Jump to content

నరసభూపాలీయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నరసభూపాలీయము

కావ్యాలంకారసంగ్రహము - ద్వితీయాశ్వాసము

.



రాజితసదనకలా
ధారనిరంతరతరార్థిదారిద్ర్యహరా
నారాయణచరణార్చన
నారీజనతారతీశ నరసాధీశా.

1


తే.

అవధరింపుము లక్ష్మలక్ష్యములనెల్ల, ననఘ భవదీయనామధేయాంకితముగ
బహువిభక్తుల నొనరింతుఁ బద్యవితతి, నిచట నాయకభేదంబు లెట్టు లనిన.

2


క.

ధీరోదాత్తప్రముఖులు, ధీరోద్ధతధీరశాంతధీరలలితు లీ
ధారుణి నలువురునాయకు, లారయఁ దల్లక్షణంబు లభివర్ణింతున్.

3


శా.

ధీరాత్ముం డవికత్థనుండు గరుణోద్వేలుండు సత్వాఢ్యుఁ డా
ధీరోదాత్తుఁడు శౌర్యదర్పకుహనాధీనుండు ధీరోద్ధతుం
డారూఢి న్సమధీప్రసన్నుఁడు ద్విజుం డౌధీరశాంతుండు వృ
త్రారిం దోలినభోగిధీరలలితుం డై పొల్చు నిశ్చింతతన్.

4

ధీరోదాత్తుఁడు ౼

సీ.

చలిచీమనేనియుఁ జాఁ ద్రొక్కఁగాఁ జాలఁ,
డేరీతి గెల్చెనో వైరివరులఁ
గల నైన నిజవర్ణనలు సేయ వినఁ జాలఁ, డె ట్లందుకొనియెనో కృతిచయంబు
చెలు వొందు నాకారచేష్ట లెయ్యడఁ గానఁ, డెట్లు నవ్వునొ యాత్మహితులతోడఁ
బరుషాక్షరంబులు పలుకఁ డెక్కాలంబు, నెట్లు భర్జించెనో హీనమతులఁ


తే.

బరులఁ జేపట్టఁ డెలమిఁ జేపట్టి విడువఁ, డలయఁ డేమఱఁ డరి నైన నవగుణంబు
లెన్నఁ డోబయనరసధాత్రీశతిలక, మరయ నరలోకభాగధేయంబు గాదె.

5

ధీరోద్ధతుఁడు ౼

మ.

బలవద్వైరిభిదామదాభిరత మై భవ్యప్రతాపోజ్జ్వల
జ్వలనజ్వాలజటాల మై రణభయవ్యాసక్తతత్తన్మనో

జలజాంధంకరణప్రగల్భకుహనాసంసాది యై పొల్చుఁ దా
నిలధీరోద్ధతవృత్తి యై నరసధాత్రీశోగ్రఖడ్గం బనిన్.

6

ధీరశాంతుఁడు —

చ.

ఇనకులధుర్యుఁ డైననరసేంద్రునిచేతఁ బ్రతిష్ఠితంబు లౌ
ననఘ మహాగ్రహారములయందలి భూసురకోటి మేటి యై
ఘనతరశాఖలం జెలఁగి కాంతశుకక్రమ మై మెలంగున
య్యనిమిషభూజవాటిక్రియ నాత్తశుచిప్రసవాభిరామ మై.

7

ధీరలలితుఁడు —

ఉ.

కుంతల గౌళ చోళ కురు ఘూర్జర హూణ శకాది మేదినీ
కాంతులు సంతతంబు నిజగాఢబలశ్రుతిమాత్రభీతు లై
యింతులరత్నహారముల నెల్ల ధనంబుల నిచ్చి కొల్వ ని
శ్చింతతఁ దాల్చు నోబయనృసింహుడు భోగకళాప్రవీణుఁడై.

8


తే.

మఱియు శృంగారలీలాసమగ్రయోగ్య, తానిశవిచక్షణులు దక్షిణానుకూల
ధృష్టు లనఁ గాంతు లభీష్టమతులు, గలరు తల్లక్షణంబులు దెలివిపఱతు.

9


చ.

చెలఁగు బహుప్రియాసదృశశీలుఁడు దక్షిణుఁ డొక్కకాంతకే
వలచి గుణాభిరాముఁ డగువాఁ డనుకూలుఁడు సాపరాధుఁ డై
యలుగనివాఁడు ధృష్టుఁడు ప్రియాశయమాత్రనివేద్యవిప్రియుం
డలశఠుఁ డండ్రు వీరల కుదాహరణంబులు నిర్ణయించెదన్.

10

దక్షిణుఁడు —

ఉ.

సాగరమేఖలాసతికిఁ జారుభుజాపరిరంభ మిచ్చె వా
ణీగగనావలగ్నకును నేర్పుమెయి న్మొగ మిచ్చె వీరల
క్ష్మీగజరాజగామిని కమేయభుజాంతర మిచ్చె సంతత
త్యాగి నృసింహభూవిభుఁడె దక్షిణనాయకుఁ డెన్నిభంగులన్.

11

అనుకూలుఁడు —

చ.

కనకము లంబరంబులును గ్రామము లుజ్జ్వలదివ్యరత్నమం
డనములు వాజివారణఘట ల్ఘనసారసుగంధసారము
ల్దనివి దలిర్ప వేఁడినకొలంది నొసంగుచు నోబభూపనం
దనుఁ డగునారసింహుఁ డిల దానరమాప్రియుఁ డయ్యె నెంతయున్.

12

ధృష్టుఁడు —

చ.

ఉరమున నున్నకుంకుమ మదుజ్జ్వలరోషకషాయవీక్షణ
స్ఫురదరుణాంశుపుంజ మని బొంకితి కన్గవకెంపుభాగ్యబం

ధురసహజారుణత్వ మని నూల్కొన నాడితి వెట్లు దాఁచె దీ
పరిమళవాసనాలహరిపర్వెడుమేన నృసింహభూవరా.

13

శరుఁడు ౼

చ.

కనుఁగవఁ బాఱఁజూచెదవు గాని మనంబునఁ జూడ వుక్తులం
దనిపెదు గాని భారమునఁ దన్ప వొకప్పుడు నీ ప్రవీణత
ల్పనుపడ వింక నీసటలు బచ్చెనచేతలు చాలఁ జాలునన్
జెనకకు కీర్తికాంతయె నృసింహప్రియాంగన నీ కెఱుంగుదున్.

14


క.

ప్రకటీకృతు లగునీనా, యకులకు విటపీఠమర్దు లనఁ జేటవిదూ
షకులనఁ గలరు ప్రియాకే, లికలాసంఘటనపటిమ లీలాచార్యుల్.

15


చ.

వసుమతి నేకవిద్య గలవాడు విటుం డనఁ బొల్చు నాయకో
ల్లసనముకన్నఁ గొంత గుణలక్షణహీనుఁడు పీఠమర్దకుం
డసదృశబాలికాసుఘటనాదిరహస్యవిదుండు చేటకుం
డెసఁగ నజస్రహాస్యరసహేతువువాఁడు విదూషికుం డిలన్.

16


క.

ఈమతమున స్వీయాన్యా, సామన్య లనంగఁ గలరు సతు లందుఁ ద్రపా
సామగ్రీశీలార్జన, కోమలకమనీయస్వీయగుణములఁ జెలఁగున్.

17


క.

అన్య యనఁగ నన్యోఢయుఁ, గన్యయు సామాన్య యనఁగ గణికామణి యీ
మాన్యల కుదాహరణము ల, నన్యాదృశవిశదఫణితి నాపాదింతున్.

18

స్వీయ ౼

చ.

అమృతము వంటి సద్గుణము నంచితచంద్రకలావిలాసభా
వము శివగోత్రభూతియు నవారణఁ దాల్చి యశఃపురంధ్రి దా
గమలవనీహితాన్వయశిఖామణి యైననృసింహమేదినీ
రమణుల కేకపత్ని యన రంజిలులోకములెల్ల మెచ్చఁగన్.

19

అన్యోఢ ౼

సీ.

పారసీకక్షమాపతులచొ ప్పడఁగించి, నేర్పు మీఱఁగ మోహనిద్ర పుచ్చి
యవనసేనాధినాయకులదోస్తంభసం, భరితప్రతాపదీపంబు లడఁటి
యభిభూతఖానమల్కావిస్కృతాయశో, ధ్వాంతసంతతి కాత్మ సంతసిల్లి
సమదముష్కతురుష్కుప్రాప్తసీమల, నడుగు మోపఁగ నీక యరుగుదెంచి


తే.

ప్రాజ్యసామ్రాజ్య యగువారిరాజ్యలక్ష్మి, కదససంకేతమున జారకాంత యగుచు
నంచితస్ఫూర్తి నిన్ను వరించె నౌర, వైరిగబసింహ యోబయనారసింహ.

20

కన్య ౼

శా.

ఆజానేయము నెక్కి యోబయనృసింహస్వామి వాహ్యాళి రా
నోజం గాంచనసౌధవీథికఁ దదీయోల్లాసముం జూచి మా

తేజోవిభ్రమధన్యకన్య మదనార్తిం జెంది ప్రాసాదపా
ళీజాగ్రన్మణిపుత్రికానియతిఁ దాల్చెం దద్గతస్వాంత యై.

21

సామాన్య —

క.

ఏరీతి వారు చెందిన, నారీతిఁ దదీయరాగ మందెడి నౌరా
వారాంగన యది సాక్షా, త్కారపుఁబటికంపుబొమ్మ గాఁబోలుఁ జుమీ.

22


క.

ఈమగువల కాద్యయు ము, గ్ధామధ్యాప్రౌఢ లనఁగఁ దగునవ్యవయో
వ్యామిశ్రితయోగ్యము లగు, నామములు తదీయలక్షణము లేర్పఱుతున్.

23


చ.

నవనవకామయౌవనసనాథయు నల్పరతంబు గల్గు న
య్యువిదయె ముగ్ధ మధ్య సదృశోదితయౌవనకామ యై రతాం
తవివశ యౌ లతాంగి సతతప్రధితోల్బణకామయౌవనో
త్సవయు రతాదిమోహమును దాల్చుతలోదరి ప్రౌఢ దా నగున్.

24

ముగ్ధ —

శా.

అలాపంబున కుతేతరం బొసఁగ దాయాసంబునం గాని తా
నాలోకింపదు పాటలాధరమరందాస్వాదసమ్మర్దముం
దాళం జాలదు కౌఁగిలియ్యదు తనూతాపంబు చల్లాఱఁగా
నే లజ్జావతి తద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే.

25

మధ్య —

ఉ.

మానితవైఖరి న్మణితమంత్రములం గబరీవినిర్గళ
త్సూనములం బ్రసూనశరశూరునిపూజ లొనర్చి తా రతి
న్మానిని యొప్పె నప్పు డసమానమనోంబుజవీథి నాతనిన్
ధ్యానము సేయుకైవడి రతాంతనితాంతనిమీలితాక్షి యై.

26

ప్రౌఢ —

మ.

నటదుత్తుంగపయోధరంబు జితమందాక్షక్రియోదార మ
స్ఫుటవాగంకుర మక్షికోణనివసత్పుష్పేషుదర్పంబు సం
ఘటితాలింగనవామనీకృతకుచాగ్ర ప్రౌఢ రోమాంచ మై
విటుఁ జొక్కించెఁ బ్రఫుల్లపద్మనయనావీరాయితం బెంతయున్.

27


క.

ధీర యధీరయు ధీరా, ధీరయు నగు నందు మధ్యధరాధిరా
ధీరాధీరాహ్వయముల, ధారుణిఁ బ్రౌఢయుఁ జెలంగుఁ దల్లక్షణముల్.

28


తే.

తప్పు గలభర్తమ్రోల సోత్ప్రాసఫణితిఁ, గేరడము లాడుసతి మధ్యధీర సాశ్రు
పరుషవచన యధీర సబాష్పకుటిల, హారివచన ధీరాధీర యనఁగఁ జెలఁగు.

29

తే.

కాంతుఁ డపరాధి యైన నాకారగుప్తిఁ, బరఁగి రతివేళ నలయించుఁ బ్రౌఢ ధీర
తాడనోగ్ర యధీర యుదగ్రకుటిల, ఫణితి యుభయాఖ్య వీరి నేర్పఱుతు వరుస.

30

మధ్యధీర —

ఉ.

మోమున ఘర్మశీకరసమూహము గానఁగ నయ్యె నిప్పు డా
రామవిహారకేలిని ధరంపడినాఁడవొ నన్నుఁ బాసి యీ
రేమదనాస్త్రఘాతముల వేఁగితొ నీయుర మెల్లఁ దద్వ్రణ
స్తోమము సోఁకి యున్నయది చొప్పడఁ గాంత యెఱుంగఁ జెప్పుమా.

31

మధ్యాధీర —

శా.

చాలుం జాలుఁ బిసాళిసేఁతలు పబాబ్జాతంబుపై మాటికిన్
వ్రాలం బోకు భవత్ప్రియానఖవిమిశ్రం బైననీవక్ష మీ
నీలస్థాపితకుట్టిమం బొరసిన న్వేధించు లే లెమ్ము నీ
బాలాసంగమసౌఖ్యవైభవము సూప న్వచ్చితే యిచ్చటన్.

32

మధ్యధీరాధీర —

చ.

పలుక వటంచు నెమిటికి బాములఁ బెట్టెదు కాంత నీపయిం
దెలియఁగఁ దప్పు లేమికిని నిన్ననఁజాలక యూరకుండినం
బలుమఱు సాపరాధుగతిఁ బల్కెద వెన్నఁడు దప్పు నీయెడం
గలుగునె యంచు నించెఁ దెలిగన్నుల నీరు లతాంగి యంతటన్.

33

ప్రౌఢధీర —

చ.

హితమతి ధూర్తభర్త కెదురేగెడునేర్పున నేకపీఠసం
గతి హరియించి పల్కుటయుఁ గ్రక్కున నెచ్చెలి కూడిగంబులం
జతురత నేర్పుచందమున జాఱఁగఁ ద్రోచి యతిప్రగల్భ యౌ
సతి యుపచారగౌరవము సల్పెడునట్లు వహించుఁ గోపమున్.

34

ప్రౌఢాధీర —

చ.

వరునిఁ గృతాపరాధుని సవారణవారణయాన యీసునం
గెరలి భుజాగుణంబుస బిగించి వతంసితసారసంబునం
గరము దమింపఁగాఁ దొడఁగెఁ గాంతుని సాంత్వనశీతలోక్తు లాం
తరనిజకోపతప్తఘృతధారకకారణవారిధారగాన్.

35

ప్రౌఢధీరాధీర—

చ.

బొమముడిపాటు జత కెనయుఁ బూని పురంధ్రులు సాపరాధు లౌ
రమణులు వేడుకొన్న ననురాగము దాల్పుదు రట్లు గాదు మ

త్క్రమ మపరాధలేశమును దాల్పనినీ విపు డెంత మ్రొక్కినం
దెమలదు శాంతిఁ బొందకు మదీయమనం బిఁకఁ జాలుఁ బ్రార్థనల్.

36


క.

ధారుణిమధ్యయుఁ బ్రౌఢయుఁ, ధీరాధీరాదిభేదదీపిత లై వే
ర్వేరను జ్యేష్ఠ కనిష్ఠయు, నై రంజిలి ద్వాదశాఖ్య లగుదురు వరుసన్.

37


క.

కావున స్వీయ త్రయోదశ, భావంబు వహించు నన్య పరఁగు ద్వివిధ యై
యావారాంగన యేకవి, ధావహ య ట్లెన్నఁగాఁ బదాఱ్వురు సుదతుల్.

38


తే.

మఱియు శృంగారశంభుసంభావితాష్ట, తనువు లన నీమృగాక్షులు వినుతిఁ గాంతు
రష్టవిధభేదముల వీరియాహ్వయములు, లక్షణము లేర్పరించెద లలితఫణితి.

39


సీ.

నరుఁడు గైవస మైనవనిత స్వాధీనభ, ర్తృక ప్రియాగమవేళ గృహముఁ దనువు
సవరించునింతి వాసకసజ్జ పతిరాక, తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
విరహోత్క సంకేత మరసి నాథుఁడు లేమి, వెస నార్త యౌకాంత విప్రలబ్ధ
విభుఁ డన్యసతిఁ జెంది వేకువరాఁ గుందు, నబల ఖండిత యల్క నధిపుఁ దెగడి


తే.

యనుశయముఁ జెందుసతి కలహాంతరిత ని, జేశుఁడు విదేశగతుఁ డైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక కాంతాభిసరణ, శీల యభిసారికాఖ్య యై చెలువు మెఱయు.

40


క.

ఈరీతిఁ జెలఁగు నతిశృం, గారకలాకలితనాయికామణులకు వే
ర్వేర నుదాహరణంబులు, భూరిమధురసవచనరచనముల నేర్పఱుతున్.

41

స్వాధీనపతిక —

ఉ.

శ్రీనిధి యోబభూవరునృసింహుడు కైవస మై చెలంగఁగా
భూనుతవైభవస్ఫురణఁ బొల్చుయశోజలజాక్షి నిత్యస
మ్మానితశీల యై ధవుని మన్నన నౌదల యెక్కినట్టివై
మానికవాహిని న్నగు నమందనిజాతిశయంబు పేర్మికిన్.

42

వాసకసజ్జిక —

చ.

యవనచమూసమూహముల నాజి జయించి యుదగ్రదిగ్జయో
త్సవిధివాభిరాముఁ డయి సారెకు నోబయనారసింహభూ
ధవుఁ డరుచెంచులగ్నమునఁ దత్పురలక్ష్మి విభూషితోల్లస
ద్భవనవిశేష యై మృగమదద్రవవాసనఁ దాల్చునిచ్చలున్.

43

విరహోత్కంఠిత —

ఉ.

నెచ్చెలు లీనృసింహధరణీవరుఁ దెచ్చెద మంచుఁ బోయి రా
రిచ్చట నీవునుం గరుణ యించుక లే కలరంప గుంపులన్
గ్రుచ్చెద వేల మత్ప్రియునిఁ గూర్పుము మన్మథ నీకుఁ దద్విభుం
దెచ్చుటకై యొసంగెద మదీయకటాక్షముల న్జయాస్త్రముల్.

44

విప్రలబ్ధ —

చ.

ఎనయఁగ నీనివాసమున కే నరుదెంచెద నంచు నాపయిం
గనుఁగొన నిక్కపుంబ్రియము గల్గినవాఁడును బోలెఁ బల్కి యీ
మనికికి రాక తక్కినను మాసెడుఁ గాక మదీయదృష్టికిం
బనుపడి మ్రోల నున్నగతి మాయలు సేయఁగ నేల భర్తకున్.

45

ఖండిత —

చ.

నృపులకు నెల్లవారల భరించుట యోగ్యము గాన నేఁటీరే
యపరిమితోత్సవంబునఁ బ్రియాసదనంబుల కేగి యేగి యా
నెపమున మద్గృహంబునకు నీ వరుదేరఁ బ్రభాత మయ్యెఁ గా
కిపుడు నృసింహ నీపయి నొకించుక వంచనలే దెఱుంగుదున్.

46

కలహాంతరిత —

ఉ.

అనఁగ రానికోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
మానదురాగ్రహగ్రహము మానుపలే కపు డెందుఁ బోయెనో
యీననవింటిదంట యపు డేఁపఁ దొడంగె భవిష్యదర్థము
ల్గానని నామనంబునకుఁ గావలె నిట్టివిషాదవేదనల్.

47

ప్రోషితభర్తృక —

చ.

చిరయశ యోబభూవరు నృసింహ భవద్రిపుభామ కాననాం
తరమున కేగి యందు నిజనాథునిఁ గానక మన్మథార్త యై
వరుని సరోజపత్రమున వ్రాయునెడం గరము ల్సెమర్పఁగా
నరయ నిజాంగకంబె పగ యయ్యె నటంచుఁ దలంచు దైవమున్.

48

అభిసారిక —

ఉ.

నాతిమదిం బ్రియాభిసరణం బొనరింపఁ దలంచె దీవు చం
ద్రాతపసాంద్రదీధితు లజాండకటాహమునిండఁ బర్వఁగా
నీతలఁ పెట్లు గూడు రమణీవలె నే నొకనన్నెఁగాఁగ ము
క్తాతతులుం బ్రసూనములు దాల్పు మలంగుము గంధసారమున్.

49


క.

ఈయెనిమిదిభేదంబులఁ, బ్రేయసులు పదాఱ్వురుం బ్రభిన్నాత్మిక లై
యాయతగతి నిల నూటిరు, వైయెనిమిది భేదములును మదిలుదు రెలమిన్.

50


క.

ఇల నీసంఖ్యలఁ దగుసతు, లల యుత్తమమధ్యమాధమాభిఖ్యలఁ జె
న్నలరఁగ మున్నూటెనుబది, నలువురు నాయిక లటండ్రు నవరసరసికుల్.

51

కావ్యస్వరూపము

తే.

ఇంకఁ గావ్యస్వరూపంబు లేర్పరింతు, విగతదోషంబులును గుణాన్వితము లధిక
లసదలంకారభావోపలక్షితములు, నైన శబ్దార్థము కావ్య మనఁ జెలంగు.

52


క.

తను వగుశబ్దార్థంబులు, ధ్వనిజీవి మలర క్రియావితానము సొమ్ముల్
తనరుగుణంబులు గుణములు, ఘనవృత్తులు వృత్తు లౌర కావ్యేందిరకున్!

53


తే.

అందు వాచకలక్షకవ్యంజనంబు, లనఁగ శబ్దప్రపంచంబు వినుతి కెక్కుఁ
ద్రివిధ మై యర్థజాతంబు తేజరిల్లు, నవని వాచ్యంబు లక్ష్మ్యంబు వ్యంగ్య మనఁగ.

54


తే.

శబ్దవృత్తులు నభిదలక్షణ యనంగ, వ్యంజన యనంగఁ బెను పొందు నందు నభిధ
సతతసంకేతార్థగోచరసుశబ్ద, ధామ మై యోగరూఢిభేదములఁ జెలఁగు.

55

యోగమూలాభిధ —

చ.

అలఘుబలాభిరాముఁ డగునౌబళరాజనృసింహ మేదినీ
తలబలవైరిదానజలధారల నిచ్చలుఁ దేలి తేలి త
ద్గళితవిరోధిశోణితనదమ్ముల నిమ్ములఁ గూడి కూడి యా
జలధులు వాహినీశు లనఁ జాలఁ జెలంగుఁ బయోనిధానముల్.

56

రూడిమూలాభిధ —

క.

కులమణియై బలవద్రిపు, కులగిరికులిశంబు నై యకుంఠితధర్మా
కలనకలాలాలసుఁ డయి, వెలయు న్నరసింహవిభుఁడు విశ్వోన్నతుఁడై.

57


తే.

ఇంక లక్షణ వివరింతు నిందు గౌణ, వృత్తియు నభిన్న మై పొల్చు నె ట్లటన్న
క్షోణిసురుఁ డగ్ని యనునెడ శుచిగుణంబు, వాచ్యవిధనాభిభావియై వఱలుకతన.

58


క.

బంధుర యగులక్షణసం, బంధానుపపత్తి మూలభావన నది సం
బంధనిబంధన సామ్యని, బంధన యని గెండుగతులఁ బరఁగుచు నుండున్.

59


తే.

అందు జహదభిధేయయు నజహదర్థ, యనఁగ సంబంధలక్షణ యలరు సామ్య
గుణనిబంధన తాను ద్వైగుణ్య మందు, జగతి సారోపసాధ్యనసాయ యనఁగ.

60


సీ.

అలగంగలో ఘోష మగునెడ గంగాప, దంబు సంబంధి యౌతటము దెలుప
సంబంధలక్షణజహదర్థ యగు నందు, నుంచె మ్రోసె నటన్న మంచగతులు
దోఁచుఁ గోదండపఙ్క్తులు వచ్చె నని విండ్ల, నమరు యోధులు దోఁప నజహదర్థ
యవనిపాలుఁడు సింహ మనువేళ నదృశతా, గుణసిద్ధిసామ్యలక్షణ చెలంగు


తే.

నందు నుపమాన ముపమేయ మప్రభిన్న, మైన సారోప యుపమాన మగదితోప
మేయ మై యున్నసాధ్యవసాయ యిట్టి, లక్షణల కన్నిటి కొనర్తు లక్ష్యములను.

61

జహల్లక్షణ —

చ.

అగణితశౌర్యధైర్యవిభవాన్విత యోబయనారసింహ నీ
గగనచరామరాగశిబికర్ణజయోన్నతదానలక్ష్మికిన్
జగములు సంతసిల్లె నతిసాంద్రభవజ్జయభేరిభాంకృతి
ద్విగుణితసైన్యఘోషముల వే వడఁకె న్రిపుపట్టణావళుల్.

62

అజహల్లక్షణ —

క.

అసమరణరంగమున నీ, యసినటి నటియింపఁ గరుల హరుల న్సిరులన్
వెస నొసఁగు నౌర యెంతటి, రసికుఁడు నీవైరి యోబరాజనృసింహా.

63

సారోపలక్షణ —

మ.

అమరద్వీపవతీఝరాంతరములం దారూఢి నీలాంబుపూ
రము సూర్యాత్మజఁగాఁ దలంపుదురసారప్రౌఢిమైఁ గొంద ఱు
ద్యమతేజోధికనారసింహ భవదుద్యత్కీర్తినిర్ధూతసం
భ్రమ యౌగంగయ కీర్తి దాల్చె నని నే భావింతుఁ జిత్తంబునన్.

64

సాధ్యవసాయలక్షణ —

క.

నిరతబుధప్రహ్లాదా, దరకరుఁడు హిరణ్యకశిపు దానోన్నతుఁ డై
ధరఁ బోచిరాజవంశ, స్థిరరత్నస్తంభమున నృసింహుఁడు పుట్టెన్.

65


క.

సంగతము లగు పదార్థము, లం గలవాక్యార్థ మున కలంకారం బై
రం గగు నర్థాంతక మర, యం గావ్యములందు వ్యంజనాఖ్య చెలంగున్.

66


క.

ప్రకృతోపపన్న కభిధకుఁ, బ్రకృతానుపపత్తిగోచరకు లక్షణకున్
బ్రకటితవిభేద్యవ్యంజన, ప్రకృతాప్రకృతోపపత్తిఁ బరఁగెడుకతనన్.

67


ఆ.

జగతి నదియు శబ్దశక్తిమూలంబును, నర్థశక్తిమూల మరయ నుభయ
శక్తిమూల మనఁగ సన్నుతిఁ గాంచుఁ ద, దీయలక్ష్యములను దేటపఱతు.

68

శబ్దశక్తిమూలవ్యంజన —

క.

ఘనత నృసింహునికరమునఁ, దనరెడునసి నిజసమగ్రధారాగ్రనిమ
జ్జనతత్పరు లగునరులకు, ననిమిషభావం బొనర్చు ననవరతంబున్.

69

అర్థశక్తిమూలవ్యంజన —

చ.

అలఘుపరాక్రమక్రమసమగ్రభుజాగ్ర నృసింహభూప నీ
విలసదనూనదానగుణవిశ్రమ మంతయు నాలకించి తా
వెలవెల బాఱె మేఘ మరవిందవిరోధియుఁ గందువాఱె నా
కులపడెఁ గల్పశాఖి తృణకోటి ద్రసించె నమర్త్యధేనువున్.

70

ఉభయశక్తిమూలవ్యంజన —

క.

అరిదరకరుఁ డై సుమనో, వరభరణధురీణుఁ డై యవారికలక్ష్మీ
స్థిరవాసభాసురుండై, నరసింహుఁడు వొల్చుఁ ద్రిభువనస్తుతమహిమన్.

71


తే.

మరియు రచనాశ్రయంబు లై మధురరసని, వేశయోగ్యతవృత్తులు కైశికియును
నారభటియును సాత్వతి భారతియును, నాగఁ బొగడొందుఁ దల్లక్షణము లొనర్తు.

72


మ.

చెలంగుఁ గైశికి కోమలార్థరచనాశ్రీమధ్ధతార్థక్రమా
చలితాడంబరమూర్తి యారభటి యీషత్ప్రౌఢసందర్భని
శ్చల యౌభారతి పొల్చు సాత్వతియు నీషత్కోమలార్థక్రమం
బుల నావృత్తులకు న్యథోచితరసస్ఫూర్తు ల్నిరూపించెదన్,

73


తే.

కైశికి చెలంగు శృంగారకరుణలందు, నారభటి రౌద్రభీభత్సహారిణి యగు
నలరు భారతి హాస్యశాంతాద్భుతముల, నమరు సాత్వతి వీరభయానకముల.

74

కైశికి —

ఉ.

తిన్ననిమేను గన్నుఁగవ తేటలు దేనియ లొల్కుమాటలున్
సన్నపుఁగౌను గుందనపుఁజాయలు దేఱుమెఱుంగుఁజెక్కులుం
గ్రొన్నెలవంటి నెన్నుదురు గుబ్బచనుంగవ తళ్కుఁజూపులున్
జె న్నెసలారఁ గన్య నరసింహునిఁ జూచె విలాసధన్య యై.

75

ఆరభటి —

మహాస్రగ్ధర.

ప్రతిపక్షక్షాపనక్షఃఫలకవిదళనప్రౌఢగాఢప్రతాప
ప్రతిభాసంరంభగుంభప్రబలసుబలశుంభన్నృసింహోగ్రరంహో
యుత మై కల్పాంతదృప్యద్ద్యుమణిధగధగప్రోద్యతజ్వాలజాల
ప్రతికూలప్రక్రమం బై పరఁగు నరసభూపాలదోఃఖడ్గ మాజిన్.

76

భారతి —

సీ.

నీ కీర్తి కెన యని నెగడినసురదంతి, శిరము మధ్యే భిన్నతరము గాదె
నీకీర్తితోఁ బ్రతి నెరసినయిందుమం, డలము పదాఱుఖండములు గాదె
నీకీర్తి నొరసినకాకోదరస్వామి, తల సహస్రచ్ఛిదాకులము గాదె
నీకీర్తిఁ బోలఁ బూనినధవళాంభోజ, తతి శతథా దళితంబు గాదె


తే.

యహహ నీకీర్తి కవనిలో నమరకరియు, గిరియు నిందుండు గిందుండు నురగపతియు
గిరియుఁ దెలిదామరలచాలు గీలు నెనయె, యౌబళేంద్రునినారసింహక్షితీంద్ర.

77

సాత్వతి —

చ.

ఉభయరగండ తావకరణోగ్రజయానకము ల్గుభుల్గుభు
ళ్గుభు లని మ్రోయఁగా భవదకుంఠితవీరభటు ల్ప్రభుత్ప్రభు

ల్ప్రభు లని శత్రుభూపతులపైఁ జొరఁ బాఱ నెడ న్విభుల్విభు
ల్విభు అని సంభ్రమింపుదురు వేడ్కన్ నఖర్వసుపర్వభామినుల్.

78


తే.

ఇంక రీతులు వివరింతు వృత్తు లట్ల, సముచితార్థపదన్యాససౌష్ఠవములు
గాక సందర్భమాత్రసంగతము లైన, కతనరీతులు వృత్తి భిన్న తఁ జెలంగు.

79


తే.

పరఁగురీతులు కోమలప్రౌఢపదవి, ధానవాసన నందు వైదర్భి యనఁగ
గౌడి పాంచాలి యనఁ బొల్చుఁ గ్రమముతోడ, దీనికిని లక్షణంబులు విస్తరింతు.

80


తే.

అతిమృదులబంధయుతయనాయత సమాస, దనరు వైదర్భి రూక్షబంధయును ఖరస
మాసయగు గౌడియు భయాత్మమహిమ గల్గి, యలరు బాంచాలి వీనిలక్ష్యము లొనర్తు.

81

వైదర్భి —

శా

ఆలావణ్య మగణ్య మాగుణగణం బవ్యాజ మాతేజ ము
ద్వేలం బాసినయం బమేయతర మావీర్యం బనిర్వాచ్య మా
యాలాపం బతిసత్య మావితరణం బాశాంతవిశ్రాంత మా
శీలం బార్జవమూల మెన్నఁ దరమే శ్రీ నరసింహేంద్రునిన్ ,

82

గౌడి —

శా.

అంభేరాశిగభీర యోబయనృసింహా నీ రణోదస్తదో
స్స్తంభోత్తంభితజృంభితాసిలతికాసంరంభసంభావనా
దంభానర్గళదుర్గదుర్గమమదోద్యద్దుష్టధృష్టారిగా
ట్ఛుంభచ్చుంభనిశుంభసంభ్రమహరస్ఫూర్తి న్విజృంభించురా.

83

పాంచాలి —

శా.

ఆరూఢిం దప మాచరించెదవు చంద్రా యల్లమందాకినీ
తీరక్షోణితటిన్మహానటజటాదీరాటవీవాటిలోఁ
బ్రారబ్ధం బగుమేనియంకము హరింప న్వేఁడి యిం తేల నీ
కారాధింపఁగ రాదె యోబయునృసింహాధ్యక్షుసత్కీర్తులన్.

84


ఉ.

పాక ముదీరితార్థపరిపాక మనం దగు నందు గోస్తనీ
పాకము నారికేళఫలపాక మనన్ ద్వివిధంబు గోస్తనీ
పాకము సంవృతార్థపరిపాకనివేద్యము నారికేళపా
కాకలనంబు గూడి నిబిడార్థవిచార్యము వీనిలక్ష్యముల్.

85

ద్రాక్షాపాకము —

క.

వాలిక లై నెలిదమ్ముల, పోలిక లై చందమామ పులుఁగులకును దా
మేలిక లైననిరీక్షణ, మాలికల నృసింహుఁ జూచె మదవతి వేడ్కన్.

86

నారికేళపాకము —

మ.

వరభూషాదులపై మనం బిడక దృగ్వ్యాపార మెంతేఁ బరా
పరసందర్భననాతిభిన్న మయి చూపట్టంగఁ గార్యాంతర
స్మరణం బేమియు లేక నిశ్చలత నీ సాంగత్యముం గోరి మా
హరిణీలోచన యాత్మయందు నరసింహా నిన్నె భావించెరా.

87


క.

కదిసి పదంబులు ముందఱి, పదములతోఁ బరమమైత్రి బరఁగి పరపదా
స్పద మన కుండినఁ గృతులం, దదిశ య్యతదీయలక్ష్య మాపాదింతున్.

88


క.

రతిపతివో చెలువున భా, రతిపతివో నుతగుణాభిరామత రామ
క్షితిపతివో ధర నోబ, క్షితిపతినరసింహ శౌర్యజితనరసింహా.

89

కావ్యవిశేషములు

.
తే.

ఇట్లు కావ్యస్వరూపంబు నేర్పరించి, యింకఁ గావ్యవిశేషము ల్పొంకపఱుతు
నటనపటుధూర్జటిజటాగ్రచటులసింధు, ఘుమఘుమారంభగంభీరగుంభనముల.

90


తే.

వ్యంగ్యము ప్రధాన మైనను నప్రధాన, మైన నస్ఫుట మైనఁ గావ్యము త్రిసంఖ్య
నమరు నుత్తమమధ్యమాధమతధ్వనిగు, ణీకృతవ్యంగ్యమును జిత్రమై కడంగి.

91

ధ్వని —

సీ.

తల యెత్తుకొనఁ గల్లెఁ గులమువారలలోనఁ, బదినూఱుశిరములపాఁప ఱేని
కనుపమచ్చాయావిహార మందఁగ గల్గెఁ, జిమ్మచీఁకటి మ్రింగునెమ్మెకాని
కమృతాబ్ధిలో నిద్ర యవధరింపఁగఁ గల్గె, వెలిదమ్మిపొక్కిటివేల్పుసామి
కలమహానటజటావలభి నుండఁగఁ గల్గె, నెలకొన్న చల్లనివెలుఁగువాని


తే.

కవుర భువనాతిశాయివైభవవిభూతిఁ, బూని జగదేకజేగీయమానుఁ డైన
యోబభూపాలునరసింహుఁ డుర్వియందు, నవతరించి శుభస్ఫూర్తి నతిశయిల్ల.

92


తే.

ఇందుఁ దలయెత్తుకొనఁ గల్గె దందశూక, పతికి నన నారసింహభూపాలుఁ డుర్వి
తాల్చె నను వ్యంగ్య మాదియౌ ధ్వనులు దోఁపఁ, దనరు నుత్తమకావ్యమై ధ్వని యనంగ.

93

గుణీకృతవ్యంగ్యము —

క.

కొలు వాస యొసఁగి సురగవి, వెకిలఁబడుఁ గల్పతరువు వేఁడిన మఱి యా
కులపడి పండ్లిగిలించును, నలువుగ నినఁ బోలఁగలవె నరసింహనృపా.

94


క.

నిను బోలఁగలదె సురతరు, వనునెల లే దనెడివ్యంగ్య మరయఁగ వాచ్యం
బు నతిక్రమించి మించమిఁ, దనరు న్ధర నిది గుణీకృతవ్యంగ్యం బై.

95


క.

చిత్రము శబ్దార్థోభయ, చిత్రము లనఁ ద్రివిధగతులఁ జెలగునదియు సం
సూత్రిత మగు ముందఱ నా, చిత్రాలంకారతతులు చెప్పెడిచోటన్.

96

క.

ద్వివిధం బగుధ్వని కృతులం, దవిరళగతి లక్షణాభిధాయోజిత మై
యవివక్షితవాచ్యంబును, వివక్షితాన్యపరవాచ్యవృత్తియు ననఁగన్.

97


క.

చను నత్యంతతిరస్కృత, మన నర్థాంతరసమేత మన ద్వివిధతఁ గై
కొనియ వివక్షితవాచ్యం, బినుమడి యగు వాక్యపదము లెనసిన నదియున్.

98


చ.

ననువుగ దీనిలక్షణ మొనర్తు ధృతిం దిరుఁ డన్న ధృష్టుఁ డ
న్థ్వని యభిభూతవాచ్యముగఁ దత్ప్రథనుంబు చెలంగు యానను
ల్మనమునఁ గ్రొవ్వుమానుఁ డనఁ దద్యవనాళిని ద్రుంచు నీతఁ డ
న్ధ్వని యితరార్థసంక్రమితవాచ్యము గాఁగ ద్వితీయ మిం పగున్.

99


తే.

అరయ మఱియు విపక్షితాన్యపరవాచ్య, మనని లక్ష్యక్రమవ్యంగ్య మన నలక్షి
తక్రమవ్యంగ్య మన ద్వివిధంబు వీని, లక్షణము లేర్పరిం చెద లలితఫణితి.

100


తే.

ఇతఁడు నరసింహుఁ డనునెడ నిదియ వ్యంజ, కం బగుచు ధృష్టుఁ డనెడువ్యంగ్యమును వరుసఁ
దెలుప లక్ష్యక్రమవ్యంగ్య మిల నలక్షి, తక్రమవ్యంగ్య మిట్ల వేద్యక్రమంబు.

101


తే.

అందు లక్ష్యక్రమవ్యంగ్య మమరు శబ్ద, శక్తిమూలం బనఁగ నర్థశక్తిమూల
మన నుభయశక్తిమూలంబు ననఁ ద్రిసంఖ్య, దాల్చు వేర్వేఱ వీనిభేదము లొనర్తు.

102


క.

తనరారు వస్తురూపం, బనఁగ నలంకారరూప మనఁగ ద్వివిధ మై
ఘనవాక్యపదగతత్వం, బున నా ల్గగు శబ్దశక్తిమూలము ధరణిన్.

103


సీ.

సమధికం బగునర్థశక్తిమూలము స్వతః, ప్రతిపన్నమును గవిప్రౌఢవచన
సిద్ధంబు సుకవినిబద్ధోక్తి సిద్ధంబు, ననఁ ద్రిరూపం బగు నవియు వస్తు
కలితవస్తుధ్వని యలవస్తుభవదలం, కృతిమయధ్వని యలంకృతినిరూఢ
వస్తుధ్వని యలంకృతిస్తుతాలంకృతి, ధ్వని యన నాల్గుభేదములు వరుస


తే.

నొక్కొకటి దాల్ప రతిసంఖ్య నొనరునవియుఁ, దనరు ముప్పదియాఱై పదప్రబంధ
వాక్యగతభేదముల నిట్లు వఱలు నుభయ, శక్తిమూలంబు నేక మై జగతియందు.

104


క.

నలువదియొకరూపంబులఁ, బొలు పగు నీరీతి భేదముల కాస్పద మై
యలసంలక్ష్యక్రమమున, నలరెడువ్యంగ్యం బశేష మాపాదింతున్.

105


క.

అసమవిభావాదులచే, రసధ్వని జనించువేళఁ గ్రమ మొదవమిఁ బెం
పొసఁగు నలక్ష్యక్రమ మై, యెసఁగినవ్యంగ్యంబు దీని కిల భేదంబుల్.

106

క.

పదవాక్యవర్ణరచనా, పదైకదేశములఁ గృతులఁ బరఁగుచు నౌరా
యిది గూడ నలువదే డగుఁ, బదిలముగ వివక్షితాస్యపరవాచ్య మిలన్.

107


క.

మును పవివక్షతవాచ్యం, బునఁ గలిగిన నాల్గుభేదములు నివి గూడం
దనరుఁ గృతి జీవశుద్ధ, ధ్వని యేకశతార్థభేదవంతం బగుచున్.

108


క.

ప్రకృతంబు లైనయీధ్వను, లొకటొకటిం గూడ నేఁబదొకభేదములం
బ్రకటిత మగుఁ బ్రాగ్భేదం, బకట ద్వితీయంబు నేఁబ దగు నీరీతిన్.

109


క.

కృతి నన్నియు నేకైకో, న్నతసముచితసంఖ్య గైకొనఁగ మిశ్రంబుల్
క్షితి షడ్వింశత్యుత్తర, శతత్రయాన్వితసహస్రసంఖ్యఁ జెలంగున్.

110


తే.

త్రివిధ మగుసంకరమున సంసృష్టిచేత, నొకటొకటి నాలుగై యివి యొప్పు మీఱు
నవనిఁ జతురుత్తరశతత్రయాభిరామ, పంచదశశతభేదప్రపంచగరిమ.

111


క.

ఎన్నిక వీనిని లక్ష్యము, లన్నిటికి నొనర్పఁజాల యగు ననుభీతిన్
గొన్నిటి కొనర్తు వినుఁడు ప్ర, సన్నలసన్నవనవచోవిచారధురీణుల్.

112

అత్యంతతిరస్కృతావివక్షితవాచ్యధ్వని —

క.

ఖరఖురకుట్టనఘట్టిత, ధరణిరజస్స్థగితసదృశతామదవిచల
త్ఖరకరతురగోత్కర మై, కర మమరు నృసింహధాటికాహయ మనినన్.

113


క.

ఖరఖురకుట్టనఘట్టిత, ధరణిరజస్స్థగితసదృశతామదవిచల
త్ఖరకరతురగం బనునెడఁ, దిరస్కృతస్వార్థ మగు నది బహువ్రీహిన్.

114

అర్థాంతరసంక్రమితావివక్షితవాచ్యధ్వని —

ఉ.

ఇంద్రసుతుం జయించి నరసేంద్రుఁ డొకమ్మున మత్స్యయంత్రమున్
సాంద్రనిరూఢి నేసె నని సంతతము న్విని తత్తఱించి మ
త్స్యేంద్రుఁడు యోగముద్ర ధరియించి చరింపఁ దొడంగె నౌర ని
స్తంద్రజవంబున న్విపినశైలగుహాగహనాంతరఁబులన్.

115


తే.

నరసభూభర్త మత్స్యయంత్రంబు నేయ, నలుకు మత్స్యేంద్రుఁ డనునెడ నాత్మ మత్స్య
శబ్దసామ్యంబుచేఁ గల్గుదొలకఁ దనరు, వ్యంగ్య మర్థాంతరసమేతవాచ్య మగుచు.

116

శబ్దశక్తిమూలాలంకారధ్వని —

క.

ఈకోమలి పద్మిని యఁట, యేకాలముఁ బ్రోచు నినుఁడ వీ వఁట సతదా
నీకరసంస్పర్శసహన, గాక చెలంగునె నృసింహఘనబలసింహా.

117


తే.

ఇందుఁ బ్రకృతంబు లగువధూనృపతవాచ, కంబు లల పద్మినీనశబ్దంబు లెలమిఁ
గమలినీభాస్కరులఁ దెల్పఁగలుగు నుపమ, వ్యంగ్యముగ నీయలంకృతిధ్వని చెలంగు.

118

శబ్దశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —

క.

ఆపన్నులార చెప్పెద, మీపాలిటికిని హితంబు మెఱయు నృసింహ
శ్రీపాదకమలసేవా, వ్యాపారము మఱవ కుండుఁ డాత్మలలోనన్.

119


తే.

ఇచ్చట నృసింహపదసేవ నెనయుఁ డనెడు, శబ్దశక్తిని ప్రకృతుఁ డౌజనవరేంద్రుఁ
గొలువుఁ డతఁ డాపదలు మాన్చుఁ గొలుచువారి, కనెడువస్తువు వ్యంగ్య మై యతిశయిల్లు.

120

స్వతస్సిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —

ఉ.

చల్లనివాఁడు మానెలవు చందురుమామ కడంగి వేఁడుముల్
చల్లనివాఁడు మాయచటిచందనశైలసమీరుఁ డంచుఁ ద
ద్భిల్లవధూమతల్లికల, బేర్కొని పల్కు నృసింహమేదినీ
వల్లభ నీవిరోధి నృపవల్లభ దుర్లభశైలవాసి యై.

121


ఉ.

చల్లనివాఁడు మానెలవు చందురుమామ యటన్నఁ దద్విష
ద్వల్లభమౌగ్ధ్యవైభవము వ్యంగ్యము తద్ధ్వనిచేత నాయకా
యల్లకమగ్న యౌ ననుట వ్యంగ్యము తద్ధ్వనిచేత వ్యంగ్యమౌ
నెల్లవిరోధిరాజుల జయించె విభుం డనువస్తు వెంతయున్.

122

వస్తుకృతాలంకారధ్వని —

మ.

సలిలచ్ఛాయఁ గుఱించి యంత్రకృతమత్స్యం బీనృసింహక్షమా
తలనాథాగ్రణి యేసె నంచు విని సద్వంశాధిపుం బట్టినన్
సలిలచ్ఛాయఁ గుణించి యేయు నని యంచద్భీతిమార్తాండునిన్
బలిమిం బట్టఁడు వేగ రాహు విధునిం బైకొన్నచందంబునన్.

123


తే.

యంత్రమీనంబు దునుమాడినట్ల దునుము, ననియ కాఁబోలు రాహువర్కు ని గ్రహింపఁ
డనెడునుత్ప్రేక్ష వాచకం బెనయ లేమి, వ్యంగ్య మగు నిట్టివాక్యార్థవైభవమున.

124

అలంకారకృతవస్తుధ్వని —

ఉ.

భూరిభుజాప్రతాపగుణభూషణ యోబయనారసింహ నీ
చారుయశోవధూమణికి సారసవైరిముఖంబు తారక
ల్సారనఖాంకురంబు లల శంకరశైలహిమాద్రు లాత్మ వ
క్షోరుహము ల్సితాబ్జములు సొ పగు లోచనపంకజాతముల్.

125


తే.

తనరు సత్కీర్తికాంతకుఁ దారకాదు, లరయ నంగంబు లై వేడ్కఁ బరిణమింపఁ
గలుగుపరిణామమునఁ ద్రిలోకములు నిందు, నరసవిభుకీర్తి వ్యంగ్య మనం జెలంగు.

126

అలంకరకృతాలంకారధ్వని —

చ.

అరిపురభంజనోజ్జ్వలబలాధిక శ్రీనరసింహరాజశే
ఖర భవదీయకీర్తిరుచి గంగ యనంగఁ జెలంగుఁ బొంగుచున్

హరిపదసంగసంకలిత యై భువనత్రయపూర్ణ యై నిరం
తరతరహంసజాంశుసముదాయసమన్విత యై వసుంధరన్.

127


తే.

రాజశేఖర భవదీయరమ్యకీర్తి, యొనరు నల గంగవలె ననునుపమచేతఁ
బరఁగుచు నృసింహ నీవు శంకరునికరణి, ననుపమవ్యంగ్య మౌ నిందు నరసి చూడ.

128

కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —

సీ.

ఒంటిగా మడికాసు గుంటిపైఁ గూర్చుండి, సంజకెంజాయపెన్జడలు దాల్చి
సొరిది నేకాలంబు సురనదీస్నాతుఁ డై, నిద్దంపుబూది మైనిండ నలఁది
యచ్చుగాఁ బులితోలుకచ్చడంబు ఘటించి, యొడలఁ బాములు వ్రాఁక నోర్పు గలిగి
హాలాహలానలాభీలధూమము గ్రోలి, యఱచేత హవ్యవాహనము బూని


తే.

నీయశోలక్ష్మిఁ బోలు పూనికలఁ దపము, నేడు నొనరించుచున్నాఁడు నీలగళుఁడు
కానియెడ నేల యతని కీగతిఁ జెలంగ, సరసగుణహార యోబయనరసధీర.

129


క.

నరసవిభుకీ క్ర్తిఁ బోలఁగ, హరుఁడు దపము సేయుచుండు ననువస్తువుచే
సరిగా దాతనికీర్తికి, హరుఁడును ననువస్తు వలరు వ్యంగ్యంబగుచున్.

130

కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతాలంకారధ్వని —

క.

 మేలిమి నృసింహధరణీ, పాలు ప్రతాపాగ్ని దిశలఁ బ్రబలినఁ గీలా
భీలదవానల మడవుల, పా లయ్యె న్జలధిఁ బడియె బడబానలమున్.

131


క.

జనపతి ప్రతాప మమరఁగ, వనవాటికి నరిగె దానవహ్ని
యనెడిచో
మనమునఁ గలఁగియునుం బలె, ననియెడు నుత్ప్రేక్ష వ్యంగ్య మగువస్తువుచేన్.

132


ఉ.

అంచితవిక్రమంబున మహాసమరవ్రతదీక్షచేనొ పో
షించిన కారణంబుననొ శ్రీనరసింహుకృపాణ మాజులం
బొంచి మదించి మించు నరిభూభృదకుంఠితకంఠపీఠముల్
ద్రుంచియు వాఁత నంట దలదుఃక్షితిపక్షతజప్రవాహముల్.

133


క.

అలఘుగతిని బోషించియు, బలె నంట దురుక్త మతనిపటుఖడ్గ మనం
గలిగినయుత్ప్రేక్షవలన, నలఖండన వేగవస్తు వలరున్ ధ్వని యై.

134

కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతాలంకారధ్వని —

శా.

ఆమోదంబున శ్రీనృసింహవిభు దానాంభోనదు ల్సాగర
స్వామిం జెంద యశంబు మేఘములఁ బర్వం గల్గువర్షాశర
త్సామానాధికరణ్యశంక నచట న్దామోదరుం డొందు ని
ద్రాముద్రానుగతప్రబోధములఁ జిత్రం బేకకాలంబునన్.

135

తే.

హరికి వర్షాశరద్భ్రాంతి యడరుననెడి, భ్రాంతి మదలంక్రియారూఢిఁ బ్రబలునిద్ర
దెలివినున్నట్లు యోగనిద్రలు వసహించు, ననెడియుద్ప్రేక్ష వ్యంగ్య మై యతిశయిల్లు.

136

కవినిబద్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని —

మ.

అనురాగాంబుధి యుబ్బి వెల్వడినయ ట్టాపూర్ణఘర్మాం బువుల్
దనువల్లిం దిగజాఱఁ గన్నుఁగవ లేదళ్కు ల్పిసాళించుచున్
ననవిల్కానిపురప్రవేశకలనానాళీకదామంబు లై
తనరం గోమలి నిన్నుఁ జూచె నరసేంద్రా సాంద్రతేజోనిధీ.

137


క.

ఈవాక్యార్థముచేతను, భూవల్లభ నిన్నుఁ గోరి పొలఁతి విరహతా
పావృత్తి నున్న దిపు డను, నావస్తువు వ్యంగ్య మగుచు నతిశయ మొందున్.

138

కవినిబద్ధవక్తృప్ఢోక్తిసిద్ధార్థశక్తిమూలవస్తుకృతాలంకారధ్వని —

చ.

సురగిరిచుట్టునుం బవరిచుట్టెద వేల దినేరరత్న సం
భరితము దేవతాధనముఁ బాయక కాచెద నంచు నేఁటికిన్
సురతరులం గరాంగుళులఁ జొప్పడఁ దాల్చి యశోభ్రగంగచేఁ
బరఁగి నృసింహుఁ డే సుకవిపంక్తులఁ బోవ నిదేల యేరికిన్.

139


క.

తనరెడు నీవాక్యార్థం, బున శ్రీనరసింహుఁ డఖిలమును బ్రోవఁగ నా
యనిమిషగిరివలెఁ దగు నను , ననుపమ మగునుపమ వ్యంగ్యమై పొగ డొందున్.

140

కవినిబధ్ధవక్తృప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతవస్తుధ్వని —

చ.

ధరణి ననంతకీర్తియుఁ బ్రతాపముఁ గల్గినరాజ వౌట నిన్
దరణి మనోరవిందమునఁ దాల్చినచుట్టఱికంబుపేర్మినో
కరివరయానకు న్విశదకాంతియుఁ గాకయు నై కడంగి బి
త్తర మగుమేనఁ గీర్తియుఁ బ్రతాపము నిల్చె నృసింహభూవరా.

141


తే.

నెఱయు కీర్తిప్రతాపాఢ్యు నిన్నుఁ దలఁప, యశము శౌర్యంబు గలిగిన ట్లలరు వెలరు
గాకయును ననునుత్ప్రేక్షఁ గాంత నేలు , విరహమున కోర్వ దను వ్యంగ్యవిభవ మలరు.

142

కవినిబద్ధవక్తృప్రొఢోక్తిసిద్ధార్థశక్తిమూలాలంకారకృతాలంకారధ్వని —

చ.

చెలువ యదేమి యామగువ చిత్రమునందు నృసింహభూవరుం
గలయ లిఖించువేళఁ బులకంబులు గ్రొంజెమరుం దలిర్పఁగా
నొలవు వడంకుచున్నది సముజ్జ్వల మైననృపాలరూపమున్
వలపులు రేఁచు చున్నరతివల్లభురూపనిభీతిఁ జెందెనో.

143


క.

వరుని లిఖంచుచు వడఁకెడి, సరోజశరుఁ డనియె యనెడి సందేహమున
న్నరసింహుఁడు మరుకైవడిఁ, బరఁగు ననెడియుపమ వ్యంగ్యభాసము నొందున్.

144

క.

ఈవరుసఁ బ్రబంధాదిక, తావేలధ్వనులు బుద్ధి ననుమేయము లౌ
నావల రసధ్వనులు రస, భావప్రకరణములం బ్రపంచితము లగున్.

145


తే.

ఇచట మధ్యమకావ్య మై రుచిర మగుగు, ణీకృతవ్యంగ్యవిభవంబు నిశ్చయింతు
నిదియు నెనిమిదిభేదంబు లెనయు వీని, భవ్యనామంబు లెఱిఁగింతుఁ బ్రక్రమమున.

146


క.

అమరు నగూఢము నపరాం, గము వాచ్యాంగంబు నప్రకాశము సంది
గ్ధము నల తుల్యప్రాధా, న్యముగా క్వాక్షిప్త మరుచిరాఖ్యము ననఁగన్.

147


క.

వనితాకుచకుంభము గతి, ధ్వని గూఢం బైనఁ గాని వైదగ్ధ్యము లే
మినిఁ దగుమధ్యమకావ్యం, బెనిమిదివగలకు నొనర్తు నిల లక్ష్యంబుల్.

148

అగూఢము —

క.

పరిపతితకవాటము లై, పరిపాటితకనకకూటపటవాటము లై
యరినికరపురప్రకరము, లరుదుగ నరసింహుశౌర్య మంతయుఁ దెలుపున్.

149


క.

పరిపతితకవాటము లై, యరిపురములు దెలుపు శౌర్య మంతయు ననుచో
నరివరులఁ గెలిచె విభుఁ డని, పరఁగెడివ్యంగ్యంబ గూఢభావము చెందున్.

150

అపరాంగము —

క.

మెడ గ్రుచ్చి కౌఁగిలించును, వొడ లెల్లం బారవశ్య మొందించు నరిన్
పడి మోహనిద్ర పుచ్చును, బుడమి నృసింహేంద్రుఖడ్గపుత్రిక యౌరా.

151


క.

రంగుగ నీయెడ ధ్వని యగు, శృంగారము రౌద్రరసవిశేషమునకుఁ దా
సంగం బై విలసిల్లుచు, సంగతి నపరాంగ మనఁగ సన్నుతి కెక్కన్.

152

వాచ్యసిద్ధ్యంగము —

క.

ధారుణి శ్రీనరసింహుని, నీరంధ్రధనుర్వినీలనీరద మమరున్
దారుణతరశరధారా, వారితరిపుశౌర్యసూర్యవైభవ మగుచున్.

153


క.

శరధార యనఁగ ధ్వని యై, పరిణత మగుసలిలధార పార్థివునిధను
శ్శరద మనువాచ్యమున కు, ర్వరలో నంగంబు గాఁగ వాచ్యాంగ మగున్.

154

అస్ఫుటము —

క.

శ్రీనరసింహునిభుజస, న్మానితకౌక్షేయకంబు మహిమండలిలో
నానారిపుభూనాథవి, తానార్జితకీర్తిదుగ్ధధారలు గ్రోలున్.

155


క.

అరికీర్తిదుగ్ధ మానును, ధరణీశ్వరుఖడ్గ మనుడు దర్వీకరశే
ఖరముగతిఁ బొల్చు ననియెడి, సరసోపమకృతులయందుఁ జను నస్ఫుట మై.

156

సందిగ్ధము —

క.

నరసింహు నభంగురసం, గరమున నిదురించురిపులు గడు ముందరగా
నరుగుదు రాయితపడుదురు, శరములు విడుతురు సమగ్రసంభ్రమపరు లై.

157

క.

అరివరు లాయితపడుదురు, శిరజాలము వీడుతు రనిన సమరంబున గో
గిరిగుహల కరుగనో యన, సరి వ్యంగ్యము లలరుచుండు సందిగ్ధము లై.

158

తుల్యప్రాధాన్యము —

క.

నరసింహేంద్రునిచరణం, బగుణంబుగ సంఘటింపుఁ డరులార భవ
ద్వరమకుటస్ఫురణంబుల, నరుణం బగునతనినయన మటు గాకున్నన్.

159


క.

నరసింహేంద్రునకు నమ, స్కరణం బొనరింపకున్నఁ గాంతారంబే
శరణం బగు ననువ్యంగ్యము, నిర వగువాచ్యంబు సమము లిచ్చటఁ దలఁపన్.

160

కాక్వాక్షిప్తము —

క.

ఒసఁగునెడఁ గసరు గర్జిలు, నొసఁగి యొసంగి వెల్లఁబాఱు నొగి నీకరణిన్
విసువక యొసఁగఁగ నేర్చునె, యసదృశగతి నీలాంబువాహ మౌబళనరసా.

161


క.

ఒసఁగునెడఁ గసరు గర్జిలు, నెసఁగఁగ నీలాంబువాహ మిల నీవలెఁ దా
నొసఁగఁగ నేర్చునె యనవుడు, నొసఁగఁగ లే దనెడివ్యంగ్య మొగిఁ గాకువగున్.

162

అరుచిరము —

మ.

బలితం బైనమనోజబాణహతిచేఁ బల్మాఱు నిల్పోపలే
కలినీలాలక ప్రాణము ల్వెడలి నేత్రాంభోజమార్గంబునం
గలయం బ్రాఁకుచు వచ్చి యన్నెలవునం గన్నీటియే ఱడ్డ మై
నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగఁ బా డింతటన్.

163


క.

ఏణాక్షి రాకయున్నను, బ్రాణంబులు విడుచు ననెడివ్యంగ్యంబునకున్
క్షోణి న్వాచ్యముకన్నఁ బ్ర, వీణత్వము లేమిఁ దనరు వెస నరుచిర మై.

164


తే.

ఇంకఁ గావ్యప్రభేదంబు లేర్పరింతు, వరుస నష్టాదశవిశిష్టవర్ణనములు
గలుగవలయు మహాకావ్యతిలకమునకు, నెలమిఁ దన్నామధేయంబు లెట్టి వనిన.

165


క.

పురసింధునగర్త్వినశశి, సరసీవనమధురతిప్రసంగవిహరముల్
పరిణయతనయోదయనయ, విరచనయాత్రాజిదౌత్యవిభువర్ణనముల్.

166


తే.

ఇందు నొకకొన్నకడమైన నెంచిచూడ, నదియు నవని మహాకావ్య మనఁగఁ బరఁగు
మతియు క్షుద్రప్రబంధనిర్మాణమర్మ, లక్షణము లేర్పరించెద లలితఫణితి.

167

క్షుద్రప్రబంధము —

క.

కలికోత్కలికలు పద్యము , లలరారు విభక్తులుం దదాభాసయుతో
త్కలికలు సజయతిపద మౌ, నల మాలిని మొదలఁ దగ నుదాహరణ మగున్.

168


క.

అందు విభక్త్యాభాసము, లందుఁ జతుర్థికిని దెనుఁ గుదాహరణము పెం
పొందం గలితోత్కలికల, సందీప్తవిభక్తితాలసంప్రాసం బై.

169

క.

ముక్తపదగ్రస్తం బై, సక్తాదిమపద్య మైనసంబోధన మై
ప్రోక్త మగుఁ జక్రవాళము, ముక్తమహాధీరశబ్దమోహన మగుచున్.

170


క.

ఆచక్రవాళలక్షణ, సూచిత మై బిరుదభరితశుభవాఙ్మయ మై
యాచక్రవాళవిపుల, క్ష్మాచక్రమునందు బిరుద గద్యము వొల్చున్.

171


క.

తరుణీమణిశృంగారము, విరహము మధుమదనగర్వవిభవంబు సరో
వరవనఖేలనములు గల, దరయ న్మంజరి యనంగ నభినుతి కెక్కున్.

172


క.

తారక లిరువదియేడును, నారయు నొక్కొక్కపద్యమందుఁ జెలంగం
గూరిచినపద్యమాలిక, తారావళి యనఁగ నభినుతం బై పొల్చున్.

173


మ.

ఫణిశుంభద్భుజసారసారసముఖీపంచాయుధాకారకా
రణసంతత్యవతారతారగిరిధైర్యస్థేమదుర్వారవా
రణసమ్రాడ్బలభారభారవికవిప్రౌఢోక్తిసంచారచా
రణసంస్తుత్యవిహారహారహరవిభ్రాజద్యశోవైభవా.

174

ఓష్ఠ్యము —

క.

భూమీసుమనోమరద్రుమ, వామాప్రద్యుమ్నభానువంశోద్భవపౌ
లోమీవిభుశుభవైభవ, భీమోపమభీమభీమపృథుదోర్వీభవా.

175


పంచచామరము.

ఘనాఘనాఘనాశదాధికప్రగానరంజనా,
జనావనాదినాగతల్పసత్కవిప్రసాధనా,
ధనాధినాథనందనాబ్జదర్పకాంగవాసనా,
సనాతనాధునాతనాతిశౌర్యధుర్యలంఘనా.

176


గద్యము.

ఇది శ్రీ హనుమత్ప్రసాదలబ్ధకవితాసారసారస్వతాలంకారనిరంకుశప్రతిభా
బంధుర ప్రబంధపఠనరచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణ
సుపుత్త్ర తిమ్మరాజపౌత్త్ర సకలభాషావిశేషనిరుపమావధానశారదామూర్తి
మూర్తిప్రణీతం బైనకావ్యాలంకారసంగ్రహం బనుమహాప్రబంధంబునందు
సర్వరససాధారణనాయకవర్ణనంబును శృంగారనాయికాఖ్యానంబును రీతి
వృత్తిప్రశంసయుఁ బాకశయ్యాప్రపంచనంబును గావ్యభేదప్రకరణంబును
మహాకావ్యప్రకటనంబు క్షుద్రప్రబంధమార్గదర్శనంబు నన్నది ద్వితీయా
శ్వాసము.