దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ప్రస్తావన

వికీసోర్స్ నుండి

ప్రస్తావన

లోకమున పుట్టినది మొదలు ఇంతవరకును నాజీవిత యాత్ర యెట్లు నడచినదో వివరించుటవలన చదువరుల కేపాటి ప్రయోజనము కలుగును అను విషయము ఆలోచన చేసిన ఎడల నా జీవితములో మార్గదర్శకములగు విశేషములు గానరావు. ఇందువలననే ఆత్మకధ వ్రాయవలెనను సంకల్పము నాకు కలుగ లేదు. కాని మిత్రులు పలువురు మాటిమాటికి నా జీవితవృత్తాంతమును వ్రాయవలసినదని నొక్కి చెప్పుటచేత దానిని వ్రాయవలెనని ఇప్పుడు పూనితిని గాని దానికి కావలయు పరికరములు నే నమర్చుకొని యుండలేదు. కొందరు బుద్ధిమంతులగువారు తమ జీవితకాలములో నిత్యము జరుగు విషయములు దినచర్య (Dairy)గా వ్రాసి పెట్టుదురు. నాకు అట్టి అభ్యాసము లేక పోయెను. కాన నేనిప్పు డేమి వ్రాసినను నా జ్ఞాపకశక్తి ననుసరించియే. ఈ వృద్ధదశయం దాజ్ఞాపకశక్తియైనను దృడముగ నుండజాలదు. కాబట్టి నేను వ్రాయునది సంతృప్తికరముగ నుండజాలదని సందియము కలిగినను నా జీవితచరిత్ర వ్రాయుట నిశ్చితమైనదిగాన నిపుడట్టి లోపములనుగూర్చి యోచించి ప్రయోజన ముండదనుట స్పష్టమే.

సాధారణముగ నెవ్వరి జీవితమైనను మొదటినుండి తుదివరకు నొక్కరీతిగనే సుఖమునకో, దు:ఖమునకో భాజనముగాదు. సుఖదు:ఖములు రెండును అనుభూతములగుచుండును. కాని మొత్తమున నీ జీవిత మింతవరకు సుఖప్రదముగ నుండెనా, లేక దు:ఖదాయకముగ నుండెనాయని ఎవ్వరేని నన్ను ప్రశ్నించిన యెడల నిస్సందేహముగ సంతోషకరముగనే యున్నదని చెప్పగలను. సామాన్యముగ నెంత దుస్థితిలో నున్నవారైనను దీర్ఘజీవితులైనవారు సౌఖ్యమే యెక్కువగ ననుభవింతురని నా విశ్వాసము. ఏలననగా ప్రతిదినము నిద్దురతో శరీరక్లేశము తగ్గి ఉదయమున మేల్కాంచునప్పటికి దేహము పుష్టికరముగ తోచినట్లు అప్పటికప్పటికి కలుగు దు:ఖములును పిమ్మటి సుఖానుభవములచేత మాసిపోవును. దినదినమును నూతనానుభవములు కలుగుచుండుటచే జీవితము నూతనకళలతో నొప్పారు నొక నాటకరంగమువలె నుండును. క్రొత్త యనుభవముల సందడిలో ప్రాత దు:ఖములు మాసిపోవును. ఇంతకును సుఖదు:ఖముల మేరలు చాలవరకు వారివారి మనస్సులనుబట్టి యుండును. ఒకరికి ఎక్కువ సుఖముగ దోచు విషయము మరియొకరి కంతగా సుఖప్రదముగ నుండదు. అటులనే ఒకరికి దు:ఖకరముగ నుండునది మరియొకరికి అంతగ దు:ఖము కలిగింపక పోవచ్చును.

ఈ సుఖదు:ఖములు కొన్ని దేహమునకు, మరికొన్ని మనస్సునకు సంబంధించి యుండును. యమ నియమముల ననుసరించి జీవించినవారు సామాన్యముగ దేహారోగ్యము మొదలగు దైహిక సుఖముల ననుభవింతురు. నిర్మలవర్తనము కలిగి సత్యనిష్ఠతో ప్రవర్తించువారికి మన:క్లేశమునకు కారణము లుండవు. అనివార్యములగు విపత్తులు సంభవించినను ధైర్యముకలిగి సర్వమును పరమేశ్వరాధీనమను పరమార్థచింతనకలవారు దు:ఖములు పాటింపరు. జీవితములో సుఖదు:ఖము లను నవి వ్యక్తికి మాత్రమే సంబంధించినవి. పరుల కుపకరించినదే నార్ధక జీవినమని యెంతును. ఈ నిర్ణయము లోకులు చేయవలసినదే. కాని ప్రతి వ్యక్తియు తన జీవితము పరుల కుపయోగించునో, లేదో నిర్ణయించుట కధికారి కాకపోయినను తన శక్తికొలది నుపయుక్తముగనే జీవితము నడపగలిగితినని ఆత్మతృప్తి చెందుటకు మాత్రము అవకాశము కలదు. కావున నా జీవితము కేవలవ్యర్ధముకాదను ఆత్మసంతుష్టి పరమేశ్వరుడు నాకు ప్రసాదించెనని మాత్రము చెప్పగలను.

కావున యీ సృష్టియందు నాకు జన్మయొసంగి కర్మఫలముల ననుభవించుటకు దీర్ఘ జీవితము ననుగ్రహించిన పరమేశ్వరునకు ప్రణమిల్లి, లోకమున రూపమెత్తుటకు కారణభూతులైన తలిదండ్రులకు నమస్కరించి, పెంచి పెద్దవానిగ జేసి విద్యా బుద్ధులు గరిపించిన నా తండ్రిగారిని, విద్యాగురువులను గూడ కృతజ్ఞతాపూర్వకముగ ప్రస్తుతించి, నా పరమ మిత్రులను సంస్మరించి, యీ నా జీవయాత్రా ప్రకరణ వ్రాయుచున్నాను.

మరియు-

        తనువులు రెండు జన్మలకు తారకమార్గము చూడనొక్కటే
        యనుచును నీతిధర్మముల నారసి యెప్పుడు దైవభక్తితో
        జనుపగబూన కాపురము చల్లగ సాగెను ప్రేమసింధువం
        దనువమలీల గ్రుంకులిడ నాదర మొప్పగమానె దు:ఖముల్.

        ఇటులనె నేబదేండ్లు భువి నిచ్చలు సౌఖ్యముగొల్పు భార్య న
        న్నిట విడనాడి స్వర్గమున కేగెను బిడ్డలనెట్లు బాపెనో
        పటుతరశీం సంపదల భద్రతగాంచిన భాగ్యశాలి పే
        రట కృతనిత్తు పుణ్యముల రాశికి వెంతట సుబ్బమాంబకున్.


____________