Jump to content

నరసభూపాలీయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నరసభూపాలీయము

కావ్యాలంకారసంగ్రహము - పంచమాశ్వాసము



నందనసౌందర్యబు
ధానందనకీర్తివిజితహరిచందనమే
ధానయనిధానదానే
దానీంతనకర్ణ నరసధరణీశమణీ.

1


తే.

అవధరింపుము లక్ష్మలక్ష్యముల నెల్ల, ననఘ భవదీయనామధేయాంకితముగ
బహువిభక్తుల నొనరింతుఁ బద్యవితతి, నింకఁ జతురార్థభవదలంకృతులు వరస.

2


వ.

ఉప మానన్వ యోపమేయోపమా స్మరణ రూపక పరిణామ సందేహ భ్రాంతి మ
దపహ్న వోల్లే ఖోత్ప్రే క్షాతిశయోక్తి సహోక్తి వినోక్తి సమాసోక్తి వక్రోక్తి
స్వభావోక్తి వ్యాజోక్తి మీలన సామాన్య తగ్గు ణాతద్గుణ విరోధాభాస విశేషా
ధిక విభావనా విశేషోక్త్యసంగతి విచిత్రాన్యోన్య విషమ సమ తుల్యయోగితాదీ
పక ప్రతివస్తూపమా దృష్టాంత నిదర్శనా వ్యతిరేక శ్లేష పరిక రాక్షేప వ్యాజస్తు
త్యప్రస్తుతప్రశంసా పర్యాయోక్తి ప్రతీసానుమాన కాన్యలిం గార్థాంతరవ్యాస
యథాసం ఖ్యార్థాపత్తి పరిసం ఖ్యోత్తర వికల్ప సముచ్చయ సమాధి భావిక ప్రత్య
నీక వ్యాఘాత పర్యాయ సూక్ష్మోదాత్త పరివృత్తికారణమా లైకావళీ మాలాదీపక
సార రసవ త్ప్రేయ ఊర్జస్వి సమాహితంబు లన డెబ్బదియలంకారంబులు. అందు
రూపక పరిణామ సందేహ భ్రాంతిమ దుల్లే ఖాపహ్న వోత్ప్రేక్షా స్మరణ తుల్య
యోగితా దీపక ప్రతివన్తూపమా దృష్టాంత సహోక్తివ్యతిరేక నిదర్శనాశ్లేషంబులు
పదియాఱును బ్రతీయమానౌపమ్యంబులు, సమాసోక్తి పర్యాయో క్త్యాక్షేప
వ్యాజస్తు త్యుపమేయోపమానన్వయాతిశయోక్తి పరికరా ప్రస్తుత ప్రశంసానుక్త
నిమిత్తవిశేషోక్తులు పదియును బ్రతీయమానవస్తుకంబులు, రసవత్ప్రేయ ఊర్జస్వి
సమాహితభావికంబు లేనును బ్రతీయమానరసభావంబు లగు కడమయుక్తనిమిత్త
విశేషోక్తిసహితంబు లను నుపమాద్యలంకారంబులు నలువదియు నస్ఫుటప్రతీయ
మానౌపయ్యరసభావంబు లగు నందు.

3


సీ.

అవని సాధర్మ్యంబు త్రివిధ మౌభేదప్ర, ధాన మభేదప్రధాన మరయ
నుభయప్రధాన మై యొగి దీపకము తుల్య, యోగితయుఁ బ్రవస్తూపమయును

దృష్టాంతమును సహోక్తియు నిదర్శనప్రతీ, పము వ్యతిరేకంబు ప్రబలు భిన్న
సామ్యము ల్రూపక సందేహ పరిణాను, ములు భ్రాంతిమదపహ్నుతులు నభిన్న


తే.

సామ్యధర్మంబు లుల్లేఖసంగతముగ, నుపమయుపమేయకోపమయును ననన్వ
యంబు స్మరణంబుఁ దలఁప భేదావిభేద, సహితసాధర్మ్యగుణవిశిష్టములు మఱియు.

4


సీ.

అతిశయోక్త్యుత్ప్రేక్ష లధ్యనసితమూల, లొగి విభావనవిశేషోక్తి విషమ
ములు నసంగతిచిత్రముల తగ్గుణానోన్య, ములు భావికవిశేషములు విరోధ
జన్యము ల్వ్యాఘాతసహితంబు గాఁగ స, ముచ్చయంబు వికల్పముఁ బరిసంఖ్య
మలయథాసంఖ్య మర్థాపత్తిపర్యాయ, భవములు పరివృత్తి ప్రత్యనీక


తే.

తద్గుణసమాధులు వినోక్త్యుదాత్తసమము, లును స్వభావోక్తి లోకవర్తనభవములు
గరిమ ననుమానకావ్యలింగములు తర్క, జంబు లర్ధాంతరన్యాససంగతముగ.

5


సీ.

కారణమాలికై కావళీసారమా, లాదీపకంబు లుల్లసితశృంఖ
లావిచిత్రత్వమూలములు వ్యాజోక్తివ, క్రోక్తి మీలన మపహ్నుతిభవములు
పరఁగు సమాసోక్తిపరికరంబులు విశే, షణజాతచాతుర్యసంభవములు
కడమశ్లేషాద్యలంకారము ల్పూర్వోది, తన్యాయనిరపేక్షతాయతంబు


తే.

లీయలంకారముల కెల్ల నిలఁ బ్రధాన, మైనయుపమయ ముందుగా ననువు కొల్పి
యొకటి కొకటికి భేదము ల్ప్రకటములుగ, సరవి నెఱిఁగింతు లక్ష్మలక్ష్యము లెలమి.

6


సీ.

ఉత్ప్రేక్షవలె నసిద్ధోపమ కా కన, న్వయముకైవడి నభిన్నంబు గాక
హీనోపమయుఁబోలె నిల నహృద్యము గాక, యుపమాన మనఘ మై యుండెనేని
శ్లేషంబువలెఁ బదక్లిష్టమాత్రము గాక , సార్థ మై యల రూపకాదులక్రియ
వ్యంగ్యంబు గాక సామ్యము వాచ్య మగు నేని, యౌపమ్యము ప్రతీప మట్లు తలఁపఁ


తే.

గ్రమవిపర్యాససహితంబు గాక యున్న, నలరు నుపమేయకోపమ యట్లు సామ్య
ధర్మ మిరుమాఱు వరుసలఁ దడవకున్న, నుపమ యగుదీనిభేదంబు లుగ్గడింతు.

7


తే.

ఒనరు నది పూర్ణయును లుప్తయును ననంగ, నందు నుపమాన ముపమేయ మలరు సమత
సామ్యవాచకమును గూర్పఁ జాలుఁ బూర్ణ, కొన్నికడ మైనలుప్త యై కొమరు మిగులు.

8


తే.

అందు నుభయాఖ్య యగుఁ బూర్ణ యార్థి శ్రౌతి, యనఁగ రఘురామసన్నిభుఁ డనెడిచోట
నార్థి కందర్పుఁడునుబోలె నలరుచుండు, నధిపుఁ డనుచోట శ్రౌతి యై యతిశయిల్లు.

9


క.

ధరయం దార్థియుఁ ద్రివిధాం, తర మయ్యె సమాసవాక్యతద్థితగత యై
తిరముగ వాక్యసమాసా, చరణంబుల ద్వివిధ యగుచు శ్రౌతముఁ దనరున్.

10

క.

అల తద్ధితములయందుం, దెలియ వతిప్రత్యయంబు తెలుఁగున లేమిం
గలిగినకల్పప్ప్రత్యయ, మలరుచు నయ్యార్థియంద యది గనుపట్టున్.

11


ఉ.

కావునఁ బూర్ణపంచవిధ కన్గొన లుప్తయు సామ్యధర్మ మీ
క్షావిధిఁ గూర్ప కున్నయెడ శ్రౌతియు నార్థియునై యథోక్తసం
భావనవాక్యయుక్తము సమస్తయు వాక్యసమాసతద్ధిత
శ్రీవిశదాత్మయై ధరణిఁ జెన్నగుసాయకసంఖ్య నె ట్లనన్.

12

సమాసగతపూర్ణార్థి —

క.

ఈవియుఁ జల్లదనంబును, గేవలసౌందర్యగుణము గిఱికొనఁగఁ గళా
భావుకుఁ డైననృసింహ, క్ష్మావల్లభుఁ డమరుఁ బూర్ణచంద్రోపముఁడై.

13

వాక్యగతపూర్ణార్థి —

క.

వెలయు జవరాండ్రు తలఁపుల, వలపును నిలుపఁగఁ జాలు వరరూపమునం
జెలఁగుచు నృసింహుఁ డలరుల, విలుకానికి సాటి యయ్యె విశ్రుతలీలన్.

14

తద్ధితగతపూర్ణార్థి —

క.

ఏయెడల నియ్యనియ్యం, గాయలు గాచిన నృసింహుకర మర్థులకుం
బాయని వడ్క ఫలించుచు, నాయతగతిఁ గల్పకల్ప మై విలసిల్లున్.

15

వాక్యగతపూర్ణశ్రౌతి —

క.

దివియును భువియు భుజంగమ, భువనంబును నిండి విమలభూరిప్రభతో
దివిజేంద్రతటినియో యన, నవిరళగతిఁ బొల్చు నీదుయశము నృసింహా.

16

సమాసగతపూర్ణశ్రౌతి —

క.

కరముల శంఖము చక్రము, నిరవుగ నురమందుఁ జెంది యిందిర దనరన్
హరివలె వెలయుదు వౌరా, వరసాహసయోబరాజు నరసింహనృపా.

17

పంచవిధానుపాత్తధర్మలుప్తోపములు —

శా.

నీదోఃఖడ్గమహీంద్రుఁడో యనఁ దగు న్నీదివ్యతేజోభరం
బాదిత్యుండునుబోలెఁ బొల్చు భవదీయాలాపము ల్వల్లకీ
నాదబ్రహ్మము సాటి నీకరము మందాగోపమానంబు నీ
ప్రాదుర్భావము భవాభ్యుదయకల్పం బౌ నృసింహాధిపా.

18

అనుపాత్తోపమానలుప్త —

సీ.

జలదంబుగతి నిచ్చి వెలవెలఁ బాఱక, కలశాంబునిధిరీతిఁ గసరుకొనక
యీగిమ్రాన్వలె ఫలం బిడి జిగి దప్పక, సురభికైవడిఁ గొలు వరసి యీక
కమలారివలె నిచ్చి క్రమ్మఱఁ గైకోక, బలిమాడ్కి నర్ధిచే భంగపడక
దండాంశుసుతుపోల్కిఁ గుండమార్పులు గాక, వాసనమణిభాతిఁ ద్రాసమంద


తే.

కొసఁగ నేర్తువు యాచకవ్యూహమునకు, భూనుతానూనదానవిద్యానిరూఢి
బొసఁగ నీతోడ నెవ్వానిఁ బోల్పవచ్చు, సరసగుణహార యోబయనరసధీర.

19

అనుపాత్తవాచకలుప్త —

సీ.

దర్పితాహికనృపోత్తములు ని న్నెదిరింపఁ, గలరె ధీరోత్తమగండబిరుద
విమతకీర్తిప్రతాపములు నీచే సమ, కట్టునే యుభయరగండబిరుద
యరివధూతాటంకగరిమంబు నీచేతఁ, గలుగునే గండభేరుండబిరుద
పరిపంథిగంధసింధురపంక్తి నీమ్రోల, నుండునే గండభేరుండబిరుద


తే.

యరుణపరిణతధామ రామాభిరామ, రామణీయకనిర్జితప్రసవబాణ
బాణసాహిత్యపరిపాకపాకవైరి, విభవసౌభాగ్య యోబభూవిభునృసింహ.

20


తే.

అరుణపరిణతధామ రామాభిరామ, యనెడిచో భానుకైవడి నలరుకాంతి
పంక్తి గలవాఁడు రామునిపగిదిఁ బొల్చు, వాఁడు ననువాచకం బవివక్షితంబు.

21

అనుపాత్తవాచకధర్మోపాదానలుప్త —

సీ.

ఇటు బేసితేజీల నెనయు మిన్నులతేరి, జోదు పుట్టినకొండఁ జూచినాఁడ
నిటు నేల జేజేల కెఱుకైనచెంగావి, సుదసంజఁ దగుకొండఁ జూచినాఁడ
నిటు కోడెరౌతు మైనిడ్డ సొమ్ములమేఁత, సొంపు లీనెడుకొండఁ జూచినాఁడ
నిటు నల్లదేవరయింట నంటినతెల్ల, జోటివా యన కొండఁ జూచినాఁడ


తే.

నిందు నందును నీతోడియీడువానిఁ, గడకతోఁ గానఁగానను గాన ననుచు
నిక్క మేబాసకైనను నిల్చువాఁడ, నరనుతాటోప యోబయనరసభూప.

22

అనుపాత్తవాచకధర్మోపమానలుప్త —

మ.

మహితప్రాభవమానధుర్యమితవాఙ్మర్యాదమీనాంకవి
గ్రహముఖ్యాన్వయమూర్తిశౌర్యరసమేఘత్యాగమైత్రీరఘూ
ద్వహమేధాన్వితమౌక్తికాభరణమంత్రప్రౌఢమస్తాగ్రస
క్తహరిశ్రీచరణాబ్ద వర్ధిలు గుణాధారా నృసింహాధిపా.

23


తే.

అలర మీనాంకవిగ్రహుం డనెడిచోట, నిందు మీనాంకుమైవలె నింపు మీఱు
విగ్రహము గల్గువాఁ తన వెలయు సామ్య, వాచకోపమానంబు లసూచితములు.

24


క.

ద్వివిధం బగుసాధర్మ్యము, భువి నుపమానోపమేయముల కొక్కటి యై
తవుటయు రెంటికి ద్వివిధం, బవుట యన ద్విదీయగతియు నలరు ద్వివిధ మై.

25


క.

క్షితి నేకార్థము శబ్ద, ద్వితయంబున సంఘటింప వెలయును వస్తు
ప్రతివస్తుత యగుబింబ, ప్రతిబింబకయర్థశబ్దసార్థక్యమునన్.

26

వస్తుప్రతివస్తూపమ —

క.

అవనిఁ బరిష్కృత మయ్యెన్, రవివంశం బోబశౌరినరసింహునిచే
దివిచరతరుభూషిత మై, నవనవగతిఁ బొల్చు నందనవనం బనఁగన్.

27

బింబప్రతిబింబోపమ —

క.

గురుశౌర్యయుతము నాయక, కరవాలము నగునృసింహుఘనభుజ మలరున్
దరళఫణామణికిరణ, స్ఫురణము జిహ్వాల మైనభోగియుఁ బోలెన్.

28

అనన్వయము —

క.

సరసం బగు నొక్కటికే, ధర నుపమానోపమేయధర్మము దిర మై
పరఁగిన ననన్వయం బగు, నరయంగా దీనిలక్ష్య మాపాదింతున్.

29


క.

నీదయకు నీడుజో డగు, నీదయ నీజయముసాటి నీజయ మిలలో
నీదానమునకు నెన యగు, నీదానము నీకు సాటి నీవె నృసింహా.

30

ఉపమేయోపమ —

క.

నిపుణస్థితి నుపమేయం, బుపమానముఁ బోల మఱియు నుపమానం బా
యుపమేయముఁ బోలఁగఁ దగు, నుపమేయోపమ యనంగ నొగి నె ట్లన్నన్.

31


క.

శరణాగతభరణంబున, నరసింహునిసాటి వచ్చు నరసాహసుఁ డీ
నరసింహుఁ డితని కెన యా, నరసింహుఁడె కాక యితరనరులకు వశమే.

32

స్మరణము —

క.

ధర నొకవస్తువుఁ గనుఁగొని, వరుసం దత్సదృశ మైనవస్తువు దలఁపన్
స్మరణం బని పాటింపుదు, రరయ నలంకారవేత్త లది యె ట్లన్నన్.

33


క.

ఇల యంత్రమత్స్య మేయను, విలు పూనినశ్రీనృసింహవిభుఁ గాంచి జనుల్
తలఁపుదురు ద్రుపదకన్యా, కలితకరగ్రహణనమితకార్ముకుఁ బార్థున్.

34

రూపకము —

మ.

అల సందేహముమాడ్కి గాక యుపమేయం బెన్న నచ్చన్న మై
యలఘూత్ప్రేక్షయు నా నభిన్నమతిజం బై యుండ కారోప మిం
పలరంగాఁ బ్రకృతోపమోగిపరిణామారోపతుల్యంబుగా
కలయారోపిత మిందు రంజనము సేయన్ రూపకం బై తగున్.

35


క.

అరయ రసజ్ఞులమతమున, నరు దగునీరూపకంబు సావయవంబు
న్నిరవయవంబును వరుసం, బరంపరిత మనఁగఁ ద్రివిధభావము నొందున్.

36


చ.

అరయ సమస్తవస్తువిషయంబును నేకతలప్రవర్తి యై
యరుదుగఁ బొల్చుసావయవ మవ్వలఁ గేవలమాలికాఖ్య మౌ
నిరవయవంబు క్లిష్టమును నేర్పున శ్లేషవిహీన మౌ పరం
పరితము తత్ప్రభేదములఁ బాయక కేవలమాలికాఖ్య మౌ.

37


క.

కావున రూపక మష్టవి, ధావహ మగులక్షణంబు లలలక్ష్యంబుల్
వావిరి నొనర్తు వీనికి, భావజధనురసమరసవిభాసితఫణితిన్.

38

క.

అవయవియు నవయవంబులు, వివరింప సమస్తవస్తువిషయం బిలలో
నవయవి యవయవగమ్యం, బవునది యేకతలవర్తి యగు నె ట్లన్నన్.

39

సమస్తవస్తువిషయసావయవరూపకము —

మహాస్రగ్ధర.

హిమశైలద్వీపదీప్తం బినమణిమహితం బిందుశంఖాభిరామం
బమరాంభోమర్త్యయుక్తం బహిపలహరికం బభ్రశైవాలజాలం
బమితాశాకుంభినక్రం బజహదుడుకణం బాత్తసంధ్యాప్రవాళం
బమరున్ శ్రీనారపింహోద్యతవిశదయశోహారిదుగ్ధాబ్దివేడ్కన్.

40

ఏకదేశవర్తిసావయవరూపకము —

క.

ధర నొఱ యనువల్మీకము, సరభసగతి వెడలి నీదుచటులాసి మదో
ద్ధుచరదరిధరణిధురం, ధరజీవానిలముఁ గ్రోలు నరసింహనృపా.

41


క.

అవయవమాత్రంబున నే, కవిమతి విశ్రాంత మైనఁ గన నిరవయవం
బవని నిది కేవలంబును, ద్వివిధత మాలికయు నయ్యె విను మె ట్లన్నన్.

42

కేవలనిరవయవరూపకము —

క.

ఇల నీదు కీర్తిచంద్రిక, యలఘుతరస్ఫూర్తి నలినజాండకరండం
బులు నిండి వెల్లివిరిసే, న్నలనహుషసమానశీల నరసనృపాలా.

43

మాలానిరవయవరూపకము—

క.

హరశిఖరిదరులభాషా, తరుణీకుచగిరుల నమరతరులం జెలఁగున్
ఝరు లై సరు లై విరు లై, నరనుత మగునీదుకీర్తి నరసింహనృపా.

44


క.

రూపకకారణ మై తగు, రూపకము పరంపరితము రూపింపఁగ నిం
దే పగు నాల్గునిభేదము, లాపాదించెద నుదంచితాయతఫణితిన్.

45

శ్లిష్టకేవలపరంపరితరూపకము —

క.

నిరతంబు రాజహంసలఁ, బరువెత్తఁగఁ జేయు నౌర పటుచటులభవ
త్కరకరవాలకరాళ, స్ఫురితాంభోదము నృసింహభూపాలమణీ.

46

శ్లిష్టమాలాపరంపరితరూపకము —

క.

కువలయవికసనహిమకరుఁ, డవిరళదానాంబుదిగ్గజాగ్రణిపద్మో
త్సవసౌభాగ్యదివాకరుఁ, డవనిని నరసింహుఁ డితని కన్యులు సరియే.

47

అశ్లిష్టకేవలపరంపరితరూపకము —

క.

కాతరతరవినుతధ్వజి, నీతతకాంతారతతికి నీచేతిమహా
హేతీదవజ్వలనోజ్జ్వల, హేతి సుమీ యోబధారుణీశ్వరునరసా.

48

అశ్లిష్టమాలాపరంపరితరూపకము —

మ.

వనితానేత్రచకోరచంద్రిక యశోవల్లీవసంతోదయం
బనిదంపూర్వకథాసుధాబ్ధిభుజగర్వాదిత్యపూర్వాచలం
బనఘోద్యద్గుణరత్నరోహణము నీయాకార మెవ్వారికిన్
వినుతింప న్వశమే నృసింహకరుణావిన్యాసధన్యాత్మకా.

49

పరిణామము —

క.

ధరలో నుపమేయమునను, నరుదుగ నారోప్యమాణ మగునుపమానం
బరయఁ బ్రకృతోపయోగా, కరముగఁ బరిణామ మయ్యెఁ గను మె ట్లన్నన్.

50


క.

నైలింపసతుల కౌఁగిటఁ, దేలుటకై దివికి నేఁగుదృప్తారులకున్
నీలాల నిచ్చె నాయెను, నీలాలితహేతి యోబనృపనరసింహా.

51

సందేహము —

తే.

విషయివిషయంబుఁ గవిమతి విహితసామ్య, దీప్తసందేహ మొంద సందేహమదియు
గరిమశుధ్ధంబు నిశ్చయగర్భితంబు, నిశ్చయాంశంబు నగుదీని నిశ్చయింతు.

52

శుద్ధసందేహము —

ఉ.

ఇంద్రుఁడొ యాయుపేంద్రుఁడొ బలీంద్రుఁడొ పార్వణచంద్రుఁడో హరి
శ్చంద్రుడొ రామచంద్రుఁడొ రసాభరణప్రవణాత్ముఁ డైన నా
గేంద్రుడొ యానగేంద్రుఁడొ మృగేంద్రుడొ యంచుఁ దలంతు రార్యు లీ
సాంద్రభుజప్రతాపరణసాహసు నోబయనారసింహునిన్.

53

నిశ్చయగర్భితసందేహము —

మ.

హరుఁడో యీఘనుఁ డైన మౌళిధృతతోయం బెద్ది దైతేయసం
హరుఁడో యీనృపుఁడైన నవ్విహగవాహం బెద్ది వాణీమనో
హరుఁడో యివ్విభుఁ డైన సారసనివాసాధ్యాసనం బెద్దియం
చు రసజ్ఞు ల్వినుతింతు రాత్మ నరసక్షోణీశు వీక్షించుచున్.

54

నిశ్చయాంతసందేహము —

సీ.

తలపోయ వల్లిమతల్లి కేగతిఁ గల్గె, నలసాలసానూనయావకలన
భావింప మణిసాలభంజిక కెటు లబ్బె, లాలితాలాపలీలాకలాప
మూహింప విమలవిద్యుల్లేఖ కేలీల, నొదవె ధాత్రీభాగయోగగరిమ
మరయంగ మననమంత్రాదిదేవతకు నే, గతిఁ గల్గె నంగసంగప్రసంగ


తే.

మనుచు శబరులు సందియం బంది యంది, తెలియుదురు తోనె నీధాటికలికితలఁకి
యహితవనితలు వనవాటి నడలు చునికి, నరనుతాటోప యోబయనరసభూప.

55

భ్రాంతిమంతము —

క.

అల యుపమేయము ఛన్నత, నలరఁగ నారోప్యమాణ మగునుపమానం
బిల నెఱుకపడగ భ్రాంతిమ, దలంకరణ మయ్యె దీని నాపాదింతున్.

56


శా.

చూడం జూడ నృసింహకీర్తిచయ మీక్షోణీనభోమధ్యమం
దేడం జూచినఁ దాన యై నెగడఁగా నీక్షించి మిన్నేట నీ
రాడం బోయెడిబేసితాపసులు మే లౌ మ్రోల సిద్ధించెఁ గా
యడం బోయినతీర్థ మంచు మదిలో హర్షింతు రశ్రాంతమున్.

57

అపహ్నవము —

క.

ఉపమేయము గా దని యిది, యుపమానమె యనఁగ నెంతయు నపహ్నన మౌ
నపు డది ప్రాగారోపము, నపహ్నవారోపమును ఛలాదియు నయ్యెన్.

58

త్రివిధాపహ్నవములు —

మ.

గురుచక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబు గా దిందుభా
స్వరకీర్తిద్యుతిపంక్తి గాదు నిబిడాంచత్పాంచజన్యప్రభా
భర మౌఁగా నటుగాన విత్వభరణప్రారంభముం గోరి యీ
నరసేంద్రాకృతి నుద్భవించెఁ గమలానాథుండు విశ్వంభరన్.

59

ఉల్లేఖము —

క.

అలరఁగ గృహీతృభేదం, బుల నొకటియె పెక్కురూపముల నెడ నెడలం
దలపోయఁగ నుల్లేఖం, బలంకరణరాజ మయ్యె నది యె ట్లన్నన్.

60


క.

బాణుఁ డని బుధులు మురజి, ద్బాణుం డని విమతభూమిపాలురు సుమనో
బాణుఁ డని సతులు దలఁపుదు, రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.

61

ఉత్ప్రేక్ష —

క.

ఉపమేయమునకుఁ గలిగిన, యుపమానగుణక్రియాదియోగముచే నా
యుపమానమె యని తలఁచిన, నపు డది యుత్ప్రేక్ష యయ్యె నదియును ధరణిన్.

62


క.

క్రమమున వాచ్యయును బ్రతీ, యమానయును నగుచు ద్వివిధ యగువాచకశ
బ్దము గలుగ వాచ్య యనఁ దగు, నమరఁగ లేనియెడ గమ్య యనఁదగు వరుసన్.

63


సీ.

అలరెడు నీరెంటియందు జాతిగుణక్రి, యాద్రవ్యము లవాచ్యయబ్ధిసంఖ్య
యవి నాల్గు వరుస భావాభావములఁ జెంద, నిల ననుసంఖ్య యాయెనిమిదియును
నిరువదినాలు గౌ హేతుఫలస్వరూ, పముల వేర్వేఱఁ ద్రిభంగిఁ జెంద
నందు నెన్మిది యెన్మి దగుహేతువుఫలంబు, నలరు వాచ్యగుణక్రియానిమిత్త


తే.

ములఁ బదాఱు పదాఱు నౌ నలస్వరూప, గతనిమిత్తంబులకు వాచ్యగమ్యగతులు
గాగఁ బదియాఱు నగువాచ్యస్వరూప, మరయ గమ్యస్వరూప మష్టాఖ్యయయ్యె.

64

క.

అలహేతుఫలనిమిత్తం, బులకు న్గమ్యత్వ మైనభువి హేతుఫలం
బులు లేక రుచిర మగు నని, యలవడ గమ్యత్వ మిందు నగదిత మయ్యెన్.

65


క.

కావున నేఁబదియా ఱగు, నావాచ్యో త్ప్రేక్షగమ్య యటువలెనే భే
దావహ మగుచు నిమిత్త, ద్వైవిధ్యమునందు గమ్యదాస్థితిలేమిన్.

66


క.

హేతుస్వరూపఫలములు, నాతతగతి నెన్మి దెన్మి దయి యనియు నిమి
త్తాతివ్యాప్తిఁ బదాఱుగ, నేతఱి గమ్యయును నల్వదెనిమిది యయ్యెన్.

67


వ.

ఇందు నేఁబదియాఱు భేదంబులం బొల్చువాచ్యోత్ప్రేక్షకుం గొన్నినామధేయంబు
లెఱింగించెద. ఊపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, నుపాత్తక్రియా
నిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, నుపాత్తగుణనిమి త్తజాత్యభావస్వరూపో
త్ప్రేక్షయు, నుపాత్త క్రియానిమిత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్షయు, ననుపాత్త
నిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, నుపాత్తగుణనిమిత్తజాతిభావహేతూత్ప్రే
క్షయు, నుపాత్తక్రియానిమిత్తజాతిభావహేతూత్ప్రేక్షయు, నుపాత్తగుణనిమిత్త
జాత్యభావహేతూత్ప్రేక్షయు, నుపీత్త క్రియానిమిత్తజాత్యభావహేతూత్ప్రే
క్షయు, నుపాత్తగుణనిమిత్తజాతిభావఫలోత్ప్రేక్షయు, నుపాత్తక్రియానిమిత్త
జాతిభావఫలోత్ప్రేక్షయు, నుపాత్తగుణనిమి త్తజాత్యభావఫలోత్ప్రేక్షయు,
నుపాత్తక్రియానిమిత్తజాత్యభావఫలోత్ప్రేక్షయు ననఁ జతుర్దశభేదంబులఁ బొల్చు
జాత్యుత్ప్రేక్ష ఇట్లు గుణోత్ప్రేక్షయుఁ క్రియోత్ప్రేక్షయు ద్రవ్యోత్ప్రేక్షయుఁ
బరస్పరచతుర్దశభేదంబులం బొంద వాచ్యోత్ప్రేక్ష యేఁబదియా ఱగుజాతి యనఁగ
సముదాయంబును గ్రియ యనఁగఁ గృత్యంబును గుణం బనఁగ రూపాదియు ద్రవ్యం
బనఁగ నొకవస్తువు నగునేతదధికాధ్యవసాయమూలంబు లగు నేఁబదియాఱుభేదం
బులకు నుదాహరణంబు లొనరించినఁ జాల యగు ననుభయంబున దిఙ్మాత్రంబుగ
లక్ష్యంబులు నిరూపించెద నె ట్లనిన.

68

ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్ష —

క.

భవదీయ బాహుపీఠం, దవిలినభూదేవి యుచితధనలాభమహో
త్సవకృతకుంకుమరుచివై, భవ మన నీశౌర్యశోభ పరఁగు నృసింహా.

69

ఉపాత్తక్రియానిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్ష —

క.

నిరుపమరణదీక్షావ్రత, విరచిత మగువిజయలక్ష్మి వేణియుఁ బోలెం
బరఁగుఁ గరాళభవత్కర, కరవాలమతల్లి యోబఘనునరసింహా.

70

అనుపాత్తనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్ష —

క.

నీచరణకమలనఖరుచి, వీచికలు నతారివీరవిభవము మగుడం
బ్రోచుసమీచీనసుధా, వీచికలనఁ బొల్చు నోబవిభునరసింహా.

71

అనుపాత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్ష —

క.

ఇలను సమాద్రమువలె నీ, బలధూళి యొనర్చి సమదపరిపంథివధూ
విలసితబాష్పోదకముల, జలనిధిశతకము ఘటించు జగతి నృసింహా.

72

జాతిహేతూత్ప్రేక్ష —

క.

పొందిననృసింహనృపసం, క్రందనుసత్కీర్తిచేతఁ గడఁగి త్రిలోకీ
మందస్మితంబుచే బలెఁ, జెందొవచెలి యంకరుచివిశేష మడంగెన్.

73

జాత్యభావహేతూత్ప్రేక్ష —

క.

రేల రవిలేమి నిరు లౌఁ, ద్రైలోక్యం బనియుఁ బోలె ధాత సృజించెన్
లాలితనిరుపమతేజో, నాళీకవనాప్తుఁ డైననరసింహేంద్రున్.

74

జాతిఫలోత్ప్రేక్ష —

క.

ప్రమదమునఁ జెలఁగు జయమయ, కమలకు రంగస్థలంబు రావలసి సుమీ
క్రమమున నరసింహేంద్రుని, సమధికభుజమధ్య మతివిలాలం బయ్యెన్.

75

జాత్యభావఫలోత్ప్రేక్ష —

క.

తగవరులు జగతి మగువలఁ, దెగటార్పరు గాన నీదుదృప్తారాతుల్
మగఁటిమి డినవలసి సుమీ, తగ భీరువు లగుట యోబధరణిపునరసా.

76

క్రియాస్వరూపోత్ప్రేక్ష —

చ.

అనఘ నృసింహ నీఘనజయానకజాతభయానకాధిక
ధ్వనులు గుహాగృహాగ్రముల వ్రాలఁ బ్రతిధ్వనిమేదురంబు లై
తనరె దిగంతశైలములు దమ్ము నెదుర్కొనువైరీకోటికిన్
నిను శరణంబు వేడు మని నేర్పున బద్ధులు నేర్పుకైవడిన్.

77

క్రియాభావస్వరూపోత్ప్రేక్ష —

చ.

భవదరిభూమిపాలకులపాలిక చెంచెత కాత్మ దుర్దశ
ల్వివరముగా వచింప వనవీథి దయామతిపల్కనీనియ
ట్లవిరళమందమారుతచలాచలచారుపలాశహస్తముల్
తెవిలి విదుర్చు శౌర్యగుణధామ నృసింహనృపాలశేఖరా.

78

క్రియాహేతూత్ప్రేక్ష —

చ.

మొగము ముడించెఁ గచ్ఛపము మో మరవాంచె భుజంగపుంగవుం
డగము చలింపఁ గా వెఱచె నాదివరాహము మోరత్రోపునం
దెగువఁ బయోధిఁ జొచ్చె సుదతీమకరాంకనృసింహభూప నీ
జగదభినంద్యభూభరణశక్తికృతాభిభవంబుచే దలెన్.

79

క్రియాభావహేతూత్ప్రేక్ష. —

చ.

సరసనృసింహ నీయశముఁ జంద్రునిఁ ద్రాసున ధాత దూఁచిన
న్సరభసవృత్తి నెత్తుడిగి సామ్యనిరూఢి వహింపలేమినో
యరయ గురుత్వహేతుమలినాంకనిరంకుశలోహటంకసం
కరమునఁ జెందెఁ జంద్రుఁడు జగంబు మృగం బని చూచుచుండగన్.

80

క్రియాఫలోత్ప్రేక్ష —

చ.

నరనుతశౌర్యవైభవ సనాథనృసింహధరాధినాథ నీ
వరజయభేరిభాంకృతిరసంబు దివిం బరిపూర్ణ మయ్యె నా
సురగణికాపరంపరకుఁ జోద్యముగా ననురూపనాయక
స్థిరపరిరంభసంభ్రమవిశేషము దెల్పఁగ నేఁగుకైవడిన్.

81

క్రియాభావఫలోత్ప్రేక్ష —

ఉ.

గందపుఁగొండపై నివము గ్రమ్మెడిమౌక్తికనిర్ఘరీతటీ
చందనవాటిలోఁ గనకనైకతసాంద్రగుహాగృహావళిం
జెంది ఫణీంద్రకన్యలు నృసింహు నమందయశోమరందని
ష్యందము గ్రోలుచుందురు విషాగ్ని దహింపఁగ లేమికిం బలెన్.

82

గుణస్వరూపోత్ప్రేక్ష —

క.

నరసింహుభాగ్యసూచక, సురుచిరదృక్కోణశోభ చెలంగెన్
శరణాగతభరణాయతి, కరుదుగ సాకార మగుదయారస మనఁగన్.

83

గుణాభావస్వరూపోత్ప్రేక్ష —

క.

బలశశిహరభాషలకును, బొలుపుగ మితిలేనిమాడ్కి మొలబం టై ఱొ
మ్ములబం టై మెడబం టై, తలమునుకలు నయ్యె నరసధరణిపుకీర్తుల్.

84

గుణహేతూత్ప్రేక్ష —

మ.

అరయ న్శ్రీనరసింహుకీర్తిచయ ముద్యన్ముఖ్యనర్ణోదయా
కరసామ్యంబున ధాతపైఁ గినిసియే కాఁబోలుఁ దత్సైంధవో
త్కరసౌభాగ్యముఁ దన్మహాసనరుచిం గారించి భాషావర
స్థిరరూపం బయి తా సృజించె నరులన్శ్రీకంఠసంకాశులన్.

85

గుణాభావహేతూత్ప్రేక్ష —

క.

హరిగరిమ దెగడి సత్సధ, పరిచయలంఘన మొనర్చి బ్రమియించుఁ జుమీ
నరసింహభూమిపాలుని, యరు దగుసత్కీర్తి యవినయంబునఁ బోలెన్.

86

గుణఫలోత్ప్రేక్ష —

క.

పడి నీకీర్తులఁ బోలెడి, కడిమిం దన కందు దీపు గావలసి జుమీ
కడ కడలి యెడల గ్రుంకును, వెడవిల్తునిమామ యోబవిభునరసింహా.

87

గుణాభావఫలోత్ప్రేక్ష —

చ.

తెగువరి యై చెలంగుభవదీయకృపాణము వైరికోటియం
దగణితదానకేలిరత మయ్యును జీవన మీ దటన్న లో
భగుణము లేమికిం బలె విపక్షనృపాలుర కెల్ల జీవనం
బొగిఁ దృణవృత్తి నిచ్చువిజయోన్నత శ్రీనరసింహభూవరా.

88

ద్రవ్యస్వరూపోత్ప్రేక్ష —

సీ.

సటలెకా నొకకొంత చాలదు పౌరుషం, బాయుధప్రౌఢి యింతైన లేదు
జనన మెంచినఁ బ్రదోషంబుపా లౌట మా, టికిఁ బుట్టినట్టిచోటికిని జేటు
నెఱిఁ జిన్నవాని కెన్నిక గానితనబల్మి, ద్వేషిఁ గన్నను నోరు చెఱచుకొనుట
పాటింప నోరి బొబ్బాట మేనడిగాని, ఘోరాజిలో బుసకొట్టుచుంట


తే.

కొదవ దన కంచుఁ గ్రమ్మఱ నుదితుఁ డైన, యల్ల నరసింహుఁడును బోలె నసమసమర
సృమరఘోరప్రతాపుఁ డై చెలఁగు దౌర, సరసగుణహార యోబయనరసధీర.

89

ద్రవ్యాభావస్వరూపోత్ప్రేక్ష —

సీ.

పొగ డొందుచదలేటిపొందామరలు గోసి, శిరసులనొఱపుగాఁ జెరువువారు
చలిదేఱుకల్పకాసవరసంబులకుఁ ద, త్కోరకంబులతావి గూర్చువారు
వేల్పుఁగన్నియల నేవేళదేశీయంపు, బిట్టుఁ జేతల గాసి పట్టువారు
నమరునే జాజల్లు లగు నని బేసితా, పసులకూర్చము లూడ్వఁ బఱచువారు


తే.

నగుచు భవదసివిదళితయవననృపతు, లహరహము రాయిడి యొనర్ప నమరపురము
వాసవుఁడు లేనికైవడి వఱలుచుండు, నననుతాటోప యోబయనరసభూప.

90

ద్రవ్యహేతూత్ప్రేక్ష —

క.

నరసింహ యోబభూవరు, నరసింహ భవద్భుజాగ్రనటదనిచి భూ
పరిచితరాహువుచేఁ బలె, నరి తేజోభానుబింబ మపహృత మయ్యెన్.

91

ద్రవ్యాభావహేతూత్ప్రేక్ష —

చ.

స్థిరబల యోబభూవరునృసింహ భవన్నవకీర్తి భూనభోం
తరముల నిండఁ దద్రుచివితానములోన విలీన మౌసుధా
శరనిధి లేమిచే బలెఁ బ్రశాంతనిరంతరతావకాశయాం
తరసుఖవాస మందె మురదానవభంజనుఁ డెల్లకాలమున్.

92

ద్రవ్యఫలోత్ప్రేక్ష —

ఉ.

రాజపురందరుండ వయి రంజిలు నీ కుచితంబు గాఁగ నీ
రాజితకీర్తి యభ్రగజరా జయి యున్కికిఁ గాదె తారకా

రాజికరాంబుశీకరపరంపరలుం దెలిమబ్బుజల్లులుం
దేజముతో ధరించె సుదతీమకరాంక నృసింహభూవరా.

93

ద్రవ్యాభావఫలోత్ప్రేక్ష —

చ.

తనరు నసంఖ్యవాజిగజదారుణ మై తగు నాదుమ్రోల నేఁ
డెనిమిదిసైంధవేధముల నీడుగఁ దాల్చుట యె ట్లటంచు నా
కినుక నభంబు లే కునికికిన్ బలె శ్రీనరసింహుజైత్రవా
హిని యనిలోన నింగి కెగయించు సుదంచితరేణుపుంజముల్.

94


క.

ధరవాచ్యోత్ప్రేక్ష కుదా, హరణము లిని గొన్ని కడను యన్యకృతులయం
దరయఁగ దగు గమ్యోత్ప్రే, క్ష రచింపఁగ లేదు నేర్పు చాలమి నిందున్.

95

అతిశయోక్తి —

క.

ఉపమేయ మింతదడవక, యుపమానమె నుడువ నతిశయోక్తి కవి మహా
నిపుణోక్తిమూల మై తగు, నపరిమితప్రౌఢి నదియు నైదువిధము లై.

96


తే.

పరఁగ సంబంధమం దసంబంధ మనఁగ, మఱి యసంబంధమందు సంబంధ మనఁగ
భేదమందు నభేద మభేద భేద, భావమును గార్యహేతువిపర్యయ మన.

97

సంబంధాసంబంధాతిశయోక్తి —

మ.

అలఘుప్రౌఢిమ నీదుదానవిభవం బౌలించి యాలించి ని
చ్చలు దా నస్ఫురణం బడంగె సురభూజశ్రేణికిం గల్గె నా
బలభిద్వారణగండకాషకలనప్రత్యగ్రలగ్నాధికో
జ్జ్వలదానం బొకవేళ గల్గు నరసక్ష్మాపాలచూడామణీ.

98

అసంబంధసంబంధాతిశయోక్తి —

ఉ.

చందనశైలసానువులఁ జాలఁ జెలంగుభుజంగబాలికా
బృందము శ్రీనృసింహవిభుఁ బేర్కొని పాడఁ దదీయగానని
ష్యందము లానువేడ్క బెరయంగఁ గురంగతురంగ మేగమిన్
మందగతిప్రసంగములు మానవు దక్షిణగంధవాహముల్.

99

భేదాభేదాతిశయోక్తి —

క.

అగు నొకటి కర్ణభూషణ; మగు నొక్కటి కర్ణవైరిహరిచందనపుం
జిగురును నీచే చిగురుం, బొగ డొందుట కిదియె భేదము నృసింహనృపా.

100

అభేదభేదాతిశయోక్తి —

సీ.

అమృతమూ ర్తికిఁ గళంకావాప్తి యె ట్లని, మిహికాంశునిఁ గళంగరహితుఁ జేయ
లోకబాంధవున కుగ్రాకార మె ట్లని, భానుఁ బార్వణశీతభానుఁ జేయ

మృత్యుంజయున కేల మెడచుట్టు విస మని, గరళకంఠుని సితకంఠుఁ జేయ
దలపోయ నుఱు వై నదాత కీమాలిన్య, మనుచితం బని ఘను నమలుఁ జేయ


తే.

మహితభవదీయసత్కీ ర్తిమధురవిధుర, వక్ర మగు బ్రహ్మసృష్టి నతిక్రమించి
కమలజాండకరండంబు గడచి వెడలె, వైరిగజసింహ యోబయనారసింహ.

101

కార్యకారణవిపర్యయరూపాతిశయోక్తి —

సీ.

నీప్రతాపగ్ని దెసలఁ బర్వక మున్నె, పొగయు శాత్రవరాజపురవరంబు
లలపురంబులధూమ మగ్గలింపక మున్నె, ప్రబలువైరికళత్రబాష్పవితతు
లలజలంబులు ధాత్రి నవఘళింపక మున్నె , ద్రె ళ్ళుబ్బువారి యకీర్తిపంక
మాపంకసంకరం బంకురింపక మున్నె, పొడము నసత్కీర్తిపుండరీక


తే.

మవుర కవిబుధశుకపికనినహనిరత, ఫలితసురుచిరసురతరుపటిమఘటన
కలితకరతలకుసుమితకరజనికర, గరిమ మనుపోచిరా జోబఘనునృసింహ.

102

సహోక్తి —

క.

నిపుణత ముఖ్యాన్విత మా, నుపమేయంబును సహార్థయోగాన్విత మౌ
నుపమానంబును బెరసినఁ, బ్రపంచితం బగుసహోక్తి రహి నె ట్లన్నన్.

103


సీ.

నానారిభూనాథసేనాపతులతోనె, కటకము ల్దూఱు నీపటహరవము
భీతారిజాతాసువాతావళులతోనె, దివి కేఁగు నీచమూభవరజంబు
ధీరాతివీరారిఘోరాంగములతోనె, వడకు నీకరతలోజ్జ్వలకృపాణ
మస్తారిమస్తాగ్రవిస్తారములతోనె, సతిఁ జెందు తావకోన్నతశ రాస


తే.

మహితనృపరాజ్యలక్ష్మీమృగాక్షితోనె, వేడ్క నినుఁ జెందు సంగ్రామవిజయలక్ష్మి
యనఘతరపోచిరాజవంశాబ్ధచంద్ర, నరనుతాటోప యోబయనరసభూప.

104

వినోక్తి —

క.

సంబంధిం బాసి మఱియొక, సంబంధికిఁ జారుతయు నచారుతయుం బ్రా
పంబుగఁ బ్రజ్ఞాధికులమ, తంబున నది యగు వినోక్తి ధర నె ట్లన్నన్.

105


ఉ.

క్రూరత లేనిచూపు నెలకొన్నవికారము లేనిరూ పహం
కారము లేనియేపు కలకాలము వేసట లేనిప్రాపు సం
ప్రేరితయంత్రమీనతనుభేదమున న్సరి లేనితూపు ని
ద్ధారుణి నీకె పొల్చు గుణధామ నృసింహనృపాలశేఖరా.

106

అచారుతావినోక్తి —

క.

కవి లేని రాజుకీర్తియు, రవి లేనినభంబు రూపరసభావములం
జవి లేనిభామపొందును, రవ లేనివిభూషణంబు రహి నరసింహా.

107

సమాసోక్తి —

క.

ప్రకృతము విశేషణంబులు, సకలంబును సామ్యధర్మసహితము లై య
ప్రకృతముఁ దలఁపింపఁగ నది, య కృతి సమాసోక్తి యయ్యె నది యె ట్లన్నన్.

108

క.

కలకంఠరుతులఁ బిలుచును, ఫలములు చవి చూడుఁ డనుచుఁ బదములఁ బెనఁగున్
బలమఱి పఱచు భవద్రిపు, లలనాతతిఁ గాంచి వింధ్యలతలు నృసింహా.

109

వక్రోక్తి —

క.

వేరొకవివిక్షఁ బలికిన, చారూక్తికి శ్లేష, కాకుసంబంధముచే
వేరొకయోజన దెచ్చిన, నారయ వక్రోక్తి యయ్యె నది యె ట్లన్నన్.

110


ఉ.

ఇంతి భవన్మనోగతుఁ డెవ్వఁ డినుం డినుఁ డైన బద్మనీ
కాంతుడొ రాజశేఖరుఁడు గా నితఁ డాతఁడు గాఁడు రుద్రుడో
శాంతి లలాటలోచనుఁడు గాఁడు నృసింహుఁడు మాధవుండొ ని
న్నింతట మెచ్చితిం జెలి నిజేశుఁడు మాధవుఁ డౌ శుభాకృతిన్.

111

స్వభావోక్తి —

క.

సహృదయహృదయంగమ మై, మహి నున్నది యున్న యట్ల మాటలతేటల్
బహుళంబులు గాఁ జెప్పిన, మహితోక్తియె జాతి యయ్యె మది నె ట్లన్నన్.

112


సీ.

తలచూపి మోసులై త్రాసులై తళు కెక్కి, నిక్కి నక్కులవలె నెరసి బెరసి
గెఱకట్టి కళుకు లై కెరలి పోఁకంత లై, వింతలై చెంతల విరివిఁ జెంది
జిగిదొట్టి మిట్టలై బిగువు లై బుగడ లై, మొగడ లై నిగనిగన్నిగల నెగడి
కొన లుబ్బిగబ్బులై గుబ్బ లై యపరంజి, కుండ లై కొండ లై దండ నించి


తే.

దొరసి యొండొంటి నొరసి క్రిక్కిఱిసి మెఱసి, యగణితస్ఫూర్తి మొగమున కెగయు నీదు
వలుదవలిగుబ్బచన్ను లోవలపులాడి, నేడు నరసింహుకౌఁగిట నెరపఁ గలిగె.

113

వ్యాజోక్తి —

క.

తేజరిలు వేడ్కతో న, వ్యాజసముద్భూత మైనవస్తువు నెలమిన్
వ్యాజంబు చేసి డాఁచిన, వ్యాజోక్తి యనంగఁ బొల్చు నది యె ట్లన్నన్.

114


క.

బాలామణి నరసింహనృ, పాలాగ్రణిఁ జూచి ప్రమదబాష్పావృత యై
లీలాసౌధసముత్థిత, కాలాగురుధూప మెంతఘన మని పల్కున్.

115

మీలనము —

క.

అతనిం బ్రబలం బగువ, స్తువుచే వస్త్వంతరంబు సొరిది నడఁగినం
గవులమతంబున మీలన, మవునది యన్వర్థ మగుచు నది యె ట్లన్నన్.

116


శా.

నీధాటీవిచలద్బలోద్భలభటానీకోదయద్భీతిచే
భాధాహేతువనోగ్రజంతుభయముం బాటింప కాత్మ న్రిపు
క్ష్మాధీశాంగన లద్రికందరల వె ల్గంచు న్భుజంగస్ఫటా
సాధూద్యన్మణిపంక్తి గప్పుదురు దోశ్శక్తి న్నృసింహాధిపా.

117

సామాన్యము —

క.

అవిరళగుణసామ్యంబున, నవని న్వస్త్వంతరంబునం దేకం బై
ప్రవిమలవస్తువు మెఱసిన, నవు నది సామాన్య మనఁగ నది యె ట్లన్నన్.

118


క.

నీకీర్తికాంతలోపల, శ్రీకంఠుం డేక మైన శివుఁ గానక యా
నాకనది జలధి కేఁగుం, బాకారిసమాన యోబపార్థివునరసా.

119

తద్గుణాతద్గుణములు —

క.

తనగుణము విడిచి యన్యము, ననఘ గుణముఁ గొనుట తద్గుణాఖ్య మొరుగుణం
బనయము హేతువు గలిగియు, నెనయమియ యతద్గుణాఖ్య మివి యె ట్లన్నన్.

120

తద్గుణము —

ఉ.

కానల కేఁగి నీవిమతకాతరలోచన ప్రాణనాథుఁడుం
దాను భుజింపఁగా ఫలవితానము గోసెద నంచుఁ బోయి నా
నానిరవద్యకోకవదనర్మసఖాంగుళిపాటలాంశురే
ఖానిబిడంబు లైనకసుగాయలె కోయు నృసింహభూవరా.

121

ఆతద్గుణము —

చ.

బలరిపుభోగ యోబనరపాలనృసింహ భవద్యశంబుచే
దెలు పగు నిందులాంఛనము దె ల్పగుఁ బ్రాక్తనభోగిభోగము
ల్దెలు పగు రుద్రుకంధరము దె ల్పగు భారతికొప్పు గాని త్వ
త్ఖలరిపుదుర్యశోరుచివితానము తె ల్పయి యుండ దెన్నడున్.

122

విరోధాభాసము —

క.

అమరవిరోధం బాభా, సము గాఁగ విరోధ మయ్యె జగతి నదియునుం
గ్రమమునఁ జాత్యాదివిభే, దములబహుత్వంబుఁ జెంది తగు నె ట్లన్నన్.

123


తే.

జాతి జాత్యాదికముతోడ జగతిఁ గ్రియ క్రి, యాదికముతోడ గుణము గుణాదితోడ
ద్రవ్యమున ద్రవ్యము విరోధంబుఁ జెందఁ, బది విరోధంబు లగు వీనిఁ బదిలపఱతు.

124

జాత్యాదివిరోధాదిక్రియాదివిరోధములు —

సీ.

ధారాధరం బయ్యుఁ దనరు నీకౌక్షేయ, మనతవాహిని కజీవనద మయ్యె
కమలాకరం బయ్యు నమరు నీశౌర్యంబు, ఘనరాజహంసభీకరతఁ దాల్చె
నీరంధ్రగతి మహావారణం బయ్యు నీ, సత్కీర్తి హరిఘటాసఖ్య మొందె
నవనిఁ బ్రభానిధి యయ్యు నీనెమ్మేను, జైవాతృకత్వంబు సంఘటించె


తే.

ధర్మకర మయ్యుఁ బ్రతిపక్షధర్మభేది, నరనుతవిహార మయ్యుఁ గర్ణప్రమోద
శీల మురుగోత్రధృతి యయ్యు జిష్ణు వగుచుఁ, జెలఁగు నీబాహుయుగము నృసింహభూప.

125

గుణాదివిరోధద్రవ్యవిరోధములు —

మ.

తలిరుంబోఁడి సరాగ యయ్యు ధవళత్వం బొందు నుచ్చైఃస్తనా
చలభారాసహ యయ్యు దా నచల యౌఁ జర్చింపఁగా నార్య యై
చెలుఁవం బందియు నన్యభాష యగు నీచేతోజశస్త్రాహత
న్నలినాక్షీమణి నేలు మింక నరసేంద్రా సాంద్రతేజోనిధీ.

126

విశేషము —

క.

ధారణి నా ధేయము నా, ధారముగా నొకట నేకతరకలితముగా
సారెకు నశక్యకరణం, బారూఢముగా విశేష మగు నె ట్లన్నన్.

127

ఆధారరహితాధేయము —

చ.

దురమున శ్రీనృసింహుఁ డతిదుర్మదవీరవిరోధిపంక్తిపై
సరభసవృత్తి నత్తలము సాఁపఁ బ్రదీప్తము లయ్యె దన్మహా
మరకతపుష్యరాగనవమౌక్తికవిద్రుమనీలకాంతిచే
సురపదవీథిపై జనులచూడ్కి కభిత్తకచిత్రకర్మముల్.

128

ఏకానేకగోచరము —

క.

కలఁడు గలఁ డన్నచోటం, గలుగు నృసింహుఁ డవుగానఁ గానల గిరులం
గలలోన మ్రోలఁ బిమ్మట, నలఘుస్థితి నీవ యగుదు వరికి నృసింహా.

129


సీ.

దారుణాఖండమార్తాండమండలము ను, ప్పొంగి గుటుక్కున మ్రింగవచ్చు
గంభీరఘుమఘుమారంభసంరంభదు, గ్ధపయోధి చెంగున దాఁటవచ్చుఁ
జండికాజానేయగండప్రకాండము, ల్వీఁకఁ జరాలున వ్రేయవచ్చుఁ
గుటిలోగ్రశతకోటికోటిసంఘాటము, ల్కినిసి ఘణిల్లునఁ దునుమవచ్చుఁ


తే.

గాని పశ్యదళీకభీకరదృగగ్ర, జాగ్రదనలోజ్జ్వలజ్వాలజాలజటిల
గురుభుజ శౌర్యు నినుఁ జెన్కఁదరమె యరుల, కౌబలేంద్రునినారసింహక్షితీంద్ర.

130

అధికము —

క.

ఆధారం బల్పం బై , యాధేయం బధిక మైన నది యల్పం బై
యాధారంబును నధికం, బై ధర రంజిల్ల నధిక మగు ని ట్లన్నన్.

131

అధికాధేయము —

క.

ఘనరోమకూపవాతా, యనముల కణుపంక్తు లగునజాండంబులచేఁ
దనకు హరికుక్షి నడఁగక, యనఘాబ్జత వెడలె నీదుయశము నృసింహా

132

అధికాధారము —

క.

నీదునిరవద్యకీర్తి మ, హాదుగ్ధవయోధిలోన నాదిమరాజ
ప్రాదుర్భూతయశంబులు, ప్రోదిం బుద్బుదములట్లు పొల్చు నృసింహా.

133

విభావనావిశేషోక్తులు —

క.

కారణము లేక కార్యము, ప్రారూఢం బైన నది విభావన పెక్కు
ల్కారణము లయ్యుఁ గార్యము, చేరక యుండుట మహి న్విశేషోక్తి యగున్.

134

విభావన —

సీ.

నలినారి లేనివెన్నెలలు రాత్రులు లేని, తారలు లత లేనికోరకములు
కొలను లేనిసితాబ్జములు స్వాతిచిన్కులు, లేనిముత్తెము లేఱు లేనిమరువు
లలరు వెల్తురు లేనివెడమబ్బులు హిమాద్రి, లేనిమంచులు వార్థి లేనిసుధలు
గని లేనివజ్రము ల్గంధాద్రి లేనిగం, ధములు పాదము లేనితారవితతు


తే.

లౌర నీకీర్తిరుచులు మహానుభావ, భావజాకార కారుణ్యభాసమాన
మానకురురాజ రాజన్యమకుటనిహిత, చరణరాజీవ యోబభూవరునృసింహ.

135

విశేషోక్తి —

క.

అని నీ చపఘనాఘన, ఘనము శరోత్కరముఁ గురియఁ గపటాహితరా
డ్వనితలకు నెట్టి చోద్యమొ, యను నొందవు కంకణంబు లౌబళనరసా.

136

అసంగతి —

క.

నేరుపుతోఁ గార్యంబును, గారణమును భిన్నదేశగతములు గా ని
ద్ధారణిలోన నసంగతి, యై రంజిలు నండ్రు సుకవు లది యె ట్లన్నన్.

137


క.

అనిలోన నీభుజాగ్రం, బనుపమతరవారిధార నందిన నేలా
యనయంబుఁ దాము వడఁకుదు, రన తారులు శ్రీనృసింహ యతిబలసింహా.

138

విచిత్రాన్యోన్యములు —

క.

స్వవిరుద్ధఫలంబునకై, యవిరళయత్నము విచిత్ర మన్యోన్యము భూ
ష్యవిభూషణభావంబునఁ, దవులుట యన్యోన్య మయ్యె ధర నె ట్లన్నన్.

139


క.

సతిఁ జెందుమ రున్నతికై, ప్రతీపభూపతులు నీదుభువనాగ్రబహిః
స్థితిఁ జెందుదురు గృహాంత, స్థితికై నరసింహ శౌర్యజితనరసింహా.

140

అన్యోన్యము —

క.

లలన నృసింహునిఁ జెందెడి, తలపున మైఁదొడవు లిడఁగ దనులత చెలఁగెన్
గలితవిభూషణములచే, లలితవిభూషణము లంగలతచేఁ జెలఁగెన్.

141

విషమము —

క.

ఆవిరళవిశుద్ధకార్యో, ద్భవమున నర్థాంకురాభిపతనవిధానం
బు విరూపఘటన మనఁగా, నవనిం ద్రివిధంబు విషమ మది యె ట్లన్నన్.

142

విరుద్ధకార్యవిషమము —

క.

కాలాహినీల మగునీ, వా లాహవభూమియందు వఱలుచు రిపుభూ
పాలాననవైవర్ణ్యవి, భాలాభ మొనర్చు నోబపౌర్థివనరసా.

143

అనర్థవిషమము —

చ.

అమరు భవత్ప్రతాపతపనాతప మంబరవీథిఁ బర్వఁగా
సమదవిరోధిభూరమణచంద్రముఖీవదనారవిందముల్

క్రమమున హర్ష మొందమియ కా దనయంబు దృగంబునిర్ఝరీ
హిమజలరూషితంబు లగు నెంతయు శ్రీనరసింహభూవరా.

144

విరూపఘటనము —

సీ.

హయగజారూఢు లై యలరురాజన్యపుం, గవు లేడఁ గవు లేడఁ గంబుకంఠి
ఘనభోగభాగ్యసంగతు లైనమంత్రికే, సరు లేడ సరు లేడఁ జంద్రవదన
సౌధవీథికలలోఁ జరియించుపుష్పకో, మల లేడ మల లేడఁ దలిరుబోఁడి
చీనిచీనాంబరశ్రీఁ జెందుబాలికా, వలు లేడ వలు లేడ వామనయన


తే.

యనుచు నీదాడి కోడి కాఱడవిఁ బడిన, వైరిభూపాలకులదురవస్థఁ జూచి
కాంతతోఁ బల్కు వింధ్యపక్కణకిరాతుఁ, డరిజయాటోప తొరగంటిసరసభూప.

145

సమము —

క.

అనురూపము లగుఃస్తువు, లనయము నెనయంగ నది సమాలంకృతి యై
ఘనత రసజ్ఞులమతమునఁ, దనరుం గార్యంబులందు ధర నె ట్లన్నన్.

146


చ.

అలరు రతి న్రతీశు దమయంతి నలు న్నలువొంద ముందుగా
నలుని సృజించి యందుకతనం దనచే యళు కెల్లఁ నటిదీఱి నే
ర్పలవడ నోలతాంగి నరసాధిపు నిన్నును గూర్చి ప్రేమసం
కలితము గాఁగ దంపతులఁ గా నొనరింపఁగ బోలు మెచ్చితిన్.

147

తుల్యయోగిత —

క.

ప్రకృంబులకైనను న, ప్రకృతంబులకైనఁ తుల్యభావము గలుగం
బ్రకట మగుఁ తుల్యయోగిత, యకలంకోపమ్యగమ్య మై యె ట్లన్నన్.

148

ప్రకృతతుల్యయోగిత —

క.

నరసింహరాజశేఖర, నరనుత మగునీదువితరణంబును రణమున్
నిరతస్వాస్థ్యంబుగఁ గ్ర, మ్మఱ దేహి యనంగనీక మనుచుం బరులన్.

149

అప్రకృతతుల్యయోగిత —

క.

కొండలు రంభాదులచనుఁ, గొండలు వడి నదరుచుండు ఘోరాజుల నీ
చండజయపటహరవము ల, జాండంబులు నిండ నోబయప్రభునరసా.

150

దీపకము —

క.

ప్రకృతము లప్రకృతంబులు, బ్రకటంబుగఁ గూడి తుల్యభావముఁ జెందన్
సుకవీంద్రులమతమున దీ, పక మగు నిది గమ్యసామ్యపర మె ట్లన్నన్.

151


క.

ధారణి సదాళిసన్నుత, సారస్యం బగుచు విమలజలజము రాకా
నీరేజవైరిబింబము, నీరమ్యయశంబుఁ బొల్చు నెమ్మి నృసింహా.

152

ప్రతివస్తూపము —

క.

వేర్వేఱ వాక్యయుగమునఁ, బర్వినసాధర్మ్య మమరఁ బ్రఖ్యాతం బై
యుర్విం బ్రతివస్తూపమ, సర్వజ్ఞులమతమునందుఁ జను నె ట్లన్నన్.

153

క.

రవి యొకఁడె ధురంధరుఁ డౌ, కవిసి తమోవితతి నడఁపఁ గవిదైన్యతమో
నివహంబు నడఁప నీవే, యవనిని ధూర్వహుఁడ వోబయప్రభునరసా.

154

దృష్టాంతము —

క.

బింబప్రతిబింబత్వము, నం బరఁగినవాక్యయుగమునం గలసాధ
ర్మ్యంబు చెలంగిన దృష్తాం, తం బగు నది కృతులయందు ధర నె ట్లలన్నన్.

155


క.

అసదసురవిసరవిశసన, రసవిసృమరసాహసుండు రాముఁడె ధరలో
నసనుసమరతలసమదా, రిసమూహవిభేది వీవె శ్రీనరసింహా.

156

నిదర్శనాలంకారము —

క.

ధర నన్వయంబు గూడక, గరిమ న్సామ్యంబు నెచట గమ్యముఁ జేయం
బరఁగునగి నిదర్శన యన, నిరవొందును గృతులయందు నిది యె ట్లన్నన్.

157


క.

బలదరిరాజసేనా, జలధిన్ జీవనము గ్రోలి జలధరశోభా
విలసనము దాల్చె నీయసి, యలఘురణోత్సాహనరస యౌబళనరసా.

158

వ్యతిరేకము —

క.

ధర నుపమానముకన్నను, నరు దగు నుపమేయ మధిక మౌ నన సామ్యం
బురుభేదకారణం బై , యిరవుగ వ్యతిరేక మయ్యె నిది యె ట్లన్నన్.

159


సీ.

బహుతరాశాభ్రాంతి బయలు వ్రాకక యున్నఁ, గువలయద్వేషంబుఁ గోరకున్న
వీటితమ్ములవిరివోటు సేయకయున్న, దోషాభిభూతుఁడై తొలగకున్న
జగతి నందఱకును బగ లొనర్పక యున్న, వారుణీసక్తిని బాఱకున్న
ద్విజరాజపరిభవోద్వృత్తి చేకొనకున్న, సరసుల నింకింపఁ జాలకున్న


తే.

సాటి యగు విశ్వవినుత శశ్వత్ప్రతాప, వైభవద్వస్తదుర్వారవైరివీరుఁ
డైనయోబయనరసింహు నమితభువన, భననభృతతేజమున కబ్జబాంధవుండు.

160

శ్లేషము —

క.

ప్రకృతము లప్రకృతంబులు, ప్రకృతాప్రకృతములు శబ్దపాటవమాత్ర
ప్రకటితసామ్యముఁ జెందిన, నకలంకతశ్లేష మయ్యె నదియును వరుసన్.

161


క.

నిరతము శ్లిష్టవిశేష్యత, నరు దందును బ్రకృతములును నప్రకృతములున్
ధర నశ్లిష్టవిశేష్యము, లరయం బ్రకృతాప్రకృతము లవి యె ట్లన్నన్.

162

ప్రకృతశ్లేషము —

క.

పరిణతగుణభరితము లై , నిరుపమశరశాస్త్రకలన నిర్మిద్రము లై
యిర వగునీధర్మంబులు, నరనుత యోబక్షితీంద్రునరసింహనృపా.

163

అప్రకృతశ్లేషము —

క.

అసదృశకాష్ఠాశ్లేషో, ల్సితుల నుగ్రకరయోగలక్షితుల విభా
వసుల నగు నీదుతేజో, విసరము నరసింహ యోబవిభునరసింహా.

164

ప్రకృతాప్రకృతశ్లేషము —

క.

అరిదరకరుఁ డై సుమనో, వరభరణధురీణుఁ డై యవారితలక్ష్మీ
స్థిరవాసభాసురుం డై, నరసింహుఁడు వొల్చు నాదినరసింహుఁ డనన్.

165

పరికరము —

క.

సాకూతము లై సఫలత, చేకొన్నవిశేషణములు చెలఁగఁ బరికరం
బై కృతుల వెలయు చుండు మ, హాకవిసంస్తుత్య మగుచు నది యె ట్లన్నన్.

166


సీ.

దర్పితాహితనృపోత్తములు ని న్నె దిరింపఁ, గలరె ధీరోత్తమగండబిరుద
విమతకీర్తిప్రతాపములు నీచే సమ, కట్టునే యుభయరగండబిరుద
యరివధూతాటంకగరిమంబు నీచేతఁ, గలుగునే గండరగండబిరుద
పరిపంథిగంధసింధురపంక్తి మ్రోల, నుండునే గండభేరుండబిరుద


తే.

యరుణపరిణతధామ రామాభిరామ,
రామణీయకనిర్జితప్రసవబాణ
బాణసాహిత్యపరిపాకపాకవైరి, విభవసౌభాగ్యయోబభూవిభునృసింహ.

167

ఆక్షేపము —

క.

ధర నిష్ట మపరమార్థ, స్ఫురణం గా దన ననిష్టమున పరమార్థ
స్ఫురణ విధింపఁగ రెండై, యరయఁగ నాక్షేప మమరు నది యె ట్లన్నన్.

168

ఇష్టనిషేధాభాసము —

సీ.

మదిలోనఁ బాయకుండుదు నన్నఁ బునరుక్తి, నీసొమ్మ నన్న గాణిక్యవృత్తి
నినుఁ బాసి నిలువలే నన నసంభావ్యంబు, పతి వీ ఇనఁగ నభః ప్రసవాంఛ
యతనుఁడు గారించు నన నసాక్షికసూక్తి, చలిగాలి వేఁ డన్న జనవిరుద్ధ
మొలమి నిచ్చటికి రావలయు నన్న మదోక్తి, చనుదెంతు నే నన్నఁ జాపలంబు


తే.

వెలయఁ ద్వదధీన యగునన్ను వేఁచు నలక, లాధరుం డన్న భవదుపాలంభసరణి
గాన నేయుక్తులు నెఱుంగఁ గరుణఁ జూడు, సరసగుణహార యోబయనరసధీర.

169

అనిష్టవిధ్యాభాసము —

చ.

అలుగఁగ నేల మీరు వసుధాధిపు లెన్న స్వతంత్రు లై మమున్
వల దనవచ్చు మీమనసు వచ్చినచోటికి నేఁగుఁ డేఁగిన
న్నెలకొని నీప్రియాంగనకు నీకును మాఱ్మొన లేకయుండ న
ర్మిలి సుసరంబు గాఁగ నొనరించెదఁ గాక నృసింహభూవరా.

170

వ్యాజస్తుతి —

క.

సతతంబు నిందచేతను, స్తుతియున్ స్తుతిచేత నింద చొప్పడ వ్యాజ
స్తుతి యై చెలు వగుఁ గృతులం, దతులితకవివినుత మగుచు నది యె ట్లన్నన్.

171

నిందాకృతిస్తుతి —

సీ.

నెఱిజీవనము లేక నింగిపై భ్రమియించు, మత్స్యంబు దునుముటే మాటవాసి
త్రిజగతీమాత వాగ్దేవిభండారంబు, చూఱగాఁ గొనుటయే సుగుణితనము

వేడినవారికి వెండియు నొకమాఱు, విత్త మీకుంటయే వితరణంబు
అలయనాదిప్రవాహము లైనయేఱ్లవం, కలు దిద్దుటే వివేకంబు కలిమి


తే.

వఱలు నీకీర్తి ద్విజరాజవైభవంబు, లపహరింపఁగ నీయాజ్ఞ యలరు టెంత
పోచిరాజాన్వయాంభోధిపూర్ణచంద్ర, నరనుతాటోప తొరగంటినరసభూప.

172

స్తుతినింద —

క.

అసమరణరంగముల నీ, యసినటి నటియింపఁ గరుల హరుల న్విరులన్
వెస నొసఁగు నౌర యెంతటి, రసికుఁడు నీవైరి యోబరాజనృసింహా.

173

అప్రస్తుతప్రశంస —

క.

క్షితి నప్రస్తుతమునఁ బ్ర, స్తుతవస్తువు గమ్య మగును సొం పొందిననీ
శ్రుతులఁ దలపోయ నప్ర, స్తుతప్రశంసాఖ్య మయ్యెఁ దుది యె ట్లన్నన్.

174


క.

ననలు మొనలెత్తెఁ దేనెలు, చినికెం జిగురాకు గందెఁ జెదరె నలితతుల్
చనువున నీపూఁదీఁగకు, ఘన మైననృసింహుపొందు గలుగఁగఁ బోలున్.

175

పర్యాయోక్తి —

క.

ప్రస్తుతకార్యస్తుతిచేఁ, బ్రస్తుతకారణము దోఁపఁ బర్యాయోక్తం
బస్తోకసుకవికావ్య, ప్రస్తుత మై చెలఁగుచుండు రహి నె ట్లన్నన్.

176


ఉ.

చక్కెర పెట్టవే వికచసారసలోచన మాట జేర్పవే
చొక్కపుగుబ్బలాఁడి ననుఁ జొప్పడఁ బాణితలంబుఁ జేర్పవే
చెక్కులనిగ్గులాఁడి యని చిల్కలుపల్కు నృసింహపూర్వపు
న్మక్కువ నీవిరోధినృపమందిరచిత్రవధూపరంపరన్.

177

ప్రతీపము —

క.

ఉపమేయమె చాలు న్ధర, నుపమానం బేల యనఁగ నొనరు బ్రతీపం
బపరిమితసుకవికృతులం, దపారవిస్ఫూర్తి జెంది యది యె ట్లన్నన్.

178


సీ.

సత్పథక్రమకళాచాతురి నెఱపదో, కమలాధికామోదకరము గాదొ
వివిధచక్రానందవిభవం బొనర్పదో, సతతంబు నుదయసంగతము గాదొ
యిలమహాగ్రహరాజజృంభణం బలమదో, యమితదోషోన్మేషహరము గాదొ
మహితగాంగేయధామస్ఫూర్తిఁ జెలఁగదో, యచ్యుతోగ్రాకారహారి గాదొ


తే.

నీప్రతాపంబు దనవలె నిఖిలతమము, నడఁపఁగా లేదొ తా నేల యరుగుదెంచుఁ
గుంటిసారథితో నల్ల కుముదవైరి, నరనుతాటోప యోబయనరసభూప.

179

అనుమానము —

క.

భువిసాధనసంపదచే, నవిరళవిస్ఫూర్తిసాధ్య మనుమేయముగా
వివిధశ్లేషవిశేషా, ద్యవియుత మనుమాన మయ్యె నది యె ట్లన్నన్.

180


సీ.

కమలాక్షుఁ డీమేటి గాఁబోలుఁ గాకున్న, గరముల శంఖచక్రములు గలవె
కమలారి యీరాజు గాఁబోలుఁ గాకున్న, సకలకలావిలాసములు గలవె

గమలాప్తుఁ డీప్రోడ గాఁబోలుఁ గాకున్న, నధిగతమండలవ్యాప్తి గలదె
కమలజుం డీస్వామి గాఁబోలుఁ గాకున్నఁ, జతురాననవచఃప్రశస్తి గలదె


తే.

యనుచుఁ గొనియాడుదురు నిన్ను నంగవంగ, మాళ వాసంతి గౌళ నేపాళ చోళ
కుకురు కురు పాండ్య శక ముఖక్షోణిపతులు, నరనుతాటోప యోబయనరసభూప.

181

కావ్యలింగము —

క.

హేతువు వాక్యార్థం బై , యాతతవిస్ఫూర్తితోఁ బదార్థంబును నై
ఖ్యాతిఁ గనఁ గావ్యలింగం, బై తగు సత్కృతులయందు నది యె ట్లన్నన్.

182

వాక్యార్థహేతుకము —

మ.

అరుదై పొల్పగుపోచిరాజునరసింహా యన్న యష్టాక్షరీ
వరమంత్రం బది యెల్లకాలము నరు ల్వాక్రువ్వ సిద్ధించుఁ బో
కరు లాందోళిక లశ్వము ల్విభవము ల్గ్రామంబు లత్యుజ్జ్వలాం
బరము ల్సొమ్ములు పల్లకీ ల్పరిణయప్రారంభసంరంభముల్.

183

పదార్థహేతుకము —

క.

గురునఖదళితప్రతిమా, కరిచిత్రితభిత్తిగళితఘనమణివీక్షా
పరితోషయుతము లై నీ, యరిపురములఁ గినుక మాను హరులు నృసింహా.

184

అర్థాంతరన్యాసము —

తే.

మహివిశేషంబుచేత సామాన్యమును బ్ర, సక్తసామాన్యమున విశేషము సమర్థి
తముగ నర్థాంతరన్యాస మమరుచుండు, నెలమి రెండువిధంబు లైయ ట్లటన్న.

185

విశేషసమర్థితసామాన్యార్ధాంతరన్యాసము —

క.

విమలాత్ముఁ డెచట నుండిన, విమలుం డగు నె ట్లఁటన్న వినుము సురాగా
రమునఁ జరించియు నీయశ, మమలస్థితి గాదె యోబయబ్రభునరసా.

186

సామాన్యసమర్థితవిశేషార్థాంతరన్యాసము —

చ.

జలనిధిరాజకన్య కనుసన్న మెలంగుచు నుండువాణియున్
మెలఁగును మాటలోన నెలమిం జెయిసన్నఁ జరించుఁ గీర్తి నీ
లలితభుజోపగూహననివాసము మానదు ధాత్రి సద్గుణో
జ్జ్వలనరసింహ మంత్రబలవంతుల కింతులు చిక్కు టబ్రమే.

187

యథాసంఖ్యము —

క.

సమముగ నేవరుసఁ బదా, ర్థము లుద్దిష్టంబు లయ్యెఁ దగ నాపర్యా
యమున ననూద్దిష్టము లై, యమర యథాసంఖ్య మయ్యె నది యె ట్లన్నన్.

188


చ.

వరకరుణాధరాభరణవైభవసద్గుణబుద్ధిచాతురీ
పరమవిభుత్వపావనవిభాబలధైర్యవిజృంభణంబులన్
వరుస హరిం గిరిం గలశవార్నిధి గిర్నీధి శూలిఁ గీలి నా
కరిఁ గిరి గెల్తు వౌర త్రిజగన్నుత శ్రీనరసింహభూవరా.

189

క.

వరుస నొకానొకవస్తువు, గిరికొన వస్త్వంతరంబు కిముతన్యాయ
స్ఫురితం బై చనుదేఱఁగ, ధర నర్థాపత్తి యయ్యెఁ దగ నె ట్లన్నన్.

190


సీ.

అమరశైలము చిన్న మంతగాఁ దలపోసి, యీశాచలము దార మెత్తుఁ జేసి
వెలయ మంథానాద్రి వేళ్లతోఁ బెకలించి, మైనాక మబ్ధిలో మ్రగ్గఁ జేసి
యనుపమానంధ్యవింధ్యస్ఫూర్తి నిలఁ బ్రామి, మలయాగ మూర్వికి వెలి యొనర్చి
యలక్రౌంచగిరికి రంధ్రాన్వేష మొనరించి, వలిగుబ్బలికి వింత వడఁకు గూర్చి


తే.

యడరు నీధైర్య మనినచో నపరగిరులు, సాటిరా పవని మఱి వేఱ చాట నేల
పోచిరాజాన్వయాంభోధిపూర్ణ చంద్ర, వైరిగజసింహ యోబయనారసింహ.

191

పరిసంఖ్య —

క.

తలఁపఁగ నొకటి యనేక, స్థలముల సంబంధసంగతం బగునెడలం
బలిమి నొకయెడనె నిలుపుట, వెలయుం బరిసంఖ్య యగుచు విను మె ట్లన్నన్.

192


సీ.

అంద మై త్రిభువనానంద మై జతకుంద, బృంద మై నభమున బెరయు నెద్ది
పొంక మై భృతరక్తపంక మై సమరని, శ్శంక మై వినుతింపఁ జాలు నెద్ది
తోర మై దానైకధీర మై సజ్జనా, ధార మై ధారణిఁ దనరు నెద్ది
తండ మై చండిమాఖండ మై సంభృతా, జాండ మై దండి మై నలరు నెద్ది


తే.

వినుము నీకీర్తి నీభుజాన్వితకృపాణి, నీకరము నీరుచియ కాని నెఱయఁ గాదు
విధుపొడుపు గాదు పవి గాదు వేల్పుమ్రాను, గాదు రవిబింబ మోబభూకాంతునరస.

193

ఉత్తరము —

క.

ఎత్తఱి నున్నేయం బౌ, నుత్తరమునఁ బ్రశ్న మరియు నుత్తరము వెస
న్నొత్త మయి పొల్చు నెత్తఱి, నత్తఱి నుత్తరము నెగడు నది యె ట్లన్నన్.

194

ఉత్తరోన్నేయప్రశ్నోత్తరము —

సీ.

అలరారు పూఁదీవ యని తలంచితిఁ గాని, యబల నీతనువల్లి యగుట యెఱుఁగ
నాలోలపల్లవం బని శ్రమించితిఁ గాని, చెలువ నీచేసన్న సేయు టెఱుఁగ
నలిబాలికాజాల మనుచుఁ జూచితిఁ గాని, సుదతి నీచికురము ల్సెదరు టెఱుఁగ
వలకోకిలాలాప మనుచు నుండితిఁ గాని, పడఁతి నీ వెలుఁ గెత్తి పలుకు టెఱుఁగ


తే.

నలుక చాలింపు మనుచు నీయహితనృపతి, తావకోద్భటధాటికిఁ దల్లడిల్లి
యడవులకు నేఁగి కులకాంత నాదరించు, నరనుతాటోప యోబయనరసభూప.

195

ప్రశ్నోత్తరమాలికోత్తరము —

ఉ.

ఎవ్వఁడు దేవతాగురుఁ డహినళయానుఁ డనక్రవిక్రముం
డెవ్వఁడు రామభద్రుఁడు మహీవలయైకధురాధురంధరుం

డెవ్వఁడు భోగిభర్త జగ జేదేకవిజృంభితదానదీక్షితుం
డెవ్వఁడు పోచిరాజునరసేంద్రుడె వార్ధిపరీత మేదినిన్.

196

వికల్పము —

క.

సమబలయుతవస్తువులకు, నమితవికల్పం బొనర్ప ననఘాలంకా
రమతజ్ఞులమతమున నది, యమరు వికల్పం బనంగ నది యె ట్లన్నన్.

197


సీ.

అలఘుకాంచనమయస్థలనివాసము మేలొ, కాంచనస్థలవాసకలన మేలొ
పుండరీకంబులదండ నుండుట మేలొ, పుండరీకంబులదండ మేలొ
మహనీయవాహినిమధ్యసంస్థితి మేలొ, వాహినీశ్వరమధ్యవసతి మేలొ
మహిషసహావాసవిహరణంబులు మేలొ, మహిషిసహావాసమహిమ మేలొ


తే.

శైలకటకాశ్రయఁబులు మేలొ యతని, యంఘ్రికటకాశ్రయము మేలొ యధిపులార
యనుచు నీశాత్రవులమంత్రు లనునయింతు, రరిజయాటోప తొరగంటినరసభూప.

198

సముచ్చయము —

క.

మిగుల గుణక్రియ లెయ్యెడ, యుగపత్ప్రాప్తంబులుగ సముచ్చయము కృతిం
బొగడఁ దగున్ ద్వివిధం బై, యగణితకవివినుత మగుచు నది యె ట్లన్నన్.

199

గుణసముచ్చయము —

క.

నరసింహశౌర్యశోభా, స్ఫురణంబున జగము లెల్ల శోణము లయ్యెన్
బరరాజవదనవితతులు, హరినీలనిభంబు లయ్యె ననవరతంబున్.

200

క్రియాసముచ్చయము —

చ.

అలకలు ముట్టి ముట్టి జఘనాంబరపంక్తికిఁ గిట్టి కిట్టి గు
బ్బలు రతిఁ బట్టి పట్టి కరపల్లవము ల్నులి పెట్టి పెట్టియుం
జెలు నగుతారహారములు చిక్కులు వెట్టునృసింహ నీద్విష
ల్లలన ననాలి కేఁగ విటలక్షణలక్ష్యము లై మహీజముల్.

201

ద్వితీయసముచ్చయము —

క.

పాయక ఖలేకపోత, న్యాయమున ననేకకారణము లొకకార్యం
బేయెడ సాధింపఁగ నుత, మై యపరసముచ్చయాఖ్య మగు నె ట్లన్నన్.

202


క.

శూరతయును ధీరతయును, దారతయ గభీరతయును ధార్మికతయి నీ
కారణజన్మస్ఫురదవ, తారము సూచించె నోబధరణిపునరసా.

203

సమాధి —

క.

కారణ మొక్కటి కార్యము, ఛారుణి సాధింపఁ గాక తాళ నయమునం
గారణము వేఱొకటి రా, నారూఢసమాధి యయ్యె నది యె ట్లన్నన్.

204


చ.

అనిమొన శ్రీనృసింహవసుధాధిపుతీవ్రచమూసమూహముం
గనుగొని యద్భుతం బొదవి ఖానవజీరులు వ్రేళ్లు నోళ్లకుం

జొనుపఁగఁ గాకతాళనయశోభఁ దదీయముఖాంగుళీనివే
శనములు ప్రాణరక్షణవిచారధురీణము లయ్యె వాటికిన్.

205

భావికము —

క.

క్షితిలోన నతీక మనా, గతమును బ్రత్యక్షమువలెఁ గనపట్టుట న
ద్భుతనిరుపమార్థకథనం, బతిశయముగ భావికాఖ్య మగు నె ట్లన్నన్.

206


మ.

వరవల్గావిధంబు దష్టభుజవ్రాతంబుగా సింగిణుల్
గురుపక్షద్వితయంబు గాఁగ సరసక్షోణీశ్వరారూఢ మౌ
తురగోత్తంసము నిందిరాహృదయనాథుం దాల్చుప్రత్యక్షబం
ధురపక్షీంద్రునిలీలఁ జూచు నహితస్తోమంబు భీమంబుగన్.

207

ప్రత్యధికము —

క.

పగవాఁడు సమర్థుఁడుగా, మగఁటిమి వెస నతనిమీఁద మార్కొన కిల నా
పగవానిహితుల నొంచుట, యగుఁ గృతులం బ్రత్యనీక మన యె ట్లన్నన్.

208


క.

నీదురవగాహశౌర్యము, భేదింపఁగ లేక విమతపృథివీశుఁ డనిన్
భేదించునృసింహభవ, న్మేదురభయదప్రతాపమిత్రునిమిత్రున్.

209

వ్యాఘాతము —

క.

ఒకఁ డొకటిచేత నొకపని, యకలంకతఁ జేయ దాని నాహేతువుచే
నొకఁడు మఱి వేఱె చేయఁగఁ , బ్రకటవ్యాఘాత మెన్నఁబడు నె ట్లన్నన్.

210


క.

రాజీవబాంధవుఁడు నిజ, తేజమున నొనర్చుఁ ద్రిజగతీతాపమున
వ్యాజవిరాజితతేజో, రాజి న్హరియింతు వోబరాజునృసింహా.

211

పర్యాయము —

క.

ఏకాధేయం బరయ న, నేకాధారంబులందు నిర వై క్రమముం
జేకొనఁ బర్యాయంబు మ, హాకవిసంస్తుత్య మయ్యె నది యె ట్లన్నన్.

212


సీ.

కందర్పహరునందుఁ గనువిప్పఁగా నేర్చి, శరవణోద్భవునందు శక్తి యెఱిఁగి
రామునం దచలాంబరము గట్టఁగా నేర్చి, జలధిలంఘనునందు జంగ యెఱిఁగి
ఘటజునం దుభయపక్షములఁ బొర్లఁగ నేర్చి, వెస ద్రౌణియెడఁబాలు వేఁడ నెఱిఁగి
మొగి వృకోదరునందు ముష్టి పూనఁగ నేర్చి, విజయునియెడఁ గర్ణవేధ యెఱిఁగి


తే.

యనుదినంబును నభిశృద్ధిఁ దనరు శౌర్య, శిశువు భవదీయదోస్తంభజృంభమాణ
ఖురళిఁ గౌక్షేయచాలనస్ఫురణ మెఱిఁగి, వైరిగజసింహ యోబయనారసింహ.

213

సూక్ష్మము —

క.

ఈక్షితిఁ దలపోయ ససం, లక్షితసూక్ష్మార్థకౌశలప్రకటనవై
చక్షణ్యము సూక్ష్మం బగు, నక్షీణకవిప్రశస్త మది యె ట్లన్నన్.

214


ఉ.

ప్రాణమునంటి నాకు నిజభావము దాఁపఁగ జెల్లు నమ్మ నీ
ప్రాణవిభుం బ్రభూతగుణబంధురుఁ దెల్పఁగదిమ్మ యంచు వి

న్నాణముగా సఖీజనులు నల్గడలం గదియంగ సైకత
శ్రోణి యురంబుమీఁద నఖసూచిక సేర్చె నృసింహభూవరా.

215

ఉదాత్తము —

క.

విశ్వోన్నత మై చెలఁగెడు, నైశ్వరము గలుగువస్తు వభినుతిసేయన్
శాశ్వత మగుచు నుదాత్తము, విశ్వంభరలోనఁ బొల్చు విను మె ట్లన్నన్.

216


మ.

నృపు లర్పించినఁ జేడె లూడ్చి వెలికి న్నేర్పొప్పఁగాఁ గుప్పఁగా
నెపుడుం జల్లినమ్రుగ్గుముత్తెములు ధాత్రీశాంగదస్వర్ణచూ
ర్ణపుఁబ్రోవు ల్దగు నీగృహాంగణములం దారాద్రిధాత్రీధరా
ధిపముల్ స్వవ్యయభీతి ని న్గొలుచురీతిన్ శ్రీనృసింహాధిపా.

217

పరివృత్తి —

క.

సమ మిచ్చి సమము గొన న, ల్పము నిచ్చి యనల్పము గొన భావింప నన
ల్పము నిచ్చి యల్పముం గొన, నమరుం బరివృత్తి త్రివిధ మై యె ట్లన్నన్.

218

సమపరివృత్తి —

క.

శ్రుతిహృదయరత్నభూషా, కృతులు కృతు ల్నీకు నొసఁగి కృతులు నృసింహ
క్షితివర నీచేఁ గాంతురు, శ్రుతిహృదయాభరణములు విశోభితలీలన్.

219

అధికదానాల్పాదానపరివృత్తి —

క.

నరసింహ నీదువైరులు, కరిసింహలులూయభల్లగవయాహిపరం
పరకుఁ దమగృహము లొసఁగుచు, వరుస భజింతురు దదీయవనమందిరముల్.

220

అల్పదానాధికాదానపరివృత్తి —

క.

నరతనువు నీకరాసికి, నరి యొసంగి నృసింహభూప యనుపమరంభా
పరిరంభగుంభసంభ్రమ, భరితామరతాశుభప్రభావముఁ జెందున్.

221

కారణమాల —

క.

ఇల నుత్తరోత్తరములకుఁ, బొలు పొందగఁ బూర్వపూర్వములు హేతువు లై
యలరఁగఁ గారణమాలిక, యలంకరణరాజ మయ్యె నది యె ట్లన్నన్.

222


మ.

హరిపాదాంబుజపూజనాభిరతిచే నైశ్వర్య మైశ్వర్యచా
తురిచే సజ్జనరక్షణంబు సుజనస్తోమావనస్ఫూర్తిచే
జిరపుణ్యంబులు పుణ్యవాసనలచేఁ జెన్నొందు సత్కీర్తియు
న్నరసింహాధిప నీకె పొల్చు బుధసంతానైకచింతామణీ.

223

ఏకావళి —

క.

ధరఁ బూర్వపూర్వమునకు, పేరోత్తరము క్రమసమగ్రతవిశేషణ మై
పరఁగిన నేకావలి యన, నరు దగు సత్కృతులయందు నది యె ట్లన్నన్.

224


క.

అవనిధవాస్థానంలులు, కవియుతములు కవులు రచితకావ్యులు కావ్య
వ్యవహారము లమితభవ, న్నవనవగుణభూషితములు నరసింహనృపా.

225

మాలాదీపకము —

క.

మహిఁ బూర్వపూర్వమునకున్, రహి మీఁఱగ నుత్తరోత్తరము రమ్యగుణా
వహముగ మాలాదీపక, మహీనవిఖ్యాతిఁ జెందు నది యె ట్లన్నన్.

226


క.

గురుచాపముచే శరతతి, శరతతిచే శత్రుశిరము శత్రుశిరముచే
ధర ధరచే నీబాహువు, పరిలబ్దం బయ్యె నోబపార్థివునరసా.

227

సారము —

క.

నిరవధిక ముత్తరోత్తర, నిరతోత్కర్షంబు దెలుప నిఖిలకృతులయం
దరు దై తగు సారాలం, కరణము కవివినుత మగుచుఁ గడు నె ట్లన్నన్.

228


సీ.

స్థావరజంగమాధారము ల్త్రిజగంబు, లలజగంబు లజాండములఁ జెలంగు
నాయజాండము లుండు హరిరోమకూపమం, దాశౌరియును భోగిపై శయించు
నాభోగి జలధికోణావాస మొందు నా, కడలి కుంభజుచులుకంబుఁ జెందు
నాకుంభజుడు నింగి కేకఖద్యోతాభుఁ, డానింగికబరి యై యతిశయిల్లు


తే.

నీయశోలక్ష్మి కక్షీణనీతిచతుర, చతురుదధిమేఖలావృతక్షితిధురీణ
చటులభుజదండదండితోత్కటమదారి, వీరపరివార యోబభూవిభునృసింహ.

229


క.

రసవత్ప్రేయము లూర్జ, స్విసమాహితములును నిచట వివరింపఁగ లే
దసమరసప్రకరణమున, రసభావాద్యుపనిబద్ధరసములు గానన్.

230


ఉ.

సొమ్ములు సొమ్ములుం గలయఃసొంపులు పుట్టెడురీతిఁ గార్యజా
లమ్ములయం దలంకృతు లలంకృతులుం గలయంగ శోభ మై
నిమ్మహిఁ బొల్చుఁ దద్ఘటన మెన్నికతోఁ దిలతండులాప్తిరూ
పమ్మునఁ బాలు నీ రెనయుభాతిఁ దగు న్ద్వివిదత్వ మొందుచున్.

231


క.

తిలతండులరూపమ్మున, నలరు న్సంసృష్టిసంకరాఖ్యము పా ల్నీ
రిల నేక మైనకైవడిఁ, దెలుపుం దత్సంకరంబు త్రివిధము కృతులన్.

232


తే.

ఎనయ నంగాంగీభావంబు నేకవాచ, కానుబంధంబు సందేహ మనఁగ నెట్లు
పొలుచు సంసృష్టిసంకరంబులకు వరుస, లక్ష్యముల నేర్పరించెద లలితఫణితి.

233

సంసృష్టి —

క.

హరిదబలాకులగిరికుచ, వరచందనరజము లగుభవత్కీర్తిరుచుల్
నిరవద్యసుఛాంభోధి, స్ఫురణంబు వహించె నోబభూవరునరసా.

234


క.

హరిదబలాచందన మయి, యరు దగుననురూపకంబు నమృతాంభోధి
స్ఫురణంబుఁ దాల్చె ననియెడి, సరసనిదర్శనయుఁ బొల్చు సంసృష్టి యనన్.

235

అంగాంగిభావసంకరము —

క.

అసిజిహ్వాభయదం బై, యసమమహాబలవిశేషహారియు నై యి
వ్వసుధ భవద్భుజదండము, బొసఁగున్ ఫణిమాడ్కి నోబభూవరునరసా.

236

క.

అసిజిహ్విక యనురూపక, మసమమహాబలవిశేషహారిశ్లేషం
బెసఁగు ఫణిచూడ్కిభుజమను, దెస నంగాంగిత్వ మొందెఁ దెలియ నుపమతోన్.

237

ఏకవాచకానుప్రవేశసంకరము —

-
క.

విశ్వామిత్రమదాసహ, శాశ్వతసౌభాగ్య మగుచు సతతోన్నత మై
విశ్వనుతశ్రీనృసింహమ, హీశ్వర నీయసి వసిష్టునీడను బోల్చున్.

238


క.

నీవాలు వసిష్ఠునివలె, నేవేళఁ జెలంగు నన్న నేకపదవిశే
షావిర్భూతము లగుచున్, శ్రీవెలయన్ శ్లేష ముపమ చెలఁగును నిచటన్.

239

సందేహసంకరము —

క.

పాకారతురగరాకా, కోకారికళానుకారికోమలరుచియై
యేకాలము రంజిల్లును, నీకీర్తమరాళి యోబనృపునరసింహా.

240


క.

ఇలఁ గీర్తి హంసి యనుచో, సలలితగతి హంసివంటిసత్కీర్తియొ కా
కీలఁ గీర్తి యనెడుహంసియొ, తెలియ దుపమరూపకంబు తేటఁగ నిచటన్.

241


క.

ఈరీతిం గొన్నియలం, కారము లేర్పడిచినాఁడఁ గడమదడమ నే
నేరక వర్జించుటగా, దారయ విస్తారభీతి నాపాదింపన్.

242


శా.

మక్ఖామండువపండువాభయదదోర్మాహాత్మయధాటీమహా
తుక్ఖారప్రతిరుద్ధభూభువనహిందూరాజ్యసంస్థాపనా
ప్రాక్ఖద్యోతకులోత్థితధ్వజపటప్రారయప్రసర్పద్యశ
స్స్రక్ఖర్వీకృతకర్వకంకణనమస్యాజాలకోలాహలా.

243


క.

సాహిత్యభోజ భూజన, సౌహిత్యనిదాన దాన సంతానమహా
బాహావదానవాహా, రోహణరేవంతలలితరూపజయంతా.

244

వర్గపంచకరహితసుగంధివృత్తము.

హారహీరసారసారిహారశైలవాసవో, ర్వీరుహాహిహారశేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీలవైరివీరసం, హారసారశౌర్యసూర్యహర్యవార్యసాహసా.


గద్యము.

ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతి
భాబంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణ
సుపుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తి
మూర్తిప్రణీతం బైన నరసభూపాలీయం బనఁ దద్రాజనామధేయంకితం బై
పొల్చుకావ్యాలంకారసంగ్రహఁ బనుమహాప్రబంధంబునం దర్థాలంకారవిభా
గఁబును సంకరసంసృష్టినిర్ణయంబు నన్నది సర్వంబును బంచమాశ్వాసము
సంపూర్ణము.