Jump to content

నాగర సర్వస్వం/ఉత్థితకరణ భేదములు

వికీసోర్స్ నుండి

ఉత్థితకరణ భేదములు :

భార్య ఏగోడనో స్తంభమునో ఆధారముగా చేసికొని నిలచియుండగా పురుషుడామెనుగూడి రమించుట ఉత్థితకరణము. ఈ ఉత్థితకరణము, దీని తరువాదైన వ్యాసతకరణము చిత్రరతములు అనబడతాయి, వీని నాచరించుటకు దంపతులు శక్తి, చురుకుతనము, శరీరలాఘవము కలవారయి ఉండాలి, అట్లు తగినంత శరీరలాఘవము లేనివారికీ కరణభేదములు సాధ్యములుకావు. ఈ కరణభేదముల యందు ఆరు మాత్రమిచ్చట తెలుపబడుచున్నవి. వీనిలో మొదటిది 'హరివిక్రమబంధము'.

1. హరివిక్రమబంధము :- భార్య తనవీపును ఏ గోడకో ఆన్చి పాదములను గోడకు కొంచెము దూరములోనుంచి - ఏటవాలుగానున్న శరీరముకలదై నిలచియుండగా - పురుషుడామెయొక్క ఒకకాలిని ఆమె మొగముమీదుగా పోవునట్లు పైకెత్తి ఉన్నతమైన పురుషాంగము కలవాడై రమించుట 'హరివిక్రమబంధము' అనబడును. ఈ బంధమునందు భార్యయొక్క - ఒకపాదము నేలను తాకుచుండ వేరొకపాదము ఆమెయొక్క ముఖమును తాకుచుండును. హరివామనావతార సమయమున ఒకపాదముతో భూమినాక్రమించి, వేరొక దానితో ఊర్ధ్వలోకముల నన్నిటిని, (ఆకాశమును) ఆక్రమించెను కదా! అట్టిరూపము వనితకీబంధము నందేర్పడుతుంది, అందుకే దీనికి హరివిక్రమని పేరు వచ్చినది.

2. వ్యాయతబంధము :- యువతి హరివిక్రమబంధము నందు వలెనే నిలచినదై - ఉన్నతమైన పురుషాంగముతో తను గూడిన భర్తయొక్క - వెన్నుపూస తుదిభాగమును తనయొక్క ఒకపాదముతో తాకుచుండగా ఏర్పడు కూటమి 'వ్యాయతబంధము' అనబడుతుంది. దీనియందు వనితయొక్క ఒకపాదముమాత్రము నేలమీదఉంటుంది. రెండవపాదము పైకెత్తబడి భర్తయొక్క నడుమును చుట్టి అతని పిరుదులను తాకుతూవుంటుంది. 3. అర్పితబంధము :- భార్యకు బదులు భర్తయే గోడనుఆనుకొని నిలచియుండగా - భార్య అతని కంఠమును కౌగలించుకొని - ఆతని అరచేతులలో తన పాదములనుంచి ఎక్కి నిలచినదై - తన మోకాళ్ళను భర్తయొక్క ఇరుపార్శ్వముల నుండియు పోనిచ్చి కొంచెము వంచియుండగా పురుషుడామెను కలియుటకు - అర్పితబంధమనిపేరు. ఇట్లు ఆచరించుటకు భార్యా శరీరభారము నరచేతులయందు మోయగల శక్తికలవాడైయుండాలి. దీనినే రతిరహస్యకర్త 'ద్వితలబంధము' అనెను.

4. దోలాబంధము :- భార్యకు బదులుగా భర్తయే గోడనానుకొని నిలచి కుడిచేతివ్రేళ్ళ సందులనుండి ఎడమచేతివ్రేళ్ళను పోవనిచ్చి ఉగ్గిలి పట్టుగా బిగియపట్టి దోసిలిని ఏర్పరచవలెను. అప్పుడు భార్య తనప్వష్ఠము నా దోసిలియందాల్చి కూర్చుండి - తనకాళ్ళను భర్తయొక్క నడుమునకుచుట్టక - భర్తయొక్క వక్షము మీదుగా పైకి పోనిచ్చి తాను చేతులతో ఆతని కంఠమును గ్రహించినదై యుండగా ఉన్నతమైన పురుషాంగముకల భర్త - ఉగ్గిలిపట్టుగానున్న తనచేతులతో భార్యా పృష్ఠమును పై కెత్తి క్రిందికి దించుచు రమించుట 'దోలాబంధము' అనబడుతుంది. ఈ బంధము నాచరించుటకు పురుషుడు తగినంత బలశాలియై యుండుటయేగాక స్త్రీయొక్క శరీరముకూడ తగినంత పలుచనదై లఘువుగా ఉండుట అవసరము. దోల అనగా ఊయెల. ఊయల ఊగుటవంటి స్థితి ఇందుండుటచే దీనికీపేరువచ్చెను.

5. విలంబితబంధము :- దోలాబంధము నందువలెనే పురుషుడు గోడనానుకొని నిలచియుండ గట్టిగా కౌగలించుకొన్నదై తనరెండుకాళ్ళను పైకెత్తి వానితో ఆతని నడుమును చుట్టి - తన యోనితో ఆతని పురుషాంగమును సంసక్త పరచుచుండగా ఏర్పడు రతిక్రీడను 'విలంబితబంధము' అని పేరు. విలంబితము అనగా వ్రేలాడునది. ఇందు భార్య భర్తయొక్క కంఠమును గ్రహించి వ్రేలాడుచు రమించును. అందుచే దీనికీ పేరువచ్చెను.

6. జానుకూర్పరబంధము :- భార్యఏగోడనో ఆనుకొని కొంచెము ఏటవాలుగా నిలచియుండగా - భర్తఆమెను సమీపించి - చేతులతో ఆమెకంఠమును కౌగలించుకొని - తనకాళ్ళతో ఆమె మోకాళ్ళను పెనవైచి ఉన్నతమైన పురుషాంగము కలవాడై రమించుచో ఆస్థితి 'జానుకూర్పము' అనబడుతుంది. జాను, కూర్పర శబ్దములకు రెండిటికి మోకాలు అనియే అర్థము, ఇందు ఆలుమగల మోకాళ్ళు పెనవైచుకొని ఉంటాయి. అందుకే దీనికీ పేరువచ్చినది.

వ్యానతకరణ భేదములు

వనిత తనచేతులను తనపాదములపై ఆన్చి వంగినిలచియుండగా (ఈస్థితియందామె పై శరీరము మిక్కిలిగా వంగుతుంది, దిగువ శరీరము నిటారుగా నిలచి ఉంటుంది) పురుషుడామెను వెనుకనుండి సమీపించి చేతులతో ఆమె కడుపును పట్టుకొని వెనుకనుండియే అంగమును యోనియందు సంవిశితముగావించి రమించుటకు 'వ్యానతకరణము' అనిపేరు. పశువుల రతిక్రీడవంటిదగుటచే దీనిని 'పశుకరణము' అని కూడ పేర్కొంటారు.

ఇట్టిదైన రతిక్రీడ మరుదేశమునందును (నేటిరాజస్థానము) సింధుదేశమునందును (నేటి పంజాబుదేశము, పశ్చిమ పాకీస్తానము) కురుదేశమునందును (నేటి కురుక్షేత్రమునకు సమీపదేశము) మిక్కిలిగా ఆచరణలో ఉన్నది. ఇవికాక మిగిలిన ప్రాంతములయందిట్టి రతిక్రీడ అరుదుగా కానవస్తుంది. ఈ కరణభేదములు ధేనుకబంధము (ఆవువలె కలయుట) ఐభబంధము (ఏన్గులవలె రమించుట) మొదలగు పేర్లతో ప్రసిద్ధములై ఉన్నాయి. కాని ఇందు 'వ్యాఘ్రస్కందము ' అనే బంధభేదము ఒక్కటి మాత్రమే తెలుపబడినది.