నారదీయపురాణము/అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

అష్టమాశ్వాసము

క.

శ్రీమాన్యజాంబవత్క
న్యామానసరాజహంస! హంసోత్తంసా
రామవసంతగుణాశ్రయ!
సోమాన్వయవరవిభూష! శోభనవేషా!

1


వ.

అవధరింపుము. సూతుండు శౌనకాదులకు హరికథాసుధావ్రవా
హంబు వెల్లివిరియ నిట్లనియె ననిన వారలు నిజశాస్త్రధౌరంధర్య
ప్రాగల్భ్యంబున వచ్చి నిలిచిన యప్పుడు.

2


క.

పూర్ణబ్రహ్మానందో
దీర్ణ పరంజ్యోతిరిద్ధతేజోమహిమా
కీర్ణ శుభాకారశ్రీ
నిర్ణిద్రస్ఫూర్తి సుతుఁడు నిలిచెన్ సభలోన్.

3


వ.

నిలిచి.

4


సీ.

పాషండమతగర్వపర్వతంబులమీఁద
                       దంభోళియై మహోద్ధతి వహించి
చార్వాకమతమహాసాగరావళిమీఁద
                       నౌర్వానలస్పూర్తి నాక్రమించి
బౌద్ధదంతావళోద్భటఘటార్భటిమీఁద
                       సింహరాజంబుప్రసిద్ధి నెదిరి
జైనమహారణ్యసంఘాతముల మీఁద
                       నతులదావానలంబై స్ఫురించి


ఆ.

కపిలాక్షపాదకాణాదవైరించ
మతఘనాంధతమసమండలార్క
మండలప్రకాండఖండనోద్దండత
నట జయించె నా[1]కయాధసుతుఁడు.

5

వ.

అప్పుడు యుక్తులు తోచక ప్రతివాదులు భంగంబు నొంద సుధాతరం
గంబులైన వాక్కుల విజృంభించి యున్నయెడఁ దండ్రి రోషోద్ధతుండై
యున్న భగవత్ప్రభావం బెఱింగించ నిట్లనియె.

6


క.

వినుము జనక! నిజసేవక
జనకల్పకమైన యట్టి చక్రియశము శో
భనమతులు వారు సన్నుతు
లనిశంబు నొనర్చి ముక్తు లైరి ధరిత్రిన్.

7


వ.

అది యెట్లంటేని వాసుదేవవరంబైన జపంబు జపియించి ము న్నర్భ
కుండైన ధ్రువుండు ధ్రువస్థానంబున బ్రహ్మాదిదివిజులకంటె మీఁదట
నుండి నది యెఱింగించెద వినుము.

8

ధ్రువుని చరిత్రము

తే. గీ.

భవ్యవైభవుఁ డుత్తానపాదుఁ డనఁగ
నాప్తబంధుండు మనకు గుణాధికుండు
సాధురక్షణచణశక్తిచక్రధరుఁడు
దుష్టశిక్షణచణశక్తిధూర్జటియును.

9


క.

ధ్రువుఁడు తనకుం దనూభవుఁ
డవుట మహాధన్యుఁ డయ్యె నారాజున్ వై
ష్ణవబంధుత్వంబు మహా
ధ్రువపూర్వతపఃఫలంబు దొరకక యగునే.

10


సీ.

ధర్మాత్ముఁడైన యుత్తానపాదున కతి
                       నీతిశీలునకు సునీతి యనఁగ
సురుచి యనంగఁ దేజోరాసులైన భా
                       ర్యలు గల రిరువు రుదారమతులు
వారిలో సురుచిపై వర్తిల్లు మోహంబు
                       రాజచంద్రునకు సర్వజ్ఞనిధికి
నప్రియమై యున్న యాసునీతికి ధ్రువుఁ
                       డను విష్ణుభక్తినిష్ఠాధికుండు

ఆ. వె.

గలిగె నాసురుచికి గారాపుబిడ్డఁ డొ
క్కరుఁడు మోహరాశి కవితమూర్తి
తండ్రితొడలమీఁద దా ముద్దు గులుకంగ
ధ్రువుఁడు చేరవచ్చి వివశుఁడైన.

11


వ.

ఉత్తానపాదుండు సురుచికి నోడి యుపేక్షించిన.

12


క.

పతి చాగఁ దెలిసి సురుచియు
నతిగర్వగ్రంథి యగుచు నాధ్రువుఁ గని నీ
చతనున్న నీకుఁ దగునా
తతమగు నుచ్ఛైర్మనోరథం బో వత్సా!

13


క.

నీ కిది ప్రియమై యుండిన
నా [2]కడుపునఁ బుట్టి యతిఘనంబగు తప మీ
లోకములు మెచ్చఁ జేసినఁ
జేకూరుంగాక చింత చేసిన గలదే.

14


మ.

అతియోగ్యత్వము నీకుఁ గల్గినను నేఁ డయ్యో సవత్నీతనూ
జతదూష్యత్వము నొందినాఁడ వతులైశ్వర్యంబుచే రాజు నీ
చతరుంగా నినుఁ జూచె; విత్తు లధికశ్లాఘ్యంబు లైనన్ నిరా
కృతముల్ గావె ఘనోషరస్థలుల నాకీర్ణంబుగాఁ జల్లినన్.

15


క.

ఈరాజాంకమునకు సుకు
మారుఁడు శూరుండు నాకుమారుఁడు దగు; వీఁ
డే రా జగు నీధరణీ
భారమునకు; నీకు నింకఁ బాత్రత గలదే?

16


వ.

అనిన రాజు నట్లనే సమ్మతించిన సామర్షదుఃఖాశ్రుధారోరస్కుండై
మాతృగృహంబునకు నేఁగి తల్లి యడిగిన, సురుచిదుర్వచనంబులు
విన్నవించిన, వ్యథ నొంది సునీతి మెల్లన నిట్లనియె.

17


ఆ. వె.

అన్న! దుఃఖ మేల యాసురుచి యథార్థ
మైనయట్ల పల్కె; నల్పభాగ్య
నామురారి గొల్వ నట్లౌట కాత్మాప
రాధ మది సహింప నర్హ మనఘ!

18

వ.

కావున నాపదలు ప్రాపించిన ధైర్యంబు వదలక యనుభవింప
వలయు; రాజు తండ్రి; సురుచి తల్లి; వీరిపై నలుగుదురే? సురుచి
తపంబు చేసి పార్వతి రుద్రునకుంబలె మీతండ్రికిం బ్రియకాంతయై
నది. పెద్దలయెడ నైచ్యంబు చేసిన [3]నది నీకు ననాయుష్కరంబు.
మత్తనూజుండ వైనకతన రాజోత్సంగంబు గోరందగునే? వారి
కంటె నాధిక్యంబు గోరెదవేని హరిం బూజింపు; మతని యనుగ్ర
హంబున బ్రహ్మాదుల కైశ్వర్యంబు గలిగినయది; యన విని
హర్షించి తల్లి కిట్లనియె.

19


సీ.

అంబ! కృతార్థుండ నైతి నే సకలకా
                       మప్రదుండైన యామధువిరోధి
గలిగె నాసకలలోకస్వామిఁ బాయక
                       కొలిచి సర్వానురస్థలప్రదోషకా
రిస్థానవీథి వర్తించెద; నమ్మహీ
                       నాయకాంకతలము నాకుఁ దగదు
మద్భ్రాతకే కాని; మౌనివర్తనమున
                       కబ్జజాదుల కలభ్యమగు నట్టి


తే. గీ.

పదముఁ గోరెదఁ; జూడు మద్భాగ్యమహిమ;
నీతనూజుండ నైతి మహీతలమున
నాకలోకంబునందును నన్ను నెంచ
నధివసించెద నుచ్చైఃపదాంతరమున.

20


వ.

అని పల్కి వెడలి పురోపవనంబున సప్తర్షులం గాంచి వారిం
గాంచుటయే భగవదనుగ్రహంబుగాఁ దలఁచుకొని యాయవమా
నంబు వారికి విన్నవించి "హిరణ్యగర్భపురుషప్రధానావ్యక్త
రూపిణే, ఓం నమో భగవతే వాసుదేవాయ శుద్ధజ్ఞానస్వరూపిణే"
యగు నీమంత్రంబు వార లుపదేశించిన యమునాతీరమధువనంబున
జపించుచు నీశ్వరుండు సాక్షాత్కారంబున హృదయస్థుండై కానుపించ
దేవత లనేకవిఘ్నంబు లొనర్చినం దరించి బాహ్యంబున సకలాత్మ
భూతుండై యట్లే దేశకాలాద్యుపాధిరహితుండై ఘనచిత్ప్రకాశుండై
నిలిచిన యప్పరమపురుషునిం గని తర్షవర్షవాతమహోష్మభవశరీర
దుఃఖంబులు మఱచి ధ్యానంబుఁ గావించిన యప్పుడు గరుడవాహనా
రూఢుండై నిలిచి.

21

క.

హరి మెఱసె రత్నమౌళ్యు
త్తరుఁడై నూతన[4]ఘనాంబుదస్ఫూర్తులతో
స్ఫురదుదయాచల[5]మత్సర
నిరతిన్ బాలార్కుతోడి నీలాద్రి యనన్.

22


ఆ. వె.

అతని యాననము సమంచితకుండల
ద్వయవిభాసి యగుచుఁ దనరె నికట
విలసదుచితకాంతి వెలయు బాలారుణ
ద్వయసుపార్శ్వనవ్యవనజ మనఁగ.

23


క.

తగఁ గౌస్తుభమణిబింబిత
మగు జగము వహించి నిలుచు నచ్యుతరూపం
బగణేయవిశ్వరూపా
ధిగతంబై నిలిచినట్ల తేజము నందెన్.

24


క.

చిత్రతరరత్నభూషా
పాత్రములై శౌరిదివ్యబాహువులు నిజ
స్తోత్రహిత[6]ఫలదనవపు
ష్పాత్రత్యసురద్రుశాఖలై దీపించెన్.

25


క.

శ్రీమంతములై తత్పద
తామరసము లమరె నఖరధామముతో ను
ద్దామజ్ఞానసుకృతకీ
ర్త్యామోదశ్రీలు నతుల కర్పించుగతిన్.

26


వ.

ఈరీతి విజృంభించిన నయ్యీశ్వరుండు ధ్రువునిం గాంచి దంతాంశు
సంజ్ఞామృతప్రవాహంబుచే గాత్రరేణువుం దొలంగింపుచు వరంబుఁ
గొనుము. మద్ధ్యానాంచితేంద్రియనిగ్రహంబున; [7]దుష్కరమనో
నిరోధంబునం జేసిన తపంబునకు మెచ్చితి. వాయునిరోధంబు చేసి
నాయందుఁ జిత్తంబు నిలిపినవాని మదాజ్ఞచే సుదర్శనంబు రక్షించు.
సాధుబుద్ధి యగు నీవంటి ప్రపన్నుండు మన్మాయ జయించి బ్రహ్మ
పరాయణుం డయ్యెనేని వానికి వరంబు లిచ్చుబుద్ధి నన్నుఁ ద్వరసేయు
చుండు నని యానతి యిచ్చిన నచింత్యమానంబై మూర్తంబై ముందర

నున్న చతుర్భుజబ్రహ్మంబుఁ గాంచి యేమి సేయుదు నెట్లు వినుతింతు
నెట్లు సేవింతు నని యూరకయుండి హర్షాశ్రుపూర్ణుండై 'స్వామీ!
ప్రసన్నుండవు గ'మ్మని యతిప్రయాసంబునం బలుకుచుండి దండ
ప్రమాణం బాచరించి వణుకుచుఁ బులకించియున్న యతనిఁ గరంబుల
నెత్తినఁ దత్సంస్పర్శహర్షోవచయంబున స్తవశక్తి గొంత మెఱయ
మూర్తి [8]మద్వాగ్‌జ్ఞాననిభంబైన శంఖంబున నమృతబిందువు
దొలంక ముఖమార్జనంబు గావించిన మున్నే విమలంబైన చిత్తంబునఁ
ద్రిభువనగురుశంఖచక్రస్పర్శజన్యజ్ఞానభానుండు స్ఫురింప నిట్లని
వినుతించె.

27


సీ.

జయ జయ లసమానశంఖచక్రాసిశా
                       ర్ఙ్గగదా[9]గ్రహణభుజాగ్రప్రధాన
జయ జయ నిజదానజనయోగ్యబహుకామ
                       భువనత్రయమయసంపూర్ణవిభవ
జయ జయ సర్వాత్మసంభూతభావజ్ఞ
                       సర్వశరణ్యశాశ్వతవరేణ్య
జయ జయ దైత్యభంజనఘనప్రకృతిపూ
                       రుషకాలసంయుక్తరూపనాథ


తే. గీ.

ఒక్కరుఁడ వీవె నిఖిలలోకోదయావ
నాంతకారణమైన మహామహుండ
వొక్కరుఁడ వీవె సకలలోకోత్తరుఁడవు
కలితశుభమూర్తి యెంచ నొక్కరుఁడ వీవె.

28


వ.

ఇది గాన నీతత్త్వంబు నెవ్వ రెఱుంగుదురో స్వామీ! యవికృత
నిజరూపుండ వగుట నీకు వివిధభావము మాయచే విరుద్దంబు
గాదు, దినకరకరజాల[10]మూషరస్థానసంగంబున నవికృతమేనియు
నిజరూపవికారంబు వహించునట్లు నీరూపంబు వైకృతంబును
గారణంబు నన వినంబడియె. ఆవైకృతరూపము జగత్తని వేదంబులు
పలికె. కారణం బగు నవి బ్రహ్మమును, సత్తు నని విన్నవించు; నట్టి
దేవవంద్యంబులైన యీరెండురూపంబులు భజించెద. విశ్వమూర్తీ!
నిన్ను వేదంబులు దశశతముఖునింగా, సహస్రాక్షిపాదునింగాఁ
బలికె. మఱియును సహస్రముఖపాదాక్షి, బాహురునింగాఁ బలికె.

వితతునింగా నణువుంగాను దీర్ఘునింగాను పలికె. బ్రహ్మభూతుండవై
వితతవిమలరూపుండవైన నీయందు నివిశ్రుతము వేఱైయున్న
యదియుంబోలెఁ జూడంబడి స్వాశ్రయాభిన్నం బయ్యె. జలమయం
బగు ఫేనంబు గాన్పించి లయకాలంబున వేఱుగానియట్లు వివిధ
రూపంబు లన్నియు నిన్నుం గలయు. లోకంబులలో నగణితపృథు
శక్తివై యుత్పథస్థుల నాశంబు నొందింపుచుఁ బ్రణతజనంబుల
ననంతజ్ఞానదానంబులం బోషింపుచు నిన్ను సేవింపనివారిని ధన
తనయవధూజనంబులచే మోహంబు నొందింపుచుండుదు. నీ
స్వేచ్చనే త్రిజగదుదయనాశంబు లగు సకలస్వజనకామోత్పా
దంబును, ఖలజనవ్యాపాదనంబును జేయుట స్తుతియింపవలయు;
ననికాశయగణితగుణసిద్ధుండవైన నిన్ను నుతించనేర. వంద
నంబు సేయనేర కందనిభా! శంఖంబు పూని యిందునిభాననంబై
సుందరావలోకనంబై సుచారంబై బృందారకజనవందితంబై
సురూపంబైన నీరూపంబు సేవించెద. ఉత్తమస్థానంబుఁ గోరి
తపంబు సేయుచు సాధుమునీంద్రగోప్యుండవైన నిన్నుఁ గంటి
కాచంబు వెదకుచు దివ్యరత్నంబు కాంచిన యట్లు కృతార్థుండ నైతి.
అపూర్వదృష్టంబులైన నీపాదపద్మంబులు గంటి విడువంజాలఁ
గామంబు లొల్లఁ గల్పవృక్షంబుఁ జేరి [11]తుషామాత్రంబు వేఁడం
దగునా? మోక్షబీజంబవగు నిన్ను శరణంబు నొంది, బహిస్సుఖంబులను
భవించునా? రత్నఖని తనకు సిద్ధించినఁ గాచమయభూషణంబు
యుక్తం బగునా? యుష్మత్పాదాబ్జభక్తి యెల్లప్పుడు నాకు లభింప
వరంబి మ్మీవరంబే మఱియు మఱియు వేఁడెద నని యాత్మసందర్శన
లబ్ధదివ్యజ్ఞానంబునం బలుకు నతనిం గాంచి భగవంతుం డిట్లనియె.

29


సీ.

విను రహస్యము వత్స! విష్ణు నారాధింప
                       ఫల మీతనికి నేమి గలిగె నంచు
జను లాడుకొనుదు రసాధువాదంబు లి
                       ట్లేది లభింపకయుండ; నిష్టమైన
యుత్తమస్థాన మే నొకటి నీ కిచ్చెద నీకుఁ
                       గల్పాంతమున మన్నికాయసీమ
యందెద వఖిలగ్రహాధారభూతుండు
                       వైకల్పకాలధ్రువాధిలక్ష్మిఁ

తే. గీ.

గాంచి సర్వైకవంద్యభాగ్యము వహించి
మత్ప్రసాదంబువలన ధర్మగుణశీల
యైన మీతల్లి వరనీతి యాసునీతి
గారవించంగ నిఖిలవిఖ్యాతి నుండు.

30


మ.

అని లాలించి నిజాలయంబునకు నత్యంతప్రసన్నైకహృ
ద్యనిరీక్షన్ నిజదాసుఁ దా మరలి యత్యాసక్తి నీక్షింపుచున్
జన మింటన్ సురసిద్ధసాధ్యవరు లంచత్కల్పభూజాతనూ
తనసూనంబులు భోరునం గురిసి రుద్యద్భక్తిమై నంతటన్.

31


క.

పరమపద మందె నీగతిఁ
బరమానందమున ధ్రువుఁడు; పరమాత్మ కృపా
పరుఁడై ప్రసన్నుఁ డైనన్
గరము ననాశాస్యవస్తుగణములు లేవే!

32

ప్రహ్లాదుఁడు తండ్రికి భగవత్ప్రభావం బెఱింగించుట

ఆ. వె.

హరి ప్రసన్మమూర్తి యగుట ననేకవి
ఘ్నములు గలవు భజనకాలముననె
యలసతయును నిద్ర యతిభయంబులును గా
మాతురతయు మదము నాదిగాఁగ.

33


క.

తరియింపరావు విఘ్నాం.
తరములు హరిభజనవేళ; దర్వీకరశే
ఖరమస్తకరత్నమువలె
దొరకునె సుకృతులకుఁ గాక దుర్లభము లిలన్.

34


క.

అరయఁగఁ గ్రోధాదులు శ్రీ
హరికల్పమహీరుహమున కావరణంబుల్
దొరకంగ నీవు వానిన్
నిరసించిన యట్టిభాగ్యనిధికిం దక్కన్.

35


క.

అరిషడ్వర్గమహాఫణి
పరిగుప్తదురాపచక్రపాణినిధానం
బురువిద్య నొందువారిన్
నిరతము సేవింతు నిత్యనిర్మలు రగుటన్.

36

తే. గీ.

హరి భజించుట దుష్కరం బని యుపేక్ష
సేయువాఁ డతినీచుండు శ్రీవిభుండె
యంతరాయంబు లణఁగించు నమ్మహాత్ము
శరణ మని కొల్వఁ బ్రాపించుఁ బరమపదము.

37


క.

శ్రద్ధాతిశుద్ధభావని
బద్ధాచ్యుతభజనశుద్ధి ప్రాపించి యఘా
నద్ధాంతరాయములు చను;
నిద్ధమహాదీపశిఖల నేగవే తమముల్?

38


వ.

అని మఱియు నిట్లనియె.

39


ఉ.

నాలుక గల్గియుం దురితనాశనకారణవిష్ణుకీర్తన
శ్రీలు వహింపఁ డెవ్వఁ డసుశీలుఁడు వాఁడు; విముక్తసౌధరా
ట్కేలికి నెక్క నిచ్చెన యకించిదుదారతఁ గల్గ నెక్కఁ డే
బాలిశుఁ డట్టి మూఢుని నపాయరతుం దలఁచంగఁ బాపముల్.

40


తే. గీ.

కాన గోవిందమాహాత్మ్యకథల యందు
నిరుపమానంద మొంది వర్ణించి సన్ను
తించి నర్తించినట్టి యానియమపరుఁడు
పరమభక్తుండు ఘనుఁడు సద్భాగవతుఁడు.

41


క.

జలజాక్షభక్తులం గని
పులకాంకురములు వహించు పురుషున కవియే
వెలలేని వజ్రకవచము
నలుగడ దురితాస్త్రచయము నాటునె వానిన్.

42


క.

హరిదివ్యకథాశ్రవణాం
తరమున నానందబాష్పధారలు వడి యాం
తరతాపత్రయదహన
స్ఫురణంబులు మాన్పు నెట్టి పురుషులకైనన్.

43


వ.

అని యప్పుడు ప్రహ్లాదుండు భక్త్యాహ్లాదంబునం బలికిన భగవత్ప్ర
భావంబు విని హిరణ్యకశిపునకు భగవదిచ్ఛవలన రజస్తమోద్రే
కంబున గర్వోత్సేకంబు వొడమునంత.

44

మ.

అతిరోషోద్భటుఁ డాహిరణ్యకశిపుం డాటోపతేజోమహో
ద్ధతి హుంకారము సేయునంతనె భయోద్ర్భాంతిన్ వణంకెన్ శచీ
పతి; భూభృద్గహనాంతరాళపతి విభ్రంశంబు దాల్పించె దే
వతలెల్లం జలియించి మ్రొక్కిరి భయవ్యాలోలచిత్తంబులన్.

45


క.

మునివరులు ధ్యానయజ్ఞజ
పనియమసముపాసనములు పాటింపక యా
తని మనసు వట్టి మధుసూ
దనువైభవ మాత్మయందె తలఁచిరి భీతిన్.

46


క.

అతిదుఃఖశీలుఁ డని విని
యతనిని నిందించరైరి యాత్మజ్ఞులు శ్రీ
పతికరనఖరచయముచే
దితి నుండెడువాఁడు గాన దితిజుం డైనన్.

47


వ.

ఇట్లు హిరణ్యకశిపుం డంతరంగంబునం గ్రోధవార్ధితరంగంబులు
వెల్లివిరియ నిజకులశత్రుండైన పుత్రునిం గాంచి చేరంబిలిచి.

48


క.

ఉరమునఁ జేర్చి కుమారక!
పరమరహస్యంబుఁ దెలిసి పలికితి భళిరా!
తిరుగం బలుకుర మాధవ
హరి కృష్ణ ముకుంద శౌరి యచ్యుత యనుచున్.

49


వ.

ఇటువంటి హాస్యదురుక్తులు పలికినవారిని శిక్షించి రాజ్యంబు వెడలం
ద్రోయించితి; నీ వెచ్చట వింటి వనిన నిర్భీతుండై తండ్రితో
నిట్లనియె.

50


మ.

ఇటులం బల్కకు మెన్నఁడేని నసురాధీశా! ఘనైశ్వర్యసం
ఘటనామూలము దుర్బవాగ్నిశమనాకాలాభ్రమౌ నచ్యుతో
త్కటమంత్రం బతిహాన్యమన్న భయశోకగ్రస్తుఁడై దేవతా
తటివిన్ స్నాన మొనర్చినం గలుగునే తండ్రీ! పవిత్రత్వముల్.

51


వ.

కావున హాస్యం బనినఁ బాపంబు దీర నేనుమారులు కృష్ణా యని
స్మరింపుము. మాయ సృజించిన జనులను దారుప్రతిమలంబోలెం

ద్రిప్పుచు నున్నవాఁడు. తదీశ్వరశక్తిం బాసి నిమేషోన్మేషంబుల
యందేని సమర్థుండు గాఁడు. నీ వసాధువచనంబులు వినక సర్వేశ్వ
రుని వేఁడుకొనుము. పూర్వపాపంబు లేనియుం దొలంగు.
ఈయైహికంబు సుఖంబుగాఁ గోరుచున్నవాఁడవు. తద్దుఃఖం
బెఱింగించెద.

52

ప్రహ్లాదుఁడు తండ్రికి భవదుఃఖస్వరూపం బెఱింగించుట

సీ.

కేవల బహుమలాకీర్ణమౌ జననిగ
                       ర్భంబున సౌకుమార్యము వహించి
యుల్బంబులో స్రుక్కియుండి సంభుగ్నక
                       రాస్థిపృష్టాధికుం డగుచు మర్త్యుఁ
డత్యామ్లకటు[12]సుతీష్ణాక్షాత్యుష్ణలవణంబు
                       లగు తల్లి భుజియించు నట్టి [13]భోజ
నముల వేదన లంది నలఁగి నిజాంగప్ర
                       సారణాకుంచనశక్తి లేక


తే. గీ.

యనిశమలమూత్రపంకలిప్తాంగుఁ డగుచు
జన్మశతములచైతన్యసరణిఁ దలఁచి
పరితపించుచు నిజకర్మబంధనమున
గర్భదుఃఖంబు గాంచు నగ్రంబునందు.

53


వ.

ప్రాజాపత్యవాతపీడ్యమానాస్థిబంధనుండై ప్రబలసూతిమారుతంబులచే
నధోముఖుండై క్లేశంబున మాతృజఠరంబు వెడలి మహామూర్ఛ నొంది
బాహ్యవాయుసంస్పర్శంబున విజ్ఞానభ్రంశంబు నొంది శరీరంబు
కంటకంబులం బొడిచిన యట్లు, క్రకచంబులం జీరిన యట్లు వేదన
లంది పూతివ్రణంబులతోఁ గ్రిమియుంబోలె ధరణిం బడి కండూ
యనపరివర్తనంబులయందు నసమర్థుండై స్నానపానాదికంబుల
యందేని పరేచ్ఛంగాని తాఁ జేయ నశక్తుండై కీటదంశాది
బాధల నొందియు వారించుకొన దక్షుండు గాక పొత్తులపయిం
బవళించి దుఃఖంబు లనుభవించు బాల్యంబున మూఢాంతఃకరణుండై
యజ్ఞానతమశ్ఛన్నుండై యే నెవ్వండ? నెచ్చటికి నేఁగుచున్న

వాఁడ? నేరూపంబువాఁడ? నేబంధంబున బద్ధుండ నైనవాఁడ?
కారణం బెయ్యది? కార్యం బెయ్యది? యకార్యం బెయ్యది?
వాచ్యం బెయ్యది? యవాచ్యం బెయ్యది? ధర్మం బెయ్యది? యధర్మం
బెయ్యది? కర్తవ్య మెయ్యది? యకర్తవ్య మెయ్యది? గుణదోషంబులు
గలయది యెయ్యది? యని తెలియక శిశ్నోదరపరాయణుండై
కార్పానబీజంబుతంతు కారణపక్షాఘంబులచేతంబోలె నానా
దుఃఖంబులచేతం బరిఫ్లుతుండై యుండు. యౌవనంబున నర్థార్జన
దుఃఖంబుల నర్థావనదుఃఖముల నృపాలాదులచేత నర్థవ్యయదుఃఖం
బులం బొరలుచు వ్యర్థోద్యోగంబు నంది యణంగుచు నుండును.

54


క.

పుత్రకళత్రక్షేత్రసు
మిత్రధనాద్యములచేత మెలఁగిన సుఖముల్
చిత్రముగ నున్న కైవడిఁ
బాత్రములే ధర్మసౌఖ్యభాగ్యక్రమముల్.

55


సీ.

ఈభవంబులయందు నెన్నెన్నియోనుల
                       జనియించు విగతవిజ్ఞానుఁ డగుచు
నలరి తత్తద్యోనులందు వైరాగ్యంబు
                       నందండు సుఖముగా ననుభవించు
నరకంబులోపల నలఁగి దేహముమీఁది
                       యాస మానఁడు నిరాయాసబుద్ధి
నాత్మజాయాతనయాగారపశుధన
                       ద్రవిణబాంధవమైత్రిఁ దగిలి యాత్మ


తే. గీ.

యందుఁ దను మెచ్చుకొనుచు నత్యంతదురిత
కోటు లొనరించుకొనుచు దుష్కుంఠితాత్ముఁ
డగుచు సంసారచక్రంబునందుఁ దిరుగు
మానవుఁ డగమ్యతరదేవమాయకతన.

56


తే. గీ.

ఆత్మలో దారపుత్రధనాదిమోహ
ములు మహాదుఃఖతరబీజములు చెలంగి
తనువు భేదించి వెడలి చేతనుని బ్రాయ
మునఁ దపింపఁగఁ జేయు నమోఘశక్తి.

57

తే. గీ.

స్థిరమహాదుఃఖవాహిని సింధు వయ్యె
ముదిమి యెన్నియవస్థలఁ బొదలు మృత్యు
భీతి సన్నిహితంబుగఁ బెక్కు లేల
వార్ధకము వంటి దుఃఖ మివ్వసుధ గలదె?

58


వ.

మఱియు వహ్న్యంబు వాతాసిమృగాహిపక్షిపశ్వాదులచేత
జనునకు మృతిభయంబు ప్రాపించు నింక నిన్ని యననేల?
నెయ్యదియు జనులకు నాశకరంబె. నాశహేతువులు కాని దేశకాలం
బులును లే విట్లు భవంబున విమర్శింపుచు సుఖం బెఱుంగమి నెట్లు
వితర్కించిన దుఃఖకరంబులే యగును.

59


సీ.

ఆధ్యాత్మికంబును నాధిభౌతికము నా
                       నాధిదైవిక మన నమరియుండుఁ
దాపత్రయంబందుఁ దనరు నాధ్యాత్మిక
                       మగు నది శారీరక మనఁగ మాన
సం బన రెండయి జరగుఁ బీనన శిలో
                       రోగభగంధరాళోజ్వలోగ్ర
గుల్మశూలశ్వాసకుష్ఠాతిసారాది
                       కంబయి శారీరకంబు వెలయు!


తే. గీ.

మానసిక మెంచి చూడఁ గామమదలోభ
మానవిద్వేషభయరోషమత్సరావ
మానశోకదురీర్ష్యామమత్వమూర్ఖ
తాదురాచరణంబు లిద్దరణిలోన.

60


క.

మృగఖగమనుజపిశాచో
రగరాక్షసముఖ్యపీడ ప్రాపించినచో
నగు నాధిభౌతికం బన
నగణేయంబైన తాప మతిచిత్రముగన్.

61


క.

శీతోష్ణవర్షవిద్యు
ద్వాతాంబుముఖప్రభూతబహుతావము వి
ఖ్యాతముగ నాధిదైవిక
మై తగుశాస్త్రక్రమమున నారసి చూడన్.

62

సీ.

స్థావరక్రిమిజలచరపక్షిపశునర
                       దేవధర్మాత్మముక్తిపరజాతి
క్రమమున నెంచఁగఁ బ్రథమంబు లవి ద్వితీ
                       యంబులకన్న సహస్రభాగ
సమధికంబులును సూక్ష్మంబులు సూక్ష్మసూ
                       క్ష్మంబులు సూక్ష్మతరంబు లట్ల
సుస్థూలములు స్థూలసుస్థూలములునునై
                       స్థూలతరంబులు లీల మెఱయు


తే. గీ.

కర్మబంధనిబంధనోత్కటములైన
ప్రాణు లుండనిచోటు [14]విశ్వంబునందుఁ
గలదె యంగుళికాష్టమకళయునైన
నిర్ణయించిన నీధరణితలమున.

63


వ.

దేహాంతరంబునఁ గొన్నియాతనల నొంది దేవనరపశుపక్షితిర్య
క్స్థావరత్వంబులు గాంతురు. వాచికకర్మదోషంబునఁ బశుత్వమృగ
త్వంబులును, మానసికకర్మదోషంబున నంత్యజత్వంబును, శారీర
కర్మదోషంబున స్థావరత్వంబు నొందుదురు మఱియు.

64


సీ.

అతిభయంకరులైన యమకింకరులు క్రోధ
                       తామ్రాక్షులై వేగఁ దారసిల్లఁ
గని వివశత నొందఁగా వారు యాతనాం
                       గంబులో నిల్పి దుష్కర్ముగళము
కఠినపాశంబులఁ గట్టి యీడిచి తెచ్చి
                       రాజభటులు సాపరాధులఁబలెఁ
దూరించి సంతప్తతాలుకాన్వితకాప
                       థంబున నడిపింపఁ దాప మంది


తే. గీ.

యపుడు క్షుత్తృష్ణ లుదయించ నతికశాప్ర
హారములు వీఁపుపై నొడ నత్యశక్తి
నిర్జరస్థలముల వెంట నిలువనీక
తరుముకొనిపోవ మూర్చిల్లి తేరితేరి.

65

తే. గీ.

ఒనర నవతి నవసహస్రయోజనాధ్వ
ముద్ధతంబుగ మూఁడుముహూర్తములను
శమనభటు లిరువురు మహాసాహసికులు
యమనివాసంబుఁ జేర్తురు యాతనలకు.

66


సీ.

నిబిడోల్ముకచ్ఛటనిజమాంసచయముఁ గా
                       వించి యుగ్రతఁ దినిపించి రొక్క
యెడ నొక్కరునిచేతఁ దొడిమడ నొసఁగించి
                       రుగ్రమహార్భటి నుగ్రలోహ
ముఖగృధ్రములచేత ముహురాంత్రకృంతనం
                       బొనరించి, రధికమహోగ్రసర్ప
వృశ్చికదంశాదివివిధదంశనముల
                       వేదన అందించి, ద్విపమహీధ


తే. గీ.

రాగ్రపాదంబుగాఁ ద్రోఁచి రంబుగర్త
రుద్ధులం జేసి యాయుధవిరుద్ధులైన
విడువ కంతంత బాధించి వేగఁ గనలి
శమనదూతలు దుర్వారశక్తి మెఱసి.

67


వ.

తమిస్రాంధతామిస్రరౌరవాదులైన యాతనల నరులనేని, నారుల
నేని యన్యోన్యసంగదోషంబునం బొందితు రటుగాన సర్వ
జగత్పూర్ణుండైన భగవంతుని భజించిన సకల దోషంబులు నణంగు
మఱియు.

68


క.

పలుకుట కుడుచుట కట్టుట
నిలుచుట తిరుగుట సుఖించి నిద్రించుట, లో
కులకు హరిప్రేరణమునఁ
గలిగినయవి కాని వేఱె కలుగవు తండ్రీ!

69


వ.

కావునఁ దామసబుద్ధి విడిచి పూర్వంబునం జేసిన హరిపూజనంబుల
లభించిన మహైశ్వర్యం బనుభవింపుచున్నప్పుడుం బూజింపుము.
కృతఘ్నుండవు గాకుము. సర్వేశ్వరకల్పితస్వభావంబు విడువ
శక్తుండు లేఁడు గానఁ దండ్రియేని గురుండేని యహిదంష్ట్రాగ్రంబు
పయి వ్రేలు చాపిన వారింపవలయునని న్యాయంబునం బలికితి,
నీయపరాధంబు క్షమింపు మని పాదంబులం బడినఁ దద్దైత్యపతి
యిట్లనియె.

70

హిరణ్యకశిపుఁడు హరిభక్తి వీడుమని ప్రహ్లాదుని మందలించుట

సీ.

తగునె నీకు నశక్తిధరణీసురోచిత
                       కర్మంబు సేయ మద్గర్భమున జ
నించియు ధూర్తులౌ నీరజేక్షణపక్ష
                       జనులు వచించు నిస్సారబుద్ధిఁ
బలికితి వీరీతి బ్రాహ్మణదుర్గోష్ఠి
                       పలకద శోభనకళకు మూల
మస్మత్కులోచితమైన తేజము నీకు
                       నెవఁడు తప్పించె నిద్ధశక్తి


తే. గీ.

మణి జపాసూనసంగతి మాడ్కి సంగ
దోషమున సంభవించు తద్గుణము నిజకు
లాభివృద్ధికిఁ దనవారి నాచరించి
తిరుగుటయ నీతి యిఁకనేని తెలియఁ జూడు.

71


క.

హరిపక్షక్షపణాధిక
తరతేజము మత్కులోచితం బగు బిరు దా
హరిఁ జేరి కొల్చితివి యా
పురుషాధము నట్లు లజ్జఁ బొందక వత్సా!

72


చ.

సకలజగత్ప్రభుండ నగు సాహసశాలికి నాకుఁ బట్టివై
యకట! భజింప నేమిటికి నన్యుని? నెక్కిన వానికిన్ మదో
చ్చకరివరంబు కొంచెమగు సామెత గాఁగఁ బరోక్తినిష్ఠ న
ర్భకుఁడవు గాన మన్మహిమ పౌరుష మింతయుఁ గాన వేమనన్.

73


ఉ.

నాకు ప్రభుండు లేఁ డఖిలనాథుఁడ నేనె; ప్రతాపశాలినై
యేకరథంబుగా జగము లేలు నితండె ప్రభుండు, దేవుఁడున్
లోకగురుండు నిస్సమబలుండు; గుణాఢ్యుఁడ; నేనె యిన్నిటన్
శ్రీకరమూర్తినై వెలసి చిత్రవిచిత్రత నుంటి వేడుకన్.

74


వ.

దేవతలలో విష్ణుదేవుం డనంగ దేవోత్తముం డొకండు గలండు. శంబ
రుండువలె మాయగలవాఁ డతనిఁ బెక్కుమారులు జయించితి,

నాకంటె నాతఁ డధికుండని నీ కేద్విజులు బోధించిరి?
దోడ్కొని తెమ్ము, భాషించెద; విష్ణుం డెట్ల యట్లనే సర్వోత్కృష్టుండ,
నతని విడిచి నిజకులోచితశౌర్యంబు వహించి, యోరి! సింహ
కిశోరంబ! దేవమృగవ్రజంబులతో నుండ నర్హంబె నీకు? నీపౌరు
షంబు చూపు మనిన నంజలిచేసి ప్రహ్లాదుండు తండ్రి కిట్లనియె.

75


సీ.

దైత్యేంద్ర! యిన్నియుఁ దగుఁ ద్రిజగజ్జయ
                       సంపద నీకు; నోస్వామి! నేడు
ప్రాకృతుండవు నీవు పరమాత్మయైన యా
                       హరి నిజాంశంబున నవతరించి
యిట్ల యుండకయున్న నీశౌర్య మీశక్తి
                       యీమహైశ్వర్యంబు నేల కలుగు!
నిది వితర్కింపక యేల పల్కితివి బ్రా
                       హ్మణగోష్ఠి విడుమని యనృతభాష?


తే. గీ.

యంధతమసబిలము చొచ్చునపుడు దీప
మెట్లు దిగనాడవచ్చు? సమిద్ధమత్స
రాన్వితద్వేషమున నిట్టులాడఁదగునె
యకట నీ కిది ధర్మమే యసురనాథ!

76


వ.

సన్మార్గదర్శనంబునకుం దనకన్నులు దానె చెఱచుకొనినవాఁ
డమృతాస్వాదఫలం బగు సాధుసంగంబు విడిచినవాఁడు; భవోద్దీపనా
నలంబైన ఖలసంగంబు నొందవచ్చునే? విష్ణుండు సర్వమయుం
డగు నందునేనియు ద్విజులు ప్రధానతనువులు; వారి విడిచి వృథా
జన్మంబు గావించుకొనం దగునే? గోబ్రాహ్మణులు పరదేవతలు;
హవిర్మంత్రస్వరూపు లొకచో మంత్రంబు లుండు. ఒకచో
హవిష్యంబు లుండు. విష్ణుశక్తి బ్రాహ్మణాధారంబు. సమస్తజగ
దాశ్రయం బైనయది. విప్రుల నాశ్రయించి దేవయోనులు బ్రతుకుదురు.
దేవతల కేని పరదేవతలైన బ్రాహ్మణులకు నెవ్వఁడు వందనంబు
సేయండు? బ్రాహ్మణులు జగద్రధంబు నడువ నక్షంబు లైనవారు.
మ్రొక్కినఁ బూజించినఁ దలంచిన రక్షింపుదురు. నరులకు
గోబ్రాహ్మణులకంటె దృష్టాదృష్టహితంబు లేదు. దర్శనస్పర్శన
కీర్తనంబులచే గోబ్రాహ్మణులు పాపంబులు హరింపుదురు. నిత్యోప
పాపాగ్నినవశులైన జనుల నీలోకంబులు మ్రింగవే గోబ్రాహ్మణులు
వారింపక యున్న భవవ్యాధిక్లిష్టులైనవారికి దివ్యజ్ఞానౌషధం

బొసంగి రక్షించు, దైత్యులకు గోబ్రాహ్మణులు విష్ణుపరమపదనిధా
నంబుఁ దెలుపు సిద్ధాంజనంబు మూర్తులు; గోబ్రాహ్మణుల ని ట్లెఱుంగని
వాఁడు నిర్విషాణపశు వనిన విని హిరణ్యకశిపుం డాగ్రహించి
వెడనవ్వు నవ్వి యిట్లనియె.

77


మ.

అవురా! యెంత మహాద్భుతం బిది! ఘనుం డస్మత్కులాంభోధిసం
భవుఁ డీబాలుఁడు తా బిడాల మెలుకన్ బ్రార్థించినట్లన్, భుజం
గవితానంబు మయూరముం బొగడురేఖన్, శ్రీమనోనాథు ను
త్సవలీలన్ వినుతించ నిట్టిదియె మందత్వంబు దుర్బుద్ధియున్.

78


క.

మత్సుతుఁడ వయ్యు నీవు ని
రుత్సవమతి నజ్ఞునట్ల యుండి, విహీనా
స్మత్సేవకుల నుతించెదు
మత్సాహసధైర్యశౌర్యమహిమలు వినవే?

79


క.

వాయసము చూతవనమునఁ
బాయక వర్తించి నింబఫలకాంక్షకునై
యాయడవిఁ దిరిగినట్లున్
బాయునె హరి నెఱుఁగుదువె దురాత్మక! యనుచున్.

80


సీ.

మనకు నీహరినుతి వినుట యుక్తమై? యెందు
                       నున్నవాఁ డాహరి? యోరి! తంతు
జాలంబు లేకయ, చేలంబు నేసిన
                       గతి, నభిత్తిని చిత్రకర్మకలన
గావించినట్టులు, గగనపుష్పము సౌర
                       భాఘ్రాణ మొనరించునట్టుల, నిర్వి
షయుఁడైన శ్రీహరి సన్నుతించెదవు శి
                       శుత్త్వంబు నొంది యశుద్ధబుద్ధి;


తే. గీ.

సూక్ష్మదృష్టుల మాహరిఁ జూడ; మల్పుఁ
డెవ్వరుఁ డెఱుంగు మాకంటె? నీదురుక్తి
విడువు మని నింద సేయు నావిభుని గాంచి
జ్ఞానపాథోధియైన యాసూనుఁ డపుడు.

81

ఆ. వె.

కనలి చెవులు మూసుకొని, తనుమాత్రబా
లకుఁడు; వాఁడు, చాపలమున ఖిన్నుఁ
డగుచుఁ, బరమగురునిరంతరాహితుఁడైన
గురుఁ డవార్యుఁ డనుచుఁ గొంత నిలిచి.

82


వ.

సత్యంబు నీ వెఱుంగకయుండుట మునీంద్రులకేని యెఱుంగం
బడదు. జడస్వభావుం డజడస్వభావుని నెఱుంగునె? అతం
డకల్పనుండు. నీవు బహుకల్పనుండ. వతండు నిగూఢ
తత్వము. నీవు ప్రకటార్ధదర్శివి. ఏదేవులకు జ్ఞానంబుచేతఁ బరా
యణుండైన విధాత కేవలచక్షురాదికము గావించె నాదేహులు
కారుణ్యమాత్రంబై యతీంద్రియుండైన యతని నెట్లు నెఱుంగుదురు?
మనం బతని నె ట్లెఱుంగు? మాత్సర్యదంభస్మరపంకలిప్తంబైన
యదిగాన నేనును లెస్సగా నెఱుంగ. సుఖాత్మయై సర్వమయుండైన
యతని నెఱింగిరేనియు భేదప్రావీణ్యము లేదు. నిశ్చయ మితండె
విభుం డనవలయు. మాలిన్యంబు వహించిన మది శుద్ధజ్ఞానం
బెఱుంగనేరదు గాన వైరాగ్యంబను జలంబుచేత మాలిన్యంబు గడిగి
కొని కొంద ఱెఱుంగుదురు. ఈశ్వరుం దస్మదాదుల కెట్లు గోచరుం
డయ్యెడు. మాత్సర్యలోభస్మరదోషశిష్యులమైన యేము విష్ణుని
నెఱింగితి మేని నష్టాంగయోగతంత్రంబులచేతఁ బర్ణభుజులైన
మునులకు వృథాయాసంబు గాదా మేమన్న నోతాదృగ్గతికాంక్షులమై
యతిమాయావృథాహతాశులమై యాయజు నెఱుంగ మొకా
నొకప్పుడు కించిత్తు నెఱింగితిమేని యప్పుడే మాయ గప్పుచున్న
యది. అది యెట్లంటేని విష్ణుదర్శనంబునకు మఱియుం గారణంబు
వినుము.

83


తే. గీ.

జ్ఞానమున కావరణము మత్సరపటంబు
తన్మహామత్సరంబు నేత్రములఁ గప్పు
కొనిన కతమున విష్ణువు గనక యునికి
నీకు సహజంబు గాదె యోనిర్జరారి!

84


వ.

కన్నులు గప్పుకొనినవాఁ డేమి గనియెడి. భక్తిపూతుండవై
చూచితివేని భగవంతుని సిద్ధాంజనాసక్తనయనుండై సిద్ధుండు
దివ్యౌషధంబుఁ గన్నట్లు గనియెదవు. స్వమాయచే సమస్తలోకములును

వశము చేసుకొనినయేని యీశ్వరుండు కేవలభక్తిచేతనే వశ్యుం
డగును.

85


తే. గీ.

అఖిలసుఖభాజనంబగు నాపరాత్మ
నొల్లక సమస్తదుఃఖాబ్ధి నొంది మునిగి
జనుఁడు మూఢత్ముఁ డగుచు శోచ్యత వహించు
నేమి చెప్పుదు దైత్యకులేశ! యింక.

86


మ.

అటులం బుత్రుఁడు పల్కఁ దండ్రి పటుగర్వాభీలుఁడై భ్రూకుటీ
కుటిలాటోపపరిస్పుటోత్కటకటుక్రోధోద్భటాస్యంబుతోఁ
జటులోద్భర్జనవర్జ మాఘనునిపై సంధించె నాత్మార్థ నా
నటదుద్భూతనృసింహభావిభవసన్నాహంబు సూచింపుచున్.

87


వ.

ఆమూఢుండు గోవిందశరణ్యుండైన సుతుని భటులచే నిజాయుశ్శే
షంబునుంబోలెఁ ద్రోయించి, తద్గురుని వక్రంబుగాఁ జూచి పొమ్ము
బొమ్ము లెస్స లెస్స; ఈశిశువు నిట్లనే చేసితి వనిన మహాప్రసాదం
బని నిజగేహంబునకుం జని విష్ణుని విడిచి దైత్యు ననుచరించు
కొనియుండె; నంత నద్దైత్యుం డాబాలకుని గురునియింటనుంచి
యప్పగించిన గురుభక్తిభూషణుండై వాఁ డశేషవిద్యావిశేషంబుతోఁ
గౌమారంబుఁ గాంచె; నాస్తిక్యం బసాధురతియుఁ గౌమారంబున
లోకులకుం గలుగు. ఆ కౌమారంబున బహిర్విరక్తియు నంతరం
గంబున హరిభక్తియుం గలిగి సకలకళల నితఁడు పూర్ణుండు గాక
మున్నె ప్రకాశితానందపదంబైన జ్ఞానచంద్రుండు సమస్తకళలుం
బోషించె. జ్ఞానచంద్రునకు క్షయంబును, రాహు ముఖలయంబును
దోషాన్వితత్త్వంబునుం బ్రాపింపక యెల్లప్పుడు నుదయించి కళంకము
లేక హృతసర్వతావశక్తియై ప్రకాశింప దైతేంద్రభయంబున గురుండు
బోధింపకమున్న బ్రహ్మంబు సాక్షాత్కారం బయ్యె. సహస్రమార్గం
బుల వెలుంగు హరిప్రసాదదీపంబున సకలంబునుం గాంచె. గురూప
దేశంబు మహామతి కేటికి? మూఢమతికిం గాక; నిరామయునకు
నౌషధం బేటికి నుత్కటరోగభావికిం గాక యని విమర్శించి.

88


క.

సంపూర్ణకళాలక్ష్మీ
సంపన్నుండైన సుతు నిశాచరపతి వీ
క్షింపుచు నానందము నను
కంపయు నుప్పొంగఁ బలికెఁ గడుమన్ననతోన్.

89

తే. గీ.

బాల్యమున నీవు బ్రాహ్మణప్రవరు లాడు
నిష్ఠురోక్తిపరంపర నీఱుగప్పు
నిప్పువలె నుండి ప్రభ లేక నేఁడు వత్స!
జాడ్యమంతయుఁ దేరి తేజమున నుంటె.

90


సీ.

అజ్ఞాననిధియైన యట్టిబాల్యము వోవ
                       నీహారముక్తుఁడౌ నీరజాప్తు
పగిది నుండిన నిన్ను బ్రాహ్మణు లేరీతిఁ
                       జేరి బోధింతు రశీలపథముఁ
బ్రాయంబునందుఁ దద్బ్రాహ్మణులే నిన్ను
                       నిట్లు శిక్షించిరి హిత మెఱింగి;
రాజ్యభారదురంధరత నీవు గైకొన్న
                       సుఖమున నుండెద శుభము లొంది;


తే. గీ.

యఖిలదుష్కంటకనివృత్తి నవనినేలు
నీమహైశ్వర్య మీక్షింప నెమ్మిపుట్టె;
గురుఁడు నిను మెచ్చె విద్యాధికుండ వనుచు
వీనులకు నది విన నేఁడు వేడ్క యయ్యె.

91


తే. గీ.

శత్రుదారిద్య్రమెల్ల లోచనములకును,
సుతుని సూక్తులు చెవులకు, వితతయుద్ధ
రంగరంగద్వ్రణంబు గాత్రంబునకు, స
ముద్యదభిమానులకును మహోత్సవములు.

92


వ.

అని యిట్లు.

93


క.

నికృతప్రజ్ఞాసంపద
వికటంబుగఁ దండ్రి పలుక విని నిశ్శంకా
త్మకుఁడై ప్రహ్లాదుఁడు యో
గికులాగ్రణి యుత్సవంబు గీల్కొనఁ బల్కెన్.

94


క.

శోత్రములకు విష్ణుకథా
పాత్రప్రథితోక్తులే యపారోత్సవముల్
చిత్రముగ నెట్లు పల్కిన
శ్రోత్రార్హమె యన్య మది సుదృష్టం బగుటన్.

95

తే. గీ.

నీతిసూక్తియు శ్రావ్యంబు; నియతకావ్య
కథ లవియు శ్రావ్యములు, మహాకఠినఘోర
ఘనభవోత్కటదుష్టాఘకక్షవహ్ని
హరి నిరూపింతు రనిన సభాంతరమున.

96


తే. గీ.

భవ్యమగు బద్ధ మేని నబద్ధ మేని
హరి నిరూపించునట్టి వాక్యంబు సాధు
జనులు పాటింతు; రది యతిశ్లాఘ్య మగుచు
నాగమోక్తులకంటె విఖ్యాత మగును.

97


క.

అనిశము నిజసంస్కృతివ
ర్ధనమగు నయ్యర్థశాస్త్రతత్త్వం బేలా?
తనతనువు నాటుకొను శ
స్త్రనికాయాభ్యాసగరిమ సంగత మగునే?

98


వ.

నీతిప్రకారంబుల సంపదలు గలవు. వానిచే బాహ్యమతులు పుట్టు.
నాబాహ్యమతులచే దృఢనిబద్ధుండై భవాంభోధి మునుంగు దుర్మతి
యైనవాఁడు; దరిద్రునకును మమతాబంధనంబులు గలవు.
వీతరాగులు కొందఱు తద్భవవార్థిఁ దరింతురు. అది గావున
సంపదలు నీతిశాస్త్రంబువలన సుఖంబుగాఁ గైకొనందగదు.
దుష్టౌషధాదికమువలన వ్యాధు లణంపందగునే? ఏశాస్త్రంబున
భవాభిధానశాత్రవుం డణంగు, ఆశాస్త్రంబు విద్వాంసులు మహా
స్త్రంబు వీరభటుండునుంబోలె స్వీకరింపుదురు.

99


సీ.

నీతిశాస్త్రం బేల నిశిచరనాయక
                       పరఁగు నీతులకు సంపదలు ఫలము;
విష్ణుమయభువనవీథులలోపల
                       సాధనభేదంబు సంభవింప
దనిశంబు కర్తృసాధనసాధ్యభేదమే
                       నియుఁ గల దది మృషానిర్ణయంబు
సంపదలెన్నేని సాధ్యంబు లాయెనా
                       యిందున వానికి నేమి ఫలము

తే. గీ.

ప్రతిదినక్లేశమార్జనపాలనముల
నట్లు గావున ధనబాంధవాదిరూప
లక్ష్మి విద్యుచ్చలంబు; చలంబు గాక
యున్న సంసారరుచి బుధుం డొందకున్నె.

100


క.

అది గాన బాహ్యలక్ష్మిన్
మదిఁ దలఁచిన యట్టి దుష్టమతులకు సర్వ
ప్రదుఁడైన శ్రీవిభుండే
మొదలన్ సేవ్యుండు నీతిమూలం బగుచున్.

101


క.

కారుణ్యసాగరం బగు
నారాయణుఁ డిచ్చు నిజజనమనో౽నుసృతిన్
బేరుగ బాహ్యాభ్యంతర
సారతరోదారసకలసంపల్లీలన్.

102


క.

లీలానృష్టజగత్రయు
శ్రీలక్ష్మీనాథు హృదయసేవ్యుఁ గృపావ్యా
లోలు రమాపతిఁ గొలువక
జాలింబడి యొకని గొల్చు జడుఁడు ఘనుండే.

103


క.

అని సుతుఁడు పల్క దితినం
దనుఁ డుద్భటతప్తతైలధారలలో వా
రినిషేకం బొనరించిన
యనూనరోషాగ్ని కన్ను లంటఁగఁ జూచెన్.

104

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని హింసింప భటులం బనుచుట

వ.

చూచి యతిభయంకరులైన నిజకింకరులం బిలిచి వీని నింతింతలుగా
విశసించుండు. ఎట్లు రక్షించునో యని యప్పుడే హరిసంస్తవంబు
చేసినఫలం బనుభవించుం గాక; కాకోలూకకంకగృధ్రంబులకు వీని
మాంసం బాహారంబుగా నొసంగంజేయుఁడు హరిస్తవంబు విడిచె
నేని విడువుండని నియోగించిన.

105

ఉ.

ఉద్యతశస్త్రులై దనుజయోధులు తర్జనభరనాదివా
క్యోద్యమరోషసాహనబలోద్ధతి శస్త్రపరంపర న్మహా
విద్యుదనీకము ల్గులియ, వ్రేటులఁ బోటులఁ జేయ బాలుఁ డు
ష్ణద్యుతివోలె నుండె మధుశాసనశక్తిని వజ్రదేహుఁడై.

106


మ.

కరుణాంబోధి ప్రసన్నుఁడై నిజకరాగ్రస్పర్శసక్తిన్ నిశా
చరరాట్పుత్రుని మేనిపై నివుర వజ్రప్రాయుఁడై యుండి దు
ర్భరతద్వీరభటోగ్రశస్త్రదురభేద్యస్ఫూర్తి వర్తించె; దు
స్తరరక్తవ్రణవేదనాజనితబాధారేఖ లే దింతయున్.

107


తే. గీ.

అపు డకృత్రిమరసశీలుఁడైన భాగ
వతశిరోమణి జ్ఞానాధివాసమూర్తి
ఘనునిఁ బ్రహ్లాదు సాంతరంగప్రసాదుఁ
జక్రహస్తుండు రక్షించెఁ జక్రధార.

108


క.

అసమజ్ఞానాధికుపై
నసురాయుధపాళి వ్యర్థమై యచలాంచ
ద్భిసరుహశకలంబులగతి
వసుధాస్థలిఁ బడియె దివిజవరులు నుతింపన్.

109


క.

భీకరతాపత్రయశ
స్త్రాకంపితహృదయుఁడైన యాభాగవతున్
బ్రాకృతశస్త్రపరంపర
లేక మహోద్ధతుని వైవ నే మొనరించున్.

110


క.

హిమ మనలముఁ దిమిరం బ
ర్యముఁ బన్నగములు విహంగమాధిపునెదురన్
దమకించినట్ల దైత్యా
ధము లెదిరి యొనర్చు క్రూరతరకృత్యంబుల్.

111


తే. గీ.

కాలకూటలయానలకాలరాత్రి
దండధరవజ్రధరపాశధరులు గూడ
ననఘు నెదురించలేరు దేవారిమశక
కోటు లెన్నేనియునుఁ గూడుకొనిన నెదురె?

112

ఆ. వె.

హరి పరాత్మ యాత్మ నధివసింపక యున్న
జనుల బాధ[15]పెట్టు సంతతంబు
నుగ్రతాపరాక్షసగ్రహరోగంబు
లరయ నేమి సేయు నతనికరుణ.

113


క.

పరమపరాపరుఁ డగు నీ
శ్వరు [16]నతని జగన్మయుం బ్రసన్నజ్ఞాన
స్పురణమున నెఱుఁగునాతం
డరయఁగ సర్వాధికుఁడు కృతార్థుఁడు ధరలో.

114


క.

ఆయల్పవీరదైత్యని
కాయము ప్రహ్లాదు [17]నెదురఁ గదలింపంగాఁ
జేయవు నిజపదభజనో
పాయంబున మేరునగముఁ బరుసమువోలెన్.

115


వ.

అంత నాతనితేజంబు విని సంతాపంబు నొంది కొంతతడవు
చింతించి స్ఫురద్గరళంబులైన యురగంబులం బిలిచి యవిరళం బగు
గరళంబున దైత్యకులద్రోహియగు వీని నాతనయుండని చూడక
హింసింపుఁ డని నియోగించిన.

116


క.

అనివార్యరోషభీషణ
ఘనతరమరుదశనతీవ్రగరళోద్భటసూ
తనదంష్ట్రాగ్నిని ఫణిసూ
దనకేతనభక్తిరతుఁడు తలఁకక నిలిచెన్.

117


వ.

మఱియు నయ్యురగంబులు గరచి విదళించి యమునాహ్రదంబునం
గృష్ణునిం జుట్టుకొనిన కాళియాహియుంబోలె హరిప్రేషితగరుడశత
విదళితంబులై నెత్తురులు గ్రక్కుచు స్రుక్కుచు గోఱలు విఱిగి
ఫణంబు లొరగి యొడలు చిఱిఁగి భోగంబులు వగుల నాదైత్యపతిం
గాంచి దేవా! భవదాత్మజు నిట్టట్టు సేయ శక్తులము గాము. నీ వింత
ఘనునిం గన్నవాఁడవు. మున్ను విషదృష్టం జూచిన సముద్రంబు
లింకు నద్రులు భసితంబులౌ నిది యేమి వింతయో! బాహ్యంబున
మృణాళమృదులం [18]బయ్యు నంతరంగం[19]బున దంభోళిధారాకఠోరం

బతనియంగం బని విన్నవించిన మంత్రులుం దానును జింతించి
యితండు దండసాధ్యుండు గాఁడని సాంత్వనమునం దలచి
పిలిచి సుతునితో నిట్లనియె.

118


సీ.

ప్రహ్లాద! దుష్టస్వభావుండ వైన నా
                       కాత్మజుండవు నిన్ను హాని సేయఁ
దలఁచిన నామది దయపుట్టె; భీకరో
                       రగదైత్యపతులదుర్వారశక్తి
వెఱపింపఁ బంచితి; విశసించుమనిన ని
                       న్నెవ్వరు రక్షింతు? రిప్పు డే న
నుగ్రహించితి; నిన్ను నిగ్రహానుగ్రహ
                       శక్తునిఁగా నాత్మ సమ్మతింపు;


తే. గీ.

పేరు పెంపును రూపంబు బిరుదు లేని
హరి భజింతి; వికఁనైన నతని విడువు;
రాజదయ నిత్యమని నమ్మరా; దకార్య
కరణమున శిక్ష సేయుదు రరులువోలె.

119


వ.

కావున నస్మద్విరోధి నాశ్రయించి యేమి యనుభవించెదవు? తన
యంతనె సకలవైభవంబులు గలిగియున్నవాఁడవు; మూర్ఖత వదలు
మని తండ్రి పలికిన విగుర్వవచనంబులు విని పరమభాగవతుం
డిట్లనియె.

120


ఉ.

వాసిగ నీవు పల్కు నయవాక్యము లన్నియు వేయుమార్లు నేఁ
జేసెద; నింక నాత్మబలచింతన లేక పరాశ్రయంబుచే
గాసిల నేల వీఁడు ? రిపుగంథములం దివి హృద్యసంపదన్
భాసిలునట్టి వాక్యములు; పల్కక యుండినఁ దోఁచు నెప్పుడున్.

121


వ.

అరివర్గ [20]మన నరిషడ్వర్గంబు గాని వేఱె లేదు. పాపతరంబైన యీయరి
షడ్వర్గంబు స్వాధీనంబగు నానందంబుఁ బొందనీయదు.కామాది
వంచితుండై యాజనుండు ప్రకృతియుక్తంబగు స్త్రీప్రసంగంబున
భ్రాంతుండై పితృమాతృపక్షంబు వదిలినట్లు శ్రీమన్నారాయణుని
వదలియుండు. వేయింట నొక్కరుండు విరక్తుండై హరిభజనంబు

సేయ స్మరాదులు తృషిత[21]సురభిని హ్రదంబు చేరకయుండ మూర్ఖులు
వారించినయట్లు వారించు; నీరిపుపక్షంబు విడిచెద. తండ్రీ!
ఎయ్యది యాత్మీయబలం బని పలుకంబడియె నది విష్ణుబలం;
బావిష్ణుండె సకలాత్మభూతుండు; తదన్యసేవ పరసంశ్రయము;
శత్రుల విడిచెద; పరుల భజింప; నీశ్వరబలంబే నాబలంబు;
తత్ప్రతిజ్ఞ యుష్మత్ప్రసాదంబున సత్యం బగుగాత. శ్రీహరి నామ
రూపంబు లేనివాఁడని దోషయుక్తంబుగాఁ బలికిన నేమి? యదియును
గుణవంతంబె యగు; స్వసనామరూపశాలి యగు నతం డెట్లు సేవింపం
దగు? ననామరూపత్వవిముక్తికొఱకు ననామరూపంబై యవికృతం
బైన తేజంబు సేవింపందగు. కార్పణ్యంబు విడుచుటకుఁ గార్పణ్యంబు
గలవాని సేవింపందగదు. కార్పణ్యంబు లేని ధన[22]వంతు సేవింపం
దగదు. అస్థూలంబై యహ్రస్వంబై యనణువై యదీర్ఘమై యనామ
రూపంబైన యనంతవస్తు వెయ్యది యది భవభీరువు లైనవారిచేత
సేవింపందగు; నదియ బ్రహ్మంబును, విష్ణువును; ఆతేజంబునేఁ
గోరుదు; నతిగుహ్యంబై పరమయోగియోగ్యంబై పరతత్వనిష్ఠం
జెందిన యీకథ యిట్లుండ నీనోరికిం దగని కబళంబు గ్రహింవ
శక్యంబై అనామరూపుం డైనను పుణ్యసహస్రనామంబు లందని లీలా
ధృతశ్రీమదనంతశక్తిం దనరి, దుష్టాంతకుండై, శిష్టజనేష్టదాతయైన,
హరి సేవింపందగు. హరిసహస్రనామంబులయందు నొకటి దలఁచిన
నొకటి కీర్తించినఁ దత్ఫలం బింత యంత యనినవారిని దేవతలు
నిందింతురు. పరబ్రహ్మంబైన యీవిష్ణువు హుతాశనరూపంబునేని
వైష్ణవరూపంబునేని భిన్నోపదేశులైన మునులు స్మరించి, యమృత
త్వంబు నొందుదురు, కొంద ఱాయీశ్వరుని రూపంబులు విధిక్రమం
బున సేవించి స్మరించి కాలమృత్యువు దరింపుదురు; స్థావరజంగ
మంబులై పృథగ్విధంబులైన నామరూపంబులన్నియు నావిష్ణు
రూపంబులే; ప్రపంచరూపుండైన విరాట్పురుషుండు నతండె; యిది
విస్మయకరంబే; [23]ఫణులు దైత్యులు చెనకలేక యుండుట విష్ణుని
మాయ; యతనిచేతనే కల్పితంబై(నయది) యతనిశక్తి నెట్లు

నాక్రమించంగలదు? ఇంద్రజాలం బెఱింగిన నరుండు గరిపించిన
యుగ్రపన్నగంబు లతని భయంబు నొందింపంగలవే? ఇట్లు సర్వ
కామప్రదుండై భవాబ్ధితరణియైన విష్ణువును ద్వేషింపుచు నాత్మ
ద్రోహులై యవివేకులు ఖగంబులు పక్వవనంబులు విడిచి తిరిగి
నట్లు చరింపుదురు. సత్కార్యంబైన నసత్కార్యంబైన ప్రభుప్రేరణ
చేతనే కావించి విచిత్రకర్మానుగతబుద్ధినంధులై యస్వతంత్రులై
యేమేమి గావింపరు? గురునియెడ క్షోభకరంబైన వాక్యంబు నాకుఁ
బలుకుట యుక్తంబుగాదు. న న్ననుగ్రహింపుమని మ్రొక్కి యేమి
యైన నేఁ జేసిన యది నే ననుభవించెదనని యూరకయున్న దైత్యుండు
నన్నిదిక్కులు నీక్షించి మాయాభేదంబున నిట్లనియె.

122


సీ.

ఎంత మూఢుఁడు [24]వీఁడు; నీక్షింతిరె వీనిఁ
                       బోషించిన ఫలంబు? బుద్ధి దప్పెఁ;
బ్రతికూలములు నాకుఁ బల్కెడు; వీనివా
                       క్యంబులయందు సారంబు గలదె?
అన్నియుఁ బరికింప నౌర యోరి దురాత్మ
                       భాషించెదవు మూఢఫణితి నిట్లు;
నాకంటె మంత్రిరత్నంబులకంటె యు
                       క్తిని గుశలుండవే! తనయ! నేఁడు?


తే. గీ.

ముదిసి రోగవిశీర్ణాంగములఁ గృశించు
వాఁడు పల్కినఁ దగుఁగాక వయసు గలిగి
రాజపుత్రుండవై నవ్యరమణు లుండి
యూర్వశికిఁ గ్లీబుఁడునుబోలె నునికిఁ దోచె.

123


క.

మందాత్మ! నీవు ధార్మికు
చందంబునఁ బల్కెదవు మృషావచనంబుల్
[25]నిందించెదు నేఁ బరమా
నందంబునఁ బల్క దైత్యనాయకు లుల్కన్.

124


వ.

కాంతాకేలిరసోజ్జ్వలంబులైన విషయంబు లనుభవింపు; మాయువు
వృధ చేయకుము; సాభిలాషదృష్టులై మదించిన ముదితలతో

రమింపుము; బ్రహ్మానుభవంబు శ్లాఘ్యంబు గాదని యెప్పుడు
మదిం దలంపవు; మృగయాద్యూతగీతరసానుభవంబు చేసి వివేక
శిక్షాగురువులముందర మున్ను పల్కినయట్లు పల్కనేరవు;
మద్భుజాబలగతభౌమదివ్యవిషయంబు లనుభవింపుము; [26]నిధానం
బుపై నధిష్ఠించి దైన్యంబు చెప్పుకొననేల? అటు పల్కెద వే నిచ్చిన
సుఖంబు విడిచి యుపేంద్రునివలన నేమి యనుభవించెదవు?
నాయాజ్ఞ శిరంబునం దాల్చిన దేవేంద్రునిం జూడవే? యని హిరణ్య
కశిపుండు పల్కినఁ దన్మంత్రులు “రాజపుత్ర యీమహారాజు
ననుగ్రహంబు మాకుం గలుగ మమ్ము నాశీర్వదింపు"డని ప్రార్థింపు
దురు. చంద్రుండు భూషాకాలంబుల వేగంబె దర్పణంబై యుండక
విళంబంబు చేసినఁ గళల మొత్తించు, వరుణుండు స్వాదుసితమధురం
బులగు జలంబుఁ గలశంబున నిడుకొని పానార్ధంబుగా వెనువెంటం
దిరుగు; దూరస్థకృత్యంబునకు ననిలంబు దూతం జేసిన సదా
తిరుగుచు సదాగతి యన్నపేరు సార్థంబుగాఁ జేసికొనియె; ఇటువంటి
యేకవీరుండైన దైత్యరాజునకుం బుత్రుండవై పుట్టి క్షీణతరులైన
దేవతలలోఁ దాను నొక్కరుండైన విష్ణుని నె ట్లాశ్రయించెదవని పల్కిన.

125

ప్రహ్లాదుఁడు హరిస్మరణమహిమను గొనియాడుట

క.

ప్రచురవిశృంఖలమతులగు
సచివులుఁ దండ్రియును బల్కు జడవాక్యంబుల్
రుచియించక నిజధర్మ
ప్రచయమునకు నప్పుడంతరాయంబైనన్.

126


క.

వారిఁ గని మీకు సరిగా
భూరిగతిం బలుక బుద్ధి వొడమదు; నే ని
టూరక యున్న ననాదర
మేరీతిఁ దరింతు మీర లెఱుఁగరె? జాణల్.

127


క.

సర్వగతుఁడైన మాధవు
నిర్వాణప్రభుఁ దలంచి నిలిచినచో నా
గీర్వాణులు చేసిన యం
తర్విఘ్నములు గురుజనులు దప్పింతు రిలన్.

128

క.

శ్రేయములకు బహువిఘ్నము
లేయెడ; శ్రేయస్తమమగు నీశ్వరభజనం
బాయతబహువిఘ్నోద్యద
పాయంబులు సంతతంబు నంటకయున్నే.

129


తే. గీ.

కంససూదనుమీఁద నొకానొకనికి
నొకయెడ మనంబు తిరమయియుండు ధాత్రి;
నఖిలవిఘ్నా౦తరములు శ్రీహరి హరించు
హరిణపోతము శార్దూలపరమువోలె.

130


తే. గీ.

నిరతసర్వేశభావనానిష్ఠుఁడైన
దాని నిష్టార్థ మొసఁగు దేవతలుఁ గలఁతు;
రతిదురాత్ములు రాక్షసులైనఁ గలఁతు;
రెలమి గురులైన వారించి కలఁతు రెపుడు.

131


క.

దుర్లంఘేదృశవిఘ్నము
నిర్లక్ష్యము గాఁగ నిలిచి నిఖిలాత్మకు నం
తర్లక్షితుఁ జేసిన, ను
చ్చైర్లోకమునందు నతఁడు సర్వాధికుఁడై.

132


క.

నీచతరశీలుఁడ వగుట
నీచతరరసజ్ఞులైన నీమంత్రులచే
నేచెవిని బడిన వాక్యము
లేచిత్తము లాత్మవిఘ్నహేతువు లగుటన్.

133


చ.

సుతహితుఁడైన తండ్రి నిజసూనుని దుర్విషయానుభూతికిన్
మతిఁ బొడమంగఁ జేయుట క్రమంబగునే? సువిచారనీతి సు
స్థితివలె నాడఁగాఁ దగునె? ధీరహితుల్ తముఁదామె భోగవ
హ్నితతిఁ బడంగఁ ద్రోయుదురె నెక్కొని తద్విరతాత్మవృత్తులన్.

134


తే. గీ.

అంధులెల్లఁ బురఃస్థితమైన యట్టి
యంధువునఁ దామె కూలుదు రనఁగ నేల?
నొకవిధంబునఁ గడితేరుచున్న నన్ను
విషయవారాశిలో ముంప వేడ్క యగునె.

135

క.

నిరయాధ్వంబులఁ దిరిగెడు
నరులకు జ్ఞానోపదేశనవ్యవివేకాం
తరమునఁ ద్రిప్పెడు నాతఁడె
పరమగురుఁడు తండ్రి యాత్మబంధుఁడు వెలయన్.

136


క.

విషయములు సుఖకరములని
విషయాంతరములఁ జరించు వీరుండె మహా
తృషమృగతృష్ణలు గని [27]
ల్విషకాంక్షకు మృగము లేఁగు విధమున నుండున్.

137


క.

అగణితవిషయగ్రాహం
బగు భవవారాశి చూచి యాత్మఁ గలిఁగి స
ర్వగుఁడైన విష్ణుఁ డను తె
ప్పఁ గలుగఁ దరియింప, ముంపఁ బాడియె తండ్రీ.

138


క.

తను దానె విషయలోలత
మనుజుఁడు వర్తింప దాని మఱపుటఁ దగునే
యనలము బాలుఁడు పట్టఁగఁ
జనుచో నంగార మొసఁగఁ జనునే తండ్రీ!

139


వ.

ఇంద్రియార్థములయందుఁ బంచేంద్రియంబులం బ్రవర్తిల్లఁజేయుచు
నశిక్షులైన కుపుత్రులచేఁ దండ్రియంబోలె నష్టుండగు; స్వభిన్నునింగా
నీశ్వరున వేఱుగాఁ దలంచినవాఁడు విషయార్థప్రత్యగాత్మయైన
యీశ్వరు నెట్లు సేవించు? యామ్యదిశకుం బోయినవాఁడు మేరు
నగంబు విలోకించునే? విషయమోక్షమార్గంబులు పరస్పర
విరుద్ధంబులు; లోకమార్గంబున నడచిన నాకమార్గంబున నడువవచ్చునే!
తండ్రీ! విషయానుభవంబునందు దుఃఖపరంపర గాని శాంతి లేదు;
బ్రహ్మ మొక్కటి యశాంతికరంబు నీవు విషయానుభవంబు సుఖం బని
యంటివి; బహుదుఃఖమిశ్రంబై యల్పం బగుటంజేసి యది దుఃఖంబే;
నాశదాహాహరణశంకామిశ్రంబై బహుప్రయాససాధ్యంబై యల్పం
బైన విషయసుఖంబుఁ గాల్పనా? నింబచూర్ణకృతంబైన ముద్ద యెంత
స్వల్పగుణంబైన నది భక్షించు నెవ్వఁడు సుఖంబు నొందు?

నిట్లనే విషయసుఖంబు; పర్వతం బెన్నియెడలం ద్రవ్విన శ్రమంబె
కాక సుఖంబు గలదే? అటువలెనే కాచమణికాని దివ్యమణి దొరకదు;
కాముకుండు బాహ్యసుఖాసక్తుండగు; గురూదితవేదాంతవిచారంబు
సేయునందాఁకనే కృపణజనుండు బాహ్యసుఖంబు ఘనం బని
తలంచు; మఱియు.

140


సీ.

త్రిభువనంబును నేలి దీపించు నీవంటి
                       ఘనుని యానందంబు మనుజతతికి
నగుఁ బరమానంద; మాపరమానంద
                       బహుకోటిగుణితసంపత్ప్రవృత్తి
సంపూర్తి మెఱయుఁ బ్రాజాపత్యమైనట్టి
                       యమ్మహానంద మత్యతిశయమున;
నమరు బ్రహ్మానంద మానందతతులు త
                       దానందకర్ణనార్ధార్థకోటి


తే. గీ.

భాగసమములుగా పెంచ; బ్రహ్మమైన
యట్టియానంద మజర మనంత మనఘ
మన్నిటికి వేఱెయై నిత్యమై చెలంగు
నట్టి బ్రహ్మసుఖం బగు హరిఁ దలంప.

141


క.

హరిసంస్మృతిమాత్రంబునఁ
బరమానందంబు లెల్లఁ బ్రాపింపఁగ; ను
ర్వర నల్పసుఖము నెవ్వం
డరయుఁ బరిక్షీణచంచలాత్ముఁడు దక్కన్.

142


తే. గీ.

చరణయుగళంబు జ్ఞానలేశంబు గలిగి
దుర్లభుండైన యాయనంతుని భజింపఁ
బాడి యామీఁద రోగాద్యుపద్రవంబు
లెల్లఁ జెందకమున్నె మహీతలమున.

143


తే. గీ.

వెంటఁ గా పెంతయును లేక వికటఘోర
కాననంబున కేఁగి యొక్కరుఁడు చోర
గణము తనుఁ జుట్టుకొని భయోత్కంప మొంది
యున్న నెవ్వఁడు రక్షించు నో మహాత్మ!

144

ఉ.

కాన సుఖస్థితిన్ నిలువఁగల్గిన యప్పుడె దుర్గతిక్రియా
హానికినై భజింపఁదగు నంబుజనేత్రు; రమాకళత్రు; భ
క్తానిశసత్ఫలప్రదు; బుధాత్మమనోత్సవమూర్తి; విష్ణు, లో
నూనిన భక్తిచే మఱి నరోత్తముఁడైన ఘనుండు ధన్యుఁడై.

145


క.

ఈరీతిఁ బల్క విని యమ
రారి సహింపక మదోత్కటాహంకృతిఁ దాఁ
జీరుకము చూతకిసలా
హారముఁ గొని యసహమానమై యున్నగతిన్.

146

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని గజములఁ ద్రొక్కించుట

వ.

అప్పుడు పూర్వాపరపరామర్శశూన్యుండై క్రోధానలవ్యాకులుండై
యతిదుర్దమంబులగు దిగ్గజంబులం బిలిచి యీకులద్రోహిని వధింపుఁడు.
హతుండై మద్భుజాబలాహతులైనవారల విలోకించుం గాక; అల్ప
కార్యంబునందు నియోగించితినని లజ్జించవలవదని యానతి
యిచ్చిన విని చని.

147


శా.

శుండాదండము లెత్తి మొత్తి, రదనక్షుణ్ణాంగుఁగాఁ గ్రుమ్మి యు
చ్చండాంఘ్రిస్ఫురితాహతిం జిదిమి, చంచద్ఘోరఘీంకారముల్
దండిన్ బద్మభవాండమండలసముద్దండార్భటిన్ నిండ ది
క్ఛుండాలంబులు తత్కయాధుతనయుం గ్రూరోద్ధతిం దాఁకినన్.

148


మ.

కులశైలంబులు నాగవేధులు మహాక్రూరంబులై యొప్పఁగా
బలసంపత్తి యనల్పమై నిగుడ, శుంభద్ఘోరదిఙ్నాగముల్
జలజాక్షున్ హృదయంబులో నిలిపి యుచ్చైర్గౌరవాటోపముల్
గల ప్రహ్లాదుఁ దరల్పలేక నిలిచెన్ గంభీరఘోరంబుగన్.

149


సీ.

అంత దిక్కరులు రోషాటోపమునఁ గ్రూర
                       దంతశూలములఁ దద్దైత్యబాలుఁ
దతపూర్వతనువులై యతివేగమునఁ గ్రుమ్మ;
                       దంతముల్ విరిగి యాధరణిఁ బడి; మ

దోరుధారలు వోయి, ధారాళతరరక్త
                       ధారలు దొరఁగ, నార్తస్వనమున
రోదసీకుహరంబు భేదింప, దుర్భయ
                       కంపంబుచే దైత్యకర్త బెదర,


తే. గీ.

ననలమును శలభంబులు, నద్రిరాజు
దంశము; లిభంబు నజము; లాత్మజ్ఞులోక
ములునుబోలెఁ దెరల్ప నాజలజనాభ
భక్తినిష్ఠాపరాయణు భవ్యు నతని.

150


వ.

అప్పుడు.

151


క.

దైత్యుల రమ్మని యంతట
దైత్యవరేణ్యుండు మీరు దహనజ్వాలౌ
ద్ధత్యంబున నణఁచుం డని
యత్యంతాగ్రహముతోడ ననిచె న్వేగన్.

152


వ.

వారు చని.

153


శా.

కాష్ఠాచక్రము కంప మంద నమలోగ్రస్ఫారరోషాగ్నిచేఁ
గాష్ఠానీకము తైలవాహినులఁ దోఁగంజేసి దుర్జ్వాలికా
కాష్ఠాభీలమహానలచ్ఛటల మ్రగ్గం ద్రోచినం భీతులై
కాష్ఠాధీశులు వేగఁ గన్నదరి వీగం జొచ్చి రత్యుద్ధతిన్.

154


వ.

ఇట్లు మహాభీలజ్వాలాకరాళంబైన యుగాంతానలంబునుంబోలె
ననంతానలం బుప్పొంగఁ దదంతరంబు చొచ్చి జలశాయిం దలంపుచు
నంతర్బలంబున జగన్నాయకుండు నాయందుఁ గలండని చింతింపుచు
నున్న నవలంబు శాంతమొందె. అంత జలంబులం దోఁగినయట్లనున్న
నసురులు విస్మయం బంది మఱియుఁ గ్రాలుకొనం జేసిన
పొనుంగుపడి సాధుశిష్యుండు గురునియొద్దంబలె, సర్పంబులు
వినతాసుతునియొద్దంబలె, హరిధ్యానపరాయణుండైన యతని
యొద్ద నిరంగారంబై యుండె; భవాగ్ని తపింపంజేయలేదు, వైష్ణవులం
బ్రాకృతాగ్ని తపింపంజేయగలదె? అట్లుగాన నతండు సుఖంబున
నుండుట విని యారాజు రోషించి మృత్యుజిహ్వాభీలంబైన కరవాలం
బెత్తి వైవం జూచిన పురోహితు లతనిం జూచి యంజలిఁ జేసి యిట్లని
వినుతించి రప్పుడు.

155

క.

శూరుండవు నీ వసిఁ గొని
దారుణగతి వచ్చునపుడు ధరణి వణంకున్
సార మెఱుఁగండు నీదు కు
మారుఁడు సుకుమారుఁ డితని మన్నించు నృపా!

156


తే. గీ.

చాలు రోషంబు [28]వీనిపై శశముమీఁద
సింహపోతంబుఁ దాఁ దాఁకఁ జేసినట్లు;
తాళు మిందున కొక్కయత్నం బొనర్చి
యతని రక్షించు మింక దైత్యాధినాథ!

157


సీ.

అర్భకుం డతఁడు దండార్హుండు గాఁ డతి
                       జడుఁడు నీసుతుఁ డయ్యుఁ జాల నసుఖ
మందుచున్నవాఁ; డత్యంతకారుణ్య
                       పాత్రుఁ డింతటనైన బహువిధముల
బుద్ధిగాఁ జెప్పి, యుద్భుద్ధంబులైన యు
                       పాయము ల్బోధించి ప్రాజ్ఞుఁ జేసి
నిర్వహించెద మతినిపుణతరోక్తుల;
                       నవి వినకున్న దురాత్ము మదియ


తే. గీ.

శాప మిచ్చెద; ముడుగుమీ సాహసోక్తి
స్వామి! యీతుడు శస్త్రాళి సమయకునికి
యద్భుతము గాదు, తద్బలోదయము; దాని
యౌషధంబు నెఱుంగుదు మసురనాథ!

158


క.

అన్నియు నన నేటికి లో
కోన్నతశీలుఁడవు తావకోగ్రక్రోధో
త్పన్నపరాధమున కితం
డెన్నిక నర్హుండె దానవేశ్వర! యింకన్.

159


తే. గీ.

అని కుమారునిఁ దోడ్కొని యపుడు తత్పు
రోహితులు విజనన్దలి నూహ సేయఁ
జనిరి; యాపత్ప్రణాశనుఁ జక్రహస్తు
నతఁడు మదిలోఁ దలంపుచు నచట నిలిచె.

160

వ.

నిలిచి గురుగృహంబున శ్రుతివిహరణపానభోజనాదుల హరిం
దలంపుచు బాహ్మకృత్యంబున జడుండువోలె వితర్కింపుచు జగం
బంతయు ననంతమయంబుగాఁ జింతింపుచు నున్న యాప్రహ్లాదునిం
జూచి గురుకులసహవాసంబులగు బాలురు శ్రుతి పఠనంబుఁ
జాలించి యిట్లనిరి.

161


చ.

దితికులమౌళిపుత్ర! భవదీయచరిత్ర మభోగలోభసం
గత; మది గాన నీమది నొకానొకతేజము వింత చేసి సం
తతపులకాంకురచ్ఛటలు దాల్చితి; చెప్పఁగ వచ్చె నెట్టు లీ
స్థితి? యెఱిఁగింపు నీమహిమ శ్రీకరమై జగము ల్నుతించఁగన్.

162


క.

దితిసుతసంప్రేషితవ
క్రతరోగ్రభటాహివహ్నికరిబాధలు లే
కతిసుఖమున నుండితి వీ
వితరసుఖప్రీతి నొందు దేమి కుమారా!

163

ప్రహ్లాదుఁడు దైత్యకుమారులకుఁ బరమార్థం బెఱింగించుట

వ.

అనిన విని మహానుభావులారా! మీర లడిగినయట్లనే నాకు నన్యాభి
లాషంబు లేదు. ధనజనరమణీవిలాసరమ్యం బైనయది భవంబు;
దాని వర్జింపవలయునో? సేవింపవలయునో? విబుధులం బరామర్శిం
పుండు; మొదల జననీజఠరంబులో నున్నవా రనుభవింపుదుఃఖంబు
వినుండు; కుటిలతనువులై, సదాగ్నితప్తులై, వివిధపూర్వజన్మంబులు
తలంపుచు నమేధ్యపంకలిప్తుండ నైతి. పూర్వంబున నీశ్వరస్మరణంబు
సేయనైతి; బహువిధబహుజన్మఖేదంబు లనుభవించి నిజహితం
బాచరించుకొనలే నైతి; మూఢుండ నైతి; మాతృభుక్తమహోగ్రకటు
లవణామ్లరసంబులచే దేహంబు తపింపుచున్నయది; యనవకాశంబువలన
నచలంబైన దుఃఖంబు ప్రాప్తించె; ఇదె హరిని మఱచిన ఫలంబు;
కారాగృహంబునఁ జోరుఁడువోలె జరాయువిట్క్రిమిమూత్ర
హేయంబైన మాతృగర్భంబునం బద్ధుండ నైతి; ఒకానొకప్పుడేని
ముకుందపాదస్మృతి సేయలేనైతి; నింకనేనియు నితరవాంఛ లుడిగి
హరిభజనంబు చేసెద; నెన్నఁడు గర్భంబు వెడలుదు నప్పుడె పూర్వ
మూఢత్వంబు వదలెద నని కోరుచు దారుబద్ధంబైన పశువు బంధనచ్యుతిఁ

గోరునట్లు మాతృగర్భనిర్గమంబుఁ గాంక్షింపుచు, తృషితుండు
తటాకంబు నపేక్షించినట్లు పరిభ్రమించుం గాన, గర్భంబులో
నున్నతఱి సౌఖ్యంబు లభింపదు; గర్భంబు వెడలినయప్పుడు బాహ్యా
నిలస్పర్శ నొంది, తల్లియుం దాను మూర్ఛనొంది, బహుదుఃఖంబు
లనుభవించి, సేద దేరి, గర్భంబులోఁ గల జ్ఞానంబు మఱచి, మున్ను
గోరిన యాశలు విఫలంబులై, యురస్థమృత్యుని భోగవాంఛలుంబలె,
లభింపవు; యోగియైన మునియుంబోలె గర్భంబున నన్నియు
నెఱింగి బాహ్యంబున విస్మృతి నొందు; జాగరసుషుప్త్యవస్థల యట్ల
గర్భబాహ్యప్రదేశంబుల వర్తించు మఱియు.

164


తే. గీ.

పృథులబాహ్యానిలాసినిర్భిన్నబోధ
వృక్షనవ్యాంకురములోలి వెడలి వచ్చు
నల్పమున కల్పమును నైన యట్టి జ్ఞాన
మదిని వృద్ధి వహించు దేహంబుతోడ.

165


తే. గీ.

శాస్త్రసత్సంగతోయసేచనసమృద్ధిఁ
జెలఁగు జ్ఞానాంకురముఁ బ్రోది చేసి, చెట్టుఁ
గట్టి, పొదలిన యట్టి వృక్షంబువలన
మోక్షఫల మందుదురు మౌనిముఖ్యవరులు.

166


తే. గీ.

అర్థకామానుగతులైన యట్టివారి
యాత్మలోఁ గల్గునట్టి జ్ఞానాంకురంబు
ప్రబలవర్షానలప్రతప్తమయి విఫల
మై మరణఖడ్గవిచ్ఛిన్నమై చలించు.

167


క.

జననంబును మృతియుఁ బున
ర్జననంబుఁ బునర్మృతియును సాంద్రముగాఁ గూ
ర్చిన మౌలిక కడతేరదు
ఘనవిజ్ఞానాసిచేత ఖండించఁదగున్.

168


వ.

ప్రసంగంబున బాల్యదుఃఖం బెఱింగించితి; నాదివ్యాధులచేఁ బీడింపం
బడి పల్క సమర్థుండుగాఁ డంతఁ క్రీడాసక్తుండై మజ్జనభోజనాది
పరేచ్ఛచేఁ గ్లేశంబు నొందియుండు; పురుషార్థబుద్ధిచే నెద్దియేనియు
నన్యులతో హాస్యంబు గావించు; వృథాశ్రమార్తుం డగు; నిది బాల్యంబు

నందునైన యజ్ఞత; యౌవనంబున నగుసుఖం బెఱింగించెద వినుండు,
పంచశరుండును బంచేంద్రియంబులు బాధింప నతిదుర్లభంబులైన
యవి యాత్మం గోరుచు నర్థంబువలన, భార్యాదులవలనఁ బరితోషంబు
నొందుచు, నిజదారధనాదులం బరితుష్టి నొందిన, విభవంబుల సుఖం
బనుభవింపఁడు; విభవంబులన్నియు ననిత్యంబు; లీవిభవంబులు
చనిన గోటిగుణితంబగు దుఃఖంబు ప్రాపించు; దారపుత్రధనంబుల
యందు నెవ్వండు లోలుండగు నదియ దుఃఖంబు; తద్దుఃఖమహా
తరువులకు బీజంబులు హృదయంబున నాటిన నవి కాలంబునందుం
దనువు భేదించి మొలక లెత్తుపర్యంతమును దుఃఖాన్వితులగు ధన
దారపుత్రుల నాత్మజ్ఞుండు గానివాఁడు పరిగ్రహించి గ్రీడించు;
నమంత్రజ్ఞుఁడు వ్యాళ శిశువులం బట్టినతెఱంగున, జీర్ణంబైన నావ
మహాబ్ధి నాశ్రయించినయట్లు, విచ్ఛిద్యమానమాహోన్నతశాఖి శాఖ
నెక్కినమాడ్కిఁ గేవల నశ్వరంబులగు విషయంబులు భజియించి,
దుఃఖంబు లనుభవించుం గాన, నీయౌవనంబున నేని సుఖంబు లేదు;
వార్థకంబున దుఃఖం బేమి సెప్పుదు? నాది వ్యాధి మహానదులకు
నర్ణవం బగు; ఇంతియ కాదు; సర్వావస్థలయందును సుఖంబు లేదు;
మఱియును,

169


ఉ.

పుత్రులు లేకయున్నయెడ పూర్ణతరోత్కటఘోరదుఃఖముల్
పుత్రులు గల్గి సద్గుణవిభూతి వహింపకయున్న దుఃఖముల్
పుత్రు లకాలధర్మమును బొందిన యట్టి యవాచ్యదుఃఖముల్
పుత్రులు గల్గినంతనె యపూర్వసుఖంబులఁ బొందనేర్చునే.

170


క.

దారసుతబంధుమిత్రా
పారమహాసంపదలును బహుదుఃఖముల్
తారాధిపమధుమందస
మీరాదులు విరహిజనుల నేఁచు తెఱఁగునన్.

171


క.

చొప్పడ నెన్నివిధంబులఁ
దప్పదు మది మృత్యుభీతి; దాన సుఖంబే?
యెప్పుడొ యెవ్వనిచేతనొ
యిప్పుడొ యీవెనుకనో మహీవలయమునన్.

172

క.

అనలోదకాన్నపానా
హినిషాదమృగఖగపశుసమీరాదులచే
ననిశంబు మృతి లభించున్
జనులకుఁ దగ్గణన సేయ శక్యం బగునే?

173


మ.

వికలాంగత్వము, మాంద్యముం బధిరతావేశంబు రోగంబులుం
బ్రకటంబైన నరాధము ల్మనములోఁ బ్రాణంబులన్ రోసియు
న్నకటా! తద్విషయానురాగమున సహ్యం బౌట చిత్రంబె? కా
ముకులై తద్విషయానురక్తులగు నామూఢుల్ ప్రమాణంబులే.

174


క.

కావున నతిదుఃఖదభవ
సేవ యొనర్తురె ప్రసన్నచిత్తులు మీరల్
భావజ్ఞు లెఱుఁగరే యీ
ప్రావీణ్యము మెఱసి యిట్లు పలుకందగునే.

175


వ.

ఇంతియ కాదు. ద్విపాత్త్వంబు నొందియు నార్తిం జెందుట కల్మికి నిది
సంప్రాప్తంబె కర్మవిపాకభేదంబున నానావిధయోనులం జెందవలయు.
నానావిధావస్థలు మనచేతనే చూడంబడియె. కర్మవశంబునం జీవులు
సంసార వనంబునం జరింపుచు నిత్యభీతిమై పాపవ్యాఘ్రసింహా
భీలవృకభక్ష్యంబులేని, నృపవధ్యులేని యగుదురు; నిష్కారణప్రియ
హస్తిశునకంబులై బద్ధంబులై యుండ్రు; పశువులై దుఃఖంబున
భారంబు వహింతు; రపరాధంబు లేకయ పరఖేలనార్ధంబుగా మేష
కుక్కుటంబులై యుద్ధంబుఁ గావింతు; రిదిమొదలుగాఁ గర్మానుగత
యోనులం బొందినవారి దుఃఖం బింతింత యనవచ్చునే? దైత్య
పుత్రులారా? యిది జంగమరూపదుఃఖంబు. స్థావరత్వరూపంబునఁ
గష్టతరంబౌనో కాదో? ఇ ట్లని తలంచిన భవంబున సుఖాంశంబులే
దెప్పుడెప్పుడు విచారించిన నప్పుడప్పుడు సంసారంబు దుఃఖమయంబు;
దీనికి సాధుజనులు చొర రతత్త్వవిదులైన మూఢులు వహ్నియందు
శలభంబులుంబోలె సంసారంబునం బడుదురు. సుఖముంబలెఁ
గాన్పించిన యీభవంబునందుఁ బడుట యుక్తంబె? గత్యంతరంబు
లేక యన్నాథావంబునఁ గృశించినవారికిఁ బిణ్యాకతుషాదిఖాదనంబు
తగు. పూర్ణునకుం దగునే? శ్రీపతిపాదపద్మద్వంద్వార్చనాప్రాప్యా

నాద్యబ్రహ్మానందంబు సవ్యం బతాపమిశ్రంబు సర్వజనసాధారణంబు
గలదు; తదర్శనంబు మోక్షప్రదంబు; అక్లేశప్రాప్యంబైన
యీమహాసుఖంబు విడిచి యెవ్వం డన్యసుఖంబుఁ గోరు? రాజ్య
వైభవంబు విడిచి భిక్షాశనంబు సేయుట సుసాధనంబైనం బ్రహ్మ
సుఖంబు గలుగు; విషయాసక్తుండైనవాఁడు జాత్యంధుండు; బుధులు
తనుఁ జూచి దుఃఖించిన భవంబునందే విహరింతు రెట్లు? భవంబు
దుఃఖమయంబుగా నెఱింగి హరిభజనంబుఁ గావించుడు. తద్భజనంబున
నపరోక్షంబైన సంస్కారఫలంబు మీకు లభించు. మఱియు.

176


చ.

వెలయు నసారఘోరభవవృక్షమునందు రమాధవార్చనా
ఫలము జనించె నొక్కటి; ప్రపన్నసుసాధ్యము తత్ఫలంబు; ని
వ్వలఁ దను వెత్తకుండిన నవశ్యము గల్గదు దేహ మేఁగినన్
గలుగునె లింగదేహ మటు గాంచిన జీవులకుం బ్రసిద్ధిగన్.

177


క.

ఇది యెఱిఁగి బాహ్యసుఖసం
పద గల జనుఁ డచ్యుతాంఘ్రిభజనము సేయన్
దుది ముట్టి జన్మఫల మా
పద లుడుపుం గాకయున్నఁ బతితుం డరయన్.

178


శా.

సంసారంబున నుండియే హరిపదాబ్జాతంబు లర్చించి త
త్సంసారంబు నధోగతిం జరపునే తావత్ప్రసంగంబునన్
సంసిద్ధం బగుఁగాక మీకు జను లెంచంగాఁ గృతఘ్నత్వ మా
సంసారం బిపు డాక్రమించునె ప్రశస్తంబైన నీధామమున్.

179


క.

అని యెఱిఁగి మానసాబ్జం
బున నీశ్వరు శంఖచక్రభూరిగదాశో
భనబాహు భక్తియోగం
బునఁ గొల్వఁగవలయుఁ గామములు విడిచి జనుల్.

180


తే. గీ.

సర్వభూతంబులందున, శక్తి గలుగ
వారిపై మైత్రి నిలుపఁగావలయు; రోష
కామములమీఁద రోషంబు గలుగవలయుఁ
గనవలయు శత్రులని రోషకామములను.

181

మ.

ప్రతిమారూపములందుఁ జక్రధరు నర్చాలీలమైఁ గొల్చి శ్రీ
పతి సర్వాంతరవాసిఁ గా దనెడు దుష్ప్రజ్ఞం జన ద్వేషులై
క్షితిదేవోత్తమపాదము ల్గొలిచి తచ్చీర్షంబుమీఁదం బదా
హతిఁ గావించిన యజ్ఞు నట్ల ఘనపాపాంబోధి మున్గున్ పగన్.

182


వ.

మీరు నాస్తికులు, భవసింధునిమగ్నులైనవారు గాన మీకు నెఱింగించెద.
మునీంద్రజుష్టంబైన జ్ఞానంబును త్రయీమారనర్థంబైన జ్ఞానంబు
నకు ననన్యభావం బంగీకరింపవలయు; నెద్దియైన మనంబున నానా
విధంబుగా దోచియుండు నదియుఁ బ్రయత్నంబున నొక్కటియే;
బ్రహ్మం బాత్మాకార్యం బగుటంజేసి బ్రహ్మంబె కా నెఱుఁగందగు. దాని
నొకానొకప్పుడు మఱువరాదు. మలినంబైన మనంబు బృథక్కుఁగా
దెలిపి యాత్మను మోసపుచ్చు; నిది మనస్స్వభావంబు. ఇది యప్ర
మత్తులై యెఱింగి తత్ప్రతికూలంబుగానే యాచరించి దానిని
గ్రహింపవలయు; ఎవ్వండు వస్తువు విభిన్నంబుగాఁ జూపుచు
మలాఢ్యంబైన మనస్సుఁ బ్రవర్తిల్లంజేయునో వాఁ డామనంబునకు
మాలిన్యంబు భవవిభావమాలిన్యంబైన వాసన యని యెఱింగి యా
వాసన వొడమకుండ మనోనిరోధంబు సేసి శోధింపవలయు; నెవ్వండు
వస్తువు విభిన్నంబుగాఁ జూపుచు నందు నభేదదృష్టియై ప్రయత్నుండై
యుండునో వాఁడు మాలిన్యంబు దప్పి సుఖియగు. పూర్వస్థిత
మాలిన్యప్రణాశనంబున మనంబు దృఢంబై ప్రశుద్ధబోధనంబు
నొందు. ప్రశస్తంబగు నామలప్రణాశనంబు మనంబు నిరోధింపక
పుట్టదు, గాన మనోనిరోధంబు సేయవలయు; మనోనిరోధం బనంగా
మనంబు నిర్విషయంబై యుండుట ఇది సేయ దుష్కరం; బుపాయం
బులం గాని సాధింపరా; దాయుపాయంబు లైదుతెఱంగులైన గుణం
బులైయుండు; జ్ఞానధ్యానంబును, మనోనిరోధంబును, మానసోపా
యంబును, వాయుబంధనంబును, నివృత్తిచిత్తుండై హృదయంబునకు
వెలియై నాథసేవ సేయుట ననంగ; ప్రపంచంబు ద్వివిధ
భూబాహ్యంబు, నాభ్యంతరంబు నని; ధనదారాదికము బాహ్యంబు;
గౌణధ్యానాదికం బాభ్యంతరంబు; బాహ్యంబు వదలవలయు. కించిద
వలంబనంబు సేయక మనంబు బాహ్యత్యాగి గానేరదు. వ్రజంబులో
నుండి గోవ్రజంబులో నొకధేనువుం దోచిన మరలి మరలి పూర్వ

స్థలంబునకే పరువెత్త నన్యపశువుతో లంకెవైచి తెచ్చి పూర్వస్థలంబు
మరచియున్న పర్యంతంబు లంకెతో నుంచి తత్పూర్వస్థలంబు
మరచిన లంకె విడుతు; రిట్లనే విచక్షణులు నీతిఁ దర్కించి గౌణధ్యా
నాదియోగంబునన్ మనంబు బాహ్యేంద్రియంబులవలన మరలింప
వలయు; నిజమనంబునకు నిర్విషయత్వం బనందగు నీక్రమంబు
ప్రకారాంతరంబునం గాదు. క్రమంబునం గాని యున్నతపదంబు నెక్క
సమర్ధుండు గాఁడు; క్రమంబు దక్కి యెక్కెనేని యధఃపథంబు నొందు;
తత్కర్మంబు సేయుచుఁ, దత్కర్మంబు గావింపుచు, శంఖచక్రగదా
ధరు యమాదిగుణసంపన్ను ధ్యానించి యాక్రమంబునఁ బరమ
ధామంబు నొందు. మీరు నాకుఁ బరమమిత్రులు లోకరహస్యం
బెఱింగించెద; సత్సంగమంబున విష్ణుకథలు వినుచు జగంబు విష్ణు
మయం బని యెఱింగి సర్వజనులయెడ మైత్రి గావింపుఁడు. విషయంబుల
యందు దోషదృష్టి పూని, సర్వక్లేశనివారకుండైన విష్ణువును
స్మరింపుచు, సత్సంగంబు లేక యుండెడు విష్ణువిముఖులం గూడక,
యొంటిమై నుండి, యావిష్ణువిముఖులం దూషింపక, యిష్టప్రాప్తి
విపత్తు లాత్మకు సమానంబుగాఁ జూచుచు, నెయ్యదియు సంకల్పింపక,
యెల్లప్పుడు బ్రహ్మజిజ్ఞాసం బూని, యపరరాత్రంబుల లేచి యౌచి
త్యంబున “నాత్మ యెటువంటిది? దేహం బెందున నైనయది?
మనం బేచందంబున వర్తించు? దశానిలంబు లెట్టివి? యక్షంబుల
కుద్యద్వృత్తు లెటువంటివి? ఆత్మపరమాత్మలకు భేదం బెట్లు? ఎవ్వనిచే
నీవిశ్వంబు సృజియింపంబడియె? నావిశ్వం బెవ్వనిచే ధరియింప
బడియె? వేదంబుల తాత్పర్యం బెట్టిది? బంధం బన నెటువంటిది?
మోక్షం బన నెటువంటిది? శ్రోత, మంత దష్టవక్తయు నన నెవ్వండు?
జనకుం డెవ్వండు? సర్వగతమై నిత్యమైన యానంద మేల కనిపించ
దని గహనాంతమైన బ్రహ్మమునున్న సద్వృద్ధుల మఱియు మఱియు
నడుగుచు నన్నియెడలఁ బ్రభుండు ప్రకటంబుగాఁ దోఁచ, స్వప్న
దశయందు మనంబు హరియందు నిలిపి రమింపవలయు; తానే యతని
నన్వయించి పశు వభ్యస్తగృహంబునకుం బోయినయట్లు చనవలయు;
సత్పథవర్తులైన వారికి హరి ప్రసన్నుండగు; విమలజ్ఞానపురస్సరంబై
దుర్లభంబైన నిజపదంబు హరి కృప సేయునంత, దుర్గమయోగ
తంత్రంబునం జరించువారికిఁ దత్త్వంబు బుద్ధిక్రమంబునం బొడము.

పరలోకమునందు నీఫలము లేదు. పెక్కు లేటికి? భవాంబుధిఁ దరింపఁ
జేయు హరియే పరంబైన పరాయణంబు; శతసహస్రంబుగాఁ బల్కెద;
హరియే పరంబైన పరాయణము; మీరు న న్నస్త్రాదిఘాతంబుల
నొంపక జయించితివనుట విస్మయంబె? అణిమాదిసిద్ధు లీశ్వరస్మృతి
విఘ్నంబులు; విష్ణుసేవియైన జనునకు విముక్తియే సత్ఫలంబు.
తదంతరాయంబు లీసర్వసిద్ధులు నని.

183


సీ.

అపుడు యోగీశ్వరుండైన దయాబ్ధి ప్ర
                       హ్లాదుండు పలికిన నాత్మ నలరి
ధన్యతఁ గనిరి; కొందఱు దితిజేశ్వరు
                       కడకేగి భయమునఁ గంప మొంది
"యధిప నీసుతుఁడు మాకందఱకును దత్త్వ
                       విద్య బోధించెఁ బ్రవీణుఁ డగుచు;
ధ్యానంబు, జ్ఞానంబు, హరిముక్తి యనియెడు
                       వచన మొక్కటియే కేవలము పల్కు;


తే. గీ.

నతని సన్నిధి నుండ నె ట్లగునొ యనుచు
నేగుదెంచితి” మనిన సమిద్ధరోష
చటులధూమ్రాక్షుఁడై నిశాచరవిభుండు
గరము దెప్పించెఁ బాపసంగరముఁ బూని.

184

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని విషప్రయోగాదులచే బాధించుట

క.

సూదకదంబము రమ్మని,
సూదకభోజ్యాదులందు నొనరిచి, సుమన
స్సూధన మని గరళము మధు
సూదనసహితునకును భక్తిశూన్యత నొసఁగెన్.

185


ఆ. వె.

అపుడు వాసుదేవుఁ డతిభక్తి నెప్పటి
యట్ల తన్ను దితిసుతాగ్రయాయి
యాత్మఁ దలఁప గరళము జ్ఞాతదత్త మ
జ్ఞాతజీర్ణమై యెసంగఁజేసె.

186


ఆ. వె.

గరము మ్రింగి నిర్వికారుఁడై యుండు ప్ర
హ్లాదుఁ జూచి దైత్యుఁ డతివికార
మందెఁ; దథ్య మరయ నది తనకే విష
మై తనర్చె నప్పు డద్భుతముగ.

187

సీ.

కనలి ప్రహ్లాదరక్షకుఁడైన దేవుని
                       నెఱుఁగక యంత దైత్యేంద్రుఁ డడరి
క్రోధాంధుఁడై యతిక్రూరత నిజపురో
                       హితు నిరీక్షించి మహేర్ష్యతోడ
"నతిమూఢులార! ఖరాసిచే వీని ఖం
                       డించ వారించి మద్వంచనంబు
చేసితి రిఁక మిమ్ము శిక్షించి పిదప నీ
                       కులనాశకునిఁ బట్టి కూల్తు" ననినఁ


తే. గీ.

దద్ద్విజులు వానిసాహసోద్ధతి యెఱింగి
స్వామి కావింతు మే మభిచారకర్మ;
మందున హుతాశనుఁడు తృప్తినొంది దుష్ట
కృత్యఁగృత్తి వినిర్మించుఁ గిల్బిషమున.

188


క.

తంత్రముల వెలయు నస్మ
న్మంత్రంబులశక్తి చూడు మనుజాశన! యా
హంత్రముమీఁద బిడాలము
సంత్రాసము లేక యురుకుచందముఁ జూపున్.

189


వ.

అని ప్రహ్లాదుని నేకాంతంబునం దోడుకొని చని యిట్లనిరి.

190


సీ.

రాజకుమార! సర్వజ్ఞ! మహాభాగ!
                       నీబలసంపత్తి నేఁడు గాన
వచ్చె; శస్త్రేచ్ఛపావకనాగవిషముఖ్య
                       ములచేత బ్రతికితి; మూర్ఖుఁడైన
దైత్యేంద్రుఁ డంప నుద్ధతశక్తి నీధైర్య
                       మణఁగింపఁబూనియు, హరిపదాబ్జ
సేవకు నిన్ను హింసింప నుపేక్షించి
                       హితము చెప్పెదము సమిద్ధబుద్ధి


తే. గీ.

నిందిరేశస్తవంబు సహింపఁ డసుర
వరుఁడు; నీవును వదల వవ్వాసుదేవు;
నతని సద్భక్తి మెఱసి నీయంతరంగ
మునఁ జరించుట నీతియై పొడమె మాకు.

191

వ.

అసురవర్యులు నిజప్రయత్నంబున నిన్ను వధింపలేరు; వైష్ణవుండ
నన్యవధ్యుం; డన్యులచే మేము ప్రేరేపింపంబడితిమి. సూక్ష్మబుద్ధియైన
మీతండ్రి మాబలం బెఱుంగు; నతండు నియోగింప వచ్చి ని న్ను
పేక్షించ శక్తులము గాము; గుణరహితులమైన మాచేత నీవు
వధ్యుండ వగుదువు; పరాధీనులము; నీకు జీవనోపాయం బొక్కటి
గలదు; హరి నుతింపక రాజును నుతింపుము; హరిని మానసంబుననే
పూజింపుము; మానసపూజ శ్రేయస్సాధనము; నీవు క్రోధంబు
నొందకున్న నొకహితంబు చెప్పెదము; సత్కులప్రసూతుండవు,
రాజాధిరాజాత్మజుండవు, వజ్రదేహుండవు, యౌవనసంపన్నుండవు,
రాజలక్షణలక్షితుండవు, ఆలంబనం బితృద్వేషియగు హరియందు
భక్తి వలవ" దనిన దుర్జాతిబృంహితంబులైన విప్రవాక్యంబులు
విని "యహో! మాయ" యని పల్కి క్షణంబు తల యూచి
విస్మయానిమేషేక్షణుండై కించిత్వక్రోన్నతాననుండై ద్విజులం
జూచి ప్రహ్లాదుండు "హరి పూజనంబునకుఁ గాలం బకాలంబు
చూతురే? సాధువేదాంతసిద్ధాంతనిరూపితం బగునది యెయ్యది
యదియ కాలం; బీరీతి మాటికిం బలుకందగదు; మీరు గురువర్యులు;
సుఖకరంబుగఁ బలుకుఁడు; మహైశ్వర్యమత్తులైన యజ్ఞులకు
నిట్లం బలుకందగు; వేదవేదులైన విప్రులకు మీకు నెట్లు నోరాడెడు?
తథ్యము పలికెద మని ప్రతిన చేసి శిష్యవత్సలురైన గురులచే
నకాలంబున విష్ణుభక్తి వదలుమని పలుకవలసె; భవదావాగ్ని
తప్తుండై విష్ణుహ్రదసమాశ్రయంబుఁ జేసిన జనునకు నెయ్యది
కాలము? తాపత్రయానలజ్వాలాజ్వలితమైన దేహమందిరంబు విష్ణు
భక్తిరసంబున శాంతిఁ బొందింపవలయుంగాక, కాలం బెవ్వఁ
డీక్షించు? యజ్ఞకాల, దానకాల, జపకాలంబులు గలవుగాక! సర్వేశ
భజనంబునకుఁ గాలంబు కలదే? యాజన్మమరణపర్యంతంబు
విష్ణుభజనంబు సేయుచు మహానుభావులు క్షణము విఘ్నంబైన
దుఃఖింతురు; దగగొన్న పశువు పానంబు సేయుచు నంతరంబు
వడనీని యట్లనే విష్ణుభజనంబు గావింపుచు భవక్లేశంబు నొందు
ప్రపన్నులు వర్తింపుదురు; మఱియు.

192


క.

పలుకులఁ బొగడుచు, మనమునఁ
దలపుచుఁ, బడి మ్రొక్కుచున్, ముదంబందఁగఁ గ
న్నుల బాష్పంబులు గ్రమ్మఁగఁ
గల యాయువు హరికి నిచ్చి కాంతురు ధీరుల్.

193

తే. గీ.

అన్యభయమున సర్వేశు నఖిలవరదు
నెట్ల వినుతింపకుండుదు; నితఁడు దక్క
జనుల నెవ్వఁడు శాసించు? సర్వమునకు
నతఁడు శాసితవిప్రకులాఢ్యులార!

194


ఉ.

ఇంతియ కాదు ప్రాణభయ మేర్పడ మానవుఁ డబ్ధికన్యకా
కాంతు నుతింపఁగాఁ దగు; నకారణబంధుఁడు దాత, దైవ, మ
త్యంతహితుండు, తండ్రి, పరమాత్మ గుణాఢ్యులఁ బ్రోచు, దుష్టులన్
బంతముతో హరించు ననపాయమహోన్నతపుణ్యశీలుఁడై.

195


తే. గీ.

అతనిసంకీర్తనం బతిస్వల్పఫలము,
తెగువతో విడు మంటివి; తగునె నీకు?
దత్ఫలం బింత యనుచుఁ గీర్తనము సేయఁ
గలఁడె శంకరుఁ? డది వినఁగలఁడె ధాత?

196


క.

మాతండ్రి యిప్పు డలుగన్
హేతువు మఱి యెక్కడిది? రమేశ్వరకథనం
బీతఱిఁ బలుకుము మేఘము
చాతక మాశించునట్ల చయ్యనఁ గంటిన్.

197


తే. గీ.

భవదభిప్రాయ మిది యార్తిఁ బడినవేళ
హరి భజించు మనుట దురాశాంతరంబు
లివి సకలజంతువులు వెలయింప బ్రతుకు
నిత్యమే? యెన్నఁ డే మౌనొ నిర్ణయింప.

198


మ.

ధర నత్యంతసుదుర్లభం బగు నరత్వం బందియున్ మూఢుఁడై
దురభిప్రాయతఁచాడి యెక్కి కరముల్ దూలన్ ధరం బడ్డయ
ట్లురుశక్తిన్ సుఖియై మురారి మదిలో యోజింపఁగా లేఁడు; దు
స్తరరోగాతురుఁడై భజింపఁగలఁడే తద్దుఃఖజాడ్యంబులన్.

199


క.

ఆతురుఁడనై యొనర్చెద
నాతతమై, మెఱయ శ్రేయ మందెద నని యీ
బూతైన యాశ లన్నియు
యాతనలకుఁ ద్రోవ లందు రార్యోత్తంసుల్.

200

క.

అతియుక్తి గురుఁడు చెప్పిన
హితమగునది సేయవలయు నియతమునున్ సా
ధుతకుఁడు; హితేతరంబుల
సతతగురుప్రియములైన జడుఁ డొనరించున్.

201


వ.

అటుగాన గురూక్తమైన విష్ణుభజనపరిత్యాగంబు సేయనొల్లనని
పలికిన దైత్యయాజ్ఞికులైన మాంత్రికులు రోషించి పావకోదితకృత్తిచే
హత్య చేసెదమని భర్జించినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

202


మ.

తగ దాస్థానమునందు జేయ నురుమంత్రస్తోమవిక్షోభ; మీ
పగ గావించుట మీకు ధర్మమె? నిజవ్యాపాదనాశక్తికృ
త్తి గుఱింపం బని యేమి; లేవె యితరాధిక్యంబు లెన్నేని? హె
చ్చుగ నాయుఃపరిపూర్తి గల్గునెడ నెచ్చో నుండు నీకృత్తియున్.

203


శా.

కాలాత్మాభిహితుం గలంచి యణఁగంగాఁజేయు కృత్త్యాదికా
భీలక్రూరగ్రహంబు లీలగను గన్పింపంగ నాకృత్తి యా
కాలోత్తాలమహానలంబు తృటియై కాన్పించు నిద్ధాత్రిలో
నేలా కారణమున్నఁ దప్పునె ఫలం బింతే వితర్కించినన్.

204

·

వ.

ఇ ట్లనునప్పుడు.

205

దానవపురోహితులు ప్రహ్లాదునిపైఁ గృత్తిం బ్రయోగించుట

శా.

క్రోధస్రస్తవివేకులై ద్విజులు దుష్కర్మాత్ములై మంత్రగ
ర్వాధిక్యంబునఁ బొంగుచున్ హవన ముద్యద్భక్తిఁ గావింప దు
స్వాధస్పారతరస్ఫులింగములలో సక్రోధమై కృత్తి సం
బాధాటోపముతోడ నార్చుచు వడిన్ బ్రహ్లాదు ధట్టింపుచున్.

206


వ.

అప్పుడు సకలభువనంబులు గ్రక్కదల నార్చుచు శూలంబుఁ ద్రిప్పి
ప్రహ్లాదుని నాటించినఁ దజ్జ్వాలాస్ఫూర్తి హరిభక్తిరసాంబుధియైన
యతనివలన శమియించె; వహ్నిం గలసిన యుల్ముకంబుల చొప్పున
నేర్పడక జీవుండు బ్రహ్మంబుబలెఁ గలిసియుండె నంత.

207

తే. గీ.

విష్ణుతేజోమయుండగు విభునియందు
నగ్నితేజోమయంబైన యాత్రిశూల
మైక్య మందెఁ బరాత్మ జీవాత్మఁ గలసి
వేఱుఁగా దోఁచకున్నట్లు విస్మయముగ.

208


ఆ. వె.

సర్వభోజి విప్రజన్మంబు ధ్యానహీ
నుం డొనర్చు జపము, దండినవ్ర
తమునఁ జదువు వేదతతియునుబోలెఁ ద్రి
శూల మఫల మయ్యె బాలునందు.

209


క.

ప్రకటవివేకజ్ఞానా
ధికుఁడగు ప్రహ్లాదుఁ గృత్తి తెగనేయక యా
ప్రకృతి మహోత్తమపురుషుని
సకలంకుని నెదురలేని యట్లన యుండెన్.

210


సీ.

కేవలవ్యర్థమై కృత్తి శిలాహత
                       శిలవోలె నెగసి రోషించి క్రోధ
సన్నద్ధు లగుచు నాస్థానంబునందుఁ బ్ర
                       యోగంబుఁ జేసిఁ యత్యుగ్రులైన
ద్విజులపై సంగారదీధితుల్ గ్రమ్మంగ
                       హీనదక్షిణయజ్ఞ మెట్ల నట్ల
నపు డధోగతిఁ ద్రోయ, హస్తముల్ శిరమున
                       దాల్చి వస్త్రములు విదల్చుకొనుచు


తే. గీ.

దాడి వార లఖండరోదనముతోడఁ
గేల నసిఁ బూని త్రిప్పుచు బాలకుండు
తానె ఖండించుకొనినచందమునఁ గావ
దిక్కులే కమ్మహాత్ము నుతించి మ్రొక్కి.

211


ఆ. వె.

"మాకు దిక్కు లేదు; మాయపరాధంబు
గాఁచి మమ్ము నిట్టి కరుణ నేలు;
కృత్తి వచ్చె, నుగ్రకృతి యయ్యె; సంతత
కృత్యభిజ్ఞ! నిలుపు సత్యమహిమ.”

212

వ.

అప్పుడు.

213


క.

ఘనుఁ డాతఁడు పరదుఃఖము
తనదుఃఖమువలెఁ దలంచి దయఁ బూని మనం
బునఁ గలఁగి దుర్వ్యథాకం
పనతనుఁడై యుండి శాంతభావముతోడన్.

214


క.

మేరుసమదుఃఖకోటు ల
పారంబుగఁ దన్నుఁ బొదువఁ బ్రాజ్ఞుఁడు మది ని
స్సారాన్యదుఃఖలేశము
దూరంబున వినినఁ గనిన దుఃఖించు దయన్.

215


క.

ధరణీసురపరిరక్షా
పరుఁడై ప్రహ్లాదుఁ డార్తబాంధవు, లక్ష్మీ
వరుఁ దలఁచి కావవే యని
శరణాగతుఁ డయ్యెఁ బరమసంతోషమునన్.

216


శా.

నే ని న్నాత్మఁ దలంచు పుణ్యమున నో నీరేజనేత్రా! పురా
తనదుర్మంత్రబలార్దితావనిసురోత్తంసావలిం గావు; మా
త్మనిదేశంబున లోకముల్ సదసదుద్యత్కార్యముల్ సేయఁబూ
నినవా రెన్నిక నట్టిలోకములకున్ నేఁ డున్నవే దోషముల్.

217


వ.

అది గాన ననీశ్వరులైన వీరిం గావుమని ప్రార్థించిన విష్ణుప్రసాదం
బునఁ దద్కృత్తి శాంతి నొందె; నంత బ్రాహ్మణులు దైత్యుకడ కేఁగి
లజ్జావనతవదనులై యున్న రాజు ఖిన్నుండై పుత్రునిం బిలిచి హర్షిం
చినట్లు "ప్రహ్లాదా! నీపు శంబరునికంటెను మాయ లెఱుంగుదువు;
బ్రహ్మబలోజితయైన కృత్తిని గెలిచితివి; బ్రహ్మబలంబునకంటె
మన యాసురబలంబే శ్రేష్ఠం బనిపించితివి; మదాత్మజత్వమాత్రంబున
నీ కెంత బలంబు గల్గె? మదాచారంబున నడచితివేని బలవంతుఁడ వయ్యెద;
నీవైష్ణవశక్తులకు నంతరంబు చూప నీయందు నీమాయ లన్నియుం
బ్రయోగించితి; బ్రాహ్మణు లందఱును వైష్ణవులే కాన శస్త్రసర్పాగ్ని
దిగ్దంతివిషకృత్యాదులచే సహజబలంబు నష్టంబు గాదు. రాక్షసుల
మన్నించు” మనఁ బ్రహ్లాదుండు నగి ప్రాంజలియై “యేల మోహంబు
నొందించెదవు? మహాకులప్రసూతుండవు; శ్రీవిష్ణువు నెఱుంగవే?
మద్భావంబు పరీక్ష సేయ నిట్లు పలికితివి; మీతాత విష్ణు నాభికమలం

బున జనించినవాఁడు; నీ వెఱుంగకయున్న విష్ణు నెవ్వ రెఱుంగుదురు?
విష్ణుప్రభావంబునందు నీ కీవిశ్వాసము గల; దది పరీక్షింప సుత
ప్రియుండవైన నీవు సర్పాదులఁ బ్రయోగించి నాకు భగవద్ద్విశ్వాసంబు
గల్పించితివి; నామీఁద దయ గల్గఁగా నే భగవంతుని విడువుమని నీ వనిన
కతన నాగ్రహంబు పుట్టెను; బాలుఁడు సేయుమనిన పని సేయండు;
అట్లు గాన నే బాలుండ; విష్ణువును విడువను; మోక్షంబు గోరఁగాఁ
గృత్యాదులచే నవధ్యత్వ మాంతరీయకఫలం బమృతమునకునై
సముద్రము మథింపగాఁ బారిజాతాదికము దొరికినట్లు; గాన నిట్లు
మోక్షైకచిత్తులమై యత్నము సేయుచున్న మాకు దివ్యసిద్ధులు లభిం
చెను; పుణ్యమువలనఁ బుణ్యఫలము గల; దందున నల్పులు సంతుష్టు
లగుదురు; మహామతి ముక్తియే కోరు; సురపతి యమృతముంబలె;
నింక నిన్ని యననేల? నీ వెంత చేసిన నవి నన్ను నేమి చేసె? హరిస్మర
ణంబు గూడదని చలంబునం బల్కిన నేమి! నీమాట నీమనంబునకు
వచ్చునె? మనస్సునకు వచ్చిన మాటయే పల్కండేని యాత్మచోరుండు;
నీకు విష్ణువునెడఁ జలమాత్సర్యంబులయందు నేమి యపరాధము?
నీస్వభావ మది; చరాచరజగత్యంతఃప్రవర్తకుండై యచరుండైన
విష్ణువు నవిద్యాంధు లెవ్వరు గెల్చెద! రనన్యమనస్కులై భజించిన
వారు గెల్తురు; ఇంక నీకు నేమి విన్నవించెద" ననిన మాటలు
శిష్టుండు పతితమందిరంబునం బోలెఁ జొరవయ్యె; నప్పుడు.

218

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని మందిరాగ్రమునుండి త్రోయించుట

సీ.

అసురనాయకుఁడు క్రోధావేశవిస్మృతా
                       ర్వాక్తనశ్రముని, తద్వైష్ణవావ
తంసు, నవధ్యుఁగాఁ దలఁచి క్లేశము నంది,
                       జంకి, నిజాస్థానచయమహోచ్ఛ
చిత్రసత్ప్రాసాదశృంగంబుమీఁదట
                       నుంచి, యాతనిఁ బడ నుగ్రశక్తిఁ
ద్రోయింప నవ్వేళఁ దోయజనయనుండె
                       తానని యాత్మ నెంతయును నిలిపి

తే. గీ.

యవ్యయానందమయుఁడై నిజాత్మ యెఱుఁగ
కధివసింపంగ నపుఁ డమ్మహాత్ముఁ దెలిసి
సర్వగుఁడు వాయుదేవుండు సంభ్రమమున
మెల్లమెల్లనె చేర్చె భూమీతలంబు.

219


క.

స్పర్శనుఁడు తత్తనూనం
స్పర్శనమున నతిపవిత్రభావైకపరా
మర్శనమును, దద్వైభవ
దర్శనమును గల్గె ననుచు ధన్యత వెలిఁగెన్.

220


మ.

..................................................................
..................................................................
భజన ప్రత్యుపకారసిద్ది మెఱయన్ క్ష్మాకాంత తద్విష్ణు దా
సజనాగ్రేసరుఁ బూనె దన్మహిమ లెంచన్ నాకు లీక్షింపఁగన్.

221


వ.

అప్పు డద్ధరణీదేవి యిట్లనియె.

222


మ.

[అతిమూఢుం డయి తండ్రి సౌధశిఖరం బందుండి త్రోయింప దుః
స్ధితుఁడౌ నిన్ను] స్పృశింప నిన్ను నొడువన్ సేవింపఁ బూజింప వ
చ్చితి; నిన్నున్, ననుఁ బూను[నట్టి] హరిసాన్నిధ్యంబునన్ నిల్చి నే
ధృతిమై నిన్ను భరింపనోపుదునె యీతేజం[బు సామాన్యమే].

223


వ.

............................................................................. లుగు
ఫలము; త్వాదృశసంస్పర్శన మందుట దేహము గాంచిన ఫలము;
భవాదృశనుతి జిహ్వాఫలమును; మౌనభావగతులు దుర్లభులు;
నది సహ.....................................................................
...................................................................................
నేఁ బవిత్ర నైతి; మున్ను యజ్ఞవరాహసంగంబున నాకు దివ్యశక్తి
గలిగె; నది నా కొకవింతయై యున్నయది; ని న్నంటినఁ బున
రుద్బుద్ధమాయె; నందున సకల లోక ..............................
...................................... యందు నీవంటి పరమభాగవతు
లొండు రెండడుగులు పెట్టినంతనె సామర్థ్యంబు గలదు.

224

మ.

అలఘుస్ఫూర్తుల మిమ్ముఁ జక్రధరపూర్వార్చాకృతిశ్రేణులన్
మ.........................................................................
....................................రూపమున శశ్వత్కీర్తిశేషాంశమై
జలజాక్షుండు శిరంబుల న్నిలిపె భాస్వన్మూర్తి న న్నెప్పుడున్.

225


క.

నరలోకంబు కృతార్థతఁ
బరగెన్ నీ యున్నకతనఁ బావన! నిను నే
[భరియించి నీదు చరణా
బ్జరజోలేశంబు సోఁకి పావిత నైతిన్.]

226


వ.

నీవు నరలోకంబున జనించినకతన నంతకలోకంబు హ్రస్వంబు
నొందె; ననంతలోకంబు వృద్ధి నొందె; భవత్కీర్తనాలోకనాధూత
పాతకులైన నరులు హరిలోకం[బునకుఁ బోయి నిన్ను సన్నుతింప
చెన్నుండు నీభక్తితాత్పర్యవిశేషంబు] వినియె; నిట్లు వృద్ధి నొందె
దని చింతించు నీవంటి పరమభాగవతులగుణంబులు పద్మజునకు
నగమ్యంబులు; నే నెఱుంగనేర్తునే? మీప్రభావంబు భాగవ[తశిరోమణు
లకుంగాక నన్యుల]కు గోచరమే! మూర్ఖమూర్ఖుండైన మీతండ్రి
యచింత్యశక్తియైన ని న్నెఱుంగడు. నిన్నుఁ దలంచినయంతనె
యాపదలు దొలంగు.......................................................
.................................................................................
.................................................................................
బయ్యె నంతఁ బ్రహ్లాదుండు దయామృతదృష్టిం జల్లంజేసిన నందఱు
సుఖంబు వహించిరి; శంబరాదులైన దుష్టదైత్యులు లజ్జావనతవదనులై
లేచి చనిరి; యాశంబరుని, దైత్యరాజును నిందింపుచుఁ బురజను
లార్తిం బాసియుండిరి. రాజును శంబరుండు నన్యోన్యదైన్యంబులం
బరితపింపుచు నుండి రంత.

227


సీ.

సంశోషకుండను శఠదైత్యు నొక్కని
                       ననిలరూపంబైన యతనిఁ దలఁచి
ప్రహ్లాదు మడియింపఁ బఱపిన, వాఁడు త
                       త్తనువులో నడఁగఁ, దద్దైత్యుభార్య

మొఱపెట్టుకొనుచు, నమోఘబిలోత్సాహ
                       సంపద వ్యర్థమై జడతనున్న
యాహిరణ్యకశిపునంఘ్రులఁ బడి "స్వామి!
                       యాత్మేశ్వరుండు ప్రహ్లాదతనువు


తే. గీ.

నందు జీర్ణించిపోయెఁ, గాలాయనంబు
తప్తమై యున్నఁ బడు నీరధారవోలె;
నేమి చిత్రంబొ కాని నేఁ డిమ్మహాత్ము
తనువులోపల పుంగ్రహోదయము దనరె”.

228


వ.

అనిన విని కలంగి నిజకులాంగారంబైన ప్రహ్లాదు నిట గురుగృహం
బున కనిచి తాను నంతఃపురంబు సొచ్చి పరితపింపుచునున్న వృద్ధ
మంత్రులు "తేజోధికుండైన ప్రహ్లాదునిం బ్రార్థించి, ప్రసన్నునిం
జేసికొని, సామ్రాజ్యంబు లనుభవింపు" మన నాసన్నమృత్యుండు
గాన వారిం దర్జించి మఱియు నొకకార్యంబు విచారించి.

229

హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదుని నాగపాశబద్ధునిఁ జేసి సముద్రమునఁ ద్రోయించుట

శా.

రక్షోవీరులచేత నబ్ధినహిరాడ్రజ్జుచ్చటాబంధదు
ర్విక్షేపం బొనరించి వైష్ణవమణిన్ వేగంబె త్రోయించినన్
సాక్షాత్సత్వగుణాంకురం బనఁగ నాచక్రాయుధధ్యానని
ష్ఠాక్షుణ్ణాత్మకుఁడైన యాఘనుని వేడ్కన్ వేలకుం జేర్చినన్.

230


క.

తను లవణాంబుధిఁ ద్రోయుట,
యనిమిషనక్రాదిజలచరానీకంబుల్
మునుమున్నె తొలగిపోవుట,
ఘనుఁ డసురకుమారుఁ డాత్మఁ గానక యుండెన్.

231


వ.

అప్పుడు పన్నగశాయియనుజ్ఞం బన్నగారి బంధనంబులు కబళించె,
నముద్రుండు రత్నంబులు కానుక దెచ్చి సమాధినిష్ఠ నున్న హరిప్రియుని
సేవించి "స్వామీ! నన్నుఁ గటాక్షింపవే యే నదీనుండ; నీవు జనింప
నీరాక్షసకులంబు చంద్రునిచే నంబరంబువోలె విమలం బయ్యె”
ననం గన్నులు విచ్చి చూచిన మ్రొక్కి సముద్రుం డిట్లనియె.

232

తే. గీ.

అసుర లహిపాశబంధమగ్నాంగుఁ జేసి
నిన్ను నాలోన వైచిన నిర్మలాత్మ!
నిప్పు మ్రింగిన నరునట్ల నిన్ను నాదు
గర్భమున నుండి త్రోచితిఁ గడకు నిపుడు.

233


క.

ఉరగవరపాశబంధము
లురగాహితుఁ డుక్కడంచె నుగ్రోద్ధతిమై;
హరిభక్తి పుణ్యసంపదఁ
బురుషులకు లభించవే యపూర్వయశంబుల్.

234


వ.

అని రత్నంబులు సమర్పించి "హరిం బూజించి; హరిభక్తుల నుపేక్షిం
చినవారికిఁ బరమధామంబు దూరంబు; రత్నోపాయనంబులచే నీకుఁ
గర్తవ్యం బెద్దియు లేదు భా........................................................
[29].........................................................................................
దెరచుకొని ప్రసన్నవదనుండును; గమలాయతాక్షుండును, దీర్ఘ
బాహుండును, సుకపోలనాసికాభాగుండును, నుదారతేజోనిధియు,
నప్రమేయుండును, గదాసిశంఖాంబుజశోభనాంగుండును, సుదృశ్య
సీమాపరసేతుభూతుండును, సర్వేంద్రియాహ్లాదనదివ్యమూర్తియుఁ,
ద్రిలోకీవితతప్రతిమూలంబును, గురుపరమగురుండును, నాథ
నాథుండుమ నగు విభునిం జూచి విస్మయభీతిహర్ష ప్రకంపంబు లంది,
యది స్వప్నంబుగాఁ దలఁచి స్వప్నంబునందేని యీశ్వరసాక్షా
త్కారం బయ్యెడునని, ప్రహర్షార్ణవమగ్నచేతస్కుండై మఱియు
నానందమూర్ఛం జెందిన, నీశ్వరుండు ధరణియందుం జేర్చి యంకం
బున నిడుకొని, నర్వజనైకబంధుండు గాన మెల్లనె కదల్చి కరపల్ల
వంబునన్ స్పృశించి, మాటికి, జననియుంబోలె నాలింగనం బొనర్చినఁ
గొంతసేపునకుఁ ప్రహ్లాదుండు కన్నులు తెఱచి విస్మయానిమేషుండై
జగన్నాథుం దప్పక చూచిన సుధామాధుర్యసారంబులైన వాక్కుల
“వత్సా! భయంబు నొందకు" మని యూఱడించినఁ గృష్ణాంగస్పర్శ
సౌరభ్యసురూపవచనామృతంబులచే నక్షగణంబు హృతంబైన
యాత్మసంభావనంబు నొందక నిజమనోభృంగంబు పరువెత్తె; శ్రీశ
భక్తాబ్జసంగియై యతిలుబ్ధంబై న; నే నెవ్వండ నెచట నున్నవాఁడ” నని

యెఱుంగక కన్నులు మూయుచుఁ దెఱచుచు నొకవింతసంతోషంబు
వహించి, గోవిందదర్శనంబు సేయు నతని యవబోధంబు క్షణంబు
గాన్పించుచు, క్షణం బతిరోధానంబు నొందుచు, సాభ్రవ్యోమేందు
మండలంబుగతిఁ బ్రకాశించె; నంతం జూచి క్షణంబు చింతించి “యితని
వాక్కునఁ బృథివియు నగ్నియు నితని ప్రాణంబున నంబరంబు నని
లంబును, నితని చక్షువున రవియు దివియు, నితని శ్రోతంబున దిశలు
శశియు, నితని మనంబున నంబువు, వరుణుండునుం దగుటఁ జూచి
శ్రీమద్విభూతిం దనరు నితండు సర్వోపనిషదర్థంబు, మహాప్రభు” వని
పునఃపారవశ్యంబు గాంచి తెలిసి శ్రీశాంకశాయియైన తన్నుం దడవుటకు
నెఱింగి భయసంభ్రమంబుల లేచి ప్రసన్నుండవు కమ్మని మ్రొక్కి
బహుయంజ్ఞుండై యల్పపూజోక్తి నాచరింపండయ్యె; నప్పుడు గదా
పద్మాసిశంఖధారి యభయహస్తం బిచ్చి చేపట్టె; స్పర్శసుఖైదితంబైన
భుజంబున నిడికొనినఁ గరాబ్జస్పర్శనాహ్లాదగళదశ్రుండై కంపంబు
నొంద మఱియు నిట్లనియె.

235

విష్ణువు ప్రత్యక్షమై ప్రహ్లాదు ననునయించుట

చ.

"గురుతరమూర్తి నంచు" ననుఁ గూర్చి భయంబును సంభ్రమంబు వే
మరుఁ దగదీకు నిట్టిది సమస్తము నాకు ప్రియంబు గాదు మ
త్పరమహితంబు సేయుట యభవ్యము సేవ్యముఁ, బూర్ణకామ్యతం
బరిగిన నాయెడ న్నిలిచి పల్కిన పల్కులు నాకు హృద్యముల్.

236


తే. గీ.

సతతముక్తుండ నయ్యుఁ బ్రసన్నభక్త,
భక్తి సుస్నేహరజ్ఞుప్రబద్ధబుద్ధి
నైతి; నజితుండ నయ్యు జితాత్మ నైతి;
వశ్యకృత్యుండ నైతి నవశ్యమహిమ.

237


తే. గీ.

త్యక్తబంధుధనస్నేహతంతుఁ డగుచు
నెమ్మి నాయందు సద్భక్తి నిలుపవలయు;
నతఁడు నాకును మరియు నే నాతనికిని
గాన మా కెవ్వరు నిజాప్తఘనులు లేరు.

238


వ.

నిత్యుండును బూర్జకాముండును నగు నాకు జన్మంబులు వివిధంబులు
గలవు; సర్వేష్టదానంబు లొసంగుదు; నీకు నెయ్యది ప్రియం బది తెలుపు“

"మనినఁ బ్రహ్లాదుండు ప్రాంజలియై యుత్ఫుల్లదృష్టిచేఁ జతుర్భుజుం
జూచి" భవత్పదారవిందంబులు చూచుకంటె నాకు మరియు నొక
వాంఛ గలదె? బ్రహ్మాదిదుర్లభంబైన యుష్మత్పదాంభోజదర్శ
నామృతంబున మచ్చిత్తంబు తృప్తిం బొందదు; మరియు నొకటి గల్గెనేని
ప్రార్థించెదఁ; గల్పాయుతశీతంబులనైన యుష్మత్సాక్షాత్కారాహ్లాద
సముద్రతరంగంబుల నోలలాడునాకు నితరసుఖంబులు రుచియిం
పవు గాన నే నితరంబులు వేడనొల్ల;" నని విన్నవించిన సుధారసప్రవా
హంబులగు వచనంబుల మోక్షలక్ష్మీసామ్రాజ్యంబునందుఁ బట్టంబు
గట్టి భగవంతుం డిట్లనియె.

239


తే. గీ.

నీవు పల్కిన యట్లనే నిజము నాకుఁ
బ్రియముగా నొక్కవరము సంప్రీతి నడుగు;
మఖిలలోకంబులందు నీ యట్టి ధీర
చిత్తుఁ డెవ్వఁడు గలఁడు చర్చించి చూడ.

240


వ.

అనఁ బ్రహ్లాదుం డిట్లనియె.

241


క.

ఉరగేంద్రవేత్రనాయక
గరుడాదులలోన నొకనిఁ గానను దేవా!
కరుణించుము, నీదాసుఁడ
శరణాగతవత్సలా! ప్రసన్నాత్మ! హరీ!

242


వ.

అనిన నీశ్వరుం డిట్లనియె; “నీకు సంకటంబు ప్రాపించినయది; యేను
నిన్ను నిర్వహింపం జనుదెంచినవాఁడ; నీవు భృత్యత్వంబు వేడితివి;
నీవె నేఁగాఁ దలంచియున్నచో నిది యుచితంబె? వేరుగాఁ జూచుట
యెందులకు నేనె యెఱుంగుదు; నీవు గోరినయది మద్భక్తి; నీకుం
గోరందగినయది గాదు. నీకు స్థిరంబైనయదియె; మరియు వరం
బులు వేఁడుమని యనుగ్రహించినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

243


తే. గీ.

నాథ! భవదీయపదభక్తి నాకు నిచ్చి
నాడఁవో యియ్యవో నీవు! వేఁడికొనిన;
నట్టి సద్భక్తి దొరకిన నదియె నాకుఁ
గామ గవి; యన్యవరకాంక్ష ఘనతరంబె?

244

తే. గీ.

పరమసద్భక్తియే నాకుఁ బ్రాప్య మనఘ!
యదియ మరియును మఱియు నాయాత్మయందుఁ
బొడమె; నెపుడుఁ జతుర్వర్గమును లఖింపఁ
జేయుఁ జిత్రంబు గాదె చర్చించి చూడ.

245


వ.

కావున నేఁ బరమభక్తిం గోరుచున్నవాఁడ; భక్తిమంతుండె యధికుండు
మహాభయముక్తుం డైనమాత్రంబున నాభక్తి యెంత యాధిక్యంబు!
నీయందు హాస్యానాదరమాయలచేతనేని నిలిపినభక్తి నరులకు నింద్ర
పదంబు లభింపంజేయు; సాత్వికభక్తి యయ్యెనేని యేమి చెప్ప? భవ
త్ప్రేరితభక్తి, భవఘోరాబ్ధిని మునుంగువారికి సుత్తారణరజ్జువు,
మాయాతమశ్చన్నబ్రహ్మానందమహానిధి చూడంగోరినవారికి
యుష్మద్భక్తియే సిద్ధదీపిక; భవశర్వరియందు జ్ఞానదీపంబు మల్చుకొని
నిద్రించువారికి యుష్మద్భక్తియ సూర్యదీప్తి; సకలేష్టంబులకు జన్మ
భూమి; యనిష్టంబులకు వహ్నిశిఖ; మోక్షలక్ష్మికిం బ్రియసఖి; నీవు
దయ సేయక దుర్లభంబు; నాథ! యుష్మద్భక్తి సాత్త్వికియై స్థిరయై
నిల్చుంగాత! నిన్ను నుతింతు, నర్తింతు, హర్షింతు" ననిన భగవం
తుండు ప్రియోక్తుల నిట్లనియె.

246


సీ.

"ప్రియవత్స! నీకు నభీష్ట మెయ్యది యది
                       ప్రాపించు; సుఖమున బ్రతుకు మింక;
నంతర్హితుండనై యరిగిన ఖేదంబు
                       నొందకు; క్షీరాబ్ధి నున్నయట్లు
నీహృదయంబున నిల్తు; లక్ష్మికి నాకు
                       భక్తహృదయమె శోభనగృహంబు;
వైకుంఠదుగ్ధాబ్ధివాసవర్ణన నిత్య
                       శోభయె తెలియ; రక్షోభయములు


తే. గీ.

తలఁగఁజేయుదు దారుణతనువు గాన
మందిరము నిలుపుకొనఁగ మనుజసింహ
మూర్తి ననుఁ జూచెదవు; భక్తి మూఁడుదివస
ములకు" నని యేఁగె విస్మయమున భజింప.

247


క.

అంతట నానందాశ్రుదృ
గంతంబులఁ గంపమంది హరిఁ గానక దు
శ్చింతం బొరలుచు భేదా
నంతరమున ధైర్యలక్ష్మి యందె న్వేగన్.

248

క.

హరిసంస్పర్శనవీక్షణ
పరిపూతశరీరుఁడైన ప్రహ్లాదుఁ గరాం
తరములఁ జూడగ వచ్చిన
కరణి దివాకరుఁ డుదయనగంబున నిల్చెన్.

249


క.

గిరి నుదయించిన యంతనె
హరియించె దిశాతమంబు లర్కుఁడు సర్వే
శ్వరభక్తిచేత నుత్కట
దురితములు జగంబులోనఁ దొలగించుగతిన్.

250


క.

తరణిఘటజన్ముఁడును దు
స్తరతిమిరాంబోధి గ్రోలఁ దత్తత్సుజనాం
తరతీర్థనిర్మలత్వము
స్ఫురితం బయ్యెం దిగంతము లహో! యనఁగన్.

251


ఆ.

సారసాప్తుఁ జూచి చక్రవాక ఖగంబు
హర్ష మందె; నాపరాత్ముఁ గాంచి
యోగివరుఁడు మోద మందినకైవడి
నంతరంగమునఁ బ్రియంబుఁ దోఁప.

252


ఆ.

అర్కుఁ డాజలాశయంబులఁ బ్రతిబింబ
మంది పెక్కుమూర్తు లయ్యె; క్షేత్ర
ములన నార్ద్రశీలములునుగా మెఱయ స
ద్గుణత వహించి తనరునట్లు.

253


క.

నలినములు సజ్జనులవలె
జలజాప్తపరేశమూర్తి సంపద వెలసెన్
కలఁగె న్నీలాబ్జంబులు
జలజాక్షుని కథలఁ దామసజనంబువలెన్.

254


వ.

అంతఁ బ్రతిబుద్ధజనస్వనంబు చెవులు సోఁకిన మేల్కని నిజపురంబు
నకుం జని హరిస్మృతిబలంబున నన్నిదిక్కులు హరిగానే వితర్కిం
చుచు, నడుగడుగునఁ దొట్రుపడుచు, హర్షింపుచు నగ్రంబున హరి
నీక్షించిన యట్లు జయజయస్వనంబులు పలుకుచు, హరిఁ జూడక
యార్తి నొందుచుఁ జరించె; సోత్కంఠుండై నాటనుండి శ్రీశహృతాంత

రంగుండై లోకజాడ్యహతుఁడై యలౌకికుండై జడునట్లు దురితంబు
లడంచుచు మంగళంబుల రమ్మని పిలుచుచు ననంతనామంబులు
గానంబు సేయుచు, నచ్చట నాడుచు, "శ్రీ గోవింద! కేశవ! ముకుంద!
శ్రీవల్లభ! శ్రీనాథ! శ్రీవైకుంఠ! సుకంఠ! కుంఠితఖల! స్వామి!
యకుంఠోదయ! శుద్ధధ్యేయ! విధూతధూర్త! ధవళశ్రీక! మాధవ!
యధోక్షజ! శ్రద్ధాబద్ధ! నీయందు నాకు బుద్ధి జనింపఁజేయవె,
యచ్యుతగుణా! అచ్యుతకళేశ! సకలేశ! శ్రీధర! ధరాధర! విబుధ
జనబుద్ధ! యాదరణచారణ! వినీలఘననీల! శ్రీధర! గుణాకర!
సుభద్ర బలభద్రకర్ణ సుఖపర్ణస! సుఖార్ణవ! మురారి! స్వర్ణరుచిరాం
బర! సుపర్ణరథ! యర్ణవనికేతన! భవార్ణవభవభయంబు మాన్పవే!
గుణగణార్ణవ! నమస్తే!" యని పాడుచుఁ దదప్రాప్తి గాఢదుఃఖాశ్రు
గద్గదుండై పొరలుచు, మొఱలిడుచు, విస్మితజనులు తనుం జుట్టుకొని
"నరకపతితజనులకు భవచ్చరణస్మరణంబు శరణంబు; భవవైతరణి
పతితుండనై దీనుండనగు నన్ను నేల నిరీక్షింపవు? నీయందు భక్తిఁ
బుట్టింపుచు, నీవె భవాబ్ధి మునుంగనీక రక్షింపవే! క్లేశంబు నొందితి
దయాపరమూర్తీ! నీకు దయ గల్గదేని కర్మవశాహతుండ నౌదు. కామ
క్రోధమదాద్యమిత్రనివహప్రోత్సారితోన్మాదవిశ్రాంతకుపితధృతి
హారదుర్నిగ్రహాదూరఘోరైకాదశేంద్రియఖలనంబులచే నార్జితంబైన
కర్మంబు, శిశువనై యొక్కరుండ ననుభవించుచున్నవాఁడ; నీకు దయ
లేకున్న నే నెట్లు గడతేరుదు; మానంబు శిరంబుపై పాషాణంబు;
మాత్సర్యంబు వలద్గరళజ్వాలామాలిక; క్రోధంబు కంటిలో నెరుసు;
భవనామకాంతారంబునందు మనోజవటుండు బుద్యాఖ్యయష్టి హరించె;
ముక్తిసరణి యెట్లు తరించెద”నని ప్రహ్లాదుండు పలుక విని యద్భుత
వైరాగ్యంబునకుం గొంద ఱశ్రువులు విడిచిరి; కొందఱు మ్రొక్కిరి.
లీలచేఁ గొందఱు హాస్యంబు చేసిరి; కొందఱు భక్తిం గాంచిరి; కొందఱు
విస్మయంబు నొందిరి; కొందఱు మూఁకలు మూఁకలై చూచుచు దురి
తంబులం దొలంగిరి; గోవిందకీర్తనానందనిర్భరుండై కీర్తననర్తన
గానంబుల జనులపై స్పృహలేక తిరిగె; అర్కుండు లోకతమో
భేదార్థంబు దిరిగినట్లు సంచరించె; నప్పుడు సముద్రముద్రామగ్నా
యాతుండైన యాప్రహ్లాదుం జూచి జనులు విస్మయం బందిరి; దైత్య

పతికి వార్థి వైచినవారలె విన్నవించిన నతండు విస్మయం బంది మృత్యు
వుంబోలె రావించిన వచ్చి, సభయందు నాసన్నమృత్యుండైనవాని;
నాయుర్జలధివలన దేహపర్యవతారణంబునకుఁ గృతోద్యోగుండై యమ
వీక్షణంబునకు యవనికామాత్రంబైనవాని నీలాంకుమిశ్రమాణిక్య
ద్యుతిచ్ఛన్నుండైనవాని, ధూమాగ్నిశిఖావ్యాప్తుండైనవాని, మలినాంగ
ద్యుతిధ్వాంతచ్ఛాదితాభరణచ్ఛవియైనవాని, విష్ణునిందాజాత
మూర్తాఘగ్రస్యమానలక్ష్మీకుండైనవాని, దంష్ట్రోత్కటఘోరఘోషణ
ఘనచ్చవికుమార్గదర్శయమదూతనిభులైన భటులతోఁ గూడినవాని,
దవస్పృష్టదవనాంతస్థకింశుకారుండైనవానిం జూచి, ఖిన్నుండైన
వాని దూరంబునం బ్రాంజలియై పీఠంబుననుండి క్రుద్ధుండైనవానిం
జూచి తలవంచుకొనిన, దైత్యుండు భర్జించి “మూఢ! మద్వాక్యంబు
విను మింక నిన్ను నెద్దియుం బలుక” నని చంద్రహాసం బంకించి
సభాజనంబు కంపంబు నొంద "హరిని విడిచెదవో! యసిం ద్రెవ్వఁ
జేయుదునో!" యని పల్కు మూర్ఖునిక్రోధంబు చూచి రక్షోగణంబు
నేఁడు ప్రహ్లాదుండు హతుండు నయ్యెడునని పల్కు సమయం
బున హిరణ్యకశిపుండు క్రోధారుణితనేత్రుండై కుమారునిం జూచి
యిట్లనియె.

255


తే. గీ.

"ఎచట వెదకియు నేఁ గాన నిన్నినాళ్లు;
నధికుఁ డంటి, నిరాకారుఁడైనవాని
సర్వగతుఁ డంటి, త్రిభువనస్వామి యంటి,
వెందుఁ జూపెదు హరిఁ జూపు మింక మూర్ఖ!"

256


వ.

అని "స్తంభంబునం జూపు" మని ఖడ్గంబున స్తంభంబుం
దాటించిన.

257

నృసింహావిర్భావము

సీ.

పటపటత్కటుసముద్భటపటుధ్వనివశీ
                       ర్యద్ఘనస్థూణాసభాంతరంబు
చటచటన్నటదుగ్రచటులరంగస్ఫులిం
                       గాచ్ఛాద్యమానగృహాంగణంబు

తటతటస్ఫురదురోదైతేయశలభసం
                       ఘాతప్రతాపనిర్బరతరంబు
కటకటదంష్ట్రాగ్రఘట్టితకహకహో
                       త్తర్జనగర్జాతిదుర్జయంబు


తే. గీ.

భూరిభూషణతీవ్రదంభోళిఘోర
సారవారుసటాచ్ఛటాసంకులంబు
సంభ్రమాదభ్రధరణితలాభ్రతలము
వీరనరసింహరూప మావిర్భవించె.

258


మ.

అతిఘోరార్భటి నానృసింహుఁడు సహస్రాత్యుగ్రబాహావళీ
శతకోటిస్పుటతీవ్రదీప్తనఖరచ్ఛాయల్ విజృంభింపఁ ద
ద్దితిజుం బట్టి నిజాంకమధ్యమున నెంతే నిల్పి చీరెన్ మహా
ద్భుతభీభత్సము లొప్ప నప్పుఁడు ప్రదీప్తోరాంతరాళంబునన్.

259


వ.

ఇట్లు తద్ఘోరనృసింహరూపంబు నున్నయెడ బ్రహ్మరుద్రదిక్పాలాది
సమస్తదేవతలు ముందర నిందిర నిడుకొని వచ్చి దగ్గరఁ జేరన్ వెఱచి
ప్రాంతంబున నున్న ప్రహ్లాదుం దగ్గరం బిలిచి నిన్నుఁ గటాక్షింప
వచ్చిన భగవంతునిం బ్రసన్నుంగాఁ జేయు మనఁ బ్రహ్లాదుండు వికసిత
వదనుండై జనకునికడ కేఁగు బాలకుని చందంబున నిర్భీకుండై
వచ్చినం గౌఁగిటం జేర్చి శిరంబు మూర్కొని నాకతంబున నింత
యలసితివిగా యని యుపలాలింపుచున్నప్పుడు.

260


సీ.

కెందమ్మిరేకులఁ జిందించు కన్నులు
                       కరుణారసంబు పొంకంబు నెఱపఁ
జారు వజ్రాంకురచ్ఛటలైన సట లురు
                       దివ్యకిరీటమై తేజరిల్లు
నాంత్రమాలిక లచ్చహారవల్లికలట్లు
                       విమలవక్షోవిభాగమున మెఱయఁ
దద్వినూతనరక్తధారలు పైఁజింది
                       రక్తచందనచర్చ రంగు చూప

తే. గీ.

జలధికన్యాకుచోపరిస్ఫారసార
భాసురోదారకుంకుమపత్రభంగ
ఖరనఖరకాంతు లెనయ నుగ్రతరమనుజ
సింహుఁ డప్పుడు లక్ష్మీనృసింహుఁ డయ్యె.

261


వ.

అంతఁ బ్రహ్లాదుండు తనతండ్రి భగవంతునిచే ముక్తుం డయ్యెనని
హర్షించి ప్రణమిల్లి యతనిగాత్రంబున నరసురాసురాదులను, శిరం
బున బ్రహ్మాండోపరిభాగంబును, గన్నుల లయార్కపాపకుల, నాస్య
బిలంబునఁ బాతాళంబును, దంష్ట్రల శేషాదులను, భుజద్రుమస్కంధం
బుల బ్రహ్మరుద్రులను దిగీశ్వరులను, హృదయంబున నంబరంబును,
నంబరంబున విద్యుద్విలాసంబును, నంఘ్రుల భూమియుం, దేహద్రవం
బున వారిధులు, రోమంబుల వనంబులు, శల్యంబుల నద్రిసంఘంబులు,
నభేద్యమాయాచర్మంబున సర్వగాత్రంబులదేజంబును గాంచి భక్తు
లకు నీశ్వరుం డప్రకాశుఁడు గాడు గావునఁ జూచి పరమానందంబు
నొందె; నంత దివిజులు మఱియు బ్రహ్మరుద్రాదులు సమ్మతించి
రప్పుడు.

262


దండకము.

శ్రీమన్మహాదేవతాసార్వభౌమా! హరీ! సర్వమౌనీంద్రసందోహ
సంకల్పితానేకయజ్ఞక్రియాసాధనా! స్తోత్రపాత్రా! ఖరోద్యన్నఖో
త్కృత్తదైతేయ! చంచద్దయాదృక్తరంగా! ప్రసన్నాంతరంగా! మహా
వీరదుర్వారరక్షోగ్రణీదుస్తిరస్కారభీతాత్మధామచ్యుతానేకయజ్ఞ
క్రియాదూర! పద్మాననాద్యాతితేయాపనార్థాప్రసిద్ధానుకంపా!
ప్రకాశీకృతోచ్చండదీప్యన్నృసింహావతారాగ్రసారధ్వనీభిన్నఘోరా
భ్రతారా! నిజాంగప్రవిచ్ఛేదభేతిద్రవద్ఘోరరక్షోగహేద్ఘోషభేరీ
రవాధఃక్రియాసారమై, క్షోణిభృత్పక్షవిచ్ఛేదకాలస్ఫురద్ఘట్టనోదగ్ర
దంభోళి దుర్ఘోరమై, భీమకల్పాంతధారాధరోత్తర్జితోర్జత్స్ఫుర
చ్చండగర్జానుకారంబునై యున్న నీగరదుర్జేయ మో తండ్రి! భక్తావళీ
నిర్జితా! పాపసంవర్జితా! యోగిలోకార్జితా! వార్థికన్యాకుచాలింగనోల్ల
గ్నసత్కుంకుమాంకచ్ఛటానేకశంకాకరోనంకశోణోపలశ్రీసమా
విద్ధపూర్ణేందుబింబస్ఫురద్వృత్తసంస్థూలపాండూరుముక్తామణీదివ్య

హారా(!) లసద్దివ్యహారానిబద్ధత్రిలోకైకభారా! సమారబ్ధదైత్య
ప్రహారా! భవాఘౌఘలీలాపహారా! సముద్యన్మహాదానవానీకసంహార
కారా! యుగాంతత్రిలోకాపహారా! యశేషానుభృత్పుణ్యపాపక్రియా
రూపదండాదికభ్రామితప్రోల్లసత్కాలచక్రక్రమాకల్పితారంభవిభ్రా
జితస్థావరాత్మస్ఫురద్విశ్వదాధోరణోద్దండ! వేధోండసద్భాండ
నిర్వాహసత్కుంభకారా! నిరస్తాఖిలాంతర్వికారా! విచిత్రప్రకారా!
త్రిలోకైకసాలానుకారా! యవేద్యాంచితాకార! భిక్షాన్యసద్భోజ్య
మాత్రప్రకాశోరుసంతోషయోగీంద్రపూర్ణాబలోధూతపంచాయుధో
న్మాదనిద్రాదిదారాత్మజస్నేహదుర్లోభలాభాబ్దిబంధచ్ఛిదాలబ్ధ
సౌభ్యోల్లసద్యోగయోగ్యాగ్రణీసన్నిధానా! త్రిలోకీనిదానా! నిరస్త
ప్రధానా! సమాయావితానా! సుశుద్ధాభిధానా! ముఖంబుల్ సరోజం
బులై బాహువుల్ సన్మృణాళంబులై కేశజాలంబు శైవాలమై హల్లక
స్తోమముల్ మాంసఖండంబులై తత్తనుత్రాణముల్ ఫేనజాలంబులై
యొప్పు ప్రత్యర్థిసేనాసరోమధ్యవీథి న్మదోన్మత్తదంతావళశ్రీ విజృం
భింపవే స్వామి! దుష్టప్రభేదీ! విశిష్టానుమోదీ! నిజశ్రేణిదుర్దోష
హారీ! సదాభక్తవాంఛాప్రదా! దేవ! నిర్వాంఛమాయామహానాటకానీక
నిత్యక్రియాసూత్రధారా! నిజాంఘ్రిస్ఫురద్దివ్యగంగాంబుధారా!
మధుక్రవ్యభుగ్రక్తధౌతాసిధారా! సునిష్కామ! సంపూర్ణకామా!
ముకుందా! నమస్తే నమస్తే నమః.

263


క.

అని యానందాశ్రులు తమ
కనుగవపైఁ జిప్పతిల్లఁగా నాదివిష
జ్జనములు వినుతించి జనా
ర్దనువలన వరంబు లంది రంజిలి రంతన్.

264


తే. గీ.

దేవతలు చూడఁ బ్రహ్లాదు దివ్యతేజు
నఖిలదైతేయవీరరాజాభిషిక్తుఁ
జేసె, భాగవతోత్తముఁ జేసె, భక్తి
నిలువఁజేసె జగము వర్ణింపఁజేసె.

265


వ.

అంతఁ బ్రహ్లాదునకు ననేకవరంబు లిచ్చి త్రిలోకశాంతిఁ గావించి సద్వా
ద్యంబులు మ్రోయ నిజధామంబునకు నేఁగె ననిమిషులు పరమానందం
బున నిజమందిరంబులకుం జనిరి మరియు.

266

క.

పరమర్షులు నరసింహుని
చరితము నరసింహహృతవిశంకటదోషాం
తరదోషాంతరవల్లభ
చరితమువలెఁ బొగడరైరి స్వాంతములందున్.

267


వ.

దొరకొని లోకవాదంబులు బలవంతు లాడుకొందురు. యోగీంద్రులకు
వృథాయాసంబులు; వీర లేకర్మంబులు చేసిన సద్గతిఁ గాంచిరి? యజ్ఞం
బులు చెరచి విప్రర్షుల భంజించి మత్తులైన దైత్యులు పరేశునివలన
మృతిం జెంది భవాబ్ధిముక్తు లైరి; ఏ మార్యుల మౌట, ధృతసచ్చరి
త్రుల మౌట, బహిస్థితుల మైతిమి; దైత్యులు విష్ణుసద్గతి నొందిరి;
దురాత్ముండు భృత్యహస్త్యశ్వరధాదులతో నీశ్వరుని పూర్వంబుల
నారాధింపనోపు; నొకానొకభక్తినిరతుండు ప్రహ్లాదునికంటె నధికుం
డని, కృతార్థుం డని తీర్థాంతరంబులకుం జనిరి. ప్రహ్లాదుండు భగవ
దాజ్ఞను రాజ్యంబు సేయుచుఁ దద్రాజ్యభోగతృష్ణ నొందక, జ్ఞానాచ్యు
తాంఘ్రిభక్తి రాజ్యం బనుభవింపుచుండె; నీచరిత్రంబు వినినవారికి
రోగగ్రహదారిద్ర్యతాపంబు లణంగు ననిన విని నైమిశారణ్యమహ
ర్షులు సూతునిం జూచి యిట్లనిరి.

268


శా.

ఆదైతేయుఁడు శౌరిగాఁ దలఁచి యార్యాదిత్యయజ్ఞక్రియా
సాదం బెప్పుడుఁ జేయ నాగమము లాచ్ఛాదించు తచ్చక్రహ
స్తాదేశంబు లటంచు భోజనపిపాసారంభనిద్రావిహా
రాదు ల్సేయుచు నమ్మురాంతకవిరోధార్థంబు మానుం డిలన్.

269


క.

అతిబద్ధమత్సరంబున
నతఁ డుద్ధతిఁ గలలనైన హరి గెల్చి రణ
క్షితిఁ దరమితి ననిఁ హర్షా
న్వితుఁడై యంతఃపురమున నృత్యము లాడున్.

270


తే. గీ.

అతఁడు హాశ్యాంతరములకు హరికథామృ
తంబు వీనులు చొరనిచ్చు తలఁచు నామ
ధేయములు జిహ్వఁ జేర్చు విధేయులైన
భృత్యవర్గంబుఁ దాను నిర్భీకుఁ డగుచు.

271

తే. గీ.

ఇట్లు దైత్యేశ్వరునిక్రోధ మెల్లకార్య
ములయెడను శ్రీరమాజాని తలఁపఁజేసె
సద్గురుఁడు సంతతజ్ఞానశాలియైన
నరుని బోధించి నిలిపిన నలువు మెఱయ.

272


వ.

అటుగాన క్రోధావిష్కృతంబైన హరిస్మృతియు దైత్యునింద లంపంజేసె
నేమి చెప్పుదు. వీఁడు దశాననుండై శిశుపాలుండై జనియించి రామ
కృష్ణావతారంబులచేఁ బొలిసి పునర్జన్మంబు నొందఁడు. కృష్ణాశ్రయం
బైన క్రోధంబును, గృష్ణాశ్రయంబైన కామంబును, దైత్యులకు గోపిక
లకు మోక్షహేతువు, కేవల కామక్రోధములు జనుల కధఃపాత
హేతువు లహిదంష్ట్రలయందు సుధయుంబలె, చోరహస్తంబు
లందు ధనంబునుంబలె స్మరరోషంబులచేత నొంద రీముక్తికి నేమి
యద్భుతంబు కారణంబు హరిస్మృతియే. ఆహరిస్మృతియే స్మర
ద్వేషభక్తివిశేషంబులయం దుదయించు; నిష్టంబులు గాకయు
నౌషధంబులు ద్రావి రోగి యారోగ్యంబు నొందినట్లే నరుండు హరి
స్మృతివలన భవబంధంబులు వాయు; ద్వేషంబుననేని మృదర్ధంబుగా
భూమిం ద్రవ్వి నిదానంబు గనినయ ట్లజుండు కామక్రోధంబులనేని
హరిస్మరణంబు చేసి మోక్షంబు నొందు. అప్రయత్నంబుననేని ద్వేషం
బుననేని వైచిన ననలంబు కక్ష్యాంతరంబు దహించినయ ట్లనాద
రంబున నర్చించిన గిల్బిషంబులం బాయు; నజ్ఞుం డశ్రద్ధనైన సుధా
పానంబు చేసి వజ్రకాయుం డైనయ ట్లశుద్ధభావుండేని ముక్తుం డగు.
ఇది వస్తుస్వభావంబు. సూర్యుండు తమోనాశనంబునకు, శీతశాంతికి నన
లంబు నైనయట్లు, సర్వేశ్వరుండు లీలాప్తహృదయుండై ద్వేషులకు
మోక్షం బొసంగను, అనురక్తులకు నిష్టవరంబు లొసంగను సన్నద్ధుఁ
డైనవాఁ డద్దేవయోగంబునకంటె భక్తియోగంబు ప్రశస్తంబు; ఘోరం
బులైన మోక్షవిఘ్నంబులవలన హరి తానే రక్షింపుచునుండుఁ గాన నిటు
వంటి కరుణాసింధువు నాశ్రితవత్సలు నెవ్వం డాశ్రయింపండు? పాపా
త్ముండైన యాత్మద్రోహి యాశ్రయింపండు గాక! సదా సూర్యుండు
బహుయోజనసహస్రంబు లక్షణంబునఁ బోవుచు వేగంబునం జనుల
యాయువు క్షయింపంజేయు; నార్తప్రమత్తసుప్తవ్యాధితు లైనవారి
నుష్ణధాముండు హ్రాసంబు నొందించుం గాని విడంబంబు సేయండు.

వేగవంతంబైన కాలచక్రంబుచే సదా త్రిప్పంబడి జీవుండు యోనిసహ
స్రంబుల జనియింపుచుండుఁ గాని నరుండై యుండుట నిత్యంబు గాదు;
జనుం డొప్పు యెల్లియో యెల్లుండియో మృత్యు వాసన్నం బని యెఱుం
గఁడు; జన్మమరణనరకక్లేశంబులు ధ్రువంబులు స్వాస్థ్యంబు లేదు
గాన బ్రతికినయన్నినాళ్లు హరిభజనంబు సేయవలయు ననేకజన్మంబులు
గాంచి కర్మభూమిని మనుజుండై జనియించుట నెన్నం డిటువంటి జన
నంబు నొంది వృథాప్రయత్నంబున నుండుట దగునె? నరులలో
విప్రత్వంబు నొందుట మిగుల దుర్లభంబు. తద్విప్రత్వంబు నొందియు
హరిభజనంబు లేక యుండుట దగునె? వ్యాధివ్యాఘ్రగ్రస్తంబైన
తాపత్రయమహోగ్రమృగసింహభయంబైన సంసారాతివనంబునందు
నరునికి రక్షాన్వేషనంబు సేయక క్రీడించఁదగునే? విషయవ్యాధిమహా
సర్పంబులతో భవతరుకోటరంబుల నుండి పురుషుం డనుగ్రహంబున
నిర్భయుండై గరుడవాహను నాశ్రయింపక యుండంజెల్లదు గానఁ దొల్లి
సురరూపంబున సుధాపానంబు సేయుచు విఘ్నంబు శంకించు రాహు
వున కైనయట్లు భజింపుచు శంకించిన హరి దుర్లభుండగు మనంబునం
దలంపవలయు; కరంబునఁ బాదార్చనంబు సేయవలయు; శ్రోత్రంబుల
దత్కథలు వినవలయు; దద్యశంబు భావింపవలయును; నేత్రంబులఁ
దత్ప్రియులైనవారిం జూడవలయు; పాదంబులఁ దత్పుణ్యక్షేత్రంబులు
ద్రొక్కవలయు; ని ట్లన్నిదినంబులు గడుపుచునుండువాఁడు బ్రతికిన
యతండు అట్లు సేయండేని వాఁడు జీవచ్ఛవంబు మక్షికామశకకాక
ముఖ్యంబులైన క్షుద్రజంతువులు కోటులకొలందులు బ్రదుకవే! కామ
మోహంబులు విడిచినవారు వైష్ణవులు. యోజనశతంబుల నున్న మర్త్యుం
డైన గంగాతరంగిణీనిజాంఘ్రిసంస్పర్శపవిత్రయైనదానిం దలంప
నఘశతంబులు దరింపంజేసిన నారాయణు భజింపుఁడు. హరిభజనం
బెవ్వండు సేయు నతండె సమస్తజనుల పాపంబులు హరించు. దీపం
బులు లేక యుండిన గృహంబులనేని దిననాథుం డుదయించి తమంబు
హరించునట్లు సందర్శనస్పర్శనపూజనంబులచేతఁ గుశలుండై న
భాగవంతుఁడు విష్ణుప్రతిమయుంబోలెఁ దమంబులు హరింపుచు దీపం
బుంబలె బరహితం బాచరింపవలయు లోకంబున.

273


క.

అనిన విని శౌనకాదులు
మనమున హర్షించి దైత్యమథనకథావ
ర్ణనసంశ్రవణకుతూహల
జనితోల్లాసమునఁ జనిరి సంరంభమునన్.

274

మ.

సతతస్వాశ్రితమందిరాంతరము హుస్సంగోప్యగోత్రాగ్రణీ
రతిసంధానవిచిత్రమోహనకళారాసేహసేహాస్మర.........
......................................................................
......................................................................

275


క.

గోపతిగమనస్తోత్రా!
గోపతికృతవర్షధృతసుగోత్రచ్ఛత్రా!
గోపాంగనాకళత్రా!
గోపార్భకవత్సరూప! గురుతరసూత్రా!

276


మాలిని.

కుముదహితకులేశా! కోటిసూర్యప్రకాశా!
విమలకమలనేత్రా! విస్ఫురన్నీలగాత్రా!
భ్రమరచికురజాలా! భక్తచిత్తాబ్జఖేలా!
సమదఖిలవిదారీ! సర్వలోకాపహారీ!

277

గద్యము
ఇతి శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడ నరసింహప్రణీతంబైన
నారదీయపురాణంబునందు నష్టమాశ్వాసము
సర్వంబును సంపూర్ణము.

  1. హిరణ్యకశిపుని భార్య
  2. బుట్టినఁ బుట్టి
  3. నవి నీకు నాయుష్కరంబు
  4. ఘనాధున
  5. వరమత్సరమున బాలార్కు
  6. ఫలదసపుష్పాత్రత్వ
  7. దుష్కర్మ
  8. మవాగజ్ఞాన
  9. గ్రణి
  10. మూషక
  11. తృషా
  12. సుతీష్ణలవణంబులగు
  13. వస్తుభోజ
  14. లోకంబునందు
  15. లిట్టి
  16. నతని
  17. నెదురఁ
  18. బగు
  19. బగు
  20. మందె
  21. సురభి నిర్హ్రాదంబు చేరకయుండు
  22. వంతుండు
  23. ఫణంబులు
  24. వీని నీక్షించి
  25. నిందించెడు నే పరమా
  26. నిధానంబవై యధిష్టించి
  27. పర్విష
  28. యితనిపై
  29. ఇక్కడ ఒకపేజీ వచనము మధ్యలో లేదు.