Jump to content

ద్విపద భారతము - మొదటిసంపుటము/సభాపర్వము - ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము


శ్రీసమంచితనేత్ర, శృంగారగాత్ర,
కోసలావనినాథ, గుణశోభి, రామ,
ఘనసార కస్తూరికా గంధసార
ఘనసారవక్ష, రాఘవ, చిత్తగింపు.
అవిరళయశుఁడైన యక్కథకుండు
శౌనకాదులకును సన్మునీంద్రులకు
మానితంబైనట్టి మహనీయచరిత
మానందమునఁజెప్పె; నటధర్మసుతుని
కడ శౌరిసహితుఁడై కడఁకతోనున్న
జడధిగాంభీర్యుండు శక్రసూనునకు
మయుఁడు వేడుకమ్రొక్కి మఱి భక్తిఁబలికె :
"నియమింప నభయంబు నిన్ను వేఁడినను
గాచితి నన్ను బ్రఖ్యాతంబుగాను;
వైచిత్రిఁ బ్రాణంబు వడి నెత్తినట్టి
యుపకారపరుఁడవై యుండిననీకు
నుపకార మొనరింప నోపనేరుతునె!
యైనను నానేర్చినట్ల నీకిపుడు
కానుపింపఁగ నుపకార మొనర్తు.
ధర్మాత్మ, వినుము నే దానవవిశ్వ
కర్మను; శిల్పమార్గమున నేర్పరిని;
నీవుగోరినయవి నిర్మింపనేర్తు;
భావించి పనిగొను భక్తితో." ననిన
నరుఁ డచ్యుతునివదనంబు వీక్షించి
పరమానురాగుఁడై పలికె నేర్పునను :


“ఇతని నపూర్వంబు నెయ్యదియైన
 నతిరూఢి నిర్మింప నానతియిండు.”
 అనినఁ బెద్దయుఁబ్రొద్దు నాత్మఁజింతించి
 వనజాతనేత్రుండు వారిజోదరుఁడు
 మయునకుఁబలికె సమ్మదచిత్తమునను :
 "గ్రియతోడఁ గురుపతికిని యుధిష్ఠిరున
 కధిపసంసేవ్యమై యమరినయట్టి
 పృథుసభ నిర్మించి పెంపుతోఁ దెమ్ము
 మహిమగా." ననవుడు మయుఁడిట్టులనియె:

మయసభానిర్మాణము


 "మహిలోనఁగల రాజమణులలోపలను
 బెద్దయై హరిజంభభేది లక్ష్ములకు
 నెందైన నధికుఁడై యీధర్మసుతుఁడు
 మించెఁగావున, సభ మిక్కిలి యేను
 గాంచన నవరత్న ఖచితమై యొప్ప
 నిర్మించితెచ్చెద నిఖిలంబునెఱుఁగ
 మర్మంబులైన విమానవైఖరుల.
 వృషపర్వుఁడను దైత్యవిభునకుఁ దొల్లి
 సుషమాభిరామమై శోభిల్లుసభను
 నిర్మింపసమకట్టి, నిఖిలరత్నములు
 భర్మంబు సమకూర్చి బహువిచిత్రములు,
 బిందు[1]సరంబను బిసరుహాకరము
 నందు దాఁచినవాఁడ; నన్నియు వేగఁ
 దెచ్చెద." ననుచు యుధిష్ఠిరుచేత
 నచ్చుగా సత్కృతుండై మయుండేఁగె.


నారాయణుండు పాండవుల వీడ్కొనుచు
ద్వారావతికినేఁగెఁ దత్ క్షణంబునను.
మయుఁడు పూర్వోత్తరమార్గంబులందు
రయముననేఁగి తారానగాగ్రమున
కుత్తరదిశను నత్యుత్తమంబైన
సత్తగు మైనాకశైలంబునందుఁ
గనకశృంగము గాంచి ఘనతనిట్లనియె:
“మనసిజారాతి సమస్తలక్ష్ములను
సచరాచరంబైన జగములనెల్లఁ
బ్రచురంబుగా సృజింపఁగఁబూనె నొక్కొ!
గంగ ప్రత్యక్షంబుగాఁబూని మున్ను
[2]ఆంగికుండైన మహాభగీరథుఁడు
తపమిందుఁజేసెనో తర్కించిచూడఁ !
ద్రిపురహరధ్యాన ధీమంతులైన
నరునకు శ్రీకృష్ణునకు నివాసంబు
కరమర్థినయ్యెనో గౌరవంబునను ;
సుర యక్ష సన్ముని స్తోమంబు క్రతువు
లరుదారఁజేయు నయ్యావాసమొక్కొ !"
యని చిత్రములుగల్గి యమితయూపములఁ
బెను [3]పొందుచున్నట్టి బిందుసరమునఁ
గమనీయ రత్నోపకరణచయంబు
క్రమమొప్పఁ గైకొని, ఘనవిప్రతతుల
నారాధనముచేసి, యతినిశ్చయమునఁ
జారుతరంబైన సభ సృజియింప
నవకమైనట్టి రత్నపుదూలములను
వివిధమణిస్తంభ [4]విసరణంబులను


నీలపుగోడల నిగుడుకోటలను
బ్రాలేయ కిరణ విస్ఫారవేదికల
మహిత విచిత్ర కోమల సౌధములను
మహనీయ దేదీప్యమానంబుగాను
నిర్మింప, సభయును నిఖిలరత్నముల
నిర్మలంబై యొప్పె ; నెఱయ నొక్కెడను
హరినీలకిరణ జలాంతరంబంగు
నరుణరత్నములు తోయజములై తోప,
రాజిత సితనవరాజీవ తతులు
రాజహంసంబులై రమణదీపింపఁ,
గమనీయ సౌవర్ణ కలశములనెడి
యమితకూర్మంబుల, నద్భుతంబైన
వైడూర్యములను బావనకుముదముల,
నీడెన్నఁగారాని హీరాంకురముల
మీనసంఘంబుల, మేటిముత్యముల
ఫేనపుంజంబులఁ, బెంపుగాన్పించు
మరకతమణులనుమహితశైవాల
భరమునఁ గనుపట్టెఁబద్మాకరంబు.
చెలువుమైఁ బటికంపుశిలలవిద్యుతులు
గలకుట్టిమంబులు కాంతులమించి
నయమొప్ప నదులుగా నలరుఠావులను,
బయలెల్ల జలము [5]లన్‌భ్రమపుట్టఁజేయు
కమనీయ మణివిటంక ప్రదేశముల,
సముచిత దశశత స్వచ్ఛహస్తముల
వెడలుపు నిడువుల విస్తారమగుచు
నొడికమై చిత్రమై యొప్పు తత్సభను


బదునాల్గునెలలు నిర్భరవృత్తితోడ
ముదముననిర్మించి, ముఖ్యదానవుల
నెనిమిదివేల నహీనసత్వులను
మునుమిడిపన్నించి మోయించుకొనుచుఁ
దెచ్చి ధర్మజునకుఁ దేజంబుతోడ
నిచ్చి, భీమునకును నెన్నికయైన
గదయుఁ బార్థునకు శంఖంబును నొసగి,
సదమలయశుఁడైన శమనజుచేత
నర్మిలి సత్కృతుండై మయుండరిగె.
ధర్మతనూజుండు ధర్మమార్గమున
ధర్మజ్ఞు లౌనన ధరణీసురులకు
నిర్మలమతులకు నీతిమంతులకుఁ
బదివేవురకు భక్తిఁ బాయసాన్నంబు
విదితవేదోక్తులు వెలయఁ బెట్టించి,
మణిముద్రికల వస్త్రమాల్యగంధముల
గణనకెక్కఁగ నలంకారులఁజేసి, (?)
వేయేసిగోవుల వేదవిప్రులకుఁ
బాయక భక్తితోఁ బ్రఖ్యాతినిచ్చి,
లాలితంబగు శుభలగ్నంబునందుఁ
ద్రైలోక్యగురుఁడైన ధౌమ్యభూసురుని
పుణ్యాహవాచనపూర్వకంబుగను
గణ్యమనస్కుఁడై ఘనతఁ దత్సభను
ఉనికియై యుండె నత్యున్నతశ్రీల.
మనుజేశ్వరుఁడు నంత మహితసత్కృపను
భూదేవతాకోటిఁ బూజించి, సర్వ
వేదశాస్త్రంబులు వినుచు, సంసిద్ధి
నమితదానంబులు నాచరింపుచును,
గ్రమముతో నర్థిసంఘములఁ బ్రోచుచును,


దిక్కులయందు సత్కీర్తి నిల్పుచును,
మక్కువ బంధుసమాజంబునెల్ల
గారవింపుచు, సత్యగౌరవంబులను
బేరంది, భూతిచేఁ బృథివియేలుచును
ఆదిరాజచరిత్రుఁడై యుండునంత,
నాదరచిత్తులై యైశ్వర్యమహిమ
పక్షంబుతోఁ బూర్వపశ్చిమశైల
దక్షిణోత్తర ధరాధరమధ్య విశ్వ
ధారుణీంద్రులు, భద్రదంతావళములుఁ
జారు ఘోటకములు సౌవర్ణములును
నవరత్నములును నానావస్త్రములును
యువతుల మృగమదవ్యూహగంధములు
నాందోళికలును ముక్తాతపత్త్రములు
సందీపితధ్వజ సముదయంబులును
దివ్యభూషణములు దివ్యాయుధములు
దివ్యరథంబులుఁ దెఱఁగొప్పఁదెచ్చి
యిచ్చి సాష్టాంగంబులెఱఁగి సేవింతు
రిచ్చలో సొంపున నెల్ల కాలంబు
ధర్మజు నమితప్రతాపసంపన్ను
నిర్మలచరితుని నీతిమానసుని.
ఆధర్మసుతుఁడును నఖిలరాజులను
ఆదరింపుచునుండు నవసరంబునను,
కలశజ కపిల మార్కండేయ కుత్స
జలజాతభవసమ శాండిల్య వత్స
శౌనక శుక పరాశర కణ్వ గాధి
సూను గౌతమ గార్గ్య సోమ మాండవ్య
మునిశేఖరులు వచ్చి మును ధర్మసుతుని
ఘనసభాస్థలి వివేకమున భూషింప,


నామహామునులను నర్ఘ్యపాద్యములఁ
బ్రేమతోఁ బూజించి పెంపగ్గలించి
వారిచేఁ గథలెల్ల వలనొప్ప వినుచు
ధారుణీనాథుండు తమ్ములుఁ దాను
సుఖమున్న యెడల, నస్తోకవైఖరుల
నఖిలగుణోపేతుఁడగు నారదుండు
వచ్చిన, నెదు రేఁగి వడిఁదెచ్చి పూజ
లిచ్చి యాసనమున నెంతయు నునుప,
వారలఁ గుశలంబు వరుసతోనడిగి
నారదుఁ డాధర్మనందనుకనియె:

నారదుఁడు ధర్మరాజుని పరిపాలనావిషయములడుగుట

"మీవంశనృపతుల మెలకువయందుఁ
బావనమతిఁ జరింపంగనేఱుతువె!
ధర్మంబుదప్పక దయ చాలఁగలిగి
ధర్మకోవిదులను దయఁబ్రోతువయ్య?
మహినిఁ గామ క్రోధ మదలోభములును
సహజ మత్సర మోహ సన్నాహములును
బొరయవుగద! నీతి బుద్ధినూహింతె?
పరరాజ భేదనోపాయంబుఁ దలఁతె?
యపరరాత్రంబులయందుఁ జింతింతె
యుపమచేయఁగరాని యుచితకృత్యములు?
పృథుకీర్తులైన మీపెద్దలసాటి
బుధుల మంత్రుల విప్రపుంజంబుఁ బ్రోతె?
నిజమంత్రములు ధారుణీనాథులకును
విజయమూలంబులు; వివరింప నీవు
రక్షింపుదువె సుస్థిరంబుగా వాని
నీక్షితి జనులెల్ల నెఱుఁగకుండఁగను;


భావింప మఱియు నీపౌరోహితుండు
భావజ్ఞుఁడే యెన్ని భంగులయందు?
జననుత, నీయజ్ఞసంఘంబులందు
ననఘ, యేమఱకుండునయ్య యాజ్ఞికుఁడు?
రణధురీణుల వితరణ గుణాకరుల
గణనకునెక్కిన ఘనయశోధనుల
మానుగా నీవు నమ్మఁగఁజాలువారి
సేనాధిపతులుగాఁ జేసితివయ్య?
పలుప్రధానులఁగూడి బలవంతులయ్యు
నిలఁ బక్షపాతులై యిలనాథసుతులు
ధనగర్వములను మదంబొందకుండ
ననిశంబు మెలపుదువయ్య నెయ్యమున?
వేద శాస్త్ర పురాణ విద్యలయందు
భూదేవులొనరిరె పూనినకడను?
రోగంబులెల్లను రూఢిగా మాన్పు
నాగమవేదులు నమృతహస్తులును
అగువైద్యులను నృప, యర్థిఁ బ్రోచితివె?
జగతీతలేశ్వర, సద్గుణాంభోధి!
మఱియును నుత్తమ మధ్య మాధముల
నెఱిఁగి రక్షింతువే యెపుడువారలను?
కొలిచినవారికిఁ గోరి జీతముల
నలయింపకిత్తువే యాదరంబునను?
త్రాణతో మూలభృత్యశ్రేణి మనుపఁ
బ్రాణంబులిత్తురు భండనంబునను;
పరికింపఁగాఁ జోరభయవర్జితముగ
ధరణిఁబాలింతువే! ధనలోభమునను
దండి నేలవుగదా తస్కరావళిని?
మండలంబునఁగల మహిత తటాక


వనములు రక్షింతె వసుధాధినాథ?
పెనుపొంద దున్నెడు పేదకాపులకు
లాలించి విత్తులెల్లను జాలనొసగి,
[6]భావంబుదప్పినఁ బన్నులు గొనక
వలనుగా మెలపుదా? వాణిజ్యతతులఁ
గొలఁదివృద్ధికినిచ్చి కూర్మిమన్పుదువె?
పంగుల మూఁగల బాహుహీనులను
వెంగలిమతులను వికలదేహులను
అరసిరక్షింతువె? యాజిలోఁ గాతె
శరణన్న నెంతటిశాత్రవునైనఁ?
గృతమెఱింగినవానిఁ గృపఁబ్రోతువయ్య?
కృతకృత్యుఁడని నిన్ను గ్రియఁ బ్రస్తుతింప;
ధనము నాలుగుపాళ్లు దప్పక చేసి
వెనుకొని యొకపాలు వెచ్చంబుసేతె?
ఆయుధశాలల నశ్వశాలలను
దోయదవర్ణ సింధుర శాలలందు
బండారమిండ్లను బరమవిశ్వాస్యు
లుండంగ నియమింతె యుర్వీతలేశ?
పేదల సాదులఁ బెద్దల హితుల
మేదినీసురులను మిత్రబాంధవుల
నరసి రక్షింతువె యవనీశతిలక?
పరమంత్ర భేదనోపాయ మంత్రులును
మూలబలంబును మూర్థాభిషిక్తు
లోలిఁగొల్వఁగను గొల్వుండుదే నీవు?
అనవరతంబు బాహ్యాభ్యంతరములు
గనుఁగొని మెలఁగుదే గౌరవంబునను?


చారులవలనను జగములవార్త
లారయ విందువే యవనీశచంద్ర?
సంధిల్లువార్త లెచ్చట వినకున్న
నంధకారముగప్పు నవనిలోపలను;
దారసంగ్రహమును ధనసంగ్రహంబు
వారణ రథ హయవ్రాత సంగ్రహముఁ
జేయుచు, సర్వంబుఁ జిత్తంబునందుఁ
బాయక యెఱుఁగంగవలయుఁ దత్ఫలము;
చాలంగఁ దృణ కాష్ఠ జలసమృద్ధియును
శ్రీలు ధాన్యంబులుఁజింతితార్థములుఁ
గలిగి దట్టములైన కడిఁదిదుర్గములఁ
జెలువుగా సవరణసేయించి తయ్య?
అరులగెల్చునుపాయ మాచరింపుదువె?
అరయ నాస్తిక్యంబు, ననృతభాషణము,
నప్రసాదంబును, నాలస్యమును, మ
హాప్రమత్తతయు, [7]ననర్థకచింత,
చింతింపఁ గ్రోధంబు, [8]శీఘ్రచింతయును,
అంతంబుగాననియట్టిసూత్రతయు,
నెఱుకగల్గినవారి నెఱుఁగకుండుటయుఁ,
[9]దెఱఁగొప్ప నర్థంబు ధృతిఁ దాఁపకునికి,
మునుపు నిశ్చితకార్యములు సేయమియును,
ఘనమంత్రములు సురక్షణమొనర్పమియుఁ,
గ్రియ శుభంబులు ప్రయోగింపకయునికి,
భయ విషయాప్తినాఁబరగు పదునాల్గు
రాజదోషంబులు రమణవర్జింతె?
రాజితంబుగ." నన్న రాజు ధర్మజుఁడు


నారదసన్ముని నాథున కనియె:
“నారయ దోషంబులన్నియు మాని,
న్యాయంబుతప్పని నడవడి గలిగి,
పాయని ధర్మసంపదఁ జరింపుదును."
అనిమ్రొక్కి భక్తితో నప్పుడిట్లనియె :
"మునిచంద్ర, బహులోకములుచూడనివియు
నేవియుఁగలవు మీయిచ్చఁజింతింప!
సౌవర్ణమయమైన సకలచిత్రముల
యీసభఁజూచితే! యిప్పు." డటంచు
వాసియెలర్ప సర్వంబుఁజూపినను
జూచి యమ్ముని ధర్మసూనునకనియె:
"భూచక్రమునను నవూర్వమియ్యదియు!

ఇంద్రసభా వర్ణనము

నీసభఁబోలంగ నేసభ లేదు;
వాసవుసభ హేమ వరరత్న చిత్ర
మయమునై శోభిల్లు; మఱి దానిఁబొగడ
నయశాలియగు శేషునకు నశక్యంబు,
అది శతయోజనంబగు వెడల్పునను,
బదిలమై నూటయేఁబది యోజనముల
నిడువు, నవ్వలఁబంచనిజయోజనముల
[10]పొడవును గలిగి పెంపును దీప్తి గలిగి
ఘనతరంబగు కామగమనంబు గలిగి
యనుపమ ఫలనివహారామములను
వరుసతో వరరమ్య వైభవంబగుచు
గురుతపఃప్రౌఢిచేఁ గొమరుదీపించు.
నమరేంద్రనిర్మితంబైన యాసభను
అమరేంద్రుఁ డతిభూతి నమరగంధర్వ


సతులుగొల్వఁగ, విభూషణ వస్త్ర గంధ
యుతుఁడై శచీదేవి నొనరంగఁగూడి
యభిరామముననుండు ననిశంబుఁ గొలువు.
అభిముఖులై యాజినడఁగు శూరులును,
గ్రతువులు వేదోక్తిఁగావించునట్టి
క్షితిదేవులును నింద్రుఁ జేరియుండుదురు.
గురుఁడు శుక్రుండును గురుపవిత్రమునఁ
జిరకాల మొప్పు [11]నగ్నిష్టోమములును,
శ్రీతనులైన విశ్వేదేవతలును,
ధాతవిధాతలుఁ, దగు హరిశ్చంద్ర
ధరణీశ్వరుండును దగ్గఱి శక్ర
వరసభాస్థలియందు వరుస నుండుదురు.

యమసభావర్ణనము

మఱి కృతాంతుని సభామందిరంబొండు
వెఱవార రచియించె విశ్వకర్మయును ;
అది శతయోజనంబైనఁవెడల్పు
బొడవునంతియ నిడుపునుజాలఁగలిగి,
కామగామిత్వంబుఁ గమలాప్తదీప్తి
హేమమాణిక్య సమిద్ధదీధితుల
నతిరమ్యమైయొప్పు; నాసభయందుఁ
దతితో నగస్త్య మతంగాది సిద్ధ
గణములు, భీకర కాలకింకరులు,
గణుతింపఁ గాలచక్ర క్రతు దక్షి
ణాధిదేవతలును, నాకృతవీర్య
మేదినీశుఁడు, జనమేజయ జనక


బ్రహ్మదత్త విశాల బల పృషదశ్వ
బ్రహ్మ మహాదర్శ భవ్యశంతనులుఁ,
బుణ్యభూరిద్యుమ్న బుధమన్మథులును,
[12]గణ్యసన్మధురోపకంరాధిపతులుఁ,
జండశౌర్యుఁడు భవజ్జనకుఁడైనట్టి
పాండురా జాదిగాఁ బరఁగు భూపతులు
సేవింప నాసభ చిత్రమైయొప్పు;
భావించి యముఁడును బాపపుణ్యముల
నరయుచుండును బ్రాణులందు నెప్పుడును.

వరుణసభావర్ణనము

వరుణదేవునిసభ వరవిచిత్రముల
గురుతరంబైయొప్పుఁ గొమరార; యముని
నిరుపమసభయంతనిడుపు వెడల్పుఁ
గలిగియుండఁగ విశ్వకర్మసృజించెఁ.
జెలఁగి యందును సుఖాసీనుఁడై యుండు
వరుణుఁడు దేవితో; వారిరాసులును,
[13]గరమొప్పుచున్నట్టి కాళింది కృష్ణ
గౌతమి నర్మద కావేరి పెన్న
పూతసరస్వతి పుణ్యవాహినులు,
ఘనసరోవర తటాకములును, గిరులు,
వనములు, వసుమతి, వరకూర్మ మకర
ఘోర నక్ర గ్రాహ గురుసింహ శరభ
వారణవ్యాఘ్రాది వరజలచరులు, (?)


శేష వాసుకి ఫణశ్రేష్ఠులు, గాఢ
దోషాచరుల్, ఖగస్తోమంబుఁ గొలువఁ
జదురొప్పు వరుణుని సభ యెల్లవేళ,

కు బే ర స భా వ ర్ణ న ము

తదనంతరంబ యాధనదుని సభయు
నింద్రునిసభతోడనెనయగుచుండు;
సాంద్రవైభవములఁ జాలనొప్పొర
నది విశ్వకర్మ నేర్పలర సృజించె,
విదితంబుగా నందు వెసఁ గుబేరుండు
కొలువుండు మందార గురుపారిజాత
మలయానిలానంద మహనీయుఁడగుచు.
ననవరతంబుఁ దన్నచట గిన్నరులు,
ఘనులుగంధర్వులుఁ, గలితవరాహ
కర్ణ సన్మదగజకర్ణులు నీల
వర్ణులు,సన్మునీశ్వరులును, బుధులు,
[14]మదకాలకంఠ సన్మణిభద్ర హేమ
విదితనేత్రులును బవిత్రధన్యులును,
నలకూబరుండు నున్నతిభజియింప,
రంభయు మేనక రమణియూర్వశియు
నంభోజవదనఘృతాచి తిలోత్త
మాదిదేవస్త్రీలహర్నిశంబొప్పు
మోదంబుతోఁ గొల్వ, ముఖ్యభోగముల
నుండును దేవితో నొగిఁగుబేరుండు.

బ్ర హ్మ స భా వ ర్ణ న ము

మఱియును విను, మహీమండలంబునకు
నఱుడు చెప్పఁగవిన నాబ్రహ్మసభను.


బోయిచూచితి దానిఁ [15]బొగడిచెప్పంగఁ
దోయజానన ఫణీంద్రులకశక్యంబు.
అందు బ్రహ్మనుగొల్చి యాదిమనువులు,
బృందారకులును, నత్రియు, మరీచియును,
భృగు భరద్వాజ శోభితవశిష్ఠులును,
దగువాలఖిల్య కశ్యప గౌతములును, (?)
బుణ్యకణ్వ పులస్త్య పులహ కుంభజులుఁ,
గణ్యులాంగీరస కమలాసనులును,
జంద్ర సూర్య గ్రహసముదయంబులును,
సాంద్ర తారకములు, సద్గుణాకరులు
వసు రుద్ర సిద్ధ పావనసాధ్యవరులు,
విశదవిశ్వేదేవ విశ్వంబు, నధిక
గౌరవ ధర్మార్థ కామమోక్షములుఁ,
బారీణమైన శబ్దస్పర్శరూప
రసగంధములు, [16] దపశ్శమదమంబులును, (?)
పసిమి [17] సంకల్ప(వి)కల్పప్రణవములు,
సమధికక్షణములు, సన్ముహూర్తములు,
రమణీయమగు నహోరాత్రపక్షములు,
సంచితమాసార్ధసంవత్సరములు,
నంచితారూఢయుగాత్మకంబైన
కాలచక్రంబును, ఘనకరణములుఁ
జాలఁజతుర్వేదశాస్త్రవిద్యలును
మూర్తిమంతంబులై ముదమునఁగొలువఁ,
గీర్తిశోభిల్ల వాగ్దేవితోఁ గూడి


కమలాసనుండు సౌఖ్యంబున నుండు
నమితభంగుల నందు." నని చెప్పుటయును
రాజచంద్రుండు నారదునకిట్లనియె:
"ఈ రాజపూజితుఁడైన రాజు మాతండ్రి
పాండుభూపాలుందు పరమధార్తికుఁడు
దండహస్తునిపురీస్థలి నుండు టేమి?
యాదిరాజవరేణ్యుఁ డాహరిశ్చంద్ర
మేదినీశ్వరుఁడును మెఱసి దేవేంద్రు
సభనున్న క్రమమెల్ల సత్తుగాఁ దెలుపు
రభసంబుతో." నన్న రమణ నారదుఁడు
నాధర్మజునితోడ నప్పుడిట్లనియె:
“ యోధ హరిశ్చంద్రుఁ డుర్వీశ్వరుండు
సప్తార్ణవద్వీప జగతీతలంబు
సప్తాశ్వతేజుఁడై జయమున నేలి,
యాజివిరోధిరాజావళి గెలిచి,
రాజసూయ మహాధ్వరంబు గావించి,
యమితదానములు బ్రాహ్మణులకుఁ జేసి,
కొమరొప్పగా యాజకులకు దక్షిణలు
నేనుమణుంగుల హేమంబులొసగి,
మానుగా జనులసమ్మానంబుచేసి,
వరలోకమున కేఁగి పర్జన్యుసభను
బరమానురాగుఁడై ప్రఖ్యాతినుండె.
దండపాణిపురంబుదరిని మీతండ్రి
పాండుభూపతి నాకుఁ బరఁగనిట్లనియె:
“అధిపులు రాజసూయంబులు చేసి
బుధపూజ్య, యింద్రునివురినున్నవారు;
ఏనిందునుండుట యెఱుఁగుదుగాన
నానందనుఁడు ధర్మనందనునకును


వినుపించి, త్రిభువనవిఖ్యాతముగను
మన రాజసూయమఖంబు గావింపు. "
మనfపూని పుత్తెంచె; నదిగాన, మీర
లనుపమరాజసూయాధ్వరంబొప్ప
జేయుఁడు; పాండుసృష్టితలేశ్వరుఁడు
వేయికన్నులవానివీటనే యుండుఁ;
గావున నీ పరాక్రమసహోదరుల
లావునఁ జేసి చాలఁగ రాజసూయ
యాగంబు గావించి, యఖిలార్థములును
ఆగమోక్తులను బ్రాహ్మణులకు నిచ్చి
జనులఁబాలించిన, శక్రునిపురము
గొనకొని గలుగు మీగురుఁడుపాండునకు.
ఇందుకు విఘ్నంబు లెన్నేనిగలవు;
అందుకు వెఱపకుండది మీకు జయము."
అని చెప్పి నారదుండరిగె నాక్షణమ.
యనఘుండు ధర్మజుండంతఁ దమ్ములను
ధౌమ్య వేదవ్యాస ధరణీసురేంద్ర
[18]సౌమ్య సజ్జన సమక్షమ్మునఁబలికె :

రాజసూయ సంకల్పము

"గణుతింపఁ దసయుడు గలిగినఫలము
క్షణములోపలఁ బితృజనులకోరికలు
తీర్చఁగల్గుటయె యీత్రిజగంబు లెఱుఁగఁ;
బేర్చినారదుఁడు చెప్పెనుసకలంబు.
రాజనూయమహాధ్వరంబు చేసినను
దేజంబుతోఁ బితృదేవతలెల్ల


స్వర్గస్థులగుదురు సత్తుగా; నిట్టి
మార్గంబునను జసమర్దనంబగును,
ఏమి సేయుదు!" నని యిచ్చఁజింతింప
నా మెయి ధౌమ్యాదులప్పుడిట్లనిరి :
"రాజితంబుగఁ జేయు రాజసూయంబు;
నాజన్మముగఁ జేయు నఘములు దొలఁగు;
లోనుమీకగు రాజలోకమంతయును;
మానుషంబున రాజమణులను గెలిచి
కావింపవే వేగ క్రతు." వనుటయును,
నావేళ ధర్మజుం డాత్మఁజింతించి
యిందుకు నిర్విఘ్న మెంతయుఁగాను
గందర్పజనకుండు కరివరదుండు
పుండరీకాక్షుండు పురుషోత్తముండు
అండజపతివాహుఁ డట కర్తయనుచు
జారునిఁ బిలిపించి సద్భక్తి బలికెఁ :
"దేరు గొంచును పోయి తేజంబుతోడ
శ్రీకృష్ణుఁ దోతెమ్ము శీఘ్రమ్మునందుఁ
బ్రాకటమ్ముగ." నంచుఁ బనిచిన వాఁడు
ననిలవేగములైన హయములుపూను
ఘనరథంబెక్కి, యాకమలాక్షుకడకుఁ

కృష్ణుఁ డింద్రప్రస్థమునకు వచ్చుట

బోయిన, నెఱిఁగి యాపుండరీకాక్షుఁ
డాయెడ రథము నెయ్యంబున నెక్కి
తత్ క్షణంబునను నింద్ర ప్రస్థపురికి
రక్షణంబునవచ్చి, రమణికుంతికిని
ధర్తజునకు మ్రొక్కి, తరువాత భీము
నర్మిలి గౌగిట నందంద చేర్చి,


నరుని మాద్రేయుల నయమార్గములను
గరుణమన్నించినఁ, గమలాక్షుఁజూచి
భయభక్తితో నర్ఘ్యపాద్యాదివిధులఁ
బ్రియమునఁ బూజించి పీఠస్థుఁ జేసి,
కలయ లోకముల యోగక్షేమమెల్లఁ
జెలువుగా నరసి రక్షించు శ్రీకృష్ణు
నేమమంతయును బ్రసిద్ధిగా నడిగి,
యామహాత్మునితోడ నప్పుడిట్లనియె :
"మాకు లోకములకు మరివిధేయుఁడవు;
నీకుఁ గాన్పింపవే నిఖలకార్యములు!
ఐనను నీకు నేనటువిన్నవింతు;
మానుగా నారదమౌని యేతెంచి
పలికెను నాతోడఁ: బాండుభూవిభుఁడు
చలనంబుతో [19]యమసభనున్నవాఁడు;
అతనికిఁ బుణ్యలోకావాస [20]మబ్బ
రతిపతిగురుకృప రాజసూయంబు
సేయునీ.' వనుచును చెప్పిఁతాఁబోయెఁ;
దోయజనేత్ర, యిందుకుఁ గార్యసిద్ధి
గావింపు." మనవుడుఁ గమలలోచనుఁడు
భూవల్లభునకు విస్ఫురణ నిట్లనియెఁ :
“గులశీలముల సర్వగుణవిశేషముల
ననఘచరిత్రుండవైనట్టి నీకు
రాజసూయమహాధ్వరము సేయఁదగును
ఆజుల గెలుచునీయనుజుల బలిమి;
నీకోర్కి సఫలంబు నెఱయఁ గావింతు;
నేకచిత్తంబున నెంతయు నుండు.


విను నీకు నెఱిఁగింతు వృత్తాంత మెల్ల;
మును జమదగ్ని రామునిచేతఁ దెగిన
[21] రాజులనుండి ధరాతలంబునను
రాజసూయాన్వయ రాజాగ్రణులకుఁ
[22] దక్కఁ దక్కినమహీధవయూధములకు
నెక్కడైనను జెల్లదిట్లు సేయంగ;
నీ రాజసూయంబు నిలఁ జేయునపుడు
వైరులులేకుండ వలయు నిచ్చటను;
ఇప్పుడు జరాసంధుఁడేచియున్నాఁడు
నృపులనుగెలిచి యున్నిద్ర శౌర్యమున;
నతనినేగూడి యీ [23]యెడఁ జేదివిభుఁడు
ప్రతిపక్షియై శిశుపాలుఁడున్నాడు;
అతిమాయలనుబెట్టు [24] హంసుండు డిచికుఁ
డతనినే సేవించి యర్థినున్నారు;
చిత్రంబు! వారు కౌశిక చిత్రసేన
పాత్రనామంబులఁ బరఁగినవారు;
బహుసేనలను గూడి పస జరాసంధుఁ
సహితులై సాధనసన్నద్ధులగుచు
వర్తింపుచున్నారు వారు మువ్వురును.
స్ఫూర్తితో వరుణునిభుజశక్తి గలిగి
భగదత్తుఁడను రాజు పశ్చిమభూమి
మగఁటిమి నేలుచు, మఱి జరాసంధుఁ
బొదివియున్నాఁడు భూభువనమెఱుంగ.
పదిలమై యాచేదిపతులలోపలను


బురుషోత్తముండును, భూమీతలేశ
వరులలోపలఁ బౌండ్రవాసుదేవుఁడును,
నానానుములు దాల్చి నడుఁకక క్రొవ్వి
పూని వైరంబు దుర్బుద్ధులై యిపుడు
గోరి జరాసంధుం గొలిచియుండుదురు.
దారుణశక్తిఁ బ్రాగ్దక్షిణదిశల
సృష్టీశ్వరులు పురుజిత్తు కరూశ
దుష్టపౌండ్ర కిరాత దుర్మార్గసాల్వ
యవనులు వానినే యలమియుండుదురు;
ప్రవిమలయశులైన పాంచాల మత్స్య
శూరసేన పుళింద సుంహక కుంతి
కేరళ పుష్కర క్షితి పాలతతులు
నెఱి నాజరాసంధునికి నోడి పాఱి,
యఱిముఱి దమభూములన్నియు విడిచి
తిరుగుచునున్నారు దిగ్భ్రమగొనుచు.
సరభసంబున జరాసంధుండు నెపుడు
కంసుని నేనాజి ఖండించుటకును
హింసగావింపంగ నెప్పుడుఁగోరు;
ఆకంసుఁడును దనకల్లుండుగాన
భీకరశౌర్యుఁడై పెర్చి యీసునను
నాతోడ వడిఁ బ్రథనము సేయు నెపుడు;
నాతతజయశాలు రాహంసడిచికు
లిరువురుతోడుగా నేడుదీవులను
దివిఱి రాజులను సాధింపంగఁగలఁడు.
ఆటువంటిడిచికుని హంసునిఁ గూడి
తటుకున సేనాకదంబంబుతోడఁ


జలము[25]నందును జరాసంధుండు పేర్చి
మలయుచు శూరుఁడై మధురపై విడియ
నేను సేనలుఁగూడి యెదిరిపోరాడఁ
బూనుచో, నెంతయు బుద్ధిజింతించి
యాహంసడిచికుల యాయుాధంబులును
వ్యూహంబులును జావకుండుటయెఱిఁగి
హతుఁడయ్యె హంసుఁ డుగ్రాజిలోననుచు
హితబుద్ధి డిచికున కెఱిఁగించి పనుప,
నతఁడు హంసునిమృతి యంతట దెలిసి
మతిలోనఁ గడుశోకమగ్నుడై యపుడు
పలికె: 'హంసుఁడు లేని బ్రదుకునా కేల!
యిలమీద' ననుచును నెంతయు వగచి
డిచికుండు గ్రక్కున దేహంబువిడిచె.
అచల ధైర్యుండగు హంసుండు డిచికు
మృతివార్తవిని వేగ మృతియునుబొందె.
మతి హంసడిచికుల మరణంబువినియు
నసహాయుఁడై మగధాధీశ్వరుండు
కొసరుచుఁబురికేఁగెఁ గోపంబునిగుడ.
ఏమును వారితో నెక్కటిపోర
నేమియుననలేక యెఱిఁగియు మధుర
విడిచి ద్వారావతి వేగనిర్మించి
కడిమి రైవతము దుర్గంబుగాఁజేసి
యందున్నవారము హర్షంబుతోడ
నిందుకు వెఱవక నిష్ఠురత్వమున
నవనిరాజులను బృహద్రథాత్మజుఁడు
తివిఱి పట్టుకవచ్చి దీర్ఘరౌద్రమున


మొనసి గిరివ్రజంబునఁ జెఱఁబెట్టి
దినమునొక్కొకని వధించి నేర్పునను
భైరవపూజలు పాటించి సేయుఁ.
గ్రూరాత్ముఁ డగువానిఁ గువలయాధీశ,
యణఁచిన నీకును నఖిలరాజ్యములు
క్షణములోపలఁ జాలసమకూరు; మఱియు
రాజసూయమహాధ్వరము సేయవచ్చు;
రాజేంద్ర, మును భగీరథనరేంద్రుఁడును,
.. .............................
................................
దోర్విక్రముఁడు మరుత్తుండును, నాజి
గర్వితాహితులను గ్రక్కునఁ ద్రుంచి
సకలసామ్రాజ్యాది సర్వసంపదలు
ప్రకటంబుగాఁ గాంచి ప్రబలిరి; గాన,
నిఖిలసద్గుణములు నీయందుఁగలవు;
అఖిలార్థవేదివి; యరివిజయుఁడవు;
ఏమిదుర్లభము నీకీజరాసంధు
భీమవిక్రమమునఁ బేర్చి త్రుంపగను!"
అని కృష్ణుఁడాడినయట్టిమాటలను
విని ధర్మజునితోడ వెస భీముఁడనియె:

భీమార్జునులు ధర్మజున కుత్సాహము గలిగించుట

"ఉద్యోగహీనున కుర్విలోపలను
సద్యఃఫలంబులు సమకూరవెందు;
బాహాబలాఢ్యుతోఁ బ్రతినదలిర్ప
నాహవంబొనరింప నతికీర్తి గలుగు;
హీనుతోఁ బోరంగ నేకీర్తి గలదు!
మానవునకు మహీమండలంబునను.


అటుగాన నీతోయజాక్షునికృపను,
స్ఫుటశౌర్యుడైన యర్జునుసహాయమున,
నిత్యమైయొప్పెడు నీప్రసాదమున,
నత్యున్నతుండైన యాజరాసంధు
నఖిలజగద్ద్రోహి నాజిఁ ద్రుంచెదను.
నిఖిలం బెరుంగంగ నేము మువ్వురముఁ
ద్రేతాగ్నులునుబోలెఁ దేజంబుతోడ
ఖ్యాతిగా, నీ యజ్ఞకార్యమంతయును
నిర్వహింతుము; దుర్వినీతు మాగధుని
దుర్వారపశువుఁ గ్రతుక్రమంబునను
ఆహుతులుగవ్రేల్చి యలరియుండుదుము
సాహసంబున." నన్న శక్రనందనుఁడు
ననిలజుమాటల కనుకూలముగను
జననాథుతోడ సద్భక్తిని బలికె :
“ఆజిలో రిపురాజినడఁచి, [26]లక్ష్ములను
రాజసూయమహాధ్వరమ్ము గావింపు
నాభుజబలమున నాధనుర్విద్య
ప్రాభవంబున జగత్ప్రఖ్యాతముగను,
ఈసభాలాభంబు నీ ప్రతాపంబు
నీసమస్తశ్రీలు నిటనీకుఁగలుగ,
నేవిచారములేల యిలనాథచంద్ర!
కోవిదస్తుతమునై కులశీలరూప
గుణములకును ననుకూలమైయొప్పి
ప్రణుతికెక్కిన నీప్రభావంబునందు
సమరంబునను జరాసంధునిఁ ద్రుంచి,
క్రమమునఁ జెఱనున్నరాజుల నెల్ల


రక్షించి సత్కీర్తిరమణిఁ గైకొనిన
నక్షయసుకృతంబు లనిశంబుఁ గలుగు."
ననిపల్క భీముని యాపార్థుమాట
విని కృష్ణుఁడప్పుడు వేడ్కనిట్లనియె:
"శౌర్యంబు గలిగినజగదీశ్వరులకుఁ
గార్యంబులివి వివేకమునఁ జింతింపఁ;
గాన మువ్వురమును ఘను జరాసంధుఁ
బూని వాహినిదరిభూజంబు మొదలు
పెకలించు కైవడిఁ బేర్చి త్రుంచెదము;
అకలంక మతిఁజని యాదురాత్మకుని
నంతరంబెఱుఁగనియట్టిదుర్మదుని
హంతను సర్వలోకాపకారకునిఁ
జంపుద." మనవుడు సంతోషమంది
తెంపుతో హరికి యుధిష్ఠిరుండనియె:
" నీకోవవహ్నిలో నెఱయంగ మిడుత
యై కడువడిఁబడు నామాగధుండు.
అనఘ, శూరుండైన యాజరాసంధు
జననంబు నాకును సర్వంబుఁ దెలువు"
మనియడిగినయట్టి యమతనూజునకు
వనజూత నేత్రుండు వర [27]భక్తిఁబలికె :

జరాసంధు నుత్పత్తికథనము

"మగధ దేశంబేలు మానవేశ్వరుఁడు
అగణితశక్తి బృహద్రథుండొప్పు;
నక్షౌహిణిత్రితయంబైనసేన
దాక్షిణ్యమునఁ గొల్వఁదగనున్నవాఁడు


కాశిరాజనువాని గాదిలిసుతలఁ
గాశసన్నిభకీర్తి గౌరవాన్వితలఁ
గవలవారల నతికాంతి[28]సమ్మితల
నవిరళమతిఁ బెండ్లియాడి, సొంపుగను
భోగింపుచును, దుదిఁ బుత్రులు లేమి
నాగమోక్తులయందు నఖిలదానములఁ
బుత్త్రకామేష్టియుఁ బొందుగాఁ జేసి
పుత్త్రులఁగనలేక పొలఁతులుఁ దాను
వనమున కేఁగి, యవ్వల సహకార
ఘనమహీజము క్రిందఁ గైకొని తపము
చేయుచునున్న కౌశికమునిఁ గాంచి
యాయతభక్తితో నర్ఘ్యపాద్యములఁ
బూజింప నమ్మునిపుంగవుండనియె:
“రాజశేఖర, బృహద్రథ, నీకు నెద్ది
యిష్టంబు? వేడుమ యిచ్చెద.' ననిన
దృష్టించి యతనికి ధృతి మ్రొక్కిపలికె :
“నెంతసంపదగల్గ నేమి ఫలంబు!
సంతానములు లేక సన్మునినాథ!
తనయులు గలుగంగ దయసేయు, మనిన
ముని కౌశికుడు యోగమునఁ జింతసేయ
మామిడిపండు గ్రమ్మున నేలఁబడిన,
నాముని దానిని నభి[29]మంత్రితంబు
చేసి బృహద్రథుచేతికినిచ్చి,
భాసురభక్తితోఁ బలికె నెయ్యమున :
“నీఫలంబున నీకు నిట నొక్కకొడుకు
సాఫల్యమున వేగజనియించు.' ననిన


నా మగధేశుండు నమ్ముని యాజ్ఞ
నేమంబుతోడను నిజపురంబునకు
నేతెంచి యాఫలం బిలను భాగించి
చాతుర్యమునఁ దనసతులకిద్దఱకుఁ
బెట్టిన, వారు తప్పృథుఫలప్రౌఢి
గట్టిగా నప్పుడు గర్భిణులగుచుఁ
బదిమాసములు మోచి, పసనొక్కరాత్రి
విదితంబుగా వారు వెసఁ గాంచిరంత
నొక్కొక్కకన్నును నొక్కొక్క చెవియు
నొక్కొక్కచెక్కును నొక్కొక్కమూపు
నొక్కొక్కచను బొడ్డు నొక్కొక్కచెయ్యి
యొక్కొక్కచరణంబు నుదయంబుగాఁగఁ;
గాంచి యంతటఁ బుణ్యకామినీమణులు
వంచనతోడ నావ్రయ్యలు చూపఁ
బతికిఁ జెప్పఁగరోసి, [30] పరిఖపంకమునఁ
దతితప్పకుండంగ దాదులచేత
వేయించినను, నంత వెస 'దైత్యభామ
యాయెడఁజూచి వ్రయ్యలు రెండుఁగూర్ప
రెండును నేకమౌ రీతి శోభిల్లఁ
జండశరీరుఁడై జయమునొందుటయు,
నాదైత్యభామిని యావజ్రదేహు
నాదట నెత్తంగ నలవిగాకుండె.
ఆబాలకుండు మహారవంబునను
బ్రాబల్యచిత్తుఁడై పలవరించుచును
ఆకుమారుండేడ్వ, నంతఃపురంబు
రాకేందుముఖులు గారామునఁ బంప


ముసలియవ్వలువచ్చి ముదముతో వాని
నెసగిన భక్తితో నెత్తుకయుండ,
నట్టిసంభ్రమమున నాబృహద్రథుఁడు
తొట్టిన భక్తితోఁ దొలుత నేతెంచి
యతిరోదనము సేయు నాత్మసంభవునిఁ
జతురతఁ గనుఁగొనె సంభ్రమంబెసగ.
అవేళ రాక్షసి యబలరూపమున
భూవిభుమణితోడ బుద్ధినిట్లనియె:
"జరయనురాక్షసి జననాథ, యేను;
బరికింప నీపురీపరిఖచదుకమునఁ
బాయక యుండుదుఁ బ్రతిదివసంబు;
నేయెడ నీకు నేనిష్టంబు సేయఁ
గోరుచునుండుదుఁ గొంకక యెపుడు;
నేరుపుతోఁ జేయ నేడు సిద్ధించె.
నీయిరువురు తరుణీమణులకును
శ్రీయుతంబుగ జనియించినయట్టి మనుజ
శకలంబులివి రెండు చర్చించిచూడ;
నకలంకగతిఁదెచ్చి యట నిందువ్రేయ
నీ రెండుశలంబు లేను గూర్చినను
బోరన మనుజుఁడై భూరిసత్వమున
ఘనవజ్రకాయుఁడై కడఁగి కుమారుఁ
డనిమిషగిరివోలె నమరి యున్నాఁడు;
ఈకుమారకుని నీ వెత్తుకొ మ్మనుచుఁ
జేకొని జర భక్తిఁ జెప్పిన, వినుచు
నామగధేశుండు నాజరకనియె :
అమహాత్ముండు విశ్వామిత్రమౌని
నాకు వేడుకనిచ్చె నందను మునుపు;
చేకొని నీవు నిచ్చితివి నా కిపుడు;


నాకులంబెల్ల నున్నతిని రక్షింప
నాకల్పమునఁ బుట్టినట్టి దేవతవు.'
అని దానిఁ బూజించి యాత్మనందనుని
గొనిపోయి దేవులకును నిద్దఱకును
సరభసంబుననిచ్చె సంతోషమునను.
జర వాని సంధింపఁజాలుటఁ జేసి
జననాథ, మఱి జరాసంధుఁడై యొప్పె.
మనుజేశుఁడేటేఁట మనుజాశనికిని
నుత్సవంబొనరించుచుండె; నందనుని
నుత్సాహమునఁ బెంచుచుండె; నంతటను
జండకౌశికుఁడు ప్రచండమునీంద్ర
మండలేశ్వరుఁడు నిర్మలబుద్ధి వచ్చె.
అంతట నెదురేఁగి యామగధేశుఁ
డెంతయు యొక్క తా నెలమితోఁ దెచ్చి
కనకాసనంబున ఘనతతో నునిచి
వినతుఁడై పదములు వేడుకఁగడిగి
యర్చించి రాజ్యంబు నఖలార్థములును
బేర్చి నందనుఁజూపఁ, బ్రియమున మౌని
యామగధేశుతో నప్పుడిట్లనియె:
"సామర్థ్యముగలట్టి జర దైత్యవనిత
నీకుపకారంబు నేర్పునఁజేసె;
నేక పోదృష్టి నిప్పుడుగంటి ;
నీకుమారుఁడు ధారుణీనాథచంద్ర,
యాకుమారునిశక్తి నలరినవాడు.
హరినిఁ గైకొనఁడు; కాలాంతకాంతకుని
హరుని మెప్పించు తా నరులమర్దించు;
వీనితోఁ [31]బోరిలో వీరాధివరులు
మానితోత్సాహులై మార్కొనుటన్న,


శలభంబు వహ్నితో సద్విహంగములు
బలుగరుత్మంతుతోఁ బ్రతిఘటింపుటలు;
ఎల్లవారలు వీనియేచిన దాడి
హల్లకల్లోలమై హతులౌదు రిట్లు;
బల్లిదుండగు వీనిపటుశౌర్యవహ్ని
యెల్లరాజులపగ యెల్ల మాయించు;
నేడుదీవులవారి నిట్టట్టుచేయు
దాడియొనర్చి [32]యుద్దండితవృత్తి;
శతమఖుశౌర్యంబు శమనుధైర్యంబుఁ
బ్రతిఘటించెడి బాహుబలపరాక్రముఁడు;
నందివాహనుకృపనందినయట్టి
పొందైన మణిమయ పుష్పంకంబెక్కి
యాదిత్యసమతేజుఁ డౌనట్టి వీని
మేదినిలోపల మీ ఱంగరాదు;
దివ్యాస్త్రముల వీనిదివ్యదేహంబు
దివ్యులకైన ఛేదింపంగ రాదు;
[33]నదుల సముద్రుఁడున్నతిని జేకొనెడు
పొదుపున ఘనమహీభుజులసంపదలు
సర్వంబు నీజరాసంధుండు గొనును
సర్వభంగుల." నని చండకౌశికుఁడు
చెప్పి గ్రక్కునఁబోయెఁ జిత్రంబుగాను.
అప్పుడు తనయుని నాబృహద్రథుఁడు
భద్రాసనంబునఁ బట్టంబుగట్టి
భద్రేభగమనలఁ బరఁగఁదోడ్కొనుచు
దపమునేయఁగ వనస్థలమున కరిగె.
నుపమ జరాసంధుఁ డురుశత్రువిశతి


[34]యణఁపఁగ హంసుని నాడిచికునిని
గణుతి కెక్కిన కార్యకర్తలుగాఁగఁ
జేకొని యరులనిర్జింపుచునుండు;
నాకాలుపురికిని హంసుండు డిచికుఁ
డరిగినపిమ్మట, నతిగర్వముడిగి
సరవినిప్పుడు జరాసంధుఁడున్నాఁడు [35].
ఏయాయుధంబుల నీల్గకుండుగ
నాయిందుధరునిచే నటువరంబందెఁ;
గావున, వానినిఁ గ్రమముతోడుతను
బావనిచే నణంపఁగఁజేయవలయు;
మల్లయుద్ధంబున మానుషంబునను
దెల్లమిగాను వర్తింపఁగవలయుఁ;
బవమానతనయుని బాహాబలమును
దివిజేంద్రనందను దివ్యాస్త్రబలిమి
నాకీర్తిబలమునున్నతి సహాయముగ
నీకసాధ్యంబెద్ది నిఖలలోకముల!
నాకునిల్లడయిమ్ము నరుని భీమునిని
జేకొని మగధునిర్జించెద." ననిన :
హరి భీము నర్జునునప్పుడు చూచి
సరసిజూక్షునితోడ శమనజుండనియె:
"నీ సహాయముగల్గ నిఖిలశాత్రవుల
వేసమయంబున విజయవాయుజులు
విదలించి త్రుంతురు వివిధభంగులను;
దుది రాజసూయంబు దొరయ సిద్ధించు;
నీకృపగలుగంగ నిఖిలార్థవితతి
గైకొనరానివి గలవె లోకముల!


అక్షులునాకు వాయుజధనంజయులు; (?)
పక్షీంద్రగమన, నా భావంబు నీవు;
మిముఁ బాసి నిముషంబు మేముండ లేము;
కమలాక్ష, నీదివ్యకారుణ్యమునను
భీమునకును జంభభేదిసూనునకు
నేమియుఁ దలపోయ నిప్పుడువలదు.”

కృష్ణుఁడు భీమార్జునులతో జరాసంధుఁ జంపింపఁబోవుట

అని వారినిచ్చి నెయ్యమున దీవించి
యనిపిన, వారలు నాత్మనుప్పొంగి
నదులయందును గృతస్నాసులై గిరులు
విదితాటవులు దాటి వివిధదేశములు
గనుఁగొంచు మగధేశుఘనభూమిఁ జొచ్చి,
యనుపమ గోరథంబను గిరియెక్కి,
యాలోకనముచేసి యాగిరివ్రజము
మేలైన రత్నపుమేడలదాని,
నమరావతీపురి కలకాపురికిని
సమమైనదానిని, సకలసంపదలఁ
జెలువొందుదాని వీక్షించి మిక్కిలిని,
జలజూక్షు డనిలజశక్రసూనులకు
నరుడంద భక్తితో నప్పుడిట్లనియె:
"పరికింప గో[36]రథపర్వతాగ్రంబు,
వైహారి, [37]ఋషిగిరి, వరచైత్యకాద్రి
యూహింప నివినాల్గు నొసరఁజుట్టులను
గాచియుండును ద్రిలోకములు నుతింప
నేచందములఁజూడ నిది గిరివ్రజము;


గౌతమమునిచేతఁ గడురమ్యమైన
పూతదుర్గంబిది భువినసాధ్యంబు.
తెరల మాగధుని సాధింపంగలేరు
దురములో." ననిచెప్పి తుదిఁజైత్యనగము
దండకుఁ జేరి మోదముననిట్లనియెఁ:
"జండభేరులు మూఁడు చాలనొప్పారు;
మగధాది[38]నాథులు మానుషాదమను
అగణితవృషభంబు నణఁగించి, దాని
చర్మంబు భేరుల సరవిమూయింప,
నిర్మిలినీపురి నటు వింతవారు
చొచ్చినప్పుడు మ్రోయుచును మునిశక్తి
నిచ్చలో నెఱిఁగించు నిట మగధునకు.”
అనిన వారలు చూచి హస్తదండముల
ననువార భేరీత్రయంబును జించి,
వారకుద్ధతి గిరివ్రజమర్థిఁ జొచ్చి,
బోరన నప్పుడు పుష్పలావికల
సదనంబునకుఁబోయి సకలపుష్పములు
ముదముతో నిమ్ముల ముడిచి, గంధములు
మేననిండుగఁబూసి, మేటిగంధమున
మానుషంబున రాజమార్గంబుచేరి,
గుహలుచొచ్చుమృగేంద్రకులముచందమున
మహనీయులై చొచ్చి మఱియు వచ్చుటయు,
నాజరాసంధుండు నర్ఘ్యపాద్యములు
తేజంబుతోఁగొంచు ధృతినెదురేఁగి


భూదేవమణులని పూజసేయంగ
నాదటఁ గదిసి, వా రవి యొల్లకునికి
జూచి యామగధరాజును వారికనియె:
“మీచందములుచూడ మేదినిఁగ్రొత్త!
ధరిణిదేవతలైనఁ దర్కింప మీరు
సురభిపుష్పంబులు శోభితంబైన
గంధంబులును ధూర్తుగతిఁ గొనుటేమి?
బంధురభేరు లుద్భటవృత్తి వ్రచ్చి
సొలయక నాపురిఁ జొచ్చుట యెట్లు!
అలఘుసద్భక్తితో నట నిచ్చునట్టి
మధుపర్క మొల్లక మఱియుండు టెట్లు!
పృథివీశ్వరులు గాని పెంపున మీరు
ధరణీసురులుగారు తర్కించి చూడ
గురుబాహుసత్వు లక్షుద్రవిక్రములు."
అనుటయు వానికి నచ్యుతుండనియె:
"జననాథులము మేము సత్తుగా వినుము;
నీపురిఁజొచ్చుట నీతి మాకెందు;
నేపారుగంధంబు నెల్ల పుష్పములుఁ
గైకొనుటది జయకారణంబనుచుం
జేకొంటి మిప్పుడు సిద్ధంబుగాను.
కార్యంబు నీయందుఁ గలుగుటఁ జేసి
యార్యమతంబున నర్ఘ్యంబు గొనము."
అనిన జరాసంధుఁ డప్పుడిట్లనియె:
"మును మీకు మాకునిమ్ములఁ బగలేదు;
సురలకు ధారుణీసురులకు మునుల
కరుదారభక్తుండ నాదిభూవిభుఁడ."
ననుటయు నచ్యుతుం డతనికిట్లనియెఁ :
“ జెనసి రాజుల నెల్లఁ జెఱఁబెట్టి తీవు;


వారిరక్షింపను వరుస నీతోడఁ
బోరాడఁగా నేము, భుజబలంబునను
వచ్చితి, మీతండు వాయునందనుఁడు;
సచ్చరిత్రుఁడు వీఁడు శక్రనందనుఁడు;
ఏను శ్రీకృష్ణుఁడ; నెల్లదుర్జనులఁ
బూనిశిక్షింపంగఁ బుట్టినవాఁడ.
నిన్నాజిఁదెగటార్చి నృపతుల నెల్ల
నెన్నిక కెక్కంగ నీక్షణంబునను
విడిపింతు మము దేవనిసరంబుపొగడ
గడిమితో." ననవుడు గడువడి నలిగి,
యాజరాసంధుండు నాగ్రహంబునను
రాజసంబున మృగరాజుచందమును
గుటిలసద్భ్రుకుటీ[39]విగుర్వణఘటిత
నిటలుఁడై పటుకార్యనిర్భరత్వమున
వారితోఁబలికె దుర్వారవైరమున :
"ధారుణీశులగెల్చి తఱిఁబట్టి తెచ్చి
కారాగృహంబులం గడిమితోఁబెట్టి
భైరవపూజలు పరఁగఁజేయుచును
ఇలలోపలను గ్రొవ్వి యేచియుండుటలు
తలపోయఁగా వీరధర్మంబుగాదె!
నాకుదోషములేదు నవరణస్థలులఁ
జేకొని పట్టి తెచ్చినమహీపతుల
దేవహితార్థంబు తెగవేయువాఁడ;
నీవేళ వారల నే నేలవిడుతు!
భావింప నాప్రతాపము లోకములను
నీ వెఱుంగవె ధారుణీధర, యెపుడు!


ఎన్నిమాఱులు పాఱవెదిరింపలేక !
మున్నుగా; నీవు సముద్రంబులోన
దుర్గంబుగట్టుకు తులఁజరించితివి ;
దోర్గర్వముస మిమ్ముఁ దూలఁదోలెదను.
మొక్కలంబున మీరు ముప్వురుఁగూడి
యెక్కటికయ్యాన కెత్తివచ్చినను,
రయమున మీతోడ రణమొనర్చెదను
నియమింపఁ; గా దేని నిఖిలసైన్యములఁ
గూడుకరమ్మన్నఁ గొసరక వత్తు
నోడక ; యటుగాక, యొక్కండవీవు
రమన్న రణము తీవ్రముగఁ జేసెదను;
ఇమ్ముల మీతోడ నేయాయుధములఁ
జెనకంగవలసినఁ జెండివై చెదను. "
అనవుడు శ్రీకృష్ణుఁ డప్పుడిట్లనియె:
"పలువురొక్కనితోడఁ [40]బ్రధనంబు సేయ
నిలనధర్మము; గాన నిపుడు మాయందు
నొకనితో రణముసేయుము, ప్రతాపమున ;
నకలంకగతియందు నతిధర్మమునను
మల్లయుద్ధంబు సమంబుగావునను
దెల్లముగాఁ బోరు ధీరత్వమునను.
సృష్టివారికిఁ గీడుసేయ నేనంటి;
దృష్టమిప్పుడు ధరిత్రీపాలతతులఁ
జెఱఁబెట్టితివి; సదా శివహితార్థముగ
వెఱవక చంపంగ వేగఁబూనితివి ;
ఎవ్వరు హరునకు నిల జీవహింస
యివ్విధంబునఁ జేయ రేయుగంబునను;
ఇది యధర్మముగాదె యిల నీదుచేఁత !
తుది మహాశౌర్యవంతుఁడనని క్రొవ్వి


పలికితి దుర్భుద్ధి, పాపంబునందు;
మలసి పుణ్యుఁ నవమానంబు చేయు
చుండితి నీకంటయోధులు లేరె!
మండలంబున; మహమదగర్వమునను
గార్తవీర్యుండు భార్గవునిచే దెగియె;
ధూర్తవిద్యలయందుఁ దుది నింకనీవు
చెడక నావచనంబుచేసి రాజులను
విడిచిపుచ్చుము జగద్విఖ్యాతముగను;
విడునకుండెద వేని, వేగ నీతనువు
విడిపింపుదుము బలువిడితోడ." ననిన

భీమజరాసంధుల మల్లయుద్ధము

రౌద్రంబుతోడ జరాసంధుఁ డపుడు
భద్రేభవరదుని బహుభాషలాడి
బిరుదుప్రతాపించి భీమునితోడ
దురము సేయఁదలంచి, దుదిఁ దనపుత్రుఁ
ద్రిభువనస్తుతు సహదేవు నుత్తముని
నభిషిక్తుఁజేసి, నిజాప్తభూసురుల
దీవనల్ గైకొని, దిక్కులల్లాడ
లావునఁబొంగి, లీలను గాసెగట్టి,
పాపిట [41]చొళ్లెంబు బాగుగాదీర్చి
చూపట్టెదగ్గఱ; చూడ భీముఁడును
సర్వ[42]సారగ్రంధు సతతమదాంధు
నుర్వీశనిర్బంధు యుక్తిసంబంధు
గాంభీర్యగుణసింధు గతసత్యసంధు
జంభారిరిపుబంధు జయజరాసంధుఁ


గనుఁగొని మల్లసంగ్రామంబు సేయ
ననిలతనూభవుం డతనిడాయుటయు,
సురుచిరోజ్జ్వలభాను శుచిబృహద్భాను
వరకాంతిహిమభాను వాక్యావధాను
బుధవిబుధోద్యానుఁ బుణ్యాభిధానుఁ
బ్రధనజయస్థానుఁ బార్థసన్మాను
శౌర్యవిష్వక్సేను సత్యనిధాను
ధైర్యసన్మణిసాను ధర్మసంధాను
నలఘువిజ్ఞాను భాద్రాసనాసీను
బలపవమాను దోర్బలభీమసేనుఁ
గని జరాసంధుడు గర్వంబుతోడ
ననిసేయ డగ్గఱి యనిలజుఁబొడిచె.
భీమసేనుండును భీమశౌర్యమున
నామగధేశుని నదరంటఁబొడిచె.
హిమకరదోర్దండ హేలాప్రచండ (?)
సమరభీకర వరచరణ ఘట్టనల
బ్రహ్మాండమెల్లఁ గంపముచాలనొందె;
బ్రహ్మ సంస్తుతుఁడైనపరమేశ్వరుండు
మెచ్చెనవ్వేళను ; మెఱసి వారపుడు
చెచ్చర నొడిసియుఁ జెనసిపట్టియును
వేసియు డాసియు వీఁగనొత్తియును
జేసేఁతనొడిసియుఁ జెలఁగిపల్కియును
బ్రబలి సింహంబునుభద్రసామజము
విబుధేశ్వరుండును వృత్రాసురుండుఁ
గులిశంబుగిరియును గొనకొనిపోరు
చెలువంబునను భీమసేనమాగధులు
మగఁటిమిఁ గార్తికమాసశుద్ధమున
నగణితంబైన పాడ్యమిదివసంబు


మొదలుగా నుద్దండముష్టిఘట్టనలఁ
బదివేలభంగులఁ బ్రధనంబుచేసె,
పడిఁ ద్రయోదశినాఁడు పరసత్వములను
బెడిదంబుగాఁబోరి పెనఁగి, వెండియును
ఆచతుర్దశినాఁటియర్ధ రాత్రమున
వైచిత్రి మగధభూవరుఁడలసినను,
ఆవేళ భీమున కచ్యుతుండనియె :
"లావుదొలంగెఁ జాలఁగమాగధుండు ;
పవమానుబలిమి నీపటుభుజాబలిమి
బవరంబులో వీనిభంజింపు." మనిన
ననిలసుతుండు నయ్యనిలునిఁ దలఁచి
ఘనసత్వుఁడై బాహుగర్వంబునందు
నాజరాసంధుని నాజిరంగముస
గాజువాఱఁగఁజేసి, కడువడిఁబట్టి
ముక్కున వాతను మొగిఁ జాలరక్త
మొక్కటియైకాఱ నొగినూఱుమాఱ్లు
విసరి నేలనువైచి, వెస వానితనువు
కొసరక [43]చీల్చి గ్రక్కున రెండుకడలఁ
బాఱవైచుటయు, నపారవైచిత్రి-
తో రయంబునను దోడ్తోన నారెండు
బద్దలప్పుడు నెడఁబాయకందఱును
'అద్దిరా ! వీనినే ' ర్పని కొనియాడ
నంటేర్పడకయుండ నంటిన, లేచి
తొంటియట్లనె వాఁడు దురముననెదిరె.
అదిగని భీముఁడత్యాశ్చర్యమంది
కదిసి కన్నుల నగ్నికణములుదొరఁగ,


నాగిరివ్రజపట్టణాధీశుఁ బట్టి
లాగించి వ్రేసి తా లఘుగతి వానిఁ
గాలను నేలను గాయంబునొంచి
చీలిచివైచి హెచ్చినసాహసమున
మారుతి వానిఁ బల్ముఱు చీల్చివిసిగి
యేరీతిఁ దెగటార్తు నీనీచు ! ననుచు
జింతింపుచుండ, నాశ్రితవత్సలుండు
కంతునితండ్రి శ్రీకలితగాత్రుండు
వనజోదరుండప్డు వడముడిఁజూచి
ఘనవృక్షశాఖ చొక్కంబుగాఁ జీల్చి
తాఱుమాఱుగవైవఁ, దనమదిఁదెలిసి
ధీరుఁడై యమ్మగధేశునిఁ జూచి
పిడికిట భుజసంధి బెడిదంబుగాఁగఁ
బొడిచియు నడిచియుఁ బొరలించి నొంచి,
యొకకాలు నొక కాల నొక కాలు కేలఁ
బ్రకటంబుగామెట్టి పట్టి యమ్మేను
పటపటమనఁజీల్చి పవమానుపట్టి
తటుకునఁ బడవై చెఁ దాఱుమాఱుగను.
ఆవేళ శ్రీకృష్ణుఁ డతిమోదమందె ;
నావేళ దేవతలార్చిరి మింట ;
భీమునియుద్దండభీమశక్తికిని
భూమికంపించె; నంబుధులెల్లఁ గలఁగె;
హిమగిరియొఱగెనో హేమాచలంబు
కమనీయశక్తి భగ్నంబయ్యెనొక్కొ!
యిదియేమియుత్పాత మిప్పుడటంచు
వదలక పురివారు వడఁకిరి కడఁగి.
మగధేశుమానినీమణులగర్భములు
తెగివిచ్చె; వానియుద్దీప్తసైన్యములు


పొదివిచ్చె; వానివిస్ఫుటకళేబరము
విదితంబుగా రాజవిపులసద్గృహము
తోరణాం[44]తరమునఁ దొడరివేయుటయు,
నారూఢి సూర్యోదయంబయ్యె నంత,
గరుడధ్వజుండు సత్కరుణ మాగధుల
నరుదారరక్షించె నభయంబు వేఁడ.
ఆగిరివ్రజమున నటుచెఱనున్న
సాగరవేష్టితక్ష్మాతలేశ్వరుల
విడిచి, జరాసంధవిభుతనూభవుని
నుడురాజనిభుని నత్యుత్తమోత్తముని
నాసహదేవుఁ గృపార్ద్రచిత్తమున
భాసురయుక్తితో బట్టంబుగట్టి
...............................
...............................
" ఆజరాసంధు మహాదివ్యరథము
భ్రాజితనవరత్నరాజి నొప్పారు;
నాయింద్రుఁడును దాని నర్ధిఁబ్రార్ధింపఁ
బాయక వసువను పార్థివుకిచ్చె;
నావసువొసగె జయద్రథునకును;
ఆవసుధేశుండు నట జరాసంధ
విభునకునిచ్చెను వేడుక దీనిఁ.
ద్రిభువన స్తుతమైన దివ్యరథంబు
మనమెక్కిపోదము మానుషంబునను."
అని విహగేంద్రుని హరిదలంచినను,
అతఁడేగుదెంచిన నారథంబునకు
జతనంబుతోడను సారథిఁ చేసి


హరియును భీముండు నమరేంద్రసుతుఁడు
నరదంబునెక్కి ధరాధీశకోటి
కొలువంగ వచ్చిరి గురువేగమునను
దలఁపులోఁబొంగి యింద్రప్రస్థపురికి
ఆపట్టణముజను లప్పుడిట్లనిరి :
"భూపాలవినుతుండు భుజబలాన్వితుఁడు
భీముండు సంగ్రామభీముండు గదిసిి
యామగధేశ్వరునణఁచెఁ గావునను
జతురబ్ధివేష్టిత జగతీతలంబు
చతురంబుగా నేలు శమననందనుఁడు.
సమధికబలు జరాసంధునిఁ జంప
నమర భీముఁడె కాక యన్యులోపుదురె!”
అని రాజనివహంబు నప్పురిజనులుఁ
జనుదెంచి చూచిరి జలజలోచనుని
భీము నర్జునుని గంభీరంబుతోడ.
ఆమెయిఁ గృష్ణభీమార్జును లంత
ధర్మరాజునకును దగుభక్తి మ్రొక్కి,
పేర్మి జరాసంధుఁ బెనఁచి యుగ్రాజి
నణఁచినక్రమమెల్ల నంతయుఁ జెప్పి,
గణుతింప నతనిచేఁ గారాగృహముల
నున్న రాజులనెల్ల నొగిఁ దెచ్చిచూప,
సన్నాహమున వారు శమనసూనునకు
దండప్రమాణంబు దగఁ జేయుటయును,
దండితో వారినందఱ నాదరించి
నిజదేశములకంపె నెయ్యంబుతోడ.
భుజగేంద్రశయనుఁ డప్పుడు పాండుసుతుల
వీడ్కొని రథమెక్కి వెసఁ బురంబునకు
వేడ్కతో నరిగె వివేకంబునందు.


అంతట ధర్మజుఁ డనిలజుకనియె:
'నెంతయుఁఁడఁగ మీరెల్ల సైన్యములు
సేవింపఁ బూర్వదక్షిణపశ్చిమముల
కా [45]యుత్తరంబున కరిగి రాజులను
గెలిచి కప్పంబులఁ గీర్తితో గొనుచు
బలిమినేతెం'డని పనుప నాక్షణమె
నాల్గువారధులపై నడచెడి క్రొత్త
నాల్గువారిధులట్లు నలుగురు గదలి
చనిరి వా." రనవుడు జనమేజయుండు
జననుతుఁడైన వైశంపాయనునకు :
"నే దేశమునకు వారేగిరి? ధనము
లేదేసఁ దెచ్చిరి? యెఱిఁగింపు.” మనినఁ
జతురాత్ముఁడైన వైశంపాయనుండు
మతి జనమేజయక్ష్మానాథుకనియె:

విజయు నుత్తరదిగ్విజయము

"వర్ణనకెక్కు పావకదత్తమైన
స్వర్ణదివ్యరథంబు జయముతో నెక్కి,
...............................
...............................
మత్తశాత్రవరాజమణుల మర్డించి,
యుత్తరభూమికి నురువడి నేఁగి
రణరంగమున నుమారమణునిఁ బ్రమథ
గణముల గెలిచి, భీకరశౌర్యమునను
ధనదునోడించి యర్థముచాలఁగొనుచు,
ననిమిషేశ్వరునిచే హాటకంబంది,


క్రమ్మఱ పూర్వభాగమున కేతెంచి
సమ్మదమ్మున బాహుసత్వుఁడై మెఱసి
వరపుళిందావనీశ్వరు నోర్చి పేర్చి,
దురములోఁ బ్రతివింధ్యుఁ ద్రుళ్లడఁగించి,
సకలమహాద్వీప జగదీశ్వరులను
బ్రకటంబుగా గెల్చి పౌరుషంబునను,
రాజులుగొలువంగ రాజసంబునను
రాజశేఖరకృపా రమణీయుఁడగుచు
శూరతవచ్చెఁ బ్రాగ్జ్యోతిషంబునకు,
నారూఢిఁ దత్పట్టణాధీశుఁడైన
భగదత్తుఁడేతెంచి పార్థునితోఁడ,
దెగి రణంబొనరించెఁ దివిఱిపోనీడ .
ఎనిమిదిదివసంబు లెదిరి పోరాడి
యనిమిషేంద్రకుమారు నఖిలాస్త్రములను
వడి భగ్నమగుచుఁ గవ్వడికి నిట్లనియె:
"నెడపనికడఁకతో నేనింద్రసఖుఁడ;
నీవింద్రసుతుఁడవు; నీకును నాకు
వావిరిఁబగలేదు; వలసినర్థముల
నడుగుమిచ్చెద." నన్న నతఁడాహవంబు
తడవక [46]కార్యసంధానుఁడై మించి
భగదత్తు సంతతప్రముదితచిత్తు
. . . . . . . . . . . . . .
బాహాబలోద్వృత్తు బహుదానవృత్తు
నాహవస్వాయత్తు నతిపుణ్యసత్తుఁ
గని వానికినిభక్తిగలిగి యిట్లనియె:
" ననఘాత్మకుఁడు భరతాన్వయుండైన


రాజు ధర్మజుఁడు సంరంభంబుతోడ
రాజసూయమహాధ్వరంబొనర్చెడిని;
అరివెట్టునీ.” వన్న నఖిలహేమములు
వరరత్నములు గజవాజియూధములు
నిచ్చినఁ గొని భక్తినిట్లనిపలికె:
“మచ్చిక ధర్మజు మఖమున కీవు
రమ్ము వేగమున వీరశ్రేష్ఠ!" యనుచు
నిమ్ములఁ దమభూమి కేఁగె శౌర్యమున ,

భీముని పూర్వదిగ్విజయము



చతురంగబలములసంఖ్యలుగొలువ
బ్రతిపక్షులను గెల్చి, పవననందనుఁడు
నానార్థములుగొని నడచి ముందటను
బూని కులూత భూభుజు బృహద్బలుని
గెలిచి, యుత్తరభూమికిని జని యందుఁ
దెలివితోడను వామదేవ గౌతముల
వసునామములుగల వనుధేశ్వరులను
బొసఁగఁగ గెలిచి, యాపూర్వదిక్కునకు
జని భక్తిఁ బాంచాలచక్రేశుచేతఁ
గనకాంబరంబులు గాంచి, విదేహ
రాజు జయించి, ఘోరదశార్ణవిభుని
యాజి [47]సుధన్వుని యతిశౌర్యమునకు
వెసమెచ్చి తన సైన్యవిభునిఁగాఁ జేసి,
యసమానయశుఁడైన యశ్వమేధేశుఁ
డగురోచమానుని ననుజయుక్తముగ
మగఁటిమి గెలిచి, సమ్మదచిత్తమునను


జేదిభూమికివచ్చి శిశుపాలుచేతఁ
బ్రోదిమీఱంగను బూజితుండగుదు
నతినిచే శమనసుతాధ్వరంబునకు
నతులితంబైనట్టి యర్థంబు గాంచి,
చేది దేశము వెళ్ళి చిత్రునిఁగాంచి
[48]మేదినీశు సుపార్శ్వు మేటిసత్యమున
ననిగెల్చి, గజపతి నామత్స్యనృపతి
ఘనమాళవులను మాగధమహీశ్వరుల
దండించి, మగధభూధవతనూభవుని
నండజపతిజవు నాసహ దేవు
మన్నించి వానిచే మఱి పూజవడిసి,
యెన్నంగ హిమగిరి కేఁగి తేజమున
నాగిరీంద్రునిచేతి ననుమతిఁ బడసి,
వేగంబె నిర్జరవిభుపర్వతమున
బహుకిరాతావళీపతుల నేడ్వురను
సహజశౌర్యుల [49]నుదంచజ్జయాధికుల
ధర్మయుక్తులను సుధర్మధార్మికుల
నర్మిలిఁ జంద్ర సేనాధీశ్వరులను
మురహరహితుల సముద్ర సేనులను
వరవిక్రములఁ గర్ణవత్సపతులను
వైరి [50]భంజన పౌండ్రవాసుదేవులను
గౌరవంబున [51]వశంకరులుగాఁజేసి
ధరణీశ్వరులగెల్చి ధనము రత్నములు
గురుతరంబగుశతతోటి సంఖ్యములు


సహదేవుని దక్షిణదిగ్విజయము

గొని యేఁగె భీముఁ డక్షుద్రశౌర్యమున;
ననఘుఁ డుత్తముఁడు [52] సహాదేవుఁడంత
ధీరత దక్షిణదిక్కునకరిగి
శూరసుమిత్రుని శూరసేనులను
దంతవక్త్రుని సాళ్వధరణీశ్వరులను
సంతత ప్రతిపక్షజగదీశవరుల
శృంగారయుతుల గోశృంగగిరీంద్ర
సంగుల నృపుల నిస్సంగులఁ జేసి,
కుంతిభోజునిచేతఁ గోరి యర్థములు
సంతసమునఁగాంచి, జయమురెట్టించి
జలజాక్షుపగవాని జంభకునొడిచి,
తలకొని వానినందనునిచే సమద
గజ హయరత్నసంఘంబులఁ గొనుచు
విజయుఁడై నర్మద వేడుకఁ జేరి,
యందు నవంతిదేశాధీశ్వరులను
విందానువిందుల వేడుకగెలిచి
పోయి మాహిష్మతీపురమున విడియ,
నాయెడ వడి నీలుఁడనుమహారాజు
దీకొనియెను సహదేవునితోడ.
ఢాక మాద్రేయుఁ డడ్డముచొచ్చి పోర,
నతనిపై నీలుండు ననలంబుఁ బఱప
నతివేగమున వహ్ని యాసహదేవు
సకలసేనలమీఁద సరవితోఁ జుట్టెఁ
బ్రకటితగతి.” నన్నఁ బారీక్షితుండు


చతురోక్తిఁబలికె వైశంపాయనునకు :
"బ్రతిభటుండై వచ్చి పావకుండేల
యాసహదేవుని నపుడు డగ్గఱెను?
ఈసమయంబున నింతయుఁదెలుపు,"
మనిన నమ్మునివరుం డతనికిట్లనియె :
"జననాథకులవార్ధచంద్రుఁడైనట్టి
నీలువంశంబున నిషధుండు ధాత్రి
యేలంగ, వహ్ని మహీదేవుఁడగుచు
వేదంబుచదువుచు వేడ్కఁ దత్పురము
సాదరంబునఁజొచ్చి, చక్కనియువతి
బరసతిఁ బట్టుక భావజుకేళి
సరసతసలుపంగ, జనపతిహితులు
పట్టుకవచ్చి భూపతిమ్రోలఁబెట్టి
పెట్టిన[53] శాస్త్రసంప్రీతితో నతని
దండింపఁబోయిన, దహనుఁడై మిగుల
మండుచునుండిన, మానవేశ్వరుఁడు
వెఱచి పావకునకు వెసమ్రొక్కిపలికె:
“నెఱుఁగగ యజ్ఞాన మిపుడు చేసితిని
మన్నించు.” మనవుడు మఱి పావకుండు
సన్నిధియై మహీశ్వరున కిట్లనియె:
“నడుగు నీకోరినయట్టివరంబు
తడయకిచ్చెద." నన్న దహనునకనియె:
“నాపురిమీఁద నేనరపతులైన
నేపారవచ్చిన నెంతయు నీవు
కదియు వారలమీఁద గ్రక్కున." ననిన
వదలక యగ్నియు వరమిచ్చిపలికె:


"నీపురిఁగల మానినీరత్నములకుఁ
బాపంబుపొందదు పరపతులందు
రతిసల్పినను; మహీరమణ, నీవిపుడు
హితబుద్ధినుండుమ యెంతయు." ననుచుఁ
జెప్పిన నృపుఁడును జేయుచునుండె.
నెప్పుడు పరధరణీశులవ్వీట
విడిసిన నీలుండు విదళింపుచుండుఁ
గడువడితో; నదికారణంబునను
అనలదేవుండు సహాదేవుమీఁదఁ
గనలుచుఁ గదిసినం గరసరోజములు
మొగిచి మాద్రేయుండు మును శుచియగుచు
మిగులంగ దర్భపై మెలకువనుండి
యగ్నిసూక్తంబు లయ్యెడఁబఠింపుచును (?)
అగ్నిదేవుని ఘను నభినుతిచేసె :
[54]నీతదర్ధం
బులు నిఖిలవేదములు;
పూతంబులకునెల్లఁ బూతయుక్తుఁడవు ;
ధర్మజుక్రతువు కిత్తఱిని విఘ్నంబు
పెర్మితోఁ జేయకు పెరిమ మన్నింపు" :
మనవుడు ప్రీతుండై యగ్నిదేవుండు
జననుతుఁడైన యాసహదేవునకును
వరదుఁడై యుండెను; వడిని నీలుండుఁ
గరిహయరత్నముల్ కనకాంబరములుఁ
దెచ్చి వేడుక సహదేవున కప్పు
డిచ్చి సద్భక్తితో నిట్లనిపలికె?:
"అమితప్రభావ, ధైర్యామరగ్రావ,
విమలకంబుగ్రీవ, విజితారిరావ,


భూతినీలగ్రీవ, పోషితజీవ,
నీతిపద్మజదేవ, నిత్యస్వభావ, (?)
నుతమహీదేవ, మానుషబలదేవ,
చతురకళాదేవసమ సహదేవ, (?)
శరణులఁగాన సజ్జనులనుబ్రోవ
బరఁగ విష్ణునిసేవఁ బరఁగితి వీవ;
నీకు నెవ్వరుసరి నృపులులోకముల!
రాకాసుధాకరారవితారకముగ
మన్నింపు; నిలుపుము మము రాజ్యములను
ఉన్నతి." ననవుడు నుప్పొంగి వేడ్క,
నాసహదేవుండు నా రాజుకనియె:
"భాసురప్రౌఢితో, బరఁగ రాజ్యంబు
సేయుము; నేఁగల్గఁ జింతనీ కేల!
ఏయెడ నీకునాకెంతయుఁ బొందు."
అని వానివీడ్కొని యట దక్షిణమునఁ
జని మహారాష్ట్ర రాజన్యులచేత
సకలార్థములుగొని, సాగరద్వీప
నికటనిషాదులు, [55]నిజకాలముఖులు,
కర్ణసత్ప్రభులు, రాక్షసయోధవరులు,
స్వర్ణవర్ణులు రామశైల సుతామ్ర
పతులు, ద్వీపజయంతి పట్టణాధిపులు,
నతులిత వశపరులై తన్నుగొలువఁ
బోయి కేరళ పాండ్య పుండ్ర కాళింగ
నాయకులను [56]బ్రధనంబున గెలిచి,
ద్రావిడ యవన గాంధారభూపతుల
లావుననోర్చి, చాలఁగ లక్ష్మిఁగొనుచు


దక్షిణభూమికిఁ దద్దయునేఁగి
రాక్షసేంద్రుఁడు రఘురామభృత్యుండు
శ్రీవిభీషణునకుఁ జెప్పిపంపినను,
భావించి యతఁడును భక్తితోడుతను
[57]శ్రీరాముమాడలుఁ జింతితార్థములు
వారణ హయ రథవ్రాత రత్నములు
నెసగఁ జతుర్దశహేమతాళములు
నసమాంబరంబులు నఖిలార్థములును
బంపెను సహదేవపార్థి వేంద్రునకు.
సొంపొంద నదిగొని చూచి మాద్రేయుఁ
డంతన పౌలస్త్యునధిపులచేత
నెంతయుఁ గప్పంబు లింపుగాఁగొనుచు
సహదేవుఁడేతెంచె జనలోకనాథ,
విహితప్రతాపుఁడై విశ్వంబుపొగడ.

నకులుని పశ్చిమదిగ్విజయము

నకులుండు సతులితోన్నతపరాక్రముఁడు
వకుళవ్రనూనోరు వరకచభరుఁడు
బలములుగొలువంగఁ బ్రఖ్యాతముగను
దెలివితోఁ బశ్చిమదిక్కున కేఁగి
కరి తురంగ భటప్రకరఘట్టనలను
శరధులుఘూర్ణిల్ల, సంభ్రమంబునను
మాద్రేయుఁ డత్యుగ్రమానుషంబునను
భద్రసైన్యంబులు బహుముఖంబులుగ
నరుదేర [58]మాహితకావనీశ్వరులఁ
దెఱఁగొప్పఁగా లాటదేశాధిపతుల


నాభీరగణముల నవలీలగెలిచి
యాభారతీసింధువందువర్తించు
[59]ద్రావణేయుల సముద్దండవిక్రములఁ
బావన గాంధార పర్వతాధిపుల
వశవర్తులనుజేసి, వాసుదేవునకుఁ
గుశలంబెఱింగించి కోరికతోడ
శాకల్యపురమున శల్యు [60]మద్రేశు
భీకరశౌర్యునిఁ బృథుబాహుబలునిఁ
దమమేనమామ నుత్తమగుణాంభోధి
రమణీయుఁడై కాంచి, రత్న రాసులను
హేమవాహనములు నీప్సితార్థములుఁ
బ్రేమతోఁగొంచును బిరుదుఁడై యరిగి
యక్షయ శ్రీపశ్చిమాంబుధిఁ జూచి
కుక్షి నివాసులఁ గ్రూరకర్ములను
బహుకిరాతులఁ బ్రతాపంబున గెలిచి,
విహిత సద్వరుణేంద్ర విశద సంవసధ
నరనాయకులచేత నానాధనములు
పరమానురాగుఁడై పడసి యవ్వాని
దశసహ [61]స్రోష్టకదంబంబు చెంత
వశముగాఁ బెఱికిరా వైరిభీకరుఁడు
నకులుండు వోయె ననంతశౌర్యమున.
అకలంకులైనట్టి యనిలజ పార్థ
నకులసహాదేవ నరవరోత్తములు
ప్రకటిత గుణధైర్య బాహువిక్రములు
విశ్వభూతలము దిగ్విజయంబుచేసి
శాశ్వతశ్రీ లెల్ల శమనసూననకు


వేడుకతోడ వేర్వేఱనిచ్చినను,
బ్రోడలుపొగడ నప్పుడు ధర్మసుతుఁడు
సంతోషమునఁబొంది సద్వరుణేశు
కంతుభంజనమిత్రుకైవడి లక్ష్మి
చాలంగఁబ్రబలి సోత్సాహుఁడై యుండె.
ఓలి ధరాపాలుఁ డూర్జితశ్రీల
రాజసూయమహాధ్వరము సేయఁబూన
రాజిత నిజమంత్రిరత్నంబులనిరి :
“ధనధాన్యములును రత్నములు గోధనము
ఘనదంతివాజులుఁ గలిగెఁజాలఁగను;
నవనిధానంబులు నానా [62]ధనములఁ
బ్రవిమలంబై నట్టి బండారమిండ్లుఁ
బరిపూర్ణమైయుండుఁ బ్రఖ్యాతముగను ;
అరుదుగా రాజసూయాధ్వరంబివుడు
గావింపు.” మనునంతఁ గమలలోచనుఁడు
వేవేగమునవచ్చి వెస ధర్మజునకు
వందనంబొనరించి వలయురత్నములు
పొందుగానిచ్చినఁ, బుండరీకాక్షుఁ
బూజించి యా యమపుత్త్రుఁడిట్లనియె:
"రాజీవనాభ , ధరాధరవర్ణ,
నీయనుగ్రహమున నిఖిలరాజులును
ఈయెడనరివెట్టి రెంతయుమాకు;
నపరిమితంబైన యర్థంబుగలిగె;
నుపమ విప్రులకును నుచితదక్షిణలు
దానంబులును బ్రసిద్ధముగఁజేయించి
నూనుగా మఖము సమ్మతముగావింపు. "
మనిన నారాయణుం డధిపతికనియె:
"నెనయంగఁ బూజ్యుండ వెల్లయంశముల ;


రాజులలోనెల్ల రాజసంబునను
రాజితధర్మ నిర్మలయశోనిధిని;
సకలసామ్రాజ్య ప్రశస్తలక్ష్ముణుడు
నకలంకగతిఁ గర్త ననిశంబునీవు ;
ఇదితగుఁ దగదన కేపనికైన
ముదమునఁ బనిపంపు మునుపుచేసెదను;"
అనిన సంతోషించె నపుడు ధర్మజుఁడు.

రాజసూయాధ్వర ప్రారంభము^

వనజాక్ష ధౌమ్య సద్వ్యాసానుమతిని
ఘనరాజసూయయాగము సేయఁ బూని
యనుజన్ము సహ దేవు నప్పుడుచూచి
పలికె ధర్మజుఁడు : భూపతుల నందఱను
బిలువంగఁబంపుము పెద్దఱికమున ;
రప్పింపు భూ దేవరాజులనెల్ల ;
నొప్పుగా వారికి నుచితగేహములు
కట్టింపు; యాగోపకరణంబు లెల్ల
గట్టిగాఁ దెప్పింపు గడఁకనీ. " వనిన
నగుఁగాక యనుచు సహదేవుఁడపుడు
నిగమోక్తిగాఁగ నన్నియు సమకూర్చి,
యుర్వి దేవతల రాజులను రప్పించి,
సర్వసౌఖ్యములను సంతోషములను
నుండుచో ; ధర్మజుండొగి నకులునకు
నిండినభక్తితో నెఱయనిట్లనియె:
"గాంగేయుఁడాదిగాఁగలబాంధవులను
సంగతిఁదో తెమ్ము చయ్యన." ననిన
నతఁడును గరిపురికరిగి భీష్మునకు
ధృతరాష్ట్రునకును యుధిష్ఠిరుమఖము


క్రమమెల్లఁజెప్పి వేగమునరండనినఁ
బ్రముదితంబుగను గుంభజ భీష్మ విదుర
ధృతరాష్ట్ర కృప కర్ణ ధృతిసోమదత్త
చతురభూరిశ్రవ శ్శల్య సైంధవులు
దుర్యోధనుండును దుశ్శాసనుండు
[63]నార్యనిగ్రహుఁడైన యాశకునియును
వచ్చిన, నవ్వేళ వరుసతోడుతను
ముచ్చికఁబూజించి మనుజేంద్రుఁడనియె :
"మీయనుగ్రహముస మెఱసి యీక్రతువు
సేయంగఁబూనితిఁ జిత్రంబుగాను ;
ఇదినిర్వహింప మీరెంతయు వలయు
విదితంబుగా. " నని వెస వారియాజ్ఞఁ
బడసి ధర్మజుఁడు ప్రభావంబునందుఁ
గడఁగి హాటకరత్న ఘనదానతతులు
పెట్టంగ [64]నియమించెఁ బేర్మితోఁ గృపున ;
గట్టిగా నౌఁగామికార్యముల్ దెలియ
గాంగేయ ద్రోణులఁ [65]గర్తలఁజేసె;
సంగతి మీఱంగ సకలార్థములకుఁ
గలయరాజులుదెచ్చు కప్పంబులకును
గొలఁదితో నీఁబుచ్చుకొనఁ గర్తఁజేసె
విదురుని బహునీతివిదుని నుత్తముని;
ముదమున నిష్టాన్నములు భక్తిఁబెట్టఁ
దుదిని గట్టడచేసె దుశ్శాసనునిని ;
బదవితో మణిహేమభండారములకుఁ
గురురాజుఁ గర్తగాఁ గొనకొనిచేసె.
నిరుపమాలంకార నీతిశోభితుఁడు


ప్రాజ్ఞుండు నయశాలి పాండవాగ్రజుఁడు
యజ్ఞదీక్షితుఁయ్యె నాగమోక్తులను.
రాజ తేజము విప్రరాజ తేజమును
రాజిత నవరత్న రాజి తేజమును
గల ధర్మసుతుని లోకములవారెల్ల
నలరుచుఁ జూచిరి యద్భుతంబంది.
బ్రాహ్మణో త్తమ మణిప్రకరంబునడుమ
బ్రహ్మతేజంబున బ్రహ్మయుఁబోలి
యుండంగ నవ్వేళ యురువినోదముల
మండలేశ్వర..... ...... ....... ...... .......
భూసురాశీర్వాద పుణ్యనాదములు
భాసిల్లఁజేయుచో బహువిధంబులను
బంచమహాశబ్ద పటునినాదములు
నంచితంబై మ్రోసె ; నాసమయమున
ధౌమ్యుండుఁ బై లుండుఁ దగినహోతలుగ,
సౌమ్యుండు నిగమార్థ చతురుండు ఘనుఁడు
యాజ్ఞవల్క్యమునీంద్రుఁ డధ్వర్యుఁడుగను,
సుజ్ఞానుఁడైన వ్యానుండు బ్రహ్మగను,
......... ......... ......... ........ ........ .........
పూతనారదముఖ్య పుణ్యమౌనులును
రాజిత భీష్మాది రాజశేఖరులు
నోజతో సభ్యులై యున్నతిఁగొలువ,
నభిరామ సర్వక్రియా సమగ్రముగ
శుభకరంబుగ రాజసూయయాగంబు
సువ్రతంబుగఁజేసి, సొంపుమీఱంగఁ
దీవ్రార్క తేజుఁడై త్రిజగంబుఁబొగడ
వేదవిప్రులకును వివిధ దానములు
మోదంబుతోఁజేసి, మునివరేణ్యులకు


ధరణీసురులకు భూతలనాయకులకు
మఱియును వర్ణాశ్రమములవారికిని
నమితదానంబులు నన్నదానములు
గ్రమముతోఁ జేసెను ఘనధర్మసుతుఁడు."
అనుచు సభాపర్వమందలికథలు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించె శాస్త్రోక్తివిఖ్యాతముగను
మునిసమూహంబు లిమ్ములఁ బ్రస్తుతింప.
భానుకులాంభోధి పావనచంద్ర,
భానుకోటిప్రభా భాభాసమాన,
యంజనాత్మజలోల, యతికృపాశీల,
మంజీరయుతపాద, మధురప్రసాద,
శరముఖాకర్షిత జలధికల్లోల,
ధరణిజాలింగన తాత్పర్యశీల,
బాణాసనాంకిత పటుభుజాదండ,
బాణభీకర శత్రుపటలసంహార,
అసమసాహిత్య విద్యాచతుర్ముఖుఁడు
రసికుఁడు బాలసరస్వతీశ్వరుఁడు
పసనొనర్చిన సభాపర్వంబునందు
నసదృశంబుగఁ బ్రథమాశ్వాసమయ్యె.

  1. శతంబను (మూ)
  2. ఈపదమును పదింపదిగావాడుచుండును ; ఆర్థమూహ్యము.
  3. పొందనున్నట్టి లింబొదరమున.
  4. విసరంబులందు. (మూ)
  5. లైప్రభ. (మూ)
  6. ఈపదమును వివిధార్థములలోవాడును; ఆధారమూహ్యము.
  7. 'అనర్థజ్ఞులతోడి చింతనము'
  8. 'దీర్ఘ చింత'
  9. 'అర్థంబులయం దనర్థకచింత' అని నన్నయ. సభా.
  10. ఉన్నతి, అను నర్థములో వాడియుండును. 'తనర్పు' అని, నన్నయ.
  11. అగ్నిసోములని నన్నయ. వ్యా. భా. లో 'అగ్నిష్టోమః, ' అని పా. అం.
  12. మధుకంఠోపరిచరులును . అని, నన్నయ.
  13. నదులును ననుమతియు మూర్తివంతములై, జలచరస్థలచరములగు కూర్మ...
    సింహాదిజంతువులతో వరుణునిసభఁ గొల్చుచుండు. అని నన్నయ.
  14. మాణిభద్రహేమనేత్రులు. అని నన్నయ, నామవాచకముల ఆదిని మధ్యను ఉప
    పదములఁజేర్చుట వింత.
  15. బొగడుచుండంగ
  16. మదరాక్షసేశ్వరులు (మూ ) మదరాక్షసేశ్వరులు బ్రహ్మసభలో నున్నట్లెందును లేకపోవుటచేతను, 'రూపరసగంధము' అని నన్నయ భారతములో నుండుటవలనను పైవిధముగా సవరింపఁబడెను. యతిభంగ మీతని సంప్రదాయమే.
  17. సంకల్పవికల్ప ప్రణవములని, నన్నయ.
  18. స్వామ్య......క్షమమున (మూ)
  19. రాజ
  20. మంబు (మూ)
  21. మూలమును అవ్యక్తముగా ననుకరించినాఁడు. చూ, నన్నయ. సభా . ప్ర. ఆ.110.గ.
  22. అమూలకము
  23. ఆయెడ ఈయెడ మొ. పదములను వ్యవహారమందలి ఉచ్చారణచేఁగలిగిన భ్రాంతివలన, అకారమధ్యములుగా ప్రయోగించి నాఁడు. తిమ్మయ రచనయగు ఆదిపర్వములోఁగూడ నట్టివి గలవు.
  24. హంసడిభకులు. -అని నన్నయ, సభా, ప. డిచికుఅనియు, పా , అం, ఇందంతట డిచికులనియేగలదు.
  25. "అందు" ప్రత్యయమును తృతీయార్థములో నితఁడు చాల చోట్ల ప్రయోగించి
    నాఁడు
  26. ఈపదమును వైభవపర్యాయముగా పదింపదిగా వాడును.
  27. భక్తి పదము ప్రేమవాత్సల్యపర్యాయముగా నిందుఁ గాననగును.
  28. సన్మతుల
  29. మంత్రకంబు (మూ)
  30. చదుకమందు వైచినట్లు. నన్నయ,భా . తే చతుష్ఫధ నిక్షిప్తే ' అని వ్యా. భా
  31. బోరెడు (మూ)
  32. యుద్దాడిత
  33. నదులు సముద్రుండున్నతను జేకొనును. (మూ)
  34. నడంగను (మూ)
  35. నిజసంక్షయశంకితాత్ముఁడై అను విషయ ముధ్యాహార్యము
  36. వధ
  37. సిరిగిరివర జైత్ర (మూ)
  38. నాథునిమాషదంబనెడి. (మూ) చాలవఱకు గవిత్రయభారతముననుసరించి యీ
    ద్విపదభారతము వ్రాయబడుటచే, లేఖకప్రమాదాదులవలనిదొసఁగలు సవరించుటలో అదియే ఆధారముగా దీసికొనబడెను.
  39. నికుర్వణ (మూ )
  40. బ్రదరము. (మూ)
  41. సూళ్లెంబు
  42. సర్వ (మూ)
  43. నిలిచి. (మూ)
  44. తంబున (మూ)
  45. వుత్తరంబున (మూ) వ్యావహారికోచ్చారణననుసరించి కవియీపదమును వకారాదిగాఁ బ్రయోగించియుండును.
  46. కార్యవాదియని కవియూహగాఁబోలు !
  47. సుధర్ముని (మూ) సుధన్వుఁడని నన్నయ. అధిసేనాపతం చక్రే సునర్మాణం
    మహాబలం. అని వ్యాస. భా.
  48. మేదినీశునిపార్శ్వమేటిసత్వమున.
  49. నుదంజభవకౌశుకులను.
  50. జంభన.
  51. వశీకరులు. (మూ)
  52. ఈపదమును దీర్ఘమధ్యముగాఁబ్రయోగించుట ఇతనికేగాక, ఆదిపర్వకర్తయగు
    తిమ్మయకును బరిపాటియే.
  53. శాస్త్రసమ్మతముతో నని యర్థము కాఁబోలు!
  54. నిత్యత్వమైయుండు (మూ)
  55. ఇట్టిపదములను వ్యర్థముగాఁ బ్రయోగించుట యీతనిపరిపాటి.
  56. ప్రదరము (మూ )
  57. రామనామాంకితములగు నాణెములు గాఁబోలు.
  58. మహితఉద్యాన నీశ్వరుల. (మూ)
  59. గ్రామణీయులని నన్నయ, సింధుకూలాశ్రితా యేచ గ్రామణీయా మహాబలా. అని వ్యా. భా.
  60. మాద్రేయు.
  61. ప్రాష్ట......చేత. (మూ)
  62. విధ. (మూ)
  63. ఆర్యాది.
  64. నిర్మించె.
  65. గర్తగా. (మూ)