ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

అష్టమాశ్వాసము

—♦♦♦♦§§♦♦♦♦—


శ్రీకరగుణజాల, సితకీర్తిలోల,
నాకేంద్రవైభవ, నరసయచౌడ,
ప్రకటిత నిఖిలసౌభాగ్య వర్తనల
[1] నకలంకుఁడగు నమాత్యా! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పదొడఁగె.
అంతట నొక్కనాఁడాంబికేయుండు
కాంతితోఁ గొలువుండి ఘనులును దాను,
ధర్మతనూజునిఁ దాల్మి రావించి,
యర్మిలిమన్నించి యతనికిట్లనియె:

ధర్మజుని యౌవరాజ్యాభిషేకము


"పాండుభూపాలునిపాలు నీపాలు;
పాండునందన, నీవుపట్టంబుఁబూను;
సాధింప నరుదైనశత్రుల నొత్తి
యీధర విరివిగా నేలింపుమమ్ము.
ఎల్లి లగ్నంబని యెఱిఁగించె ద్విజుఁడు;
వల్లభాయుతుఁడవై వ్రతముధరింపు,
అభిషేకసలిలంబు లాదిగావచ్చె;
నభినవంబుగ యత్నమఖిలంబు నయ్యె;
హరిపూర్వకంబుగా నరదంబులెక్కి
యరుదెండు ప్రొద్దున నాస్థానమునకు.


ఖాండవప్రస్థంబుగల; దది మీకు
నుండయోగ్యంబైన యొప్పులపురము;
ఉండుఁడు దవ్వులే దొకవాడపెట్టు;
రెండు దేశములు వర్ధిల్లు నిట్లైన.
అని చెప్పి ధర్మజుననిచి భూవిభుఁడు
గొనకొని కృప భీష్మ గురులునుతింప,
నరుణోదయంబైన యమ్మఱున్నాడు
హరిపూర్వముగ వారి నర్థిరప్పించి,
యభిషేకశాలలో నర్హపీఠమునఁ
బ్రభువైన ధర్మజుఁ బాంచాలినునిచి,
మంత్రోదకంబుల మజ్జనంబార్చి,
మంత్రి [2] సమేతుఁడై మకుటంబుపెట్టి,
పాండునిపాలికిఁ బట్టంబుగట్టి
ఖాండవప్రస్థంబు కడకు వీడ్కొల్పఁ
బాండవుల్ ధౌమ్యునిఁ బాంచాలిఁ గుంతిఁ
బుండరీకాక్షునిఁ బొసఁగఁదోడ్కొనుచుఁ,
ద్రుపదుని సైన్యంబుతో వీడుకొల్పి,
నృపతిపంచినసేన నియతిఁదోడ్కొనుచుఁ,
గురుపతి కృప భీష్మ గురు విదురులకు
నిరవొంద నందుఁబోయెదమని చెప్పి,
కరిపురిఁ బాండునికాలంబు విప్ర
వరులకిచ్చిన [3]చేలు వడినప్పగించి
యరిగినచోఁ, గృష్ణుఁ డప్పుడప్పురికిఁ
గరిపురిఁగల సొంపుగలగమి చూచి,
కరము వేగము విశ్వకర్మరావించి,
సరసత నయ్యూరిచందంబుదెలిపి,

ఇంద్రప్రస్థనిర్మాణము


"స్థలము మంచిదిగాదు ధర్మరాజునకుఁ ;
గులరాజధానికిఁ గొంచెమీపురము.
సురపురంబునకంటె సొంపైనపురము
విరచింపుమా నీదువిద్యాబలమునఁ;
జెలువున బ్రాహ్మసృష్టికిఁ బ్రతిసృష్టి
వలెనన్నఁ [4]ద్రుటిఁజేయువాఁడవునీవు.
ఈయూరితూర్పున నిదె రమ్యసీమ
యాయామ[5]పరిణాహ యంత్రితస్థలము."
అనిన, నింద్రప్రస్థమనియెడు పురము
కనకరత్నమయంబుగా విశ్వకర్మ
నిర్మించిపోయిన, నృపుఁడందువిడిసి,
ధర్మసహాయుఁడై ధరణియేలుచును,
బంచబాణానంద పారవశ్యమున
బాంచాలిఁ గవయునాభావంబుఁదెలిసి,
నారదాగమనంబు నారాయణుండు
ధారుణీశులకెల్లఁ దగనెఱిఁగించి :
'యతఁడేమి మీకుమర్యాద గావించె
హితమతి నడుఁ.' డని యేర్పడఁబలికి,
యాయతగతి వారలనుప ద్వారకకు
బోయెఁ; [6]బోవఁ, బురాణమునిపుంగవుండు
విరహులనేఁచిన [7]వృజినంబుపాయ
నురుశాంతి మునియయ్యెనో చంద్రుఁడనఁగఁ,
దెల్లని చల్లని దేహంబుతోడ
నల్లనవచ్చి, యేకాంతవాసమున


నృపకుమారులఁగాంచి నెమ్మితో వారి
యుపచారములఁగాంచి యొప్పనిట్లనియె:

నారదుఁడు పాండవులకు హితోపదేశము సేయుట



"తమ్ములందఱు ధాత్రిఁ దఱచైన నేమి?
మిమ్ముఁబోలఁగరాదు మిత్రభావమున.
మూఁడుమూర్తులు నొక్కమూర్తియన్నట్లు
పోఁడిమి కేవురుఁ బొసఁగ నొక్కళ్ల.
నీటినడుమడఁచిన నెఱిరెండుగాని
[8] సూటి మీకూటమి చూడనచ్చెరువు;
అగుఁగాక యేమి, నెయ్యముచిక్కువాస
మగువల నిర్మించె మాయపుబ్రహ్మ
మగువ లెందఱు లేరు! మహిఁ గృష్ణవోలు
మగువగల్గదుగాక మానాఢ్యులార!
సుందోపసుందులు సుదతికిఁగాదె!
మ్రందిరి తమలోన మర్యాద లేక;
కావున, వత్సరక్రమమునఁగాని
యేవురుఁ బాంచాలినిటఁ గూడరాదు.
ఒక్కఁడు రతి [9]సేయుచున్న బాంచాలి
నొక్కఁడయ్యేఁటిలో నొగిఁజూచెనేని,
యతఁడు వత్సరమాత్ర మఖిలతీర్థముల
వ్రతధారుఁడై గ్రుంకి వచ్చువాఁ.” డనుచు
నందఱ నొడఁబడనాడి యాబ్రహ్మ
నందనుఁడేగిన, నాఁటినుండియును
మరియాదదప్పక మగువఁ బాండవులు
మరుకేళిఁగవయుచో, మఱియొక్కనాఁడు


అచ్చోట బ్రాహ్మణుండడవిలోపలను
మ్రుచ్చులఁగోపించి మొఱవెట్టుకొనుచు
నతివేగమునవచ్చి యాస్థానవేది
శతమఖసుతుఁగాంచి చాల దైన్యమున :
"మేదినీపతులార, మీరలూరేల
వేదంబులనుగాని వినము మ్రుచ్చులను,
రవిగాని పరతాపరతులెందు లేరు;
దివిఁగాని పుట్టదు ద్విజపగోగ్రహణ;
మిట్టిచో, మ్రుచ్చులు హెచ్చి నాపశులఁ
బట్టినఁ, బరితాపభయుఁడనై యేను
గూయిడవచ్చితిఁ; గూడఁగాఁ బాఱి
నాయాలఁద్రిప్పవే! నలినరణ్యమున.
ద్విజుఁడ దరిద్రుండ విమలకుటుంబి
నజునైన విత్తంబు లడుగనివాఁడ."
అనిన 'నీగోవులనర్థితో దెత్తు'
ననుచు, బ్రాహ్మణుఁజాలనాద[10] రింపంగఁ
బవనజునకుఁ జెప్పి పార్థుండులేచి
............................................
యాయుధశాలకై యస్త్రముల్ దేరఁ
బోయి, యచ్చో ధర్మపుత్త్రుఁ బాంచాలి
నొక్కట రతిసేయుచున్న నీక్షించి,
గ్రక్కున నస్త్రముల్ గైకొనివెడలి,
కవచ శిరస్త్రాణ ఘనతనుత్రాణ
సవిశేషమూర్తియై స్యందనం బెక్కి,
చదువులుగొనిపోవు చండరాక్షసుని
వెదకు మీనాకారవిష్ణుఁడువోలె


వెదకి గోచోరుల విపినమధ్యమునఁ
జెదరిపోనీక నిర్జించి, యాపశుల
మరలించి తెచ్చి బ్రాహ్మణునకునొసగి,
వరరత్నకాంచనావలిఁ బూజచేసి,
యతనివీడ్కొల్పి యభ్యంతరంబునకు
నతివేగమునఁబోయి యమసూతిఁగాంచి,
తక్కక సాష్టాంగదండపాతముగ
మ్రొక్కి హస్తంబులుమోడ్చి యిట్లనియె:
"అనఘాత్మ, విప్రకార్యార్థినై యేను
 జనుదెంచుచో, నస్త్రశాలలోపలను
సతియు మీరును నొక్కశయ్యపై నుండ
మతిలేక గనుఁగొంటి మర్యాద దప్పి;
కావున, నొకయేడు ఘనతీర్థయాత్ర
గావింపకుండినఁ గార్యంబుగాదు
మనలోన మర్యాదమానిన, మనల
మనుజులు మనముల మఱిపాటిగొనరు.
మెలఁతద్రౌపదిఁగంటి మీరున్నశయ్యఁ;
గలదె! యీదుష్కీర్తి [11]కంటే వేఱొకటి.
అనవుడు, ధర్మరా జర్జునుఁబలికెఁ  :
"బనివడి నిన్ను నేఁబాయనోపుదునె!
నర, నీకు [12]వంత యెన్నఁడులేనివింత!
మరియాదయే యింత! మానుమీచింత!
అవనీసురార్థమై యయిన పనికి
వివరింపనున్నదే! వీరాగ్రగణ్య!
అధికధర్మార్థమై యల్పదోషంబు
బుధుఁడాచరించిన భువి నిందపడఁడు."


అనినఁగవ్వడిపల్కు: "నదియట్ల తగును;
మునియాజ్ఞ మీఱుట మోసంబుగాదె!
మనల దుర్ణయులుగా మనుజు లెన్నుదురు;
జననాథ, పోవుటచందంబునాకు;
ఒకయేఁటిపనియెంత! యుల్లమట్లైన
వికసించునా." కని వీడ్కొనికదలి,

అర్జునుతీర్థయాత్ర


తిలలు ధాన్యంబులు ధేనువత్సములుఁ
గలశంబు లాజ్యంబుఁ గనకంబుఁ గంచుఁ
[13]బులకండమును రత్నములు లవణంబు
వెలిపచ్చడంబులు వెండి యాదిగను
ననుపమ దానపదార్థముల్ గొనుచు
ఘనధర్మవతిదాటి కాళిందిదాటి,
రథదాన హయదాన రవిమూర్తిదాన
పృథులగోదానముల్ పెక్కాచరించి,
యాదెసఁగదలి ప్రయాగతీర్థమున
నైదురాత్రులు నిరాహారుఁడై నిలిచి,
పరిపూతహృదయుఁడై పారణవేళ
ధరఁ గోటికన్యాప్రదానముల్ చేసి,
యక్షయ[14]వటమున్న యాపర్వతంబు
నీక్షించి, కాశికినేతెంచి, యందు
దీనులై నవసినతీర్థవాసులకు
వానగాఁ గనకంబు వర్షించి, మఱియు
శివుని సహస్రాభిషేకపూర్వముగ
భువనైకపూజ్యునిఁ బొసఁగఁ బూజించి,


గంగ మునింగి గంగాద్వారమునకు
సంగతినేఁగి మజ్జనమాడువేళఁ,
గౌరవ్యుఁడనుపాము గన్నట్టికన్య
శ్రీరమ్య [15]యగు నులూచీనామధేయ
[16]గొంతులతో నందుఁగొలనాడఁబోయి,
యంత నాతనిమూర్తి కాత్మలోఁజొక్కి
"యేవాఁడొకో! వీనినేఁజూచియెఱుఁగ;
భావజన్మునికంటెఁ బసమేనివాఁడు!
కట్టక ముట్టక ఘననీలరత్న
మిట్టిరూపముదాల్చె; నింతియకాక,
మణిగాక మేనొండు మలయునోయిట్లు!
...........................................
విస్తీర్ణతరమైన వీని [17]వక్షమునఁ
గస్తూరిగంధికిఁ గాపుండవలదె!
కొనగోర నితఁడింత గుఱిసేయఁడేని,
చనుఁగవఫల మెంత జవ్వరాండ్రకును!
'ఏను లీలావతి నీక్షోణి' - ననుచు
వీనిముందట నిల్వ వెలఁదియెక్కడిది!
ఈక్షణంబున వీనియీక్షణంబులకు
లక్షనిష్కములైన లంచమీవచ్చు;
గలుగునొకో వీనికౌగిలి నాకుఁ!
గలుగకుండినఁ జేటు కామునిచేత.
హీనవృత్తికిఁ జొచ్చి యీ స్నానవేళ
నేను బ్రార్థించిన నితఁడేలవినును!
కొనిపోయి పాతాళకుహరంబులోన
నునిచి ప్రార్థించెద నొయ్యన" ననుచుఁ


గరపల్లవమున నక్కామినిఁ దిగిచి
యురగలోకమునకు నువిద తెచ్చినను
ధీరుఁడై కనువిచ్చి దేవేంద్రసుతుఁడు
భూరిసర్పములున్న పుణ్యగేహములు
బొసఁగ నింద్రునివింటిపూదెలోయనఁగఁ
బసనారఁబర్విన ఫణరత్నరుచులు,
వేవేగ శేషునివేదశాస్త్రములు
భావించి వినుచున్న బాలసర్పములు,
జెదరినముత్యాలచిప్పలువోలె
నదనుతో బగిలినయండఖండములు,
మందిరాగ్రములెక్కి మారుతంబులకు
విందులై [18]తినుచున్నవృద్ధనాగములు,
వనితలు గానంబు వలనొప్పఁజేయఁ
గొనియాడి చొక్కిన కొదమసర్పములు,
నమృతంబునాకిన యలవాటనంగఁ
గొమరునాల్కలుగ్రోలు క్రూరపసర్పములుఁ
[19]దుట్టె పింజర నీరుదొత్త మన్ దిండి
కట్టెడ త్రాచు రక్తపుమండలంబు
నెనసిన జెఱ్ఱిపో తిరుదలశిఖిని
పెనుఁబాము పసిరిక పెరజు నాదిగను
నొక్కొక్కవీథికి నుప[20]విష్టులగుచుఁ
బెక్కుతెఱంగుల బెరయుసర్పములఁ
జిత్రవైఖరిని వీక్షింపుచు వచ్చి,
సుత్రామసూనుండు సుదతియిల్ సొచ్చి,
పనివడిమూఁగినపన్నగాంగనల
ననుచుతీవ్రతఁజూచి యాకన్నెకనియె :
 


“నన్నేల తెచ్చితి నాతి! నీవెవ్వ?
రిన్నలినాక్షుల నేలయంపెదవు?
తెలిసె నించుకమాకుఁ; దీర్థవాసులకు
వలరాజుకేళి తా వర్ణింపవలయు
ము; న్నటుగాక , పాములతోడిపొత్తు;
మిన్నకపోయెద మేదినీస్థలికి."
అనుటయు లజ్జించి యనువెల్లమఱచి ,
[21] తనలోనె తానగి, తడవాపఁజూచి :
"నాగకన్యక నేను; నాపే రులూచి;
బొగొప్పఁ గౌరవ్యఫణికిఁగూఁతురను;
పెండ్లిప్రాయముదాఁకఁ బెనిచి నన్నతఁడు
పెండ్లిసేయఁడు తగుప్రియుఁడు లేఁడనుచు;
గరుడోరగామర గంధర్వులందుఁ
బరికింప మిట్టిసౌభాగ్యంబువాని .
ఏను నీమూర్తికి నిచ్చలోఁజొక్కి
భూనాథ, తెచ్చితిఁ బుష్పాస్త్రునోమ.
ఇంద్రుఁ డింద్రునిపుత్రుఁ డింద్రునిపౌత్త్రు
డింద్రాభ, దివి భువి నిచటను వలదె!
ఇంద్రుఁడుగలఁడు; నీవింద్ర పుత్రుఁడవు;
ఇంద్రపౌత్రునినింకనిచ్చోటనిలుపు.
ప్రాణేశ, నాకంటెఁ బాత్రంబులేదు;
ప్రాణదానముసేయు బహుపుణ్యమిచ్చు.
అనయంబు గాంధర్వ[22] మనెడివివాహ
మున నన్నుఁగూడవే! పోదు నీవ్రతము."
అని దైన్యదశనాడ, నతఁడాదరించి
వనితయౌవనపుష్పవాననఁగొనిన,


సుదతికిఁ బతికి నచ్చో నిరావంతు,
డుదయించె సుతుఁడు సద్యోగర్భమునను.
వాసవిమాఱుగా వానిశేషాదు
లాసతోనీక్షించి రందఱు వచ్చి.
అంత, నులూచిచే నంపించుకొనుచుఁ
గౌంతేయుఁడును దొంటికందున నిలిచె.
తనకథ బ్రాహ్మణోత్తములకుఁ జెప్పి,
ఘనరతి నిఖిలగంగల నాడుకొనుచు
వచ్చి యంతనగస్త్యవటము నీక్షించి,
యచ్చట భృగు[23]తుంగమను తీర్థ మాడి,
కోటికన్యాదాన గోకోటి దాన
హాటకదానంబు లచ్చోటఁ జేసి,
నృపచంద్రుఁడుత్పలినియుఁ గౌశికియును
అపరనందయ నందయనుసరోవరము
సేవించి, జాహ్నవీసింధుసంగమున
వావిరి మాసోపవాసంబు సలిపి,
రత్నగర్భంబు హిరణ్యగర్భంబు
యత్నంబుతోఁజూచి యచ్చోటుకదలి,
పురుషోత్తమమునకుఁబోయి, యచ్చోటఁ
బురుషోత్తముని లోకపూజ్యుఁ బూజించి,
వేలాతటంబున వెసఁబోవఁబోవఁ
గాళింగభూములు గానవచ్చినను,
అతిదూరమయ్యెడునని విప్రసమితి
మతికల్మి నూరికిమరల వీడ్కొలిపి,
కొందఱువిప్రులు గూడియేతేర
నందందచని మహేంద్రాచల మెక్కి,
 


వింధ్యాది దక్షిణవిషయంబు చూచి,
సంధ్య [24]సేవించి యాశైలంబు నెక్కి,
విలసితబహురామ విద్రుమారామ
నలకాభిరామ దాక్షారామఁజూచి,
బెల్లంబుఁ బులగంబు భీమనాథునకు
విల్లెత్తుపొడవు నైనేద్యంబుచేసి,
బోగంబులాడెడు పువ్వుఁబోండ్లకును
జాగంబులిచ్చి యచ్చటనుండికదలి,
తాలాంకబలుఁడు గోదావరినాడి
లీలమార్కండేయలింగంబునకును
జేవపాయసమునఁ [25]జెరవచేయించి, (?)
సేవించి యటఁబోయి శ్రీశైలమెక్కి,
మంత్రస్వరూపుని మల్లికార్జునుని
మంత్రపుష్పమువెట్టి మణులఁ బూజించి,
యందులతీర్థంబులన్నియు నాడి,
కెందామరలనొప్పు కృష్ణకునడచి,
విజవాడశివుని సంప్రీతితోఁ గాంచి,
ద్విజులకుఁ గనకంబు తృప్తితోనొసగి,
హరునిఁబూజలు చేసి, యంతనాకొలని
తిరునాళ్లుచూచి, యాదేవదేవునకు
బసిఁడిపళ్లెరములు బట్టువస్త్రములు
బశులు ధాన్యములు సంపాదించియిచ్చి,
భక్తవత్సలు నహోబలనారసింహు
భక్తిపెంపునఁజూచి, భవనాశిదోఁగి,
యన్నదానమువెట్టి యటఁగాళహస్తి
గన్నారఁజూచి, వేంకటగిరియెక్కి,


కమ్మనియప్పాలఁ నలవంటకముల
రమణ మహోపహారమ్ము సేయించి,
కవ్వడి యటఁబోయి కాంచీపురమున
నవ్విష్ణు సేవించి, యభవుమహేశు
నేకామ్రనాథు గౌరీశుఁ కామాక్షిఁ
గైకొని మదిఁబూని కదలియాక్షణమ
యరుణాచలమునకు నర్థితోఁబోయి,
యరుణేశుఁ బూజించి, యభ్రసరసికిని
జని శివగంగలో స్నానంబు చేసి,
పెనుగొన్న వేడ్కతో భక్తవత్సలుని
నాచిదంబరనాథు నర్చించి ప్రీతి,
వేచని కమలాలయేశు విశ్వేశు (?)
భావించి సేవించి ప్రార్థించి కదలి,
సేవితనిర్వాణు శ్రీపతిబాణు
జంబునాథుని పాదజలజముల్ గొలిచి,
యంబుజలోచనుండంతఁ గావేరి
దక్షిణగంగగదాయని యందు
దక్షిణమూర్తుల దానంబుచేసి,
సేతురామేశ్వరు శివుఁగానఁ బోయి
బ్రాఁతి నచ్చటఁ దులాభారంబు తూఁగి,
యంతలో వ్రతముసమాప్తిఁ బొందుటయు
నెంతయు యమసూతికెఱుఁగంగఁ బుచ్చి,
యతఁడంతఁ జిత్రవాహనుఁడనుశబర
పతియూర ధీరుఁడై పైత్రోవ నడవ,
నతనిని జెంచు తానతివైభవమున
హితమతిఁ గొంపోయి యింటఁబూజించి,
యతనికి మదిలోనియాసక్తిఁదెలిపి
యతివఁ జిత్రాంగదయసుపుత్రిఁజూపి :


అర్జునుఁడు చిత్రాంగదను వివాహమగుట


"[26]వసుధేశ, తొల్లి యీవంశసూత్రంబు
పసతోడఁ దెల్పెదఁ బరిపాటి; నొకఁడు
హరునకుఁదపమున్న, నాతండు మెచ్చి
యరుదెంచి మా తాతనప్పుడు వలికె:
'కులమునిదెల్పెదను; నీకోరెడు కొడుకు
నిలువఁడు గదుర మున్నిటిదోషమునను (?)
అట్టయ్యు, వరము నన్నిడిగితిగానఁ
బుట్టుదు రొక్కొక్కపుత్త్రుఁడై యిందు;
శాఖోపశాఖలై జరుగుదుసువ్వె!
యాఖేదమునుమాని యరుగుము నీవు.”
అనియిచ్చిపోయినాఁ డట్టివంశమున
(జనియించినట్టి యీ సకియఁ బెండ్లాడి
పుత్త్రదాన మొనర్పు భూవర!" యనిన)
ధాత్రీశుఁడయ్యింతిఁదగిలెడుకాంక్ష
నొడఁబడఁగైకొని యొకకొన్నినెలలు
పడతితోడ విహారపరిణతి నుండి,
బభ్రువాహనుఁడనుపట్టిఁ బుట్టించి,
సుభ్రుతండ్రికి వాని సుతునిఁగానిచ్చి,
యచ్చోటువీడ్కొని యటపోయిపోయి,
క్రచ్చఱ సౌభద్రకంబనుకొలన
నారయఁ బౌలోమయనియెడు కొలన
[27]గారంధమఖ్యాతి గలిగిడి కొలన
నమర భరద్వాజమనియెడు కొలన
నమరు లెన్నఁ బ్రసన్నయనియెడుకొలనఁ


బొనర మజ్జనమాడఁబోవ , నర్జునునిఁ
గని యందు మౌనులు గదిసి యిట్లనిరి
“అనఘాత్మ, నీ వేలయరిగెదవందు :
నొనరంగ నూఱేండ్ల నుండియు నచట
నొగ్గమై మకరంబులుండుటవలన
డగ్గఱవెఱతు రాఢాకనెవ్వరును;
సోపద్రవంబులై చొరరాకయున్న
నేపుణ్యతీర్థంబు లేటికిఁ జెపుమ!
క్షితిఁ దాతగట్టినచెఱువైన నేమి!
చతురతమునింగి లోఁజావంగఁ దగునె!
మఱియుఁ దీర్థంబులు మహినెన్ని లేవు!
జరుగుము నీవందుఁ జననిందువలదు.”
అనుచు మౌనులు చెప్ప నర్జునుండనియె:
"మునులార, వినుఁడేను మునివృత్తి దాల్చి
సకలతీర్థంబులుఁ జరియింతుననుచుఁ
బ్రకటంపుఁబ్రతిన తప్పక చేసినాఁడ ;
వికటవైరులనెల్ల విదళించునాకు
మకరంబు లొకయొడ్డె! మర్దించివైతు.”
అనుచు నర్జునుఁ డేఁగి యందులో మొదలి
ఘనసరసిని నవగాహంబు సేయ,
విమలజలంబెల్ల విచ్చిపాఱంగఁ
గమలోత్పలంబులు గ్రక్కదలంగ,
మీనంబులన్నియు మిట్టిపడంగఁ,
దోన నేతేరంగఁ దోరంపునాచు,
వికటదంష్ట్రానన వికృతమై మొసలి
ప్రకటించి యాపార్థుఁ బట్టెఁ; బట్టినను,
సరసభవాబ్ధిలో జారంగఁదివియు
నురుకర్మమెడలించు యోగియుఁబోలె,


నర్జునుం డాగ్రాహి పదరంటఁదన్ని
భర్జించి చేపట్టి రోషాయస్ఫూర్తి
వెలిఁబాఱవైచిన వేగంబె యదియు
వెలఁదియై నరుఁజూచి వేడ్క నిట్లనియె:
"ఓరాజ, నీకృపాయోగంబువలన
నీరీతి [28] నాశాప మింతయునుదీఱె
తరువాతి సరసులన్ తరుణులు నల్వు
రొరలుచునున్నవా; రొప్పుగా వారి
శాపముక్తులఁ జేసి స్నానఫలంబు
చేపట్టవే! వారు చెలియండ్రు నాకు.
పోయెద ధననాథుపురమున కేను ;
నీయభీష్టములెల్ల నెలకొనుఁగాత"
అనిన బీభత్సుండు నతివకిట్లనియె:
"వనిత, మీకేటికి వచ్చెశాపంబు?
మీనాథుఁ డెవ్వాడు మీదుఁ బేరేమి?
పూని చెప్పు." మటన్న బొలఁతియిట్లనియె:
"వినుతాత్మ, వినుము మావృత్తాంతమెల్ల ;
నొనరఁ గుబేరుని యుడిగల మేము;
[29]నా పేరునందయౌ; నాసఖుల్ లతయు
రూపింప [30]సౌరుచి రూఢిసమీచి
యరయ [31]బుద్బుద యనునట్టియేవురముఁ
బరఁగ సుఖంబుండి, బహుకాలమచట
నొకనాఁడు వేడ్కమై నొనరలోకంబు
లకలంకగతిఁ జూతమంచు నేతెంచి,
సకలలోకంబులు జరియించి చూచి,
ప్రకటభూలోకంబుఁ బరికించుచోట,


నగ్నికల్పుఁడను సంయమిచంద్రుఁ డొకఁడు
అగ్నిసమానుఁడై యటఁదపంబుండఁ
దొడఁగి యాతనిఁ జూచి తొలఁగక యేము
నొడలుండఁబట్టక నోలిఁ గట్టెదుర
నాటలుఁ బాటలు వలపుమాటలును
దేటలు నట తరితీపుసేయుటలుఁ
బచరించి, మఱియు బహువిలాసములఁ
బ్రచురమై మేనెల్ల బాటించి నిమిరి
చిన్నిచన్నులమీదఁ జేలాంచలములు
క్రన్ననఁ దొలగించి కడగంటఁ జూచి,
వాతెరకెంపులు వదనలీలలును
లేఁతనవ్వులు సూప, లేవకమ్మౌని
కనలి కెంపొదవంగఁ గన్నులువిచ్చి
తనమనోధైర్యంబు తప్పక పలికె:
'మత్తాత్మలార, యే మహితతపంబు
చిత్తశ్రమంబుగాఁ జేయుచునుండఁ,
గ్రొత్తలాగుల నిట్లు కుటిలవిఘ్నంబు
నొత్తిసేయఁగ మీకు యోగ్యమే యకట!
ఈదోషమున మీరలేవురుఁ బోయి
యాదక్షిణాంబుధి కనతిదూరమునఁ
దిరమగు నాపంచతీర్థంబులందు
బరఁగుఁడు జలచరీభావంబుదాల్చి;
నుసుగక యీరీతి నూఱేండ్లదాఁకఁ
బొసఁగంగ నుండుఁడు భువి; నంతమీఁదఁ
దీర్థంబులన్నియుఁ దిరిగియాడంగ
నర్జించి వ్రతధారియై యర్జునుండు
నచ్చోటి కేతెంచి యన్నిటఁ గ్రుంకి
యచ్చుగా మీశాప మడఁగంగఁజేయు.'


నని యగ్నికల్పుఁ డిట్లానతిచ్చినను
అనఘాత్మ, మేమునిట్లైతిమిచ్చోట.
నెఱి నింతకాలంబు నీరాకగోరి
యొఱలుచునుండంగ నొదవె నీకరుణ.
భరతకులాంభోధిపరిపూర్ణచంద్ర,
యరిగి నాచెలియండ్ర ననుపవే! దివికి.”
అనుచు నాసురకాంత యలరిప్రార్థింప,
విని యర్జునుఁడు కృపావిమలుఁడై పోయి,
నాలుగుకొలఁకుల నలిఁ దీర్థమాడి
యోలి నాల్గురకును నొనరించెముక్తి
అప్పు డయ్యేవురు నమరకామినులు
నుప్పొంగి యా క్రీడి నొసరదీవించి
యలకాపురంబున కరిగిరి వేడ్క
జలజాక్షుమఱఁదియు జలచరంబులకుఁ
బస మోక్షమార్గంబు ప్రాపింపఁ జేసి,
మసలక యంతలో మహిమదీపింపఁ
గదలి పశ్చిమవార్ధిఁ గరళులుమిగులఁ
గదిసినపురము గోకర్ణంబుచేరి,
యచ్చోటియతులకు అభివందనములు
చెచ్చెరఁ గావించి, శివుని సేవించి,
భాసురంబైన ప్రభాసతీర్థమున
వాసుదేవుని లోకవంద్యునిఁ గొలిచి,

అర్జునుఁడు ద్వారక కేఁగుట


ద్వారకాపురికేఁగుతలఁపుననుండ,
శౌరి యాతనిభావసరణి మున్నెఱిగి:
"యితఁడు సుభద్రపై నిష్టంబుగలిగి
గతివశంబున వచ్చెఁ గాదననేల!


యాదవు లెఱిఁగిన నబలనీనీరు;
నాదు నేర్పునఁగూర్తు నాతి నీతనికి.”
అని నరుఁగాన నారాయణుండరిగి
మునులైననాఁటి యిమ్మునఁ గౌఁగిలించి,
మునుమున్న యతివేషముననున్నవానిఁ
గనుగొని మేలంబుగానరాఁ బలికె:
"చతురత ఫణులచే శబరులచేత
[32]నతివలఁ గొన్న సన్యాసులు మీరు;
ఎందుఁ బోయెదరు! నేనెఱుఁగుదుఁ గొంత
పొందు సేయుదు మీరు పూనినపనులు"
అనుచు రైవతకాద్రి కతనిఁదోడ్తెచ్చి :
'వినవయ్య! యాదవుల్ వెఱతురు యతికిఁ;
గావున, యతివైనక్రమము మేలయ్యె.
ఏవిధముననైననేమి! కార్యార్ధిఁ
దోతెత్తుఁ బ్రజల జాతరకు నిచ్చటికి;
నాతిఁ జూతువుగాక నయనంబులలర.”
అని శౌరి యాతని నచ్చోట నునిచి,
తనయూరి కేతెంచి తగుసంభ్రమమున
రైవతకాద్రియాత్రకుఁ జాటఁబనిచి
వేవేగఁ గదలుచో, వేడ్కతోఁ బ్రజలు
కుంకుమతో బండ్లుగొనితెచ్చువారుఁ,
గింకిణీరథములెక్కియు వచ్చువారు,
నారులఁగైసేసి నడపించువారు,
భేరులమ్రోఁతలు బెరయించువారు,
భక్ష్యభోజ్యంబులు పసిఁడిపాత్రములఁ
గక్ష్యలుకక్ష్యలుగాఁ దెచ్చువారుఁ,

.


జాడెలుపాడుచుఁ జాలఁగోలాట
మాడుచు గుంపులై యరుదెంచువారు,
సతులుఁ బుత్త్రులు బంధుసఖులునేతేర
వ్రతములు చెల్లించువారునై యిట్లు
జాతరవెడలుచోఁ, జాలఁగైసేసి
ప్రీతినుద్ధవుఁడును, బెరయనాహుకుఁడు,
ననిరుద్ధ సారణ హార్దిక్య గదులు,
శిని పౌండ్ర రామ సుషేణ బాణులును,
బ్రద్యుమ్న సాంబాది బహుకుమారకులు
నుద్యోగ[33]వంతులై యొదవిరి హరికి.
ఈ తెఱంగునఁబోయి యిందఱు గిరికి
జాతర శూలివెచ్చఁగ నాచరించి,
యింద్రనందనుఁడున్న యేకాంతసీమఁ
జంద్రకాంతోపలస్థలులు చేరుటయు,
బలభద్రుఁడంత సుభద్రఁ దోకొనుచు
వెలయ నచ్చటికేఁగి వెన్నునియెదుట
నతివకై వచ్చిన యతివేషధారి
నతిభక్తి నీక్షించి, యందంద మ్రొక్కి
యడుగులు పూజించి యర్ఘ్యంబులిచ్చి
యడరికీర్తింప, నయ్యవనరంబునను
భావంబుకంపింపఁ బడఁతిసుభద్ర
యావేషధారికి నాత్మలో దక్కి :
యతిఁజేసెనక్కటా! యాలరి బ్రహ్మ;
యితనిజూచిన నింతి యేమికాఁగలది!
అందనిపండ్లకు నఱుచాచిచాచి
[34]యెందఱు విరహాగ్ని నీదుచున్నారొ!


కామినీజనులకాంక్షలు [35] వృథగాఁగ
నేమిటికిట్లయ్యె నీయయ్యగారు!
ఒకపాటి సతినేల [36]నొల్లఁడుగాన,
సకలంబుఁజాలించి సన్యాసి యయ్య.
ఇతఁడు కాంతలనేల కిట్లయ్యెఁగాని,
మతినిల్వనేర్చునే! మనబోఁటులకును;
ననుజూచి యేమొకో! నయనమల్లార్చె;
ననుమాన మీరాత్రి యడిగి చూచెదను."
అనుచు నందఱు మ్రొక్కినట్లె తామ్రొక్కి,
పెనఁగొన్నలజ్జ నా ప్రియునిఁ బూజించి,
సఖులకు మున్నాడిచనిన, నత్తెఱఁగు
ముఖసంజ్ఞ నరునకు మురవైరిచూపె.
బలుఁడంత నర్జునుభవ్యతేజమును
దలయూఁచి మెచ్చి యాతనికినిట్లనియె:
"అనఘ, మాపురమున నైదారు నెలలు
గొనవచ్చునే పూజఁ! గొన వసియింపఁ
గన్యకాపూర్వంబు గదిసి మీసేవ
కన్యసేయు సుభద్ర కణఁకమాయాజ్ఞ;
మృదువచోరచనల మీతోడిగోష్ఠి
సుదినంబులగు మాకు శుద్ధాంతరంగ!"
అనిన, నంతయుఁ బార్థుఁ డంగీకరించి
చనుదెంచె యాదవసదనంబునకును.
బలుఁడును నిజవాక్యఫణితిని యతికిఁ
జెలియలిచే నిత్యసేవ చేయించె
అంత, వర్షాకాలమైన మేఘములు
చింతింపఁ దగవువచ్చినయట్లు కూడి,


యుర్విఁ [37] దారిడినట్టి యుదకధనంబు
సర్వంబు మునుగొన్న చండాంశురుచుల
నాకాశపథమున నాఁగినట్లాగి,
చేకొన్న యురుములచే ధిక్కరించి,
జడనిధిఁద్రావుచో సందడిఁగొన్ని
బడబాగ్నికణములు పర్విచొచ్చుటయుఁ,
గడుపునకవిగాక గ్రక్కుచందమునఁ
బిడుగులొక్కొకమాటు పృథివిఫై రాల్చు;
నెలగోలు వర్షించి యేఱులువఱసి,
యిలయెల్లభేదించు నివిధూర్తులనుచు;
ననిమిషేంద్రుఁడు తమ్మునాఁక పెట్టించె
ననితోపఁ గొండల నడఁగు నొక్కెడల;
సైరణ నాఁకొన్న చాతకద్విజులఁ
బారణకై మింటఁ బంక్తి సాగించి,
[38]పరితోషమునఁ బాఱిపాఱివడ్డించ
పరుసున నుడువీథిఁ బాఱునొక్కెడల;
నటులచందమున నానారూపులగుచుఁ,
గటకరత్నంబులగతి మెఱయుచును,
నిలిచి రోగులువోలె నీరు గ్రోలుచును,
గలములగమివోలె గాలిఁబోవుచును,
యుద్ధభీతులువోలె [39]నుక్కడఁగుచును,
నిద్ధపార్థులువోలె నిటనల్లనగుచుఁ, (?)
బ్రతియోధులునుబోలెఁ బన్నివచ్చుచును,
శ్రుతరాక్షసులువోలె సూర్యునాఁగుచును,
[40]గెడయు పార్థులువోలె గిరులఁదోచుచును,
జడివట్టి యిట్లు వర్షపయోదములు
 


సుభద్ర అర్జును నుపచరించుట


కురియుచో, నప్పుడు గోవిందుననుజ్ఞ
పరిచర్యకై వచ్చి పార్థునిఁగదిసి,
పరమేశ్వరుండు తపంబాచరింపఁ
బరిచర్యకైవచ్చు పార్వతివోలె
మంచిగంధంబున మంటపంబలికి,
మించిన కెంబట్టుమేల్కట్టు కట్టి,
మొగ్గలవలెఁ దీర్చి మ్రుగ్గులువెట్టి,
గుగ్గులు[41]ధూపంబు ఘూర్ణిల్లఁజేసి,
సరసముగాఁబెట్టి జమ్ముఖానంబు,
ధరఁ బులితోలుతాఁ దార్కొనఁబఱచి,
కప్పారునీలాల కాళులవీట
చప్పరంబునఁ బెట్టి జలకంబులార్చి,
నెఱిఁ బట్టియుదికిననీర్కావిగోచి
నెఱయ నీళ్లాడిన నృపతికినిచ్చి,
కాషాయవస్త్రంబు కస్తూరినద్ది
వేషధారికిఁ దెచ్చి వెన్నునఁగప్పి,
పవడపుఁబిల్లనపావాలు పెట్టి,
యివురాకుఁగైదండయిచ్చి తోడ్తెచ్చి,
కుంకుమమెత్తిన కూర్మిపీఠంబు
పంకజాననవెట్టి, భక్తితో మఱియు
నాపైనఁదులసియు నక్షమాలికయు
గోపిచందనమును గుశపవిత్రమును
సరసరీతులనిచ్చి, [42]జపమైనదాక
నొరసిలియుండి తానొయ్యనవచ్చి


దేవపూజకుఁబెట్టి, దేవసన్నిధిని
బావుమీఱిన పత్రపాత్రంబువెట్టి,
మెత్తనియశనంబు మేల్మిపాయసముఁ
గ్రొత్తగాఁ గాచిన గోవులునేయి
గారెలు బూరెలుఁ గడియపుటట్లు
నీరొత్తు [43]లౌజులు నెఱయుమండిగలు
ఫలములుఁ గూరలుఁ బంచదారలును
ఒలుపుఁబప్పును దీపునొట్రువడియములు
వరుగు లప్పడములు వాసితోదకముఁ
జిఱుచెట్టు తేనియ చెలువైనకంద
పెరుగులుఁ బచ్చళ్లు భీమానుజునకు
సరసవడ్డించి, భోజమైనపిదపఁ
గిన్నరకంఠి యెంగిలి [44]పాఱఁబోసి,
పన్నీట నడుగులు భక్తితోఁగడిగి,
కమ్మఁగాఁ దనువునఁ గప్పురంబార్చి
యిమ్ములఁజనుచోట, నిటనొక్కనాఁడు
హరిసూనుఁ డాయింతి యధరపల్లవము,
నరచందురునిచందమందిననుదురుఁ,
గనుఁగవ చిక్కులు గరమూలయుగముఁ
జన్నులు నడుమును జఘనభారంబుఁ,
గ్రన్ననఁ బాదపంకజములు వేడ్కఁ
జూచి యచ్చెరువంద, సురరాజసుతునిఁ
జూచి యిట్లనియె నాసుదతీలలామ :
"ఎప్పుడు నోయయ్య! యేయూరు మీకు?
నిప్పు డెచ్చోటికి నేఁగుచున్నారు?
వెస మీరుచూడని విశ్వంబు లేదు;
పొసఁగ నింద్రప్రస్థపురము చూచితిరె!


పరికించితిరె! యందుఁ బాండునందనుల;
నిరవొప్ప నర్జును నెఱుఁగంగఁగలరె?
ఆతఁడు తీర్థయాత్రార్థియై పోయి
యేతెంచెనే తిర్గి యిభపురంబునకు!
ఆతఁడు మాబావ; యతుల ప్రభావ,
చూతునొకో ! నేత్రసుఖ ముప్పతిల్ల;
నీవేషమున నటియించెడు నీవె
కావుగదా! కాంతిగల యర్జునుఁడవు."
అనుటయు నెంతయు నంతరంగమును
మనసిజుఁ డలయింప మమతవాటించి,
యక్కన్యమధురభాషామృతధారఁ
జొక్కి యాదేవేంద్రసుతుఁ డోర్వలేక
యిట్లను : "విను, నేన యింద్రపుత్రుఁడను;
ఇట్లు వచ్చితి నిన్ను నేఁ బెండ్లియాడ;
నీరూపమునఁగాని యిచ్చటి ప్రజలు
గారాముసేయరుగాన నిట్లైతి;
నొడఁబడివచ్చిన నుగ్మలి, రమ్ము;
తొడికొనిపోయెడ దొరలఁ గన్మొఱఁగి."
అనుటయు: 'హరి యీక నరుదేర వెఱతు;'
నని సిగ్గుతోఁ జెప్ప, నతివతోడుతను :
అంగజ[45]శాంతిగా నబల, నీతోడి
సంగతిలేకున్న సైరింపజాల;
ధరణీశ్వరులకు గాంధర్వవివాహ
మరహంబు ర" మ్మన నతివ సిగ్గునను:
"నన్నునీఁగర్తలున్నారు యాదవులు;
మిన్నక నాకెట్లు మేకొనవచ్చు!"
ననుచు సుభద్ర యంతఃపురంబునకుఁ (?)
జనియె; నర్జునుఁడును శయనింపఁబోయె.


సు భ ద్రా ర్జు ను ల వి వా హ ము


అట్టిసల్లాప వృత్తాంతమంతయును
నెట్టన మురవైరి నిజబుద్ధినెఱిఁగి
బలముఖ్య యాదవ ప్రభుల మొఱంగి
చెలువఁ గ్రీడికిఁ బెండ్లి సేయంగఁ దలఁచి,
తనచేయు కార్యయత్నము పాండవునకు
ననుజకు నతిరహస్యంబుగాఁ జెప్పి,
ఖ్యాతి నంతర్ద్వీపకాలకంఠునకు
జాతరవెడలంగ సమకట్టుటయును,
సాంబ సంకర్షణ సారణాక్రూర
శంబరారి సుధేష్ణ సాత్యకి బలులు
వెడలిరి కామినీవితతులుఁ దారుఁ;
గడు ద్వారవతిలోనఁ గావలివెట్టి,
తాను వారినిగూడి దామోదరుండు
పూనికఁజని శంభుఁబూజించి యచట
నైదారుదివసంబు లట్లున్న చోట,
యాదవేశ్వరుల నొయ్యన డాఁగురించి
హరి తనపురమునకరుదెంచి మిగులఁ
గరియానఁగైసేయఁ గాంతలఁబనిచి
యింద్రుఁదలంచిన, నింద్రుఁడాక్షణమె
సాంద్రవైభవ కళాచతురుఁడై వచ్చె;
గరుడ కిన్నర యక్ష గంధర్వపతులు
వరసప్తసంయమీశ్వరు లాదిగాఁగ
వచ్చిరి; శచియునువచ్చె; వెండియును
వచ్చిరి మునులు దుర్వాసుఁడాదిగను.
అమరులు విహరింప హరిరాజధాని
యమరావతినిబోలె నటవింతలేక.


కొడుకుపెండ్లికి నిట్లు గోత్రారివచ్చి,
కడువేడ్కఁ బురముశృంగారింపఁబనిచె.
ఈరీతివచ్చిన యింద్రాదులకును
శౌరి పూజలు చేసి సంభ్రమంబునను,
చారులగ్నము బృహస్పతి నిర్ణయింప,
నారూఢి దేవతూర్యములు ఘోషింప,
విహిత యాజకతంత్ర విరచనయందు
బహుభంగిఁ గశ్యపబ్రహ్మ వర్తింప,
శచి యరుంధతి రతి సత్యభామయును
నచట సుభద్ర కల్యాణంబుపాడ,
మునిజనాశీర్వాదములు మిన్నముట్ట
వనితఁ గవ్వడికి వివాహంబు సేసి,
వరుసఁబూజించి దేవతులవీడ్కొలిపి,
పరమానురాగుఁడై పద్మనాభుండు
రత్న కేయూర హారములు పార్థునకు
యత్నంబుతోనిచ్చి యతనికిట్లనియె:
"అర్జున, [46]మనసైనయట్టికార్యంబు
నూర్జితంబయ్యె వేయును నేలమనకు;
ఇదియెఱుంగనియట్టు లిదె నాకు బలుఁడు
మొదలైనయదుబలంబులకుం బోవలయుఁ;
గోమలి నీవుతోడ్కొనిపొమ్ము లెమ్ము;
తామసంబయ్యె యాదవులు వచ్చెదరు.”
అని రథ్య కేతు శస్త్రాస్త్రసంపదల
ననువైనయరదంబు హరిసూతికొసగి
యనిపి, గృష్ణుఁడు వేగ యాదవులున్న
మునుమున కేతెంచె మునిమ్రుచ్చువోలె.


అట పార్థుఁడును భార్య నరద మెక్కించి
పటుతరశస్త్రాస్త్రభరితుఁడై కదలి
పోవుచో, ద్వారకాపురవీథి నెపుడుఁ
గావలియుండు శృంఖలుఁడనువాఁడు
తను వేవురుగ్రయాదవులు సేవింపఁ
జనుదెంచి యాసవ్యసాచి నీక్షించి
దహనుఁడై మండి యాదవసేనతోడఁ
గహకహధ్వని సమగ్రముగ నిట్లనియె:
"ఓరిసేనాధ్యక్ష, యోవిరూపాక్ష,
యోరిసంగరకోప, యోరిసౌవీర,
రండురం; డది! పాండురాజనందనుఁడు
కండక్రొవ్వున రాజకన్య సుభద్రఁ
గొనిపోవుచున్నాఁడు కుటిలమార్గమున
మునుకొని హరియు రాముఁడు లేనిచోట.
వీనిఁ బోనిచ్చిన విభులచే మనకుఁ
గానికార్యము పుట్టుఁ గడఁగుఁ.” డటంచు
జలదకులంబెల్ల సమకాలవృష్టి
గులగిరీంద్రము ముంచుకొన్నచందమున
బాణవేణికల నప్పార్థుఁగప్పుటయు,
బాణవైరిమఱంది భయమింతలేక
చిఱునవ్వు దళుకొత్తఁ జెలువ కిట్లనియె :

అర్జునుఁడు యాదవవీరుల జయించుట


"హరిణాక్షి, చూచితే! యాదవబలము;
కన్నులుగానక గదనంబుసేయఁ
బన్నిన యాయల్పబలమెంత నాకు!
దొరఁకొని రథమీవు దోలుమా నాకు;
శరముల భస్మంబుచేసెద వీరి.”


అని చెప్పి నొగలపై నతివఁగూర్చుండఁ
బనుప, సుభద్రయుఁ బగ్గముల్ వట్టి
జిలిబిలినవ్వును సిగ్గును బెరయఁ,
బలుమాఱు పయ్యెద పచరించుకొనుచుఁ
దేరుదోలుటయు, నద్దేవేంద్రసుతుఁడు
ఘోరనారాచముల్ గురియంగనార్చి,
యమృతభాండమున కయ్యండజాధీశుఁ
డమరులతోఁ బోరునట్టి చందమున
వంచియు వ్రాల్చియు వ్రక్కలించియును,
ద్రుంచియు నొంచియుఁ దూలనేసియును,
జించియుం దెంచియుఁ జిదురుచేసియును,
ముంచియుఁ గూల్చియు మొనవిఱిచియును,
బాణధారానిజప్రౌఢిఁ జూపుటయుఁ,
బ్రాణభీతికి నోడి బలములుచెదరి
కన్నులఁగన్నవంకలఁ బాఱుటయును,
అన్నరుండును వేడ్కనరిగె శీఘ్రమున.
ఆరీతి సైన్యంబు లాయాదవాగ్ర
వీరులతోడ నవ్విధము చెప్పుటయు,
వృష్ణిభోజులు గోపవివశులై రామ
కృష్ణులతో బురికేతెంచునపుడు
రాముఁడు భీకరప్రళయకాలోగ్ర
భీమునికరణిఁ గోపించి యిట్లనియె:
"ఎట్టెట్టురా! పార్థుఁ డేలేనిచోట
నిట్టు నాపురిఁజొర నెవ్వఁడు వాఁడు!
పొట్ట క్రొవ్వినచందములుగాక, కికురు
పెట్టిపోయెడునట్టి బీరముల్గలవె!
ఎటువోవవచ్పు నాయెదుట; నెందున్నఁ
బటుభంగి రథముతోఁబట్టి వేతెత్తు.


పొదఁడు యాదవులార! పొలఁతియుఁ దానుఁ
గదలి యాతఁడు దవ్వుగాఁబోక యుండ."
అని విజృంభించిన, హరి రాముఁజూచి
వినయసంభ్రమములు వెలయ నిట్లనియె:
విను రామ, నిలునిలు వేగిరపడకు;
మెనయ నాతఁడు దవ్వుకేఁగు నింతకును;
యతిమాత్రుఁడన నేల! యఁత డర్జునుండు;
మతి నేఁడెఱింగితి మగటిమి చూచి,
హితమతి నేనుండ నిట్లేఁగెఁగాక
యతివకై పురమెల్ల, నాహుతిగొనఁడె!
ఎప్పుడే నొకనికి నీవలెఁ గన్య;
నప్పాండవుఁడు పెండ్లియై పోవనిమ్ము.
అగణితగాంధర్వమను వివాహంబు
తగుచోటఁ గలిగించె దైవంబుసతికి.
గొనకొన మేనత్తకొడుకు చూచినను;
ఘనత నాతనిసొమ్ము గైకొనె నతఁడు.
వలవదు నీ కేటివలవనిఱంతు!
కలహింప శక్యమే కౌంతేయు మొదల"
అనిన, రాముఁడు వింజిమాఁకిడినట్లు
దనుజమర్దనుమాట దాటంగనోడె.

అర్జునుఁడు సుభద్రతో నింద్రప్రస్థము సేరుట


అంతనక్కడఁ బార్థుఁడటపోయిపోయి
కాంతి నింద్రప్రస్థకటకంబుచేరి,
తనయూళ్లవారలెంతయుఁ దన్నుగూడి
చనుదేర, మిక్కిలిసంభ్రమంబునను
ఇంతిసుభద్రతో నిట్లను : "నీవు
వింతగాఁ బాంచాలి వెస మున్నుగదిసి


మ్రొక్కుము; నిన్నునాముదితదీవించు;
నక్కాంతదీవెన వ్యర్థంబుగాదు"
నావుడు నయ్యింతి నాథునియాజ్ఞ
[47] వేవేగ నా కాంత వీక్షించి మ్రొక్క,
ననయంబు నాసాధ్వి యాదరంబమర:
......................................
వెలఁది, నీపురుషుండు విజయుఁడౌఁగాక;
తలఁపంగ వీరమాతవు నీవుగమ్ము.
అనుచు దీవించుచో, నంత నర్జునుఁడు
చనుదెంచి యన్నకు సద్భక్తి మ్రొక్కి
భీమధౌమ్యులకును బ్రీతిమైనెఱిఁగి,
యా మాద్రిసుతుల నొయ్యనఁగౌఁగిలించి,
గరమొప్పఁ దనయాత్రకథలెల్లఁ జెప్పి,
హరిసత్వమున యాదవావలిఁ ద్రోచి
హరిణాక్షిఁదెచ్చినయదియును జెప్పి,
సరస[48]రీతులఁ బథశ్రాంతి దీఱంగ
సరస[49]సుభద్రుపచారముల్ సేయఁ,
బరమానురాగ సౌభాగ్యుడైయుండె.
వారిజాక్షుండు ననుజభర్తకును
దటుకున నరణంబు దానిచ్చు వేడ్క
సారణ బల సాంబ శైనేయ ముఖ్య
వీరులు సేవింప వేవేగఁగదలి,
కరి రథ హరిభటుల్ గదిసికొల్వంగ,
వర భేరికాహళావళులు ఘోషింప,
హరి యింద్రప్రస్థ మహాపురంబునకు
నరుదెంచి, యాపాండవాత్మజులకును


వేయియేనుంగులు వేర్వేఱనిచ్చి,
యాయర్జునున కంత నరణంబు గాఁగ
[50] వేయిరథములు నూర్వేలధేనువులు
వేయి మదించిన వేదండమణులు
సింధుబాహ్లికపారసీక కాంభోజ
గంధర్వలక్షలు క్రమముతో నిచ్చి,
ధారుణీపతి యంతఁ దన్ను బూజింప
గోరిక లిగురొత్తఁ గొంత కాలంబు
విందులుగుడుచుచు వియ్యంకు లసక
యందు వినోదించి, యంత నందఱును
ద్వారక కేఁగుచోఁ, దాఁబోక వేడ్క
శౌరి యర్జునుతోడ సద్గోష్ఠి నుండె.

ఉ ప పాం డ వో త్ప త్తి


కాలక్రమంబునఁ గాంతసుభద్ర
యాలోన గర్భిణియై పుత్రుఁ గనియె.
అభిమన్యుఁడను నామమతనికి నిచ్చి
యభిమతి ధౌమ్యు డొయ్యనఁ జేసెఁగ్రియలు.
ద్రౌపదీ పుణ్యకాంతయు నంతఁ గ్రమము
దీపింప ధర్మసూతికిఁ బ్రతివింధ్యు,
నెఱయ వేడుకఁ బావనికి శ్రుతసోముఁ,
దెఱఁగొప్ప నింద్రసూతికి శ్రుతకీర్తి,
నలిఁబూర్వమాద్రేయునకు శతానీకు,
నలువొప్ప సహదేవునకు శ్రుతవర్మ
గాంచినఁ దోడ్తోనఁ గావించె ధౌమ్యుఁ
డంచితసత్క్రియ లక్కుమారులకు


భూపాలగృహములఁ బుత్రోత్సవంబు
దీపించె ధర్మవృద్ధికి మూలమగుచు.
అక్కడ దుర్యోధనాదులు గనిరి
[51] లక్కనుఁడాదిగా లలిఁగుమారులను.
అంత, వేసవికాల మఖిలజీవులకు
సంతాపభయము నసౌఖ్యంబుగలుగఁ
దవిలినఁ, దమవేఁడి తారోర్వలేక
రవికిరణములు నీరముద్రావననఁగ
మనుజిక్కి చెఱువులు మడుఁగులు నూతు
లనువారనేళ్లు నొయ్యన రిత్తలయ్యె;
[52]ఆటలతోఁటల నలులపాటలును
బాటలపవనంబుఁ బలుమాఱు వీచెఁ;
గరములదోసిళ్లఁ గమలమునదులు
గరులు సంధ్యలువార్చుగతిఁ జల్లుకొనియె;
మిక్కిలి [53]పులివోలె మృగతృష్ణగలిగి
యెక్కడఁగదలిపోనీయదు దినము;
పావకుం డచలంబుప్రక్కలు చూడ
జేవురించుచు ఱాలచేఁజెట్లుపడియె;
నెమకి వీసంబంతనీడగల్గినను,
నెమరుపెట్టుచు నిర్లునిలుచు నచ్చోట;
పగలు క్రాగిన నేలఁ బావకోదయము
తగునన సూర్యకాంతంబులుమండె;
కమలాప్తుఁడయ్యును గమలాకరముల
కమలంబు రవిగ్రోలి కమలారియయ్యె;
ఛాయఁబాయక [54]నిల్చు సవితృఁడన్నట్లు
ఛాయాప్రియంబయ్యె జగతిజీవంబు; (?)


వర చంప కాంభోజ వకుళ మల్లికలు
దిరిసెంబు గ్రోవి మోదెనయును బూచె;
[55] యువతిపాంథుల తల్పయోగంబుపోలె
దివసంబుల ఫలిత [56] దీర్ఘోష్ణమయ్యె ,
అట్టి వేసవియందు హరియు నర్జునుఁడు
దిట్టలై యమునానదీ తీరభూమి
విహరింప, నొక వృద్ధవిప్రుడై కదిసి
దహనుండు వారినిద్దఱను వీక్షించి :
దీపనంబయ్యెడుఁదృప్తిగా నశన
....పుదురే మాకునొసగ మీ" రనిన
వా: రోపుదుము నీగు వాంఛయె?" ట్లనినఁ,
బాఱుఁడిట్లనె: వహ్ని, బ్రభులార, యేను;
నూతన ధనశక్తి నూఱేండ్ల క్రతువు
శ్వేతకియను రాజు నేయంగఁదలఁచి,
హోతలఁ దర్కింపనోపక పోయి
"శ్వేతాద్రిఁదపమున్న , శివుఁడంతఁగదిసి :
"నీతలం పెఱిఁగితి నృప, [57] సత్రయాగ-
హోతలఁగోరితి వొకటిచెప్పెదను.
గారాముతో నేయి కరికరాకార-
ధారఁ బండ్రెండేండ్లు దహనులోఁ దొలుతఁ
దొరఁగింపు; మందుఁదోతుర హోత." లనిన,
హరుని వీడ్కొనివచ్చి యతఁడట్లుచేసి
హోతలఁబుట్టించి, యొగివారుఁదాను
జాతిగా నూఱేండ్లు జన్నంబు సేయ,
నఱుగమిపుట్టి యే నజుఁగానఁబోయి,
యెఱిగించి దీనికి నదిమందనిన:


'ఖాండవమనుతోఁటఁ గాల్పుము ; నీకు
నుండు నిక్కువమందు నొనరెడుమందు;
అదియు నింద్రునితోఁట.' యని బ్రహ్మ చెప్పఁ,
గదలి యేఁబోయి యాఖాండవవనము
కాలుపఁ, గోపించి కావలివారు
వేలసంఖ్యలు నన్ను వెడల నేయుటయుఁ,
గ్రమ్మఱ నా హేమగర్భునిఁగదిసి
యిమ్ముల నాచందమెఱిఁగింప నతఁడు :
"తత్తరింపకు; తోఁట తవిలి నీకొనగ
వత్తురు విజయుండు వాసుదేవుండు;
అప్పుడు నీకోర్కి యగుఁగాక; నేడు
చప్పుడుగాకుండఁ జను." మన్న, నేను
నుండితి నొదిగి ; నేఁడొగి మిమ్ముఁగంటి;
నిండు ఖాండవభిక్ష యిదినాకురక్ష ."
అని బార్ధుఁడిట్లను : "నట్లైన మాకు
ననిమిష పతితోడ నాజి గాఁగలదు;
తగినయమ్ములు విల్లుఁ దగినరథ్యములు
దగిన తీరును లేవు తలపోయమాకు;
శౌరికిఁ దగినయస్త్రము లేదు మొదల ;
నేరీతి ! " యనుటయు, నింతలో నగ్ని
వరుణ దేవుని నాత్మవగచి రప్పించి,
వరుణునియింటఁ బూర్వమునఁ జంద్రుండు
దిక్కులుసాధించి ధృతి దాఁచినట్టి
యక్కజంబైన విల్లా గాండివంబు,
సమరభయంకరాక్షయ తూణబాణ
యమలంబు, గంధర్వహయములరథము
నరునకుఁ దగనిమ్ము; నాఁటిచక్రమును
నురుగదయును శౌరికొసగుము పొసఁగ.


నాకార్యమునకు యత్నముసేయువీరి
కీకలాపములేక యేదియుఁగాదు.”
అనిన నన్నియుఁ దెచ్చి యతఁడిచ్చిపోవ ,
ననువుతో నరుఁడు నారాయణుఁజూచి :

ఖాం డ వ ద హ న ము


"యేరథికుండనయ్యెద ; నిందునీవు
సౌరథ్య మొనరింపు సత్కృప." ననుచు
లాలిత సింహగోలాంగూల కేతు-
ఖేలన ధవళాశ్వ కీలితరథము
నాయుధసన్నద్ధులై వేడ్క నెక్కి,
యాయగ్ని వెఱవకుమని యూఱడించి,
ఖాండవవనవీధిఁ గాల్పఁబుచ్చుటయు,
నొండొండ దరికొని యుగ్రుడై వహ్ని
నాకంబుపొడవుగా నాల్కలువాఱ
భీకరధ్వనితోడఁ బేర్చి కాల్పంగఁ,
దెరువులులేక మ్రందెడుమృగంబులును,
సరసరఁజనలేక స్రగ్గుపక్షులును,
[58]మలఁగుచోటును లేక మ్రగ్గుసర్పములు,
గలఁగిమడువులలోనఁ గందుమత్స్యములు,
మిడుఁగుఱుఁగాడ్పున మృతిఁబొందుకపులు,
నడవిఁగ్రమ్మిన మంటనణఁగెడు తరులు,
నిగుడు పువ్వులతోన నీఱైనలతలుఁ,
బొడవుగా దరికొనుపొదరిండ్లుఁ గలిగి
వెనుకొని మిన్నేఱువేఁడిగా మంట
వనమువెంటనె పర్వ, వనపాలురార్చి


పదివేవు రుద్దండబలులు బాణముల
నదలించి యగ్ని నేయఁగఁ, జూచి నరుఁడు
తెంపున నచటికి దేరుఁదోలించి
యంపకోలల వాన నావీరవరులఁ
గప్పినఁ, దమచేతఁగాక వారరిగి
యప్పు డింద్రునితోడ నదిచెప్ప నలిగి :
"తొడుకైన నొకమాఱు తోలినఁబోవు;
గడుసన్న నొకపని గాదన్నమాను;
బలుపునాలుక మూలఁబడియు నిట్లేల
తొలఁగక యాచిచ్చు తోఁటకువచ్చు!
మఱియు బహ్వాశిత మనునమార్గునకు
నెఱిమండువానికి నీతి యెక్కడిది!
తక్షకుఁడక్కటా! తనయులుఁ దాను
నక్షీణగతినుండు నందుఁగాపురము;
ఏమయ్యెనో! వాని నేఁగాతు." ననుచు
వే మేఘములఁదెచ్చి వినువీథిఁబన్ని
ఘోరవర్షము వజ్రి గురియించి యుదక
ధారల నయ్యగ్ని తడియకుండినను,
ఘనపుష్కలావర్తికంబులచేత
బొనరఁ గుంభద్రోణములు గురియింప
నుఱియనిపందిలి యుగ్రబాణముల
నెఱచిచ్చుపైఁబన్ని యింద్రనందనుఁడు
వినువీథి మొగిళులు వివ్వనేయుటయు,
ననిమిషపతి యల్గి యాయగ్నిమీఁద
నెఱిపిడుగులవాన నిగిడింపఁ, బార్థుఁ
డుఱక యాశిఖి 'నోడకోడకు', మనుచుఁ
బెనుగాడ్పు తూపులఁ బిడుగులమొగులు
వినువీథివిప్పిన, వెండియు వజ్రి


సుర యక్ష కిన్న రాసుర సిద్ధ సాధ్య
గరుడ గంధర్వ వర్గము నగ్నిమీఁద
ననిచినఁ, గాండీవి యాసేననెల్ల
ననిచిన దివ్యబాణప్రభావమున
మంత్రభస్మము భూతమండలిమీఁద
మాంత్రికుండొదవించి మఱి విప్పునట్లు
తఱిమిన, నిలువక దైవతసేన
పఱచె నిప్పులుచల్లి పావకుండార్వ.
అంతఁ దక్షకసూనుఁ డశ్వసేనాఖ్యుఁ
డెంతయు భయముతో నెలదోఁటనుండి
తనతోఁక గఱపించి తల్లిఁదోకొనుచు
వినువీథి కెగసిన, వీక్షించి నరుఁడు
వాలమ్ముచే వానివాలమ్ము తల్లి
తో లీల నగ్నిలో దొరఁగ ఖండించి
మఱి వానినేయుచో, మఘవుండు మాయ
మెఱయించి విడిపించె [59]మిత్రనందనుని.
విను మంత నప్పాము వెసఁబోయి కర్ణు
దొనఁజొచ్చి యర్జునుతోడివైరమున :
"నరునిఁ జంపెదఁ గర్ణ, నన్నాజిఁ దొడుగు,
మిరవైనగతి నమ్ము నే నీకు నమ్ము,
హరిహరబ్రహ్మాదు లడ్డమైరేని
మరలఁజుమీ! చంపె మాతల్లి నఁతఁడు."
అనుటయు, ధూపదీపాదుల నతని
నొనరఁ బూజింపుచునుండెఁ గర్ణుండు.
ఇట ఱాలవాన నయ్యింద్రుండు గురియఁ,
బటులీల నగ్నిపైఁ బడకుండ నరుఁడు


నిసుముగానేసిన, నింద్రుండు మఱియు
వెస నద్రిశిఖరముల్ విఱిచి వైచినను,
వజ్రాస్త్రముల వాని వాసవి దునుమ,
వజ్రితో నాకాశవాణి యిట్లనియె:
"విడుమింక దేవేంద్ర, వీరాదిమునులు
జడియరు నీచేత; సకలయత్నములఁ
గాలు నీయగ్నిచే ఖాండవవనము
వాలాయ' మనుబ్రహ్మవాక్యంబు గలదు.
ఈయగ్నిభయము మున్నెఱిఁగి, తక్షకుఁడు
పోయెఁ గురుక్షేత్రమున కిందు లేఁడు;
ఈసంకటవుఁగోటి నీఁగెడుపాటి
చేసూటిగలమేటి చెడఁడు కిరీటి."
అనుటయు, దేవేంద్రుఁ డమరులుఁ దాను
ఘనయుతుండై యేఁగెఁ గలహంబుమాని.
నలినంత మయుఁడునా నవ్విశ్వకర్మ
చెలువకై ఖాండవస్థలి నుండుఁ గాన
దరలి వహ్నికిఁగాక తక్షకగృహము
చొరఁబాఱి వెడలక చుట్టునుబెట్టి
సుడిగాడ్పుతో నందుఁజొచ్చి పావకుఁడు
తడవుచుఁ బోనీక తన్నాక్రమింప,
బలిమి నయ్యగ్నిలోఁ బడలేక మయుఁడు
బలభేదిసుతు నిట్లుప్రస్తుతిచేసె :
"కావవే యర్జున! కరుణావిధేయ,
పావకశిఖలోనఁ బడియున్నవాఁడఁ;
దక్ష[60]కాదులకును దాత నన్నెఱుగు;
లక్షింపఁ బెద్దకాలమునాఁటివాఁడ;


శరణాగతత్రాణచరితుండ వంచు .
శరణంటిఁ; గావవే చక్రిసహాయ!
ద్రుపదబంధనలోల, ద్రోణసంస్తుత్య,
కపటఖేచరయంత్ర ఖండనోద్దండ
రణరంగభీకర, రాధేయవిజయ ,
ప్రణవకోవిద, దివ్యబాణప్రవీణ,
శ్వేతవాహన, బాహువిహితగాండీవ,
నాత.......గొరయగు ననుఁగావుమనిన
మయునిఁ బోనిమ్మని మంటకుఁ జెప్పి,
ప్రియముతో రక్షించె బీభత్సుఁ డతని.
లావుకపిట్టయై లావుకియందు
బావుగా మును మందపాలుండు గనిన
మొలకఱెక్కలఁ బచ్చిముక్కులతోడ
నలువురుకొడుకులు నాగేంద్రుఁడొకఁడు
మయుఁడును దప్ప, నమ్మంటలో భస్మ
మయమయ్యె జంతుసామగ్రితో వనము.
ఆరీతి ఖాండవం బాహుతిఁగొనిన,
నారోగ్యమును బొంది యనలుఁ డుప్పొంగి
నారాయణునిఁ జూచి నవభక్తియుక్తి
గారవం బేర్పడఁ గదిసి యిట్లనియె:
"కమలాక్ష, యీవును ఘనుఁ డర్జునుండు
నమితవైభవశక్తి నలరి యిచ్చోట
దేవేంద్రుతోఁ బోరి దివ్యబాణముల
వావిరి నవ్వేల్పు వదలంగఁ దోలి,
నాకోర్కి గావించి నలువొప్ప జయము
చేకొంటి; రిదిచూడఁ జిత్రంబుగాదు!
నరసహాయుండవై నవ్యతేజమున
ధరణిభారంబెల్లఁ దగమాన్పఁబూని


సప్రతాపుండవై జనియించు నీకు
నీప్రయోజనమెంత యెన్ని చూడఁగను!
నీప్రభావముఁ గాననేరఁడు బ్రహ్మ;
నీప్రభావముఁ గాననేర్తునె యేను!"
అనుచు వైశ్వానరుఁ డావాసుదేవుఁ
గొనియాడి, వేడ్కతోఁ గొమరొప్ప గ్రీడి
దీవించిపోయిన, దివిజులు మెచ్చ
నా వేళఁ గృష్ణుండు హర్షింపుచుండె.

శివుఁడు ప్రత్యక్షమై కృష్ణార్జునులఁ బ్రశంసించుట


అంత మహాదేవుఁ డధికసంతోష
మెంతయు దైవాఱ నింపుసొంపలర
నందికేశ్వర భృంగినాథ విఘ్నేశు
లందంద షణ్ముఖులాదిగాఁ గలుగు
ప్రమధగణంబులు బలిసి సేవింప,
నమితవైఖరితోడ నష్టభైరవులు
హరి వహ్ని యమ దానవాంబుప వాయు
నరవాహనాదు లున్నతభక్తి గొలువ,
సురముని కిన్నరాసుర సిద్ధ సాధ్య
గరు డాప్సరో యక్ష గంధర్వవరులు
వరుసతోఁ జేరి కైవారముల్ సేయఁ,
బరమమునీంద్రులు ప్రణుతిగావింపఁ,
దుంబుర నాంద స్తుతిగీతకళలు
పంబినప్రీతితోఁ బరిపాటి వినుచు
సకలవాద్యధ్వనుల్ చదలఁబర్వంగఁ
బ్రకటమై జయజయభాషలు చెలఁగఁ,
బరమానురాగసంపద నేఁగుదెంచి
హరి ఫల్గుణుల యగ్రమందొప్పనిలువ,


నప్పుడు శ్రీకృష్ణుఁ డమరేంద్రసుతుఁడు
నుప్పొంగి సన్నుతు లోలిఁగావించి,
[61] పొనరఁ గరాంబుజములు భక్తిమోడ్చి
వినయవినమ్రులై వినుతించి రిట్లు :
"శర్వ, సర్వేశ్వర, శాంభవీరమణ,
సర్వజ్ఞ, సర్వాత, సచ్చిదానంద,
నిర్వికల్పకభావ, నిగమాంతవేద్య,
నిర్వికార, నిరీహ, నిర్వాణగమ్య,
గజదైత్యసంహార, గజచర్మధార,
గజరక్షసన్నుత, గజవక్త్రజనక,
నిన్నెఱుంగఁగ లేవు నిఖలవేదములు;
నిన్ను గానఁగ లేవు నిఖలశాస్త్రములు;
నేమెంతవారము నీతత్త్వమెఱుఁగ;
సోమార్ధశేఖర, సురుచిర తేజ! ”
అనుచు నివ్విధమున హరియు నర్జునుఁడు
వినుతులుసేయంగ విశ్వేశుఁ డలరి
చిఱునవ్వు దళుకొత్తఁ జెలఁగి యిట్లనియె:
.......................................
జలజాక్ష, నీతోడ సఖ్యంబుగలుగఁ
జెలఁగి పూజ్యుఁడనైతి సకలలోకముల;
కమలాక్షు, నన్నాదికాలంబునందు
భ్రమరకీటన్యాయపద్ధతి వేడ్క
నీవు ప్రతిష్ఠింప నిత్యుండనైతి;
నీవుసంకల్పింప నెఱిఁ దృణంబైన
నావేల్పుశైలమౌ నఖిలలోకేశ!
.........................................
.........................................


అల నరనారాయణాఖ్యులు మీరు
కలితతేజోధర్మఘనపరాక్రములు.
భూభార మిరువురుఁ బూని మాన్పుటకు
భూభువనంబునఁ బుట్టితిరిట్లు.
ఖాండవదహనంబు గావించినట్లు
కాండాగ్నిఁగూల్పుఁడు ఘనశత్రువితతి.
కృష్ణసఖుండైన కృష్ణాప్రియునకుఁ
గృష్ణాభిధానంబు గీల్కొనుఁగాక. ”
యని కృష్ణనామంబు హరిసూతి కొసగి
ఘనముగా బహుదివ్యకాండజాలంబు
సురలచేనెల్లను శుభమంత్రశక్తి
నిరువుర కిప్పించి, యిష్టంబుమెఱయ
( దేవదత్తమునిచ్చి,) దేవదేవుండు
దేవేంద్రునిట్లనుఁ దేటనవ్వమర :
“వాసవ, ఖాండవవనమున నేను
మోసపోయితినని మొగిఁగుందవలదు;
ఆరీతి ననలున కఱుగమిచేయు
కారణంబున కిట్లుకమరె నవ్వనము.
ఈఖాండవమువోయిననేమి! నీకు
నాకీశ, యున్నది నందనవనము.
తొల్లిటికంటెను దోరంపుతోట
యెల్లవృక్షంబుల నెల్లపూఁబొదల
మొల్లమై ఫలముల నుల్లసిల్లుచును
ఫుల్లలతాజా(లపుం)జితభ్రమర
కోకిల శుకపిక కూజిత యుక్తి
నేకాలమునుగల్గి యింపొందుఁగాత."


మనుచు గౌరీశ్వరుఁ డమరనాథునకుఁ
దసరంగ వరమిచ్చి తద్దమోదమున,
వినుతులు సేయు గోవిందఫల్గుణుల
(నొనర వీ)డ్కొని, సురయూధంబు గొల్వ
సకలమునీంద్రులు సన్నుతిసేయ
నకలంకగతి నేఁగె నాలయంబునకు.
వనజజుఁ డాదిగా వరముల నొసగి
చనిరంతఁ దమ నిజస్థానంబులకును.

ఇంద్రుఁడర్జునునకు దివ్యాస్త్రములొసగుట


అంత దేవేంద్రుండు నాత్మజుమీఁద
నెంతయువేడ్క ననేకబాణములు
నరున కర్మిలి నిచ్చి, నారాయణునకు
నురుహార మకుట కేయూరంబు లిచ్చి,
మమత [62]వీడ్కొనిపోవ, మయుఁగూడి ధరణి
రమణులు వచ్చి రింద్రప్రస్థవురికి,
హరిచేఁ గిరీట మిట్లందుటఁజేసి
నరున కబ్బెఁ గిరీటినామధేయంబు.
ఇదియాదిపర్వంబు హితరాజసభల
విదితమై వర్ధిల్లు విద్వాంసు లలర.
అని యిట్లు జనమేజయ క్షితిపతికి
ముని మున్నుచెప్పినముఖ్యమార్గమున
నక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథ వినుపింప హర్షించి వారు
ఆతనిఁబూజించి యనఘులుమునులు
ఆతరువాతి వృత్తాంత మేమనిన,
 


ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మననామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితాష్టమాశ్వాస మొనరనింపొందె.

ఇది యాదిపర్వము.

  1. నకలంకమగు (మూ)
  2. సమేతులై
  3. వేలు (మూ )
  4. బ్రతికించు
  5. పరిణామ
  6. బోయెం బురాణపురుషుం డన్నట్లు
  7. విజయంబు (మూ)
  8. చూటమి
  9. సేయనున్న (మూ)
  10. రణమున (మూ)
  11. గలవె
  12. వెంత (మూ)
  13. ఫుల్లఖండంబు
  14. వటమును(మూ)
  15. ముగ
  16. ఈపదమును స్త్రీపర్యాయముగా వాడియుండును. చూ. ఆ.ప.చ.ఆ 207.పు.
  17. వక్షంబు (మూ)
  18. వినుచున్న
  19. దుట్టపింజరనితతొత్త
  20. దిష్టు (మూ)
  21. తనలోనెతాడాంగితడబాపజూచి
  22. మైన (మూ)
  23. శృంగమను (మూ )
  24. శేషించి
  25. చెరుపు (మూ)
  26. ఈపంక్తులలోని కథాసందర్భవాక్యయోజనాదికము స్పష్టముగా లేదు; కవిత్రయ
    భారతమునుబట్టి సవరింపఁబూనినచో జాల తాఱుమాఱు చేయవలసివచ్చునని ఇట్లే యుంచబడినది.
  27. కారండవిఖ్యాతి (మూ)
  28. నాతాప
  29. నా పేరునంద యానావెన్క లలిత. (మూ) వంద అని నన్నయ. వర్గ అని వ్యాస. భా.
  30. సౌరభేయి, అని సం. ఆం. భారతములు.
  31. పుల్వస (మూ)
  32. అతిదల (మూ)
  33. ఉద్యోగవానులై
  34. ఇందఱు (మూ)
  35. వృథగావు
  36. నొల్లనొల్లఁడు (మూ)
  37. తారిమిడిన
  38. పరితోదకము
  39. నుక్కటయగుచు
  40. కినిసి (మూ)
  41. ధూమంబు
  42. జడ (మూ)
  43. లేగులు
  44. యార్వంబోసి (మూ)
  45. కాంతిగా (మూ)
  46. మనమైన మెట్టి (మూ)
  47. వేవేగఁ జని కుంతి వీక్షించి మ్రొక్క
  48. ధీరుల
  49. సుభద్రోపచారముల్, (మూ )
  50. వేయిమదెమల నూరువేల (మూ )
  51. లక్ష్మణపదమునకు వికృతి
  52. అటులతికలనలులబాధలను
  53. పురినోలె
  54. గెల్చె (మూ)
  55. పాంథయువతులని కవి ఆశయముగాఁబోలు. ఈ వేసవివర్ణనమందలి అర్థము
    అంత విస్పష్టముగా లేదు.
  56. దీర్ఘోష్ణమగుచు.
  57. సత్వ. (మూ)
  58. మలంగజాటున. (మూ )
  59. మంత్రి (మూ)
  60. రాక్షసులకు (మూ)
  61. యొనరకరంబుల భక్తియుమోడి (మూ)1
  62. చేకొని (మూ )