నానకు చరిత్ర/చతుర్థాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీ

నానకు చరిత్ర.

చతుర్థాథ్యాయము.

ఇరువది యేండ్లయిన నిండకముందే నానకు గృహస్థుడయి సంసారభారము వహించెను. కాని యాపెండ్లి వానిజీవనము సుఖాస్పదముగ జేయుటకు మారు దు:ఖభాజనముగ జేసెను. చూనీదేవి కోపశీల గర్వసమేత. ఒరులపై నధికారముచేయనిచ్చకలది. ఆమె జనకుండగు మూలుడు కాలుని యచ్చు. వాక్పారుష్యమునందు ధనాశయందు మన:కాఠిన్యము నందు వియ్యంకు లొండొరులకు దీసిపోరు. చూనీదేవితల్లి నానకు తల్లివంటిదిగాక భర్తగుణములకు వన్నె వెట్టుచు ననుకూల దాంపత్యమని లోకులు చెప్పుకొనునట్లు నడచెను.

అట్టి జననీ జనకుల కుద్భవించినందున చూనీదేవి తల్లిచాలు బిడ్డయు తండ్రిచాలు బిడ్డయు నయ్యెను. తల్లిదండ్రుల గుణములు ప్రతిబింబములట్లు బిడ్డలయందు గానబడుచుండును గదా. తల్లి మంచిదికానపుడు తండ్రి మంచివాడగుటయో తండ్రి యోగ్యుడు గానపుడు తల్లి యోగ్యురాలగుటయో తటస్థించునేని బిడ్డలొకవేళ సుగుణవంతులు కావచ్చును. భార్యాభర్తలిద్దఱు దుస్స్వభావులయినపుడు బిడ్డలు సాధుశీలురగుట యరిది. అయోగ్యులగు జననీజనకుల కుద్భవించినను బిడ్డలు జన్మించినది మొదలు సజ్జనులచే బెంపబడుదురేని వారికి సద్గుణము లలవడవచ్చును. అట్లుగాక యవివేకులగు మాతాపితలకు బుట్టి వారికడనేపెరిగిన బిడ్డలమాట వేరే చెప్పవలయునా! చూనీదేవి గయ్యాళితనమున దల్లిదండ్రులను బోలినందున బ్రతిదినము మగడు గృహమునకు వచ్చినప్పుడు పిల్లిమీదబెట్టి యెలుకమీదబెట్టి సణుగుచు నిదిలేదదిలేదని కేకలు వేయుచుండును. అంతతో బోక గృహకృత్యములకు గావలసిన సంబారములు సరిగ సమకూర్చుట లేదనియు సంపాదించిన ధనమంతయు బైరాగులకు బావాజీలకు బెట్టి సంసారము గుల్ల చేయుచున్నవాడనియు, నుదయాస్తమయములు మగనిని సాదించు చుండును. సంపాదించిన ధనములో జిల్లిగవ్వయైన వెచ్చబెట్టక తనయిచ్చవచ్చినట్లు వ్యయముచేయుటకు దనయధీనము జేయుమని పోరుచుండును. తానెంత పోరువెట్టినను భర్త తనమాట రవ్వంతయు లక్ష్యము సేయనందున నామెతనపంతము నెగ్గించుకొనుటకు బలుమారు తల్లిదండ్రులకు దనకష్టములదీర్ప రమ్మనివర్తమాన మంపుచుండెను. పంపుటయేతడవుగ వానియత్తమామలిరువురు కూతురుమిక్కిలి కష్టపడుచున్నదనుకొని యల్లుని యింటికివచ్చి తమకూతు రష్టకష్టములు బడుచున్నదని కల్లిబొల్ల యేడ్పులేడ్చి "యె న్నడు బుద్ధితెచ్చుకొని బాగుపడుదువు నాయనా" యని యల్లునిమీదబడి రక్కసులవలె వానిని బాధించుచు వచ్చిరి. సహజముగ శాంతశీలుడయి వాక్పారుష్యమన్న మిక్కిలి యసహ్యపడుచు నిరంతరము మనశ్శాంతినే గోరు నానకు, ఆలిపోరునకు దోడుగ నత్తమామల పోరుగూడ సంభవించుటచే మనస్థిమితము లేనివాడయి చాల దు:ఖపడుచు వచ్చెను. ఒకప్పుడత్తమామల పోరుబడలేక మాయింట నన్నవస్త్రములకు లోపము లేదుకదాయని యడుగుచుండును. ఆపలుకుల కత్తమామలు మిక్కిలి కినిసి "అన్న వస్త్రములున్న చాలునా మఱేమియు నక్కఱలేదా! నగలుండవలె నాణెములుండవలె సంసారము చేయుచున్నపుడెన్నో యుండవలెను. కాలు నొచ్చిన చేయినొచ్చిన నింటగూర్చుని సుఖముగ తినుటకు గొంతసొమ్ము నిలువ యుండనక్కరలేదా! నీసొమ్ము దినుచున్న గోసాయిలు సన్యాసులు నీకాపత్సమయమున నక్కఱకువత్తురని తలంచుచున్నాడవు కాబోలు. పాపమేమియు నెఱుగని మాపిల్ల యట్టియాపత్సమయము వచ్చినచో నిష్కారణముగ గంగలో దిగవలయు" నని నిష్ఠురముగ బలుకుచు వచ్చిరి. కర్ణకఠోరములగు నప్పలుకులు వినినప్పుడు నానకు మనస్సు మిక్కిలి ఖేదమునొంది "మాయూరికి మాయత్తవారియూరికి నిప్పుడున్నదూరముకంటె బదిరెట్లుదూరముండిన బాగుండునుగదా దూరముండినపక్షమున వీరు తఱుచుగవచ్చి నన్ను బాధింప కుందురుగదా" యని తలంచుచుండును. అల్లునియూరికి మామయూరికి దూరముండుట మంచిదనయే కాబోలు శాస్త్రకారకులు సయితము "గృహస్థులు పుత్రికలను దూరప్రదేశములనుండు పడుచువారి కీయవలయి"నని శాసించిరి. నానకునకు గృహము సుఖప్రదమగుటకు మారుదుంఖబాజన మయినందున నత డింటనుండినప్పుడు ముండ్లకంపమీద నుండినట్లుండి మెదుకులు నోటవేసుకొని యావలకు బోవుచుండును. సోదరీ గృహమునకు బోవదలచిన వానియత్త యామెయింటికిగూడ బోయి యల్లునిమీద విధివిరామము లేక నేరములు చెప్పుచువచ్చెను. నానకి సాధుశీల యగుటచే దనసోదరుడు యోగ్యుడని యామె యెఱింగియుండియు నా గయ్యాళిగంప నోటికి వెరచి యేమియుననక యూరకుండును.

వేయిమంది పడుచు పడతులైనను నానకి యత్తగారి యెదుట నిలువలేరు. అట్టి యామెయెదుట పరమసాధ్వియగు నానకి నిలిచి యేమిప్రతిఘటింపగలదు. స్వగృహమునందుగాని సోదరీగృహమందుగాని యించుకేనియు మనశ్శాంతినొందుటకు వీలులేక నానకు దుకాణమే యిల్లుచేసికొని దినమునం దెనిమిది జాములలో జాలభాగ మక్కడనే గడుపుచు వచ్చెను. అతనికి బలుడు సహాయుడు బలున కతండు సహాయుడు. అతడొంటిగ గూర్చున్నప్పుడు మనసులో ననేకాలోచన లొకదానివెంబడి నొకటి తోచుచుండును. భార్యా దు:ఖ హేతువు సంసారము దు:ఖహేతువని పెద్దలు చెప్పెడుమాటలు వానికి జ్ఞప్తికిరాగా నతడు మాటిమాటికి మెడకు గుదికఱ్ఱయుగలిగి సంకిలియునగు నీవివాహమేల చేసికొంటినని విచారించుచు దృడమైన యాబంధమును తెంపుటకు సమయమును నిరీక్షించుచుండెను. అట్లు నిరీక్షించుచుండగానే యనేక సంవత్సరములు గడచెను. అతనికప్పటి ముప్పదియాఱవయేడు. వివాహమై పదునాఱు సంవత్సరములాయెను. అతనికిద్దఱు కుమారులు జన్మించిరి. అతని ముప్పది రెండవయేట మొదటి కుమారుడు పుట్టెను. ఆకుమారునిపేరు శ్రీచంద్రుడు. మఱి నాలుగేండ్లకనగా ముప్పది యాఱవయేట రెండవకుమారుడుదయించెను. అతనిపేరు లక్ష్మీదాసు. అట్టియవస్థలలో నానకు జీవితమందు గొప్ప మార్పొకటిజరిగెను. ఆమార్పు వానిని సంపూర్ణముగ మార్చివేసెను. భార్యాబంధమే త్యజింప నలవిగానిది. అట్టియెడ సంతానముచేత మఱింత దృడమైన యాబంధమును నానకు తృణప్రాయముగ ఛేదింపగలడని లోకులెవ్వఱు దలంపలేదు. వానిశత్రులు మిత్రులుగూడ నానకు సంసారబంధనం దగులుకొన్నాడు. వాని బ్రహ్మవిద్యయంతయు నడుగంటినదని బహిరంగముగ ననుకొనుచుండిరి. అట్టి సమయమున నానకు సర్వసంగ పరిత్యాగియై యెల్లవారల నద్భుత మొందజేసెను. రెండవ కుమారుడు పుట్టినయాఱు మాసములకు నానకొక నాడొకచోట నొంటిగ గూర్చుండి దీ ర్ఘాలోచనము చేయుచుండ వానివద్దకొక పకీరు వచ్చెను. ఇరువురు గొంతసేపు భగవద్విషయకమైన చర్చచేసిరి. ఆసంభాషణము ముగిసినవెనుక పకీరు నానకుతో నిట్లనియెనట. "నానకూ! నీవు చేయుచున్న పనియేమి? నీజీవితముయొక్క పరమార్థమిదియేనా? నీవు చేయవలసిన యుత్కృష్టకార్యమునకు నీవిప్పుడు గడుపుచున్న దేహయాత్ర యనుకూలమై యున్నదో లేదో చూచుకొనుచున్నావా?" ఆపలుకులు నానకు మనస్సుమీద నెంతో పనిజేసివానిని విరక్తిమాగన్‌మునకుం ద్రిప్పెను. త్రిప్పుటయు నతడు పకీరుతో నిట్లనియెనట. "భగవంతుడంతయు సరిగా వచ్చునట్లె నడపించును" ఆపలుకులు పలుకునప్పుడు నానకు మనసారా నేదోచేయుటకు గృతనిశ్చియుడైనట్లు కనబడెను. అదిగ్రహించి పకీరు సంతసించి తనదారిం బోయెను.

ఆపకీరుతో బ్రసంగముజరిగిన యెనిమిదిమాసముల కొకనాడు తెల్ల వారుజామున నానకు దాపుననున్న యేటి కెప్పటియట్ల స్నానమునకుబోయి తిరిగి గృహమునకురాక యదృశ్యుడయ్యెను. అతని యదృశ్యత యాలుబిడ్డలకు సోదరీ భావుకలకు జాల భయముగలిగింప వారు వానినిమిత్తము గ్రామము పొలిమేరలు వెదికించిరి. కాని యతండెందుం గానబడడయ్యె. ఆయనను గనిపెట్టి వానికి గిట్టనివారు నానకు నవాబుసొమ్ము హరించి యాపదవచ్చునను భయమున నెక్కడికో పారిపోయెననియు గడుసువాడగుటచేత నట్లుచేసెననియు నపవాదములు వేయజొచ్చిరి. అట్లు పగతురు చెప్పుకొనుచుండ నేమికారణముననో మరల నానకు మూడవనాడు స్వగ్రామమునకు బోయెను. అతనింజూచి నిరాపనిందలు మోపిన కుత్సితస్వభావులు తమపలుకులు కల్లలయ్యెనని తలవంచుకొనిరి. నానకు చిన్న గోచిమాత్రము పెట్టుకొని దిగంబరుడట్లె యుండె స్వగృహమమునకుగాని సోదరీగృహంబునకుగాని యతడుపోవక యూరకనిందందు దిరుగజొచ్చె. గ్రామవాసులు వానియవస్థ గనుగొని "వానికిమతిలేదు పిచ్చియెత్తినదని కొందఱు దయ్యమేదోపట్టి యట్లు వేధించుచున్నదని కొందఱు బలుకజొచ్చిరి. నానకు హఠాత్తుగ నదృశ్యుడయ్యెనని విని నవాబు వానికి బూటకుడగు జయరామునింబిలుపించి లెక్కలు పరిక్షచేయింపుమని యానతిచ్చెను. జయరాముడు నానకును గూడ వెంటబెట్టుకొని నవాబువద్దకు బోయెను. లెక్కలు మూడవసారి పరీక్షింపబడెను. కాని కడచిన రెండుసార్లవలెనే నానకు నిర్దోషియని తేలుటయేగాక యతని వంతు రు 760 లు రావలసి యుండెను. పరీక్షానంతరము నవాబు నానకు న్యాయబుద్ధికి సంతోషించి మరల దనవద్ద నుండుమని యడిగెను. నానకు తనకుద్యోగమక్కరలేదని తనకు రావలసిన ధనము పేదలకు బంచిపెట్టమని చెప్పెను. నానకు చాలకాలము గృహస్థుడై భార్యతో గాపురముచేసి సంతానముంబడసి సంసారబంధములు మఱింత బిగిసినవెనుక వయసు కొంత ముదిరిన పిదప విరాగియై యాలు బిడ్డలవిడచి నిస్పృహుడై భగవధ్యాన పరాయణుడగుట జాలమంది కాశ్చర్యము కలిగించును. కాని యిందాశ్చర్య పడవలసిన దేమియులేదు. ఏలయన నానకుయొక్క గృహస్థాశ్రమము వాని నుత్తమగతి నొందించునట్లే యుండెను. కాని యధోగతికిం దెచ్చునట్టులేదు. అతడు ప్రతిదినము జామురాత్రియుండగా మేల్కొని స్నానముజేసి పరిశుద్ధదేహముతోడను పరిశుద్ధ మనస్సుతోడను భగవధ్యానము చేయుచుండును. భగవంతుడు దయామయుడు సత్యస్వరూపుడు పరిశుద్ధడు నగుటచేత వాని నిర్మలమనస్సుతో ధ్యానించి వారికందఱకు దయా సత్యశౌచములు తమయంతట తామేవచ్చి కరతలామలకములై యుండెను. వారు సంసారమునందుండియు సంసారమున కతీతులు. మనసు వారి యధీనమునం దుండుటచే నుండదలచిన నింత నుండుదురు. వెడలదలంచిన నిర్విచారముగ వెడలుదురు. అదియునుగాక న్యాయార్జితమగు సొంత ద్రవ్యము దినువారి మనస్సు నిర్మలమై పవిత్రమైయుండును. నానకు ధాన్యపుదుకాణమునం బ్రవేశించినదిమొదలు న్యాయాజిన్‌తము స్వాజిన్‌తమునగు ధనమే తినుచుండుటజేసి వానిచిత్తము నిష్కలుసుమైయుండె. మఱియు నతడు ద్రవ్యమును సంపా దించినప్పుడు భగవద్భక్తులకు స్వార్జితమున జాలభాగము దానము చేయుచువచ్చెను. దాతయెల్లప్పుడు భగవంతునకు సమీపవర్తియై యుండునుగదా! పూర్వోక్త విషయములంబట్టి నానకు సాంసారమం దున్నపుడె మోహపాశబద్ధుడు గాడనియు నిర్మలాంత:కరణముగలవాడనియు, బరమభక్తుడనియు, నిస్పృహగలవాడనియు మనము గ్రహింపవచ్చును. అట్టి గుణములుండుటచేతనే విరక్తిదోచినతోడనే యతడు సంసారము నవలీలగ విడువగలిగెను.

మూళుడు తనయల్లుడు విరాగియైపోయెనని విని తద్దయు విషాదమంది పిడుగడచిన వాని చందమున తొలు దొల్తనిశ్చేష్టుడయ్యెను. తెలివివచ్చినపిదప నతడు మహాకుపితుడై యల్లుండుదారపుత్రులను నిరాధారులజేసి సన్యసించుట దుష్కార్యమనియు సంసార నాశహేతువనియు నభిప్రాయపడి యల్లుడుద్యోగము సేయునపుడైన నించుకధనము నిలువచేయకపోవుటచేతను కూతుసంసారము బిడ్డలు పాపలు గలిగి పెద్దదగుటచేతను దానిపోషణ మేవిధంబున జరుగగలదని బెంగపెట్టుగొనియె. తనకున్న సొత్తులోనుండి కూతునకేదేని గొంత యియ్యవలయునన్న దనసంసారము దీనస్థితిలోనేయుండెను. నానకు మొదటినుండియు నెవ్వరితో మాటలాడక నొంటిగగూర్చుండి ప్రపంచముమీద నసహ్యపడునట్లు గానబడుచువచ్చెనుగాని యతడంతలో నంతపని చేయునని మామగారెన్నడు స్వప్నమందైన దలంపలేదు. తలచినకొలది కూతురు యొక్కయు మనుమలయొక్కయు నవస్థ విషాదము గలుగ జేయ మూళుడు తనమాట యల్లుడు వినడని యెఱింగి తనపురోహితుని గాంచి నానకు బుద్ధివైరాగ్యమునుండి మరల్చి సంసారమవంక ద్రిప్పుమని యాయననుబతిమాలి పంపెను. ఆపురోహితుడు వల్లెయని బయలుదేరి పోయి శ్మశానమునందు గూర్చుండి యీశ్వరధ్యానము చేయుచున్న నానకునుగాంచి యాలుబిడ్డలను మలమలమాడ్చి సన్యసించుట యనుచితమని యెన్నో తెఱంగుల వాని కుపదేశించెను. కాని వానిమనస్సు నిశ్చలమై యుండుటంజేసి పురోహితుడు వచ్చినదారినే స్వగ్రామమునకు జని యావృత్తాంతము మూళున కెఱింగించెను. అల్లుడు మరల సంసారియగుట యసాధ్యమని గ్రహించి మూళుడు నానకునకు ధాన్యపుదుకాణములో రావలసిన యేడువందల యిరువది రూపాయలు వాని యాలుబిడ్డలకిచ్చి రక్షింపవలయునని నవాబునకు విజ్ఞాపనమంపెను. నవాబు నానకుదారపుత్రుల నిరాధారస్థితికి మిక్కిలి జాలినొందియు నానకుచేత పేదలనిమిత్తము దానమీయబడిన ధనము వాని సమ్మతిలేక యాలుబిడ్డల కిచ్చుట యధర్మమని భయపడి మూళుడు కోరినప్రకారము చేయుట కిష్టపడడయ్యె. అయినను నానకునకు మతిలేదని లోకులు చెప్పుకొనుట చేతను మతిలేనివాడు చేసిన దానధర్మములు పరిగ్రహింప దగినవి కావని తెలియుటచేతను నవాబు వానివంతుధనము దానముచేయక యాలు బిడ్డల కీయ బ్రయత్నించెను. నానకు నిరంతరము గీరీలదొడ్డిలో గూర్చుండి జపము సేయుచుండుటచే వానికేదేని యొక దయ్యముపట్టి యుండవచ్చునని కొందరు చెప్పిరి. తురకలకును దయ్యము లున్నవని నమ్మికగలదు. గావున నవాబు తన మతగురువు నొక్కనింబిలిచి మంత్రములు చదివియా దయ్యమును వదలించుమని వానితో జెప్పి నానకు నప్పగించెను. ఆగురువు నానకుకడకుం బోయి తనమంత్రము లన్నియు జదివెను. ఎన్ని మంత్రములు జదివిన నతడెప్పటి యట్లె యుండెను. తురక గురువు నానకుతో నించుకసేపు సంభాషించి వానికి దయ్యము పట్టలేదనియు మతి లేకపోలేదనియు గ్రహించి యామాట నవాబున కెఱిగించెను. పేదలకు బంచిపెట్టవలసిన సొమ్ము మఱియొకలాగున వినియోగించుట మహాపాపమని మహమ్మదీయ ధర్మశాస్త్రములలో నుండుటచే నవాబు పాపభీతినొంది యాధన మేవిధంబున వినియోగింప నగునని జయరామునిం బిలిపించి యాలోచనమడిగెను. జయరాముడెటుచెప్పిన నెటువచ్చునో యని యేయాలోచనముం జెప్పవెరచెను. ఏలయన నానకుయొక్క యాలుబిడ్డల యవస్థజూడధనము వారికప్పగించుటయే న్యాయమని తోచును నానకు మతిలేనివాడుకాడని తెలిసినప్పుడువానిచెప్పిన చొప్పున వానిసొమ్ముదానముచేయక పోవుట యనుచితమని తోచును. ఈరెండు ధర్మసందేహములు జయరాముని బాధించిన కతమున నతడు నానకునే పిలుపించి కర్తవ్యమునుగూర్చి యడుగమని నవాబునకు విన్నవించెను. నవాబువాని చెప్పినచొప్పున నానకును రమ్మని వతన్‌మాన మంపెను. నానకువానియాజ్ఞ నిరాకరించి రానందున నవాబు వానిని బలవంతముగ దనసన్నిధికి రావించి తనయాజ్ఞప్రకారము రాకుండుటకు గారణమేమని కోపముతో నడిగెను. నానకు వానికిట్లనియె. "నేను మీసేవచేయునప్పుడు మీయాజ్ఞమన్నించి ఇప్పుడు భగవంతునిసేవ చేయుటచే భగవంతుని యాజ్ఞనేమన్నించెద. అప్పలుకులు విని నవాబు "నీవు భగవద్భక్తుండ వయితివేని నేనును భగవద్భక్తుడనే. నేడు శుక్రవారము మసీదునకుబోయి మనమిద్దరము నమాజు చేయుదము ర" మ్మని పలికెను. భగవంతుడు సర్వవ్యాపకుడను నమ్మిక హృదయమున నుండుటచే నానకు మసీదునకు బోవ సమ్మతించె. సమ్మతించుటయు నవాబు కొలువులోనున్న గొప్పసరదారులను స్వమతగురువులను నానకును వెంటబెట్టుకొని వైభవముతో మసీదునకుబోయి ప్రార్థనల నారంభించెను. తురకలందరు దమయాచారప్రకారము ప్రార్థనసమయమున మోకాళ్ళమీదబడియుండ నానకు మాత్ర మట్లుచేయక కాలువంచక నిలచియుండెను. ప్రార్థనలు ముగిసినపిదప నవాబునిలిచియున్న నానకునుజూచి "ఓయి నీవు నాతోగలిసి ప్రాథిన్ంచుటకు వచ్చితివా? లేక నిలిచియుండుటకు వచ్చితివా?" యని యడిగెను. నవాబు ప్రశ్నమునకు నానకు క్రిందియుత్తరము జెప్పెను. "ప్రార్థనసమయమున మీరు గాంధారదేశమున గుఱ్ఱములను బేరము చేయుచుండిరి. అందుచేత నేను మీతో గలసి యెట్లుబ్రాథన్‌నసేయగలను." అనవుడు నవాబుప్రక్కనున్న ఖాజీ నానకుతో నిట్లనియె. "నీవు నవాబుగారితో గలిసి ప్రార్థనము జేయలేనిపక్షమున నాతోగలసి యేలప్రార్థింపవైతివి" అప్పలుకులకు నాన కీవిధమున బదులుచెప్పెను. "మీ తక్కువ యేమున్నది. మీగుఱ్ఱపుపిల్ల మీదొడ్డిలోనున్న బోదెలో బడునేమోయను భయమున మీమనసు ప్రార్థనసమయమున మీ గుఱ్ఱపుపిల్ల వెనుకనే యుండెను. నేనుమీతోగలిసిన మాత్రమెట్లు ప్రాథిన్ంపగలను."

అతనిపలుకులు విని నవాబు వానిగురువు విస్మయమునొంది యొండొరుల మొగంబులు చూచుకొని యెట్టకేలకు తమమనస్సు లాసమయమున నిజముగా మసీదులో లేవనియొప్పుకొనిరట. అన్యుల మనోగతములగు నాలోచనలను విజ్ఞానవంతులు సులభముగ నెఱుంగ గలరని ప్రకృతి శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఇది నిజమో యతిశయోక్తియో మనము చెప్పజాలము. అనంతరము నవాబు నానకును బిలిపించిన కార్యము మరువక ధనమెట్లు వ్యయము సేయవలయునని వాని నడిగెను. ఎన్నివిధముల దరచి యడిగినను నానకు మొట్టమొదట దానున్నట్లు ధర్మమే చేయుమని నొక్కిచెప్పెను. నవాబు నానకు నడిగిన కార్యములేదని తెలిసికొని వానిం బంపివేసి యాధనము సగము నానకు మనోరధ ప్రకారము పేదలకు పంచిపెట్టి సగ మాలుబిడ్డల కిచ్చెను.

ఈనాటి హిందువులకు వలెనె యానాటి హిందువులకు గూడ జాతి మతవర్నసంబంధములయిన పట్టుదలలు మిక్కుటముగనుండెను. మనదేశము నిప్పుడు క్రైస్తవులు పరిపాలించుచున్నట్టె యప్పుడు మహమ్మదీయులు పరిపాలించుచుండిరి. ప్రభువులు మహమ్మదీయ మతస్థులయినను దేశస్థులు హిందూమతమునే యవలంబించి విడువక యభిమానముగలవారై యుండిరి. తురకలు హిందువులు పలుమారుత్సవసమయములగలియుచు వచ్చిరిగాని కలిసి తినుట వియ్యమందుట మొదలగు వానిలో మాత్రము హిందువులు గలియరైరి. హిందువుడు, మసీదునకుబోయి తురకలంగలసి నమాజు చేయుట స్వమత మరియాదం దాటుటగా నానాటివారు భావించుచు వచ్చిరి. అట్టివాని నానాటివారు వెలివేసిరేగాని వర్నములో నుంచరైరి. నానకు మహమ్మదీయులతో గలిసి మసీదులో బ్రార్థనచేసి స్వమతమరియాద నతిక్రమించెను. నవాబు ఖాజీవాని వెంటబెట్టుకొని పోవుటంజేసి నానకు స్వభావమెఱుగని వారందఱు దప్పక యతడు నవాబు ప్రేరణంబుంన దురకలలో గలసెననియే జెప్పుకొనిరి. జయరాముడామాట విన్నప్పుడు చాల తొట్రుపడి యతిత్వరితమున నింటికిబోయి యావాతన్ బార్యకెఱగించెను. ఆమెతన సహజధైర్యమునుజూపి భతన్‌జెప్పినమాట సరిగా నమ్మలేదు. జయరాముడు తనమాట భార్యసరిగా నమ్మకపోవుటచే నిజస్థితి గనుగొని రమ్మని నాధుడను బ్రాహ్మణుని నానకువద్ద కంపెను. ఆబ్రాహ్మణుడు తక్షణమే బోయి యధార్థస్థితి దెలుసుకొని నానకు తురకలలో గలిసినమాట యబద్ధమనియు నానకు నవాబుమాటలోబడి యట్టిపనిచేయువాడు కాడనియు జెప్పెను. అదివిని జయరాముడు భార్యయు మిక్కిలి సంతసించిరి.

నానకు విరాగులలో గలిసినవార్త కాళునకు జాలకాలమునకుగాని తెలియదయ్యె. తాల్వెండి గ్రామమునకు సుల్తానుపురమునకు కొన్నివందలమైళ్ళ దూరమున్నందున నాదినములలో వతన్‌మానము దెలియుట చాలకష్టముగ నుండెను. పూర్వము పొరుగూరి వాతన్‌లు దెలియవలెనన్న గృహస్థుడు పురోహితునో యింటి మంగలినో యింటి పాటకునో లేక బత్తెమిచ్చి ప్రత్యేకముగా నొక మనిషినో పంపవలయును. కుమారుని వార్త కాళున కెట్లెట్లో తెలిసెను. ఆవాతన్ వినగానే కాళునిప్రాణములు నిలువునంబోయెనని చెప్పవచ్చును. త్రిస్తాదేవి దు:ఖ మింతింతయని వర్ణింప నలవిగాదు. ఆమెభర్త తన దు:ఖము గోపావేశముచేత నడుమనడుమ మరచుచువచ్చె. త్రిప్తాదేవి శాంతమున భూదేవియే కోపమెట్టిదో యెఱుగనిదిగావున నామె దు:ఖమున కూరటయే లేకపోయెను అయినను కుమారుని స్థితి యున్న దున్నట్లు తెలిసికొని రమ్మని గాళుడు మర్దనుడను గాయకుని సుల్తానుపురమున కంపెను. మార్గమున మర్దనున కెదురుపడిన మొదటిపురుషుడే యావార్తనిజమని పలికెను. అప్పటికిని మర్దనుని మనసు సందేహపరవశమగుటచే సుల్తానుపురమునకు వచ్చినతోడనే జయరాముడు వానిసందేహమును దీర్చెను. ఆదూత యంతతో దనివి నొందక నానకును స్వయముగా జూడవలయునని కోరి గోరీలదొడ్డికిబోయి యాతనిం గాంచి మరల గృహస్థాశ్రమస్వీకారము జేయుమని వాని కెన్నెన్నో యుపదేశముల జేసెను. ఈతడు తాల్వెండినుంచి వచ్చినప్పుడు తన వాక్చమత్కృతిచేత నానకు మనసు గరిగించి గృహస్థుంజేయ గలిగినట్లు కాళునితో బ్రజ్ఞలు పలికివచ్చె అందుచేత నతడు తన యావచ్ఛక్తి వినియోగించి నానకుం ద్రిప్పజొచ్చెను. అయ్యిరువుర కలయికచేత నానకు గృహస్థాశ్రమము స్వీకరించలేదు గాని నానకు చేసిన వేదాంతబోధలచేత మర్దనుడు సంసారముమీద విరక్తుడై తాల్వెండికి బోయి కాలునకు గుమారుని యవస్థయైనం జెప్ప దలపక నానకునకు శిష్యుడయ్యెను. ఊరక శిష్యుడైయుండక నానకు కంఠములో బ్రాణముండినంత కాలము పరమభక్తుడై తోడు నీడ యట్లు వానిని సేవించెను. లోకము నుద్ధరింపదలచిన మహాత్ము లొక్కచోట నెప్పుడు నుండరు. తాము బుట్టిపెరిగినచోటులను వ్యవహారములు చేసినచోటుల మొదలే యుండరు. తమకు భగవంతు డిచ్చిన జ్ఞానము లోకమంతట వెల్లడిచేయుటయే వారి ముఖ్యోద్దేశము గావున మహాత్ములు నిరంతరము దేశాటనము చేయుచుందురు. నానకుగూడ జగదుపకార పారీణుడగుటచే మర్దనుడు తన శిష్యుడైన కొన్ని నాళ్ళకు సుల్తానుపురము విడిచి మఱియొకతావునకు బోవదలచెను. మర్దనుడు మంచిపాటకుడగుటచే నిరంతరము భగవన్నామ కీర్తనము గానరూపమున వానినోటనుండి వినవచ్చునని నానకు తాంబురా కావలయునని కోరి యదికొనుటకైన దనవద్ద ధనము లేనందున దానికి వలయు ధనమిమ్మని సోదరివద్దకు వర్తమాన మంపెను. తమ్ముడట్టి కోరిక కోరుటయే చాలునని నానకిదేవి తక్షణమే వానికి గావలసిన ధనమిచ్చి సోదరు నొకసారి జూడగోరి యెటులైన వచ్చిచూచి పొమ్మని ప్రాథన్‌వపూర్వకముగా వర్తమాన మంపెను. నానకు తనయక్కమాట త్రోసివేయలేక యామె దర్శనమునకు బోయెను. నానకి తమ్మును మిక్కిలి గారవించి భోజనముపెట్టి చాలసేపు వానితో సంభాషించెను. అక్కడ నుండగానే నానకు పూర్వపు చెలికాడగు బలుని జూడగోరెను. నానకి వెంటనే వానిని రావింప నతడు వానిం జూచి నీ వెట్లున్నావని యడిగెను. బలుడప్పలుకులు విని యజమానుడు తన్ను విడిచిపోయినది మొదలు తన కేమియు దోచక పిచ్చియెత్తినట్లున్నదనియు సెలవయ్యెనేని తాల్వెండికి బోయి వ్యవహారములం జక్క బెట్టుకొని మున్ను చేయదలంచిన పని జేయవచ్చుననియు బదులు చెప్పి నానకుచేసిన పని చాల మంచిదని పొగడి యతండు త్రొక్కినత్రోవ తప్పన్న వారిని నిరసించి తనకు నానకునందు బరమభక్తి గలిగింపుమని భగవంతుని బ్రార్థించెను. నానకు వాని భక్తికిమెచ్చి తాల్వెండికి బోవుటకు వానికి ననుజ్ఞ నిచ్చెను.

అనంతరము నానకు సోదరివద్ద సెలవు బుచ్చుకొని నిజనివాసమగు గోరీలదొడ్డికి బోయెను. మర్దనుడు తాంబూరా గొనుటకు బజారున కరిగెను. బజారులో నెక్కడవెదకిన నొక్క తాంబురా యైనం దొరకలేదు. దొరకకపోవుట యటుండగ వాని యుద్దేశమెఱిగిన పడుచువాండ్రందఱు వానిని జూచి యెగతాళి చేసిరి. మర్దనుడు బజారంతయు దిరిగి తిరిగి విసికి వేసారి నానకుకడకు బోయి తాంబురా దొరకకపోవుటయు దన్నెల్లవారు బరిహసించుటయు లోనగు వృత్తాంతమెఱింగించెను. నానకు వానిపలుకులు విని యిట్లని యూరడించె. "ప్రపంచమంతయు నజ్ఞానాంధకారమున మునిగి యున్నది. ఇప్పుడు లోకము మనల నిరసించినను ముందుముందు పశ్చాత్తాపముతోడను వినయముతోడను, మన మాటల నాకర్ణించును." ఈశ్వరునియందు గాటముగ మనస్సు నిలిపిన పరమ భాగవతోత్తముని మనోధైర్యమెట్లుండునో చూచితిరా? లోకము తనమాట నిరాకరింపక వినయముతో వినునుని వాని యంతరాత్మ విస్పష్టముగ వానికి జెప్పెను. భగవద్భక్తులకు సామాన్యమనుష్యులకు గల ముఖ్యభేద మిదియే. అనంతరము నానకు కొంచెము యోచించి సుల్తానుపురమునకు సమీపమందున్న యొక గ్రామములో నొక వతన్‌కుడు పెహురూయనువాడు తాంబురాలు చక్కగా చేయగలడనియు వాని కడకు బోయిన దొరకుననియు జెప్పి మర్దను నంపెను. మర్దనుడు బయలుదేరి నానాస్థలములు దిరిగి యామనుష్యుని నెలవుగానక మూడుదినములు తిరిగితిరిగి మిక్కిలి డస్సి యొక చెట్టుక్రింద గూర్చుండ వానివద్దకే పెహురూ వచ్చి యొక తాంబురా యిచ్చెనట. మర్దనుడు దాని వెల యీయబోవ దాని నతడు పరిగ్రహింపక నానకుదరిశనము చేయింపుమని ప్రార్థించెను. మర్దనుడను వానిందోడ్కొని నానకునకు జూపి త దభీష్టముం దీర్చెను.

మర్దనుడు గానవిద్యలో నానాటివారి నందరిని మించెనని చెప్పుదురు. తాంబురా దెచ్చి సృతివేసి యతడు తుహినిరాకార్ తుహినిరాకార్ నానక్ బందా తేరా యను పల్లవిగల కృతి పాడెను. పాడినతోడనే నానకు భక్తిరసపరవశుడై యెడలెఱుంగక పడియెను. మర్దనునకు గానమునందధికప్రజ్ఞ మొదట లేదనియు నానకు వరప్రసాదమునకు నిము సమున నట్టిప్రజ్ఞ వానికి గలినదనియు గొందఱునుచున్నారు. కొందరు మర్దనునకు సహజముగా గానమునం దధికప్రజ్ఞగలదని చెప్పుదురు. నానకు మైమరచిపడుట మర్దనునియొక్క గానప్రభావముచేత గాక వాని హృదయమున నున్న భక్తిరసముచేతనే యని కొందఱు పలుకుదురు. ఈమాటయే కొంతవఱకు నిజమని తోచుచున్నది. భక్తిరసములేని శుష్కహృదయుడు రాళ్ళ గరగించు పాటలు వినినను పరవశుడైమూర్ఛిల్లునా? సహజముగా హృదయము భక్తి పూరితమైనప్పుడు స్వల్పగానము సహితము వాని కుత్సాహము గలిగించును. అంతేకాని తాంబురా కొయ్యలు నోటిపాటలు భక్తిలేనివానికి భక్తి సృష్టింపలేవు.

నానకు రెండుదినములు మూర్ఛావస్థలోనుండి మూడవనాడు కన్ను దెరచి చూచెను. గురువునకు మెలకువ వచ్చినతోడనే మర్దనుండు స్వగ్రామమునకు బోవుటకు సెలవిమ్మనియడిగెను. నానకు కారణముం దెలియగోర మర్దనుడిట్లనియె. "మీరు మూర్ఛవోయి రెండేసి దినము లీ ప్రకారముగా నున్న పక్షమున నాపనియేమి కావలయును? ఆకలిచేత దాహముచేత నేను చచ్చిపోనా! కావున నన్ను బోనిండు." శిష్యుని బేలమాటలు విని గురు విట్లనియె "నీయిష్టము వచ్చినట్లు చేయవచ్చును. నీవు స్వగ్రామమునకు బోయి సుఖించినను సంతోషమే నన్ను గనిపెట్టుకొనియున్నను సంతోషమే, ఉండదలతువేని యాకలిచేత దప్పికచేత బాధపడవలసి యుండును. నానకుతో నున్నవారికి నానకుతోపాటు కష్టములేగాని సుఖములు లభింపవు" మర్దనుడా పలుకులు విని యేమియుం బదులుచెప్పక యెటుచేయుటకుం దోచక సందిగ్ధ మనస్కుడై యుండెను. అంతలో మర్దనుడు తన తమ్ముని విడిచి పోవదలంచుకొన్నాడని విని నానకి విచారమొంది మర్దనుని బిలిపించి పోవదలచిన కారణమడిగి తమ్ముని విడిచి పోవలదనియు సుల్తానుపురములో నున్నంతకాలము తనయింటనే రెండుపూటలు భుజియింప వలసిన దనియు సోదరుడాయూరు విడిచిపోవునప్పుడు వానివెంట బోవలసినదని యీ ప్రయాణమున కగు కర్చులన్నియు తానే యిచ్చుకొనబూను ననియు జెప్పి యిప్పుడే రెండుబట్టలు నిరువది రూపాయలు వాని కిచ్చెను. అది పుచ్చుకొని మర్దనుడు వారు చెప్పినట్లె చేయుటకు వాగ్దానము చేసి మరల నానకు కడకుంబోయెను. మర్దనుడు కనబడకపోవుటచే నతడు స్వగ్రామమునకే బోయి యుండవచ్చునని నానకు తలంచి వానిం జూచినతోడనే మరల నేలవచ్చితివని యడిగెను. మర్దనుడు నానకీదేవి తన్ను బిలిపించి చెప్పినమాటలన్నియు వాని కెఱిగించెను. మర్దనుడు తన సోదరివద్దనుంచి వస్త్రములు గ్రహింపవచ్చునే కాని ధనము స్వీకరించుట యనుచితమని తలంచి నానకు వానివద్దనున్న ధనము దీసికొని సోదరివద్దకు బోయి యామెధనమామె కిచ్చెను. ఆమె దానిని బుచ్చుకొనుట కిష్టము లేనిదయ్యు దమ్ముడేమను కొనునోయను భయమున మరల గ్రహించి గృహస్థాశ్రమము స్వీకరించి తల్లి దండ్రులకు నాలు బిడ్డలకు దనకు బావకు నత్తవారికి నెప్పటియట్లు నేత్రానందము గలుగ జేయదగునని వానిని బ్రార్థించెను. ఎన్ని చెప్పినను నానకు తనత్రోవ విడువనందున నానకీదేవి తమ్మునిం జూచి "నాకు నిన్ను జూడవలయునని బుద్ధి పుట్టినప్పుడు నేను నీకు వర్తమాన మంపెదను. నీవు తక్షణము వచ్చి నన్నుజూచి పోవలయు" నని కోరెను. నానకు సోదరి కోరికను దప్పక తీర్చుట కొడంబడెను.