దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/5, 6 నెల్లూరు - నంద్యాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాబట్టి ఆయూరిలో నొక పాఠశాలకు అద్దె లేకుండగనే ఇచ్చి వేసితిని. అవసరము వచ్చినపుడు ఖాళీచేయుటకు పాఠశాలకమిటీ అంగీకరించెను.

5, 6 నెల్లూరు - నంద్యాల (ఆంధ్రమహాసభలు)

1916 లో నెల్లూరులో ఆంధ్రమహాసభ సమావేశమగుట కేర్పాట్లు జరిగెను. స్థాయీసంఘము నన్నే ఆసభకు అధ్యక్షుడుగానుండునట్లు నిర్ణయించిరి. శ్రీ వంగోలు వెంకటరంగయ్యగారు సన్మాన సంఘాధ్యక్షులుగా నుండిరి. నెల్లూరిలో వీరు న్యాయవాదిగానుండిరి. మిక్కిలి సౌమ్యస్వభావులు. ఆంధ్రభాషయందు అభిరుచికలవారు. ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున పూర్ణమగు అభిమానముకలవారు. శ్రీ ఆమంచర్ల సుబ్బుకృష్ణరావుగారు శాసనసభాసభ్యులు. వీ రచట పబ్లిక్‌ప్రాసిక్యూటరుగాను మునిసిపల్ ఛైర్‌మన్‌గా నుండిరి. వీరును మరికొందరును ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకు వ్యతిరేకులు. వారు బాహాటముగ నెదిరింపకున్నను ఆంధ్రరాష్ట్రతీర్మానము ఆసభలో నెగ్గు విషయములో కొంత సంశయమేర్పడెను. శ్రీ సుబ్బుకృష్ణరావుగారికితోడు శ్రీ చంగయ్యగా రను మరియొక ప్లీడరుగారుకూడ ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి వ్యతిరేకాభిప్రాయము కలిగి యుండిరి. మహాసభకు వచ్చిన ప్రతినిధులు ఉదయమున పినాకిని నదిలో స్నానముచేసి తిక్కనసోమయాజులవారి ఘంటమును చలువచప్పరములో నుంచి, జాతీయగీతములుపాడుచు నూరేగించిరి. నెల్లూరుసమీపమున పాటూరుగ్రామములో ఆయనసంతతివారు ఆఘంటమును దేవతార్చనలో నుంచి ప్రతిదినము పూజించుచుండిరి. ఆపాటూరులోనే హరిహరనాథుని దేవాలయము కలదు. నాఉపన్యాసములో నెల్లూరువారి వ్యతిరేకవాదమును ఖండించుచు "ఇది ఎట్టి నీతియో తెలియకున్న" దని నేను వచించితిని. ఆవాక్యమునకు కోపించి శ్రీ సుబ్బుకృష్ణరావు మొదలగువారు సభను విడిచిపోయిరి. అంతట సభలో కలవరము సాగెను. నేనుమాత్ర మెవ్వరిని తూలనాడవలెనని ఆవాక్యము పలుకలేదు కాని నామూలముగ సభలో కలవరము కలుగుట వలన మనస్సు బాధించినది. పలువురు "ఎట్టినీతి" అన్నంత మాత్రమున తప్పులేదు అని వాదించసాగిరి. కాని మరి కొందరు మిత్రులు మాత్రము అది ఉద్దేశపూర్వకముగాకున్నను ఆక్షేపణీయమే యని అభిప్రాయపడుచుండిరి. సభ నిలుపుదల కావలసివచ్చెను. శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు వచ్చి నే నెవ్వరిని అవమానించవలెనని చెప్పినదికా దని సభలో చెప్పినయెడల సభవిడిచిపోయినవారు మరల వచ్చెదరని చెప్పినందున నేను ఆప్రకారము చెప్పుటకు ఆక్షేపణలేదనియు ఆవచనములు పలికినపుడైనను నాకు వేరొక యుద్దేశము లేదనియు తెలిపితిని. ఈ మాటయైనను నేను జెప్పవలసిన పనిలేదని చాలమంది మిత్రులు ముఖ్యముగ యువకులగువారు విరోధించి పల్కిరి. సభ చక్కగా జరిగిపోయెను. ఆంధ్రరాష్ట్రతీర్మానమునుగూర్చి వాదప్రతివాదములు హెచ్చుగా నడిచెను. రాత్రి ప్రొద్దుపోవునప్పటికి సమ్మతులు తీసుకొనుట సంభవించెను. సభలో మొత్తముమీద లెక్కించగా అనుకూలాభిప్రాయములే హెచ్చుగా తేలినవి. కాని విడదీసి లెక్కించవలెనని సభ్యులలో కొందరు పట్టుబట్టిరి. ఆప్రకారము అనుకూలురను, ప్రతికూలురను విడదీయగా వ్యతి రేకులకంటె మున్నూరుమంది అనుకూలురే అధికముగ లెక్కకు వచ్చిరి. ఇట్లు జయముచేకూరినను కొందరైనను వ్యతిరేకులుండుటచే ప్రజలకు ఉద్యమముపట్ల పట్టుదల కొరతగనే యుండెనని స్పష్టమయ్యెను. కాని ఈవ్యతిరేకాభిప్రాయము కొందరు ప్రముఖుల పలుకుబడిచే నేర్పడినదేగాని స్వతంత్రము కాదు. ఈ జయమునకు శ్రీ కోడి రామమూర్తిగారు సామాన్యప్రజలతో కలసి మాట్లాడుటగూడ చాల ఉపయోగించినది. రామమూర్తి గారు అభినవభీము డని పేరుపొందిన జగజెట్టి. హిందీలోనూ, తెలుగుభాషలోనూ ధారాళముగ నుపన్యసించి ప్రజల హృదయములను రంజింపజేయుచుండెడివాడు. శ్రీ వెంకటరంగయ్యగారు తమ ఉపన్యాసములో ఆంధ్రరాష్ట్రనిర్మాణమును సహేతుకముగ బలపరచిరి. ఆంధ్రులు ప్రత్యేకరాష్ట్రము కోరుట ఆత్మవ్యక్తిత్వసిద్ధినిమిత్తమే యని స్పష్టీకరించిరి. ఆరవ ఆంధ్రమహాసభను కర్నూలుప్రతినిధులు నంద్యాలకు ఆహ్వానించిరి.


_____________