నాగర సర్వస్వం/శృంగార చేష్టలు

వికీసోర్స్ నుండి

శృంగార చేష్టలు

ఏ సంకేతాలైనా యువతీ యువకుల మానసంలో శృంగారభావం ఉద్భంధమైనపుడు (మేలుకొన్నపుడు) చేయబడితేనే చరితార్ధం అవుతుంది. వట్టికట్టెల ప్రోవుదగ్గర కూర్చుండి చలికాగడం అన్నది సాధ్యంకాదు. ఆ కట్టెలయందు అగ్ని జ్వలిస్తూండాలి. అప్పుడే ఎవరైనా తమ శీతబాధను తొలగించుకొనగలుగుతారు. అలాగే కామినీకాముకుల మానసంలో శృంగారభావం జ్వలిస్తూ ఉన్నప్పుడే సంకేతము మొదలైన వ్యవహారలన్నిటికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా యౌవ్వనం వచ్చేసరికి అందరియందు యీ శృంగారభావం మేల్కొనడానికి తగినస్థితి కలదై యుంటుంది. కాని లోకంలో వయస్సువచ్చినా శృంగారభావంయొక్క స్పర్శ అయినా ఎఱుగని మనస్సుకలవారుకూడ ఉంటారు. రామాయణంలోని ఋష్యశృంగుడు అట్టివాడు.

ఒకప్పుడు అంగదేశములో కరవువచ్చింది. వానలులేవు. జనం అన్నంలేక అల్లాడిపోతున్నారు. వానలు కురిసి కరవు తొలగాలీఅంటే ఎవరైనా మంచి శీలంకల మహర్షి యీ దేశంలో అడుగుపెట్టాలి. అప్పుడు మాత్రమే యీ కరవు తొలగే అవకాశం ఉన్నదన్నారు పండితులు. అయితే అట్టి మహర్షి యెవరన్న ప్రశ్న బయలుదేరింది. చివరకు విభాండకుడనే ఋషికి కుమారుడైన ఋష్యశృంగుడట్టివాడని తేలింది. ఆ ఋష్య శృంగుడు విభాండకుని కట్టడిలో తన తపమేమో తన జపమేమో తప్ప ఇతరచింతలేకుండ జీవిస్తున్నాడు. యౌవ్వనం వచ్చినా ఆయనకు స్త్రీ అంటే ఏమిటోకూడ తెలియదు. ఆయనను అంగదేశానికి తేవడం ఎలా? ఎవరీ పనికి పూనుకొంటారు. రావయ్యా ! అని ఆహ్వానించిన మాత్రంలో వస్తాడోరాడో, అన్న శంకకూడ కలిగింది.

అంగదేశంలోని వేశ్యలు మిక్కిలి రూపవంతులు. తమ సౌందర్యంతో ఎట్టివానినైనా సరే పాదదాసుడుగా చేసికొనగలమన్న గర్వంకలవారు. వారు మేమా ఋష్యశృంగుని ఈదేశానికి తీసుకురాగలమ"న్నారు.

ఆ వేశ్యలలో పడుచుదనంలోఉన్న నెరజాణలైన అందగత్తెలు కొందరు విభాండకుని ఆశ్రమానికి చేరుకొన్నారు. వారు వచ్చిన సమయానికి విభాండకుడు ఆశ్రమంలోలేడు. ఋష్యశృంగు డొక్కడే ఉన్నాడు. ఆశ్రమానికి వచ్చిన యీ వేశ్యలనుజూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన వారినిచూచి-"ఎవరో ఋషి కుమారులు, మిక్కిలి తపంచేసి ఎంతో తేజం సంపాదించుకొన్నారు. నేనూ తపస్సు చేస్తున్నాను కాని ఇంతతేజం నాకు కలుగలేదే!" అనుకొంటూ ఇలా ప్రశ్నించాడు.

ఓ ముని కుమారులారా! మీ రెవరు? మీరు చేసే తపోవిధానం యేమిటి? మీ జుట్టు అంతపొడవుగా సుందరముగా ఉన్నదేమిటి? మీ ముఖంమీద యీ వింత తేజస్సు యెలా యేర్పడ్డది? అని ప్రశ్నించాడు.

ఆ వేశ్యలు ఋష్యశృంగునియొక్క ఈ ప్రశ్నలువిని ఆశ్చర్య పోయారు. అయినా వారంతా నెరజాణలు. "మేము చేసే తపస్సును గూర్చి వివరిస్తాం రమ్మంటూ వారు ఆయనను సమీపములోవున్న నదికి తీసికొనివెళ్లేరు. అక్కడ నదిలో ఋష్యశృంగునితో వారున్ను స్నానంచేసేరు.

ఆ వేశ్యలు ధరించిన వస్త్రాలు మిక్కిలి పల్చనివి. ఆ పల్చని వస్త్రాలు నీటిలో తడిసి వారి శరీరానికి అంటుకొనిపోయాయి. అప్పుడు ఋష్యశృంగుడు వారివంక చూచి మరీ ఆశ్చర్యానికిలోనై ఇలా అన్నాడు.

"ఋషికుమారులారా! మీ ముధము మీద తేజస్సుకే ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు మీ గుండెలమీద బంతుల వంటివి ఏవో కనబడుతున్నాయి. అవేమిటి? అన్నాడు.

వేశ్యలు ఆయనయొక్క యిలాంటి ప్రశ్నలకు ఏవో సమాధానాలు చెపుతూ క్రమంగా ఆయనను అంగదేశానికి తీసికొని వచ్చారు. ఋష్యశృంగునిరాకతో అంగదేశంలో వర్షాలుకురిశాయి. కరవు తొలగింది. ఆ ఋష్యశృంగుడే దశరథునకు సంతానం కలుగకపోతే 'పుత్రకామేష్టి' చేయించాడు. ఆ యాగఫలముగానే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఈకథ రామాయణంలో విపులంగావుంది,

లోకంలో ఋష్యశృంగునివంటి ప్రకృతులుచాలా అరుదు. సాధారణముగా బాల్య యౌవ్వనాల సంధియందే శృంగార భావం జాగృతం అవుతుంది.

కొందరి యందీభావము చాల తక్కువగా యుంటుంది. కొందరి యందిది ఎక్కువగాను, మరికొందరియందు చాల అధికంగాను ఉంటుంది.

అసలా యీశృంగార భావము యేయే అంతరువులలో జన్మిస్తుంది? అన్న విషయాన్ని అలంకారికులు అలంకార శాస్త్రాలలోని రసచర్చలో విపులంగా వివరించారు. ఆ వివరణ అంతా చెప్పడానికి ఇది స్థానంకాదు. అయినా అల్పంగానైనా వివరించకపోతే దాని రూపం తెలియడం కష్టంగనుక కొంత వివరిస్తున్నాము.

"సహజంగా స్త్రీని అనుభవించవలెనన్న కోరిక పురుషుని మనస్సులోను, పురుషుని పొందు బడయాలన్న కోరిక స్త్రీ మనస్సులోను ఉంటుంది. అయితే ఆకోరిక బాగా నివురుగప్పిన నిప్పులా వుంటుంది. కోరికయొక్క అట్టి స్థితినే 'రతి' అన్నారు. ఇలా నివురు గప్పిన నిప్పులా తన ఉనికి తనకే తెలియనంత అజ్ఞాతంగా ఉన్న 'రతి' (సంభోగేచ్ఛ) తనకు నచ్చిన యువతీ సందర్శనంతో పురుషుని మనస్సులోను, అందగాడైన యువకుని సందర్శనంతో తరుణీ మానసయందు-ఆ నివురు తొలగించుకొని కొంత బయటకు వస్తుంది. అంటే అజ్ఞాతంగా ఉన్న "రతి" యువతీ యువకులను, వారి వేషభాషాదికాన్ని, వయస్సును, సౌందర్యాన్ని వాతావరణాన్ని (వసంతకాలం, సాయంసమయం, మలయపవనం, వెన్నెలరాత్రి) ఆలంబంగా (ఆధారంగా) చేసికొని మేలుకొంటుంది.

అలా "రతి" ఇంచుక మేలుకొన్నంతనే దానియొక్క దీప్తి మనస్సులోనికి, బుద్ధిలోనికి, వాక్కులోనికి, శరీరంలోనికి వ్యాపిస్తుంది. అనగా మనస్సుయొక్క ఆలోచనాశక్తి, బుద్ధియొక్క వివేచనాశక్తి పూర్వంవలెకాక క్రొత్తదారులు త్రొక్కుతాయి. మాటలలో, శరీరంలో కొంతమార్పువస్తుంది.

ఒకయువతి ఉద్యానవనంలో ఏకాంతముగా సంచరిస్తోంది. వాతావరణం సుందరంగా వున్నది. ఆ సమయంలో అక్కడకే వచ్చిన ఒక యువకుడామె కంటబడ్డాడు. ఆ యువకుని చూచేసరికి ఆమె మనస్సులో ఏదో ఒక వింతకదలిక కలిగింది. సాయంకాలము, ఏకాంత సమయం ఆ యువకుని సౌదర్యం కారణాలుగా ఆ కదలిక మరికొంత పెరిగింది. అప్పుడామె మనస్సు సిగ్గుచే ఆవరింపబడ్డది. బుగ్గలు అనుకోకుండానే కొంత ఎఱుపెక్కాయి. ఆమె ఆయువకునితో ఏవో మాటలు మాట్లాడింది. ఆ మాటలలో ఏదో వింత సౌందర్యాలను వెలిజిమ్ముతుంది.

ఇదంతా "రతి" (సంభోగేచ్చ) ఇంచుక మేలుకొన్న తరువాత జరిగేపరిస్థితి. ఈస్థితికి చేరుకొన్న రతియే శృంగారభావమనబడుతుంది.

ఈ భావమే 1 అల్పము, 2 సామాన్యము, 3 అధికము అనే మూడు రకాలుగా వ్యక్తం అవుతూంటుందని వెనుక చెప్పబడ్డది. ఒక యువతి ఒక యువకునివంక జూచి కొద్దిగా చిఱునవ్వు నవ్వడం మాత్రమేజరిగితే, అక్కడ శృంగారభావం అల్పంగా మాత్రమే వ్యక్తమైనటులు గుర్తించాలి.

ఒకయువతి ఒకయువకునివంకజూచి కేవలం చిరునవ్వు నవ్వుటయే కాక పులకించిన శరీరం కలదికూడ అయితే శృంగారభావం చాలవరకు వ్యక్తమైనటులే గుర్తించాలి.

యువకునివంకచూచి యువతి-పులకించిన శరీరంకలది కావడమే కాక, నిట్టూర్పులు విడచిపెట్టడంవంటివికూడ జరగితే ఆభావంఅధికంగా వ్యక్తమైనటులు గుర్తించాలి. కామినీకాముకులు తాము పిలచినవారియందు శృంగారభావం ఏ అంతరువులో వ్యక్తమై ఉన్నదో గుర్తించాలి. అది తక్కువగా, లేక సాధారణంగా ఉంటే తమ వర్తనంద్వారా దానికి దోహదం చెయ్యాలి. ఎంతో కాలంగా కలిసిమెలసి కాపురం చేసుకొంటూఉన్న ఆలుమగలుకూడ శృంగారభావంయొక్క అధికదీప్తిని గమనించి వ్యవహరించినపుడు మాత్రమే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతారు. శృంగారభావం అధికంగా దీప్తమైనపుడు స్త్రీ పురుషుల చేష్టలయందు మార్పువస్తుంది. ఈ చేష్టలద్వారా దాని దీప్తిని గమనించవచ్చును. వీనిని గుర్తించడం, గుర్తించి వ్యవహరించడంవల్ల భార్యా సాంగత్యంలో భర్తకు, భర్తయొక్క పొందులో భార్యకు మిక్కిలి ఆనందం కలుగుతుంది. ఈ చేష్టలు పదునారు రకాలుగా విభజింపబడ్డాయి. 1 హేల. 2 విచ్ఛితి. 3 కిలికించితము. 4 విభ్రమము. 5 లీల. 6 విలాసము. 7 హానము. 8 విక్షేపము. 9 వికృతము. 10 మదము. 11 మోట్టాయితము. 12 కుట్టమితము. 13 ముగ్ధత్వము. 14 తపనము. 15 బిబ్బోకము. 16 లలితము- అని వానిపేర్లు. వీనియొక్క లక్షణాలు ఉదాహరణాలు దిగువ నీయబడుతున్నాయి.

1 హేల:- సంభోగేచ్ఛ ప్రబలంగాఉంటే ఆస్థితిని సూచించే చేష్టకే హేల అని పేరు. "భార్యా భర్తలిద్దరియందు సంభోగ సమయంలో భార్యకంటె ముందుగా భర్త ప్రవృత్తుడవుతాడు. స్త్రీ తన బిగింపును వదలి ముందుగా సిద్ధంకావడం అనేది ఎన్నడోకాని జరుగదు. కోర్కె ఉన్నా తనంతతానై ప్రవర్తించకపోవడం స్త్రీలయొక్క లక్షణం, ఈ సహజ లక్షణాన్ని విడచి భార్య తానే ముందుగా పతిని అతడు కోరకుండగానే కౌగలించుకొని ముద్దుపెట్టుకొనడం, సంభోగ మధ్యంలో తనంత తానుగా భర్తను క్రిందుజేసి పురుషాయితం (పురుషునివలె ఆచరించడం) చేయడంవంటిది జరిగితే అది శృంగారభావంనుండి పుట్టిన "హేల" అనే చేష్టగా గుర్తించాలి. ఈ హేల పురుషునకు మిక్కిలి ఆనందాన్ని ఇచ్చేది అవుతుంది. పురుషుడు తన వర్తనంద్వారా భార్యయొక్క మానసంలోని శృంగారభావాన్ని అధికంగా దీప్తంచేసిన మీదట మాత్రమే భార్య యీ చేష్టను ప్రదర్శిస్తుంది.

2 విచ్ఛిత్తి : భర్తచేసిన అపరాధం కారణంగా భార్యతాను అలంకరించుకొనుట మానినదై, చెలికత్తెలు అలంకరింపబూనుకొన్నా తిరస్కరించడం జరిగితే ఆ చేష్ట "విచ్ఛిత్తి" అనబడుతుంది. కొందరు "భర్త పిలుస్తూఉన్నా సిగ్గుచే సమాధానం చెప్పనిదై భార్య ఉంటే ఆ స్థితి విచ్ఛిత్తి అనబడుతుంది" అంటారు.

"ఓసి చెలీ! నీ పతి ఏదో చిన్న తప్పిదం చేశాడేఅనుకో! అయినా ప్రియుని విషయంలో ఇంత అలగడం తగదు. ప్రేమించినవారిని క్షమించడంకూడ నేర్చుకోవాలి. అలకరించుకోనంటావేమిటి? నేను జడ వేస్తాను, ఇలారా! అని చెలికత్తె అంటూ ఉన్నపుడు, అలంకరించడానికి పూనుకొన్నపుడు- "నాకు జడ అక్కరలేదు, నేను అలంకరించుకో నక్కరలేదు, నీవునాకు బలవంతంగా జడవేస్తావా ఏమిటి, లాగుతున్నావా"- అంటూ త్రోసి పుచ్చడం జరిగితే దానిని "విచ్ఛిత్తి" అనే శృంగార చేష్టగా గుర్తించాలి.

3 కిలికించితము : చిరకాలానికి వచ్చిన భర్తను చూచిన ఆనందాతిరేకంలో భార్య క్షణకాలం చిరునవ్వునవ్వి, క్షణం ఏడ్చి కండ్ల నీరుపెట్టకయే, క్షణకాలం గట్టిగానవ్వి, క్షణం ఎందుకో భయపడి క్షణం కోపించి, క్షణం ఏదో అలసటను ప్రదర్శించి, అనేక భావాల సాంకర్యానికి లోనైతే ఆ చేష్ట "కిలికించితం" అనబడుతుంది.

"భర్త చిరకాలానికి యింటికివచ్చాడు. భార్య అతనినిచూచి కొంత ఆనందాన్ని వ్యక్తపరచి ఇంటిపనులన్నీ తొందరగా ముగించి, ఏకాంతంగా వున్న పడకటింటింకి, భర్త సన్నిధికి చేరుకొన్నది. అప్పుడు భర్త ఆమెను పొదవుకొన్నాడు. ఆస్థితియందామె కొంతసేపునవ్వి, "ఇంత కాలంగా నన్ను విడచి ఉండగలిగేరు, నేనేమైపోయానో అన్న చింతకూడ మీకులేదు" అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించి, మీ వియోగంలో నేనెంతగా బాధపడ్డానని"పలుకుతూ ఏడ్పుకాని ఏడ్పును ప్రదర్శించి, తిరుగ నన్ను విడచి వెళ్ళవద్దంటూ భయాన్ని సూచించి అలసటతో అతని గుండెమీద ఒరిగిపోతే- ఆ చేష్ట కిలికించితం అనబడుతుంది.

4 విభ్రమము : పతి వస్తున్నాడని తెలిసినంతనే కలిగిన ఆనందంలో తొందరకలదై భార్య తన అలంకారలను తారుమారుగా ధరించడం జరిగితే ఆచేష్ట 'విభ్రమము' అనబడుతుంది.

"ఏమే! రవిక తిరుగవేసి తొడుక్కొన్నావు. బొట్టు పెట్టుకోలేదా? అదేమిటి ముఖాన నల్లగా ఉన్నది! కాటుక పెట్టుకొన్నావా కంటికి పెట్టుకోవలసిన కాటుక ముఖానికి పెట్టుకొన్నావేమిటే! ఇదంతా బావవచ్చేడన్న ఆనందమేనా!'-ఇత్యాదిగా నవయువతుల విభ్రమచేష్టను జూచి ఆనందంతో వృద్ధులు పలుకుతూ ఉంటారు.

5 లీల : తాను మిక్కిలిగా ప్రేమిస్తూఉన్న తన భర్తతోడి పొందు తనకు ఎంతకాలానికి లభించకపోతే, నిరంతరం భర్తనే ధ్యానిస్తూ అతని చరిత్రనే చెప్పుకొంటూ, మనో వినాదినికై చెలుల యెదుట- నా పతి యిలాఉంటాడని, ఇలా మాటాడుతాడని, ఇలానడుస్తాడని, ఆయన వేషం ఇలావుంటుందని, ఆయన ఇలానవ్వుతాడని, ఇలాకొంటె చూపులు చూస్తాడని అనుకరిస్తూ అభినయించడం 'లీల' అనబడుతుంది "పార్వతీదేవి పరమశివుని గూర్చి తపం ఆచరిస్తూన్నది. ఆయన ఇంకా ప్రసన్నుడుకాలేదు. రోజురోజుకు పరమశివునికొరకై పార్వతియొక్క తహతహ పెరిగిపోతుంది. ఒకరోజున ఆమె చెలులు ఆమెను చూడడానికై వచ్చారు. వచ్చిన చెలులను చూచి పార్వతి ఏవోకబుర్లు చెపుతూ కూర్చున్నది. కబుర్లన్నీ పరమశివునిగూర్చియే. అలాచెపుతూ పార్వతి "చెలీ! పరమశివుని రూపం ఎంత మనోహరమైన దనుకొన్నావు ఆయన శిరస్సుపై జటాజూటం ఉన్నది. దానికి 'కపర్దం' అనిపేరు. ఆకపర్దం చక్కగా చుట్టబడి ఉంటుంది. దాని అందంచూస్తే తెలియీలికాని చెబితే తెలిసేదికాదు. ఉండు! నా జుట్టునే కపర్దంగా చుట్టి చూపుతాను. "అంటూ తన జుట్టును శివ జటా జూటంలాచుట్టి, ఇదిగో! ఆయన జటాజూటం ఇలా అందంగా ఉంటుంది; అయ్యో! నా తెలివి తెల్లవారినట్లేఉంది; ఆయన జటాజూటానికి దిగువగా చంద్రరేఖ వెలుగులు క్రుమ్మరిస్తూంటుంది. అదిలేకపోతే జటాజూటానికి అంత అందం ఎక్కడినుండి వస్తుంది. కపర్దాన్ని చూపడానికి నాజుట్టును చుట్టగాచుట్టాను కాని చంద్రరేఖను చూపడంఎలా? అయినా ఉండు! అంటూ తెల్లని మొగలిపూరేకను చంద్రవంగా కత్తిరించి నొసట ధరించి-ఆయనయొక్క 'కపర్దము' చంద్రరేఖ ఇలాఉంటాయి, ఆయన శరీరం తెల్లగా మెరుస్తూంటుంది. నా శరీరం నల్లగా ఉన్నది. అని తెల్లని మంచిగంధం ఒడలినిండా పూసుకొని, ఆయన మెడలో యజ్ఞోపవీతాలు (జంధెము) తెల్లగా మెఱుస్తూంటాయి అని తామర తూడు లను చీల్చగా వచ్చిన తెల్లని దారాలను యజ్ఞోపవీతాలుగా ధరించింది. ఇది ఒక కవిచేసిన వర్ణన.

స్త్రీలయొక్క ఇట్టి చేష్ట "లీల" అనబడుతుంది.

6 విలాసము : వచ్చిన భర్తను చూచినది మొదలు నవయువతియైన భార్యయొక్క నడకలో, కూర్చుండుటలో, ఉనికిలో, మాటాడుటలో, చూపులలో ఒకరకమైన మార్పువస్తుంది. ఈమార్పునే లోకంలో 'ఒయ్యారం' అంటారు. ఇట్టి మారిన చేష్టకే 'విలాసము' అనిపేరు.

"చెలీ నీ ముఖంమీద యీ వింత కాంతియేమిటే! నా ప్రశ్న విని నవ్వుతావు దేనికి! నీ నడక చాల ఒయ్యారంగా ఉన్నదే! ఈ ఒయ్యారపు నడక ఎక్కడనేర్చావు! పడగలవు మాటాడవేమిటి! పలుకే బంగారమైనదా యేమిటి! అసలు నామాటలు నీకు వినబడుతున్నాయ్యా! ఎందుకే అక్కడే నిలువబడిపోయావు? నీలో ఏదో మార్పు వచ్చింది. నీపతి వచ్చినాడేమిటి? ఆయనరాక నీలో ఆనందజ్యోతి వెలిగించి వుంటుంది. అందుకే యీ మార్పులన్నీవచ్చాయి- ఇత్యాదిగా విలాసాన్ని ప్రదర్శించే యువతులనుగూర్చి వారిచెలికత్తెలు పలుకుతూంటారు.

పదునారేండ్ల వయసులోని కన్యకు పెండ్లిచేసి 'శోభనం' ఇంకా చెయ్యక ఏ పండుగకో ఆమె భర్తను ఆహ్వానించి తీసికొనివస్తే, పతి యింటికి వచ్చిన సమయంలో ఆమె ఒక్కసారిగా మారిపోతుంది. అట్టివారి యందే విలాస లక్షణాన్ని స్ఫుటంగా గుర్తించవచ్చును.

7 హావము : కన్నులయొక్క కనుబొమ్మలయొక్క కదలికలోని మార్పు కారణముగాను, మాటలోని మాధుర్యం కారణంగాను, సంభోగేచ్ఛ కొంచముగా వ్యక్తం అయితే ఆచేష్ట "హావం" అనబడుతుంది.

"పెండ్లి కొడుకును చూచేవు కదా! మా కందరికీ నచ్చేడు. పున్నమి చంద్రుడులా ఉన్నాడు. మెరుస్తూ ఉన్న పెద్ద కళ్ళు-ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు-పల్చగా, పచ్చగా పొడవుగా నాజూకుగా ఉన్నాడు. ఇంతకూ నీకు నచ్చినాడాలేదా? అలా చూస్తావేమిటే! చెప్పు!" అని పెద్దలడిగితే పదునారేండ్ల కన్యక.

కొంచెంగా నవ్వుతూ-మెరసే కండ్లతో క్రింది చూపులు చూస్తూ, కనుబొమలుకదలిస్తూ "నాకేం తెలుస్తుంది, మీయిష్టం!" అన్నమాటలు మధురంగా పలుకుతుంది. ఇదిగో! ఇట్టి చేష్టకే "హాసం" 8. విక్షేపము : పతిని గాంచిన సంతోషములో ఏదో ఆవేశమునకు లోనై స్థిరతను వీడి వివిధవికారములను ప్రదర్శించుట "విక్షేపము"-అని కొందరి మతము.

మరికొందరు యువతి నగలు సగము సగముగా ధరించి, జడ పూర్తిగా కాక సగమే వేసికొని, ఊరకే క్రీగంట చూస్తూ పతితో గుసగుసలాడడం విక్షేపమన్నారు.

"ఓయి మిత్రుడా! నీయొద్ద దాపరిక మేమున్నది. నిన్న నేను నాప్రియతమ సన్నిధికి వెళ్ళేను. అప్పుడామె తల్లిదండ్రులను, బంధుజనమును తప్పించుకొని నాయొద్దకు వచ్చినది. ఆసమయంలో ఆమె రూపము పరమ మనోహరంగా ఉన్నది. జడసరిగా అల్లుకొనలేదు. కాటుక సరిగా పెట్టుకొనలేదు. నుదుట కుంకుమతిలకము చక్కగా దిద్దుకొన లేదు. నడుమునకు ఉన్న ఒడ్డాణములోని మువ్వలు చక్కగా ధ్వనిస్తున్నాయి. మెడలోని హారాలు బుజంమీదకు జారిఉన్నాయి. ఇట్టి రూపముతో ఆమె నాయొద్ద కూర్చుండి ఏవో మాటలు లజ్జానమ్రమూడియై మధురంగా పలికింది. ఇట్టిదైన ప్రియారూపం నామానసంలో హత్తుకొని పోయింది."

యువతీ గతమైన ఇట్టి చేష్ట విక్షేపము అనబడుతుంది. సాధారణముగా ఈ విక్షేపమన్న చేష్ట నవదంపతులయందు గోచరిస్తుంది. వివాహము జరిగిన కొలది కాలానికే వరుడు అత్తవారి యింటికి ఏపండుగకో వెళ్ళినపుడు-భర్తతో కొంత పరిచయం ఏర్పడి ఏర్పడనిస్థితిలో ముద్దురాలైన వధువు ఈ విక్షేపాన్ని అనుకొనకుండ (తలవని తలంపుగ) ప్రదర్శిస్తుంది. ఈవిక్షేపాన్ని వివాహితులైన దంపతులందరును అనుభవించియే ఉంటారు. ఏదో తెలియని ఆనందాన్ని అందొకొంటున్నామనియే తప్ప, ఆఆనందం ప్రియురాలు ఆచరించే విక్షేపమనే చేష్టవల్ల లభిస్తోందని పురుషునకు, ఇట్టి చేష్ట నాచే ఆచరింపబడి భర్తయొక్క మానసంలో ఆనందతరంగాలను సృష్టిస్తూ ఉన్నదని వథువుకు తెలియ కుండగనే ఈ విక్షేపం ఏర్పడుతుంది. అందువల్లనే "కామో నాఖ్యాత శిక్షితః"-గురువులయొద్ద చదువకపోయినా కామం తెలియబడుతుందన్నారు.

9. వికృతము :- పతితో మాటాడునపుడు వనిత అతని మాటలకు కావలెనని వంకర సమాధానములు చెప్పుట 'వికృతము' అనే శృంగారచేష్టగా పేర్కొనబడ్డది. అనురక్తులైన భార్యాభర్తలయొక్క చేష్టలు ఎట్టివైనా పరస్పరం ఆనందాన్నే కలిగిస్తాయి. భర్త యేదో అంటే భార్య ఆశబ్ధాన్ని కొంత పెడగా విరచి వక్రంగా సమాధానం చెప్పడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయిత ఈ వక్రత భార్యాగతమైనది కావడంవల్ల పురుషుని మానసంలో ని శృంగారభావాన్ని తరంగితం చేస్తుంది.

"ఆలుమగలు పరస్పరం దగ్గరగా కూర్చుండి ఉన్నారు. ఆమె మెడలో హారాలు, కాళ్ళకు అందెలు ధరించి ఉన్నది. ఆ సమయంలో ప్రియుడు ఊరకనే-నీమెడలోని నగ పేరేమిటి? అన్నాడు.ఆమె కేవలం నవ్వులాటకై నామెడలోనిది హారం అనడానికి బదులుగా-మెడలోని నగ 'నూపురం' అంటె "అందె" అన్నది. అయితే నీకాలికున్న నగ పేరేమిటి? అన్నాడు భర్త. ఆమె కూడ తడుముకోకుండా-అదా, అది కంకణం, అన్నది తన సమాధానాని తానే నవ్వుకొంటూ.

ప్రియురాలి యీసమాధానానికి నవ్వుతూ ప్రియుడామె బుగ్గపై సన్నగా గిల్లేడు. ఆమె బుగ్గను చేతితో రాసుకొంటూ ఏమిటిది? అన్నది. వెంటనే ప్రియుడు-ఇదా, ఇది చుంబనం, అంటే ముద్దు-అన్నాడు. నవ్వుతూ-ఆమె నవ్వింది, అతడామెను కౌగలించుకొన్నాడు.

ఇదుగో! ఇట్టి చేష్టకీ వికృతమని పేరు.

10 మదము:- కొంతమంది స్త్రీల శరీరంలో యౌవనం సన్నసన్నగా ప్రవేశిస్తుంది. అధికంగా విజృంభించదు. కొంతమంది స్త్రీల విషయంలో అలాకాక యౌవనం వస్తూనే ఉద్ధృతంగా వస్తుంది. ఉడ్డోలంగా విజృంభిస్తుంది. నిన్నకాక మొన్నటిది. రెండు నెలలేకదా అయింది. దీనిని చూచి, అప్పుడే ఎంత మారిపోయింది. ఎంత మనిషి అయింది-అన్నమాటలు ఉద్ధృతంగా యౌవనం ప్రవేశించగా మారిన వారిని గూర్చి లోకం అంటూ వుంటుంది. అట్టి స్త్రీలయందు మద్యము త్రావినవారియొక్క లక్షణాలతో సమానమైన లక్షణాలు కొన్నిగోచరిస్తాయి. ఇదుగో! ఈ లక్షణ సముదాయమునకే మదము అనిపేరు. "మదవతి" అనగా నాలుగు అంచులా సందు లేకుండా వ్యాపించిన యౌవనంవల్ల పిటపిటలాడుతూ కనులకు నిండుగా సుపుష్టంగా కానవచ్చే యువతి, యువతీ శరీరంలో గోచరం అయ్యే యీమదం అనగా యౌవనంయొక్క అధికస్ఫూర్తి పురుషుని మానసంలో శృంగారభావానికి అధికమైన దీప్తి కలిగిస్తుంది.

"ఏమేవ్! నీవు చాలా మారేవు. నిన్న మొన్నటిదాకా నీ యీ మార్పు నేను గమనించనేలేదు. నీవు మాటాడుతూ ఉండగా తెల్లని నీ పలువరుస వెన్నెలలు కురియిస్తూ వున్నట్లున్నది అనిపిస్తోంది. నీ చూపులలో మంచి దీప్తి ఏర్పడ్డది. బుగ్గలు నున్నగావుండి నాకే ఒకసారి ముద్దుపెట్టుకొనాలి అనిపిస్తోంది. కనుబొమలకు నాట్యంలో పాండిత్యం అలవడినది. నడకలో ఒయ్యారాలు ప్రవేశించాయి. స్వభావంలో చాంచల్యం ఏర్పడినది. నీవు మన్మధుని చేతిలోని సానపెట్టిన ఖడ్గంలావున్నావు. ఇక నీపతి ఎలాటివాడైనా నీఆన మీరలేడు.

ఇట్టిమాటలు మదంఅనే శృంగారచేష్టను ప్రదర్శించే వనితలను గూర్చి లోకం అంటూవుంటుంది.

11 మోట్టాయితము :- ప్రియునిగూర్చినవిషయాలు ఎవరైనా చెబుతూవుంటే వింటూ వనిత ఒడలు విరచుకొనడం, ఆవులించడం, చెవులలో వ్రేళ్లుంచుకొని ఇటునటుకదపడం జరిగితే ఆ చేష్ట 'మోట్టాయితము' అనబడుతుంది. ఈ చేష్ట వివాహానికి పూర్వదశయందు లేదా విరహావస్థ యందు పతియందనురక్తులైన స్త్రీలలో గోచరిస్తుంది. అనగా-తల్లి దండ్రులు తమకన్యకు తగినవరుడుగా ఎవరినో తీసికొని వచ్చివారు, ఆ వరుడువచ్చి యీ పెండ్లికూతురును చూచేడు; వెళ్లేడు. వివాహం నిర్ధారణ అయినటులేతోస్తోంది. ఇక్కడ ఈపెండ్లికూతురుకూడ ఆ వరుని తిలకించి వున్నదికదా! అతడు సుందరుడు, ఈమె కంటికి నచ్చేడు. ఇంటిలో ఈ వివాహాన్ని గూర్చి తల్లి దండ్రి మాటాడుకొంటున్నారు. వారు వరునిగూర్చి-అతనికి సంగీతంలోకూడ మంచిప్రవేశం వున్నదట! ఎంతో బాగా పాడగలడట! ఎంతోవినయం కలవాడు. వాళ్లకు తోటలు, దొడ్లు ఉన్నాయి. ఇంతమంచి సంబంధం కుదరడం అమ్మాయి అదృష్టం-ఇత్యాదిగా ఆ వరుని గుణగుణాలను సంపదనుగూర్చి చెప్పుకొనే సమయంలో ఆమెచెవులు దోరపెట్టుకొని వింటుంది. వినుటయేకాక అత్యధికానురాగంలో ఒడలు విరుచుకొంటుంది. ఆవులిస్తుంది. ఈ చేష్ట విరహిణి అయిన యువతికూడ ప్రియకథాశ్రవణవేళ ప్రదర్శిస్తుంది.

హిమవంతుని ఇంటిలో పార్వతిపెరుగుతుంది. పార్వతికి తగిన వరుడు పరమశివుడే అన్నవిషయం నిశ్చయం అయింది. అంతా ఆ పరమశివునిగూర్చియే మాటాడుకొంటున్నారు. ఆశివునిపాదాలకు మహర్షులుకూడ తలలువంచి నమస్కరిస్తారనేవారు కొందరు. ఆయనకు తెలియని విషయమేలేదు, ఆయన సర్వజ్ఞుడ అని కొందరు, అంతేకాదు, ఆయన మృత్యువునికూడ జయించేడట, ఇంతవరకు ఆయనకు పెండ్లికాలేదు, అనికొందరు హిమవంతుని కుటుంబంలోనివారు చెప్పుకొంటున్నారు. పార్వతీదేవి ఆమాటలను కుతూహలంతో వింటోంది. వినాలనివున్నా లజ్జకారణంగా విననటులే వినాలన్న ఆసక్తిలేనటులే చరిస్తోంది. కాని మనసులోనికోరిక ఆమెను ఆమాటలు వినబడేచోటికి లాగుతూనే వున్నది. వెళ్లివిన్నపుడల్లా ఆమెమానసంలో ఏవో మధురములైన ఊ హలు మొదలుతూనేవున్నాయి. ఈస్థితిలో ఒకసారి యిట్టిపరమశివగుణ గానం విని ఆమె ఒడలు విరచుకొన్నది. ఆవులించినది. ఆచేష్ట నెరజాణలైన ఆమె చెలులకంటబడ్డది. వారునవ్వేరు. పార్వతిమొగం సిగ్గుతో ఎఱ్ఱతామరమొగ్గ అయినది." ఇదుగో! ఇట్టిచేష్టకే మోట్టాయితము అని పేరు.

12. కుట్టమిత :- తాను మిక్కిలిగా వలచిన ప్రియుడు ప్రేమతో తన్నూ సమీపించి తనస్తనాలను, కేశాలను గ్రహించి ఆలింగనం చేసికొన్నపుడు కలిగిన అధికానందంలో యువతి అప్పుడప్పుడు బాధను వ్యక్తపరచడం అబ్బ! అయ్యో! అనడం జరుగుతుంది. ప్రియురాలి నోటినుండి వచ్చే యీ మాటలవలన ప్రియుని యందలి శృంగారభావం ఉత్తేజితం అవుతుంది. ఇట్టిదైన దుఃఖావిష్కరణ చేష్టయే 'కుట్టమితము' అనబడుతుంది.

'అబ్బా! చేతులతో అంతగట్టిగా నొక్కితే సహించుకొన గలనా? అంతమోటదనమైతే ఎలా? అనేమాటలు భార్యపలుకగా పురుషుడు వినడం, విని అధికమైన ఉత్సాహాన్ని పొందడం సాధారణంగా జరుగుతూనే వుంటుంది.

ఇదుగో! వనితలొనరించే యిట్టిచేష్టయే 'కుట్టమితము' అనబడుతుంది.

13. మౌగ్ధ్యము :- ఇప్పుడిప్పుడే యౌవనావస్థలో అడుగుపెట్టిన వనితను 'ముగ్ధ' అంటారు. ఆమె మన్మథవ్యాపారం ఎరుగనిదై అమాయికయై వుంటుంది. ఆమెలో లోకజ్ఞత తక్కువగా వుంటుంది. లజ్జ మిక్కుటంగా వుంటుంది. ఇట్టివనితయొక్క స్వభావమునకే 'మౌగ్ధ్యము' అనిపేరు. అమాయికములైన ఆమెపనులు మాటలుకూడ భర్త్వమానసంలోని శృంగారభావానికి చక్కిలిగింతలు పెట్టజాలినవై వుంటాయి.

"ఒక ముద్ధరాలు ప్రియునియొడిలో తలనిడుకొని శయనించినది. సిగ్గువల్ల ఆమెకు ఆలా శయనించకుండా వుండాలని వున్నా భర్త చేతులలో ఆమె పరవశ అయివున్నది. ఆమె చేతులకు మంచిముత్యములు పొదగబడిన బంగారుగాజులున్నాయి. అవి ఆమెయొక్క కోమల హస్తాలకు ఎంతో అందాన్ని చేకూర్చాయి. అవి ప్రియునిదృష్టిని ఆకర్శించాయి. అతడామె కంకణాలను పరిశీలిస్తూ-ఈ ముక్తాఫలాలు చాలా ఉత్తమమైనవి."-అన్నాడు. ముక్తాఫలం అంటే మంచిముత్యమే. అవి సముద్రంలో ముత్తెపుచిప్పలలో దొరుకుతాయి. కాని ఈ విషయం ఆముద్దరాలికి తెలియదు. ముక్తాఫలం అంటే ఆమె ఏదోపండు అని అనుకొన్నది. అవి ఏవో చెట్లను పండుతాయని, ఆఫలాలే తనచేతి గాజులలో మెరుస్తున్నాయని అనుకొంటోంది ఆమె.

అందుచే వెంటనే ఆమె తనప్రియునితో-ముక్తాఫలాలు పండే చెట్లు ఎక్కడవుంటాయి? నేనెప్పుడూ ఆచెట్లను చూడనేలేదు-అన్నది. ఆమెయొక్క యీ అమాయికత అతని ఉత్సాహానికి దీప్తినికలిగించింది. అతడునవ్వుతూ ఆమెను అక్కునజేర్చికొన్నాడు. ఇదిగో! ఇట్టి అమాయికతా లక్షణమునకే మౌగ్ధ్యము అనిపేరు.

14. తపనము :- ప్రియుడు అర్ధరాత్రమువరకు రాకపోయినచో ప్రియురాలు మిక్కిలిగా తాపానికి లోనుకావడం 'తపనము' అనబడుతుంది. ఈసమయంలో స్త్రీలు ఎక్కువగా నిట్టూర్చుట, కన్నీరుపెట్టుకొనుట, తమ దురదృష్టాన్ని నిందించుకొనుటద్వారా తమ తాపాన్ని వ్యక్తపరుస్తారు. తనకై యింతగా తపించే ప్రియురాలిని చూచేసరికి ప్రియునకు కలిగే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. ప్రియునితో శృంగారరసానికి యీ విధంగా దోహదంచేసే చేష్టకే 'తపనము' అనిపేరు.

అర్ధరాత్రం కావస్తోంది. వచ్చెదనన్న ప్రియుడు రాలేదు. తానేమో అలంకరించుకొని కూర్చున్నది. శయ్యాకారం నుసజ్జతంగా ఉన్నది. వెలిగించిన అగురువత్తులుకూడ మేమింక నిరీక్షించలేమన్నట్లు నివురు గక్కి చల్లారిపోయాయి. సాయంవేళ అరవిరసిన బొడ్డుమల్లెలను తాను సిగలో తురుముకొన్నది. అవి క్రమంగా వికసించడమే కాక రేకలను రాల్చే దశకుచేరుకొంటున్నాయి. ప్రియుడు వస్తాడన్న ఊహతో మనసులోని కోరికలు రెపరెపలాడగా తనూతాపం పెరిగింది. ఆ ప్రియుడు రాలేదు ఆమె తన నితంబాన్ని చేతితోనొక్కుకొని నిట్టూర్చింది. శయ్యపై నిద్రిద్దామని ఇటునటు పొరలాడింది. తాపం పెరుగుతోంది ప్రియుడు రాలేదన్న బాధవల్ల కన్నులలో నీరు చిప్పిలుతోంది.

ఈస్థితిలో ప్రియుడు వచ్చేడు. తనకై తపించే ప్రియురాలి యీ తపన ఆతనికంటబడ్డది. ఆతని పెదవులపై దరహసం. మనసులో ఉత్సాహం వెల్లివిరిశాయి. అతడామెను కౌగలించుకొన్నాడు. ఆమె అలుకతో-"ఇదిగో! ఇప్పుడేవస్తానని ఇంతఆలస్యంగానా రావడం? అన్నది. ఈమాటకూడ ఆమెలోని తాపాన్నే వ్యక్తంచేసింది.

అతడు-ఆలస్యమైనది అపరాధిని దండించు. బాహువులతో బంధనం, బొడ్డుమల్లెలు తురుముకొన్న జడతోదండనం-నేనుసిద్ధంగా ఉన్నాను-అన్నాడు. ఆమెనవ్వింది. అతనిఒడిలోనికి ఒరిగిపోయింది.

ఇదిగో! ఇట్టిచేష్ట 'తపనం' అనబడుతుంది.

15. లలితము :- పరమసుకుమారముగా కన్నులను, కను బొమలను, చేతులను కదల్చుట 'లలితము' అనబడుతుంది. ప్రియురాలి సర్వశరీరము ప్రియునిలోని శృంగారరసాన్ని తరంగితం చేసేదై వుంటుంది. ఆప్రియురాలే పరమసుకుమారంగా తన కాళ్ళు చేతులను కదలిస్తూ కనుబొమలను సుందరంగా పైకెత్తి క్రీగంట చూడడం జరిగితే ఆ చేష్టకు ప్రియునిలోనికామం మరొకమెట్టు పైకి ఎక్కుతుంది.

"ప్రియురాలు ఇంటిలో ఏదోపని చేస్తోంది. ఆమెశరీరం మెఱుపుదీవలా మెఱుస్తోంది. పొడవైనజడ పిరుదలపై నాట్యం చేస్తోంది. ప్రియునకామెను ముద్దాడవలెననిపించింది. అతడామెకు వెనుకగ వెళ్లి ఒకచేతితో ఆమెజడనుపట్టుకొని వేరొకచేతితో ఆమెముఖమును తన వంకకు త్రిప్పుకొని ముద్దుపెట్టుకొన్నాడు. అప్పుడామె కనుబొమలను పై కెత్తి విస్ఫారితములు, చంచలములుఅయిన నేత్రాలతో కోపముకాని కోపమును వ్యతిరేకతకాని వ్యతిరేకతను ప్రదర్శిస్తూ చూచింది. ప్రియునకాచూపు మదనుని తూపు (బాణం) అయింది. అతడు ఆదేశముతో విహ్వలుడై ఆమెను గాఢంగా కౌగలించుకొన్నాడు.

ఇదుగో! ఇట్టి చేష్ట 'లలితము' అనబడుతుంది.

16. బిబ్బోకము :- భర్త అధికంగా తన్ను ప్రేమిస్తున్న కారణంగా మిక్కిలి గర్వముకలదై వనిత తనకిష్టమైన వస్తువునందు అప్పుడప్పుడు భర్తయందు ఆనందం చూపడం లేదా అతనియొక్క ప్రణయకోపాన్ని లక్ష్యంచేయకపోవడం 'బిబ్బోకము' అనబడుతుంది.

సాధారణంగా భర్త ఎవరి వశమందుంటాడో అట్టి స్త్రీలయందు మాత్రమే ఈ విబ్బోకం అనే శృంగార చేష్ట వ్యక్తం అవుతుంది.

"ఇదిగో! యీ సన్నగడి చీర నీకై తెచ్చాను. అబ్బ! ఎన్నికొట్లు తిరిగేనని; రంగుబాగున్నచోట నేత బాగులేదు. నేతబాగున్నచోట రంగుబాగులేదు. రెండూ బాగున్నచోట అంచు నచ్చలేదు. దాదాపు రెండుగంటలు వెదుకగా వెదుకగా యీచీర ఒకదుకాణంలో కనబడ్డది. ఆమధ్య నీవిట్టిచీర కావాలి అన్నావుకదా? అని అచ్చం నీవు కోరినరకం చీరకై శ్రమించి తెచ్చాను'-అన్నాడు భర్త భార్యతో.

భర్తకుతనమీదగల ప్రేమాధిక్యానికి గర్విస్తూవున్న ఆ భార్య ఆఁ! చాల శ్రమపడ్డారు! ఎలాగైతేనేం తెచ్చేరు ఇన్నాళ్లకి ఒకనూలుచీర-అన్నది.

ఈమాటతో అతడు నీరసపడిపోయాడు. తానింత శ్రమపడి తెచ్చిన వస్తువుమీద, తనమీద ఇంత అనాదరం చూపినందులకు భార్యమీద కొంత అలుకకూడ వచ్చింది. కాని అలుకను ప్రదర్శించడానికి సమయం కాదనుకొన్నాడతడు. రాత్రిఅయింది. ముందుగా పడకటింటికి చేరుకొన్న ప్రియుడు భార్యరాకకై మనసులో నిరీక్షిస్తూ శయ్యమీద పెడమొగంపెట్టుకొని శయనించాడు అలుకను ప్రదర్శించడానికి వీలుగా, కొంతసేపటికి-ఆభార్యవచ్చింది. కోపకారణం ఆమెకు తెలియనిదికాదు. ఆమెకు ఏదో ప్రళయం జరుగుతుందన్న జంకులేదు. భర్తయొక్క స్వభావం ఆమెకు తెలియనిదికాదు. తాను భర్తను సులభంగా ప్రసన్నుని చేసికొనగలనన్న ధైర్యం ఆమెయందున్నది.

"శ్రీవారికి అలుకవచ్చిందా! పెడమొగంపెట్టుకొని శయనించారు"-అన్నదామె నవ్వుతూ.

భార్యకు సమాధానం చెప్పలేదు భర్త అతనిబిగింపు ఎంతటిదో ఆమెకు తెలుసు "అప్పుడే నిద్రపట్టిందికాబోలు! అంతా దొంగ నిద్ర!"-అంటూ అతనికి చక్కిలిగింత పెట్టిందామె.

వస్తూవున్న నవ్వును ఆపుకొనడానికి వ్యర్ధప్రయత్నం చేస్తూ నవ్వితే బిగింపుపోతుందని ఆతడు-ఏమిటిది? నన్ను తాకకు-అన్నాడు లేనికోపాన్ని ప్రదర్శిస్తూ.

ఆమె అతని కోపాన్ని లక్ష్యపెట్టక తిరుగఅతనికి చక్కిలిగింత పెట్టింది. అతడీమారు గట్టిగా కసరేడు.

ఈపర్యాయమామె-అంతాగొప్ప! పోనీయండి"!-అంటూ తానుకూడ కోపాన్నే ప్రదర్శిస్తూ అతనివీపుకు తనవీపునాన్చి శయనించింది. పదినిముషాలు గడిచాయి, భార్యయొక్క శరీరసన్నికర్షకు భర్తయొక్క మనస్సులోని కోరిక పట్టుతప్పి విజృంభింపసాగింది. అతడు నెమ్మదిగా ఆమెవంకకు తిరిగేడు. ఆమెపై చేయివైచాడు. ఆమె తన విజయాన్ని గుర్తించింది. అతనిచేతినామె తొలగించలేదు, అతనివంకకు తిరుగనూలేదు. అతడే ఆమెను తనవంకకు త్రిప్పుకొన్నాడు. ఆమెఒక బొమ్మవలె ఇటుతిరిగింది.

ఏబిగింపు తాను ప్రదర్శించాలని ఆభర్త భావించాడో ఆబిగింపు భార్య చక్కగా ప్రదర్శిస్తోంది. అతనిలో కోరిక విజృంభించింది. దానికి అనుగుణంగా భార్యకూడ ఆవేశంతో తన్ను ఆలింగనం చేసికొనేలా చెయ్యాలని అతని తాపత్రయం, ఆమెలోని కామాగ్నిని మండింపడానికై అతడేదేదో చేశాడు. కాని ఏం ప్రయత్నించినా ఆమెలోని కామాగ్ని లోలోపల ఏమిమండుతూవున్నదో కాని పైకి దానిజాడకనబడడంలేదు. అతని విషయం దీనికి భిన్నంగా ఉన్నది. భార్యామానసంలోని కామాగ్నిని దీప్తంచెయ్యాలని ప్రయత్నించినకొలది అతని మానసంలోని కామం సెగలెగయిస్తు విజృభించింది.

భర్తయొక్క ఉద్ధృతమైన ఆవేశాన్ని చూచి ఆమెనవ్వుతూ-ఇందాక అలుకవచ్చిందా? ఇప్పుడు అలుక తీరిందికాబోలు! నన్ను తాకనే తాకకు నాతోమాటాడకు అన్నారు. ఇప్పుడిదేమిటి? -అన్నది అనుగ్రహిస్తు. ఆభర్త చెప్పగల సమాధానంలేదు. అతడామెను పొదవుకొన్నాడు. ఆమె అనుగ్రహించిందికదా? వారిరువురు గాఢాలింగనంలో ఏకీకృత శరీరులయ్యారు.

ఇదికో! జిబ్బోకం అనేచేష్ట ఈవిధంగావుంటుంది.

యీ శృంగార చేష్టలన్నిటిని గూర్చిన ఎఱుకనాగరకులుగా మనగోరే-స్త్రీ పురుషులకు మిక్కిలి వుసరం. దీనివలన వారు తమ ప్రియులయందు శృంగార భావం ఏ స్థాయిలో వున్నదో అన్నవిషయము తెలిసికొని వర్తించగలుగుతారు.

★ ★ ★