నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/6-వ అంకము
6-వ అంకము
[ ప్రతాపుడు ప్రవేశము ]
ప్ర : ఇది భయానకరూపం. మీ కేదో భయంకరంగా వుంటుంది. కాని నాకు అన్నిరసాలు వొకటే. నేను అనేక మార్గాల లోకసంహారం చేస్తూవుంటాను. ఒకరయిలు పడదోస్తా -- అనేకమందికి కాళ్ళు, చేతులు, మెడలు, విరుస్తా. ఒక అడవికి అగ్గిముట్టిస్తా — వేలజంతువులను మాడుస్తా. ఒకప్లేగు దెప్పిస్తా - లక్షులను చంపుతా. నా కేమయినా విచారమనుకొన్నారా ? ఇవన్నీ ఆనందంగా చేస్తా. నేను ఆనంద దాయకుణ్ణి.
[ నిష్క్రమణం ]
2-వ రంగము
కారెంపూడి
[ నలగామరాజు, నాయకురాలు ప్రవేశము ]
నల. రా : అలరాజు కండ్లలో మెదులుతున్నాడు. అల్లు డయినా అతడే, కొడుకయినా అతడేకదా అనుకున్నాను. ఇటు ఘోరవిచారమూ, అటు అపవాదమూ కూడా భరించలేకుండా వున్నాము.
నాయ : పుణ్యం, పాపం దేవుడికి దెలుసు. నోరుముయ్య మూతలేదు. నరసింగరాజుగారిమీద వాండ్లు నిందమోపారు.
నర : అది నే నెప్పుడూ నమ్మను. అతడు చంపవలసిన అవసర మేమి వచ్చింది ? అతడిద్వారా రాజీకూడా కుదిరేది.
నాయ : ఈ అపవాదుచేత ఆయనమనస్సు చాలా వైకల్యం బొందింది ; సేనల నన్నిటినీ నడపవలసిన వాడు. నల. రా : ఎవ రేమనుకున్నా నాయం దతనికీ, అతనియందు నాకూ భేదభావం లేదు.
నాయ : వాస్తవం. రెండుజాములయింది. యుద్ధభూమినుంచి యింకా మనుష్యులు రాలేదు.
నల. రా : వాకిట్లో చప్పుడౌతున్నది. ఎవడురా అక్కడ ?
నౌ : ( ప్రవేశించి) రణభూమినుంచి చిన్నదొరగారు వచ్చారు. మిమ్మును చూడగోరుతున్నారు.
నల. రా : తక్షణం రమ్మను.
[ ఝట్టిరాజు ప్రవేశము ]
ఝట్టి : అన్నయ్యా, నమస్కారము.
నల. రా : విజయోస్తు. సమాచారము లేమి ?
ఝట్టి : అలరాజు మరణవార్త శత్రుశిబిరములో తెలియంగనే యుద్ధప్రకటనలు లేకనే బ్రహ్మనాయుడు వారించినా వినక బాలుడూ, అతని అనుచరులూ తోక దొక్కిన తాచులవలె లేచి, రణభేరి వాయించి, యుద్ధమునకు బయలు దేరడమూ ఇక విధిలేక తక్కినవారందరూ వారివెంట బయలుదేరడమూ మీరెరిగిన విషయమే.
నల. రా : అవును తెలుసును. బాలుడు బలుదుడుకుపిండము.
ఝట్టి : చెల్లాచెదరుగా బయలుదేరిన సైన్యము లన్నిటినీ బ్రహ్మనాయుడు మార్గమధ్యమున నిలువరించి, మొగ్గరముగా నమర్చి, కారెంపూడిలో గంగధారిమడుగుదగ్గర విడిసివున్న మనసేనలమీదికి బయలుదేరాడు.
నల. రా: తరువాత? వారి వెంట ఝట్టి : తరువాత, ఆహవపాండిత్యమున నారితేరిన నరసింగభూపతిచేత నడుపబడుతూ, వీరాధివీరుడయిన మాడుగుల వీరారెడ్డిచేత అభిరక్షితమయిన మన సేనలన్నీ శకట వ్యూహముగ నమర్చబడి, గంగధారిమడుగు ఉత్తరంగితయై పొంగిపొరలినట్లు గన్పడినది.
నల. రా : అంత నేమయినది ?
ఝట్టి : యుధిష్ఠిర ప్రతిముడయిన....
నల. రా : శత్రువును ప్రశంసించడమూ వీరలక్షణమే .
ఝట్టి : బ్రహ్మనాయుడు ఆహవదోహలుడైన కన్నమదాసునూ, అభిమన్యుకుమారుంబోలు బాలచంద్రుడునూ ముందు నడువగా, అరిభయంకరమయి శత్రుసేన గరుడవ్యూహముగ నమరి మన సేనల ముట్టడించగా సముద్రము లుప్పొంగి ఒండొంటిం దాకినట్లు గన్పడినది.
నల. రా : ఇట్టిదృశ్యములు వీరులహృదయాలను పొంగ జేస్తవి.
ఝట్టి : అంతట ఉభయపక్షములూ వచ్చందాలు బడ్డట్టు యుద్ధము ప్రారంభించక కొంతవడి పూరకున్నారు. బాలు డీ దుస్సహమయిన విరామమును విరమింపజేసి నారాచమొకటి విడువగా ఒక్కుమ్మడిన మన సేనా సముద్రమంతటను అంపజల్లు గురిసినది. మస వారి కవి చిటి చినుకులప్రాయమై సరకుసేయనట్లు గనుపట్టి నా అమ్ములు కుప్పతిప్పలై జడివానగా శత్రువులపై గురిసినవి, ఇట్లు కొంతవడి అమ్ములతో చెర్లాటలాడి, వెట్టబుట్టి, విండ్లు బుజములకు దగిలించి, కృపాణములు, సన్నీలు, బరిసెలు చేతికి దీసికొని తారసిల్లి ముహూర్తమాత్రములో దేహములు గడికండలుగ గోసుకొనసాగారు. రణరంగమంతా పుఱ్ఱెలమయమయినది. సైనికు లవి చూచి వొళ్లు మరచి వున్మత్త పిశాచములవలె ఒండొరులు దలపడి, హతము గావించుకొని పనలు పనలుగా పడిపోయినారు. సేనాముఖమంతా పలచబడ్డది. తుదకు తెగిపడిన మొండెములు దప్ప, సవ్యముగ వున్న కళేబర మొక్కటీ గన్పడలేదు. శవముల కుప్ప లడ్డమయి సైన్యము ముందుకు సాగివచ్చుటకు వీలు జిక్కక కొంతవడి యుద్ధము నిలిచిపోయినది.
య : రణరంగ మెంత బీభత్స మయినది ? నే వెళ్లి పాల్గొనిన బాగుండు. నా కవకాశము కలుగకముందే యుద్ధము ముగుస్తుందేమో?
నల. రా : తొందరపడవద్దు. తరువాత నేమి జరిగినది ?
ఝట్టి : యుద్ధమును సువ్వీ అని మొదలుబెట్టిన బాలచంద్రుడే, చాకల చందన్న, మంగలి మంచన్నలను రెండుపక్కల నిడుకొని, పీనుగుల తిప్పలెక్కి దుమికి అడ్డమువచ్చిన సైనికుల చించి చెండాడుతూ, మన వాహినీపతి యయిన చింతపల్లిరెడ్డిని దలపడగా ఆత డా మువ్వురు వీరులతో కొంతవడి పోరి పాటవము చెడి పలాయనము కాబోగా మన చమూపతి కొదమగుండ్ల నరసారెడ్డి బాసటయినాడు. బాలుని కడ్డము వచ్చి, చిత్రగతుల యుద్ధపాండిత్యము జూపి, రెండమ్ములు బరపి చందన్నను సమయింపజేసి, ఈటెపోటుతో మంచన్నను నేలకు దెచ్చాడు. వారి ఇర్వురిపాటు జూచి బాలుడు తోకతొక్కిన తాచై నరసారెడ్డి నొడిసి పట్టుకొని ద్వంద్వయుద్ధమునకు దలపడగా పెద్దమలినీడు చింతపల్లిరెడ్డికి అడ్డము వచ్చాడు. రెడ్డియును నిలువరించుకొని యెదురుతిరిగి రాగా కొంతవడికి బాలచంద్రు, డా నరసారెడ్డినీ, మలినీడు చింతపల్లిరెడ్డినీ మడియించి యిద్దరూ యేకమై మన తూర్పుసైన్యములం దాకగా నలగొండ బాపన్నా, కోలంకి వీరాస్వామీ, పొదిలె బాపన్నా వారి కడ్డుపడి సైన్యముల రక్షించుకొన్నారు.
అప్పటికి రెండుజాములు కావచ్చినది. భానుప్రభల నినుమడించి గండరగండడని పేర్వడిసిన మాడుగుల వీరారెడ్డి ఆరితేరిన ఆహవపాండిత్యముకు మొక్కవోని ప్రతాపము బాసటగా శత్రుసైన్యములపై బడి నుగ్గు నూచముగ జేస్తుండగా, సేనాపతు లెంతప్రోత్సహించినా నిలువలేక పారిపోవు సేనలను మరలించుకొంటూ పిన్నమలిదేవుడు అడ్డమై మాడుగుల జోదుయొక్క ప్రతాపాగ్నికి ఇంధనమై ఒక్క నిముసములో సమసిపోయినాడు.
నాయ : ఇది బ్రహ్మనాయుడికి మొదటిదెబ్బ.
ఝుట్టి : రాచకొడుకు పడంగానే బాలునిసైన్యములో హాహా కారములు చెలరేగినవి. విచారం, కోపం, డంబము వర్ణనాతీతమయినవి. బ్రహ్మనాయుని సేనాసముద్రపు కెరటములన్నీ, మాడుగుల వీరుడను పర్వతముపై గొట్టనారంభించినవి.
నల. రా : ( ఆశ్చర్యముతో ) వీరడే వీరుడు.
ఝట్టి : మబ్బులుగప్పిన మార్తాండునివలె వీరారెడ్డి సైనిక సమూహములో మరుగైపోయినాడు. మన వీరులందరు త్వరపడి వీరారెడ్డికి బాసటయైనారుగాని వానిం జేరలేక పోయినారు. కొంతవడికి వీరారెడ్డి విరమించెనని శత్రువుల సింహనాదములు ప్రకటించినవి. మనసైన్యము గ్రహణము గప్పిన పగటివలె కాంతిహీన మయినది. విరామఘంట వినబడగానే యెవరిశిబిరములకు వారు పోయినారు. నే నిట వచ్చాను.
నల. రా : వీరారెడ్డికి వీరోచితమరణము సంభవించినది. అతడు లేనిలోపము మనము నివర్తిచేయలేము.
ఝట్టి : సెలవిండు. రణరంగమునకు వెళ్లుతాను.
(నిష్క్రమణం)
నల. రా: ఏ మా కలకలము ?
[ఝట్టిరాజు తెరలో)
యోధాగ్రేసరులారా ! తమ్ముని మరణముచే క్రోధమూర్తియై మలిదేవభూపతి అలరాజు మరణమునకై కసిబట్టివున్న బాలచంద్రుని బాసటచేసుకొని బహుళ సేనాసమేతుడై నరసింగభూపతి నొంటరిగా దాకి పట్టుకొనబోతున్నాడు. బిక్క మొగంబులు వైచుకొని పరువెత్తెద రేల ? మాడుగులరెడ్డి మరణించుటచే అసహాయుడై సేనల గోల్తలు సేయలేకున్న సేనాధ్యక్షుని విడిచి పారిపోయెద రేల ? ఓరీ పాపులార ! బాలుడు పట్టనే పట్టినాడు. అయ్యో, యెంతకష్ట మెంతకష్టము ? సేనాధ్యక్షు డిట్టి దిక్కులేని దుర్మరణమునకు లోబడుట విధినియతిగదా !
నాయ : (లేచి) తే తెమ్ము. ఓరీ! పిరికిపందలారా! నాగాంబిక ఖడ్గము ధరించివుండగా నరసింగభూపతి కెట్టి విపత్తును కలుగ జాలదు. పారిపోయి కలకాలము జీవించగలరా?
(నిష్క్రమణం)
[ ఝట్టి తెరలో ]
కోటకేతురెడ్డి మరలించినా మరలక సైన్యములు విరిగినిర్వీర్యమై పారిపోతున్నవి. ఆహా ! నరసింగభూపతి వీరస్వర్గము నందినాడు.
నల. రా : అయ్యో ! తమ్ముడా! నాయందే నీ ప్రేమంతా వుంచి లక్మణుడు శ్రీరాముని గాచినట్లు న న్నింతవరకు కాచి, రక్షించి న న్నిపుడేల విడిచిపోయినావు? నీవు లేని రాజ్యము నా కెందుకు? నీకై పోరాడబోయిన నాయకురాలికి బాసటై శత్రుసంహారము గావించి నీ ఆత్మసంతృప్తి గలిగింతునుగాక !
ఝట్టి : ( ప్రవేశించి) అన్నయ్యా ! నీ విక్కడనే వుండు. నేను నాయకురాలికి తోడై చినఅన్నయ్యకు దుర్మరణము గలిగించిన యా హంతకుల నంతమొందించి వస్తాను.
నల. రా : తమ్ముడా ! అనాథయై వున్న పల్నాటిరాజ్యమునకు నీవే అధిపతివి గమ్ము. ఇచ్చటనే వుండుము. తమ్ముడు లేని రాజ్యము నాకేల?
ఝట్టి : కాదన్నయ్యా ! నే బోతాను.
నల. రా : వద్దు. ఇది నా యాజ్ఞగా శిరసావహించుము.
ఝట్టి : వద్దన్నయ్యా.
నల. రా : అసహాయుడనై వున్న నా ఆజ్ఞను నీవూ పాలించవా?
ఝట్టి : చిత్తము. మీ యాజ్ఞ శిరసావహిస్తాను.
నల. రా : ఎవడురా! తేరు....
[ నిష్క్రమణం ]
2 - రంగము
కారెంపూడి
[ బ్రహ్మనాయుడు, కొమ్మరాజు : పవేశము ]
బ్రహ్మ: నరసింగరాజుయొక్క మరణవార్త విన్నప్పటినుంచీ నా కావేదనగా వున్నది అలరాజు, పినమలిదేవుల మరణములకే మనసున నొగిలిపోతుంటే గోరుచుట్టుమీద రోకటిపో టన్నట్టు నరసింగరాజుమరణము వీరితోపాటు సమానదుఃఖమునే కలిగిస్తున్నది.
కొమ్మ : అతనిమీద అలరాజును చంపించాడనే క్రోధం మన పిల్లలకు పూర్తిగా వున్నదిగాని సత్యం దేవు డెరుగు. తమ్ముడు పోయినవార్త విని పెదమలిదేవుడు యుద్ధానికి పోయినాడు. ఇదేమి కొంపముంచుతుందో !
నౌ : ( ప్రవేశించి ) మంత్రి మహాప్రభూ ! ఘోరదుర్వార్తలు చెప్పవలసివచ్చినందుకు వెరుస్తున్నాను.
బ్రహ్మ : దేనికయినను వొడిగట్టుకొని సిద్ధముగానే వున్నాను. వెరవక చెప్పు.
కొమ్మ: రాజు క్షేమముగ నున్నాడుగదా !
నౌ : ఆయనమట్టుకు క్షేమమే కాని మన పక్షమున పేరుగల నాయకులందరు పడిపోయినారు.
బ్రహ్మ : అదియేమి ? చెప్పు, చెప్పు.
నౌ: నరసింగరాజు పడిపోంగనే నాయకురాలు సర్వసేనాధిపత్యము వహించినది. అగ్గికి కరువలి తోడయినట్లు రా జామెకు బాసటైనాడు. అది యేమిచిత్రమోగాని అది మొదలు పారిపోతున్న వారి సైన్యములన్నీ కోల్తలై ఘోర సంగ్రామమునకు దార్కొన్నవి. నరసింగభూపతి మరణమునకు కారణమయిన బాలచంద్రునిపై నాయకురాలు, కేతురెడ్డి, కోలంకి వీరాస్వామి, పొన్నాళ్ల రామానాయుడూ, పొదిలె పాపన్నా, కల్వగుంట కాశీపతీ మొదలైన వీరానీకమంతా ఒక్కుమ్మడిని దలపడ్డారు. బాలచంద్రుని యుద్ధమును ప్రత్యేకము వర్ణించడముకంటె పద్మవ్యూహమునాటి అభిమన్యుని యుద్ధమును మించినదని చెప్పితే చాలును.
బ్రహ్మ : ఇతరులెవ్వరూ అతనికి తోడ్పడలేదా ?
నౌ : బాలు డొంటరిగ నుండుటంగని తమ సోదరులైన పేరినాయుడూ, సూరినీడూ పొంగివచ్చే సేనాసముద్రమున కడ్డమై ఒక్కగడియ ఘోరముగ పోరాడారుగాని నాయకురాలి ఘోరనారాచములకు బలైనారు.
బ్రహ్మ : ఆహా ! యేమి వారి పుత్రవాత్సల్యము. బాలచంద్రుడు వంశనాశనకారుడని జ్యోతిష్కులు చెప్పినది వాస్తవమయినది.
నౌ : అంతట బాలు డొక్కడే వారి క్రౌర్యమున కగ్గమయినాడు. పలువురు క్రూరనారాచముల బరపీ, ఈటెలతో బొడిచీ, నిరాయుధుం జేసీ, అంతమొందించారుగాని యా బాలుని పరాక్రమప్రదర్శనము నరులకేకాక దేవతలకూ అద్భుతాశ్చర్యముల గొల్పినది.
బ్రహ్మ : బాలచెన్నా ! ని వల్పాయుష్కుడవయినా నీ కీర్తి ఆచంద్రతారార్కము విలసిల్లుతుంది !
నౌ : కన్నమదాసు యెంత ప్రయత్నించినా నాయకురాలి సైన్యము లడ్డుపడడంచేత బాలచంద్రుని జేరలేక , తుద కాతని మరణవార్తనుగూడ విని కసిమసగిన కోల్పులివలె నాయకురాలిపై కురికి ఆమె రథ్యలను, సారధిని అంత మొందించి రథముపై దుముక నుంకించాడుగాని....
బ్రహ్మ : ఇప్పుడేమి ప్రయోజనము ? ఆమె చేయదలంచిన దంతా చేసినది. సంకల్పసిద్ధురాలు.
కొమ్మ : ఇంతలో ఏమి జరిగినది ?
నౌ : బాలుని జంపిన సైన్యములన్నీ పెదమల్లభూపతిపై తిరుగగా, కన్న డామెను విడిచి, బాలుని మరణముచే భయపడి పరుగెత్తుతున్న స్వసైన్యముల బురికొల్పుకొని, రాజు రక్షణార్థమై బరుగెత్తగా, నామె కేత రెడ్డి రథముపై నెక్కి మల్లభూపతిపై దిరిగినది.
బ్రహ్మ: ఇంకెక్కడి మల్లభూపతి ? మన మిక్క డెందుకు ? పోదాము లెండి.
[ క ల క ల ము ]
[ కన్నమదాసు - తెరలో ]
చమూపతులారా ! అట్లు పిరికిపందలై పారిపోతారేల ? మల్లభూపతి యిక్కట్టులో నుండగా ముందంజ వేయరేమి ?
బ్రహ్మ : ఎవరురా ? రథము, రథము.
క. దా : ( తెరలో) కుమారా ! ఎంతచెప్పినా వినకపోతివిగా. ఎవరూ నామాట విని ప్రభువునకు తోడ్పడేవారు లేరా ? మాచర్లమండలాధిపతి, పేర్వడిసిన వీరానీకమునకు నాథుడయిన రాజాగ్రణికే దిక్కులేని చావు సంభవించినదా ? అయ్యో ! యెంతకష్ట మెంత కష్టము?
బ్రహ్మ : సేనాధ్యక్షుని మాట వినువారుకూడా లేక పోయిరిగా ! అంతయు ముగిసినది. మన కిక ప్రపంచముతో ? నేమి సంబంధమున్నది ? నాఅన్న వారందరూ పోయినారు. మనము ఆయుధపాణులమై క్షత్రియోచితమయిన మరణమును బొందుదాము రండు. (నిష్క్రమణం )
[ మరలవచ్చి ]
బ్రహ్మ : అయ్యా ! ఏల పరువెత్తుతారు? మన కిహలోక సౌఖ్యము లేకున్నా పరలోక సౌఖ్యమయినా కావలదా ?
[ వెళ్లి, మరలవచ్చి ]
ముందుకు పొండి. పారిపోకండి.
[ వెళ్లి పోతాడు ]
[ ప్రతాపుడు- ప్రవేశము ]
ప్రతా : ఆనందం. బ్రహ్మానందం. మహదానందం. నరకండి. చంపండి. కొయ్యండి. ఎక్కడా ఇదేపని. నేను నటరాజును. నా పల్నాటినాటకము పూర్తవుతున్నది. శృంగార పురుషుడనై యమునాతీరమున తాండవమాడాను. ప్రతావుడనై కురుక్షేత్రములో, లంకాపురములో విహరించాను. శృంగారపురుషుడు ప్రపంచం సృష్టించడంలో తాండవమాడుతాడు. నేను లయించడంలో తాండవమాడుతాను. నా లీల చూడండి.
ప్రళయ గీతము
వరాళి - ఖండగతి
ఓ భైరవీదేవి - ఓ భద్రకాళి
భేతాళకాటిగా - పెదపోతరాజు
పుఱ్ఱెదండలనొప్పె - భువనైకమాత
శింబోతుచౌడమ్మ - చెండి శివసత్తి
కంఠాలు నులి పేటి - కంబాలనాగి
మారెమ్మ అంకమ్మ - మద్దిరామమ్మ
రండెఱ్ఱపోదాము - రణరంగమునకో.
కఱ్ఱలు అంబులు - గండ్రగొడ్డండ్లు
ఈటెలు బాకులు - విచ్చుకత్తులును
పెద్దఫిరంగులు - భిండివాలములు
రంపాలు బరిసెలు - రహినొప్పబట్టి
ఆవేశపరవశు - లైన సైనికుల
కొవ్విన గుఱ్ఱాల - గొఱ్ఱెపొట్టేళ్ల
వీరుల రొమ్ముల - ఏనుగుతలల
చిదిమి ముక్కలుగాగ - చీల్చుతున్నారో.
కారేటి రక్తాన్ని - కలగల్పు జేసి
కడవల బానల - గాబులనిండ
పట్టించి వుంచుతా - పానకంబునకు
తందనాలాడుతూ - తాగుదురుగాని
తలకుబోసుకొనండి - తానమాడండో.
కోట్లాదిశవముల - కోయించినాను
కుప్పలువేయించి - కుళ్లిపోకుండ
యెండ బెట్టించాను - కొండలయెత్తు
పీనుగుగుట్టల - పీటలమర్తు
కేరింతలాడుతు - కేకిసలుగొడుతు
బువ్వపుబంతుల - పొలుపుమీరంగ
తిని తిని మీరెల్ల - త్రేపంగవచ్చో.
కండల ముక్కలు - కాగులబట్టి
కుమ్మున బెట్టించి - కొద్దిగాకాచి
కరపచ్చిముక్కల - కమిలిపోకుండ
కొత్తనెత్తుట ముంచి - కోరలబట్టి
చెలిమెలరక్తము - చిమ్మికారంగ
పలలఖండములను - భక్షింత్రుగానో,
పుఱ్ఱెలనెల్లను - పోగుపోయించి
తేరిననీళ్లలో - తెల్లగా గడిగి
పెట పెటలాడంగ - పేలాలువేచి
పొడిపిండిగొట్టించి - బొక్కుదురుగానో,
కోట్లాదిశవముల - గుడ్లు వొలిపించి
నులివెచ్చరక్తము - నూనెయు గలిపి
గంగాళములబట్టి - కనిగుడ్లుబోసి
గట్టిపకోడీల - కరణివేయించి
భేతాళగణముకు - బెట్టింతు విందో
[విరామఘంట]
నా లీల నా కానందం.
[ నిష్క్రమణం ]
3.వ రంగము
శిబిరం
[ బ్రహ్మనాయుడు, కొమ్మరాజు ప్రవేశము ]
బ్రహ్మ: అంతా చల్లబడ్డది.
కొమ్మ : కాగి చల్లారిన కాడున్నట్లున్నది.
కేతరాజు : ( ప్రవేశించి) అయ్యా ! నమస్కారం. బ్రహ్మ : అంతా ముగిసినదిగదా. విరామఘంట మాకు వీర పురుషోచితమయిన మరణమునుగూడ లేకుండ జేసినది. బ్రతిమలాడినా మమ్ము చంపేవారు లేరు. మీ రేమిపనికై దయచేశారు?
కేత : నలగామభూపతీ, నాగాంబికా తమ దర్శనమునకే వస్తున్నా రు.
బ్రహ్మ : శత్రుశేష ముంచరాదని వస్తున్నారుగాబోలు. మరణము మాకూ ఆనందదాయకమే. ఏదిరా కత్తి!
కేత : వారు పోరాటమునకు రావడంలేదు. తమ్ము క్షమింపుమని వేడుకొనుటకోసం వస్తున్నారు.
బ్రహ్మ : క్షమాపణేల ? క్షత్రియోచితమయిన తమ ధర్మమును వారు నేరవేర్చారు. విజయలక్ష్మి వారిని వరించినది. తప్పక వారి నిచ్చటికి దోడ్కొనిరండు.
[ నలగామరాజు, నాయకురాలు ప్రవేశము ]
నల. రా : అయ్యా ! నమస్కారము.
బ్రహ్మ : శుభమస్తు.
నాయ : మాయం దెన్నిలోపములున్నా క్షమించి మమ్మాశీర్వ దింపుడు.
బ్రహ్మ : ఆశీర్వాద మిదివరకే యిచ్చాను. తప్పులు క్షమించే వాడు దేవుడు.
నల. రా : మనలో మనకు అంతఃకలహములు కలిగినందుకు విచారపడుతున్నాను.
బ్రహ్మ: దానికి ఉభయవక్షములూ విచారించవలసినదే. ఒకరి ననవలసినపని లేదు. నల. రా : ఉభయపక్షములా ఆప్తులూ, బంధువులూ యెందరో నశించారు. అది తీరనికొరత.
బ్రహ్మ: అది విధినియతి,
నల. రా : ఇకముందు జరుగవలసిన విధానమును తమరు నిర్ణయించ కర్తలు.
బ్రహ్మ : ఏకచ్ఛత్రాధిపతులై పల్నాటిని మీరు పాలించగోరుతాను. అది భగవద్విధానమని స్పష్టపడినది. శేముషీధురీణ యయిన నాగాంబికకంటె సమర్థులయిన మంత్రులు వేరొకరు నాకు గన్పడరు. పల్నాటియందు ఆమెకు మిక్కిలిప్రేమ.
నాయ : మంత్రిపదవికి అర్హులు తమకంటె వేరొకరు లేరు. ఈ భారము తాము వహించవలసినదని మా ప్రార్థన. నేను నా పశువులను, పశుపతిని సేవించుకో బోతాను. అదియే నే మొదట గోరిన షరతు.
బ్రహ్మ : తమ రంగీకరించనిచో కొమ్మరాజుగా రర్హులని నా అభిప్రాయము.
కొమ్మ : ఆ పని నా కక్కర లేదు. ఓపినంతవరకు కత్తిపట్టి పోరాడడందప్ప రాజకీయవ్యవహారములు నాకు తల కెక్కవు.
నల. రా : ఆ పదవి తమరే వహించవలసినది. బహుకాలం మా రాజవంశమూ, మీ మంత్రివంశమూ కలసివస్తున్నవి. సంబంధం విడగొట్టవద్దు.
బ్రహ్మ : చూతాము. ఈ యుద్ధమునకు సంబంధించిన వీరులందరికి కారెంపూడి క్షేత్రములో వర్ణ వివక్షతలేక ఆచంద్రతారార్కమూ వీరపూజ యేటేట కార్తీక మాసములో ఉత్సవముతో జరుపవలసినది. నల. రా : వీరాచారమనే పేరుతో ఈ కట్టుబాటు శాశ్వతముగా జరుగునుగాక!
బ్రహ్మ : మొదటి కొలుపు ఎప్పుడు జేతాం ?
నల. రా : రేపే మొదటి కొలుపు ప్రారంభం.
[ నిష్క్రమణం ]
4-వ రంగము
[ నాగులేటిలోని గంగధారి మడుగు ]
[నల. రా; నాయ; బ్రహ్మ - మొదలగు వారు ప్రవేశము]
నల. రా : వీర్లకొలుపుకు ఏర్పాట్లు జరిగినవా ?
నాయ : ఉత్సవాని కేర్పాట్లు చేయించాము. వీరాలయం కట్టించి దానిలో పల్నాటివీరులు బట్టిన ఆయుధములను నిలిపాము. ఇకముందు యుద్ధములలో చనిపోయే పల్నాటివీరులకుకూడ జాతి మత వివక్షత లేకుండా దీనిలో చోటుంటుంది. తిరునాళ్ల పూర్తిఅయ్యేలోగా వీరచరిత్ర మంతా ప్రతిసంవత్సరమూ బోధించడానికి కొందరి కీనాము లిచ్చి శాశ్వతమైన యేర్పాటు జరిగినది ఉదయము వీరాచారులందరు ముడుపులూ మొక్కుబళ్ళూ చెల్లిస్తారు. అవికాంగనే కొందరు వేషాలుగట్టి వీరచరిత్రంతా నాటక మాడి యుద్ధపట్టులో ఆ యా వీరులు పడ్డచోట పడిపోతారు. దానితో కొలుపు ముగుస్తుంది వీరచరిత్రలు వినీ, కొలుపులు జేసీ మన రాబోయే సంతానము వీర్యవంత మవుతుంది.
నల. రా : నాయుడుగారి సత్యవ్రతసిద్ధాంతాని కిది పొసగుతుందా? నాయ : పొసగకేమి ? ద్వేష ముండకూడదనిమాత్రమే సత్యవ్రతము కోరుతుంది. ప్రతివాడు నిస్సంగుడై యుద్ధము చేయవచ్చును. మన యుద్ధములో ఉభయపక్షములా పోరినవారికి వొకరిమీద వొకరికి ద్వేషము లేదు. చాలమంది బంధువులు కూడాను. స్వలాభంకోసం పోరలేదు. ధర్మంకోసమే ప్రాణములు విడిచారు.
నల. రా : తమ రంగీకరిస్తారా యిది ?
బ్రహ్మ : నా అభిప్రాయం నే జెప్పితే మంచిది. నాగమ్మగారు చెప్పినది కాదనను. అది మానవధర్మం ; భగవద్గీత దా న్నంగీకరించినది కాని అంతకంటె పైధర్మ మున్నది. అది సత్యధర్మం. మానవధర్మానికి పై మెట్టు. దీనిలో శత్రువును హింసించడం లేదు. అవసరమైతే శత్రువువల్ల తానే హింసించబడి, దానికి ప్రతిక్రియ తలంపకుండా సహించి, తిరిగి శత్రువును ప్రేమించడమే సత్యవ్రతం.
నాయ : అది నేను కాదనను. ఇప్పట్లో అది సాధ్యమూకాదు. ప్రయోజనకారీ కాదు.
బ్రహ్మ : అది మానవునిలో గర్భితమై వున్నది. ప్రస్ఫుట మవుతుంది.
నల. రా : అంతవరకు నాగమ్మగారు చెప్పినదే ధర్మం. త్వరలో సత్యధర్మం లోకకళ్యాణ మొడగూర్చుగాక!
[ నిష్క్రమణం - తెరపడుతుంది ]
సంపూర్ణము