నాగర సర్వస్వం/సశబ్ద చుంబనములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6. వైకృతికము : ప్రియురాలు తనయొక్క పార్శ్వ భాగమున కూర్చుండి యుండగా ఆమెను తనయొడిలోనికి అడ్దముగా వంచి ఆమెయొక్క బుగ్గలను, కంఠమును, కుచములను చుంబించుట వైకృతిక చుంబనము అనబడుతుంది, "వైకృతము" అనగా వ్యతిరేకముగా చేయబడినది. భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురు ఎదురుగా నున్నపుడు జరుగు చుంబనము సహజము. ఆట్లు కాక భార్య అడ్డముగా పురుషుడు నిలువుగా ఉన్నప్పుడు చేయబడు చుంబనమైనందున దీనికి "వైకృతిక" మని పేరేర్పడును.

7. నతగండచుంబనము :- భర్త శయనించిన శయ్య యొక్క పార్శ్వభాగమునకు భార్యవచ్చి నిలచు ఉండగా-శయనించినవాడై యున్న ఆభర్త ఆమెయొక్క ముఖమును బాగుగా వంచి ఆమె బుగ్గలను చుంబించినచో అది 'నతగండము' అనబడుతుంది. నతము-అనగా వంచబడినది. 'గండము' అనగా బుగ్గ. ఈ చుంబనమునకు బుగ్గలే ప్రధానస్థానమైనను భార్యయొక్క సర్వశరీరము ఈ చుంబనమునకు తగినదే అని శాస్త్రకర్తల అభిప్రాయము. అయినను ప్రధానస్థానము బుగ్గలగుటచే దీనికి 'నతగండము' అను పేరు వచ్చినది.

ఇంతవరకు చెప్పబడిన యీ ఏడు చుంబనములు నిశ్శబ్దచుంబనములు అనబడతాయి. వీనియందు ధ్వని ఉండదు. ఉన్నను అది మివుల అల్పంగా ఉంటుంది. సశబ్దచుంబనములు ధ్వని ప్రధానంగా సాగుతాయి. అవికూడ సంఖ్యచే ఏడుగానే ఉన్నాయి.

సశబ్ద చుంబనములు

1. సూచీచుంబనము : సూచి అనగా సూది. ప్రియుడు తన నాలుక చివరను సన్నగా నుండుంట్లొనరించి ప్రియురాలి పెదవుల గుండా ఆమె నోటిలో సూదిదూర్చినట్లు దూర్చుట జరిగినచో అది సూచీచుంబనము అనబడుతుంది. కాముకుల చేష్టలకు అర్ధముండదు. ఎందుకో ప్రియురాలి పెదవులను బిగించి కూర్చుండవచ్చును. ప్రియుడామెయందున్న కోర్కెతో బిగించియున్న ఆమెపెదవులలోనుండి దారిచేసికొనుటకు తగినంత దృఢముగా నాలుకను బిగించి, అనగా దానికి దృఢతను కల్పించి-మెత్తనైన ప్రియురాలి పెదవులగుండా ఆమె నోటిలోనికి చొప్పించవచ్చును. ప్రియునియొక్క యీచేష్టవలన ఆప్రియురాలి నాడీమండలము కూడ రతికి అభిముఖమైన ఆవేశమును పొందుతూంది. ఈ చుంబనమునందు ధ్వని కూడ యేర్పడుతుంది. ఇట్టి యీచుంబనమునకు సూచీచుంబనము అనిపేరు.

2. ప్రతతాచుంబనము :- ప్రతత అనగా విస్తరించినది. నాలుక యొక్క చివరను కోరినపుడు సన్నగా చేయుట. వెడల్పుగా పల్చగా చేయుటయందు అందరకు నేరుపు సహజంగా ఉంటుంది. వెనుక చెప్పిన సూచీచుంబనమునందు నాలుక సన్నగా చేయబడి ప్రియురాలి పెదవులయందు ప్రవేశింపజేయుట జరిగితే ఈ చుంబనమునందు నాలుకను వెడల్పుగాచేసి ప్రవేశింపజేయుట జరుగుతుంది. నాలుకను వెడల్పుగాచేసి ప్రియురాలి పెదవులలోనికి ప్రవేశింపజేయుటకే ప్రతతా చుంబనమనిపేరు.

3. వాకలీ చుంబనము :- ప్రియురాలి నోటిలోనికి ప్రవేశ పెట్టబడిన తన నాలుకను ప్రియుడు ఇటు నటు కదిపినపుడు "వాకలీ" అన్న శబ్దమునకు సన్నిహితమైన ధ్వని ఏర్పడుతుంది. అట్టి చుంబనమునకు వాకలీ చుంబనమని పేరు.

4. ఓష్ఠవిమృష్టచుంబనము :- ప్రియురాలి పెదవులనుగాక కేవలమామెయొక్క నాలుకను ప్రియుడు తన పెదవులతో గ్రహించి నాలుకతో పీల్చుట వంటి క్రియ నాచరించినచో అది 'ఓష్ఠవిమృష్టము' అనబడుతుంది.

5. చుంబితము^ :- ఏమామిడి పండునో పీల్చినట్లు తాంబూలరాగాగుణమై, సువాసనాపూర్ణమైయున్న ప్రియురాలి నాలుకను వేగముగ పీల్చినచో అది 'చుంబితము' అనబడుతుంది. దీనికిని 'ఓష్ఠవిమృష్టము'నకును అధికవేగ-అల్పవేగములు మాత్రమే భేదము.

6. అర్ద్రచుంబనము :- ప్రియుడు తన భార్యయొక్క క్రింది పెదవిని తన మునిపంటితో కొద్దిగా నొచ్చునట్లు కొరికి ఆమె యొక్క ఆ పెదవినే తన పెదవులతో గ్రహించి పీల్చినచో అది ఆర్ద్ర చుంబనము అనబడుతుంది. ప్రియురాలి పెదవిని ఈవిధముగా మునిపంటితో కొరుకునప్పుడు ప్రియుడు తనక్రిందపండ్లను తనక్రిందిపెదవితో కప్పియుంచి కేవలము పైపంటితో మాత్రమే కొద్దిగా గాటుపడునటులు కొరుకవలెనేకాని ఈ క్రియయందు క్రింది పండ్లను, మీదిపండ్లను కలిపి ఉపయోగించరాదు. ప్రియాశరీరము సర్వము మధురము. ఉత్తేజకరము అయి ఉంటుంది. అందుచే ప్రియుడు కేవలము చుంబించుటయేకాక కొన్ని కొన్ని శరీరభాగములయందు చూషణక్రియ (పీల్చుట) ఆచరించి కాని తృప్తిపొందజాలనివాడవుతాడు.

7. సంపుటకము :- భర్త, భార్యయొక్క పై పెదవిని తన పెదవులతో గ్రహించి చుంబించుచుండగా-భార్య తన రెండు పెదవుల మధ్యకు చేరిన భర్తయొక్క క్రింది పెదవిని చుంబించుట జరిగినచో ఆచుంబనము సంపుటకము అనబడుతుంది. ఇది కేవల చుంబనము గాక చూషణ క్రియతో (పీల్చుట) కూడి ఉంటుంది. ఒకే సమయమున భార్యాభర్తలు ఇద్దరియందు ఈక్రియ ప్రవర్తిల్లుతుంది. అందుచే దీనికి సంపుటి చుంబనమని పేరు వచ్చినది.

ఈ చుంబనము లేడును సశబ్ద చుంబనము లనబడతాయి, వీనియందు ధ్వని ఏర్పడుటయే దీనికి కారణము. నిశ్శబ్దచుంబనము లేడును క్రొత్తజంటలయందును, వియోగానంతరము కలిసికొన్న వారియందును ఏర్పడతాయి. ఈ సశబ్ద చుంబనము లేడును నిరంతరము కామక్రీడా పరులై తృప్తిచెందని దంపతులయందేర్పడతాయి. ఈ చుంబనములన్నియు ఆలుమగలను రతికి అభిముఖులుగా చేయుటయందు తోడ్పడతాయి.