నన్ను గని యేరు జాలి జెందంగ వలదు
Jump to navigation
Jump to search
నన్ను గని యేరు జాలి జెందంగ వలదు -
ఎవ్వ రని యెంతురో నన్ను? - ఏ ననంత
శోకభీకర తిమిరలో కైకపతిని!
కంటకకిరీట ధారినై, కాళరాత్రి
మధ్యవేళల, జీమూతమందిరంపు
కొలువుకూటాల, నేకాంతగోష్ఠి దీర్చి,
దారుణ దివాంధ రోదనధ్వనుల శ్రుతుల
పొంగి యుప్పొంగి యుప్పొంగి పొరలి పోవు
నా విలాప నిబిడ గీతి కావళీ వి
రావముల నర్ధరాత్ర గర్భమ్ము, మరియు
మరియు భీషణ కాళి మోన్నత్త గాగ
చేయు తరి, నన్ను మీరు వీక్షింప లేదొ!
నన్ను గని యేరు జాలి జెందంగ వలదు -
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు,
నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు,
నా కమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దు॰ఖంపు నిధులు కలవు -
ఎవ్వ రని యెంతురో నన్ను? -