నరసభూపాలీయము/పీఠిక
కావ్యాలంకారసంగ్రహ మనునామాంతరమున నలరు నీ నరసభూపాలీయ మనునలంకారగ్రంథమును దెలుఁగున రచియించిన మూర్తికవి లక్షణకవులలో నొకఁడు. విద్యానాథుఁడు సంస్కృతమున వ్రాసిన ప్రతాపరుద్రీయ మనునలంకారశాస్త్రము నీతఁడు పద్యకావ్యముగా వ్రాసెను. విద్యానాథుఁడు కృతిపతినామధేయాంకితముగ లక్ష్యభాగమును వ్రాసినట్లే యీభట్టుమూర్తియుఁ గృతిపతి యగునరసభూపాలునిపేరట లక్ష్యభాగమును వ్రాసియున్నాడు. సంస్కృతమున విద్యానాథునికవిత్వ మెంతశ్లాఘాపాత్రమో ఆంధ్రమున నీతనికవిత్వము నంత శ్లాఘింపఁదగిన దని చెప్పుట కావంతయు సందియము లేదు. వసుచరిత్రము లోనగు గ్రంథములు వ్రాసిన రామరాజభూషణుఁ డే యీమూర్తికవి యని కొందఱును, కాదని కొందఱును వాదింతురు. నిష్పక్షపాతబుద్ధితోఁ బరిశీలింప వీరిరువురకవిత్వ మేకరీతిగనే యున్నదని తోఁచెడిని. వీరిచరిత్రవిషయ మిచ్చట పెంచి వ్రాయఁబూనుకొనము. అవిషయమును నిర్ణయించుగ్రంథములు వేఱు మాపని యది గాదు. గ్రంథమును గూర్చి మాత్రము వ్రాయుపని మాదై యున్నది. ఇప్పనిని జేయఁబూని శాఖాచంక్రమణముగాఁ గవికాలము మొదలగువానిని నిర్ణ యింపఁబోవుట “నీవీబంధనవేళాయాం వస్త్రమూల్యపరీక్షణమ్” అనున్యాయము ననుసరించినట్లె యగును. కాబట్టి చరిత్రగ్రంథకర్తల కాభాగమును వదలితిమి.
ఇమ్మహాకవి కవిత్వ మసమానమై, యమృతముఁ బోలి కవివిబుధజీవనాధారమై, హృదయంగమమై చెన్నారుచున్నది. నిఘంటువులఁ జెంత నునిచికొని యొక్కొక్కపదమునే యేర్చికూర్చినకవిత్వమువలెఁ గాక యీతని కవితాధార దివిజగంగాప్రవాహముం బోలి యనివార్యవిజృంభణము గలదియై పెం పొందుచున్నది.
భారత భాగవత రామాయణాదులు చరిత్రముతో సంబంధించిన గ్రంథములు. అట్టి గ్రంథములయందుఁ గవి పలుపోకలం బోవచ్చును. ఈ గ్రంథ మట్టిది కాదు. అలంకారశాస్త్రము గావున స్వేచ్ఛగా స్వకపోలకల్పనలఁ జేర్చుట కవకాశ మీయదు. అట్లయ్యును గ్రంథమును రసవంతముగను, మృదుపదసంఘటితముగను జెప్పి తనకవితామహిమను జూపియున్నాఁడు. కవియే తనకవితామహిమను గూర్చి యిట్లు వ్రాసికొనియున్నాడు.
| సీ. | బాణు వేగంబును, భవభూతి సుకుమార,తయు, మాఘు శైత్యంబు, దండి సమత, | |
| | సోము ప్రసాదంబు, సోమయాజుల నియ, మంబు, భాస్కరుని సన్మార్గఘటన, | |
| గీ. | నీక కల దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱిచి | |
ఇది యతిశయోక్తి యని తలంపరాదు. చెప్పినట్లు చేయుట సామాన్యముగ నందఱకు నలవిగానిపనియే కాని యీతఁ డట్లు చేయఁజాలినవాఁ డని సులభముగఁ దోఁచును.
అప్పకవీయాది లక్షణగ్రంథము లొప్పని రేఫద్వయమైత్రి, యిత్వసంధులు మొదలగువానిని అచ్చటచ్చట నీకవి యుపయోగించి యున్నాడు.
రేఫద్వయమైత్రికి
| | “వేఱ వివరింప నేల బంగారమునకుఁ, జటుల సౌరభ్యలహరి యబ్బుటయ కాదె" | |
| "శా. | శ్రీరంగప్రభుతిమ్మశౌరి భుజకౌక్షేయంబుచే నాజుల | |
ఇంక నీకవి కవితాశక్తిని గుఱించి కొంచెము వ్రాసెదము. ఈమూర్తికవికి నతిశయోక్తి క్రమాలంకారాదులు మంచినీళ్లప్రాయములు,
ఈ క్రిందియుదాహరణము లీవిషయమును దేటపఱచును.
క్రమాలంకారము
| “సీ. | కమలాప్త కమలాప్త కమలాప్తసన్నిభుం, డేవిభుండు రుచి ప్రభావ దయల | |
| తే. | నతఁడు సువిచారుఁ డవికారుఁ డనఘుఁ డలఘుఁ, డప్రమేయుఁ డజయ్యుఁ డతి ప్రతాపుఁ | |
అతిశయోక్తి
| "ఉ. | భూనుతశౌర్యుఁ డోబనృపపుంగవుఁ డుగ్రరణోర్విభీమబా | |
| | ల్పూని హరింపఁ దద్గళితభూరిసమున్నతఖడ్గము ల్పర | |
అద్భుతకల్పన
| | బలధూతధూళిచేఁ బందిళ్లు సమకట్టి, యహితరక్తము కలయంపి చల్లి | |
| తే | మెఱయు నేరాజు విజయలక్ష్మీవివాహ, విదితసన్నాహుఁడై యతఁ డదురుగుండె | |
| “చ. | చకచకమించు సింగనృపచంద్రునిశాక తకృపాణవల్లిలోఁ | |
నిరుపమానశ్లేష
| "సీ. | ఖరదూషణాఖర్వగర్వనిర్వాపణం, బాజి నెవ్వానిసాయకనికాయ | |
| తే. | యతఁడు కలియుగనవ్యరామావతార, చారుతాసార్థనామప్రదానుఁ డగుచు | |
అనన్యసాధ్యమగు శైలి
| "సీ. | వనజారి కళలచేఁ దనివి నొందించిన, నిల ఖేచరుఁడు ప్రాణ మిత్తు ననిన | |
| తే. | వారి నెవ్వారిగా దని వసుధ నౌర, నిక్కముగఁ గీర్తకామిని నీకుఁ దక్కె | |
జటప్రోలు సంస్థానములోని యాస్థానపండితు లగు బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రులవా రి౦దలి మూఁడవయాశ్వాసమునకు బాగుగా విమర్శించి విశేషములు పెక్కు చేరిచి విపులముగా వ్యాఖ్యానము వ్రాసియున్నారు. అం దచ్చటచ్చట లక్షణపద్యములలోని లోపములఁ గనిపట్టి సవరణలు చేసియున్నారు. ఆ సవరణ లిందు దిగువునఁ బొందుపఱుపఁబడి యున్నవి. వారి సవరణలను మే మిం దుపయోగించుకొన్నందులకు, ఆంధ్రభాషాప్రపంచమున కావ్యాఖ్యానముచే శ్రీ శాస్త్రులవారు గావించిన మహోపకారమునకును వారి కనేకవందనము లొనరించుచున్నారము.
మొదటికూర్పునందుఁ బ్రమాదవశంబునఁ బడిన తప్పులు దిద్ది యీ కూర్పున నీగ్రంథరత్నమును నలంకరించితిమి. ఇందేమేని బొరపాటు లుండవచ్చును. వాని నిటమీఁద ముద్రించునపుడు సవరించుకొందు మని సరసమతులకు విన్నవించుచున్నాము.
| | నిందతు వందతు వా సన్నసూయు రనసూయు రత్ర కిం తేన, | |
చెన్నపురి
ఇట్లు,
18_5_13
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్