Jump to content

దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/జననము - దేశస్థితి

వికీసోర్స్ నుండి

జననము - దేశస్థితి

నేను గుంటూరు పురమందొక బ్రాహ్మణ కుటుంబమున జనన మొదితిని. నా జన్మదినము ఎనుబది రెండేండ్ల క్రిందటి క్రోధననామ సంవత్సర మాఖ బహుళ సప్తమి. అనగా భారత దేశ ప్రధమ స్వాతంత్ర్య సమరము నడచిపోయిన తొమ్మిది యేండ్లకు. అది క్రైస్తవశకము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2 వ తేది యగుచున్నది. అంతకుముందు యుద్ధములు, పిండారీ మూకల దోపీడులు మొదలగు నలజడులచే కలతనొందిన దేశమునందు కొంత శాంతి నెలకొల్పబడినది. ఈ ప్రాంతము పూర్వకాల హైందవ ప్రభుత్వముల క్రిందనుండి, పిమ్మట మొగలాయి రాజ్యములో చేరిన హైదరాబాదు సంస్థానములో నైజాము యొక్క పరిపాలనలో నుండెను. యుద్ధములో నోడిపోయిన నైజాము ఈ దేశమును కొలదికాలము క్రిందటనే ఆంగ్లేయుల కిచ్చివేసెను. కాని మొగలాయి సాంప్రదాయములు ప్రజల నింకను బూర్తిగా విడువలేదు.

ఆంగ్లేయులకును నైజామునకును జరుగుచుండిన కలహముల మధ్య బుస్సీయను ఫ్రెంచి సేనాపతి కొంత సేనతో యీ ప్రాంతముపై దాడివెడలి భయంకర యుద్ధప్రచారము సాగించి యుండుటచేత ప్రజలు మిక్కిలి కలవరము నొందిరి. కావుననే ఆ బూసి సేనానిపేరు మరవక ఇప్పటికిని పోరుబెట్టు బిడ్డలను బూచివాడు వచ్చుచున్నాడని భయపెట్టి ఏడ్పుమాన్ప ప్రయత్నించు చున్నారు. అప్పుడు సర్కారు ఉద్యోగులుగా నుండువారును, ప్రజలలో మరికొందరు ప్రముఖులును మోకాళ్ళవరకు సాగు పొడవు చొక్కాలు, షేర్వాణీలు లేక అంగర్ఖాలను పేరుగలవి తొడుగుకొనుచుండువారు. తలగుడ్డలు వంకరగా చుట్టుకొని, వీపున తోకవలె కొంగులు జారవిడుచుచుండెడివారు. కొందరి ఇండ్లలో పట్టాకత్తులును, బాకులు, బల్లెములుగూడ నుండెడివి.

'పార్షి' అను పేరుతో ఉర్దూభాష నా కాలమున నేర్పుచుండిరి. ఇంక నెప్పటికైన మరల మొగలాయి రాజ్యములో మనదేశము చేరునను భ్రమచే తమ పిల్లలకు హిందువులు గూడ 'పార్షి' నేర్పించెడివారు కావున పార్షిభాషా పండితులు గూడ మనవారిలో నుండెడివారు.

ఆ కాలమున వేసవియెండలు మిక్కిలి తీవ్రముగ నుండెడివి. రాత్రివేళలో సయితము వేడిగాడ్పులి వీచుచుండెను. వర్షములును అధికముగ కురియుచు భూములు బీళ్ళువడి దున్నుటకు దుస్సాధములుగ నుండెను. పంటలు చాల తక్కువ. ఈ ప్రాంతమంతటను మెట్టసాగే సాగుచుండెను. మాగాణి అప్పుడప్పుడె యరుదుగ ప్రారంభమయ్యెను.

జొన్న, సజ్జ, వరిగె, మొక్కజొన్న మొదలగు మెట్ట పంటలు పండుచుండెడివి. జనులు సాధారణముగ తాము పండించుకొను ధాన్యమునే తినుచుండెడివారు. బ్రాహ్మణులు సయితము పలువురు జొన్నన్నము, వరిగన్నము తినుచుండెడివారు. కొంత కాలమునకు ఒకపూట జొన్నఅన్నమో వరిగఅన్నమో తినుచు రెండవపూట వరియన్నము తినుట బ్రాహ్మణులు, వైశ్యులు మున్నగు వారిలో ప్రారంభమయ్యెను. రయితులు శిస్తు చెల్లించుటకు డబ్బు దొరకక చాల కష్టపడుచుండిరి. కొన్నిచోట్ల శిస్తులు చెల్లించని వారిని ఎండలో నిలబెట్టి వీపుపై బండలు పెట్టి బాధించి శిస్తు వసూళ్ళుచేయుచుండుట సాధారణముగ నుండెను. ఈ అభ్యాసము కొన్నిచోట్ల దారుణముగ నుండుటచే చెన్నపట్టణములో రాజకీయములకు దారిజూపిన గాజుల లక్ష్మీనరసింహ చెట్టిగారును, శ్రీ రంగయ్య నాయుడుగారు మొదలగు ప్రముఖులు కలసి గవర్నరుగారికి మాత్రమేగాక లండనులో పార్లమెంటువారికి గూడ మహరులను నంపి ఈ దురభ్యాసము మాన్పించుటకు గొప్ప ఆందోళన గావించి, తుదకు కృతకృత్యులైరి. ప్రజలు చాల విద్యా విహీనులుగనే యుండిరి. బ్రాహ్మణులలో మాత్రము పలువురు చదువను వ్రాయను లెక్కలువేయను నేర్చియుండిరి. కాని భాషా పాండిత్యము కలవారు అప్పటికే దేశమున నరుదుగా నుండిరి.

నేను పుట్టిన కాలమున ఇప్పటి గుంటూరులో పాత గుంటూరు అని పిలువబడు భాగము మాత్రము ప్రధానముగ నుండెను. అది అప్పటికి చిరకాలమునుండి సంస్థానాధీశులగు వాసిరెడ్డి వారికిని, మానూరి వారికిని ముఖ్య స్థానముగ నుండెను. వాసిరెడ్డివారి కోట పెద్దది. యొకటి యూరి మధ్యను, మానూరివారి కోటలు రెండు దక్షిణభాగమున నుండెను. ఆ సంస్థానములు అధికారములు కలిగి భాగ్య వంతములై యుండిన కాలమున మా పాతగుంటూరు గొప్ప వైభవము ననుభవించెను. కాని నా జననకాలమునకు కొన్ని సంవత్సరముల పూర్వమే ఆంగ్లేయ ప్రభుత్వమువారు తమకు చెల్లించవలసిన పేష్కషు చెల్లించలేదను మిషబెట్టి, తమకు రావలసిన పేష్కషును రాబట్టుకొని మరల జమీందారీలను వదలి వేయుదమని వ్రాతపూర్వకమైన వాగ్దానములుచేసి జమీందారీలు స్వాధీన పరచుకొనిరి. జమీందారులకు మాత్రము అలవెన్సుల పేరట వారి జీవితభృతికి కొంతసొమ్ము ఏటేట ఇచ్చుచుండిరేగాని ఎంతయో ఆదాయము జామీందారీ గ్రామముల మీద వసూలై తమ పేష్కషు సంబంధమగు అప్పు ఎప్పుడో తీరిపోయినను మరల జమీందారులకు వారి గ్రామములను స్వాధీనపరచక ఆంగ్లేయ ప్రభుత్వమువారే శాశ్వతముగ నాక్రమించుకొని పరిపాలించుచుండిరి.

ఈజమీందారీలు మొగలాయి ప్రభుత్వము నాటినుండి నున్నవియే. కేష్ణానదికి దక్షిణమున నున్న దేశము కొండవీటి సూబా యనియు, ఉత్తరమున నున్న దేశము కొండపల్లి సూబా యనియు పిలువబడుచుండెను. మొగలాయిల ప్రభుత్వము మారి ఆంగ్లేయ ప్రభుత్వము ప్రారంభమైన పిదప ఇప్పటి గుంటూరు జిల్లా భాగములో ఒంగవోలు తప్ప తక్కినదంతయును, కృష్ణకు నుత్తరమున బెజవాడ బందరు గుడివాడ నూజివీడు మొదలగు ప్రాంతమంతయు కలిపి కృష్ణాజిల్లా యను నొక మండలముగ నేర్పరచిరి. జిల్లాకలెక్టరు బందరులో నుండినను జిల్లాకోర్టు గుంటూరులోనే యుండుచువచ్చెను. పిమ్మట కొంతకాలమునకు జిల్లాకోర్టు సయితము బందరులోనె స్థాపించబడెను. 1904 సంవత్సరములో గుంటూరుజిల్లా ప్రత్యేకించబడువరకు జిల్లాకోర్టును, కలెక్టరు కచ్చేరియును బందరులోనే యుండెను.