Jump to content

నాగర సర్వస్వం/పుత్రప్రాప్తి

వికీసోర్స్ నుండి

పుత్రప్రాప్తి - ఉపాయము

దంపతులు ఈలోకంలో సుఖంగా ఆనందమయంగా తమ జీవనాలను గడపడానికి ఉపయోగించే సర్వవిషయాలు వెనుకటి ప్రకరణాలలో చెప్పబడ్డాయి. ఇక యీలోకంలోను పరలోకంలోను కూడ సుఖాన్ని అందిచ్చే పుత్రుడనే మహాఫలం దంపతులు ఏవిధంగా పొందగలరన్న విషయం ఈ ప్రకరణంలో చెప్పబడుతూ ఉన్నది.

సాధారణంగా ఆలుమగలు తమ కామపరితృప్తికై ప్రవర్తించే సమయములోనే భగవంతుని అనుగ్రహం వారియందు ఫలించి వారికి పుత్రుడో పుత్రికయో జన్మిస్తూ ఉంటారు. కాని కొందరికి పిల్లలు కలుగరు. అట్టివారు సంతానం కోసం పరితపిస్తూ చెట్టుకు, పుట్టకు మ్రొక్కుతూ, వ్రతాలు నియమాలు ఆచరిస్తూ ఉంటారు. అట్టిదంపతులు తమకు పుత్రులు కలుగలేదని చింతింపనక్కరలేదు. వారు ఈదిగువ విషయాలను పాటించడం ద్వారా సంతానాన్ని పొందగలుగుతారు.

పుత్రాభిలాషకల దంపతులు చేయవలసిన పనులు :

సంతానంకావాలని పరితపించే వనిత ఋతుస్నానం చేసిన రోజున పగలు చాల పవిత్రంగా గడపాలి. ఆరోజున ఆమె బ్రాహ్మణులకు భోజనంపెట్టి యధాశక్తి దక్షిణలిచ్చి, తనకు మంచి సంతతి కలుగునట్లు ఆశీర్వదించవలసినదిగా వారిని కోరాలి. స్వయంగా ఇష్ట దేవతను ఆరాధించాలి.[1] ఆమెయొక్క భర్తకూడ పరస్త్రీగమనము అసత్యము, మద్యము, మాంసము, పరిహాసము, క్రోధము, అభిమానము - అనే దోషాలను విడచి శివపూజా పరుడుకావాలి. తనకు సంతానమును అనుగ్రహింపుమని పార్వతీతోకూడిన పరమశివుని ప్రార్ధించాలి.

ఈవిధంగా పవిత్రముగా పగటిభాగము గడపి సూర్యుడస్తమించి చీకటి పడినమీదట చక్కగా అలంకరింపబడిన శయ్యాగృహానికి చేరుకొని ఆదంపతులు ఇష్టదైవాన్ని స్మరించి బాహ్య-అభ్యంతర రతులయందు ప్రవృత్తులు కావాలి. ఈవిధంగా రతిలో ప్రవృత్తులుకావడానికి పూర్వం వారు తమయొక్క శ్వాస సూర్యనాడిలో నున్నదో చంద్రనాడిలో ఉన్నదో గమనించి చంద్రనాడిలో ఉంటే సూర్యనాడిలోనికి మార్చుకోవాలి అయితే సూర్యనాడి చంద్రనాడి అనగా ఏమోకొందరకు తెలియకపోవచ్చును. అందుచే ఆనాడుల విషయం ఇచ్చట తెలుపబడుతూ ఉన్నది.

సూర్యచంద్రనాడులు : మానవుడు ముక్కుతో శ్వాసక్రియ జరుపుతాడుకదా! ఆముక్కుకు ఉన్న రంధ్రాలు రెండు. ఈ రెండింటి ద్వారా గాలి పీల్చి వదలుతున్నామని అందరూ అనుకొంటారు! కాని దీనిలో కొంత తేడా ఉన్నది. ముక్కుయొక్క రెండురంధ్రాల ద్వారా కాక యేదో ఒక రంధ్రంద్వారా మాత్రమే శ్వాసక్రియ జరుగుతూ వుంటుంది. కొంతసేపు కుడిరంధ్రముద్వారా శ్వాసక్రియ జరిగితే కొంతసేపు ఎడమరంధ్రము ద్వారా జరుగుతుంది. ఒక రంధ్రము నుండి వేరొక రంధ్రానికి శ్వాసమార్పుచెందే సమయంలో మాత్రం కొన్ని క్షణాలు రెండు రంధ్రాలతోను శ్వాసక్రియ సాగుతుంది. ఈ మార్పులు మనకు తెలియకుండానే జరుగుతూ వుంటాయి.

వీనిలో కుడిరంధ్రము నుండి జరిగే శ్వాసక్రియ సూర్యనాడి అని ఎడమరంధ్రము నుండి జరిగే శ్వాసక్రియ చంద్రనాడి అని అన బడతాయి. చంద్రనాడిని సూర్యనాడిగా మార్చదలచినపుడు ముక్కు యొక్క ఎడమరంధ్రమును చేతితో మూసి కుడిరంధ్రముద్వారా బలంగా శ్వాసపీల్చి విడిచిపెట్టాలి. ఇలా కొన్నిసార్లుచేయగా శ్వాస సహజంగానే కుడిరంధ్రంలో రాకపోకలు సాగిస్తుంది. సూర్యనాడి చంద్రనాడిగా మార్చవలెనన్నపుడుకూడ ఇదేవిధానం. అప్పుడు కుడి రంధ్రమును వ్రేలితోమూసి ఎడమరంధ్రముద్వారా బలంగా గాలిపీల్చి విడువాలి. సూర్యనాడియందు శరీరములోని నెత్తురు మొదలగు సప్త ధాతువులయొక్క స్థితి స్చచ్ఛంగా ఉంటుంది. చంద్రనాడియందది కొంత మారుతుంది. ఇది నాడులను గూర్చిన అల్పపరిచయము. ప్రకృతానికి వద్దాము.

శయ్యాగృహానికి చేరుకొన్న దంపతులు తమ శ్వాసక్రియను సరిచేసుకొని తమయందు సూర్యనాడి ఆడుతూఉండగా, అనగా ముక్కుయొక్క కుడిరంధ్రములో నుండి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు జరుగుతూ ఉండగా బాహ్య-ఆభ్యంతర రతులయందు ప్రవృత్తులు కావాలి. ఆభ్యంతరరతి సమయములో భర్త తన పురుషాంగముచే భార్యయోనిలోని పుత్రనాడిని (ఈ విషయము వెనుక చెప్పబడినది) ప్రేరేపించినచో ఆమె గర్భాన్ని ధరించి వంశోద్ధారకుడైన కుమారుని ప్రసవిస్తుంది. ఆమె భర్త దుహిత్రిణీనాడిని ప్రేరేపించినచో ఆమె గుణవతియైన పుత్రికను ప్రసవిస్తుంది.

ఋతుస్నాన దివసంలో పైనచెప్పిన నియమాలను పాటించిన దంపతులకు అభీష్టసంతానం కలుగుతుంది. ఇందు సందేహం లేదు.

★ ★ ★

  1. ఈ గ్రంథకర్త బౌద్ధుడైనందున సంతానాభిలాషకల బౌద్ధవనిత బౌద్ధబిక్షువులకు భోజనం పెట్టాలి అని, బౌద్ధులకు ఆరాధ్యదేవతయైన "తారాదేవిని' పూజించాలి" అని కూడ చెప్పినాడు.