దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వృత్తి విసర్జనం

వికీసోర్స్ నుండి

వృత్తి విసర్జనం

అప్పటికి పదిసంవత్సరములపూర్వము నేనును శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారును కలసి పదిఏండ్లకు తదుపరి వృత్తిమానివేసుకొని ఏదో ఒక దేశహితైకకార్యమునందు ప్రవేశించవలెనని చేసికొన్న ప్రతిజ్ఞ నా కపుడపుడు జ్ఞాపకము వచ్చుచుండెను. ఉదయమున లేచి, ఆనాటి కేసులరికార్డును చదువుకొనుచుండగా ఇంటివెలుపల సూర్యకాంతులు ప్రకాశించుచు చల్లని గాలి వీచుచుండ వెలుపలకుబోయి తిరుగవలెనని కుతూహలము పుట్టినను ఇంటిలోకూర్చుండి పాఠములుచదివినట్లు కాగితములు చదువవలసివచ్చినప్పుడు ఈనిర్బంధమునుండి ఎప్పుడు విముక్తి చెందుదునా యనువాంఛ మనస్సున కలుగుచుండెను. అట్టివిరమణ సిద్ధించుటకు క్రొత్తకేసులు పుచ్చుకొనకుండవలెనుగదా. అదివరకు చేపట్టిన కేసులు త్వరలో ముగించుకొనవలెనుగదా యని యోచించుచుంటిని. కాని ఒకానొకరోజు ఏదియైన పెద్దఫీజు వచ్చెడికేసు వచ్చినప్పుడు దానిని వదల బుద్ది పుట్టెడిది కాదు. ఇట్లు ఆసంవత్సరములో తుదిమాసములు ముగియుచున్నకొలది మనస్సున ఆందోళన హెచ్చుచుండెను. వృత్తిపని యనిన కొంత విసుగుపుట్టుచుండెను. ఇట్లు సంచలనము చెందుచున్న మనస్సుతోడనే డిసెంబరుమాసము ముగియుసరికి పంజరమునుండి తప్పించుకొన్న చిలుకవలె నతంత్రవిహారతరుణమేర్పడెనని ఆనందోత్సాహములు హృదయమునం దంకురించి ఒకరీతి నూతనబలమును చేకూర్చెను. 1915 డిశంబరు 31 వ తేదినాడు వృత్తివిసర్జన చేయగలిగితిని. నామిత్రుడు చెన్నాప్రగడ భాను మూర్తిగా రప్పుడు చెన్నపట్టణములో గవర్నమెంటుట్రాన్సులేటరు ఉద్యోగము చేయుచుండిరిగాన "మనముపెట్టుకొన్న పదిసంవత్సరములు గడువు నేటితో ముగిసినది. నేను నావృత్తిని విసర్జించితిని, మీరును మీఉద్యోగము మాని, నాతో కలియవలె" నని కోరుచు వారికి జాబు వ్రాసితిని. ఇట్లునా వృత్తివిసర్జనచేయుట పలువురకు విపరీతముగ గాన్పించెను. పుష్కలముగ ద్రవ్యార్జన చేసుకొనుచు తినుచుతినుచున్న అన్నపుబాత్రను తటాలున బోర్లత్రోసుకొను వెఱ్ఱివానివలె వృత్తిని విడనాడితినని తలంచుచుండిరి. నాబంధువులకెవ్వరికిని సమ్మతి లేదయ్యెను. నాభార్యకును ఇష్టములేకున్నను అంతగా కలవరముచెందక శాంతమువహించి యూరకుండెను. గుమాస్తాలు బొత్తుగ సహింప జాలకుండిరి. నా పెద్దగుమాస్తా కౌతా పుండరికాక్షుడు నాదగ్గరకువచ్చి, కంట నీరుబెట్టుకొని "ఇంకను కొన్నిసంవత్సరములు హాయిగా పనిచేయుచు మమ్మునుగూడ రక్షించరాదా? మీరు వృత్తివదలుటతో మేము నీరింకిన గుంటలోని చేపలవలె బయటపడి నశించవలసినదే" యని చెప్పుచు మిక్కిలి దు:ఖించెను. నాయొద్దపనిలో ప్రవేశించినప్పటినుంచి అతడు సంసారముతో సుఖముగ కాలము జరుపుకొనుచుండెను. ఆతనిమాటలు వినినప్పుడు నామనసున జాలికలిగెనుగాని నేను వృత్తి మానినంతమాత్రమున అతనికి జీవనము జరుగకపోదనియు, ఎవరియొద్దనో పొట్టపోసుకొన గలడనియు తలంచి అతనినోదార్చి, అప్పీళ్ళు మొదలగు రికార్డులు తెప్పించి అవి ఏఏప్లీడర్లకు పంచిపెట్టవలెనాయని యోచించుకొంటిని. అప్పటికి నాయొద్ద జూనియరుగా పనిచేయుచున్న శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు మంచి బుద్ధికుశలతగలవారు. అప్పుడప్పుడు కొన్ని చిన్నఅప్పీళ్ళను ఆయనకే ఇచ్చి వాదన చేయించుచుంటిని. సమర్ధుడని గుర్తించగలిగితిని. నేను వృత్తిని వదలివేయుట ఆయనకును సమ్మతమైనది కాదు. "మీరు ఇంటిలో ఊరక కూర్చుండి సలహాచెప్పుచుండిన చాలును, నేనే స్వయముగ కోర్టుపని యంతయు చూచుకొనెదను. కావలెననిన మీయిష్టము వచ్చినప్పుడు దేశహితైకకార్యములు నెరవేర్చు కొనుచుండవచ్చును" అని నాకు సానుభూతితో సలహానిచ్చిరి. నానిశ్చయము తిరుగదని వారితోచెప్పి సమాధానపరచితిని. ఆయన జూనియరుగా నుండుటచే ఆయనకే యొప్పజెప్పినయెడల క్క్షిదారులు సమ్మతించరని సంశయముకలిగి, కొద్దిపాటి అప్పీళ్ళు మాత్రము స్వల్పముగ ఆయన కిచ్చి, తక్కిన అప్పీళ్ళను, అసలు వ్యాజ్యములను శ్రీపతి శ్రీనివాసరావుగారి కప్పజెప్పితిని. కొన్ని ముఖ్యమైన అసలువ్యాజ్యముల కక్షిదారులు తమవ్యాజ్యముల నెవ్వరి కిచ్చినను ఒప్పుకొనమనియు మీరే చేయవలసినదనియు గట్టిగా పట్టుపట్టినందున అట్టి రికార్డులు అయిదారు మాత్రము నాయొద్దనే యుంచుకొంటిని.

ఇట్లు నేను నాచేతనున్న వ్యవహారములు ఇతరులకు వదలివేయుచున్న విషయము విని, నాతో ఆంధ్రోద్యమప్రచారములోనూ, అంతకుముందునుండి కాంగ్రెసువిషయములలోను కలసిసంచరించుచుండిన శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి వచ్చి "ఇది యంతయు సంసారమును వదలి సన్యాసాశ్రమముపుచ్చుకొను విరాగి చేయుకార్యముగనో లేక ప్రాణావసానకాలమున లోకమువిడచిపోవువాడు తన ఆస్తిపాస్తులు బందుగుల కిచ్చివేయుపనివలెనో యున్న"దని వర్ణించెను. గుంటూరులోని కొందరుమిత్రులు అందు ముఖ్యముగ న్యాపతి హనుమంతరావు పంతులుగారు ఈప్రయత్నమును మాన్పించవలెనని బహుదూరము నాతో వాదించిరి. శ్రీ రాయసం వెంకటశివుడుపంతులుగారును నా నిశ్చయమునుండి మరల్పజూచిరిగాని తుదకు నా పూన్కియే యుక్తమని వారును తలంచిరి. తోడి న్యాయవాదులందరికి నేను చేసినపని మిక్కిలి ఆశ్చర్యముగనే యుండెను. వారిలో పలువురు నేను బాగుగ సంపాదనచేసియుంటినిగనుక మిగిలినకాలము సుఖముగ కూర్చుండి, అనుభవింతునని తలంచిరి. నేను పూర్వము చేసుకొన్న నిశ్చయమునుగూర్చి నాముఖ్యమిత్రులుతప్ప ఇతరు లెరుగరు. ఈదీక్షకు ముఖ్యప్రేరణ శ్రీ గోపాలకృష్ణ గోఖ్లేగారి జీవితవృత్తాంతమే. వారితో నెందుకు పోలనివాడ నైనను యధాశక్తి వారివలెనే వృత్తిని వదలి, దేశసేవచేయుటకు జీవితకాలములో కొంతయైనను గడుపుట యుక్తమని తలంచితిని. కొంతకాలముక్రిందట వారి భారతసేవాసంఘములో సభ్యుడుగా నుండవలెనని యోచించితినిగాని అది సిద్ధించలేదు. కాని ఆసేవకులవలెనే దేశములో చేతనైన సేవచేయుటకు అడ్డు లేదని యెంచితిని.

శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారు తమ ఉద్యోగమును మానజాలమని ప్రత్యుత్తరమువ్రాసినను నేనుమాత్రము నాదీక్షను కొనసాగింప నిశ్చయించుకొని యొంటరిగనే ఎదియోసేవ చేయవచ్చునని యనుకొంటిని. వేటపాలెములో విద్యాసంస్థస్థాపించుటకు శ్రీ భానుమూర్తిగారు తోడ్పడునని తలంచితిని. కాని ఆయాశ నిరాశయయ్యెను. మరెవ్వరును ఆభారమును పైనబెట్టుకొనుటకు సమ్మతించకుండిరి.

ఇట్లుండగా, భారతదేశసేవాసంఘములో సభ్యులైన శ్రీ వాజపేయ వెంకటసుబ్బయ్యగారితో నాకు స్నేహమేర్పడెను. వారు బెంగుళూరువాస్తవ్యులైనను తెలుగువారు. వాల సౌమ్యస్వభావముగల శాంతమూర్తులు, త్యాగశీలురు నగుటచే వేటపాలెములోని స్త్రీవిద్యాశాల కధ్యక్షులుగా నుండదగినవారనియెంచి, వారిని కోరగా వారు సమ్మతించి, శ్రీ గోఖ్లేగారిని కలుసుకొని, వారి అనుజ్ఞపుచ్చుకొని వచ్చెదనని పునహాకువెళ్ళి, వారివలన అనుజ్ఞాతులై, భార్యగారితో, చిన్నకుమార్తెతో గుంటూరు వచ్చిచేరిరి. వారి కొక నెల గ్రాసమునకు సరిపోవు పదార్థములు మూటలుగట్టి, పాత్రసామగ్రితోగూడ వేటపాలెము పంపుటకు సిద్ధముచేసి, వాకిటిలోనికి వచ్చునప్పటికి పోస్టు జవాను తంతివార్త యొకటి చేతి కిచ్చెను. అది విప్పి, చదువుకొనగా శ్రీ గోఖ్లేగారు పరలోకగతులై రను పిడుగువంటివార్త తెలియవచ్చెను. విభ్రాంతిచెంది, శ్రీ సుబ్బయ్యగారు కొంత తడవు నిశ్చేష్టితుడై నిలచి, దు:ఖపూరితుడయ్యెను. ఇకను వెంటనే పునహా వెళ్ళవలెనని తెలిపెను. తా నొకటి దలచిన దైవ మొకటి తలచు ననునట్లు తగినవారు దొరకిరిగదా యని సంతోషించినందుకు ఆ ఆశయు నిరాశయయ్యెను. కాని ఇంకను శారదానికేతనము స్థాపించవలెనను కోర్కె నన్ను విడువలేదు. బంగళాలను తోటను కాపాడుటకు నెలజీతములిచ్చి వృధావ్యయముచేయుట కష్టముగనే తోచుచుండెను. కాబట్టి ఆయూరిలో నొక పాఠశాలకు అద్దె లేకుండగనే ఇచ్చి వేసితిని. అవసరము వచ్చినపుడు ఖాళీచేయుటకు పాఠశాలకమిటీ అంగీకరించెను.

5, 6 నెల్లూరు - నంద్యాల (ఆంధ్రమహాసభలు)

1916 లో నెల్లూరులో ఆంధ్రమహాసభ సమావేశమగుట కేర్పాట్లు జరిగెను. స్థాయీసంఘము నన్నే ఆసభకు అధ్యక్షుడుగానుండునట్లు నిర్ణయించిరి. శ్రీ వంగోలు వెంకటరంగయ్యగారు సన్మాన సంఘాధ్యక్షులుగా నుండిరి. నెల్లూరిలో వీరు న్యాయవాదిగానుండిరి. మిక్కిలి సౌమ్యస్వభావులు. ఆంధ్రభాషయందు అభిరుచికలవారు. ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున పూర్ణమగు అభిమానముకలవారు. శ్రీ ఆమంచర్ల సుబ్బుకృష్ణరావుగారు శాసనసభాసభ్యులు. వీ రచట పబ్లిక్‌ప్రాసిక్యూటరుగాను మునిసిపల్ ఛైర్‌మన్‌గా నుండిరి. వీరును మరికొందరును ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకు వ్యతిరేకులు. వారు బాహాటముగ నెదిరింపకున్నను ఆంధ్రరాష్ట్రతీర్మానము ఆసభలో నెగ్గు విషయములో కొంత సంశయమేర్పడెను. శ్రీ సుబ్బుకృష్ణరావుగారికితోడు శ్రీ చంగయ్యగా రను మరియొక ప్లీడరుగారుకూడ ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి వ్యతిరేకాభిప్రాయము కలిగి యుండిరి. మహాసభకు వచ్చిన ప్రతినిధులు ఉదయమున పినాకిని నదిలో స్నానముచేసి తిక్కనసోమయాజులవారి ఘంటమును చలువచప్పరములో నుంచి, జాతీయగీతములుపాడుచు నూరేగించిరి. నెల్లూరుసమీపమున పాటూరుగ్రామములో ఆయనసంతతివారు ఆఘంటమును దేవతార్చనలో నుంచి ప్రతిదినము