Jump to content

నరసభూపాలీయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నరసభూపాలీయము

కావ్యాలంకారసంగ్రహము - చతుర్థాశ్వాసము



కరగభీరగుణర
త్నాకరకటకాధిరాజహయపతిసేనా
భీకర భుజప్రతాప
స్వీకృతజయసాంద్ర నారసింహనరేంద్రా.

1


తే.

అవధరింపుము దోషంబులను వచింతు, నవియు శబ్దార్ధగతము లై ద్వివిధము లగు
నందుఁ బదవాక్యగతము లౌ నరయ శబ్ద, దోషములు వీనిలోఁ బదదోషతతులు.

2


సీ.

అప్రయుక్తం బపుష్టార్థంబు నేయార్థ, మసమర్థకంబు నిరర్థకంబు
గ్రామ్యంబు విగతసంస్కారంబు గూఢార్థ, మన్యార్ధ మశ్లీల మప్రతీత
మప్రయోజనము క్లిష్టార్థబంధంబు సం, దిగ్ధంబు విపరీతధీప్రదాయి
యనిమృష్టతరవిధేయాంశంబు పరుషంబు, ననఁగఁ గావ్యంబులం దరసి చూడ


తే.

పదగతంబులు వెలయుసప్తదశసంఖ్య, గడలుకొన వీనిలక్ష్యలక్షణము లెల్ల
విస్తరించెదఁ గవితాప్రవీణసుకవి, నివహనిరతోపకారనిర్ణిద్రఫణితి.

3


క.

ఈకవితాదోషోత్కర, మేకడ నీ వొసఁగుమాడ్తి, నియ్యక ఖలు లౌ
నాకుఱకుఱదాతలకు మ, హాకుకవు లొనర్చుకృతులయందు వసించున్.

4

అప్రయుక్తము —

క.

కవులు ప్రయోగింపనిపద, మవనిం దగ నప్రయుక్త మగు నె ట్లన్నన్
ద్రవిణైలబిలుం డల దు, శ్చ్యవనమహాభోగిఖేటసంస్తుతుఁ డనఁగన్.

5

అపుష్టార్థము —

క.

ఎనయఁ బ్రకృతోపయోగం, బునుఁ జెందక యున్నపద మపుష్టార్థం బోఁ
దునిమెను వింశత్యర్ధా, ననువింశత్యర్ధరథునినందనుఁ డనఁగన్.

6

నేయార్థము —

క.

ఇలఁ దనసంకేతంబున నిలిపినపద మెంచి చూడ నేయార్థం బౌ
బలుతేనెదిండిగమి నగు, నలసాగరకర్ణయాన యలక లనంగన్.

7

అసమర్థము —

క.

ధర నప్రసిద్ధయోగం, బరసి ప్రయోగించుపదమ యసమర్ధం బౌ
శరధరరాజనికేతను, గురుపంకజచక్రహస్తుఁ గొలుతు న టన్నన్.

8

నిరర్ధకము —

క.

ఇలఁ బదపూరణమాత్రం, బలపడినపదంబు కృతి నిరర్థక మయ్యెన్
దలఁపఁగ వెలయుచు లలి ను, జ్జ్వల మగునీతనివిలాససౌష్ఠవ మనఁగన్.

9

గ్రామ్యము —

క.

పామరులభాష గ్రామ్యము, భామినికటిగల్లములు విభాసిల్లు ననన్
గోమలిచన్నులు గన్నులు, గామునిపండువు లొనర్చెఁ గడువడి ననఁగన్.

10

చ్యుతసంస్కారము —

క.

వ్యాకరణదుష్ట మగుపద, మేకడఁ జ్యుతసంస్కృతాఖ్య మిది యె ట్లన్నన్
శ్రీకమలకాంతపదసే, వాకర్మఠుఁ డనఁగఁ గరుణవారిధి యనఁగన్.

11

గూడార్థము, అన్యార్థము —

క.

కృతి నఖ్యాతము గూఢం, బతిశయరూఢివ్యపేత మన్యార్థం బై
క్షితిఁ దగుశోణితనయనుం, డితఁ డనఁగ సమానుఁ డితఁ డహిధ్వజుఁ డనఁగన్.

12

అశ్లీలము —

క.

వ్రీడ జుగుప్సామంగళ, శీలము లగుపదము లొకటఁ జేర్చిన నవి య
శ్లీలము లగుఁ గృతి నేత, న్మూలము లగు త్రివిధభేదముల నెఱిఁగింతున్.

13


క.

వసుదేవయోనిగోపీ, విసరమహాపీనకుచనవీనాశ్లేషో
ల్లసితుం డనఁ గాలిందీ, రసవిహరణకరణనిత్యరసికుం డనఁగన్.

14

అప్రతీతము —

క.

అల శాస్త్రపురాణములనె, కలశబ్దం బప్రతీతకం బగుఁ గృతులం
దలఁతు వృషాకపిఁ ద్రిజగము, నెలమి నజావృతముఁ జేయు నీశ్వరు ననఁగన్.

15

అప్రయోజనము —

క.

అవిశేషవిధాయక మై, కవిసినపద మప్రయోజకము భూతివిభా
ధవళితహరసుతుఁ గొలుతును, నవనలినహరద్విపాస్యు నయముగ ననఁగన్.

16

క్లిష్టము —

క.

దూరార్థము క్లిష్టం బగు, ధారుణిఁ బవనాశనేంద్రధరమకుటాలం
కారమణిజనకవరపు, త్త్రీరమణకుమారరూపదీపితుఁ డనఁగన్.

17

సందిగ్ధము —

క.

సందిగ్ధ మనఁగఁ జెలఁగును, సందేహాస్పదపదంబు సమరధరిత్రీ
సందీపితజయశాలిపు, రందరనుతవిక్రముండు రాముఁ డనంగన్.

18

విపరీతధీప్రదము —

క.

జగతి న్విరుద్ధ మతికర, మగునది విపరీతధీప్రదాఖ్యం బనఁగా
దగుఁ గృతు లన కులహీనుం, డగు నీతఁ డన నంబికావిటాసక్తుఁ డనన్.

19

ఆవిమృష్టవిధేయము —

క.

అవిమృష్టవిధేయం బగుఁ, దవిలినవర్ణ్యాంశ మప్రధానం బైనన్
నవనవసంఫుల్లలతాం, తవసంతము వచ్చె నిపుడు ధరణి కనంగన్.

20

పరుషము —

క.

శ్రుతికటువు లైనపదములు, కృతిఁ బరుషము లనఁగఁ జెలఁగు నిలఁ గుధ్రేడ్జా
పతిమూర్ధధృతార్థోడ్వధి, పతి గొల్తు నభీష్టసిద్ధి ఫలమున కనఁగన్.

21

వాక్యదోషములు —

సీ.

అక్రంబు విసంధి ప్రక్రమభంగంబు, పునరుక్తియుత మసంపూర్ణతరము
వాక్యసంకీర్ణంబు వ్యాకీర్ణ మధికప, దంబు వాచ్యవిసర్జితం బరీతి
న్యూనోపమంబు బధికోపమంబు సమాప్త, పునరాత్తమస్థానఘనసమాస
మనియతచ్ఛందంబు యతిభంగ ముపతత్ప్ర, కర్షంబు భిన్నలింగంబు భిన్న


తే.

వచన మక్రియసంబంధవర్జితములు, వాక్యగర్భితమును నన వాక్యదోష
వితతు లిరువదిరెం డయి వినుతిఁ గాంచు, వీని లక్షణలక్ష్యము ల్విస్తరింతు.

22

అక్రమము —

క.

క్రమహీన మక్రమం బగు, సమధిక మగు నితనికీర్తి శౌర్యచ్ఛాయా
సముదయమునకున్ దినకర, హిమకరకిరణోత్కరంబు లెనయే యనఁగన్.

23

విసంధి —

క.

అపగతలక్షణమును గ్రా, మ్యపుసంధియుఁ దగ విసంధి యనఁ దగు నరిగె
న్నపరగిరి కినుఁ డనంగా, నృపు లొప్పుదు రధికగుణవినిద్ర తనంగన్.

24

ప్రక్రమభంగము —

ఆ.

ప్రక్రమంబు విడువఁ బ్రక్రమభంగంబు, శౌరి దానవారిఁ జక్రధారి
నభవు నమితవిభవు ననవిద్యచారిత్రు, విష్ణుఁ గొల్తు జిష్ణుఁ గృష్ణు ననఁగ.

25

పునరుక్తియుతము —

క.

ఎనయఁగ శబ్దార్ధంబులు, పునరుక్తము లైన నదియె పునరుక్తియుతం
బనఁదగుఁ జక్రాంచలమున, దనుజావళిఁ ద్రుంచు జక్రధరుఁ డితఁ డనఁగన్.

26

అపూర్ణము —

క.

ధరలోఁ గ్రియాన్వయంబుల, సరిపోని దపూర్ణ మనఁగ సన్నుతి కెక్కున్
నరపతి యొసఁగును ద్రవ్యము, పరఁగఁగ నౌదార్యశాలి బహుళము ననఁగన్.

27

వాక్యసంకీర్ణము —

క.

ఏకడ వాక్యాంతరితప, దాకీర్ణము వాక్యకీర్ణ మగుఁ బొగడుదు రీ
భూకాంతుఁడు జను లెల్ల న, నేకగుణాన్వితుఁ డటంచు నిలలో ననఁగన్.

28

వ్యాకీర్ణము —

క.

భ్రాంతికరం బగు నన్వయ, మెంతయు వ్యాకీర్ణ మయ్యె నీడుఁడు తిలకముం
గుంతనములఁ గాంతకును ల, తాంతంబులు సెరువుఁ డిప్పుడనంగన లనఁగన్.

29

అధికపదము —

క.

తలఁపఁగ మిక్కిలిపదములు, గలిసిన యది యధిక పదము కమలారికలా
కలితవిలాససముల్లస, దలఘుయశోవిభవశాలి యగు నితఁ డనఁగన్.

30

వాచ్యవివర్జితము —

ఆ.

వాచ్య ముజ్జగింప వాచ్యవివర్జితం, బనఁగ నెగడు నాజి నభవుఁ నైనఁ
బెగడు నీతనిబాహుదీప్తాసి యనునెడ, నాజి నభవుఁ దెగడు ననుచుఁ బలుక.

31

అరీతి —

క.

రసమున కనుచితమగుపద, విసర మరీతి యనఁ బొల్చు విటజనహృదయ
గ్రసనాగ్రహగ్రహిళదృ, ష్టిసమగ్రోదగ్ర మతివశృంగార మనన్.

32

న్యూనోపమము, అధికోపమము —

తే.

ఉపమ చాల కున్న న్యూనోపమం బది, కోపమాఖ్య మధిక ముపమ యైన
హైమవసనుఁ డైన హరి మేఘనిభుఁ డన, నతివ పల్లవితలతాభ యనఁగ.

33

సమాప్తపునరాత్తము —

క.

క్రమ ముడిగి మగుడఁ బూనిన, సమాప్తపునరాత్త మయ్యె శాశ్వతు నభవుం
గమలాక్షుఁ గమలనాభుం, గమలాపతిఁ గొల్తు ముక్తికై విభు ననఁగన్.

34

అస్థానసమాసము —

క.

అపదసమాసం బస్థా, నపటుసమాసంబు రిపుల ననిఁ దునిమెద నే
నిపు డని వికటభ్రుకుటీ, విపులక్రోధాంధుఁ డయ్యె వీరుం డనఁగన్.

35

ఛందోభంగము, యతిభంగము —

క.

ఛందము యతియుం దప్పిన, ఛందోయతిభంగము లగుసంగతి నితఁడున్
కుందేందువిశదయశుఁ డై, ముందుగఁ బూజించినాఁడు నరహరి ననఁగన్.

36

పతత్ప్రకర్షము —

క.

క్షితి నుత్కర్ష ము దక్కినఁ, బతత్ప్రకర్షంబు గవయ భల్లూకమృగీ
వితతివిభేదనగర్వా, యశసింహాభీల మీమహాటవి యనఁగన్.

37

భిన్నలింగము, భిన్నవచనము —

ఆ.

ఉవిదఁ బురుషుఁ బోల్ప నొకనిఁ బల్వురఁ బోల్ప, భిన్నలింగ మనఁగ భిన్నవచన
మనఁగఁ జెలఁగు నింతి వనజారివలె నన, ఖడ్గ మురగనరులకరణి ననఁగ.

38

అక్రియము లేక అశరీరము —

క.

తుదలఁ క్రియాశూన్యము లగు, పదంబు లశరీర మనఁగఁ బరఁగు న్విభవా
స్పద మగుమధుమాసంబునఁ, బొదలు తరూత్కరము కుసుమపూర్ణం బనఁగన్.

39

సంబంధవర్జితము —

క.

సంబంధవర్జితం బగు, సంబంధము విడువ గరులు శైలములు తురం
గంబులు భంగంబులు సమ, రాంబుధివరతరణి యితనియసిలత యనఁగన్.

40

వాక్యగర్భితము —

క.

నడుమ నొకవాక్య పద్ధతి, తొడరిన నది వాక్యగర్భదోషము ఖలు లౌ
వెడమతులతోడిసంగతి, కడుహిత మిది నీ కొనర్పఁగా వల దనఁగన్.

41

అర్థదోషములు —

క.

క్రమమున నిఁక నర్థదో, షముల నెఱింగింతు సుకవిజనులకు హీనో
పమ మధితోపమ మసమో, పమ మఖ్యాతోపమంబు పరుషము మఱియున్.

42


తే.

వ్యర్థ మేకార్థము ససంశయం బపక్ర, మము విరుద్ధంబు విరసాతిమాత్రహేతు
రహితనిరలంకృతాశ్లీలసహచరచ్యు, తములు భిన్నంబు నన వీనిక్రమ మొనర్తు.

43

హీనోపమము, అధికోపమము —

తే.

ఉర్వి ఘను నల్పుఁ బోల్ప హీనోపమంబు, శ్వానమునబోలె నితఁడు విశ్వాసి యనఁగ
నరయ నధికోపమం బల్పు నధికుఁ బోల్పఁ, బునుకపట్టినపే నీశుఁ బోలు ననఁగ.

44

అసమోపమము, అఖ్యాతోపమము —

తే.

ఉపమ సరివోని దిల నసమోపమంబు, హలధరుఁడు మేరుగిరివోలె నలరు ననఁగ
విను ప్రసిద్ధంబు గాని దవిశ్రుతోప, మంబు వదనంబు కుముదంబుమాడ్కి యనఁగ.

45

పరుషము —

క.

పరుషార్థంబులు గలయం, పరుషం బనుదోష మయ్యెఁ బరఁగెడు నీభూ
పరుసౌందర్యముసకు వే, మఱు సరి యౌ మంటఁ బడ్డ మదనుం డనఁగన్.

46

వ్యర్థము, ఏకార్థము —

తే.

అప్రయోజనంబు వ్యర్ధ మౌ ఫేనిలం, బైనజలధి దాఁటె ననిలతనయుఁ
డన నభిన్నవాక్య మరయ నేకార్థ మౌ, సుగుణఖనిచరిత్రశోభి యనఁగ.

47

ససంశయము —

క.

క్రమమఱిపదములు సంది, గ్ధము లైన ససంశయంబు ధరణీవరుధై
ర్యము నజము గెల్పు ననఁగా, నమరెడు సతిమేను మించు వసియించు ననన్.

48

విరుద్ధము —

క.

క్రమ మెడలి దేశకాలా, సముచితము విరుద్ధ మయ్యె సమదవిలోల
భ్రమరము చంపకవన మన, సముదంచితకైతకంబు చైత్రం బనఁగన్.

49

విరసము —

క.

ధర ననుచితరసభావము, విరసం బగు నితనిసమదవిద్వేషితలో
దరులు దగులందుఁ గుందఁగ, సరసము లాడుదురు ప్రేమ శబగు లఁటన్నన్.

50

అతిమాత్రము, హేతురహితము —

క.

క్షితిలో లోకాతీతం, బతిమాత్రము నింగి నిండె నబ్జాక్షికుచ
ద్వితయ మన హేతుశూన్యము, సతి గనుఁగొనె భృంగపంక్తి చనుదెంచె ననన్.

51

నిరలంకృతి, అశ్లీలము —

క.

ధరజాతిమాత్రశూన్యము, నిరలంకృతిబాహుయుతుఁడు నృపుఁ డన లజ్జా
కర మశ్లీలము పద్మిని, సరసాంగిగృహమ్ముతు పద్మసౌరభ మనఁగన్.

52

సహచరచ్యుతము —

క.

సరిగా సరిగా నిది యు, ర్వరపైఁ బొందింప సహచరభ్రష్టం బౌఁ
బరఁగు నెలచేత గగనం, బరుదుగ ఫేనంబుచేత నంబుధి యనఁగన్.

53

భిన్నము —

క.

భిన్నం బగుసంబంధవి, భిన్నం బీతనివిరోధపృథివీశ్వరుఁ డా
పన్నుం డై తననుదురున, నన్నలినజువ్రాఁత శూన్య మని పల్కు ననన్.

54


క.

రసములు వాచ్యము లైనను, వెస నదియును దోప మయ్యె విపులోగ్రరణం
బసదృశబీభత్సరసో, ల్లిసితము శృంగారసహితలలన యనంగన్.

55

గుణములు —

తే.

ఇంక గుణములు వివరింతు నివియుఁ గృతుల, దొరసి శ్లేషప్రసాదమాధుర్యసౌకు
మార్యసమతార్థదీపనౌదార్యకాంతు, లనఁగ నోజస్సమాధులు ననఁ జెలంగు.

56


క.

ఇల సంధి గూడి పదములు, నెలకొని యొకపదమురీతి నిలిచిన శ్లేషం
బలరుఁ బ్రసిద్ధపదంబుల, నలఘూక్తిప్రసాద మయ్యె నది యె ట్లన్నన్.

57

శ్లేషము —

శా.

లలావణ్య మగణ్య మాగుణగణం బవ్యాజ మాతేజ ము
ద్వేలం బావినయం బమేయతర మావీర్యం బనిర్వాచ్య మా

యాలాపం బతిసత్య మావితరణం బాశాంతవిశ్రాంత మా
శీలం బార్జవమూల మెన్నఁ దరమే శ్రీనారసింహాధిపున్.

58

ప్రసాదము —

ఉ.

ముంగిటిపెన్నిధాన మిలుముందటికల్పక మర్థికోటిముం
గొంగుపసిండి చెంగటన కూడినబంగరుకొండ దొడ్డిలో
నం గలకామధేనువదనం బెర యీఁగలు లేనిచొక్కపు
న్దంగెటిజున్ను నీవితరణంబు నృసింహనృపాలశేఖరా.

59


క.

సరసము లగువాక్యంబులు, వరుసను వేర్వేఱ మించువగ మాధుర్యం
బరయఁగ బొట్లు పిఱుందుల, నరు దగునది సౌకుమార్య మది యె ట్లన్నన్.

60

మాధుర్యము —

చ.

అనయము యంత్రమత్స్యము నొకమ్మున శ్రీనరసింహుఁ డేయఁగా
వెనుకఁకు బాఱి పుల్గఱచి వేషము మార్చి బిలంబు దూఱ కా
ననమున కేఁగి సిగ్గున నణంగి భరంపడి వీఁగి తావిషం
బెనసి నతి న్భజించి నదు లీఁది భ్రమించెను రాసు లన్నియున్.

61

సౌకుమార్యము —

ఉ.

చెందొవవిందుమంచువలెఁ జిందురుచిం దగఁ జందనంబు వె
చ్చందన మొందు నిందుముఖిచందము డెందమునం దలంప నీ
యందమునందె నందనమునందు మిళిందము పొందుపొందికం
జెందె నృసింహ కౌఁగిటను జేర్పుము ముందుగ మందగామినిన్.

62


క.

లలితార్థభంగిఁ బాదం, బులు నాల్గిట నేకసరణిఁ బొదువ సమత యౌ
నిల నర్థము వ్యక్తం బై, నలు వొందిన నర్థదీపనం బె ట్లన్నన్.

63

సమత —

సీ.

శరవేగములు లేవె చలయంత్రపాఠీన, పాటనక్రియకు నేర్పడవు గాక
చాతుర్యములు లేవె శారదాభండార, చోరకారశ్రీకిఁ జొరవు గాక
వితరణంబులు లేవె వివిధయాచకనృపా, లకకంఠదఘ్నము ల్కావు గాక
సామర్థ్యములు లేవె సరిదన్యపథయాన, శాసనప్రౌఢికిఁ జనవు గాక


తే.

తొలుత గడిదుర్గముల నున్న దొరలు లేరె, మహిమ నీమాడ్కి గదనదుర్మదసపాద
సారసప్తాంగహరణులు లేరు గాక, నరనుతాటోప యోబయనరసభూప.

64

అర్థవ్యక్తి —

సీ.

నలు వొందునమరేంద్రునాగంబు సాటిగా, సామజంబుల నెల్ల
సంతరించి
విఖ్యాతి కెక్కిన వెలిమావు సాటిగా, సైంధవముల నెల్ల సవరణించి

మహిమ మించినమింటిమ్రాకులసాటిగా, బాదపంబుల నెల్ల బాదుకొల్పి
వన్నె కెక్కినదేవవాహినిసాటిగా, నిల నెల్లయేఱుల నిరవుకొల్పి


తే.

స్వర్గసృష్టికిఁ బ్రతిసృష్టి, సలుపుకీర్తి, వసుధఁ గౌశికగోత్రపావనుఁడ వైన
నీక తగుఁగాక మఱి యన్యనృపుల కగునె, సరసగుణహార యోబయనరసధీర.

65


క.

కతిపయసంయుక్తాక్షర, వితతం బౌదార్య మయ్యె విమలవిచిత్రా
యతవర్ణావృత్తులు గల, యతిమృదుబంధంబు కాంతి యగు నె ట్లన్నన్.

66

ఔదార్యము —

చ.

ఎదిరిస యోబశౌరినరసేంద్రునికీర్తి నిజాంశుపంక్తికిన్
మదనవిరోధి భీతుఁ డయి మార్కొన కేఁగినఁ దద్రథంబు ద
త్సదనము నాక్రమించి రభసంబున నావృషభాధిపధ్వజున్
వెదకఁ జుమీ యజాండముల వే వెడలెం గడిలేనియీసునన్.

67

కాంతి —

సీ.

నెలవంక తోడివెన్నెలవంక గలమేటి, నెలవంక రహితాంశునియతిఁ దెగడి
ననయము వానిఁ గన్ననయమ్ము గలయింతి, ననయమ్ము దాల్చువానన్నఁ జెనకి
కడలేక తరిగొండ కడలేకడలఁ ద్రోయ, కడ లేక మైనమీఁగడల గెల్చి
కవురాలవన్నె చొక్కపురాల నగుమేని, కపురాలపోతు బింకంబు నణఁచి


తే.

తనరుచులు లోకములు నిండఁ దనరుచుండు, లాటకరహాటలలనాలలాటఫలక
మలయజము లైన నీదునిర్మలయశంబు, లమితగుణసాంద్ర నారసింహక్షితీంద్ర.

68


క.

విలసితసమాసభరితో, జ్జ్వలబంధం బోజ మయ్యె సరియవ్యగుణం
బులు మఱి వేఱొక్కటి పై, నలరింప సమాధి యయ్యె నది యె ట్లన్నన్.

69

ఓజము —

సీ.

మందారబిసకుందకుందాదినిధిబృంద, బృందారకాప్తశోభితయశుండు
హేలావిజితహాలహాలాశనోత్తాల, తాలాంకభుజదండతాండవుండు
దీనాపననిదానదానాంబుజనదీన, దీనాథపరిణయస్థితివిధాయి
భీమాసురవిరామరామాతిశయధామ, ధామాంబకనిభాసిదారితారి


తే.

రాజమాత్రుండె వసుధాధిరాజమకుట, నికటవికటమహానీలనికరసుకర
మధుకరకరంభితాంఘ్రిపదద్వయుండు, సరసగుణహారి యోబయనరసశౌరి.

70

సమాధి —

సీ.

అలబలీంద్రునిచేత నడుగు వెట్టఁగ నేర్చి, ధారాధరముచేత నీరు మోచి
కానీనుచేఁ గంచుకముఁ బూనఁగా నేర్చి, యెలమి దధీచిచే నెమ్ము బలిసి

క్షీరాంబురాశి ద్రచ్చినవెన్న నీడేరి, నైలింపగనిచన్నుఁబాలఁ బెరిఁగి
కల్పపాదపఫలోత్కరములఁ జని గాంచి, వనజారి నెమ్మేన ననఁగి పెనఁగి


తే.

ధరణిఁ బ్రోది వహించినదానకన్య, సకలయాచకబాంధవు ల్సంతసిల్ల
నీకరగ్రహణావాప్తి నెరసె నౌర, వైరిగజసింహ యోబయనారసింహ.

71

శబ్దాలంకారములు —

తే.

ఇఁక నలంకారనికరంబు లేర్పరింతు, నవియుఁ గవితాలతాంగికి హారకటక
కంకణాదులక్రియ య నలంకరణకరణ, పరిణతులచే నలంకారభావ మొందు.

72


క.

ఇవియును శబ్దార్థంబుల, ద్వివిధములై క్రమముతోడ వెలయు ననుప్రా
సవిశేషంబుల నుపమా, దివిశేషములను గావ్యదీపితసరణిన్.

73


తే.

అం దను ప్రాసభేదంబు లైన శబ్ద, భవదలంకారమును మున్ను ప్రస్తుతింతు
నడర నెడ లేక రెండు రెం డక్షరంబు, లెనయు నియమంబు ఛేకమౌ నెట్ల టన్న.

75


పంచచామరము.

స్ఫురత్కృపాబలప్రతాపభూతిధైర్యభూభరా
ర్చిరంగదానబుద్ధివైఖరి న్హరి న్హరి న్సుధా
హరు న్హరు న్గిరి న్గిరి న్మహానలు న్నలు న్రమా
గురు న్గురు న్జయింతు వౌఁ దగు న్నృసింహభూవరా.

75


తే.

ఒక్కవర్ణంబు కడదాక నుద్ధరింపఁ, బరఁగు జృంభణవృత్త్యనుప్రాస మయ్యె
దలఁపఁ బునరుక్తి యయ్యుఁ దాత్పర్యభేద, మొనయు నియమంబు లాట మౌ నె ట్లఁటన్న.

76

వృత్త్యనుప్రాసము—

చ.

సమదవిపక్షశిక్షణవిచక్షణదక్షిణదోరనుక్షణ
భ్రమదసిదుర్ణిరీక్షసమరక్షపితక్షితిపక్షతక్షర
త్సమధికశోణితక్షరకృతక్షణరక్షితపక్షిలోక నిన్
గమలదళాక్షుఁ డేలు బలగౌరవసింహ నృసింహభూవరా.

77

లాటానుప్రాసము—

చ.

ఘనత నృసింహుఁ జూడఁ గలకన్నులు కన్నులు వానికౌఁగిటం
జనువున నేపు చూపఁ గలచన్నులు చన్నులు వాని మోవికిం
జొనిపిన పాటలాధరము జూన్నులు జున్నులు వాని మేనఁ జే
ర్చినసరసాంగవల్లికల చెన్నులు చెన్నులు వో తలోదరీ.

78


క.

సమపర్ణయుగాధిక మై, యమరిననియమంబు యమక మగుఁ గృతులం దా
యమకం బనేకవిధ మగుఁ, గ్రమమున నొక రెండుమూడుగతు లెఱిఁగింతున్.

79

క.

మేలిమి రెండవపాదము, నాలవపాదంబు నొక్కయనువునఁ దనరం
జాలినయమకము కృతులం, దాలింపఁగఁ బాదయమక మగు నె ట్లన్నన్.

80

పాదయమకము —

క.

ఔరా యోబనృపాలకు, మారా మనుమదనసమరమాధుర్యుఁడ వై
ధీరానృసింహ కూడితి, మారా మనుమదనసమరమాధుర్యుఁడ వై.

81


క.

ప్రస్తుత మగుముక్తపద, గ్రస్తం బన నదియుఁ గృతులఁ బరఁగు బదాంతో
దస్తము పాదాద్యంతను, విస్తృతము పదాంతసింహవీక్షణ మనఁగన్.

82

పాదాంతపాదాదిముక్తపదగ్రస్తము —

క.

సుదతీనూతనమదనా, మదనాగతురంగపూర్ణమణిమయసదనా
సదనామయగజరదనా, రదనాగేంద్రనిభకీర్తిరసనరసింహా.

83

సింహావలోకనముక్తపదగ్రస్తము —

క.

మన వేటికి నూతనమా, తన మాయెడఁ బ్రేమ దనకుఁ దక్కితి ననుమా
ననుమానక దయ దనరం, దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

84

పద్మబంధము —

చ.

కనుఁగొన రేకు లెన్మిదియుఁ గర్ణిక చుట్టిడి స్రగ్ధరాంఘ్రుల
న్మునుపటియేడువర్ణములునుం గడయేడుఁ బ్రవేశనిర్గతు
ల్పనుపడ నాల్గుదిగ్దళముల న్లిఖియించి విదిగ్దళంబులం
దెనయఁగఁ బాదమధ్యగము లేడును వ్రాయఁగఁ బద్మబంధ మౌ.

85


స్రగ్ధర.

రామాకశ్రీసమగ్రరణకృతభయముద్రాససక్తారమారా
రామారక్తాససద్రాష్ట్రభరణపటిమాత్రాసకుస్తికుమారా
రామాకున్తీకుసత్రాప్రకటతరవిచిత్రాపవిత్రాసమారా
రామాసత్రావిపత్రాశ్రయనరసరుచిగ్రామసశ్రీకమారా.

86

చక్రబంధము —

క.

పదిచుట్లు నాఱురేకులు, పదిలపఱిచి సుకవిపేరు పతిపేరును లోఁ
బొదలఁగ నేవంవిధగుణ, విదితం బగుచక్రబంధవిధ మౌ నె ట్లనన్.

87


శా.

రక్షానాకపమూర్తిభాసురగభీరావిక్రమోహాస్పదా
దక్షారమ్యమతిస్థిరాభరణవిద్యాకృత్యశఙ్కిస్వనా
వక్షస్సింధుపకన్యకానరసభవ్యాతిగ్మధీతంత్రదా
దాక్షిణ్యారతనాదవైభవవినోదాహేమనాగాశ్వదా.

88

వృత్తకందగర్భసీసము —

సీ.

మహితవిద్వజ్జనమండలీవినుతసా, హిత్యప్రియంభావుకాత్యుదార
వితతభీమాహవవిక్రమక్రమసము, ద్యద్ద్వైరినిర్భేదనాభిరామ
వినుతవిశ్రాణనవిభ్రమాపహసితా, నూనామరక్ష్మారుహా నృపేంద్ర
వినతభూపాలకవిస్ఫురన్మకుటర, త్నద్యోతితాంచత్పదా మహాత్మ


తే.

'నిరుపమదయాపయోనిధినిరతభరిత, చారుచరితనిర్మలతరసత్యరుచిర
తరణికులమణీనరసింహధరణిరమణ, ఘనతరగుణనిధీ' మనుజనులు వొగడ.

89

ఓష్ఠ్యనిరోష్ఠ్యసంకరము —

శా.

భూనాథోత్తమ జంభభంజనమహాభోగాభిరామ క్రియా
దానోజ్జృంభితవారిపూరభరితోద్యద్వార్థివీచివ్రజా
మానామేయసుధాబ్ధినిర్మలగుణా మాద్యన్మహాయూథప
శ్రీనూత్నప్రథమానభాగ్యవరవైరివ్రాతభేదివ్రతా.

90


క.

నీహారశిఖరిశిఖర, వ్యూహామితతుహినకణమహోమహిమ మహా
మోహావహవిమతవరా, రోహామణిహారనయన రూఢవిహారా.

91


లయగ్రాహి.

మిత్రకులభూషణ యమిత్రకులభీషణ విచిత్రమృదుభాషణ చరిత్రమణిహారా
జైత్రవిశిఖాసన బలత్రిపురశాసన పనిత్రగుణభాసన సగోత్రభృతిధీరా
క్షాత్త్రశుభలక్షణ సుపాత్రజనరక్షణ కుశాత్రయవిచక్షణ యకృత్రివవిహారా
గోత్రసమసింధుర కళత్రితవసుంధర పతత్రిరథబంధుర తనుత్రభుజసారా.

92


గద్యము.

ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతి
భాబంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణ
సుపుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తి
మూర్తిప్రణీతం బైనకావ్యాలంకారసంగ్రహం బనుమహాప్రబంధంబునందుఁ
ద్రివిధదోషనిర్ణయంబును గుణప్రకరణంబును శబ్దాలంకారసంగ్రహంబు
నన్నది చతుర్థాశ్వాసము.