దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/విద్యాభ్యాసము

వికీసోర్స్ నుండి

విద్యాభ్యాసము

అయిదవఏట నన్ను బడిలో చదువవేసిరి. ఆరోజున నాకాళ్ళకు ముచ్చలజో డొకటి తొడిగి క్రొత్తరుమాల నాపైన గప్పిరి. బడిపంతులు పిల్లలతోగూడ మాయింటికి వచ్చిరి. ఓం నమశ్శివాయ సిద్ధం నమ: అనువాక్యములు వ్రాయించిరి. పిమ్మట పంతులుగారు నన్ను తనచంకను బెట్టుకొని బడికి తీసికొనిపోయిరి. చదువులబడి పాతగుంటూరులో మరియొకబజారులో నొక పెద్దఅగ్రహారీకులైన మర్ధ్వులయింట నుండెను. ఆయింటివారి పిల్లవాడను చదువుకొనుచుండెను. పంతులుగారు ఆయింటిలోనే ఒక వైపున కాపురముండిరి.

ఆయింటి యజమానురాలు నన్ను దయతో చూచుచుండెను. తన కుమారునితోపాటుగ నా తలయును దువ్వుచు ప్రేమతో మాట్లాడుచుండెను. అందరికంటె ముందు బడికి పోవుచుండినందున శ్రీయో చుక్కయో నాకే లభించుచుండెను. బాలు రందరిలో నొకకొంత చురుకైనవాడని నన్ను భావించుచుండిరి. తెలుగుబడిచదువు అనగా చిన్నబాలశిక్ష కొన్ని ఆట విడుపుపద్యములు, ఎక్కములు మొదలగునవి. మాకంటె పెద్దబాలురు కొందరు వెరసులువేయుచుండిరి. అనగా నింగ్లీషులో practice లెక్కలవంటివి.

నా తొమ్మిదవయేట కలప మొదలగునవి మా నాయనగారు బెజవాడనుండి కొనితెచ్చి మా మూడువందలగజముల ఖాళీస్థలములోనే చిన్న పెంకుటిభవంతి కట్టించి, అందులో కాపురముండిరి. మా తండ్రిగారు మ్రొక్కినమ్రొక్కుబడి చెల్లించుటకు వైకుంఠపుర దేవాలయములో నాకు పుట్టువెంట్రుకలు తీయించి ఉపనయనముగూడ చేసిరి.

మా తండ్రిగారు చాల మితవ్యయపరులు. మా తల్లిగారికి గట్టిపట్టు చేతగాదని ఆమెను కోపించుచుండెడివారు. మా తండ్రిగారు ఆకోమటి గుమాస్తాపనియే చేయుచుండిరి. మధ్యాహ్నమున భోజనమునకు ఇంటికి వచ్చునపుడు వాకిటిలో ముష్టిపెట్టునపుడు రాలినగింజలు చూచి కోపించి ఆగింజలు ఎత్తువరకును లోపలికి వచ్చువారుకారు. ఎవ్వరియొద్దను అరువుగాని, బదులుగాని త్చెచుట ఆయనకు అయిష్టము. ఇంట లేనివస్తువు ముందుగా చెప్పవలసినదని మాటిమాటికి మాతల్లిగారిని హెచ్చరించుచుండెడివారు.

తాకట్టుఋణము తీర్చినపిమ్మట వా రెవ్వరివద్దను అప్పుతెచ్చియుండలేదు. ఇతరులకు ఋణము లిచ్చుచుండెడివారు. బాకీచెల్లింపవచ్చినవారు సాధారణముగ చదువురానివారుగనుక లెక్క ఋజువుచూచుకొనుటకు తెలిసినవారి నెవ్వరినైన తెచ్చుకొనుడని నిర్బంధించుచుండెడివారు. ఎవ్వరును దొరకనిపక్షమున తామే వడ్డీ కట్టి, ఒక కాగితముమీద వ్రాసియిచ్చి ఎవ్వరికైన చూపించుకొని సరిగానున్నదని చెప్పినమీదటనే బాకీ చెల్లు పుచ్చుకొనుచుండిరి. ఋణస్తుడు ఎంతగా కోరినను ఒక్కదమ్మిడీయైనను తీసివేయక చాల నిష్కర్షగను నిష్పక్షపాతబుద్ధితోను వర్తించుచుండెడివారు. దేని నిమిత్తమైనను ఇతరుల నాశ్రయింప నొల్లకుండెడివారు. మాయూరిలో పేరుపొందిన పెద్దకుటుంబముల వారితో సంబంధములు పెట్టుకొనుటయు, వారి యిండ్లకు బోవుటయు ఆయనకు అభ్యాసములేదు. చాల స్వతంత్రప్రియులు, అభిమానవంతులును.

నా యేడవయేట మాతల్లి రెండవ కుమారునికనెను. ఆమె సూర్యనమస్కారములు చేయుచుండెనుగాన వానికి సూర్యనారాయణ అని పేరుపెట్టిరి. మరల మూడేండ్లకు నా రెండవ తమ్ముడు జన్మించెను. ఇతనికి ఆదినారాయణ యని పేరు పెట్టిరి. పిమ్మట కొలదికాలమునకు మాతల్లి మరణించుటచేత పసిబాలుడుగానున్న మా చిన్నతమ్ముని మా అమ్మమ్మగారు వలివేరు తీసుకొనివెళ్లి కొన్నిసంవత్సరములు పెంచినది. అపుడో, మరికొంత కాలమునకో వానిని హరినారాయణయని పిలువ నారంభించిరి.

మాతల్లిగారు వైద్యుని తెలివితక్కువవలన ఆకస్మికముగ మృత్యువువాతబడినది. ఎదియో నిక్కాక తగులుచు కాళ్లు
నొచ్చుచున్నవని మా తండ్రిగారితో పలుమార్లు చెప్పుచుండుటచేత నొక మధ్యాహ్నము పేరుపడిన తంబలవైద్యు నొకని పిలుకొనివచ్చిరి. ఆయన తన యిత్తడిపెట్టెలో నున్న కుప్పెకట్టులు కొన్ని బండమీద నూరి, మాత్రలుకట్టి, ఒక పెద్దమాత్ర ఆమెచే తినిపించుటయేగాక బండకడిగిన ఔషధపునీళ్లుగూడ త్రాగించి వెళ్లిపోయెను. సాయంకాలమగునప్పటికి విరేచనములు ప్రారంభమై పలుసారులు రక్తముగూడ పడసాగెను. పిమ్మట నొడలు చలువలుగమ్మి నోటిమాట పడిపోయినది. ఆ వైద్యుని పిలిపించిననూ మరల రాలేదు. పిమ్మట పదునైదురోజులు దాదామియా యను యునానీడాక్టరు, పేరుపొందినవాడే, ఏవేవో ఔషధములిచ్చెను గాని దినదినము క్షీణించి పదునారవరోజున మాతల్లిగారు మరణించిరి.

ఆమె చనిపోవునాటికి ముప్పదియేండ్లది. ఆమె మొదటి నుండియు సుకుమారముగ పెరిగినది. గాన బలహీనురాలు. సామాన్యముగ ఆరోగ్యముగనే యుండునది. ఇంటిలో దాసీపని వారు లేరుకావున కసవుఊడ్చుట, ఇల్లుఅలుకుట, అంట్లుతోముట చెరువుకు పోయి నీళ్లుతెచ్చుట, మడిబట్టలు తడిపి పిండి ఆరవేయుట, బావికి పోయి మడినీళ్లుతెచ్చుట మొదలగు పనులన్నియు ఆమె యొంటిగనే చేయుచుండెను. బిడ్డలపోషణ, ఇంటిలో వంట, పెట్టు అనునవి ఆమెకుతప్పనివే. సాధారణముగ ప్రతిగృహమందును ఆడవారు ఈ పనులన్నియుచేయుట ఆకాలమున అగౌరవముగ నెంచెడివారు కారు. ఈదినములలోనైనను పల్లెటూళ్లలో సామాన్యకుటుంబములలో ఈరీతినే ఆడవారుపాటుపడుచుందురు. మాతండ్రి కావపారుగా నుండు దృడకాయుడు. ప్రతిదినమును ఉదయముననే చెరువుకు బోయి స్నానముచేసి సంధ్యావందనముచేసుకొని, పేటకు బోయి, మధ్యాహ్నమునకు ఇంటికి వచ్చి, మడిగట్టుకొని సంధ్యవార్చి భోజనముచేయువారు. రాత్రి ప్రొద్దుపోయి ఇంటికివచ్చినను సంధ్యవార్చుకొనియే భోజనము చేయుచుండిరి. ఇట్లు ప్రతిదినము మూడుసారులు సంధ్యావందనము చేయుటయు, అప్పుడప్పుడు దేవాలయమునకు బోయి దేవదర్శనము చేసుకొనుటయు వారికి అభ్యాసము. ఇంతకుమించిన మతవిషయమైన ఆలోచనలు ఆయనకు ఉండినట్లు కనపడవు. ఆయన సాధారణముగ కోపదారి. కొంత కఠినహృదయముకలిగి మిక్కిలి మితభాషిగా నుండెడివారు. తనసొమ్ము రవ్వంతయైన నితరులకు బోనీయక మితవ్యయముతో కాలముగడపుచు ఉన్నంతలో ద్రవ్యము కూడబెట్టి వృద్ధిచేసిరి. పాతభూమికి ఎరువుదోలించి బాగుచేయించి పాలికిచ్చి ఫలదాయకముగావించిరి. మరికొన్ని కొత్త భూములు కొనిరి. తనద్రవ్యము బీరుపోకుండ నెంత గట్టిపట్టుగనుండునో యితరులసొమ్ముపట్లగూడ అంత పట్టుగనే యుండి తృణమైన అపేక్షించువారు కారు. ఇతరులపై నాధారపడక స్వప్రయత్నమువలననే తనపనులు సాగించుకొనవలెనను గట్టిదీక్షతో వర్తించుచుండెను. మాతల్లి దయాదాక్షిణ్యములు గలది. బీదసాదల కష్టములకు జాలిచెందియు, ఒక్క కాసైనను చేతలేమి, నేమియు చేయలేకుండెను. ఇంటిలో బియ్యము, పప్పు మొదలగు ద్రవ్యములు సమృద్ధిగ నుండినను వానిలోనుంచి ఇతరుల కిచ్చినచో మాతండ్రిగారు కోపపడునని మిక్కిలి భయపడుచుండెను. కాని ఒకానొకపుడు, మిక్కిలి కష్టములోనున్నవారి కెట్లో రహస్యముగ కొలది సాయము చేయుచునేయుండెను. కాని ఆమె యకాలమరణమువలన అప్పుడప్పుడే కూడబారుచున్న కాపురము ఒక్కసారిగ కూలినట్లుండెను. ఆమె చనిపోవునాటికి మా మేనత్తగారు మాయింటిలోనే యుండెనుగాని కొలదిమాసములకే మా తండ్రిగారితో కలహించి ఆమె అత్తవారింటిలో సవతికొమారునియొద్దకు వెడలిపోయెను. అందువలన ఇంటిలో ఆదదిక్కు కరవాయెను. మాతండ్రి విశేష ధనవంతుడు గాకపోవుటచేతను ఎవరియందును విశ్వాసములేక పోవుటచేతను ఇంటిపనులకు మరెవ్వరిని ఏర్పాటుచేయలేదు. తాను ఇల్లు కనిపెట్టుకొనియుండువాడు కానందునను, మేము ఏమియు తెలియని చిన్నవాండ్రమగుటచేతను ఇంటి నొక పరాయివంట మనిషిపై వదలిపెట్టుటకు సాహసించలేకపోయెను. అందువలన ఇంటిపనులన్నియు తనమెడను వేసుకొని ఈదవలసివచ్చెను. నౌకరీ వదలివేయుటకు తగిన ఆర్థికస్తోమత లేనివాడగుటచేత ముందు కాపురముగడచుట కష్టముగావచ్చునను భయముకూడ ఆయన నావహించెను. ఆయన కప్పటికి నలుబదియేండ్లు. మరల వివాహముచేసుకొనుటకు తగిన యవకాశము లుండెను. కాన ఇతరుల ప్రేరణచేత అందుకు కొంత ప్రయత్నముచేసెను. గట్టిగ పట్టుపట్టినయెడల వివాహము సమకూడియేయుండునుగాని, ముగ్గురము మగపిల్లలము చెడిపోవుదు మని యోచించి, వివాహ యత్నము మానివేసెను. అప్పటినుండియు ధృడవ్రతుడై బ్రహ్మ చర్యమునే నడుపసాగెను.

గుమాస్తానౌకరీచేయుచు, ఇంటిపనులన్నియు చక్కబెట్టి మమ్ము అన్నివిధముల సాకుచు మోయరానిమోపు తలపై మోయవలసివచ్చెను. కాని విసుగక, ఏమరుపాటులేక ఇంత భారమును వహించుటకు సంసిద్ధుడయ్యెను. ప్రతిదినమునను తెల్లవారుఝాముననే లేచి దాశరధీశతకములోని పద్యములు పాడుకొనుచు ఇల్లు శుభ్రముచేసి, పాత్రలుకడిగి తెల్లవారకమునుపే చెరువుకుబోయి స్నానముచేసి బావినీరు కావిడితో మోసుకొనివచ్చుచుండిరి. అప్పుడే వంటగూడ ప్రారంభముచేసి ఎనిమిదిగంటలలోపల తాను భోజనము ముగించుకొని బజారులో నౌకరీనిమిత్తము పోవుచుండిరి.

మాతల్లి చనిపోవునప్పటికి నేను పదేండ్లవాడను. నేనే ఆమెకు అంత్యక్రియలు జరిపియుంటిని. మా తండ్రిగారు నా ప్రక్కనుండి ఆపనులన్నియు నాచేత చేయించిరి. అప్పటి కింకను నేను తెలుగుబడిలోనే చదువుచుంటిని. నా పెదతమ్ముని అయిదవయేట ఊరబడిలో చదువవేసిరి. రెండవతమ్ముడు తొమ్మిది మాసముల పసిబాలుడగుటచేత మా అమ్మను కన్నతల్లి వానిని పెంచుచుండెను.