ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

షష్ఠాశ్వాసము


శ్రీయుత వాగ్జాల సిద్ధివిశాల,
న్యాయనూతనచోడ, నరపయచౌడ,
పంచమ వేదప్రబంధ సత్కీర్తి
మించినసత్యధర్మీ! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పదొణఁగె .
ఆవిధంబున దైత్యుఁడణఁగినపిదప
భావిత హర్షసంభ్రమములు దోపఁ
గొడుకులనీక్షించి కుంతి యిట్లనియె:
"కడలేనిఈకాన ఘనులార, మనకు
జరియింప నేటికి? జనపదంబులకు
వరయుక్తిఁబోవలె వనము వెల్వడుఁడు."
అనిన నయ్యేగురు నౌఁగాక యనుచు
జననీసమేతులై సమ్ముదంబునను
అచ్చోటుచాలించి యరుగుచో, వెంట
వచ్చుదానవిఁజూచి వాయుజుండనియె:
"ఏలవచ్చెదు బాల! యీవేళ కొలువు
చాలుఁ; జయ్యనఁబొమ్ము సదనంబుకడకు.
అన్నఁజంపినపగ యాత్మలోనిడిన
విన్ను నమ్ముట యెట్లు! నీవు రాక్షసివి;
కాదని, నీరూపుగై [1]కొనఁ జనునె!
పోదువు మీయన్నపోయినకడకు."
అనిన హిడింబ దైన్యంబునం గుంతి
గనుఁగొని గదిసి యేకతమ యిట్లనియె:


"కులముతోఁ బగగొని కుసుమాస్త్రబాణ
దళితనై వచ్చితిఁ దనుబొందుమనుచు;
కపటమెఱుంగ; రాక్షసినైన నేమి!
విపరీతమునఁ దన్ను విడిచినఁ జిత్తు.
చెప్పఁగదే! భీమసేనున కెఱుఁగ
నిప్పుడు ననుడించి యేఁగుట తగదు.
[2]తగ నతీతానాగతము లెఱుంగుదును;
బగతుచే మీరుత్రోపడివచ్చినారు;
ఇద్దెస మీకింక నేగుచో నెదుటఁ
దద్దయు విశ్రాంతి తరువులు [3]కూర్పఁ
గన్నులపండువై కడుసమీపమున
నున్నది విను శాలిహోత్రునాశ్రమము.
అచ్చట కేగి మీరర్థినున్నంత
వచ్చు వేదవ్యాస వరమునీశ్వరుఁడు.
ఆతఁడు బుద్ధి మీకానతియిచ్చు;
నాతి, వెండియు విను నావిశేషములు.
గోరినయెడలకుఁ గొనిపోదు మిమ్ము;
వారకతెత్తు మీవాంఛితార్థములు;
ఏ రూపుగమ్మన్న నేను గానేర్తు;
నూరక తానేల నొల్లఁడె!"ట్లనినఁ
గుంతిసంతోషించి, కొడుకుతో దాని
మంతనంబెఱిఁగించి మఱియుఁ బ్రార్థించి :
"రా భీమ, దానవురాలి విరాలి
లాభించు మనకు నేలా దిగవిడువ.
'చేపట్టుశరణ' ని చేరినవారి
నేపట్టునను గాచు టిదిధర్మ" మనిన


ననిలజుఁ డమ్మాట కంగీకరించి
దనుజకామినిఁజూచి తగగుస్తరించి:
“యోజతో దినమెల్ల నొకచోటఁబుచ్చి
రాజీవముఖి, రమ్ము రాత్రినాకడకుఁ ;
గొడుకుగల్గినదాఁక గొమ్మ, యీరీతి
నెడతాఁకి, వీడ్కొను మెఱిఁగియవ్వెనుక. ”
అనియెడఁబడఁజెప్పి యందఱుఁగూడి
చనుదేర, వేదఘోషంబులతోడ
వేడుకఁ బులినాకి విడిచిన లేడి
దూడలచేఁ బడ్డ దొరువులచేత,
హరిదువ్వ నిద్రించు హస్తులచేతఁ,
బరమాత్ము జింతించు బకములచేత,
ఘనబిడాలములకుఁ గందమూలములు
గొనితెచ్చు మూషికకులములచేత,
నహులకు యోగనిద్రాసక్తి నుండ
బహుబిలములు చూపు బభ్రులచేత,
వాసిత మాసోపవాస వరాహ
కాసర శరభ ఖడ్గంబులచేత,
శాఖలగతి వేదశాఖలు[4]గలుగు
శాఖులచే నతిసౌమ్యంబ యగుచు
ననుపమ శాలిహోత్రాశ్రమంబున్నఁ
గనుఁగొని మ్రొక్కి భాస్కరునుదయమున
నిత్యసంధ్యావిధుల్ నృపు లందుఁదీర్చి,
దైత్యకామినిమాట తథ్యమౌననుచు
నున్నయప్పుడు వ్యాసుఁ డురుకృపావాసుఁ
డున్నతాజినవాసుఁ డొయ్యనవచ్చి,
.................................................
హరినాత్మనునిచిన యానిమిత్తమున
.................................................


వేడుకఁబూజించి వినతులై యున్న,
గోడలి మనుమలఁ గూర్చుండఁబనిచి,
యాసీనుఁడై పాండవాగ్రజుఁబలికె:

వ్యాసుఁడు పాండవులకు హితోపదేశము సేయుట


పాసిపొండని మిముఁ బలికెనే నృపుఁడు!
కొడుకుఁ దానును నొక్కకుత్తుకయగుచు.
వెడలివచ్చుట మేలు వెయ్యేల మీకు
వదలక మిముఁ జావువారలఁ జేసి
యుదకంబులను నిచ్చియున్నారువారు.
ఓలిఁగౌరవులకు నుదకంబులిచ్చి,
యేలుదు భూచక్ర మీవు చింతిలకు.
నాలుగుభుజములు నారాయణునకుఁ
బోలెఁ దమ్ములు నీకు భుజబలోన్నతులు.
రాజసూయమహాధ్వ[5]రంబశ్వమేధ
వాజపేయములు భూవర, సేయఁగలవు;
ఇంతనుండియు మిమ్ము నెఱుఁగరాకుండఁ
గొంతకాలము మానిఁ గొలిచి యిందుండి,
యేకచక్రమునకు నేఁగుఁ; డేనంత
నాకడ కేతెంచి యరయుదు మిమ్ము.
కమలలోచన యిది గడుముద్దరాలు;
రమణి రాక్షసియని రాదు వర్ణింప.
తనయు మహాసత్వుఁ దనయంతవాని
గను నిందు భీముఁడు; కౌంతేయ, మఱియు
నొక్కొకయాపద యుదయించువేళ
నక్కుమారుడు మిమ్ము నందఱఁ గాచు.
అనివ్యాసుడేఁగిన, నయ్యాశ్రమమున
మునితోడ బహుశాస్త్రములు చదువుచును


మనుజేంద్రులున్నచో, మారుతి యంత
దనుజకామినితోడ దర్పకకేళి
వెసఁ బుష్పకముఁగన్న వేల్పును బోలెఁ
బొసఁగ నానామార్గములఁజరింపుచును,
నేరూప మేప్రాయ మిచ్చకువచ్చి
నారూప మాప్రాయ మతివఁగమ్మనుచు
విహరింప, నుదయించె వెస ఘటోత్కచుడు;
సహజశస్త్రాస్త్రుండు, శంఖకర్ణుండు,
శ్యామలతనుఁడు దంష్ట్రాకరాళుండు,
భీమవిక్రముఁడు, గంభీరభాషణుఁడు,
రాక్షసయుతుఁడు సంప్రాప్తయౌవనుఁడు,
వీక్షింప సురలకు వ్రేగైనవాఁడు.
దనుజుఁడాగతిఁబుట్టి తల్లికిమ్రొక్కి,
మనుజేశులకు మ్రొక్కి మౌళిఁగేల్మొగిచి  :
“పనిగలయప్పుడు భవ్యాత్ములార,
ననుదలంపుడు వత్తు నాసేనఁగూడి;
వచ్చి, సంకటములు వడి నెన్నియైన
బుచ్చివైచెద మీరు బుద్ధిలో మెచ్చ. "
నని చెప్పి, వారిచే ననుమతి వడసి
చనియె నుత్తరముగా జననిదోడ్కొనుచు.
ఆలోనఁ బాండవు లట్లు శాస్త్రములు
శాలిహోత్రునియొద్దఁ జదివి చాలించి,
యతనిచేఁ బూజితులై మ్రొక్కి కదలి,
చతురత మత్స్యరాజ్యములోన నడచి,
యంతఁ [6]త్రిగర్తరాజ్యములోన వెడలి,
యంతఁ గీచకవిషయంబులు దాటి,


ఏకచక్ర పురావాసము



లాటరాజ్యంబున లలి బ్రహ్మలోక
చాటువుగల యేకచక్రంబు గాంచి,
యనుపమకీర్తు లయ్యగ్రహారంబు
ఘనవిప్రవేషంబు గైకొని చొచ్చి.
విడిదలగా నొక్కవిప్రునియింట
విడిసి వేదంబులు వేడ్కఁజదువుచు,
నేగురుభిక్షార్థమేఁగి నిత్యంబు
నోగిరంబులు దేర, నువిద భాగించి
సగముభీమునిచ్చి సరినున్న సగము
ప్రేమ నేవురుఁ దృప్తి బెరయఁ గుడుచుచును
నుండుచో, రవితోడ నుల్లసంబాడు
పాండవతేజంబు పరికించి ద్విజులు:
"ఐదుమోముల శివుండైదు [7]వేషంబు
లాదటగతిఁ దాల్చి యరుదెంచినాఁడొ!
పరహితోన్నతినొప్పు పంచభూతములు
ధర నిట్టితనువులు దాల్చియున్నవియొ !
ఈ తేజములు వీరికెక్కడఁ గలిగె
ధాతనూతనసృష్టి తలఁప [8]నేవురును!"
అనునంత, నొకనాడు హాహారవంబు
విననయ్యెఁ దారున్న విప్రునియింట
అదివిని, గొంతియు ననిలనందనుఁడు
సదయులై కదిసి విచారింపుచుండ,
నాలోన మూర్ఛిల్లి యల్లనఁదెలిసి
యాలి బిడ్డలఁ జూచి యాయింటిద్విజుఁడు :


“అక్కట! సంసారమతికష్టమగుట
నిక్క మెఱింగియు నేరుపు లేక
యాలని బిడ్డని యడియాసఁజొచ్చి
తూలుదునే యిట్టిదుఃఖాబ్ధిమునిఁగి!
యీదెసకై తొల్లి యీపల్లెవిడిచి
పోదమురమ్మన్నఁ బొలఁతి రాదయ్యె.
ఒగ్గుగూడిన యగ్నిహోత్రంబు విడిచి,
యగ్గలంబైన దేవార్చన విడిచి,
యతిథిసత్కారంబులన్నియు విడిచి,
మృతి కేఁగవలసెనే మిన్నక తనకు!
పుత్రుండు బాలుఁడు పొమ్మనరాదు;
పుత్రి యల్లునిసొమ్ము పొమ్మనరాదు;
పొలఁతి యుత్తమసాధ్వి పొమ్మనరాదు;
నలువుర మీయింట నాకుఁబోవలసె. "
అనవు డప్పుడుచూచి యంగనపలికె :
"ననుఁబంపు ప్రాణేశ , నరభోజనునకు
నెనగ బిడ్డలఁగంటి నీడేరెమనువు;
అసురచేజత్తు ముత్తైదువచావు.
పతిలేక బ్రదికెడు పడఁతిజీవనము,
కుతలంబుతిట్టు.........................
పడిన మాంసముఁజూచి పక్షులువోలె
వెడదలగాఁ జూచి విటులుగోరుదురు.
కులము విచారించి కూతునీనేరఁ;
జలముతో బాలునిఁ జదివింపనేర ;
నేనుజచ్చిననేమి! యింక వివాహ
మై నీకుఁ బుత్త్రుల నార్జింపవచ్చు."
ననిన నిర్వురఁజూచి యాకూఁతురనియె:
"ననుబంపుమచటికి న్యాయమార్గమున;


నెంతకాలమునకు నే వింతదాన;
నింతమేలొనరించి యే ముక్తి గాంతు;
గురుఁడు శ్రాద్ధముసేయఁ గూఁతున కెక్కు;
గురునకు శ్రాద్ధంబు కూఁతుచేఁగాదు;
గురులార! మీరున్న, గొడుకులుఁ గూఁతు
లిరవొందఁ గల్గెద రిండ్లు నిండంగ."
అనునంత, సెలగోల యల్లార్చి పేర్చి
తన ముద్దుమాటలఁ దనయుఁడిట్లనియె:
"ఎవ్వరుఁబో నేల! యేను నీ చివ్వఁ
ద్రెవ్వనేయుదు నట్టిదీనరాక్షసుని;
నబ్బకదానవుఁ డబ్బక కాక,
యిబ్బాధనొనరింప నెంతటివాఁడు!
ఇదె చన్నుగుడిచి పోయెద." నన్న నవ్వి
మదిశోకమించుక మఱచియున్నంతఁ,
గుంతి బ్రాహ్మణుఁ జేరి: "గుణధామ, మీకు
నింతచిక్కులువడ నేమి కారణము?
చావ నెచ్చోటికిఁ జనవలె మొదల?
ఆవల నెవ్వారికాహారకాంక్ష?
ఎఱిఁగింపు వినియెద; నేభంగినైన
వెఱపుమాన్చెద." నన్న విప్రుఁడిట్లనియె:
"ఏమనిచెప్పుదు నింతి, యిప్పురికి
నామడ యమునామహానది గలదు;
అందు దైత్యుఁడు బకుండనువాఁడు తొల్లి
సందుచేకొని యేకచక్రంబువారి
నొక్కటమ్రింగుచో, నూరి బ్రాహ్మణులు
తక్కక జప హోమ దాన ససత్వమున
నసురేశునిల్పుచు నప్పుడిట్లనిరి:
'పొసఁగ నిందఱమ్రింగి పోనేల నీకు?


[9] నొక్కట శశిమ్రింగ నొల్లక కాదె
యొక్కొక్కకళ మ్రింగుచున్నారు సురలు!
దనుజేంద్ర, నీకు నిత్యము బండిగట్టి
యెనుబోతులను గట్టి యిరువంక రెండు,
బండిలోఁ గూరలు భక్ష్యభోజ్యములు
నిండించి, యొక్కమానిసి దోలుకొనుచు
నేతెంచు నీవున్న యెడకు; నీ వంతఁ
బోతుల మనుజుని భోజ్యంబుగొనుము.”
నావుడు నొడఁబడి నదికేఁగె వాడు.
దేవి, యీయది సాగు దిన మొకయింట;
నువిద, నూఱేండ్లకు నూరెల్లఁ గలియు;
వివరింప నీయూరి విధమదెట్టిదియొ
ఏతెంచె నేడు మాయింటికి వరుస
నాతి, పోవలె." నన్న నరనాథు దేవి :
"కలవాడు నీకు నొక్కఁడె పసుబిడ్డ,
తలఁప నేవురునాకుఁ దనయులుగలరు.
ఒక్కనిఁబుత్తు నీయుపకారమునకు
గ్రక్కునఁ బ్రత్యుపకారంబుగాఁగ;
నుంటిమి నీయింట నుల్లంబులలర;
వెంట [10]నొడల్ రాదు విప్ర, యెవ్వరికి."
అనిన విప్రుఁడుపల్కె : "నతిథుల మిమ్ము
దనుజుల కనుపుట ధర్మమా తల్లి!
గ్రామసూతకులముగావున మాకు
భామ, విధమును బాటింపవలసె;
నేనుబోయెద ." నన్న నిట్లనుఁగుంతి :
.................................................
"భీమదైత్యులువోరఁ బ్రిదులఁడీ కొడుకు;


దానవు నాహవస్థలిఁ జంపివచ్చు;
నేనొండువిధమైన నేటికిఁ బుత్తు!
తొల్లియు దైత్యులఁదునుమాడినట్టి
బల్లిదుం." డని ప్రీతిఁ బవనజుఁజూచి :
“తడయక బకుఁజంపి తనయ, ర;" మ్మనుచుఁ
గొడుకు నియోగించె గుంతివేడుకను,
అంతఁ దమ్ములుఁ దాను యమసూతి వచ్చి,
వింత భీముని యందు వీక్షించి యెఱిఁగి
కుంతికినిట్లనుఁ : - "గుంతి, యిదేమి!
యెంతయుఁదెలిసి నేఁడితఁడున్నవాడు;
కయ్యంబదెక్కడఁ గలిగెనో తనకు?
నియ్యత్న మేమైన నెఱుఁగు దే!" యనినఁ,
గుంతియావిధమెల్లఁ గొడుకుతోఁ జెప్పఁ
జింతించి, యతఁ: "డిట్లు సేయంగఁ దగునా!
విడువవచ్చినయట్టి వీరుండెనీకు !
వడముడి భారతవంశవర్ధనుఁడు.
ఎల్లసంకటములు నితనిచేఁగాదె!
తల్లి, యీవును మేముఁ దప్పి వచ్చితిమి ;
ఇతఁడుగూలిన వైరు లెత్తరె తలలు!
మతిఁ గార్యహేతుపు మఱుచితి." వనినఁ
దల్లి పుత్త్రునిఁజూచి : "ధర్మమె తప్ప!
నెల్లవారలలావు నెఱుఁగవు కొంత.
పావని పుట్టినపదియవనాఁడు
నా వెరవునఁదప్పి యవనిపైఁ బడిన,
నిసుమయ్యె నాగొండ యెల్లరు నెఱుఁగ;
నసురఁజంపఁడె మొన్న నాహిడింబాఖ్యు!
ఆప్రభావమున మహాపుణ్యమనుడు,
విప్రకార్యార్థమై వీనిఁ బొమ్మంటి."


అనిన సంతోషించి యసురపైఁ బవన
తనయు నియోగించి ధర్మసూతియును.
అప్పుడు సందేహ మాత్మలోఁ బాసి,
యుప్పొంగి పలికె వాయుజుఁడు బ్రాహ్మణుల :
"కడుపార నశనంబు గానమిఁ జేసి
కడు డస్సియున్నాఁడఁ గరుణాఢ్యులార!
తెండు నాకశనంబు తృప్తిగా." ననిన,
నిండారువేడ్కతో నెలఁతయుఁ బతియుఁ
గడవల వార్చినకమ్మనికూడు,
నెడపని బానల నివురువంటకముఁ,
గొప్పెర్ల నుడికిన గుజ్జుపులగము,
విప్పైన కాఁగుల విచ్చుపాయసము,
నేర్పడఁ బరఁటుల నెనసినపప్పుఁ,
బేర్పుననుడికిన పిండియుక్కెరయు,
ఖండశర్కరయును, గడవలకొలఁది
మండిగలాజ్యంబు మఱి మొదలుగను
గలిమియేర్పడఁదెచ్చి కదలికాపత్ర
ములఁబోయబోయ, భీముఁడు వానినెల్లఁ
గలిపి ముద్దలుచేసి కడుజఠరమున
నిలిపి యెంగిలి వార్చి, నెమ్మోము దెలియఁ
బోలఁగొండలవంటిపోతులు దివియఁ
జాలక పెనఁగునాశకటంబు వెంట
నల్లనవచ్చి, యయ్యసురయున్నెడకు
నెల్లేరువునఁబోక యెగువకుఁబోయి, (?)

                 బకాసుర వధ

రమ్మని యొక మాఱు రాక్షసుఁబిలిచి,
కమ్మఱ నయ్యేటి కఱతకు డిగ్గి ,


శకటంబుడిగ్గి యాచమనంబుచేసి,
బకుఁడువచ్చినదాఁకఁ బస లేదుగాన
బండిలోపలికూడు బావుకొనంగ,
మండుచు బకుఁడు గ్రామంబుపై నలిగి :
"యొక్కటఁ దముమ్రింగ నొల్లకయున్న
మిక్కిలిక్రొవ్విరే! మేదినీసురులు;
రారైరిప్రొద్దున; రాకున్న నేమి,
తేరైరి నేనున్న తెరువుకు బండి;
తేకున్న నేమి, నాదృష్టి మార్గమున
నీకుడుగుడువ వీఁడెంతటివాడు!"
అనిపోయి పిడికిట ననిలజుఁ బొడువఁ,
దనుగానివానిచందమున భీముండు
తలఁకక పొణకయంతయు రిత్తచేసి,
జలముల మఱియు నాచమనంబు చేసి,
యుర్వికి వ్రేఁగైన యొకమాను వెఱికి
దుర్వారుఁడై యేసె దుష్టదానవుని.
వాఁడంత నొకమాను వలచేతఁ బూని,
వేడిచూపులఁ బాండవేయుని జూచి:
"మనుజభోజనులైన మాకు నీవెంత!
మనుజకీటమ, నిన్ను మడియించి నేఁడు
ఎడపనియాఁకట నే నిండ్లతోడఁ
గడిచేసి యేకచక్రము మ్రింగువాఁడ
నిలు.” మని యొక మ్రాను నృవునిపై నేయఁ,
బలు దునియలుచేసి పలికె రాక్షసుని:
"ప్రకటించి యసిచూపి బ్రాహ్మలచేత
నొకకాసుమొదలుగా నొల్లరునృపులు ;
అట్టిబ్రాహ్మణుల నేలా! యిల్లువరుసఁ
బొట్టకై చంపితి పుణ్యవిదూర!


మనుజులపునుకలు, మఱి [11]రిత్తబండ్లు,
నెనుఁపయట్టలు నిండా నేటిచాడ్పునను;
అన్నియుఁగ్రక్కింతు." నని వాని నెగసి
తన్నిన, వాఁడు నుధ్ధతి భీమునురము
వదలకపొడిచిన, వారిరువురకు
గదనంబు లోకభీకరముగా నయ్యె;
ఉరుముష్టిహతి మ్రోఁత యుబ్బుటగాని,
కరములరాకపోకలు గానరావు;
పడుట లేచుట కానఁబడుఁ గొంతగాని,
వడముడి బకుఁడన వరుస నేర్పడరు;
విదలింప నదలింప వ్రేటును వాటుఁ
బొదివి నొక్కును ద్రొక్కుఁ బోటును మాటు
నొడుపును విడుపు నొండొరుత్రోపు దాపుఁ
దొడికిపట్టును బిట్టుఁ దోరమై నిగుడ
నంధకాసురునకు హరునకుఁబోలె
బంధురసమరంబు బకపాండవులకు
నడచుచో, నలిగి మారుతపట్టి వానిఁ
బడద్రొక్కి, యంతనేర్పడ నిరుఁగేలఁ
గటుకున నటవచ్చి కట్టియవిఱుచు
పటులీల విఱిచె నాపాపాత్మురొమ్ము.
అప్పుడు బకుఁడు మహాధ్వనిసేయఁ
జప్పుడువిని వచ్చి సకలరాక్షసులు
వినువీథినిలిచిన, వీక్షించి భీముఁ
డనియె: "రాక్షసులార, యందఱువినుఁడు;
ఏకచక్రమునకు నెవ్వఁడే నెగ్గు
గైకొనిచేయు నాకపటరాక్షసుని


నీచావుచంపుదు నెఱిఁగిపొం" డనిన,
వేచనిరామాటవినుచు రాక్షసులు.
బకుని నెత్తురుటేఱు పాఱినచోట
బకములు నిలువక బంతులుసాగె.
ఆరీతి బకుబారి యాహిడింబారి
యూరికి లేకుండ నుపకృతిచేసి,
బరువైనయాకళేబర మీడ్చి తెచ్చి
[12]పఱగటవైచిన, బ్రాహ్మణోత్తములు
ననిలసంభవుని బాహాధురంధరునిఁ
గనుఁగొనవచ్చిరి కట్టలుగట్టి.
సురపురీసురుల భూసురుల దీవనలు
కరువలిపట్టికిఁ గలిగె [13]వేవేలు.
వేవిధంబుల నిట్లు విప్రప్రతిష్ఠ
గావించి వేడ్కతో గౌంతేయులుండ,
నత్తఱి నొకవిప్రుఁ డాగృహంబునకు
హత్తినరతిఁ దీర్థయాత్రకై వచ్చి,
గృహపతిఁగాంచి యాగృహమేధిచేత
బహుభంగిఁ బూజలువడయ, నారాత్రి
కొడుకులువినుచుండఁ గొంతి యావిప్రు
నడిగెనిట్లని చేరి యతివినయమున :
"ఏ దేశమున వార? లెందుఁ బోయెదరు?
భూదేవ, యేభూమిభుజుఁడు ధార్మికుఁడు?
అతిథులఁబూజింప నాత్మలోఁగోరు
హితులు పుణ్యగృహస్థు లేసీమఁగలరు?
తలఁప నేమైన వార్తావిశేషములు
గలవె! మీరెఱుఁగనికటకంబు లేదు


చెప్పుఁడా." యనుటయుఁ జెలువనీక్షించి
యప్పుడా విప్రుఁడిట్లని చెప్పఁదొణఁగె :

ద్రౌపదీ ధృష్టద్యుమ్నుల జననము



"భామ, యేదక్షిణపాంచాలభూమి
ధాముఁడఁ; దీర్థయాత్రకు వెడలితిని.
ద్రుపదుఁడచ్చటి రాజు దుష్టమర్దనుఁడు;
విపులధర్మముత్రోవ విడువఁడా రాజు,
అతని రాజ్యంబున నతిథిపూజనము
పతిపత్నులేకమై భక్తిఁ జేయుదురు.
ఆనృపునింట స్వయంవరంబైన
నే నందుఁబోయెద నిప్పుడు మరలి.
ఈక్షింపఁబోయిన యెల్ల విప్రులకు
దక్షిణలిచ్చునాతండనివింటి.”
ననిన:"స్వయంవరం బతనికిఁ జేయఁ
బనియేమి? నాకునేర్పడఁజెప్పు." మనిన,
నారాచకూతున కా విప్రుఁడనియె:
"కారణంబడిగితిఁ గ్రమమొప్పవినుము ;
రామ, ద్రోణుండు భరద్వాజమునికిఁ,
బ్రేమతో ద్రుపదుండు పృషతభూపతికి,
నొక్కట మునిసీమ నుదయించి పెరిగి
మక్కువ నన్యోన్యమైత్రి వాటించి
యున్నచో, ద్రుపదునకుర్విరాజ్యంబు
క్రన్ననఁబూనబో గార్యంబు గలిగె.
గురుని రమ్మనిపిల్వ గురుఁ : డీవు పొమ్ము;
శరవిద్యనేర్చి యచ్చటికి నేవత్తు;
మఱవకు' మనుటయు : 'మఱతునే యేను!
జెఱిసాము నీకు నీక్షితి యిత్తుఁగాక."


అనిద్రుపదుఁడుపోవ, నటయొక్కనాఁడు
ధనకాంక్ష ద్రోణుఁ డాతనిఁగానఁబోయి.
తనలేమిచెప్ప, నాతఁడు గర్వమహిమ
వినక యెగ్గులువల్కి వెడలదొబ్బింప,
నవమానముఁనఁ గ్రోధమారాజుమీఁద
నివురొత్త నాచార్యుఁడిభపురి కేఁగ,
ధృతరాష్ట్రుఁ డాతని ధృతినాదరించి
సుతులకు శరవిద్య చూపఁబెట్టుటయు,
శిష్యుల నతఁడు [14]వీక్షించి : 'వివేకి
దూష్యుని నాకు నాద్రుపదుఁ దెండయ్య.”
అని విద్య చెప్పిన నంతయు నేర్చి
యనికి సన్నద్ధులై యాశిష్యులేఁగి
పాంచాలుఁ దాఁకి యాప్రభుని బాణముల
వంచితులై పాఱ, వారిలో నరుఁడు
దురమునఁ దేరితో ద్రుపదుబంధించి
కురువర్ధనుఁడు దెచ్చి గురునకిచ్చినను,
బాంచాలు నెగ్గులుపలికి ద్రోణుండు
పంచతకడమగాఁ బగదీర్చి విడిచి.
విడిచినఁ గ్రోధాగ్ని విరిసి యారాజు
మృడునకుఁ దపమున్న, మెచ్చి యా వేల్పు
ప్రత్యక్షమగుటయుఁ, బాంచాలుఁడపుడు :
“సత్యాత్మ, నిర్గుణ, శైలేంద్రచాప,
స్మరహర, భూతేశ, జాహ్నవీమకుట,
కఱకంఠ, మాహేశ, కామితఫలద,
అంధకాసురవైరి, యఖలాదిజనక,
సింధుర[15]దమన, యాశ్రితకృపామూర్తి


మధువైరి [16]నియత సమర్చితాచరణ,
విధిశిరోమాలికా విభ్రమాభరణ,
నిత్యాత్మ, పరమాత్మ, నిఖిలభూతాత్మ,
సత్యాత్మ, ద్రోణునిఁజంపెడికొడుకు,
నరునకుదేవిగా నాకొక్కకూతుఁ
గరుణింపు." మనుటయుఁ, గాలకంధరుఁడు:
"హోమంబు సేయుము, హోమకుండమున
భూమీశ, యిరువురుఁబుట్టుదు.” రనుచుఁ
బంచాస్యుఁడేఁగినఁ, బాంచాలుఁడరిగి
పంచ[17]భక్ష్యములతో బ్రాహ్మణతతికి
నెడపనిభోజనంబులు పెట్టుటకును (?)
గడగట్టి, శాలలు కట్టించి, యంత
యాజోపయాజుల నఖిలసన్మునుల
యాజత్వమునకు నర్చించి తెచ్చి,
యాగోపకరణంబులన్నియుఁ గూర్చి,
 [18]యాగాగ్నులను దాను నాత్మలో నిలిపి,
దేవేంద్రసుతునకు దేవిగాఁ గూఁతు
వావిరి గురునకువైరిగాఁ గొడుకు
బుద్ధిలోపలఁగోరి పుత్రకామేష్టి
యద్ధాత్రిపతి వ్రేల్వ, నగ్నికుండమున
మణికిరీటముతోడ మార్తాండకిరణ
గుణ[19]ధనుర్లతతోడ గురుశక్తితోడఁ
దూణీరయుగముతోఁ దొడవులతోడ
శోణాశ్వములతోడ సుతుఁడొక్కరుండు,
మందహాసముతోడ మంజిమతోడ
నిందీవరశ్యామ హితకాంతితోడ


హిమకరముఖముతో హేమకలాప
కుముదగంధములతో గూతురొక్కర్తు
జనియింపఁ, దనయు ధృష్టద్యుమ్నుఁడనియు,
ననువొప్ప సుతఁ గృష్ణయనియును బిలిచె.
జనపతి యాగంబుచాలించి యంతఁ,
దననగరికి వచ్చి తనయఁ బెంచుటయు,
జంగారుప్రతిమకుఁ బరిమళంబొదవు
భంగిఁ గృష్ణయుఁ బెండ్లిప్రాయమై యపుడు
నునుజన్నుమోసులు నూగారునారుఁ
గనుదోయిసిగ్గును గలుగుచో, నృపుఁడు
వారణావతమున వహ్నిఁ గౌంతేయ
వీరులీల్గినవార్త విన్నాఁడుగాన :
“నింద్రజునకుఁగూఁతు నీనేరనైతిఁ;
జంద్రాస్యకెవ్వఁడు సరియైనవరుఁడు!
దుర్మదాంధుండగు దుర్యోధనుండు
ధర్మమూర్తుల వారి ధరనుండనీక
పావకశిఖలోనఁ బడఁద్రోచె.' ననుచు
వేవిధంబుల నేడ్వ, వీక్షించి మంత్రి :
'సత్యాత్ములగువారు చావ; రున్నారు;
ప్రత్యక్షమునఁ బక్షి పలుకంగ వింటి.
[20]క్షితినాథ, యేలయేడ్చెదు మోమువావ?
క్షితినున్న వారలు చెడరుపాండవులు;
కాంత వారలసొమ్ముగా బ్రాప్తికలదు;
చింతింపవలదు; సుస్థిరబుద్ధితోడ
నంగనామణికి స్వయంవరోత్సవము
రంగుగా ఘోషింప రమణమైఁ బనుపు.


అవ్వాసవికిఁదక్క నన్యులకేయ
దవ్వైన [21]చరలక్ష్యధనువులువన్ని
సేయుముయత్నంబు; జిష్ణునట్లైన
వేయేల కాంచెదు విపులాధినాథ!'
అనినధైర్యమువచ్చి యతఁడట్లుసేయ
ననిచె మంత్రీంద్రువాక్యప్రకారంబు.
[22]చక్కడింపఁగలేని చాపమూలమున
నుక్కునక్కులుగట్టి యొకచిల్లుచేసి,
యెనయంగఁ దొమ్మిదియినుపసంకెలలఁ
బెనచిననారి నప్పెనువింటఁగట్టి,
[23]యేసులువునరాక యిటునటుఁబఱచు
మోసపుశరములు మొగినైదమర్చి,
కోలలకందక గొనమింటఁదిరుగు
నాలజాలమువోలె యంత్రమత్స్యంబు
పన్నించి : 'యెవ్వఁడే బరఁగ నవ్వింట
నిన్నభోమత్స్యంబు నిలవ్రాలనేసె,
వాఁడు మాకృష్ణకు వర్ణింప మగఁడు;
మూఁడుజాతులకును ముదల యీమాట.'
అనినవార్తకు లోకులందఱుఁ గదలి
చనుచున్నవారు పాంచాలి రాఁగోరి,
బ్రాఁతి రోహిణిఁ బెండ్లి పౌష్యశుద్ధమున;
నాతి, డెబ్బదియేనునాళ్లాదినంబు."
అని విప్రుఁడబలతోనాడువాక్యములు
వినఁ గృష్ణపైఁబుట్టె వేడ్క యేవురకు.
కుంతియు నప్పుడు కొడుకులఁబలికె :
“నెంతకాలంబైన నిందుండఁదగునె!


పోదము; పాంచాలభూములలోని
భూదేవు లతిథులఁ బూజింతురట్టె!
చూతము పాంచాలసుతవివాహంబు;
నేతెఱంగున బ్రహ్మ యెన్నుచున్నాఁడొ!
యారూఢి." ననఁగ నయ్యవనీసురుండు
నూరికేఁగె గృహస్థునొప్పవీడ్కొనుచు.
అంత సూర్యోదయంబైనఁ, బాండవుఁడు
శాంతితో సంధ్యాదిచర్యలు దీర్చి
కువలయామరకోటికొలువున్నయట్టి
ధవళవేదికిఁబోయి, తమ్ములుఁ దాను
నామముల్ నొడిపి ప్రణామముల్ చేసి
యామహాత్ములు తమ్మునాశీర్వదింప
వినతుఁడై యున్నచో, విప్రులఁజూచి
జననికుంతియుఁ గరాబ్జమ్ములు మొగిచి:

పాండవు లేకచక్రపురము విడుచుట


"ఉత్తమోత్తములార, యొకచోటమాకు
నిత్తెఱంగుననిల్వ నెఱయదునీతి;
పుణ్యదేశములకుఁబోయి మీవంటి
పుణ్యులఁబొడగాంచి పుత్తుముదినము;
దేశాంతరులకిదిదీక్షగా." దనిన
నాశాంతులిట్లని రాకుంతితోడ :
"ఒండు దేశములేల! యుత్తమసాధ్వి,
నిండ నిన్నియు మీరునిలిపినయిండ్లు;
ఈయమునాస్నాన, మీయనుష్ఠాన,
మీయగ్నిహోత్రంబు లేసీమఁగలవు!
దేవమూర్తుల మిమ్ము దృష్టించుభాగ్య
మేవెంట మఱువలేమే" మన్నఁగొంతి;


"మీకృపయిట్టిది, మిమునేమువిడిచి
యేకడ కేఁగెద! మెవ్వారుహితులు!
తీర్థయాత్రలు మాకు దీక్షగా వలసి
యర్థిఁబోవుట భావ్య మఖిలజ్ఞులార!"
అనుడు విప్రులు వారి నతిగారవమున
ననిచిరి పూజించి యాశీర్వదించి.
వారును, యమునాప్రవాహంబు దాటి
వారాశిఁజూచుచు వచ్చుచో, నెదుట
వ్యాసుండు హరిపరధ్యానలక్ష్మికిని
దాసుండు శ్రితకృపాదాసుఁ డే తేర,
నట్టిమౌనికి బార్థు లతిభక్తి మ్రొక్కి,
పట్టినయంజలిప్రతతులతోడ
[24]నుపవిష్టుఁగావించి యోలిసేవింపఁ,
దపసి యందఱ దయాధారనిట్లనియె:
"ద్రుపదభూపాలుకూఁతురుస్వయంవరము
నృపులార, చూడఁబూనితిరి మేలయ్యె;
ఆకన్య మునికన్య యాదిజన్మమునఁ ;
జేకొని తపము దా శివునకుఁజేసి
మగనినిమ్మని యేనుమాఱులు వలుక,
నగి చంద్రధారి యన్నాతిపల్కులకు
నీజన్మమున దాని కేవురుమగల
యోజించుచున్నవాఁ; డొకటి చెప్పెదను,
ఏకచక్రమున దైత్యేంద్రశిక్షణము
మీకతంబుననయ్యె; మీరింకఁబోయి
పాంచాలపురమున బ్రాహ్మణవేష
మంచితచ్ఛాయ పాయక వెలుంగుచును,


బొలఁతిస్వయంవరంబున మత్స్యయంత్ర
[25]దళనంబుచేసి, యాద్రౌపదీకన్య
నేవురుఁగైకొనుఁ; డింతలో నేను
దేవమూర్తుల మిమ్ము దృష్టింపవత్తు.
ఆవివాహోత్సవంబైనమీదటను
వేవేగఁ గరిపురవిభుఁడు మిమ్మెఱిఁగి,
రప్పించి రాజ్యభారంబునఁబూన్చుఁ ;
దప్పదింతయు." నని తగనానతిచ్చి
తపసి యంతర్థానధారనేఁగుటయు,
నృపతులానందించి నెఱినుత్తరముగ
వచ్చుచు, సరయూప్రవాహంబుదాటి,
యచ్చట గోవర్ధనాద్రిఁజూచుచును,
గాశ్మీరభూములు గడచి, గంధర్వ
వేశ్మమై పొడవైన వృషభాద్రిగడచి,
మునిసీమలకుఁ బురంబులకుఁ గిరాత
ఘనసీమలకుఁ ద్రోవఁగడువేడ్కఁగడచి,
యిదిపగ లిదిరాత్రి యిదిసంధ్యయనక
చదురొప్ప నమ్మహోత్సవదినంబునకు
ముందటఁ బార్థుండుమొగిఁద్రోవవెట్ట
నందఱునడచుచు, నర్ధరాత్రమున
నమరసంగతరంగ నతిమంగళాంగ
నమరంగ భవభంగయగు గంగఁగదిసి,
యేవురపెండ్లికి నీవుసాక్షివిగ
రావలెనని మహాప్రభువగ్నినపుడు
తొడుకొనిపోవుటదోపఁ జీకట్లు
జడియంగఁ గొఱవి వాసవిచేతఁబట్ట


అర్జునుఁ డంగారపర్ణు జయించుట



నాగంగదాటి వారారసికొనుచు
ధీగతిఁ బార్థులేతేర, నారాత్రి
ననువుగఁ జీఁకటి నంగారపర్ణుఁ
డనియెడుగంధర్వుఁ డాండ్రునుదాను
జలకేళిసలుపుచుఁ జాలగర్వమునఁ
బలికె మీఁదెఱుఁగక పాండునందనుల :
ఎవ్వరురా! యోరి! యీ మధ్యరాత్రి
జవ్వనులును నేను జలకేళిసలుపఁ,
ద్రోవపెట్టుక మూరత్రోపుతనాన
వేవచ్చుచున్నారు! విధితప్పినదియొ !
కానరొ! నన్నునంగారపర్ణాఖ్యు;
నేనిందు విహరింతు నెదురెందులేక
ఇది కారణంబుగా నీగంగమడువు
విదితమై నా పేర వెలయుటవినరె!
మానరుగర్వంబు మానవులయ్యుఁ ;
గానరు మీకింత కావరంబేల!
జలజనేత్రలు నేను జలకేళి యిచట
సలుపుచునున్నాము చావకపొండు;
అంగారపర్ణుండ నమరాదులైన
సంగతి నేనన్నఁ జలియింతురెపుడు.
కొఱవిదాల్చితివేల కొఱవిదయ్యమవొ!
గిఱుకున మరలుఁడు కినియనట్లైన."
అనుఁడు నర్జునుఁడును హాసంబుచేసి:
"విను, నీవుపొమ్మన్న వెఱచిపోలేము ;
పోవభీతుఁడుగాదె ప్రొద్దువాటించు!
నేవేళయును మాకు నేకరూపంబు.


జగదేకవిఖ్యాతచరిత యీగంగ;
జగదేకనిర్వాణజనయిత్రి గంగ;
అట్టిజాహ్నవిఁ దీర్ధమాడకమాన;
మెట్టివాఁడునుమాన్ప నెంతటివాఁడు!
ఏరులు వాగులు నెవ్వరిసొమ్ము!
.................................................
సతులుసన్నిధినున్న చండగర్వమున
బ్రతిభాషలాడకు బంటవై నిలుము."
అనినఁ బద్మవనంబు హస్తి వెల్వడిన
యనువున యువతిమధ్యము వాఁడు వెడలి,
వరభూషణప్రభావళులఁ జీఁకట్లు
పొరిపొరిఁజెదర నేర్పునవిల్లుదాల్చి,
మాటలబోదని మణిరథంబెక్కి,
బోటులు వెఱవ నద్భుతపరాక్రముఁడు
అమ్ముల సంధించి, యవని పైఁ బింజ
లిమ్ముల మోపుచు నిట్లనిపలికె :
“ఎట్టుట్టు రా! నన్ను నేమంటి మనుజ!
పొట్టక్రొవ్వున నన్ను బొమ్మంటి తొలఁగి!
రథమోసరించునే రాట్న మే తేరఁ!
బృథివి నరాధమ! ప్రేలెదెన్నైన;
క్రుక్కుదునో నిన్నుఁ గొఱవినీయేట!
దిక్కెవ్వరున్నారు ధృతినన్నుమాన్ప!
ఒగి నింకముందల కొక్కడుగిడినఁ,
దెగనేయువాఁడ నీతీవ్ర బాణమున."
అని వింట [26]గంధర్వుఁ డమ్ముసంధింప,
మనమునబెదరక మఱియునర్జునుఁడు


వానిఁ దృణప్రాయవచనుఁగాఁజేసి.
పూనికనార్వురుఁ బొదివిప్పకపుడు
వారిపై నడవంగ, వనితలున్నెడకు
వారురాఁగనుఁగొని వాఁడాగ్రహించి,
బాణవర్షము పార్థుపైఁ బ్రయోగింప,
బాణారిమఱఁది యబ్బాణంబులెల్లఁ
బిడుగుచే వర్షించుబిందువుల్ వోలెఁ
గడకొఱవిని నేర్పుగదురఁ ద్రుంపుచును,
సవ్యకరంబున జంగఱాలెత్తి
దివ్యుపైవైచుచోఁ, దెమలక వాఁడు
బాణధారల నట్టిపాషాణవృష్టి
రేణువుల్చేసి యార్చిన, నింద్రసుతుఁడు
మిడుఁగుర్లు గంధర్వుమీదబెట్టురలఁ
గడువడి నయ్యగ్నికాష్ఠంబు ద్రిప్పి
పలికె: "నీవొకతేరుపై విల్లుగలిగి
యలుగులేయుచు మమ్ము ననదలఁ జేసి
యెత్తివచ్చెదవింకనోరి! యీ కొఱవి
క్రొత్తగా వైచెదఁ గుందకనిలువు. "
మనివైవ నాభీల హాలాహలాగ్ని
జనిత కోలాహలసరణి నయ్యగ్ని
నిప్పులంజడిగాఁగ నిగిడె బెట్టుగను.
అప్పుడు పైచీరలంతంతఁగమరి
కొన[27]మీసములుగాలుగొని శరీరంబు
నొనరఁబొక్కిన, నింతులోలిపొక్కంగ,
నమరులాకలకలం బాలించి మింట
సమరసన్నద్ధులై సైనికోత్తములు
పతికినడ్డమువచ్చి పార్థుపైఁగినిసి
యతిఘోరశరవృష్టి నందంద ముంప,


ధృతిఁ గాష్ట్రమెత్తి యెంతే నగ్నిమెఱయు
గతి నర్జునుఁడు చేతి కాండాగ్ని పెంచి
సేననంతట మహాశిఖిఁ గప్పుటయును,
నానాముఖంబుగా నడికి యాసేనఁ
గొందఱుభయమంది, కొందఱుమ్రగ్గి
కొందఱు దరికొని, కొండఱుగమరి,
చేతులాడక [28]చేదుచిచ్చునఁదొల్లి
భీతిల్లు సురసైన్యబృందంబు వోలెఁ
బ్రాణభయంబున భగ్నులైపాఱ,
నేణలోచనలతో నితఁడొంటినిలిచి
నవనిధీశ్వరదత్తనారాచపంక్తి
కలిసి మంటలుగ్రమ్మ గవ్వడి మీద
గుప్పిన, నావృష్టిఁ గొఱవిచేఁదరలఁ
దిప్పశక్యముగాక దేవేంద్రసుతుఁడు
నాగ్నేయమంత్ర మయ్యగ్నికాష్ఠమున
నగ్నిప్రతాపుఁడు హత్తించి వైవ ,
నది ధగధగయని యంతరిక్షమునఁ
ద్రిదశులువెఱఁగందఁ దీవ్రమైవచ్చి
రథముపై గంధర్వరాజుగూల్చుటయుఁ,
బృథివివైఁబడె వాఁడు బిట్టుమూర్ఛిల్లి.
నరుఁడీడ్చి తెచ్చి గంధర్వు ధర్మజుని
చరణాబ్జములవద్ద సాగఁబెట్టుటయు,
నంతలోపల వానియతివలుచేరి:
"శాంతలక్షణులార, చాలింపుఁడలుక ;
[29]ఎఱుఁగఁడు మహి మిమ్ము నితఁడాడె నెగ్గు;
మఱవుడు; పతిభిక్ష మాకు నీవలయు;


ఎట్టివాఁడు మదించు నింతులయెదుట;
నిట్టితప్పు సహింపుఁడీ." రన్న నృపతి :
"హరితనూభవ, వీరియలమటమానఁ
బురుషభిక్షార్థమై పోనిమ్ము వీని. "
అనినఁ బార్థుఁడు వానినచ్చోట విడిచి
జననీసహోదరసహితుఁడై కదల,
నంగారపర్ణుండు నంతలోఁ దెలిసి
సంగతిఁ దనమాయశక్తిచే నపుడు
కాలి నీఱైపడ్డ కనకరథంబు
లీల రావించి వాలిక[30]మొనఁదీర్చి,
యరిగెడు పార్థుల కడ్డంబువచ్చి,
సరసవైఖరి వారిసన్నుతిచేసి :
“ధారుణి దివ్యాస్త్రధరులు లోకైక
వీరులు వెసఁ బాండవేయులు మీరు;
సతులనన్నిధినున్న సాధులకైన
మతిదప్పు; నింక నామాటయేమిటికి!
వెలిఁగినరథ మేను విద్యాబలమునఁ
గలుగఁజిత్రించితిఁగాన, నా పేరు
చిత్రరథుండనఁజెల్లు; మీకృపకు
బాత్రుండ; నంగారపర్ణాఖ్యమొల్ల;
నరయంగ నేనును నర్థేశుసఖుఁడ
ధరణీశులార! యెంతయుఁగృపతోడ
.................................................
ననుగాచి పోవుచున్నాఁడవు పార్థ!
విను, నీకు గంధర్వవిద్య యిచ్చెదను;
నాకు నాగ్నేయబాణము సత్కరింపు;
చేకొని నీతోడఁ జేసెదఁ జెలిమి.


బంధుర రిపు హయ ప్రతిరూపమడఁచు
గంధర్వహయములు గలవు నాయింట;
నిన్నూటి నందులోనిత్తునేవురకుఁ;
జెన్నార నాకీవె! చిచ్చఱకోల. "
అనిన, ధర్మజునాజ్ఞ నాదివ్యబాణ
మనిమిషునకునిచ్చె హరితనూభవుఁడు.
'అవసరంబై నప్పు డశ్వరత్నములు
దివిజ, పుత్తె.' మని తెలియంగఁ జెప్పి,
గాంధర్వమాయయు ఘనముగాఁగాంచి :
“గంధర్వ, యపుడేల గడఁగితి మమ్ము
నీక్షింప మాసత్వ మెఱుఁగలేవైతి;
యక్షులు సర్వజ్ఞులని చెప్పవిందుఁ ;
జెప్పుమా.' యనపుడుఁ జెలఁగి గంధర్వుఁ:
“డప్పటికక్కార్య మట్లయ్యె; విజయ!
ఉగ్రాంశువులులేకయుండుటఁగాదె
[31]నుగ్రాహముగఁ జంద్రుఁజూతురు నరులు;
సూర్యునిఁ దామట్లు [32]చూడరుగాక ;
కార్యమొక్కటిచెప్పఁగలదదివినుము.
హితుఁడు మీకొకపురోహితుఁడు లేకునికి
శ్రుతశౌర్య, యిసుముగాఁ జూతురునరులు.
మంత్రరక్షితమైనమగఁటిమిగాదె!
[33]సంతాపమొనరించు శత్రుకోటికిని.
వ్రతధారులై మీరువర్తించుకతనఁ,
జతురత మీయెడ జయముసిద్ధించె.
కాంతలలో నతికామినై యుంట
నెంతయు మీచేత నిట్లుగావలసె


ఇటమీఁదఁ [34]గృతపురోహితులౌచుఁదిరుగఁ
బటుబుద్ధి వైరులు పగులంగఁగలరు;
కావున మీరలు ఘనపరాక్రములు
భావింపఁ బరధర్మభరితమానసులు
తాపసునోక్కనిఁ దావత్యులార,
చేపట్టుఁడబ్బెడు శ్రీయును జయము.
అనుడు గంధర్వున కర్జునుండనియె:
"వినుతాత్మ, నీచేత విననయ్యెవింత;
కౌంతేయవిఖ్యాతి ఘనత మై నుండ,
నెంతయుఁ దాపత్యు లేలంటివిపుడు?
వినయంబుతోడ నీవృత్తాంత మెల్ల
విన వేడుకయ్యెడు వినిపింపుమాకు."
అనుడుఁ గవ్వడిఁజూచి యమరుఁడిట్లనియె:

తపతీసంవరణము



“ఘనశౌర్య, యాకథ కడముట్ట వినుము;
భారతవంశాబ్ది పరిపూర్ణచంద్రు
డారయ సత్యధరాంచితాత్మకుఁడు
ధరణి నజామీఢతనయుండు ఘనుఁడు
వరయశోధనుఁడు సంవరణుండు తొల్లి
ధరణితలంబెల్ల ధర్మమార్గమున
నరయుచు, వేడ్కమై నతఁడొక్కనాఁడు
వాటంపుసేనలు వలనొప్పఁ గొలువ
వేఁటకై చనుదెంచి విపినంబులోనఁ
గంతునిదీమంబు గాంతాలలామఁ
గాంతి నారతినైనఁ గైకోనిబోఁటి


ఘనరూపసంపద గలిగినయట్టి
వనితనొక్కతెఁ జూచె వసుమతీవిభుఁడు.
పడఁతిఁజూచినచూపు పరికించి తివియు
వడుపునఁ దలయూఁచి వర్ణింపఁ దొడఁగె:
"ఈకాంతముఖకాంతి కెన [35]చేయఁబూని
యాకంజభవుఁ డమృతాంశుని నెపుడు
నెలకునొక్కొకమాఱు నెఱిఁజెఱిచిచెఱిచి,
కలగాలమును నిట్లు గడపుచున్నాఁడు.
ఏవంక యీలేమ యెలమితోఁ జూచె,
నావంక నలగల్వ లమరినట్లయ్యె;
నీయింతి చనుదోయి యెలమినొండొండ
రాయుచున్నవి గడిరాజులువోలె;
వలరాజు చేపట్టు వాలునుబోలె
వలనొప్పు వళుల నీవనితరోమాళి;
'జలజబాంధవుఁ డేకచక్రరథంబు
గలిగినమాత్ర లోకములెల్లఁ దిరిగె;
రెండుచక్రములయంత్రితమైనరథము
దండిగల్గిన నేను దాటనే యతని'
నని కంతుఁ డొకరథంబాయత్తపరఱె
నన నొప్పె నీయింతి కాజఘనంబు;
అతికర్కశంబులు హస్తితుండములు
సతతశీతలములు జగతినరంట్లు,
కావున నీభామ కలితంపుఁదొడల
కేవిధంబున సవతెన్నంగరాదు;
ఈనాతి పదముల కెనగాఁగఁదలఁచి
పూనెఁ దపంబు నంబుజములు నీట;


సల్లీల దీనికి సరియైనసతుల
నెల్లలోకంబుల నేఁగాంచియెఱుఁగ.
చిత్తంబులో బ్రహ్మ చెలువొప్పఁ దలఁచి,
హత్తింపనోపు నీయబలరూపంబు;
కాక, చిత్తురువునఁ గ్రమమొప్పవ్రాసి
జోకఁ బ్రాణము మఱి జోడింపఁబోలు;
దైవకన్యకయొ! గంధర్వకన్యకయొ!
భూవరకన్యయో! భూదేవసుతయొ!”
అని యిట్లుతలపోయు నారాజచంద్రు
మనసిజాకారుని మానినిఁజూచి
మెఱయుమేఘములోనిమెఱుఁగునుబోలెఁ
దెఱవ వేగంబె యదృశ్యయై పోయె.
పోయిన, నారాజు పొలపొలవోయి
ధీయుక్తి నెంతయుఁ దిరిగిరాఁజూచి,
వినువీథియునుజూచి విస్మయంబంది
తనమనంబున నిట్లు తలపోయఁదొణఁగె :
"ఈకన్య యెందుండి యిటవచ్చెనొక్కొ!
కాక యీతేజంబు కాంతయొ కాదొ!
వలరాజుమాయయో! వనలక్ష్మియొక్కొ!
తెలియంగలేనైతి దిటతప్పెనపుడు;
అనుమానమటుమాని యాలేమఁగదిసి
చనుమానమున వేడ్కసలుపలేనైతి;
చేతనుండెడిసొమ్ము చిందంగ వైచి
బ్రాఁతితో వెడలెడుపందఁబోలితిని;
చేరినమృగనేత్రఁ జెందంగలేక
జరంగవిడిచి నే జాలిఁబొందితిని."
అనుచు సంవరణుండు హత్తినమోహ
వినతుఁడై, యెంతయువిరహాగ్నిఁబొంది,


మదనాస్త్రములవ్రస్సి, మానంబు [36]గ్రొచ్చి,
హృదయమోహమువెంచి, యీలువవంచి,
గండుఁగోయిలకూఁత గర్వంబు వెడలి,
మిండతుమ్మెదజంకెమేనెల్లఁబొదలి,
రాచిల్కపలుకులరవళికిఁ జిక్కి
పూఁచినలతలచేఁ బొంకంబుదక్కి
యుండ, నక్కోమలి యొనరంగవచ్చి
.................................................
తళతళమని మేనితళుకులొప్పంగఁ
బలికె? భూవిభుఁజూచి పరమహర్షమున :
ఓరాజ, నీ కేల యుపతాపమందఁ!
జేరునెందైనను జేరెడు సొమ్ము;
నాతండ్రి సూర్యుండు; నా పేరు తపతి;
నాతలంపున నీవు నరనాథ, కలవు;
ఏ తెఱంగున నైన నీవు మాతండ్రి
నాతతగతి వేఁడు మతఁడు నీకిచ్చు;
తరుణికి నాకు స్వతంత్రత లేదు;
వరుఁడవవశ్యంబు వసుధేశ, నీవు."
అని చెప్పి తపతియు నర్కునికడకుఁ
జనియె; సంవరణుండు స్మరబాధఁబొంది
యున్నంత, మంత్రీంద్రులొయ్యన వచ్చి
యన్నియుఁ దెలిసి యయ్యవనీశువలన,
భూకాంతు నప్పుడు పురవరంబునకుఁ
దోకొనియేతెంచి, తోరంపువేడ్కఁ
జంద్రకాంతపువేది [37]చలువగా నొక్క
సాంద్రపుష్పపుశయ్య సవరగాఁ జేసి


పన్నీరుచిలికించి పార్థివుఁగదిసి
క్రన్నన మృగమద కర్పూర భద్ర
మిళిత గంధంబును మేనిండనలఁది,
[38]చలువగా సురటిచే జానొప్పవిసరఁ,
దాపమగ్గలమైన ధారుణీవిభుఁడు
దీపించురవిపుత్రి దేఁజాలినట్టి
తని పురోహితుఁడైస తపసి వసిష్ఠు
ననువొప్పఁదలఁచె నాయతభక్తితోడఁ;
దలఁచిన నాతఁడాధరణీశునెదుర
నిలిచిన, వీక్షించి నీతితోమ్రొక్కి
యాసీనుఁగావించి యంజలిచేసి
భాసురాత్మకుఁబల్కెఁ బ్రార్థన చేసి :
ఆచార్య, మీగృపా[39]యత్తతవలన
భూచక్రమంతయు [40]భోగదేశంబు.
ఒక్కటి నాకింక నొనగూర్చవలయు ;
నక్కార్యమంతయు నాదట వినుఁడు,
వేటఁకైపోయి యేవిపినమధ్యమున
వాటంపుఁగూరిమి వామాయతాక్షి
దపసునికూఁతునిఁ దపతియన్ దానిఁ
జపలతఁజూచితి స్మరుఁడు ప్రేరేప;
అదియును,నామీదనాసక్తినెఱపి
ముదలలేమిని బోయె మొగిఁ దండ్రికడకు;
ఈపొద్దు నీవేఁగి యేరీతినైన
నాపొద్దుఁబ్రార్థించి యతివఁ దేవయ్య."
అనుచుఁ బ్రార్థించిన, నావశిష్ఠుండు
ననుమతి గైకొని యర్కునికడకుఁ


జతురతఁబోయి యాజలజబాంధవుని
శ్రుతులచే నెంతయు స్తుతియింప, నతఁడు
మనమునహర్షించి మౌనికిట్లనియె:
"అనఘాత్మ, యేమైన నడుగు మిచ్చెదను;
బ్రహ్మవేత్తవు నీవు బ్రహ్మపూజ్యుఁడవు
బ్రహ్మసంభవుఁడవు ప్రణుతింపవలదు."
అనిన వశిష్ఠుండు హరిదశ్వుఁబలికె:
"వనజాప్త, యిపుడు సంవరణభూపతికి
నీకూఁతుఁ దపతిని నెమ్మినీవలయు
బ్రాకట నిఖిల సౌభాగ్యవర్తనల;
వనితలఁగన్నట్టి నారల ల్ల
ఘనవరునకు నీయఁ గాంచుటే ఫలము."
అనిన సంతోషించి యంభోజసఖుఁడు
తనకూతుఁ దపతినిఁ దాల్మిరావించి,
దివ్యభూషణములు దివ్యవస్త్రములు
నవ్యంబుగానిచ్చి నయములునొడివి,
భూవరునకుఁ బెక్కుభూషల నొసగి
యావశిష్ఠుని వెంట ననిచిపుత్తెంచె.
ఆరీతి నమ్మౌని యర్కసంభవను
గారవంబునఁదెచ్చి కడుసంభ్రమమున
వరముహుర్తమున సంవరణభూపతికి
సరిఁబెండ్లిసేయ, నాజననాథుఁడలరి
మునిశిఖామణికిఁ గేల్మొగిచి వీడ్కొలిపి,
యనుభవవాంఛ నయ్యవని రాజ్యమున
మంత్రలఁబూన్చి, యమ్మగువయుఁదాను
యంత్రితమదనరాజ్యానుభోగంబు
వరుసఁ బన్నెండేండ్లు వారక సేయ
ధరణి నధర్మంబుతగులుటఁ జేసి


తొలఁగకనావృష్టితోచెఁ; తోచుటయుఁ,
జెలఁగి యేతెంచి వశిష్ఠుఁడాలోన
శాంతిహోమాదులు సవరగాఁజేసి
వింత ననావృష్టి వేగంబెమాన్చి,
ప్రజలకు సౌఖ్యంబు పాటిల్లఁజేసి
నిజనివాసమునకు నెమ్మితోనరిగె,
అంత సంవరణధరాధినాథునకుఁ
గాంతితోఁ దపతికిఁ గలితలగ్నమున
నొదవువసిష్ఠాదియోజితకర్ము
డుదయించెఁ గురుఁడన నొకకుమారకుఁడు.
ఆతపతీతనయాన్వయులగుట
బ్రాఁతి మీకబ్బెఁ దాపత్యనామంబు;
కావునఁ గురువంశకర్తలు మీర;
లావశిష్ఠుఁడు మీకు నాచార్యుఁడెపుడు."
అనుచు నాగంధర్వుఁ డంతయుఁ జెప్ప
విని, హర్షమునఁ గ్రీడి వెండియుఁబలికె:
"మా వంశమునకెల్ల మహి గురుండైన
యావశిష్ఠుమహత్త్వమది చెప్పవలయు."

వశిష్ఠునిమహిమ



అనిన దివ్యుఁడువల్కె: "నతని సామర్థ్య
 [41]మనయంబుఁ జెప్పఁగ నలనియె నాకు!
కొంతచెప్పెద విను, క్షోణి నమ్మౌని
యెంతయు ఘనతపోహితమానసుండు;
మున్ను విశ్వామిత్రమునిసేయునెగ్గు
లన్నియుమఱచి, యయ్యమలాత్మునకును
బ్రహమునిత్వంబు పరగంగ నొసగె;
బ్రహ్మసంభవుశక్తి ప్రణుతింపవశమె!”


అనినఁ, గవ్వడి పల్కు: “ నావశిష్ఠునకు
మును గౌశికుం డేల మొగినెగ్గుచేసె?
విను, బ్రహ్మ[42]మౌని యావిమలుఁడెట్లయ్యె?
వినవేడ్కయయ్యెడు వినిపింపునాకు."
అనవుడు గంధర్వుఁ డర్జునుకనియె:
“ననఘ, చెప్పెద నదియంతయువినుము;
తొల్లి రాజన్యుఁడై దొరయుకౌశికుఁడు
సల్లీల జగమెల్ల శాసింపుచుండి,
సకలసేనలుగొల్వ శైలాటవులకు
నొకనాడు వేఁటమై నొప్పుగాఁబోయి,
నొగిలించి మృగముల నూల్కొన్నశాంతి
మగిడి వశిష్ఠాశ్రమమునకువచ్చె.
వచ్చిన గాధేయు వరుస నమ్మౌని
యచ్చుగాఁ బూజించి యర్థినిట్లనియె :
"మహితాత్మ, మాయాశ్రమంబున నేఁడు
విహితసేనలు నీవు విందారగించి,
దీవసఁబొంది యీదివసాంతమునను
బోవంగవలె," నన్నఁబొంగి కౌశికుఁడు :
“నమలాత్మ, నీమాటకడ్డంబుచెప్ప;
నమర నన్నియు వేగ నావటిం,” పనినఁ
గైకొనివచ్చి యాఘనతపోధనుఁడు
ధీకాంతఁ దమకామధేనువుఁబిలిచి,
విందు తెఱ౦గెల్ల వినిపించి, వేడ్కఁ
బొంది 'భోజన మెల్లఁబుట్టించు' మనిన,
నాకామధేనువు నట్లకాకనుచుఁ
బ్రాకటంబుగ నన్నపర్వతంబులును,


నిండి పాఱుచునున్న నేతికాలువలు,
దండిగానొప్పారు దధిసరస్సులును,
బిండివంటలు బెక్కుపృథుశాకతతులుఁ
గండచక్కరలతో గడుననేకములు
చాలంగఁగురిసిన, సంయమిచూచి
మేలని యాకుఱ్ఱిమేనెల్ల దువ్వి,
మేయంగఁబొమ్మని మృదురీతి ననిచి,
యాయవనీశ్వరు నటకు రాఁబనిచి,
వినుతింపరాకుండ విందువెట్టుటయుఁ,
దన సేనలును దానుఁ దనరి కౌశికుడు
భుజియించి విస్మయపుంజితుండగుచు,
భజన నరుంధతీపతిఁ జూచిపలికె :
ముదితాత్మ, నాకు నీ మొదవునీవయ్య!
మొదవులెన్నైనను మొగి దీనికంటె
ఘనవయోవిభవంబు గలిగినవానిఁ
దనియంగ నిచ్చెదఁ దాపసారాధ్య!"
అనినఎ గౌశికునకిట్లనియె వశిష్ఠు:
"విను మేను నీకుఱ్ఱవిడువంగఁజాల;
దీనినొక్కటిఁగావఁ దీరదు నాకుఁ;
బూని పెక్కైనను బ్రోవంగఁగలనె!
సర్వకృత్యంబులు సరి దీనివలన
నుర్వీశ, యెప్పుడే నొదవును నాకుఁ;
గావున నీయావు గడచి యోరాజ,
యేవైనఁ బ్రార్థింపు మిచ్చెదనీకు. ”
అనిన విశ్వామిత్రుఁడలుక నిట్లనియె:
"మునివని నేనిట్లు మోమాటసేయ
వినయమించుక లేక విఱ్ఱవీఁగెదవు!
నినువంటి మౌనులునెఱి నెందులేరు!


సకలభూతలమెల్ల శాసించునాకు
నొకకుఱ్ఱి నడిగిన నొప్పింపఁదగదె!
పెన్నిధియునుబోలెఁ బిదుకునీ మొదవు
నెన్నిభంగుల నుండనిత్తునే! యేను."
అనుచుఁ గోపంబున నాగోవుఁబట్ట
దనబలంబుల నెల్లఁ దడయక పనిచె.
అనిచిన, నానేన యాక్రేవుఁబట్టి
కొనిపోయి యావుకు గుఱుతుగాఁ జూపి,
యెలయింపరాకున్న నెంతయుబలిమిఁ
దలకొని వల్లెలఁ దప్పక దిగిచి
కట్టంగఁజూచినఁ, గనలి యా మొదవు
మెట్టి యావల్లెలు మిన్నక తన్ని,
పొట్టలుపగులంగఁ బొరిపొరిఁద్రొక్కి,
యట్టిట్టుగాఁదోలి యాబలంబులను,
జనుదెంచి భక్తితో సంయమిఁబలికె:
"ఇనతేజ! నన్నునుపేక్షింపఁదగునె!
బలిమి విశ్వామిత్రబలములుపొదివి
చలమున నాదూడఁ జావనీడ్చుచును
నన్నుబట్టుకపోవ నడచుచున్నారు;
క్రన్నన మాన్పవే! గాధేయుబాధ. ”
అనిన నూరకయుండ నమ్మౌనిచంద్రు
మనసు పూనికగాంచి మరలి యామొదవు
నెఱిఁగన్నుగ్రోవల నిప్పులుగ్రమ్మ
దఱమిడి క్షితిఁ గాలఁద్రవ్వి దిముచును,
స్ఫురితక్రోధంబునఁ బ్రోధంబులదర,
నరిమురి సేనల నదరంటఁదాఁకి,
చెక్కియుఁ జెండియుఁ జెదరఁదన్నియును,
ద్రొక్కియుఁ ద్రుంచియుఁ ద్రుళ్లడంచియును,


బఱచియుఁ బొడిచియుఁ బాఱఁదోలియును,
మెఱమియు మెట్టియు మెల్లెవాపియును (?)
గడిమిమైనేతేరఁ, గౌశికుబలము
తడయక యాకుఱ్ఱి దండిమైఁగదిసి
యేచి యార్పులు బొబ్బలిడుచు నందంద
నేచందముననైన నిట దీనినిపుడు
పట్టకున్ననుగాదు పౌరుషంబనుచుఁ
జుట్టిరా రథ దంతి సూతులనిలిపి,
యొత్తి యల్లనడాసి యెదిగి డాకాల
హత్తించి యొకపల్లె నదిబిగియించి
తలకోల దగిలించి తాళ్లనుబట్టి
పలుమాఱు కోలలపాలుసేయుటయు,
సంసారబంధముల్ సరి విడఁదన్ను
కంసారిసముఁడైన ఘనయోగివోలె,
నందికోపించి యంతయుఁ బాకసమితి
నందంద తెగదన్ని'హంబా', యటన్న,
గోమయంబున దాని ఖురరోమములను
సామర్థ్యముప్పొంగ శబరకోటులు ను
క్షితియదరఁ బుళింద సింహక ద్రవిడ
తతులనేకులు బల్మిఁ దడయక పుట్టి,
పరశు తోమర కుంత పట్టస ప్రాస
పరిఘ గదా శూల బాణాసనాది
వివిధాయుధంబులు వీరులై తాల్చి
జవ మొప్పఁ గౌశికు సైన్యంబుఁ దాఁకి
రథముల విఱిచి, సారథులఁగారించి,
రథికులవిదళించి, రథ్యాళినొంచి,


కరులనుదెగటార్చి, కలఁచిమావుతులఁ,
దురగాళిఁ [43]జఱచి, రౌతుల [44]నేలఁగలిపి,
యోడక కాల్బంట్ల నుక్కడగించి,
[45]వాఁడిమిగా మోది వదలకయార్వ,
హతశేషమైన విశ్వామిత్ర బలము
క్షితియెల్ల యెడలను జెదరి చేడ్వడియె.
అప్పుడు నందిని హంబారవంబు
లుప్పొంగ మేయుచు నొగిఁబంచతిలుచుఁ
దనక్రేపు వేడ్కమైఁ దఱచునాకుచును
మనముగా విహరింపఁ గౌశికుఁడంత :
'నచ్చుగా నక్కట! యావుచే నిట్లు
చెచ్చెఱ నాసేన చిందువందయ్యెఁ!
బటురాజతేజంబు బ్రహ్మతేజమున
కెటువలెఁజేసిన నీడుగా. " దనుచుఁ
బటుతరనిష్ఠ మై బ్రహ్మకుఁ దపము
.................................................
పెక్కుకాలంబులు పెక్కురీతులను
దక్కక సేయఁ బ్రత్యక్ష మైయజుఁడు :
“అనఘ, నీకోరు బ్రహ్మర్షిభావంబు
ఘనవసిష్ఠుఁడు వల్కఁ గలుగు నీ." కనుచు
నానతి చేసి యయ్యజుఁడు వోవుటయు,
జానొప్పవేడ్క విశ్వామిత్రుఁ డపుడు
రమణ నరుంధతీరమణుముందఱకు
సమబుద్ధి నేతెంచి చతురతనిలిచె.
నిలిచినఁ గనుఁగొని నెఱి వశిష్ఠుండు
లలి 'రాజముని! కుశలంబెనీ? కనిన,


మరలి యేతెంచియు మఱియుఁ గౌశికుఁడు
తరమిడి యత్యుగ్రతపముననుండె,
అంతఁ గల్మషపాదుఁడను రాజవరుఁడు
వింతగా హయమెక్కి వెడలెడుచోట
శక్తిశంభుఁడు వశిష్టాగ్రసుతుండు
శక్తి సంయమి త్రోవఁజన నెదురైనఁ,

శక్తిమహాముని కల్మాషపాదుని శపించుట



జూచియిట్లనియె నాక్షోణివల్లభుఁడు :
నే చనుమార్గంబు విడిచిపో విప్ర!"
అనవిని యాశక్తి యవనీశుఁ బలికె  :
మనుజేశ, ధర్మంబు మఱచి పల్కెదవు;
"రాజవునీవు; నే బ్రాహ్మణోత్తముఁడ;
నోజ నేఁదొలఁగంగ యోగ్యమానీకు!"
అనిన రాజిట్లను నలుక దీపింప :
“నినుఁజూచి పలుకుము; నియమంబులేల!
తొలగు; మూరక నీవు దొసఁగులుమాను;
తొలఁగికుండితివేని తొలఁగింతునిపుడు."
అనిన సంయమిపల్కు: "నవనీశ, నీదు
మనసువచ్చినయట్లు మర్దించునన్ను;
ధర్మమార్గంబు నేఁదప్ప; దప్పినను
ధర్మంబులన్నియుఁ దప్పుఁగావునను."
అనిపల్క రాజన్యుఁ డలిగి యమ్మౌనిఁ
దనచేతిగశకోలఁ దప్పకవేసె.
వేసిన నాశక్తి వికృతుఁడై పలికె:
'వాసి యించుక లేక వసుధీశ, నన్ను
దఱటున నేయంగ ధర్మమే నీకు!
వెఱపు విప్రులయెడ విడిచితి; గానఁ,


దక్కక కానలో [46]దశవర్షములును
ఱక్కసుఁడవుగమ్ము రాజ్యంబుమాని."
అనిశాపమిచ్చిన, నధిపుఁడమ్మౌని
బొనర వసిష్ఠుని పుత్రుఁగా నెఱిఁగి,
పురపురఁబొక్కుచుఁ బురమున కేఁగి
గురుకౌశికునకు నాఘోరత చెప్పి
యున్నంత, నొకవిప్రుఁ డుర్వీశుఁగదిసి
సన్నుతి మాంసభోజనమడుగుటయు,
రాజప్పు డడబాల రావించి :"యిట్టి
భోజనంబతనికిఁ భువిఁ బెట్టు" మనుచు
నప్పనచేసిన, నడబాల వోయి
యప్పొద్దు మాంసంబులందక యున్నఁ
గౌశికుమాయచేఁ గార్యంబు మఱచి,
యాశయ్య నరమాంస మనువుగా వండి
ద్విజునకుఁబెట్ట, నాద్విజుఁడురోషించి :
“నిజమింతయును లేక నృపుఁడు నాకిట్లు
మనుజమాంసము పెట్టు మహితపాపమున
మనుజాశనుండు దా మహినౌనుగాక. ”
అనుచు శాపంబిచ్చి యావిప్రుఁడేగ,
నను వేది యానృపుండట్లయ్యె; నపుడు
వింతగా దనుజుఁడై విహరించుచోట
నంతట నొక్కనాఁడడవిలోపలను,
నమితతపశ్శక్తి యాశక్తి వచ్చి
సమిధలు విఱుచుచుఁ జరియింపఁ జూచి
కపటాత్ముడైనట్టి కౌశికమౌని
చపలాత్ము నొక దైత్యుఁ జలమొప్పఁబిలిచి


పలికె : "నో రాక్షస, పదరక నీవు
బలిమిమైఁ గల్మాషపాదులోఁజొచ్చి,
యావశిష్టాత్మజునణఁగింపు." మనిన
వావిరి నాదైత్యపరుఁడియ్యకొనుచుఁ
గల్మాషపాదులోఁ గడిమి మైఁజొచ్చి
జాల్ముఁ డాశక్తినిఁ జంపి భక్షించె.
మఱియు విశ్వామిత్రుమాయ ప్రేరేపఁ
బఱచి గల్మాషపాదుండు కినిసి,
పొదలు వశిష్ఠునిపుత్త్రుల నెల్ల
వదలక వధియించి వరుసతోఁదినియె.
ఈరీతిఁ దనపుత్రులీల్గినఁ జూచి,
దారుణశోకాగ్నిఁ దాపసోత్తముఁడు
పత్నియుఁ దానును బలవరింపుచును
నూత్నదుఃఖంబుస నొగులంగ లేక
కాళ్లు, చేతులుఁ త్రాటఁగట్టుక పోయి
నీళ్ల నొక్కటను మునింగిన, నదియుఁ
బాంబులన్నియు భగ్నంబు సేసి
పేశలంబుగ ధరఁబెట్టె నమ్మౌని.
నదిమొద లానది యన్ని దిక్కులను
విదిత విపాశనా వెలసె; వెండియును
నొకకొండచఱియలో నుఱుక, నాగిరియు
వికలంబు లేకుండ వెలువలఁబెట్టె;
విడువక యమ్మౌని విపరీతబుద్ధి
దడయక కంఠానఁదగనొక్కగుండు
కట్టుక ఘోరనక్రగ్రాహములకు
బెట్టైననదిఁజొర, బెదరి యన్నదియు
నతిసాత్వికులనంటదలజడన్నట్లు
శతముఖంబులఁ [47] బాఱి[48] శతద్రువయ్యె;


మఱియును నమ్మౌని మరణయత్నములు
వెఱవక చేసియు విఫలంబులైనఁ,
దనతపోవనభూమిఁ దడయక చేరి
యనయంబుఁ దపముండ, నటనొక్కనాఁడు,
తనకుమారుఁడుశక్తి తాపసుభార్య
[49]యనఘాంగదృశ్యంతియనియెడు ముగ్ధ
తసయగ్రమునఁబోవ, దానిగర్భమున
వినుత సుస్వర వేదవితతులు చెలఁగ
విని, మౌని యెంతయు వెలఁదిగర్భమున
దనయుఁడుండుటెఱింగి తద్దహర్షించి
పుత్త్రశోకము మాని పొలఁతియుఁ దానుఁ
బౌత్రునిజన్మంబు ప్రార్థించుచుండె.
అంతట నొక్కనాఁ డమ్మౌనికోడ
లెంతయు జలముల కేతెంచుచోట
ఘనకల్మషుండైన కల్మాషపాదుఁ
డెనయ నామునికాంత నేచి మ్రింగంగఁ
జను దేరఁ, [50]జూచదృశ్యంతి తలంక ,
మునుదానినీక్షించి మునివసిష్ఠుండు

కల్మాషపాదుఁడు శాపవిముక్తుఁడగుట


వెఱవకుమని దాని వెఱపెల్ల మాన్చి
మఱవక వానిపై మంత్రోదకంబు
ఝల్లనఁ దనమంత్రశక్తిచే నపుడు
చల్లిన, రాక్షసచపలభావమును
గల్మాషపాదుండు కడముట్ట విడిచి
మేల్మిరాజై ప్రణమిల్లి యాలోన,


వినయ సద్భక్తితో వీక్షించి పలికె :
“అనఘాత్మ, నీచేత నణఁగె శాపంబు ;
చనియెద నేనింక జనపదంబునకు;
నెనసిన వేడ్క నీవేతేరవలయు. "
అనవుడు మౌనియు నంగీకరించి
పొనర నారాజన్యుపురికి నేతెంచె.
అపుడు కల్మాషపాదావనీశ్వరుఁడు
తపసియుఁ దానును దనపురంబునకు
నేతెంచి, మంత్రుల నింతులఁగూడి
యాతాపసారాధ్యు నర్చించి మ్రొక్కి
ప్రణుతించి పలికె : " నోభవ్యాత్మ, నాకు
గణుతింప మునిశాపకారణంబునను
మగువఁ గూడఁగరాదు మరణోక్తి భీతి ;
మగవాని నొక్కని మదయంతియందుఁ
గులమెల్ల నిలుపంగఁ కుదురైనవానిఁ
జెలువుగా నీవయ్య! క్షేత్రజుఁగాను.
అనుచుఁ బ్రార్థన చేయ నతఁడు గైకొనుచు
మనుజేశుసతియైన మదయంతియందు
నొక పుత్రు నుత్తము నుదయింపఁ జేసి
ప్రకటించి రాజుచే బహుమానమంది
యచ్చోటువీడ్కొని యాశ్రమంబునకుఁ
జెచ్చెరనేతెంచె శిష్యులుగొలువ.
అంత నదృశ్యంతి హర్షంబుతోడఁ
గాంతిమంతునిఁ బుత్త్రు ఘనతపోధనుని
రవినిభతేజుఁ బరాశరుంగనియె.
అవసరంబునవచ్చి యావసిష్ఠుండు
సకలకర్మంబులు శాస్త్రోక్తిఁ జేసి,
ప్రకటించి పెనుపంగఁ, బ్రబలి యాసుతుఁడు


కాలోప[51]నీతుఁడై కలవిద్యలెల్ల
లీలమైనేర్చి, వాలికప్రాయమునను
దాతకు నెఱిఁగించి తపమునకరిగి
ప్రీతితోడఁ దపంబు పెక్కేండ్లుచేసి,
హరి ధాత హరులఁ బ్రత్యక్షంబుచేసి,
వరుస వారలచేత వరములువడసి,
మరలి యే తెంచి యామహితాత్మకుండు
గురుతరంబుగఁ దాతకును భక్తి మ్రొక్కి
పలికె: "భవ్యాత్మక, ఫలియించెఁదపము;
అలరి మిమ్మొకటి నేనడుగవచ్చితిని;
పితృఋణంబుడుపని బిడ్డఁడేమిటికి!
బితరులకెల్లను బ్రియముగా నిపుడు
ఘోరతపంబునఁ గుటిల రాక్షసులఁ
బేరుమాన్పెద నన్నుబ్రియముతోనసువు. '
మనవుడు నమ్మౌని మనుమనిఁబలికె :
"ననఘ, తపంబేల యల్పంపుఁబనికి!
నుగ్రతపంబున నొక కీడు దోచు;
 [52]వ్యగ్రత దానిచే నణఁగులోకములు.
ఈయర్థమునకు నే నితిహాసమొకటి
ధీయుక్తిఁ జెప్పెద ధీరాత్మ , వినుము.
కృతవీర్యుఁడనురాజు క్షితియేలి మున్ను
జతురతఁ గావించె సకలయజ్ఞములు.
ప్రీతి యాజకులైన భృగునందనులకు
బ్రాఁతి దక్షిణలుగా బహుధనంబొసగి
యాపుణ్యఫలమున నాండ్రును దానుఁ
బ్రాపించె నాకంబు పార్థివోత్తముఁడు.


ఆవెన్కఁ దత్పుత్త్రు లవని నేలుచును
ఆవిప్రులకు ధనంబబ్బుటయెఱిగి,
భృగుతనూభవులను బిలిపించి బలిమిఁ
దెగనియర్థముతృష్ణ, దివిఱియిట్లనిరి :
'ద్విజులార, మీకేల విపులార్థతతులు!
విజయింపవలె మాకు వేగంబె తెండు'.
అనిన, వారలు ధనమట్లీయకున్నఁ
గిసిసి భార్గవుల నాక్షితిపులు చంపి,
దాఁచినధనములు దాఁకఁగైకొనుచుఁ
బూఁచి [53] యెవ్వనినిందుఁ బొడమనీమనుచు
నర్భకులాదిగా [54] నణఁగించుచోట,
గర్భంబు నొకకాంత గరిమతోఁ దొడల
ధరియించెఁ బదియేండ్లు; తగ నంతమీద
సురుచిరాత్మకుఁడైన సుతునిఁ గాంచుటయు,
నరయంగ నాపుత్రుఁ డౌౌర్వుఁడై పెరిగి
జననిచే జనకులచా వెల్ల నెఱిగి
ఘనతపంబొనరింపఁ, గలకె లోకములు;
సురరాజు భీతిల్లె; సూర్యుండుసళ్ళె  :
నరుదందెభవుఁ; డజుండతిభీతిఁబొందె
నప్పుడౌర్వునితండ్రు లచటికి వచ్చి
యుప్పొంగి పలికిరయ్యురుతపోధనుని :

పితరు లౌర్వుని శాంతునిఁజేయుట



“ఓవత్స! యింక నీయుగ్రతపంబు
గావింపవలదు లోకములఁగాల్చెడిని
కృతవీర్యసుతులచేఁ గృతమున నేము
సతతధనాపేక్ష జచ్చుట లేదు;


పరలోక సౌఖ్యంబు ప్రాపించుకొఱకుఁ
బొరలి యావిధమునఁ [55]బొలిసితిమింతె'
అనిన నౌర్వుఁడుపల్కు : “నమలాత్ములార,
యెనసిన యీతపంబేమాన్తి నేని,
నన్నునే గాల్చు నీనవతపోవహ్ని;
యున్నతి నెచ్చోట నునుతునే' ననిన
నంతయుఁ జింతించి యమ్మౌనులనిరి:
'వింతతపోవహ్ని విమలాత్మ! యిప్పుడు
జలముల [56]లోకముల్ జనియించెఁగాన
జలధిలోవైవుము జలము గ్రోలంగ.'
అనిన వారలమాటలంగీకరించి
యనిచి దండమువెట్టి యౌర్వుండువోయి,
తనతపశ్శిఖ సముద్రములోన వైవ
ననయంబు బడబాగ్నియై యుండె; నంత
నౌర్వుఁడు నటవచ్చి యంబయుఁ గాను
సర్వకర్మంబులు సలుపుచు నుండె.
కావునఁ బౌత్రక, కడిదితపంబు
గావింపవల దింకఁగార్యంబువినుము.
రాక్షసక్షయముగా రమణ జన్నంబు
దీక్షతో జేయంగఁ [57]దివుఱుము నీవు."
అని వశిష్ఠుఁడుచెప్ప నప్పరాశరుఁడు
విని యిచ్చగించి యవ్విపినమధ్యమున
సకలసాధనములుఁ జయ్యనఁ గూర్చి
ప్రకటించి రాక్షసప్రళయయాగంబు
చేయుచునుండంగఁ, జెదరిదానవులు
నాయజునకుఁ జెప్ప, నద్దేవుఁడపుడు

పొనరఁ బులస్త్యాదిమునులఁ బుత్తేర,
ననఘు లేతెంచి రయ్యజ్ఞవాటికకు.
ఆరీతి వచ్చినయమ్మునీంద్రులకు
నారీతినర్ఘ్యాదులప్పరాశరుఁడు
గారవంబుననిచ్చి, కలితాసనములు
ధీరతఁబెట్టించి దృఢభక్తిఁబలికె :
“ఓమహాత్మకులార, యోగ్యులుమీర
లీమహికే తెంచుటేమికారణము?
ఏనుధన్యుఁడనైతి; నింక నాపితరు
లానిన సౌఖ్యంబులనుభవించెదరు.
ఏపని నాచేత నెసగుమీకిపుడు?
చేపట్టి దయతోడఁ జేయించుకొనుఁడు."
అనినఁ బులస్త్యాదు లాశక్తిసుతుని
వినయంబునకు [58]మెచ్చి వేడ్కనిట్లనిరి:
"మహితాత్మ, నీయట్టిమనుమండు గలుగ
మహి వశిష్ఠుండు నెమ్మదినున్నవాఁడు;
ఆమహాత్మునిధైర్య మాశాంతగుణము
నేమంబుతోఁ జెప్పనేర్తుమె మేము!
అతనితోఁ బగగొని యాకౌశికుండు
[59]మతకముసల్పిన, మాయదానవుఁడు
తినియె మీతండ్రుల దేవసన్నిభుల.
దనుజులుచేసినతప్పు గాదదియు;
వారును మీతాత వరతపోమహిమ
బోరనఁ గాంచిరి పుణ్యలోకములు;
కావున నీవింక ఘనరోషముడుగు;
కావింపవలవ దీక్రతువు చాలింపు.”



అని పులస్త్యాదు లిట్లానతిచ్చినను
విని పరాశరమౌని వేడ్కనిట్లనియె:
"[60]మీవాక్యమంతయు మీఱక [61] సేతు;
నేవిధంబుననార్తు నీమహావహ్ని?”
అనిన మౌనులు పల్కి : "రనఘాత్మ, దీని
నొనర హేమాద్రికి నుత్తరంబునను
గడుఘోరమైయుండుకాననమందు
వెడలింపు [62]మీ" వన్న వేగంబె పోయి
యనలంబు గైకొని యప్పరాశరుఁడు,
మునుల వీడ్కొల్పి యిమ్ముల నంతలోన
దనుజాటవీ దాహ దావాగ్నిఁ బోలు
ఘనతరాటవిలోనఁ గడువేగ వైచె
వైచిన నాచిచ్చు వనమెల్లనిండి
యేచి దావాగ్నియై యెప్పుడుమండె,
నప్పుడు శాక్తేయుఁ డలుకచాలించి
తప్పక చనుదెంచి తాతకు మ్రొక్కి,
యవ్వకుఁ దల్లికి నతిభక్తి నెఱఁగి,
మవ్వంపుదపములు మహిఁజేయుచుండె.
అట గౌశికుండును నతిఘోరతపము
పటుబుద్ధి గావించి బహువత్సరములు
బ్రహ్మసంభవుచేత బ్రహ్మమెచ్చంగ
బ్రహ్మమునిత్వంబు భక్తితోఁబడసి,
యావశిష్ఠునకును నబ్జసంభవున
కేవెంట సరివచ్చి యెలమివర్తించె.
అనఘ, తపశ్శక్తి నందంగరాని
ఫలములుగలవె! సంభావితాత్ములకు.

.


ఎనయ నీ తాపత్యహితవశిష్ఠార్య -
ఘనమహాఖ్యానముల్ కడుభక్తి వినినఁ
జదివిన వ్రాసిన జనుల కెప్పుడును
బొదలు సంపదలును బుణ్యజాలములు.
గావున భక్తితోఁ గౌంతేయ, మీరు
భావింప నొకమునిఁ బరమతపస్విఁ
జేపట్టియున్న నీక్షితి నెంతవారు
నేపట్టునను మీకు నీడుగాలేరు."
అనుచు నవ్విధమున నంగారపర్ణుఁ
డనయంబు చెప్పంగ నర్జునుండనియె:
“అనఘ, నీ చెప్పినయట్ల చేసెదము;
వినుతాత్ముడగు నొక్కవిప్రుండు గలఁడె!"
అనుడు దివ్యుండువల్కు: “నాచార్యుఁగాఁగ
నొనరింపఁదగువిప్రు నుర్వీశ, వినుము;
ఉత్కచంబనుతీర్థమున్నది యెదుట;
సత్కాంతినిధులార, చనుఁడు మీరటకు,
ధౌమ్యుఁడున్నాఁ డందుఁ దాపసోత్తముఁడు;
సౌమ్యుఁడతండు మీచనవుచేకొనును.
ఆచార్యుఁగా మీర లతనిఁ బ్రార్థింపుఁ;
డాచుల్కఁదనమేఁగు నంతలో." ననిన
నంగారపర్ణుచే నంతయుఁ దెలిసి,
సంగతిఁ బాండవుల్ సంతసంబునను
అతనివీడ్కొని వేగ నాగంగదాటి,
ధృతివచ్చి యుత్కచతీర్థంబునందుఁ

పాండవులు ధౌమ్యునిఁ బురోహితుఁగా వరించుట



దపమున్న ధౌమ్యు నుత్తమకళారమ్యు
విపులవర్తనసౌమ్యు వేడ్కతోఁ గాంచి


జననీసమేతులై సాగిలి మ్రొక్క,
ముని వారిఁ బూజించి ముఖవికాసమున:
"నేమొకొ ! వచ్చితి రిటనన్ను వెదకి;
భూమి మీవృత్తాంతములు వినియుందు;
దుర్యోధనుఁడు సేయుదుష్కార్యములకు
గార్యంబువుట్టనికణఁక వర్తింత్రు.
మిముఁ [63] గూల్చువారైన మీరు చింతించి
సమబుద్ధినున్న మీశాంతి పర్ణింతు.
వేడుక తళుకొత్త [64] విభులార, మిమ్ముఁ
జూడఁగంటిమి నేడు సుదినంబుమాకు,
మీరుకాలిన వార్త మేదిని మ్రోయఁ
గౌరవకుల మేను గాల్పఁజింతించి,
మఱి యోగదృష్టి మీమనికి యెఱింగి
మఱవకున్నారము మముఁ గాంతురనుచు.
పరమకళ్యాణంబు పాంచాలువీఁట
దొరకొనుమీకు బంధువులెల్ల నెఱుఁగ.
అప్పుడు విని మిమ్ము నాంబికేయుండు
రప్పించి మఱి యర్ధరాజ్యమీఁగలడు."
అనిన సంతోషించి యతనికిఁ బాండు-
తనయులిట్లనిరి : "మీతత్త్వమిట్టిదియె;
ఇచ్చలో మిముఁ బురోహితునిఁగాఁ గోరి
వచ్చితిమిచటికి; వాత్సల్యలీల
ననుమతిచేసి మమ్మనుపుదుగాక;
చనవలెఁ గాంపిల్యజనపదంబునకు, "
అనుటయు నట్లకాకని పురోహితము
మునియియ్యకొని ప్రియంబున వీడుకొలుపఁ,


గవచధారులువోలెఁ గదలి పాండవులు
జవమొప్ప నడచుచు సంప్రీతి [65]యడరఁ
బోవుచో, గొందఱు భూసురోత్తములు
త్రోవ గుంపులుగూడి తోడ్తోన నడవఁ,
గ్రోధమించుక లేక కుంభినిఁబరఁగు
సాధువిప్రులఁగూడి జననియుఁ దారు
నడచి శరావతినది యుత్తరించి
యడరంగవచ్చుచో, నంతఁ గట్టెదురఁ
గాంచిరి మణిసౌమ్య కాంచనరమ్య
సంచిత సురపురీ సమభాసురంబు,
గజరాజ భటరాజ ఘనరాజయోగ
నిజకీర్తిగుణసుధా నిర్మలీకృతము,
నభ్రస్థలభ్రమ[66]దభ్రసందర్భ
విభ్రమాస్పద సౌధవీథిబంధురము,
గేలీగృహాంచిత కృత్రిమపుష్ప
లీలావిలోల శిలీముఖాకులము,
నిరుపమ తారుణ్య నిచితలావణ్య
వరవనితారత్న వైభవోజ్జ్వలము,
బహుతర కుట్టిమ భర్మమాణిక్య
మహనీయ తోరణమార్గ శోభితము,
రవిరథవాహ విక్రమ[67]ధావనోత్థ
పవనచాలిత కేతుపట భావితంబు
నింపార ద్రుపదరాజేలుచునున్న
కాంపిల్యనగరంబుఁ; గనుఁగొని యలరి
విప్రకోటులుఁ దారు వేడ్కఁ గౌంతేయు
లాప్రొద్దెసొచ్చి సూర్యాస్తమయమునఁ

గుమ్మరవాడలో గుణియైన యొక్క
కుమ్మరివానింట గుఱుతుగా విడిసి,
భిక్షాన్నములుదెచ్చి ప్రియముతోఁ గుడిచి
యక్షీణసుఖనిద్ర నందిరారాత్రి.
అంత స్వయంవరంబందుఁ బాండవులు
కాంతఁగైకొన రాచగమిమోములెల్లఁ
దెల్లనౌనిట్లని తెలిపినమాడ్కిఁ
దెల్లఁబాఱె సురేంద్ర [68]దిగ్భామ మొగము ;
పుండరీకాక్షునిఁబొడగన్న నయన
పుండరీకంబులు బోరన నెల్లి
వికసించుఁ బాండవవిభులకన్నట్లు
వికసించెఁ గొలఁకుల విరిదమ్మిగములు;
విభులోలిఁ దమచేత విలువంపరాక
సభయులై యొండొండ జరుగుదురిట్టు
లని చూపిచెప్పినట్లాకాశవీధి
వెనుకొని చుక్కలు వచ్చిపోఁ దొణఁగె;
ద్విజరూపధరుఁడెల్లిఁ దివియుఁ గార్ముకము
ద్విజకులంబులకెల్లఁ దేజంబువచ్చు
నని వేడ్కఁ దమలోన నాడుకొన్నట్లు
గొణఁగఁజొచ్చె ద్విజాలి గూడులలోన;
వారణావతములో వహ్ని పాండవులఁ
బారణగొనెనని ప్రజలాడుకొనఁగ
నానిందఁ బాపుగో నగ్ని రాఁబోలు
నీ నెలవునకన నెఱసంజ దోచే;
విజయాస్త్రములఁ ద్రెవ్వు వీరులకెల్ల
గజవీధి యుసగంగఁ గాలకాలమున (?)


నుదయింతునన్నట్టు లుదయాద్రి సూర్యు
డుదయించె నర్ఘ్యంబు లొసగ బ్రాహ్మణులు.

ద్రౌపదీ స్వయంవరోత్సవము



అటమున్న ద్రుపదుండు నఖిలదిక్కులకుఁ
బటులీలఁ గల్యాణపత్రికల్ వ్రాసి
క్షత్రకోటికిఁ జెప్పఁ, జయ్యన వారు
యాత్రామహాభేరు లందంద మ్రోయఁ
దమతమగొడుగులుఁ దమతమపడగ
లమిత వైఖరి [69] మెఱయ నా ప్రొద్దె కదలి
వచ్చుచో, శల్యుండు వజ్రతుల్యుండు
నచ్చినభుజబలోన్నతిఁ బెచ్చు పెరిగి:
'విలువంతు గుఱిద్రుంతు వెలఁదివరింతుఁ
బలుకులేల !' ని వచ్చె బాంచాలుపురికి ;
శిశుపాలుఁ డతిరథశ్రేష్ఠులతోడ
దశదిశఅద్రువఁ బ్రతాపించి కదలి
తగినకోమలిగల్గె దనశయ్యకనుచు
నగియెడువారిఁ -[70] గానక వచ్చె నటకు;
దుర్యోధనుఁడు మహాద్భుత వైభవమున
ధైర్యభూషణులైన తమ్ములు గొలువ
నేకార్ణవఖ్యాతి నిభములు గొలువ
ఢాకతోవచ్చెఁ జుట్టవువానిపురికి ;
నలివేణిఁబొందాస నంగాధిరాజు
నలుగడఁ గవికీర్తనంబులు, చెలఁగ:
విజయుఁడుర్వరలేనివేళ [71] నేఁదెత్తు :-
గజయాన' ననివచ్చెఁ గాంపిల్యపురికి ;


'రాకమానరు పాండురాజనందనులు
నాకుఁజూడఁగఁగల్గు సయమొప్ప' ననుచు
నారాయణుఁడు వచ్చి నలుగడ [72] వృష్ణి-
వీరులు నేవింప విందుప్రోలికిని.
ఈరీతి మఱియు ననేకులు నృపులు
వారాశివలయిత వసుమతినుండి
చిగురుఁబోఁడి విరాలిచిక్కముచేరు
తిగిచినకరణి సంధిలిరి తత్పురిని.
ఉర్విమోపరులెల్ల నొకవంకఁ గూడ
నుర్విభారము శేషుఁడోర్వలేఁడయ్యె.
పనిగొని సేనతోఁ బాంచాలుఁడట్టి
యినసోమవంశ్యుల కెదురుగాఁ బోయి
తడయక తోడ్తెచ్చి తగు విడిదలల
విడియించి, వారికి విభవంబుమెఱసి
యుపచారములుసేయ, నొకరీతి రాత్రి
నృపులువేగించిరి నెలఁతరాఁగోరి.
ఆఁడుబిడ్డకును స్వయంవరోత్సవము
నేడని ద్రుపదుండు నిజపురిలోనఁ
జాటింపంబనిచిన, శంబరారియును
బాటింపఁబనిచెను బాణ సంపదను.
మఱునాఁడు ద్రుపదుండు మనుజేంద్రసభలఁ
దఱిగొని యింద్రనందను వెదకించి
కానక, గజముపై గంటయెత్తించి
జూనొప్ప నిట్లని చాటఁబుత్తెంచె:
"మంచలమీద వేమాఱుండి మిగుల
సంచిత పుష్పగంధాదులవలన



రూపింప నొప్పుకార్ముక మెవ్వఁడేని
మోపెట్టి పంచాస్త్రములు వింటఁ దొడిగి
యంత్రమత్స్యమునేయు, నతఁడు ద్రౌపదికి
మంత్ర దేవతగూర్చు మగఁడు గాఁగలఁడు."
అనిచాటుటయు, విని యారాజలక్ష్ము
లిసుమడింపఁగ రాజులెల్లఁ గైసేసి,
గుంపులై సింగంపుఁగొదమలు వోలె
సంపదమెఱసి పాంచాలిరాగోరి
ధనువువంపకమున్న తమమీద మరుఁడు
ధనువువంపంగఁ బోయి తగినవేడుకను
వందిమాగధులు కైవారముల్ సేయఁ
గ్రందైన మంచలు క్రమముతో నెక్కి,
యెప్పుడెప్పుడు కృష్ణనీక్షింప మాకుఁ
జొప్పడు నని నిక్కిచూచిరెదుళ్లు.
విప్రులు వైశ్యులు [73] వృషలవల్లభులు
గప్రము [74]గంధంబుఁ గై నేసివచ్చి
చెలువఁబాంచాలిఁ జూచినఁజాలు ననుచుఁ
గులములేర్పడ వచ్చి కూర్చుండిరచట.
ద్విజులలోపలవచ్చి ద్విజరాజవంశ్యు
[75]లజిన జటా వల్కలాంచితులగుచు
ఘనమైన రాజలోకములోనఁ జొచ్చి
పొనర నందఱకంటెఁ బొడవు దీపింపఁ
గొనకొన్న వేడుకఁ గూర్చుండి రంత.
కొనియాడు మానవకోటుల రవముఁ,
దునియని పటహాది తూర్యరవంబుఁ,
జెలఁగు భూసురుల యాశీర్వాదరవముఁ,
బలుకు లోకుల పక్షపాతరవంబుఁ
 



బోరుక లంగ నంభోనిధిద్రచ్చు
నారావమునుబోలె నప్పుడెంతయును.
అటమున్న ద్రుపదరాజాత్మసంభవసు
బటుతరకల్యాణ [76] భాగ్య యోగ్యతలఁ
గైనేయఁబనిచినఁ, గలికి జవ్వనులు
చేసూటి బోఁటిమెచ్చినపరిపాటిఁ
జంపక తైలంబు చారుధమ్మిల్ల
సంపదకింపుగా సకియకు సంటి,
కలకంఠి నలసత గదియకయుండ
[77] నలకలు మెల్లన నతివకుదువ్వి,
కుంకుమ చందన గోరోచనముల
పంకంబు [78]సతిమేనఁ బసిమిరానలంది,
నీలాలకాఁగుల నెఱి దొరలించి
యోలిఁబట్టినతీర్థ మువిదకు నార్చి,
మెత్తని [79] వలిపాన మెయితడి యొత్తి
యుత్తమాంగజలంబు లొయ్యన విద్రిచి,
తొడరి కాలాగరుధూపవాసనలఁ
దడియార్చి, మల్లికాదామముల్ దురిమి,
తిలకంబు బాలికాతిలకంబునుదుట
నలికంబుగాఁ బెట్టి నగవంకురింపఁ,
గాటుక తెలిసోగకన్నుల వ్రాసి,
పాటించి మకరికాపత్రంబు లొత్తి,
స్వాతి తా ముత్తెమై చనుదెంచె ననఁగ
బ్రాఁతిగా నాసికాభరణంబు పెట్టి,
మృగనాభికప్రము మేలన చేసి,
మృగనేత్ర చక్కని మెయిదీఁగె నలఁది


వట [80] ఫలాధరకు దువ్వట మావటముగఁ
దటుకునఁ గట్టి, యెంతయు ముదంబొదవ
మట్టెలు మొలనూళ్లు మణివలయములుఁ
గట్టి, నేవళములుఁ గంఠమాలికలు
బవిరె లుంగరములుఁబల్లేరుపువ్వు
లివియాదిగా సొమ్ము లింతికిఁ దొడిగి,
వాలికలైన నివ్వాళికలెత్తి,
బాలికామణికి సౌభాగ్యదర్పణము
చూపినఁ, దనరూపు చూడలజ్జించి
ద్రౌపది తనయింటి ధనువుచింతించి:
యీకార్ముకమువంచి యెవ్వఁడే నన్ను
[81] గైకొనునట్లౌనొ! కాదొకొ !" యనుచుఁ
[82]దలపోయఁ, జెలువలాధవళాయతాక్షిఁ
గొలువుకూటమునకుఁ గొమరొప్పఁదెచ్చి
యారాజునకుఁజూప, నతఁడుముద్దాడి
కీరభాషిణిఁ బల్లకీ యెక్కఁ బనిచి
ఛత్రచామరములు [83]సకియలు పూనఁ
జిత్రవైఖరి మహానేనలు నడవ,
సంతనకట్టి ధృష్టద్యుమ్ను కవుడు
నెంతయుఁ బ్రియమున నిట్లనిపలికె:
“కన్నియ రాజమార్గంబునఁ జనుచుఁ
గన్నిచ్చయగురాజుఁ గైకొనరాదు;
వెలయ బ్రహ్మక్షత్ర విట్ఛూద్రులందు
నలువొప్ప నెవ్వడైనను గొదలేదు ;
ఇవ్విల్లుమోపెట్టి యిషుపంచకమున
దవ్వులయంత్రమత్స్యమునెవ్వఁడేయు



వనజాతముఖి వానివరియింపఁగలది.
వినఁజెప్పుమబలకు వీరులు వినఁగ
సతిభక్తిఁ బేర్వేర సట్టివీరులను
సుతకెఱింగింపుమీ చూపుచు." ననుచు
నెల్లరు వినఁజెప్ప నింతి యామాట
లెల్లను ధరియించె హృదయంబులోన.
ఇదెవచ్చెఁ బాంచాలి యివ్వీధికనుచు
నదెవచ్చెఁ బాంచాలి యవ్వీధికనుచు
నొక్క మొత్తంబులై యువీదపైఁ గవిసి
నిక్కినమెడలెల్ల నిడుపులుగాఁగ
రాజలోకము చూడ, రాజబింబాస్య-
కాజూడచూపుచు నగ్రజుండనియె:

ధృష్టద్యుమ్నుఁడు రాజులఁ బేర్వేర ద్రౌపదికిఁ జూపి చెప్పుట

“మలయజ గంధి, యీమనుజేశుఁజూడు,
మలవడ ముత్యాలహారముల్ వైచి
పన్నగపతివోలె బాహువిస్ఫూర్తి
నున్న వాఁ; డితఁడు పాండ్యుఁడు నీరజాక్షి  !
కుంతలపతివీఁడె కుటిలకుంతలుల
చింతా[84] స్థలులఁగాని చేయఁడు విడిది ;
స్వారాజునకు నాత్మచలియింపుచుండఁ
బారియాత్రావురిఁ బాలించునితఁడు.
మాళవేశ్వరుఁజూడు మదిరాయతాక్షి !
బాలార్కనిభమౌళి భరియించువాఁడు ;
వీని యౌవనమున విహరింప రంభ
మేనక యూర్వసి మెఱసికోరుదురు.



తరుణి, యీతఁడు పరంతపుఁడనువాఁడు
మరహాటకామినీ మదనమంత్రంబు ;
వీనిశాత్రవగేహ విపినమధ్యమున
నీనినపులులుండు నెందునుబోక.
భూరిశ్రవుఁడు వీఁడె పూఁబోఁడి,చూడు
ధీరుఁడు బాహ్లీక దేశనాయకుఁడు ;
బలుఁడు భీముఁడు సింహబలుఁడు మాగధుఁడు
బలమునఁ దనతోటిపాటివారనుచు
నెక్కువలావున నెపుడు మట్టాడుఁ
జొక్కించుమగవానిఁ జూడుమా శల్యుఁ
జేదీశు నిటుచూడు శిశుపాలు నబల!
[85]ఈదృక్ శుభమువిని యెదిరి శూరులకు
బలవంతమున నైన భామిని, నిన్ను
వలవంతఁ గొనిపోవ వచ్చినవాడు.
మధురిపుఁడెవ్వనిమహిమకుఁ గాక
మధురనుండక పోయె మహినొక్కపురికి;
రాకేందువదన, జరాసంధుఁజూడు
కైకొనఁ డీవిల్లు కసవునకైన  ;
అవనీశవరుల సహస్రసంఖ్యలను
శివగాత్రికై వీఁడు చెరఁబెట్టినాఁడు.
జగతి నక్షోహిణిసంఖ్యలుగలుగు
పగ రాక్షసులఁజంపి ప్రజలలో నిపుడు
సాధులాగుననున్న జగదేకనాథుఁ
డాదినారాయణుండైన దేవుండు
బాణాసురునితోడి బవరంబునాఁడు
బాణునిపై పూని భవుఁడువచ్చినను
 


బ్రమథులతోడఁ బాల్పడి పోరినట్టి
సమరభీమునిఁజూడు జలజాక్షి, బలుని.
కర్ణుఁజూడుము వీఁడా కర్ణాంతనేత్ర!
దుర్ణివారుఁడు వీడె! దురములోపలను;
ఎన్నికఁ [86] గవులకు నితఁడిచ్చుధనము
పన్నగపతియైన భరియింపలేడు.
కౌరవపతి వీఁడె కమలాక్షి, చూడు
ధారుణీశుల నెల్లఁ దగనేలినతఁడు ;
వీనిధాటీభేరి వినినవీరులకుఁ
గానరావలెనొండెఁ గానఁబోవలెను.
నలువొప్ప ధృతరాష్ట్రునకు బిడ్డనిచ్చి
బలిమి భూస్థలిఁ జెల్లుబడిగాఁగ నేలు
బంధుసంపదఁ గాకిబలగంబుఁ దెగడు
గాంధార రాజు నోకల్యాణి, చూడు.
ఈతఁడు శూరసే; నితఁడువిరాటుఁ;
డితఁడు - [87]భగదత్తుఁ; డితఁడు సైంధవుఁడు ;
ఇతఁడు చిత్రాంగదుం; డితఁడు సుషేణుఁ ;
డితఁడు సేనాభిదుం ; డితఁడు సుశర్మ
వాఁడె సుమిత్రుండు ; వత్సరాజితఁడు ;
వాఁడె చూడుము పౌండ్రవాసుదేవుండు ;
శ్రీనిధులదె చంద్రసేన సముద్ర-
నేన శుభాంగద చేకితానులును."
అనిచూపి వెండియు నవనిఁ గాంభోజ-
ఘనశూరసేన కేకయులాదిగాఁగ
నృపులఁ గన్గొనఁజేసి, నెమ్మి బ్రాహ్మణుల
సపరిమితాధ్వరాహర్తలఁ జూపి,



హేమకోటికిఁ బడగెత్తు వైశ్యులను
భామకేర్పడఁజూపి, పాంచాలసుతుఁడు
ఆవరవర్ణిని నపర వర్ణులకు
వేవేగఁ జూపి యావిభులకిట్లనియె:
"సకల భూములవారుఁ జనుదెంచినారు;
శుకవాణి మీకు రాఁ [88]జూడద యురక.
ఇవ్విల్లుమోపెట్టి, యేనింట మీనుఁ
దైవ్వనేసినవాఁడు దీనికిమగఁడు.
[89] అంగవింతురుగాక యాకార్యమునకు
శృంగార నిధు." లన్నఁ జెలఁగి పార్థివులు,

మత్స్యయంత్రమేయుటలో రాజపుత్రులు పరాభూతులగుట



మూలగాలికి లేచు మొగిళులుపోలె
నోలి నందఱులేచి యుద్ధండవృత్తి,
నంచిత పదఘట్టనారావమెసగ
మంచలపై నుండి మహిడిగ్గనురికి,
పై పుట్టములువుచ్చి పటులీలదాటి
..................................
..................................
యాభంగివచ్చిన యాకృతివోలె,
మనుజవార్ధిమధింప మంధరాచలము
చనుదెంచెనో విష్ణుసన్నిధికనఁగ,
నిరువంకలను నడుమేక ప్రకార
పరిణతిఁ బుణ్యాతుపలుకునుబోలెఁ,
గదియ నక్కజమైనఁ గదిసి చేదూర్చి,
కదలింపరాకయగ్గలము మల్లాడి,


కొందఱువిరిగిరి; కొందఱావిల్లు
చెందినవేడ్క వంచియు నెత్తలేక
కలఁగిరి; కొందఱు కదలించి యెత్తి
యెలమి నించుక నారియెక్కింపలేక
. . . . . . . . . . . . . . . . . .
వూపునఁదివియుచోఁ బోవునోప్రాణ
మేపునఁ బాంచాలికిట్లు భూపతుల
. . . . . . . . . . . . . . . . . .
అనుచుఁబోయిరి కృష్ణ యాత్మలోనవ్వ  ;
మునుపు కొందఱు పీఠములు డిగ్గరైరి;
ఘోరమైయున్నఁ గన్గొని కొందఱందు:
“ నీరీతిఁ బాంచాలినీనియత్నమున
ముడివెట్టెనో ! కాక, మొదల నీవిల్లు
కడఁగి యెక్కండేనిఁ గదలింపకున్నె !”
అని చూడభీతులై యందంద నిలిచి
కనుగొనుచుండిరి ఘనశరాసనము.
మఱికొంద ఱవ్విల్లు మలయుచుఁగదిసి
నెఱిఁగదల్పఁగలేక నివ్వెఱఁజనిరి.
కొంద : " ఱీవిల్లేల ! కోమలియేల !
యిందఱలోపల నీసిగ్గులేల !
ఊరకుండుటకార్య; మువిదకై నోళ్లు
నూరకుండుట కార్య మొప్పుగా" ననిరి.
అంత జరాసంధుఁ డావిల్లుగదిసి
పంతంబుతో నెత్తి ప్రజలెల్లఁ బొగడ
మిడికొప్పునకు నారి మినపగింజంత
కడమగా నెక్కించి గ్రక్కునవిడిచె ;
అటువిడిచిన వ్రాలునావింటి క్రిందఁ
బటుసహస్రములీల్లెఁ బ్రజలుసందడిని.



మద్రేశుఁ డప్పుడు మదమునఁగదిసి
యద్రిఁబోలిన చాప మవలీలనెత్తి,
పెడగాల నడుమూది పెసరగింజంత
కడమగా నెక్కించి గ్రక్కున విడిచె
శిశుపాలుడును దనచేతికి విల్లు
వశముగానెత్తి భూవరులెల్లఁ జూడ
వడిఁ గొప్పునకు నారి వరిగింజయంత
కడమగా నెక్కించి గ్రక్కున విడిచె.
అంగాధిపతి కర్ణుఁ డార్చుచు వచ్చి
యంగద నాచాప మవలీలనె త్తి
'యక్కట ! వీనిపాలైపోదు' ననుచు
నక్కన్యవీక్షింప, నలువొప్ప మౌర్వి
విడువనిలావున వెండ్రుకయంత
కడమగా నెక్కించి గ్రక్కునవిడిచె.
హలపాణి మొదలైనయాదవులెల్లఁ
దలపడఁజూచిన, దై త్యారిగదిసి :
"విప్రులతోఁ బాండవేయులు వచ్చి
యీప్రసంగమునకై యిదె యున్నవారు ;
వారికై ద్రుపదుండు వరమునఁగన్న
వారిజాక్షికి మీరు వలదాసచేయ;
వినుతిఁ గన్నులుగల వేల్పులువోలెఁ
గనుఁ;" డని వారలఁ గదియనీఁడయ్యె.

అర్జునుఁడు మత్స్యయంత్ర మేయుట



మఱియెవ్వరును వింటిమాటాడవెఱచి
మఱుఁగులకొదుగుచో, మఘవాత్మజుండు
కరియూధములనుండి కరిరాజులేచు-
సరణి మహీదేవ సభనుండి లేచి


చాపంబుగదియుచో, శక్రజుఁజూచి
యాపార్శ్వచరులెల్ల నటతమలోన:
"నద్దిరా! సతిమీదనాస బ్రాహ్మణున ;
కిద్దీర్ఘమైనవిల్లెట్లు ! తానెట్లు !
పార్థివేంద్రుల సిగ్గుపఱచినదాని
నర్థిడగ్గఱియె మేలనవచ్చు వీని! "
ననిరికొందఱు; కొందఱ : "ట్లేల ! వీడు
ధనువునకెంతయుఁ దగియున్న నాఁడు ;
ధరణిపై నెవ్వరెంతటివారుగలరొ !
పరికింపుచుందము భావికార్యములు;
నృపుల నుల్లస [90]మాడనెగడిన బాణ-
తపముపెంపెట్లైన దనకునున్నదియొ!”
అనుచోట, మఱికొంద : "ఱట్లేల ! వీడు
మనమంత్రసిద్ధుండు గాఁబోలు మొదల;
అట్టివారలకు సాధ్యముగానిదెద్ది !
యెట్టిదొ కాక యీయింతిభాగ్యంబు!"
అని. రంత, బ్రాహ్మణులతనిదీవించి :
“ఘనుఁడ, మాకపకీర్తి కట్టకుమయ్య !
[91]యిందని లావున నీవిల్లువంచి
కందువగన్నట్లు ఘనయంత్రమేసి,
కల్యాణ దేవతగరుణ గైకొనుము
కల్యాణగీతి వాక్యములు మిన్నంద. "
ననుచుండ నాపార్థుఁడావిల్లు గదిసి,
పొనరఁ బ్రదక్షిణంబుగవచ్చి నిలిచి,
జడధులు దశదిశాచక్రంబు భీతి
నడుక భుజాస్ఫాలనంబొనరించి,


లలి మత్తకరి యిక్షులతయెత్తినట్టు
లలవోక విల్లెత్తె నమరులవొగడ.
ఎక్కు వెట్టినవేగ మెవ్వరుఁగాన
రక్కన్యకయె కాంచె హరిమున్నె కాంచె
పెనఁచినగొలుసుల ఫెళఫెళధ్వనుల
ననిచి యొక్కటిగాఁగ నారిసంధింపఁ,
గలగె నంభోనిధుల్; కంపించె గిరులు;
తలఁకిరి సప్తపాతాళవాసులును;
పరఁగఁ బ్రత్యాలీఢపాదుఁడై నిలిచి,
పురలక్ష్యమీక్షించుభూతేశువోలె
నేనమ్ము లొక్కట నేయనుంకించు
మీనకేతుఁడువోలె మీఁదమీనమర
హరిమెచ్చ హరిమెచ్చ నఖిలంబుమెచ్చ
శరములిమ్ములవెంట సంధించి నరుఁడు
ఆననాంబుజమెత్తి, యంతరిక్షమునఁ
గానవచ్చియురాక కడుసూక్ష్మరేఖఁ
జపలచిత్తమువోలెఁ జలియింపుచున్న
కపటలక్ష్యముఁగాంచి, కళవళపడక
తప్పనిచూడ్కి నందలిమర్మమెఱిఁగి
యొప్పునాత్మనుగన్న యోగియు వోలెఁ
గర్ణాంతకృష్టభీకరమౌర్వినుండి
తూర్ణవైఖరిఁ బాఱఁ దూపులేయుటయు,
నవి హంసములువోలె నంబరవీథి
నీవలావలఁబోక యేకమై నడవ,
నంచితగతి లక్ష్యమనుమృణాలమును
ద్రుంచి, యంతటఁబోక తోడ్తోననెగసి
లీల నేగురపెండ్లిలేఖలాయింద్రు
ప్రోలి కర్జునుఁడంపఁ బోయినట్లరిగె.


మొగి రాజలోకసముద్రమధ్యమునఁ
దెగిన మత్స్యము వ్రాలె దృష్టింపజగము.
అప్పుడు సిగ్గును నానందగళయుఁ
దప్పక సాత్వికోదయము దీపింపఁ
బాంచాలి వెసవచ్చి పార్థుకంఠమునఁ
జంచరీకారావసంతతితోడి
పుష్పమాలికవైవఁ, బులకించి నరుఁడు
పుష్పాస్త్రముల నారువోసినట్లగుచు
నావేళఁ బ్రేమఁ గంఠాశ్లేషమర్థిఁ
గావించెనని యాత్మగణుతించుకొనియె.
ఇదిమంత్రబలమని యెన్నిరి నృపులు;
యదుకుమారులుఁ దాను హరి సంతసిల్లె.
పైపుట్టములువీచి బ్రాహ్మణులార్చి
రాపజ్జ నైదమ్ములపుడు వీక్షించి;
పురుహూతసుతుమీఁదఁ బువ్వులవాన
కురిసిరి సురలంతఁ గొనియాడి దిశల.
భేరీమృదంగాది భీమఘోషంబుఁ,
జేరి పాఠకకోటిచేయుకీర్తనము,
విప్రులు చెలఁగిదీవించు సంభ్రమము,
సుప్రసన్నతనొప్పు సురసన్నుతులును,
నేకమైయుండంగ నింద్రజుభాగ్య
మాకంజజుఁడుఁ గొనియాడలేఁడయ్యె"
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
ముని చెప్పి ననిచెప్ప మోదించి వారు:
'ననఘాత్మ, తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే!" యనియడుగుటయు,


ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాసమొప్పె నాఱవది.

  1. కొని చనకు (మూ)
  2. తగనతితానాగమతతు...
  3. మాన్ప (మూ)
  4. గలిగి – నాఖంబుల చేత నతిరమ్యమగుచు (మూ )
  5. రంబును నశ్వ (మూ)
  6. త్రిగతర్క (మూ)
  7. వేదంబు
  8. రెవ్వరును (మూ)
  9. ఒక్కొక
  10. నిండ్లు (మూ )
  11. రుత్తపండ్లు (మూ )
  12. పరకటు
  13. దీవనలు (మూ )
  14. వీక్షింపవివేక
  15. వరద (మూ)
  16. నేత్ర
  17. భక్షణలతో
  18. యాగమగ్నులుదాను
  19. ధనుల్లతి (మూ)
  20. క్షితినాథ! యేడ్వకుమోమువావ (మూ )
  21. శర
  22. చక్కుటపసలేదు చాపమూలమున
  23. యేశెలవుల (మూ )
  24. ఉపవిష్ణు (మా)
  25. దళితంబు (మూ)
  26. గర్వాంధు (మూ )
  27. వాస (మూ )
  28. చేత
  29. ఎరుగుదు (మూ )
  30. మేనందీర్చి (మూ)
  31. నుగ్రాసమున
  32. చూతురు
  33. సంతాన
  34. బహుకృపాహేతివైతిరుగ (మూ )
  35. గాగ (మూ)
  36. గ్రొస్సి
  37. చలుపగా (మూ)
  38. చెలువు
  39. యత్నంబుగాక
  40. భోగకాలంబు (మూ )
  41. మనయంగ (మూ)
  42. మౌనత్వ (మూ)
  43. చలిపి
  44. గాల
  45. వాడలు (మూ)
  46. దశమవర్షములు (మూ)
  47. బఱచి
  48. శతధృతియయ్యె (మూ )
  49. అనఘాంగి దృశ్యంతి
  50. జూచి దృశ్యంతి, (మూ)
  51. నియతుఁడై
  52. అగ్రత (మూ )
  53. యెవ్వాడిందుఁ బొడమనిమనుచు
  54. అగణించుచోట, (మూ)
  55. బోరితి
  56. జ్వలనంబు
  57. దిమురుము (మూ)
  58. మ్రొక్కి
  59. సుతమునబల్కిన (మూ)
  60. మీకార్య
  61. పోలంగ నేడాజిభూమిగైసేతు, రం.నా.రా.యు.కా
  62. మీయగ్ని వేగంబె యనిన (మూ )
  63. గెల్చువారుగా
  64. విధులార (మూ)
  65. నడుమ
  66. దర్భ
  67. దానహేతు (మూ )
  68. దిగ్భాగచయము (మూ)
  69. మ్రోయ.
  70. గానఁగవచ్చెనతఁడు
  71. యేతెంతు. (మూ)
  72. దృష్టి. (మూ)
  73. ద్రిపద
  74. గంధింప
  75. అజిత. (మూ )
  76. భాస్య
  77. నలకంట
  78. గతి
  79. వలిపెము. (మూ)
  80. బలాధరకి
  81. కైకొనునట్లనాకాకనాకనుచు.
  82. తలపొల
  83. చలువలు(మూ)
  84. స్థయల (మూ)
  85. యేది శుభము. (మూ)
  86. కౌలకు
  87. భగవంతుడు. (మూ )
  88. జూడక
  89. అంగలించు.(మూ)
  90. మాడినుడిగిన.
  91. యిందఱి (మూ)