నాగర సర్వస్వం/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాగర సర్వస్వం

పీఠిక.

నాగర సర్వస్వం అంటే యేమిటి ? అన్న సందేహం ప్రతి పాఠకుని మనస్సులోను తొలుత ఉదయిస్తుంది. ఆ సందేహాన్ని నివారించి గ్రంథంలోని విషయాలను వివరించడం మంచిదికదా! ఆ సందేహ నివారణ కొఱకే యీ పీఠిక.

పూర్వ కాలంలో రిపుంజయుడనే మహారాజు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆరాజు పరమసుందరుడు. ఆయన శౌర్యం సాటిలేనిది. ఆయన సంపదకు కుబేరుడు. బుద్ధికి బృహస్పతి అయి ప్రజారంజకంగా రాజ్యంచేస్తూ ఉండేవాడు.

రిపుంజయుని సౌందర్యంచూచి నలుగురు రాచకన్నియలాయనను వరించారు. వారు నలువురు సుందరాంగులే, ఉన్నత కుటుంబాలనుండి వచ్చినవారే, అందువలన రిపుంజయుడు వారితో కలిసి విహరిస్తూ భూమి మీదనే స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఆయన తన భార్యలను నలుగురను సమానమైన ప్రేమతో ఆదరిస్తూ వారిలో వారికి మాత్సర్యం కలుగకుండచూస్తూ ఉండేవాడు. ఇలా ఆ రాజు ఎంతో నేర్పుతో వర్తిస్తూ ఉండడం వల్ల మనస్సులో ఏలాఉన్నా పైకిమాత్రం ఆ నలువురు భార్యలు అక్క చెల్లెండ్రవలె కలిసిమెలసి ఉంటూండేవారు.

కొంతకాలానికి ఆ నలువురు భార్యలు గర్భవతులయ్యారు. నలుగురు భార్యలు ఒక్కసారి గర్భవతులు కావడంతో రాజుయొక్క ఆనందానికి అవధిలేకపోయింది. ఆయన పట్టరాని ఉత్సాహంతో ఎన్నో వినోదాలు, వేడుకలు ఏర్పాటు చేయించాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించి తాను ఎల్లవేళలా అంతఃపురంలో భార్యల సన్నిధానంలో గడపసాగాడు. తొమ్మిది నెలలు గడచాయి. ఒక మంచి ముహూర్తాన పెద్దభార్య కళావతీదేవికి మగబిడ్డ జన్మించాడు. ఈవార్త నగరం అంతట ప్రాకింది. అంతా ఉత్సాహంగా ఉన్నారు. అంతలో రెండవ భార్య ఇందుమతీదేవికికూడ మగబిడ్డ కలిగినాడన్నవార్త, దానికి వెంటనే మూడవభార్య రత్నావతీదేవికి, నాల్గవభార్య మాలాదేవికికూడ మగబిడ్డలే జన్మించారన్న శుభవర్తమానం నగరంలో వ్యాపించింది. దానితో ఆరాజుయొక్క రాజధాని నరగమంతా ఉత్సాహంతో నిండిపోయింది.

మహారాజు రిపుంజయుని హృదయం ఒక్కసారిగా జన్మించిన కుమారులను చూడడంతో పున్నమిచంద్రుని జూచిన సముద్రంలా పొంగింది. ఆయన యెన్నో వేడుకలు ఉత్సవాలు జరిపించాడు. దానధర్మాలు ఆచరించాడు.

ఆ రాజకుమారులు కూడ తల్లిదండ్రులవలెనే అందంగా ఉన్నారు. వారి మొగములేకాదు, చేతులు, కన్నులు, పాదాలుకూడ అరవిడిచిన ఎఱ్రతామరవలె ఉన్నాయి.

రిపుంజయుడు వారికి జాతకర్మ చేయించి పెద్దవానికి అజయుడని రెండవవానికి విజయుడని మూడవవానికి సూర్యుడని నాల్గవవానికి చంద్రుడని పేరులు పెట్టాడు.

ఆ బాలకులు తల్లుల ఒడులలోనో, తండ్రి గుండెమీదనో ఉండేవారేకాని ఊయలలో ఉండడం అన్నదిలేదు. వారిని తల్లిదండ్రులు అంత ముద్దుగా చూస్తూ ఉండేవారు. క్రమంగా ఆ బాలురు పెరిగి అంతఃపురం అంతా ప్రాకడానికి ఆరంభించారు. వారు అంతఃపురం యొక్క నడవలో నాలుగువైపులకు ప్రాకివెళ్ళి వెనుదిరిగి చూచినపుడు ఒక్కసారిగా నాలుగుచంద్రబింబాలు ఎదురెదురుగా ఉదయించినట్లు ఉండేది.

రిపుంజయుడు తనకుమారులకు ఐదేండ్లు వచ్చినంతనే చదువుచెప్పుటకై తగిన ఉపాధ్యాయులను నియమించాడు. ఆరాకుమారులు గురువు చెప్పడమే తడవుగా అన్ని విధ్యలు గ్రహిస్తూవచ్ఛారు. పదునారేండ్లు వయస్సువచ్చేసరికి వారికి రాని విద్యఅంటూ లేదు. శాస్త్రాలు వల్లించుటయేగాక అన్నిరకములైన ఆయుధవిద్యలయందు వారు ఆరితేరారు. అంతేకాక అశ్వారోహణ, గజారోహణ, రథారోహణలయందు సేనలను సడఫుటయందు. వ్యూహములను కల్పించుట యందుకూడ సుశిక్షితులయ్యారు. ఆ రాకుమారులు పదునారేండ్ల వయస్సు కలవారే అయినప్పటికి నిరంతరం వ్యాయామం చేయడంవల్ల వారి శరీరాలు మంచిపుష్టి కలిగి సమున్నతంగా వున్నాయి.

రిపుంజయుడు తన కుమారులను చూచిమురిసిపోతున్నాడు. ఒకనాడాయన సభలో కూర్చుండి వుండగా ఒక రాజదూతవచ్చి ఆహ్వానపత్రిక నొకదానిని ఆయన చేతిలోపెట్టాడు. అదియొక రాకుమారి యొక్క స్వయంవరాహ్వానం, ఆ రాకుమారిక పేరు స్వయంప్రభ, ఆమె యొక్క సౌందర్యంముందు దేవతల సౌందర్యంకూడా ఎందుకూ కొఱగానిదని, సంగీత సాహిత్య విధ్యలలో ఆమె సాటిలేదని ప్రసిర్థి. ఆ రాజకుమారియొక్క స్వయంవరానికి రానలసిందని ఆహ్వానం వచ్చింది.

అ ఆహ్వానాన్నిచూచి రిపుంజయుడు - నేను స్వయంవరానికి వెళ్ళడం ఏమిటి? నాకు నలుగురు భార్యలున్నారు, రత్నాలవంటి నలుగురు కుమారులున్నారు అనుకొన్నాడు. ఈ స్వయంవరానికి కుమారులను పంపితే బాగుంటుదనుకొన్నాడు. కాని ఆయన కుమారులంతా గంటలు, ఘడియలు తేడాలో సమవయస్కులు, ఆ రాచకూతురు వీరిలో ఒకరిని వరించినా మిగిలిన ముగ్గురకు పెండ్లికూతుళ్ళను వెదకాలి కదా! అందుచేత ఇది బాగలేదు. నలుగురకు చక్కని కన్యలను వెదకి ఒకేసారి ఒకే ముహూర్తాన పెండ్లిచేస్తే బాగుంటుందనుకొన్నాడాయన. ఈ ఆలోచన రావడంతో ఆయన సభచాలించి అంతఃపురానికి వెళ్ళాడు.

అంతఃపురములోనికి రిపుంజయుడు అడుగుపెట్టగానే ఆయన భార్యలు నలుగురు ఆయన కెదురుగా వచ్చారు. ఆయనవారితోకలిసి ఆమాట ఆమాటచెప్పి కుమారులకు యుక్తవయస్సు వచ్చినది, వారికి తగిన కన్యలను వెదకి పెండ్లి చేయాలి. - అన్న తన ఆలోచనను వెల్లడించాడు. దానికి వారంతా సంతోషించారు.

నలుగురు కుమారులకు తగిననారు - అందగత్తెలు విద్యా వినయాలలో సాటిలేనివారు అయిన రాజకుమార్తెల చిత్రాలను దేశ దేశాలనుండి త్వరలో రప్పించమని రిపుంజయుడు తన మంత్రికి ఆజ్ఞాపించాడు.

కొంతకాలానికి ఎందరో సుందరాంగులైన రాకుమారికలయొక్క చిత్రాలు రివుంజయుని అంతఃపురానికి చేరుకొన్నాయి, వారంతా పరమ సుందరులు. ఒకరిని మించిన సౌందర్యం మరియొకరిది. ఆ చిత్రాలకు దిగువనే వారి విద్యాపాటవాలు గుణస్వభావాలు సంక్షేపంగా వ్రాయబడ్డాయి.

రిపుంజయుడు ఈ మొత్తం చిత్రాలనన్నిటిని ఎదుటబెట్టుకొని భార్యల తోడ్పాటుతో అందులో మేలైన చిత్రాలను నాలిగింటిని ఎన్నిక చేసాడు. ఆ నలుగురు గుణరూప స్వభావాలలో మిగిలిన రాకుమారికలకంటే మిన్నగా వున్నారు. వారి రూపసౌందర్యాలు భిన్నంగావున్నా నిరుపమానంగా వున్నాయి. అందుచే రెపుంజయుడు ఆ నలుగురను తనకు కోడండ్రుగా చేసికొనాలని ఊహించాడు. అయితే ఏ కన్యక నేకుమారునకు చేసికొనుట అన్నది ఇంకను తేలలేదు. అందుచేత రాజు ఆ చిత్రాలను నాల్గింటిని తీసికొని పెద్దభార్యతో ఆలోచించారు. అమె ఆ నాలిగింటిలో తనకుమారునకు తగిన కన్యయొక్క చిత్రాన్ని ఎన్నికచేసికొన్నది. అనంతరం ఆ రాజు రెండవభార్య సన్నిధికి మిగిలిన మూడు చిత్రాలను తెచ్చి వీనిలో నీరు నచ్చిన చిత్రాన్ని యెన్నిక చెయ్యి. ఆమెతో నీ కుమారుని వివాహం జరిపిస్తానన్నాడు.

"ఈ చిత్రాలు నాలుగుకదా! మూడే వున్నాయేమి”? - అన్నదామె. “ఒక చిత్రం కళావతి ఎన్నుకొన్నది, అందుచే మూడే తెచ్చాను" - అన్నాడు రాజు.

అది విన్న రెండవభార్య - మంచి చిత్రం ఆమె యెన్నుకొన్నది. ఇక యీ చిత్రాలను నాకు చూపడం ఎందుకు? మీ పెద్దకుమారునికి పెండ్లి చేసికొనండి. నేను ఎన్నికచేయనక్కరలేదు. నా కుమారుడు ఆజన్మ బ్రహ్మచారిగానే వుంటాడు అన్నది ఈర్షతో.

రాజుకు ఇది క్రొత్తసమస్య అయినది. ఆయన పెద్దభార్యకు నచ్చజెప్పబోతే అమెకూడ అంగీకరించలేదు. ఎంత శ్రమపడినా ఆరాణు లందరు ఒకరు కోరిన వధువునే వేరొకరు కోరుకొంటూవచ్చారు. దానితో రాజుకు చాల చికాకుకలిగింది. ఆయన కుమారుల వివాహాలు కుమారులే చేసికొనడం మేలైనదనుకొన్నాడు.

ఆ ఊహ తోచినంతనే రిపుంజయుడు తన నలుగురు కుమారులను పిలచి - మీరందఱు దేశాటనంచేసి తగిన కన్యలను పెండ్లాడిరండి. మీ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాను - అన్నాడు. దానికి వారందరు సంతోషంతో అంగీకరించారు.

ఒక శుభముహూర్తాన ఆ నలుగురు రాజకుమారులు చాలినంత ధసం తీసికొని గుఱ్ఱాలమీద దేశాటనానికి బయలుదేరారు. వారు సవతితల్లి బిడ్డలేఅయినప్పటికి ఏకోదరులకంటె ఎక్కుప స్నేహము, ప్రేమకలవారు. అందుచే మిక్కిలి వుత్సాహముతో ఆయా వింతలు, విశేషాలుచూస్తూ ప్రయాణం చేయసాగారు. ఇలా వారు ఎన్నో దేశాలు గడచి చైత్రరధం అనే నగరానికి చేరుకొన్నారు.

చైత్రరధం చాల సుందరమైన నగరం. అందలి విశాలములైన రాజమార్గాలు, వున్నతములైన సౌధాలు, నగరవాసుల రూపురేఖలు, వేషభూషణాలు మనోహరంగా వున్నాయి. అందువల్ల ఆ నగరంలోని వింతలు చూడడానికి రాకుమారు లచ్చట సత్రంలో షుకాంచేశారు. వుదయం కాగానే పెద్దవాడైన అజయుడు- "నేను బసలో వుంటాను. మీరు నగరంలోనికివెళ్ళి చూచిరండి. మీరు వచ్చిన మీదట సాయంకాలం నేను వెడతాను. మధ్యాహ్నం భోజనసమయం దాటకుండ మాత్రం మీరువచ్చితీరాలి-అన్నాడు తమ్ములతో.

ఇలా అన్న అనుమతి ఈయగానే విజయుడు, సూర్యుడు, చంద్రుడు నగరం చూడడానికి వుత్సాహంగా బయలుదేరారు. ఇక్కడ - జయుడొక్కడూ వచ్చేపోయే నాగరికులను చూస్తూ సత్రం అరుగు మీద కూర్చున్నాడు.

మధ్యాహ్నం అయింది. భోజనసమయంకూడ దాటుతోంది. కాని నగరంచూడడానికై వెళ్ళిన తమ్ములు రాలేదు. అజయుడే వారిరాకకై ఎదురుచూస్తున్నాడు. అలా నిరీక్షిస్తూవుండగా సాయంకాలం కూడ గడచిపోయింది. రాత్రికూడ చాలవరకు నిరీక్షించి ఆజయుడు తన తమ్ములేమైనారో అని పరిపరివిధాలుగ ఆలోచించాడు. తెల్లవారు సరికైన రాకపోతారా? అనుకొన్నాడు.

తెల్లవారింది. కాని సోదరులు తిరిగారాలేదు. ఇక నిరీక్షించి ప్రయోజనంలేదు. నగరంలోకి స్వయంగా వెళ్ళి వారిజాడ తెలిసి కొనాలనుకొన్నాడు అజయుడు. అతడు సత్రంయొక్క అధికారికి తమ సామానులు అప్పగించి నగరంలోనికి బయలుదేరాడు. అతడెన్నో వీధులుతిరిగాడు. అన్నివీధులు జనంతోనిండివున్నాయి. ప్రతివస్తువు చూపుసు ఆకర్షించేదిగా వుంది. కాని ఆజయుడు దేనిచేతను ఆకర్షింప బడలేదు. అతనికి తన సోదరులు కనబడలేదన్న చింత ఎక్కువగా వున్నది.

సోదరులకొఱకు వెదకుతూ వెదకుతూ మధ్యాహ్న సమయానికి అజయుడొక పెద్దవీధిలో అడుగుపెట్టాడు. ఆవీథి అన్నీ వీధులకంటె సుందరంగా వున్నది, అచ్చటనైన తన సోదరులు కనపడతారేమో అన్న ఆతురతతో అజయుడు నాలుగువంకలా పరికిస్తూ ముందుకు వెళ్ళసాగాడు. అంతలో ఒక మహాభవనం అతని దృష్టిని ఆకర్షించింది. ఆ భవనం రాజభవనమంత పెద్దది. ఎత్తైన ప్రాకారపుగోడ, విశాలమైన ప్రవేశద్వారము ఆ భవన సౌందర్యాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. అజయుడాభవన ప్రాకార సమీపానికి వెళ్ళాడు. అక్కడ ద్వారసమీపంలో చలువరాతిమీద చెక్కబడిన ఒక ప్రకటనపై అతనిచూపు పడ్డది. అందులో ఇలా వ్రాయబడి వున్నది.

         ఐదే ప్రశ్నలు!
    ప్రశ్నలు శాస్త్రీయములే!
    సముచిత సమాథానము చెప్పగలిగితివా -
    రాకుమారి రత్నవదిక ఈ రాజ్యంతో నీకు పాదదాసి.
    నీ సమాధానములు తగినవి కానిచో-
         నీవామెకు తోటమాలివి.
                           -రాకుమారి రత్నవదిక,

అజయుడా ప్రకటన చదివేడు. అతడనుకొన్నాడు- ఇదేమి ప్రకటన! రాకుమారిక శాస్త్రములందు బ్రశ్నించునా? ఐదు ప్రశ్నలా! ఆ ప్రశ్నల కింతవరకు ఎవరును సమాధానము చెప్పలేకపోయిరా? ఏవో వికట ప్రశ్నలయినచో సమాధానము చెప్పజాలకపోవచ్చును. కాని శాస్త్రములందు చెప్పబడిన విషయములందే ప్రశ్నించినపుడు చెప్పకపోవుట యేమిటి! శాస్త్రములు చదివినవాడెవరైన చెప్పవచ్చునే! ఇంతకు నా సోదరులేమైనట్లు? వారిక్కడకువచ్చి చిక్కుకొనలేదుకదా! ఏమో! ఎవరు చెప్పగలరు?

ఇలా ఊహించుకొని అజయుడు వచ్చేపోయే జనాన్ని అడిగి కొంత వివరం తెలిసికొన్నాడు. అతనికి తెలియవచ్చిన విషయంఇది.

"రత్నవదిక చాల అందగత్తె, బుద్ధిమతి, విదుషి. ఆమెతండ్రి ఆమెకీరాజ్యం అప్పగించి చనిపోయాడు. మంత్రుల సాయంతో ఆమెయే యీ రాజ్యాన్ని పాలిస్తోంది. ఆమె నవయువతి, ఇది ఆమె వుద్యా నాన్ని అంటివున్న భవనము తనకు తగిన భర్తను సంపాదించుకొనుటకై ఆమె యీ ప్రకటనను వ్రేలాడగట్టి ఏండ్లుదాటింది. ఇంతవరకు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వెళ్ళినవారెందరో ఆమెతోటలోపనిచేస్తున్నారు. అవేవో చిత్రమైన శాస్త్రప్రశ్నలు వానికి సమాధానం చెప్పడం అసంభవం. ఆ రాకుమారికి పెండ్లియే కాదేమో!"

ఇలా వున్నాయి జనం చెప్పేమాటలు, అజయుడు ఆలోచించికాని ఏపనీ చేయడు. అతడాభవన ద్వారం దగ్గఱ కావలియున్నవాని వద్దకు చేరి-నిన్న ఎవరైనా ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చినారా? అని అడిగేడు.

ఆఁ! వచ్చారుబాబూ! వారెవరో మీవలెనే వున్నారు. మొత్తం ముగ్గురు. ఇప్పుడు తోటలో పనిచేస్తున్నారు అన్నాడు.

ఇది విని అజయుడు ఆశ్చర్యపడ్డాడు. అతడాలోచించసాగాడు. నా సోదరు లిక్కడ చిక్కుకొన్నారన్నమాట. కాని ఇది సంభవమా! మా చదువని శాస్త్రములు లేవు. వారామె ప్రశ్నలకు తగు సమాధానములు చెప్పలేకపోయినారా? వారు చెప్పజాలకపోయిన నేను మాత్రము చెప్పగలనా? తమ్ములను విడిపించుట యెట్లు? ఇంతకు ఆమె యే శాస్త్రములో ప్రశ్నిస్తోంది? నవయువతి అగుటచే కామ శాస్త్రములో ప్రశ్నించునేమో! అందైనను సోదరులకు తెలియని విషయములు లేవే! అట్లుకాదు. యౌవ్వన మింకను బొడసూపకముందే కామశాస్త్రములు చదువుట మంచిదికాదని గురువులు నిషేదిస్తూ వాత్స్యాయన మహర్షి రచించిన కామ సూత్రములకు మాత్రమే బోధించారు. కామశాస్త్రములేకాక కామశాస్త్రగ్రంథములెన్నో వున్నవి. నేనుమాత్రము ఆ గ్రంథాలన్నీ తెప్పించి చదివేను. వారు చదువలేదేమో! ఈ రాకుమారి తప్పక కామశాస్త్రములోనే ప్రశ్నిస్తూవుండాలి. లేకపోతే నా తమ్ములను జయించడం ఈమెకు సాధ్యంకాదు. ఇప్పుడు నేనేమిచెయ్యాలి? ఆమె ప్రశ్నలకు సమాధానం చెపుతానని లోపలకువెళ్ళనా? మాననా? సమాధానం చెప్ప డానికి నేను సాహసించలేదంటే తమ్ములను తోటమాలులుగ విడచి పెడుతున్నానన్నమాటయే కదా! అలాకాదు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పుటకు ఉద్యమించుటయే కర్తవ్యము. దైవము తోడ్పడెనా జయిస్తాను. లేదా తమ్ములను కలసికొంటాను.

అజయు డీవిధంగా ఆలోచిస్తూండగా ఆ భవనంలో నుండి ఘంటా నాదం వినబడ్డది. అజయుడా ధ్వనివిని ద్వారపాలకుని సమీపించి - ఆ ధ్వని ఏమని ప్రశ్నించాడు.

దానికి ద్వారపాలకుడు- స్వామీ! రాకుమారి యీ భవనములోనికి ఇప్పుడే వచ్చినది. ఆమె ప్రశ్నలకు సమాధాన మీయదలచు వారెవరైనా ఉన్నచో రావచ్చునని సూచించుటకు ఈ గంట మ్రోగింపబడినది.

అజయుడు వెంటనే నేనామె ప్రశ్నలకు సమాధానమిస్తాను నన్ను లోపలకు తీసికొనివెళ్ళు అన్నాడు.

ద్వారపాలకు డాతని యీ నిర్ణయానికి చకితుడయ్యాడు. కాని అతని నాపుటకు తానెవ్వడు? అందుచేత “రండి! రండి!” అని పిలుస్తూ ముందుకు నడచి మార్గము చూపసాగేడు.

ఆ భవనము మిక్కిలి విశాలమైనది. నానాలంకారములతో నిండినది. భవనములోని కడుగిడినంతనే కొందరు పరిచారకులు అజయుని పాదాలు కడిగి తడియొత్తారు. మరికొందరు నీరాజన మిచ్చారు. కొందరాతని నొక సుందరమైన గదిలోనికి గొనిపోయి మెత్తనైన సెజ్జపై

డబెట్టారు.

అజయుడా భనస సౌందర్యమును పరికిస్తూ ఆ రాకుమారి తన్నేమి ప్రశ్నిస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో ఒక పరిచారిక బంగారు పళ్ళెములో తీయమామిడి చివుళ్ళ అంకురములను బెట్టి తెచ్చి యాతనిముందు నిలువబడినది, అజయునకిది యేమో అర్ధముకాలేదు. ప్రశ్నిస్తుందనుకొన్న రాకుమారిరాలేదు. పోనీ తన్ను గౌరవించి ఆతిధ్యమిస్తున్నారనుకొంద మంటే మామిడి చివుళ్ళ నెవరు తింటారుగనుక? దీనియర్ధ మేమై యుంటుంది. ఇట్టి సందిగ్ధావస్థలో చిక్కుకొని అజయుడు దైవమును తలుస్తూ క్షణకాలమూరకున్నాడు. అంతలో అతని బుద్ధియందు తా నెన్నడో చదివిన “నాగర సర్వస్వము”అను కామశాస్త్రమందలి సంకేతాలు స్ఫురించాయి.

'కులప్రశ్నేంకురః స్మృతః'

నీ కులమేది? అని ప్రశ్నించుటకు అంకురమును బంపుట సంకేతముగా ఆ శాస్త్రమున చెప్పబడ్డది.

ఆ రాకుమారి తన కులమునుగూర్చి ప్రశ్నించుచున్నదని అజయుడుగ్రహించి ఆ నాగరసర్వస్వమునందే చెప్పబడిన విధానాన్ననుసరించి సమాధానము చెప్పవలెననని తలంచి అటునిటు పరికించాడు.

అచ్చట ఒక బల్లమీద లక్కతో చేయబడిన దానిమ్మపండ్లు, పనసపండ్లు, అరటిపండ్లు, మామిడిపండ్లు అమర్పబడి ఉన్నాయి. అజయుడు వానిని చూచినంతనే మిగుల ఉత్సాహముతో అందలి లక్క పనసపండునుదెచ్చి, మామిడి చివుళ్ళ అంకురములున్న పళ్ళెమునందుంచాడు

దాడిమంతు ద్విజే జ్ఞేయం
    పనసః క్షత్రియే స్మృతః
కదలీజం ఫలం వైశ్యే
    తధామ్రం తూర్రజే స్మృతం.

అని శాస్త్ర సంకేతనము. అనగా బ్రాహ్మణునకు దానిమ్మపండు. క్షత్రియునకు పనసపండు, వైశ్యునకు అరటిపండు, శూద్రునకు మామిడిపండు సంకేతములై ఉన్నాయి.

నీకులమేది? అని చూతాంకురములను బంఫుటద్వారా రాకుమారి ప్రశ్నించెనుకదా! అజయుడు తాను క్షత్రియుడైనందున పనస ఫలమునంపి తనకులమును తెలియజేసాడు. పరిచారిక ఆ పళ్ళెరాన్ని లోనికి గొనిపోయి మరికొంత సేపటికి వేరొక పళ్ళెమునుదెచ్చి యాతని యెదుటఉంచింది. అందొక చక్కని కాగితముపై సుందరముగా చిత్రింపబడిన చంద్రరేఖ ఉన్నది. ఆ చంద్రరేఖ విదియ చంద్రునకు చాలివున్నది.

“రాజపుత్రె ద్మితీయేందః"

అని శాస్త్రము. అనగా నీవు రాజపుత్రుడవా? అని అడుగుటకు విదియ చంద్రుడు సంకేతము.

అజయుడు దానివంకచూచి ఈమెప్రశ్నలన్నియు నాగరసర్వస్వ శాస్త్రమునకు చెందినవేకాబోలును. అయినచో జయపతాక నెగురవేసినటులే తలంచవచ్చును. అనుకొనుచు తాను చక్కగా చదివిన ఆ శాస్త్రసంకేతాలను స్ఫురణకు తెచ్చుకొని అచటనున్న కుంచెతో ఆ చంద్రరేఖకు వెనుకగా మేఘమాలలను చిత్రించాడు.

"ఘనచ్ఛాయస్తు భూపతిః"

అని శాస్త్రము. భూమీశుడైనచో మేఘచ్ఛాయ సంకేతము.

అందువలననే అజయుడు తాను సామాన్య రాజకుమారుడను కాననియు భూపతి ననియు సూచించుట కా కాగితముపై మేఘమును చిత్రించాడు.

పరిచారిక యాపళ్ళెరాన్ని లోనికి గొనిపోయింది. అజయుడు- రెండు ప్రశ్నలయ్యాయి. మూడున్నాయి- అని తలుస్తున్నాడు.

అంతలో పరిచారిక తిరుగ వేరొక పళ్ళెరముతో అతని యెదుటకువచ్చింది. ఆ పళ్ళెరంలో ఒక మైనపుముద్ద ఉన్నది. ఆముద్ధపై ఐదుగోళ్ళతో గ్రుచ్చినటులు గుర్తులున్నవి. మైనమునకు ఎఱ్ఱదారము చుట్టబడియున్నది.

అజయుడు దానినిచూచి రాకుమారిక పోటలీ ప్రశ్న అడిగినదే! అని తలచేడు.

మదనాసంగతః సిక్ధః సంరాగో రక్తవేష్టనమ్,
పంచబాణ క్షత త్త్వేతు పంచాంగుళి సుఖక్షతిః-

ఇంతకుముందు మన్మధవ్యాపారము లేదనుటకు మైనము, నీయం దెక్కువ యనురాగము కలదనుటకు ఎఱ్రదారము చుట్టుట, మన్మధుని ఐదు బాణములు తన మనస్సుననాటి యుస్నవని తెలుపుటకు ఐదు గోళ్ళతో గ్రుచ్చుట సంకేతములై ఉన్నాయి. శాస్త్రమున దీనికి పోటలీ యనిపేరు.

అజయుడు వెంటనే ఇటునటు పరికించి అచ్చటనున్న చక్కని వస్త్రఖండాన్ని తెచ్చి, దానికి చిల్లులు పొడిచి యామైసపు ముద్ద కంటించాడు. పరిచారిక పళ్ళెరాన్ని లోనికి గొనిపోయింది.

"స్మరేణోద్భిన్న దేహత్త్వే సచ్ఛిద్రం వస్తముత్తమం”

అని శాస్త్రము, అనగా-మస్మధునిచే నా దేహము చిల్లులుపడినదని సూచించుటకు చిల్లులు పడిన వస్త్రము సంకేతము. అజయుడు చిల్లులు పొడిచిన వస్త్రమంపుట ద్వారా రాకుమారియొక్క సంకేతమునుగుర్తించినటులేకాక తానుకూడ మదనునిచే పీడింపబడుచున్నట్లు చూచించాడు.

కొంతసమయానికి పరిచారిక వేరొక పళ్ళెరాన్ని తెచ్చి రాకుమారుని యెదుట ఉంచింది. ఆ పళ్ళెమునందు తమలపాకులు చిత్రముగా చుట్టబడి నాలుగుమూలలయందు లవంగ మొగ్గలచే గ్రుచ్చుబడిఉన్నాయి ఆ లవంగములు నాలుగు నాలుగుకోళ్ళవలె నుండగా చుట్టబడిన తమలపాకులు పరుపుతోకూడిన మంచమువలె ఉన్నాయి.

"పర్యంక స్సంగమాశయా"

అని శాస్త్రము. అనగా-నేను నిన్నుకలియ గోరుచున్నాను, అనుటకు పర్యంకముయొక్క. ఆకారముగల తాంబూలము సంకేతము.

అజయుడు దాని భావము గ్రహించి ప్రక్కనున్న గంధపు గిన్నెలోని గంధమునింతదీసి యా తాంబూలముపై అంటించాడు. పరిచారిక పళ్ళెమును లోనికి దీసికొనిపోయింది.

"బాహ్యే చందన పంకాక్త మత్యర్ధ మనురాగతః"

తాంబూలమునకు మంచిగంధ మంటించినప్పుడు నాకు నీయందు మిక్కిలి యనురాగము కలదని సూచించుటకు సంకేతముగా శాస్త్రముస చెప్పబడ్డది.

పర్యంకాకారముగల తాంబూలమునంపి రాకుమారి తన మనస్సులోని సంగమాశను తెలుపగా దానిపై మంచిగంధముసలది అజయుడు నాకు నీయందు మిక్కిలి యనురాగముకలదని సూచించెను.

మరికొంత సమయానికి పరిచారిక పళ్ళెరము లేకయే చేతనొక చీటిగొని యాతని సన్నిధికివచ్చి యా చీటినందించింది. దానియందిట్లు వ్రాయబడిఉన్నది.

ఆర్యా! తాము ఎడమచేతి బొటనవ్రేలి చివరిరేఖనాడు తిరుగ యిచ్చటకు దయచేయుడు.

-రాకుమారి రత్నపదిక,

అనియున్నది.

"శుక్లేవామకరో జ్ఞేయః అసితే దక్షిణః కరః”.

అని శాస్త్రము. అనగా ఎడమచేయి శుక్లపక్షమునకు కుడిచేయి కృష్ణపక్షమునకు సంకేతములు. చేతికి వ్రేళ్ళైదు, ప్రతివ్రేలికి రేఖలు మూడు. మొత్తమీ రేఖలు పదునైదు. అందు చిటికెనవ్రేలి మొదటి రేఖ పాడ్యమి తిధిని, రెండవది విదియను, మూడవది తదియను సూచించును. ఇట్లు వరుసగా పదునైదు రేఖలు పదునైదు తిధులకు గుర్తులుగా శాస్త్రము సూచించెను.

ఎడమచేతి బొటనవ్రేలి చివరిరేఖ నాడనగా పూర్ణిమ అయినది రాకుమారి పూర్ణిమనాడు రమ్మని సంకేతము చెప్పినదని గ్రహించి-అజయుడు, నేడు శుద్ధవిదియకచా! అని కొంచెమాలోచించి ఆకాగితము మీదనేనేనంతవరకు నిలువజాలను. ఎడమచేతి చిటికెనవ్రేలి నడిమిరేఖ సంకేతముగాగల యీ దినముననే నా కోరిక తీర్పవలెను.

- అజయుడు

అనివ్రాసి ఆ పరిచారికకిచ్చెను. పరిచారిక యా చీటిని రాకుమారియొద్దకు గొనిపోయింది.

ఈ విధముగా తానామె ప్రశ్నలకైదింటికి తగు సమాధానములు చెప్పగలిగినందులకు వాన్ని స్తుతిస్తూ అజయుడచ్చట కూర్చుండి ఉన్నాడు. అంతలో బహుపరిచారికా సేవితయై రాకుమారి అజయుని యెదుటకు వచ్చి నమస్కరించి పరిచారిక యందిచ్చిన పూలమాల నాతని మెడయందుంచి-

స్వామీ! నాకొక సిద్ధుడీ ప్రశ్నలను-వీని సమాధానములను ఉపదేశించి-ఈ సమాధానములు చెప్పినవానిని పెండ్లాడమన్నాడు. అప్పటినుండి నేనివిధంగా అనేకులను బ్రశ్నించాను. కాని ఒక్కరును వీని మర్మము తెలిసికొని సమాధానము చెప్పజాలకపోయేరు. నేటికి నా తపము ఫలించింది. మీరిచ్చిన సమాధానాలు తగివున్నాయి. నాకు మువ్వురు చెల్లెండ్రు. వారుకూడ ముమ్మూర్తుల నన్నేపోలినవారు. మమ్ము నలువురను భార్యలుగా స్వీకరించి యీ రాజ్యాన్ని బాలించండి.- అని వినయముగా బలికింది.

అనంతరం ఆజయుడు తన సోదరులనుగూర్చి రాకుమారినడిగి తెలిసికొని వారిని విడిపించాడు. రూపంలో సౌందర్యంలో గత్నపదికనే పోలివున్న ఆమె చెల్లెండ్రను మువ్వురను తన ముగ్గురు సోదరులకు భార్యలుగా నిర్ణయించారు.

ఒకనొక శుభముహూర్తంలో గత్నపదికకు, అజయుసకు వైభవముగా వివాహము జరిగినది. అదే ముహూర్తలో రత్నపదికయొక్క చెల్లెండ్రను అజయుని సోదరులు పెండ్లాడిరి. ఆనూతన దంపతులు చిరకాలము సుఖముగా జీవించారు.

★ ★ ★

నాగర సర్వస్వమననేమో తెలుపుటకీ కథ చెప్పబడినది. కామినీ కాముకులు పరమ నాగరికులైనపుడు తమ సంకేతముల నితరులు గుర్తింపనటులు ప్రవర్తించు స్వభావముకలవారై యుంటారు. ఆ సంకేత మర్మములు తెలియనినాడు స్త్రీయైనను పురుషుడైనను-ఇట్టి సంకేతములతో తమ యెదుటకు వచ్చిన సౌఖ్యమును అనుభవింప జాలనివారే అవుతారు. ఇట్టి కళాపాండిత్యముకల స్త్రీలు అరుదుగా వుంటారు. అట్టివారితో సాంగత్యము దుర్లభము. అయినను ఒకవేళ అట్టి స్త్రీ తన్నువలచి సంకేతమును దెలిపినచో శాస్త్రము తెలియనివాడు తెల్లబోవుట దక్క చేయునది యుండదు.

లోకమునందలి యిట్టి నాగరిక సంకేతములను, ఇంకను అనేక విషయములను శాస్త్రగ్రంధములనుండి యేర్చికూర్చి పద్మశ్రీ అను పేరుగల బౌద్దయతి యీ నాగరసర్వస్వమును సంస్కృతంలో రచించారు. గంధాంత మందాత డిట్లు చెప్పుకొన్నాడు.

ఆసీద్భ్రహ్మకంలే కలాగ్రనిలయో యోవాసువః కృతీ
తస్యస్నేహవశా చ్చిరంప్రతిముహృ స్సంప్రేరణాత్ నాంప్రతం
దీప్తేయం రతిశాస్త్రదీపకలివా పద్మశ్రియా ధీమతా
హృద్యార్ధాన్ ప్రకటీకరోతు జగతాం సంహృత్యహార్దుతమః

వాసుదేవుడను విప్రు డొకడు కలడు. అతడు సకలకలాకోవిదుడు చతురుడు. అతడు మాటిమాటికి ప్రోత్సహింపగా పద్మశ్రీ అను పేరుగల బౌద్ధయతి రతిశాస్త్రములకు దివ్వెవంటిదైన ఈనాగర సర్వస్వమును రచించాడు. ఈ గ్రంధము రమ్యార్ధములను వెల్లడించుచు అజ్ఞానమను చీకటిని హరించి లోకమున చిరకాలము వెలుగులు చిందుగాత!

వాస్తవమున కీ నాగర సర్వస్వము చదువుటవలన హృదయము నందొక వింత వెలుగు ప్రసరిస్తుంది. గ్రంధమును పఠించినగాని ఆ నలుగు మనస్సున కంటదు. యీ నాగర సర్వస్వం అనాగరకునకు నాగరత నేర్పుతుంది. నాగరికునియందు అనంత విలాసాలను నిక్షేపిస్తుంది. విలాసి జనానికి విశ్వాతిశాయి సౌఖ్యాన్ని అందజేస్తుంది. సంస్కృత భాషయందున్న యీగ్రంధము సర్వులకు చదువుట సాధ్యముకాదు. అందులకే ఈగ్రంధము తెనిగింపబడుచున్నది. ఈ అనువాదమున అవతారికాభిప్రాయములు వ్యాఖ్యాసదృశములు అయిన విషయములనేక ములున్నను మూలమును విడిచిన అకాండతాండవము మాత్రముకాదు.

ఇట్టి గ్రంధమొకటి సంస్కృతమునం దున్నదనియైన యెఱుంగని నన్ను- శ్రీరాంషాగారు అనువాదము చేయుడని పోత్సహించినారు కాగా వ్రాసినది నేనే అయినను వ్రాయించినది రాంషాగారు. ఆయన ఉత్తమ రచనలకేకాదు, రచయితలకును న్రష్ట. ఆయనకు నమస్సులు. ఈగ్రంధమును జదువు పాఠకులకు అభినందనలు.

ఇట్లు,

"అరుణకిరణం"