోతే, పూర్వకాలంలో కోటీశ్వరులున్న దేశంలో నేడు పదిలక్షలున్న సాహుకార్లరుదు. మహారాజులు కవితాపోషకులై కృతులు గొన్న కాలం పోయి కవిత్వం పేరు చెప్పితే నిరసించే దిక్కుమాలిన కాలం వచ్చింది. అమరావతిలో నాగార్జున మెట్టలో, ఒరంగల్లులో, హంపిలో, మహాబలేశ్వరంలో విరిసిపోయిన శిల్పం నేడు నామమాత్రావశిష్టం అయింది. ఇంక ఎవరికైనా పేరొచ్చింది అంటే దేశం విడిచి వెళ్లారుగనుక. విశ్వదాత నాగేశ్వరరావు గారు, ఆచార్య రాధాకృష్ణ గారు, నాగపురంలో లక్ష్మీ నారాయణ గారు, నియోగి గారు, చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి గారు దేశాలు విడిచి వెళ్లి మహోన్నత పదవులకు వెళ్లారు. బొంబాయి కామాఠీలని, రంగూనులో గౌడ రెడ్లనీ, నాగపురంలో నాయుళ్లనీ ప్రఖ్యాతిగన్న వారంతా యిలా తెలుగుగడ్డ విడిచి వెళ్లిన వారే.

రాజేశ్వర రావు: జిడ్డు కృష్ణమూర్తి గారో?

పరం: అవును. ప్రపంచవిఖ్యాతిగన్న మహాజ్ఞాని.

రాజే: తర్వాత వారిలో పండిత వంగల శివరాము, పున్నయ్య గారు. ఇంకా ముఖ్యులు ఇంజనీరు విశ్వేశ్వరయ్య, దివాను నాగుమయ్య . పరం: అదేనండి ! చిన్న చిన్న వాళ్లై కూడా దేశం విడిచిపోతే మన ఆంధ్రులు బయటికి వస్తారండి. దామెర్ల రామారావును చూడండీ!

లక్ష్మీపతి: ఆంధ్రదేశం వదిలితే అరవగ్రహ బాధ వదిలి పైకి వస్తారోయి పరమేశ్వరం.

జమీం: పరమేశ్వరమూర్తి గారూ! మీరు చెప్పినదానిలో సత్యం ఉన్నట్లే తోస్తున్నది. కారణం మీరు చెప్పింది కాకపోవచ్చును. యశం సంపాదించుకోవాలంటే మనం మన దేశమేకాదు మద్రాసు రాష్ట్రం విడిచిపోవాలండీ! అయితే పరమేశ్వరమూర్తి గారు! మీరు కలకత్తాలో ఎన్నాళ్లు అవనీంద్రుని దగ్గిర చిత్ర లేఖన నేర్చుకున్నారు?

పరమేశ్వర: బి. ఏ. కలకత్తాలో చదవడానికి వెళ్లాను. పాలీ, సంస్కృతం పుచ్చుకొని ఆర్కియాలజీ శాఖలో చేరుదామని ఉద్దేశం. అప్పటికి నాకు ఇష్టమైనది రామారావు గారి సంప్రదాయమే. నేను ఇంటరు తరగతిలో చదివిన రెండేళ్లు ఆయన దగ్గర చిత్ర లేఖనం నేర్చుకున్నాను. నా బొమ్మలు రెండు బొంబాయిలోను, ఒకటి చెన్నపట్టణంలోను అమ్ముడైనాయండి. తర్వాత కలకత్తా వెళ్ళి, బి. ఏ. చదువుతూ, అవనీంద్రబాబు పాదాలకడ చిత్రలేఖనానికి దీక్ష వహించాను.

లక్ష్మీ: అప్పుడు వేసిన కొన్ని చిత్రలేఖనాలకు ఇంగ్లండు, వెంబ్లీలో కూడా ప్రఖ్యాతి వచ్చిందండి మా పరమేశ్వరునికి. ఆస్ట్రేలియాకు వెళ్ళినది ఒక బొమ్మ. ఆ రోజుల్లో పరమేశ్వరుని బొమ్మలెన్నో కలకత్తా ప్రదర్శనములో అమ్ముడయ్యాయి.

జమీం: మీ రిప్పుడు వేసిన బొమ్మ లేవేనాఉంటే నాకో బొమ్మ ఖరీదు వేసి పంపించండి. ఖరీదుకు వెరవకుండా మంచి పెద్దరకమే పంపండి. మరీ చిన్న రకము పంపకండి. నా గ్రంథాలయం గదిలో కొన్ని బొమ్మలుకొని పెట్టవలెనని వున్నది. నారాయణరావూ, మీరూ ఆలోచించి పంపించండి.

రాజే: నారాయణ రావు పరమేశ్వరుని బొమ్మలు నాలుగు కొన్నాడు. అతనికడ గొప్ప చిత్రాలు ఉత్తమ చిత్రకారులవి యిరవై ఉన్నాయండి.

ఇంతలో కూడవచ్చిన గుమాస్తా ‘బాబు గారు! ఏడుగంటలయింది, పడవ తిప్పమని సెలవా?’ అని వినయముగా జమీందారు గారి నడిగెను. రాజేశ్వర రావు ‘ఓహో యీగాలి! గోదావరి సముద్రంలో ఉన్నదే కెరటాలతో, అని పాదములు నీటిలోనికి వ్రేలవైచేను.

౨౨

గౌతమి

“శీతే సుఖోష్ణ సర్వాంగీ, గ్రీష్మేతు సుఖశీతలా, భర్తృయుక్తాచయా నారీసా భవేద్వదవర్ణినీ.” నిజముగ నీ గౌతమీ స్రవంతి వరవర్షినియె. గౌతమి మాతవలె, సోదరివలె, ప్రియభామినివలె తనకు జల్లనై, స్నిగ్ధమై, అనురక్తయై తోచుచుండు టేలనో! ఆ నిర్మలవినీలనీరములలో నురికి, దేహమెల్ల నామె గౌగిలింప దన హృదయమూలములకు నామె ప్రేమ చొచ్చుకొనిపోవ, నీటి లోని మత్స్యమై యా నీలజలములోనికణమై యైక్యమైపోయి తేలియాడుచు, మునుగుచు, బాహువులు సారించి యీదుచు, నీ గౌతమి బాలికతో నాతడాడుకొన్నాడు. ఆమె కెరటాలతో పందెము వేచినాడు. లోతులలో మునిగి కన్నులు తెరచి, సూర్యకిరణములు చొచ్చుటచే గరుడపచ్చలయిన యాగాంభీర్యమున విస్తుపోయినాడు. ఆమె హృదయమున దన సర్వాంగ చైతన్యము నుపసంహరించి తరుశాఖవలె తేలినాడు. ఉబికిపోవు నామె వక్షములతో ఎన్ని సారులో చంటిపిల్లవానివలె నాడుకొన్నాడు. గౌతమిదేవిలోని యనిర్వచనీయమగు నానందము తన యంత రాయముల జొరబాఱ నామెలో లీనమైనాడు. నారాయణరా వీ యాలోచనతో గన్ను లరమూతలైపోవ నానంద మయుడైనాడు. వారి లాంచి కొవ్వూరు లంకకడ నాగినది. వారందరు లంకలోదిగి, యీ యిసుక తిన్నెలలో నధివసించి మంతనములు సలుపుకొనుచుండిరి. నారాయణరావు గౌతమీ సమాహూతుడై బిరబిర లాల్చీవిప్పి, యద్ధానిని, యుత్తరీయమును సేవకున కందిచ్చి, కట్టినవస్త్రము వెనుకకు విరిచికట్టి నీటిలోనికి బరుగిడినాడు. ‘లోతులుండును, జాగ్రత్త సుమీ’ యని జమీందారు గారు హెచ్చరింప, స్నేహితులందఱు ‘నారాయణ రావు గజయీత గా’ డని ధైర్యము చెప్పి తాముగూడ నీటిలోనికి దిగిరి. ఒక్క రాజారావునకు మాత్రము ఈత రాదు. ఆత డొడ్డుననే చంటిపిల్లనివలె నీటిలో చేతులు తట్టుచు వినోదించుచుండెను.

గౌతమీమాత కింకను వరదలు రాలేదు. నిర్మల వినీలజలములతో నామె యొక మహాసరస్సువలె నున్నది. గోపీచందనపు బూతల వలె నిసుక తిప్ప లచ్చ టచ్చట తలలెత్తికొనియున్నవి. దూరాన పాపికొండలు స్పష్ట నీలలోహితములగు తమ శిఖరముల నా సంధ్యారుణరాగార్ద్ర గగనము లోనికి జొనిపి యానందించుచున్నవి. పశ్చిమమున లోహిత హరిద్రావర్ణ వికాసమై, మధ్య కర్బురరాగపూరితమై, దిశాంచలముల నవ్యక్తారుణచ్ఛవీ సుందరమై యాకాశము హృదయమును ద్రవింప జేయుచున్నది. కెరటముల హోరు షడ్జమమై, వాయు ప్రసారము రిషభమై, పక్షుల కలకలారావములు పంచమమైపోవ బ్రకృతిమాత మధుర సంగీతమున జొక్కుచున్నది.

పరమేశ్వరమూర్తి నెమ్మదిగా తేలియాడుకొనుచు రాజారావుకడకువచ్చి, ‘ఓ ముగ్ధ బాలుడా! చూడవోయి యీ ప్రకృతి అందం! నీలో నిద్రాణమైయున్న కవితాశక్తి మేల్కొలుపవోయి! అందులో కరిగి మరిగి లీనమై పోవోయి! నారాయుడు అడుగో శివమెత్తి ఆడుతున్నాడు. వేయితీపులు నాలో ఒక్కసారిగా తలలెత్తుతున్నాయోయి’ అనుచు హృదయము వొలుకవోసికొనియెను.

జమీందారుగారి చూపులన్నియు నీటిలోనుంచివచ్చు సుందరమంజుశ్రీమూర్తియగు నల్లునిమీదనే యున్నవి. విశాలాంసలుడై విపులవక్షుడై గోమూర్ధకటి సుందరుడై, అల్పమధ్యముడై, గంభీర వదనుడై, ఉన్నతశరీరుడై జలక్లిన్న ప్రకాశోజ్వల హరిద్రరోహితవర్ణుడై, నీటి చుక్కలు ముత్యములవలె రాలుచుండ గట్టునకువచ్చి తడియార్పుకొనుచుండిన యల్లుని చూచిన యాయన కన్నులు చెమర్చినవి. ఈ బాలకు డవతారమూర్తియని యుబ్బిపోయినాడు. యమునాతీరము, బృందావనము, శ్యామసుందరుడు నాయన మనోవీధి దళుక్కున మెఱసి గోపికాభావ మాయన నావహించినట్లయినది.

రాత్రి యెనిమిది గంటలకు వారంద రింటికి జేరినారు.

వారు గృహమధ్యశాలకు వచ్చునప్పటికి, అచ్చటి సోఫాలపై జగన్మో హనరావును శారదయు దగ్గరగా గూర్చుండి మాట్లాడుకొనుచుండిరి. శారద కిలకిల నవ్వుచుండెను. జగన్మోహనరావు మోము దరహాస ప్రఫుల్లమైయున్నది. వీరు లోన నడుగిడగనే శారద త్వరితముగ లేచి లోనికి జివ్వున పారిపోయినది. జగన్మోహనరావు మోమున గ్రోధచ్ఛాయ లించుక పొలసి తొలగిపోయినవి. శారద లేచిపోవుట ముందువచ్చిన జమీందారుగారికి నారాయణరావుకు మాత్రమే కనబడెను. జమీందారు గారి హృదయమునం దొకవిధమగు జుగుప్స జనించెను. మెరుపువలె మెరసి మాయమయిన శారదా బాలిక నారాయణరావు గుండియలో బాటపాడినది.

శారదపై నారాయణరాయని ప్రేమ నానాటికి గట్టలొరసి యఖండ గౌతమివలె పొరలిపోవుచున్నది. అత డందు మునకలిడుచు దేలియాడుచున్నాడు. వెడదలై, అర్థనిమీలితములగు శారదానయనము లాతని గలంచి వైచుచున్నవి. ఇతని ఇరువది రెండేండ్ల వయసు ముమ్మరము సలసల వెరలియాడుచున్నది.

వయసులోనున్న స్త్రీ, పురుషుల కొండొరులపై జనించు నీ వలపున కర్థమేమో? చిన్నతనమున నొకచో బెరిగి యాటలాడుకొను బాలికా బాలకులకు మాత్రము ప్రేమలేదా? అవ్యక్తమధురము, సరళము నగు నా ప్రేమకూడ వియోగమును సహింపదు. ఆ బాలికా బాలకు లిర్వురు నెపుడు గలసియుండగోరుదురు. ఒండొరులు భుజములపై చేతులిడుకొని తిరుగుచుందురు. ఆ యాట పాటలందే, ఒకరినొకరు ‘ఏమోయి’ యని నోరార బిలుచుకొనుటయందే వారికి దృప్తి. వారికి బరస్పర సౌందర్యముతో బనిలేదు. వారిరువురకు యౌవనోదయ మగుటతోడనే ఆ స్నేహము వలపుగా బరిణమించుటేలనో ? వారి పల్కులు, చూపులు, చేతలుగూడ నూత్నవికారమును బొంది క్రొత్తతలపులు రేకెత్తించు టేలనో ? అట్టి చిన్ననాటి మిత్రుల యౌవన మొండొరుల యందు వివాహముచే జరితార్థము కానినాడు వారి జీవితములు దుఃఖభాజనము లైపోవుట వినుచుందుము.

అవ్యాజమధురమగు నా చిననాటి స్వచ్ఛ ప్రేమమే తారుణ్యోదయమున కామావతార మెత్తనేల? ప్రాణిధర్మమగు నీ కామమునకుదోడు సౌందర్య లాలస యేటికో? అట్లని సుందరియగు ప్రతియువతిని ప్రతిపురుషుడును కామించునా? రతీచ్ఛవినా దేహసంశ్లేష మాత్రమున దృప్తిచెందు కామముండునా? తా నింతకుము న్నెందరు సౌందర్యవతులను గాంచియుండలేదు? అట్టి వారెల్ల తన హృదయమును జూరగొనరై రేల? ప్రథమదర్శనమాత్రముననే శారదపై దనకు జనించినది ప్రేమమా, కామమా? అపరిచితయు, నజ్ఞాతయౌవనయు నగు నీ శారద తనకు భార్యయైనంతమాత్రమున తన దేహ మనఃప్రాణము లామెకై యిట్లు తహ తహ జెందనేల? దీనిని జననాంతర సౌహృద మందునా? లేక దాంపత్యమే యనవలయునా? నా యీ చిన్న శారదయు నేనును జన్మజన్మ ముల నొకరి నొకరిట్లు వెదకికొనుచు నేకమగుచున్నామా? ఈ సంయోగ వియోగముల కంతమెక్కడ? చరితార్థత యెక్కడ?

ఆలోచనాధీనుడగు నారాయణరావు భోజనము చేసి, యొంటిమై తాంబూలము వేసికొను శారద నల్లన జేరి, ‘నాకు రెండాకులు రాసియిస్తావా?’ యని యాచించెను. ఆమె యులికిపడి భర్తవంక నొక నిముషముచూచి, మారుమాటాడక యా లేత తమలంపుటాకులు చిలుకలుచుట్ట నారంభించెను. నారాయణ సంతసము మై జిఱునవ్వునవ్వుచు నచ్చటనే వేఱొక యాసనముపై నధివసించెను.

నారాయణరావురూప మానాడు శారద కేలనో సుందరతరమై కన్పించినది. వివిధవర్ణ విద్యుద్దీపికల ప్రసన్నకాంతిలో నాతనిరూపము మఱింత మోహనమై కాన్పించినది. అవ్యక్తమధురములగు నూతనానుభవము లామెలో జాగరితములుగానోపు లజ్జచే నామె కపోలము లించుక చెమర్చినవి. ఆమె పెదవులలో జ్యోత్స్నలు నాట్యమాడినవి. తల వంచియే దీర్ఘములగు కంటిరెప్పల నెత్తి యా బాలిక భర్తను మరల గనుగొన్నది. తెల్లని పొందూరుపట్టు శాలీ ఖదరులాల్చీలోనుండి ముడులువడు నాతని దేహసుభగత్వము వెలిగిపోవుచున్నది. ఉబికి విస్తరించియున్న యాతని మెడకండరములు తొనలవలె తిరిగియున్నవి. గంభీరమగు నాతని ముఖము, విశాల ఫాలము, తీరైన ముక్కు, చెవులు నాతనికి దేవసేనానియగు కుమారస్వామి సౌందర్యమును ప్రసాదించినవి. శారదాదేవి స్తోకవక్షము లుప్పొంగినవి. విభ్రమవతియైనది. సానురాగయై భర్త చేతిలో సుగంధ ద్రవ్యములు గూర్చిన వక్కపొడియు, దమలపాకు చిల్కలు పెట్టుచు స్పర్శసుఖ మనుభవించినది. ఆ వ్రీడావతి శరీరము పుల్కరించినది. ‘హాయి’ యనుచు నామె హృదయ మానందపూరితమైనది.

నారాయణరావు మృదులమ్పదులమగు నా కరతలము గ్రహించి, ‘నీ చేతి రేఖలు చూడవలె‘నని యామెపాణి చూడ నారంభించెను. మెత్తని గులాబి మొగ్గవలెనున్న యామె చేతిలో రేఖలు స్పష్టములై యున్నవి. దీర్ఘములై లలితములగు నా వేళ్ళు తీగెలే. గోళ్ళు ఎరుపులై సంధ్యారాగ తప్తములగు నక్షత్రములవలె ప్రకాశించినవి. నీలము పొదివిన తన చిటికనవ్రేలి యుంగరము తీసి యాత డామె యనామికకు దోడిగి ‘ఎంతవదులో!’ యనుచు చిరునవ్వు నవ్వెను. ఆమె వజ్రపుటుంగరము తన కనిష్టికాంగుళికి దొడిగి ‘జూచితివా, బిగు’వని మేలమాడుచు, దీపికాకాంతిలో నద్దాని గాంచుచు నిది నా ప్రాణప్రదమని ముద్దాడుకొనినాడు. ‘చెన్నపట్టణము నుండి చక్కని యుంగర మొకటి తెచ్చి, యా చిట్టివ్రేలికి దొడిగికొందు’నని ప్రేమపూర్వకముగా ననుజ్ఞ వేడికొన్నాడు.

శారద నెమ్మదిగా జేయి లాగికొన్నది. ఆమె గుండియలు దడ దడ కొట్టుకొన్నవి. ‘ఇంత మెత్తని వేళ్ళకు వీణతీగెల నొక్కులు బాధకాదూ శారదా?’ యని నారాయణరావు ప్రశ్నించెను. ‘కుడి బొటనవ్రేలికి గోణము తగిలించుకొంటాను. ఎడమచేతివేళ్లు నొక్కులుపడ్డాయి’యని యాబాల వామహస్తము భర్తకు జూపించినది. అతడా పాణిని గ్రహించి ‘హృదయవచశ్శరీరముల సౌందర్యాన్ని బలియిస్తే కాని ఆనందాన్ని సృష్టించలేము కాదూ? ఎన్ని గంటులో! పాపము, ఈ చిన్న వేళ్ళకు ఎంత శ్రమో’ యని యామె చేయి తన పెదవులతో నల్లన స్పృశించి కన్నుల కద్దుకొనెను.

శారద యపరిమిత త్రపామూర్తియై చేయి లాగికొని, చిరునవ్వు మోమును రాగరంజితము చేయ, మెరపువలె నా మేడమీద నింకొక గదిలోనికి మాయమైనది.

నారాయణరావు హర్ష ప్రఫుల్లములగు నయనములతో దన చిన్నారి భార్య పోయిన దెస చూచుచుండెను.

ఇంతలో జమీందారు గారు లోనికివచ్చి యాలోచనామగ్నుడైయున్న యల్లుని వీపుపై చేయి నిడెను. నారాయణరావు ఉలికిపడి తలయెత్తి మామగారిని జూచి, చివాలున లేచెను. ‘కూర్చోవోయి! నీ స్నేహితులంతా నీకోసం కాబోలు చూస్తున్నారు. మా జగన్మోహనుణ్ణి ఆడిస్తునట్లున్నారు. అతడో వెఱ్ఱివాడు. గర్వి. దుష్టహృదయం కలవాడు. నీవు ఎఫ్. ఎల్. లో మొదటివాడవుగా మొదటితరగతిలో నెగ్గినందుకు నాకు చాలా సంతోషంఅయింది. నువ్వు వెళ్లేటప్పుడే నేనూ చెన్నపట్టణం వస్తాను. నువ్వు హాస్టలులోవుండడం మానివేసి కీల్ పాకులో నా బంగాళావుంది అందులోనే ఉండు. అద్దెకున్న వారిని ఖాళీ చేయవలసిందని వ్రాశాను. వారున్నూ రేపు జూలై నెలలో వెడుతున్నారు. నీ యిష్టంవచ్చిన కారొకటి చూడు. మా దివానుగా రదికొని, నీకు ఇస్తారు. ‘చ్యాపుయరు’ (మోటారునడుపువాడు) నొకణ్ణి చూచి ఉంచారు. ఆకారు నీకు బహుమతి.’

‘నేనే ఒక చిన్నరకం కారు కొనుక్కోడానికి ఏర్పాటులు చేసుకున్నానండి.’

‘నా ముచ్చటకు నువ్వు అడ్డం చెప్పవద్దు.’

‘చిత్తం.’

‘శారదా!’

పక్కగదిలోనున్న శారద ‘ఎందుకు నాన్నగారూ?’ అని పలికినది.

‘ఈలా రా అమ్మా!’

శారద గుమ్మము కడకు వచ్చినది.

‘కొంచెముసేపు క్రిందికివచ్చి వీణ వాయిస్తావా? నీ సంగీతగదిలో నే కూచో.’

‘ఇపుడు వాయించలేనండి.’

‘పోనీలే.’ ‘కాదు, ఇక్కడే నాగదిలో కూచుండి వాయిస్తానండి.’

‘సరేలే, నీకు కులాసా లేకపోతే ఇబ్బంది లేదులే.’

‘ఇష్టం లేక కాదండి! క్రింది గదిలోకి ఎందుకని.’

శారద పరిచారికను బిలిచి సంగీతపుగదిలోనున్న వీణియ తెమ్మని యాజ్ఞ యిచ్చినది. జమిందారు గా రల్లుని జూచి ‘సంగీతపుగది ధ్వనిశాస్త్రవేత్త నొకణ్ణి కలకత్తానుండి రప్పించి తయారు చేయించినాను. చాలా చక్కగా కుదిరింది. పొడుగాటి హాలులా వుండటంవల్ల పదిమంది కూచొని వినుటకు వీలుగా ఉంటుంది. నీ స్నేహితులను పైకి తీసికొని రావోయి’ యని యనెను.

‘చిత్త’ మని నారాయణ రావు స్నేహితులను మేడమీదికి బిలిచికొని రాబోయెను.

శారద వీణియ సారెలు బిగించి, శ్రుతి మేళవించి, కలస్వనమున పాడనారంభించినది.

నారాయణ రావు, స్నేహితులువచ్చి, మేడమీద మధ్యశాలలో నాసనములపై నధివసించిరి. జగన్మోహన రావు మాత్రము శారద శయనగృహము లోనికిపోయి, యచ్చట శారద కెదురుగ నొక దిండ్లున్న సోఫాపై నుపవిష్టుడై శారదను దేరిచూడ సాగెను.

జగన్మోహనుని కుర్కురహృదయమునకు శారదా సౌందర్య మద్దముల పెట్టెలోని పలలఖండమై కలచి వేయుచుండెను.

జగన్మోహనుడు లోనికి బోవుట జూచి రాజేశ్వరరావు భ్రూయుగ్మము ముడిచినాడు.

నారాయణరావు, పరమేశ్వరుడు సంగీతలోలురై యా యానందలహరీ వేగములో దేలిపోయిరి.

అహో, విమల గాంధర్వమా! నీ వానందమూర్తివి! నిర్మలకళారూపమవు. సాక్షాత్కరించిన పరదేవతవు. నీ దర్శనమాత్రమున పవిత్రత నొందని చేత నా చేతనము లున్నయవియే! పరమశివుని డమరుక కింకిణీద్వయి నుండి జనించిన నీయం దాత్మస్వరూపమే వ్యక్తమగును. ప్రాణదుగమునిచ్చు సురభీ మతల్లివి నీవు!

ఆ సంగీతము దిశల నావరించి ప్రణవస్వరూపమయినది.