నాగర సర్వస్వం/రత్నాలు - సుగంధాలు

వికీసోర్స్ నుండి

గణంలో నిరంతరం విహరించే యేర్పాటుకూడ నాగరకులు చెయ్యవలసి ఉంటుంది.

ఈ అన్నిటివలన ఆ నాగరకుని నాగరకతా లక్షణం వ్యక్తమై సర్వుల హృదయాలలోను అతడంటే ఒక ప్రత్యేకభావం ఏర్పడుతుంది. అయితే ఈ అలంకరణం అంతా తాను ఎవరినో మిక్కిలి నాగరకురాలైన వనితను ప్రేమించనారంభించి, ఆమెయొక్క అనురాగాన్ని సపాదించగోరి అప్పటికప్పుడు యత్నిస్తే సాధ్యంకాదు. తనను ఇంటిని అలంకరించుకొనడం నాగరకుని లక్షణం. ఆలక్షణమే అవసరమైనప్పుడు నాగరక వనితానురాగసంపాదనానికికూడ తోడ్పడుతుంది.

రత్నాలు - సుగంధాలు;

బాగా ధనవంతులైనవారు కేవలం బంగారు నగలనేకాక రత్నాభరణాలనుకూడ ధరిస్తారు. అవి వారిసౌందర్యాన్ని పెంచుటయే కాక నలుగురిలో వారికొక ప్రత్యేక గౌరవం కలిగింపజాలినవి అవుతాయనడంలో సందేహంలేదు. కాని గుణదోషపరిశీలన చెయ్యకుండా జాతి రత్నాలను ధరిస్తే అందంమాట దేవున కెరుక, ఆపదలు ముంచుకొనివస్తాయి. అందుచే ప్రాస్తావికంగా ఇక్కడ జాతిరత్నాల గుణదోషాలు సంక్షేపంగా చెప్పబడుతున్నాయి.

దోషంగల రత్నాన్ని ఎవరైనా తెలియక ధరిస్తే అతనికేకాదు, అతని సన్నిహిత బంధువులకుకూడ ఆపదలు కలిగే సావకాశంవున్నది. అట్టి దోషయుక్తములైన రత్నాలను ధరించడంవల్ల కారాగార ప్రవేశము (జైలుశిక్ష) ఏదో తెలియబడని వ్యాధిపీడ-బంధుమరణం-ధననాశనం వంటి విపత్తులు కలుగుతాయి. అందుచే రత్నాల గుణదోషాలు తెలిసికొనడం అవసరం.

రత్నం తగినంత బరువుకలదై - మంచి కాంతికలదై-నున్నగా-స్వచ్చంగా-సమంగా ఉంటే అది వుత్తమ రత్నం అనబడుతుంది. ఇట్టి రత్నాలను ధరించడంవల్ల మేలు కలుగుతుంది. అలాకాక రత్నం తగినంత బరువులేక తేలికగావుంటే అది వుత్తమ రత్నంకాదు. కాంతి కలదైనప్పటికి రత్నంలో ఎక్కడైనా చిన్న చుక్క లేక మచ్చ ఏర్పడిఉంటే అది దుష్టరత్నమే అవుతుంది. గీరలున్న రత్నాలు, పగిలిన రత్నాలు, నున్నగాకాక ఎగుడు దిగుడుగా వున్న రత్నాలు, కాకికాలువంటి రేఖలుగల రత్నాలు ఉత్తమ రత్నాలు కావు. ఈలక్షణాలలో ఏ ఒక్క లక్షణమున్నాసరే ఆరత్నాన్ని ధరించ కూడదు. వీనిని ధరించడం ఆపదలను కొని తెచ్చుకొనడమే అవుతుంది. రత్న శాస్త్రంలోకూడ (గుణవద్గుణ సంపదాం ప్రసూతి ర్విపరీతం వ్యసనోదయస్యహేతుః) "ఉత్తమమైన జాతిరత్నం గుణసంపదలను ప్రసాదిస్తే దోషయుక్తమైన దుష్టరత్నం ఆపదలను తెచ్చిపెడుతుంది" అని చెప్పబడినది.

లోకంలో అధికంగా వజ్రము-ముత్యము-పద్మరాగము-ఇంద్రనీలము-మరకతము-వైడూర్యము ధరింపబడుతూ వుంటయి.

వజ్రం కత్తి పదునువంటి పదునుకలదై వెడల్పుగా వుంటే ఉత్తమంగా భావింపబడుతుంది. ఆ పదును, వెడల్పూ అన్నవి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత వుత్తమమైనదని గ్రహించాలి.

ముత్యం ముత్యపు చిప్పనుండి లభిస్తుంది. అది నున్నగా గుడ్రంగావుండి తెల్లగా మెరుస్తూంటే వుత్తమమైనదిగా తలచాలి. నున్నదనము, గుండ్రదనము తెల్లనికాంతి అనేగుణాలు ఎంత ఎక్కువగా వుంటే అది అంత వుత్తమమైనదని గ్రహించాలి.

పద్మరాగమనబడే రత్నం బంధూక పుష్పమువలె, (మంకెన పూవు) మగకోకిల కనుగ్రుడ్డువలె, గురివెందపూసవలె మెరస్తూంటుంది. ఇట్టికాంతి తగినంతవుండి బరువు-నున్నదనము-స్వచ్చత్వము-సమత్వము అనే గుణాలు కలదై వెనుక చెప్పిన దోషములు లేకుండా వుంటే అది వుత్తమ పద్మరాగంగా భావించదగినది. ఇంద్రనీలమనబడే రత్నం నీలిరంగునీళ్ళలో ఒక బుడగ (నీటి బుడగ) తేలితే అది ఎలా మెఱస్తూ వుంటుందో అలామెరసేదై ఉంటుంది. ఇట్టి మెరుపు ఇతరములైన గుణాలు కలదైనపుడు దానిని శ్రేష్టమైన ఇంద్రనీలంగా భావించాలి.

మరకతమనబడే రత్నం మిణుగురు పురుగు వీపువలె (దానివీపు మెరిసే చిక్కని ఆకుపచ్చరంగు కలదై వుంటుంది.) క్రొత్తగా మొలచిన గడ్డివలె. నీటిలో తేలియాడే నాచువలె మెరుస్తూంటుంది. ఇట్టి మెరపు ఎక్కువగా కలిగివుండి చెప్పబడిన దోషములు ఏవీలేని రత్నాన్ని వుత్తమమరకత రత్నంగా భావించాలి.

వైడూర్యాలనబడే రత్నాలలో కొన్ని నెమలి మెడవలె ప్రకాశిస్తాయి. కొన్ని వెదురుపొదయొక్క ఆకువంటి కాంతికలవై వుంటాయి. ఇవి రెండూకూడ వుత్తమమైనవే. దోషరహితంగా చూచుకొని ఇట్టి వైడూర్యాలను ధరించవచ్చును.

రత్నాలు - అవి లభించే గనులనుబట్టి, వానిరంగునుబట్టి ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రాస్తావికంగా కొన్ని ముఖ్యమైన వానినిగూర్చి మాత్రం వివరించడం జరిగింది.

రత్నాలవలెనే నాగరకజనం తాము ఉపయోగించే సుగంధ ద్రవ్యాలనుకూడ విలక్షణంగా, వుత్తమంగా వుండేటట్లు చూచుకొనాలి. పూర్వం ఈ సుగంధ ద్రవ్యాలను ఇంటిలోనే తయారు చేసుకొనేవారు. కాని క్రమంగా అట్టి అలవాటు తొలగి సుగంధ ద్రవ్యాలను కొన్ని ప్రత్యేక సంస్థలవారు తయారుచేసి విక్రయిస్తే కొని వుపయోగించే సంప్రదాయం ఏర్పడ్డది. అందుచే వానియొక్క నిర్మాణ విధానం ఇక్కడ వివరింపబడడంలేదు.

నాగరకులు తాంబూలమునందు సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తూనే వుంటారు. స్నానం చెయ్యడానికి పూర్వం శరీరాన్ని నలుచుకొనే నలుగుపిండి, తలకు రాసుకొనే నూనే, స్నానార్ధమైన జలమూ కూడ సువాసనాభరితమై వుండునట్లు చూచుకొనాలి. నోటియెక్క దుర్వాసనను హరించి సువాసన కలిగించే ద్రవ్యాలను, చంకలయందేర్పడే చెమట వాసనను హరించే సామర్థ్యం కల ద్రవ్యాలనుకూడ వారు వుపయోగించాలి. మంచి సువాసనగల అగరువత్తులను అత్తరులను వారువుపయోగిస్తూ వుండాలి. ఇపన్నీ నాగరకతా లక్షణానికి మెరుగులు దిద్దుతాయి.

భాషా సంకేతములు

నగరాలలో నివసించే చతురులై స వనితలు పురుషుని యందెన్ని గుణాలు, ఎన్నిరకాల కళానైపుణ్యాలు వున్నాసరే - తామొక వక్రోక్తిని, ఒక గూఢార్ధాల్ని, ఒక సంకేతార్ధాన్ని చెప్పినపుడు గ్రహించలేనివాడైతే తిరస్కరిస్తారు. అలాంటి పురుషుణ్ని వారు వాడిపోయిన పూలదండలా విడిచి పెడతారు. వారి గూఢార్ధ వాక్యాలు ఎలా ఉంటాయో తెలిసికొనడానికి ఒక ఉదహరణం.

శ్లో॥ వాణిజ్యేన గతన్సమే గృహపతి ర్వార్తాపి సశ్రూయతే
    ప్రాతస్తజ్జననీ ప్రసూతతనయా జామాత్వగేహంగతా
    బాలాహం నవయౌవనా నిశకథం స్ధాతవ్యమస్మిన్‌గృహే
    సాయం సంప్రతి వర్తతే పధికహేస్థానాంతరం గమ్యతాం

ప్రయాణ సాధనాలు లేని ప్రాచీన కాలంలో ప్రయాణం కాలినడకనే సాగించవలసి వచ్చేది. ఎక్కడ చీకటిపడితే అక్కడ ఎవరియింటనో తలదాచుకొని రాత్రివేగించి తిరుగప్రయాణం చేయవలసిఉండేది.

అలాంటి వెనుకటి రోజులలో ఒక యువకుడైన బాటసారి సాయంకాలనికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఈ రాత్రి ఎక్కడ గడిపెదా అన్న ఆలోచనలో ఉన్నాడు. అలా ఆలోచిస్తూ అతడొక యింటినడవలో అడుగుపెట్టాడు. ఎవరో వచ్చిన అలికిడివిని ఆ యింటిలోనుండి ఒక మదవతియైన నవయువతి బయటకువచ్చి నడవలో నిలచియున్న నవయువకుడైన బాటసారిని పరికించిచూచింది. చూచీ చూడ