నారదీయపురాణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

పంచమాశ్వాసము

క.

శ్రీమహితోపనిషద్వి
ద్యామయ! నిత్యప్రకాశితైశ్వర్య శ్రీ
సామ్యగ్రీకార్మణ! శ్రీ
వామాక్షీహృదయసదన! వనరుహవదనా!

1


వ.

అవధరింపుము. వసిష్ఠుండు మాంధాతకు నెఱింగించిన క్రమంబున
నూతుండు శౌనకాదుల కిట్లనియె.

2

చాతుర్మాస్య వ్రత మహత్వము

మ.

తతి వర్ణించితి కార్తికవ్రతమహత్త్వఖ్యాతధర్మంబు ప్ర
స్తుతమై యుండఁగఁ దెల్పు మింక నృపచాతుర్మాస్యపుణ్యవ్రతం
బతిలోకం బనవద్య మప్రతిమ మి ట్లాకాల మేదాన మీ
క్షితిలోఁ జేసినఁ బూర్ణమై వెలయు భక్తిన్ నా కెఱింగింపవే.

3


వ.

అనిన.

4


సీ.

వాసి నయాచితవ్రతుఁడును నక్తభో
                       క్తయునైనవాఁ డనురక్తి బ్రాహ్మ
ణులకు భోజన మిడి నూత్నబలీవర్ధ
                       మొక్కటి పసిఁడితో నొసఁగవలయు
నట్లు బ్రాహ్మణభోజనానంతరమున న
                       మాంసభోజనుఁడైన మానవుండు
ధేనువు దక్షిణ దీవించ నర్పించఁ
                       దగు నాకు లెల్లఁ జోద్యము వహింప

గీ.

నుసిరికలక్రింద నిన్నియు నూర్జితముగ
నామలకములతోఁ [1]బెట్టి యర్హముగను
నియమ మొనరించు[2]వారికి నియతఫలప
రీతదానంబు తగ నాచరించు టొప్పు.

5


సీ.

నెరయు తైలత్యాగనియమంబునకు ఘృత
                       దానంబు తద్ఘృతత్యాగనియమ
మునకుఁ బయోదానమును దధిత్యాగని
                       యమమునకును హిరణ్యప్రదాన
మట పయస్త్యాగనియమమునకు రజత
                       దానంబు నా సర్వధాన్యభోజ
నత్యాగనియమంబునకు శాలిదానంబు
                       భూతల్పనియమంబునకు హంస


గీ.

తూలికాకందుకాన్వితశాలి మృదుల
శయనదానంబు తక్రభక్షానియమము
నకు ఘృతాపూర్ణపరభాజనప్రదాన
మరసి కావింపవలయు నేపురుషుఁడైన.

6


గీ.

మౌననియమంబు మానిన మానవుండు
కనకఘంటాద్వయము సముత్కంఠతోడ
దాన మర్పించి మృదుశయ్య దంపతులకు
నొసఁగి భోజన మిడి గోవు నొసఁగవలయు.

7


శా.

నిత్యస్నాయిహయంబు నీ శుభములౌ నిస్స్నేహసంస్నాయిసం
స్తుత్యుండై ఘృతసక్తుదానమున నాద్యు ల్మెచ్చఁ బుణ్యవ్రతౌ
న్నత్యుండౌ నఖకైశికోత్క్షణసమానద్ధవ్రతాచార మి
ట్లత్యంతంబు నొనర్చెనేని ముకురం బర్హంబు దానం బిడన్.

8


క.

పాదుకలు విడిచి విడి [3]విడి
పాదంబులఁ దిరుగునట్టి పరమవ్రతసం
పాదికి శుభమగు మృదుతర
పాదూదానంబు నియతి బ్రాహ్మణున కిడన్.

9

వ.

ఆపణపరిత్యాగంబున ధేనుదానంబును నామిషత్యాగంబునఁ గపిలా
దానంబును దేవతాలయంబున నిత్యదీపం బర్పించిన సఘృతవాసో౽
న్వితతామ్రకాంచనదీపపాత్రంబులు విష్ణుభక్తునకు వ్రతపూర్తికి
నర్పించిన నైశ్వర్యంబు ప్రాపించు. ఏకాంతోపవాసంబున వస్త్రకాంచన
యుక్తంబులైన యెనిమిదిహలంబులు శయ్యతోఁగూడ నొసంగందగు.
త్రిరాత్రోపవాసంబు చేసిన ఛత్రోపానహయుతమైన మణిక మర్పించి
శిరాకర్షణక్షేమంబైన పచ్చని యనడ్వాహంబు నర్పింపవలయు.
నేకాహ్నికోపవాసంబున నజాదానంబు సేయవలయు. ఫలాహారంబు
చేసిన శాలిదానంబు గావింపవలయు శాకాహారంబు చేసిన ఘృతపూర్ణ
రజతపాత్రంబు లర్పింపవలయు నివి యిన్నియు లభింపకున్న విప్ర
వాక్యంబున వ్రతంబు పూర్ణంబు గావింపవలయు. విప్రవచనంబు
గ్రహించి దక్షిణ యొసంగఁడేని నరకంబునం బడు. వ్రతవైకల్యం
బునఁ గుష్ఠియు నంధుండు నగు. దివిజులు బ్రాహ్మణవాక్యంబు
నందే వర్తింపుదురు. తద్వాక్యంబు శ్రేయఃకాంక్షియగువాఁ డెవ్వఁ
డతిక్రమించు? వేదాశ్రితమై పాపవిమోచనంబై మాధువతుష్టిహేతు
వైన పరమరహస్యంబు విను మనిన మోహిని యిట్లనియె.

10

మోహిని రుక్మాంగదుని వ్రతనిష్ఠ మాన్పించుట

మ.

ఇతరం బెంచక కార్తికవ్రతము లోకేష్టంబు గావించి ప
ల్కితి రాజుల్ వ్రతదీక్ష గైకొనుట [4]లక్ష్మీహేతువే? యుద్ధరం
గతరంగస్ఫురితాంతరంగజయవిఖ్యాతిన్ మహీపాలన
వ్రతముం దానముఁ దక్కఁ జేయుదురె పూర్వక్షోణిఫాలాగ్రణీ!

11


క.

చేయకు మీవ్రత మవనీ
నాయక! కందర్పమోహనశితాస్త్రము నా
కాయము నాటినఁ దూలెన్
గాయము కానంగరాదె [5]గాయము లింకన్.

12


వ.

అనిన.

13


క.

ప్రతివచనము దోఁచక భూ
పతి యతివిస్మయము గాంచి ప్రఖ్యాతగుణ
స్థితి సంధ్యావళిఁ బిలువన్
వితతమహోపాయలైన వెలఁదులఁ బంచెన్.

14

చ.

పనిచిన వచ్చి రత్నగృహపాలిక బాలిక లూఁచ డోలికాం
చనమున మోహినీ[6]లకుచచారుకుచస్థలవర్తియై యశో
ధనుఁడగు ధర్మశోధనునుదారకళాపరిపూర్ణ చంద్రునిన్
గనుఁగొని వామభాగమున గ్రక్కున నిల్చె వరాంజలిక్రియన్.

15


వ.

నిల్చి యిట్లనియె.

16


మ.

ననుఁ బిల్పించితి వేమి నాథ! సకలానందంబులం దావకో
క్తిని దేశంబుల నున్నదానను సపత్నీదుఃఖలేశంబు లే
దనఘా! మోహిని నాశరీరము తదీయంబైన భోగంబు మ
ద్ఘనభోగం బిఁక సంశయంబు గలదే కారుణ్యరత్నాకరా!

17


తే. గీ.

పతిసుఖం బాత్మసుఖమని భక్తిఁబూని
తలఁచని యసాధ్వి శ్యేనియై ధరణిఁ బుట్టు
నయిదు మూఁడునునైన జన్మాంతరములఁ
గాన [7]నానతి యొసఁగు మే కార్యమైన.

18


వ.

అనినఁ గులశీలజన్మాద్యభిమానంబులు గలదానవని బహూకరించి
కార్తికమాసవ్రతంబు లెన్నేనియుం గడచె నీమోహినితో రమింపఁగ
మదాంధుఁడనై యుంటి. ఇంకనేనియు నీవ్రతంబుఁ జేనెదనన్న
మోహిని వారింపుచున్నది యనఁ దా నొనర్చెదనని యంగీకరించి వర
కృఛ్రసంజ్ఞంబైన వ్రతంబుఁ బూనె. రుక్మాంగదుండు నంత కుశ
కేశిపుత్రిం జూచి యిట్లనియె.

19


తే. గీ.

ఇంతి నీమాట చేసితి నింతనుండి
సకలభోగానుభవమహైశ్వర్యధుర్య
పూర్ణకామత నుండు మే పొలఁతిమీఁద
నైన నీమీఁదఁగల ప్రేమ పూనఁ[8]గలనే?

20


వ.

అనిన మోహిని యిట్లనియె.

21

చ.

అతులపరాక్రమోన్నతుఁడ వంచు గుణాఢ్యుఁడ వంచు వైభవ
స్థితి గలవాఁడ వంచు నరసిద్ధనభశ్చరసాధ్యనాగయ
క్షతురగవక్త్రదానవముఖప్రకరంబుల నీసడించి వ
చ్చితి నినుఁ గోరి మంథనగసీమకుఁ బ్రేమకు మేర యున్నదే!

22


తే. గీ.

మనసు మనసును గలిసి ప్రేమలత ననలు
గలుగ దంపతులకు నవి కామఫలము
లన్యచిత్తత్వముననైన యట్టి కామ
మరయ శవసంగమోపమ మనిరి బుధులు.

23


తే. గీ.

రూపసౌందర్యశీలముల్ రూఢి కెక్క
నీవు పతి వైనకతమున నెందు నాకు
దుర్లభమె మూఁడుజగములందుం గలిగిన
వైభవస్ఫూర్తి యైన నో వసుమతీశ!

24


తే. గీ.

కామినీకుచకుంభము ల్కాముకుల కు
రంబునం దొకమేరువై ప్రబలుఁ గాదె
యమృత మనఁగఁ బురంధ్రివరాధ[9]రోష్ఠ
వరసుధారయ కాదె! భూవరవరేణ్య!

25


సీ.

[10]కుచకుంభముల నానికొని [11]వీఁపు గీలింప
                       మత్తకుంభీశకుంభస్థలోరు
పటహరవాధికోద్భటభటార్భటి దోఁచెః
                       "హరిదినం బెల్లి మీరతులనిష్ఠ
నక్షారలవణమై యమరు హవిష్యాన్న
                       మొక్కప్రొ ద్దొనరించి యువతిఁ బాసి
యవనితల్పమున మురారిపాదాబ్జముల్
                       దలఁపు చనన్యచింతత వహించి

తే. గీ.

ప్రాతిసాంవత్సరికముఖ్యపైతృకములు
తర్పణాదికములుఁ బిండదానములు [12]
యావ్రజనములు సేయక హరిదినమునఁ
దనయు లుపవాస ముండినతఱిని జగతి.

26


వ.

తత్పితృగణంబు మోక్షంబు నొందు ననుచుం" [13]జాటి.

27

ప్రబోధనీమహిమ

క.

"అక్లేశకరము కార్తిక
శుక్లైకాదశి యముండు చూడ వెఱచు రో
షక్లిన్నాక్షుండై హరి
[14]విక్లబులను గావఁగాఁ దవిలి మేల్కనఁగన్.

28


తే. గీ.

బ్రహ్మహత్యాదిదుస్తరపాతకములు
కామచారకృతంబులై కలిగిన యవి
యెన విలయంబు నొందు నన్యూనమహిమ
నిది ప్రబోధని యండ్రు యతీంద్రవరులు.

29


క.

ఘనపాతకములు వాయఁగ
ననిశము ధర్మంబె నిల్పి హరికిఁ బ్రబోధం
బొనరింప నిది ప్రబోధని
యని పలికిరి సూరిజనము లాయాసభలన్.

30


క.

ఒకనాఁడైనఁ బ్రబోధని
నకలంకత నుపవసించు నాతఁడు చన్బా
లకు లోను గాఁడు రవిబా
లకునకు మఱి లోను గాఁడు లలితస్ఫూర్తిన్.

31


చ.

మలయజచంద్రకుంకుమ సమగ్రముగాఁ గలపంబు లందుఁ డు
జ్జ్వలత దుకూలచేలము విశాలముగా సవరింపుఁ డుత్తమా
ఖిలమణిభూషణాళి బెళఁకింపుఁడు ఫుల్లసుగంధపుష్పజా
తులఁ పలుపూజ సేయుఁడు యదుప్రవరోత్తముఁ బార వీథులన్.

32

తే. గీ.

ఇట్లు నడువక నాసీమ నెవ్వఁ డుండు
వాడు వోదండ్యవధ్యనిర్వాన్యతాప్ర
ధానవృత్తుల కర్హు డుద్దండశక్తి
నజమహేశ్వరశక్రాదు లడ్డమైన”.

33


వ.

అని చాటిన విని సకర్పూరతాంబూలంబు చేతిది విడిచి, మోహినీ
కుచకేశీమహోదయంబైన హృదయంబుఁ దిగిచికొని, శయనంబు డిగ్గి;
మధురవచో౽మృతధారల మోహిని నోలార్చి “కార్తిక వ్రతంబు నీ
యాజ్ఞచే విడిచితి; ప్రబోధని విడువ శక్యంబు గాదు. నాతో నుపవ
సింపు" మనిన మోహిని యిట్లనియె.

34


మ.

ఇనవంశేంద్ర! నిమేషమాత్రమయినన్ [15]నే నోర్వ ని న్బాసి, చే
సినమేరం గమలేశవాసరపరిస్ఫీతవ్రతాచారవ
ర్జన ముద్వృత్తి నొనర్చి భోజనము పూర్ణప్రీతిఁ గావింపు కం
తునితాంతాతతభీకరప్రదరశక్తుల్ తాళ శక్యంబులే?

35


వ.

కావునఁ బూర్వంబు నా కొకవరం బొసంగితివి. తద్వరంబున కిది
యవసరంబు. నీ వనృతంబు పలికెదవేని చతుర్దశేంద్రపర్యంతంబు
నరకంబు లనుభవించెద వనిన రా జిట్లనియె.

36


చ.

కమలజపుత్రివై సకలకర్మములెల్ల నెఱింగి ధర్మవి
ఘ్నమునకు నోడవైతి గుఱి గల్గిన సద్గుణరాశి నేను స
త్యముగ శిశుత్వవేళయుఁగదా భుజియింప; జరాప్తకేశశౌ
క్ల్యమున భుజింపనేర్తునె? ప్రగల్భుఁడనై హరివాసరంబునన్.

37


ఆ. వె.

మానవుండు ముదిమిఁ బూని క్షీణేంద్రియ
బలత నుండి పాపభంజనమున
కభ్రతటిని మునుఁగ నర్హుండు గాకున్న
హరిదినోపవాసి యైన మేలు.

38


ఉ.

బాల్యమునందు నీవ్రతము భక్తి నొనర్చితిఁ గొంత కొంత సౌ
శీల్యము గల్గి యౌవనముఁ జెందియుఁ జేసితి దండహస్తహృ
చ్ఛీల్యము గాఁగ వార్ధకవిశేషమునన్ విడనేర్తునే మనో
లౌల్యమునన్ వచించితి భళా! కలకంఠి! భయంకరార్భటిన్.

39

మ.

వ్రతభంగం బొనరింపఁగాఁ దలఁప కో వామాక్షి నాపైఁ బ్రస
న్నత పాటింపుము రాజ్యసంపద లనూనస్ఫూర్తిఁ గైకొమ్ము త
న్మతి లేకున్నఁ దదన్యకార్య మెటులైనం జేసెదన్ నిన్ను మ
త్సతులెల్లన్ శిబిక ల్వహింపఁ గొలుతున్ దత్పాదచారంబునన్.

40


మ.

అది గాదేని సువస్త్రవిద్రుమమయోద్యత్కాంచనస్తంభరా
జదుదాత్తామలకోరుమౌక్తికఫలాంచల్లోలడోలాస్థలిన్
మదిరాక్షీ! నిను నూఁచెదన్ సొగసుగా మాణిక్యసౌధంబులో
మదిరాక్షీణము [16]సేయ కింకఁ గరుణన్ మన్నించి న న్నేలవే!

41


తే. గీ.

మానవుండు (జగతిని) స్వమాంస పుత్ర
మాంసములు దిన్నఁ దరియించు మత్తుఁ డగుచు
హరిదినంబున భుజియించునట్టి పాప
మఖిలజన్మంబులఁ దరింపఁ డనఘచరిత!

42


వ.

కాంతా! త్రైలోక్యహననపాపంబును, గుహూదినంబున రతి
యొనర్చు పాపంబును, భూమి యంగుళిమాత్రం బపహరించి మిథ్యా
విక్రయం బొనర్చిన పాపంబును, నిక్షేపాహరణం బొనర్చిన పాపం
బును, భూతతిథియందు క్షౌరంబు చేయించుకొనిన పాపంబును, హరి
వాసరంబున భుజియించిన పాపంబును, షష్ఠిం దైలంబు పూసిన
పాపంబును, దృతీయను లవణంబు చవిగొనిన పాపంబును, అష్టమిని
మాంసం బనుభవించిన పాపంబును, విశ్వాసఘాతపాపంబును, మృత
వత్సాప్రదోహనపాపంబును, బున్నమను జూదం బాడిన పాపంబును,
రవిసంక్రమణంబున సురాపానంబు చేసిన పాపంబును, గోప్రచార
ప్రలోపంబు గావించిన పాపంబును, గూట[17]సాక్షి పలికిన పాపంబును,
నగరక్షేత్రగ్రామద్రవ్యాదులు బ్రాహ్మణున కిచ్చెదనని బొంకిన
పాపంబును, నిర్ణీతంబులైనమీఁద ననృతాక్షరంబులు పల్కిన పాపం
బును, గన్యానృతపాపంబును, ననృతపాపంబును, మాంసకూట
మహాకూటపాపంబులును, కనకాధానంబునందు [18]శుద్ధం బని యాడిన
పాపంబును సమంబులు గాన హరివాసరంబున నెట్లు భుజింతు ననిన
మోహిని యిట్లనియె.

43

తే. గీ.

అవనిలో నెంచి చూడ నయాచితోప
వాసనక్తైకభుక్తప్రవర్తనమున
దానమునఁ దద్వ్రత మొనర్చి ద్వాదశీవ్ర
తంబు సాధింపవలయు నుత్తమజనంబు.

44


మ.

అరయన్ గర్భిణులున్ గృహస్థులును క్షీణాకారుఁడున్ బాలుఁ డా
తురులున్ వృద్ధులు భారవాహులు మహీంద్రుల్ యుద్ధసన్నద్ధులున్
బరమోత్కృష్టపతివ్రతామణులు నాపన్నుల్ సమగ్రోపవా
సరతు ల్గాఁదగదంచు గౌతముఁడు వైశాఖాద్రిఁ బల్కెన్ ధృతిన్.

45


వ.

ఎవ్వరికి నగ్నిపరిగ్రహంబు గలదు వారు గృహస్థులు. ప్రజాపాలన
ప్రవణు లెవ్వరు వారు రాజులు. ఎనిమిదవ[19]మాసం బేర్పడిన యా
యింతి గర్భిణి యగు. అష్టవర్షాన్వితుం డెవ్వండు? వాఁడు బాలుండు.
యజ్ఞభాగోద్యతులై తిరుగ [20]నతిలంఘనంబు సేయువారు క్షీణులు.
మనోవాక్కాయకర్మంబులఁ బతిహితంబు సేయువారు పతివ్రత లింక
నివి యేల? ఏకాదశి నీతోఁగూడ భుజింపం బ్రీతి యయ్యెడు. లోక
త్రయంబు నీ విచ్చిన నాకుఁ దృణంబు. శిరం బిచ్చిన నెంత? దక్షిణ
కరం బిచ్చి పాలించకుండితివేని యీదేహంబు విడిచెద. వర్ణాశ్రమ
ములకు సత్యంబు వలయు. విశేషించి రాజులకు సత్యంబె శ్రేయో
మూలంబు.

46


సీ.

సత్యంబుచేతనే జలజాప్తుఁ డుదయించు
                       సత్యంబుచేతనే శశి వెలుంగు
సత్యంబుచేతనే జగతీతలము నిల్చు
                       సత్యంబుచేతనె జరుగు గాడ్పు
సత్యంబుచేతనే జ్వలనుండు దీపించు
                       సత్యంబుచేతనే జగము లుండు
సత్యంబుచేతనే జలధి వేల మెలంగు
                       సత్యంబుచేతనే నడలు వింధ్య


తే. గీ.

మఖిలఋతువులుఁ బుష్పఫలాభివృద్ధి
సత్యముననె స్ఫురించు నీసకలదిశలు
సత్యమున మించియున్నవి సత్యవాక్య
మశ్వమేధసహస్రపుణ్య మను నజుండు.

47

తే. గీ.

సత్యహీనసురాపాయిజనులలోన
నాసురాపానరతులకు సమరవరులు
నిష్కృతి వచించి రనృతోక్తినిరతుఁడైన
నీచునకు నిష్కృతి వచింపనేరరైరి.

48


వ.

అనిన రుక్మాంగదుం డిట్లనియె: గౌతముండు గృహస్థునకు నేకాదశ్యుప
వాసంబు వలదని పలికెనంటివి. అతండు క్షుద్రశాస్త్రానుసారంబునం
బలికిన నేమి? పురాణంబులందు నిర్ణయంబు గలదు. శంఖంబుతో
జలంబు ద్రావుట, కూర్మసూకరమాంసంబులు భక్షించుట పాపంబులని
తెలియంబడియె నేకాదశి భోజనంబును నగమ్యాగమనంబును నభక్ష్య
భక్షణంబును నకార్యకరణంబును గోసహస్రవధతుల్యం బని
యెఱింగించె. ఏకాదశి నర్హంబె భుజింప? ఏకాదశిని బురోడాశంబును
భుజియింపంగాదు. క్షీణులకు మూలఫలపయస్సోమపానంబును,
జ్వరితులకు లంఘనంబును, బాపులకు నుపవాసంబును ప్రశస్తం బను
నొకకల్పంబు గలదు. మలప్రకోపంబున హరివాసరంబు వచ్చిన
భుజింపందగదు; జ్వరమధ్యకృతపథ్యభోజనంబు సేయందగదు.
చేసిన నరకంబు నొందుఁ గావున నాగ్రహంబు విడువు మిదిగాక మఱి
యొకటి యెుయ్యేదియేనియు రుచించినం జేసెద ననిన మోహిని
యిట్లనియె.

49


క.

అవనీశ! ప్రాణ మిచ్చినఁ
జవి యగునే? యేను నీవు సల్లాపములన్
నవశాల్యోదనఫలరస
వివిధరుచుల్ గొని భుజించి వెలయకయున్నన్.

50


తే. గీ.

రాజశేఖర! హరివాసరవ్రతంబు
ఘనత వేదోపదిష్టంబు గాదు విప్రు
లగ్నిమంతులు వర్తింప రావ్రతమున
వేదబాహ్యమతం బేల విస్తరింప?

51


వ.

అనినం గనలి రాజేంద్రుం డిట్లనియె.

52

సీ.

బహువాదమూలమై భాషించు వేదంబు
                       యజ్ఞకర్మక్రియాద్యంబు వేద
[21]మఖిలగృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
                       స్మృతిమర్మవిద్యయౌ [22]హృద్యవేద
మమితపురాణరహస్యతంత్రము వేద
                       మాదిత్యపురుషజన్మములు జగము
లట్లైన వాఙ్మయం బంతయు నీపురా
                       ణంబులయందె ధన్యత వహించె


తే. గీ.

నట్లు గానఁ బురాణార్ధ మధికతరము
తెలియ వేదార్ధమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము చేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబు లెల్ల.

53


వ.

"పరమార్థం బెఱుంగలేక యల్పశ్రుతులైనవారు మదర్థం బితిహాస
పురాణస్మృతినిర్ణీతం బైనదానిం జెఱుతు" [23]రని వేదంబులు పలుకు.
వేదంబునందు గ్రహసంచారంబును లగ్నశుద్ధియుఁ దిథివృద్ధిక్షయం
బులుఁ గాన్పింపవు; యాజ్యాయాజ్యులు నేర్పడరు; బ్రహ్మహత్యాదు
లకుఁ బ్రాయశ్చితాదులు నిర్ణయింపబడవు. అంగంబుల నెయ్యది
దీపించు నుపాంగంబుల నెయ్యది గాన్పించు స్మృతిపురాణంబుల
నెయ్యది ప్రకాశించు నదియ వేదంబులు నుచ్చరించుం గావున:
    “నభోక్తవ్యం నభోక్తవ్యం సంప్రాప్తే హరివాసరే
     పురాణమన్యథాకృత్వా తిర్యగ్యోని మధా౽ప్నుయాత్”
అని మొఱ్ఱ వెట్టుచున్నవి. పితృమాతృనింద సేయుకంటెను,
గంగాస్నానంబు సేయకయుండునంతకంటెను, హరివాసరంబున
భుజియించునంతకంటెను, దేవబ్రాహ్మణులదూషణంబు సేయునంత
కంటెను, బ్రహ్మహత్య గావించునంతకంటెను, పరదారాభిగమనంబు
గావించునంతకంటెను మహాపాపంబుఁ గావింప నెవ్వరితరంబు? అని
యెఱింగి హరివాసరంబున భుజియింపనేర్తునే? అనిన.

54

మోహిని బ్రాహ్మణుల రావించుట

మ.

అతిరోషంబున ఘూర్ణికం బిలిచి నెయ్యం బొప్ప మన్నించి యా
శ్రితవిప్రావళిఁ గూర్చి యాసనసుఖాసీనాత్ములం జేసి సు
వ్రతలీలాధికులైన యాఘనులకున్ పశ్యక్రియన్ మ్రొక్కి స
మ్మతితో వృద్ధుని గౌతముం గనిన ధర్మజ్ఞుం డతం డిట్లనున్.

55


క.

“పిలిచితి వేటికి నిపు డో
యలికుంతల! నీదు సంశయము దీర్చగ స
త్కులశీలవ్రతులగు వి
ప్రులు వచ్చిరి వీరె పూర్వపుణ్యముకతనన్."

56


వ.

అనిన మోహిని యిట్లనియె: హరివాసరంబున భుజింప నొల్ల నని
యెడి నీరాజు స్థావరజంగమాత్మకంబైన యీజగంబునకు నన్నంబె
జీవనంబు. పితృగణంబేనియు నన్నంబున హర్షించు. కర్కం
ధూమాత్రపురోడాశంబుననే దేవతలు ప్రమోదింతు రన్నమే యమృతం
బని యాకాంక్షింతురు. పిపీలికాగణంబులు తండులకణంబులు గొని
దుఃఖంబున బిలంబు చొచ్చు నన్నం బెవ్వరికిఁ బ్రియంబు గాదు? రాజా!
నీధర్మంబు వదలి యతిధర్మంబు గైకొన్నవాఁ డవవ్రతయైన విశ్వ
స్తయు నవ్రతుండైన యతియు నంధతమసంబునం జతుర్దశేంద్ర
పర్యంతంబు వర్తింపుదురు. రాజులకు రాజ్యపరిపాలనంబు దక్క
నితరధర్మం బర్హంబె? స్త్రీలకు భర్తృశుశ్రూషయుఁ బుత్రులకుఁ బితృ
సేవనంబును శూద్రులకు ద్విజపూజనంబును రాజులకు లోకరక్షణం
బును ధర్మంబులు. ఇట్టి ధర్మంబులు ప్రమోదాజ్ఞానంబున వదలినఁ
బతితుండగు. అవ్యాపారయగు యువతియు, నవినీతుండగు సుతుం
డును, భృత్యమంత్రివివర్జితుండై యేకాంతశీలుండగు రాజును నప్ర
తిష్ఠతో నరకంబు గాంతురు. అన్నంబునఁ బ్రాణంబును, బ్రాణంబునఁ
జేష్టయుఁ, జేష్టచే రిపునాశనంబు సేయ శక్తుండు నగు. ఇట్టి యన్నంబు
విడిచిన క్షీణదేహుండై యేకార్యం బొనర్పనేర్చు ననిన:

57


క.

తద్వాక్యము విని యపు డా
విద్వాంసులు తథ్య మనుచు వివరించి మహీ
భృద్వేదండము శాస్త్రో
ద్యద్వచనాంకురము చూసి యనిరి ప్రియమునన్.

58

చ.

శపథముఁ జేసినాఁడవు, ప్రశస్తిని శ్రీహరివాసరవ్రత
ప్రపదనవృత్తిమై నుభయపక్షములన్ నిజబుద్ధిచేతనే
సృపవర! శాస్త్రదృష్టిని వినిర్ణయమై తగియుండు నాగృహ
స్థపతులు సాగ్నులై యుభయసమ్మతపక్షములన్ భుజింపరే?

59


వ.

అది గాన వర్ణత్రయంబును హోమోచ్ఛిష్టభోక్తలు గావలయు. విశే
షించియు నిరంత[24]రోద్యతాయుధులైన రాజులకు నుపవాసంబు
యుక్తంబుగాదు. శాస్త్రంబేని యశాస్త్రంబేని నీవు చేసిన శవథం బస్మ
దనుగ్రహంబునఁ బూర్ణంబయ్యెడు. వ్రతభంగదోషంబు నీకు లేదు.
విప్రసమన్వితుండవై భుజింపు. విప్రవాక్యంబు మహత్తరంబు. తద్వా
క్యోల్లంఘనంబు చేసినఁ బదియేనుజన్మంబులు రాసభయోనిన్
జన్మించునన రాజు వారలం జూచి యిట్లనియె.

60


సీ.

సర్వభూతములకు సన్మార్గవర్తులై
                       యకట! విమార్గస్థు లగుట దగునె?
యతులకు విధవల కర్హంబు హరివాస
                       రోపవాసంబన నుచిత మగునె?
యదియ మిథ్యావాక్య; మఖిలభూతములకు
                       హరివాసరవ్రతం బాచరింప
నియతంబు; రాజులు నిక్కం బుపవసిం
                       పఁగఁ దగుఁ; బౌరాణభవ్యగాథ


తే. గీ.

సంశయంబెల్లఁ దీర్చెడు: శంఖమునను
జలముఁ గ్రోలుట, కిటికూర్మపలలభక్ష
ణంబు సేయుట హరివాసరంబునందు
నుభయపక్షమ్ముల భుజింప నొప్పదనుచు.

61


క.

వలదు సురాపానము వి
ప్రులఁ జంపఁగవలదు ద్యూతముల వర్తింపన్
వలదు హరివాసరంబున
వలదు భుజింపంగఁ బాపవర్తను లయినన్.

62

వ.

యతికి విధవకు నేకాదశినాఁటి యన్నంబు నింద్యం బనుట యతికిఁ
బరదారాభిగమనంబు గర్హితం బనిన వర్ణాశ్రమాదుల కగర్హిత మనుటే?
ఇది యుచితంబుగాదు.

63


క.

దోషాకరసంక్షయమున
యోషామణిఁ గూడి భోగ మొందిన శ్రీమ
చ్ఛేషశయనదినసకృదను
పోషితమున సకలనరకములు ప్రాపించున్.

64


క.

[25]అకటఁ జతుష్పదజంతువు
నకునైనను నరుఁడు భోజనము పెట్టఁగ రా
దకలంకబుద్ధియగు నరు
నకు యుక్తం బగునె? హరిదినమున భుజింపన్.

65


వ.

ఉత్తరాశాస్థితులై విష్ణుభక్తిపరాయణులైన విప్రులచేతఁ జేయంబడని
దురాచారం బెట్లొనర్చెద? మీవచనంబు సేయ నొల్ల. మిమ్ము నిందు
లకుఁ బిల్వఁ బంపితినే? క్షీణదేహుండఁ గాను. ధర్మాంగదుండు రాజ్య
భారంబు వహింప న న్నెవ్వం డెదిరింప శక్తుం డిట్లెఱింగి మీ రీరీతిం
బల్కందగునే? ఒల్లనివానికిం బ్రాయశ్చిత్తం బెవ్వ రొనర్తురు తత్పా
పంబు వారలకే యగును.

66


మ.

సురదైతేయఫణీంద్రసాధ్యమునిరక్షోయక్షగంధర్వకి
న్నరవిద్యాధరఖేచరార్కరజనీనాథాదులున్ విష్ణుశం
కరపద్మోద్భవశుక్రులుం గదిసి సాక్షాత్కారమై నిల్చి ధీ
వరతన్ శాస్త్రముఁ దెల్పిరేనియు భుజింపన్నేర్తునే? యిత్తఱిన్.

67


క.

ధర దిరిగిన నాహిమవ
ద్గిరి దిరిగిన జలధు లింకి కెడసిన వైశ్వా
నరుఁ డుష్ణత విడిచిన నీ
హరివాసరసువ్రతము ప్రియంబే విడువన్.

68


చ.

త్రిభువనసీమయందు వినుతింపఁ బ్రసిద్ధికి నెక్కి ధారుణీ
విభునభమించి మత్పటహవిస్ఫుటఘోషము రత్నఖేటక
ప్రభుపురరాష్ట్రముఖ్యముల బ్రాహ్మణముఖ్యులు విష్ణువాసరా
భిభవము చేసినం గుశలఁ బెట్టు నృపాలకుఁ డంచు మ్రోసెడిన్.

69

వ.

ఈరీతి ఘోషార్భటి మ్రోయఁ బాపం బొనర్చితినేని నీలవస్త్రాచ్చాది
తంబై తత్పటహంబు మలినంబగు. తా నార్జించినయశంబు తానే
యడంచిన క్రిమికీటకజుష్టంబై విష్ణాశయంబైన సూకరయోనిం బది
రెండుయుగంబులు జన్మించు. హరివాసరంబున భుజించినవాఁడు
దురాత్ముండు, పాపమతి, కుకర్ముండు. వాఁడు జనింపనేల? మీది
దివ్యశాస్త్రము గాదు. హరివాసరంబున భుజింపుమనువారు సత్పురుషులు
గారు; భుజింపుమనినవి స్మృతులు గావు; వేదములు గావు. నాఁడు
పైతృకం బాచరించినఁ బితృశేషంబు భుజించినఁ బితృతృప్తి లేదు. వైవ
స్వతుండు సలేఖుండై దూతబలోపపన్నుండై హర్షంబు నొందు ననిన.

70

మోహిని రుక్మాంగదుని నిందించుచు వెడలుట

సీ.

ఆమాట లాలించి యారక్తనయనయై
                       ధర్మబాహ్యుఁడ వైతి ధరణినాథ!
పాంశువు తద్ధర్మబాహ్యుండు సరియని
                       తలఁచిన నేమి తత్పాంశుచయము
ఘనగర్తఖననంబు గావింప బుద్ధిత
                       ద్గర్తపూర్తికి నధికతర మదియె
నీదు ధర్మంబు గాన్పించె నీ కుపధాన
                       మేఁ జేయ నాభుజ మింక నధిప!

!

తే. గీ.

సత్య ముడిగి దురాచారసరణిఁ దిరుగ
మ్లేచ్ఛుఁడవుగావు; నీతియే మ్లేచ్ఛబుద్ధి
నడువ? నిక్ష్వాకువంశైకనాథ! నేను
నిన్ను విడిచితిఁ బోయెదఁ గన్నయెడకు.

71


వ.

ఇట్లు పలుకుచు వేగంబున లేచి యాక్రోశంబు సేయుచు గౌతమాదిభూ
సురులుం దానును మదిరాపానంబు మేలు రాజు సంగంబునకంటె;
మలసంకరణంబు మేలు భూపతి సమాగమంబునకంటె; నీలాంబర
స్పర్శనంబు మేలు మూఢుని కూటమికంటె ; నుదక్యాసంసృష్టి
మేలు దురాచారుని కేళికంటె ననుచు బాహ్యసీమకుం జనియె నప్పుడు
ధర్మాంగదుండు చనుదెంచి యిట్లనియె.

72

ధర్మాంగదుఁడు మోహిని ననునయించుట

క.

రా జేమి చేసె నీ కం
భోజానన రాజు నింద నొందించెద వ
య్యో! జనని! తగునె నీ కీ
యోజన నిఖిలావనీసురోత్తమసభలన్.

73


వ.

అనిన మోహిని యిట్లనియె.

74


మ.

అరుణాశోకసమాకృతి న్మెఱసి చక్రాబ్జధ్వజచ్ఛత్రచా
మరమీనాంకుశముఖ్యరేఖలను రమ్యంబై సువర్ణాంగద
స్ఫురితంబై తగునట్టి దక్షిణకరాంభోజంబుపైఁ జూచి యీ
ధరణీనాథుఁడు సత్యశీలుఁ డనఁగాఁ దప్పెం గుమారోత్తమా!

75


క.

అది గాన సకలభోగా
స్పదమగు మజ్జనకు రాజ్యపదమున కే నేఁ
గెదఁ; ద్రిదశేంద్రాదుల నా
మది మెచ్చక వలచి వచ్చి మఱి యిట్లయితిన్.

76


వ.

అన ధర్మాంగదుం డిట్లనియె.

77


క.

దేవీ! నీయానతి నేఁ
గావించెద నెద్దియైనఁ గటకట! శోకం
బీ వింత చెంద నేటికి ?
వేవేగ నృపాలుకడకు విచ్చేయు మిఁకన్.

78


[26](వ.

అనిన మోహిని యాతని కిట్లనియె.)

79)


సీ.

తనయ! మీతండ్రి మందరగిరిక్షోణి ధూ
                       ర్జటి సన్నిధానదేశంబునందు
భార్యగా ననుఁ జెంది బహుభాషయై పల్కి
                       బొంకెఁ గాంచనవస్త్రభూషణాంబ
రగ్రామఖేటఖర్వటగజహయముఖా
                       ఖిలవస్తువులు వేఁడఁదలచఁ దనకు
హాని యౌననుచు మోహము గల్గి దేహ మే
                       రీతిని బలశక్తి హెచ్చియుండు

తే. గీ.

ననుచు నాత్మోపకారకంబైన కోర్కె
యొకటి తా నిచ్చువరమున కొనరఁ గోరి
బ్రాహ్మణోత్తములును నేనుఁ బ్రార్థనంబు
సేయ ననృతంబు పలికె దుశ్శీలుఁ డగుచు.

80


తే. గీ.

హా! సురాపానతుల్యకృత్యంబు గాదె
యనృత మాడుట ధర్మబాహ్యప్రవర్త
నుండు భాషింపనైన నర్హుండు గాఁడు
దోష మిఁకనైన నీతనితోడఁ గూడ.

81


వ.

అనిన ధర్మాంగదుఁ డిట్లనియె.

82


చ.

అనృతము పల్కనేరఁడు కృతార్థుఁడు మజ్జనకుండు తొల్లి, నేఁ
దనయుఁడ [27]నేడు గల్గి ననృతంబులు పల్కు నె? నీపు తాల్మి భూ
వనితవు రమ్ము రమ్మిపు డవద్యము లెంచక తల్లి! నీకు నీ
మనసునఁ గల్గు కోర్కు అనుమానము లే దొనరింతు నెంతయున్.

83


మ.

ధరణీచక్రము సర్వలోకనుతశశ్వత్కీర్తి యైనట్టి మ
ద్గురుసత్యంబున నిల్చియున్నయది, దుర్దోర్దండదండప్రచం
డరయోద్దండపిచండదండధరపీడల్ మాన్పె, సప్తాంతరీ
పరమారాజ్యవిభాసి ధర్మగుణసంపన్నుం డయో! బొంకునే?

84


వ.

అన మోహిని మరలఁ జనుదెంచె నంత.

85


మ.

మణివైడూర్యసమన్వితం బగుచు సమ్యర్దివ్యరత్నావళీ
ఘృణిదీపాంకురతేజ[28]మౌ పురము లాకీర్ణాంతరంబై సుల
క్షణదీర్ఘత్వవిశాలతాకలితమై కాన్పించు శయ్యన్ సమీ
క్షణముల్ మూయుచు విప్పుచున్ గలఁగి రాజన్యుండు చింతింపఁగన్.

86


క.

చని కనుఁగొని యీమోహిని
యనరానివి నిన్ను నాడ నర్హం బగునే
తనయుఁడ నేఁ గల్గఁగ నీ
వనృతోక్తులు పల్కితివని యాడించుకొనన్.

87

శా.

కోశాగారము రాజధాని సకలక్షోణీతలద్వీప మా
ద్యాశాచక్రసదేశదేశగజవాహానీకముం బ్రాఁతియే?
యీశాతోదరి కిచ్చి నిల్పు మిఁక ధాత్రీశా! భవత్సత్యభా
షాశీలంబు ధనుర్ధరుండనయి నే సాధింతు నేవస్తువుల్.

88


సీ.

శక్రపదం బిమ్ము జగదీశ! యాశక్రుఁ
                       డోడినాఁడని చూడు ముగ్రశక్తి
శక్రపదాకాంక్ష సల్పదేని కృశాను
                       యమయాతుధానజలాధినాథ
పవమానయక్షేశపదములు నర్పింపు
                       మది నొల్లదేని బ్రహ్మపదమైన
సనకాదిఘనయోగిజనరంజమున నిరం
                       జనమునై యున్న సశక్యతపముఁ


తే. గీ.

జేసి పద్మజు మెప్పించి సిరులతోడ
మెఱయఁ జేకొని తెత్తు నమేయమహిమ
నదియు నర్పింతు నీవు జిహ్వాగ్రవీథి
నాడి సత్యంబు వదలుట యర్హ మగునె?

89


క.

అనఘాత్మ! సత్యవర్తన
జనని మనోరథము దీర్ప స్వరమహీభో
గినిలయములఁ గలవస్తువు
లనిశంబు జయించి తెత్తు నర్పింతు ధృతిన్.

90


తే. గీ.

పార్థివేశ్వర! నీప్రతాపంబువలన
నవనిలోపల నా కసాధ్యంబు గలదె?
దాసుఁడఁ దనూజుఁడ హితుండఁ దల్లి [29]నన్ను
నెయ్యది యొనర్పు మనిన నే నిపు డొనర్తు.

91


క.

మజ్జననీ మజ్జీవిత
మజ్జాయాజనమునైన మహి రంజిలి వి
ద్వజ్జనము మెచ్చ నిచ్చెద
నిజ్జనము లనంగ నాకు నెంత నరేంద్రా!

92


వ.

కావున నింద్రవైభవంబును, దినేంద్రతేజంబును గలవాఁడవు. నీకు
నీయపయశంబు వహియింపం దగునే? యని పుత్రుండు పలికిన
రుక్మాంగదుం డిట్లనియె.

93

రుక్మాంగదుఁడు తననిశ్చయము నెఱింగించుట

తే. గీ.

అనృతమై యుండనీ వాక్య, మపయశంబు
వొందనీ; ఘోరనిరయంబుఁ జెందనీ; ము
కుందవాసరభుక్తి నేఁ గోర నొల్ల
నందనందనసత్కృపానందమహిమ.

94


తే. గీ.

అధికదుర్మేధ యిది మూర్ఖ యగ్గలముగఁ
బరుషభాషలు పల్కినఁ బల్క నిమ్ము
కోర దెయ్యదియును మహాఘోరధర్మ
దూరనారకవీథుల త్రోవఁ గాని.

95


క.

క్రిమినై యనృతవచఃపా
పమునన్ జనియింతు మీఁదఁ బంకజనాభో
త్తమదినమునఁ గల్మషభో
జ్యము సేయఁగ నొల్ల సకలజనులు హసింపన్.

96


సీ.

ఎడసి పోనిమ్ము మోహినియు నేతద్విర
                       హానలంబున మామకాంగ మెటుల
నుండిన నుండనీ చండాంశునందనో
                       ద్దండదండాహతి ధరణిజనులు
నరకబాధల నొంద నమ్మించి నే నె ట్లు
                       పేక్షింతు నిఖిలసురేంద్రమౌళి
తటతలంబులు ద్రొక్క ధన్యత హరివాస
                       రోపోషితజనంబు [30]నొంచి విష్ణు


తే. గీ.

లోకమంతయు నిందించి లోలబుద్ధి
నన్యధర్మంబు నే నెట్టు లాచరింతు
భార్యకై కాముకుండనఁ బ్రథ వహించి
యితర మొల్లదు దుర్మేధ యీలతాంగి.

97


క.

గరళము మ్రింగుదు వైశ్వా
నరుశిఖలం బడుదుఁ బడుదు [31]ననిశిఖరముపై
శిర మసిఁ డూలింతును శ్రీ
హరివాసరమున భుజింప నాత్మజ! యింకన్.

98

క.

భూమిన్ రుక్మాంగదుఁడను
నామము నేకాదశీదినవ్రతపుణ్య
శ్రీమహిమయుఁ గీర్తింపఁగ
సామాన్యుం డనఁగ బ్రదుక శక్యం బగునే.

99


వ.

అనృతంబు పలికిన నాకీర్తి యెటులైనం గానిమ్ము మోహినినిమిత్తంబు
మరలదు: హరివాసరంబు వదలననిన తండ్రి వాక్యంబులు విని
సంధ్యావళి రావించి మోహినికి మనోభంగంబు గాకుండ, రాజు
హరివాసరవ్రతభంగంబు గాకుండ నన్యోన్యానురాగంబు నొందింపు
మని విన్నవించిన సంధ్యావళి మోహినిం జూచి ప్రియవచనంబుల
నిట్లనియె.

100

సంధ్యావళి మోహిని ననునయించుట

తే. గీ

అధిపు ధర్మంబుఁ దొలఁగింప నాగ్రహంబు
సేయకుము నీమనంబులోఁ దోయజాస్య!
యమ్మహారాజు హరివాసరాంతరముల
నన్న మనుపేరు వీనులనైన వినఁడు.

101


తే. గీ.

భర్త సువ్రత మొనరింప భార్య యాత్మ
నానుకూల్యంబు వాటించి యాచరించి
యందుఁ బోఁ బుణ్యలోకంబు లమితకీర్తి
వెలయు సావిత్రివోలెఁ బవిత్ర యగుచు.

102


వ.

మందరాచలంబున శుభకరంబగు కరం బిచ్చి కామాంధుండై మఱచి
యున్ననేమి? అది నేఁ గావించెద. ఈరాజు శైశవంబున నుండి హరి
దినంబున భుజియింపఁడు. మఱియొక్కటి వేఁడుము. నన్ను, ధర్మాం
గదు, రాజ్యంబును, జీవితంబునేని యిప్పింతు. వరిష్ఠనైన నేను గనిష్ఠ
నైన నేమి? అధికనిష్ఠం బాదంబు లొత్తెద, మ్రొక్కెదం బ్రస
న్నవు కమ్ము.

103


చ.

పతి ననురక్తిమై శపథపాశముల న్మెడఁగట్టి యీడ్చి యు
న్నతిమతియై యకార్యకరణంబులకుం బురికొల్పునట్టి యా
సతి నరకంబులం బడి యసారగతిన్ బదిరెండుజన్మముల్
క్షితిపయి వల్గు లీతనువుఁ జెందు నిజంబు నిజంబు మానినీ!

104

ఆ. వె.

ఇటుల నెఱిఁగి నీకు హితవృత్తి పాటించి
యీయకార్యకరణ మేల యనుచు
మాన్పఁదలఁచి నీకు మఱియును మఱియును
దెలుపవలసె నాకు జలజనయన!

105


ఆ. వె.

ధర్మబుద్ది చెప్పఁదగు విరోధికి నైనఁ
జెలిమి గలుగునెడలఁ జెప్పఁదగదె?
యదియుఁగాక పతికి నత్యంతహితవృత్తి
గలిగి యునికి మానఁగలనె చెలిమి.

106


వ.

అని సంధ్యావళి పలికిన విని నగి నీవచనంబులు ధర్మనిబద్దంబు లగుట
సేయందగు. వివాదంబుచేత ద్వంద్వదృష్టి యగునని నారదాదులచేతఁ
బలుకంబడియె. హరివాసరంబున నీ రాజు భుజింపండేని మరణాధికం
బైనయొకటి సేయవలయునది నాకును దుఃఖకరంబగు నైనను నేను
దైవవశంబునఁ బలుకుచున్నదాన. నాత్మహనన విషభక్షణ గిరిశృంగ
పతన వ్యాళవదనచుంబన వ్యాఘ్రసింహాభిగమనంబు లెవ్వరికి
నిష్టంబులు? దురుక్తానృతవాక్యపరదారాభిమర్శనాభక్ష్య భక్షణా
భోజ్యభోజనమృగయాపానద్యూతక్రీడన తృణకాష్ఠచ్ఛేదన లోక
దండన సూక్ష్మజీవహింస నక్రీడనంబు లెవ్వరికి నర్హంబులు? ఇట్టివి
యేను నతండు [32]సేయమే? యశోదాహకంబై ఘోరంబైన నరక
కర్మంబు సేయండే?[33] ఏను నిర్దయనై పలుకుచున్నదాన. తండ్రి యెటు
వంటిభావంబుఁ దలంచుఁ దద్భావంబుననే యపత్యంబు జనియించు.
రుక్మాంగదభ్రంశనార్థంబు జలజసంభవుండు నన్ను దుర్భావన
సృజించెం గావున నాకు దుష్టత్వంబు గాక శిష్టత్వంబు గలదే? నీకును
రాజునకు ధర్మాంగదునకుం గీర్తి యగునట్లుగా నొకటి యెఱిగించెద
ననిన సంధ్యావళి యిట్లనియె.

107


ఆ. వె.

ఆత్మహాని పుత్రహాని సామ్రాజ్యైక
హాని యైన నెంత నధిపవాక్య
సత్యకరణశీలశాలిని న్నైన నా
కకట! వెతలు గలవె యాత్మలోన?

108

తే. గీ.

భర్త దుఃఖోపలబ్ధిమైఁ బరితపింపఁ
జేయునింతి యధోగతిఁ జెంది జన్మ
సప్తతిం బూ[34]యు నిరయాప్తి సడలి మూఁడు
నమలు విముఖిక్రిమికుయోని జని వహించు.

109


క.

ధనమేని ప్రాణమేని వి
భున కడిగినయపుడె యీక పూనికతో నుం
డిన సతి విష్ఠాక్రిమియై
ఘనదైన్యముతోడ నింతికాష్ఠిలయు నగున్.

110

కాష్ఠకీటవృత్తాంతము

వ.

ఏను బాల్యంబున సఖీజనంబుతోడన్ మత్పితృమహాననశాలం గోష్ఠ
[35]పాలనపరుండగు పాచకుండు కాష్ఠదళనం బొనర్పఁ దత్కాష్ఠ
మధ్యంబుననుండి నవనీతశుభాకారయు, నంజననిభాననయుఁ
గనిష్ఠికాప్రమాణయుఁ ద్వఙ్మాంససమావృతయునైన యొకకాష్ఠిల
మెదలిన దాని భక్షింప నొకవాయసంబు చంచుపుటంబునం బొడుచు
నంత నే నొకకాష్ఠంబున నదలించిన వాయసంబు విడిచి చనియె.
అప్పు డాకాష్ఠిల మనుష్యభాషల నిట్లనియె.

111

సుప్రియ యను స్త్రీచరిత్రము

సీ.

వినుము సంధ్యావళి మును దురితం బొన
                       ర్చినదానఁ గౌండిన్యుఁ డనఁగ నొక్క
బ్రాహ్మణోత్తముఁడు శోభనధర్మశీలుండు
                       గలఁడు కన్యాకుబ్జకలితయశుఁడు
తత్త్వజ్ఞుఁడైన యాతనిభార్య నేను సు
                       ప్రియ యనుదాన నో భీరుమధ్య!
తల్లిదండ్రులును బాంధవసమూహంబు న
                       న్నల్లారుముద్దుగా నాచరించి

తే. గీ.

సత్యకులశీలవేదశాస్త్రప్రసంగ
వరవధూసంగభంగనిర్భరతరాంత
రంగుఁడగు తద్వరున కిచ్చి[36] రతులనియతి
సమవివాహం బటంచు భూజనులు పొగడ.

112


క.

మామామ యిచ్చె వరము
క్తామణిహేమాయుతములు తతవైభవల
క్ష్మీమహనీయోత్సవమున
నామేరనె యిచ్చెఁ దండ్రి యతిమోహమునన్.

113


వ.

ఇట్లు పితృశ్వశురదత్తవిత్తశ్రీప్రమత్తనై యుండ నంతఁ గొంత
కాలంబునకు నాయత్తమామలు నాకలోకంబునకు నేగి రంతం
బ్రబుద్ధుండై మద్భర్త మాసద్వయంబు గడచిన రాజమందిరంబునకు
నేఁగి మరలివచ్చుచు రూపలావణ్యవిలాసవిభ్రమంబులుగల వేశ్యలం
జూచి వారలలోన సౌందర్యనిధి యగు నొక్కర్తు నింటికిం దెచ్చు
కొని దానితో రమింపుచు విత్తంబుఁ గోలుపోయె. వర్షత్రయంబునకు
జూదంబాడి నిలస్స్వుండై మధ్భూషణంబులు వేఁడిన నొసంగక పితృ
గృహంబునకు నేగితి నంత గృహంబు విక్రయించె నంత నల్ప
మూల్యంబునకుఁ జేను దొడ్డి తోఁట మంద మొదలు సర్వంబును నమ్మి
కొనియె నంత నోడ యెక్కి సముద్రతరణంబు చేసి దూరంబునకు
నేఁగ వాయువశంబున నాయోడ యామారంబునఁ బడి యేడుయోజ
నంబులు మించి చనియె నందునున్న నావికులు క్షుత్పిపాసార్దితులై
పరాసులైరి. విత్తంబంతయు విడిచి దైవయోగంబున నడవి చేరి
నిషాదులుం దాను నోడ విడిచి బహుశృంగవిభూషితంబై బహువృక్ష
సమాకీర్ణంబై బహుపుణ్యఫలాన్వితంబై యంబరచుంబిశిఖరంబగు
నొక్కనగంబుఁ జేరి భక్షణంబు వెదకుచు.

114


తే. గీ.

అచట నొకద్రాక్ష చూచి జరామరణ[37]వి
నాశనములగు ఫలములు నవ్యమధుర
రసము లొలుకంగ భక్షించె రమ్యరుచులు
దనర నిరువదియాఱింటిదనుక నతఁడు.

115

తే. గీ.

అంత నాతఁడు మృదుశీతలాంబుధార
నల్లనల్లనఁ గోరి ఛాయావిశాల
సాలసాలంబు మించి పంచాశదుచ్చ
పురుషమానోన్నతి వహించి పొదలియున్న.

116


తే. గీ.

అన్నగచ్చాయ నుత్తరీయంబు పఱచి
దానిమీఁదట శీతవాతంబు విసర
నిద్రవోవంగఁ దపనుఁ డస్తాద్రిఁ జేరె
నంధతమసంబు నిండె దిశాంతరముల.

117

రత్నావళివృత్తాంతము

వ.

అప్పు డొక్కరాక్షసుండు కాశీపతిపుత్త్రి రత్నావళి యనునది దౌత
పాదయై పరీతశిరస్కయై నిద్రింపుచు వలయంబులు రెంటను బది
రత్నంబులును, నీవియందుఁ బదియేడురత్నంబులును, సీమంతంబున
నేడురత్నంబులును, గేయూరంబునం బదుమూఁడురత్నంబులును
బూని మెఱుపువలె నొఱుపు చూపం బతికామయై తగినపతి లేక పరి
తపించుచు నున్నదాని దశాననుండు సీతంబోలె హరించి మొఱలిడ
నంకంబున నిడికొని మత్పతియున్న సాలంబుచెంత సర్వైశ్వర్య
సమన్వితంబై మయనిర్మితరత్నమయచిత్రమందిరంబై కనకశయ
నాసనశోభితంబై పద్మరాగపాత్రంబై బహువృక్షసమాకీర్ణంబై బహు
భక్ష భోజ్యాభిరామంబై పరిఫుల్లహల్లకోత్పలవిభూషితహంసకారండ
చక్రవాకోపశోభితతీరసారవనవిరాజితపుణ్యనదీశోభితంబైన యొక
గుహ సొచ్చి కుసుమశయ్యపై రాజకన్య నునిచె నంత నారాక్షసుని
భార్య చూచి భర్తం గనుంగొని దీని నేమి కారణంబునం దెచ్చితి
వే నుండ? సపత్నీదుఃఖంబు సహింపనేర్చునే? యని యాగ్రహించు
గృహిణిం జూచి ప్రియభాషల లాలించి యిది భక్షణార్థంబుగా సంపా
దింపఁబడియె. ద్విజుం డొకండు దైవవశంబున నాహారంబుగాఁ
జేరినవాఁడు. వానిం దెమ్ము భక్షించెద ననఁ దద్వాక్యంబులు విని
చెఱగొని తెచ్చిన యారాజకుమారి యేకతంబున నిట్లనియె.

118


శా.

మిథ్యావాక్యము పల్కె నీవిభుఁడు దుర్మేధావధానంబుతో
దథ్యం బయ్యెనె నీకు? నీదుముదిమిం దర్కించి చంచద్గుహా
వీధ్యంతస్థలి నుండ రోసి విడిచెన్ వేషంబు దూషింపుచున్
దథ్యం బింతయు రాక్షసోద్వహనకృత్యం బో సరోజాననా!

119

వ.

అనిన విని.

120


శా.

క్రోధారక్తకటాక్షయై కలఁగి రక్షోభామ యీభామరే
ఖాధారాళవిలాసవిభ్రమశుభాకారంబు వీక్షించి ధై
ర్యాధిక్యంబు వహించి రక్కసి బలొదార్యక్రియాశక్తి దు
స్వాధుం డీతఁడు పాద ముంచు నిఁక నస్మన్మస్తకాగ్రంబునన్.

121


వ.

అని వితర్కించి యీజగన్మోహిని భార్య యయ్యెనేని నాకు నిలువ
నవకాశంబు గలదే? సాపత్న్యదుఃఖంబు సర్వదుఃఖంబులకు దుఃఖ
తరంబు. భార్యాద్వయంబు గలవానికి సమతాబుద్ధి లేదు. పతికి నిష్ట
యైనయది సుఖం బుండు. పతికి నిష్టంబుగానియది తిరస్కారంబు
నొందుం గావున వైరనిర్యాతనంబు సేయవలయునని భర్తతో
నిట్లనియె.

122


శా.

రక్షోనాయక! యీ సరోజవదనన్ రాజాత్మజన్ బాపురే!
భక్షార్థంబుగఁ దెచ్చితేని విటపిప్రాంతస్థనిద్రాణనూ
త్నక్షోణీసురవల్లభున్ మెసఁగు మానందంబునన్ నీకు ని
త్యక్షేమంకరశక్తియుక్తుల మితోదారంబులై వర్ధిలున్.

123


వ.

అన ధవుండు పొమ్ము పొమ్ము సృక్వభాగంబు లూరుచున్నయవి
యన గుహ వెడలి పదియాఱేండ్లజవ్వనియై నిలిచి మద్భర్తం జూచి
రాకాసి యిట్లనియె.

124


తే. గీ.

ఏల వచ్చితి విటకు మహీసురేంద్ర!
కార్య మిచ్చట నెయ్యది గలదు నీకు
నేను రాక్షసిఁ బతి రాక్షసేంద్రుఁ డొక్క
రాజసుతఁ దెచ్చుకొని దాని రహినిఁ జొక్కి.

125


తే. గీ.

నన్ను దిగనాడినాఁడు మనంబునందు
నిన్నుఁ బతిఁగాఁ దలఁచి యే నిశ్చయించి
యున్నదాన ననుగ్రహోద్యుక్తి నన్ను
నేలు దయఁజూచి నేఁడు మహీసురేంద్ర!

126


వ.

అనిన విప్రుండు ప్రియభాషల నిట్లనియె:

127


క.

మనుజులు రాక్షసులకు భో
జనములు తద్గోష్ఠి యెట్లు శక్యము రక్షో
మనుజవిరోధము పూర్వం
బుననుండి జనించినయది భువనములోనన్.

128

వ.

అన మదిరాక్షి మధురోక్తుల నిట్లనియె: భవిష్యద్భారత పురాణంబున
హిడింబియను రాక్షసి భీమసేనుండను పాండవునకు భార్య గాఁగలదు.
అతనికంటె బలాధికుండైన ఘటోత్కచుండను తనయుండు జనియింపఁ
గలండు. వాని నేశస్త్రంబుల వధింపఁ దరంబు గాదు. ఇంద్రశక్తిచేత
సాధ్యుండు గాఁగలఁడు. ఆశక్తి పూర్వంబున వైరోచనిజిఘాంసచే
నింద్రుండు మధ్యమలోకంబునకుఁ జని శౌర్యంబున నాశక్తిఁ దెచ్చి
సాలాగ్రంబున నుంచిన వాఁడదె యమర్త్యుని పైనేనిఁ బ్రయోగించిన
మృతుండు గావలయు నది మత్పతి సాలాగ్రంబున నిడినవాఁడు అది
నేఁ దెచ్చెద నది రాక్షసుపై ప్రయోగించితివేని యతం డీల్గిన మన
మన్యోన్యప్రేమాతిశయంబు లనుభవింపఁగలము. కాదేని వాఁడు
నిన్ను భక్షించు. నన్ను సపత్నీదుఃఖంబునం బొరలించుం గావున నీ
యత్నంబుం దలంపు. నే ననృతంబు పలికితినేని జన్మార్జితపుణ్యంబులు
దొలంగు, బ్రహ్మహత్యాపరులపాపంబు నొందుదు, మద్యపానం
బొనర్చిన దురాత్ములైన బ్రాహ్మణులదురితంబు నొందుదు, స్వర్ణ
రత్నమే దిన్యవహారంబులు చేసినవారి దుష్కృతంబుఁ గాంతు,
ఆత్మహననంబు చేసినవారి దుర్గతిం బాయుదు, పంచమియందు గర్గరీ
రవం బొనర్చిన స్త్రీల కిల్బిషంబుఁ జెందుదు. నవమిం దరుచ్ఛేదంబు
చేసినవారి దుష్కర్మంబునకు లోనైయుండుదు. పర్వంబుల స్త్రీ
సంగమంబు చేసినవారి వృజినంబులకు లోనగుదు. ఎవ్వఁ డుచ్చిష్ట
సమయంబున ఘృతంబు వోయించుకొని భుజించు నెవ్వఁడు ఘృతంబు
వ్రేలం బట్టి యాస్వాదించు నెవ్వఁడు దివారతం బొనర్చు వారి కల్మ
షంబులకు నాలయంబై వర్తింపుదు. గృహస్థుండై వైశ్వదేవంబు
సేయక భుజియించి భిక్షుకులకు భిక్ష యొడంబడి పరిహరించినవారి
యఘంబునకు నాటపట్టై కనుపట్టుదు. సంక్రమణంబునఁ దైలస్నానంబు,
గోవులచేతఁ దీర్ఘవ్రజనంబును, బరోదపానంబునందుఁ బంచమృత్తికా
పిండోద్ధరణంబు సేయక స్నానంబు చేసినవాని యంహువారంబులకుఁ
జేరిక యగుదు. కుశకాశతృణంబులుదక్క శుష్కకాష్ఠంబుల దంత
ధావనంబు చేసినపంకం బనుభవింపుడు. నిజగృహంబున మొదవుం
గట్టి తృణజలంబులం బోషించనివాని యేనంబులం జేకొందు. దేవార్చన
యందుఁ బైతృకంబునం గాష్ఠాసనంబున నుండి యెవ్వఁ డాచరించు వాని

దుష్క్రియలకు మూలంబగుదు. ఏబ్రాహ్మణుండు గోరహితంబుగా
మహిషీగణంబు నేలుకొనువాఁ డెన్నెన్ని బాములం బడు నవి నే నొందుదు.
చిరిఁగిన, యధౌతంబైన దగ్ధంబైన పరులు గట్టినదియైన పటంబుఁ
గట్టుగొని దేవార్చనంబు సేయువాఁ డేగతిం బొందు నాగతిం బొందుదు.
వధూవిలోకనపరదారవిలోకనంబుల నెయ్యది ప్రాపించు నది నాకు
లభించు. సత్కథాప్రసంగంబు సేయునెడ విఘ్నం బాచరించువాఁ డే
లోకంబు నొందు నాలోకంబు నందుదు. పారక్యమందు నజాత
కుసుమంబునఁ జేయువాఁ డెచ్చటనుండు నచ్చట నుండుదు. కంచుకో
పేతయగు విధవయుఁ గంచుకరహితయగు భర్తృమతియు నేజగంబుల
నుండుదు రాజగంబుల నుండుదు. హీనజాతియతండు బ్రాహ్మణ
వేషంబుఁ దాల్చిన, బ్రాహ్మణుండు బ్రాహ్మణచిహ్నంబు లేకయుండిన
నేదుర్గతులం బొందుదు రాదుర్గతులం బొందుదునని పాపరాక్షసి
బోధించిన నంగీకరించి ద్రవ్యలోభరతిలోభంబులు పెనఁగొని
తచ్ఛక్తి వేగంబె తెమ్మని నియోగించిన రాక్షసి చని తెచ్చె నంత.

129


క.

ఘనుఁ డారాక్షసవీరుఁడు
తనుఁ జెఱగొనితెచ్చి మదనతంత్రక్రీడన్
బెనఁగొన వచ్చిన నా నృప
తనయ ప్రియం బొప్పఁ బలికె దనుజునితోడన్.

130


క.

పరిణయము లేని కన్యను
గరిమన్ రతి సల్పఁ బాతకంబని శాస్త్రాం
తరములఁ బల్కిరి ధరణీ
సురవర్యులు వినవె ధర్మసూక్ష్మక్రమముల్.

131


సీ.

అది గాన మద్భాగ్య మట్లయినఁ గానిమ్ము
                       నీకు దోసము లేదు నిశిచరేంద్ర!
కాముకుండవు గాన భూమీశసంగుప్త
                       సౌధస్థలముఁ జొచ్చి శంకలేక
తెచ్చితి నన్ను నుద్వృత్తిమై మొదలనె
                       ధవుఁడు భార్యయును విద్యయు గృహంబు
విత్తంబు కష్టంబు వృద్ధి క్షయంబులుఁ
                       బ్రాపించు దైవకృతంబువలన

తే. గీ.

నారదుఁడు తత్త్వవిద్యావిశారదుండు
నానతి యొసంగె నట్లనె యఖిలజనులు
దైవవశమున నుండఁగఁ దగునుపాయ
ములు వృథాయగు వంధ్యారతులను బోలె.

132


ఆ. వె.

నీవు దక్క నాకు నిక్కంబు పతి లేఁడు
సాలసాలమూలసంప్రవేశి
యైన విప్రు నీకులాంగన చంపక
యుండెనేని తె మ్మఖండమహిమ.

133


తే. గీ.

పావకుండును జలమును బాహ్మణుండు
భర్త లరయంగ జగతిలోఁ బరిణయమున
కట్లు గాన కుశజలానలాదికంబు
లొనరకుండిన బ్రాహ్మణుం డొకడు చాలు.

134


మ.

దనుజాధీశవతంస! నేఁడు సుముహూర్తంబైన హోమాంతరం
బున విప్రున్ భజియింపు మీ వనిన నా పూవిల్తుఁ డేయన్ రయం
బున నేఁగెన్ ఫలియించుఁబో మనసులోఁ బూర్జంబులౌ కోర్కు లా
ఘనవిప్రున్ మడియించునో యిపుడు మత్కంజాక్షి గర్వోద్ధతిన్.

135


మ.

అని చింతించుచు నేఁగుచో నదరె నవ్యంబైన నే త్రంబు స
య్యన నాత్మక్షుత ముద్భవించె, నిజదేహాకీర్ణమౌ నంబరం
బును నేలం బడియెన్ నగాగ్రమున నిప్పుల్ గ్రక్కె ఘూకంబు ప్ర
త్యనిలంబుల్ పలుమాఱు వీచె నశుభంబై తోఁచెఁ గ్రవ్యాశికిన్.

136


సీ.

అవి యన్నియును నాదురాత్మకుఁ డాత్మలో
                       గణన సేయక వచ్చి కామనీయ
కస్ఫూర్తి మానుషకాంతయై భర్తృభా
                       ర్యాభావములను బ్రాహ్మణుఁడుఁ దాను
జోకయై మద్భర్త క్షుద్రుండు సంతత
                       పాపశీలుండు సపత్నిఁగాఁగ
నొకబాలరాజకన్యక నెత్తుకొని వచ్చి
                       యున్నవాఁ డతని నే నొల్ల ననుచు

తే. గీ.

నాడికొన విని క్రోధతామ్రాక్షుఁ డగుచు
వివృతవదనంబుతోడఁ దద్వీరుఁ డుగ్ర
వాక్కుఠారంబు బెళఁ కనవార్యశక్తిఁ
గవసి చనుదేర వెఱచి తత్కంజవదన.

137


వ.

శక్తి వైవుమనుచుఁ దచ్ఛక్తిఁ దెలుప నది ప్రయోగించిన వక్షస్థ్సలంబు
నాటి రాక్షసుం డీల్గె నంతఁ దచ్చక్తి నాకంబునకు నేఁగె. నిశాచరకాంత
యేకాంతనిశాంతంబునకుం దిగిచి దివ్యమానసభోగంబు లనుభవింపు
మని పయోధరంబు లాస్ఫాదింపుచుఁ గౌగిటం జేర్చుకొని వెనుచని
వచ్చు కాంతునకుం గైదండ యిడి కుచంబుల నొత్తుచు గుహలోనికిం జని
రాజకన్యకామణిం జూపి యిది పంచగవ్యూతిసంజ్ఞచేఁ గాశియను
పురంబు గలదు. హరిహరభాస్కరులకు నాలయం బైనదది. అందు
నీల్గినవారికిఁ బునరావృత్తి లభింపదు. ఆపట్టణం బేలు రాజపుత్రి యిది.
దీనిం గాముకుఁడై మత్పతి నిద్రించునెడఁ గొనితెచ్చె. దీనిఁ దండ్రి
కడకుఁ జేర్చి సంరక్షించు. ఇవియే వరరత్నశయనాసనంబు లేను నీ
యధీన. నేను నిన్నుం గోరి వీనిం జంపించితి. వీనిం గౌమారంబునఁ
బతింగా వరించియు నీశుభాకారంబునకు మోహించి యిట్లు కావించితి
నన్నుం గటాక్షించు మనినఁ దద్రాక్షసితో నిట్లనియె.

138


సీ.

స్త్రీల నమ్మఁగరాదు చెలువ! సపర్ణుఁడౌ
                       ప్రాణనాయకుని సాపత్న్యశంక
సమయించితివి నన్ను సమయించు టేమి చో
                       ద్యంబు లావణ్యగుణాభిరాముఁ
డధికుండు నాకంటె నభిమాని యరుదేర
                       నీ కేటి మోహంబు నీరజాక్షి!
యత్యంతభయము బాహ్యాభ్యంతరంబుల
                       నావహింపుచున్నయది నిజంబు


తే. గీ.

చంద్రబింబాస్య! నీకు నిష్ట మగునట్లు
సేయు మిఁక నెల్లి నేఁ డింకఁ జిత్తగించి
త్రుంచి భుజియించు నీవు నక్తంచరాంగ
నామణివి నీకు నిది కులన్యాయపథము.

139


వ.

అనిన.

140

మ.

నను నెల్లప్పుడు నేఁచు రాక్షసుఁ డనూనక్రోధధూమ్రాక్షుఁడై
మును, దీనిం జెఱదెచ్చె నగ్గలికమై మోహించి సాపత్న్యదుః
ఖనిరోధం బొనరించె వీఁడు మిగులం గష్టాత్ముఁ డేమందు నీ
దనుజస్త్రీ పతిఘాతశీల (?) యని యాత్మన్ నమ్మఁగా నేర్తువే?

141


వ.

అయిన నేమి? నమ్మినవానిం దెగటార్చిన బ్రహ్మహత్యాపాపంబులని
యెఱుంగనే?

142


ఆ. వె.

నమ్ము నమ్ము నన్ను నమ్మినవాఁ డని
నిన్ను నిర్వహింతు నిజమనోధి
రాజయైన యంత[38]రాత్మయుఁ బంచభూ
తములసాక్షి నీవె ధవుఁడ వెంచ.

143


వ.

అనినఁ దద్వాక్యంబులు సత్యంబులుగాఁ దలంచె నంత రాక్షసి నిజమంది
రంబునంగల సకలధనంబులు సంగ్రహించుకొని కరేణురూపంబున
బ్రాహ్మణునిం బైనిడుకొని రాజపుత్రియైన రత్నావళి నదృశ్యకరణ
శక్తిం దోడుకొని తృతీయముహూర్తంబున శంకరాలయంబున కరు
దెంచి కాశీపురంబు చూపి యిది పాపతరుకుఠారంబు. ఇది సంసార
గేహపాదకం బిది షడూర్మికూర్మసువర్ణద్యూతం బిది కర్మబీజోష
రం బిది సద్గతిమూలం బిది పురాణంబుల వైష్ణవస్థానం బని వర్ణింపు
దురు. శంకరుం డెన్నిదివ్యతీర్థస్థలంబులు దిరిగిన బ్రహ్మహత్య
దొలంగదయ్యె నిది విడిచిన నేమి యగునో? యని ప్రార్ధించిన నారా
యణుం డిచ్చె నిది శివునకు. నాఁడు మొదలుకొని శివక్షేత్రం బయ్యె
నిది భోగాభిలాషుల కేని మోక్షదాయకం బిందునున్నవారికిఁ గాల
భైరవుం డనేకవిఘ్నంబులు గల్పించు నిందు సిద్దింబొందిన చంచ
లాత్ములకేని ముక్తి కరతలామలకంబగు. ఈరత్నావళితండ్రి
ప్రతాపశాలి యీపట్టణం బేలు నతనికి నీకన్యక నర్పించుము. ఈ
క్షేత్రంబు భుక్తిముక్తిప్రదాయకంబు అని విన్నవించిన విని
బ్రాహ్మణుండు రత్నావళితో దిగు నంత.

144


క.

పీనోత్తుంగపయోధర
మై నారీలీలఁ దాల్చి యారాక్షసి సు
శ్రీ నరుగుదేర విప్రుం
డానృపకన్యాపురమున కప్పుడు చనియెన్.

145

మ.

చనుచో నంత నిశీథమయ్యెఁ బురరక్షాశీలకుల్ ధావనం
బున నన్యోన్యభయంకరార్భటి సమాపూర్ణోగ్రకోలాహలం
బునఁ బెల్లార్చుచు రాజవీథికల చప్పు ళ్ళాలకింపఁగఁ గ
న్గొని యారాజకుమారి పల్కె నపు డాక్షోణీశభృత్యాళితోన్.

146


వ.

మీరు వేగంబునం జని మజ్జనకుండగు రాజుతో నంతఃపురంబున నుండి
మున్ను న న్నొకదురాత్ముండు రాక్షసుండు గొని చనిన నారాక్షసుని
చేత సమాషితనై బ్రదికి వచ్చితి. నాకై విచారంబు నందవలవదు.
బ్రాహ్మణుం డొకండు మహానుభావుండు తోడ్తెచ్చె నతని నెదుర్కొని
యర్ఘ్యపాద్యపురస్సరంబుగాఁ బూజింపుము. దైవవశంబున శత్రుం
డణఁగంద్రొక్కలేఁడయ్యె. పితృవనంబున గతజీవుల యన్నంబు
భుజించు వాయసంబునకు హవిర్భోజనంబు లభించునే? శునకంబున
కుచ్ఛిష్టంబుగాక రాజార్హంబైన పంచగవ్యప్రాశనంబు సిద్ధించునే? ఏను
దద్రాక్షసునకు భార్యనై బ్రదుకనేర్తునే తల్లిదండ్రులైన మీభాగ్యవిశే
షంబున విష్ణుపాదసంప్రాప్తగంగోదకధారవలెఁ బవిత్రనై వచ్చితి నని
విన్నవించుఁడని పలికిన సుబాహుండను పురరక్షాపాలుండు రాజ
గృహంబున కరిగి యన్నియు విన్నవించిన నద్భుతంబగు తద్వృత్తాంత
మంతయు విని రాజు మహామాత్యకళత్రపురోహితసమేతుండై పుర
ద్వారంబున వెడలి గంగాతీరంబున సమానకుసుమాభిరామయు నను
పమమణిభూషణోద్దామయు నగు కూఁతుం గాంచి దూరంబుననుండి
మొఱలిడుచు వచ్చి యక్కునం జేర్చె నంత నంతరంగంబు నిండ నా
కాంత తండ్రికిం బ్రణమిల్లి ఏను ధౌతచరణనై కాళ్ళకడ శిరంబు చేర్చు
కొని నిద్రింప రాక్షసుండు గొని చనియె. నన్ను వరింపదలఁచిన రాక్ష
సుని నేతన్మానుషాకృతినున్న తద్భార్య సాపత్న్యదుఃఖంబున వానిపై
నలిగి యతండు శౌర్యంబునం దెచ్చిన యింద్రశక్తి దైవవశంబునం
జేరిన యీబ్రాహ్మణునిచేతి కిచ్చి మడియించె. మమ్ముఁ గరేణురూపం
బునఁ దనపై నెక్కించుకొని యిచ్చటికిం దెచ్చె. దీనిం బూజింపవలయు.
ఈబ్రాహ్మణోత్తముండు సద్గుణపూర్ణుండు. ఈతండె నాకుం బతి.
పురాణంబుల నొకనికిం గూర్చినయది యొకనికి లభించదని పలుకుదు
రితనిపై నాకు మనంబు దగిలినయది. సతీధర్మంబు నిట్లనె యగు.
శాస్త్రాగమనిదర్శనంబున నితనిం గని యే నన్యు నొల్ల. ఈరాక్షసి

మత్ప్రాణంబులు నల్మినయది. ఏతత్సమ్మతంబుగా రూపకులశీలసంప
న్నుండగు నీబ్రాహ్మణునికి నిమ్మన నట్లనె నంగీకరించి దానిం
బ్రార్థించి.

147

కాశీరాజు పుత్రికను గౌండిన్యున కిచ్చి వివాహ మొనరించుట

మ.

ఇది నీదాసి యనుగ్రహింపు కృపచే నింతీ! మనోజాత మ
ర్మదబాణంబులఁ దూలి యోర్చితివి తద్రక్షోవిభున్ నింద కా
స్పదమైయుండిన నుండనిమ్ము విలసత్సౌభాగ్యభాగ్యైకసం
పద నీ విపుఁడు భర్తయైన జని సాఫల్యంబు నీ కబ్బదే?

148


సీ.

మత్సుతకును నాకు మద్బాంధవులకు మ
                       దిష్టదైవములకు నీశ్వరివి స
పత్నీత్వదోషసంపత్తి నుండకు మీద్వి
                       జాగ్రణి కిచ్చితి నాత్మజాత
నిది నీకు నిల్లడ యెలమితో మన్నించి
                       దాసిఁగా నేలు మో తల్లి! నీవు
దేహంబుఁ బ్రాణంబుఁ దీఱినయవి నేఁడు
                       తిరుగనిచ్చితివి సందేహ మేల?


తే. గీ.

యనుచు లాలించి పలికిన నాత్మ నుబ్బి
యిద్దఱము నీకుఁ దనయల మింత యేల?
నగరమునఁ బూజ నొందితి జగ మెఱుంగ
నిఖిలభాగ్యంబు లభియించె నృపవరేణ్య!

149


వ.

అష్టమినుండి చతుర్దశిదనుక నేడుదినంబు లుత్సవంబులు సేయవలయు
నృత్తగీతవాద్యనటకీర్తనసమేతంబుగా బలిపూజాదు లర్పింపవలయు
నగరంబు శృంగారింపవలయు నిందున నీకుఁ గల్యాణపరంపరావాప్తి
యగు నన నట్ల కావించి బ్రాహ్మణునకుఁ బరిణయం బొనరించె నంత
దాసదాసీగోమహిషహయకుంజరయానదివ్యవస్త్రాభరణకనక
రత్నాదులతో భటజనంబు గొలువ రాజు రత్నావళి ననిచె. రాక్షసి
కరిణియై కంధరంబున నిడికొని నిజపురంబునకుం దోడ్కొని తెచ్చె.
తద్గృహంబు కుబేరగృహంబునుంబోలెఁ గలితవస్తుసకలసంగ్రహంబై
యుండ సపత్నీద్వయంబుం జూచి యేను దుఃఖింపుచు నుండ బంధు
సఖీజనంబులు చేరి మర్మభేదకంబులగు పరుసనిమాటల నిట్లనిరి.

150

సీ.

పతి నీకు వలసెనే భామిని ధనలోభ
                       పరత వంచించితి భర్త నిన్ను
దీనత వేఁడ నిందించి త్యజించి మీ
                       పుట్టినయింటికిఁ బోయి[39]నావ
నీవు చేసిన నిత్యనీచకృత్యంబులు
                       దలఁపవే చంచలత్వమున నబల!
శాశ్వతమే తండ్రిసంపద! మఱి భర్తృ
                       సంపద సతికి శాశ్వతము గాక


తే. గీ.

యధిపుకడ కెట్టు లేఁగెద వబల! లజ్జ
లేక భాషింప నోరాడు నీకు నెట్టు
లంగసంగంబు సుఖమె? దురాత్మ! నీవు
నాట నాడినమాట నానాఁట నరయ.

151


వ.

ఆతండు నిన్ను గృహంబుఁ జేరనిచ్చునే? లోకవాదభయంబునఁ
జొరనిచ్చిన శయ్యకుఁ జేరనిచ్చునే? శయ్యకుం జేరనిచ్చినఁ బశు
సంయోగంబునుంబోలె బలాత్కారరతం బగునని యాడిన నధోముఖినై
యశ్రువులు దొరుఁగ నీమణివలయం బేల యీనైతి? నీనూపురం బేల
యీనైతి? నీకటిసూత్రం బేల యీనైతి నయ్యో! యొకగవ్వయైన
నిచ్చిన మన్నించుఁగా! లోభంబుకంటె దుర్గుణంబు గలదే? యని
[40]తలంకుచు నతనిమొగం బెట్లు కాంతు నేమని భాషింతు? తలకుం
బాసిన వెండ్రుకం జేసి విడిచితి నింక నెడసిన చిత్తం బెట్లు హత్తునని
విచారించుచున్నసమయంబున.

152


సీ.

బంధువర్గంబు వెంబడిరా ననేకులు
                       వేత్రహస్తులు వృద్ధవిప్రజనులు
చామరవ్యజనవీజనపరుల్ నలువంక
                       సవడిఁ గొల్వఁగ సితచ్ఛత్రరాజ
మూనిపట్టఁగ భూషణోత్కరపేటికఁ
                       గొని యొకసైరంధ్రి మొనసి నడువ
రమణీయకాంచనరత్నడోలికఁ దెచ్చి
                       జంఘాలవర్యు లాశ్చర్యశక్తిఁ

తే. గీ.

గనుఁగొని పురంధ్రీ! నీపతి ఘనగుణాఢ్యుఁ
డఖిలధనములు భార్యాద్వయంబుఁ గలిగి
యరుగుదెంచి భవన్మోహభరమువలన
మమ్ముఁ బుత్తెంచెఁ దడ వేల? మగువ! రమ్ము.

153


వ.

అను తద్వాక్యంబులు విని లజ్జించి ప్రత్యుత్తరంబులు దోఁచక పతి
గుణంబులు దలపోయుచు నున్నసమయంబున బంధువర్గంబు పతి
పిలువనంపినం బోవనియది పదియేనుజన్మంబులు వాయసియై
జన్మించునని బోధించి డోలిక నెక్కించిన నేను భర్తృగృహంబున కేఁగి.

154


క.

కనుఁగొంటి వస్త్రరాసులు
ఘనసారకురంగనాభి కాశ్మీరజచం
దనరాసులు (ధనరాసులు)
నినరాసులువోలె మణులు నిరుగడ మెఱయన్.

155


వ.

అప్పు డెదుర్కొని మద్భర్త రాక్షసి రాజనందనలచేఁ బాదంబు లొత్తించి
తనకు మామయగు రా జిచ్చిన సొమ్ములు, రాక్షసీదత్తదివ్యరత్నంబులుం
జూపి యీ సొమ్మునకు [41]నీకే యాధిపత్యంబులని యన్నియు నప్పన
చేసి నన్ను మన్నించె; సపత్నులు చూడ నేకశయ్య విహరించె. ఇట్లు
కొంతకాలంబు దాఁటిన నేను గాలాంతరంబున నరకం బనుభవించి
యీరూపంబున జనియించితి. ఇంక వేయిమాఱులు తిర్యగ్యోనుల
జనియింపవలసినయది. తనజీవితంబులు పతియెడ దాఁచెనేని బహు
నరకంబు లనుభవించునని కాష్ఠకీటంబు పలికిన నే నిట్లంటి.

156


క.

నినుఁ జూచిన దయ పుట్టెడి
ఘనతరమగు నిట్టిపాతకం బేసుకృతం
బునఁ జను నాసుకృతం బిపు
డొనరించి జగంబు లెఱుఁగ నొసఁగుదు నీకున్.

157


వ.

అనినఁ గాష్ఠకీటం బిట్లనియె.

158


క.

ఇలయెల్ల దాన మిచ్చినఁ
దొలఁగఁదు నాపాతకంబు దూరతరంబై
తొలఁగును హరివాసరమున
వెలసిన సుకృతంబువలన విమలచరిత్రా!

159

మాఘమాసమహిమ

వ.

మఱియు మాఘమాసంబున దేవతలు తమతేజంబు జలంబుల నుంతురు.
తజ్జలస్నానంబున బ్రహ్మహత్యాదిపాపంబులు మొఱలిడుచుం
దొలంగు. నాఁడు స్నానంబు చేసినవారికిం గల సద్గతి సంగరస్థలంబున
నైన లేదు. సరిన్నిర్ఝరజలంబులం దవగాహించుట యుత్తమంబు.
వాపీతటాకంబులయందు స్నానంబు గావించుట మధ్యమంబు. గృహ
స్నానంబు శ్రేయో౽ర్థు లగువారికిఁ జేయందగదు. శీతలజలంబునఁ
బ్రాతస్స్నానంబుఁ జేయఁ బ్రశస్తంబు. క్లేశంబునంగాని సౌఖ్యంబునఁ
బుణ్యంబు లభించదు. శ్రేయస్కాముండగువాఁడు వహ్నిఁ గ్రాఁగం
జనదు. హోమార్ధంబు వహ్నిస్పర్శంబు సేయందగదు. సూర్యోద
యంబునఁ దూర్పు దెల్లనగుట మేఘావరణంబున సూర్యుఁడు గానరాక
యుండిన నుదయంబె కా నెఱంగవలయు. ఉదయంబున స్నానం
బర్హంబు గాదు. సరిత్తోయంబు దౌరకకయున్న నవకుంభస్థితజలంబులు
వాయువు రాత్రి సోఁకినయవి తీర్థమాడిన గంగాస్నానసమం బగు.
మాఘంబున దినదినస్నానంబు చేసి శర్కరతోఁ గూడఁ దిలలు దానం
బొసంగవలయు. మాఘావసానంబున బ్రాహ్మణులకు షడ్రసోపేతం
బుగా భోజన మొసంగవలయును. విష్ణుమూర్తియై నిరంజనుడగు
సూర్యుండు ప్రీతుం డగుంగాక యని దంపతులకు శుక్లవస్త్రంబులును
సప్తధేనువులును మోదకంబులును దిలమయంబు లగునవి ముప్పది
యర్పింపవలయు నామోదకంబు లొకభాగంబు శర్కరయు మూఁడు
భాగంబులు, తిలలు నారికేళశకలంబులు మూఁడుభాగంబులును,
నేలామరీచంబులతోఁ గూడఁ జేసిన దాన శుద్ధి యగు. మాఘంబు
నెలయు నభ్యంజనంబు వర్జింపవలయు బ్రాహ్మణుండు.
          "దివాకర! జగన్నాథ! ప్రభాకర! నమో౽స్తుతే
            పరిపూర్ణం కురుష్వేదం మాఘస్నానం మమాచ్యుత!"
యని సూర్యప్రార్థనంబు చేసి యాసూర్యబింబంబు భేదించి పరమ
ధామంబు నొందుం గావున మాఘస్నానంబు సేయునతండు మోక్ష
గామి యగు. తన్మాసంబున శుక్లపక్షైకాదశియందు నాదిత్యార్కంబులఁ
గూడెనేని మహాపాతకనాశం బగు. నక్షత్రంబుఁ గూడకుండిన నుప
వసింపవలయు, కౌరవులలో యశస్కరుండుగు భీముం డుదరాగ్నిచే
నుపవాసంబున కోర్వకుండియుఁ దన్మాసంబున నుపవసించిన మహా
ఫలం బని యెఱింగి యుపవసించు. నాఁటనుండి భీమైకాదశి యనం

బ్రసిద్ధం బయ్యె. ఇది మహాపాపంబు లపహరించు. కునృపతి దేశం
బునుం బోలెఁ, గుపుత్రుండు కులంబునుంబోలెఁ గుభార్య పతింబోలె,
నధర్మము ధర్మువుంబోలెఁ, గుమంత్రి రాజుంబోలెఁ, గుజ్ఞానంబు
జ్ఞానంబునుంబోలెఁ, గుశౌచంబు శౌచంబునుంబోలె, నసంవాదంబు
సంవాదంబునుంబోలె, ననత్యంబు సత్యంబునుంబోలె, హిమం బుష్ణం
బునుంబోలె, ననర్థం బర్థంబునుంబోలెఁ, బ్రకీర్తనంబు దానంబుంబోలె,
విస్మయంబునఁ దపనంబునుంబోలె, నశిక్షచేఁ బుత్రుండునుంబోలె,
దూరగతి గోగణంబునుంబోలె, సంకేతంబు పైతృకంబునుంబోలె,
వివర్థనంబున విత్తంబునుంబోలె, భీమద్వాదశి సమస్తాఘంబు
ల హరించు.

160


సీ.

బ్రహ్మహత్యా సురాపాన హేమస్తేయ
                       గుర్వంగనాసంగ ఘోరతరమ
హాపాతకములు సయ్యన నన్నియును గూడి
                       ప్రాపింప హరివాసరంబె కాని
యరయఁ బుష్కర నైమిశారణ్య కురుదేశ
                       శమనసహోదరి జహ్నుపుత్రి
కా నర్మదాదేవికా ప్రభాసాది తీ
                       ర్థజపతపోహోమదానమహిమ


తే. గీ.

లణఁప నేరవు లోకంబు లభినుతింప
భూమిలోపలఁ గల పుణ్యములును హరిది
నవ్రతపుసుకృతము దూఁచ నయము దెలియ
సరియె హరివాసరవ్రతసారమునకు?

161


తే. గీ

ద్వాదశీపుణ్యవాసరోత్సవము వంటి
యుత్సవము గల్గ నేర్చునే యుర్వియందు
నజహరాదులకైన శక్యంబె దాని
మహిమ యంతయుఁ గొనియాడ మధురవాణి!

162


వ.

ద్వాదశినాఁడు హాటకవరాహపురుషరూపంబు గావించి ఘటోపరి
భాగంబున నవతామ్రపాత్రంబు నిలిపి దానియందు సర్వబీజంబులు
నించి [42]సితవస్త్రంబు గట్టి సువర్ణం బిడి చుట్టు దీపంబులు పెట్టి, సురభి
కుసుమంబులు నిగిడ్చి 'వరాహాయ నమ' యని పాదంబులును,
‘క్రోడాయ నమ’ యని కటిస్థలంబును, 'గంభీరఘోషాయ నమ' యని

నాభియును, 'శ్రీవత్సధారిణే నమ' యని వక్షస్స్థలంబును, 'సహస్ర
శిరసే నమ' యని బాహువులుసు, 'సర్వేశాయ నమ' యని కంఠప్రదేశ
మును, 'సర్వాత్మనే నమ' యని ముఖంబును, 'సుప్రభాయ నమ' యని
లలాటంబును, 'శతమఘాయ నమ' యని కేశంబులును బూజించి,
జాగరంబు గావించి విష్ణుమహత్త్వప్రతిపాదకపురాణంబులు వినుచుఁ
బ్రాతఃకాలంబునఁ గుటుంబి యగు వైష్ణవునకుఁ గ్రోడసహితననైవేద్య
పరిచ్ఛదకుంభంబు దానం బిచ్చి యంత బంధువర్గంబుతోఁ గూడఁ
బారణ చేసినఁ బునర్జననంబు నొందఁడు. జ్ఞానాజ్ఞానకృతంబగు
బహుజన్మార్జితపాపంబును సూర్యుం డంధకారంబును బోలె హరించు
నిటువంటి ద్వాదశి పూర్వజన్మంబున నాచరించినదానవు. తన్మహత్త్వం
బున నీపతి యీపుత్రుం డీసంపద నీకు లభించె. తద్ద్వాదశీవ్రతపుణ్య
చతుర్థాంశంబు నా కిచ్చితివేని భర్తృనిమిత్తద్రవ్యలోభపాతకంబుఁ
దరించి సద్గతిం బొందెద. నాయట్టు లెవ్వతె లోకంబున నాచరించు
నది క్రిమియోనిశతంబునం బుట్టి పిమ్మటఁ జండాలియై జన్మించునని
విన్నవించిన దానికిఁ దత్ఫలం బొసంగితి. ఏఁ జూడ విష్ణుపురంబున
కేఁగె. స్త్రీలకుఁ బతియే దైవంబు. పతిని విడిచి పితృగృహంబున
కేఁగి బ్రాహ్మణభార్య కాష్టకీటం బగుట చూడవే? కులశీలాద్యభిమాన
వతివి. మఱియొకటి వేడుమని పలికిన రోషంబున సంధ్యావళిం
జూచి యిట్లనియె.

163

మోహిని ధర్మాంగదుని రాజు చంపవలెనని కోరుట

సీ.

సకలధర్మాధర్మసార మీ వెఱిఁగిన
                       దానవు పతిహితత్వంబుకొఱకుఁ
బ్రాణ మిచ్చెదవేనిఁ బ్రాణం బనఁగ నెంత?
                       యంతకంటెఁ దలంప నధికుఁడైన
ధర్మాంగదునిఁ బట్టి తనచేతివాలునఁ
                       దలఁ ద్రెవ్వనేసి యాతల నిజాంక
భాగంబుపైఁ బక్వఫల మున్నయట్లుగాఁ
                       బరఁగఁబూనిన వానిశిరము నవ్య


తే. గీ.

చంద్రబింబసమంబు నశ్మశ్రుకంబు
కుండలాంకంబునైన యాగొనబు చూచి
సంతసిల్లుచు నేత్రాశ్రుజలము లేక
రాజు వర్తింపవలయు నో రాజవదన!

164

వ.

అనినఁ దద్వచనంబులు విని కంపించి సంధ్యావళి ధైర్యంబు పూని
నగుచు శుక్రసమీరితగాథ పురాణంబులయందు వినంబడియె.
ద్వాదశి స్వర్గమోక్షప్రద యగు. ధనంబు విడుచు, గృహంబు విడుచు,
భార్యల విడుచు, మిత్రుల విడుచు, గురుని విడుచు, బంధువుల విడుచు,
తీర్థంబులు విడుచు, యజ్ఞంబులు విడుచు, ధర్మక్రియాతపస్సాంఖ్య
యోగంబులేని విడుచుంగాని యుభయపక్షద్వాదశీవాసరోత్సవంబు
విడువఁడు. తద్ద్వాదశీప్రభావంబున క్షేమం బయ్యెడి. నీకు సంతోషం
బుగా ధర్మాంగదుని హింసించిన సంతోషమున నుండుము. సత్యంబు
వదలిన నరుండు శ్వపాకపరునకంటె నీచుండగుం గావున సత్యంబు
వదలునే? యని పోయి పతి చరణంబుల వ్రాలి యిట్లనియె.

165


తే. గీ.

ఎంత బోధించినను విన దీరసంబు
మించి హరివాసరమున భుజించు టొండె
తనయు ధర్మాంగదుని తల తఱంగుటొండె
కాని యెవ్వియు నొల్ల దాకలుషశీల.

166


సీ.

తనయునిపైఁ బ్రేమ తల్లికి నధికంబు
                       కనియెడి దుఃఖ ముత్కటతరంబు
తండ్రి బీజావాసధర్మహేతువు గాని
                       తల్లిపాలనము వర్ణనము చేయ
నోపు లోకంబున నూర్జితసత్యవ్ర
                       తంబు నిల్పఁదలంచి ధరణినాథ!
శతగుణాధికపుత్రసౌహార్ద మాత్మకు
                       వదలితి నీవు సత్పథము నంద


తే. గీ.

ఘనుని ధర్మాంగదునిఁ బుత్రుఁ డనక చేతి
హేతిఁ బరిమార్చి మెడమీఁద నిడి శిరంబు
గాంచి హర్షించితేని యాకాంత కొసఁగు
వరము ఫలియించు ననియె నావశ్యకమున.

167


వ.

ఇట్టి యాపత్పరంపరలు తరింపంజేయ నీశ్వరుండు గలఁడు. శిబి
శ్యేనంబునకు మాంసం బీఁడె? పురందరునకుఁ గర్ణుండు చర్మం బొప్పిం
పఁడె? జీమూతవాహనుండు గరుత్మంతునకుఁ బ్రాణం బొసంగఁడె?
దధీచి దేవతలకు నెమ్ములు విసర్జింపఁడె? కీర్తి ధర్మంబు సత్యంబు
నిలుపుకొనవలయు. ఈమోహిని ధర్మభ్రంశంబు నొందింప విధాత
నిర్మించినవాఁడు. పుత్రహింసకునిపై దేవతలు వైముఖ్యంబు నొంద

రేని హరిపదంబు నొందెద వవశ్యంబు దృఢచిత్తుండవై సత్యంబు
నిల్పుకొమ్మని విన్నవించిన.

168


తే. గీ.

అంత రుక్మాంగదుఁడు పుత్రహత్య, యాత్మ
హత్యయును జూడ బ్రహ్మహత్యాధికములు
గాన ధర్మజ్ఞు వినయవిఖ్యాతు నితనిఁ
జంపి యేలోకము భజింతు సాధ్వి! యకట!

169


వ.

మందరంబున కేల పోయితి? విధిబలంబున నీమోహిని నేల చూచి
మోహించితి? కుపుత్రుండేని యొకనిచే నీల్గినం దండ్రికి దుఃఖంబగు.
ధర్మశీలుండైన నందను నెట్లు నాచేతిహేతిచే హింసింపుదు? నేను
జంబూద్వీపంబె కాని (యీతండు) సప్తద్వీపంబులు నేలె. విష్ణుభక్తిచే
నాకంటె నధికుండు. ఏమి సేయుదు నెట్లు బ్రదుకుదు నెట్లు
తరింతు? ఏ నేఁగి స్వాంతంబు గావింతునని చేరంజని యిట్లనియె.

170


చ.

పొరి గొనఁజాల నందనునిఁ బుణ్యకరంబగునట్టి తద్రమా
వరదివసత్రయంబు విడువన్, నసునేని కృతాభిషేకయై
పరఁగిన సాధ్వినేని యసిపాలుగఁ జేసెదఁ జేయుమన్న దు
ష్కరతరఘోరకర్మము లసంఖ్యములైన నొనర్తు నెన్నికన్.

171


వ.

ధర్మాంగదుం జంపిన నీకు నేమిలాభంబు? హరివాసరభంగంబు చేసిన
నీకు నేమి లాభంబు? దాసుండ నినుం గొల్చినవాఁడ నెయ్యదియైనం
జేయుదు. కళితరత్నాంగుళీయకభారంబులగు కరంబులం బాదంబు
లొత్తెద ననుగ్రహింపవే! పుత్రభిక్షఁ బెట్టవే; గుణవంతుండగు పుత్ర
రత్నంబు దుర్లభంబు, హరివాసరంబు దుర్లభంబు. జాహ్నవీతోయంబు
దుర్లభంబు. జననివాత్సల్యంబు దుర్లభంబు. సత్కులప్రసవంబు
దుర్లభంబు. వంశజప్రియాజనంబు దుర్లభంబు. కాంచనదానంబు
దుర్లభంబు. హరిపూజనంబు దుర్లభంబు. వైష్ణవదీక్షానియమంబు
దుర్లభంబు. శ్రుతిసంగ్రహంబు దుర్లభంబు. వరాహక్షేత్రవాసంబు
దుర్లభంబు. ఆత్మచింతనంబు దుర్లభంబు. గురుసత్కారంబు దుర్ల
భంబు. విష్ణునిమిత్తజాగరంబు దుర్లభంబు. పుష్కరజలంబు దుర్ల
భంబు. శిష్టసంయోగంబు దుర్లభంబు. పుత్రసంప్రాప్తి దుర్లభంబు.
అచ్యుతభక్తి దుర్లభంబు. పథ్యాశనంబు దుర్లభంబు. మహోషధంబు
దుర్లభంబు. వ్యాధినిధానంబు దుర్లభంబు. మరణవేళ విష్ణుస్మర
ణంబు దుర్లభంబు. నీలవృషభమోచనంబు దుర్లభంబు. త్రయోదశి
శ్రాద్ధకర్మంబు దుర్లభంబు. తిలమయధేనుదానంబు దుర్లభంబు.

కపిలదానంబు దుర్లభంబు. హరి వాసరంబున ధాత్రీఫలస్నానంబు
దుర్లభంబు. సామగ్రి గలిగి శీతోదకంబునం బ్రాతస్స్నానంబు
సేయుట దుర్లభంబు. ఏదియేని మాఘమాసంబునఁ జేయుట దుర్లభం
బిట్లెఱింగి యట్ల నీకార్యద్వయం బొనరింతు. మచ్ఛిరం బిచ్చెద,
సంధ్యావళిని దాసిఁగా నిచ్చెద రాజ్యం బిచ్చెద ననిన విని మోహిని
యిట్లనియె.

172


సీ.

శత్రుఁడే నాకు నో జననాథ ధర్మాంగ
                       దుండు సద్గుణశాలి దోషదూరుఁ
డతని నేటికిఁ జంప? హరివాసరమున భు
                       జించి నాతో గోష్ఠి చేసితేని
నాయభీష్టము తీరు నరనాథ! నీకుఁ బు
                       త్రునిమీఁద మోహంబు దోఁచెనేని
బద్ధప్రలాపముల్ పలుక నేమిటికి నే
                       నెయ్యది చెప్పిన హితముగాఁ ద


తే. గీ.

లంచి కావింపుమని యాదరించి పలుక
నలుక సేయక ధైర్యంపుమొలకవోలెఁ
దండ్రికడ నిల్చి ధర్మాంగదక్షితీశుఁ
డతని శాతాసి యిచ్చి యిట్లనియె నపుడు.

173

ధర్మాంగదుండు తన్నుఁ జంపుమని తండ్రిని గోరుట

శా.

ఆలస్యం బొనరింపఁ బాపము జగం బౌనౌ ననం దల్లి నేఁ
డాలోచించినమాట సేయుము యశస్యం బాత్మసంరక్ష భూ
పాలశ్రేణికిఁ జేయఁ జెల్లు సుతుచే భార్యాళిచే సొమ్ముచే
నీలోకంబుఁ బరంబు నీకుఁ దగు నీ విట్లుం బ్రవరిల్లినన్.

174


క.

దైన్యంబు విడువు దేహం
బన్యం బొక్కటి లభించు నామీఁద యశం
బన్యోన్యమునకుఁ దగు సా
మాన్యునికైవడిని నీవు మానం దగునే.

175


సీ.

అవనీసుపర్వార్ధమై జననీజన
                       కార్ధమై ప్రమదార్ధమై వసుంధ
రార్ధమై యధికకార్యార్ధమై దేవహి
                       తార్ధమై బాలార్ధమై వికలజ

నార్థమై గోరక్షణార్థమై నిజదేహ
                       మర్పించెనేని విఖ్యాతపుణ్య
లోకము ల్గలుగు నాలోకేశదినభుక్తి
                       యర్హమే? శాస్త్రరహస్య మిదియె


తే. గీ.

సర్వమేధమఖంబున స్వసుతుఁ బశువుఁ
జేసి వ్రేల్చిన తండ్రికి సిద్ధమై ల
భించు నుత్కృష్టపదము గాంభీర్యధైర్య
శౌర్యశాలివి నీ కింక శంక యేల?

176


వ.

సకలధర్మంబు లెఱింగి మాతల్లి సంధ్యావళియు నానతి యిచ్చె.
తద్వాక్యంబున వర్తింపుము. మీకు నాకు మజ్జననికి యశంబగు. హరి
వాసరవ్రతంబు నిలిపికొమ్మని విన్నవించిన.

177


క.

తనయునిమాటలు విని యా
జననాథుం డాత్మఁ గలఁగి సంధ్యావళిఁ జూ
చిన సంఫుల్లసరోజా
ననయై వినయైకఖేలనంబున నున్నన్.

178


మ.

అసిఁ గేలన్ జళిపించి యానృపతి సత్యస్ఫూర్తి లక్ష్మీశు మా
నసమధ్యంబున నిల్పి వ్రేయఁ దమి యూనన్ సారసంపద్గుణా
ఢ్యు సుపుత్రున్ సమయింప నేమిటికి నయ్యో! నేఁడు నాతోడఁ గూ
డి సుఖం బందు భుజింపు మీదినమునన్ డెందంబు రంజిల్లఁగన్.

179


క.

అని మోహిని పల్కిన భో
జన మిందు భుజించుకంటె సంధ్యావళి నా
తనయునిఁ జంపుట మేలని
యన ననఘుం డందుఁ జాల నాందోళింపన్.

180


తే. గీ.

అతనిధైర్యంబుఁ జూడ రమాధినాథుఁ
డపు డదృశ్యత నిల్చె నభోంతరమున
గరుడవాహనమున దేవఖచరసిద్ధ
సాధ్యవర్యులు తనుఁ జేరి సంస్తుతింప.

181


క.

వీరుండగు ధర్మాంగదు
చారిత్రము, తల్లియైన సంధ్యావళి హృ
త్సారము రుక్మాంగదు స
త్యారంభము చూడ నుండె హరి వినువీథిన్.

182

రుక్మాంగదుఁడు సత్యపాలనకై పుత్రుని జంపఁ బూనుట

సీ.

పూని మోహిని తను భుజియింపు మనుచుఁ బ
                       ల్మాఱు నాడఁగ ధైర్య మహిమ మెఱసి
ఖడ్గ మంకించి రుక్మవిభూషణుఁడు నిల్వ
                       ధర్మాంగదుఁడు పూర్ణధర్మశక్తిఁ
దల్లిదండ్రులకు శ్రీధరునకుఁ బ్రణమిల్లి
                       కంఠంబుఁ దండ్రి యగ్రమున వంచి
యున్న నాకంపించె నుర్వీపయోధులు
                       ధ్వను లొనర్చెను మహోదగ్రలీల


తే. గీ.

వీఁచె జంఝానిలంబులు వేగ రాలె
నుల్క లేన్నేని నిర్ఘాతయుతము లగుచు
నప్పు డేమనవచ్చు బ్రహ్మాండమెల్ల
దుఃఖపుంజం బనంగ నల్ద్రోవ లయ్యె.

183


వ.

అంత మోహిని వివర్ణయై దేవకార్యంబు సేయలేనైతి, జన్మంబు నిరర్థ
కం బయ్యె. మద్రూపలావణ్యపరవశుండు గాక రాజు హరివాసరంబు
విడువక సుతుని సమయింపంజూచె. దండధరునిమొగం బెట్లు చూతు?
నప్సరోజనంబులు నన్నుఁ దృణంబుగాఁ జూడరే! ఈరా జీవ్రతంబునఁ
బరమధామంబు నొందెడి నితండు మన్నిమిత్తంబున సుతునిం జంపెడి
నింక నరకపాతకంబు నొందెద నని యుద్యతాయుధుండగు రాజుం
జూచి మూర్ఛిల్లిన.

184


ఉ.

ఆజగదేకవీరుగళ మంటకమున్నె సితాసితోడ నా
రాజుకరంబు పట్టి రతిరాజగురుండు ప్రసన్నమూర్తియై
..... ...... ..... ..... ...... ...... ..... ...... ..... ..... ....
రాజులలోన (నెన్న) నతిరాజితకీర్తివి లోకు లెన్నఁగాన్.

185


క.

ఈధైర్యం బీశౌర్యం
బీధర్మం బీవివేక మెన్నికగా నేఁ
డేధాత్రీపతికిం గల
వో ధన్యుఁడ! నీకె కాక యూహ యొనర్పన్.

186

క.

శుద్ధాంతఃకరణుండవు
బోద్ధవు నీవంటి పుణ్యపురుషులు గలరే?
యిద్ధరణీతలమున నీ
విద్ధరణితభేరిఁ దెలిపి తేకాదశియున్.

187


శా.

త్రైలోక్యంబున సద్గుణంబులు మహోదారంబులై యుండ భూ
పాలా పూర్ణయశంబు నిల్పి సుతుతోఁ బద్మాక్షితో సంతత
శ్రీలన్ సర్వవికారదూరమయి యర్చిఃకీర్ణమై యాత్మవి
ద్యాలాభాధికమై శుభస్థిరతరంబై యొప్పు మన్మూర్తితోన్.

188


వ.

నీవును సుతుండును నిల్లాలును సమగ్రైశ్వర్యతేజంబుల నైక్యంబు
నొందుం డనిన.

189

రుక్మాంగదుఁడు సపుత్త్రకళత్త్రముగా ముక్తి పొందుట

సీ.

అప్పు డైహికసుఖంబంతయు విడనాడి
                       కోశమందిరధారకుంజరహరి
వస్తువాహనబంధువర్గంబు దిగనాడి
                       యైక్యంబు నొందఁ బో రనుచుఁ గురిసె
మందారతరుకుసుమంబులు, దివ్యదుం
                       దుభులు మ్రోయ నుతించి రభిమతముగ
నప్సరోంగనలు, చోద్యంబుగాఁ బాడిరి
                       గంధర్వవరు లుత్కంఠ మెఱయ


తే. గీ.

నది నిరీక్షించి యంతకుం డంతలో లి
పిప్రమార్జన మొనరించి బెగడి దిశలు
గ్రక్కతిల మొఱ్ఱలిడి యధికార మొల్ల
ననుచు సాగిలి మ్రొక్కి, యి ట్లనుచుఁ బలికె.

190


వ.

చక్రధరా! యీమోహిని నేకాదశీవ్రతభంగంబు గావింపఁ గుశకే
తుండు నిర్మించిన వాఁడే తత్ప్రభావంబున సతీసుతసహితుండై నీ
యందు నైక్యంబు నొందె, నాలోకంబు రహితనానాలోకం బయ్యె.
నీ వెఱుంగనిది యెయ్యది? యని విన్నవించి కమలాసనుకడ కేఁగి
విన్నవించిన దివ్యవిమానంబులతో నింద్రాదులు చుట్టునుం గొలిచి రా
నవ్విధాత యెండిననదివోలెఁ, జంద్రుండు లేని శర్వరివోలె, వాడిన
పంకజంబువోలె, నివృత్తమఖంబైన వేదికయుంబోలె, ద్రుమంబులు

లేని వనంబువోలెఁ, గలమసస్యంబు లేని కేదారంబునుం బోలెఁ,
బ్రభ లేని దివాకరుండువోలె, గతోద్వాహంబగు మంటపంబువోలె,
నవనీతంబు దిగిచిన మధనివోలె, విఱిగినసేనయుం బోలె, నాథ
రహితయైన యువతియుం బోలె, ధాన్యహీనంబగు కోష్ఠంబునుం బోలె,
రాజు లేని రాష్ట్రంబునుం బోలె, మంత్రి లేని రాజునుం బోలె, ధనధాన్యం
బులు లేని గృహంబునుం బోలెఁ, బక్షిసంఘంబు లేని గూడునుం బోలె,
బద్ధసంఘుండైన భిక్షుకుండునుం బోలె, భార్యారహితుండగు గృహ
స్థుండువోలె, మార్జనీపాంశుసంస్పృష్టుండైన జనుండునుం బోలె,
వాదభగ్నుండగు వాదియుం బోలె, నిర్ధనుండగు పురుషుండునుం బోలె,
నంధునిదీపంబునుం బోలె, వికలాంగయగు ప్రతిమయుం బోలె, శాఖలు
విఱిగిన శాఖియుం బోలె, నిర్జలంబగు మేఘంబునుం బోలె, ధూమసహి
తంబగు వహ్నియుం బోలెఁ, బత్నీసమేతంబు గాని గృహంబునుం బోలె,
సర్వసంగంబు నొనర్చు నరుండునుం బోలె, శ్వశురావాసంబునఁ బ్రియా
తిరస్కృతుండై వేదయై యున్న జామాతయుం బోలెఁ, గరి పెఱికివైచిన
తామరయుం బోలె, మదంబు డిగిన కుంజరంబు వోలె, భగ్నవేగంబైన
హయంబునుం బోలె, శుష్కించిన సింహంబునుం బోలెఁ, గోఱలు దిగి
చిన సర్పంబునుం బోలె, రెక్కలు విఱిగిన పక్షియుం బోలె, బతితుం
డైన బ్రాహ్మణుండువోలె, భుజవెట్టిన లిపియుం బోలె, విస్వరంబగు
యజుర్వేదంబునుం బోలె, స్వరహీనంబగు సామంబునుం బోలెఁ, బద
హీనయగు ఋక్కునుం బోలెఁ, దృణసమాకీర్ణమగు మార్గంబునుం బోలెఁ,
బద్మంబులు లేని సరోవరంబువోలె, మమత విడువని జ్ఞానంబునుం
బోలె, దంభంబునం జేయు ధర్మంబునుం బోలె మోహిని తేజోరహితయై
నిరుత్సాహయై చింతింప జనులు 'పుత్రహత్యాకారిణి, భర్తృఘాతిని,
సంధ్యావళీదుఃఖదాయిని' యని యాక్రోశింపం జూచి దేవత లిట్లనిరి.

191


ఆ. వె.

శోక మందె దేల సుందరి! చేసితి
పౌరుషంబు దానఫలము గాక
యున్న నీకుఁ గలదె! యుర్విపై నపరాధ
వింతి! నీకు నింత చింత యేల?

192


సీ.

దండించఁ గర్త యంతకుఁడు లోకులనెల్ల
                       వనజాక్షభక్తదండనము గాన
శక్తుండు గాఁడు, నిర్జనకార్యసాధన
                       నియతతేజశ్శక్తి నీకె కలదు,

కలిగిన నేమి విఘ్నము లేక వైశాఖ
                       [43]సితపక్ష మేకాదశీదినమున
సారంబు గాఁగ విష్వక్సేనపూజఁ గా
                       వించెఁ దన్మహిమఁ బవిత్రుఁ డయ్యెఁ,


తే. గీ.

గొడుకుఁ ద్రికరణశుద్ధిగా నడపఁజూడ
నబ్ధిజాజాని ప్రత్యక్షమై కుమార
దారసహితునిఁగా నిజతనువునందుఁ
దాల్చుకొని యేఁగె నౌర! తద్ధర్మమహిమ.

193


క.

సారతరంబగు ధర్మము
ప్రారంభించినను వేగ ఫలియించు విధి
ప్రేరణమునఁ గాకున్నన్
నేరం బింతయును లేదు నిఖిలజనులకున్.

194


తే. గీ.

[44]త్రికరణంబుల నీవు పూనిక నొనర్చు
యత్న మీడేరకుండిన నబల! నీప్ర
గల్భతకు మెచ్చి వర మొసంగం దలంచి
వచ్చినారము తెలుపు నీవాంఛితంబు.

195


ఉ.

వంచన మింతలేక యనివారణశక్తి వంచించునట్ల యూ
హించి యొనర్పఁ గార్య మొకయింతయుఁ గాక నిరర్ధమైనఁ గ
ష్టించిన లాగు చూడక హసించిన యానరుఁ డందు ధాత్రిలో
నెంచఁగ గోవధాదికము లెన్నియుఁ జేసిన పాపసంఘముల్.

196


వ.

కావున నీవు దేవకార్యనిమిత్తం బింత నిష్ఠురకృత్యంబు గావించితివి.
ద్వాదశిమహిమ భగ్నం బయ్యె నైన నేమి? వరంబు వేఁడుమనిన
మోహిని వారిం జూచి యేమి సాధించితి? యమపురంబుఁ బూర్ణంబు
గావించితినో? హరిదినంబున భుజింప సమకట్టితినో? రుక్మాంగదుని
మోహాబ్ధి ముంచితినో? అతం డీదండధరుని తలఁ ద్రొక్కి యప్ర
మేయగుణాఢ్యుండును నిర్మలుండును నిర్మలాశ్రయుండును హంసం .
బును శుచిషన్మూర్తియు, వ్యోమంబును, బ్రణవంబును, జీవుండును,

నవ్యయుండును, నిరాధారుండును, నిష్ప్రపంచుఁడును, నిరంజనుం
డును, విష్ణుండును, శూన్యుండును, వేదస్వరూపుండును, ధ్యేయుం
డును, ధ్యేయవర్జితుండును, నస్తినాస్తివాక్యవర్తియు, దూరవర్తియు,
నంతికవర్తియు, మనోగ్రాహ్యుండును, బరమధామపురుషాఖ్యుం
డును, జగత్రయజనహృత్పంకజసమాసీనుండును, దేజోరూ
పంబును, నిరింద్రియుండును నగు స్వామియందు లీనుం డయ్యె.
కార్యంబు సాధింపక వేతనంబు గొను భృత్యుండు నరకం బనుభవించి
లతాగుల్మాదిరూపంబున జనించు నేను భర్తృపుత్రవినాశినినై
యెట్లు వరంబు వేఁడుదు ననిన నిర్జరు లిట్లనిరి.

197


క.

నీమదిఁలో గల కోరిక
నో మోహిని! మమ్ము నడుగు మొసఁగెదము యశ
శ్శ్రీ మించ నీఋణం బిఁక
మామీఁద ఘటింపకుండ మంజులవాణీ!

198


తే. గీ.

రాజుతోఁ గూడ నతిపరిశ్రమము నొంది
యస్మదర్థంబుగాఁ గలహం బొనర్చి
యింత చేసితి విశ్వాసహితగుణమున
ననుభవింపుము తత్ఫలం బైన వరము.

199


వ.

అనునంత [45](రుక్మాంగదు పురోహితుండు).

200

పురోహితుఁడు మోహినిపై కోపించుట

సీ.

అంబుమధ్యమునఁ బ్రాణాయామపరతమై
                       నబ్దశతంబు నవ్యయు నమేయు
నారాయణుని మనోనలినంబునం దాన్చి
                       తద్వ్రతాంతంబునఁ దజ్జలంబు
వెడలి మోహిని సేయు విపరీతకృత్యంబు
                       విని దేవతలఁ జూచి విపులరోష
[46]శీలయై నిపు డెంత చేసె నీదుర్మేధ!
                       వేధ యి ట్లేల కావించె దీని?

తే. గీ.

సాధ్వి యౌనె? దురాచార సత్యదూర
పరతరాశ్లీల సంతతపాపశీల
మర మొసంగుట మీకు భావ్యంబె ధర్మ
మెట్లు నిల్పెదరో నాకు నెఱుఁగఁబడదు.

201


వ.

అని మఱియు నిట్లనియె.

202


క.

పతిసుతఘాతిని యిది దు
ర్వ్రత యనలములోన దీని వైచినఁ గానీ,
యతినిందఁ గాని పాప
చ్యుతి యింతయు లేదు వినరె! శ్రుతులన్ స్మృతులన్.

203


వ.

దీని నరకంబునం ద్రోయుట కాక పుణ్యలోకంబగు నాకంబుఁ జేర్పం
దగునే? దీనికి వర మిచ్చెద మన మీకు నోరెట్టు లాడెనని మఱియు
నిట్లనియె.

204


క.

హరిదినమునఁ గుడువు మనుట,
సురభుల బ్రాహ్మణులఁ జంపఁ జూచుట, విప్రున్
సురఁ ద్రావు మనుట, యుష్మ
త్పురవాసనిరోధకములు బుధవరులారా!

205


వ.

హరివాసరభోజన గోబ్రాహ్మణవధ సురాపానాది పాపవచనంబు
లెఱింగి పల్కినం బ్రాయశ్చిత్తంబు లేదు. ఎఱుంగక పల్కినఁ
బ్రాణాయామశతంబులనేని ఏకాదశ్యుపవాసంబున నేని, సౌరకక్షేత్ర
స్పర్శనంబుననేని దేవప్యూహార్చనంబుననేని తరించు నిది యెఱింగి
హరివాసరమున భుజింపుమనియె. భర్తృవాక్యంబు మీఱి సద్గుణా
ఢ్యుండు నిజహృదయంగమశీలుండు నైన సుతుని సమయింపం జూచె,
నిది స్పృశింప నర్హ గాదు. దీనికి వరం బీ నుత్సహించుట దగునే?
మీరు ధర్మజ్ఞులను, న్యాయజ్ఞులను, బ్రాజ్ఞులను బాలించువారు. పాత
కులం బాలింపందగునే? ధర్మంబున కాధారంబులు వేదంబులు. స్త్రీలకుఁ
బతిశుశ్రూష సేయవలయునని పలికె. ఆశుశ్రూష యన నతనియాజ్ఞ
మీఱక యుండుటయే. ఆయాజ్ఞ దాఁటిన యది శాపార్హ గాని యనుగ్ర
హార్హ గాదు. బొంకింతునని వరంబు వేఁడి వంచించె నిది సత్యవ్రతుండు
గాన నతండు దీనికిం బాపంబు గట్టి ముక్తుం డయ్యె. మఱియు నిది పాప
శరీర. సకలదానధురంధరుని బ్రహ్మణ్యునిఁ, బ్రజారంజనుని,
హరివాసరవ్రతపరాయణునిఁ, బరదారవివర్జితుని, దుష్కర్మరహి

తుని, దుష్టశిక్షకుని, సప్తవ్యసనాపేతుని, ధర్మాంగదుని నింత చేనె, నిది
వరంబునకుఁ దగునే? దీనిపై దేవతలేని దానవులేని పక్షంబు నిలిపిన
వారినే భస్మంబు సేయుదు. తత్పక్షదోషంబునఁ బక్షపాతియు మహా
పాతకుం డౌనని కోపంబు మోహినిదేహంబుపైఁ బ్రయోగించి దివ్యులు
ప్రార్థించు నంతనే భస్మంబు చేసెనని వసిష్ఠుండు మాంధాతకు నానతి
యిచ్చి మఱియు నిట్లనియె.

206


ఉ.

నాకమనాగ పద్మసదనాకము నాయతభక్తినిష్ఠులౌ
లోకులకుం బ్రశస్తమగు లోకము పాపశరీరులైన యా
లోకులకున్ దినేశసుతలోకము గాని లభింప దీవు సు
శ్లోకుని రాజుభక్తు నరిసూదనుఁ జేసిన చేఁత రిత్తయే?

207

మోహిని పాపఫల మనుభవించుట

సీ.

అని [47]భూమిదేవుఁ డిట్లాడిన నాబోటి
                       నరకంబునకుఁ ద్రోయ నరకవాసు
లందఱు నిందుండ నర్హలే నీవు గు
                       ణాధికు ధర్మాంగదావనీశు
ధర్మజ్ఞు సత్పథస్థాయి దయాళుని
                       గురుభక్తిరతు దానకుశలు బంధు
పక్షు సప్తద్వీపపతి నసిచే నేఁడు
                       సమయింపఁజూచితి సాహసమునఁ


తే. గీ.

గనలి దుర్మదసుతునైన గాసిచేయ
బ్రహ్మహత్యాశతోపమపాతకము ల
భించునని యమ్మహాఋషు లెంచుకొందు
రట్టితత్త్వజ్ఞుఁ జేసితి వౌనె నీకు?

208


వ.

ఇందు నీకు నిష్కృతి గలదే? యని వెడలంద్రోయ రసాతలంబు సొచ్చె,
నారసాతలంబున నాగకుమారులు తర్జించిన లజ్జించి దేవసభకు నేఁగి
మొఱలిడుచు భువనత్రయంబుఁ దిరిగి ముసలదండాదులచే మొత్తులం
బడి భవత్కార్యార్థంబుగా నింత చేసి నొచ్చితి. నాకు గతి యెట్లు
గలిగెడునని పరితపింప.

209

చ.

అరయఁగ విప్రశాపహతులై పడువారికి విప్రతాడనో
త్కరమున నీల్గువారికిని దగ్ధభుజంగమదష్టవజ్రపా
తరదనఘాతభగ్నులయి తారెడువారికి జహ్నుకన్యకా
సరిదవగాహమోపు ననిశంబును దద్ఘనపాప మాపఁగన్.

210


వ.

అనిన మోహిని యిట్లనియె.

211


క.

అటువంటి దివ్యవాహినిఁ
బటువేగముతోడ నేఁగి పడి మునిగినఁ ద
త్కుటిలాఘంబులు దొలఁగవు
జటిలానీకములు దొలఁగి చనుదురు చేరన్.

212


వ.

అది గావున నేను హరివాసరద్రోహిని, భర్తృపుత్రవినాశినిని, జగ
త్త్రయనిందితను, నన్ను నెట్లు దండించినం దగుదు నేమి సేయుదాన
నని దైన్యంబున నున్న మహేశదివాకరసహితులగు దివ్యులు
రుక్మాంగద పురోహితుని మెల్లన శాంతి నొందించి యిట్లనిరి.

213


వ.

నాకము పాడై యుండన్
వెకుంఠము నిండియుండ వనరుహహితభూ
లోకము శూన్యం బగుటన్
వ్యాకులతం బొంది చేయవలసెన్ మాకున్.

214


వ.

ఏము పంపిన నిమిత్తంబుననే యీమోహిని హరివాసరవ్రతంబు
మాన్ప రుక్మాంగదసన్నిధానంబునకు వచ్చినయది గాని నిజతంత్రం
బున వచ్చినయది గాదు. (రాజు) పునరావృత్తిరహితంబైన పరమ
ధామంబు సత్యంబు నిలుపుకొని చెందె. ఇది యుపకారంబె కావించిన
యది. నీవు సదాచారుండవు. తపస్వివి, సర్వభూతహితుండవు.
మహానుభావులకుఁ జేసిన యప్రియంబేనియుఁ బ్రియంబే యగు. సాంఖ్య
విదులైన మునులకు లభింపని వైభవం బారాజునకుం గలిగె.
ప్రసన్నుండవు కమ్ము. పాదహతులైనవారిని హింసింప నేటికి? అని
విన్నవించిన నిర్జరుల మన్నించి శాంతుఁడై పురోహితుం డిట్లనియె.

215


సీ.

అనిమిషులార! పాపాన్విత యిది భర్తృ
                       దుఃఖప్రదాయిని, దుష్టశీల
స్థావరజంగ మాత్మకమైన లోకత్ర .
                       యంబున దీనికి నధివసింప

రాదు; భూతవ్రజాక్రాంతంబు గాని దు
                       స్థ్సాన మెయ్యది యది తలఁచి దీని
నునుపంగఁదగు భూమి నునిచెద ననినఁ జ
                       రాచరజీవసంవ్యాప్తతరము


తే. గీ.

దైత్యనాగాన్వితంబు పాతాళసీమ,
యాకసము పక్షులకునెల్ల నాకరంబు,
సుకృతి గమ్యంబు, నాకంబు వికృతిఁ బాప
కర్మనిలయంబు నరకంబు గణన సేయ.

216


వ.

ఝషాదులచే సాగరంబులు [48]వ్యాప్తంబు లయ్యెడి, విహంగంబులచే
మహీరుహంబు లధిష్ఠింపబడియె. ఇది యెచ్చట నుండెనేని దీని నంటిన
మాత్రంబున నధోగతిం బొందుదురు. అని విప్రుండు పలికిన నెఱింగి
యగుంకాక! యని మోహినిం జూచి నీకు లోకత్రయంబున నుండ
నవకాశంబు లేదు. దివ్యులు పాపభోక్తలు కారు; పాపసంగులుం గారు.
నీవు సేయు నుపకారంబులకు శాపాపాయవరంబు దయచేసెద మని
యున్నవార మిందులకు నుపాయంబు దోఁచ దనిన మోహిని
యిట్లనియె.

217


ఉ.

చేసితి మీర లంపిన యశేషవిశేషవిమోహకార్యముల్
వాసి ననేకపాపము లవార్యములైనను [49]ముట్టె నాత్మ ను
ల్లాసము నొందె దండధరు లక్ష్మి యశేషమనుష్యవర్గముల్
డాసె సమస్తఘోరవికటధ్వని నారకలోకవాసముల్.

218


తే. గీ.

చిత్రగుప్తుండు నలసెఁ జేసేత వ్రాసి
ధర్మసంచయ మెల్ల విధ్వస్తమయ్యె
నైనఁ బాపంబు నామీఁద నంట నిమ్ము
సంఘటించితి నే నిట్టి సాహసమ్ము.

219


వ.

అయినను బురోహితసహితులగు మీకు నంజలిఁ గావించి వేఁడెద.
మీకు హితంబు చేసి పాపంబు లనుభవించిన నేమి? మఱియుం దత్సాప
బుద్ధియే నాకుఁ దోఁచుచున్నది. ఏకాదశిపుణ్యఫలంబు నాకు నిడినఁ
దదాధారంబున నుండెద నయ్యేకాదశి సర్వదినపుణ్యరాశి, సర్వపాప

ప్రణాశని, సర్వలోకప్రదాయిని యనిన మోహిని వచనంబులు విని
శిరంబు లూఁచుచుఁ బరుషాక్షరంబుల నిట్లనిరి.

220


ఆ. వె.

అడుగరాని యర్థ మడిగితి వబల! సు
రాసురులకునైన ననుభవింప
రాదు విష్ణువాసరవ్రతఫలము నీ
కెవ్వఁ డొసగ శక్తుఁ డెంచి చూడ.

221


క.

హరిదివసఫలము దక్కన్
వరమొక్కటి వేఁడు మింక వారిజనయనా!
హరిదినము బ్రహ్మహత్యా
దురితాయుతకోటినేని త్రోవలఁ బెట్టున్.

222


వ.

సర్వయజ్ఞఫలప్రదంబగు హరివాసరఫలం బొసంగ మాకు శక్తి లే దది
మోక్షప్రదంబు, పుణ్యంబు, జన్మమృత్యునికర్తనంబు. తత్ఫలంబు
వేఁడిన నీశిరంబునఁ గులిశంబు వడియెడు ననిన మోహిని యిట్లనియె.

223


క.

అయిన న్నేమి? ప్రియంబుగ
దయతోడం బ్రాంతవిద్ధదశమీసుకృతం
బయిన న్నొసఁగుఁడు నాకని
లయులారా యనుచు సువికలంబుగఁ బలుకన్.

224


వ.

దివ్యు లిట్లనిరి.

225


ఆ. వె.

ప్రాంతవిద్ధదశమిఁ బ్రాపించు సుకృతంబు
హరునిమాటమీఁద నబ్జసూతి
జంభునకు నొసంగె సంతతబలశాలి
యైనఁ దత్ఫలమున కర్హుఁ డగునె!

226


వ.

అనిన మోహిని యిట్లనియె. దశమీప్రాంతంబున దివాకరుం
డుదయించినది మొదలు హరిదినం బది యసురులకు నొసంగిరి.
సూర్యోదయవిహీనంబైన దృశ్యాదృశ్యచరచరంబై దశమితోఁ గూడిన
హరిదినం బగ్నివిహారకాలార్హం బదియె వధూత్థాపన[50]కాలంబు,
గోదోహనకాలంబు, పక్షి నన్నాదలోలంబు, సర్వదేవవిరామ
కారణంబు, మార్జనిగ్రహణసమయంబు, ద్వారోద్ఘాటనవేళ, ప్రతి
వీక్షితస్నానావసరంబు, వాదిత్రనినదసంకులంబు, తద్దశమితో

నేకాదశి కూడెనేని యది నాకు నివాసంబుగా నొసంగుఁడు
ఉదయంబున హరివాసరంబును వేఁడ వైనతేయోదయంబున వేఁడెద.
మునిదగ్ధ[51]నై యిష్ఠార్థంబుగా నీప్రాంతంబు వేఁడెద నీవలయు నిధి
యీకుండిన వేయితునియ లయ్యెదనని కులిశంబుచేత విచ్ఛిన్నయైన
తన్మోహిని పలుకు వచనంబులు విని దిగంబరపురోగములైన యా
నిర్జరులందఱు విమర్శించుకొని యమదర్శనార్థంబుగా, వైకుంఠధ్వంస
నార్థంబుగాఁ, బాషండవృద్ధ్యర్థంబుగాఁ, బాపసంజననార్థంబుగా,
దత్పురోహితునివలన ననుజ్ఞఁ గొని మోహినిం జూచి యిట్లనిరి.

227

దేవతలు మోహినికి స్థానమును కల్పించుట

సీ.

అఖిలలోకవిమోహానార్థంబుగా నీకు
                       నుండ నర్హం బగుచున్న ధామ
మాదశమీప్రాంత మదియె ప్రత్యూషదు
                       ష్టము హరిదినసంయుతము ఘటింప
జంభదుష్టము గాదు సకలదానవదైత్య
                       గమ్యంబు గాదు యోగ్యంబు గాదు
సురలకు, నందు సుస్థిరలీల విహరింపు
                       మాకాలమున మాధవార్చనంబు


తే. గీ.

సేయుమనుజుల సుకృతంబు చెందు నింక
సంశయం బంద నేటికి సారసాక్షి!
దేవకార్యార్థమై నీవు తిరిగినట్టి
తత్ప్రయాసంబు ఫలియించుఁ దరళనేత్ర!

228


క.

ఆదిత్యోదయహీనత .
నాదశమీప్రాంత మున్న హరిదివసముగా
నాదటఁ గైకొని యుండెడు
నాదుర్మదుఫలము నీకు నర్పించు నిఁకన్.

229


వ.

సూర్యహీనంబగు దశమీప్రాంతం బేకాదశీమిశ్రంబు నాశంబు
నొందించిన నుపవాసవ్రతదానజాగరణంబులచే నార్జించిన పుణ్యంబు

నీ కగు. అప్రభాతాంకితంబై యంతర్దశమీగర్హితంబై దృశ్యాదృశ్యత
హరిదినంబునుం గూడియున్న నరుఁడు సేయు సుకృతంబు నిష్పలం
బగు. ఇట్టి దశమీప్రాంతంబున నుండి జగంబుల మోహంబు నొందిం
పుచు తాఁ బడినపాటులన్నియు మఱచి మోహిని హర్షించుచుండు.
యముండు తత్పాతకుల శిక్షించుటకుఁ బటాక్షరలిపి పుట్టెడి. అది
దేవదానవులచేత నలంఘ్యం బగు. రవిసంప్రయుక్తదశమీయోగంబు
భువనత్రయంబునఁ బ్రసిద్ధంబు. ఆయోగయుక్తదశమిం బటస్థితయై
దృశ్యాదృశ్యసంజ్ఞ వర్తించునదియై మోహిని యనుభవించుకొని
తత్పటంబునందు లిపి గావింపుచు నిజస్థానంబున నుండునని
యముండు పలికి దేవతలుం దానును నాకలోకంబున కేఁగె. మోహినియు
జగన్మోహినియై దినేశహీనదశమీప్రాంతంబున నుండెనని వసిష్ఠుండు
మాంధాతకు నెఱింగించి మఱియు.

230


సీ.

పాపనాశనము శోభన మీపురాణంబు
                       రుక్మాంగదచరిత్ర రుక్మచేల
భక్తిగమ్యము జగత్‌ప్రాప్యంబు సర్వదుః
                       ఖక్షయకరము విఖ్యాతతరము
సంతతాయుష్యయశస్యప్రశక్యంబు
                       సర్వశత్రువిఘాతశక్తియుతము
శ్రోతవ్యము మహీశసూనులకెల్ల
                       యప్రదం బధికయోగ్యంబు భూమి


తే. 231


వ.

ఈరుక్మాంగదచరిత్రంబు రాజసూయఫలప్రదంబు. ఇది నీ కెఱిం
గించితి ననిన వసిష్ఠునకు మ్రొక్కి పరమానందంబు నొంది మాంధాత
యేకాదశీనిశ్చయం బెఱింగి ద్వాదశీమహోత్సవం బాచరింపుచు
నుండె.

232

ఆశ్వాసాంతము

మ.

అమితోద్యద్యమళార్జునద్రుమదమాహంకారధౌరేయ దు
ర్దమ! సాళ్వద్రుమరుక్మికాలయవనాద్యక్షుద్రదుర్వాహినీ
శమనోదగ్రమహోగ్ర! శుక్రరుచిరాజత్తీవ్రతేజఃప్రభా
కుముదిన్యాప్తకులావతంస! చరమాంగుళ్యుద్ధృతోర్వీధరా!

233


శకటారిబలనిషూదన!
నికటారిజలజయుగోనీయవరత్వ
ప్రకటనసంయోజితది
క్ప్రకటనవోల్లాసరత్న! కాంచీధామా!

234


భాషిణి.

సత్యభాషణా! సాధుపోషణా !
నిత్యజీవనా! నిర్మలావనా!
దైత్యసూదనా! ధర్మమోదనా!
స్తుత్యబోధనా! దోషశోధనా!

235

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీ మదల్లాడు నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ బంచమాశ్వాసము
సంపూర్ణము

  1. "బెట్టదరము ఫలనియమ" వ్రాతప్రతి
  2. "వారిందన్నియతఫల" వ్రాతప్రతి
  3. "వివి (?)" వ్రాతప్రతి
  4. "లక్ష్మీహేతువై " యని వ్రాతప్రతిలో దిద్దుబాటు కలదు.
  5. "కాయము లింకన్" అని వ్రాతప్రతి.
  6. "వికుచశాలి కుశస్తవివర్తియై" అని వ్రాతప్రతి పాఠము.
  7. "యానతి". అని వ్రాతప్రతిలో దిద్దుబాటు.
  8. "గలదే” వాతప్రతి
  9. "రాసు" వ్రాతప్రతి
  10. 25, 26 పద్యములనడుమ "అని పలికి" అను విధముగా నొకచిన్నవచన ముండవలెను. లేనిచో నన్వయము కుదురదు.
  11. "నీవు" అని వ్రాతప్రతి. దానికి సమన్వయము లేదు.
  12. గయావర్జన మనుట సంప్రదాయము. వజ్రనము=వెళ్లుట అనువిధముగా నెట్లో సమన్వయము కుదుర్చుకొనవలెను.
  13. "జాటి రతివ వినుము" అని వ్రాతప్రతి
  14. "విక్షంబులు గావఁ గావ వివి మేల్కనఁగన్" అని వ్రాతప్రతి
  15. ఇక్కడ యతి విచార్యము. దృతద్విత్వముగా పెంచినచో సరిపడును.
  16. "వ" అని వ్రాతప్రతి
  17. సాక్ష్య మనుట లెస్స. "సాక్షి చెప్పు" వ్యవహారమున నున్నది.
  18. "సిద్ధం బని" వ్రాతప్రతి
  19. "గర్భం" బని వ్రాతప్రతి
  20. "యతి" యని వ్రాతప్రతి
  21. ఈపాదమునం దఖండయతి కలదు.
  22. "విద్య" అని వాతప్రతి. అప్పుడు యతిభంగము.
  23. "నని” వ్రాతప్రతి.
  24. "రోద్యాయుధు" అని వ్రాతప్రతి
  25. "ఆకట" వ్రాతప్రతి
  26. ఈవచనము వ్రాతప్రతియందు లేదు. గ్రంథపాతపుగుర్తులును లేవు. అయినను సందర్భము జూచిన నిది యవసరమని స్పష్టపడగలదు.
  27. "నేను" అని వ్రాతప్రతి.
  28. "మై పురము లాకీర్ణాంత" అని వ్రాతప్రతి
  29. "నాకు" వ్రాతప్రతి
  30. యతిభంగము. నుంచి?
  31. ఈపాదమునం దఖండయతి కలదు.
  32. "సేయండే?" వ్రాతప్రతి
  33. ఈరెండువాక్యముల కన్వయము కుదురుట లేదు.
  34. "య" వ్రాతప్రతి
  35. "పాట" వ్రాతప్రతి
  36. అఖండయతి
  37. “కనాశనములకు ఫల" వ్రాతప్రతి.
  38. అఖండయతి
  39. "నాఁడ" వ్రాతప్రతి
  40. "తలంగుచు" వ్రాతప్రతి
  41. "మీకే" వ్రాతప్రతి
  42. "శీత" వ్రాతప్రతి
  43. "సితపక్ష యేకాదశి” ఇది వ్యాకరణముచే సాధ్యము కాదు. 'సితపక్ష మేకాదసిదినమున' అనువిధముగా నున్నచో సరిపెట్టుకొనవచ్చును.
  44. ఈపాదమున యతిభంగము. కాని పూర్వపద్యాంతముం గల ద్రుతమును బురిస్కరించుకొని "౦ద్రి"గా భావించినచోఁ గుదురును.
  45. తరువాతిభాగమును బట్టి యిక్కడ నీపద ముండవలసినదిగా గానవచ్చుచున్నది.
  46. ఈపాదమున యతిభంగము శక్తిమై యని మార్చినం గుదురును.
  47. వాయు
  48. "వ్యాపిషం బయ్యెడి" నని వ్రాతప్రతి
  49. "బుట్టి” వ్రాతప్రతి
  50. "మూలంబు” అని వ్రాతప్రతి
  51. "నైష్యర్థంబులుగా" నని వ్రాతప్రతి.