Jump to content

నాగర సర్వస్వం/పోటలీ సంకేతములు

వికీసోర్స్ నుండి

నడిమివ్రేలి దిగువరేఖ సప్తమికి, మధ్యమరేఖ అష్టమికి, పై రేఖ నవమికి సంకేతాలై యున్నాయి. ఆ తరువాత చూపుడువ్రేలియొక్క పై రేఖనుండి గణించాలి.

చూపుడువ్రేలియొక్క పై రేఖ దశమికి, మధ్యరేఖ ఏకాదశికి, దిగువరేఖ ద్వాదశికి సంకేతాలు. పిమ్మట బొటనవ్రేలి దిగువరేఖ నుండి లెక్కించాలి.

బొటనవ్రేలియొక్క దిగువరేఖ త్రయోదశి, మధ్యరేఖ చతుర్ధశికి, పై రేఖ పూర్ణిమకు లేక అమావాస్యకు (ఆ బొటన వ్రేలు ఎడమచేతిదైనపుడు పూర్ణిమకు, కుడిచేతిదైనపుడు అమావాస్యకు) సంకేతాలు.

ఇలా వున్న యీ సంకేతాలలో ప్రియురాలు స్పృశించిన సంకేతాన్ని గమనించి పురుషుడు ఫలానా తిధినాడు రమ్మంటూ వున్నదని గ్రహించి—వెనుక భాషాసంకేతాలలో జాములకు చెప్పిన "శంఖ-మహాశంఖాది సంకేతాలతో జామునుకూడ ఆమె సూచిస్తే- ఆ తిధినాడు-ఆ జామున-ఆమె సంకేతంద్వారా తెలిపిన దిశయందు ఆమెను కలిసికొనాలి.

ఈ సంకేతాలను పురుషులు, స్త్రీలు ఇద్దరూకూడ వుపయోగించ వచ్చును. వీనిద్వారా నాగరజనం యొక్క వర్తనం ఇతరులు తెలిసికొనడానికి వీలులేనిదై-దుర్భేద్యమై-నిరపాయమై-సుఖదమై వుంటుంది. భాషా సంకేతాలు మాట వినబడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోగింపబడతాయి. ఈ అంగ సంకేతాలు ప్రియుడు లేక ప్రియురాలు ఒకరినొకరు చూడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోస్తాయి.


పోటలీ సంకేతములు

ఈ లోకంలో కామినీ కాముకులు స్వచ్చా విహారాలు అసంఖ్యాక విధానాలలో సాగుతూంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక విధమైన సంకేతాన్ని వుపయోగించడానికి వీలు కుదురుతుంది. అందుచే భాషా సంకేతాలు, అంగసంకేతాలు అయిన పిమ్మట పోటలీ సంకేతాలు, వివరింపబడుతున్నాయి.

'పోటలీ'-అనగా పొట్లము. ప్రియుని యెదుటకు తనకుతానై వెళ్ళడానికి వీలుకుదరనప్పుడు నాగరయువతులు ఇతరులకు తెలియకుండ ఈ పోటలీ సంకేతాలను వినియోగిస్తారు.

"ప్రియుడు ఎక్కడనో వున్నాడు. అతనిని తాను ప్రేమిస్తూ ఉన్నది. తన యీప్రేమవార్త అతనికి తెలియాలి"-అన్నప్పుడు-సుగంధ ద్రవ్యాలు, వక్కలు, కవిరి పొట్లాముగాకట్టి అతనియొద్దకుపంపడం"—సంకేతముగా చెప్పబడ్డది.

ఎవరైనా యువతి కొన్ని సుగంధ ద్రవ్యాలను పొట్లముగాకట్టి తనయొద్దకు పంపడం జరిగితే, పురుషుడామె తన్ను ప్రేమిస్తూన్నదని గ్రహించాలి.

'నాకు నీ మీద ప్రేమ చాలాధికం'—అని సూచించడానికి-చిన్న ఏలకులు, జాజికాయ, లవంగములు పొట్లముగాకట్టి పంపుట-సంకేతముగా చెప్పబడినది.

అట్టిదైన పొట్లము తనవద్దకు పంపబడినప్పుడు ఆపొట్లమును పంపినవారు తన్ను అధికముగా ప్రేమిస్తున్నారని నాగరకులు గ్రహించాలి.

ఒకప్పుడు ఒకజంట ఒకరిమీద ఒకరు అనురాగం కలవారై సాంకేతికంగా కలిసి విహరించి, కొంతకాలానికి అందులో ఒకరికి ఒకరిమీద ఏదో కారణంవల్ల విరక్తికలిగి తమప్రేమకు స్వస్తి చెప్పదలచినప్పుడు 'పగడమును' పొట్లముగాకట్టి పంపుట సంకేతముగా చెప్పబడ్డది.

తనయొద్దకు పగడము పొట్లముగాకట్టి పంపబడినప్పుడు-ఆపంపినవారు ఇంతవరకూ తన్ను ప్రేమిస్తూన్నా, ఇప్పుడు ప్రేమించడంలేదని, తమప్రేమకు స్వస్తి చెప్పేరని- నాగరకులు గ్రహించాలి.

చిరకాల సమాగమానాన్ని సూచించడానికి-రెండు పగడములను పొట్లముగాకట్టి పంపడం—సంకేతమైయున్నది. "ఒక యువతి, ఒక యువకుడు చాలకాలానికి వెనుక ఒకరినొకరు ప్రేమించి విహరించారు. కాని తరువాత కొన్ని కారాణాలవల్ల ఒకరి నొకరు దూరమైపోయారు. మరల కొంతకాలానికి ఇద్దరూ ఒకేఊరిలో ఉండడం సంభవించింది. వారికి ఆ చిన్ననాటి నెచ్చెలి ఈ యూరనే యున్నట్లు తెలిసింది. ఈ విషయం ఆ యువతికి, ఆ యువకునకు ఇద్దరకు తెలిసియున్నదే. అయినా ఎవరిమట్టుకు వారు వెనుకటి ప్రేమ నిలచి యున్నదో లేదో అని సందేహిస్తున్నారు.

అట్టి పరిస్థితిలలో ఆ యువతి వద్ధనుండికాని, యువకునివద్దనుండి కాని—రెండు పగడాలు పొట్లాముగా కట్టి పంపబడితే- ఆ పంపినవారు తమ్ము ఇంకను ప్రేమిస్తూనే ఉన్నారని, తమయొక్క చిరకాల సమాగమాన్ని సూచిస్తున్నారని నాగరకులు గ్రహించాలి.

"నేను నీ మీది నలవు నిలుపలేక, దానివల్ల జ్వరంవచ్చి బాధపడుతున్నాను."—అని చూచించడానికి—'చేదుగా, కారంగాఉండే ద్రవ్యాలను పొట్లముగాకట్టి పంపుట' సంకేతముగా చెప్పబడ్డది.

"నేను నిన్ను ఇప్పుడే కలియగోరుతున్నాను. ఆలస్యానికి సహించలేను"—అనుటకు—"ద్రాక్షపండు పొట్లముగాకట్టి పంపుట"—సంకేతమై యున్నది.

అట్టి పొట్లమును ఏ యువతి అయినా తనయొద్దకు పంపినపుడు యువకుడామె వెంటనే తన్ను కలియుటకై రమ్మంటూవున్నదని గ్రహించాలి.

'నా శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను'—అనుటకు ప్రత్తిని పొట్లముగాకట్టి పంపుట—సంకేతమై యున్నది.

'నా శరీరాన్నేకాదు, ప్రాణాలనుకూడ నీకై అర్పిస్తున్నాను'-అనుటకు జీలకఱ్ఱను పొట్లముగాకట్టి పంపుట సంకేతము.

'నేను నిన్ను కలియగోరుతున్నాను. కాని ఏది యెటువస్తుందో అని మిక్కిలి భయముగా వుంది'—అని భీతిని సూచించడానికి 'జీడిని పొట్లముగాకట్టి పంపుట' సంకేతము. 'నాకు నిన్ను కలియాలని ఉన్నది. నాకు భయములేదు. నీవుకూడ భయపడనక్కరలేదు'—అని సూచించడానికి 'కరక్కాయను' పొట్లముగాకట్టి పంపుట సంకేతము.

కరక్కాయతో కూడిన పొట్లము ప్రియురాలివద్దనుండి వచ్చినపుడు పురుషుడు జంకుగొంకులు లేకుండ ఆమెను కలియుటకు యత్నింపవచ్చును.

'నేనిదివరకు మన్మధ వ్యాపారము నెఱుంగనిదానను, నేనునిన్ను మిక్కిలి ప్రేమిస్తున్నాను, మన్మధుడు నన్ను మిక్కిలి వేధిస్తున్నాడు, నన్ను దయజూడు'-అని సూచించడానికి ప్రత్యేకసంకేతము చెప్పబడినది.

మైనము తెచ్చి దానిని నున్నని ముద్దగాచేసి, దానిపై ఎఱుపు దారముచుట్టి, ఆముద్దమీద తనచేతి ఐదుగోళ్లు నాటునట్లు ఒక్కసారి నొక్కి, దానిని పొట్లముగాకట్టి పంపుట పైన చెప్పిన మూడు విషయాలకు సంకేతమై యున్నది.

ఇందు 'నున్నని మైనపుముద్ద'-ఇంతవరకు పరసంపర్కము ఎరుగనిదనుటకు, దానికి చుట్టిన ఎఱ్రదారము-'ఆమె తన్ను ప్రేమిస్తూన్న దనుటకు', దానిమీద గ్రుచ్చబడిన గోరులైదూ-'ఆమెను మన్మధుడు తనబాణము లైదింటితోడను వేధిస్తున్నాడనుటకు'-సూచనలు.

ఇట్టి పోటలీ సంకేతములద్వారా కామినీకాముకులు నిగూఢముగా కలిసికొని విహరించగలవారు అవుతారు.


వస్త్ర సంకేతములు

నాగరకులు తాము ధరించే దుస్తుల ద్వారాకూడ తమ మనోభావాలను సాంకేతికంగా వెల్లడించే స్వభావం కలవారై ఉంటారు. భాషాసంకేతములకంటె వస్త్రసంకేతములు నిగూఢములైనవి. ఏమంటే ఇచ్చట తనపని తానుచేసి కొంటూ తాను ధరించిన వస్త్రంద్వారా